Tuesday, 22 August 2000

బిల్వాష్టకం

బిల్వాష్టకం

బిల్వ పూజ
శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి  త్రిదళం అని పేరు పొందాయి . ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు),  పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం, తాత్పర్యం మీకోసం.


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం

సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం

దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం

లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం

ఫలశృతిబిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్

తాత్పర్యము:మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను.

ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

ఫల శృతి:శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది.

శివాష్టకం

శివాష్టకం

శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని చాలామంది ధ్రువీకరించడాం లేదు. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దేశాల్లో కొంత తేడా ఉంది.


ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం
జటాఝూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే

ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం
అనాదిహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమీడే

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశం
గిరీశం గణేశం  సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే

గిరీంద్రాత్మజాసంగాహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దధానం
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే

శరచ్చంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే

ఫల శృతి
స్తవం యః ప్రభాతే నరః శూలపాణే పఠేత్ సర్వదా భర్గ భావానురక్తః
సుపుత్రం ధనం ధాన్య మిత్రం కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షం ప్రయాతి

తాత్పర్యము:

ప్రభువు, మా ప్రాణ నాథుడు, జగత్పతి, విశ్వనాథుడు, జగన్నాథుడు అయిన విష్ణువునకు నాథుడు, ఎల్లప్పుడూ ఆనందంలో అలరు వాడు, జగమంతటికి ప్రకాశాన్ని కలిగించే వాడు, జీవులకు, భూతములకు, అన్నిటికి నాథుడయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

మెడలో కపాలములు ధరించిన వాడు, శరీరము అంతా సర్పములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, గణేశునికి అధిపతి,  గంగానదీ ప్రవాహము ధరించుట వలన విశాలమైన జటా ఝూటములు కలిగిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

ప్రపంచానికి ఆనందం పంచే వాడు, అంతటా ఉన్నవాడు, సర్వము తనే అయిన వాడు, భస్మము శరీరమంతా కలిగిన వాడు, ఆది లేని వాడు, కొలత లేని వాడు,  మహా మోహములను సంహరించే వాడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

వట వృక్షము (మర్రి చెట్టు) క్రింద నివసించేవాడు, అట్టహాసంగా నవ్వేవాడు, మహా పాపములను నాశనము చేసే వాడు, ఎల్లప్పుడూ ప్రకాశించే వాడు, హిమవత్పర్వతాలకు అధిపతి,  గణ నాయకుడు, దేవతలకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

అర్థ దేహమున పార్వతిని కలిగిన వాడు, కైలాసమున నివసించువాడు, ఆర్తుల రక్షకుడు, ఆత్మ యైన వాడు, బ్రహ్మచే కొలువబడిన వాడు,  అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

కపాలము, త్రిశూలం చేతులలో ధరించిన వాడు, పాదపద్మములను ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చే వాడు, నందిని అధిరోహించే వాడు, దేవతలకు, గణములకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

శరత్కాలములో చంద్రుని వంటి ముఖము కలవాడు, గణములకు సంతోషాన్ని ఇచ్చే వాడు, మూడు నేత్రములు కలవాడు, స్వచ్చమైన వాడు, కుబేరుని స్నేహితుడు, పార్వతికి భర్త, ఎల్లప్పుడూ సచ్చరిత్ర కలిగిన వాడు, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.


హరుడు, సర్పములు హారములుగా కలవాడు, శ్మశానంలో తిరిగే వాడు, ప్రపంచమైన వాడు, వేదాల సారమైన వాడు, భేద భావము, వికారము లేని వాడు, శ్మశానములో నివసించే వాడు, మనసులో పుట్టిన కోరికను దహించే వాడు (మన్మథుని దహించిన వాడు అని కూడా అర్థం), అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

ఫల శృతి:
ఆర్తితో, శరణాగతితో, భక్తితో ఈ స్తోత్రముతో శూలపాణిని స్తుతించిన వారికి మంచి భార్య, సంతానము, ధనము, ధాన్యము, విశేషమైన జీవనము కలిగి పిమ్మట శివ సాయుజ్యము కలుగును.

వైద్యనాథాష్టకము

వైద్యనాథాష్టకము

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం, తాత్పర్యము మీకోసం. యూట్యూబ్ శ్రవణం.


శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ


ఫల శ్రుతిః

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

తాత్పర్యము:
శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.


వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు,  కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన - భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఫల శృతి:బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.