Wednesday, 8 November 2017

జటాయువు - సంపాతి









జటాయువు - సంపాతి
స్వామి కార్యం


స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తి మేర కృషి సల్పిన గాథలను అద్భుతంగా వర్ణించిన మహా కావ్యము శ్రీమద్రామాయణము. ఉడుత వారధి కోసం, సంపాతి లంకకు మార్గం కోసం, అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాల కోసం, వానరసైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు ప్రభువుకు తోడ్పాటుగా నిలిచారు. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు. దశరథుని మిత్రుడైన జటాయువు ఒక గ్రద్ద. వృద్ధాప్యంతో శరీరం సహకరించక పోయినా సీతను అపహరించుకుపోతున్న రావణుని ఎదిరించి కొనప్రాణమున్నంత వరకు పోరాడిన వీరుడు. సీతమ్మను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు అమ్మ జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి తోడ్పడిన గొప్ప జీవి. జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు.

సీతా రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారి పంచవటి సమీపంలో జటాయువు రాముని కలుస్తాడు. తాను దశరథుని మిత్రుడని తెలిపి సృష్టిలో జంతు జాతి ఏ విధంగా ఆవిర్భవించిందో విపులంగా తెలుపుతాడు. కర్దమ ప్రజాపతినుండి గరుత్మంతుడు (శ్రీమహావిష్ణువు యొక్క వాహనము), అరుణుడు (సూర్యుని రథసారథి) గ్రద్ద సంతతిగా ఎలా జన్మించారో వివరిస్తాడు. అదే వారసత్వానికి తాను, సంపాతి చెందినట్లు తెలుపుతాడు. అరుణుని సంతతే జటాయువు, సంపాతి. దశరథుని స్నేహానికి గౌరవంగా ఈ భీకరమైన దండకారణ్యములో సీత రక్షణకు తాను రామునికి తోడుగా ఉండగలనని పలుకుతాడు.

సీతాపహరణం తరువాత రావణుని చేతిలో రెక్కలు తెగి, రక్తసిక్తమై అసువులు బాయటానికి సిద్ధంగా ఉన్న జటాయువును చూసి రాముడు జటాయువే సీతను చంపి ఉంటాడని అనుమానించి అతనిని చంపబోతాడు. అప్పుడు జటాయువు తనకు రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించి సీత జాడ తెలుపుతాడు. రావణుని చరిత్రను, అతని శక్తి పరాక్రమాలను, ఏ విధంగా సీతను అపహరించింది వివరించి రాముని చేతిలో ప్రాణాలు వదులుతాడు. తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఆ వీరుని కొరకు రాముడు దుఃఖించి, అతనికి స్వయంగా ఉత్తరక్రియలు జరుపుతాడు. ఈ విధంగా జటాయువు ఉత్తమలోకాలను పొందుతాడు.

గృధ్రాధిప సంసేవిత రాం!!!
దక్షిణభాగాన చివరకు చేరుకున్న వానరమూకకు రావణుని మరియు లంక జాడను తెలిపిన వాడు ఈ సంపాతి.

సీతమ్మకోసం వెదకి వెదకి అలసిన వానరులు ప్రాయోపవేశానికి సిద్ధులై తమ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకువస్తారు. అప్పుడు వారి మాటలను విన్న సంపాతి వింధ్యమహాపర్వతపు గుహనుండి బయటకు వచ్చి "ఓ వానరులారా! నేను రెక్కలు విరిగిన పక్షిని, శక్తి హీనుడను. నాకు చేతనైనంత  శ్రీరాముని కార్యానికై మాట సాయం చేయగలను. ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము.

చక్కని రూప సంపద కలిగి, వివిధ ఆభరణములు ధరించియున్న ఒక స్త్రీని దుర్మార్గుడైన రాక్షసుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూసాను. ఆ స్త్రీ రామా! రామా! లక్ష్మణా! అని విలపిస్తుండెను. ఆమె తన ఆభరణములన్నీ తీసువేయుచుండెను. పదే పదే శ్రీరాముని నామము స్మరించుచున్నందున ఆమె సీతయే అని నేను అనుకొనుచున్నాను,

ఆ రాక్షసుడు లంకాధిపతియైన రావణుడు. ఇక్కడికి వంద యోజనముల దూరములో సముద్రము నడుమ ద్వీపములో విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. ఆ నగరము చాలా రమ్యమైనది. సీతాదేవి ఆ లంకానగరమున రావణుని అంతఃపురమున బంధింపబడియున్నది.  దీనురాలైన ఆ సీతామాతను రాక్షస స్త్రీలు కాపలాకాస్తున్నారు. సముద్రము మీద నూరు యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు. కావున వానర వీరులారా! వెంటనే మీ పరాక్రమము చూపి సముద్రమును లంఘించుటకు త్వరపడండి. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగి రాగలరు. నా దివ్యదృష్టితో చూసి పలుకుతున్న మాటలివి.

నేను, జటాయువు గరుత్మంతుని వంశము వారమే. కనుక ఇక్కడినుండే రావణుని, సీతను స్పష్టముగా చూచుచున్నాను. ఓ వానరులారా! మేము మా ఆహారబలము చేతను, సహజమైన దివ్య శక్తివలనను శతయోజనములే గాక అంతకన్నా దూరము కూడా అనుక్షణము చూడగలము. నా తమ్ముని చంపిన రావణుని పగ తీర్చుకోవాలి. మీరే ఆ కార్యానికి సమర్థులు" అని పలికి సీతమ్మ జాడ తెలుపుతాడు సంపాతి. ఈ విధంగా పక్షి సోదరులైన జటాయువు-సంపాతి రామకార్యానికి ఎంతో ఉపకరిస్తారు.

రామకార్యానికి వానరులు, పక్షి సోదరులు...ఇలా ఎన్నో రకాల జంతు సమూహం తోడ్పడి తమ జన్మకు సార్థకతను తెచ్చుకొని రాముని అనుగ్రహంతో మోక్షాన్ని పొందాయి. అంతటి మహత్తరమైనది రామకార్యము. మానవునిగా జన్మించి, తనతో పాటు జన్మించి తనతో నడచిన ప్రతి ప్రాణినీ అనుగ్రహించిన ధర్మమూర్తి రామచంద్రుడు.

శ్రీరామ జయరామ జయ జయ రామ!

కాశీ క్షేత్ర పాలకుడు - కాలభైరవుడు

కాశీ క్షేత్ర పాలకుడు - కాలభైరవుడు




కాశీలోని కాలభైరవ దేవాలయం

సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం ఆగమ శాస్త్రానుసారంగా మహనీయులచే స్థాపించబడిన ప్రతి దేవాలయానికీ ఒక క్షేత్రపాలకుడిని కూడా గుర్తించి ఆలయం నిర్మించటం. పేరులో ఉన్నట్లు క్షేత్రపాలకుడు ఆ క్షేత్రానికి కాపలాదారు. అంటే ఆ దేవతా స్వరూపానికి నమ్మిన బంటు లేదా ఆ దేవతామూర్తి యొక్క మరొక రూపమే. తన శక్తిని క్షేత్రపాలకునికి ఆ దేవతామూర్తి నిరంతరం అందజేస్తూ ఉంటుంది. మీరు నిశితంగా పరిశీలించండి - కొన్ని వైష్ణవాలయాలలో హనుమంతుడు, శివ, శక్తి సంబంధితమైన ఆలయాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులుగా ఉంటారు. కాలభైరవుని వృత్తాంతము శివపురాణంలో చెప్పబడింది. ఈ సారి కాశీ వెళితే తప్పకుండా కాలభైరవుని దర్శించుకోండి. అలాగే, నేపాల్ వెళ్లినప్పుడు కాఠ్మండు లోని దర్బారు స్క్వేరులో గల కాలభైరవుని దర్శించుకోగలరు.


కాఠ్మండులోని కాలభైరవ విగ్రహం

వారణాసి (కాశీ) పుణ్య క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుని ఉగ్రాంశగా భావించబడే రూపం కాలభైరవుడు. దీనికి ఒక చిన్న గాథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ శివుని అవమానించి, తన ముఖముతో శివుని చూసి పక పక నవ్వాడు. అప్పుడు శివుని నుండి కాల భైరవుడు జన్మించి ఆ శిరస్సును నరికేస్తాడు. విష్ణువు విన్నపముతో శివుడు బ్రహ్మను మన్నించి శాంతిస్తాడు. కాని శిరస్సు ఖండించిన ఆ పాపము కాలభైరవుడిని వెంటాడింది. ఆ శిరస్సు కూడా కాలభైరవుని వీడక ఉంది. ఈ పాతకము, దాని శిక్షను దూరం చేసుకోటానికి కాలభైరవుడు కాశీ క్షేత్ర ప్రవేశము చేయాలని సంకల్పిస్తాడు. ఆయన ప్రవేశించ గలుగుతాడు, ఆ పాపము ఊరి బయటనే ఉండిపోతుంది. అప్పటినుంచి ఆ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి కోత్వాల్ (క్షేత్ర పాలకుడు) గా వ్యవహరించబడ్డాడు. ఈ కాల భైరవునకు వాహనము శునకము. ఈ స్వామి దర్శనము చేయనిదే కాశీ యాత్ర పూర్తి కానట్లే అని ప్రతీతి.

శంకర భగవత్పాదులు

శంకర భగవత్పాదులు

హిందూ మతం బౌద్ధ, జైన మతాల దాడికి గురయ్యి, అంతర్గత (శైవ/వైష్ణవ) పోరులో నలిగి నాశనము అవుతున్న దశలో దక్షిణామూర్తి అవతారముగా కేరళలోని కాలడిలో ఆర్యాంబ మరియు శివగురు దంపతులకు జన్మించారు శంకరులు. పిన్న వయసులోనే భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో  మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.  ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు.  పామరుల నుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి,  ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు. ఆయన తర్వాత, శిష్యులు ఈ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన ఈ తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. 

Tuesday, 31 October 2017

హనుమంతుడు - ఎప్పుడు ఎలా మాట్లాడాలి?

ఎప్పుడు ఎలా మాట్లాడాలి?

ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని ఉద్దేశించే కాబోలు, ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత పుట్టి ఉండవచ్చు. ఉదాహరణకు... రామాయణంలో సుగ్రీవుడి సచివుడిగా మొట్టమొదటిసారి హనుమ రాముడిని కలిశాడు. నాలుగు మాటలు మాట్లాడాడు. వెంటనే రాముడు లక్ష్మణుడితో – ‘‘చూశావా? ఇతను నవ వ్యాకరణ పండితుడు. శాస్త్రాలన్నీ చదివినవాడు. మాటలో తడబాటులేదు. అస్పష్టత లేదు. అసందిగ్ధం లేదు. కొట్టినట్లు లేదు. మృదువుగా, ప్రియంగా ఉంది. ఎంత మాట్లాడాలో అంతే, అర్థవంతంగా, మనసుకు హత్తుకునేలా మాట్లాడుతున్నాడు’’ అని మెచ్చుకున్నాడు. అంటే హనుమ మాటలకే రాముడు మంత్రముగ్ధుడయ్యాడన్నమాట.

మరో సందర్భంలో హనుమ మాటలు సీతమ్మకు ఉపశమనంలా అనిపించాయి. అంతులేని నిర్వేదంలో ఉన్న సీతమ్మ, హనుమ మాటలకు దుఃఖం నుంచి తేరుకుంది. అదెప్పుడో చూద్దామా..? అప్పటికి పదినెలలుగా సీతమ్మ కంటికి మంటికి ఏకధారగా విలపిస్తోంది. హనుమ అశోక వనం చేరి – ఆమె సీతమ్మేనని నిర్ధారించుకున్నాడు. ఆమె కూర్చున్న చెట్టుకొమ్మ మీద అంతా గమనిస్తూ ఉన్నాడు. ఈ లోపు తెల్లవారకముందే రావణాసురుడు మందీమార్బలంతో బయలుదేరాడు.

రాముడు ఉన్నాడో లేడో, ఉన్నా రాలేడు. ఇక రెండు నెలలు గడువిస్తా. అయినా మనసు మారకపోతే, గడువు తరువాత రోజు ఉదయం ఫలహారంగా సీతను తింటానని – హుంకరించి వెళ్ళిపోయాడు. రావణుడి మాటలతో రాక్షసులు మరింతగా సీతమ్మను ఏడిపించారు. సీతమ్మకు అంతులేని వేదన. తనను తాను చంపుకుందామన్నా తగిన వస్తువు అందుబాటులో లేదు. తన జడనే చెట్టుకొమ్మకు బిగించి, ఆపై మెడకు బిగించుకుందామని సిద్ధం కాబోతోంది.

ఇంతలో హనుమ మెరుపులా స్పందించాడు. హనుమంతుడు... రామకథను, గంధర్వగానంగా, మృదువుగా అమ్మకు చైతన్యం కలిగేలా, రాక్షసులకు నిద్రవచ్చేలా, మైథిలీ ప్రాకృత  భాషలో, అది కూడా అయోధ్యా మాండలికంలో ప్రారంభించాడు. అమృతపు జల్లువంటి ఆ మాటలతోనే సీతమ్మ ఎంతో సాంత్వన పొందింది. ఆ తర్వాత హనుమ తనకోసం ఎదురు చూస్తున్న వానరులతో, రామలక్ష్మణులతోనూ ‘‘చూశాను సీతను’’ అని చెప్పాడు. అంటే సూటిగా స్పష్టంగా చెప్ప వారికి ఉపశమనం కలిగించాడు.

ధన్వంతరి - ఆరోగ్య ధన్‌’వంతరి

ధన్వంతరి - ఆరోగ్య ధన్‌’వంతరి

దేవతలూ, రాక్షసులూ కలసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం ఉద్భవించింది. లోకాలను దహించివేసే ఆ హాలాహలాన్ని ఉండగా చేసుకుని, పరమేశ్వరుడు దానిని భక్షించి, గరళకంఠుడయ్యాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు ఆవిర్భవించారు. తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత అరచేత అమృతకలశాన్ని పట్టుకుని, విష్ణుమూర్తి అంశతో ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి. అప్పటినుంచి దేవవైద్యుడు ఆయనే. ఆయుర్వేదానికి, సమస్త ఔషధాలకు మూలపురుషుడు ఆయనే.

దీపావళికి రెండురోజుల ముందు మనం జరుపుకుంటున్న ధన్‌తేరస్‌ పండుగలో ధన్‌ అనేదానికి ధనమనే చెప్పుకుంటున్నాం కానీ, నిజానికి అది ధన్వంతరికి సంబంధించినదే. ధన్వంతరిని సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశగా చెప్పుకుంటారు.  దేశవ్యాప్తంగా ధన్వంతరికి ఆలయాలున్నాయి.

లక్ష్మీదేవి, ధన్వంతరి ఒక్కరోజే ఉద్భవించినప్పటికీ, ధన్వంతరి విషయం ఎవరూ అంతగా పట్టించుకోరు. ఎందుకంటే, ఆరోగ్యం కన్నా, అందరికీ ధనమే ముఖ్యం అయిపోయింది కదా మరి! అందుకే ధన్‌తేరస్‌ నాడు కేవలం లక్ష్మీపూజ. అదీ కాదు విలువైన వస్త్రాభరణాలు, ఖరీదైన వస్తుసామగ్రుల కొనుగోలులో మునిగి తేలుతుంటారు. లక్ష్మీపూజ చేయడంలో, వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేయడంలో తప్పు లేదు కానీ, ఆరోగ్యం కూడా సంపదే! అందుకే కదా, అష్టలక్ష్ములలో ఆరోగ్యం కూడా లక్ష్మీస్థానం సంపాదించుకుంది.


ఆయుర్వేదంలో ఎవరైనా మంచి హస్తవాసి గల వైద్యులుంటే వారిని ధన్వంతరితో పోలుస్తారు. ఆయుర్వేదమనే కాదు, వైద్యులందరూ కూడా ధన్వంతరికి వారసులేననడంలో తప్పులేదు. ఎందుకంటే మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరే కాబట్టి. ఆయన దేవ వైద్యుడు. ప్రస్తుతం ధన్వంతరి పేరుతో అనేక వైద్య, సేవాసంస్థలు కూడా ఉన్నాయి.



– డి.వి.ఆర్‌.

ఏకదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి?

ఏకదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి?

సన్యాసులు (స్వామీజీలు) వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా  చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. (దండి అంటే కర్ర అని అర్థం)

ఒక కర్రను (ఏకదండి ) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు (ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.

రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.

మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధా్దంతాన్ని బోధిస్తారు !!

Friday, 20 October 2017

చింతామణి రహస్యం

చింతామణి రహస్యం

వినాయకునికి అనేక నామాలున్నాయి. అందులో ఒక నామం ‘చింతామణి’. ఈ నామం ఆయనకు ఎలా వచ్చిందంటే...

పూర్వం అభిజిత్‌ అనే రాజు ఉండేవాడు. అతనికి ‘ఘనుడు’ అనే అతి దుష్టుడైన రాకుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడు నిస్సహాయులుగా ఉన్న జనులను, మునులను ఎన్నో బాధలుపెట్టేవాడు. ఒకసారి వేటకోసం వనానికి వెళ్లిన ఘనుడు ఆ వనంలో ఉన్న కపిలముని ఆశ్రమానికి వెళ్లాడు. కపిలముని అతన్ని భోజనానికి ఆహ్వానించాడు. ‘ఈ ముని కుటీరంలో మాకు ఎటువంటి భోజనం లభిస్తుంది’ అని ఘనుడు ఆలోచించ సాగాడు. కందమూలాలు, ఆకులు అలములు పెడతాడా! అని మనసులో అనుకున్నాడు. కాసేపయ్యాక చూస్తే కుటీరం సమీపంలోనే ఒక మండపం కనిపించింది. వెళ్లి చూస్తే అందులో ఆసనాలు, వెండి పాత్రలు, రకరకాల ఆహారపదార్థాలు సిద్ధం చేసి ఉన్నాయి. కపిలముని ఎంతో ప్రేమగా ఘనుడికి, అతని సైన్యానికి భోజనం పెట్టాడు. ఆ వైభవం చూసి ఘనుడు ఆశ్చర్యపోయాడు. ‘ఇంత తక్కువ సమయంలో అంత ఘనంగా ఏర్పాట్లు ఎలా చేశాడు?’ అని ఆలోచించసాగాడు. ఆ విషయమే కపిలమునిని అడిగాడు. అప్పుడు కపిలముని ‘‘నేను ఒకసారి ఇంద్రునికి సాయం చేశాను. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై నాకు చింతామణిని ప్రసాదించాడు’’ అని చెప్పాడు. ఆ మణిని చూసిన ఘనుడు నాకు ఇవ్వమని అడిగాడు.

అందుకు కపిలముని అంగీకరించలేదు. దాంతో ఘనుడు బలవంతంగా లాక్కున్నాడు. జరిగిన దానికి కపిలముని చాలా బాధపడ్డాడు. సహాయం కోరుతూ విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై గణేషున్ని ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు కపిలముని ఘోర తపస్సు చేసి గణనాథుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. జరిగినదంతా చెబితే ఘునుడి దగ్గరి నుంచి మణిని తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు. గణేషుడు తన సైన్యంతో వెళతాడు. అప్పుడు ఘనుడు తండ్రి మాట వినకుండా గణేషునితో యుద్ధానికి దిగుతాడు. చివరకు గణేషుడు పరసుతో ఘనుడి శిరస్సు చేధిస్తాడు. తరువాత ఘనుడి తండ్రి దగ్గర నుంచి చింతామణి తీసుకుని వచ్చి కపిలమునికి ఇచ్చాడు గణపతి. అప్పుడు కపిలముని ఆ చింతామణిని గణనాథుని మెడకు అలంకరించి ‘ఈ చింతామణి మీదగ్గరే ఉండనివ్వండి. ఈనాటి నుంచి మిమ్మల్ని చింతామణి అని కూడా పిలుస్తారు’ అని చెప్పి నమస్కరించాడు.

Tuesday, 10 October 2017

పూజలో ఎలాంటి విగ్రహాలుండాలి?

పూజలో ఎలాంటి విగ్రహాలుండాలి?

అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. అయితే, అందంగా వున్నాయి కదా అని మార్కెట్‌ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు.

మరి మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాంకదా మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదంటారా? మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తాయి కదా, మరి అలాంటివాటిని పూజించ కూడదుకదా. గణపతి నవరాత్రులలో, దసరాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు కానీ, ఎక్కువకాలం పూజ చెయ్యరు కదా. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు.

అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజాసమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది.

చిన్ముద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు, మనవంక శాంతంగా, చిరునవ్వుతో చూస్తున్నట్లు వుంటే మనకి ఎనలేని ప్రశాంతత,ఎక్కడలేని ధైర్యం లభిస్తాయి. అంతకన్నా మన పూజకి పరమార్ధం ఏముంటుంది.

వృత్రాసురుడు

త్యాగబుద్ధి


స్వార్థబుద్ధితో కోరుకునే వరాలు లోకానికే కాదు, ఆఖరుకు అలా కోరుకున్న వారికి కూడా మంచి చేయవని, నిస్వార్థంతో చేసిన స్వల్పదానమైనా పదికాలాలపాటు చెప్పుకునే విధంగా వారి పేరు స్థిరపడిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణే మహాబలసంపన్నుడైన వృత్రాసురుడు, దధీచి మహాముని జీవితాలు. వృత్రాసురుడు మహాభయంకరాకారం గల, మహాశక్తి సంపన్నుడైన రాక్షసుడు. దేవతలపైన ద్వేషంతో తపస్సు చేసి, కనీవినీ ఎరుగని విధంగా తయారైన కొత్త ఆయుధం... అదీ ఏవిధమైన లోహంతోనూ తయారు చేయని ఆయుధం తప్ప మరేదీ తనను చంపడం కాదు కదా, కనీసం కొద్దిపాటి గాయం కూడా చేయని విధంగా వరం పొందాడు. ఆ వరానికి సహజసిద్ధమైన రాక్షసబలం తోడు కావడంతో వాడిని ఎదిరించగలిగేవారెవరూ లేకుండా పోయారు. వాడు మొదట ఇంద్రుడి మీద దండెత్తి, సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు.

అది చాలదన్నట్టు దేవతలందరినీ హింసించడం మొదలు పెట్టాడు. దేవేంద్రుడు ఏమీ చేయలేక దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తి వద్దకెళ్లి, మొరపెట్టుకున్నారు. అత్యంత బలమైన, పొడవైన ఎముకలతో అత్యంత పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు. ఏనుగు, సింహం, పులి వంటి జంతువుల ఎముకలు బలిష్టంగా ఉంటాయి కాబట్టి ఆయుధ తయారీకి పనికొస్తాయనుకుంటున్న దేవతలతో విష్ణువు ఇలా అన్నాడు. ‘‘మీ ఆలోచన సరైనది కాదు. బలంతోపాటు, తపశ్శక్తి కూడా కలబోసుకున్న ఎముకలై ఉండాలి, భృగుమహర్షి కుమారుడు, మహాతపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముక అందుకు బాగా ఉపయోగపడుతుందని, దేవశిల్పి, దేవగురువులను తీసుకుని వెంటనే దధీచి మునిని ఆశ్రయించమని మార్గాంతరం చెప్పాడు విష్ణుమూర్తి.

దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతిని, దేవశిల్పి విశ్వకర్మను వెంటబెట్టుకుని దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వారిని చూసి, సంతోషంతో అతిథిమర్యాదలు చేయబోతున్న దధీచితో తాము వచ్చిన సంగతిని ఎలా అడగాలో అర్థం కాక సతమతం అవుతుండగా, దధీచి మహర్షి వారిని గుచ్చిగుచ్చి అడగడంతో ఎట్టకేలకు చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు.దధీచి మహర్షి ఎంతో సంతోషంతో వారికి తన అనుమతిని తెల్పాడు. అంతేగాక యోగశక్తితో తన ప్రాణాలను ఊర్ధ్వోత్కటనం చేసుకున్నాడు. లోకోపకారం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి, అవయవదానానికి ఆద్యుడయ్యాడు. అలా దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైందే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుడితో పోరాడి, అవలీలగా విజయం సాధించాడు దేవేంద్రుడు. మంచితనానికి, త్యాగానికి మారుపేరుగా దధీచి మహర్షి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌


Thursday, 5 October 2017

అష్టాదశ శక్తిపీఠాలు





అష్టాదశ శక్తిపీఠాలు
ఈ ప్రపంచాన్ని శాసించే సర్వసత్తాక శక్తులుగా పేరొందిన శివుడు, విష్ణూవుతో పోటీపడి సర్వ జనులనూ ఆకట్టుకున్న దేవి ఆదిపరాశక్తి. ఆమె దయతోనే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కారకాలను నిర్వహిస్తున్నార ని పురాణాలు చెబుతున్నాయి. నిగ్రహానుగ్రహ సామర్థ్యం గల సర్వశక్తి స్వరూపిణి, సర్వగ్రహ సంచారిణి, లోకానుగ్రహ కారిణి అమ్మవారు. ఆ అమ్మను ఆరాధించేందుకు మనదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో వెలసిన అమ్మవారికి ఎనలేని శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. అయితే అందరికీ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న శక్తి స్వరూపిణిని దర్శించుకోవడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఏ ఒక్క పీఠాన్ని దర్శించుకున్నా అన్ని శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఞం చేయ తలపెట్టి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన కూతురు, అల్లుడిని ఆహ్వానించడు. దీంతో ఎలాగైనా యజ్ఞానికి వెళ్ళాలని పరమశివుడిని పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి రావడానికి శివుడు ఒప్పుకోడు. దీనిని అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా ఊగిపోతూ తన శరీరాన్ని 18 ముక్కలు చేసి విసిరి వేస్తుంది. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడతాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయని పురాణగాథ. ఈ అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

“లంకాయాం శాంకరీదేవి”
భూప్రపంచాన్నే జంబూద్వీపం అని అంటారు. అగ్నిధృవుడనే రాజుకి అప్సరకాంతవల్ల తొమ్మండుగురు తనయులు కలిగారు. జంబూద్వీపాన్ని నవ ఖండాలుగా చేసి, తొమ్మిది మందికి పంచి ఇచ్చాడు. అందులో ఒకటి భారత ఖండం. భారత ఖండంలో సింహళం కూడా ఒక భూభాగముగా ఉండేది. నాటి సింహళ ద్వీపం, నేడు శ్రీలంకగా ప్రసిద్ధిగాంచినది. ఆంగ్లంలో సింహళమే సిలోన్ అయింది. సిలోన్ లోని ఉత్తర భాగమంతా 12వ శతాబ్దంలో తమిళరాజుల పాలనలో ఉండేది. నాటి నుంచి ఉత్తర ప్రాంతము తమిళులది. దక్షిణ ప్రాంతము సింహళీయులది. ఉత్తరాన హిందూమతం, దక్షిణాన బౌద్దమతం స్నేహ సౌభ్రాతృత్వాలతో వర్థిల్లాయి.

మౌర్యుల కాలములో కళింగ రాజులపై అశోకుడు దండయాత్ర చేశాడు. కళింగ యుద్ధానంతరము అశోకుడు పశ్చాత్తాపం చెంది యుద్ధ విరమణ ప్రకటించి, బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అశోకుడు తన కుమారుడు మరియు కుమార్తెను బౌద్ధమతాభివృద్ధికి, మతవ్యాప్తికై చైనా, బర్మా, సింహళం మొదలగు దేశ, విదేశములకు పంపినాడు. గయక్షేత్రంలోని బుద్ధుడు తపస్సు చేసిన బోధివృక్షము తాలూకు రెండు కొమ్మలను సింహళ దేశమునకు పంపినాడు. బౌద్ధమతంను సింహళద్వీపం నందు విస్తరింపజేశాడు. బౌద్ధమతాన్ని ఆచరించిన సార్వభౌములు, వారిపాలనలో హిందూమతాన్ని అణిచివేసినట్లు శిలాశాసనాలు తెలియపర్చుచున్నాయి. తరువాతి కాలమునందు మహమ్మదీయ మతం కూడా వ్యాప్తిలోనికి వచ్చింది. వాస్కోడిగామా క్రైస్తవంతో సిలోన్ లోనికి ప్రవేశించాడు. పోర్చుగీసువారు తమ మతంను ఇండోనేషియా దాకా విస్తరించారు. 1796వ సంవత్సరములో సిలోన్ ప్రాంతమును బ్రిటిష్‌వారు తమ వశం చేసుకున్నారు. వారి పాలనలో క్రీస్తు మతంను అభివృద్ధి చేసినారు.

శ్రీలంక భూభాగము 65,610 చ|| కి|| మీటర్లుగా ఉంటుంది. శ్రీలంక ద్వీపంను ఉత్తర ప్రాంతము, ఉత్తర మధ్యప్రాంతము, తూర్పు తీరప్రాంతము, వాయవ్య ప్రాంతము, ఎల్లవాయుప్రాంతముగా గుర్తించినారు. శ్రీలంక రాజధాని జయవర్థనపురం. దీనినే కొలంబోగా పిలుస్తారు. జాఫ్నా, దేహివాల, కాండి, కొలంబో, అనురాధపురం, పొలన్నరుప, కొట్టే మొదలగు ముఖ్య నగరములు కలవు. సిగిరియా, హిక్కడువా మొదలగు పర్యాటక స్థలాలు, పర్యాటకులను ఆకర్షించుచున్నాయి. సింహళి, తమిళ, ఇంగ్లీష్ అధికార భాషలుగా ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు మొదలగు నగరముల నుంచి కొలంబోకు విమాన సర్విసులు కలవు. ముంబాయి, త్రివేండ్రం, చెన్నె (మనంబాకం) నాగపట్టణం మొదలగు రేవుల నుంచి సముద్ర మార్గంలో నౌకా సర్వీసులు కలవు.

“లంకాయాం శాంకరీదేవి”, అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటది. భారతదేశమునకు పొరుగున గల సింహళద్వీపం(శ్రీలంక) నందు ఉండేది. శ్రీలంక ద్వీపంనందు తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపుర(ట్రింకోంలీ) పట్టణము ఉంది. ఇది సతీదేవి కాలిగజ్జెలు పడిన ప్రదేశముగా ప్రసిద్ది. ఇక్కడ శాంకరీదేవి మందిరము ఉండేది అని పూర్వీకుల వాదన. బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధితో హిందూమతంనకు రాజపోషణ కరువయింది.దీనితో ప్రజల ఆదరణ కూడా క్షీణించింది. కొంతకాలమునకు హిందూ దేవాలయములు శిథిలముగా మారినాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. శాంకరీదేవి మందిరము కూడా కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చును. నేడు శ్రీలంకను శోధిస్తే, ఎక్కడా శాంకరీదేవి ఆలయం కనిపించుటలేదు. ప్రస్తుతం శాంకరీదేవి దర్శనం దుర్లభమే. శ్రీలంకలో తమిళులపై దాడులు హింసాత్మక మవటంతో, వాటిని తట్టుకోలేక పారిపోయి కెనడా, ఇండియా మొదలగు దేశములకు, చేరిన హిందువుల సంఖ్య అదికం. క్రమక్రమంగా శ్రీలంకలో హిందూమతంకు, హిందూ దేవాలయములకు ఆదరణ కరువయింది.

త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం. ట్రింకోంలీ నందు శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్రా దర్శనము ఆనందాయకమే. కొలంబో పట్టణము పశ్చిమతీరంలో ఉండగా, ట్రికోంలీ పట్టణము తూర్పుతీరంలో ఉంది. రెండు పట్టణముల మధ్య రవాణా సదుపాయములు కలవు. మహోపట్టణం, గలోయపట్టణం మీదగా శ్రీలంక ప్రభుత్వరైలు మార్గం ఉండగా, కాండిపట్టణం, గలోయ పట్టణముల మీదుగా రోడ్‌మార్గం కలదు. భారతీయులకు శ్రీలంకలోని పర్యాటక స్థలసందర్శనకై 25,000/- రు||లు పైగా ఖర్చు అవుతుంది.

ఈ పీఠం శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయి. ఇది అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం. రావణుని స్తోత్రాలకు ప్రన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.


శ్రీకామక్షీ కంచికాపురే:

ఓం శ్రీ కామాక్షీ దేవతాయై నమః అంటూ కొలిచిన భక్తులను కాపాడి కోరికలు తీర్చే బంగరు తల్లి శక్తిస్వరూపిణి కామాక్షీదేవి. ఈ తల్లిని చేపట్టిన శంకరుడు ఏకామ్రేశ్వరుడు. కామాక్షీదేవి ఆలయం “కంపా” నదీ తీరంలో ఉంది. “కామాక్షి” అనగా “కోర్కెలు తీర్చే కన్నులు” గల శక్తి స్వరూపిణి.

ఈ కంచి కామాక్షీ ఆలయం తమిళనాడు లోని చెన్నైకి 70 కి.మీ. దూరంలో కాంచీపురం అనగా నేటి కంచి క్షేత్రంలో నిత్యార్చన విలసితురాలై భక్తజన మనోభీష్టాలను నెరవేర్చే అమ్మగా విలసిల్లుతోంది. అంతే కాదు శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామి రూపంలో మిగిలిన దేవతలంతా తమతమ నెలవులను ఏర్పరచుకొన్న కంచి, మించి సిద్ధినొసగు శ్రీ శక్తి పీఠం. అష్టాదశ శక్తి పిఠాలలో రెండవ శక్తిపీఠమైన ఈ కంచి దేవాలయంలోని బంగారు బల్లి, వెండి బల్లి రూపాలను తాకి తరించే భాగ్యం ఈ క్షేత్రాన్ని దర్శించే వారికి కలుగుతుంది.

చెన్నైకి 70 కి.మీ. దూరంలో గల కంచిక్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నైనుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా విశిష్ఠ విద్యాకేంద్రంగా గల ఈ కంచిపురంలో సతీదేవి “కంకాళం” పడినట్లు చరిత్రకారుల నమ్మకం.

ఆదిశంకరులే స్వయంగా ప్రతిష్టించిన ఈ శక్తిక్షేత్ర శక్తిపీఠం వైపుకే కంచిలోని ఆలయాలన్నీ తిరిగి ఉండటం ప్రత్యేక విశిష్ఠతగల అమ్మను, ఏకామ్రేశ్వర కామాక్షమ్మను దర్శించి తరించండి!

ప్రద్యుమ్నేశృంఖలాదేవి.
ఈ చరాచర ప్రపంచానికంతటకు తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి. ‘శృంఖలా దేవి ‘కొలువు దీరిన దివ్యక్షేత్రం – ప్రద్యుమ్నం. ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠములలో మూడవది అయిన శృంఖలాదేవి శక్తిపీఠము.

నేటి బెంగాల్ బంగ్లా దేశముగా, వంగ దేశముగా విడిపోయి ఉన్నది. హుగ్లీ జిల్లాలోని పాండుపా గ్రామంలోని దేవినే “శృంఖలాదేవి” అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లొని హుగ్లీ జిల్లాలోగల కలకత్తా (కోల్‌కతా) పట్టణానికి సుమారు 80 కి.మీ. దూరంలో పాండవ ప్రాంతమయిన “ప్రద్యుమ్న” అనే ప్రదేశంలో ఈ శృంఖలాదేవి క్షేత్రం ఉండేదని ఆర్యుల ప్రామాణికం. దాన్ని అనుసరిస్తే కలకత్తాకు 135 కి.మీ. దూరంలో గల గంగా సాగర్ క్షేత్రం శక్తి పీఠముగా పిలువబడుతోంది.

త్రేతాయుగంలో ‘ఋష్యశృంగ మహర్షి ‘ శృంఖలా దేవిని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.
ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరూ, స్థనము పడిందని మరికొందరి వాదన.


శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని ప్రతీతి. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు. 


క్రౌంచపట్టణ చాముండేశ్వరి:
అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం|
చాముండేశ్వరి, చిత్కళవాసిని! శ్రీ జగదీశ్వరి రక్షయమాం||

అంటూ క్రౌంచి పట్టణమందున్న చాముండేశ్వరి ఆలయం భక్తజన జయజయ ధ్వానాలతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్రౌంచి పట్టణం అనగా మహిషాసురుని ప్రధాన పట్టణం. అదే ఈనాటి మైసూరు పట్టణం. కర్నాటక రాష్ట్రంలోగల మైసూరు పట్టణమందు మహిషాసుర మర్ధినిగా, చాముండేశ్వరీ మాతగా తన చల్లని దేవెనలు కురిపిస్తూ, భక్తజన మనోభీష్టాలనీడేరుస్తూ నిత్యసేవా కైంకర్యాల నందుకుంటున్న బంగారు తల్లి ఆదిపరాశక్తి చాముండేశ్వరికి నిత్యం మనః పూర్వక వందనం.

శ్రీ చాముండేశ్వరీ దేవి… ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి. సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

అలంపురే జోగులాంబ:
అలంపురం పూర్వనామం హలంపురం, మరో పేరు హేమలాపురం. ఈ అలంపురంలోని శక్తిపీఠం జోగులాంబా దేవి శక్తిక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కలదు. ఆదియుగంలో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా భాసిల్లింది. కాశీక్షేత్రంలో ఉత్తర వాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర. కాశీకి అటు, ఇటు వరుణ, అసి నదులున్నాయి. అదే విధంగా అలంపురానికి వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీలో గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఉన్న విధంగా అలంపురంలో వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.

అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు. ఇసుకతో రూపుదిద్దిన “రససిద్ది వినాయకుడు” అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది.

తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశేశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది.

ఎంతో అద్భుత మహిమల చరిత్రల అలంపురం క్షేత్రాన్ని 7,8 శతాబ్దాలలో చాళుక్య రాజులు; 9వ శతాబ్దంలో రాష్ట్రకూటం రాజులు; 10,11 శతాబ్దాలలో కళ్యాణ, చాళుక్య రాజులు అభివృద్ధిపరచారు. కాని బహుమని సుల్తానుల తాకిడికి ఈ ప్రాంతం జీర్ణస్థితికి చేరుకుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ అలంపురాన్ని అభివృద్ధిప్రిచాడు. ఇలా కాలమనే ఆటుపోటులకు తట్టుకుంటు నాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలచి నేటికి ఆ ప్రతిభను చాటుతూ నిలచిన అలంపురం చూసి తీరవలసిన మహిమాన్విత పర్యాటక కేంద్రం. అష్టాదశ క్షేత్రాలలో ఐదవది.

శ్రీశైల భ్రమరాంబిక:
అష్టాదశ శక్తిపీఠలలో ఆరవ శక్తి పీఠమై భ్రామరి శక్తితో విరాజిల్లుతున్న శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా విశిష్ట స్థానం పొంది యున్నది. ఆంధ్రరాష్ట్రంలోని కర్ణూలు జిల్లాలో గల శ్రీశైలం సముద్రమట్టానికి చుట్టూ నాలుగు ప్రధాన గోపురాలతో కోట గోడల్లాంటి ఎతైన ప్రాకారంలో 279300 చ.అడుగుల విశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉన్నది. ఆలయ ప్రాకారం 2121 అడుగుల పొడవుతో దాదాపు 20 అడుగుల ఎత్తుగల కోట గోడ పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలచి ఉన్నది.

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లేశ్వరల దర్శనం ముక్తిదాయకమని పురాణ ప్రవచనం. అందుకే “శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే” అని ఆర్యోక్తి. శ్రీశైలము అనగా వరములనిచ్చె శివ కైలాసము. సతీదేవి కంఠభాగము ఈ ప్రదేశంలో పడిందని చరిత్ర ఆదారం.

ఒకరోజున సౌందర్యలహరి అయిన జగజ్జనని అరుణాసురుని కంటపడింది. ఓ సుందరీ ! నీకీ కానలలో పని ఏమి? నేను లోకాల నేలేటి అరుణాసురుడను. నా సామ్రాజ్ఞ్‌వై నాతో సుఖించు అని ఆమె చేయిపట్టుకోబోగా ఆమె చుట్టూ తిరుగుతున్న భ్రమరాల (తుమ్మెదలు) అరుణాసురునిపై దాడిచేసి, చంపివేసి వాడి రాజ్యంలో ఉన్న రక్కసులందరినీ తుదముట్టించాయి.

కొంతకాలానికి మహిషాసురుని సంహరించేందుకు ఉగ్ర చండీరూపంతో, పద్దెనిమిది భుజములతో వెలసి వాడిని తుదముట్టించింది. రెండవసారి మహిషుడు మళ్ళీ పుట్టినప్పుడు భద్రకాళిగా ఎనిమిది చేతులతో అవతరించి వాడిని సంహరించింది. మూడవసారి మహిషుడు పుట్టి ‘అమ్మా! రేండు జన్మలలో నీచేత సంహరింపబడి నా అజ్ఞానం పొగొట్టుకున్నాను. ఇప్పటికైనా నన్ను కటాక్షించి నీ వాహనంగా నన్ను సేవచేయనీ, అని ప్రార్థించగా వాడిని తన పాదల క్రింద తొక్కి ఉంచింది భ్రమరాంబాదేవి.

ఈ క్షేత్రమున ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ భ్రమరాంబా దేవి వెలసిన నాటి నుండి ఈమెయే ప్రధాన శక్తి స్వరూపిణి అయినది.

శ్రీశైలానికి నాలుగు ప్రధాన ద్వారములు కలవు. అవి త్రిపురాంతకము, సిద్ధవటము, అలంపురము, ఉమామహేశము అనునవి.

ఇక్కడి పాతాళగంగ భక్తుల పాపాలు కడిగే పావనగంగ. నల్లమలై అడవిలోపల గల “ఇష్టకామేశ్వరి” ఆలయం కాకుండా ఆరుబయటే ఆ దేవి ఉంటుంది. ఇష్టకామేశ్వరీ దేవి నొసట కుంకుమ దిద్దినపుడు మనిషి నుదురువలె మెత్తగా ఉంటుంది. ఇంకా చంద్రావతి నిర్మించిన “వృద్ధ మల్లికార్జునాలయము” అలా అడుగడుగునా అలరారే వన సౌందర్యాలు, ఔషధీ విలువలు, ఆరోగ్య ప్రశాంతతో అలరారే శ్రీశైలం నిజంగా భూతల కైలాసం.

శరణు ! శరణు ! భ్రమరాంబా మల్లేశా ! శరణు!

కొలాహపురి మహాలక్ష్మీ:
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||

తా|| శ్రీ పీఠముపై సుఖముగా కూర్చొని యుండి, శంఖము, చక్రము, గద మరియు అభయ హస్తముద్రతో నుండి మాయను మటుమాయం చేసే మహామాయగా దేవతల రత్న కిరీట కాంతులతో మొరయుచున్న పద్మపాదములుగల తల్లి, దేవతలచే పూజింపబడుతున్న మహాలక్ష్మికి భక్తిపూర్వక నమస్కారము.

అష్టాదశ శక్తి పీఠములలో ముఖ్యమైన శక్తిపీఠము కొలాహపురి మహలక్ష్మీ శక్తిపీఠము. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ కొలాహపూర్ సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో వున్నది. క్రీ.శ.9వ శతాబ్దంలో ఈ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడినదని చరిత్రకారుల భవన.

పద్మావతి పురంవంటి కొలాహపురంలో కొలువైనది, కరుణ మాత్రమున వీరత్వము నొసగే కరవీర పురవాసిని, విభూతి అనగా ఐశ్వర్యప్రదమైన శివలింగమును కిరీటంపై ధరించి, వాత్సల్యంతో కోరిన వారికి సంపదనొసగే సచ్చిదానంద స్వరూపిణీ, ఓ లక్ష్మిదేవీ నీకు జయమగుకాక…

మాత లుంగం గదాం ఖేటం పానపాత్రం చ భిభ్రతే|
నాగలింగం చ యోనించ భిభ్రతీ నృప మూర్థని||

కొలాహపురి మహలక్ష్మికి నాలుగు చేతులున్నాయి. (కొలాహపుర మహాత్మ్యము) క్రింద కుడిచేతిలో మాతలుంగ ఫలం (మాదిఫలం), పైకుడి చేతిలో కిందికి దిగి ఉన్న పెద్ద గద, పైన ఎడమ చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ఉండగా, శిరస్సుపై ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోని ముద్ర ఉన్నాయి. చంద్రఘంటా దేవి కిరీటంలోని ఘంటయే లక్ష్మిదేవి కిరీటంలోని శివలింగంగా మారిందని పెద్దల ప్రవచనం. అత్రి, అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మద్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్షస్వీకరించేవాడట. వింధ్య గర్వమణచిన అగస్త్యుడు కొలాహపురి క్షేత్రదర్శనంతో దేవి సాక్షాత్కారం పొందాడు.

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సర్వసౌభాగ్యదాయినీం|
వందే కరవీరపురస్థితాం మహాలక్షీం మానసార్చిత వందనం||

ఏకవీరికా దేవి:
మాహుర్యే ఏకవీరికా.. అనగా మాహుర్య పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరికాదేవి. ఈ మాహుర్య పురం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నాందేడ్‌కి 128 కి||మీ|| దూరంలో ఉన్నది. దీనినే మయూర పురమని కూడా అంటారు.

ఈ ప్రదేశంలోని 3 పర్వతాలున్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రేండవ పర్వతంపైన అత్రి, అనసూయల ఆలయాలు ఉన్నాయి.

మూడవ శిఖరం సతీదేవి కుడిస్తం పడిన శ్రీ క్షేత్రం.. ఈ శిఖరంపైన గల ఆలయంలోగల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది.

ఆ అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయమనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తపిస్తే అమ్మ మనకోసం పరితపిస్తుంది.

ఇక అమ్మ ఏకవీరికా దేవిగా వెలసిన మయూర పురం దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది.

సహ్యద్రి పర్వత శ్రేణులో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామమని, తులజాపూర్ అని అంటుంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు.

ఉజ్జయిన్యాం మహాకాళీ:
మహామంత్రాధి దేవతాం ధీగంభీరతాం|
మహా కాళీ స్వరూపిణీం. మాం పాలయమాం||
ఎక్కడైతే స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో, అదే దేవతల స్థానం. ఎప్పుడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో ఆ అజ్ఞానాన్ని ద్రుంచే విజ్ఞాన స్థానమే కాళీ నిలయం.

ధర్మగ్లాని జరిగే వేళ దేవతల ప్రార్థనతో అంబిక నవదుర్గ రూపాలలో దుష్ట శిక్షణకై బయలుదేరింది. ఆ నవదుర్గ రూపాలలో అతి భీకరమైనదీ కాళీ స్వరూపం.

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు 55 కి|| మీ|| దూరంలో క్షిప్రానదీ తీరంలో ఉజ్జయినీ క్షేత్రం ఉన్నది. ఈ ఉజ్జయిని పూర్వనామం అవంతిక. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళీ శక్తి పీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతానికి అష్టాదశ శక్తి పీఠలలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. అదేమిటంటే ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది.

ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు కన్నులుండటం అనగా శివలింగానికి కన్నులుండటం విశేషం.

ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని.

అదిగో చూడండి ! మహాకాలుని ఎదుట మహాకాళి ఆనంద తాండవం చేస్తోంది. ఒక్కసారి ఆ ఆదిదంపతులను స్మరించి మనసుతో ఆ ఆనంద తాండవాన్ని తిలకించండి.
అప్పుడు మనకి లభించేది సత్ + చిత్ ఆనంద మోక్షపురి. అదే ఉజ్జయిని, (విజయవంతమైన) మహాపురి, శివపురి.

పీఠికాయాం పురుహూతికా:
అది అందమైన తల్లి పీఠము. బంగారు తల్లి పేరు పురుహూతికా దేవి. ఆ బంగారు తల్లిని చేపట్టినవాడు కుక్కుటేశ్వరస్వామి. పిఠపురం అనాదిగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఎందుకంటే ఇక్కడి శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది. కుక్కుటమనగా కోడి. పైగా ఏలముని యోగానికి సారమైనది. అత్యద్భుతమైన మహితమలకు ఆలవాలమైనది. పాదగయ అని ఇక్కడి ప్రాంతానికి మరోపేరు. ప్రప్రథమంగా దేవేంద్రునిచే ఆరాధించబడిన పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం.

ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి 60కి||మీ|| దూరంలోను మరియు కాకినాడకు 18 కి||మీ దూరంలోను ఉంది.

భీహారులో ఉన్న ప్రదేశాన్ని “విష్ణుగయ” లేదా “శిరోగయ” అని, పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశానికి “పాదగయ” అనే పేరు వచ్చింది. అలా శివ, శక్తి, విష్ణు పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మంగళప్రద మహాత్మ్యలకు ఆలవాలమై ఉన్నది.

సత్ చిదానంద శక్తి క్షేత్రమైన ఈ పిఠాపురం దర్శనం పరమం పవిత్రం !

ఓం శ్రీ కుక్కుటేశ్వర సమేత శ్రీ పురుహూతికాయై నమః


ఓఢ్యాణే గిరిజా దేవి:

ఆత్మయే శంకరుడు. బుద్ధియే గిరిజాదేవి. కావున జగద్గురు ఆదిశంకరాచార్యులవారిలా “గిరిజా శంకరులను” స్తోత్రంతో అర్చించారు. “ఆత్మాత్వం గిరిజా మతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం పూజతే విషయోప భోగ రచనా నిద్రా సమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన్‌ం “.

“శంభో! నా ఆత్మవు నీవు, నామతి గిరిజాదేవి, పంచప్రాణాలు నీకు పరిచారికలు, శరీరము అనే ఈ గృహంలో మీ ఆదిదంపతులను నిలిపిన. నాకు ఏఏ విషయోప భోగాలందాసక్తి కలదో అవన్నీ నీకు నిత్యపూజలు, నా నిద్రా స్థితి నీ ధ్యాన సమాధి స్థితి. నా పాదాలు భూమిని సంచరించినదంతా నీకు భక్తి ప్రదక్షిణలు. నే పలికే ప్రతి పలుకు నీ స్తోత్ర గానాలే నేను ఏఏ కర్మలొనర్చినా అవి నీకు ఆరాధనలే. కనుక నిత్యం నీపై నుండి దృష్టి మరలని వరమీయి” అని ప్రార్థించారు. మనము కూడా మన తనువును “శక్తి ఆలయం”గా మలచుకొని బుద్ధి అనే అర్చనతో “శక్తి”నుపాసించి మనసు “శక్తి” దక్షిణగా ఇచ్చినచో “శక్తి” సంపన్నులమౌతాము.

గిరిజ అనగా గిరి (హిమవంతుడు)కి జనియించినది. జన్మించినది మొదలు జటధారిపై మనసు నిలిపి ధ్యానంతో కొలిచేది.

విరజానది పాపులను పుణ్యలను చేసే పావన జల ప్రవాహం. ఓఢ్యాణము అనగా ఓడ్రదేశము. అదే నేటి ఒరిస్సా రాష్ట్రము. ఈ రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరిణి నది ఉన్నది. ఈ నదీ తీరంలో వైతరిణి అనే గ్రామం కూడా ఉంది. ఇప్పటి ఒరిస్సాలోని జాజ్‌పూర్ రోడ్‌కి సుమారు 20 కి|| మీ|| దూరంలో ఉంది ఓఢ్యాణము.

ద్రాక్షారామ మాణిక్యాంబ:

రక్షమాం ద్రాక్షారామ పురవాసినీ – భీమే శురాణీ
పాలయమాం గోదావరీతటి వాసినీ – శక్తి స్వరూపిణీ

మాణిక్యాంబ … ఆహా ! ఎంత చల్లని పేరు. అంబ అనగా అమ్మ, మాణిక్యముల వంటి చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలందించే అమృతమూర్తి. సతీదేవి “కణత” పడిన శక్తి ప్రదేశమై భీమేశ్వరుడు, మాణిక్యాంబ ఒకేసారి స్వయం ప్రతిష్ఠ పొందిన ప్రదేశమే ద్రాక్షారామం. ఈ ప్రాంతాన్నే “త్రిలింగ” పిఠం అంటారు. ఆంధ్ర ప్రదేశ్‌లో శ్రీశైల, శ్రీకాళహస్తి, ద్రాక్షారామ క్షేత్రాలను మూడింటిని కలిపి “త్రిలింగ దేశం” అంటారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కి||మీ|| దూరంలో, రాజమండ్రికి 60 కి||మి|| దూరంలో ఉన్న ఈ ద్రాక్షారామ శక్తి పీఠాధినేత్రి మాణిక్యాంబ, స్వయంభూ లింగాకారుడు భీమేశ్వరుడు, దక్షుడు యాగం చేసిన ప్రదేశం కనుక దక్షారామమయింది.

పంచ భూతాకారమైన ప్రపంచానికి పంచముఖేశ్వరుడు మించి సిద్ధినందుటకు జనులకందించిన పంచాక్షరీ ప్రణవ నాదమే “ఓం నమః శివాయ ” అన్న మంత్రం.

దక్షప్రజాపతి యజ్ఞ చేసిన ప్రదేశం కనుక “దక్షారామం” అని మిక్కిలి ద్రాక్ష తోటలుండటం వలన “ద్రాక్షారామం” అని పేరు వచ్చింది. “ద్రాక్షారం” అనే మరోపేరు కూడా కలదు. ఇక్కడ శంకరుడు “భీమేశ్వరుడై” స్వయంభువుడై వెలిశాడు. కనుక శక్తి ఈశ్వరుల సంగమస్థానమే ఈ ద్రాక్షారామం.

ఈ ప్రాంతాన గోదావరీ నదికి “సప్త గోదావరమని” పేరు.

తెలుగు వెలుగుల పదమునకు సత్యపదమై అమరేవిధంగా అక్షర సత్య నిరూపణ చేసిన భీమ కవి ఈ భీమేశ్వర మాణిక్యాంబలను సేవించి, అక్షర శక్తిని సంపాదించాడు.

ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించారు. ఊరిమధ్యనగల ఈ ఆలయం 3 ప్రాకారాలతో , 4 గాలిగోపురాలతో శివభక్తితో ధీటుగా నిలచింది. జగద్గురు శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన ఈ శక్తి స్వరూపిణి మాణిక్యాంబాలయం, స్వయంభూ భీమేశ్వరాలయం యొక్క విశిష్ఠత చేరి కొలవవలెనే గాని చెప్పనలవికాదు. శివోహం !

హరిక్షేత్ర కామరూపా దేవి:
హరిక్షేత్ర కామరూపాదేవి వందనం, అభివందనం. నీలాచలవాసినికి నిత్యాభివందనం. అంటూ కామరూపాదేవి అనబడే కామాఖ్యా దేవిని నిత్యార్చనల స్తుతిస్తూ ఉంటారు. ఈ కామాఖ్యదేవి కన్యక అని, పెళ్ళికాని పిల్ల కనుక కామరూపి అని ఆర్యోక్తి. సమానంగా లేని కొండప్రాంతం కనుక “అసమ” అన్న నాటి పేరు నేటి అస్సాంగా మారింది. నీలాంచలమున గల ఈ క్షేత్రానికి దగ్గరగా బ్రహ్మపుత్రానది కలదు. సతీదేవి యొక్క “యోని” భాగం ఈ పర్వతం మీద పడింది. ఈ ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా వున్నది. ఇక్కడే వున్న నీలాంచల పర్వతం విష్ణుస్వరూపంగా భావించబడుతోంది కనుక ఇది హరిక్షేత్రమయింది.

కాముడికి ఖ్యాతి వచ్చిన క్షేత్రం కనుక ఆ క్షేత్రాన్ని “కామాఖ్యా క్షేత్రమని” కాముడికి మళ్ళీ జీవం వచ్చింది కనుక కామరూప క్షేత్రమని పిలచేవారు. ఆ తల్లిని కామరూపాదేవిగా అర్చించేవారు.

13వ శతాబ్దంలో బిష్వసింహుడు, శివసింహుడు అనే రాజ యువకులు అడవిలో తప్పిపోయిన తమ సైన్యం గురించి వెతుకుతూ, నీలాచల పర్వతం చేరి అక్కడ ఒక జ్వాల ఆ ప్రక్కన ఒక ముసలమ్మ కనిపించగా తమ దాహం తీర్చమని అడిగారు రాకుమారులు. వారికి బ్రహ్మకుండం చూపింది ములసమ్మ.

ఆ బ్రహ్మకుండంలోని నీరుతాగి సేదతీరిన రాకుమారులు అవ్వా! ఆ జ్వాల ఏమిటి? ఒంటరిగా ఎందుకున్నావని అడుగగా అది కామాఖ్యక్షేత్రమని, కూలిపోయిన గుడిని పునర్నిర్మిస్తే మీ కోరిక తీరుతుందని ముసలమ్మ తెలుపగా… ‘బంగారు గుడి కట్టించలేని అశక్తులము, ఇటుక ఇటుక మధ్యన బంగారు పలుకు వేసి కట్టిస్తాం… మమ్ము క్షమించి అనుగ్రహించమని ప్రార్థించగా… తల్లి ఆనందించి ఆశీర్వదించింది. అందుకే అంటారు అమ్మ వాత్సల్యానికి మించిన అనుగ్రహం లేదని. అమ్మ అనుగ్రహంతో ఆలయ నిర్మాణం పూర్తిచేసి నిత్యార్చనలకై అర్చక కుటుంబాలను ఏర్పరిచారు.

పిమ్మట కాలగతంలో శిథిలమైన ఆలయాన్ని పునరుద్ధరించేందుకు 16వ శతాబ్దంలో నరనారాయణుడు, చిలారై రాజసోదరులు నడుంకట్టారు.

ఈ ఆలయం సమీపంలోగల “ఉర్బసీ కుండం”లో స్నానమాచరించి కామాఖ్యా ఆలయంలో ప్రవేశించాలి.

మరో విశేషమేమిటంటే “అంబూషి మేళ”గా పిలువబడే సమయంలో అమ్మవారికి కట్టిన వస్త్రాలు ఎర్రబడతాయి. మృగశిరకార్తెవెళ్ళి ఆర్త్రకార్తె ప్రవేశించేవేళ, భూమి రజస్వలవుతుందని దేవీ భాగవతంలో ఉంది. ఈ సమయంలో 3 రోజులపాటు అమ్మవారి ఆలయాలను, చుట్టుపక్కల ఆలయాలను మూసివేస్తారు. నాల్గవరోజున అమ్మవారికి తలంటిపోసి ఆలయ సంప్రోక్షణ జరిపి అమ్మవారి దర్శనం కోసం ఆలయం తెరుస్తారు. 


కామాఖ్యాదేవి ఆలయం చుట్టుపక్కల ఏడుగురు అమ్మవార్ల ఆలయాలున్నాయి. అవి : 1. కాశి, 2. తార, 3.భువనేశ్వరి, 4.భైరవి, 5. చిన్న మస్తా, 6. భగళీ, 7.ధూమావతి 
ఆలయాలతోపాటు 1. కామేశ్వర, 2. సిద్ధేశ్వర, 3.కోటిలింగ, 4. అఘోర, 5. అమృతేశ్వర అనే పంచశివాలయాలున్నాయి.

ఈ క్షేత్ర సందర్శకులకు నిత్యమూ మహిమా చూపి ఆదరిస్తున్న బంగారు తల్లి కోర్కెలు తీర్చే కామాఖ్యమాత అనడంలో ఎటువంటి సందేహం లేదని ఎందరో భక్తులు కొనియాడుతున్నారు.

ప్రయాగే మాధవేశ్వరి:
“ప్ర” అనగా గొప్ప. “యాగ” అనగా యాగము. కావున గొప్ప యాగము చేసిన ప్రదేశమైనందు వలన ఈ ప్రదేశమునకు “ప్రయాగ” అను పేరు వచ్చినది.

పూర్వం గంగా యమునల మధ్య సరస్వతీదేవి నది కూడా ప్రవహిస్తూ ఉండేది. గంగా నదిని “ఇడానాడి” గానూ, యమునానదిని “పింగళానడి” గాను, సరస్వతీ దేవిని “సుషుమ్నా నాడి”గా భావించి ఎందరో మహర్షులు, దేవర్షులు, ఈ సరస్వతి నదీ ప్రాంతంలో నివసించేవారు. సరస్వతి నది ఉన్నంతకాలం గంగానదికి ప్రాచుర్యం లభించలేదు. సరస్వతి నది అంతర్వాహిని అయిన తరువాత గంగానదికి విశేష ప్రాచుర్యం లభించింది. ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమక్షేత్రమని పిలిచేవారు.

బ్రహ్మ యాగాలు చేసిన ప్రదేశం కనుక “ప్రయాగ క్షేత్రమని” ఆ క్షేత్రానికి పేరు వచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఈ ప్రయాగ క్షేత్రం వుంది. సతీ దేవి హస్తాంగుళీయం ఇక్కడ పడింది.

ప్రతి 12 సం||లకొకసారి ఈ ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. మరియు జీవకోటికి ప్రత్యక్షసాక్షి అయిన సూర్యభగవానుడు పూజించినందువల్ల భాస్కర క్షేత్రమని మరోపేరు కూడా ఈ ప్రయాగ క్షేత్రానికి వచ్చింది. కొంత కాలానికి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉండిపోయింది.

ఈ క్షేత్రంలో సతీదేవి చేతివేలు పడింది. కావున ఇది ఒక శక్తి క్షేత్రంగా పూజలందుకుంటోంది. అక్బరు నిర్మించిన కోటలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది. దాన్ని “అక్షయ వటము” అని పిలుస్తారు. ఈ వటవృక్షం శ్రీహరికి గొడుగుగా ఉంటుందని పురాణ సారం.

ఈ క్షేత్రంలో ముందుగా గంగాస్నానం చేశాక తరువాత యమునలో విడివిడిగా స్నానం చేయాలి. తలనీలాలర్పించటం అనేది ఈ సంగమస్థానంలో ఒక విశిష్ఠత. పురుషులు తలనీలాలు, స్త్రీలు జడ కొసలు ఈ నదీమ తల్లికి సమర్పిస్తారు.

గయాక్షేత్రంలో పిండ ప్రదానం ఎంత ప్రశస్తమో, గయ తరువాత పిండ ప్రదానానికి అంత ప్రాముఖ్యత కలిగినదీ ప్రయాగ. గంగా, యమునల మధ్య గల భూభాగమంతా పరమ పవిత్రమైనది మనం ప్రతిరోజూ చేసే సంధ్యా వందనంలో ఉంటుంది. దానికి కారణమేమంటే గంగా, యమునల మధ్య భూమి దేవతకు నడుము. ఆ నదుల సంగమ స్థానం భూదేవికి ఒడి. తల్లి ఒడిలో లాలన పొందే శిశువులను ప్రేమించినట్లు ప్రేమతో లాలించే పవిత్ర పావన “మాతృక్షేత్రం” ఈ ప్రయాగ.

ఈ క్షేత్రం చేరుకున్నా దూరం నుంచైనా స్మరించి, ఇక్కడి ఒంటికి పూసుకుంటే త్రివేణి సంగమ స్నాన ఫలం లభిస్తుంది. ఈ మాధవేశ్వరి శక్తి పీఠం వలననే ఈ మహత్మ్యం లభిస్తున్నదని పురాణ ప్రవచనం.

సితా సితే యత్ర తరంగ చామరే
నద్యో విభాతో ముని భాను కన్యకే
లాలాత పత్రం వట ఏవ సాక్షాత్
స తీర్ధ రాజో జయతి ప్రయాగః

తా|| గంగా తరంగాలు తెల్ల వింజామర వీచగా, యమునా తరంగాలు నల్లని వింజామర వీచగా అక్కడి “అక్షయ వటము” శ్వేతఛత్రంగా అలరారే రాజు చిహ్నలు గల ప్రయాగ, సకల తీర్థాలకు రాజు.

జ్వాలాయాం వైష్ణవీ దేవి:
జగజ్జేగీయమానమైన “జ్వాలాక్షేత్రం” శ్రీ వైష్ణవీ దేవి క్షేత్రం. సతీదేవి పుర్రెపడి నందువలన ఇది జ్ఞానక్షేత్రమని కూడా కొందరు భావిస్తారు. ద్వాపరయుగంలో మహాభారత యుద్ధానికి ముందు శ్రీ కృష్ణుని ఆదేశానుసారం ఈ జ్వాలాదేవిని విజయం కోసం అర్చించి అర్జునుడు వైష్ణవీదేవి దీవెనలు పొందాడని పురాణ కథనం.

కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్ముకు 60 కి||మి|| దూరంలో కాలధరమనే పర్వత ప్రాంతం ఉంది. ఈ కాలధర పర్వతంపై వైష్ణవి మాత, జ్వాలా వైష్ణవిగా విలసిల్లుతోంది. కొందరు జమ్ము-కాశ్మిర్ రాష్ట్రంలో, కాట్రా దగ్గరలో గల వైష్ణోదేవి ఆలయమే ఈ “జ్వాలా ముఖి” ఆలయమంటున్నారు. అక్కడి దేవిపేరు కూడా వైష్ణవీ దేవియే కావటం వలన కూడా జనులు అభిప్రాయపడుంటారు.

పఠాన్ కోట నుండి జోగేంద్ర నగర్‌కు వెళ్ళే దారిలో, జ్వాలాముఖీ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి 20 కి||మి|| దూరంలో జ్వాలాముఖీ క్షేత్రం ఉంది. ఇదే అష్టాదశ శక్తి పీఠాలలోని “జ్వాలా ముఖీ” క్షేత్రం.

ఈ ప్రాంతంలో గల “కాలధరమనే” పర్వతంపై సతీదేవి నాలుక నిలువుగా పడినందువలన ఆ ప్రదేశంలో అప్పటి నుండి ఈ నాటి వరకు “అగ్నిజ్వాల” బయటకు వస్తూనే ఉంది. ఈ అగ్నిజ్వలనే జ్వాలాముఖియని, అమ్మవారిని జ్వాలాముఖీశ్వరీ దేవియని, జ్వాలాజీ అని భక్తులు పిలుస్తున్నారు, కొలుస్తున్నారు.

గయా మాంగల్యగౌరి:
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ద సాధకే|
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే||

తా|| సర్వ మంగళప్రదమై.. మాంగల్యాను బంధం కలకాలం నిలపే శివనారి… మాంగల్య గౌరి… నారాయణ ప్రియసోదరియైన సర్వమంగళకు ప్రణతులర్పిస్తున్నాను.

భీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సుమారు 74 కి||మి|| దూరంలో గల గయాక్షేత్ర శక్తి స్వరూపిణి మంగళగౌరి, సర్వమంగళ, విష్ణు సోదరియైన మాంగల్య గౌరి నిత్యానంద దాయినిగా వర ప్రదాయినిగా భక్తుల కోర్కెలు తీరుస్తోంది.

1. గయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ”గా వెలసింది.

2. జాజాపూర్: ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.

3. పిఠపురం: ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.

4. గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృహయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

5. బధరీనాథ్: ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.

గయాక్షేత్రంలో సతీదేవి యొక్క శరీర భాగం ఒకటి పడింది. కనుక శక్తి క్షేత్రముగా, ఇక్కడి అమ్మవారు సర్వమంగళాదేవిగా దేవతల, మునులచే పూజింపబడుచున్నది.

ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమై ప్రయాగ క్షేత్రంతో సమానమై ఫలం అందిస్తోంది.

ఈ ప్రాంతానికి బుద్ధగయ అనేపేరు కూడా కలదు. జన్మకు ఒకసారైన పితృదేవతలకు గయలో పిండప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటారు.

సర్వమూ శాంతిని ఒనగూర్చే సర్వమంగళ అయిన మాంగల్య గౌరిని మనసారా ప్రార్థిస్తే… భక్తులనేగాక వారి పితృదేవతలను కూడా అనుగ్రహించే మంగళ గౌరికి, మహేశ్వరికి శతసహస్ర భక్తి వందనాలు మనసారా అర్పిద్దామా!

వారణాస్యాం విశాలాక్షి:
విశ్వమునేలు విశ్వజనని విశ్వేశ్వరుని రాణి విబుధ జనవాణి
వారణాసి ప్రాంత వాసిని ఆకొన్న వారి క్షుద్భాధ తీర్చే జనని
విశాలాక్షీ వందనం ! శివనారీ శరణం ! అన్నపూర్ణా వందనం !

మాతా! అన్నపూర్ణేశ్వరీ ! భిక్షాందేహి! అని పిలచినంతనే బిడ్డ ఆకలి తెలిసిన అమ్మవలె ఆదరించి అన్నపూర్ణాదేవి కొలువున్న కమనీయ క్షేత్రం వారణాసి. అంతేకాదు విశాలమైన అక్షములు (కనులు) గలది కావున విశాలాక్షి. ఆ తల్లి కొలువున్న శక్తి క్షేత్రం కాశీ. ఈ కాశీకే “వారణాసి” అను మరోపేరు కూడా కలదు. వరుణ, అసి అను రెండు నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి.

అయోధ్యా, మధురా, మాయా, అవంతికా, కంచి, కాశీ|
పురీ ద్వారవతీ చైవ సస్తైతా మోక్ష దాయకాః||

సప్త మోక్షపురులలో కాశీ కూడా విశిష్ఠ స్థానం గల శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగ క్షేత్రం అయిన కాశీని ఆనంద కాననమని, మహాశ్మశానమని, శివానందక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ కాశి క్షేత్రం శివునికి కైలాసానికన్నా ప్రియమైన ప్రదేశమని కూడా అంటారు.

అన్నదానమే దీక్షగాగల మాతా అన్నపూర్ణేశ్వరీ! జ్ఞాన భిక్షాందేహి దేహిమే సదా||

కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి నిత్య విశ్వేశ్వర, అన్నపూర్ణాంబికను ఆరాధించేవాడు కనుక “వ్యాసకాశి” అనికూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు.


కాశ్మీరేతు సరస్వతి:

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ|
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||

అంటు మనం చదువు ప్రారంభించే ముందు చదువుల తల్లి సరస్వతీ దేవిని మనసారా ధ్యానిస్తాం. చదువుకు అధిష్ఠాన దేవత సరస్వతీదేవి. బ్రహ్మ ముఖం నుండి జనియించిన వాగ్దేవి బ్రహ్మవాణి అయింది. ఆ చదువుల తల్లిని, పుస్తక పాణిని, వాగ్విలాసినిని మనం నిత్యం కొలవాలి, స్మరించాలి.

మనిషికి, మృగానికి గల తేడాను తెలిపేది చదువే. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. మన సాహిత్య, విజ్ఞాన వైభవానికి సారస్వతమనే పేరు వచ్చింది సరస్వతీ దేవి వల్లనే. వాక్సుద్ధిని, వాక్సిద్ధినీ అనుగ్రహించే శారదాంబను మనసారా తలుచుకున్న తరువాతనే కవులు, విద్యార్థులు కలం చేతబడతారు.

ఈ సరస్వతీ దేవి ఆలయం కాశ్మీరంలో ఉందని పురాణేతిహాసాల నిర్వచనం. కానీ ఈ ఆలయం ఇప్పుడు కాశ్మీరంలో లేదు. కాని కాశ్మీర్‌లో కొంతమంది సరస్వతిని కీర్ భవానీగా కొలుస్తారు. ఆ కీర్ భవాని ఆలయం శ్రీనగర్‌కు పది కిలో మీటర్ల దూరంలో వుంది. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన 2 సరస్వతుల ఆలయాల్లో ఒకటి కాశ్మీరం, రెండవది బాసరలో వుందని పెద్దలు చెబుతారు. సతీదేవి కుడి చెంప భాగం ఈ కాశ్మీరంలో పడిందని ఆర్యుల ఉవాచ.

నమస్తే శారదాదేవి, కశ్మీర పుర వాహిని|
త్వా మహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే||

తా|| కాశ్మీర పురంలో నివసించే శారదా దేవీ! నేను నిన్ను ఎల్లప్పుడూ భక్తిపూర్వకంగా ప్రార్థించెదను. నాకు విద్యాదానం చేసి కటాక్షించు జనని!

మాఘ శుద్ధ పంచమి సరస్వతీ దేవి జన్మదినం. అందుకని ఆనాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.

కర్ణాటక వద్ద గల శృంగేరిలో శంకరాచార్యుల వారు సరస్వతీదేవి ఆలయానికి రూపకల్పనచేసి ఒకరాతిపై శ్రీ చక్రయంత్ర స్థాపన చేసి సరస్వతి చందనపు విగ్రహ ప్రతిష్ఠ చేశారు.

శ్రీనగర్‌లోని సరస్వతీ దేవి ఆలయానికి శతాబ్దాల చరిత్ర వుంది. హిమగిరిపై వెలసిన శారదాదేవిని “కల్వణుడు” తన “రాజతరంగిణి” అనే గ్రంథంలో ప్రస్తావించాడు. మాతంగ మహర్షి కుమారుడైన శాండిల్యముని ఈ చోటనే సరస్వతీ సాక్షాత్కారం పొందాడు.

“మూకం కరోతి వాచాలం” అనగా “అక్షర జ్ఞానంలేని అజ్ఞానిని సైతం విజ్ఞాన ఖనిగా మార్చే శక్తి” శారదాంబది. దీనికి ఉదాహరణగా “కాలుడు” అనే గొర్రెల కాపరి నిరక్షర కుక్షి, అమ్మ అనుగ్రహంతో “మాణిక్యవీణా ముఫలాల యంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం, మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి” అని ప్రార్థన చేసి ఆ తల్లి దీవెనతో మేఘ సందేశం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం వంటి కావ్యరచనా మేధావిగా మారిన కవి కాళిదాసు.నిజంగా సరస్వతీ దాసుడే.

కాశ్మీరంలో సరస్వతి ఆలయం లేకున్నా ప్రతి మనసు సరస్వతి ఆలయం కావాలి. అజ్ఞానాన్ని వదలి విజ్ఞనం పెంచుకుని ప్రతి ఒక్కరూ సత్య సఖ్యతతో, ఇక్యతతో వసుదైక కుటుంబమై మెలగాలి.

ఓం సరస్వత్యై నమోనమః

సృష్టి స్థితి లయస్వరూపిణి ఆదిపరాశక్తి జగన్మాత శ్రీదేవి. ఆ జగన్మాత లీలలను వర్ణింప ఎవరికీ శక్యముకాదు. దుష్టశిక్షణ శిష్ఠ రక్షణ చేసే ఆదిపరాశక్తిని అభివందన చందన చర్చల సేవలతో నిత్యం మరియు దేవి నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో సేవిద్దాం.


అష్టాదశ శక్తి పీఠాలు
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.


లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు తెలుగు రాష్టాలలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం(ఆంధ్రప్రదేశ్), అలంపురం(తెలంగాణ). మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు... 

1. శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2. కామాక్షి
సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3. శృంఖల
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4. చాముండి
హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5. జోగులాంబ
మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6. భ్రమరాంబిక
విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7. మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

8. ఏకవీరాదేవి
మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9. మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10. పురుహూతిక
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11. గిరిజాదేవి
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12. మాణిక్యాంబ
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13. కామాఖ్య
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14. మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

15. సరస్వతి
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16. వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17. మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18. విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.



జయశుభకారిణి విజయరూపిణి



జయశుభకారిణి విజయరూపిణి
అనంత వైభవానికి ప్రతీకలు


నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే


దేవీనవరాత్రులు శరదృతువులో వస్తాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులు అంటారు. ఈ శరన్నవరాత్రులు ఆశ్వయుజమాసంలో వచ్చే మొదటి రోజున అంటే ప్రతిపద (పాడ్యమి) నుంచి దశమి వరకు ఆచరించాలని ధర్మప్రవృత్తి, మత్స్యపురాణం, దేవీపురాణం, స్కందపురాణం మొదలైన గ్రంధాలెన్నో వివరించాయి. దాన్ని ఆధారంగా చేసుకుని మనదేశం నలుమూలలా ఈ నవరాత్రులు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మ వారి పూజ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజులూ తొమ్మిదిరూపాలలో అమ్మవారిని కొలుస్తాం. మొదటిరోజు బాలాతిపురసుందరిగా, రెండోరోజు గాయత్రిగా, మూడోరోజు అన్నపూర్ణగా, నాలుగవ రోజు మహాలక్మిగా, ఐదవరోజు లలితాదేవిగా, ఆరో రోజు సరస్వతిగా, ఏడవరోజు మహా దుర్గగా, ఎనిమిదవరోజు మహిషాసుర మర్దినిగా, తొమ్మిదవరోజు రాజరాజేశ్వరిగా పూజిస్తాం. చివరిరోజైన విజయదశమినాడు సమస్త శుభాలనూ చేకూర్చే అపరాజితగా పూజిస్తాం. మహిషాసుర సంహారంతో అమ్మవారు జగత్తుకు విజయం చేకూర్చిన రోజే విజయదశమి.

నవరూపాల్లో ఒక్కోరూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వయసుతో నిమిత్తం లేకుండా బాల్యంలోనే శక్తీతత్వం ఉంటుందని బాలాత్రిపురసుందరి తెలియ చేస్తుంది. పరమార్దాన్ని బ్రహ్మజ్ఞానమనే పేరుతో సూచించే రూపం గాయత్రి, సకల జీవరాశులకూ ప్రాణాధారమైన అన్నాన్ని ప్రేమతో పెట్టే తల్లి అన్నపూర్ణ, సర్వసంపదలూ ప్రసాదించే వరదాయిని మహాలక్ష్మీ, ఆత్మసౌందర్యాన్ని ప్రసాదించే లలితా త్రిపుర సుందరి, సమస్త విద్యలనూ అనుగ్రహించే సరస్వతి, సాటిలేని శక్తికి సంకేతం కాళి, జీవులలో దుందుడుకు స్వభావాన్ని అణచివేసే మహిషాసుర మర్దిని, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి రాజరాజేశ్వరి. ఇక ఇవేకాక శైలపుత్రీ, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండి, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్దిధాత్రిరూపాలలో కూడా అమ్మవారిని కొలుస్తాం. ఈ రూపాలన్నీ అమ్మ అనంతవైభవానికి ప్రతీకలు. భక్తులు తమ భక్తి, విశ్వాసాలను బట్టీ వివిధ రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. కోరికలు తీర్చమని వేడుకుంటారు

కుమారి ఆరాధన
ఆశ్వయుజ పాడ్యమి మొదలుకుని తొమ్మిది రోజులపాటు విశేషపూజలు చేసి చివరగా కుమారీ పూజ చేయాలని శ్రీ విద్యార్జవ గ్రంథంలో చెప్ప బడింది. నవరాత్రి పూజా విధానాలలో కుమారీపూజ విశేషమైనది. రోజుకొక్కరు చొప్పున తొమ్మిది రోజులు తొమ్మిది మంది బాలికలను పూజించాలి. వీరంతా రెండు సంవత్పరాల నుంచి పదిసంవత్పరాల లోపు కలవారై ఉరిడాలనేది శాస్త్రం.

సమస్త సుఖాలు కలిగించేది
ఒకనాడు దేవతలు, రాక్షసులతో యుద్దం చేస్తూ శ్రవణనక్షత్రం నాడు అభిజిత్ లగ్నసమయంలో విజయం సాధించారు. ఆనాడు ఆశ్వయుజదశమి. దేవతలు విజయం సాధించిన దశమి కనుకనే విజయ దశమి అయింది. దీనినే కొందరు దసరా అంటారు. సకల సద్గునాలతో కూడిన సమున్నత వ్యక్తీత్వవికాసానికి సంకేతమే విజయదశమి. అందుకే ఆ రోజు అన్ని అంశలకూ మూలమైన రాజరాజేశ్వరిదేవిని అర్చించే సంప్రదాయం ఏర్పడింది. చండ ముండ మహిషాది దుష్ట రాక్షసులను సంహరించి జగన్మాత సకల లోకాలకు ఆనందం ప్రసాదించిన పండగే విజయదశమి. రాముడు రావణసంహారం చేసింది కూడా ఈరోజే. గదాధర పద్దతి అనే గ్రందంలో ఇదే అపరా జిత దశమిగా చెప్పబడింది. విజయానికి అధిదేవత అపరాజితా దేవి. దుర్గాదేవికి మరోపేరు అపరాజిత. మహారాజుల ఆరాధ్య దైవంగా చెప్పబడింది. విజయదశమిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ ఉత్సవాలు నిర్వహించడంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య భేదం ఉన్నా అంతర్గతంగా మూలసూత్రం మాత్రం ఒక్కటే. అదే దుష్ఠత్వంపై దైవత్వ విజయం. ఈ సత్యం కళ్ళకు కట్టినట్టుగా మనకు కనపడుతుంది. అహంకారం, అజ్ఞానం కేవలంవ్యక్తినే కాదు, సమాజాన్ని తద్వారా జాతినే నిర్వీర్యం చేయగల శక్తీ కలిగినవి. అలాంటి దుర్గుణాలను సమీపానికి రానీయకుండా ఎప్పటికప్పుడు మనలోని చెడు ఆలోచనలు తొలగించుకుంటూ సత్వగుణాన్ని అలవరుచుకునే అవకాశం కలుగజేసేదే విజయదశమి. అపజయం ఎరుగని విజయదశమి రోజు అపరాజితాదేవిని పూజించి ఏ పని ప్రారంబించినా అఖండ విజయం సొంతమవుతుందని భక్తుల విశ్వాసం. దేవీభాగవతం మొదలైన దేవీపూరాణాల్లో ని కథలూ ఆ విషయాన్నే చెబుతాయి. సాధన ద్వారా అన్నింటినీ సాధించి విజయం పొందవచ్చనేదే విజయదశమి ముఖ్యభావన.

శమీపూజ
శమీశమీయతే పాపం శమీశతృవినాశనం
అర్జునస్య ధనుర్దారి రామస్య ప్రియవాదినీ

దసరా పండుగరోజు సాయంత్రం శమీవృక్షం అంటే జమ్మిచెట్టుకు పూజలు చేయాలి. అది మన సంప్రదాయం. శమీ ఆంటే దోషాల్ని తొలగిరిచేది అని అర్ధం. జమ్మిచెట్టుకు ఒక ప్రత్యేకత ఉరిది. అగ్నిని తనలో ఇముడ్చుకున్న పవిత్రవృక్షం జమ్మి. అందుకే దీనిని అగ్నిగర్భ అని పిలుస్తాం. వైదిక సంప్రదాయంలో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినప్పుడు అందుకు కావాల్సిన అగ్నిని రావి, జమ్మి రెండురకాల కర్రలతో చేసిన ఒక పరికరం ద్వారా సృష్టిస్తారు. ఇలా పుట్టిన అగ్ని అతి పవిత్ర మైనది. అంతటి అగ్నిని శమీవృక్షం తన గర్భంలో దాచుకుంది. అందుకే వేదం కూడా ‘శమీగర్భా దగ్నిం మంథతి’ అని అగ్నికి జమ్మిచెట్టు నిలయం అని చెబుతోంది. పాండవులు అజ్ఞాతవాస ప్రారంభంలో తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు. తర్వాత జరిగిన యుద్ధంలో విజయం సాధించారు. దానికి సూచికగా ఆనాటి నుంచి సకల కార్య విజయాన్ని కోరుకునేవారు విజయ దశమినాడు ఆయుధపూజ నిర్వహించడం, జమ్మి చెట్టును పూజించి ఆ వృక్షం ఆకులు శిరస్సుపై వేసుకోవడం మన సంప్రదాయం. నవగ్రహాలలో ప్రధానమైన శనిదేవునికి జమ్మివృక్షం ప్రీతికరమైనది. జమ్మి వృక్షాన్ని పూజించడం ద్వారా శనిదోషాలు తొలగించుకోవచ్చు. ఇంకా ఈరోజు సీమోల్లంఘనం చేస్తారు. అంటే ఊరు పొలిమేరలు దాటి వెవక్కిరావడమన్న మాట. దీని అంతరార్థం ఊళ్ళోని ఎవరి మధ్యనైనా శత్రుత్వం ఉంటే దాన్ని ఊరిచివరనే విడిచిపెట్టి మళ్లీ స్నేహితుల్లా కలిసిపోవడానికి సూచనగా ఈ పద్ధతి పాటిస్తారు.


శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి రూపాలు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి రూపాలు

1వ రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి
2వ రోజూ బాలాత్రీపుర సుందరి దేవీ
3వ రోజు గాయత్రీ దేవి
4వ రోజు అన్నపూర్ణ దేవి
5వ రోజు లలితా త్రీపుర సుందరి దేవి
6వ రోజు మహాలక్ష్మీ దేవి
7వ రోజు మహా సరస్వతి దేవి
8వ రోజు దుర్గాదేవి
9వ రోజు మహిషాసురమర్దిని దేవి
విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి




జగన్మాత వైభవం

“అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌! ”

మాతృదేవోభవ అని చెబుతురిటారు పెద్దలు. మన భారతీయ సంస్కృతిలో తల్లికి ఉత్కృష్ఠమైన స్ధానం ఉంది. అమ్మలకే అమ్మ ఆమె. ఇలలో తల్లిగా అవతరించిన సాక్షాత్తూ ఆ శక్తిస్వరూపిణి సమగ్ర స్వరూపమే లలిత త్రిపురసుందరి. లలితా సహస్రనామస్తోత్రంలో మాతృమూర్తి గొప్పతనాన్ని తెలిపే నామాలనేకం.

పారాయణంతో విశేష ఫలం
దేవీనవరాత్రులలో లలితాసహస్రనామ పారాయణం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. లలితాపరమేశ్వరి గురించి బ్రహ్మాండం పురాణం వివరించింది. అగస్త్యమహాముని కోరిక మేరకు జగన్మాత గొప్పదనాన్ని వివరించిన హయగ్రీవుడే లలితా నామాలను కూడా చెప్పాడు. అదే లలితా సహస్రనామం. వాటిని రహస్య సహస్రనామం అన్నాడు. ఇందులో ప్రతి ఒక్క నామాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే అమ్మవారి తత్వం మనకు బోధపడుతుంది. అదే మాతృతత్వం.

లలితా సహస్రనామాలలో జననీ, మాతా, అంబా వంటి నామాలన్నీ మాతృప్రేమను వ్యక్తం చేసేవే . శ్రీమహారాజ్ఞి, శ్రీపీఠా, రాజపీఠ లాంటి నామాలలో ఆమె పరిపాలనాదక్షత, రక్షణ, పోషణ ప్రసాదించే గుణం వెల్లడవుతాయి. మైత్రాదివాసనాలభ్యా వంటి నామాలను పరిశీలిస్తే మైత్రి, కరుణ వంటి సద్గుణాలు ప్రస్పుటమవుతాయి. సరస్వతీ శాస్త్ర మయీ వంటి నామాలు ఆమె పాండిత్యాన్ని వెల్లడిస్తాయి. మహాలావణ్య సేవధి, దయామయీ, కరుణారససాగరా వంటి నామాలు ఆమె దయాళుత్వం, గుణరూపం, అంతః, బాహ్య సౌందర్యాలను వివరిస్తాయి. జీవితంలో సాధించాల్సివ సమస్త ప్రయోజనాలు, సకల సద్గుణాలు కలిసి లలితాదేవి రూపంలో కనిపించడమే ఆ స్తోత్రవిశేషం. సంకేతరూపంలో చెప్పే ఆ స్తోత్రనామాలోని అర్ధాలు, సంపూర్ణ వ్వక్తీత్వ వికాసాన్ని, ఉదాత్త మానవత్వాన్నీ రూపుగడతాయి. అలాంటి దివ్య స్తోత్రాన్ని పదే పదే పఠిస్తూ అరాధించడం ఆ మహనీయ గుణాలను అలవరుచుకోవడమే. అర్చనలోని ప్రధాన లక్యమూ అదే.

నవరూపాలు
దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో నవ వర్ణాంబరాలతో అమ్మవారిని అలంకరిస్తారు. అదే విధంగా అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు నైవేద్యం చేస్తారు.


ప్రథమం శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థకీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనీతి చ|
సప్తమా కాలరాత్రే చ| అష్టమాచాతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్‌| నవదుర్గా ప్రకీర్తితా:||

మొదటిరోజు:
ఆశ్వయుజ శుద్ధపాడ్యమితో మొదలయ్యే దేవీనవరాత్రుల్లో మొదటిరోజు శైలపుత్రి అవతారం. నందివాహనంపై కుడి, ఎడమల త్రిశూల, పద్మధారిణియై దర్శవమిస్తుంది దేవి.
నైవేద్యం: చలిమిడి, వడపప్పు, పాయసం, కట్జెపొంగలి
రెండవరోజు:
రెండవరోజు బ్రహ్మచారిణియై కుడి, ఎడమల రుద్రాక్షమాల, కమండలధారిణియై బ్రహ్మచారిణీ మాతనిష్ఠలో భక్తులను కరుణిస్తుంది. నైవేద్యం: శనగలు, తీపీబూరిది, పులిహోర
మూడవరోజు:
మూడోరోజు పదిచేతులలో పది ఆయుధాలు ధరించి సింహవాహినియై చంద్రఘంటారూపంలో కనిపిస్తుంది.
నైవేద్యం: కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసం.
నాలుగవరోజు:
నాలుగవరోజు అమ్మవారు కూష్మాండియై ధనుర్భాణం, పద్మం, పుష్పం, అమృతభాండం, చక్రం, గద, రుద్రాక్షమాలలు ధరించి భక్తులకు ఎనిమిదిచేతులతో అభయమిస్తుంది అమ్మ.
నైవేద్యం: మినపగారెలు లేదా మొక్కజొన్న గారెలు లేదా పెసరగారెలు
ఐదవరోజూ: 

ఐదోరోజు కూష్మాండ బలిదానంతో  దేవి సంతృప్తి చెందుతుందని శాస్త్రం. ఒకచేత స్కందబాలుడు, మరోచేత పద్మం, ఆశీర్వాదముద్రలతో పద్మ పీఠధారిణియై నాలుగుచేతులతో స్కందమాతగా దర్శనమిస్తుంది అమ్మ.
నైవేద్యం: పెరుగన్నం.
ఆరవరోజు:
ఆరవనాడు కాత్యాయనిదేవిగా సింహవాహనంపై బంగరు ఛాయతో వన్నెలీనుతుంది. కుడిచేత అభయవరద ముద్ర, ఎడమచేత పద్మ ఖడ్గములతో దర్శనమిస్తుంది దేవి.
నైవేద్యం: కేసరి
ఏడవరోజు: 

ఇక ఏడవరూపంగా, విరబూసిన కాటుకకురులతో నిప్పులుకక్కే త్రినేత్రిగా, నాలుగుచేతులతో గాడిదపై భయంకర రూపంలో గోచరిస్తుంది ఈ కాళరాత్రిదేవి. చెడును శిక్షించే విలయకారిణీరూపమిది.
నైవేద్యం: శాకాన్నం లేదా కలగూరపులుసు
ఎనిమిదవరోజు:
ఎనిమిదవనాడు శ్వేతవర్ణ మహాగౌరిగా నందివాహనంపై ప్రశాంతతకు, పరిశుద్ధతకు ప్రతీకగా విరాజిల్లుతుంది.
నైవేద్యం: చక్రపొంగలి
తొమ్మిదవరోజు: 

ఎడమచేత పద్మం, శంఖం, కుడిచేత ముద్గలం, చక్రం ధరించి సిద్దిధాత్రిదేవిగా చివరిరోజైన తొమ్మిదవనాడు పూజలందుకుంటుంది.
నైవేద్యం: పాయసం లేదా పరమాన్నం
విజయదశమి: 

విజయదశమిరోజు పరాజయమెరుగని తల్లిగా అపరాజితా దేవిగా కొలువుదీరుతుంది పరమేశ్వరి.
నైవేద్యం: గారెలు, పులిహోర, పాయసం, అన్నిరకాల నైవేద్యాలు 


Monday, 2 October 2017

దసరా - అంతటా జగన్మాత స్మరణే

అంతటా జగన్మాత స్మరణే..!
చెడుపై మంచి గెలిచిన రోజు..
అధర్మాన్ని ధర్మం ఓడించిన రోజు..
అజ్ఞానంపై జ్ఞానం పైచేయిగా నిలిచిన రోజు..
అసత్యంపై సత్యం విజయం పొందిన రోజు..
దుఖం, దుర్భుర్ది, దురాశ, దుర్మార్గం, దుర్నీతి వంటి దుర్గతులన్నింటినీ దుర్గాదేవి తుదముట్టించిన రోజు..
విజయదశమి.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం జగన్మాత ధరించిన తొమ్మిది అవతారాల పరమార్థాన్ని మానవాళికి బోధిస్తుంది దసరా. కామ, క్రోద, లోభ, మోహ, మద, మాశ్చర్యాలను జయించి, నూతన జీవన మార్గాన్వేషణ కోసం శోధించమనే సందేశాన్ని చాటుతుంది దసరా. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఎవరెలా జరుపుకున్నా అమ్మ ఆరాధనే వాటన్నింటి అంతరార్థం!

దుర్గామాతగా పూజించినా.. భవానీగా పిలుచుకున్నా.. బతుకమ్మగా కొలిచినా... కాళీమాత అన్నా, దేశ మంతటా ఆ లోకపావని స్మరణే! అందుకే దసరా దేశవాళి పండుగ!

విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. ఎన్నో ప్రాంతాల సంగమం భాగ్యనగరం. మరి మన నగరంలో దసరా పండుగను ఎవరు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం!

దసరా రోజు సంధ్యావేళ పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని తెలుగు ప్రజల విశ్వాసం. దుర్గామాత పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. భాగ్యనగరంలో పాలపిట్ట కనిపించడం కష్టమే! అందుకే చాలా మంది శమీ పూజతోనే సరిపెట్టుకుంటున్నారు.


‘‘శమీ శమయితే పాపం..శమీ శత్రు వినాశినీ | అర్జునస్య ధనుర్థారీ..రామస్య ప్రియదర్శినీ’’

అంటూ జమ్మి చెట్టు లేక కొమ్మకైనా పూజచేస్తారు. శమీ పత్రం శత్రువుల్ని నాశనం చేస్తుంది. అర్జునుడిని ధనుర్ధారిని చేసింది.

శ్రీరామచంద్రుడికి ఇష్టమైనది జమ్మి చెట్టు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా రోజు పూజ చేసిన జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారు. ఆ బంగారాన్ని బంధు, మిత్రులు, ఇరుగుపొరుగు వారందరికీ పంచుతూ, ఆలింగనం చేసుకుంటారు. దాన్నే అలయ్‌-బలయ్‌ అంటారు. ఇది తెలంగాణ సంస్కృతిలో ఉట్టిపడే ఐక్యతారాగం.

కన్నడిగుల ఘట ప్రతిష్టాపన
దసరాను భాగ్యనగర కన్నడిగులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అమ్మవారి నవరాత్రులు మొదలయ్యే రోజున ఘట ప్రతిష్టాపన చేస్తారు. అంటే కొత్త మట్టి మూకుడులో మట్టిపోస్తారు. దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టించడంతోపాటు ఆ మట్టిలో నవధాన్యాలను చల్లుతారు. ఆ 9రోజుల పాటు అమ్మను కొలుస్తూ, నిత్యం ఉదయం, సాయంత్రం పూజలో భాగంగా ఆ మూకుడులో నీళ్లు పోస్తారు. మొలకెత్తిన ఆ విత్తులు 9వ రోజుకి మొక్కలవుతాయి. 10వ రోజు దర్గాదేవి ఆరాధనచేసి, ఆ ఘటాన్ని(మూకుడు) గుడిలో వదిలొస్తారు. జీవిత సత్యాలను బోధించే జానపద గీతాలతో భవానీమాతను కొలుస్తారు.

గుజరాతీల నృత్య కొలుపు
గుజరాతీ నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకం! శరన్నవరాత్రుల్లో మొదటిరోజు గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను కొలిచి, దుర్గామాత ప్రతిమను ప్రతిష్టిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అమ్మను కొలుస్తారు. గానం, గీతం అమ్మకు ప్రీతికరం. అవి పూజలో అంతర్భాగం కూడా! అందుకే తొమ్మిదిరోజుల పాటు రోజూ సాయంత్రం 9గంటల నుంచి తెల్లవారుజాము 4గంటల వరకు గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను ఆరాధిస్తారు. 10వ రోజు వ్యాపారస్తులు దుకాణాల్లో, వృత్తిదారులు తమ పనిమట్లకు, వాహనాలకు పూజచేస్తారు. దసరారోజు అమ్మను కొలిచి, వెళ్లిరావమ్మా అంటూ దుర్గామాత ప్రతిమలను గంగ ఒడికి చేరుస్తారు.

మలయాళీల వాగ్దేవి ఆరాధన
పండుగ, పూజాధికాల్లో దక్షిణ భారతదేశంలో కేరళ ప్రత్యేకమైంది. దసరా శరన్నవరాత్రులు అమ్మవారిని కొలుస్తారు. విజయదశమి రోజున కేరళీయులు ప్రత్యేకంగా విద్యాపూజచేస్తారు. పిల్లలందరిచేత దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. నగరంలో 4లక్షల మందికిపైగా కేరళీయులు నివసిస్తున్నారని మలయాళీ అసోసియేషన్‌, హైదరాబాద్‌ నిర్వాహకులు చెబుతున్నారు. దసరా నాడు బొల్లారంలోని అయ్యప్ప దేవాలయం, రామాంతపూర్‌లోని అయ్యప్ప క్షేత్రానికి పెద్ద ఎత్తున నగర కేరళీయులంతా విచ్చేసి, సరస్వతీ పూజ చేస్తారు.

రావణ దహనమే దసరా వేడుక
రావణుణ్ణి రాముడు దసరా రోజున సంహరించాడనేది ఈశాన్య భారతీయుల విశ్వాసం. విజయదశమి ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా వాసులు రావణప్రతిమను దహనం చేస్తారు. ఢిల్లీలోని రామలీల మైదానంలో పెద్ద ఎత్తున రావణ దహనం కార్యక్రమం చేస్తారు. అలాగే భాగ్యనగరంలో స్థిరపడిన ఉత్తరభారతీయులు ఆ ఆచారాన్ని నిర్వహిస్తారు. రావణుడి ప్రతిమ కాలుతుంటే, హర్షధ్వానాలతో ఆనందంతో నోరుతీపి చేసుకుంటారు. ఉత్తర భారతదేశానికి చెందిన అగర్వాల్‌ కుటుంబీకులు ఇంటి గోడలు, వంటగదిలో ప్రత్యేక శక్తిమాట గుర్తులు వేసి, పూజిస్తారు. మట్టికుండలో నవధాన్యాల విత్తనాలు వేసి, ఆరాధిస్తారు. దశమినాడు ఆ మొలకలను చెవిలో, తలపాగాలో ఉంచుకొని పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు.

బెంగాలీల దుర్గా పూజ
శరన్నవరాత్రుల ఉత్సవాలు అనగానే వెంటనే గుర్తొచ్చేది బెంగాలీ దుర్గాపూజ. పశ్చిమ బంగా ప్రజలకి అత్యంత ప్రీతికరమైన పండుగ దసరా. నవరాత్రుల సమయంలో కలకత్తా కాళీపూజ దేశవ్యాప్తంగా పేరు. నగరంలో స్థిరపడ్డ బెంగాలీలు 9రోజులు, 5రోజులు, 3 రోజులు... దుర్గామాతను ప్రతిష్టించి, పూజలు చేస్తారు. మొదటి మూడు రోజులు అమ్మవారిని పూలు, ఫలాలతో పూజిస్తారు. బెంగాల్‌లో అమ్మవారికి జంతుబలి ఇస్తారు. అయితే, నగరంలో నివసిస్తున్న బెంగాలీలు మాత్రం జంతుబలికి బదులుగా గుమ్మడి, కొబ్బరికాయ వంటి వాటిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు. విజయదశమి రోజున నిమజ్జనం చేస్తారు.

దశమి నాటి నుంచి పూజ ప్రారంభం
ఒరిస్సా వాసులకు అత్యంత పెద్ద పండుగ దసర. దేశమంతటా విజయదశమి పది రోజుల ముందు నుంచి దేవీ పూజ మొదలవుతుంది. కానీ ఒరిస్సా వారు మాత్రం విజయదశమి నుంచి 10 రోజుల పాటు అపరాజితాదేవి పూజ చేస్తారు. వీరు తమిళనాడు కేలండర్‌ను అనుసరిస్తారు. అమావాస్యను వీరు పవిత్రమైన రోజుగా భావిస్తారు. దేవీ పూజలో వచ్చే అమావస్యనాడు ప్రత్యేక ఆరాధన చే స్తారు. దుర్గాపూజ 10రోజులూ రోజుకి 10రకాల నైవేధ్యాలతో మాతను కొలుస్తారు.

మరాఠీల దసరా వేడుకలు
నగరంలో స్థిరపడ్డ మహరాష్ట్రీలు నవ చండీ పూజను ఘనంగా జరుపుతారు. ఆశ్వీయుజ మాసం తొలిరోజున ఘన ప్రతిష్ఠాపన చేస్తారు. అమ్మప్రతిమను నెలకొల్పుతారు. అమ్మరూపు ముందు షోఢసోపచార పూజతో పవిత్ర కలశం పెట్టి, దాని చుట్టూ మట్టిపోస్తారు. అందులో గోధుమ, వరి, జొన్న గింజలు చల్లుతారు. అదే ఘట ప్రతిష్టాపన. తొమ్మిదిరోజుల పాటు నిత్యం ఆరాధిస్తారు. తొమ్మిదవ రోజున హోమం చేస్తారు. 10వ రోజు శస్త్రపూజ(ఆయుధ పూజ) నిర్వహిస్తారు. విజయదశమి నాడు సీమోల్లంఘన చేస్తారు. అనగా అమ్మవారి ఘటాన్ని జరిపి, వచ్చిన మొలకలతో మాతను పూజిస్తారు. పూజ అనంతరం అమ్మవారి ప్రతిమను నిమజ్జనం చేయడంతో మహరాష్ట్రీయుల దసరా వేడుక ముగుస్తుంది.

బొమ్మల కొలువు
ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల వారు విజయదశమి రోజున బొమ్మల కొలువు నిర్వహిస్తారు. రామాయణగాథ, దక్షయజ్ఞం వంటి పురాణ, ఇతిహాస కథలను వివరించేవిధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. రకరకాల పింగాణీ, మట్టి బొమ్మలను అమరుస్తారు. అందునా గౌరీ, పార్వతీ ప్రతిమలనూ ఉంచుతారు. అలా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువుకి పలువురు పేరంటాళ్లను, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానిస్తారు. మహిళలు, అమ్మాయిలు, యువతులంతా చేరి రామాయణ, భారత కథలను చెప్పుకుంటారు. గౌరీ, ఆదిశక్తి పాటలను పాడతారు. వచ్చిన పేరంటాళ్లకు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేస్తారు.

అంతా ఒక్కటై..
ఒకే నగరంలో.. ఒక పండుగను ఎన్ని విధాలుగా జరుపుకుంటున్నారో కదా! ఎవరు ఎలా జరుపుకున్నా, ఆ పండుగ పరమార్థం మాత్రం ఒక్కటే ఆదిశక్తి ఆరాధన. నలుగురితో కలిసి మెలగమని, నలుగురికి మంచి పంచమని, నలుగురితో నడవమని చెప్పడమే విజయదశమి అంతరార్థం. ఆ మాటకొస్తే ప్రతి పండుగ పరమార్థం కూడా. సృష్టిలయత్వాన్ని, ప్రకృతి అంతర్లీనతనూ అర్థంచేసుకొని, తద్వారా తమను తాము తీర్చిదిద్దుకోమని బోధించడమే దసరా సందేశం.

దసరా సంగతులు
చిన్న, పెద్ద, ఆడ,మగ అన్న తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ దసరా. సామాజిక సందేశంతో పాటు, స్త్రీత్వాన్ని ఇముడ్చుకున్న పండుగ విజయదశమి. మరి కొందరు సినీ నటీమణులు, గాయకులు, కళాకారులు దసరాను ఎలా జరుపుకుంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం!

విద్వేషాల మూలాలు వెతకాలి







విద్వేషాల మూలాలు వెతకాలి

పంచ పాండవులకూ, దుర్యోధనుడికీ మధ్య శాంతి, సౌహార్దాలన్నవి ఎప్పుడూ లేవు. బాల్యం నుంచీ ప్రత్యర్థులుగానే పెరిగారు. దుర్యోధనుడు తనను తాను యువరాజుగా భావించుకుంటే, యుధిష్ఠరుడు కూడా పాండురాజు జ్యేష్ఠ పుత్రుడిగా హస్తినాపురంపై తన అధికారాన్ని ఎప్పుడూ కాదనుకోలేదు. నిజానికి కురువంశంలోని ఈ రెండు వర్గాల మధ్య శత్రుత్వానికి ప్రధాన కారణం భీముడు. అతని బాహుబలం దుర్యోధనుడికీ, అతని సోదరులకూ అసూయా కారణమయ్యింది. పైగా ద్రోణుని ఆచార్యత్వంలో ధనుర్విద్య నేర్చుకున్న కౌరవులు, తమ కౌశలానికి ప్రశంసలెన్నడూ పొందలేదు.

ఆచార్యుడెప్పుడూ భీముణ్ణో, అర్జునుణ్ణో పొగిడే వాడు. ఏదో విధంగా భీముడి అడ్డు తొలగించుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని దుర్యోధనుడు భావించేవాడు. అందువల్ల భీముణ్ణి గంగలో తోసి చంపివేద్దామని అతడు పథకం వేశాడు. ఒకరోజు నదిలో తమతో ఈత కొట్టడానికి భీముణ్ణి ఆహ్వానించాడు. భీముడిది విపరీతంగా తినే నైజం. కాబట్టి భీముడి చేత కడుపు పగిలేలా విషం కలిపిన ఆహారం తినిపించాలనీ, ఆ తర్వాత భయంకర విష సర్పాలున్న నదిలో పారవేయాలనీ దుర్యోధనుడు పథకం వేశాడు. వారు అనుకున్నట్లే భీముడు కడుపు నిండా విషాహారం తిని మూర్ఛపోయాడు. కౌరవులు అతన్ని మోసుకువెళ్లి నదిలో పడవేశారు. అయితే అదృష్ఠవశాత్తూ భీముడు తిన్న విషాహారం, అతన్ని కాటేసిన పాముల విషానికి విరుగుడుగా పనిచేసింది. కాసేపు స్పృహ లేకుండా నదిలో కొట్టుకుపోయిన తర్వాత స్పృహ వచ్చిన భీముడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. క్షేమంగా ఇంటికి బయలు దేరాడు.

ఈతకు వెళ్లిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో యుధిష్ఠరుడు ఆందోళన చెందాడు. భీముడి గురించి దుర్యోధనుణ్ణి అడిగాడు. దుర్యోధనుడు తనకేమీ తెలియదన్నాడు. యుధిష్ఠరుడికి ఎక్కడో ఏదో జరిగి ఉంటుందన్న అనుమానం కలిగింది. అందుకే భీముణ్ణి వెదకడానికి అనుచరులను పంపాడు. కానీ, వారెవరికీ భీముడు కనిపించలేదు. అయితే, ఆ తర్వాత అకస్మాత్తుగా భీముడు రాజభవనంలోకి నడిచి వస్తుండడం చూసి యుధిష్ఠరుడు హర్షాతిరేకానికి లోనయ్యాడు. ఈత పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్లావని యుధిష్ఠరుడు అడిగాడు. దుర్యోధనుడు తనకు విషం పెట్టి చంపడానికి పన్నిన పన్నాగం గురించి భీముడు చెప్పేసరికి యుధిష్ఠరుడు అవాక్కయ్యాడు. ఈ విషయం కుంతి విన్నది. హస్తినాపుర సింహాసనం కోసం తనకు ఎటువంటి అడ్డు లేకుండా చేసుకోవడానికి దుర్యోధనుడు పాండవులందరినీ చంపడానికి పూనుకున్నాడని ఆమెకు బోధపడింది. తీవ్రంగా కలత చెందిన కుంతి సలహా కోసం విదురుని పిలిచింది. అయితే ‘‘నీ అనుమానాల్ని గుండెలోనే దాచుకొండి. దుర్యోధనకి ఈ విషయాలు తెలిస్తే నీ కుమారుల్ని చంపడానికి మరో పథకం వేస్తాడు’’ అంటూ హెచ్చరించాడు. విదురుడు చెప్పినట్లే, జరిగిన సంగతి విషయంలో మౌనం వహించమని కుంతి యుధిష్ఠరుడుని హెచ్చరించింది.

భీముడు క్షేమంగా తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న దుర్యోధనుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అసహనంతో రగిలిపోయాడు. మరణించిన వ్యక్తి సమాధిలోంచి లేచి వచ్చిన భావన కలిగింది. అయితే, తనను కానీ, తన తమ్ముల్ని కానీ ఎవరూ అనుమానించనందుకు అతనికి సంతోషం కూడా కలిగింది. అయితే తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి అతడు యుధిష్ఠరుని వద్దకు వెళ్లి భీముడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దుర్యోధనుని దురాగతం గురించి ముందే తెలిసిన యుధిష్ఠరుడు అభివ్యక్తికీ, అంతరంగానికీ మధ్యనుండే వేయి పొరల్ని గమనించకపోతే ఎంత ప్రమాదమో కదా అనుకున్నాడు.



Friday, 29 September 2017

దేవీనవరాత్రులు అలంకార విశేషాలు



Title
matter



దేవీనవరాత్రులు
భక్తితో దణ్ణం పెట్టుకుంటే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, పూజించడం వల్ల కలిగే ఫలితాలను సాక్షి ఫ్యామిలీ పాఠకులకోసం రోజూ ప్రత్యేకంగా అందిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం.



మొదటిరోజు: స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి)గా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు.



నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి. ఈరోజు పఠించవలసిన 
శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే! యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్‌

భావం : ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు!

ఫలమ్‌ : ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి.



రెండోరోజు అలంకారం బాలాత్రిపురసుందరి
నిర్మలమైన మనస్సుకూ, నిత్యసంతోషానికీ చిహ్నాలు చిన్నారులు. నవరాత్రి వేడుకలో ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. బాల్యం దైవత్వంతో సమానమని ప్రతీకాత్మకంగా నిరూపించడమే ఈ అలంకరణ ఆంతర్యం. బాలారూపంలో అమ్మను దర్శించే భక్తులకు ఎటువంటి మనోవికారాలకు లోనుకాని ప్రశాంత చిత్తం కలుగుతుందని విశ్వాసం.

దిక్కులన్నిటినీ కాంతిపుంజాలతో నింపుతూ జ్ఞానాన్ని ప్రదానం చేసే అభయ హస్తంతో, వరదానం చేస్తూ స్ఫటికమాల, విద్యాప్రదాయినిగా, పుస్తకాన్ని, ఎర్రకలువను చేత ధరించి చతుర్భుజాలతో మోమున చిరు మందహాసంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది.

శ్లోకం : దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ! దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యమత్తమా!

భావం :  వరదాభయ హస్తాలతో జ్ఞానం అనే అక్షరమాలను  స్ఫటికమాలను ధరించి  జ్ఞానప్రదానం చేయుము జగద్ధాత్రీ!

అర్చన, సందర్శన ఫలమ్‌ : ఉన్నతవిద్య, విశేషజ్ఞాన  సంపదలు చేకూరతాయి.

నివేదన  : కట్టెపొంగలి, దధ్యోదనం



శ్రీ గాయత్రీ అలంకారం దేవీనవరాత్రులు
సర్వతత్వ మయీం వందే గాయత్రీం వేదమాతరం అంటే సకల మంత్రాలకూ, అనుష్ఠానాలకూ, ఉపనిషత్తులకూ మూలం గాయత్రీదేవే.  శ్రీ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. పంచభూతాలకూ ప్రతీకగా పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తుంది.

న గాయత్య్రాః పరో మంత్రం
న మాతుః పరదైవతం
అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన గొప్ప మంత్రం లేదు. అమ్మను మించిన దైవం లేదు అని అర్థం. కనుక గాయత్రీ రూపంలో అమ్మవారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను సందర్శించినట్లే.

ఫలమ్‌ : మంత్రసిద్ధి,
వృత్తి : ఉద్యోగాలలో ఉన్నత స్థానం.
నివేదన : గుడాన్నం (బెల్లం  పరమాన్నం)

శ్లోకం: యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమో నమః

భావం: ఓ జగజ్జననీ! సకల చరాచర జగత్తుయందు మాతృ
మూర్తిగా నిలిచి ఉన్న నీకు శతదా సహస్రకోటి నమస్సులు. 



నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
ఈరోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడయిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస పుణ్యం లభిస్తుందని ఆర్యోక్తి.

ఫలమ్‌: పాడిపంటలు, ధనధాన్యాభివృద్ధి, నూతన గృహ యోగం కలుగుతాయి. ఉపాసకులకు జ్ఞానం, వైరాగ్యం ప్రాప్తిస్తాయి.

నివేదన : అప్పాలు,  షడ్రసోపేత  మహానైవేద్యం (ఓపిక లేనివారు  స్నానం చేసి శుచిగా వండిన అన్నం, పప్పు, కూరలను కూడా  నివేదించవచ్చు)

శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహిచ పార్వతి

భావం: ఓ అన్నపూర్ణాదేవీ, సాక్షాత్తూ శంకరుని ప్రాణేశ్వరివైన నీవు మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్నీ భిక్షగా ప్రసాదించు తల్లీ!



ఐదో రోజు లలితాత్రిపురసుందరీదేవి అలంకారం
శరన్నవరాత్రి ఉత్సవాల ఐదోరోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈమెకే లలితాత్రిపురసుందరి  అని నామాంతరం ఉంది. శ్రీవిద్యోపాసనకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో శ్రీచక్ర అధిష్టానశక్తిగా ఉంటుంది. పంచదశాక్షరి మంత్రానికి కూడా ఈమే అధిష్టానదేవత. సకల లోకాలకు అతీతమైన కుసుమకోమల రూపంలో చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతులు వీస్తుండగా భక్తులకు ప్రసన్నురాలై వరాలను అనుగ్రహిస్తుంది. సృష్టి, స్థితి, లయ కార్యాలకు ఈమె అనుగ్రహం తప్పనిసరి.

నిత్యం ఈమెను పూజించిన ముత్తయిదువులు అఖండ మాంగల్య సౌభాగ్యం పొందుతారు. సకల సంపదలు ఈ తల్లి అనుగ్రహం ద్వారా సంప్రాప్తమవుతాయి. శ్రీచక్రాన్ని అర్చించి, కుంకుమ పూజ చేయడం ద్వారా ఈ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఇంద్రకీలాద్రిపై ఆదిశంకరులు శ్రీచక్రాన్ని స్వయంగా ప్రతిష్టించి, ఇక్కడ నిత్యం కుంకుమపూజ జరిగేలా ఆదేశించారు. అంతకుపూర్వం ఉగ్రస్వరూపిణిగా ఉన్న కనకదుర్గాదేవి నాటినుంచి శాంతరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తోంది. లలితాదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజున లలితా సహస్రనామ పారాయణ వీలైనన్ని సార్లు చేయాలి. అలాగే లలితా అష్టోత్తరం, స్తోత్రాలు, పంచరత్నాలు పఠించాలి.

మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి.
నివేదన: అమ్మకు గారెలు నివేదన చేయాలి. సువాసినులకు పూజచేసి,  మంగళద్రవ్యాలు అందించాలి.
ఫలం: దారిద్య్ర దుఃఖం తొలగి, సకల శుభాలు, ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి.



ఆరో రోజు మహాలక్ష్మీదేవి అలంకారం
రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ వరద ముద్రలు ప్రదర్శిస్తూ  పులా గజరాజు సేవిస్తున్న తేజోమూర్తిగా శరన్నవరాత్రుల్లో ఆరోరోజున కనకదుర్గాదేవి భక్తులను మహాలక్ష్మీ అవతారంలో అనుగ్రహిస్తుంది. ఈ తల్లి సర్వమంగళకారిణి, సకల సౌభాగ్యప్రదాయిని, ఆనంద సంధాయిని. నిత్యం ప్రసన్నవదనంతో ఉంటుంది. అష్టలక్ష్ముల సమష్టిరూపంగా, సకల జీవకోటిలో, ప్రకృతిలో నిండి ఉన్న సకల లక్ష్మీస్వరూపంగా ఈమెను శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ‘యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ అని చండీసప్తశతి చెబుతోంది.

డోలాసురుడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం ఈ దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్యలో ఉంటుంది.  ఎరుపురంగు పూలతో అర్చించి, లక్ష్మీస్తోత్రం పారాయణ చేస్తే శీఘ్రఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మీ ప్రీతిగా పూర్ణాలు నివేదన చేయాలి. సువాసినులకు షోడశోపచారాలతో అర్చించి, శక్తికొద్దీ మంగళద్రవ్యాలు అందించాలి.
మంత్రం: ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్షై్మ్య నమోనమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి
నైవేద్యం: పూర్ణాలు   
ఫలితం: సకలైశ్వర్య సిద్ధి.



ఏడవ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి
ఈరోజు దుర్గమ్మ ధవళవస్త్రధారిణిౖయె సంగీత రస స్వరూపమైన మరాళ వాహనంపై తారాహారాలు కంఠాభరణాలుగా ధరించి జ్ఞానాధిష్ఠాన దేవత, వాగ్దేవిౖయెన శ్రీ మహాసరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన దుర్గాదేవిని చదువులతల్లి అయిన సరస్వతీదేవి రూపంలో అలంకరించటం విశేషం. శ్రీ సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకుంటే విశేష జ్ఞాన సంపద కలుగుతుందని ప్రతీతి.

శ్లోకం : యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్మై నమస్తస్మై నమస్త్మై నమో నమః

భావం : సృష్టిలోని సమస్త జీవులయందు బుద్ధి రూపంలో ప్రకాశిస్తున్న ఓ జగన్మాతా నీకు మొక్కెదన్‌.
నివేదన : జీడిపప్పు, కొబ్బరి పులిహోర
ఫలమ్‌: బుద్ధి కుశలత, జ్ఞానసంపద, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు.



ఎనిమిదవ రోజు మహిషాసురమర్దిని
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున దుర్గాదేవి శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఇది ఆఖరి రోజు. దీనికే దుర్గాష్టమి అనే పేరు వాడుకలో ఉంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం కోసం సకల దేవీ, దేవతల శక్తి స్వరూపంగా ఈ తల్లి ఆవిర్భవించింది. ఇది అత్యుగ్రరూపం. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ఈ అవతారంలో అమ్మ సింహవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషుడిని సంహరిస్తున్న రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. ఈ మూర్తిని ఉపాసించడం ద్వారా సకల భయాలు, శత్రుపీడ, రోగాలు దూరమవుతాయి.

విశ్వశాంతి కలుగుతుంది. శత్రువిజయాన్ని కాంక్షించేవారు ఈ తల్లిని ఉపాసించాలి. ఈ తల్లిని పూజించడం వల్ల సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది. ఈరోజున చండీ సప్తశతీ పారాయణ, హోమం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
మంత్రం: ‘ఓం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా’ అనే మంత్రాన్ని జపించడం మంచిది.
నైవేద్యం: గారెలు, పులిహోర, పొంగలి



కనకదుర్గాదేవి
లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం.

శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ
సర్వశక్తి సమన్వితే!
భయేభ్యః ప్రాహివో దేవి
దుర్గేదేవి నమోస్తుతే!!

భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు.
ఫలమ్‌: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు.
నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం

మహిషాసురమర్దిని
బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి.

శ్లోకం
దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
భావం: అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతిని, భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను.
నివేదన: నువ్వులు, బెల్లమన్నం
ఫలమ్‌: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి.



దానవత్వంపై దైవత్వం విజయం
పండగ
దుష్ట రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి.ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చని చెప్పే పండుగ ఇది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి, ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే.
ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం
దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అదీ వీలుకాని వారు మూడు రోజులు, అదీ కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి ఆశీస్సులందుకోవాలి.
చెడుపై మంచి సాధించిన విజయం
దానవత్వంపై దైవత్వం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలోనే ఉన్నారు. మనలోని దుర్గుణాతో పోరాడి విజయం సాధిద్దాం.
జమ్మిని ఎందుకు పూజిస్తారు?
శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు విజయ సోపానాలని నమ్మకం. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. అందుకే
శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మిని బంగారం అంటారు. జమ్మి బంగారాన్ని అందరికీ పంచి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే... అమ్మవారి విజయవార్తను దేవతలు కొందరు పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చి చాటిచెప్పారట. అందుకే ఆ రోజు పాలపిట్ట దర్శనం శుభప్రదం.  
రావణ దహనం ఎందుకు చేస్తారు?
మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలి, విజయం సాధించిన దినం విజయ దశమే. రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను టపాసులతో పేల్చేడం లేదా దహనం చేయడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు.



Title
matter



Title
matter



Title
matter



Title
matter