Sunday, 18 October 2015

నారీ విశ్వరూపం..నవరాత్రి వైభవం!





నారీ విశ్వరూపం.. నవరాత్రి వైభవం!


సర్వమంగళమాంగల్యే.. శివే సర్వార్థ సాధికే.. శరణ్యే త్రయంబకే దేవీ.. నారాయణీ నమోస్తుతే!!.. అంటూ పలు అలంకారాల్లో ఆ జగన్మాతను పూజించే పండగ దసరా. ఇది కేవలం ఓ పదకొండు రోజుల వేడుక మాత్రమే కాదు, మహిళా సాధికారతకూ, చైతన్యానికీ ప్రతీక. ఆ రూపాల నుంచీ ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవత’ అన్నది ఆర్యోక్తి. స్త్రీలను గౌరవించడం వల్ల దేవతలు నివసిస్తారనేది దానర్థం. అసలు స్త్రీలని ఎందుకు గౌరవించాలి? గౌరవించదగిన స్థితిలో స్త్రీలు ఎలా ఉండాలి? అనేది ఈ శరన్నవరాత్రులు చెబుతాయి. మరి ఆ జగన్మాత రూపాల నుంచి మనమేం నేర్చుకోవచ్చో చూద్దామా.

కనకదుర్గ:మొదటి రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా దర్శనమిస్తుంది. రాక్షసులతో యుద్ధం చేసేందుకు స్వర్ణ కవచం ధరిస్తుంది. ఆ స్వర్ణ కవచం సంపదకూ, వైభవానికి గుర్తు. నేటి మహిళలు అలాంటి కవచాన్ని ధరించాల్సిన అవసరంలేదు కానీ.. సమస్యలు ఎదురైనప్పుడు యుక్తీ, ఓర్పూ, నేర్పులను కవచంగా ధరించాలి.

బాలా త్రిపుర సుందరి:తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన రూపానికి బాల అని పేరు. ఈ బాలాత్రిపుర సుందరిని పూజించడమంటే.. మహిళల్ని చిన్నతనం నుంచే పవిత్ర భావం, గౌరవంతో ఆదరించాలని అర్థం. తొమ్మిదేళ్ల బాలిక అయ్యుండి ముప్పై మంది రాక్షసులను సంహరించిందని బ్రహ్మాండ పురాణ గాథ చెబుతోంది. ఆడపిల్ల బాల్యం నుంచి.. యౌవనంలోకి అడుగు పెట్టకముందే సమాజంలోని చీకటి కోణాన్ని గుర్తించి, జాగ్రత్త పడాలని, వెర్రి చేష్టలు చేసేవారిని ఓ కంట కనిపెట్టాలని, తగిన తీరులో సమాధానం చెప్పాలని బాలాదేవి ఆరాధన చెబుతుంది.

లలితా త్రిపుర సుందరి:‘ఓం శ్రీమాత్రే నమః’ అంటూ లలితాదేవిని పూజిస్తాం. వాస్తవానికి ఈ రూపం నుంచే మనం ఆరాధిస్తున్న దేవతా రూపాలు దిగివచ్చాయని వ్యాస మహర్షి పురాణాల్లో తెలిపాడు. శరీరం, మనసు, బుద్ధి అనేవి త్రిపురాలు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులు కలిగినది లలితాదేవి అంటారు. నేటి మహిళలు పరిజ్ఞానంలో పురుషుల కంటే ముందు అడుగులో ఉన్నారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు అనే పేరుతో సంసిద్ధత, అవగాహన, నిర్వహణ దక్షత అనే మూడు లక్షణాలను సొంతం చేసుకుని పురోగమించే నేటి మహిళలకి లలితాత్రిపురసుందరి మార్గదర్శి.

కాత్యాయని:కతుడు అనే మహర్షి కడుపున పుట్టిన అమ్మే కాత్యాయని అనీ, ఆమె పరమేశ్వరుడి అర్థాంగిగా ప్రత్యేకత అందుకుందని పురాణాలు చెబుతున్నాయి. భాగవతంలో గోపికలు నిర్మలమైన ప్రేమతో శ్రీకృష్ణుడే భర్తగా కావాలని కాత్యాయనీ వ్రతం చేశారు. అంటే గృహస్థ జీవితంలో మహిళకి ఉన్న ప్రాధాన్యాన్ని కాత్యాయిని తెలియజేస్తుంది. బాధ్యత, ప్రవర్తన, ఓర్పు, నేర్పుల ఆధారంగా వైవాహిక జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఓర్పు నేర్పులన్నీ కాత్యాయనీ స్వరూపాలే.

గాయత్రీదేవి:‘సర్వ చైతన్య రూపాం! పాం ఆధ్యాం! విద్యాం చ ధీమహీ! బుద్ధిం య నహః ప్రచోదయ’ అని గాయత్రి దేవీని ఆరాధిస్తాం. ఈ దేవతకు ముఖాలు ఐదు అయినా హృదయం ఒకటే. గాయత్రీ దేవత విద్యాధిదేవత అనీ, బుద్ధి, శక్తిని ప్రచోదనం చేస్తుందని మహర్షులు సెలవిచ్చారు. నేటి మహిళలు గృహిణిగా, ఉద్యోగినిగా సామాజిక కార్యకర్తలు, కళాకారిణిగా, వీరసైనికురాలిగా ఎన్నో రూపాలూ, మరెన్నో పాత్రల్నీ పోషిస్తున్నారు. ఏ స్త్రీ మూర్తి బుద్ధి చురుగ్గా ఉండి.. స్తబ్ధత లేకుండా చైతన్యంతో అడుగులు వేస్తుందో అలాంటి మహిళ వల్ల కుటుంబం పచ్చగా ఉంటుంది. సమాజం బాగుంటుంది. అలాంటి వారంతా గాయత్రీ దేవతలే. ‘కరణేశు మంత్రి’ అని గృహిణిని పేర్కొంటారు. తగిన సమయానికి సలహాలూ, సూచనలు అందించగల సమర్థురాలు గృహిణి అని అర్థం. ఈ లక్షణం కూడా గాయత్రీ తత్వమే.

అన్నపూర్ణ:అన్నం పెట్టడం, అతిథ్యం ఇవ్వడం, కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి కావల్సిన అంశం. ఉద్యోగం చేస్తున్నా మహిళలు ఈ విషయంలో బాధ్యతగా ఉంటారు. అందుకు కావల్సిన అన్ని ఆలోచనలూ సమగ్రంగా చేస్తుంది స్త్రీ. అభాగ్యులను ఆదరించడంలోనూ ఆమె చూపే ఓర్పు నేర్పులే ఆ ఇంటి గౌరవాన్ని పెంపొదిస్తాయి. బాధ్యతగా ఉండే గృహిణులంతా అన్నపూర్ణలే. అమ్మవారూ మహిళలకు ఆ తత్వమే బోధిస్తుంది!

మహాలక్ష్మి:సంపదలను అనుగ్రహించే మహాలక్ష్మినే ధనలక్ష్మీ అంటారు. ఆధునిక అవసరాలకు తగినట్టుగా అటు తండ్రికో, భర్తకో ఆర్థిక సహకారాన్ని అందించగలిగిన ప్రతి మహిళా మహాలక్ష్మి స్వరూపమే. సంపాదించకపోయినా పొదుపుగా ఇల్లు దిద్దుకోవడంలో మహిళకు మహిళే సాటి. అలాంటి ఇల్లే లక్ష్మీ కళతో శోభిల్లుతుంది. ఈ స్వభావం కూడా మహాలక్ష్మి గుణమే.

మహా సరస్వతి:ఈమెని విద్యాలక్ష్మి అంటారు. అందరికీ చక్కని వాక్కు కావాలి, సాంకేతిక శాస్త్ర రంగాల్లో నైపుణ్యం తెలిసి ఉండాలి. కళల్లో ప్రావీణ్యం కావాలి. అలాగే చక్కని వాక్కు ఉండాలి. సాంకేతిక శాస్త్ర రంగాల్లో పైపుణ్యం కావాలి. ఇవన్నీ విద్యలో అంతర్భాగాలే. ఈ అవగాహన కలిగిన స్త్రీ మూర్తులందరూ సరస్వతీ రూపాలే. వాక్కును పరిమితంగా, సూటిగా, స్పష్టంగా ప్రయోజనకరంగా, ప్రభావవంతంగా ప్రయోగించగలిగిన నేర్పు ప్రతి మహిళకీ అవసరమే.

దుర్గ:దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడానికే అమ్మవారు దుర్గగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గముడు అంటే ఎటూ వెళ్లనీయని వాడు. కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవితాల్లో నేడు ఎటూ తేలని, పరిష్కారం దొరకని సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఎదురైనప్పుడు ఆందోళన పడకుండా ఆలోచిస్తే ఆ దుర్గమం అనే రాక్షసత్వాన్ని సంహరించడం సులువే అవుతుంది.

మహిషాసుర మర్దిని:మహిషుడు అనే రాక్షసుడి సంహారానికే అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతోంది. మహిషుడు అంటే దున్నపోతు రూపంలో ఉన్నవాడు. ఏమీ ఆలోచించకపోవడం, దుడుకుతనం, సోమరితనం, దుర్మార్గం మహిషుడి లక్షణాలు. నేటి మహిళల చుట్టూ ఎందరో మహిషాసురులు కనిపిస్తున్నారు. ఆనాడు మహిషుడు అమ్మవారి పట్ల కాముక ప్రవృత్తిని ప్రకటించాడు. నేడు నర రూపరాక్షసులుగా మానవ మహిషాసురుల్లా కనపడుతున్నవారెందరో. అలాంటి వారికి బెంబేలు పడకుండా మహిష రూపాన్ని మర్దించగల రూపం తనలో దాగి ఉందని ప్రతి మహిళా గుర్తించాలి.

రాజరాజేశ్వరి:దసరా రోజుల్లో ఇదే చివరి అలంకారం. రాజులంటే పాలకులు. రాజరాజులంటే వారి అధికారులు. రాజరాజేశ్వరి అంటే ఉన్నతోన్నత అధికార పీఠాన్ని ఆదర్శ ప్రాయంగా, అభ్యుదయకరంగా నిర్వహించగల సామర్థ్యానికి ప్రతీక. వివిధ జీవన దశల్లో బాల, తరుణి, వృద్ధ రూపాల్లో ఉన్న లలితాత్రిపురసుందరి రాజరాజేశ్వరిగా పరిపాలన రంగంలో అఖండ విజయాలను సాధించగలుగుతోంది. అలా విజయం సాధించిన తోటి మహిళల్ని ప్రతి ఆడపిల్లా ఆదర్శంగా తీసుకోవాలి. ఆ జాగన్మాతను మనసారా పూజిస్తూ.. దేవీరూపాల్లోని అంతరార్థాలను తెలుసుకోవాలి.

మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


Friday, 16 October 2015

సుబ్రహ్మణ్య షష్ఠి





6 ముఖాలు... చక్రాలు..

‘మాసానాం మార్గశీర్షోహమ్‌’ (మాసాలలో మార్గశీర్షాన్ని నేనే) అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అలాంటి విశిష్టమైన మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ‘స్కంద షష్ఠి’ అని కూడా అంటారు. ఆది దంపతులుగా పూజలందుకొనే శివపార్వతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి పుట్టిన రోజుగా మార్గశిర శుద్ధ షష్ఠిని దేశవ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో భక్తులు జరుపుకొంటారు. దీన్ని ఎంతో పవిత్రమైన దినంగా ఆచరిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాలు కూడా నిర్వహిస్తారు. బ్రహ్మచారులను భోజన, వస్త్రాలతో సత్కరించడం, ఉపవాసం ఆచరించడం లాంటి నియమాలను భక్తులు ఈ రోజున పాటిస్తారు. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో కావడి మొక్కులు, నోటిలోంచీ శూలాలను గుచ్చుకొనే మొక్కులూ భక్తులు తీర్చుకుంటూ ఉంటారు.

యోగశాస్త్రం ఏం చెబుతోంది?:
ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాకుండా యోగ శాస్త్రంలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరు ముఖాలతో పుట్టిన స్కందుడిని, అంటే షణ్ముఖుడిని మానవ దేహంలోని షట్చక్రాలకు ప్రతీకగా యోగసాధకులు భావిస్తారు. రెల్లు పొదలో పుట్టిన కారణంగా శరవణభవుడనీ, కృత్తికల చేతుల్లో పెరిగాడు కాబట్టి కార్తికేయుడనీ సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తారు. దేవ సైన్యాధ్యక్షుడై తారకాసురుణ్ణి సంహరించిన తరువాత మహా విష్ణువు ఆదేశం మేరకు వల్లీ, దేవసేనలను కార్తికేయుడు పరిణయమాడినట్టు పురాణ గాథలు చెబుతాయి. వల్లి కుండలినీ శక్తికి ప్రతీక అంటారు. కాబట్టి కుండలినీ శక్తికి అధిపతిగా కూడా ఆయనను సాధకులు ఆరాధిస్తారు.

సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మజ్ఞానానికి ప్రతీక అంటారు. ఆయన సర్పాకారంలో ఉంటాడనే విశ్వాసం ఉంది. కాబట్టి భక్తులు పుట్టల దగ్గర పూజలు చేసి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పుట్టల్లో పాలు పోస్తారు. సంతాన ప్రాప్తికీ, ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తికీ, ముఖ్యంగా కుజదోష నివారణకూ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనను మించినది లేదని ఒక విశ్వాసం.. ఐహికమైనవాటిని అలా ఉంచితే, కార్తికేయుడి కరుణాత్మకమైన అమృత దృష్టి ఎవరిమీద ప్రసరిస్తే వారిలో కామాది అరిషడ్వర్గాలూ, మనో కాలుష్యాలూ నశిస్తాయనీ, దుష్టమైన ఆలోచనలు రూపుమాసిపోతాయనీ కూడా
నమ్మిక ఉంది.



Wednesday, 14 October 2015

దేవినవరాత్రుల అలంకారాలు


దేవినవరాత్రుల అలంకారాలు 

తిథిఅలంకరణ
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమిశ్రీ స్వర్ణకవచాలంకృత దేవి
ఆశ్వీయుజ శుద్ధ విదియశ్రీ బాలా త్రిపురసుందరీ దేవి
ఆశ్వీయుజ శుద్ధ తదియశ్రీ గాయత్రీ దేవి
ఆశ్వీయుజ శుద్ధ చవితిశ్రీ అన్నపూర్ణా దేవి
ఆశ్వీయుజ శుద్ధ పంచమిశ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఆశ్వీయుజ శుద్ధ షష్ఠిశ్రీ మహాలక్ష్మీ దేవి
ఆశ్వీయుజ శుద్ధ సప్తమిశ్రీ మహాసరస్వతీ దేవి
ఆశ్వీయుజ శుద్ధ అష్టమిశ్రీ దుర్గా దేవి & శ్రీ మహిషాసురమర్దినీ దేవి
ఆశ్వీయుజ శుద్ధ నవమి మరియు దశమి (దసరా)శ్రీ రాజరాజేశ్వరీ దేవి

దేవినవరాత్రుల అలంకారాలు

దసరా శరన్నవరాత్రులు

దసరా శరన్నవరాత్రులు


దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో జరుపుకున్నప్పటికీ సందడి మాత్రం ఒకేలా ఉంటుంది. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.

రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా ఉత్తరాది ప్రజలు రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి ఈ పండుగను జరుపుకొంటారు.

పాండవులు 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను జమ్మి వృక్షం పై ఉంచి, తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు. కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున ఆయుధపూజని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు. విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది.

కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడ అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజావిధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గ లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కొక్కదేవిని మూడేసి దినములు పూజింతురు. ఈ తొమ్మిది రాత్రులయందును ఆ దేవతలను పూజించుటకు వీలుకానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజింతురు. అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అనియు సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజాదినము అని, ఆయుధములను పెట్టి పూజంచుటచే ఆయుధపూజా దినము అనియు చెప్పబడును. మరునాటి దశమి తిథికి విజయదశమి అని పేరు.

నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనకదుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.

మన దగ్గర ఆచరణలో ఉన్నది...
జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారంట. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.

ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.

తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.

శరన్నవరాత్రులు:
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది.

కనకదుర్గమ్మ గుడి గురించి...
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపసు ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఉంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శువుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ తొమ్మిది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి(ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)
రెండవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
మూడవ రోజు: శ్రీ గాయత్రీ దేవి (విదియ-వృద్ధి )
నాలుగవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
ఐదవ రోజు: కాత్యాయని దేవి
ఆరవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఏడవ రోజు: శ్రీ మహాలక్ష్మి దేవి
ఎనిమిదవ రోజు: శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం)
తొమ్మిదవ రోజు : శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
పదవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
పదకొండవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

Monday, 12 October 2015

రామాయణంలోని కొన్ని పాత్రలు


ఈ ఉదయం ఆధ్యాత్మిక రచనలు చదువుదామని, ఇంట్లోని పుస్తకాలు చూస్తుంటే.. శ్రీమద్వాల్మీకి రామాయణంలోని అతి పవిత్రమైన సుందరకాండము కనిపించింది. చదువుతుంటే.. ఈ పవిత్ర ఘట్టం విశేషాలను, ఇందులో వచ్చే పాత్రలను బ్లాగు ద్వారా నలుగురితో పంచుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ఈ పోస్టు. ఇవాళ మొదటి సర్గము పూర్తి చేశాను ఇందులో హనుమంతుడు సముద్రాన్ని దాటడం, దారిలో మైనాకుడి స్వాగతం, సురసను జయించడం, సింహికను హతమార్చడం ప్రధానంగా ఉన్నాయి. ఈ సర్గములో వచ్చిన పాత్రలు.. వాటి వివరాలు :


ఆంజనేయుడు :
అంజన కుమారుడు. అంజన వానర స్త్రీ. ఈమె కుంజరుడనే వానరుడి కుమార్తె. కేసరి అనే వానర యోధుడి భార్య. ప్రభాస తీర్థంలో మునులను బాధిస్తున్న శంఖశబలాలనే ఏనుగులను సంహరిస్తాడు. భరద్వాజుడు మెచ్చుకుని ఇతడికి కేసరి అని పేరు పెట్టి వరం కోరుకొమ్మంటాడు. కామరూపి, బలాఢ్యుడు ఐన పుత్రుడు కావాలని కోరుకుంటాడు. ఇతడికి అంజనతో వివాహం అయిన తర్వాత వాయుదేవుడి వరబలం వల్ల.. ఈ దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు.  
సందర్భం : సుందరకాండ యావత్తూ ఆంజనేయుడి వీరోచిత సుందర విజయ గాథే.


విద్యాధరులు : ఉపదేవతలు. పూలమాలలు కట్టడం వీరి పని. సర్పయాగానికి ఇంద్రుడి వెంట వెళతారు.
సందర్భం : ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించేందుకు తన శరీరాన్ని పెంచుతున్న సందర్భంలో వీరి ప్రస్తావన వస్తుంది.


మైనాకుడు : మైనాకము ఓ పర్వతము. మేనకా హిమవంతులు కుమారుడు (ఈ మేనక అప్సరస కాదు.. వైరాజులనే పితృదేవతల మానస పుత్రిక. హిమవంతుడిని పెళ్లాడుతుంది. వీరికి మైనాకుడితో పాటు క్రౌంచుడు అనే కుమారుడు, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనే కూతుళ్లూ జన్మిస్తారు.) కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. దీంతో ఇష్టానుసారంగా ఎగురుతూ.. దేవ, ముని గణాలపై వాలుతుండేవి. వీరు ఇంద్రుణ్ణి ప్రార్థించడంతో.. కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు, వజ్రాయుధంతో.. పర్వతాల రెక్కలను తెగనరికాడు. ఆ సమయంలో.. మైనాకుడిని మిత్రుడు వాయుదేవుడు చాకచక్యంతో తప్పించి.. నేర్పుగా సముద్రంలో పడవేశాడు. రెక్కలు తెగకుండానే మైనాకుడు సముద్రం గర్భంలో దాక్కుంటాడు. మైనాకుడు.. ఇష్టారీతిగా పైకి, కిందకి, పక్కలకు ఇలా ఎటు కావాలంటే అటు పెరిగిపోగల శక్తిమంతుడు.
సందర్భం : తన మీదుగా ఎగురుతున్న ఆంజనేయుడు.. కాసేపు విశ్రమించేందుకు వీలుగా, మైనాకుడిని పెరగమని సముద్రుడు కోరతాడు. తనను గర్భంలో ఉంచుకుని, ఇంద్రుడినుంచి కాపాడుతున్న, సాగరుడి సూచనను మైనాకుడు పాటిస్తాడు. ఆంజనేయుడు మైనాకుడిపై స్వల్వ వ్యవధి విశ్రమిస్తాడు. రాముడి పని మీద వెళుతున్న ఆంజనేయుడికి ఈరీతిగా సేవ చేసిన మైనాకుడికి ఇంద్రుడు అభయాన్నిస్తాడు.


సురస : నాగమాత.
సందర్భం : మైనాకుడి మీదనుంచి తిరిగి లంఘించిన ఆంజనేయుడి బలపరాక్రమాలను మళ్లీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో.... దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సురసాదేవిని పంపుతారు. ఆమె, అతి భయంకరమైన రూపంతో.. ఆంజనేయుడిని అడ్డగిస్తుంది. ముందుకు సాగాలంటే తన నోట్లోకి దూరి బయటకు వెళ్లాలని షరతు పెడుతుంది. ఆంజనేయుడు ఆమె నోట్లోకి ప్రవేశించి, తన దేహాన్ని అంతకంతకూ పెంచుతూ వెళతాడు. దానికి తగ్గట్లుగానే ఆమె కూడా తన నోటిని పెంచుతూ పోతుంటుంది. ఉన్నట్టుండి ఆంజనేయుడు సూక్ష్మరూపాన్ని ధరించి, ఒక్క ఉదుటన బయటకు వెళ్లిపోతాడు. ఆరకంగా దేవతల పరీక్షను సమర్థంగా ఎదుర్కొంటాడు.



సింహిక : రాక్షసి. దితి, కశ్యపులకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే కుమారులతో పాటు.. సింహిక జన్మిస్తుంది. ఈమె భర్త విప్రచిత్తి. ఈమె కామరూపిణి... ఛాయాగ్రాహిని. (అంటే కోరుకున్న రూపం దాల్చే శక్తి గలది.. దాంతో పాటే.. నీడను లాక్కు పోగలది.) ఈమె కుమారులే రాహుకేతులు. అందుకే వీరికి సైంహికేయులు అని పేరు.
సందర్భం : సముద్రంపై నుంచి ఎగురుతున్న ఆంజనేయుడిని చూసి.. సింహిక తనకు మహాజంతువు ఆహారంగా లభించిందని భావించి, ఆంజనేయుడి నీడను లాక్కొని వెళుతుంది. దీంతో ఆంజనేయుడి శక్తి కాస్త తగ్గుతుంది. విషయాన్ని గమనించిన ఆంజనేయుడు తన శరీరాన్ని ఇంతలింతలుగా పెంచుతాడు. దానికి తగ్గట్లే నీడ కూడా పెరుగుతుంది. దాంతో, సింహిక కూడా నోటిని బాగా తెరవాల్సి వస్తుంది. ఆంజనేయుడు హఠాత్తుగా ఆమె నోట్లోకి ప్రవేశించి.. చీల్చి చెండాడుతాడు.


Saturday, 3 October 2015

బంగారు స్వామికి బ్రహ్మండోత్సవం




Sakshi  Funday September 20, 2015


చీమల పుట్ట నుంచి సిరుల గిరుల వరకు


శేషాచల గిరులపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి శతాబ్దాల తరబడి చీమలపుట్టలో దాగి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రకృతిలో సేద తీరాడు. నాటి ‘తిరువేంగడమే’ నేటి ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి చైతన్యానికి దర్పణమైనతిరుమల పుణ్య క్షేత్రం. పూర్వం స్వామి ఆలయాన్ని తొలిసారిగా తొండమాన్ చక్రవర్తి కట్టించాడని, ఆ తర్వాత పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు దశలవారీగా అభివృద్ధి చేశారని చరిత్ర. కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులకు సజీవ సాక్ష్యమైన తిరుమల కోవెల భక్తుల కోర్కెలు తీర్చే కల్పవక్షంగా భాసిల్లుతోంది.

పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, వేంకటేశ్వరస్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అని పిలిచేవారు. ఈ తిరువేంగడం అనే కొండ తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేది.

క్రీ.పూ.1వ శతాబ్దంలో తిరుమలలో చీమలపుట్ట చేత కప్పబడిన స్వామివారి విగ్రహాన్ని తొండమాన్ చక్రవర్తి తొలిసారిగా దర్శించి ఆ శిలామూర్తి చుట్టూ ఓ చిన్నమండపాన్ని కట్టించాడట. ఆ మండపంలోనే స్వామి చాలా కాలంపాటు భక్తుల చేత పూజలందుకొంటూ ఉండేవారని చరిత్ర.

క్రీ.శ.8వ శతాబ్దకాలంలో ఆళ్వారులు శ్రీనివాసుని వైభవ కీర్తిని తమ కీర్తనల ద్వారా నలుదిశలా చాటారు. కులశేఖరాళ్వారు ఎన్ని జన్మలెత్తినా సరే స్వామివారి గడప/లేక పీఠంగానైనా ఉండాలంటూ ఓ పాశురం ద్వారా తన భక్తిని చాటుకున్నాడట.

శిలామూర్తి చుట్టూ గర్భగృహం తిరుమళి కేశికై ఆళ్వారు, కులశేఖరాళ్వారుల మధ్యకాలంలో నిర్మించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. అప్పటి వాతావరణ పరిస్థితుల కారణంగా  ‘తిరువేంగడం’ కొండ మీదకు వెళ్లడం కష్టంగా ఉండటంతో వైష్ణవ భక్తులు వెండితో శ్రీవారి ప్రతిరూపాన్ని ‘తిరుచోగినూర్’ (నేటి తిరుచానూరు)లో ప్రతిష్టించి అక్కడే గుడికట్టారట.

క్రీ.శ. 8 -10వ శతాబ్దంలో గర్భగృహం, అంతరాళం నిర్మాణం
ఆళ్వారుల కాలంలో తమిళదేశంలో శైవమతం విస్తృతమైంది. అక్కడి నుంచి   తిరుచానూరుకూ విస్తరించింది. దీంతో క్రీ.శ.9వ శతాబ్దంలో తిరుమలలో నామమాత్రంగా ఉన్న చిన్నగుడిని విస్తరించే పనులు చేపట్టార ట. అందులో భాగంగా క్రీ.శ.945లో గర్భగృహం నిర్మించారు. ఇక్కడి శేషాచల కొండల్లోని రాళ్లను పలకలుగా పగులకొట్టి వాటితోనే గర్భగృహంతోపాటు అంతరాళం పూర్తి చేశారు. ఇందుకు ఆధారంగా ఆలయంలోని మొదటి ప్రాకారంలో ఉత్తరపు గోడపై ఒకటవ కొప్పాత్ర మహేంద్ర పర్మాన్ శాసనం ఉంది.

దీనికి ముందున్న అర్ధమండపం (ప్రస్తుత శయన మండపం), అంతరాళం (ప్రస్తుతం రామన్‌మేడై/ రాములవారి మేడ)తో కలిపి లోపలి ప్రాకారంలోని మొదటి సముదాయంగా నిర్మించారు.


క్రీ.శ.10వ శతాబ్దంలో గర్భాలయానికి ప్రాకారం నిర్మాణం
10వ శతాబ్దం, ఆ తర్వాత  కాలంలో ఆలయ నిర్మాణం, దశలవారీగా అభివృద్ధి జరిగింది. గర్భగృహ ఆవరణకు గోడకు చుట్టూ మరొక గోడ (ప్రాకారం) నిర్మించినట్టు పరిశోధకుల విశ్లేషణ. తర్వాత క్రీ.శ.12-13 శతాబ్దాల మధ్య కాలంలో ఆలయానికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

క్రీ.శ.1262లో సుందర పాండ్యుడు ఆనంద నిలయ విమానం మీద కలశానికి బంగారు పూత పూయించాడట. తర్వాత వీర నరసింగరాయలు దేవాలయం మరింత ప్రకాశవంతంగా కనిపించేలా బంగారుపూత పూయించాడట. విజయనగర శిల్పరీతులలో తిరుమామణి మండపం

క్రీ.శ.13వ శతాబ్దంలో ఆలయానికి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, నూతన నిర్మాణాలు చేపట్టారు. తర్వాత క్రీ.శ.1417లో మల్లన్న (మాధవదాసు) తిరుమామణి మండపం (ప్రస్తుతం బంగారుమేడ/ బంగారు వాకిలి)ను నాలుగు వరుసల్లో 16 రాతి స్తంభాలతో నిర్మించారు. ఈ మండపం పడమట దిశలో ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి.

ఇదే మండపాన్నే ముఖమండపం, ఆస్థాన మండపం అని కూడా పిలుస్తారు.  ఈ మండపంలోని శిల్పాలన్నీ విజయనగర శిల్పరీతులలో ఉన్నాయి. ఈ మండపం తూర్పుదిశలో నమస్కార భంగిమలో మూలమూర్తికి అభిముఖంగా  గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. దీన్నే గరుడ మండపం అని కూడా పిలుస్తారు. 12శ శతాబ్దంలో రెండవ గోపురం, విమాన ప్రదక్షిణం

క్రీ.శ.1209 సంవత్సరం ఆలయంలో నాటికి రెండవ గోపురం (నిర్మాణంలో ఇదే తొలిగోపురం అయినప్పటికీ ప్రస్తుత ఆలయంలో రెండవదిగా కనిపిస్తుంది) నిర్మాణం చేపట్టారు. ఈ గోపురం దాటి ఆలయంలోని స్వామివారి గర్భాలయం విమానానికి నాలుగు దిశల్లో ఉన్న ప్రాకారాన్ని విమాన ప్రదక్షిణం/ విమాన ప్రాకారం అంటారు.

ఇదే ప్రాకారాన్ని అనుసరించి మరొక ప్రాకారంలో కొన్ని రాతి చెక్కడాలు, మండపాలు, చిన్నచిన్న దేవతా సన్నిధులు నిర్మించారు. ఈ ప్రాకారంలో ఆగ్నేయ దిశలో వంటశాల నిర్మించారు. క్రీ.శ.16లో పడమట దిశలో పెద్దమండపం నిర్మించారు (ప్రస్తుతం కానుకలు లెక్కించే పరకామణిగా ఈ మండపాన్ని వినియోగిస్తున్నారు).

శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాల్లో ఎక్కువ రోజులు ఉత్సవమూర్తులను ఈ మండపంలోనే ఉంచుతారు. ఇదే ప్రాకారంలోనే ఉత్తర దిశలో తాళ్లపాక అన్నమాచార్యుల అర, ఆ తర్వాత రామానుజ (భాష్యకార్ల) సన్నిధి ఏర్పాటైంది. ఇదే క్రమంలో నృసింహ స్వామికి, వరదరాజస్వామికి కూడా ఆలయాలు నిర్మించారు.

క్రీ.శ.13 నుండి మహద్వార గోపురం, సంపంగి ప్రదక్షిణం ఆలయ ప్రవేశ ద్వారమైన మహద్వారంపై నిర్మించిన గోపురాన్ని‘ మహద్వార గోపురం’, ‘ సింహద్వార గోపురం’ , ‘పడికావలి గోపురం’ అనే వివిధ పేర్లతో పిలుస్తారు. తమిళంలో ‘పెరియ తిరువాశల్’ అంటే పెద్దవాకిలి అని అర్థం. ఈ గోపురాన్ని క్రీ.శ.13వ శతాబ్దం నుండి అంచెలంచెలుగా నిర్మించారు. మహద్వారాన్ని ఆనుకుని 16 రాతి స్తంభాలతో కృష్ణరాయ మండపాన్ని నిర్మించారు.

ప్రతిమామండపంగా ప్రసిద్ధి పొందిన ఈ మండపంలో విజయనగర శిల్ప సంప్రదాయం కనిపిస్తుంది. స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఊరేగించిన తర్వాత ఈ ప్రతిమా మండపంలోకి కొంత సమయం పాటు వేంచేపు చేసే సంప్రదాయం నేటికీ అమల్లో ఉంది. ఈ మండపానికి ఉత్తరదిక్కున అద్దాల మండపం, దక్షిణదిక్కులో రంగనాయక మండపం నిర్మించారు. క్రీ.శ.1320-1360 మధ్య మహ్మదీయుల దండయాత్రల వల్ల తమిళదేశంలోని శ్రీరంగక్షేత్రంలోని శ్రీరంగనాథుని విగ్రహాలు ఇక్కడ దాచి ఉంచడం వల్ల ఈ మండపం రంగనాయక మండపంగా ప్రసిద్ధి పొందింది.

క్రీ.శ.15వ శతాబ్దంలో ధ్వజస్తంభ మండపం నిర్మించారు. ఇదే మండపంలోని రాతిపీఠంపై ఎత్తై దారు స్తంభమే ధ్వజస్తంభం. క్రీ.శ.1470లో విజయనగర చక్రవర్తి సాళ్వ నరసింహ రాయలు తన భార్య, ఇద్దరు కుమారులు, తనపేరుతో సంపంగి ప్రాకారం, ఇతర మండపాలు నిర్మించారు.

ఇక వైష్ణవ భక్తుడైన విజయనగర చక్రవర్తి  శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని మరింత విస్తరించారు. క్రీ.శ.1513 నుండి 1521 మధ్యకాలంలో ఏడుసార్లు తిరుమలయాత్ర చేసి స్వామి అలంకరణకు వెలకట్టలేని వజ్రవైఢూర్య మరకత మాణిక్యాది ఆభరణాలిచ్చారు. ఆలయ నిర్వహణ బాధ్యతను పోషించారు. అనుక్షణం శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రణమిల్లుతున్నట్టుగా రెండు చేతులు జోడిస్తున్నట్టుగా ప్రతిమా మండపంలో తిరుమలాదేవి, చిన్నాదేవితో ప్రతిమలు  ఏర్పాటు చేయించారు.

ఆగమం ప్రకారం ఆలయ దక్షిణ దిశలోని మండపాల్లోనే కల్యాణోత్సవం, పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. పడమట దిశలోని మండపాల్లో గిడ్డంగులుగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఆలయం కాలానుగుణంగా అప్పటి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తూన్నా.. ప్రాకారాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

నాడు వందల్లో ... నేడు వేలల్లో 1945, ఏప్రిల్ 10 మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలు,  1974లో పూర్తిస్థాయిలో రెండో ఘాట్‌రోడ్డు వచ్చేనాటికీ ఈ సంఖ్య సుమారుగా 8 వేలకు చేరింది. 1980లో రోజుకు పదిహేనువేలు, 1990 నాటికి రోజుకు 20 నుంచి 25వేలు, 1995 నాటికి 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు, 2010 నాటికి ఈ సంఖ్య 60 వేలకు చేరింది. ప్రస్తుతం 2015లో సెలవులు, పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు, ఒక్కోసారి సాధారణ దినాల్లోనూ ఈ సంఖ్య లక్ష దాటుతోంది.

నిర్మాణ పరంగా 60 వేల మందికే సంతృప్తికర దర్శనం..  ఆలయంలో ఉన్న స్థలాభావ పరిస్థితుల వల్ల కులశేఖరడి (మూల మూర్తికి పది అడుగుల దూరం) నుంచి రోజుకు 27 వేల మంది భక్తులకు దర్శనం కల్పించవచ్చు. ఈ పరిస్థితులు క్రీ.శ. 2000 సంవత్సరానికి ముందు వరకు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 2004 వరకు  రాములవారి మేడ (లఘుదర్శనం/ 35 అడుగుల దూరం) నుంచి రోజుకు 45 వేల వరకు భక్తులకు దర్శనం కల్పించేవారు.

ఇక 2004 నుండి ఘంటా మంటపంలోని ద్వారపాలకులైన జయ విజయుల (మహాలఘు/ 60 అడుగుల దూరం) నుంచి వేగంగా క్యూలైన్లను నెడుతూ 70 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు. తోపులాటల్ని నివారించేందుకు టీటీడీ సన్నిధిలో మూడు క్యూలైన్ల విధానం అమలు చేసింది. ప్రస్తుత విధానంలో 60 వేల మంది భక్తులకు మాత్రమే మూలమూర్తి దర్శనాన్ని సంతృప్తికరంగా కల్పించే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు దాటితే తోపులాటలు నిత్యకృత్యమయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ రెట్టింపుస్థాయిలో వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా.

పూజాకైంకర్యాలు తగ్గించొద్దు: పండితులు
వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం తిరుమల ఆలయంలో కనిష్టంగా 6 గంటలపాటు గర్భాలయ మూలమూర్తి పూజా కైంకర్యాలకు సమయం కేటాయించాలి. మరోవైపు పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్వామి దర్శనం కల్పించాల్సి ఉంది. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినం, బ్రహ్మోత్సవాల్లో ఒకటి రెండు గంటల మినహా మిగిలిన సమయాన్ని భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాల్సి వస్తోంది. ఈ కారణంగా స్వామి పూజల్లో కోత పడుతోంది. అలా చేయటం శ్రేయస్కరం కాదని పండితులు హెచ్చరిస్తున్నారు.

స్వామి దర్శనం కోసం భక్తకోటి...
1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. 1945, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్‌రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారుగా 8 వేలకు పెరిగింది. 1980లో రోజుకు పదిహేను వేలు, 1990 నాటికి రోజుకు 20 నుంచి 25వేల , 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు , 2010 నాటికి ఈ సంఖ్య 60 వేలకు చేరింది.

2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు,  2012లో 2.73 కోట్లు, 2013లో 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లమంది భక్తులు వచ్చారు. ఇక ఈ ఏడాది ఎనిమిది నెలల కాలంలో సుమారు 1.8 కోట్లు దాటింది. భవిష్యత్‌లో ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.

నేత్రద్వారాల ఏర్పాటుకు ఆగమం అభ్యంతరం
ఆలయ నిర్మాణం ఆగమ నిబంధనలకు లోబడి జరిగింది. శ్రీవారి పోటెత్తుతున్న భక్తులందరికీ సత్వరంగా స్వామి దర్శనం కల్పించాలంటే వెండి వాకిలి ప్రాకారానికి నేత్రద్వారం తెరవాలన్న ప్రతిపాదన రెండు దశాబ్దాల నుంచి నలుగుతూనే ఉంది. దీని ప్రకారం వెండివాకిలికి అటుఇటూ 20 అడుగుల దూరంలో రెండు ద్వారాలు తెరవాల్సి ఉంది. ఈ నేత్రద్వారాల నుండి లోనికి, వెలుపలకు పంపడం ద్వారా  ఎలాంటి తోపులాటలు లేకుండా చేయాలన్నదే దీని సారాంశం.

పనిలో పనిగా ఆనంద నిలయ ప్రాకారానికి కూడా ప్రత్యేక ద్వారం తెరవాలని కూడా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ప్రకారం రాములవారి మేడకు ముందున్న స్నపన మంటపం దక్షిణదిశ ప్రాకారానికి కొత్తగా ప్రత్యేకద్వారం ఏర్పాటు చేయాలి. వీఐపీ అయినా, సామాన్యుడైనా  భక్తులందరికీ 35 అడుగుల దూరం నుంచే   సంతృప్తికరమైన దర్శనం కల్పించి వైకుంఠ వాకిలి వద్ద బంగారు బావి సమీపం వరకు భక్తులను వెలుపలకు పంపాలన్నదే మరో ఉద్దేశం. దీనివల్ల జయవిజయలను దాటి లోనికి వెళ్లిన భక్తులు తిరిగి అదే మార్గంలో రాకుండా సులభంగా కొత్త ప్రత్యేకద్వారం నుంచి వెలుపలకు పంపవచ్చు.

ఈ ద్వారాలు అమల్లోకి వస్తే భక్తులందరికీ సంతృప్తికర దర్శనంతోపాటు రోజుకు లక్ష మందికి పైబడి దర్శనం కల్పించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఆ మేరకు 2010లో అప్పటి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు ఎక్కువ మంది భక్తులకు స్వామి దర్శనం కల్పించాలనే సంకల్పంతో దర్శనంలో కొత్త విధానాలతో పాటు ఆలయ ఆగమాలకు అభ్యంతరం లేకుండా చూడాలని జాతీయ స్థాయిలో చర్చకు లేవదీశారు.

అందులో భాగంగా 2010 నవంబర్ 20, 21వ తేదీల్లో జాతీయ స్థాయి సదస్సును తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. అందులో ఆగమ పండితులు, అర్చకులు, టీటీడీ పూర్వపు ఈఓలు, ఆలయం తో ముడిపడిన అనువజ్ఞుల చేత ఉపన్యాసాలు ఇప్పించారు. సదస్సు విజయవంతం అయినప్పటికీ ఆలయంలో కొత్త దర్శన విధానాలపై, నేత్రద్వారాలు, ప్రత్యేక ద్వారాలపై ఆగమ పండితులు తిరస్కరించారు.

మరోసారి 2012లో అప్పటి టీటీడీ ఈఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం కూడా నేత్రద్వారాల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినా, అమలు చేయలేక పోయారు.  ఏది ఏమైనా స్వామివారి దర్శనం కోసం పరితపిస్తున్న భక్తజనావళికంతటికీ విమర్శలకు, శాస్త్రవిరుద్ధతకు తావులేకుండా సంతృప్తికరంగా దర్శన భాగ్యం కల్పించవలసిన ప్రధాన బాధ్యత టీటీడీ మీద ఉన్న ప్రధాన కర్తవ్యం.       

క్రీ.శ. మొదటి శతాబ్దం నాటి త మిళ గ్రంథం ‘శిలప్పాదిగారం’లో తిరుమల ఆలయ ప్రస్తావన ఉంది. క్రీ.శ. 614 సంవత్సరంలో పల్లవ రాణి సమవాయి (పెరిందేవి) గర్భాలయానికి జీవోద్ధరణ చేసినట్టు చరిత్ర. గర్భాలయం తర్వాత కొన్నేళ్ళకు ఆనంద నిలయంపై విమాన గోపురాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. క్రీ.శ.1262 నాటికే విమాన గోపురం సంపూర్ణంగా ఉన్నట్టు శాసనాధారం.

కన్వేయర్ బెల్ట్‌ల ద్వారానే సరుకులు, బూంది-లడ్డూ
పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ప్రసాదాల తయారీ కూడా పెరిగింది. దిట్టానికి అనుగుణంగా సరుకులు సరఫరా చేయాల్సి వచ్చింది. ఆలయంలోని ఉగ్రాణంలోకి సరుకులు తీసుకెళ్లేందుకు ఆలయం వెలుపల దక్షిణ దిశలో ప్రత్యేకంగా ద్వారం తెరవాలని ప్రతిపాదన వచ్చింది. దీనిపై సుదీర్ఘకాలం చర్చజరిగింది. ఆగమ పండితులు ముక్తకంఠంతో తిరస్కరించారు. ఆలయ నిర్మాణానికి విరుద్ధంగా మరొక ద్వారం తెరిస్తే వ్యతిరేక ఫలితాలు ఉత్పన్నం అవుతాయని ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు.

ఇందుకు ప్రత్యామ్నాయంగా సరుకులను ఆలయ ఉగ్రాణంలోకి తీసుకెళ్లేందుకు ఆలయ ఇంజనీర్లు ప్రత్యేకంగా కన్వేయర్ బె ల్ట్ అమర్చారు. ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఈ కన్వేయర్ బెల్ ్టద్వారానే సరుకులను ఉగ్రాణంలోకి చేరవేస్తున్నారు. అలాగే ఆలయం వెలుపల ఉత్తర దిశలోని బూంది పోటులో తయారైన బూందిని కూడా మరో కన్వేయర్ బెల్టు ద్వారా ఆలయంలోని పోటుకు పంపుతున్నారు. ఇక్కడ తయారైన లడ్డూలను తిరిగి లడ్డూ కౌంటర్లకు పంపేందుకు కూడా కన్వేయర్ బెల్ట్‌నే వాడుతున్నారు.


ఆలయంలోని గర్భాలయానికి ముందు ఉన్న మెట్టు (కులశేఖరపడి) ద్వారా 27వేలు, రాములవారి మేడ నుండి (లఘుదర్శనం) 45వేల మంది, జయవిజయల నుండి (మహాలఘులో ) 90 వేల మంది భక్తులకు దర్శనం కల్పించే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువసంఖ్యలో వస్తే మరుసటి రోజు దర్శనం కల్పిస్తారు.

ఆలయంలో మార్పులు చేయకూడదు
* స్వయం వ్యక్త సాలగ్రామ స్వరూపంలో శ్రీవేంకటేశ్వరస్వామి గర్భాలయంలోని ‘ఉపధ్యక’ పుణ్యప్రదేశంలో వెలిసారు.
* దేవశిల్ప విశ్వకర్మ వేయి స్తంభాలతో దివ్యమైన ఆలయం నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
* మహాయుగాలుగా దివ్యమైన దేవాలయం మరుగున ఉంది. అది సామాన్య మానవులకు కనిపించకుండా అదృశ్యంగా ఉంది. ఇందుకు శాస్త్ర ఆధారం ఉంది. కంటికి కనిపించే ఆలయాన్ని నిర్మాణంగా పరిగణించకూడదు.  స్వామి దేహంగా భావించాలి. అలాంటి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అలా చేయటం శాస్త్రం విరుద్ధం. అలా శాస్త్ర విరుద్ధంగా చేయటం వల్ల ప్రతికూల ఫలితాలు సంభవిస్తాయి.

శిల్పశాస్త్రం ప్రకారం నేత్రద్వారాల ఏర్పాటుకు వీలుంది
నేత్రద్వారాలు తెరవాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. దానిపై ఏళ్లకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇంతవరకు పరిష్కారం లభించలేదు. తమిళనాడులోని తిరువణ్ణామలై, కాంచీపురం, చిదంబరం వంటి ఆలయాల్లోకి భక్తులు సులభంగా వెళ్లిరావటానికి అనేక మార్గాలున్నాయి, కాలానుగుణంగా మార్పులు జరిగాయి. తిరుమల ఆలయాన్ని వాటితో పోల్చలేము. అయితే, పెరుగుతున్న భక్తులకు సులభంగా గర్భాలయ మూలమూర్తి దివ్యమంగళ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించేందుకు మార్పుల అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు శిల్పశాస్త్రం సమ్మతిస్తోంది.
 - ఏబీ లక్ష్మీనారాయణ, 1976-2002 టీటీడీ ఆలయాల స్థపతి, ప్రస్తుత స్థపతి సలహాదారు



బ్రహ్మోత్సవాలే కాదు...జగత్కల్యాణోత్సవాలు

వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవ ణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను జరిపించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి.

వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే  శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. సౌర, చాంద్రమానాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు. వైఖానన ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణ నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.

నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు లేకుండా అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఈసారి అధిక భాద్రపద మాసం రావటం వల్ల బ్రహ్మోత్సవ సుముహూర్తం ఓ నెల ముందుకు వచ్చింది.

అంకురార్పణ
వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంతమండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీతప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు.

దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)-నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.

ధ్వజారోహణం
బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు.

ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

పెద్ద శేషవాహనం
ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు.

చిన్నశేషవాహనం
రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు.

హంసవాహ నం
రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం.

హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమెన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారని ఐతిహ్యం.

సింహవాహనం
మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపు పందిరి వాహనం
మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.

కల్పవృక్ష వాహనం
కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వారాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు.

సర్వభూపాల వాహనం
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వ భూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.

మోహినీ అవతారం
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కార మిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహ పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది.

గరుడవాహనం
ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు.  గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు.

హనుమంత వాహ నం
ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతు భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ  తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు.

గజ వాహనం
గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.

సూర్యప్రభ వాహనం
బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు.

చంద్ర ప్రభ వాహనం
ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు.

రథోత్సవం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

అశ్వవాహనం
ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.

చక్రస్నానం
ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో  అలసి పోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు  ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరోరూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

ధ్వజావరోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

వెండిరథం వెలుగులు కనుమరుగు
వెంకన్న సన్నిధిలో వెండిరథం వెలుగులు కనుమరుగయ్యాయి. మూడేళ్లకు ఒకసారి వచ్చే  అధికమాసంలో తిరుమలేశునికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తొలిసారి జరిగే వార్షిక బ్రహ్మోత్సవం ఎనిమిదోనాడు కొయ్యతేరుపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిస్తారు. ఇక  నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వెండిరథం ఊరేగించటం సంప్రదాయం. అలాగే, ఏటా వార్షిక వసంతోత్సవాలలో రెండోరోజు వెండిరథంపై ఉత్సవమూర్తులు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సంప్రదాయం 1992 వరకు సాగింది. తర్వాత శ్రీవారికి కొత్తగా స్వర్ణరథం సిద్ధం చేశారు. అప్పటి నుంచి వెండిరథానికి బదులు స్వర్ణరథాన్ని ఊరేగిస్తున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వెండిరథాన్ని తప్పనిసరిగా ఊరేగించాలని అర్చకులు, పండితులు చెబుతున్నారు. స్వర్ణరథం అలంకార ప్రాయంగా మాత్రమే చూడాలని పండితులు చెబుతున్నారు. కొత్త వెండిరథం అవసరమని పండితుల సూచనతో ఆ దిశగా టీటీడీ అడుగులు వేసినా ఇంతవరకు సఫలం కాలేదు.

స్వామి సేవలో స్వర్ణరథం
1992లో తయారు చేసిన స్వర్ణరథం సుమారు 21 ఏళ్లపాటు సేవలందించింది. క్రమేణా అది మసకబారడంతో మాజీ టీటీడీ ఈవో ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో మరొక స్వర్ణరథాన్ని తయారు చేయాలన్న సంకల్పం 2013 నాటికి కార్యరూపం దాల్చింది. తిరుమలలోని మ్యూజియంలో ప్రత్యేకంగా వర్క్‌షాపు ఏర్పాటు చేసి కొత్త స్వర్ణరథాన్ని సిద్ధం చేశారు.

ఇది భారతదేశంలోనే అతిపెద్దది. 32 అడుగు ల ఎత్తు. 30 టన్నుల బరువు గల ఈ రథానికి మొత్తం 74 కిలోల మేలిమి బంగారం వాడారు. 18 అంగుళాల మందంతో కూడిన 2900 కిలోల రాగి పై తొమ్మిదిసార్లు స్వర్ణతాపడం చేశారు. బీహెచ్‌ఈఎల్ సంస్థ రూపొందించిన హైడ్రాలిక్ చక్రాలతో సరికొత్త హంగులతో స్వర్ణరథాన్ని తీర్చిదిద్దారు. వైఖానస ఆగమోక్తంగా కొత్త స్వర్ణరథానికి సంప్రోక్షణ, వైదిక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పను రథపీఠంపై వేంచేపు చేశారు. తొలిసారిగా 2013, అక్టోబరు 10వ తేది గరుడ వాహన సేవ సందర్భంగా రథరంగ డోలోత్సవం నిర్వహించారు. స్వర్ణకాంతుల స్వర్ణరథంలో  దేవదేవుడైన స్వామివారు, అమ్మవార్లతో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అప్పటి నుంచి ఉత్సవాల్లో కొత్త స్వర్ణరథం భాగమైంది.

వారపు సేవల్లో ఉత్సవాల వేల్పు

బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవాల వైభవం నయనానందకరం. ప్రతి ఏటా స్వామికి 450 ఉత్సవాలు నిర్వహిస్తారు. వేకువ సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య సేవల్లో స్వామి భక్తకోటికి దర్శనమిస్తూ పరవశింపచేస్తాడు. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకో ప్రత్యేక సేవలో స్వామి వైభవ ప్రాశస్త్యాన్ని వర్ణించటానికి మాటలు చాలవు.

శ్రీదేవి, భూదేవి సమేతుడైన
* శ్రీ మలయప్పకు ప్రతి సోమవారం ఉదయం జరిగే ప్రధానసేవ విశేషపూజ. ఆలయంలోని నిత్య కల్యాణోత్సవ మండపంలో దీనిని ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు.
* ఉభయ దేవేరులతో స్వామి శ్రీపీఠం (తిరుచ్చి)పై ఆశీనులై ఛత్రచామర బాజాభజంత్రీలు, వేద పారాయణలతో ఆనంద నిలయాన్ని వీడి కల్యాణోత్సవ మండపానికి చేరుకుంటారు.
* ఉత్సవమూర్తులకు అలంకారాలు, పట్టువస్త్రాలు సడలిస్తారు. స్నానవస్త్రాలు ధరింపచేసి స్నానపీఠంపై తూర్పు ముఖంగా వేంచేపు చేస్తారు.
* దీక్షాధారులైన వైఖానస అర్చకులు వేదికపై నవకలశాలను, హోమగుండంలో అగ్నిని ప్రతిష్ఠిస్తారు. పుణ్యాఃవచనంతో స్థల శుద్ధి, పరిసర శుద్ధి చేస్తారు. కంకణ ప్రతిష్ఠ చే సి ఉత్సవమూర్తులకు అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలతో కంకణాలు సమర్పిస్తారు.
* ఆర్జితం చెల్లించిన గృహస్తులతో సంకల్పం చేయిస్తారు. నవకలశ పూజ నివేదన, పూర్ణాహుతి సమర్పిస్తారు. ఆ హోమ తిలకాన్ని ఉత్సవమూర్తులకు ధరింప చేస్తారు. అనంతరం భక్తులకూ పంచిపెడతారు.
* తర్వాత స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి, మలయప్పను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
* మంగళవాయిద్యాలు, వేదఘోష నడుమ శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత  ఆవుపాలతో, ఆ తర్వాత శుద్ధజలంతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సమయంలో వేదపండితులు పురుష సూక్తం, శ్రీసూక్తం, భూ నీలా సూక్తాలు, పంచ సూక్తాలు పఠిస్తారు.
* చివరగా నవకలశాలలోని జలంతో  సహస్రధారాభిషేకం చేస్తారు. ఆ జలాన్ని అర్చకులు తాము ప్రోక్షణ చేసుకుని, భక్తులకూ ప్రోక్షణ చేస్తారు.
* అనంతరం తెరల మాటున ఉత్సవమూర్తులను నూత్నవస్త్రంతో తుడిచి పట్టువస్త్రం, పూలమాలతో అలంకరిస్తారు. పెద్దవడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు నివేదిస్తారు. తెరలు తీసి కర్పూర నీరాజనం సమర్పిస్తారు. హారతి అయిన తర్వాత సేవలో పాల్గొన్న భక్తులకు ఉత్తరీయం లేదా రవిక గుడ్డ,పెద్దలడ్డూ, వడ అందజేస్తారు. చివరగా భక్తులందరికీ మూలవిరాట్టు దర్శనభాగ్యాన్ని కల్పిస్తారు. టికెట్టు ధర రూ.600.

అష్టదళ పాదపద్మారాధన-
* తిరుమల తిరుపతి దేవస్థానం (1933- 1984) ఆవిర్భవించి యాభైఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1984లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. అందుకు గుర్తుగా ఈ అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన 108 బంగారు కమలాలను హైదరాబాద్‌కు చెందిన ఓ మహ్మదీయ భక్తుడు స్వామికి కానుకగా సమర్పించారు.
* సేవకు ముందుగా ఆర్జితసేవ గృహస్తులను ‘కులశేఖరపడి’ గడప నుండి బంగారువాకిలి వరకు కూర్చోబెడతారు.
* అర్చకులు గర్భాలయ మూలమూర్తికి అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పిస్తారు. స్వామి పాద పద్మాల చెంత కూర్చుని అర్చనకు సిద్ధమవుతారు. ఆలయ పెద జీయంగార్ అందించిన బంగారు పద్మాలను స్వీకరించి అష్టోత్తర శతనామాలతో స్వామి పాద పద్మాలకు అర్చన చేస్తారు.
* స్వామి పాదపద్మాలపై ఉన్న తులసిదళాలను స్వీకరించి వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చతుర్వింశతి నామావళితో అర్చన పూర్తి చేసి గంధధూపం సమర్పిస్తారు. ఆవునేతి తో తడిపిన 27 వత్తులు గల వెండి దీపపుసెమ్మెతో స్వామికి నక్షత్ర హారతి, నైవేద్యాలు సమర్పిస్తారు. కర్పూర నీరాజనంతో స్వామి పాదపద్మాలు, వైకుంఠ హస్తం, చక్రం, స్వామి ముఖారవిందం, తిరునామాలు, శంఖం, కటిహస్తం, పాదపద్మాలు, నందక ఖడ్గం, వక్షస్థల మహాలక్ష్మికి సమర్పిస్తారు.
* ఆర్జిత గృహస్తులకు ఉత్తరీయం లేదా రవిక గుడ్డ, రెండు పెద్ద లడ్డూలు, రెండు వడలు అందజేస్తారు. టికెట్టు రూ.1250.

ప్రాచీనం... సహస్ర కలశాభిషేకం
* తిరుమల ఆలయంలో నిర్వహించే సేవల్లో సహస్ర కలశాభిషేకం అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన సేవగా చెప్పవచ్చు. ప్రతి బుధవారం బంగారు వాకిలిలో ప్రధాన సేవగా నిర్వహిస్తారు.
* ఆలయంలో మూలమూర్తి (ధ్రువమూర్తి), మనవాళప్పెరుమాళ్ (భోగశ్రీనివాసమూర్తి), కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తి,  మలయప్ప... ఐదు రకాల మూర్తులను పంచబేరాలుగా పిలుస్తారు.
* సహస్ర కలశాభిషేకంలో భోగ శ్రీనివాసమూర్తితోపాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు పాల్గొంటారు.
* క్రీ.శ.614 నాటిదిగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని వైఖానస ఆగమం ప్రకారం కౌతుకమూర్తి అనీ, పురుషబేరం అనీ పిలుస్తుంటారు.
* గర్భాలయంలో మూలమూర్తికి ఈశాన్యదిశలో ఉండే భోగ శ్రీనివాస మూర్తికి నిత్యం ఆకాశగంగ తీర్థంతో అభిషేకిస్తారు. ఎప్పుడూ బంగారు వాకిలి దాటి బయటకు తీసుకురారు. సహస్ర కలశాభిషేకం కోసం ఒక్క బుధవారం మాత్రమే గంటామండపానికి తీసుకొస్తారు.
* దక్షిణదిశలో స్నానపీఠంపై ఉత్తరాభిముఖంగా ఉభయదేవేరులతో మలయప్ప, ఉత్తరదిశలో స్నానపీఠంపై దక్షిణాభిముఖంగా విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు. వీరికి మధ్యలో తూర్పున అభిముఖంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని ఆసీనుల్ని చేస్తారు. ఆయనకు గర్భాలయ మూలవిరాట్టును అనుసంధానిస్తూ బంగారు తీగ లేదా పట్టుదారంతో కడతారు. దీనినే ‘సంబంధ కూర్చం’ అంటారు.
* నేలపై ధాన్యం (వడ్లు)పోసి, 1008 వెండికలశాలను సుగంధద్రవ్యాలు కలిపిన జలంతో నింపి ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేనుడి పక్కన ‘నవకలశాలు’ ఏర్పాటు చేస్తారు. ఆగ్నేయదిశలో ‘యజ్ఞవేదిక’ ఏర్పాటు చేస్తారు. ఆర్జితసేవాగృహ స్థులను ఆసీనుల్ని చేస్తారు.
* మంగళ ధ్వనుల నడుమ దీక్షాధారులైన వైఖానస అర్చకులు ఘంటానాదంతో హోమగుండంలో అగ్నిప్రతిష్టాపన చేస్తారు. కలశాన్ని ప్రతిష్టించి పుణ్యతీర్థ జలాలు ఆవాహనం చేసి ధూపదీప కర్పూర నీరాజనాలిచ్చి అక్షతారోపణం చేస్తారు. కలశంలోని పవిత్ర జలాన్ని అన్ని వైపులా చల్లుతూ పుణ్యాహవచనం పూర్తి చేస్తారు.
* శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్ఘ్యపాద్యాచమనాది అనుష్టాన క్రియలు, తులసి సమర్పించి కంకణధారణ చేస్తారు. తర్వాత శ్రీదేవి, భూదేవి, మలయప్ప, విష్వక్సేనులవారికి కంకణధారణ చేస్తారు.
* సంకల్పసహితంగా ముక్కోటి దేవతలను ఉద్దేశించి హోమం చేస్త్తారు. ధాన్యంపై ప్రతిష్టించిన సహస్ర కలశాలు, పీఠంపై ప్రతిష్టించిన నవకలశాలకు ఆవాహనాది క్రియలు చేసి ధూపదీప హారతులు సమర్పిస్తారు.
* హోమగుండం వద్ద అప్పాలు, శుద్ధాన్నం నివేదన చేసి హోమాన్ని నిర్వహిస్తూ పూర్ణాహుతి చేస్తారు. హోమ తిలకాన్ని శ్రీభోగ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి, మలయప్ప, విష్వక్సేనులవారికి సమర్పిస్తారు. భక్తులకూ అందజేస్తారు.
* మంగళవాయిద్యాలు, వేద పండితుల పంచసూక్తాల నడుమ సహస్ర కలశాలలోని శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనద్రవ్యాలతో భోగ శ్రీనివాసమూర్తికి, విష్వక్సేనులవారికి అభిషేకిస్తారు. చివరగా అన్ని మూర్తులకు తులసిమాలలు అలంకరించి నవ కలశాలలోని జలంతో బంగారుపళ్లెంతో సహస్రధారాభిషేకం చేస్తారు.
* తర్వాత ఆ పవిత్రజలాన్ని ముందుగా అర్చకులు చల్లుకుని, జీయంగార్, ఏకాంగి, భక్తుల మీద  చల్లుతారు. తర్వాత తెరలమాటున పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి,  క్షీరాన్నం, అప్పాలతో నివేదన సమర్పిస్తారు. అనంతరం తెరలు తొలగించి అక్షతారోపణతో కర్పూర నీరాజనం సమర్పించి మూర్తులను ఆనంద నిలయంలోకి వేంచేపు చేస్తారు. చివరగా భక్తులకు మూలవిరాట్టు దర్శన భాగ్యాన్ని కల్పించి, ఉత్తరీయం లేదా రవికగుడ్డ, పెద్దలడ్డూ, వడ, రెండు అప్పాలు, రెండు దోశలు, అన్నప్రసాదాలు అందజేస్తారు. టికెట్టు ధర రూ.850.

నేత్ర దర్శనం
* తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం ఓ విశిష్టత ఉంది. మూలమూర్తి దర్శనం, నివేదనలు, అలంకారాలు ఈ రోజు విభిన్నంగా ఉంటాయి. ప్రతి గురువారం వేకువ జామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా నిరాడంబర రూపంతో దర్శనమిస్తారు.
* ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు తిరునామం (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. భక్తులకు స్వామి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం ఆ రోజు మాత్రమే కలుగుతుంది. గురువారం నాటి ఈ దర్శనాన్నే నేత్రదర్శనం అంటారు.
* ఆ రోజు ఆభరణాల బదులు పట్టుధోవతిని, పట్టు ఉత్తరీయాన్ని ధరింపజేస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి పట్టువస్త్రాన్ని చుడతారు. బంగారు శంఖుచక్రాలు, కర్ణభూషణాలు, సాలిగ్రామహారాలను అలంకరిస్తారు. మెడలో హారం, కాళ్లకు కడి యాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు.

అన్నరాశి నైవేద్యమే తిరుప్పావడసేవ
* శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రతి గురువారం రెండో అర్చన తర్వాత నివేదనోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనినే ‘తిరుప్పావడసేవ’ అనీ, అన్నకూటోత్సవం అనీ అంటారు. స్వామికి బంగారువాకిలి వద్ద నుండి నేరుగా సమర్పించే అన్ననివేదన ఇది.
* బంగారు వాకిలి ముందు గరుడాళ్వారుకు ఎదురుగా నాలుగు స్తంభాల మధ్య వెదురు చాపలపై 6 బస్తాల బియ్యం (450 కిలోలు) తో తయారు చేసిన పులిహోరను ‘రాశి’గా పోస్తారు. స్తంభాలకు చుట్టూ తెరలు కట్టి ఈ అన్నరాశిని పెద్ద శిఖరం లాగా దానికి చుట్టూ ఎనిమిది దిక్కులా చిన్న శిఖరాలు గా తీర్చిదిద్దుతారు. ఈ రాశి ముందు ధూపదీప నైవేద్యాలు, నీరాజనం సమర్పిస్తారు.
* జిలేబి, తేనెతొళ (మురుకు), దోసె, అప్పలం, పాయసం, లడ్లు, వడలు వంటి ప్రసాదాలను మూలవిరాట్టు దృష్టి పడేలా కులశేఖరపడి వద్ద ఉంచి నైవేద్యం, మంగళహారతి సమర్పిస్తారు.
* వేద పండితులు శ్రావ్యంగా పఠించే శ్రీనివాస గద్యంతో సప్తగిరులు పులకిస్తాయి. శ్రీనివాసగద్యం పూర్తికాగానే బంగారువాకిలి నుండే మూలమూర్తికి, తర్వాత అన్నరాశికి హారతి సమర్పిస్తారు. . తర్వాత పులిహోర రాశిని భక్తులకు వితరణ చేస్తారు. గృహస్థులను మూలవిరాట్టు దర్శనానికి అనుమతిస్తారు.
* ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికగుడ్డ, ప్రసాదాలు అందజేస్తారు. టికెట్ ధర రూ.850.

పూలంగి సేవలో పెరుమాళ్లు...
* ప్రతి గురువారం సాయంత్రం మూలవిరాట్టుకు నిర్వహించే తోమాల సేవనే పూలంగి సేవ అంటారు.
* సాయం సమయంలో వైఖానస అర్చకులు శుచిస్నాతులై సన్నిధిగొల్ల వెంటరాగా ఆలయానికి చేరుకుంటారు.
* జీయంగార్లు, ఏకాంగి ‘యమునోత్తరై’ అను ‘పూల అర’లో సిద్ధంగా ఉంచిన పూలు, పూలమాలల్ని పెద్ద వెదురుబుట్టలను బాజా భజంత్రీల తో, ఛత్రచామర మర్యాదలతో సన్నిధికి ఊరేగింపుగా తీసుకొస్తారు.
* అర్చకులు స్వామికి అలంకరించిన  ఆభరణాలు తీసివేసి, బంగారు తీగెలతో కూడిన ముఖమల్ వస్త్రాన్ని ధరింప చేస్తారు. అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పించి పూలంగి, తోమాల సేవలు నిర్వహిస్తారు. జీయంగార్లు, వైష్ణవాచార్యులు, దివ్యప్రబంధాన్ని గానం చేస్తారు.
* పూలమాలల్ని శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరిస్తారు. ఈ అలంకరణలో స్వామివారు పూల అంగీని ధరించినట్టు కనువిందుగా దర్శనమిస్తారు. స్వామివారు గురువారం రౌద్రంగా ఉంటారని, ఆ రౌద్రాన్ని తగ్గించి శాంతింప చేయడానికే పూలంగిసేవ నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు.

దివ్యమంగళ స్వరూప దర్శన భాగ్యం!
* ప్రతి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తంలో  స్వామివారికి జరిగే విశేషసేవ ‘అభిషేకం’.
* అర్చకులు మూలవిరాట్టుకు నమస్కారం చేసి, అభిషేకానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించి సంకల్పం, అష్టోత్తర శతనామార్చన చేస్తారు. స్వామికి నొసటన ఉండే పచ్చకర్పూరపు నామాన్ని తగ్గించి సూక్ష్మంగా ఉంచుతారు. ఆభరణాలు, పట్టువస్త్రాలను తీసివేసి, స్నానవస్త్రంగా తెల్లని కౌపీనాన్ని ధరింప చేసి, దంతధావన అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పించి శిరసాదిగా పునుగు తైలాన్ని అలది వెండి గంగాళాల్లో బంగారు బావి జలాన్ని సిద్ధం చేస్తారు.
* జీయంగార్లు, అర్చకులు గర్భాలయంలోకి చేరుకోగా, అధికారులు, భక్తులు కులశేఖర పడి నుంచి బంగారు వాకిలి వరకు కూర్చుంటారు.
* జీయంగార్, అర్చకులు స్వామికి, వక్షస్థల మహాలక్ష్మికి నమస్కరించి అభిషేక సమర్పణకు అనువుగా వరద హస్తం దగ్గర నిలుస్తారు.
* తొలుత జీయంగార్లు బంగారు శంఖంతో ఆకాశగంగ తీర్థాన్ని అర్చకులకు అందిస్తారు. వారు పురుష సూక్తాన్ని పఠిస్తూ స్వామి శిరస్సుపై అభిషేకిస్తారు. వేద పండితులు పంచసూక్తులు, పంచోపనిషత్తులు పారాయణం చేస్తారు.
* తర్వాత ఆవుపాలతో శిరసాది పాదాల వరకు అభిషేకిస్తారు. తర్వాత బంగారు బావి శుద్ధజలంతో అభిషేకించి, పసుపు ముద్దలను వక్షస్థల మహాలక్ష్మికి సమర్పిస్తారు.
* అనంతరం స్వామికి కర్పూరం, చందనం, కుంకుమపువ్వు శిరసాదిగా అద్దుతారు. ఈ నలుగు విధానాన్ని ‘ఉద్వర్తనం’ అంటారు. ఆ తర్వాత ఇచ్చే హారతిలో ముఖారవిందం, శంఖుచక్రాలు, వరద కటి హస్తాలు, పాదాలు, నందక ఖడ్గం, వక్షస్థల మహాలక్ష్మి.. ఇలా అంగాంగాలతో స్వామి దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించి ఆనంద పరవశులవుతారు. జలాభిషేకంతో జాలువారుతున్న తీర్థాన్ని ‘శ్రీపాద తీర్థం’ అంటారు. అనంతరం స్వామి వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మికి అభిషేకం చేస్తారు. తరువాత బంగారు బావి జలంతోనూ, ఆకాశగంగ తీర్థంతోనూ స్వామిని అభిషేకించి ఆ తీర్థాన్ని పాత్రలో సేకరిస్తారు.
* ఈలోగా పండితులు వేద పారాయణం పూర్తి చేస్తారు. తెరవేసి వస్త్రంతో స్వామికి తడిలేకుండా తుడుస్తూ ఉండగా జీయంగార్ ద్రవిడ వేదంలోని ‘నీరాట్టం’ పది పాశురాలు గానం చేస్తారు.
* ఆ సమయంలో అర్చకులు తెరలమాటున స్వామికి సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని అంతరీయంగాను, పండ్రెండు మూరల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగానూ ధరింప చేస్తారు. తర్వాత  ఆభరణాలు అలంకరించి పట్టువస్త్రంతో శిరస్సుకు కిరీటంగా చుడతారు. నుదుట పచ్చకర్పూరంతో తిరునామం తీర్చిదిద్దుతారు.
* తర్వాత వెన్న, పంచదారతో నివేదన చేసి తాంబూలం సమర్పిస్తారు. ఆ తర్వాత ‘పచ్చ కర్పూరపు హారతి’ సమర్పిస్తూ తెరను తొలగించి, భక్తులకు అభిషేక తీర్థాన్ని, ‘శ్రీపాదరేణువు’అనే మహాప్రసాదాన్ని వితరణ చేస్తారు. టికెట్టు ధర రూ.750.

వస్త్రాలు సమర్పించే వస్త్రాలంకార సేవ
* అభిషేకసేవలో మూలవిరాట్టుకు ధరింప చేసే వస్త్రాలను భక్తులే సమర్పించేందుకు ప్రత్యేకంగా వస్త్రాలంకార సేవ టికెట్టు టీటీడీ ప్రారంభించింది. టికెట్టు ధర రూ.12.250.

నిజపాదాల దర్శనం.. భక్తకోటి జన్మధన్యం
* ప్రతి శుక్రవారం శ్రీ స్వామి నిజపాదాల దర్శనభాగ్యం భక్తులకు కలుగుతుంది. అభిషేకసేవలో పాల్గొనే భక్తులతోపాటు నిజపాద సేవాటికెట్లు కలిగిన వారికీ ఈ మహద్భాగ్యం దక్కుతుంది.       
దేవతల కోసం ‘బ్రహ్మస్థలం’
* తిరుమల ఆలయంలో పంచ భూతాలు, దేవగణాలు, అష్టదిక్పాలకులు నిత్యం స్వామిని సేవించేందుకు వీలుగా గర్భాలయం నుంచి ముఖమండపం తప్పిస్తే మిగిలిన మూడు ప్రాకారాల్లోనూ ఎక్కువభాగం ‘బ్రహ్మస్థలం’గానే ఆలయ నిర్మాణం సాగిందని పండితులు, అర్చకులు చెబుతున్నారు.
* ఆలయాల గోపురాలు, విమాన ప్రాకారాలు ప్రకృతిసిద్ధంగావచ్చే భూకంపాల వంటి వైపరీత్యాలను  తట్టుకునే శక్తికోసమే అలాంటి నిర్మాణాలు చేపడుతుంటారని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
* సాధారణంగా వైష్ణవం, శైవం వంటి శాఖలు తమ ఆలయాలు నిర్మించే  సందర్భంలో ఆయా ధర్మాలను అనుసరించి వాస్తును కూడా పరిగణనలోకి తీసుకునే నిర్మాణం పనులు చేస్తారు.
* పురాతన గృహాల్లోని మధ్య భాగంలోఎక్కువ ఖాళీస్థలం వదిలేవారు. దాన్ని బ్రహ్మ స్థలంగా పరిగణిస్తారు.  అక్కడ దేవ తలు కొలువై ఉంటారట. అందుకే ఆ బ్రహ్మస్థలంలో తులసి మొక్క నాటి పూజలు చేస్తారు. అక్కడికే నేరుగా పంచభూతాలు ఆవాహన అవుతుంటాయి. భగవంతుడు ముఖద్వారం నుంచి కాకుండా నేరుగా ఆకాశమార్గం నుంచి నేరుగా బ్రహ్మస్థలానికి చేరుకుని పూజలందుకుంటారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.


ధ్వజారోహణంలో దర్భతాడు...
హిందూ ధర్మంలో దర్భను పవిత్రంగా భావిస్తారు. అంతటి పవిత్రమైన దర్భతోనే ధ్వజారోహణంలో  ధర్మతాడు (కొడితాడు) సిద్ధం చేస్తారు. 1.5 అంగుళాల మందం, 300 అడుగుల పొడవుతో దర్భలను తాడుగా పేనుతారు. దర్భలతోనే రెండు మీటర్ల వెడల్పు, ఆరుమీటర్ల పొడవుతో 12 చదరపు మీటర్ల చాపను సిద్ధంచేస్తారు. చాపను ధ్వజస్తంభం (కొడిస్తంభం)కు అమర్చి, దారంతో చుడతారు. దర్భను ఇంతకుముందు వరకు టీటీడీ అటవీశాఖ వెంకటగిరి ప్రాంతంలో సేకరించేవారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా అవసరమైన దర్భ లభించేది కాదు. పవిత్రకార్యానికి వాడే దర్భను పెంచటంలోనూ శుభ్రత పాటించే పరిస్థితులు సన్నగిల్లాయి. దీంతో బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ధ్వజారోహణం కోసం పవిత్రమైన దర్భను పెంచే విషయంలో టీటీడీ అటవీశాఖా డీఎఫ్‌వో ఎన్‌వీ శివరామ్‌ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈమేరకు ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉద్యానవనంలో   మంచినీరు, సేంద్రియ ఎరువులు వాడి దర్భను పెంచారు.  దానిని పవిత్ర కార్యాలకు వినియోగిస్తున్నారు.

పుష్కరిణి నిత్య హారతి
ఆలయానికి ఉత్తర  ఈశాన్యదిశలో పుష్కరిణి ఉంది. 1.5 ఎకరాల వైశాల్యమున్న ఈ కోనేరు మధ్యలో క్రీ.శ 1468లో సాళ్వ నరసింగరాయలు నివాళీ మండపాన్ని నిర్మించారు. క్రీ.శ.15వ శతాబ్దంలో పుష్కరిణికి తాళ్ళపాక వారు మెట్లను నిర్మించి నివాళీ మండపాన్ని బాగు చేయించారు. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో నిర్వహిస్తారు.

ఫాల్గుణ మాసంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. స్వామి పుష్కరిణికి హారతి ఇచ్చే సంప్రదాయానికి 2008లో అప్పటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈఓ కేవీ రమణాచారి శ్రీకారం చుట్టారు. నాటినుంచి ప్రతిరోజూ సాయంసంధ్యాసమయంలో మలయప్ప సాక్షిగా పుష్కరిణి నిత్య హారతి అందుకుంటోంది.

ఆనంద నిలయం అఖండ తేజోమయం

ఆనంద నిలయం అఖండ తేజోమయం
తనమీద అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వీడిన విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైన వేంకటాచల క్షేత్రానికి విచ్చేశాడు. అక్కడ స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురమే ‘ఆనంద నిలయ విమానం’గా ప్రసిద్ధి పొందింది.
‘వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన
వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’’

శ్రీవేంకటేశ్వరస్వామి వారు గర్భాలయంలో ‘ఉపధ్యక’ అనే పవిత్రస్థానంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వాటినే ధ్రువమూర్తి, మూలమూర్తి, మూలవిరాట్టుగా కొలుస్తారు. యోగ, భోగ, విరహ రూపాలతోపాటు ‘వీర స్థానప’ విధానంలో నిలబడిన స్వామి ముగ్ధమనోహరంగా ప్రకాశిస్తాడు. స్థిరంగా ఉంటాడు. ఈ విగ్రహాన్నే ఆగమ పరిభాషలో ధ్రువబేరంగా సంబోధిస్తారు.
 
సుప్రభాతంతో వేకువజామున 2.30 గంటలకు స్వామిసేవను ప్రారంభించి, తిరిగి రాత్రి 12.30 గంటలకు జోలపాటతో నిద్రపుచ్చుతారు. వైఖానస ఆగమబద్ధంగా తోమాల, అర్చన, కొలువు ఇతర నిత్యసేవా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో మూడుపూట లా అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తూ అర్చకులు లోకకల్యాణం కోసం శరణు వేడుతారు.

పుష్పకైంకర్యంలో భాగంగా సాలగ్రామ హారాలు, శిఖామణి, శంఖుచక్రం, శ్రీదేవి, భూదేవి కంఠహారాలు, అలంకార బిట్లు, 25 రకాల పూలకుచ్చులతో కూడిన సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పుష్పకైంకర్యాలు చేస్తారు. నిత్య దిట్టం కింద 300 కేజీల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, ఆస్థాన కార్యక్రమాల కోసం 10 నుంచి 20 టన్నుల వరకు పుష్పాలు వినియోగిస్తారు.

తననే శరణు వేడండంటూ కటి, వరదహస్తాలతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ భక్తులకు హెచ్చరికతో కూడిన  హితబోధ చేస్తూ దర్శనమిస్తుంటారు. అలాంటి దివ్యమైన బంగారు పాదాలను నిత్యం పుష్పాలు, తులసి సేవిస్తుంటాయి. వేకువజాము సుప్రభాత దర్శనంలో మాత్రమే తులసి, పుష్పాలు లేకుండా దర్శించవచ్చు. ఇక శుక్రవారం అభిషేకం, ఆ తర్వాత దర్శన సమయంలో మాత్రమే బంగారు పాద తొడుగులు లేకుండా స్వామి పాద పద్మాలు (నిజపాద సేవలో) దర్శించవచ్చు.

ప్రతి రోజూ నిత్యకట్ల అలంకారంలో 120 రకాల ఆభరణాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు చేసేందుకు అదనంగా ఆభరణాలు వాడతారు. రోజూ చేసే అలంకారాన్ని నిత్య కట్ల అలంకారమని, పండుగలు, ఉత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారమని అంటారు. స్వామికి వజ్రకిరీటం, శంఖ, చక్ర, వరద హస్తాలు, ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా అలంకరిస్తారు.

శ్రీ స్వామి, ఉత్సవమూర్తుల అలంకరణలకు వాడే కిరీటాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇతర నిల్వలు దాదాపుగా 11 టన్నులు ఉంటాయి. వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగ లు కూడా ఉన్నాయి.

ఆకాశరాజు కిరీటం, వేంకటాద్రిని పాలించిన రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, భక్తులు సమర్పించే కానుకల వివరాలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది.

శుక్రవారం అభిషేకం తర్వాత స్వామికి ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) సమర్పిస్తారు. దీనినే ‘తిరుమామణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల  పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భాల్లో తిరుమానానికి వాడే ద్రవ్యాలు రెట్టింపు స్థాయిలో వాడతారు.

అభిషేకం తర్వాత మూలమూర్తికి అంతరీయం (ధోవతి)గా 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింప చేస్తారు. విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ఇతర సామాజ్య్రాలపై దండయాత్రకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సందర్భంగా విలువైన ఆభరణాలు, కిరీటాలు, ఖడ్గాలను బహూకరించాడు. మలయప్పకు అలంకరించే గుండ్రని కిరీటం, మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఉత్సవాల్లో ఎదపై అలంకరించే పెద్ద పచ్చ రాయలు సమర్పించినవే.

ఆలయంలోని జయవిజయలు ఉన్న బంగారువాకిలి దాటుకున్న తర్వాత రాములవారి మేడలో ఉండే రహస్య అలమరాలో శ్రీవారికి వినియోగించే ఆభరణాలు భద్రపరుస్తారు. వీటిని ఆలయ డిప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షిస్తారు. ఏ రోజు, ఏ ఉత్సవంలో ఏయే ఆభరణాలు అవసరమో అర్చకుల సూచన మేరకు వాటిని సమకూరుస్తారు.

శ్రీవారి ఆలయంలో గర్భాలయ  మూలమూర్తితోపాటు భోగ శ్రీనివాసుడు,  కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉన్నారు. పంచమూర్తులే కాకుండా సుదర్శన చక్రత్తాళ్వార్, సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వంటి పంచలోహ మూర్తులు కూడా గర్భాలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడే దేవతామూర్తులతోపాటు పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య పూజలందుకుంటున్నాయి. గర్భాలయానికి ఆగ్నేయం, ఈశాన్య దిశల్లో అటు ఇటుగా ‘బ్రహ్మ అఖండం’ నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ దీపాలను వెలిగించాడని విశ్వాసం.

రాత్రి పవళింపు సేవ చివరి సమయంలో బంగారు నవారు పట్టె మంచంపై ‘మనవాళ పెరుమాళ్’ (భోగశ్రీనివాసుడు)ని వేంచేపు చేస్తారు. అదే సమయంలోని గర్భాలయ మూలమూర్తికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి ‘ముత్యాల హారతి’  మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తారు.

తెలుగు నూతన సంవత్సరాధి పర్వదినమైన ఉగాది (మార్చి/ఏప్రిల్), ఆణివారి ఆస్థానం (జూలై), శ్రీవారి  బ్రహ్మోత్సవం (సెప్టెంబరు/అక్టోబరు), వైకుంఠ ఏకాదశి (డిసెంబరు/జనవరి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం రోజున ఆనంద నిలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో నీరు, దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రాన్నే ‘మలైగుడారం’ అని అంటారు. తిరుమంజన సేవలు పూర్తకాగానే కురాలం అనే దీర్ఘచతురస్రాకారపు మఖమల్ వస్త్రాన్ని పైకప్పునకు కడతారు.

గర్భాలయంలో కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న దుమ్ముదూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే ఎక్కువ మోతాదులో నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ కిచిలిగడ్డ ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారు చేస్తారు. భారీ గంగాళాల్లో సిద్ధం చేసిన ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనంగా పూస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు క్రిమికీటకాలు ఉండకుండా ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.


తెల్లదొరలూ... వెంకన్న సేవకులే

తెల్లదొరలూ... వెంకన్న సేవకులే
రెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులే. ఆ మాటకొస్తే ఆలయ పాలనా పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయి. దేవస్థానం రికార్డులే అందుకు ఆధారం.

1801 నుండి 1843 వరకు బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా పాలకుల హయాంలోనే ఆలయ పాలనకు కఠిన నిబంధనలు, క్రమశిక్షణ పద్ధతులు అమలయ్యాయి. నేటికీ తిరుమల ఆలయం, టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది  1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్  ఈస్టిండియా కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి  దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు.

క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు  1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్  నియమితులయ్యారు.

టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు
దిట్టం:
శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాల తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు.
కైంకర్యపట్టీ:
తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీ దారులు, జియ్యర్ సిబ్బంది విధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చే శారు. దీనిప్రకారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి.

బ్రూస్‌కోడ్:
బ్రిటీష్ ప్రావిన్షియల్ జడ్జి పి.బ్రూస్ ఈస్టిండియా కోడ్ ఆఫ్ డెరైక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికీ ఆలయపాలనకు అదే దిక్సూచీగా ఉంది.

సవాల్- ఇ-జవాబు:
శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలువేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే సవాల్- ఇ-జవాబు పట్టీగా పిలుస్తారు.

పైమేయిషి ఖాతా:
ఆలయ స్థిర, చరాస్తులు, దేవతావిగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషి అకౌంట్’ అని పిలుస్తారు. ధార్మికసంస్థ పరిపాలనలో రికార్డులు, విధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది.

జీవో ఎంఎస్ నెంబరు 4429 తేది:23.09.1940,  జీవో ఎంఎస్ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చ.కి.మీ. పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్లదొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండటం వారి పాలనాదక్షతకు నిదర్శనం.


వికాస కేంద్రాలుగా విదేశీ ఆలయాలు

ఆలయ సంస్కృతి ఒక్క భారత దేశంలోనే కాకుండా ఖండాంతరాలలో వ్యాపించి సమస్త మానవాళికి సంజీవనిగా వెలుగొందుతోంది. లోకకల్యాణం కోసం దే శదేశాల్లో కూడా ఆలయాలు విస్తరిస్తూ అక్కడివారిలో ప్రేమామృతాన్ని పంచే ఆధ్యాత్మిక కేంద్రాలుగా బాసిల్లుతుండటం విశేషం.

దక్షిణభారత దేశ శిల్పరీతుల్లో  శ్రీమహావిష్ణువు అంశలైన శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడుతోపాటు కుమారస్వామి (మురుగన్), వినాయకుడు, శివపార్వతులు, ఆంజనేయస్వామి, నవగ్రహాల ఆలయాలు అధికంగా కనిపిస్తాయి. వీటితోపాటు ఉత్తర భారతదేశ శిల్పరీతుల్లో ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలు, స్వామినారాయణ్ ఆలయాలు విదేశాల్లో ఉన్నాయి.

నాటి శిల్పకళా వైభవ రీతులకు దర్పం
అలనాటి కళింగ, చోళ, పల్లవ, పాండ్య, కాకతీయ రాజుల నాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీకలుగా నిలిచిన శిల్పకళా నిర్మాణం రీతుల్లోనే విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించారు. వైష్ణవ, శైవ ఆగమ రీతులకు లోబడి పునాది నుంచి విమానప్రాకారం వరకు అన్నీ ఆగమ శాస్త్ర, వాస్తు సంబంధంగానే నిర్మించారు.

నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా గర్భాలయం, శయన మండపం, ముఖమండపం, ప్రాకారాలు, ధ్వజ స్తంభం, పుష్కరిణి వంటివి తప్పక ఏర్పాటు చేయటం విశేషంగా చెప్పవచ్చు.

ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్రత్యేకంగానూ, ఒకే భవంతిలో వివిధ అంతస్తుల్లోనూ వివిధ దేవతా మూర్తులను ఆగమోక్తంగా ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.

విదేశాల్లో సమాజ హిత కేంద్రాలుగా...
* విదేశాల్లోని ఆలయాల్లో కేవలం పూజలు, ఉత్సవాలే కాకుండా సమాజ హితం కోసం అనేక ఆధ్యాత్మిక, కళా, సాంస్కృతిక, నైతిక, సామాజిక, విద్య, ఆరోగ్య, మానసిక వారధులుగా ఆలయాలు పనిచేస్తున్నాయి.
* ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ వంటి ఆధ్యాత్మికవేత్తల మరెందరితోనూ తరచు ఆధ్యాత్మిక, వేదాంతిక ప్రసంగాలు, ప్రవచనాలు చేయిస్తూ అక్కడి జనంలో తాత్విక చింతన, భక్తి, ప్రేమ తత్వాన్ని పెంపొందిస్తున్నారు.
* ప్రత్యేకించి సెలవురోజుల్లో యోగా శిక్షణా తరగతులు నిర్వహించి మానసిక రుగ్మతలను, ఎన్నో దీర్ఘకాలిక జబ్బులను నియంత్రిస్తుంటారు.
* సనాతన భారతీయ నృత్య, సాంస్కృతిక సంపదలైన కూచిపూడి, భరతనాట్యం, ఆలయ భజన, హరికథ  వంటి ఎన్నో భక్తి, సంగీత కళాసంప్రదాయాల్ని నేటి తరానికి అందించటం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* హెల్త్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచేలా విలువైన సూచనలు ఇచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్య పరుస్తారు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఆలయాల వద్ద తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ మొదలగు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మాతృభాషను బోధిస్తారు.
* ప్రత్యేకంగా ధ్యానంపై శిక్షణ ఇచ్చి మానసిక స్వాంతన చేకూరుస్తారు. ఆలయాల్లో ఆడిటోరియం, లైబ్రరీ, డైనింగ్ హాలు, మీడియా సెంటర్ ఏర్పాటు చేసి నిత్యం అనుకూల వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ట్రస్టీల చేతుల్లో ఆలయ నిర్వహణ
* విదేశాల్లోని ఆలయాలు దాదాపుగా ట్రస్టీల చేతుల్లో నిర్వహింపబడుతున్నాయి. నిర్ణీత గడువులో జరిగే ఎన్నికల్లో ట్రస్టీలను ఎన్నుకుంటారు. ఏడాదికి సరిపడా కార్యక్రమాలు రూపొందించి పక్కాప్రణాళికతో అమలు చేస్తారు.
* భక్తులకు సలహాలు, అన్నదానం, ఆర్థిక సంబంధ  విషయాలు, హిందూధర్మ పరిరక్షణ, మానవతా విలువల్ని సంరక్షించటం, గ్రంథాలయాల్లో శాస్త్రగ్రంథాలు సమకూర్చటం, మానవసంబంధాలు కొనసాగించటం, సామాజిక సేవాకార్యక్రమాలు వంటివి నిర్వహిస్తారు.

విదేశాల్లోని ఆలయాల్లో ఏడాది పొడవునా ఉత్సవాలు
* విదేశాల్లోని ఆలయాలు సాధారణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు, పూజలు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక, కాలపట్టికను సిద్ధం చేసుకుంటాయి. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి.
* ప్రతి ఏడాది దసరా నవరాత్రుల్లోనూ, కార్తీక మాసంలోనూ స్వామివారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వాహన సేవల్ని, రథం ఊరేగింపు, చక్రస్నానం కూడా నిర్వహిస్తారు.
* అలాగే మకర సంక్రాంతి, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, కృష్టాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి, మహాశివరాత్రి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. కృష్ణుని జీవితంలోని ప్రధాన ఘట్టాలైన రాధామాధవ రాసలీల, గోవర్ధనగిరిని తన చిటికనవేలితో ఎత్తటం, అలనాడు పూతనను సంహరించటం వంటి ప్రధాన ఘట్టాలు కళ్లకు కట్టే విధంగా కళాప్రదర్శనలు ఇవ్వటం ద్వారా నేటితరాలకు నాటి భక్తితత్వాన్ని, ఆధ్యాత్మికత అమృతసారాన్ని నాటి తరం నుంచి నేటితరానికి అందిస్తుండటం ముదావహం.

స్వామినారాయణ్, ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల సందడి
* ఉత్తర భారత దేశ సంస్కృతిలో భాగంగా అంతర్జాతీయంగా స్వామి నారాయణ్ ఆలయాలు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌కు చెందిన రాధాకృష్ణమందిరాలు ఎక్కువ దేశాల్లో విస్తరించాయి.

విదేశీ ఆలయాల్లో టీటీడీ శ్రీనివాస కల్యాణాలు
* ఖండాంతరాల్లోని ప్రవాస భారతీయ భక్తులకూ స్వామి వైభవాన్ని చాటేలా ‘శ్రీనివాస కల్యాణం’ నిర్వహిస్తూ వారిలో భక్తి చైతన్యాన్ని నింపుతోంది టీటీడీ. పంచలోహ విగ్రహ మూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామికి తిరుమల ఆలయ తరహాలోనే స్వామి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. ఈ పంచలోహ విగ్రహాలను టీటీడీ తయారు చేసి నిర్వాహకులకు నగదుపై ముందుగానే అందజేస్తుంది.

మహ్మదీయుల నాదస్వరార్చన
ప్రపంచ నాదస్వర చక్రవర్తిగా ప్రఖ్యాతి గాంచిన పద్మశ్రీ షేక్ చినమౌలానాకు శ్రీవారి ఆలయంతో అపారమైన అనుబంధం ఉంది. ఆలయంలో అనేక కైంకర్య కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాల్లో నాదస్వర కచ్చేరి చేసేవారు మౌలానా. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో నాద నీరాజనంతో స్వామిని స్తుతించారు. అలాంటి విద్వాంసుడి ఏకైక కుమార్తె వీవీ జాన్ బిడ్డలైన మనుమలు షేక్ ఖాసిం, షేక్ బాబులు తాతగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తిరుమలేశుని ఆలయ నాదస్వర  విద్వాంసులుగా సేవలు అందిస్తూ మత సామరస్యాన్ని చాటుతుండటం విశేషం.

తాత చలవతోనే వెంకన్న సేవాభాగ్యం
‘‘మా తాత మౌలానా గారు ప్రపంచ నాదస్వర చక్రవర్తి. మాకు చిన్నతనంలోనే నాదస్వరంలో నడకలు నేర్పారు. ఆ సంగీత సమ్రాట్ నేర్పిన నడకల వల్లే నేడు శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలిగింది. మతాలకు అతీతంగా వెంకన్నసేవలో తరిస్తున్నాం. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. ఇది పూర్వజన్మసుకృతం. ’’
- షేక్ ఖాసిం, షేక్ బాబు, నాదస్వర విద్వాంసులు, అన్నదమ్ములు

వారి సేవ అనిర్వచనీయం
పద్మశ్రీ షేక్ చినమౌలానా మనమలు షేక్ ఖాసిం, షేక్ బాబు సేవ అనిర్వచనీయం. స్వామివారి ఉత్సవాల్లో విధిగా పాల్గొని తమ జ్ఞానవిద్య, సంగీత విద్యను స్వామికి సేవా రూపంలో అందిస్తూ కొలుస్తున్నారు. ఆ  కుటుంబంపై స్వామి వారి కృప ఎల్లవేళలా ఉంటుంది.
- డాక్టర్ కేవీ రమణాచారి, టీటీడీ పూర్వపు ఈవో

షేక్ హుస్సేన్ అనే భక్తుడు భక్తిశ్రద్ధలతో సమర్పించిన 108 బంగారు పుష్పాలతోనే ప్రతి మంగళవారం గర్భాలయంలోని మూలమూర్తికి అష్టదళ పాద పద్మారాధన, ప్రత్యేక వారపు సేవ చేస్తుండటం విశేషం.



లడ్డూ మాధుర్యానికి 75 ఏళ్లు

లడ్డూ మాధుర్యానికి 75 ఏళ్లు
అమృత పదార్థంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న  తిరుమల వెంకన్న లడ్డూ అమృతోత్సవాన్ని పూర్తి చేసుకుంది. మాధుర్యంలో సాటిలేని లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికీ, ఆయన భక్తజనకోటికీ కూడా ప్రీతిపాత్రమైనది.

1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించిన ట్టు చారిత్రక ఆధారం. అప్పటినుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారట. తొలుత పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర. అప్పట్లోనే శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ  సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.

ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాదు. దాంతో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది.

1940 నుంచే భక్తుల చేతికి లడ్డూ
1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచారు. 1940 నుంచి బూందీని లడ్డూగా మార్చి భక్తులకు అందజేయటం ప్రారంభించారు. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అనే పేరుతో పిలుస్తారు. 1950లో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఈ దిట్టం పరిమాణాలను ఖరారు చేసింది. ఆలయ అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు.

ఒక లడ్డూ తయారీకి...
భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీకి టీటీడీ రూ.30 దాకా ఖర్చుపెడుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా 2015లో లెక్కలు వేశారు. ఇందులో భాగంగానే ఆలయ పోటులో  దిట్టం ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకు వినియోగిస్తారు. ఇందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తారు. ఆలయంలో నిత్యం 900 కేజీల ఆవునెయ్యి లడ్డూల తయారీకే వాడతారు. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు దక్కించుకోవటంలో 2009లో అప్పటి ఈవో కేవీ రమణాచారి కృషి చేశారు.

రాయితీలడ్డూలపై రూ.60 కోట్లు
భక్తుల కానుకలతో ధార్మిక సంస్థ మనుగడ సాగిస్తోంది. అదే భక్తులకు అందజేసే ఉచిత, రాయితీ ధరలతో ఇచ్చే   లడ్డూల వల్ల ఏటా రూ.60 కోట్ల వ్యయాన్ని టీటీడీ భరిస్తోంది. నాలుగేళ్లకు ముందు సర్వదర్శనం, కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులు, అంగప్రదక్షిణం, వికలాంగులు, వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చే తల్లిదండ్రులు, శ్రీవారి సేవకులకు రూ.10 రాయితీ ధరతో రూ.20కి రెండు లడ్డూల చొప్పున అందిస్తున్నారు. ఇలా ఏటా సుమారుగా రూ.40 కోట్ల వరకు అదనంగా టీటీడీ ఖర్చు చేస్తోంది. ఇక సర్వదర్శనం, కాలిబాట దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందిస్తుండటం వల్ల మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది.       

లడ్డూ తయారీకి రోజుకు 900 కిలోల ఆవునెయ్యి వాడతారు. ఆవునెయ్యిని ఆలయం వెలుపల ఉన్న ఎనిమిది భారీ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. పైపులైను ద్వారా నెయ్యిని ఈ ట్యాంకుల నుంచి పోటుకు సరఫరా చేస్తారు. ఇవి చాలకపోవడం వల్ల మరికొన్ని ట్యాంకులు సిద్ధం చేశారు.

భక్తుల కురులూ సిరులే!

భక్తుల కురులూ సిరులే!
వెంకన్నకు భక్తులు సమర్పించే వెంట్రుకలతో విదేశీ వాణిజ్యమా? అనిఆశ్చర్యపోకండి. ఇది నిజం.. సాక్షాత్తు వెంకన్న సన్నిధిలో నిత్యం భక్తులు సమర్పించే తలనీలాలు టీటీడీకి ఏటా సుమారు రూ.200 కోట్లకుపైగా విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నాయి. అనాదిగా వస్తున్న తలనీలాల మొక్కుల ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలోనూ భక్తకోటి బ్రహ్మరథం పడుతున్నారు.

పురాణాల్లో తలనీలాల మొక్కుల ప్రస్తావన
* తీర్థక్షేత్రాల్లో విధిగా తలనీలాల మొక్కులు చెల్లించుకోవాలని పద్మ పురాణం చెబుతోంది. తలనీలాలు సమర్పించుకోవడం ద్వారా తెలిసో తెలియకో చేసిన కర్మలన్నీ తొలగి పోతాయి. మనిషిలో స్వతహాగా ఉండే అహం తొలగి సన్మార్గంలో నడిచేందుకు తలనీలాల మొక్కులు దోహద పడతాయి. అందుకే పిల్లల పుట్టువెంట్రుకల్ని పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల్లోనే తీయిస్తారు.
* 1803కు ముందునుండే తిరుమలలో తలనీలాలు తీసే ఆచారం ఉండేది. చంటిబిడ్డలు, వృద్ధులు  స్త్రీ- పురుష లింగ భేదం లేకుండా స్వామికి తలనీలాల మొక్కులు చెల్లిస్తారు.

ఏడాదిలో 1.16 కోట్ల మంది...
* ప్రపంచంలోనే అతిపెద్ద క్షౌరశాలగా ప్రసిద్ధి పొందిన తిరుమలలో రెండు ప్రధాన కల్యాణ కట్టలతోపాటు కాటేజీలు, అతిథి గృహాలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద మరో 9 చిన్న కల్యాణకట్టలు ఉన్నాయి.

* సాధారణ రోజుల్లో 30 వేలు, రద్దీ రోజుల్లో 60 వేలు పైబడి భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. ఇలా నెలకు సరాసరి 9.7 లక్షలు, ఏడాదికి 1.15 కోట్ల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 13వతేదిన రికార్డు స్థాయిలో 73వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించటం విశేషం. ఇలా ఏటా టీటీడీకి సుమారు 360 టన్నుల వెంట్రుకలు సమకూరుతున్నాయి.
* తిరుమలతోపాటు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పరిధిలో టీటీడీ కల్యాణ కట్టలు పనిచేస్తున్నాయి. ఇక్కడ రోజూవారీగా సుమారు 300 మంది తలనీలాలు సమర్పిస్తున్నారు.

తలనీలాల సేకరణ ఇలా...
గుండు కొట్టే సమయంలోనే వెంట్రుకల నాణ్యతను క్షురకులు గుర్తిస్తారు. గుండు కొట్టించుకునేందుకు స్త్రీలు వస్తే వారి జుట్టును ముడి వేస్తారు. కార్యక్రమం పూర్తయినతర్వాత భక్తుల చేతనే ఆ వెంట్రుకల్ని హుండీలో వేయిస్తారు. మిగిలినవాటిని కూడా మరోహుండీలో వేస్తారు. తర్వాత వాటిని తిరుమలలోనే ప్రధాన కల్యాణకట్టపై ఉండే గిడ్డంగులకు తరలిస్తారు. అక్కడ వెంట్రుకల్లో తేమ లేకుండా ఆరబెడతారు. తర్వాత రంగు, పొడవు, నాణ్యత లెక్కన ఆరు రకాలుగా విభజిస్తారు.

ఈ-వేలంతో పెరిగిన ఆదాయం
* 1933లో టీటీడీ ఏర్పడక  ముందు ఆలయ నిర్వాహకులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా కల్యాణకట్టలను నిర్వహించేవారు.
* తర్వాత 1985, ఏప్రిల్ 6న తలనీలాల కోసం టీటీడీ అధికారికం గా కల్యాణకట్టలు ప్రారంభించింది. ఈ సందర్భంగా సమకూరే తలనీలాలను సాధారణ టెండర్ ప్రక్రియలో విక్రయించే వారు. దీనిద్వారా టీటీడీకి ఆదాయం అంతగా వచ్చేది కాదు. దాంతో 2011లో అప్పటి టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పారదర్శకంగా అంతర్జాతీయ స్థాయిలో తలనీలాలు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన మెటీరియల్ ట్రేడ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్‌టీసీ)తో సంప్రదింపులు జరిపారు.

రూ.810 కోట్ల విదేశీ మారకద్రవ్యం
తొలిసారిగా సెప్టెంబరు 22, 2011  టీటీడీ ఈ-వేలంలో తలనీలాలు విక్రయించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెల మొదటి గురువారం  ఈ-వేలం ప్రక్రియలో వెంట్రుకలను విక్రయిస్తున్నారు. 2015 ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు మొత్తం 15 విడతల ఈ వేలం ద్వారా టీటీడీకి రూ.810 కోట్లు ఆదాయం సమకూరింది.

తమిళులే టాప్!
తిరుమలేశునికి తలనీలాల మొక్కు చెల్లించే విషయంలో పక్కనే ఉన్న తమిళనాడు వాసులే టాప్‌గా నిలుస్తున్నారు. రెండోస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలు, తర్వాత వరుసగా కర్ణాటక, మహారాష్ర్ట (నాండేడ్, శిరిడీ) భక్తులు అధికంగా వస్తూ స్వామికి తలనీలాల మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాజ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని భక్తులు అధికంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్నా వారిలో తలనీలాలు సమర్పించే భక్తులు తక్కువనే చెప్పవచ్చు.

విశ్వ విపణిలో వెంట్రుకలతో వాణిజ్యం
* వెంట్రుకలు ప్రధానంగా వ్యవసాయం, మందుల తయారీ, నిర్మాణ రంగం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో వాడతారు. ఇక ఫ్యాషన్ ప్రపంచంలో రారాజుగా వెంట్రుకల్ని డిజైన్లు, కాస్మొటిక్స్‌లో వినియోగిస్తున్నారు. ఫ్యాషన్ డిజైన్లలో సాటిలేని దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్‌తోపాటు నైజీరియా వంటి చిన్న దేశాలు కూడా వెంట్రుకలు కొనుగోలు చేసే దేశాల్లో ముందు వరుసలో ఉన్నాయి.

చారిత్రక నేపథ్యం
* క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల కాలంలోనే ఈజిప్టులో నాటక రంగాల్లో వెంట్రుకలతో తయారు చేసిన విగ్గులు వాడినట్టు చరిత్ర. ఆనాడు వాడిన విగ్గులు నేటికీ చెక్కు చెదరకపోవటం వెంట్రుకల నాణ్యత, వాటిలోని ఔషధగుణాలకు నిదర్శనమని తెలుస్తోంది.

వ్యవసాయ రంగంలో...
* వెంట్రుకలు భూమిలో కలసి పోవటం వల్ల రసాయనిక వాయువులైన కార్బన్, నైట్రోజన్, సల్ఫర్‌తోపాటు టాక్సిక్ వాయువులైన అమ్మోలియా, కార్బన్ సల్ఫేట్, హైడ్రోజన్ సల్ఫేట్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువుల విడుదలకు కారణమవుతుంది.
* బయో డీగ్రేడబుల్ వస్తువుగా, వర్మీ కంపోస్టుగా వాడటానికి వెంట్రుకలు చాలా ఉపయోగం. పొట్టిరకం, ముడి రకానికి సంబంధించిన వెంట్రుకలతో ఎరువులు తయారు చేస్తారు.
* జంతువుల పేడలో నైట్రోజన్ 0.2 శాతం మాత్రమే ఉండగా, మనుషుల వెంట్రుకల్లో మాత్రం అత్యధికంగా 16 శాతం నైట్రోజన్ ఉంటుంది. దాంతోపాటు సల్ఫర్, కార్బన్, చెట్లు ఎదగడానికి దోహదపడే మరో 20 రకాల పోషక పదార్థాలుంటాయి.

వెంట్రుకల ఎరువుతో అధిక దిగుబడి
* చైనా వ్యవ సాయంలో జంతువుల పేడతోపాటు వెంట్రుకల్ని కూడా కలిపి వాడటం వల్ల ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి సాధించారు. ఒక్కసారి వెంట్రుకల ఎరువు వేస్తే కనీసం మూడేళ్లపాటు ఇతర ఎరువుల అవసరం లేకుండానే పంటలు పండించి మంచి దిగుబడి సాధించవచ్చని చైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిరూపించారు.
* పెట్రోల్ బావులు, చమురు శుద్ధి కర్మాగారాల్లో వాడకం
* వెంట్రుకలకు ఉండే పటిష్టత, మన్నిక దృష్ట్యా వాటితో తయారు చేసిన పరికరాలనే పెట్రోల్ బావుల్లోనూ, చమురు శుద్ధి కర్మాగారాల్లోనూ వాడతుంటారు. నూనె శుద్ధిచేయడానికి ఫిల్టర్‌గా వాడతారు. నీటిని శుభ్రం చేసే పరిశ్రమల్లోనూ వాడతారు.
* అంతరిక్ష పరిశోధనలకు వాడే క్రయోజెనిక్ ఇంజన్లలో ఇంక్యులేషన్ (పైపొర)గా వాడతారు. గ్లాస్ ఫైబర్ కంపోజిట్ కంటే వెంట్రుకలతో తయారు చేసిన ఇంక్యులేషన్ చాలా చవకగాను, మన్నికగా ఉండటం వల్ల క్రయోజనిక్ ఇంజన్ల విడిభాగాల్లో వాడుతుంటారు.
* అమెరికా, ఫిలిఫైన్స్ వంటి దేశాల్లో నూనె కర్మాగారాల్లో వెంట్రుకలతో తయారు చేసిన పరికరాలనే వాడతారు. మన్నికతోపాటు నూనె పీల్చే గుణం లేకపోవటం, ఫినాల్, పాదరసం, రాగి, కాడ్మియం, వెండి వంటి రసాయన పదార్థాలను ఒడిసి పట్టుకునే గుణం కూడా ఉండటమే ఇందుకు కారణం.

కీలకమైనా ఫార్మా పరిశ్రమల్లోనూ...
* వెంట్రుకల్లో 20 రకాల పోషక విలువల గల అమినో ఆమ్లాలు ఉన్నాయి. సిస్టైన్, లిజైన్, ఇసోలిసిన్, వాలిన్ మొదలగు పోషకాలున్నాయి. హైడ్రాలసిస్ పద్దతి ద్వారా వెలికి తీయవచ్చు.
* ఈ సిస్టైన్ పోషకాన్ని కాస్మొటిక్స్, ఫార్మారంగాల్లో (మందుల తయారీ) ప్రధానంగా గాయాలు మాన్పడానికి  యాంటీసెప్టిక్‌గా వాడతారు.
* చత్తీస్‌ఘడ్‌లో గాయాలకు వెంట్రుకలతో కాల్చిన బూడిదను ఔషదంగా వాడతారు. తద్వారా శాశ్వతంగా గాయం మానటం, రక్తస్రావాన్ని నిలిపివేయటం జరుగుతుంది.
* సర్జరీలో కుట్లు వేయడానికి మానవ శరీరానికి బాగా సూట్ అవుతుంది. ఎలాంటి ప్రతిచర్యలు ఉండవు, మన్నికతోపాటు ముడి వేయడానికి అనుకూలత ఉన్న కారణంగా వైద్యరంగంలో విరివిగా వాడతారు.
* పశువుల రక్తస్రావాన్ని నిరోధించటంలోనూ, మూత్ర విసర్జన సమస్యల పరిష్కారంలోనూ వాడతారు.
* శతాబ్దాల కిందట యూరప్ దేశాల్లో సూక్ష్మసర్జరీల్లో కూడా, చాలా సున్నితమైన వాటిల్లో కూడా వెంట్రుకల వాడకం ఉంది.
* కణ ఉత్పత్తి, ప్రొటీన్, కెరాటిన్ ఉత్పత్తి మొదలగు జీవ ఉత్పత్తులు తయారు చేయడానికి కణ పునరుజ్జీవనా నికి, వెంట్రుకలతో తయారు చేసిన ప్రొటీన్‌నే ఉపయోగిస్తారు.
* ఆసియా ఖండం వారి వెంట్రుకలు నల్లగా ఉండటం వల్ల సిస్టైన్ ఆమ్లం సమృద్ధిగా లభిస్తుంది.
* హైడ్రాలసిస్ అనే ప్రక్రియ ద్వారా కెరాటిన్ అనే ప్రొటీన్‌ను వెంట్రుకల నుంచి తయారు చేయవచ్చు.

వివిధ దేశాల్లో ...
* మారిషస్‌లో ఎలుకల నివారణకు, అమెరికాలో జింకల కట్టడికి, ఇండియాలో ఎలుగుబంట్ల నివారణకు వెంట్రుకలతో చేసిన వస్తువులు వాడుతుంటారు.
* విగ్గులు, జుత్తు అతికించే ఫ్యాషన్ పరిశ్రమల్లోనూ ...
* వెంట్రుకలతో విగ్గుల తయారీ పరిశ్రమ, జుత్తు అతికించే పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
* 1970 కాలంలో సింథటిక్ ఫైబర్‌తో తయారు చేసిన విగ్గులను ప్రత్యామ్నాయంగా వాడారు. కానీ, నాణ్యత, మన్నిక, సహజత్వం దృష్ట్యా తర్వాత కాలంలో వెంట్రుకలే విగ్గులుగా వాడతారు.
* చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, ఇటలీ వంటి దేశాలు విగ్గులు ఎగుమతి చేస్తాయి  అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, కొరియా దేశాల్లో విగ్గులు అధికంగా కొనుగోలు చేస్తారు.
* మనదేశంలోని ఢిల్లీ నగరంలో జ్యాలాపురి పరిశ్రమ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. దేశంలో ఇదే అతిపెద్ద వెంట్రుకల పరిశ్రమ. పర్యావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతంలోకి తరలించారు.
* పొడవు వెంట్రుకలతో కాస్మొటిక్స్ (విగ్గులు, జుత్తు అతికించే వస్తువులు), దారాలు అల్లుతారు.
* 2010 సంవత్సరంలో భారత దేశం ఒక మిలియన్ కిలోల తలనీలాలు ఎగుమతి చేసి రూ.238 మిలియన్ డాలర్లు సంపాదించింది.
* వెంట్రుకల్లో ‘రెమి’ అనేరకం నాణ్యైమైంది. దాని రంగు, మన్నిక, తత్వం వంటి గుణాల కారణంగా రెమీ వెంట్రుకలకు డిమాండ్ ఎక్కువ. పరిశోధకులు, వివిధ హెయిర్ డై పరిశ్రమలలో కాస్మొటిక్ బ్రష్‌లు తయారు చేయడానికి ఇదే రకం వెంట్రుకలే వాడుతుంటారు.

నిర్దిష్ట విధానాల అమలుతోనే ఆదాయం
* తలనీలాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉందని గుర్తించాము. అందుకు తగ్గట్టుగా టెండర్ విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ టెండర్ విధానాన్ని మార్పు చేశాం. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ ద్వారా వెంట్రుకల అమ్మకానికి ఈ-వేలం విధానాన్ని అమలు చేశాం. ఈ- వేలంలో అమ్ముడైన వెంట్రుకల్ని అప్పగించేంతవరకు ప్రత్యేక జాగ్రత్తలు అమలు చేశాం. గతంలో ఏటా రూ.40 కోట్లు వచ్చే ఆదాయం పారదర్శకత అమలు చేయటం వల్ల రూ.240 కోట్లు దాటింది. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది.
  - కేఎస్ శ్రీనివాసరాజు, జేఈవో, తిరుమల

భక్తకోటికి బోలెడంత భద్రత
* ఒళ్లు తెలియని భక్తిపారవశ్యంతో దూరాభారమూ, వ్యయప్రయాసలూ అలుపూసొలుపూ వేళాపాళా ఎరుగకుండా నిత్యం పరవళ్లు తొక్కుతుండే భక్తజనానికి టీటీడీ విజిలెన్స్, పోలీసు బలగాలు భద్రతను కల్పించాయి. భక్తులు ఎలాంటి చీకూ చింతాలేకుండా తీర్థయాత్రను పరిపూర్ణం చేసుకునే సౌలభ్యం కల్పించాయి.
* టీటీడీ ముఖ్య భద్రత, నిఘా అధికారి నేతృత్వంలో ఆలయానికి ఆర్మ్‌డ్ ఫోర్సు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు కాపలాగా పనిచేస్తాయి. మహాద్వారం నుండి ఆనంద నిలయ ప్రాకారం వరకు విజిలెన్స్ తప్ప మిగిలిన సిబ్బంది అధునాతన ఆయుధాలతో 24 గంటలూ షిఫ్టుల పద్ధతిలో పహారా కాస్తారు. ఇక ఆలయానికి నాలుగు దిశల్లోనూ గస్తీ (ఔట్‌పోస్టు)ల్లో ఉంటారు. పోలీసు ఔట్‌పోస్టులను కూడా ఆలయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేకంగా తయారు చేసారు. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద కూడా భద్రత సిబ్బంది విధుల్లో ఉంటారు.
* స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను భద్రతా సిబ్బంది వైకుంఠం నుంచి ఆలయం వరకు పలు దశల్లో తనిఖీ చేస్తారు. భక్తులు వెంట తీసుకెళ్లే చిన్న చేతిసంచులను సైతం వదలకుండా పరిశీలించేందుకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు.
* వైకుంఠం నుంచి ఆలయం వరకు అడుగడుగునా అధునాతన సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా నిఘా సిబ్బంది ఆలయంలోకి వెళ్లేవారి కదలికల్ని నిశితంగా పరికిస్తారు. ఆలయంలోకి వెళ్లే సరుకులను కూడా తనిఖీ చేసిన తర్వాతే ఆలయంలోకి తరలిస్తారు.
* ఆలయంలో విధుల్లో ఉండే భద్రతా సిబ్బంది ఆలయ సంప్రదాయాలను అనుసరించి జంతుచర్మాలతో కాకుండా నూలుదారంతో తయారు చేసిన బెల్ట్‌లు ధరిస్తారు. ఆలయ పరిసరాల్లో పాదరక్షలు ధరించరు. అశుభ కార్యాలు జరిగిన సందర్భాల్లో ఆలయంలో విధినిర్వహణకు వెళ్లరు.
* సాధారణ పోలీసు విభాగాలు, నేర పరిశోధన విభాగాలు, నిఘా, భద్రతా విభాగాలు కూడా భక్తులకు, ఆలయానికి అదనంగా భద్రత కల్పిస్తాయి.
* ఇక దేశంలో ఉగ్రవాద చర్యల నేపథ్యంలో సుమారు 40 మంది మెరికల్లాంటి యువ కమాండోల అక్టోపస్ దళం ఎల్లప్పుడూ ఆలయాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. వీరంతా సాధారణ దుస్తుల్లో భక్తుల మధ్య సంచరిస్తుంటారు.
* తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలను, ప్రయాణీకులను, లగేజీని తనిఖీ చేసేందుకు తిరుపతిలోని అలిపిరి, తిరుమలలోని గరుడాద్రినగర్ తనిఖీ కేంద్రాల్లోనూ, అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో వచ్చే దారుల్లోనూ తనిఖీ వ్యవస్థ ఉంది. కాలిబాటల్లో 24 గంటలూ పనిచేసే గూర్ఖా వ్యవస్థ కూడా ఉంది.
* ఇక బ్రహ్మోత్సవాల సమయంలో సాధారణ బలగాలతోపాటు జాతీయ విపత్తుల నివారణ సంస్థ తరపు సిబ్బంది కూడా తమవంతు సేవలందిస్తారు.


నేటి జీవన వేదం

నేటి జీవన వేదం
వేద వ్యాప్తికి తిరుమలలోని వేద విజ్ఞానపీఠం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.  వేద ధర్మాలు కొనసాగించటం, పరమాత్మ తత్వాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లటం, తిరుమల దేవాలయంలో స్వామికి జరిగే నిత్య పూజా కైంకర్యాలు, ఉత్సవాదులు విశేషంగా నిర్వహించేందుకు, వేదభూమిలో భవిష్యత్ పండిత అవసరాలు తీర్చటమే లక్ష్యంగా వేద పాఠశాల కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం వేద విద్యార్థుల జీవనానికి సంపూర్ణ భరోసా ఇస్తోంది. అందులో భాగంగా వేదపాఠశాలలో విద్యార్థిగా రికార్డుల్లో నమోదు చేసుకున్న రోజునే 12 ఏళ్ల కోర్సు చేసే వేదవిద్యార్థికి రూ.3 లక్షలు టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చే స్తుంది. 2007 ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలోని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్సు పూర్తి అయ్యేనాటికి ఆ విద్యార్థికి సుమారు రూ.9 లక్షల దాకా అందుతోంది. ఇక ఎనిమిదేళ్ల కోర్సులో భాగంగా ఆగమ- స్మార్త- ప్రబంధ విద్యార్థులకు రూ. లక్ష డిపాజిట్ చేసి, కోర్సు పూర్తి కాగానే వడ్డీతో కలిపి ఆ విద్యార్థులకు అందజేస్తారు.

వేదం: ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం (తైత్తిరీయశాఖ), కృష్ణ యజుర్వేదం (మైత్రాయణి శాఖ), సామవేదం (కౌధమ శాఖ, జైమినిశాఖ), అధర్వణ వేదం. ఏడేళ్లు, పన్నెండేళ్ల వేద విద్య కోర్సుల్లో మొత్తం 300 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అడ్మిషన్ పొందాక టీటీడీ విద్యార్థిపేరుతో రూ.3 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది.  ఏడేళ్ల కోర్సుతో రూ.6 లక్షలు, పన్నెండేళ్ల కోర్సు తర్వాత రూ.9 లక్షల నగదు అందిస్తోంది.

దివ్యప్రబంధం: ఈ విభాగంలో  మొత్తం 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఎనిమిదేళ్ల కోర్సులో చేరే విద్యార్థిపేరుతో  రూ.లక్ష డిపాజిట్ చేసి, పూర్తయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు.

ఆగమాలు: వైఖానస, పాంచరాత్ర, చాత్తాద శ్రీవైష్ణవ , శైవ, తంత్రసారాగమా ల్లో మొత్తం 300 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కోర్సుల్లో చేరే విద్యార్థి పేరుతో రూ.లక్ష డిపాజిట్ చేసి కోర్సు పూర్తి అయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు.

స్మార్తం: ఋగ్వేద, శుక్ల యజుర్వేద, కృష్ణయజుర్వేద, వైఖానస స్మార్త కోర్సుల్లో  300 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కోర్సులో చేరే విద్యార్థి పేరుతో లక్ష డిపాజిట్ చేసి కోర్సు పూర్తయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు.

వేద విద్యార్థులకు ఇతర సౌకర్యాలు
ఏడాదిలో నాలుగు జతల వస్త్రాలు, పుస్తకాలు, చాపలు, శాలువ, భోజనం పళ్లెం, గ్లాసు ఇస్తారు. ప్రతి నె లా సబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరినూనె, విద్యా, వైజ్ఞానిక యాత్రలు, దేవాలయాల సందర్శనకు తీసుకెళతారు. ధనుర్మాసం, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో స్వామి దర్శనం, విద్యార్థి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తీసుకెళతారు. పాఠశాలల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బాట్మెంటన్  క్రీడాంశాలల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

తిరుమల ఆలయంలో  నిర్వహించే నిత్య ఉత్సవాల తరహాలో విద్యార్థుల చేతుల మీదుగా  మాదిరి ఉత్సవాలు నిర్వహిస్తారు. టీటీడీ వేద పాఠశాలల్లో  వివిధ విభాగాల  కోర్సులు  పూర్తి చేసిన 90 శాతం విద్యార్థులు టీటీడీ పరిధిలోనే స్థిరపడి ఉపాధి పొందుతున్నారు.  మిగిలినవారు దేశ విదేశాల్లోని ప్రముఖ ఆలయాల్లో అర్చకులు, పండితులుగా జీవనం సాగిస్తున్నారు.

1884 నుంచి 2015 వరకు అంటే 131 ఏళ్లలో టీటీడీ వేద పాఠశాలల ద్వారా కోర్సులు పూర్తిచేసి సుమారు 20 వేల మంది వేద పండితులు, అర్చకులు, పౌరోహితులుగా ఉపాధి పొందుతున్నట్టు టీటీడీ రికార్డుల ద్వారా తెలుస్తోంది. మరికొందరు విదేశాల్లో అర్చకవృత్తిని కొనసాగిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు.

నేటి పెద్ద జీయరైన గోవింద రామానుజ జీయర్ స్వామి నాటి వేద పాఠశాల విద్యార్థే. శ్రీవారి కైంక ర్య బాధ్యతలు పర్యవేక్షించే ప్రస్తుత ఆలయ పెద్ద జీయరు, మూడేళ్ల క్రితం పరమపదించిన శ్రీరంగ రామానుజ జీయరు స్వామివారు కూడా వేదపాఠశాల విద్యార్థులే! ఇదే తరహాలో ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరెందరో విద్యార్థులు అత్యున్నత స్థానాల్లో ఉండటం విశేషం.

ఒకే గొడుగు కిందకు టీటీడీ సేవలు

కోర్కెలు తీర్చే కొండలరాయునికి భక్తిశ్రద్ధలతో సామాన్య భక్తులు సమర్పించే ముడుపులతోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ముందుకు సాగుతోంది. అలాంటి ధార్మిక సంస్థలో పారదర్శక పాలనతోపాటు అన్ని విభాగాల సేవల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సామాన్య భక్తులకు మరింత చేరువ కావాలని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు సంకల్పించారు. కొత్తవాటికి, వివాదాంశాల జోలికెళ్లకుండా ఉన్నవాటిని మరింత లోతుగా అధ్యయనం చేసి లోపాలను సవరించి కొత్త జవసత్వాలతో ముందుకు నడిపించాలని భావిస్తున్న టీటీడీ ఈవో ‘సాక్షి ఫన్‌డే’తో పంచుకున్న మనోభావాలివి...
 
టీటీడీ ఈవోగా బ్రహ్మోత్సవాల బాధ్యత తీసుకోవడంపై ఎలాంటి అనుభూతి ఉంది?  
దేవదేవుని సన్నిధిలో వీఐపీ, సామాన్యుడు అన్న తేడా ఉండదు. దేవుని ముందు అందరూ సమానమే. ధార్మిక సంస్థ టీటీడీ కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సామాన్యుడే మాన్యుడు అన్న లక్ష్యంతో సాగిపోతున్నాం. బ్రహ్మోత్సవాల్లో  సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదేవుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించే బాధ్యత రావటం అదృష్టంగా భావిస్తున్నా. ఆ అనుభూతి చెప్పలేనిది. అంతకంటే బాధ్యతతో పనిచేయాలని సంకల్పించాము.

ధార్మిక సంస్థలోని వివిధ విభాగాల సేవల్ని భక్తులకు ఎలా చేరవేయబో తున్నారు?
టీటీడీలో అనేక విభాగాలున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా భక్తులకు సేవ చేస్తుంటాయి, మరికొన్ని పరోక్షంగా సేవలందిస్తాయి. వీటిలో కొన్ని భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే, మరికొన్ని ధర్మప్రచారం ద్వారా స్వామి వైభవ ప్రాశస్త్యాన్ని చాటటం, మానవ సంబంధాలు- నైతిక విలువలు పెంపొందించటం ద్వారా యువతను ధార్మికత దిశగా తీసుకెళుతుంటాయి.

రిసెప్షన్, ఆలయం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, ధర్మప్రచారంలో భాగంగా శ్రీనివాసకల్యాణోత్సవాలు, శుభప్రదం, మనగుడి, వైభవోత్సవాలు, సప్తగిరి మాసపత్రిక, శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్  వంటి ఎన్నెన్నో విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఇలా అన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భక్తుడి కేంద్రంగా సేవలందించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. అన్ని విభాగాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే భక్తుడికి టీటీడీ సేవలు సత్వరంగా లభిస్తాయి.

ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలుతో ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం చక్కగా అమలు చేస్తున్నాం. భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. గతంలో భక్తుల మధ్య ఉండే తోపులాటలు తగ్గాయి. గతంలో కంటే స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 5నుండి 10 శాతం వరకు పెరిగింది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాం. హుండీ కానుకలు కూడా 10 శాతం వరకు పెరగటం శుభపరిణామం.

రూ.300 టికెట్లు, రూ.50 సుదర్శనం వంటి ఆన్‌లైన్ దర్శనాలు ఎలా అమలవుతున్నాయి?
రూ.300 టికెట్ల ఆన్‌లైన్ దర్శనాలు సజావుగా అమలవుతున్నాయి. రోజుకు 26వేలు రూ.300 టికెట్లు, మరో 4వేల వరకు రూ.50 సుదర్శనం టికెట్లు కేటాయిస్తున్నాం. భక్తుల నుంచి స్పందన విశేషంగా ఉంది. ఆ టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు  వచ్చినట్టుగాను, తిరిగి  వెళ్లినట్టుగాను తెలియటం లేదంటే ఎంత సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్నాయో ఇక చెప్పనక్కరలేదు.  దీనివల్ల సిఫారసు దర్శనాల సంఖ్య  కూడా క్రమంగా తగ్గుతోంది.

లడ్డూ నాణ్యత, రుచి విషయంలో స్వామి భక్తులు కొంత ఆవేదనతో ఉన్నారు? దిట్టాన్ని సవరించి భక్తుల కోర్కె తీరుస్తారా?
స్వామి దర్శనం తర్వాత అంత ప్రాధాన్యత లడ్డూకు ఉంది. నాణ్యత, రుచికరమైన లడ్డూలు శుచిగా తయారికీ కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి, చక్కెర, ఇతర పప్పు దినుసులన్నీ కూడా నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు కలిగిన వాటినే వినియోగిస్తున్నాం. రోజూ 3 లక్షలకు తగ్గకుండా లడ్డూలు తయారు చేస్తున్నాం. భక్తులు వేచి ఉండే కంపార్ట్‌మెంట్లలోనే లడ్డూ టోకెన్లు పొందే సౌకర్యం కల్పించాం.

భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు మీరు ఏమి చేయదలిచారు?
ఆలయ నిర్వహణాంశాల్లో వివాదాల జోలికి వెళ్లము. ఉన్న వాటిని ఎలా అభివృద్ధి చేయాలో ఆ దిశగా యోచన చేస్తాం. దేనికైనా సమయం వచ్చినప్పుడు అది తప్పక జరుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుంది. భవిష్యత్‌లో మార్పులు మాత్రం తప్పవు.

పరిపాలన సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా?
పాలనలో సంస్కరణల కంటే ఉన్నవాటిని మెరుగుపరచటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆయా విభాగాల్లో అమలు చేసేవాటిలోనే నిర్దిష్ట విధానాలను ప్రవేశ పెట్టాము. బస, కల్యాణకట్ట, అన్నప్రసాదం వంటి విభాగాలను సులభతరం చేయటం వల్ల భక్తులకు మరింత చేరువయ్యాయి. రిసెప్షన్ విభాగాల్లో గదుల వేకెన్సీ రిజర్వు తగ్గించాం. గదుల కేటాయింపుల్లో పారదర్శక విధానాల వల్ల ఆక్యుపెన్సీ  110 శాతానికి పెరిగింది. గదుల అద్దె ఆదాయం కూడా మరో 13 శాతం వరకు పెరిగింది. కల్యాణ కట్టల్లోనూ 15 నుండి 20 శాతం భక్తులు అధికంగా తలనీలాలు సమర్పించే అవకాశాలు పెరిగాయి.

వేయికాళ్ల మండపాన్ని ఎలా నిర్మించబోతున్నారు?  
చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నిర్మించాలని సంకల్పించాం. దేవదేవుని ఉత్సవాలకు అనువుగా చారిత్రక, ఆధ్యాత్మిక, ధార్మికత ఉట్టిపడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయానికి నైరుతి దిశలో నారాయణగిరి ఉద్యాననవంలో నిర్మిస్తాం. భక్తులు మండపాన్ని దర్శించేలా పూర్వవైభవాన్ని పునరుజ్జీవింప చేస్తాం.

టీటీడీ ఈవోగా మీ ప్రాధాన్యతాంశాలేమిటి?
స్వామిదర్శనం కోసం తిరుమల కొండమీద కొచ్చిన సామాన్య భక్తుడి నుంచి వీఐపీ వరకు ఉపయోగించుకునే విధంగా యాత్రిసదన్లు అభివృద్ధి చేయటమే నా తొలి ప్రాధాన్యత. ఒకేచోట అనువైన మరుగుదొడ్లు, స్నానపు గదులు, లాకర్లు, తలనీలాలు సమర్పించే సౌకర్యాలు కల్పించాలి. నాల్గు యాత్రిసదన్‌లను అభివృద్ధి చేస్తే గదులు కోరుకునే భక్తులు తగ్గుతారు. రూ.300 టికెట్లు పొందిన భక్తులు యాత్రిసదన్‌లు ఉపయోగించుకునే విధంగా వందశాతం పరిశుభ్రతతో అభివృద్ధి చేస్తాం.

తిరుమలలో నీటి ఇబ్బందులు న్నాయి. వాటిని తగ్గించేందుకు చర్యలు చేపడతాం. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతినీటి బొట్టును వినియోగించుకునేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వర్షపు నీటిని తిరిగి వాడుకునే విధంగా హార్వెస్టింగ్ చేయాలని భావిస్తున్నాం. గోగర్భం డ్యాము కింద అదనంగా చెక్ డ్యాము నిర్మిస్తాం. వాటర్‌ను ట్రీట్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తాం. అది పూర్తయితే సుమారు నాలుగు నెలలపాటు అదనంగా నీరు లభించే అవకాశం ఉంది.

ఇక పవర్ విషయానికి వస్తే ఎల్‌ఈడీ బల్బుల వినియోగానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల అలంకరణలతోపాటు సాధారణ రోజుల్లోనూ ఎల్‌ఈడీ లైట్లనే వినియోగిస్తాం. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు పర్యావరణానికి  మేలు జరుగుతుంది. సోలార్ విద్యుత్  వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

రెండు బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి?
అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఒకటి వార్షిక, మరొకటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. రెండింటినీ అంగరంగవైభవంగా నిర్వహిస్తాం. ఏలోటూ రానివ్వం.
* బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారికి ప్రయాణం, బస, కల్పిస్తాం. ఆలయంలో మూలవిరాట్టు దర్శనంతోపాటు ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తాం. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి.
* ప్రత్యేకించి గరుడ వాహనం, చక్రస్నానంపై ఎక్కువ దృష్టిపెట్టాం. గరుడ వాహనంపై మలయప్పస్వామిని దర్శించేందుకు వచ్చే అశేష జనవాహిని సంతృప్తిగా స్వామిని దర్శించే ఏర్పాట్లు చేశాం. వాహనాన్ని బాగా రద్దీ ఉండే ప్రాంతాల్లో తిప్పుతూ భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తాం.
* టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఆర్టీసీ విభాగాల మధ్య సమన్వయం పెంచాం. అందరికీ బాధ్యతలు అప్పగించాం. అమలయ్యేలా ప్రత్యేక ఆదేశాలిచ్చాం.  అందరూ ఒకే మాటమీద ఉంటూ అన్నీ విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాం.
* ఆలయ నాలుగు మాడ వీధుల్లో అన్నప్రసాదం, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.  వాహన సేవను శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలు  చేస్తాము. అధునాతన కెమెరాలు వినియోగిస్తాం. వాహన సేవ విశిష్టతను తెలిపేందుకు అనుభవజ్ఞులైన వ్యాఖ్యాతలను ఏర్పాటు చేస్తాం.
* ఉత్సవాల్లో ఉత్సవమూర్తుల అలంకరణకు, వాహన సేవల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం.  శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అలంకారాల్లో ఏలోటూ రానివ్వకుండా చూసుకోవలసిందిగా సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చాం.
* భక్తులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అందుకోసం అనుభవ జ్ఞులైన కళాకారుల్ని ఎంపిక చేశాం.

నెట్టింట్లోంచే తిరుమల యాత్ర

నెట్టింట్లోంచే తిరుమల యాత్ర
తిరుమలలో నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఆధునిక, సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఇంట్లో నెట్ ఉంటే చాలు... ఆన్‌లైన్‌లోనే స్వామి దర్శనం, బస, సేవలను బుక్ చేసుకునేలా నిబంధనలు సులభతరం చేసింది.

తిరుమలలో రూ.300 టికెట్ల కేటాయింపుల్లేవు... ఆన్‌లైన్ లోనే 26వేల టికెట్లు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కేటాయింపులో మార్పు వచ్చింది. 2009 నుండి తిరుమలలోనే టికెట్లు కేటాయించేవారు. ఇటీవల పూర్తిగా రద్దు చేశారు. ఆ కోటాలో రోజు కేటాయించే  26 వేల టికెట్లను ఇంటర్నెట్ ద్వారా కేటాయిస్తున్నారు.

ఓ కుటుంబంలోని  భక్తుల్లో ఒకరు తమ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాలి. మొదటి వ్యక్తితోపాటు మిగిలినవారి పేర్లు నమోదు చేసుకోవాలి.
* అదే టికెట్టుపై ఒకరికి రెండు లడ్డూలు ఇస్తారు. అదనంగా మరో రెండు లడ్డూలు కావాలంటే దర్శన టికెట్ల బుకింగ్ సందర్భంలోనే మరో రూ.50 చెల్లించి రెండు లడ్డూ టికెట్లు తీసుకునే సదుపాయం కల్పించారు. స్వామి దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఆ టికెట్లపై భక్తులు లడ్డూలు పొందే అవకాశం ఉంది.
* ఆన్‌లైన్‌తోపాటు టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల్లోనూ, మండల పోస్టాఫీసుల్లోనూ రూ.300 దర్శన టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఇటీవల టీటీడీ ఏపీ, తెలంగాణలోని 2500 పోస్టాఫీసుల ద్వారా రోజుకు 5 వేల టికెట్ల వరకు పొందే అవకాశం కల్పించింది..
* ఈ రూ.300 టికెట్లను ప్రతిరోజూ 56 రోజులకు ముందు కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఖాళీలను బట్టి భక్తులు తమకు నచ్చిన తేదీల్లో టికెట్లు రిజర్వు చేసుకునే సౌకర్యం కల్పించారు.
* ఉదయం 9 గంటల నుంచి  సాయంత్రం 7 గంటల వరకు పది టైం స్లాట్లలో టికెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.
* ఇక ఇదే విధానంలో రూ.50 సుదర్శనం టికెట్లు రోజుకు 4 వేలు కేటాయిస్తున్నారు. వీరికి రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల్లోపు మూడు టైం స్లాట్లలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు.

సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
* శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయం తెలియజేసేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ప్రారంభంలో కల్యాణోత్సవం, ఆ తర్వాత అన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ అమలు చేసింది.

టీటీడీ ఆలయ దర్శనం కోసం...
* చిత్తూరుజిల్లా వ్యాప్తంగా టీటీడీ ఆలయాలు ఉన్నాయి. ఇందులో అనాదిగా దేవస్థానం నిర్వహించే ఆలయాలతోపాటు స్థానికంగా పూజలందుకుంటూ టీటీడీకి అప్పగించిన ఆలయాలు ఉన్నాయి. వీటి సందర్శన కోసం దేవస్థానం సొంతంగా ఏపీ టూరిజం బస్సులతో ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసింది. తక్కువ టికెట్ల ధరతో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం  వరకు సుమారు ఏడెనిమిది ఆలయాలు సంద ర్శించే అవకాశం కల్పించింది. ఆ ప్రత్యేక ప్యాకేజి టూర్ వివరాలేమిటో తెలుసుకుందాం!

తిరుపతిలోని స్థానిక ఆలయాలు
* శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు  శ్రీకోదండరామస్వామి ఆలయం, తిరుపతి  శ్రీగోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి  శ్రీకపిలేశ్వరస్వామి ఆలయం, తిరుపతి  శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురం  శ్రీఅగస్త్యేశ్వరస్వామి ఆలయం, తొండవాడ.

ప్యాకేజీ: టికెట్టు ధర రూ.100. (నాన్ ఏసీ- 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరం లేదు) బస్సు బయలుదేరే స్థలం, సమయం: శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి. ఉ. 6 నుండి మ.1 గంటల వరకు ప్రతి ఒక గంటకు.

చిత్తూరు జిల్లాలో దర్శించే ఆలయాలు
* శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, కార్వేటినగరం  శ్రీవేదనారాయణస్వామి ఆలయం, నాగలాపురం  శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం  శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట  శ్రీకరియమాణిక్యస్వామి ఆలయం, నగిరి  శ్రీఅన్నపూర్ణాసమేత కాశీవిశ్వేరస్వామి ఆలయం, బుగ్గ, కార్వేటినగరం  శ్రీవల్లికొండేశ్వర స్వామి ఆలయం, సురుటుపల్లి, నాగలాపురం

అదనపు వివరాలకు: 0877-2289120, 2289123, 09848007033

ప్యాకేజీ: టికెట్టు ధర రూ.200. (నాన్ ఏ.సీ), 300(ఏ.సీ) 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరం లేదు) బస్సు బయలుదేరే స్థలం: శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం తిరుపతి. ఉ. 8 నుండి మ. 9 గంటలకు

భక్తులు ఇలా టీటీడీ సమాచారం
తెలుసుకోవచ్చు: టీటీడీ కాల్‌సెంటర్‌లో శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 0877-22 33333, 2277777, 2264252

టీటీడీ వెబ్‌సైట్: www.tirumala.org www.tirupati.org
ఈమెయిల్:www.tirumala.org www.tirupati.org
సేవలు, వసతి ఆన్‌లైన్ బుకింగ్: www.tirumala.org www.tirupati.org

టీటీడీ దాతల విషయ వివరాల కేంద్రం: 0877-2263472
ఉచిత సేవలకు డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు  ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో (0877-2263261) ఫోన్‌చేసి నేరుగా ఈఓతో టీటీడీ పరిధిలో తమకు ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు.   

నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల విరాళం
అన్నప్రసాదాల తయారీకోసం రోజుకు టన్నుల కొద్దీ కూరగాయలు వాడతారు. వాటిలో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వంటి కూరగాయల్ని భక్తులు విరాళంగా ఇస్తే టీటీడీ అధికారులు స్వీకరిస్తారు. అదనపు వివరాలకు 0877-226458 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

దాతలకు బస, దర్శనంలో కోటా
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.1 లక్ష ఆపైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర బహుమానాలు టీటీడీ అందజేస్తోంది. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం ఫోన్:087722-63472,2263727కు సంప్రదించవచ్చు.

టీటీడీ పౌరోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే...
భారతీయ వివాహ చట్టాల ప్రకారం వధూవరులకు నిర్ణీత వయోపరిమితి ఉండాలి. వధూవరుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ప్రభుత్వం ద్వారా వచ్చిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాస్‌పోర్టు, ఓటరు కార్డు... వంటి వాటిల్లో ఫొటో గుర్తింపు కార్డు నకలును అందజేయాలి.