ఒకసారి ఏం జరిగిందంటే..
అదో పల్లెటూరు. దాన్ని ఒరుసుకుని ప్రవహించే ఓ నల్లని నది. ఆ పక్కనే కొండల వరుస. ఆకాశంలో సాయంకాలం ఎగిరి వెళ్తున్న దేవతలకి ఆ ఊరు "పక్కకి తిరిగి పడుకున్న అందమైన పడతి జడలో మెరిసే నాగరంలా" కనిపిస్తుందట. ఆ ఊరి రంగు బంగారపు రంగు.
"ఊరికి రంగేవిటా?" అనేగా మీ ప్రశ్న? ఇళ్ళకి చేరుతున్న గోవుల గిట్టలు రేపే నారింజ ధూళి చిమ్మచీకటయ్యేదాకా గాల్లో తేలుతూనే ఉంటుంది మరి! ఒకటా రెండా.. ప్రతీ ఇంటికి ఓ మంద పశువులుండాల్సిందే!
పాడీ, పంటా సమృధ్ధిగా ఉండే ఆ పల్లె పేరు "రేపల్లె".
ఆ పక్కన పారుతున్నది "యమున".
ఆ పల్లెలో వీచే గాలిలో నిత్యం తేలే ఓ దివ్య సుగంధం!
అవును మరి! వెన్న కమ్మదనం, పున్నాగ పువ్వుల ఘుమఘుమలూ, ఆ ఊరి పడుచులద్దుకునే కస్తూరీ, జవ్వాది పరిమళాలూ.. ఇవన్నీ చాలవన్నట్టు ఆ ఊరి రాజుగారింట్లోంచి సతతమూ వీచే కర్పూర వీచికలూ కలిస్తే గాలి మత్తెక్కక మానుతుందా?
ఆ ఊరి రాజుగారింట్లో కర్పూరానిది ఉప్పుతో సమానమైన వాడుక. "రాచబిడ్డ"కి వాళ్ళమ్మ దిష్టి తీసి హారతివ్వని పూట లేదు మరి!
ఎందుకా! నెమ్మదిగా అడుగుతారేం? అతను మహ అందగాడట!!
అతనిది నీలిమేఘపు రంగు.
అందమంటే అలాంటి ఇలాంటి అందం కాదు!
అందానికే మోహం కలిగి, మనసు మరిగి మతి తప్పేంత సమ్మోహనుడట! అదొక్కటేనా?
ఓ పాల నవ్వు నవ్వుతాడట! మల్లెలు చిన్నబోయేలా, వెన్నెల తెల్లబోయేలా..
అతని నవ్వు ఎంత బావుంటుందంటే, ఆ ఊరి పడుచులందరూ పాల కడవల్లో, నీళ్ళ బిందెల్లో, అద్దాల్లో, వాళ్ళ చేతుల మణి కంకణాల్లో.. ఇవన్నీ సరిపోక ఒకరి కళ్ళల్లోకి ఒకరు తమ ప్రతిబింబాన్ని చూసుకుని అతనిలా నవ్వుదామని నిత్యం సాధన చేస్తూ ఉంటారట! అయితే వాళ్ళకి ఆ నవ్వు పట్టుబడకపోవడానికి కారణమేవిటో తెలుసా! ఆ నవ్వులో వేరొకరికి చేతకాని 'ఓ చిన్న తుంటరితనం' ఉంటుంది. తుంటరితనం అతనికి కట్టుబానిస! అతను చేసే పనుల్లో, పలికే పలుకుల్లో, నవ్వే నవ్వులో సదా వెన్నంటి వచ్చే దాసానుదాసుడు ఆ 'కొంటెతనం'!
అతనికి ఇంకో విద్య వచ్చు, తెలుసా! పిల్లనగ్రోవి ఊదుతాడట. చిత్రమేమిటంటే అతను మురళిని మ్రోగిస్తూ ఉంటే వినేవారికి ఆ మాధుర్యానికి కళ్ళు తెరవలేని మత్తు కమ్మేస్తుందట!
అలా అని మురళీధరుణ్ణి చూడకపోతే ఎలా..?
అందుకని ఏకకాలంలో ఆ వేణుగానం వింటూ, కళ్ళు తెరిచి అతన్ని చూడడం ఎవరికి సాధ్యమవుతుందో అని పందాలు కాసుకుంటూ ఉంటారట ఆ ఊళ్ళో.
గెలిచినవాడు లేడిప్పటికి!
అతని అందానికే వాళ్ళమ్మ దిష్టి తిసేస్తోందనుకుంటున్నారేమో!
కాదు.. కాదు! అతను బోలెడు బలమున్నవాడట! ఆ ఊరికి రాక్షసుల బెడద కొంచెం ఎక్కువే, పాపం!
ఆడపిల్ల రూపంలోనూ, బండి రూపంలోనూ, కొంగలాగా, ఆవులాగా ఇలా రకరకాల మారు వేషాల్లో బోలెడుమంది రాక్షసులు వచ్చి అతని చేతుల్లో ప్రాణాలు విడిచారట. పాపం, తల్లి మనసు కదా! అందుకని ఎటు నుంచి ఏ కీడొస్తుందో అని కొడుకుని చూసి బెంగపడుతూ, అతని అందానికి మురిసిపోతూ మెటికెలు విరుస్తూ ముప్పూటలా దిష్టి తీస్తూంటుందన్నమాట!
మరి ఇంత అందగాడి వెంటపడేవాళ్ళేమైనా తక్కువా? అబ్బే! ఊరందరి కళ్ళూ అతని మీదే! ఆ ఊరి ఆడపిల్లలందరికీ అతనంటే తగని మక్కువ. ఇంట్లో కట్టడి చేస్తున్నా, పెడచెవిన పెట్టి నది ఒడ్డునా, తోటల్లోనూ అతను మురళీగానం చేస్తూంటే పరుగున వెళ్ళి వింటూ ఉండేవారట! అతగాని ఊహల్లో మైమరిచిపోతూ నిత్యకృత్యాలన్నీ అవకతవకలుగా చేసేస్తూ ఉండేవారట. చల్ల చిలికేవేళ అతను గుర్తొస్తే, ఆ చల్లలో వెన్న ఏర్పడి మళ్ళీ కరిగిపోయేదాకా చిలికీ చిలికీ ఆ ఊరి భామలందరి నడుములూ బహుసన్నమైపోయాయట.
"ఏ క్షణంలో అతను ఎదురుపడతాడో!" అని ఎప్పుడూ వాళ్ళందరూ అలంకారాలు చేసుకుని, పువ్వులు ముడుచుకుని గంధపు కుప్పెల్లా, నిత్యమల్లె చెట్లలా, బంగారుబొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారట!
అలా గడుస్తూండగా శరదృతువు వచ్చింది. ఆకాశంలో మేఘాలు తెల్లని పువ్వుల్లా, తేలికైన, స్వచ్చమైన మనసుల్లా తేలుతున్నాయి. రాత్రుల్లో వెన్నెల చాందినీకి కట్టిన ముత్యాల్లా నక్షత్రాలు మెరుస్తున్నాయి. పండి ఓరగా వాలిన వరిచేలలో, గాలి వీచినప్పుడల్లా గలగలమని వినసొంపైన సడి పుట్టేది. చేలల్లో వాలిన చిలుకలు అదిలించగానే గోలగోలగా ఎగిరిపోయేవి. కొలనుల్లో కలహంసలు కిక్కిరిసి తామరలకి చోటు లేకుండా చేసేసాయి. చామంతులూ, బంతులూ విరిసి పసిడిహారతుల్లా మెరుస్తున్నాయి. ఇంత మనోహరమైన రోజుల్లో ఆ ఊరి పడుచులకి ఒకటే బాధ! మన్మథ తాపం. చెరుకు వింట మన్మథుడెక్కుపెట్టిన నల్ల కలువల బాణాలు నేరుగా ఆ వెర్రి గొల్ల పడుచులకి గుచ్చుకునేవి.
విరహబాధ తట్టుకోలేని పడుచులంతా యమునలో జలకాలాడుతూ, గుసగుసగా ఒకరి చెవిలో ఒకరు తమ బాధ చెప్పుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, వేళాకోళం చేసుకుంటూ నల్లనయ్య గురించి కలలు కంటున్నారు. పిల్లనగ్రోవి మ్రోగేసరికి ఒళ్ళుమరిచి ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ బాధకి ఉపాయం ఏదైనా ఉంటే బాగుండునని తలవని ఆడపిల్ల లేదు.
ఒకనాడు ఉదయం పల్లెలో పెద్దలందరూ ఆడపిల్లలనందర్నీ సమావేశపరిచారు.
"ఎందుకో? ఏం చెప్తారో? కారణమేంటో?" అని వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్న ధ్వని తుమ్మెదల గుంపు ఝుమ్మని ఎగురుతున్నట్టు వినిపిస్తోంది.
ఓ ముసలి గొల్ల లేచి పువ్వుల దండలా ఓ వైపు నిలబడిన పడుచుల్ని చూసి చెప్పనారంభించాడు.
"అమ్మాయిలూ, మీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. నేనూ, మిగిలిన పెద్దలూ ఇందాకే మన పల్లె చివర ఉన్న మునిపల్లెకి వెళ్ళి వచ్చాం. అక్కడి మునీశ్వరుడు చెప్పిన మాటలివి. రాబోయేది హేమంత ఋతువు. మార్గశిరమాసం మంచి కాలమట. ఈ నెలలో ఆడపిల్లలు కాత్యాయినీ దేవిని పూజిస్తే మంచిదట. మంచి వర్షాలు కురిసి, పాడీ పంటా సమృధ్ధి చెందుతుందట."
"ఈ పెద్దాయన ఒకరూ, మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అయినా మనకిప్పుడేం తక్కువైందని? అబ్బో, ఈ పూజలూ పునస్కారాలూ మన వల్ల అయ్యేవేనా? ఇళ్ళల్లో పనులో!" ఇలా అమ్మాయిలందరూ గుసగుసలు ప్రారంభించారు.
వాళ్ళ ఉద్దేశ్యం, మాటలూ తెలియని వాళ్ళు కాదు కదా పెద్దలు. అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరుగడా? పండిన మీసం చాటున నర్మగర్భంగా నవ్వుకుని పెద్దాయన చెప్పాడు.. "అంతే కాదమ్మాయిలూ, ఈ వ్రతం శ్రధ్ధగా, సక్రమంగా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయట."
"కోరికలన్నీ అంటే.." ఓ పిల్ల కొంటెగా అడిగి ముందున్న అమ్మాయి వెనక్కి నక్కింది.
"ఆహా.. అన్ని కోరికలూ అంటే అన్ని కోరికలూ.. సురభికి కాసుల పేరూ, నర్మదకి మువ్వల పట్టెడా, మల్లికకి జడ నాగరమూ, ప్రియంవదకి దంతపు బొట్టుపెట్టె, మృణాలినికి సంపెంగ రంగు పట్టు చీరా, నీకు కోరిన మొగుడూను" ఘొల్లుమని నవ్వారు పడుచులందరూ.
ఇందాకా ప్రశ్న వేసిన కమలిని సిగ్గుగా నవ్వుతూ వెనక్కి జరిగింది. సభ తీరిన పెద్దవాళ్ళూ ముసిముసిగా నవ్వుకున్నారు.
"అలా కాదు పెద్దయ్యా, మా చేత వ్రతం చేయించేదెవరనీ?" సందేహం వెలిబుచ్చింది మృణాలిని.
"ముందు మీరంటూ సిధ్ధపడితే, అన్నీ జరుగుతాయి. సురభీ, ప్రియంవదా, ఉత్పలా, కావేరి.. ఇంత మంది ఉన్నారు మీలో అన్నీ తెలిసినవారూ, చదువుకున్న వారూను. మీలో కొందరు ఓ సారి మునిపల్లెకి వెళ్ళి కనుక్కుంటే విషయాలూ, విధానమూ మీకే తెలుస్తాయి. అన్నీ మేమే చెప్పాలంటే ఎలాగర్రా. మీరే ఉత్సాహంగా అన్నీ తెలుసుకోవాలీ, చెయ్యలీ కానీ!" ఉత్సాహపరిచాడు పెద్దాయన.
ఆడపిల్లలందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని, గోలగోలగా అభిప్రాయాలూ, సందేహాలూ, అనుమానాలూ వెలిబుచ్చుకుని, తమలో తామే సమాధానాలు చెప్పుకుని ఒక అంగీకారానికి వచ్చారు.
"సరే పెద్దయ్యా, హేమంతం వచ్చేసరికి సిధ్ధంగా ఉంటాం. అందరం కాత్యాయనీ వ్రతం చేస్తాం. మంచి పనికి వెనకాడేదేముంది?" అని స్థిరంగా చెప్పింది సురభి.
హేమంతం వచ్చేసింది. తెలవారితే వ్రతారంభం. యమున ఒడ్డున స్నానానికి కలుద్దామని, అక్కడే కాత్యాయనీ దేవికి పూజ చేసుకోవాలని ముందు రోజే అమ్మాయిలందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. హేమంతమంటే మాటలా! చలి వణికించేస్తోందప్పుడే! అంత తెలవారు ఝామున లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటే కష్టం. మంచు కత్తిలా కోసేసే యమున నీళ్ళలో మూడు మునకలు వెయ్యాలని తలుచుకుంటేనే అందరికీ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది.
అదే మాట అంది ఉత్పల.
"గారెలు తినాలని ఉందంటే అవి గాల్లో పుట్టవు, అమ్మడూ! మనమే వండుకోవాలి. కోరినవి దక్కాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు. మరో మాట లేదు. వేకువ ఝాముకి ఘడియ ముందే నేను మీ ఇంటికి వచ్చి లేపుతాను." అంది చేతులు తిప్పుకుంటూ ఖస్సుమని ఒంటికాలిన లేచింది కమలిని.
"ఏనుగులు మీద పరిగెట్టినా లేవని దానివి! నువ్వా సుద్దులు చెప్తున్నావ్, కమలినీ!?" వెక్కిరించింది సురభి.
"ఏం కాదు. రేపు చూడండి. ఉత్పల ఒక్కర్తినే కాదు మీ అందరినీ నేనే లేపుతాను." ఉడుక్కుంటూ చెప్పింది కమలిని.
"అబ్బా. ఆగండే! చిటికె వేస్తే తెలివొస్తుంది సురభికి. సురభీ! నువ్వే రేపు మా అందరినీ నిద్ర లేపాలి. నీదే పూచీ. మనం లేవడం ఆలస్యమయి పొద్దు పొడిచిందా.. వ్రతానికి ముప్పు!" హెచ్చరిస్తూ చెప్పింది ఉత్పల.
"సరేనర్రా.. ఇళ్ళకి వెళ్ళి హాయిగా నిద్రపోండి. నేను కోడికూతకి రెండు ఘడియల ముందే లేస్తాను. పక్కనే కమలిని ఇల్లు కదా.. ఇద్దరమూ మిగిలిన వాళ్ళని లేపుతాం." చెప్పింది సురభి.
అందరూ ఇంటిదిక్కు పట్టారు.
(బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి.)
మంచి వెన్నెల వేళ: 1
తెలవారు ఝామున అందరినీ నిద్ర లేపే బాధ్యత సురభికి అప్పచెప్పి, గోపభామలందరూ ఇళ్ళకి చేరుకున్నారు. పడక మీదకి చేరిన వారందరి మనసుల్లోనూ ఒకటే ఆలోచన. "తెల్లవారు ఝామున తెలివొస్తుందా?"
ఇంటిల్లి పాదికీ మరో మారు తనని తెల్లవారుఝామున నిద్రలేపమన్న విషయం గుర్తు చేసింది తరళ.
"తెలివి రాదేమో! రాత్రంతా జాగరణ చేద్దామా?" అని ఆలోచిస్తోంది మేదిని.
దుప్పటి కప్పుకోకుండా నిద్రకి ఉపక్రమించింది మంజుల.. చలికి తెలివొస్తుందన్న ఆశతో!
కిటికీ తలుపు ఓరగా తెరచిపెట్టుకుంది కమలిని, సురభి పిలిచినప్పుడు వినిపించడానికి వీలుగా.
"దేముడి మీద భక్తి కాదర్రా.. మీరంతా ప్రసాదం భక్తులు! చూద్దాం.. మీది ఆరంభ శూరత్వమో, నెల్లాళ్ళూ నియమం తప్పకుండా వ్రతం చేస్తారో!" ములుకుల్లాంటి మాటలతో గుచ్చింది ఓ అమ్మాయిని ఆమె నాయనమ్మ.
కోపంగా పళ్ళు నూరుతూ ముసుగు తన్నిందా మనుమరాలు.
నిజంగానే "నల్లనయ్య కావాలి." అనే కోరికే వాళ్ళందరి మనసుల్లోనూ లేకపోతే ఆ సుమసుకుమారులు కఠిన నియమాలతో కూడిన ఇలాంటి వ్రతానికి తలపెట్టేవారు కాదేమో!
అక్కడ సురభి మనసులో వెయ్యి ఆలోచనలు. "నిద్ర లేపుతానని మాటిచ్చాను. బాధ్యత నెత్తి మీద వేసుకుని నేనే నిద్ర లేవలేకపోతేనో! మునిపల్లెలో తెలుసుకుని వచ్చిన నియమాలన్నీ ఇంకా అందరికీ చెప్పలేదు. రాజుగారితో మాట్లాడిన విషయాలు కూడా! నియమాలు చెప్తే మంజుల, వసుధ లాంటి పిరికి పిల్లలు వెనక్కి తగ్గుతారా? ఏమో! ఎవరొచ్చినా రాకపోయినా నేనైతే ఈ వ్రతాన్ని చేసి తీరుతాను. వంశీమోహనుడు నా సొంతం కావాలి. పైగా ఊరికి మేలు జరుగుతుందట కూడాను." ఆలోచిస్తూండగానే నిద్రా దేవి ఆమెని తన ఒళ్ళోకి తీసుకుంది.
అర్ధరాత్రి దాటగానే మెలుకువొచ్చింది కమలినికి. "హమ్మయ్యో! సురభి వచ్చి వెళ్ళిపోయిందా?" అని గాభరా పడుతూ లేచి, ఒక్క ఉదుటన వీధిలోకి వచ్చింది. పుచ్చపువ్వులా వెన్నెల విరగకాస్తోంది. చలికి కదులుతున్న గోవుల సడి, కీచురాళ్ళ రొద తప్ప వేరేదీ వినిపించడం లేదు. సమయం ఎంతయిందో కూడా అర్ధం కాలేదామెకి. గబగబా సురభి ఇంటివైపు అడుగులు వేసింది. కిటికీ తలుపు తోసి చూస్తే, సురభి గాఢంగా నిద్రపోతూ కనిపించింది . కమలిని ఒక్క క్షణం గర్వంతో పొంగిపోయి, తనని తనే మెచ్చుకుంది. అందరికంటే ముందు తనే నిద్ర లేచింది!
"సురభీ.. లే లే.." అని పిలిచింది.
ఉలిక్కి పడి లేచింది సురభి. మంకెనల్లాంటి కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చి గజగజా వణుకుతూ "అర్ధరాత్రి దాటిందే కమలినీ ఇంకా.. నీ ఆత్రం బంగారంగానూ!" అని విసుక్కుంది.
"అవునా! తెలివొచ్చిందని ఇలా వచ్చేసాను. నువ్వెళ్ళి పడుకో." కమలిని నొచ్చుకుంది.
"ఇంక నిద్ర పట్టదులే. రా.. లోపలికి. ఓ ఝాము గడిస్తే ఎలాగూ బయలుదేరాలి. నీకు నిద్రొస్తే ఇక్కడే పడుక్కో. నాకింక మెలకువే." ఎర్రబడ్డ కళ్ళలో ఊరుతున్న చెమ్మని పైట చెంగుతో అద్దుకుంటూ చెప్పింది సురభి.
"నాకూ ఇంక నిద్ర పట్టదులే. కాసేపు కబుర్లు చెప్పుకుందాం." ఇంట్లోకి దారితీస్తూ అంది కమలిని.
"వెన్నెల చూడు. పాల తరకలా ఎలా మెరిసిపోతోందో!" తలుపేస్తూ ఆకాశంవైపు చూసి చెప్పింది సురభి.
"ఈ మాసమే ఎందుకంత గొప్పది సురభీ? వెన్నెల వేళలనా?"
"అదీ ఓ కారణమనుకో. చంద్రుడు ఓషధులకు అధిపతి. సత్వగుణ సంపన్నుడు. అలాంటి చంద్రుడు వృధ్ధిలో ఉండే కాలమిది. పైగా ఇంకో నెలలో ఉత్తరాయణం వస్తుంది. నీకు తెలుసు కదా! దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రీను. అంటే ఈ నెల తెల్లవారుఝామన్నమాట. దేవతలకే అమృత గడియలివి. ఈ కాలంలో చేసిన పూజలు వృధా కావు. పైగా చంద్రుడి మూలంగా మనందరిలోనూ సత్వగుణం పెరుగుతుంది. అంటే మంచితనమన్నమాట! మంచి మాటలు మాట్లాడాలనీ, మంచి పనులు చెయ్యాలనీ అనిపిస్తుందన్నమాట. నిజమే కదూ! ప్రకృతి ఇంత మనోహరంగా, చల్లగా, హాయిగా ఉంటే ఎవరితోనైనా దెబ్బలాడబుధ్ధేస్తుందా చెప్పు? మొన్నటికి మొన్న మా అత్తమ్మ అడగకుండానే, ఆవిడకిష్టమని మినపసున్ని చేసిపెట్టాను. "పాపం లెద్దూ! ఆవిడకెవరు చేస్తార్లే.." అనిపించింది. ఆ.. ఏం చెప్తున్నానూ... అందుకని ఇది మంచి కాలమన్నమాట!"
ఇలా కబుర్లు చెప్పుకుంటూ తెల్లవారుఝాము దాకా గడిపేసారిద్దరూ. ఇంకో రెండూ గడియల్లో తెలవారుతుందనగా బయలుదేరి మిగిలిన వాళ్ళని ఒక్కొక్కరినే నిద్రలేపసాగారు.
రాజుగారి వీధిలో ఉండే ఉత్పల బయటికొస్తూ "రేరాణి పరిమళం కూడా తెలియకుండా చేసేసింది యశోదమ్మ. రేపల్లె కాస్తా 'కర్పూరపు పల్లె' అయిపోయేలా ఉంది. నిన్న రాత్రి కొడుక్కి రెండు తుమ్ములెక్కువొచ్చాయట! ఒకటే విలవిల్లాడిపోతూ దిగతుడుపులూ, ఆర్భాటమూను. సూర్యగుమ్మడికాయంత కర్పూరం వెలిగించి దిగతుడిచింది!!" అని చెప్పింది.
"పోనీలెద్దూ, నువ్వో పిల్లాడిని కను. నీకూ తెలుస్తుంది. ఏమాటకామాటేలే! అయినా అంతలేసి కళ్ళతో ఆయమ్మే పొద్దస్తమానం కొడుకుని చూస్తూ ఉంటుందాయె. దిష్టి తగిలిందంటే తగలదూ! పైగా వద్దంటున్నా బతిమాలి చలికాలంలోనూ పెరుగు వడ్డించిందనుకుంటా. పాపం, బాగా తుమ్మాడా ఏంటి?" కలవరపడుతూ వాకబు చేసింది సురభి.
"కొంచెం ఎక్కువే తుమ్మాడనుకో. కాత్యాయని చల్లగా చూడాలి. నేను కన్నా అంత అందగాడిని కనగలనా చెప్పు! కన్నయ్యది యశోదమ్మ పోలికేనంటావా?"
"ఆ.. కళ్ళు మాత్రం ఆవిడవే."
"ఏం కాదు. ఆ కళ్ళకి పోలిక లేదు. సారసాలు కూడా పనికిరావు." కమలిని నమ్మకంగా చెప్పింది.
"యశోదమ్మ కళ్ళేనే. కాకపోతే ఆవిడవి గంగిగోవు కళ్ళయితే, ఆ కుర్రాడివి చెంగనాలు వేసే కోడెగిత్త కళ్ళు. కోణంగి చూపులొకటీ మళ్ళీ. " ముక్తాయించింది సురభి.
"లేగదూడ కాదతడు. సింహపు కొదమ!" చెప్పింది ఉత్పల.
"దరి చేరినవారికి చల్లని చూపుల చంద్రుడూ, కానివారికి సూరీడూను." అతడిని తలుచుకు మురుస్తూ అంది కమలిని.
ఇలా మాట్లాడుకుంటూ ఊరికి దూరంలో ఉన్న మేదిని ఇంటికి నడిచారందరూ.
"అబ్బా.. అంత దూరం వెళ్ళి మరీ ఆవిడగారిని నిద్ర లేపాలా?" అడిగింది ఉత్పల.
మేదినికీ, ఉత్పలకీ ఉప్పూ నిప్పూను. వామన గుంటల దగ్గర నుంచీ దాగుడుమూతల దాకా ప్రతీ ఆటలోనూ ఉత్పల మేదిని చేతిలో ఓడిపోవడం మామూలు.
"తప్పు! అలా అనకూడదు. మంచి పనికి అందరినీ తోడు తీసుకెళ్ళాలి. లేకపోతే ఫలితం దక్కదు. పంచుకు తినే తాయిలం బహు తియ్యన కదూ! "ఏకస్వాదునభుంజీత" అని నీతివాక్యం! మరిచిపోయావా?" మెత్తగా మందలించింది సురభి.
అందరూ కలిసి యమున ఒడ్డుకి చేరారు. అందరూ వచ్చారని లెక్క చూసుకున్నాక సురభి ఇలా చెప్పింది. "నేస్తాలూ! ఇంకో ఝాములో తెల్లారుతుంది. ఈ లోగా స్నానం చేసి పూజకి సిధ్ధం కావాలి. నియమాలన్నీ తెలుసుకు వచ్చాం. నిన్న రాజుగారి దగ్గరకు వెళ్ళి ఇలా వ్రతం చేస్తున్నామని విన్నపం చేసాం కూడా! మరి మన మంచీ చెడూ చూడాల్సింది ఆయనేగా!"
"మంచి పని చేసావ్. ఆయన చేతిలో సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండే 'కరకు కత్తి'ని చూస్తే ఇంక చెడు మన జోలికి రాదు." ధైర్యం చెప్పుకుంది మేదిని. చీకటి బూచులంటే మహా భయం ఆ పిల్లకి.
"వెర్రిదానా! నువ్వు పుట్టి నాలుగాదివారాలు కాలేదు. ఆయన సంగతి నీకేం తెలుసు? నందగోపుడంత సాధువు నందగోపుడే. ఈ కత్తి 'కొడుకు పుట్టాక చేరిన ఆభరణం'. చీమకి కూడా హాని చేయని నంద భూపాలుడు ఏ చీమ కనిపించినా 'రాక్షసుడేమో!' అని భయపడుతున్నాడీ రోజు. అందుకే ఈ కరవాలమూ, కరకుదనమూను! అయినా మనని కాపాడేది కన్నయ్య. సాక్షాత్తూ విష్ణువు. గోవర్ధనగిరి ఎత్తినప్పుడు చూడలేదూ! అతను సామాన్యుడు కాదు. దేముడు వరమిచ్చినా పూజారి అనుమతి ఉండాలి కనుక, నిన్న లోపాయకారిగా రాజుగారితో మన రక్షణ, పూజకి కావలసిన సంభారాలూ వగైరాల గురించి చెప్పాను. నేనూహించినట్టే "కన్నా, ఈ పిల్లలేదో వ్రతం చేస్తున్నారట. ఏం కావాలో చూడు నాన్నా! అల్లరి చేసి వ్రతభంగం కానివ్వకు సుమా! కాత్యాయనీ వ్రతం చాలా నిష్ఠగా చెయ్యాలి." అని కొడుకుని పిలిచి చెప్పారు."
"అవునా!!" నోరెళ్ళబెట్టారు ఈ సంగతి తెలియనివారందరూ. మనసులో ఆనందించారు కూడా!
"మరి పూజకి కావలసినవన్నీ దొరికాయా? కృష్ణుడేమైనా తెస్తానన్నాడా?" అమాయకత్వం నటిస్తూ ఆశగా అడిగింది మంజుల.
"అదిగో.. నీ వెనకే ఉన్నాడు. నువ్వు నీ వల్లెవాటూ, బొట్టు భరిణా మర్చిపోయావట! తెచ్చాడు." అని వేళాకోళం చేసింది కమలిని. కిలకిల్లాడారందరూ.
"ఊరుకో కమలినీ! నువ్వేం తక్కువదానివా? కృష్ణుడు తెస్తానంటే నీ వల్లెవాటేం ఖర్మ తలకాయో, గుండె నో మర్చిపోయివస్తావ్ ఇంట్లో. ఈ రోజుకి కావలసినవన్నీ తెచ్చేసుకున్నాం. వ్రతం పూర్తయ్యే లోపు మనకో 'పర' కావాలి." చెప్పింది సురభి.
"పరా? అంటే డప్పేనా?"
"అవును డప్పు. అది మ్రోగించాలి కాత్యాయనీ ప్రీత్యర్ధం. తొందరేం లేదులే. వ్రతం పూర్తయ్యేలోపు ఓ రోజు వెళ్ళి కృష్ణుడిని అడుగుదాం." చెప్పింది సురభి.
తరువాత వాళ్ళందరూ పూజావిధిని అనుసరించి యమునలో స్నానం చేసి, తడి ఇసుకతో 'కాత్యాయనీ ప్రతిమ'ను చేసి కొండ గోగుపూలూ, పారిజాతాలూ, గులాబీలు, కలువలతో పూజ చేసి, వేడి పొంగళ్ళు వండి నివేదన చేసారు. కాత్యాయనికి హారతిచ్చి అందరి మనసుల్లో ఉన్న ఒకే కోరికని విన్నవించుకున్నారు.
తెలవారుతోంది. యమున గలగలా పారుతోంది. చంద్రుడు అస్తమిస్తున్నాడు. వెలుగు రేకలు పరుచుకుంటున్నాయి. ఆ చలిగాలిలో ఒకరికి ఒకరూ దగ్గరగా కూర్చుని, పొంగలి ఘుమఘుమలు ఆస్వాదిస్తూ, ధూప దీపాలతో కళకళ్ళాడుతున్న కాత్యాయనిని చూస్తే అందరి మనసులూ తృప్తితో నిండిపోయాయి. ఉత్పలా, మంజులా తామరాకుల్లో నైవేద్యాన్ని వడ్డించి అందరికీ అందించే పనిలో పడ్డారు.
ఏ అమరలోకపు తంబురనో మీటినట్టు గొంతు శ్రుతి చేసుకుని, విన్న విషయాలూ, కలిగిన అనుభూతులూ, చెప్పుకున్న కబుర్లూ కలిపి మాల గుచ్చి వంశీమోహనుని మెడలో ఒక పాటగా వేసింది కమలిని. ఆమె బిలహరి రాగంలో పాడుతూ ఉంటే, ఆమె చారడేసి కళ్ళలో మెరుస్తున్న 'హరి'ని చూస్తూ మైమరచిపోయారందరూ...
రారమ్మ ఓ అమ్మలారా! రారేమమ్మ!
నీరాడ మనసున్నవారూ! మీరూ - మీరూ!
శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన
చేరి కన్నియలార! కూరిమి చెలులార!
ఇది మార్గశిరము, వెన్నెలవేళ, భాసురము!
ఇది పరవాద్యవ్రతారంభ వాసరము
మదిలోన జగమెల్ల ముదమంది పొగడ,
కదిసి కంకణ కటక కింకిణులు కదల
మరిమరీ కనికనీ మెరిసేటి కనులతో
మురిసే యశోదమ్మ ముద్దు సింగపు కొదమ
కరిమొయిలు మెయిహొయలు గల అందగాడు,
వరదుడౌ మన రేడు వ్రతమేలువాడు
కరమందు కరకువాల్ కాపుగా దాలిచి
వరలేటి మేటి నందుని నందనుండు
అరుణశశిబింబనిభ శుభవదనుడు
సరసిజాక్షుడె నోము కరుణింపగా
రారమ్మ ఓ అమ్మలారా..
ఏకస్వాదునభుంజీత ఏకశ్చార్ధాన్నచింతయేత్
ఏకో న గఛ్ఛేదధ్వానం నైకః సుప్తేషు జాగృయాత్
రుచికరమైన పదార్ధమును ఒక్కరే భుజించకూడదు. కార్యములను గురించి ఒక్కరే ఆలోచించరాదు. అమార్గమున ఒక్కరే ప్రయాణము చెయ్యకూడదు. అందరు నిద్రపోతున్నవేళ ఒక్కరే మెలకువగా ఉండకూడదు. ఇది విదురనీతి వాక్యమండీ. (ఈ కథ నాటికి కురుక్షేత్ర సంగ్రామం (ఉద్యోగపర్వం) జరుగలేదు కదా! అందుకని నీతివాక్యమని వ్రాసి ఊరుకున్నాను.)
'సారసాలు' అంటే ఏంటండీ?
'సారసము' అంటే సరస్సులో పుట్టేది, పద్మం అని అర్ధమండీ. సారస నేత్ర, సారసాక్షి అంటారు కదా!
ఏకో న గఛ్ఛేదధ్వానం నైకః సుప్తేషు జాగృయాత్
రుచికరమైన పదార్ధమును ఒక్కరే భుజించకూడదు. కార్యములను గురించి ఒక్కరే ఆలోచించరాదు. అమార్గమున ఒక్కరే ప్రయాణము చెయ్యకూడదు. అందరు నిద్రపోతున్నవేళ ఒక్కరే మెలకువగా ఉండకూడదు. ఇది విదురనీతి వాక్యమండీ. (ఈ కథ నాటికి కురుక్షేత్ర సంగ్రామం (ఉద్యోగపర్వం) జరుగలేదు కదా! అందుకని నీతివాక్యమని వ్రాసి ఊరుకున్నాను.)
'సారసాలు' అంటే ఏంటండీ?
'సారసము' అంటే సరస్సులో పుట్టేది, పద్మం అని అర్ధమండీ. సారస నేత్ర, సారసాక్షి అంటారు కదా!
"పాలొద్దూ.. నెయ్యొద్దూ.." - 2
"నల్లని నీలో మునకలు వేస్తూ, నల్లనయ్య కౌగిట్లో ఉన్నామని ఊహించుకుంటున్నారా గొల్లపిల్లలు. నువ్వేమో తెల్లబడిపోదామని ప్రయత్నిస్తున్నావ్! పొరుగింటి పుల్లకూర నీకెందుకు యమునమ్మా? నలుపు నారాయణుడు మెచ్చు!" అని హితవు పలికాడు.
మూతి ముడిచి విసవిసా పరుగులు తీసింది యమున. ఒక్క క్షణం ఆలోచించి "నిజమే!" అనిపించి తనను తను చూసుకుని గర్వంగా తరగల ముసినవ్వులు నవ్వుకుంది.
రేపల్లెలో ఓ పడతి కళ్ళాపి జల్లుతోంది. ప్రతి ఉదయం ముంగిట్లో తను చిత్రించే రంగవల్లికకి చిత్రపటాన్ని సిధ్ధం చేసుకున్ననంత శ్రధ్ధగా, ముంగిట్లో నేలను సమాయత్తం చేసుకోవడం ఆ పిల్లకి మహా ఇష్టం. పటం సిధ్ధమయింది. ఆమె ఉపయోగించేది ధవళ వర్ణమొక్కటే. నూకలు తిరగట్లో విసిరి మెత్తని తెలతెల్లని బియ్యపు పిండిని పదిరోజులకోమాటు సిధ్ధం చేసుకుంటుంది. ఊళ్ళో ఆడపిల్లలందరూ తెల్లవారాక ఏదో నెపంతో ఆ ముంగిలి ముందు నుంచి వెళ్తారు. "తరళ ఈ రోజు పన్నెండు పద్మాల ముగ్గు వేస్తుందా..? పన్నీరు బుడ్డి మెలికల ముగ్గు వేస్తుందా.. ఆడే నెమలి బొమ్మ వేస్తుందా!" అని ముందే పందాలు వేసుకుంటారు. అంత గొప్ప చిత్రకారిణి ఆమె!
కృష్ణుడు కూడా ఓ నాడు ఆమె వేసిన పద్మవల్లికను చూసి మెచ్చుకున్నాడు. ఆ సాయంత్రం కడిమి మొదట మురళి మ్రోగిస్తున్న ఆతని వద్దకు చేరిన గోపికల్లోంచి, ప్రత్యేకం తరళను పిలిచి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని "మృదు పాణీ, నువ్వు భలే చిత్రాలు గీస్తావు సుమా! ముంగిట్లో ముగ్గులేనా నా బొమ్మ గీసేదేమైనా ఉందా!?" అని మేలమాడుతూ అడిగాడు కూడా! కన్నయ్య అడగడమూ, తరళ కాదనడమూనా! ఆనాటి నుండీ కృష్ణుడి బొమ్మ గీసేందుకు కుంచె పట్టుకోవడం, రంగుల మిశ్రమం కుదరక ఓ సారీ, అసలు కుంచే కదలక ఓ సారీ, అంతా గీసాక ఏ ముంగురులో సరిగ్గా కుదరలేదనో, కళ్ళు బాగా రాలేదనో ఆ చిత్రం పక్కన పెట్టడం ఆ అమ్మాయికి నిత్యం ఓ పని. ప్రయత్నం మానలేదు, మానదు. అయితే ముంగిట్లో ముగ్గు మాత్రం గొప్ప యాగం చేస్తున్నంత శ్రధ్ధతో, దీక్షతో గీస్తుంది. "ఆ వీధిలో ఏ పని ఉండి అటుగా వచ్చి తన ముగ్గు చూస్తాడో!" అనే ఊహే ఆమె చేత చిత్రమైన అల్లికలు అల్లిస్తుంది. తెల్లని వరిపిండితో ఆమె గీసిన ముగ్గులో ఒక పద్మం మాత్రం రోజూ ఉండి తీరుతుంది. కృష్ణుడు మెచ్చుకున్నది ఆ పద్మాన్ని చూసేగా! తెలవారాక పిచుకలు ఆ పద్మపు అంచున వాలి మధ్యలో ఒత్తుగా ఉన్న పిండిని పొడుచుకు తింటూ ఉంటాయి. చీమలూ ఇతర కీటకాలూ సరే సరి!
కాత్యాయనీ వ్రతం మొదలు పెట్టిన నిన్నటి నుంచీ మాత్రం మెలికల ముగ్గులు వెయ్యడం మానేసింది. గీతల్లోనే ముగ్గులన్నీ. పిండి గుప్పిట బిగించి వేళ్ళ సందుల్లోంచి రెండేసి గీతలు పడేలా, దీక్షగా గీతలు గీసుకుపోతోంది. ఆమెను నిద్ర లేపడానికి వచ్చిన మిగిలిన మిగతా అమ్మాయిలందరూ ఆమె వేళ్ళలోంచి నక్షత్రాల పొడి లా ఆ పిండి జారుతూ నేలమీద ఆకృతి సంతరించుకుంటున్న వైనం అబ్బురంగా చూస్తూ నిలబడిపోయారు. చతురస్రాకారంలో బ్రహ్మాండమైన వైకుంఠ ద్వారాల ముగ్గు వేసేసి తృప్తిగా చూస్తూ, ఎందుకో తల వెనక్కి తిప్పి చూసింది. మంత్ర ముగ్ధల్లా తన నేస్తాలందరూ "రెప్పలు వేసీ, ఊపిరి పీల్చీ కూడా సడి చెయ్యకూడదు" అన్నట్టు నిలబడి ఉన్నారు.
"అయ్యో, వేళ మించిపోతోందా? అందరూ వచ్చేసారే! మనం వచ్చేసరికి తెలవారిపోతుందనీ.. ముగ్గు వేసేద్దామనీ.." సంజాయిషీ చెప్తున్న స్వరంలో చెప్పింది. మౌనంగా ముందుకు కదిలిన ఉత్పల తరళ చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంది. కన్నయ్య మెచ్చిన చేతులవి! ఆయన మెచ్చిన ముగ్గులవి!! వైకుంఠ ద్వారాన్ని కళ్ళెదుట నిలిపిన నేర్పరితనం ఆ చేతుల సొత్తు మరి!!
"ఏవిటర్రా!" అని అయోమయంగా అడిగింది తరళ.
వాతావరణాన్ని తేలిక చేసేందుకు "ఇదిగో తరళా.. "నువ్వు గీసిన ఈ ద్వారం వెనుకే పాల కడలీ, శేష శయ్యా ఉన్నాయేమో!" అని లక్ష్మి పరిగెట్టుకొస్తుంది మీ ఇంటికి! ఈనాటి వరకూ పద్మాల కోసమే సిరి మీ ఇంటి దారి విడువదని అనుకునే వాళ్ళం. ఈ రోజు వైకుంఠ ద్వారాలే గీసేసావే!!" అని నవ్వింది సురభి.
"వైకుంఠ ద్వారాలంటే ఇంకో నాలుగు కమ్మలూ, ఆ ఉత్తర ద్వారం వైపు మరో రెండు వంపులూ ఎక్కువ పడతాయ్లెండే! ఇది దాదాపు అలాంటిది. ఏదో నా బుర్రకి తోచినది. పోన్లెండి! ఉదయాన్నే పాలకడలిలో వెలిగే హరి పాదాలను తలుచుకున్నాం! ఎంత మంచి రోజు!" అందరూ ప్రశంసించేసరికి సిగ్గుగా నవ్వుతూ చెప్పింది తరళ.
"అవును. పాల సంద్రంలో, పాము సెజ్జ పైన యోగనిద్రలో ఉండే పరమాత్మని తలచుకోవడమే ఎంత గొప్ప విషయం! మీరు విన్నారర్రా! హరి పాదాలు బహు సుకుమారమట. ఎరనెర్రని తామరపువ్వుల్లా ఉంటాయట! ఆ పాదాల్లో శంఖ, రధాంగ, కల్పక,ధ్వజ, అరవింద, వజ్ర, అంకుశ.. మొదలైన ఉత్తమ చిహ్నాలు ఉంటాయట. పసివాడు తల్లిరొమ్ము వెతుక్కున్నంత సులువుగా నిజమైన భక్తుడు ఆ పాదాలను చేరుకోగలడట! ఆయన పాదాలను మించిన దిక్కేది!?" చేతులెత్తి నమస్కారం చేస్తూ చెప్పింది ఉత్పల. ఇందాకా భక్తితో కలిగిన గగుర్పాటు ఇంకా ఉత్పల ఒంటిని వదల్లేదు.
"నిజంగా నిజం!! సరే, సరే పదండి. ఇంకా సమయం ఉంది కానీ, పువ్వులు కోసుకోవాలి కదా ఇంకా.." బయలుదేరింది కమలిని.
అందరూ పూలతోటలోకి వెళ్ళి తుమ్మెద కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివీ, రకరకమ్ముల వన్నెలవీ, దివ్య పరిమళాలు వెదజల్లేవీ.. బోలెడు పువ్వులు కోసుకుని యమున ఒడ్డుకి చేరారు. పూజా ద్రవ్యాలూ, పువ్వులూ ఓ పక్కన పెట్టి నదిలో దిగి "హరి హరీ!" అంటూ మూడు మునకలేసి వచ్చారు. "కాత్యాయని ప్రతిమ"ని సురభి, ఉత్పలా చేస్తున్నారు. కమలిని, మేదినీ వంటకి సిధ్ధపడుతున్నారు. పువ్వుల మాలలు అల్లుతున్న తరళా, విష్ణుప్రియా గోవిందనామాలు వల్లెవేస్తున్నారు. విష్ణుప్రియకి పువ్వుల మాలలు అల్లడమంటే చాలా ఇష్టం. అందుకని "రోజూ ఆ పని తనదే!" అని ముందే చెప్పుకుంది.
కాస్త దూరంలో పూజకు సిధ్ధం చేస్తున్న ఆనందినిని అడిగి తనకి కలిగిన సందేహాలు తీర్చుకుందామనుకుంది విష్ణుప్రియ. ఆనందిని మునిపల్లెకి తరచూ వెళ్ళి పురాణాలూ, ధర్మ శాస్త్రాలూ నేర్చుకు వస్తూ ఉంటుంది. ఆమెకి చాలా విషయాలు తెలుసని అందరూ అనుకుంటూ ఉంటారు.
"ఆనందినీ, కాత్యాయనీ వ్రతానికి ఇంత కఠిన నియమాలెందుకూ! ఆడపిల్లలకి కాటుకా, పువ్వులూ ప్రీతి పాత్రమైనవి కదా! నాకయితే పువ్వులు ముడవని రోజు తోచదు. అలాంటిది నెల రోజులు పువ్వులు పెట్టుకోకూడదంటే కారణమేమై ఉంటుంది?"
"విష్ణువు లాగే విష్ణుప్రియా అలంకారప్రియ! చెప్పు చెప్పు. ఎందుకు?" నవ్వింది తరళ.
"కాదులేవే తరళా! అలంకారాలు ఇష్టం లేని ఆడపిల్లెవరు చెప్పు! పరీక్షకి తట్టుకునే తత్వం మనిషిలో పెంపొందించడమే ఏ వ్రతంలో అయినా ముఖ్య ఉద్దేశ్యం. కాటుక, పువ్వులూ కాదని మరీ వ్రతాన్ని చెయ్యగలిగావే అనుకో.. ఇష్టమైన వస్తువు ఏదైనా కారణం వల్ల దొరకకపోయినా, విలాసాలు లేకుండా కూడా నువ్వు గడపగలవు అనే నమ్మకం నీపై నీకే కలగదూ! అందుకన్నమాట. ఇంక ఈ నెల్లాళ్ళూ పాలూ, నెయ్యి కూడదని చెప్తారు కదా! అదీ ఇలాంటిదే! చలికాలం కదా.. కఫతత్వాన్ని పెంపు చేసి ఏ జబ్బైనా చేస్తుందేమో అని వద్దంటారేమో కూడా!"
"ఆడపిల్లలం.. అయినా ఈ నెల్లాళ్ళూ కాటుకా, పువ్వులూ కూడదు. గొల్ల పిల్లలం.. కానీ పాలు నెయ్యీ కూడదు. ఇంత కంటే పరీక్ష మరోటి ఉంటుందా!" వాపోయింది విష్ణుప్రియ.
"రెండో రోజుకే! ఆదిలోనే హంసపాదు వేస్తున్నావ్, పిల్లా!" సురభి అటుగా వస్తూ ఆటపట్టించింది.
"అబ్బే! ఏం లేదు. ఊరికే తెలుసుకుందామనీ!" ఉడుక్కుంది విష్ణుప్రియ.
"నీకింకా చెప్తాను. విను. దురుసు మాటలు మాట్లాడకూడదు. మనస్పూర్తిగా దాన ధర్మాలు చెయ్యాలి.. రోజుకు రెండు సార్లు ఓ గంట సేఫు ఊపిరి బిగపట్టి యమునలో మునిగి ఉండాలి."
"నిజమా!!!!"
"నమ్మేసి చేసేసేలా ఉన్నావ్ కన్నయ్య కోసం! నీతో పరిహాసాలాడకుడదు తల్లీ! అన్నీ నిజమే, యమునలో ముక్కుమూసుకు నిలబడడం తప్ప."
"నువ్వు మాత్రం ఇలా వేళాకోళాలు ఆడవచ్చునేం!" ఉడుకుమోతుతనం విష్ణుప్రియకి పెట్టని నగ.
"మరీ వీసానికి వీగిపోతావ్ పిల్లా! ఊరికే అన్నానులే. మనసులో పెట్టుకోకు. ఇక నిన్ను ఏడిపించనులే." నవ్వేసింది సురభి.
"మరి మనకి తెలియక తప్పులు చేస్తేనో?" కమలిని వచ్చి కూర్చుంటూ అడిగింది. ఆనందిని చెప్పసాగింది.
"తప్పు లేనివారు భూమిపై లేరని సీతమ్మే చెప్పింది తెలుసా! లంకలో అశోక వనంలో తన చుట్టూ చేరి మాటలతో ఆమెను హింసించిన రాక్షస స్త్రీలని "నువ్వు ఊ అని ఒక్క మాట అను తల్లీ! ఈ రక్కసి మూకని చంపి పారేస్తానని" హనుమ అంటే.."
"ఊ.. అంటే.."
"దయ చూపించవయ్యా! తప్పు చెయ్యని వారు లోకంలో ఎవరు!?" అని చల్లని నీళ్ళతో నిప్పుని ఆర్పినట్టు హనుమంతుల వారి కోపాన్ని శమింపచేసిందన్నమాట." చెప్పింది ఆనందిని. క్షణమాగి మళ్ళీ చెప్పనారంభించింది.
"పోనీ, తెలియక తప్పే చేసామనుకో.. "అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ" అంటే అన్ని ప్రాణుల రక్షణా నా బాధ్యత, వ్రతమూను అని చెప్పిన రాముడున్నాడు మనకు. మనం చెయ్యాల్సిందల్లా మన పని త్రికరణ శుధ్ధిగా మనం చెయ్యడమూ, తెలియక చేసిన తప్పులను మన్నించమనీ, నువ్వే శరణనీ పరమాత్మను నమ్మడమూను. నొప్పి కలిగితే 'బాబోయ్..ఈ బాధ పగవాడిక్కూడా వద్దని' ఏదో మాట వరసకి అంటాం కానీ, పగవాడొస్తే ఆదరిస్తామా చెప్పు! లేదు. మరి రాముడో, విభీషణుడు శరణంటే కాచాడా లేదా..!"
"ఊ.. రాజ్యం గెలిచి ఇచ్చాడు."
"కాబట్టి మన పని మనం చేస్తే చాలు. పాలూ, నెయ్యీ లేదని బెంగ పెట్టుకోకు చిన్నారీ! పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. నీకేం కావాలన్నా "కృష్ణా" అనుకో. కన్నయ్యే మనకి చద్దిమూట."
"రామాయణంలోంచి రేపల్లెలోకి వచ్చేసావా! ఎంత మాటకారివి ఆనందినీ!" మెచ్చుకోలుగా అంది కమలిని. అవునన్నట్టు తలలూపి నవ్వారందరూ.
"మళ్ళీ రామాయణంలోకి వెళ్ళానని అనుకోనంటే ఒక్క మాట!"
"అయ్యో! భలేదానివే! నువ్వు చెప్పడమే మాక్కావలసింది. చెప్పు చెప్పు"
"వనవాసానికి అన్నవెంట బయలుదేరిన లక్ష్మణుడితో వాళ్ళమ్మ సుమిత్ర చెప్పిందిటా.."
"ఊ.."
"రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా! అయోధ్యాం అటవీం విద్ధి గచ్ఛ తాత యథా సుఖం" అంటే..
"రామన్నని దశరథుడనుకో. జానకిని మీ అమ్మని నేనే అనుకో. అడవులే నీకు అయోధ్య. ఇక్కడున్నంత సుఖంగా రాముడెక్కడుంటే అక్కడే ఉండు, తండ్రీ!" అని చెప్పి తన బంగారు తండ్రిని అన్న వెంట అడవులకి పంపిందట ఆ తల్లి."
కలువల్లా విచ్చిన వాళ్ళందరి కళ్ళలోనూ మంచు ముత్యాల్లా కన్నీళ్ళు. కరిగించనిది కథ కాదు.. రామకథ అసలే కాదు.
"ఇదిగో, మీరందరూ ఇలా బేలమొహాలేసుకు చూస్తారనే నేను రాముడి కథలు చెప్పను." నొచ్చుకుంటూ ఆపేసింది ఆనందిని.
"లేదు లేదు. చెప్పు" ఏకకంఠంతో అన్నారందరూ!
"అలాగే మనకి రేపల్లే వైకుంఠం. యమున పాల కడలీ, కృష్ణుడే పరమాత్మ. అతని కోసం కఠిన నియమాల కారడవుల్లో అయినా మల్లెపూల దారిలో నడిచినట్టు మనమూ నడిచేద్దాం. ఏమంటారు!?"
"నువ్వింతలా చెప్పాక కూడా మళ్ళీ నియమాలు కష్టమని అంటామా! ఈ నెల రోజులు నల్లేరు మీద బండి నడక. కృష్ణుడి కోసం కదా!" స్థిరంగా పలికింది విష్ణుప్రియ.
ఔనంటే ఔనని అందరూ పూజ పూర్తి చేసుకున్నారు. "సైకత కాత్యాయని" దీపకళికల వెలుగులో మెరుస్తోంది. చీకటి కరిగి దినకరుడి తేరు కదులుతోంది. యమున గలగలల నేపధ్య సంగీతంలో కమలిని, ఆనందిని, విష్ణుప్రియ కలిసి ఆలపించసాగారు. "పంతువరాళి!" సురభి వాళ్ళు పాడుతున్న రాగం పేరు ఉత్పలతో చెప్పింది.
వినరమ్మ వినరమ్మ మన నోము తీరు
పని బూని చేసిన మన సిరులు మీరు
అల పాల కడలి ఊయెల శేష శయ్యపై
అలవోక నిదురించు హరి శ్రీపదాబ్జాల
తలచుకొనుచు, సారె కొలుచుకొనుచు
తొలివేగుబోక నీరాడవలె చెలులార!
వలదు క్రోలగ పాలు, వలదు త్రావగ నేయి!
వలదు కాటుక పూత మన కన్నుదోయి!
అలరులు కైసేయ వలదు క్రొమ్ముడులలో!
లలనలారా! నోము నోచిన దినాలలో!
పరమాత్ముడౌ ప్రభువు సరస, పరులపై
దురుసు మాటలు నోట తొడగరాదమ్మ!
దరియనీదు ఘనులొల్లని పనులను!
జరుపవలెను ముదమున దానధర్మములను!
వినరమ్మ వినరమ్మ మన నోము తీరు..
సిరుల వాన - 3
ఎలదమ్మి రేకుల కనురెప్పల వెనుక వెలిగే స్వప్న లోకాలలో, కృష్ణుడు ఏం వింతలూ విడ్డూరాలూ చూపుతున్నాడో, ఎంత హాయిగొలిపేలా మాట్లాడుతున్నాడో కానీ, నిద్దరోతున్న ఉత్పల మోమంతా చిరునవ్వే..!! కిటికీ సందుల్లోంచి లోనికి వచ్చిన పల్చని వెన్నెల ఆ అద్దాల చెక్కిళ్ళలో ప్రతిఫలించి రెట్టింపై వెలుగుతోంది. ఉండుండీ విచ్చుకుంటున్న ఆమె పెదాలు వెన్నెల్లో అరవిరుస్తున్న పసి గులాబి రేకులని తలపిస్తున్నాయి. ఆమెను మేల్కొలిపేందుకు కిటికీ తలుపు తోసి తొంగి చూసిన కమలినికి ఉత్పల ముద్దు మోము రెండో చంద్రబింబంలా కనిపించింది.
చప్పుడు చెయ్యకుండా వెనక్కి తిరిగి "నువ్వే చూడు.." అన్నట్టు సురభికి సైగ చేసింది. తొంగి చూసిన సురభి నవ్వుతూ "కలల్లో తేలుతోంది సొగసరి! పాపం! ఎలా నిద్ర లేపడం?" చిన్నగా గుసగుసగా అంది.
"తప్పదుగా.. ఉండు.."అని కిటికీ తలుపు పూర్తిగా తెరిచింది కమలిని. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మంద్రంగా, హాయిగా "కృష్ణా..." అంది. అమ్మ సడి విన్న పసి పాపలా కళ్ళిప్పి చూసింది ఉత్పల. కిటికీలోంచి జంట కలువల్లా సిరినవ్వుల చెలులు కనిపించారు.
అప్పటికే బయలుదేరిన విష్ణుప్రియా, మేదినీ, తరళా వీధి మొగలో కనిపించారు. ఆరుగురూ కలిసి ఆనందినీ, నళిని, మల్లికలు ఉండే వీధి వైపు అడుగులు వేసారు.
"కృష్ణవేణి ఇల్లు ఈ వెనుక వీధిలోనే కదా.. అటు వెళ్ళి అప్పుడు ఆనందిని దగ్గరకి వెళ్దాం. మళ్ళీ ఇటు రానక్కర్లేదు." చెప్పింది మేదిని.
"వద్దు వద్దు.. అందరినీ లేపే లోపు తను నిద్ర లేచి రాకపోతే, అప్పుడు వెళ్దాం వాళ్ళింటికి." చెప్పింది ఉత్పల.
"అదేం?"
"కృష్ణవేణిని నిద్ర లేపితే వాళ్ళ ఇల్లంతా నిద్ర లేస్తుంది. వద్దు."
"అవును! వాళ్ళింట్లో చిలకలూ, ఆవుల దగ్గర నుంచీ అన్నిటి పేరూ కృష్ణే కదా! .. కృష్ణ శబ్దం వినిపిస్తే నిద్ర లేచి కూర్చుంటాయ్.. కృష్ణవేణిని 'కృష్ణా' అని కాక ఇంకెలా నిద్ర లేపడం?" అంగీకరించింది సురభి.
"ఉత్పలా.. అప్పుడెప్పుడో వాళ్ళింటి కథ చెప్తానన్నావ్.. ఎందుకు ఆ ఇంట్లో అన్నిటి పేరూ 'కృష్ణ'?" అడిగింది మేదిని.
"హ్మ్.. మా వెనుక వీధేగా వాళ్ళది. ఆ కథ ఓ రోజు మా నాయనమ్మ చెప్పింది. ఇది మనం పుట్టక ముందు కథ. కృష్ణుడు రేపల్లెకి రాక ముందు కథ."
"చెప్పు చెప్పు..మనం ఇంకా చాలా దూరం నడవాలిగా.."
వెన్నెల్లో మెరుస్తున్న రేపల్లె వీధులు ఓ కథ వినడానికీ, కీచురాళ్ళ సడితో ఊ కొట్టడానికీ సిధ్ధమయ్యాయి. కన్నయ్య కబుర్లు లేని కథ రేపల్లెలో ఉండదని వాటికీ బోలెడు నమ్మకం!
"కృష్ణ వేణి తండ్రి అసలు పేరు పుండరీకుడట. మీకెవరికీ తెలిసి ఉండదు. మహా కోపిష్టి. మనిషి పొడ గిట్టదు. ఇల్లాలని గౌరవమూ, పెద్దలని భక్తీ, పిన్నలని ప్రేమా ఉండేది కాదట అతనికి. కుండలు చెయ్యడం కదా అతని వృత్తీ.. పాలకో, చల్లకో కడవ కొనాలని వెళ్ళే ప్రతీ వాళ్ళూ అతని ముక్కోపానికీ, దురుసు మాటలకీ, గర్వానికీ విసుక్కొనే వారట. తను చేసిన కుండలే రేపల్లెకి దిక్కని గర్వమట. "వెయ్యి మందలున్న రాజైనా వాడేది నా కుండలే!" అని తలెగరేసి చెప్పేవాడట. అతని మొహంలో నవ్వనేది ఉండేది కాదట.
ఇలా ఉండగా కన్నయ్య పుట్టాడు. "రాజుగారబ్బాయైతే నాకేమైనా గొప్పా..?" అని కనీసం వెళ్ళి చూడలేదట. ఇతను మనిషి కాదని ఊళ్ళో వాళ్ళంతా దాదాపు పుండరీకుడిని వెలేసినంత పని చేసారు. అయితే "మనం పెంచే పశువుల్లాగే మనకీ కట్టు ముఖ్యం. పొగరు గిత్త పట్లైనా కొన్నాళ్ళు సహనం వహించాలని" నందగోపుడు ఊరివాళ్ళకి సర్ది చెప్పాడట. శుక్ల పక్ష చంద్రుడిలా కన్నయ్య ఎదిగి పెద్దవాడవుతున్నాడు. సరిగ్గా రాజుగారి పెరట్లోంచి పుండరీకుడి పెరడు, కుమ్మరి చక్రం, కుండలు కాల్చే ఆవము కనిపిస్తాయి కదా! కిట్టయ్య అసలే తుంటరి వాడు!! పుండరీకుడు తయారు చేసిన కుండ తయారు చేసినట్టు రాళ్ళు విసిరి బద్దలుగొట్టేవాడట. పంచాయితీలూ, పరిహారం ఇప్పించడాలూ చాలా సార్లే జరిగాయట.
"ఈ చెడ్డ పేరు నీకెందుకు కన్నా, అల్లరి మానెయ్య్.. " అని యశోదమ్మ కన్నీళ్ళు పెట్టుకుందని కన్నయ్య ఓ రోజు పుండరీకుడి కుండలు బద్దలుగొట్టడం మానేసాడట. ఆ రాత్రి పుండరీకుడు హాయిగా నిద్రపోయాడు. తెల్లారి లేచే సరికి అందరిళ్ళలో కుండలూ బద్దలైపోయి ఉన్నాయట. కన్నయ్యని రాత్రంతా వాళ్ళమ్మ పొదువుకునే పడుకుంది మరి! అయినా ఊరంతా తిరిగి ఒక్క రాత్రిలో వేల కుండలెలా బద్దలు గొడతాడని, ఇదేదో దృష్టనీ, మాయనీ తీర్మానించుకుని, పుండరీకుడిని పిలిపించి కుండలు చేసివ్వమన్నారట రాజుగారు. గొల్లపల్లెలో కడవలు లేనిదే క్షణమైనా గడుస్తుందా! మనుషుల్ని సాయం ఇచ్చి పంపించారట. పుండరీకుడు పని మొదలు పెట్టాడు. ఒక్క కుండా సరిగ్గా రాదే! ఏ కుండైనా వచ్చినా ఆవంలో పగిలిపోయేది. చీకటి పడే దాకా ప్రయత్నం చేసి సాయం వచ్చిన వారంతా వెళ్ళిపోయారట. పుండరీకుడికి కృష్ణమాయ అర్ధం కాక చక్రం ఎదుట తల పట్టుకుని నిశ్చేష్టుడై కూర్చున్నాడట.
"ఇదిగో.. మావయ్యా.." అని కన్నయ్య గోడవతల ముక్కాలి పీట వేసుకుని, గోడ మీద నుంచి తొంగి చూస్తూ నల్ల నల్లని కళ్ళతో నవ్వుతూ పిలిచాడట.
అసలే చేష్టలుడిగి కూర్చున్న పుండరీకుడు మాయ కన్నయ్య వైపు అయోమయంగా చూసాడట.
"మరేమో! మా ఇంట్లో కుండలన్నీ రాత్రి బూచి బద్దలు గొట్టేసిందట. మా ఎర్రావు పొదుగు దగ్గర తల పెట్టి పాలు తాగేసాననుకో. కానీ పెరుగూ బువ్వా కావాలంటే కుండలుండాలట! అమ్మ చెప్పింది. నా బొజ్జకి ఎక్కువ పెరుగేం వద్దులే. ఓ బుజ్జి కుండ చేసివ్వవూ.." అని ముద్దు మాటలతో అడిగాడట.
కన్నయ్య చక్రాల కళ్ళలోకి చూస్తూ రెప్పకొట్టడం మరచి, మంత్రమేసిన వాడిలా "సరే!"నన్నాడట పుండరీకుడు.
అంతే! చక్రం తిరగడం మొదలెట్టింది. తెల్లారేసరికి పుండరీకుడి ఇల్లంతా కుండలే! మాయపొరలు వీడిన మనిషేమవుతాడు..!? పరమానందానికి రాజవుతాడు. ఆ రోజు నుంచీ పుండరీకుడి లోకం 'కృష్ణ శబ్దమే!' కుండలు కృష్ణ.. పిచికలు కృష్ణ.. చిలకలు కృష్ణ.. పశువులు కృష్ణ... ఆఖరుకి కూతురూ కృష్ణే! తన పేరు కూడా తను మరచిపోయాడు. "కృష్ణా.." అంటేనే పలుకుతాడు.
నల్లనయ్య ఒకనాడు దంతపు బొమ్మలాంటి కృష్ణని చూసి, "పాల మీగడలా ఉన్నావు! నీకు "కృష్ణా" అని పేరు పెట్టాడా మీ అయ్య! వెర్రిమారాజు! నేను కృష్ణుడినీ, నువ్వు కృష్ణవేణివీ!" అని ఆ పిల్ల నల్లని తెగబారెడు జడలో ఓ చామంతి పువ్వు తురిమాడు. అలా కృష్ణ కాస్తా కృష్ణవేణయ్యింది." కథ ముగించింది ఉత్పల. అందరి మనసులలోనూ మాటల కందని భావన! ఏరువాకలో పైరులా మనసు తడిసి, ఆపై కనులను తడిపితే మాటలేం వస్తాయ్!!
అందరిలోనూ ముందు తేరుకున్న సురభి చెప్పింది. "మహ మాయగాడు సుమీ! మనసులో ప్రవేశించడమే ఆలస్యం! సర్వవ్యాప్తమైపోతాడు. ఇహమూ, పరమూ తానేననిపించేస్తాడు. ఆనాడు బలి చక్రవర్తి అంతటి వాడే ఇతగాని 'ముద్దు బుడత రూపం' చూసి వశమై, మూడడుగుల నేలనిచ్చి ముల్లోకాలూ కొలిచిన ఆ దివ్య పాదాన్ని తలపై దాల్చాడు. ఇంక వెర్రి కుమ్మరి వాడి లోకాన్ని జయించడం కన్నయ్యకి చిటికెలో పని కదూ!"
మేదిని కలలోంచి తేరుకున్నట్టు చెప్పింది. "సత్యం!"
ఇంతింతై వటుడింతై మఱియు దానంతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై
రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై...
యమున అల్లంత దూరాన గొల్ల పడుచుల నోట వినిపిస్తున్న వామన మూర్తి విశ్వరూప దర్శనాన్ని విని ఉప్పొంగి స్వాగతం పలికింది. ఇంతలో కృష్ణవేణి వచ్చి నేస్తాలను చేరింది.
యథావిధిగా స్నానమూ, పూజా, నివేదనా పూర్తయ్యాక కాత్యాయనికి హారతినిస్తూ ఆనందిని చెప్పింది. "అమ్మాయిలూ! మన పల్లెలో సమృధ్ధిగా నెలకు మూడు వానలు కురియాలనీ, పాడీ పంటా లోటు లేకుండా పెరగాలనీ, అందరూ క్షేమంగా ఉండాలనీ కోరుకోండి."
తామరతూడుల్లాంటి చేతులు ముకుళించి కాత్యాయనికి తమ్మిమొగ్గల వందనం చేసారు గోపబాలలందరూ!
"నెలకు మూడు వానలా? అదేం లెక్క?" తామరాకులో పొగలు చిమ్ముతున్న కమ్మటి పొంగలిని నోట్లో వేసుకుంటూ అడిగింది తరళ.
"నెలకి మూడు వానలంటే వరుసగా కాదు. తొమ్మిది రోజులకి ఒక సారి ఒక వర్షం. తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు.. వర్షం పడ్డ రోజులు మూడు.. మొత్తం కలిపి ఒక మాసం. ఇలా కనుకా శ్రేష్టమైన వానలు పడితే పంటలు ఏపుగా పెరుగుతాయట! పైరు మొదళ్ళలో చేపలు ఎగిరేంత నీరు నిలుస్తుందట! అలాంటి నీటిలో విరిసిన కలువల్లో నిండిన తేనె తాగీ, ఊయలలూగీ ఎలతేంట్లు నిద్దరపోతాయట! ప్రసాదం నోట్లో పడుతూనే మనకి కంటి నిండా నిద్దరొచ్చేయట్లేదూ.." నవ్వింది ఆనందిని.
"ఇంకా ఇప్పుడేం నిద్రా.. ఇళ్ళకి వెళ్ళాలి. పాలు పితకాలీ, చద్దులు మూట కట్టాలీ.. చల్ల చిలకాలీ.." పనుల్ని గుర్తు చేసింది మేదిని.
"మన నోము ఫలించి నెలకి మూడు వానలు పడితే ఇంకా పనులు పెరిగిపోతాయి తెలుసా, అమ్మడూ! సమృధ్ధిగా పచ్చిక మేసిన పశువులు పాల ధారలు వర్షంలా కురిపిస్తాయి."
"అంత కంటే కావలసినదేముంది చెప్పు! ఏదీ కమలినీ.. పాట పాడవూ.." అడిగింది మేదిని.
మంచి అర్ధమూ, నడకలో ప్రాస కలిగిన అందమైన పదాలతో ఎవరో మహా కవి కూర్చిన మధురమైన పద్యంలా కనిపించారు ఒక చోట చేరిన ఆ పడుచులందరూ.. అప్పుడే తొంగి చూస్తున్న బాల భానుడికి. తెలివెలుగు కిరణాలలో మెరుస్తున్న కమలిని 'మధ్యమావతి' ఆలపిస్తోంది.
ఎనలేని సిరులతో నిండును
ఈ సీమ
ఈతిబాధలు కలుగకుండును!
మునుకొని త్రివిక్రముని నామములు పాడి
మొనసి మన నోమునకు తాన మాడితిమేని
నెలనెలా మూడు వానలు కురియును
బలిసి ఏపుగ పైరులెదుగును
అల పైరు సందులను మీ లెగురును
కలువల ఎలతేంట్లు కనుమూయును
కడగి కూర్చుండి పొంకంపు చన్నులను
ఒడిసి, పిదుకగ, పట్టి - రెండు చేతులను
ఎడము లేకుండ పెను జడుల ధారలను
కడవల ఉదార గోక్షీరములు కురియును
ఎనలేని సిరులతో నిండును ఈ సీమ..
కరిమబ్బు కావాలి - 4
రేపల్లెకి రాత్రి కావలి కాయడానికి వచ్చే జాబిలిని చుక్కలు ఒక్కటంటే ఒక్క క్షణం కూడా ఏమరపుగా విడిచిపెట్టవు. అవును! వాటికి అసూయ! చుక్కల్ని మించిన అధిక చక్కని భామలున్నారు రేపల్లెలో. వాళ్ళ నవ్వుల ముందు వెన్నెల ఓడిపోతుంది. వాళ్ళ వన్నెల ముందు చుక్కలు చిన్నబోతాయి. ఒకరికి తీసిపోని సొగసు మరొకరిది. మిలమిలలాడే మీనుల కన్నుల చిన్నది ఒకతె. సంపెంగ ముక్కుకి పెట్టుకున్న రవ్వల ముక్కెర తళుక్కుమనేలా వయారాలు పోయేదొకతె. గులాబి పెదాల మధ్య దానిమ్మ గింజల పలువరస జిగేల్మనేలా నవ్వులు రువ్వేదొకతె. 'శ్రీ'కారాన్ని పోలిన పల్చని ఎర్రని చెవులకి మరకతాలు పొదిగిన చెవికమ్మలు, ముత్యాల బావిలీలు ధరించి వగలు పోయేదొకతె. నలక నడుము చుట్టూ జారిపోతున్న పాలెల మొలనూలు సవరించుకుంటూ నడిచే సొగసరి మరొకతె. తమలపాకుల్లాంటి పాదాలకు పసుపు పారాణి పెట్టుకుని, పాంజేబు కడియాలు, మువ్వలు ఘల్లుమనేలా అడుగులు వేసేదొకతె. ఇంత మంది అందాల భరిణల మధ్య వెలవెల బోయే పిల్లొకరుంది. ఆమే 'సుమన'.
సుమన అనాకారి కాదు. కానీ అందగత్తె అంతకన్నా కాదు. ఒకప్పుడు ఆమెకు అద్దంలో తన చింతాకు కళ్ళు చూసుకోవడమంటే తగని వెరపు. చట్టి ముక్కు చూసుకుంటే ఆమెకి మహా రోత. పెదాలూ అంత బాగోవు. నవ్వా.. నవ్వినదెప్పుడని? ఒడ్డూపొడవూ అంత గొప్పగా ఉండదు. రంగు వెలిసిన బొమ్మలా ఉంటుంది. రవ్వల మధ్య మట్టిబెడ్డలా వెలతెలబోవడం ఇష్టం లేక ఆమె మిగిలిన గోప కాంతలతో వన విహారాలకూ, వెన్నెల స్నానాలకూ వెళ్ళేది కాదు. ఆమె క్రమం తప్పక ధరించేది మేలిముసుగును మాత్రమే!
రేపల్లెలో దూరంగా విసిరేసినట్టుండే ఓ ఇంట్లో ఉంటుందామె. ఆ ఊరి మీదుగా వెళ్ళే యాత్రీకులకు అడగకుండానే అతిధిమర్యాదలు చేసి పంపుతుంది. తెలవారక ముందే యమున నీళ్ళు తెచ్చి కడవల్లో నింపి వేసవి కాలమంతా చలివేంద్రం నడుపుతుంది. వర్షాకాలంలో దారి తప్పి ఊళ్ళోకొచ్చిన ప్రయాణీకులకు రాత్రికి బస ఏర్పాటు చేస్తుంది. ఏ వేళలో ఎవరొస్తారో అని ఎప్పుడూ పదిమందికి సరిపడే భోజనం సిధ్ధం చేస్తుంది. అతిధి రాని రోజు ఆమెకు అన్నం సహించదు. తన నట్టింట్లో కనీసం పది విస్తళ్ళు లేవని రోజు ఆమెకు మా చెడ్డ లోటుగా ఉంటుంది. అంతేనా.. ఊళ్ళో ప్రతి బాలింతకీ పథ్యం ఆమే పంపుతుంది. ప్రతి పాపాయికీ అగరు, కాటుకా తనింట్లో వేసి ఇస్తుంది. జ్వరం పడ్డ వాళ్ళకి జావ కాచి తీసుకెళ్ళి పలకరించి వస్తుంది. ముసలీ ముతకకి ఇంట్లో పిల్లలా సాయం చేస్తుంది.
రేపల్లెలో పుట్టిన ప్రతీ పుట్టా, పులుగూ లాగే సుమనకి కృష్ణుడంటే పంచప్రాణాలు. కానీ ఎప్పుడూ ఎదుటపడే ధైర్యం చేసేది కాదు. వేణుగానానికి ఓడి కన్నయ్య చెంతకి పరుగులు తియ్యని ఒకే ఒక ప్రాణి సుమన మాత్రమే! దొంగ చాటుగా అతడిని చూసి కళ్ళు ముసుకు ఇంటికి నడుచుకొచ్చేస్తుంది. రెప్పలు విప్పితే కన్నయ్య రూపం కరిగిపోతుందేమో అని ఆమెకు బెంగ. అందరిలాగే తనూ అందంగా ఉంటే కృష్ణుడి ఎదుట పడేదాన్ని కదా! అనుకునేది. సృష్టిలో ప్రతీ ప్రాణినీ ఒకేలా మలచని దేవుడిది 'అన్యాయమ'ని బాధపడేది.
ఓ సాయంత్రం తప్పిపోయిన తన పెంపుడు నెమలిని వెతుక్కుంటూ వెళ్ళింది సుమన. బృందావనం వైపు నుంచి నెమళ్ళ క్రేంకారాలు వినిపించి అటుగా నడవసాగింది. అక్కడ మురళిని ఓ చేత పట్టుకుని, విలాసంగా ఓ తిన్నె మీద కూర్చుని కృష్ణుడు కనిపించాడు. ఆ తిన్నె పక్కనే నెమళ్ళ గుంపు. తన నెమలి కూడా ఆ మందలో చేరిపోయినట్టు గమనించింది. చప్పుడు చెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అడుగు వెయ్యబోయింది. పిల్లగాలి తాకినట్టు వేణుగానం మొదలయ్యింది. కాలు కదలదే! నేలలో పాతుకుపోయిన మొక్కా మోడూలాగే ఆమె కాళ్ళూ నిలచిపోయాయి. ఎంత సేపు గడిచిందో తెలియదు.
వేణుగాన మాధుర్యం మనసు నిండి పొంగి పొరలుతూ ఉండగా, హఠాత్తుగా ఆపేసాడు కృష్ణుడు. కలవర పడి కళ్ళు తెరిచింది. కదలలేదని తను తలచిన కాళ్ళు తనని ఎప్పుడు నడిపించి ఆతని ముందు నిలబెట్టాయో మరి! ఎదురుగా మోహన కృష్ణుడు చిరునవ్వుతో...!!
"నీ నెమలి కానీ తప్పిపోయిందా?"
"ఊ.."
"ఈ మందలో ఉంటే తీసుకెళ్ళు"
ఎదురుగా కృష్ణుడుంటే వేరే దిక్కు కళ్ళు మరలుతాయా! అతి ప్రయత్నం మీద కళ్ళు తిప్పి చూసింది. తన నెమలికీ మిగిలిన వాటికీ తేడా తెలియడం లేదు. అసలు నెమళ్ళన్నీ ఒకేలా ఉంటాయా? లేక తనే గుర్తు పట్టలేకపోతోందా? ఆశ్చర్యం!
"ఇదా.. కాదు.. అదేమో.. ఊహూ.. ఒకేలా ఉన్నాయే!" అయోమయంగా కృష్ణుడి వైపు చూసింది.
"గుర్తు పట్టలేవా? నువ్వేగా అన్ని ప్రాణుల్నీ ఒకేలా పుట్టించని దేముడిది అన్యాయమన్నావు. ఇదిగో ఇవన్నీ ఒకేలా ఉన్నాయ్. అంతే కాదు, నువ్వూ నేనూ కూడా అచ్చం ఒకేలా ఉన్నాం..!" కావాలంటే చూసుకో అన్నట్టు కాస్త దూరంలో ఉన్న కొలను వైపు చూపించాడు.
వెళ్ళి కొలనులో అయోమయంగా తన మొహం చూసుకుంది. కృష్ణుడు కనిపించాడు! కళ్ళు నులుముకుని చూసింది. నిశ్చలంగా ఉన్న కొలను నీళ్ళలో సాయంకాలపు వెలుగులో తళుక్కున మెరుస్తూ కృష్ణుడు! అది కొలను కాదేమో అని చేతితో నీళ్ళు కదిపి చూసింది. తన చేతులు, ఒళ్ళూ చూసుకుంది. మొహం తడిమి చూసుకుంది. నుదుటి మీదకు పడుతున్న ముంగురులనూ, నీలి ఛాయలో మెరుస్తున్న చేతులనూ, మెడలో వ్రేలాడుతున్న కౌస్థుభ మణినీ, చేతిలో ఉన్న వేణువునీ చూసుకుంది. తన ఒంటిని అంటిపెట్టుకుని ఉన్న పీతాంబరాన్ని తడిమి తడిమి చూసుకుంది. తిన్నె మీద కూర్చున్న కృష్ణుడి వైపు చూసింది.
నవ్వుతున్నాడు. మధురంగా.. చల్లగా.. హాయిగా..
"ఏం మాయ ఇది, కన్నా..!!" గొంతు పూడుకుపోతూ ఉండగా అడిగింది.
"ఏమో మరి! నువ్వూ నేనూ ఒకటే కదా! కాదా?!" ఏళ్ళూ పూళ్ళూ ఘోరతపస్సు చేసే గొప్ప గొప్ప ఋషుల ప్రశ్నలకి సమాధానమది. కన్నీళ్ళు ధారలై మనసులోని న్యూనతనీ, మాయనీ కడిగేస్తూ ఉండగా సుమన నవ్వింది.. పులు కడిగిన మాణిక్యంలా..
"అవును కృష్ణా! నువ్వూ నేనూ ఒకటే. నువ్వే నేను." నిజమే కదూ! హెచ్చు- తగ్గు, అందం - అనాకారితనం, పేద - గొప్ప, తెలుపు - నలుపు అన్నింటా వ్యాపించి ఉన్న అంతర్యామి అతడు.
అప్పటి నుంచీ సుమన సాయంకాలం యమున ఒడ్డున చేరి, గోపికలందరి తోనూ ఆటలు ఆడింది. పువ్వులు మాలలు కట్టి కృష్ణుడి మెడలో వేసింది. వేణు గానపు సంకేతానికి బృందావనం చేరి, కన్నయ్యతో కబుర్లు చెప్పింది. అందరిలో ఒకరయ్యింది. ఇప్పుడు అందరితోనూ కలిసి కాత్యాయనీ వ్రతమూ చేస్తోంది.
తెలవారు ఝామున తలుపు తీసుకుని బయటకు వచ్చి, ఇంటిముందున్న తోటలోని పువ్వులు కోసుకుని, సజ్జ నింపుకుని బయటకు వచ్చింది సుమన. వెంట వీధిలోకి వచ్చి సాగనంపిన తన పెంపుడు నెమలిని ముద్దు చేస్తూ అక్కడే కాసేపు నిలబడిపోయింది. ఈ లోపు ఆ వీధిలోకి వచ్చిన నేస్తాలని చూసి పలకరింపుగా నవ్వింది.
"ఏవమ్మా.. నీ యజమానురాలిని వదలలేకపోతున్నావా? పూజ అవగానే పంపేస్తాములే!" నెమలిని పలకరించింది విష్ణుప్రియ.
"నువ్వు మైమరచి నాట్యం చేసేలా వర్షాలు కురవాలనే ఈ వ్రతం చేస్తున్నాం. మరి వెళ్ళి రమ్మంటావా!" నవ్వుతూ దాన్ని అడిగింది సురభి.
"అసలీ నెమలిదే అదృష్టమంతా.. కన్నయ్య ని నిత్యం అంటి పెట్టుకు ఉండే ఆభరణం దీని పింఛమేగా! నల్ల మబ్బుదీ, నెమలిదీ, నల్లని కన్నయ్యదీ వీడని బంధం కదా!" మురిపెంగా అంది సుమన యమున వైపు దారి తీస్తూ.
"నిజం! నెలకు మూడు వానలు కోరుకుంటున్నాం లే మయూరీ! నువ్వూ ఆనందంగా ఆడచ్చు!" వెనక్కి తిరిగి సుమన ఇంటి ముందు నిలబడి చూస్తున్ననెమలితో అల్లరిగా చెప్పింది కమలిని.
"వానలంటే అలాంటిలాంటి వానలు కాదు మయూరమూ, చెంగలువలూ, పుడమీ, పైరులూ పులకరించే వర్షం రావాలి."
"పుష్కలావర్తక మేఘాలతో ఆకాశం నిండిపోవాలి." అంది ఆనందిని.
"కాస్త అర్ధమయ్యేలా చెప్పకూడదూ! కరిమబ్బులన్నీ ఒకటే కదా! మరీ పుష్కలావర్తకాలేమిటీ?"
"అంటే మేఘ శ్రేష్ఠాలు. నల్లనయ్యలా నల్లగా ఉంటాయి"
"ఉరుములూ మెరుపులూ.. హోరు గాలులూ.. వర్షమంటే నాకు ఎంత భయమో!" చెప్పింది మేదిని.
"వర్షమంటే భయమెందుకూ! మనం కోరుకునే మేఘం అలాంటిలాంటిది కాదు. ఆ మేఘం సగర చక్రవర్తి కుమారులు తవ్విన గుంటల్లో నిండిన నీళ్ళు తాగకూడదు. నేరుగా సముద్రం లోపలి దాకా వెళ్ళాలి. అక్కడ తన దాహం తీర్చుకోవాలి." చెప్పింది ఆనందిని.
"ఊ.. ఇంకా! నల్లనయ్యలా నల్లని రూపం సంతరించుకోవాలి."
"అంతే కాదు! ఫెళ ఫెళా గర్జించాలి. శ్రీ హరి పాంచజన్యం చేసే ధ్వనిలా ఉండాలి దాని గర్జన!"
"హమ్మయ్యో! ఇంకా.." బెదురు చూపులతో అడిగింది మేదిని.
"ఆ మేఘం మరో మేఘంతో రాసుకు ఏర్పరిచే మెరుపు పద్మనాభుడి దక్షిణ హస్తాన జాజ్వల్యమానంగా వెలిగే సుదర్శన చక్రం సృష్టించే మెరుపులా ఉండాలి !"
"సుదర్శన చక్రపు వెలుగెలా ఉంటుందో! కళ్ళు మిరుమిట్లు గొలపవూ! అసలు చూడ శక్యమా!" భయం భయంగా ప్రశ్నించింది మేదిని.
"వెర్రి పిల్లా! భయపడకు. సుదర్శనుడికి ఆహ్లాదంగా నవ్వడమూ తెలుసు. పూర్వం సృష్టి మొదలయినపుడు పాలకడలిలో యోగ నిద్రలో ఉండే శ్రీ మహా విష్ణువు పక్కన శంఖ చక్రాలు మాత్రమే ఉన్నాయట. అప్పుడు స్వామి నాభి నుంచి కమలం పుట్టింది. ఆ కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడట. నారాయణుడు ఇంకా యోగనిద్రలోనే ఉన్నాడు. సృష్టికర్త పుట్టాడన్న ఆనందంతో సుదర్శనుడు "పుత్రస్తే జాతః నీకు కొడుకు పుట్టాడయ్యా! చూడు చూడు!" అని సంబరపడిపోతూ చెప్పాలనుకున్నాడట. మరి సుదర్శనమంటే చక్రం! ఆయన మాటలు మెరుపులే కదా! పట్టలేని ఆనందంతో ఓ బ్రహ్మాండమైన మెరుపు మెరిపించాడట. ఆహ్లాదకరమైన జాజ్వల్యమానమైన మెరుపది. అలాంటి మెరుపు కావాలి."
ఆనందిని మాటల్లో దృశ్యాన్ని ఊహించుకుంటూ కళ్ళల్లో భయాన్ని జయించిన ఆనందం మెరుస్తూ ఉండగా అడిగింది మేదిని.
"ఆహా! ఇంకా.. ఇంకా.."
"రావణుడి మీద రాముడు కురిపించిన బాణ వర్షాన్ని తలపించే చినుకులతో వర్షం కురవాలి. అలాంటి మేఘం కావాలి. మన మార్గశీర్ష స్నానానికి సరిపడా, పైర్లకు సమృధ్ధిగా నీరు ఉండేలా వర్షాలు కురియాలి."
"ఆ మెరుపులు చూసి చెంగలువలు విచ్చుకోవాలి. నెమళ్ళు క్రేంకారాలతో నాట్యం చెయ్యాలి. యమున ఉప్పొంగి పారాలి. అదిగో యమున.. పదండి నేస్తాలూ.. తెలవారక ముందే త్వరపడాలి." స్నానానికి సిధ్ధపడమని నేస్తాలను పిలిచింది సురభి.
"ఏమో ఆనందినీ! అంత గొప్ప మేఘాన్ని కోరుతున్నాం. మన పూజలకూ, మన పిలుపులకూ మెచ్చి వస్తుందంటావా!" సందేహాన్ని వెలిబుచ్చింది కమలిని.
"అయ్యయ్యో! ఎంత మాట కమలినీ! మనమెవరం! సాక్షాత్తూ ఆ కన్నయ్యని కొలిచేవాళ్ళం. అలా తక్కువ చెయ్యకు సుమా!"
"కన్నయ్య పిలిస్తే మేఘమే కాదు సాక్షాత్తూ ఇంద్రుడే వస్తాడు. కృష్ణుడు గోవర్ధన గిరి ఎత్తినపుడు చూడలేదూ మనం! కానీ మనం పిలిస్తే.."
"సందేహ ప్రాణివి కదూ, నువ్వు!" విసుక్కుంది సురభి.
"సందేహం తీర్చేస్తే పోతుంది కదా సురభీ! నేను చెప్తాను విను. 'ఓ మేఘాన్ని మనం పిలిస్తే వచ్చేనా?' అని సందేహపడుతున్నావ్. ఆ మేఘమే కాదు యముడైనా హరిని నమ్మిన వారికి వెరవాల్సిందే! పిలిస్తే పలికి తీరాల్సిందే! తెలుసా!" నమ్మకంగా చెప్పింది ఆనందిని.
కమలిని కళ్ళలో ఇంకా అపనమ్మకం. మేదిని కళ్ళల్లో ఆనందిని ఏం చెప్తుందా అని కుతూహలం. యమున ఒడ్డుకు చేరి నిలుచున్నారంతా..
"ఇదిగో ఈ యమునమ్మ అన్నగారే యమధర్మ రాజు. ఆయన తన కింకరుడికి ఏం చెప్పాడటో తెలుసా!"
యమున ఆసక్తిగా పుట్టింటి కబురు వినిపిస్తుందని గలగలలు అపి వినసాగింది.
"ప్రభురహం అన్యనృణాం న వైష్ణవాణాం" అని తన కింకరుని చెవిలో చెప్పి మరీ పాశాన్ని ఇచ్చి పంపుతాడట. అంటే మధుసూదనుడిని నమ్మిన వారికి తాను ప్రభువు కాదు. వారి మంచీ చెడూ చూసేది కన్నయ్యే! అని చెప్పాడన్నమాట.
కళ్ళు మిలమిల్లాడించారు కమలినీ,మేదినీ. యమునా కన్నయ్య పక్షమేగా! గర్వంగా నవ్వుకుని మనసులో అన్నగారిని మెచ్చుకుంది. తనని పొంగి పొరలేలా చేసేందుకు రాబోయే వర్షాన్ని తలుచుకు సంబరపడింది.
యమునలో "హరిహరీ!" అంటూ పడుచులందరూ మునిగి తెల్లకలువల్లా పైకి తేలారు.
రోజూ చేసిన విధంగానే తడి ఇసుకతో "కాత్యాయనీ ప్రతిమ" చేసుకుని, సురభిళ పుష్పాలతో, ధూప దీప నైవేద్యాలతో, ఆనాటి పూజ పూర్తి చేసుకున్నారు.
చల్లని గాలి వీస్తోంది. యమున నెమ్మదిగా కదులుతోంది. తొలివెలుగుల్లో ముత్యాల దండలా ఒక చోట చేరి కూర్చున్న వారందరి మనసులలోనూ, కృష్ణ శబ్దమే అమృత వర్షాన్ని కురిపిస్తుంది. పాడీ పంటా పచ్చగా ఉండేందుకు కృష్ణుడి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని "అమృతం కురిసే మేఘం" రావాలని ఆ గొల్ల పిల్లలు "అమృత వర్షిణి" రాగంలో తీయగా ఆలపించసాగారు.
కురియుము కురియుము వర్షము
వరలగ జగతికి హర్షము
ఓయీ గంభీర హృదయ!
ఓయీ వర్ష నిర్వాహ!
మురిసి మార్గశిర స్నానమును
మును మే మొనరుప తడయక
జలనిధిలో జొరబడి, అట సలిలమెల్ల త్రాగి త్రాగి,
ఫెళఫెళ మని గర్జింపుచు, బిరబిర పైకెగసిఎగసి,
అల కాలోపలక్షిత జగత్కారణుని మూరితి
వలె నీ మెయి నీల నీల వర్ణముతో తేల తేల
సుందరపటుబాహువు అరవిందనాభు మేటి కరము
పొందిన శ్రీ సుదర్శనము పొలుపున తళతళ మెరసి,
క్రందుగ దక్షిణావర్తమగు శ్రీ పాంచజన్యమ్ము
చందమ్మున ఉరిమి, శార్ఞ్జమట్లు అంపజడులు చిమ్మి
కురియుము కురియుము వర్షము
ఒప్పుల కుప్పలు - 5
కృష్ణ పక్షం జాబిలి దీపపు వత్తిని కాస్త తగ్గించి, చీకటి దుప్పటి కప్పి, రాత్రంతా రేపల్లెని హాయి ఊయలూచింది. తెలవారడానికి ఇంకా సమయం ఉంది. సుకుమారమైన ఆడపిల్లల్లాంటి పారిజాతాలు "కాత్యాయనీ వ్రతానికి" తామూ వస్తామని చలిగాలి పల్లకీ ఎక్కి నేల చేరుతున్నాయి. గోప కాంతలందరూ ఆదమరచి వేకువఝాము కలలు కంటున్నారు. మేదినికి మాత్రం రాత్రంతా కలత నిద్రే! ఏవో కలలు, ఏదో బెంగ. ఇక చాలునని పడక మీద నుంచి లేచి కూర్చుంది. మనసంతా రకరకాల ఆలోచనలు. ఎవరితోనైనా పంచుకుంటే బాగుండనిపించే తలపులు. లేచి బయటకు వచ్చింది. ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. పూల సజ్జ తీసుకు వచ్చి మంచు తానాలాడుతున్న గులాబీలూ, నంది వర్ధనాలూ కోసి సజ్జ నింపింది. ఆ పై పారిజాతాలు ఏరింది. ఆనందినిని నిద్ర లేపేందుకు అడుగులు వెయ్యసాగింది. నిద్ర లేచేందుకు సిధ్ధమవుతున్న పిట్టలు, పశువులూ చలికి బధ్ధకంగా మసలుతున్నాయి. ఆనందిని అప్పటికే నిద్ర లేచి బయటకు వచ్చింది.
"అప్పుడే పువ్వులేరి తెచ్చావే!" అని నవ్వుతూ పలకరించింది ఆనందిని.
"అవును. రాత్రంతా సరిగా నిద్ర లేదు. చేసేదేముందనీ.. ఈ పని పూర్తి చేసాను."
"కళ్ళు మంకెనల్లా ఉన్నాయి. ఏం, ఒంట్లో కులాసానా?"
"ఆ.. కన్నయ్యని కట్టేసిన రోలల్లే నిక్షేపంగా ఉన్నాను. నాకేం! ఎందుకో రకరకాల బెంగలు." నవ్వు లేని మేదిని మొహం ఆకాశంలో దూరంగా మినుకుమంటున్న తారలా ఉంది.
"ఏమయిందమ్మా.. చెప్తేగా బెంగ తీరేది!"
"కలొచ్చింది. నేనేమో ఆదమరచి నిద్దరోతున్నానట. నిద్ర లేపీ లేపీ విసుగొచ్చి మీరంతా వెళ్ళిపోయారట. అది మొదలూ ఎంత బెంగగా ఉందో!" బేలగా చూస్తూ చెప్పింది.
"హహ్హహ్హహా.. ఓసి పిచ్చి పిల్లా! ఇంత మాత్రానికేనా! నువ్వు నిజంగా అలాగే నిద్దరోయావనుకో! అందరం కలిసి నిన్ను ఎత్తుకెళ్ళి చల్లని యమున నీళ్ళతో కళ్ళు తుడిచి, నిద్ర లేపి మరీ లాల పోసేస్తాం. వెర్రి దానా! నిన్ను వదిలేస్తామా! నేనే నిద్ర లేవకపోతే, నన్ను నువ్వు అలాగే వదిలేసి వెళ్ళీపోతావా చెప్పు!?" చిరు మువ్వలు గలగల్లాడినట్టు నవ్వేస్తూ అడిగింది ఆనందిని.
"ఊహూ.. వదలను. 'కృష్ణా కృష్ణా' అని నీ చెవిలో అరిచి మరీ నిద్ర లేపేస్తాను." మబ్బుచాటు తొలిగిన నెలవంకల్లే నవ్వేసింది మేదిని.
"ఇంకేం! అయినా సందేహమెందుకు! మనం తలపెట్టినది మంచి పని. మన వెనుక ఉన్నది దేవదేవుడు. ఎలాంటి అడ్డూ లేని మందాకినిలా మన వ్రతం సాగిపోతుంది."
"శ్రేయాంసి బహు విఘ్నాని" అని అంటారు కదా! మంచి పనికే పరీక్షలు, ఆటుపోట్లూ ఎక్కువ! ఏవిటో.. ఈ బెంగ నీడలా వెంటాడుతోంది."
"లాభం లేదమ్మాయీ! హనుమ లాగే నీకూ నీ బలం తెలీయడం లేదు. సముద్ర లంఘనానికి ఆలోచిస్తున్న ఆయనకు వానర సైన్యమంతా గుర్తు చేసినట్టు, నేనూ నీకు మన బలమూ, మన వెనుక దన్నూ గుర్తు చెయ్యక తప్పదు!"
"నీ మాటలు వింటే ధైర్యమొస్తుంది. చెప్పు ఆనందినీ!"
"నీకో కథ చెప్తాను విను. ఓ చీమ ఉండేదట. దానికి గంగలో మునక వెయ్యాలని చాన్నాళ్ళ నుంచీ కోరిక. కానీ అది తీరే దారేదీ! మేరు పర్వతంలా రోజురోజుకూ పెరిగిపోతున్న తన కోరికని సాధించుకునేందుకు ఆలోచించీ ఆలోచించీ దాని చిట్టి బుర్రలో ఓ ఉపాయం తట్టిందట! ఓ శివాలయం ముందున్న బిల్వవృక్షం ఎక్కి కూర్చుందిట. ఉదయాన్నే శివార్చన కోసం బిల్వ దళాలు కోసిన పూజారి పూలసజ్జతో చీమ శివ సన్నిధిని ప్రవేశించిందట. అర్చన చేస్తూ చీమ ఎక్కిన బిల్వ దళాన్ని శివుని శిరస్సుపై ఉంచాడట. శివుని తలపై ఉండే గంగమ్మ చీమ భక్తికి మెచ్చి పొంగిపోయిందట. అలా చీమ కోరిక కాస్తా తీరిందన్నమాట! ఉపాయమూ, కోరికా ఉంటే ఎంతటి పనైనా చెయ్యగలం, అమ్మడూ!"
"కథలదేముంది లే ఆనందినీ..ఎన్నైనా చెప్తావూ! నేనూ ఓ కథ చెప్తాను విను. ఓ తుమ్మెద పద్మం పై వాలిందట. మకరందం తాగి ఆ మత్తుకి కళ్ళు మూసుకుని అక్కడే పడి నిద్రపోయిందట."
"కలలో నువ్వు కృష్ణ రసాయనం తాగీ తాగీ మొద్దు నిద్ర పోయినట్టే!" ఆటపట్టించింది ఆనందిని.
"ఇదిగో, ఇలా అయితే నేను చెప్పను." మూతి ముడిచిందా ముద్దుగుమ్మ.
"లేదు లే! అదిగో సురభీ, కమలినీ, విష్ణుప్రియా వస్తున్నారు. తరళ కూడా..మిగిలిన వాళ్ళు యమున ఒడ్డుకే వచ్చేస్తారనుకుంటా! చెప్పు చెప్పు. నీ కథ వాళ్ళూ వింటారు." అంది ఆనందిని. వాళ్ళను చేరిన మిగిలిన చెలులు కూడా ఆసక్తిగా వింటూ నడవసాగారు.
"తేనె తాగి నిద్దరోయిన తుమ్మెద మేలుకునే సరికి సాయంకాలం అయిపోయింది. పద్మం ముకుళించుకుపోయింది. "సర్లే, మళ్ళీ తెల్లారదా!" అని ఎదురు చూస్తూ అలా పద్మంలో బందీయై తుమ్మెద రాత్రంతా ఉండిపోయిందట. తెల్లారింది. ఉదయాన్నే స్నానానికి ఆ కొలనులోకి వచ్చిన ఓ మదపుటేనుగు ఆ పద్మాన్ని పెకలించి విసిరేసింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయింది. మన కర్మలు మనని ఎటు తీసుకు వెళ్తాయో చెప్పలేం కదా! కృష్ణుడంతటి వాడిని కోరుకోవాలంటే.. వెర్రి గొల్ల పడతులం! మన పుణ్యం సరిపోతుందా! వర్షాలు కురిపించి ఊరికి మేలు చేసేంతటి వాళ్ళమా!?"
సురభీ, ఆనందినీ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. తమ నేస్తం మనసును కబళించిన సందేహాల రాహువును విడిపించే శక్తి, సుదర్శన చక్రంలాంటి కృష్ణ గాధలకే ఉందని తెలిసి చెప్పనారంభించింది ఆనందిని.
"ఇందాకా ఏమన్నావు మేదినీ! కృష్ణుడిని కట్టిన రోలల్లే ఉన్నానని కదూ! కన్నయ్యని యశోదమ్మ ఎలా కట్టేసిందో నీకేమైనా తెలుసా?"
"తాడుతో!"
"అదే ఎలా?"
"అల్లరి కన్నయ్యని కట్టేందుకు ఒక తాడెక్కడ సరిపోతుందీ! పాపం వెర్రి తల్లి బోలెడు తాళ్ళు తెచ్చి, ముడులు వేసీ వేసీ అలసిపోయి కూలబడిపోయిందట. చమటతో ఆవిడ ఒళ్ళంతా తడిసిపోయిందట. జుత్తు ముడి జారిపోయి విడిపోయిందట. బొట్టు చెమటకి చెదిరిపోయిందట. ఆయాసపడిపోతోంది! అమ్మని అలా చూసే సరికి, కన్నయ్యకి బోలెడు జాలేసిందిట. వెన్నలాంటి మనసు కదూ! బొజ్జ కాస్త లోపలికి లాక్కున్నాడట. అంతే! ముడి వేసి రోటికి కట్టేసింది." వెలిగిపోతున్న మొహంతో ఉత్సాహంగా చెప్పింది మేదిని.
"మరి! ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. "పట్టుబడతాడా?" అనే సందేహం ఆమెకు లేదు. పట్టుబడితే చాలన్న తపన ఉంది. అంతే. ముద్దులు మూట కడుతున్నబుల్లి బుజ్జాయి బొజ్జకి కట్టేందుకు మూరెడు తాడు సరిపోలేదేవిటా! అనే సందేహం లేదు. దామోదరుడు మాయగాడు కదూ!" ఆనందిని ఇంక చెప్పక్కర్లేకుండానే అర్ధమయ్యింది అందరికీ.
"నల్లనయ్య పుట్టిన ఉత్తర మధురాపురి సామాన్యమైన ఊరు కాదు తెలుసా! వామనావతారంలో బలి చక్రవర్తి యాగం చేసిన సిధ్ధాశ్రమం అక్కడే ఉండేదట! వామన మూర్తి త్రివిక్రముడై ముల్లోకాలూ జయించినదీ ఇదే నేల మీద. ఆ పై విశ్వామిత్రుడు తపస్సు ఆచరించినదీ అదే స్థలంలో. రాముని కాలంలో ఆ అడవిలో శత్రుఘ్నుడు గొప్ప నగరం నిర్మించాడని చెప్తారు. అంత గొప్ప ప్రదేశం మధుర. "మధురా నామ నగరీ పుణ్యా పాపహరీ శుభా.. యస్యాం జాతో జగన్నాథః సాక్షాత్ విష్ణుః సనాతనః" అలాంటి నగరానికి రాజు మన కన్నయ్య. అలాంటి వాడు మన కోసం యమున దాటి ఈ రేపల్లెకి వచ్చి 'యశోద కడుపు చల్లగా' పెరుగుతున్నాడంటే.. మనం పుణ్యాల పుట్టలం కదూ! ఒప్పులకుప్పలం కదూ! మీరే చెప్పండి!?" అడిగింది సురభి. విచ్చిన కల్హారాల్లాంటి వాళ్ళ కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం కలిసి స్వఛ్చంగా మెరుస్తున్నాయి.
"కనుక అమ్మాయిలూ! మనం చేతులు జోడించి "కృష్ణా!" అంటే చాలు. మనం చేసిన పాపాలేవైనా ఉంటే ధాన్యపు పొల్లు గాలికి ఎగిరిపోయినట్టు, నిప్పులో వేసిన దూది బూడిదైపోయినట్టు మాయమైపోతాయి. ఆ పై మన పని మనం త్రికరణ శుధ్ధిగా చేస్తే చాలు. కన్నయ్య పేరు పలికితే పెదవి తియ్యనైపోతుంది కదూ! మనసు యమునలా పొంగదూ! అసలు 'కృష్ణ' అంటేనే గొప్ప ఆనందమని అర్ధమట." యమున వైపు దారి తీస్తూ చెప్పింది ఆనందిని.
అందరి మనసులూ వాన చినుకులకు తడిసిన పువ్వుల్లా స్వఛ్ఛంగా ఉన్నాయి. ప్రాతఃకాలానికి ముందే యమునలో స్నానం పూర్తి చేసుకుని కాత్యాయనీ వ్రత విధానాన్ని ఆచరించారు. "అమాయకమైన మనకు కలలోనూ, ఇలలోనూ తోడుండి నడిపించేది కృష్ణుడే!" అని మరోసారి ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. సందేహాలూ, బెంగలూ తీరిన మేదిని ముఖం తేటగా ఉంది. 'తోడి రాగం' లో కమలిని హాయిగా పాడుతున్న పాటను వింటూ ఉదయిస్తున్న భానుమూర్తికి స్వాగతం పలికారందరూ.
చెప్పరే! చెప్పరే! శ్రీ నామములను
ఒప్పుల కుప్పలార! తప్పక! తప్పక!
ఎప్పుడో చేసిన తప్పులన్నీ నశింప
నిప్పులో తూలికలుగ! ఇప్పుడే! ఇప్పుడే!
అల్ల వ్రజవంశమ్మునకు కల్యాణ దీపమైన వాని,
తల్లికడుపులకెల్లవేలలా చల్లని వెలుగైన వాని
అల్లన, అమలినలుగా ఏతెంచి ధ్యానించి, ధ్యానించి,
సల్లలిత సుమములర్పించి సేవించి సేవించి
మాయవాని, ఉత్తరమధురాపురికి రేడైన వాని
హాయిగా గంభీర యమునా తీరమున విహరించువాని
ఈయెడ, దామోదరుని ధ్యానించి, మరి ధ్యానించి,
తీయని అచ్చంపు పువులర్పించి మరిమరి సేవించి
చెప్పరే! చెప్పరే! శ్రీనామములను
ఓ బాల! నిద్ర లేవవే - 6
ఆకాశం యమునని అడిగింది. "యమునమ్మా, నల్లని చలి రాత్రంటే మహా లోటుగా లేదూ!?" అని. గలగలా నవ్వుతూ యమున చెప్పింది.. "చంద్రుడిని కృష్ణపక్షం దాచేసుకుంటే నాకేం! ఇలపై నడిచొచ్చే చందమామల్లా ఇంకాసేపటిలో గోపవనితలొస్తారు నా దగ్గరకి. ఈ మార్గశిర శీతవేళ కార్తీక దీపాల్లా నాలో మునకలేసి తేలుతూ మెరుస్తారు. హిమాలయాల్లో రాత్రివేళ వెలిగే అద్భుత ఓషధుల్లా పవిత్రమైన తేజస్సు వెదజల్లుతారు."
గొల్ల పడుచులందరూ ఒక్కొక్కరే నిద్ర లేచి తమతమ ఇళ్ళకు దగ్గరలో ఉండే నేస్తాలను కలిసి, మిగిలిన వారిని నిద్ర లేపేందుకు కదులుతున్నారు. గాజుల గలగలలు నవ్వులకి వంతపాడుతున్నాయి. వాళ్ళ నవ్వులు, మాటల్లో విడిచే వెచ్చని శ్వాస చలిగాలిలో పల్చటి మేఘాలను సృష్టిస్తోంది. దారిలో పరిమళాలు వెదజల్లే పూలమొక్క ఎక్కడ కనిపించినా పువ్వులు కోసి సజ్జల్లో వేసుకుంటున్నారు. రాత్రి తమకొచ్చిన కలలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. "కన్నయ్య నాతో కలిసి పాట పాడాడు." అని ఒకరు చెప్తే, "కృష్ణుడు నా జడలో పువ్వులు ముడిచాడ"ని మరొకతె చెప్తోంది.
ఈ కోలాహలానికి మేలుకున్న పక్షులు ముక్కులతో రెక్కల్ని సవరించుకుంటున్నాయి. పశువులు మోరలెత్తి బధ్ధకం తీర్చుకుంటున్నాయి. ఒక్క అమ్మాయి మాత్రం తన పడకటింట్లో శిల్పసుందరిలా కదలక మెదలక నిద్రపోతోంది. ఆమె 'వకుళ'.
అప్పుడే చివురులేస్తున్న సన్నజాజి తీగె, జాళువా బంగారు తిన్నె పైకి జారినట్టుంది.. పట్టు బాలీసుల మధ్య ఆ శయ్యపై ఆమె నిద్రపోతున్న భంగిమ! ముక్కుపచ్చలారని చిన్నది ఆ పిల్ల. మొన్ననే పదహారేళ్ళు నిండాయి. అతి సుకుమారమైన సౌందర్యం. మేలి బంగరు ఛాయ. కాటుక పూత లేకున్నా చెవుల దాకా ఉండే సోగకళ్ళు. పాల పసిప్రాయపు ఛాయలింకా వీడని ముద్దులొలికే మోము.
వకుళ అందానికి నెలవు ఆమె కళ్ళే. ఇతరులని ఆకర్షించేది ఆ సోగ కళ్ళ వైశాల్యమో, స్వఛ్చంగా మెరిసే నీళ్ళలో తిరిగే మీనుల్లా తోచే ఆమె కనుపాపలో, నల్లగా వత్తుగా వంపు తిరిగి ఉన్న కనురెప్పలో, హరివిల్లులా వంగి ఆ కళ్ళ వైశాల్యానికి హద్దులు సూచించే కనుబొమలో కాదు. ఆ కళ్ళలోకి భీతి, బెంగ, సందేహం, కోపం.. ఇవేవీ రానివ్వకుండా నిత్యం కొలువుండే విశ్వాసం!! ధీమాగా ఉంటాయామె చూపులు. ఎప్పుడూ తడబడవు. లేడి కూన చూపుల్లా బిత్తరపోవు. ఆమె మాటా, నడవడికా అన్నీ అంత స్థిరంగానూ ఉంటాయి.
బృందావనం లో 'ఏ పొద చాటున దాగాడో!', వెతుకుతున్న తమని 'ఏ చెట్టెక్కి గమనిస్తూ నవ్వుకుంటున్నాడో!' అని తప్పిన దూడని వెతికే ఆవుల్లా "కన్నా..!! కృష్ణా..!!" అని పిలుస్తూ మిగిలిన గోపికలంతా వెదికే వేళ వకుళ మాత్రం అలా పరుగులు తియ్యదు. బృందావనంలో ఓ తిన్నె మీద కూర్చుని వీణ మీటుతూ ఉంటుంది. "వకుళా.. కన్నయ్య ఇటుకానీ వచ్చాడా?" అని ఏ నేస్తమైనా వచ్చి అడిగితే, "ఇక్కడ కూర్చో! తానే వస్తాడు. మనం ఎందుకు చెప్పు వెతకడం! మనం కనిపించకపోతే అతగాడికి మాత్రం బెంగ ఉండదూ! నా వీణాగానం వినబడుతుందిలే." అని సమాధానం చెప్పేది. పువ్వులు మాలలు కడుతున్న తనని "త్వరగా కానీ, ఎవరు ముందు మాల కడితే ఆ మాలదే కన్నయ్య మెడలో చోటు." అని ఎవరైనా పందానికి పురికొల్పితే, "మిగిలిన పువ్వులు పూచేది కన్నయ్య కోసం కాదా? అతని కోసం కట్టిన ప్రతీ మాలా ధరించే బాధ్యత అతనిదే!" అని మొండిగా సమాధానం చెప్పేది.
వకుళ ఆత్మ విశ్వాసాన్ని చూసి నెవ్వెరబోయేవారు మిగిలిన వాళ్ళంతా. చాటుగా "మొండిపిల్ల!" అని గుసగుసలాడుకునేవారు. 'మొండివాడు రాజు కంటే బలశాలి' అన్న మాట వకుళ విషయంలో నిజమయ్యేది. తను వచ్చేదాకా ఎదురుచూస్తూ ఎంత పొద్దుపోయినా పొగడమాలలు అల్లుతున్న వకుళ దగ్గరకి కృష్ణుడే వచ్చేవాడు. ఆమె అల్లిన మాలలన్నీ కంఠంలోనూ, చేతులకూ, నడుముకూ చుట్టుకునేవాడు. మిగిలిన మాలలతో ఆమెను బంధించి నవ్వేవాడు.
వకుళకి ఏ కల్లా కపటం తెలీదు. కుతంత్రాలూ, అసూయలూ అంటలేదు. అలక రాదు. ఆశించడం రాదు. ఎడబాటూ, విరహమూ అర్ధం కావు. ఆమె ముగ్ధ! అమాయకత్వం ఒక వరం కదూ! అందుకే వకుళ అంటే రేపల్లెలో ఆడపిల్లలందరికీ ఇష్టం. "ఈ పిల్ల ఇప్పుడే కన్నయ్యని జయించేసింది! ఇంక పెద్దయితే ఇంకేమైనా ఉందా! ఈ పిల్లది మొండితనమూ కాదు, తెలియనితనమూ కాదు. వేరేదో! "ముంచినా, తేల్చినా నీదే భారం!" అని కన్నయ్య పైనే నిశ్చింతగా అన్నీ వదిలేస్తుంది కదా! మనం అలా ఉండగలిగితే బాగుండును!" అనుకునేవారు. నిజం! వకుళ స్థితప్రజ్ఞురాలు. కన్న తండ్రే శత్రువై కొండ మీద నుండి తోయించినా, నిప్పుల్లో నడిపించినా.. "నీదేనయ్యా బాధ్యత. నన్ను నువ్వే కాపాడుకో! రా!" అని నృహరిని స్థంభం బద్దలుగొట్టుకు వచ్చేంతలా లొంగదీసుకున్న ప్రహ్లాదునిదీ అదే స్థితప్రజ్ఞత!
వణికించే చలి తట్టుకోలేక కిటికీలన్నీ మూసి, తలుపులు గొళ్ళాలు పెట్టి నిద్రపోతోంది వకుళ. మిగిలిన అమ్మాయిలంతా ఆ వీధి దాకా వచ్చాక తమలో వకుళ లేకపోడాన్ని గమనించారు.
"వకుళ ఇంకా నిద్ర లేవనట్టుంది కదూ! కమలినీ, వకుళ కనిపించిందా?" అడిగింది ఉత్పల.
"అబ్బే, లేదు. పదండి, వెళ్ళి చూద్దాం." అని వకుళ ఇంటివైపు నడిచింది కమలిని. తలుపు తట్టారు. "కృష్ణా.. కృష్ణా.." అన్నారు. "వకుళమ్మా.. లే తల్లీ" అని పిలిచారు.
లోపలి నుంచి సడి లేదు. వ్రత నియమాలకు అలసిన ఆమె శరీరమే సహకరించట్లేదో, కలలోకి జారిపోయి ఈ లోకపు శబ్దాలేవీ వినిపించట్లేదో మరి! కృష్ణుడే వచ్చి నిద్ర లేపే దాకా నిద్ర లేవనట్టుంది ఆమె వాలకం.
"ఓ వకుళ బాలా! లే లే! పక్షులు కూస్తున్నాయ్, పిల్లా! విన్నావా?!" తలుపుకు దగ్గరగా నిలబడి పిలిచింది కమలిని.
"కృష్ణా కృష్ణా అన్నా ఉలకదూ పలకదూ ఈ పిల్ల!! ఆ వచ్చే కన్నయ్య తన దగ్గరకే వస్తాడని ధీమా!" చెప్పింది ఉత్పల.
"అమ్మడూ! గూళ్ళలోంచి లేచి ఎగరబోతున్న పక్షుల కిలకిలారావాలు వినిపించలేదు సరే! దూరంగా ఆ పక్షి రాజు గరుడుని వాహనంగా చేసుకున్న విష్ణుమూర్తి ఆలయం లోంచి వినిపించే శంఖారావం వినిపించట్లేదూ!"
ఊహూ.. లాభం లేదు. చప్పుడు లేదు.
"ఓ పిల్లా! నీకేమైనా మాయ కమ్మేసిందా ఏం! అదేమైనా సామాన్యమైన శంఖమా? శ్రీహరి పాంచజన్యాన్ని పోలిన తెల్లని శంఖం! చీకటి పొరలు చీల్చేలా ఎలా ఘోషిస్తోందో! ప్రాతఃకాలపు పిలుపు అది! వినిపించలేదూ! లే బంగారుతల్లీ!" బతిమాలుతూ పిలిచింది ఉత్పల.
"లాభం లేదర్రా! ఈ పిల్లకి ఇష్టమైన కథలు చెప్తే నిద్ర లేస్తుందేమో!"
"తను పుట్టక మునుపు కన్నయ్య చేసిన మాయలూ, లీలలూ అంటే వకుళకి మహా ఇష్టం కదా! పదే పదే అడిగి చెప్పించుకుంటుంది. పోనీ అవి చెప్తే లేచి వస్తుందంటారా?" అంది కమలిని.
"హూ.. ప్రయత్నిద్దాం." అని సురభి తనూ తలుపు దగ్గరగా నిలబడి పిలిచింది.
"వకుళా! ఓ చిన్నారీ! లేమ్మా.. అదిగో చూడు.. మునిపల్లెలో మునులూ, యోగులూ నిద్ర లేచారప్పుడే! "హరిహరీ" అని విన్న వాళ్ళ మనసు చల్లగా హాయి నిండేలా పిలుస్తున్నారు. లే తల్లీ! వ్రతానికి వేళ మించిపోతోందీ.."
"హరీ.. హరీ.." అని మగత నిద్రలో కలవరించి అటు తిరిగి పడుకుంది వకుళ. అలా తిరగడంలో ఆమె కాలి మువ్వలు గలగల్లాడాయి. ముఖంలో అదే నిశ్చలత.
ఆ సడి విన్న చెలులకి కాస్త ధైర్యమొచ్చింది. ఈ పిల్లని ఎలాగో ఒకలాగ లేపొచ్చని ఒకరి మొహాలు ఒకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు.
"ఇదిగో వకుళా.. ఆ మునులు పిలుస్తున్న కన్నయ్య చిన్నప్పుడు ఎలాంటి పనులు చేసాడో తెలుసా! నందవ్రజంలో పసికందులను చంపమని కంసుడు పంపిన పూతన అనే రాక్షసి వచ్చిందోనాడు. పెట్టెలో మాణిక్యాన్ని పెట్టి భద్రంగా దాచుకున్నట్టు కన్నయ్యని కాపాడుకొస్తున్నాడు నందగోపుడు." చెప్పసాగింది సురభి.
"ఊ.. అప్పుడేమయింది...?!" అని అడుగుతూ వకుళ నిద్ర లేస్తుందని వాళ్ళ పథకం, ఆశ!
"ఊ.." లోపల ఉన్న వకుళ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఊ కొట్టారు.
"అందమైన గొల్ల పడుచులా వేషం వేసుకుని, వయారాలు పోతూ రాజు గారింటికి వెళ్ళింది. కన్నయ్య అమ్మ దగ్గర బొజ్జ నిండా పాలు తాగి ఉయ్యాల్లో నిద్దరోతున్నాడట. ఉయ్యాలకి కట్టిన చిలకల పందిరి తప్ప గదిలో ఇంకెవరూ కావలి లేరు."
"యశోదమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది కాబోలు..!" కలవరం నిండిన స్వరంతో వెనక చెప్పింది విష్ణుప్రియ. ఎన్ని వేలసార్లు విన్న కథైనా, తరువాతేం జరుగుతుందో తెలిసినా కన్నయ్యకేమైనా అవుతుందేమో అనే బెంగే ఆ పిల్లకి.
"ఆ పూతన మెల్లిగా గదిలోకి వచ్చింది. చిరునవ్వు మోముతో, ముద్దులొలికే పాల బుగ్గలతో, బిగించిన ఎర్రని గుప్పిళ్ళతో నిద్రపోతున్న కన్నయ్యని చూసి ఒక్క క్షణం అంతటి రాక్షసీ మైమరచిపోయిందట!"
"ఊ.."
"మరుక్షణం తమాయించుకుని అప్పుడే కళ్ళు విప్పి చూస్తున్న కన్నయ్యని ఒళ్ళోకి తీసుకుని, విషం పూసిన చనుమొన నోటికందించిందిట!"
"హమ్మయ్యో!!"
"పాల బుగ్గల పసివాడైనా కన్నయ్య సామాన్యుడేం కాదు కదా! విషపు పాలతో పాటూ రక్కసి ప్రాణాలూ పీల్చి ఆ పూతనని హతమార్చాడు. ఇంకేముందీ.. భీకరమైన కొండలా నిజరూపంలో విరుచుకు పడ్డ దాని గుండెల మీద చందమామలా ఆడుకుంటున్న కన్నయ్య! కసుకందలేదు. ఆ పూతన పెట్టిన చావుకేకలకు పరిగెత్తుకొచ్చిన ఊరంతా బెదిరిపోయిందట!"
"పాడు రాక్షసి!! కన్నయ్య భద్రమే కదా!"
"ఆ.. పుట్టగానే ప్రకృతి అనే పూతన ఇచ్చే "నేను, నాది అనే అహపు విషాన్ని హరించేవాడా.. హరీ..!!" అని పిలుస్తున్నారు మునులు" చెప్పింది సురభి.
వకుళ గదితలుపులకు చెవులానించి విన్నా లోపల నుంచి సడి లేదు.
నిద్రపోతున్న ఆ "కల్యాణి"ని మేలుకొలిపేందుకు మధురంగా పాడుతోంది సురభి. వెనుకే గొంతు కలిపారు కమలినీ, ఆనందినీ..
తెలవారుచున్నది గదే! లేవే! లేవవే!
కలకలా కూసేను పులుగులు - ఓ బాల!
అల గరుడ వాహనుని గుడినుండి తెలిసంకు
అదిగదిగొ పిలిచేను లేవే! బాల లేవే!
ఓలి పెనువిసపు చనుబాలు పీల్చిన వాని,
లీల మాయశకటమ్ము కాల కూల్చిన వాని,
మేలుకుని, ఋషులు యోగులు మనసులోనగొని,
మరిమరీ 'హరి హరీ' అను మహాఘోషమ్ము
చొరబారి మా యెదలలో
చలచల్లనాయె గదవే!
పాల కడలిలో పాపపానుపున యోగ ని
ద్రాళువగువాని కారణ భూతుని,
మేలుకుని ఋషులు యోగులు మనసులోనగొని,
మరిమరి 'హరి హరీ' అను మహాఘోషమ్ము
చొరబారి మా యెదలలో
చలచల్లనాయె గదవే!
తెలవారుచున్నది గదే లేవే లేవవే..
"మేలుకొలుపు పాట పాడినా నిద్ర లేవలేదు! పాలకడలిలో విష్ణువులా ఈ పడకటింట్లో వకుళ బాల నిద్దరోతోంది! పోన్లే ఆనందినీ.. బండి రాక్షసుడి కథ కూడా చెప్పెయ్య్.. చూద్దాం నిద్ర లేస్తుందేమో!" అంది మేదిని. సరేనని చెప్పనారంభించింది ఆనందిని.
"పూతన వచ్చి చచ్చి నాలుగు రోజులు కాక మునుపే.. ఊరవతల కొండకు పూజలు చేద్దామని బళ్ళు కట్టుకుని ఊరంతా వెళ్ళింది. నిద్దరోతున్న కన్నయ్యని బండి కింద ఉయ్యాల కట్టి పడుకోబెట్టింది యశోద."
"ఊ.. అప్పుడేమయింది!" విన్నకథే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వినే చిన్నపిల్లల్లా అందరూ..
"ఏమవుతుంది. అది నిజం బండి కాదటా! శకటాసురుడనే రాక్షసుడు. మారు రూపంలో కన్నయ్యకి కీడు తలపెట్టాలని వచ్చాడు."
"మనుషులూ, పశువుల రూపం చాలదా.. బండి రూపంలో కూడానా!! అయ్యో!"
"ఊ.. ఏం చేసాడు కన్నయ్య? భద్రమేనా బంగారు తండ్రి!"
"ఏం చేస్తాడు.. ఏడేడు లోకాలూ బొజ్జలో నింపుకున్న ఆ బుజ్జాయికి ఆకలేసింది. కళ్ళిప్పి చూస్తే అమ్మ ఎదురుగా లేదు. యశోదమ్మది కదూ అదృష్టమంటే! ఎర్రటి బుల్లి గుప్పిళ్ళు విసురుతూ.. ఏడుపు లంకించుకుని.."
"ఆ.."
"మువ్వల చిగురు పాదం ఎత్తి బండిని ఒఖ్ఖ తాపు తన్నాడు."
"భలే!!"
"బండి అంత రాక్షసుడూ ఒక్క తన్నుకి ముక్కలైపోయి ప్రాణాలు వదిలేసాడు." నిద్ర లేచిన మత్తు ఇసుమంతైనా లేని తెల్లని అరవిందాల్లాంటి కళ్ళు మెరిపిస్తూ చెప్తూ తలుపు తీసింది వకుళ.
"హమ్మయ్య! లేచావా చిట్టితల్లీ.. పద పద.." తొందర చేసారు మిగిలిన వాళ్ళంతా..
యమునలో మునకలేసి, ఆ గొల్ల పడుచులందరూ "సైకత కాత్యాయని" కి అగరు ధూపపు సుడుల మధ్య వెలిగే దీప కళికల వెలుగులో చేసిన పూజ నిర్విఘ్నంగా జరిగిపోయింది. యమున తరగల నవ్వులతో సాగిపోతోంది.
దొరసానీ! లేవవే!! - 7
అప్పుడే నడక నేర్చిన అల్లరి బుజ్జాయి వెనుక పగలంతా పరుగులు తీస్తూ, వాడు చేసే కొంటె పనులను ఓ కంట కనిపెడుతూ, వచ్చే పోయే అతిధులతో కళకళ్ళాడే పెద్ద ఇంటిని సమర్ధించే ఇల్లాలు, పొద్దు గూకిన తరువాత ఇల్లు చక్కబెట్టుకుని, పక్కలో పాపడిని పొదువుకుని అలసి సొలసి ఒళ్ళెరగక నిద్రపోయినట్టుంది.. సద్దుమణిగి నిద్దరోతున్న ఆ గొల్లపల్లె. రాత్రైనా నిద్ర లేనిది ఒక్క కన్నయ్యకే! అవును! గోప భామినుల కలల్లోకి వెళ్ళి కన్నయ్య ఎన్ని కబుర్లు చెప్పాలో, ఎంత అల్లరి చెయ్యాలో, ఎవరి అలకలు తీర్చి మురిపించి మరిపించాలో కదా! క్షణమైనా ఆ గోపాల చూడామణిని మరువని వారిని కలలో కూడా అతడు వదలలేడు.
నిన్నటి రోజు తనని చెలులు అతి ప్రయత్నం మీద నిద్ర లేపారని, ఈ రోజు ఓ గడియ ముందే నిద్ర లేచింది వకుళ. పసిడి పాదాల అందెలు ఘల్లు ఘల్లున చేతి గాజుల సంగీతానికి జతగా సడి చేస్తూంటే, పూలసజ్జ నింపుకుని ఉత్పల ఇంటికి వెళ్ళింది. వకుళ పిలుపు విని నిద్ర లేచిన ఉత్పల కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చింది.
"ఊరికి ముందే నిద్ర లేచేసావా? చిన్నారీ! బుధ్ధిమంతురాలివి సుమీ!" అని నవ్వింది.
"ఏం చెయ్యమంటావు చెప్పు! మీరంతా ఇంటి బయట అలా నిలబడి ఎదురుచూస్తూ ఉంటే భలే బాధనిపించింది." చిన్నబోతూ చెప్పింది వకుళ.
"భలే దానివే! ఈ చలికి ఎవరైనా మత్తుగా నిద్దరోవాల్సిందే!
"లేదులే అక్కా! నాకే ఏదో మాయ కమ్మేసింది."
"కన్నయ్య మాయ! కలలో కృష్ణుడు నీ వీణాగానం వింటూ కదలనన్నాడో! ఇద్దరూ బృందావనిలో చెలరేగి పూలబంతులతో ఆడుకుంటున్నారో!" ఆటపట్టించింది ఉత్పల.
"ఏమాటకామాటే అక్కా! నిద్ర లేచేసరికి కృష్ణ లీలలు చెవిన పడడం అంత మధురమైన సుప్రభాత గీతిక మరొకటి ఉండదు తెలుసా!" నిన్నటి కబుర్లు తలుచుకుంటూ చెప్పింది వకుళ.
"కాదూ మరి! తేనె కంటే తీయనిది కన్నయ్య పేరు .. మాయల్లో పెనుమాయ కన్నయ్య చేష్టలూ.. నీ పుణ్యమా అని మేమూ ఎన్ని మంచి మంచి సంగతులు మాట్లాడుకున్నామో!" చెప్పింది ఉత్పల.
"ఈ రోజెవర్ని నిద్ర లేపాలో! అరే! వకుళాదేవి అప్పుడే నిద్ర లేచిందే!" మేలమాడింది ఎదురుగా మిగిలిన గోపికలందరినీ వెంట పెట్టుకుని వస్తున్న సురభి.
"కమలిని రాలేదింకా.. మీ ఇంటి పక్కనేగా! నువ్వెళ్ళి చూడలేదా సురభీ!" అడిగింది ఉత్పల.
"అయ్యో.. తలుపు వేసి ఉంటే కమలిని నిద్ర లేచి, నన్ను పిలిచి నేను లేవకపోతే మీ దగ్గరకి వచ్చేసిందనుకున్నానే!"
"మంచి దానివే! పద పద.. వెళ్ళి చూద్దాం. ఈ రోజు ఆమె గారు స్వప్న డోలికలలో ఊగుతోందనుకుంటా!"
అందరూ కలిసి కమలిని ఇంటి ముందు నిలబడ్డారు. నిన్న వకుళ నిద్రపోయినట్టే ఈ రోజు కమలిని గాఢంగా నిద్రపోతోంది. పక్కకు తిరిగి నిద్రపోతున్న ఆమె 'పడమటి కొండల బారులా' ఉంది. రెండు కొండల మధ్య పొంగి నేల చేరుతున్న పాల జలపాతంలా.. చెదరిన ఆమె జలతారు వల్లెవాటు, నడుము పై నుండి కిందకు జారి వేలాడుతోంది. అలసిసొలసి నిద్రపోతోందేమో.. చెదిరిన ముత్యాల సరాలు ఆమె గుండెలపై చిక్కులు పడి అదివరకు ఎవరూ పెట్టుకోని వింత ఆభరణంలా ఉన్నాయి. ఆమె చేతిలో దంతపు కట్టున్న చిన్న అద్దం ఉంది. ఆమె నుదుట కస్తూరి రంగరించిన తిలకం అర్ధ చంద్రాకృతిలో దిద్ది ఉంది. "తిలకం ఇలా దిద్దుకుంటే బాగుంటుందా! కృష్ణుడికి నచ్చుతుందా?" అని నిద్రపోయే ముందు దిద్దుకుని అద్దంలో చూసుకుంటూ నిద్రపోయినట్టుంది.
"ఓ దొరసానీ! నువ్వే ముందు ఉండి మమ్మల్ని నిద్ర లేపే దానివి.. ఈ రోజు ఇంకా నిద్దరోతున్నావేవమ్మా! కమలినీ! ఓ కృష్ణప్రియా! లే లే!" పిలిచింది సురభి. ఆమె గది కిటికీ దగ్గరకి వెళ్ళి తట్టి చూసింది.
బయట నిలబడ్డ చెలులందరూ ఒకే సారి "కృష్ణా.. కృష్ణా!!" అని పిలిచారు. వెయ్యి వీణలు ఒక్క సారి మీటినట్టు, వెయ్యిమంది విలుకాళ్ళు ఒకే సారి బాణాలు వదిలితే అల్లెత్రాటి ఝుంకారాలు మిన్నంటినట్టూ వాళ్ళ గొంతులు మ్రోగాయి.
చలనం లేదామెలో! నిశ్చింతగా నిద్దరోతోంది.
"కమలినీ.. ఇంతలా పిలిచినా లేవట్లేదు! అదిగో మా కృష్ణ శబ్దాన్ని చెట్ల మీది ఏట్రింతలు అనుకరిస్తున్నాయి విను!!"
చెట్లమీది కాటుక పిట్టలు వాటి చిట్టి గొంతులిప్పి "కృష్ణా. కృష్ణా.. కృష్ణా.. " అని అరుస్తున్నాయి. ఒక పిట్ట అరుపు విని మరో పిట్ట అందుకుని కృష్ణ శబ్దం అలలు అలలుగా రేపల్లె మొత్తం మారుమ్రోగింది. ఆ శబ్దానికి ఇళ్ళలో నిద్ర లేచిన గొల్ల ఇల్లాళ్ళు, పక్కల్లో అప్పుడే నిద్ర లేచి కళ్ళు తెరవకుండానే ఒళ్ళు విరుచుకుంటూ బధ్ధకాలు తీర్చుకుంటున్న తమ పసి కందుల్ని నెమ్మదిగా తీసి, గుడ్డ ఉయ్యాళ్ళలో వేసారు. నిద్రలో వదులయిన చీర ముడి సరి చేసుకుని, విడిన కొప్పులు ముడుచుకుంటూ చంటి పాపాయిలకు ఊరు తెలవారక ముందే ఉగ్గు పట్టేందుకు సిధ్ధపడుతున్నారు.
"ఏట్రింతల మరో పేరు భరద్వాజ పక్షులు కదూ! భరద్వాజుడు భరతుడిని పరీక్షించినట్టు అవి నిన్ను పరిక్షిస్తున్నాయనుకుంటున్నావా?" ఆ కథ గుర్తొచ్చి నవ్వుకుంటూ అడిగింది ఆనందిని.
"భరద్వాజుడా..? భరతుడా..? చెప్పకుండానే నవ్వేసుకుంటున్నావే! చెప్పు ఆనందినీ.. ఇంకా సమయం ఉందిగా! ఆ మహరాణి లేచి రావాలిగా ఇంకా!" అడిగారు విష్ణుప్రియా, మేదిని.
"అమ్మాయిలూ, క అన భయం. కథ అంటారుగా!" నవ్వింది ఆనందిని.
"చెప్పవూ! భరతుడంటున్నావూ.. నువ్వు రామ కథలు మహగొప్పగా చెప్తావు కూడానూ!" ఇంటి అరుగు మీద కూర్చుంటూ అడిగింది సురభి.
"సరే తప్పేదేముంది! చెప్తాను వినండి." చెప్పడం ప్రారంభించింది ఆనందిని. చెక్కిట చేతులు చేర్చుకు కొందరూ, పక్క వాళ్ళ భుజం మీద చెయ్యాన్చి నిలబడి కొందరూ.. ఊ కొట్టేందుకు సిధ్ధమయ్యారు.
"ఉచక్షుడనే మునికి మమత అనే భార్య ఉండేది. ఆమెకి పుట్టిన వాడే భరద్వాజుడు. ఆయన సాక్షాత్తూ బృహస్పతికి ఔరసుడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాధ్యయనం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు భరద్వాజుడు. శతాయుః పురుషః అన్నారు కదా.. ఆ నిండూ నూరేళ్ళూ శ్రధ్ధగా వేదాధ్యనం చేసాడతడు. చదివిన చదువు తృప్తి కలిగించలేదు. ఇంకా చదవాలనుకున్నాడు. తన ఆయుష్షు అయిపోనుందని గమనించి ప్రజాపతిని మరో వందేళ్ళు వరమడిగాడు. "సరే"నన్నాడు ప్రజాపతి. ఆ రెండో వందేళ్ళూ అయినా భరద్వాజుడికి వేదాలు నేర్చుకునేందుకు సరిపోలేదట. మరో వందేళ్ళు అడిగి తెచ్చుకున్నాడు. మూడు వందలేళ్ళు పూర్తవుతూండగా ఇంకా సంతృప్తి చెందక మళ్ళీ వరమడిగాడు."
"ఊ.."
"అప్పుడు ప్రజాపతి భరద్వాజుడిని ఓ నాలుగు పేద్ద పర్వతాల దగ్గరికి తీసుకెళ్ళాడట."
"ఊ.."
"అప్పుడు ప్రజాపతి అన్నాడటా.. "భరద్వాజా..! ఇదిగో ఇవే వేద పర్వతాలు. మూడు వందల సంవత్సరాలు కఠోర దీక్షతో నువ్వు అధ్యయనం చేసిన వేదభాగం ఎంతో తెలుసా..?" అని మూడు పిడికిళ్ళ మట్టి తీసి పక్కన పెట్టాడట!"
"ఆ..!!!" ఆశ్చర్యం వారి కళ్ళని రెండింతలు చేస్తే, అందమేమో పదింతలయ్యింది.
"వేదం అనంతం. వేదాలు వర్ణించిన ఆ పరంజ్యోతి గొప్పతనంలాగే! ఎన్ని వేల సంవత్సరాలు నేర్చుకుంటే నీకు తృప్తి కలుగుతుంది కనుక! పో.. వెళ్ళి ఈ మూడు వందల ఏళ్ళు నువ్వు వేదాధ్యయనం వల్ల గడించిన తపోసంపద, శక్తీ వినియోగం చేసిరా! నీకు మోక్షమే!" అన్నాడట ప్రజాపతి.
సరే అని బయలుదేరిన భరద్వాజుడు లోకమంతా తిరిగాడట. అప్పటికే రాముడు తన ఇల్లాలినీ, అనుజుడినీ వెంటపెట్టుకుని అడవులకెళ్ళిపోయాడు.
"ఊ..!" రామ కథలోకి వచ్చేసామని ఆనందం, ఏమవుతుందో అని ఆత్రుత వాళ్ళ గొంతులో!
"భరద్వాజుడు నేరుగా నందిగ్రామానికి వెళ్ళాడు. అక్కడ 'రాముడు విడిచి వెళ్ళిన అయోధ్య.. దేముడు లేని కోవెలలాంటిదని', రామ పాదుకలకు పూజ చేస్తూ, వనవాస వ్రతాన్ని తానూ చేపట్టి ఓ కుటీరంలో ఉన్నాడు భరతుడు."
"ఊ.."
"భరద్వాజుడు వెళ్ళి భరతుడిని అడిగాడటా.. "ఏవయ్యా, మీ అన్న అడవులకెళ్ళాడు కదా! నువ్వు రాజ్యమేలకుండా ఇలా నార బట్టలు కట్టుకుని, జడలు కట్టిన కేశాలతో, కాయా కసరూ తింటూ ఈ కారడవిలో ఉన్నావేం?" అని."
"వాళ్ళమ్మదే పన్నాగమంతా.. పాపం బిడ్డ అమాయకుడే!" తీర్పు ఇచ్చి భరతుడిని వెనకేసుకొచ్చారు గొల్లపిల్లలంతా.
"ఊ.. మరే! "రామన్న లేని అయోధ్య జీవుడు లేని శరీరం కదా!" అందుకే విడిచిపెట్టానన్నాడు భరతుడు. భరద్వాజుడికి భరతుడి మాటల మీద నమ్మకం కుదర లేదు. నిజంగానే అన్న మీద ప్రేమా? లోకానికి వెరచి రాజ్యం ఏలట్లేదా? అని అనుమానమొచ్చింది."
"ఛ ఛా.. పాపం భరతుడికి అలాంటివి తెలియదు." తమకు తెలుసన్నట్టు చెప్పారు.
"అవునులే! మరి నిజం నిగ్గు తేలాలిగా! అప్పుడు భరద్వాజుడు తన అపార తపశ్శక్తితో ఆ అడవిలోనే ఓ బ్రహ్మాండమైన రాజ్యాన్ని మణిమయ భవంతులతోనూ, అన్ని హంగులతోనూ నిర్మించి భరతుడితో చెప్పాడట. "నీ భ్రాతృ ప్రేమ కి మెచ్చి ఈ నగరం నీకు కానుక ఇస్తున్నాను. అయోధ్యకైతే వెళ్ళలేవు కానీ, ఈ రాజ్యాన్ని ఏలుకో. రాచబిడ్డవి అడవుల్లో కష్టపడడం నేనే చూడలేకపోతున్నాను." అన్నాడట.
"ఊ..!!"
"ముని వాక్యాన్ని కాదనకుడదు కదా! అందుకని భరతుడు ఆ రాజ్యంలో ప్రవేశించాడు"
"నిజమా!!" అపనమ్మకం.. పాలు నల్లగా ఉంటాయంటే నమ్మగలమా?
"ఊ.. పెద్దల మాట కొట్టివేయడం మహా పాపం! అందుకని భరతుడు ఆ రాజ సభలో ప్రవేశించి, సింహాసనం మీద రామ పాదుకలు ఉంచి పక్కన నిలబడి వింజామర వీస్తూ, కళ్ళంట నీటి ధారలు కారిపోతూ ఉండగా అలా నిలబడిపోయాడట. భరతుడు అచ్చం రాముడిలాగే ఉంటాడట! అతని కళ్ళలో నీళ్ళు చూసి భరద్వాజుని గుండె కరిగిపోయిందట!!"
కళ్ళ నీళ్ళు బొటబొటా కార్చేస్తూ.. "ఊ.." అన్నారు అందరూ.
"తన అంచనా తప్పనందుకు పరమానంద భరితుడైన భరద్వాజుడు రెండు చేతులతోనూ భరతుడి భుజాలు పట్టుకుని "తండ్రీ! నా శక్తి ని ధారపోసి మరీ నిన్ను పరీక్షించాను. నీ రామ భక్తి ఇంత గొప్పదని లోకానికి చాటాను. మూడువందలేళ్ళు కూడబెట్టిన నా శక్తికి ఇంతకంటే సార్ధకత మరొకటి ఉండదు. రామానుజులను మించిన తమ్ములు వేరొకరికి ఉండరు! భగవంతుని కంటే భాగవతులను అంటే నీలాంటి భక్తులను కళ్ళారా చూడడమే గొప్ప అదృష్టం! " అని పొగిడి వెళ్ళిపోయాడట!"
"ఊ.."
"అలాంటి భరద్వాజుడి పేరు పెట్టుకుని ఆ భరద్వాజ పక్షులు తెల్లవారకుండానే కూసి, వ్రతం పట్ల ఉన్న మన భక్తిని పరీక్షిస్తున్నాయని అనుకుంటున్నావా? అని కమలినిని అడిగాను."
"నిజంగానే తెల్లవారబోతోంది కానీ, ఈరోజు ఏటిరింతలు మంచి కథే వినిపించాయి." అంది సురభి.
"ఆ విషయం లోపల ఉన్న ఆయమ్మకి తెలియాలి కదా!"
"కమలినీ! వింటున్నావా.. మేమూ, ఏట్రింతలే కాదు రేపల్లెంతా నిద్ర లేచింది."
"కమలినీ! రోజూ నువ్వే ముందు ఉండే దానివి. ఈ రోజేంటి వింతగా నువ్వే నిద్రపోతున్నావా? అదిగో! దధి చిలకడానికి తరుణులందరూ సిధ్ధమయినట్టున్నారు! పాల సంద్రంలో మంధరపర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి ని తాడుగా చేసి ఆనాడు అమృతమథనం జరిపినట్టు, పెరుగు చిలికి వెన్న తీయడానికి సిధ్ధపడుతున్నారు. లే.. లే!"
"అదిగో విన్నావా! వాళ్ళ మెడలో కాసుల పేర్లు, పట్టెడలూ ఒకదానికొకటి ఒరుసుకుని గలగలా శబ్దం చేస్తున్నాయి. దధిమథనం మన గొల్లవారికి దేవతార్చనతో సమానం కదా! అందుకని ఉదయాన్నే స్నానం చేసి పువ్వులు అలంకరించుకుని మరీ పెరుగు తరిచే పనిలో ఉన్నారు. తెల్లగా గట్టిగా రాయిలా ఉన్న పెరుగు చిలకడానికి వాళ్ళు బలమంతా ఉపయోగించి అవస్థ పడుతూ ఉంటే, వాళ్ళ జుత్తు ముడి ఊడిపోతోంది. వాళ్ళ కొప్పుల్లో ఉన్న పువ్వుల సువాసన ఊరంతా ఘుమ్మని వ్యాపిస్తోంది. నీకు తెలియడం లేదా! "
కమలిని నెమ్మదిగా కదులుతోంది. ఎక్కడో లీలగా వినిపిస్తున్న మాటలు! నిన్న వకుళని నిద్ర లేపిన విషయం గుర్తొచ్చింది. అలా తనకూ ఏవైనా కథలు చెప్తారేమో అని కళ్ళు మూసుకునే వింటోంది.
"అమ్మడూ! కమలినీ! నారాయణా.. కేశవా.. అని గోవిందనామాలు పాడుతూ చల్ల చేస్తున్నారు అందరూ! విను విను.."
"కేశి అనే రాక్షసుడిని చంపిన వాడా!! అందమైన కేశ సంపద గలవాడా!! అని కన్నయ్యని పొగుడుతున్నారు విను!"
"కన్నయ్యని పొగిడితే లేవవా! సరే! నిన్ను పొగుడుతాం విను!" అని నవ్వుతూ చెప్తోంది సురభి.
"నువ్వే మా బృందానికి శోభ నిచ్చేదానివి. నువ్వు లేకపోతే చిన్నబోయినట్టుంది, బంగారూ! నిత్యం "కృష్ణా కృష్ణా" అని జపం చేస్తూ ఏడు నలుగులూ పెట్టుకుంటావు కాబోలు! గులాబిరేకుల్లో నిద్దరోతావేమో! పాల మీగడ తప్ప వేరేది తినవేమో! వెన్నెల తాగిన వన్నెలాడీ! లే.. లే! నీ శరీరపు వన్నె ఎంత అందమైనదనుకున్నావూ..? నువ్వు కన్నయ్య పక్కన నిలబడితే, మెరుపుతో కల్సిన మేఘంలా కన్నయ్య మరింత వెలుగులు చిమ్ముతాడు. తేజోరాశివి! చక్కదనాల చుక్కవి! రా బయటికి! లేచి తలుపు తెరు! భరద్వాజుడు భరతుడిని చూసి పొందిన పుణ్యం, మేము నిన్ను చూసి మూట కట్టుకుంటాం! నీలా కన్నయ్యని కొలిచేదెవరని!?"
"హు.. ఈ రాణీ గారికి కూడా పాట పాడాలి కాబోలు! నిన్న వకుళకి తనే మేలుకొలుపు పాడింది. ఈ రోజు మనం పాడక తప్పదు." చెప్పింది మేదిని.
చెలుల పొగడ్తలకూ, కన్నయ్య పక్కన తనని ఊహించుకుని మెచ్చుకున్నందుకూ ఉబ్బితబ్బిబ్బై లేచి కూర్చుని, పాట విందామని చప్పుడు చెయ్యకుండా ఎదురుచూస్తోంది కమలిని. గొంతు సరి చేసుకుని, వేయి వీణలు ఒకేసారి మ్రోగినట్టు "సింహేంద్రమధ్యమ రాగం"లో మేలుకొలుపు పలుకుతున్నారు బయట నుంచి.
వినలేదటే వెర్రి జవరాలా!
వినియె హాయిగ పవళించేవటే!
తనితనిగ తెలవారెనని కీచుకీచుమని
మునుమునుగ ఏటిరింతలు మూగి పలికెను.
ఘల్లుమనగా కంఠసరులు కాసులపేర్లు,
జల్లగా కడల క్రొమ్ముడులు వాసనలు
గొల్ల ఇల్లాండ్రు తరిగోలలను కైకొనుచు
పెల్లుగా చల్ల తరిచే సవ్వడి
హరిని నారాయణుని కైవారముల మేము
ఆలపించిన ఆలకించనే లేదటే
దొరసాని! వౌరౌర ఓ బాల లేచి,
తెరవవే వాకిలి! ఓసి తేజోవతీ!
మెల్లిగా తలుపు తీసి "హరి..హరీ!" అంటూ చెలులను చూసి నవ్వింది కమలిని. ఆమె చిగురు పెదవులు పలికిన హరినామానికి వాళ్ళందరి ముఖాలూ వికసించాయి. స్నానమాడి, "కాత్యాయని"ని కొలిచేందుకు యమున వైపు .. లేళ్ళ మంద నీళ్ళు తాగడానికి కదిలినట్టు అందరూ గబగబా అడుగులు వేసారు.
చాలులే పవళింపులు - 8
నిశి కట్టుకొచ్చిన చుక్కల కుట్టుపువ్వుల చీరని కళ్ళింతలు చేసుకుని మరీ చూస్తూ, ముచ్చట పడుతూ నెమ్మదిగా కదులుతోంది యమున. ఉండుండి తరగల కబుర్లతో ఆరాలు తీస్తోంది.
ఆ ఇంట్లో ఒక గోపి నిద్దుర దుప్పటిలో ముడుచుకుని కలలు కంటోంది. ఆ కలనిండా పువ్వులే పువ్వులు! మాలతీ మాధవాలు, ఆకు సంపెంగలు, మల్లెలు, మొల్లలు, పొగడలు, పారిజాతాలు, కెంపుల చామంతులు, కేతకీ సౌరభాలూ .. ఒకటా రెండా.. వేల రకాల పువ్వులు ఘుమ్ముఘుమ్మని మత్తెక్కిస్తున్న పూలవనంలో.. తిన్నెలు జాజులతోనూ, దారులు గులాబీలతోనూ, తటాకాలు కలువ చెలువలతోనూ నిండి పరిమళిస్తున్నాయి. తుమ్మెదలు ఝుంఝుమ్మని రొద చేస్తూ తేనెలు తాగి, మత్తెక్కి సొక్కి సోలిపోయి, పూబోడుల కౌగిళ్ళలో వాలి నిద్దరోతున్నాయి. మరి తన కౌగిలి లోనో! తన కౌగిట్లో ఒరిగిన మోహన కృష్ణుడు తెల్ల సంపెంగల తిన్నె మీద నీలాలు రాశి పోసినట్టు ధగధగా మెరుస్తున్నాడు!! తన తామరతూళ్ళ చేతులతో ఎంత బంధిస్తే, అంత దగ్గరగా ఒదిగిపోతున్నాడు. 'ఏ చెలి పిలుపు వినిపిస్తే పట్టువిడిపించుకు ఎక్కడ వెళ్ళిపోతాడో!' అని బెంగతో కౌగిలి ఇంకా బిగించేస్తోంది తను. చెలియలొస్తారు. తలుపు తడతారు. కృష్ణుడిని చూస్తే!! తను అనుభవిస్తున్న మహదైశ్వర్యంలో వాటా అడుగుతారే! ఎలా..? రావద్దని ఎలా చెప్పడం.. ? ఈ రేయిని కరగనివ్వకని ఆకాశాన్ని ఎలా బతిమాలుకోవడం!
"విష్ణుప్రియా.. కృష్ణ వల్లభా! తెల్లవారబోతోంది లే లే!"
అదిగో.. వచ్చేసారు. కళ్ళు బిగించి నిద్దరోతే!!
"ఈ రోజు నీ వంతా అమ్మాయీ!? అందరి కంటే ముందే నిద్రలేచి, సుగంధాలు విరజిమ్మే పుష్పాలతో పూలసజ్జ నింపుకుని పూవయారిలా నడిచొచ్చే దానివి! కబుర్ల గలగలలతో యమున చిన్నబోయేలా సందడి చేసే దానివి! ఓ భామా! లే లే!"
సమాధానం చెప్పకుండా కనురెప్పలు బిగించింది విష్ణుప్రియ. ఆమె నిద్రపోతున్న తల్పం పక్కనే ఉన్న కిటికీ లోంచి, బయట నిలబడి మేలుకొలుపుతున్న తన నేస్తాల మాటలు సుస్పష్టంగా వినబడుతున్నాయి. నిద్రపోయే వాళ్ళని మేలుకొలపగలం కానీ, నిద్ర నటించే వారిని లొంగదీయడం ఎవరి తరం! స్వప్నసౌధపు మెట్లు దిగనని మొండిపట్టు పట్టిందా అమ్మడు. ఈ రోజు ఆమెది! మేలుకొలిపి స్నానానికి తీసుకెళ్ళే బాధ్యత చెలులది.
విష్ణుప్రియ నిజంగానే కృష్ణ వల్లభ! కులుకూ, అలకా ఎరిగిన జాణ. ఆమెకు పువ్వులంటే ఎంత ఇష్టమో, ప్రతి పువ్వులోనూ ఆమెకి కనిపించే కన్నయ్య నవ్వులంటే అంత కంటే ప్రాణం! బృందావనిని పోలిన పువ్వులతోట ఆమె ఇంటిచుట్టూ పెంచుకుంది. ఆ తోటలో లేని పువ్వు లేదు! వేసవిలో మల్లెలవనం. వానాకాలం గుమ్మెత్తే చంపక సుమాల సౌరభాలు.. శరత్తు వచ్చేసరికి చామంతులు.. హేమంతాన్ని పలకరించే గులాబీలు.. నిత్యమల్లెలా కుసుమించే తమ దొరసానికి తోడుండే పారిజాతాలూ, పొగడలూ, జాజులూ, మాలతీమాధవాలూ.. అన్నీ మురళీ మనోహరుని కోసం విరిసి ఎదురుచూస్తూ ఉంటాయి.
ఆ పూలవనంలో అప్పుడే విరిసిన గులాబిబాలల్లా గోపకాంతలు లోపల నిద్రపోతున్న తమ నెచ్చెలి కోసం ఎదురుచూస్తున్నారు. లోపల కృష్ణ స్వామిని కౌగిట చేర్చుకుని, కలలోంచి ఇలపైకి దిగిరానని పట్టు పట్టి సోయగాల మాలికలా పడక మీద ఉన్న ఆమె!
బయట నుంచి మేదిని చెప్తోంది. "ఇదిగో! చూడు తూరుపు దిక్కున వెలుగు రేఖలు పొడచూపుతున్నాయి. మంచుకి తడిసిన బిరుసైన గడ్డిని మేసేందుకు గేదెల మంద వెళ్ళింది. నల్లగా నిశిరాత్రి కదిలి వెళ్తున్నట్టు ఆ ఎనుములు వెళ్తున్నాయి చూడు!"
సమాధానమివ్వలేదు విష్ణుప్రియ.
"ఓ విష్ణుప్రియా! నువ్వింకా తెల్లారబోవడం లేదనుకుంటున్నావేమో! మన చెలియలందరూ యమున ఒడ్డుకు వెళ్ళిపోయారు. నువ్వింకా రాలేదని ఇంకొంతమందిని వెంటపెట్టుకుని, నిన్ను లేపుదామని వెనక్కి వచ్చాను. నవరత్నాల ఉంగరంలో ఏ ఒక్క మణి లేకపోయినా దానికి నిండు ఉంటుందా! నువ్వు లేని మన జట్టూ అంతే! లేచి రావమ్మా!"
"ఊహూ.. లేవను. సగం మంది వెళ్ళిపోయాక గుర్తొచ్చానా నేను..?! హు..!" కళ్ళు ముసుకునే కినుకగా పెదవి కొరుక్కుంది విష్ణుప్రియ.
"విష్ణుప్రియా, నువ్వు నిజంగానే మాలో మేటి గోపికవు. నిన్ను ముందు నిలబెట్టుకుని వెళ్తేనే కన్నయ్య మమ్మల్ని చూస్తాడు. అంత గొప్పదానివి నువ్వు! నువ్వు అల్లే మాలలే కదూ! ఆయన నిత్యం తన మెడలో వేసుకునేదీ! లే లే! నువ్వు లేచి వచ్చి, నీ తోటలో పువ్వులు తెచ్చి, మాలలు అల్లితే కానీ, మన వ్రతం ఎలా పూర్తవుతుంది చెప్పు!"
"ఊ.. అలా రండి దారికి."
"నీకూ కథలు చెప్పాలా! సురభి లేదే! ఆనందిని లేదే! నాకేమో పెద్ద పెద్ద వేదాంత విషయాలేవీ తెలియదాయె! కన్నయ్య చిన్ననాటి లీలలూ నేను చూడలేదు. నీలాగా నేనూ విన్నానంతే!" అని వాపోయింది మేదిని.
"మనకు తెలిసినవే చెప్దాం లే, మేదినీ..!" అని ధైర్యం చెప్పింది పక్కన ఉన్న తరళ.
"హ్మ్.. విష్ణుప్రియా.. నిన్ను నిద్ర లేపి తీసుకొస్తామని, పెద్ద బాధ్యత భుజాల మీద వేసుకుని వచ్చాం. వేళ మించిపోతే కష్టం! అయినా నాకు తెలియక అడుగుతున్నానూ! "చలి" అన్నది ఎరుగని పిల్లవి. రోజూ స్నానానికి యమునలో తొలిగా కాలుపెట్టి దిగేది నువ్వే! 'విరహంలో ఎంత మరిగి ఉన్నావో!' అని నిన్ను, నీ తాపాన్నీ చూసి చెలులందరూ గుసగుసలాడుకుని నవ్వేవారు కదూ! అలాంటిది నువ్వే చలికి ముడుచుకుని నిద్రపోతున్నావంటే నమ్మశక్యంగా లేదు. కేశిని చంపడానికి గోపాలకులు వారిస్తున్నా, కన్నయ్య ముందుకు దూకినట్టు నువ్వూ స్నానానికి ఉరకలు వేసే దానివి!"
సిగ్గుగా నవ్వుకుని, చిన్నగా కదిలి వినసాగింది విష్ణుప్రియ!
"సరే! కథ చెప్తే కానీ నిద్ర లేవకపొవడం ఆనవాయితీ అయిపోయింది కదా! నాకు తోచినట్టు చెప్తున్నాను. ఈ కథ అయ్యేసరికి నిద్ర లేచి వచ్చి మా మాట దక్కించు!"
"సరే, చెప్పండన్నట్టు" గాజులు గలగల్లాడించింది లోపలనుండి.
సంకేతాన్నదుకున్నట్టు సంబరపడి, తనకు తోచిన విధంగా కథ చెప్పనారంభించింది మేదిని. కృష్ణ లీలలు ఎవరు ఎలా చెప్పినా వినదగినవే!
"కన్నయ్య తన స్నేహితులతో కలిసి ఆవుల మంద వెనుక వెళ్ళి అడవిలో తిరుగుతున్నాడట. కంసునిచే పంపబడిన 'కేశి' అనే రాక్షసుడు ఓ పొగరెక్కిన అడవిగుర్రం రూపంలో కన్నయ్య ఉన్న చోటికి వచ్చాడట. పశువులన్నీ కడుపు నిండా గడ్డి మేసి, నీళ్ళు తాగి, చెట్ల నీడలలో పడుకుని నెమరేస్తున్నాయట. కన్నయ్య తన స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుని చల్ది మూటలు విప్పుకుని తింటున్నాడట. దూరంగా నీళ్ళ మడుగు దగ్గర అలికిడై, వెళ్ళి చూసి వద్దామని నడిచిన గోపాలకుడొకడికి.. తన ముందు కాళ్ళు ఎత్తి పశువులని తన్ని చంపేస్తున్న ఈ అడవి గుర్రం కనిపించిందిట!! పరుగున అందరూ వెళ్ళి చూసేసరికి కనిపించిన పశువుని కనిపించినట్టు మట్టికరిపిస్తోందట ఆ గుర్రం! దాని నోటి నుండి అగ్ని జ్వాలలు వెదజల్లుతోంది! అది సకిలిస్తూ ఉంటే వినేవాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయట. అలా నోరులేని జీవాలని పొట్టన పెట్టుకుంటున్న ఆ పొగరుబోతు గుర్రాన్ని లొంగదీసుకోడానికి, స్నేహితులంతా వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా సింహం లంఘించినట్టు ఉరికాడట కన్నయ్య! భీకరంగా సకిలిస్తూ, ముందు కాళ్ళు ఎత్తి దూకబోయిన ఆ కేశి ని ఒడుపుగా తప్పించుకుని, అ గుర్రం నోట్లో చెయ్యి పెట్టాడట కన్నయ్య!"
"ఆ!!"
"ఆ.. ! ఆ కేశి దవడలు పట్టుకు చీల్చి ప్రాణాలను హరించేసాడట!"
ఒక వైపు కృష్ణుడి విజయాన్ని విని సంతోషంగా ఉన్నా, మనసంతా భయంతో నిండి.. మరీ ముడుచుకుపోయింది లోపల ఉన్న విష్ణుప్రియ!
"అంతేనా! కృష్ణుడి శౌర్యమంటే చాణూర ముష్టికులనే మల్లులను జయించినప్పుడే చూడాలి! బలరామ కృష్ణులిద్దరినీ మధురాపురికి పిలిపించిన కంసరాజు, చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మహా బలవంతులైన మల్లులని పంపించాడట. రాచవీధిలో మదపుటేనుగుల్లా తమకు అడ్డుపడిన ఆ మల్లులిద్దరినీ, సింహాలు వాటి కుంభస్థలం మీదికి లంఘించి చంపినట్టు.. తమ అజేయమైన శౌర్యపరాక్రమాలతో చంపేసారట బలరామ కృష్ణులు!"
విష్ణుప్రియ మనసంతా కన్నయ్య మీద చెప్పలేనంత బెంగతో నిండిపోయింది. ఆతని సుందర దేహం గుర్తొచ్చింది. "చిన్నప్పటి నుంచీ ఆ యశోదమ్మ మొత్తుకుంటూనే ఉంది.. 'కన్నా.. దుడుకు పనులు వద్దూ..!' అని వింటేనా..? అపాయంతో చెలగాటమాడడం కన్నయ్యకి అలవాటయిపోయింది. గెలిచేది తానే అయినా ఆ చేతులు ఎంత కందిపోయి ఉంటాయో! ఆ భుజాలు ఎంత నొప్పెట్టి ఉంటాయో!" ముఖమంతా అలుముకున్న బాధతో వడిలిన కమలంలా ఉంది విష్ణుప్రియ.
చానా లేవే చాలే పవళింపులు
చానా లేవే చాలులే పవళింపులు
ఔనే అచట చెలులనాపి వచ్చేమే
పూని నోము స్నానమాడ వలచేదాన
అల్లదే చూడవే! తూరుపు
తెల్లవారెనె, ఎనుము కదుపులు
మెల్లగా తరలెనే! మంచున
తడియు పచ్చిక బీళ్ళ మేయగ!
చేరి వాద్యముల కైవారముల కావింప
కూరిమితో దేవదేవుడు కృపను మనపై చూపునే!
వారువము వలె వచ్చు రక్కసు
నోరు చీరినవాని వేడగ
క్రూర చాణూరాది మల్లుల
బీరమడచిన వాని పాడగ!
చానా లేవే చాలు పవళింపులు
విష్ణుప్రియ మనసు కాస్త కుదుట పడింది. వీనులవిందైన "నీలాంబరి" రాగానికి కళ్ళు తెరచుకోవాలనే ప్రయత్నం చెయ్యాలనిపిస్తోంది. ఈలోగా బయట ఆనందిని మాటలు వినిపించాయి!
"ఏం? ఆ ముద్దరాలింకా నిద్రలేవలేదా..!! మీరేం చేస్తున్నారు బయట!?"
"ఏం చేస్తున్నామేమిటి? 'కృష్ణ కృష్ణా!' అన్నాం.. అదిగో గేదెలు నిద్ర లేచాయ్ చూడమన్నాం.. గుర్రాన్ని చీల్చి చంపిన కన్నయ్య కథ చెప్పాం!" చెప్పింది మేదిని.
"చాణూరాది మల్లుల సంహారం కూడా! పాట కూడా పాడాం." ఇచ్చిన పనిని చేసామని నమ్మకంగా చెప్పింది తరళ.
"ఏవిటేవిటీ!!! సుమసుకుమారమైన మనసున్న ఆ జవరాలికి మేలుకొలుపులు ఇలా పాడారా? మంచి వాళ్ళే!! ఆవులు నిద్ర లేచాయి. కాటుక పిట్టలు కూసాయి. అంటే అందం! కానీ ఉదయాన్నేఎనుముకదుపుల గురించా చెప్పేదీ!" బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది ఆనందిని.
బిక్కమొహాలేసారు మేదినీ, తరళా.. వాళ్ళకి సాయం ఉన్న ఇంకొంతమంది. పున్నాగపువ్వులు చిన్నపోయినట్టున్న వాళ్ళ వాలకం చూసి నవ్వొచ్చింది.. జాలేసింది ఆనందినికి.
"సర్లేండి! అసుర సంహారం ఇప్పుడు కన్నయ్యకీ తప్పలేదు. అప్పుడు రామయ్యకీ తప్పలేదు. మీరేం చేస్తారు? వాళ్ళ కథలన్నీ రక్కసి మూకని చంపడమే అయితేనూ..!" సాంత్వన పలికింది.
"హమ్మయ్య!" అనుకున్నారు అందరూ.
"కృష్ణుడు రేపల్లెకి వచ్చిన రాక్షసులను మట్టి కరిపించినట్టే ఆనాడు రాముడూను..." ఓ అందమైన రామకథ చెప్పనారంభించింది ఆనందిని.
"వనవాసానికి బయలుదేరిన రామచంద్రుడు సీతమ్మతోనూ, లక్ష్మణుడితోనూ కలిసి జనస్థానం చేరుకున్నాడట. అక్కడ ఓ అందమైన కుటీరం నిర్మించుకుని ఉండసాగారు. ఈలోగా అక్కడ ఉండే మునులంతా వచ్చి, రామయ్యని చూసి తమ జపతపాలకు భంగం కలిగిస్తున్న రక్కసిమూక గురించి మొరపెట్టుకున్నారట."
"ఊ.."
"అయ్యో! మీరు చెప్పకుండానే మీరెలా ఉన్నారో, మీకే కష్టాలున్నాయో కనుక్కోవలసిన బాధ్యత నాదీ! మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేనున్నాను కదా!" అని అభయమిచ్చాడట. వాళ్ళు వెళ్ళాక సీత అందటా.. "ఏదో కుటీరం వేసుకుని కాయాకసరూ తింటూ పద్నాలుగేళ్ళూ గడిపేయకుండా.. ఏవండీ.. ఇక్కడికొచ్చినా రాచకార్యాలు తప్పవా? రాక్షస వధ తప్పదా? అని."
"అవునా!!"
"ఊ.. ఆవిడకీ మనకున్నట్టే బెంగ ఉంటుంది కదా! రాజ్యాలేలే రాజైనా తల్లికి బిడ్డే.. ఆలికి మగడే!"
తమ మనసుల్లో కన్నయ్య దూకుడు గురించి ఉన్న బెంగలన్నింటికీ ఊతం దొరికిందని సంతోషించారందరూ.
"అప్పుడు రాముడన్నాడట.. "నిన్నైనా విడిచిపెడతాను, తమ్ముడినైనా విడిచిపెడతాను.. మునులకు ఇచ్చిన మాట మాత్రం విడిచిపెట్టనూ.." అని చెప్పి విల్లందుకుని అడవిలోకి వెళ్ళిపోయాడట."
"రూపం బహు సుందరమే కానీ, మాట మహ కచ్చితం! ఇద్దరూ ఒక్కరేగా!!" అంది మేదిని.
"హ్హహ్హహా.. మరే! అలా అడవిలోకి వెళ్ళిన రామభద్రుడు పద్నాలుగు వేల పద్నాలుగు మంది రాక్షసులను చంపి.. ఆక్షరున ఖరుడనే రాక్షసుడిని చంపి ఇంటికొచ్చాడట."
"హమ్మయ్యో! పద్నాలుగు వేల మందే!!" నోరు వెళ్ళవెట్టింది తరళ.
"రామయ్యకి విల్లైనా ఉంది. ఈ దుడుకు కన్నయ్యో!! కాలితోనూ, చేతితోనూ, నోట్లో దూరీ, నెత్తెక్కి నాట్యం చేసీ.. " వాపోయింది మేదిని.
"హ్హహ్హహ్హహా.. భలే వారే అమ్మాయిలూ! చీకటిని పారద్రోలడమే వెలుగు లక్షణం! అప్పుడు ఇంటికొచ్చిన రఘువీరుడిని చూసి సీతమ్మ ఏం చేసిందో తెలుసా!?"
"ఆ.."
"త్వం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం!
భభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే!! "
"అర్ధం చెప్పు, బంగారుతల్లీ!"
"శత్రువులను హతమార్చి, మహర్షుల మనసులను రంజింపచేసి, వారికి సుఖాన్నొసగి ఇంటికి వచ్చిన తన పతిని చూసి, మనసు ఉప్పొంగి.. ఆ సీతాకాంత పరుగున వెళ్ళి గాఢంగా కౌగిలించుకుందట!!"
"భలే!!" ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టారు చెలియలందరూ..
"మరి రక్కసి గుంపును కాలరాసిన కృష్ణుడికి నీ కౌగిలి ఇచ్చి అభినందించాలి కదూ, విష్ణుప్రియా! రా బయటికి! వ్రతం పూర్తి చేసుకుని కన్నయ్యని కొంగున కట్టేసుకోవద్దూ!" ఊరించింది.
ఒక్క అంగలో వచ్చి తలుపు తెరిచి, సిగ్గులు చిందిస్తూ నవ్వేసింది విష్ణుప్రియ. గాఢాలింగన సౌఖ్యమెరిగిన ప్రౌఢాంగన మరి!!
"హమ్మయ్య!! కలకలమని పక్షిగణములు పలికేను.. కల్యాణీ! స్నానానికి వేళయింది. "కాత్యాయని"ని కొలిచే సమయమయింది. పద పద!" యమున వైపు దారితీసింది ఆనందిని... వెనుకే చెలులందరూ!
మణికవాటము తీయవే - 9
నిద్రపోతున్న రేపల్లెలో గిరికీలు కొట్టి వస్తున్న ఓ పిల్ల తెమ్మెరని యమునమ్మ పలకరించింది. "ఏవిటోయ్.. అంతలా పరిమళాలు వెదజల్లుతున్నావ్!! ఎచట నుంచి నీ రాక!?"
అల్లరి తెమ్మెర నవ్వుతూ "ఈ పల్లెలో చీకటి పడగానే వెలిగే సంజె దీపంలాంటి ఇల్లొకటుంది. మా గొప్పవారిల్లు! ఆ ఇంటికెళ్ళి వస్తున్నాను" అని మహ గర్వంగా చెప్పింది.
"వెళ్ళి చూడలేని దాన్నని తెలుసు కదా! నువ్వేమో కన్నయ్యలాగే ఎక్కడికైనా వెళ్ళి రాగలిగే సమర్ధత ఉన్న సర్వవ్యాపివి. నన్నూరించకుండా ఏవిటా పరిమళం.. ఎంత గొప్ప ఇల్లూ.. చెప్పవచ్చు కదా! వింటాను." అని అడిగింది యమున.
తెమ్మెర చెప్పడం మొదలుపెట్టింది. "ఆ ఇంటి గోడలు బంగారు తాపడం చేసి ఉంటాయి. కిటికీలకు మణులు పొదగబడి ఉంటాయి. ఆ ఇల్లు కుబేరుని సౌధంలా అణువణువునా ఐశ్వర్యంతో మెరిసిపడుతూ ఉంటుంది. ఆ ఇంటి వాకిట్లో వెండి గిన్నెలూ, బంగారపు పళ్ళెరాలతో పక్షులకు నీళ్ళు, నూకలు పెడతారు. ఆ ఇంటికి మరకతమణులూ, నీలాలూ పొదిగిన కవాటమొకటి.. దక్షిణపు గాలి ధారాళంగా వచ్చేలా ఉంది. నేను ఎప్పుడూ ఆ దారంటే ఆ ఇంటికి వెళ్ళొస్తాను."
"ఊ.. ఎవరుంటారా గదిలో!?" ఆసక్తిగా అడిగిని యమున.
"నేను దేశదేశాలు తిరిగానా..! ఎంతో మంది ధనికుల ఖజానాల్లో తారట్లాడానా..! కొండల లోయల్లోంచి గరుడపక్షుల ఆహారానికి అంటుకుని కొండచరియల్లో విడిచిపెట్టబడి, ఎండకి మెరిసే పెద్ద పెద్ద వజ్రాలను చూసానా? ఎక్కడా చూడని ఓ అద్భుతమైన రత్నం ఆ గదిలో ఉంది."
"అవునా! ఏవిటా రత్నం? వైఢూర్యమా? మరకతమా? నీలమా?"
"అలా ఒక రంగులో మెరిసే రాయి కాదు. నిత్యం కృష్ణనామ సంకీర్తన చేస్తూ అద్భుత తేజస్సుతో మిలమిలలాడే రత్నం!"
"అబ్బా.. చెప్దూ! మాట్లాడే మాణిక్యమా!!"
"అవును! కృష్ణ లీలలే ఉగ్గుపాలుగా పోసి, కృష్ణుడి తలపే పాలబువ్వలుగా, పంచభక్ష్యాలుగా కొసరికొసరి తినిపిస్తూ ఆ ఇంటి యజమానురాలు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న గారాలపట్టి... మంజుల!"
"ఓ... మంజులా!! నాకెందుకు తెలియదు! కాత్యాయనీ వ్రతానికి రోజూ వస్తుంది కదా!"
"అవును. ఆ మంజులే! నీ ఒడ్డున వాళ్ళాడిన ఆటలూ, పాటలూ, నీ చల్లని తరగల్లో ఆడిన తానాలే చూసావు నువ్వు. ఆ పిల్ల ఎంత భాగ్యవంతుల బిడ్డో నీకు తెలియదు."
"ఎంత భాగ్యశాలికైనా అసలుసిసలు ఐశ్వర్యం కన్నయ్యే కదా!"
"అవుననుకో! అలా అయినా గొప్ప ధనవంతుల ఇల్లది! నీకు తెలియని సంగతొకటి చెప్తాను విను. మంజుల ప్రతి రేయీ తన గది ఎంత అందంగా అలంకరిస్తుందో తెలుసా!"
"అవునా! ఎందుకూ?"
"ఎందుకంటావేమిటీ! "ఏ క్షణంలో కన్నయ్య ఎదురుపడతాడో!" అని ఆ గొల్లపిల్లలందరూ అనుక్షణం ముస్తాబు చేసుకుని కడిగిన ముత్యాల్లా ఉండరూ! అలాగే "ఏ వేళలో కన్నయ్య వస్తాడో!" అని తన గదిని మంజుల అలాగే అలంకరించుకుని ఉంచుకుంటుంది."
"వాసక సజ్జిక!"
"అవును. గోమేధికాలు, గరుడ పచ్చలూ పొదిగిన బంగారు ప్రమిదెల్లో, పరిమళాలు వెదజల్లే నూనె పోసి దివ్వెలు వెలిగిస్తుంది. దంతపు కట్టున్న చక్కటి అద్దాలు బిగించిన ఆ గది గోడలు, ఆ దీపాల వెలుగును పదింతలు చేస్తూ ఉంటాయి."
"ఆహా!"
"అంతేనా..!! బహు చక్కని లతల చెక్కడపు వెండి పన్నీరు బుడ్డి, నిత్యం పన్నీరు నింపుకుని అతని కోసం సిధ్ధంగా ఉంటుంది. మేలు చందనపు చెక్క పన్నీట అరగదీసిన గంధం మరో వెండిగిన్నెలో సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.
"ఆహా.. విత్తం కొద్దీ వైభవం కదా!"
"ఈ మాత్రానికేనా! లేలేత తమలపాకులూ, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు, లవంగాలూ తదితర ద్రవ్యాలూ, పోక చెక్కలూ.. ఓ ముద్దులొలికిలే బంగారు పళ్ళెంలో ఆ శయ్య పక్కనే ఎదురుచూస్తూ ఉంటాయి. శయ్య అంటే మామూలు తల్పమనుకునేవు! ఆ పన్నగపు శయ్యపై పరుండే స్వామికి, శేషతల్పానికి దీటైన పరుపు ఉండద్దూ! సౌఖ్యమైన హంసతూలికా తల్పం.. చక్కని పట్టు తలగడలూ.. పాలతరగల మేలుకట్టు, మిసమిసలాడే పల్చని తెరలు!! చమరీ మృగాల కేశాలతో తయారు చేసిన చామరాలు.. వింజామరలు!!"
"ఆహా.. భోగ నారాయణుడికి ఆ మాత్రం ఉండద్దూ! భేష్!!"
"ఆ గదిలో సుడులు తిరుగుతూ దివ్యపరిమళాలు వెదజల్లే అగరుధూపం క్షణమైనా విశ్రమించదంటే నమ్మాలి నువ్వు!"
"అబ్బ! ఇంత భోగ్యమైన పడకటిల్లు వదిలి కృష్ణుడు ఇంకెక్కడికి పోతాడూ!? నిత్యం మంజుల కౌగిట్లో బందీయై ఆ సౌధం దాటి రాడేమో!"
"అన్నావూ..! గోపికలందరికీ అదే అనుమానం. ఇందాకా "కృష్ణా.. కృష్ణా!" అని పలవరిస్తూ మంజుల కలలో తేలుతోందా! బయట గుమ్మం దగ్గర నిలబడిన గోపికలందరూ అదే అనుకుంటున్నారు! ఎంత పిలిచినా మేలుకోవడం లేదంటే ఆమె ఇంట్లో కన్నయ్య ఉన్నాడేమో! కన్నయ్యే తన చెంత ఉంటే ఇంక వేరే వ్రతాలెందుకని ఆ భాగ్యశాలి తలుపుతీయట్లేదేమో!" అని అనుమానపడుతున్నారు."
"నిజమా!!" ఆశ్చర్యపోయింది యమున.
"అవును.. నిన్న రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళాను. నేనిలా లోపలికి వెళ్ళానా.. ఆ అమ్మాయి కవాటం బిగించేసింది. చేసేదేముందని ఆ మందిర సౌందర్యాన్ని చూస్తూ, అగరుపొగలతో ముచ్చట్లాడుతూ రాత్రంతా గడిపేసాను. ఆ పక్క గదిలోనే వాళ్ళమ్మ కూడా ఉంది. ఆ గది కిటికీ తెరచి ఉండడం గమనించి, తెల్లారబోతోంది కదా అని బయటికి వచ్చాను. రాత్రంతా మంజుల గదిలో తారట్లాడనేమో.. నా ఒళ్ళంతా ఆ అగరు సుగంధం పట్టేసింది." చెప్పుకొచ్చింది తెమ్మెర.
"సరిపోయింది! ఇంతకీ నిజంగానే ఆ గదిలో కృష్ణుడు లేడా?" అనుమానంగా అడిగింది యమున.
"హు.. కన్నయ్య లేనిదెక్కడని! ఆ పిల్ల రాత్రి ఊపిరెన్నిసార్లు తీసిందో అన్ని సార్లూ "కృష్ణా.. కృష్ణా..!" అంటూనే ఉంది!"
"అయితే కలలోనే ఉన్నాడనమాట కన్నయ్య!పాపం, ఆ పిల్ల నిద్ర లేవడం లేదని చెలులు ఎన్ని అభాండాలు వేసి మాటలాడుతున్నారో! అసూయ, అనుమానం మహ చెడ్డవి కదూ! కబుర్లు చాల్లే కానీ.. ఇదిగో! చప్పున వెళ్ళి అక్కడేం జరుగుతోందో చూసి రా!" పురమాయించింది.
"రాత్రంతా మంజుల నిట్టూర్పుల చండ్రగాలుల్లో మరిగి ఉన్నాను. ఒక్క స్నానం చేసి వెళ్ళనిద్దూ!"
"స్నానం చేసి వెళ్ళే సమయం లేదు. వెళ్ళు వెళ్ళు.. చెలులతో కలిసి తీరిగ్గా జలకాలాడుదువు గాని! వెళ్ళి చూసి రా.. ఇక్కడున్నట్టు వెళ్ళి రావాలి తెలిసిందా!!" తరిమింది యమునమ్మ.
తప్పేదేముందని మంజుల ఇంటివైపు పరుగులు తీసింది పిల్ల తెమ్మెర.
"ఓ మంజులా! నిన్ను పిలిచీ పిలిచీ మా గొంతు జీరబోతోంది. లేమ్మా..! నీలాంటి గొప్ప ధనవంతురాలు మాతో కలిసి వ్రతం చెయ్యడమే గొప్పని మురిసిపోతున్నాం. అంతస్థులో నీతో సమానమైన వాళ్ళమేం కాదు కానీ, ఏదో.. నువ్వు మా మేనమామ కూతురివి కదా.. ఆ చనువుతో నీతో కలిసి తిరుగుతున్నాం." పిలుస్తోంది కమలిని. ఆ బంగారు వాకిలి ముందు పడిగాపులు కాస్తున్నారు మిగిలిన చెలులందరూ. అటు వెళ్ళిన పిల్ల తెమ్మెర అక్కడే తారట్లాడుతూ వింత చూస్తోంది.
"ఈ పిల్ల అంత చక్కని శయ్యమీద నిద్దరోతే ఆ సౌఖ్యానికి తెలివేం వస్తుంది! నిద్ర లేస్తున్న పక్షులతో సమానంగా ఇంత సేపటి నుంచీ పిలుస్తున్నాం. మంజులకి వినబడలేదు సరే! కనీసం అత్తకైనా వినబడలేదంటావా!?" వాపోయింది సురభి.
"పోనీ ముందు అత్తనే పిలుద్దాం. అత్తా.. లే లే!! నీ ముద్దుల కూతుర్ని నిద్ర లేపి 'కాత్యాయనీ వ్రతానికి' పంపించు. స్నానానికి వేళ మించిపోతోంది. పెద్ద దానివి! అన్నీ తెలిసిన దానివి! కనీసం నీకైనా తెల్లవారుఝామున తెలివి రానంతగా మొద్దు నిద్ర పట్టేసిందా!" పిలిచింది కమలిని.
"ఓ అత్తా! నీ చిన్నారి నిజంగానే నిద్రపోతోందా? లేక కృష్ణుడే ఆ గదిలో ఉన్నాడని, సడి లేకుండా ఆ మోహనాకారుడిని చూస్తూ మూగదైపోయిందా!"
"కనీసం పిలుపైనా వినిపించని చెవిటిదా? కిటికీ తలుపు తెరిచి "మీరెళ్ళండర్రా.. మీతో రావాల్సిన అవసరం నాకేంటి!" అని మమ్మల్ని పంపించేయచ్చు కదా!" నిష్టూరమాడింది సురభి.
"అత్తా.. పోనీ.. కన్నయ్య ఆ గదిలో లేడనుకో! కలలో "కృష్ణా కృష్ణా!" అని జపం చేస్తున్న నీ కూతురికి తపోభంగం కాకుండా, నువ్వే కావలి ఉండి నిద్ర లేవకుండా చూసుకుంటున్నావా, ఏం?"
"మీ ఇద్దరికీ గాఢనిద్రామంత్రమేమైనా ఎవరైనా వేసారా?" తనవంతు ఇంకొన్ని మాటల బాణాలు వేసింది ఉత్పల.
ఇలా చెలులు అంటున్న మాటలని వారించింది ఆనందిని. "ఆగడాగండి అమ్మాయిలూ!! ఈ రేపల్లెలో 'అందరికీ సమానమైన సొత్తు' కృష్ణుడని మీకు తెలీదూ! అయినా అత్తమ్మ మంజులని ఎలా పెంచిందో మనం చూడలేదూ! తన ఐశ్వర్యాన్ని చూసి కృష్ణుడు వస్తాడని భ్రమ పడేంత తెలివి తక్కువదా ఆ పిల్ల! తప్పు..తప్పు! గాఢ నిద్రామంత్రమేసినారో! అని నిష్టూరాలాడుతున్నారు కదా! నిజమే! కృష్ణుడే ఆ మంత్రం!
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జపజప సతతం జన్మసాఫల్యమంత్రం
అన్నింటికంటే గొప్ప మంత్రం కన్నయ్య పేరు తలవడమే! ఆ పేరు తలచీ తలచీ మత్తులో మునిగిపోయిందా పిల్ల. విత్తొకటేస్తే చెట్టొకటి రాదు కదా! ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. అత్తమ్మ నేర్పిన పలుకులే పలుకుతోంది మంజుల. ఏవైనా మంచి కబుర్లు చెప్పి నిద్ర లేపక నిష్టూరాలతో లేపుతామా?" అందరినీ శాంతింపచేసింది ఆనందిని.
మనవి వినవే! మామ కూతుర!
మణికవాటము తీయవే!
మణిఖచిత సౌధమ్ములో పరి
మళపు దివ్వెల వెలుగులో,
నునుతలిమమున కనులు మొగిడిచి
కునుకుదువుగానీ! లేవే!
మూకయో! చెవిటిదో! అత్తా!
ముద్దులా చిన్నారి కూతురు!
కాక కావలి కదలనీయరొ?
గాఢనిద్రామంత్రమేసిరొ
"శ్రీకరా! వైకుంఠనాధా!
మాధవా! మాయావి! హరి!"యని
నీకుమార్తెను లేపుమా, శుభ
నామపారాయణమ్ముతో!
బయట ఆ "కల్యాణు'ల మేల్కొలుపు విని కళ్ళు విప్పింది వాళ్ళ అత్తమ్మ. కూతురిని "మాధవా! కృష్ణా!" అని పిలుస్తూ నిద్ర లేపుదామని వెళ్ళబోతూ ఉండగా, ఆమెకి బయట నుంచి మాటలు వినిపిస్తున్నాయిలా..
"అత్తా! నీవెరుగని విషయమేముంది! నీ కూతురిలాగే గోపస్త్రీలందరమూ కృష్ణుని ముఖచంద్రబింబం కోసం చకోరాల్లా ఎదురుచూస్తున్న వాళ్ళమే! విరహపు వేడి సెగలో, వేడి నిట్టూర్పు గాడ్పుల్లో వేగి వేసారుతున్న వాళ్ళమే! ఈ తాపానికి, కన్నయ్యని పొందాలనే మా సంకల్పానికీ యమునలో మునకను మించిన ఉపశమనమేముంది, తరుణోపాయమేముంది?"
"అడవిలో ఆలమందలను కబళించిన దావాగ్నిని కన్నయ్య అమాంతం మింగినట్టు, ఆ యమున మా తాపాన్ని చల్లార్చితే బాగుండును!" దిగులుగా చెప్పింది ఉత్పల.
"నీ కూతురు మహా భాగ్యశాలి. గోపాల చూడామణిని నిత్యం తన గుండెలపై ధరిస్తుంది. కృష్ణ మంత్రాన్ని క్షణమైనా మరువదు. ఆమెతో కలిసి వ్రతం పూర్తి చేస్తేనే మా నోము పండుతుంది."
చిరుగంటలు ఘల్లుమని మ్రోగుతూ బంగారువాకిలి తెరుచుకుంది. శేషతల్పం దిగివచ్చిన సిరిలా వెలుగుల నవ్వులు వెదజల్లుతూ బయటకు నడిచి వచ్చింది మంజుల. 'కాత్యాయని పూజ'కు కదిలివెళ్ళారందరూ!
ఆ తులసి పరిమళమెక్కడిది? -10
ఏ పదార్ధం ఎటు వడ్డించాలో తెలిసిన ఇల్లాలు, మక్కువతో తన మగనికి వడ్డించిన విస్తరిలా ఉంటుంది రేపల్లె! నీరిచ్చే నది, పాలిచ్చే గోవులు, వాటికి అవసరమైన పచ్చిక బయళ్ళు, నీడ నిచ్చే చెట్లు, పచ్చని పంటచేలు, విహారానికి అందమైన పూల తోటలు, రాయంచలు తిరిగే తటాకాలు, కష్టించి పనిచేసే గొల్లలు, ఆప్యాయత నిండిన వారి మనసులు.. ఆ మనసుల్లో కొలువున్న కృష్ణుడు..!! ఇంతకంటే గొప్ప ప్రదేశం ఏడేడు లోకాల్లోనూ ఉండదని ఆ పల్లెలో పుట్టిన పురుగూ పిట్టా మీద కూడా దేవతలు సైతం అసూయ పడుతూ ఉంటారట! అలాంటి పల్లెలో పుట్టి, కన్నయ్యని వలచి వరించి, అతడిని పొందేందుకు నియమ నిష్టలతో "కాత్యాయనీ వ్రతం" చేస్తున్న గోపభామినులందరూ చిన్న పెద్దా, గొప్పా కొద్దీ తేడా లేకుండా అసూయ పడేది 'ప్రియంవద' మీద!
ప్రియంవద కృష్ణుడి పక్కింట్లో పుట్టిన పిల్ల. "ఎంత అదృష్టవంతురాలో!! కన్నయ్యకీ, ఆ పిల్లకీ ఒక్క గోడే అడ్డు కదా! ఏ వేళలో అయినా అల్లరి కృష్ణుడిని చూడగలిగేంత దగ్గరగా ఉంది కదా!" అని మిగిలిన చెలియలందరూ అసూయపడుతూ ఉంటారు. అతని చేష్టలనూ, దుడుకు పనులనూ, అనన్య శౌర్యపరాక్రమాలనూ, మధురాతి మధురమైన అతని సౌందర్యాన్నీ ఒకరికొకరు చెప్పుకుని మురిసిపోతున్న సమయంలో.. ప్రియంవద మాటాడదు! అవుననదు.. మారు పలకదు! పాలరాతి బొమ్మలా చెక్కిట చెయ్యి చేర్చుకుని, పెదవంచున దోబూచులాడుతున్న చిరునవ్వుతో మౌనంగా.. ముగ్ధంగా.. వింటూ ఉంటుంది. "అన్నీ కలిసొచ్చిన పిల్ల! అందం, విధేయత, మంచి బుధ్ధికుశలత.. ఇవేవీ కలిపి కూడా సరిపోని గొప్ప అదృష్టం కన్నయ్య పక్కింట్లో పుట్టడం! ఇంక మనలా తలచుకు తలచుకు మురిసే పనేముంది? పక్కనే కోరిన వాడుంటే!" అని గుసగుసలాడేవారామెను చూసి అందరూ!
తమ ముఖ వర్ఛస్సుతో, నవ్వినప్పుడల్లా మేలిముత్యపు పలువరుస జిలుగులతో, చేతులూపుతూ కబుర్లు చెప్పుకుంటూ తమ గాజుల మెరుపులతో రేపల్లె వీధుల్లో చలికి బిగుసుకున్న చీకటి రేయిని వెలిగిస్తూ, తెలవారుతోందన్న సంకేతాన్ని ప్రతి పులుగుకీ అందిస్తూ.. ఆ గోపవనితలందరూ నడిచి వస్తున్నారు. రాజుగారి వీధి మొగలోకి వచ్చేసరికి గాజులు సవరించుకునీ, పైటలు సరిచేసుకునీ, ముంగురులు సరిగా ఉన్నాయో లేదో చూసుకునీ.. ఒకరినొకరు చూసుకుంటూ నెమ్మదైన నడకలతో వస్తున్నారు. "కన్నయ్య నిద్దరోతున్నాడా..? పొరపాటున మెలుకువొచ్చి మనని చూస్తే..?! చూస్తే బాగుండును..!" అనే స్త్రీ సహజమైన ఆశ, లజ్జ కలగలసి అప్పుడే విచ్చుకోవడానికి సిధ్ధమవుతున్న కమలాల తీరున మిసమిసలాడుతున్నారందరూ!
ఆ వీధి చివరలో ఉన్న ఉత్పల బయటకి వచ్చి చెలులని పలకరించింది.
"అందరూ వచ్చేసినట్టేనా? ప్రియంవద లేదు!! రోజూ ముందే ఉండేదిగా.. పదండి పదండి.. ఎందుకు నిద్ర లేవలేదో!" అనుకుంటూ అడుగులేసింది.
మిగిలిన వారంతా అనుసరించారు. ప్రియంవద ఇల్లు ఇంకా నిద్రపోతోంది.కిటికీల వద్దకి వెళ్ళి తట్టి చూసారు. తలుపు వద్ద నిలబడి పిలిచి చూసారు. లోపల హాయిగా నిద్రపోతోంది ప్రియంవద.
ఉన్నట్టుండి బయట నిలబడిన చెలులని ఓ చిరపరిచితమైన సౌరభం పలకరించింది. అది తులసి పరిమళం! నిత్యం కృష్ణుని గళసీమని అలంకరించి, హృదయంపై వాలే భాగ్యశాలి.. 'వనమాలా'సౌరభం!! ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. కళ్ళతోనే మాట్లాడుకున్నారు. "తమ అనుమానం నిజమేనా!?" అని దూరంగా వెళ్ళి మళ్ళీ ఆ తలుపుల దాకా వచ్చి మరీ పరిశీలించారు కొందరు! అందరికీ కమ్మని తులసి మాల పరిమళం కచ్చితంగా తెలిసింది. అందరి ముఖ కమలాలూ కాస్త వాడిపోయాయి. కాటుక, పువ్వులూ విడిచి.. పాలూ, నెయ్యీ మరచి.. పొద్దు పొడవక ముందే గడ్డకట్టించే చన్నీటి స్నానాలు చేసి దీక్షతో కాత్యాయనికి పూజ చేస్తున్నది ఎందుకు? కృష్ణుని పొందాలనే కోరికతో! పాడీ పంటా బాగుండేలా వానలు కురవాలనే సదుద్దేశంతో! తామింత కష్టపడుతూ ఉంటే.. గోడవతల ఉన్న కన్నయ్య గోడ దూకి ఎప్పుడొచ్చాడో.. రేయంతా ఆమెతోనే ఉన్నాడో.. ఏమో!?
"కన్నయ్యకైనా అనిపించలేదా.. అందరమూ ఒకటేనని?" కలవరపడుతున్న కనులతో తోటి గోపికలతో అంది కమలిని.
"అందరమూ ఒకటే ఎలా అవుతాం? ఆమె ఉండేది పక్కింట్లో.. మనమేమో ఎక్కడో దూరంగా.." అక్కసుగా చెప్పింది అందరికంటే దూరంగా ఉండే మేదిని.
"కనీసం ప్రియంవదకైనా అనిపించలేదా? తెలవారితే మనమొస్తామని.. అడుగుతామని.. బాధపడతామని.." కన్నయ్యని నిందించలేని ఉత్పల వాపోయింది.
"అయ్యో! వెర్రి దానా..!! అతను మహా మాయగాడు. ఎదుటపడితే పశుపక్ష్యాదులే రెప్పవెయ్యలేవు. మనమెంత!! ప్రియంవద ఎంత? మురళి మ్రోగిస్తే ఆలమందలు పాలవాన, పొన్నచెట్లు పూలవానా కురిపించాల్సిందే! ఆ వయారి వలపు ఆరబోయక ఏంచేస్తుంది!!" చెప్పింది మల్లిక.
"ఎవరికేది ప్రాప్తమో.. ఏ క్షణం కన్నయ్య కౌగిట కరగాలని రాసి ఉందో! అదృష్టవంతురాలు! ఎన్ని నోములు నోచి పక్కింట్లో పుట్టిందో!" వేదాంతం వల్లెవేసింది విష్ణుప్రియ.
సురభి, ఆనందినీ ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. మిగిలిన చెలులకు అర్ధం కాలేదు. ఒకరిద్దరికి కోపం వచ్చింది కూడా..
"గోప బాలలూ.. మనమిక్కడికి వచ్చినది ప్రియంవదని మేలుకొలిపేందుకు! ఆ పని చేద్దాం ముందు." అని ఇద్దరూ ఏకకంఠంతో చెప్పారు. మిగిలిన నేస్తాలకు వచ్చిన అనుమానానికీ, కోపానికీ నవ్వుకుంటూ ప్రియంవదని నిద్రలెమ్మని పిలిచారు.
"ప్రియంవదా.. ఆ జానకిలా కోమలమైన అద్భుత సౌందర్యం నీది! అంత సౌందర్యాన్ని మించిన మంచి మనసున్న దానివి. నీ పలుకులు ఎంత హాయిని కలిగించేవో.. మీ పెద్దవారికి ఎలా తెలిసిందో సుమా.. నువ్వు 'ప్రియంవద'వని! బహుశా పుట్టగానే "కృష్ణా!" అని ఉంటావు. ఆనందం కలిగించే ఆ పలుకు నీ నోట విని, నీకా పేరు పెట్టి ఉంటారు." తన కోయిల కంఠంతో సుప్రభాతం పలికింది ఆనందిని.
"మధురా.. మధురాలాపా..! అని రామచంద్రుడు వర్ణించిన సీతాభామినిలాంటి దానివి! 'కృష్ణా!' అన్న పేరు ఎవరైనా తలిస్తే నువ్వు మూగపోతావు. ఆమె కూడా అంతేనట! తన రాముడినీ, మామగారు దశరథ మహారాజు గొప్పతనాన్నీ గురించి హనుమ చెప్తూ ఉంటే పారవశ్యంలో ఆమెకు నోటమాట రాలేదట! మా నోట కృష్ణుని కథలు వినిపిస్తాయన్న తలపుకే నీ పెదవులు సిగ్గుతో, పరవశంతో పలకనంటున్నాయా!?" అంది ఆనందిని.
ఈ వరసేం నచ్చని చెలులు పక్కన నిలబడి చూస్తున్నారు.
"కుంభకర్ణుడిలా నిద్దరోతున్నావా!" అక్కసుగా అంది కమలిని.
"కృష్ణుడు నీ వద్దే ఉంటే.. ఆ 'పర'వాద్యమేదో అడిగి మాకివ్వమ్మా! మేము వెళ్ళి వ్రతం పూర్తి చేసుకుంటాం. నీకేమవసరం.. మాలా కష్టపడాల్సిన దానివి కాదు. స్వర్గసుఖాలలో తేలుతున్నావు కదా!" ఎర్రగా కందిన ముఖంతో రుసరుసలాడుతూ అంది ఉత్పల.
"తలుపు తీయకపోతే మానేసావు.. ఒక్క మాటైనా పలుకు లోపల నుండీ..!!" మల్లిక సన్నాయి నొక్కులు నొక్కింది.
వాళ్ళ పలుకులే పాట కట్టి మధురంగా 'అసావేరి' ఆలపించసాగింది ఆనందిని.
పోనీ తలుపుతీకుంటే
మానేవుగానీ!
ఔనే! ఒక్కమాటైనా
మాతో అనవేమీ?
చానా! నోమూని స్వ
ర్గానూన భోగముల
ఆనందించే దాన!
మా తల్లి కాన!
నారాయణుడు కోమలామోద తులసీ
శ్రీరుచిరమౌళి మనపాలి వరదాయి!
గారాన పరవాద్యమ్ము కరుణించు!
నోరార చేయు కైవారముల ఆలించు!
పాములూ, పశువులూ, పాపలూ సైతం విని పరవశించే పాట కూడా కరిగించలేని రాతి హృదయాలు కావా గొల్లపిల్లలవి! బహు సున్నితం! కోపం కరిగిపోయింది!!
తలుపు తీసుకుని ప్రసూనంలా నవ్వు చిందిస్తూ బయటకు వచ్చింది ప్రియంవద. తనను దాటి ఇంట్లోకి చూస్తున్న వారి చూపులు అర్ధం కానట్టు చూసింది.
"ఏవమ్మా! ప్రియంవదా.. మీ ఇంట్లోంచి కన్నయ్య మెడలో ఉండే తులసి మాల సువాసన ఘుంఘుమ్మని మమ్మల్ని వివశల్ని చేస్తోంది. నువ్వూ ఆ మాల వాలినట్టే ఆతని గుండెలపై వాలి ఇహాన్ని మరిచావేమో! అని చెలులందరూ అనుమాన పడుతున్నారు." కోపం నటిస్తూ చెప్పింది ఆనందిని.
"నారాయణుడు లేని చోటేది!? మీ ఇళ్ళలో మాత్రం లేడూ! రాత్రీ పగలూ కూడా ఉంటాడే!!" స్వచ్ఛంగా నవ్వుతున్న ప్రియంవద అబధ్ధం చెప్తోందని ఏ ఒక్క గోపికా అనుకోలేకపోయింది.
"నువ్వేమో సీతాకాంతలా బహు చక్కనిదానివి! ఆమెలాగే ఎల్లప్పుడూ ప్రియమైన మధురమైన పలుకులు పలికే దానివి.. మరి కుంభకర్ణునిలా అంత నిద్రెలా వచ్చింది, అమ్మడూ!" అమాయకత్వం చిందిస్తూ ప్రశ్నించింది సురభి.
"కలలో అంతులేని జలరాశి.. అందులో ఓ మర్రాకు. చూద్దును కదా! ఆ ఆకు మీద ఓ బుజ్జాయి!! కాలిబొటన వేలు చేతితో పైకెత్తి, నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న పాపడు!ఎంతచూసినా తనివి తీరదే! కళ్ళు తెరచుకోవే! అతిప్రయత్నం మీద లేచి వచ్చాను." స్పటికంలా తళతళా మెరుస్తున్నాయి ఆమె కళ్ళు ఆనందంతో.. అమాయకత్వంతో!
"ఆహా..!అదృష్టమంటే నీదే కదా, చెలీ! కన్నయ్య పక్కింట్లో ఉన్నావని నీమీద అసూయచెందుతున్నారు చెలులంతా! నీ పున్నెమంతా ఇంతానా..? నీకు స్వప్నంలో కనిపించినది వటపత్రశాయి!! ప్రళయకాలంలో సమస్త ప్రాణికోటినీ బొజ్జలో దాచుకుని కాపాడుతున్న పాపడిని చూసావు!
కరార విందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి!
చేతులు జోడించింది ఆనందిని. ఒళ్ళు గగుర్పొడిచింది మిగిలిన వారందరికీ!
"పదండి..స్నానానికి వేళ మించిపోవట్లేదూ..!"నడిచింది ప్రియంవద.
"ఆ తులసి పరిమళం.."అర్ధోక్తితో ఆపేసింది ఉత్పల.
"వెర్రిదానా.. కృష్ణమాయ!" తేటగా నవ్వింది కమలిని.
అందాల భరిణా! మేలుకో! - 11
యమునా, నింగీ ఒకదాని నల్లదనంతో ఒకటి పోటీ పడుతున్నాయి. చుక్కలు జిగేలుమన్నపుడల్లా యమున పందెం గెలుస్తోంది. ఆ చుక్కల వెలుగు నీళ్ళలో తళుక్కుమన్నప్పుడల్లా ఆకాశం నెగ్గుతోంది. తెలవారితే ఆకాశం ఎలాగూ ఓడి తెల్లబోతుందని తెలిసిన యమునమ్మ గోపకాంతల్లాగే తొలిఝాము కోసం ఎదురుచూస్తోంది. ఓటమినెరుగని తేజస్విని మాత్రం ఒళ్ళెరుగక నిద్రపోతోంది.
రేపల్లెలో నిత్యం జరిగే పందెం "ఎవరికెక్కువ పశువులున్నాయో..! ఎవరి పశువులు ఎక్కువ పాలనిస్తాయో..!" అని. తేజస్విని ఇంట్లో పశువులను మించినవి ఇంకెవరి ఇంట్లోనూ లేవు. ఆ పశువులిచ్చిన పాడి మరొకరి పశువు ఇవ్వలేదు. కామధేనువు కన్న పెయ్యల్లా ఉంటాయవి!! అంతే కాదు.. అన్ని ఆవులూ మంచి యవ్వనంలో ఉంటాయి. వట్టిపోవడమంటే వాటికి తెలీదు. పాలివ్వమని వాటిని అడగడం తేజస్వినికి తెలీదు. అడగకుండానే ఎడతెగని క్షీరధారలు కురిపిస్తూ ఉంటాయవి. నిత్యం అవి కురిపించే పాలధారలను, కడవలతో నింపడం... రాయిలా తోడుకున్న పెరుగును తరిగోలలతో చిలికి వెన్నతీయడం, తన పశువుల మందలో నిత్యం ఏదో ఒక ఆవు ఈనడం.. ఇలా పశువుల సంరక్షణతో క్షణమైనా ఖాళీ లేకుండా తేజస్విని పగలంతా పనిచేస్తూనే ఉంటుంది.
తెలవారకముందే మొదలయ్యే ఆమె పని పొద్దు గూకే దాకా సాగుతూనే ఉంటుంది. ఆలమందలను కాచి కాపాడుకునే క్రమంలో ఆమెకు విహారాలకు, రాసలీలలకు క్షణమైనా తీరిక ఉండదు. పువ్వుల మాలలు అల్లే సమయం ఉండదు. పూబంతులాడే అవకాశం ఉండదు. బృందావనిలో మురళి మ్రోగే వేళ ఆమె తన పెరట్లో ఆవులకు నీళ్ళు పెడుతూనో, పాలు పితుకుతూనో ఉంటుంది. "ఎప్పుడూ ఉండే పనులే కదా.. వదిలి రా! కన్నయ్యని చూసేందుకు వెళ్దాం." అని నేస్తాలెవరైనా పిలిచినా సున్నితంగా నవ్వేసి తిరస్కరిస్తుందామె.
"కన్నయ్య ని ఈ రోజు దాగుడు మూతల్లో ఓడించాను తెలుసా! కృష్ణుడు నాకోసం దోర జామకాయలు కోసిపెట్టాడు! ఈ రోజు మేమందరం కన్నయ్యతో కలిసి యమునలో జలకాలాడాం..!" ఇలా ఎవరో ఒక చెలి మోసుకొచ్చే కబుర్లను తన పని ఒకవైపు చేసుకుంటూనే నవ్వుతూ వింటుందామె. బదులివ్వదు. అసూయపడదు. తన పనిని తను విసుక్కోదు. ఒక్క క్షణం ఏమరుపాటుగా పాలు పొంగి పొరలనివ్వదు, పెరుగు పులవనివ్వదు. ఒళ్ళలసేలా కష్టపడి ఆమె శరీరం ధృఢంగా ఉంటుంది. నడుము పిడికెడు! చేతులు చూసేందుకు నాజూకుగా ఉన్నా, కడవల కొద్దీ గడ్డపెరుగు చిలికీ చిలికీ ఆమె నరాలు ఎంతో బలాన్ని కలిగి ఉంటాయి. తన పశువులపై ఈగవాలనివ్వదు. అవసరమైతే మందలను పచ్చిక బయళ్ళలోకీ, కొండమొదట్లోకీ నిర్భీతిగా మేతకు తోలుకుపోగలదు. ఇతర గోపకాంతల్లా సుకుమారి కాదు. నీడ బూచులకు, తోడేళ్ళకు, రాక్షసులకు భయపడదు. ఆమె ఇంట్లో వారంతా వీరులే. అమాయక గొల్లలు కాదు. శత్రువులకు వెరచేవారు కాదు. గోపాలకులలో అంత శౌర్యం అరుదు!
"పొద్దస్తమానం ఆ పశువుల మధ్య తిరుగుతుందే కానీ, ఓ ఆటా ఓ పాటా..? ఆమెకు గర్వం. తనది గొప్ప వంశమని! గోపాలకులందరిలోనూ శ్రేష్ఠమైన పాడి ఆమె ఇంట్లోనే ఉందని. గొప్ప ధనవంతురాలని. పోనీ మనతో కలవకపోతే మానెయ్య్.. కనీసం కన్నయ్యకోసమైనా ఆ పనులు పక్కన పెట్టి రాదే! ఏం నిర్లక్ష్యం!" అని చాటున అనుకుంటారందరూ! తన వద్దకే వచ్చి అడిగిన వారికి చాలా మందికి చిరునవ్వే ఆమె సమాధానం. అయితే ఆమెను ద్వేషించడం ఎవరితరం కాదు. అవును మరి! అడిగిన సాయం చేసేదీ, చూడచక్కనిదీ, చిరునవ్వు పెదవంచున మెరిసే చిన్నదీ ఆ పడుచు. ఆమెకి గిట్టనివారు లేరు! పనికి వెరచే పిల్లలకు ఆమెను ఉదాహరణగా చెప్పని పెద్దవారుండరు.. ఆమెను చూసి రేపల్లెలో ఓ సామెత పుట్టింది. "కూర్చున్నమ్మ కుంగిపోయింది.. చేసినమ్మ చేవతేలిందీ.." అని!
ఆమె చక్కదనాల చుక్క. ఎవరో మహాశిల్పి బహు జాగరూకతతో నిద్రాహారాలు మాని చెక్కిన శిల్పంలా ఉంటుంది. నేలజారిన గంధర్వకన్యలా ఉంటుంది. మిగిలిన గోపకాంతలెవరూ ఆమెను చూసి అసూయపడరు. మగవాడిగా పుట్టని తమ దురదృష్టానికి చింతిస్తారు! ఆమె అపురూప లావణ్యాన్ని చూసేందుకు పనికట్టుకు వాళ్ళింటికి వెళ్తారు. ఆమె పాలు పితకడానికి కూర్చుంటే, ఆమె చురుకైన కదలికను చూసి ముచ్చట పడతారు. పాలకడవ నడుముకెత్తుకుని నడుస్తున్న ఆమె ఘనజఘనాన్ని చూసి ఆశ్చర్యపోతారు. పిరుదులు దాటేదాకా ఉండే ఆమె నల్లని ఒత్తైన జుత్తుని ఆరాధిస్తారు. "అయ్యో! ఇంత అందాన్ని కృష్ణుడికి దూరంగా ఈమె ఇంట్లోనే బంధించి అడవి కాచిన వెన్నెల చేసేస్తోందే!!" అని నొచ్చుకుంటారు. ఆమెను ఎలాగో ఒకలా బృందావనికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తారు.
ఎవరికీ తెలియని విషయమొకటుంది. పాలు పితుకుతూ, పనిచేస్తూ, చల్ల చిలుకుతూ ఆమె తలచే తలపులోంచి రూపం దాల్చి.. వంశీకృష్ణుడు నిత్యం ఆమె ఎదుటే ఉంటాడు!! ఆమె పాలు పితుకుతూ ఉంటే చెంతనే కూర్చుని కబుర్లు చెప్తాడు. చల్ల చిలికేవేళ అల్లరిగా ఆమె నడుము గిల్లి నవ్వుతాడు. పనులలో అలసి చెదిరిన ముంగురులు సవరిస్తాడు. విడిన కొప్పు సరిచేసి, పువ్వులు స్వయంగా మాలలల్లి ఆ నీలాల కురులను ఆమె మెడపై పడకుండా కట్టడి చేస్తాడు. చమటతో తడిసిన ఆమెకు వీవనలు వీస్తాడు. అలసిన ఆమె తమలపాకు పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని మెత్తమెత్తగా ఒత్తుతాడు. "అయ్యో! తప్పు తప్పు!" అని వారిస్తున్న ఆమెను చూసి నవ్వుతూ "మీ ఇంటి పాడీ, వెన్నా తింటున్న వాడిని! ఈ మాత్రం సేవ చేసుకోనీ! ఆలమందల్ని నీ పెరట్లోనూ, ఈ అల్లరి కృష్ణుడిని నీ పాదాల దగ్గరా కట్టేసుకున్నావు! జాణవి సుమా!" అని మేలమాడుతాడు. బుగ్గల్లో గులాబులు పూయిస్తుందామె. వెన్నెలను కళ్ళతోనే కురిపిస్తుంది. హరివిల్లుని తన ఒంపుల్లోనే చూపిస్తుంది. ఇంక కన్నయ్యకి ఆమెతో వన విహారాలెందుకు! ఆమెకు యమునలో అతనితో సరిగంగ తానాలో లెక్కా?! ఈ భాగ్యం ముందు..
"అలసిపోయి నిద్రలేవలేదని ఒక్క తేజస్విని గురించి మాత్రమే అనుకోగలం! ఈ ఆలమందలను ఒక్కచేత్తో సమర్ధించుకు వస్తోందంటే అలిసిపోదూ మరి! అప్పటికీ ఈ వ్రతం మొదలెట్టిన దగ్గర నుంచీ క్రమం తప్పకుండా ఇల్లు విడిచి పూజకి వస్తోందాయె! ఏనాడైనా ఆమె మనతో విహారాలకు రావడం ఎరుగుదుమా!" తేజస్విని ఇంటి ముందు ఆగుతూ సురభితో అంది ఉత్పల.
"నిజమే! చెలులందరూ వచ్చేదాకా బయటే నిలబడదాం. ఇంకాసేఫు నిద్రపోనీ పాపం!" జాలి చూపించింది సురభి.
"ఏమాటకామాటే! ఇంత అందం ఉండి, ఇన్ని పశువులు ఉండీ అసలు గర్వం అన్నది ఎరగని పిల్లెవరంటే తేజస్వినే!"
"నిజం ఉత్పలా! ఏం అందమసలు! అందమొక్కటేనా! ఏ పనైనా తను చేసినట్టు మన పల్లెలో మరో ఆడపిల్ల చెయ్యగలదా? గొప్పింట్లో పుట్టింది. గారాలపట్టి. అయినా ఎంత పనిమంతురాలో!" మెచ్చుకుంది కమలిని.
అంతలో వచ్చి చేరిన ఆనందిని అంది "పదండి.. వెళ్ళి నిద్ర లేపుదాం అమ్మడిని! ఈ రోజెందుకంత ఆలస్యమయిందో! అన్ని పనులుండీ రోజూ ముందే వచ్చేస్తోంది కదా! జాగ్రత్త! మన అలికిడికి ఈ పశువులు నిద్ర లేస్తే కష్టం! అందునా.. ఒకటా రెండా.. వేల పశువులు.. పాల కుండలు ఒకదానికొకటి చేర్చి ఉంచినట్టున్నాయి మసక వెలుతురులో!"
"ఒక్క ముసలి ఆవు ఉండదు కదా! అన్నీ ఒకే వయసులో లేతగా.. ఇంకా దూడల్లాగే ఉంటాయి! ఆశ్చర్యం!!" చెప్పింది కమలిని.
"అదే వింత! దేవతలందరూ వీళ్ళ పెరట్లో ఆవులై పుట్టారేమో! వారికే నిత్య యవ్వనం సాధ్యం!" నవ్వుతూ చెప్పింది ఆనందిని.
"నిజమా!"
"అవును! అమృతం తాగిన దేవతలు ఎప్పుడూ పాతికేళ్ళ పడుచు వయసులో ఉంటారట! ఎన్ని సంవత్సరాలైనా సరే! అమృతం పాలరూపేణా ఇచ్చే ఈ పశువులూ అంతే! తేజస్విని అందానికి మోహించి వచ్చి కన్నయ్య ఈ పెరట్లో నిలబడి వేణువూదుతాడేమో నిత్యం! లేకపోతే ఈ మందలకు అంత గొప్ప పాడి,ఆ అమరత్వం ఎక్కడిది!"
"ఏమో! నిజమేనేమో! ఆ.. ఎంతందముండి ఏం ప్రయోజనం! ఒక్క నాడు ఆ కురులలో సుమ మాలికలు ధరించదు కదా! ఒక్కనాడు తీరికగా గోరింటాకూ, పారాణీ అలదదు కదా! ఎప్పుడూ పనీ పనీ!" వాపోయింది ఉత్పల.
"ఆ పనిలోనే ఆమెకు కన్నయ్య ఉన్నాడు. విహితమైన కర్మలను చేస్తూనే పరమాత్మని మరువని వారే మహా యోగులు! అలాంటి యోగిని తేజస్విని!" చెప్పింది ఆనందిని.
"నువ్వెన్నైనా చెప్పు.. కృష్ణుడికి దూరంగా ఈ ఇంట్లో ఎన్ని సార్లు కన్నయ్యని తలుచుకుని ఏం లాభం!" వాదించింది కమలిని.
"రామన్న వెంట అడవులకు వెళ్ళి అనుక్షణం నీడలా అన్నని కాపాడుకున్న లక్ష్మణుడి అదృష్టం వేరు. అన్నలాగే తనూ తండ్రి మాటని కాదనకుండా రామపాదుకలే తోడుగా రాజ్యం చేస్తూ క్షణమొక యుగంగా రాముని విరహంలో గడిపిన భరతుడిదొక తీరు. ఎవరు గొప్పని అడిగితే ఏం చెప్పగలం!"
ఆనందిని మాటలకు మారుమాట్లాడలేదు చెలులందరూ! నిజమే కదూ! ఆలమందలను కాచడమే వృత్తి. అది దాటి వెళ్ళకుండా, తన దగ్గరకే కన్నయ్యని రప్పించునే శక్తి ఎవరికుంటుంది! మనస్వినికి తప్ప! 'స్వధర్మం నిధనం శ్రేయః' అన్నారు కదూ!
విశాలమైన పెరడు దాటి, ఆ ఇంటి ముంగిట్లో నిలబడి లోపల నిద్రపోతున్న తేజస్వినిని 'శహన రాగం'లో పిలుస్తున్నారందరూ!
రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!
రావే! పాముపడగ బోలే కటికలదాన!
లేవే! నీరదశ్యామ మోహనుని నామముల
నీ వాకిటనే నిలచి నీవారు పాడేరు
మేలిపొదుగుల ఆలు వేలు కలవారు, ఆ
భీల రణమున అరుల బీరమడచేవారు, గో
పాలకులమున వెలసే ఓ వనమయూరీ
లేవే! కలుముల నెలవౌ ఓ నారి! వయ్యారి!
రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!
"ఓ తేజస్వినీ! 'పుంసాం మోహన రూపాయ..' అని పురుషులు సైతం మోహించేంత మోహన రూపుడట శ్రీరామచంద్రుడు! ఆ చాలు నీకెలా వచ్చిందో!! నీ సౌందర్యం ఆడపిల్లలం మాకే మోహాన్ని కలిగిస్తుంది! నీ వన్నెలు చూసి వలచని ప్రాణి లేదేమో! నువ్వు మాతో కూడి నోము నోచడమే మా అదృష్టం! కన్నయ్యనే నీ ఇంటికి రప్పించుకునే జాణవు. గొప్ప భక్తి గలదానివి. నువ్వు మాతో ఉంటే మా నోము పండుతుంది." పిలిచింది ఆనదిని.
"నీలిమబ్బు వన్నెలో వెలుగుతూ అంతులేని మోహాన్ని కలిగించే సుందరాకారుడు.. ఆ కృష్ణుడు! అతడిని తలుచుకుంటూ 'కృష్ణా.. కృష్ణా!' అని పిలుస్తున్నాం! మబ్బు తలపుకే పరవశించి ఆడే మయూరిలాంటిది నీ మనసు! గొప్ప వంశంలో, గొప్ప పాడి ఉన్న ఇంట్లో పుట్టానన్న ఆభిజాత్యం లేని దానివి. కృష్ణుని నీ అణువణువునా నింపుకున్నావు. రా.. నిన్ను చూస్తే చాలు! మాకు కృష్ణుడిని చూసినంత ఆనందం కలుగుతుంది. మేలుకో! లేచి రా వయ్యారీ!" పిలిచారు చెలులు.
"ఎంత అలసి సొలసి నిద్రపోతున్నావో! నిన్ను నిద్ర లేపాలంటే మాకు మనసు రావడం లేదు! కానీ పూజకి వేళవుతోంది. ఇంకా స్నానం చెయ్యాలి. పూజకు సిధ్ధం చేసుకోవాలి! వేళయిపోతోంది అమ్మాయీ! లే లే!" మరో సారి పిలిచింది కమలిని.
అలకిడైనా లేదు! తలుపుకు దగ్గరగా నిలబడి మృదుమధురంగా చెప్పనారంభించింది సురభి.
"ఓ చెలీ! ఓ తేజస్వినీ! నువ్వెంత గొప్పదానివో, ఎంత అందచందాల భరిణవో నీకు తెలీదు. పొద్దస్తమానం పనిపాటల్లో మునిగి నీ అందానికి మెరుగులు దిద్దుకోవడం లేదని మేమంతా అనుకుంటామా..! అసలు కాటుక, తిలకాలూ, రకరకాల పువ్వులు, అత్తర్లతో అలంకరించుకునే మాకంటే నువ్వు కొన్ని వందలరెట్లు అందగత్తెవి! సహజ సౌందర్య రాశివి! నీ ఘన నితంబ ప్రదేశం చూసి మోహించని వారుండరు తెలుసా! పాముపడగలా ఉంటుంది నీ కటిభాగం! యోగసాధన చేసి సాధించిన శరీర లావణ్యం నీది! నీ యోగం, నీ ఉపాసనా అన్నీ కృష్ణుడే కదా!"
"నిజం! ఎంత సేఫు పితికినా ఖాళీ అవని కడవల్లాంటి పొదుగులున్న ఆవులు నీ పెరట్లో వేలసంఖ్యలో ఉన్నాయి. వాటి ఆలనా పాలనలో నీకు క్షణమైనా తీరిక ఉండదు పాపం! పొద్దున్న ముడిచిన కొప్పు.. ఏ పాల కడవ వంటింట్లో దింపుతూనో దార్లో కనిపించిన ఏ చామంతో పుణికి కొప్పులో తురుముకుంటావు. మళ్ళీ ఆ ఊసైనా పట్టించుకొనే దినచర్యా నీది! అందుకే నీకోసం కన్నయ్యే వస్తాడట! నిజమేనా!? నెలవంకలాంటి నీ నుదుటిమీద చిందిన స్వేదం తన పీతాంబరపు అంచుతో తుడుస్తాడట! నీ ముంగురులు సర్ది, నువ్వు చల్ల చిలుకుతూ ఉండగా విడిపోయిన నీ పొడవైన జుత్తు సవరిస్తాడట. నీ పెరట్లో విరజాజి తీగొకటి ఉంది కదా! ఆ పువ్వులు కోసి తెచ్చి మాలలు కట్టి, స్వయంగా నీ కురులను ఆ మాలలతో బంధిస్తాడట కదా!"
తన రహస్యాలన్నీ చెలులకి ఎలా తెలిసిపోయాయో అని ఆశ్చర్యపోతూ, సిగ్గుపడుతూ తలుపు తీసింది తేజస్విని. మెరుస్తున్న ఆ కళ్ళ ధవళిమను, సిగ్గుతో కందిన ఆ బుగ్గల అరుణిమను.. బంగారుతీగెలా నిలబడిన ఆమె సౌందర్యాన్ని చూస్తూ రెప్పవెయ్యడం మరచిపోయారు చెలులందరూ!
"నన్ను నిద్రలేపి మీరందరూ కళ్ళుతెరిచి కలలు కంటున్నారల్లే ఉంది. కృష్ణ కృష్ణా! పదండి పదండి స్నానానికి! కాత్యాయని పూజకు వేళ మించకూడదు!" దారితీసింది తేజస్విని.
నిలువ చోటు లేదు! నిదుర లే! - 12
కృష్ణపక్షానికి వీడ్కోలు పలికింది ఆకాశం. నిన్ననే పుట్టిన తన జాబిలికూనని మురిపెంగా యమునకి చూపిస్తోంది.
రేపల్లెలో ఆ ఇంటి వింతలు చెప్పుకోనివారు ఉండరు. ఆలనా పాలనా లేనిదే ఆ ఇంటి పశువులు అంత పాడి ఎలా ఇస్తున్నాయో అందరికీ ఆశ్చర్యమే! నీళ్ళు తోడి పొయ్యకపోయినా ఆ ఇంటి ముంగిట్లో పూలతోట అంత పచ్చగా ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కాదు. ఆ ఇంటి గోపన్న పొద్దస్తమానం కన్నయ్య వెంట తిరుగుతాడు మరి! గోపన్న కన్నయ్యకి ప్రియనేస్తం. నిద్ర లేచింది మొదలు ప్రతిక్షణం కన్నయ్య వెంట అతనూ ఉండితీరాల్సిందే! ఆలమందలను మేతకు తీసుకువెళ్ళేటప్పుడు కృష్ణుడి కంటే ఓ అడుగు ముందే నడుస్తాడతడు. ఏ ముల్లైనా కృష్ణుడిని గుచ్చే ప్రమాదం ఉంటుందని అతడి బెంగ. చల్ది మూటలు మోస్తాడు. కొండవాగుల్లోంచి చల్లని నీళ్ళు ఆకుదొన్నెల్లో పట్టి తెస్తాడు. కన్నయ్య వేణువూదితే ఒళ్ళు మరచి నాట్యం చేస్తాడు. పుట్టతేనెలు తెచ్చి కృష్ణుడి నోట్లో పిండుతాడు. కొండగోగుపూలు పరిచి కన్నయ్య విశ్రమించేందుకు పడక సిధ్ధం చేస్తాడు. తన తొడపై తలుంచి కృష్ణుడు నిద్రపోతూంటే రెప్పవెయ్యకుండా అతని రూపాన్ని కళ్ళలో పదిల పరుచుకుంటాడు. 'ఏమరుపాటుగా ఉన్న కృష్ణుడిపై ఏ రక్కసి వచ్చిపడుతుందేమో!' అని అనుక్షణం చురుకుగా కావలి కాస్తాడు. కృష్ణుణ్ణి ఇంట్లో దింపి యశోదమ్మ పక్కనే నిలబడి దిష్టి తీసేదాకా ఊరుకోడు. కన్నయ్య బువ్వ తిని నిద్దరోయాక అతని ముద్దు మోము మరోసారి చూసి కడుపు నింపుకుని ఇంటికొచ్చేస్తాడు. మళ్ళీ వేగుచుక్క పొడవకముందే నిద్రలేచి నందగోపుడి ఇంటి ముందు నిలబడతాడు.
"గోపన్నా.. అన్నం తినడం మర్చిపోయినా నవనవలాడతావు. అమృతం తాగావేంట్రా!?" అని గోపన్న తల్లి ఆశ్చర్యపోతుంది. "కన్నయ్యని చూస్తే కడుపు నిండిపోతుందే! పాయసం కంటే తియ్యగా ఉంటాయి ఆ పలుకులు! అమృతం నాకెందుకో..!" అని నవ్వేస్తాడు. "నీ అశ్రధ్ధకి చిక్కనైనా చిక్కవురా ఎనుములు..!! నువ్వేం తింటున్నావో.. వాటికేం మేపుతున్నావో!" అని బుగ్గలు నొక్కుకుంటుందావిడ. కృష్ణనామామృతం తాగి సమృధ్ధిగా చిక్కటి కమ్మటి పాలనిస్తాయి గోపన్న ఇంటి ఎనుములు.
అలాంటి అన్నకి వెన్నుతట్టి పుట్టిన చెల్లెలు అమృత. పాలు పితుకుతూ కడవపొర్లి ధారలు నేలపై పారినా ఒంటిపై తెలివి రాదాపిల్లకి. చల్ల చిలుకుతూ చిలుకుతూ వెన్న ఏర్పడి కరిగిపోయినా పట్టదా అమ్మడికి! పువ్వులు కోస్తున్నాననుకుని ఆకులు దూసి మాలలు కడుతుంది. కాటుకతో బొట్టు దిద్దుకుంటుంది చంద్రహారం నడుముకు చుడుతుంది. అనుక్షణం కృష్ణస్మరణలో ఇహం మరచి ఎప్పుడూ బృందావనిలోనే ఉంటుందామె మనసు!
"ఇంకా అమృత నిద్ర లేవలేదు. అసలే పరధ్యానం పిల్ల. అసలు గదిలో ఉందో లేదో!" అని కిటికీ సందుల్లోంచి చూసారు చెలులు. ఆ వేళ చలి మిక్కుటంగా ఉందేమో చిగురుటాకుల్లా వణికిపోతున్నారందరూ! లోపల హాయిగా నిద్రపోతోంది అమృత.
"ఓ పిల్లా! అమృతా.. నిద్ర లే లే! పొద్దు పొడిచే వేళయిపోతోంది. మీ ఇంటి పశువులు ఎప్పుడనగా నిద్రలేచాయో! వాటి అంబారావాలకు మీ తోటలో గూడుకట్టుకున్న పక్షులన్నీ నిద్రలేచి ఎప్పుడో ఎగిరిపోయాయి. నీకు ఇంకా తెలివి రాలేదా?" పిలిచింది కమలిని.
"ఓ అమ్మాయీ! నువ్వు తొందరగా నిద్ర లేచి రాకపోతే మా అందరం నీ ఇంటి ముందు గడ్డకట్టుకుపోయేలా ఉన్నాం. ఈ రోజు మంచు వర్షంలా కురుస్తోంది. అబ్బో! చలి భరించలేకపోతున్నాం. మా మీద దయుంచి లే తల్లీ! ఈ మంచు వానలో తడిసే కంటే యమునలో మునగడం మహా సులువు!" గజగజా వణుకుతూ చెప్పింది ఉత్పల.
"ఈ నేలంతా ఎంత చిత్తడిగా ఉందో చూసారా!" కిందకి చూస్తూ అంది కమలిని.
"అవును! నిద్ర లేచిన ఎనుములు దూడలను తలుచుకుని పాలను వాటంతట అవే కార్చేస్తున్నాయి. ఆ పాల మడుగులివి!"
"అవునా! ఏం చోద్యమిది! పాలు పిదికి కడవల్లో నింపుకోవాలి కానీ, నేలపాలు చేస్తారా!? అపచారం.. అపచారం!" లెంపలు వేసుకుని ఆ పాల మడుగు దాటి గుమ్మానికి దగ్గరగా నిలబడింది కమలిని.
"మన రేపల్లె మొత్తానికి గోపన్న ఒక్కడేనేమో.. ఇలా పనులు మానుకు కన్నయ్య వెనుక తిరిగే వాడు. పోషణ లేకపోయినా పాలిస్తాయి ఈ ఇంటి పశువులు.. నీళ్ళుపొయ్యకపోయినా ఆ చామంతులు చూడు! పచ్చని తివాచీలా ఎలా పూచాయో! ఈ పిల్ల తలలో ఎప్పుడు చూసినా.. చేమంతి ఆకుల దండే! అదేమని అడిగితే అప్పుడే తెలివొచ్చినట్టు చూసి నవ్వేస్తుంది. అన్నా చెల్లెలూ ఇద్దరూ ఇద్దరే!" చెప్పింది ఉత్పల.
"ఎంత అదృష్టమది! ఇహం మరచి, తన సుఖం విడిచి కన్నయ్య వెంట తిరిగే అదృష్టం ఎందరికుంటుంది!" అంది సురభి.
"నువ్వు మరీ చెప్తావులెద్దూ! నిన్నేగా తేజస్వినిని చూసి, పనిమంతురాలూ. ఆమెకోసమే కన్నయ్య వస్తాడు అని అనుకున్నాం.. ఈ రోజు రెండో నాలుకతో మాట్టాడుతున్నావేవమ్మా?"
"తేజస్విని పని వదిలి రానిదీ కన్నయ్య కోసమే.. ఈ గోపన్న పనిమాలా వెంట తిరిగేదీ కృష్ణ సానిధ్య సుఖం కోసమే!"చెప్పింది సురభి.
"హ్మ్.. ఆమె భరతుడైతే ఈతడు లక్ష్మణుడంటావ్!"
"నిస్సందేహంగా..! లక్ష్మణో లక్ష్మిసంపన్నః అన్నారు. ఆనాడు ఆ లక్ష్మణుడి దగ్గరా, ఈనాడు ఈ గోపన్న దగ్గరా ఉన్నది కైంకర్యమనే లక్ష్మి. అందుకోసం కర్మని తోసిరాజన్నా సంపద వారి వెంటే ఉంది చూడు! సర్వైశ్వర్యాలూ, అమరభోగాలూ, ఏడేడులోకాల సార్వభౌమాధికారమూ ఇచ్చినా రామన్న పక్కన ఉండే అనుభవిస్తానన్నాడు లక్ష్మణుడు. ఇంత సంపద ఉండి గోపన్నకి ఏమైనా పట్టిందా.. తెలవారితే మళ్ళీ కన్నయ్య చెంతకు లేగదూడలా పరుగులు తీస్తాడు."
"ఈ అమృత అన్నకు తగిన చెల్లెలే! యమునకు నీళ్ళకు వెళ్ళి కడవ నింపుకుని ఏరోజైనా తిరిగి వచ్చిందా! ఎప్పుడూ ఖాళీ కడవ నట్టింట్లో దించడమే! నాలిక కరుచుకుని మళ్ళీ యమునకి బయలుదేరడమే!" నవ్వింది ఉత్పల.
"అవునవును! నిద్రలేపండి దొరసానిని. చలికి తట్టుకోలేకపోతున్నాం. ఈ ముంగిట్లో నిలబడే చోటు కూడా లేదు" గుమ్మం పట్టుకు ఒంటికాలిపై నిలబడి వణుకుతోంది కమలిని.
ఏమి వింతలొ గాని చెలియరో! అయ్యయో!
నీ మదిని కమ్మినది ఏమాయ నిదురో
జామాయె నీ ఇంటి మోసాలలో వేచి
ఈ మంచులో గడపనానుకుని నిలిచి
వైరియౌ లంకాధిపతిని తునుమాడిన
శౌరిపై,ఆ మనోహారిపై మా పాట
ఊరివారెల్లరును చెవులార విన్నారు!
ఔరౌర! ఇకనైన లేవమ్మ! మా అమ్మ!
తన లేగలను తలచికొని అరచి చేపుగొను
చనుమొనల, ఎనుము ఎడతెగక కురిసే పాల!
మునివాకిటను బందగానైన వీటిలో
ఎనలేని సంపదలు గలవాని చెల్లెలా!
గొంతెత్తి పాడింది ఆనందిని. వింటున్న కాసేపూ చలిని మరచిపోయిన ఆ గొల్లపిల్లలందరూ మళ్ళీ వణకడం ప్రారంభించారు. లోపల నుండి అలికిడైనా లేదు.
"మనం ఇంత చలిలోనూ వ్రతం పూనినది కృష్ణుడి కోసమైతే, నువ్వేంటమ్మడూ.. రాముడి ఊసు తప్ప మరోటి మాట్లాడవే!" ఆనందినిని వేళాకోళం చేసింది ఉత్పల.
"హ్మ్.. రామకథ తియ్యగా ఉంటుంది. అదీ కాక తనవారికి నొప్పెడితే తను బాధపడే రాముడినే కదా.. ఈ చలిబాధలో తలుచుకోవలసింది!"
"హ్మ్.."
ఇంకా కథ చెప్తుందేమో అని ఎదురుచూస్తున్న చెలుల ఉద్దేశ్యం గమనించి గలగలా నవ్వింది ఆనందిని.
"పిట్టకథే! పెద్ద కథేం కాదు. వానరసేనను వెంటబెట్టుకుని సంద్రానికి ఆనకట్ట వేసి, సీతను చెరపట్టిన రావణుడితో యుధ్ధానికి తలపడ్డాడట రామచంద్రుడు."
"ఊ.."
"రావణుడు వేసిన బాణమొకటి వచ్చి సుగ్రీవుడికి గుచ్చుకుందట!"
"ఆ..!"
"ఆ దెబ్బ చూసి తనకి దెబ్బ తగిలినట్టు విలవిల్లాడాడట రాముడు."
"పాపం!"
"అంత సుతిమెత్తని మనసు రామచంద్రుడిది. అంతకు తగ్గ మనోహరమైన రూపం ఆయనది. ఆ రూపాన్ని చూస్తేనే దెబ్బలూ, నొప్పులూ, బాధలూ మాయమైపోతాయి. అలాంటి మనోహరుడిని, రాముడిని తలుచుకోవద్దూ ఈ చలిరక్కసి కొరికేస్తూంటే!"
"రామచంద్రా! నిజమేనమ్మాయిలూ.. పాపం! ఎంత చలిలో ఎదురుచుస్తున్నారో! పదండి పదండి!" తలుపుతెరుచుకుని బయటకు వచ్చి పెరటివైపు దారితీసింది అమృత.
"అమ్మాయీ! నల్లటి ఎనుము కదుపులు యమునలా ఉన్నాయి సరే! స్నానానికి సరిపడా పాలనూ కురిపిస్తాయి.. కానీ మనం మునగాల్సింది అసలు యమునలో! అటు వెళ్ళాలి పద!" అని నవ్వుతూ యమున వైపు కదిలారందరూ.
కడిమి చెట్టు, పాటలీవృక్షం ఇప్పటి భాషలో ఏమని పిలుస్తారు?
'కడిమి'కి కదంబమని మరో పేరు.
'పాటలి'ని (Trumpet flower)కలిగొట్టు అంటారు. పల్లెటూళ్ళలో కడిమి,కలిగొట్టు అనే పేర్లు తెలుస్తాయి.
http://en.wikipedia.org/wiki/Neolamarckia_cadamba
http://en.wikipedia.org/wiki/Bignonia_suaveolens
'కడిమి'కి కదంబమని మరో పేరు.
'పాటలి'ని (Trumpet flower)కలిగొట్టు అంటారు. పల్లెటూళ్ళలో కడిమి,కలిగొట్టు అనే పేర్లు తెలుస్తాయి.
http://en.wikipedia.org/wiki/Neolamarckia_cadamba
http://en.wikipedia.org/wiki/Bignonia_suaveolens
చలితహరిణ నయనా! లెమ్మా! - 13
అప్పుడే కళ్ళిప్పి లోకాన్ని ముగ్ధంగా పలకరిస్తున్న సుమబాలలకు మంచు ముత్యాలు ముస్తాబు చేస్తున్నాయి. నిన్న లేని సుగంధాన్ని విరజిమ్ముతున్న వాటి నెమ్మోము సోయగాలను చూసి తెమ్మెర ఆశ్చర్యపోతోంది. విచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న కమలాన్ని చూసి "ఇలాంటి కళ్ళెక్కడో చూసానే!" అని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది. ఆ కమలాల కనుదోయి గల చిన్నది 'వారిజ'.
చెంపకు చారెడు కన్నుల వయారి! హాయి నిద్దురపోతోంది. చెలియలందరూ తన మొగసాల నిలచి తనను పిలుస్తూంటే తను మాత్రం స్వప్నలోకాలలో తేలుతోంది. నిద్రాదేవికి ఎంత ముద్దొచ్చాయో ఆమె కళ్ళు.. వీడిపోనంటోంది! తమ నిడివిని కట్టడి చేసే కాటుక రేఖలు లేనందుకు ఆమె కనుదోయి మిడిసిపడుతోంది. నల్లని కనురెప్పలు వంపు తిరిగి కాటుక లేని లోటు తీరుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఆమెది అద్భుతమైన దేహఛ్ఛాయ! మంచి గంధపు నిగ్గులో మెరిసిపోతోంది. ఆమె కట్టుకున్న నీలిచీర ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తోంది. కోమలంగా పూలచెండులా ఉన్న ఒక చేతిని గుండెల మీద, రెండో చేతిని నుదుటి మీద వేసుకుని చిత్రమైన నాట్య భంగిమలో నిద్రపోతున్న కిన్నెరలా ఉంది.
రోజూ ఎవరో ఒక చెలియ ఇంకా నిద్దుర పోవడం, తాము వెళ్ళి కృష్ణలీలాగానంతో మేలుకొలపడం అలవాటైన గోపకాంతలు "ఈ రోజెవరి ఇల్లు..?" అని వెతుక్కుని వారిజ ఇంటి ముందు నిలబడి పిలుస్తున్నారు.
"ఓ అమ్మాయీ, వారిజా! నువ్వు నిద్రపోవడానికి కారణం మాకు బాగా తెలుసు. నీ అందమైన కళ్ళు కన్నయ్యకే ఎంతో ఇష్టమైనవి. వాటి తళతళల్లో తన రూపు చూసుకుని మురిసిపోతాడతను. ఆ రోజు బృందావనిలో తటాకం ఒడ్డున కూర్చుని నీ సారసనేత్రాలకు అంజనం దిద్దడం మేము చూసాం లే! అలాంటి కళ్ళను రాత్రైతే మాత్రం విడిచి పెడతాడా..! కలలోకొచ్చి వెళ్ళనని మారాం చేస్తున్నాడు కాబోలు! కానీ తెల్లారబోతోంది. కలలు పక్కనపెట్టి నిద్రలేచే సమయం ఆసన్నమైంది. లే లే! యమునకి వెళ్ళి స్నానం చెయ్యాలి." పిలిచింది ఉత్పల.
లోపల నుంచి అలికిడి లేదు. అలాగే బంగరు బొమ్మలా నిద్రపోతోంది వారిజ.
"హ్మ్... అంత సులువుగా ఎందుకు నిద్ర లేస్తావు!? మా మనసులను విరహకీల దహిస్తోంది. ఎంతట చన్నీట మునిగి ఈ తాపం తీర్చుకుందామా అనిపిస్తోంది. నీకేమో కలలో కూడా ఎడబాటు తెలియనివ్వట్లేదతడు. చాలులే కలలు! లేవమ్మా లే లే!" నిష్టూరాలాడింది విష్ణుప్రియ.
"పక్షులు నిద్ర లేచాయి. మేత వెళ్ళేముందు తమ పిల్లల్ని గూళ్ళలో వదిలి, బోలెడు జాగ్రత్తలు చెప్తున్నట్టు కిలకిలారావాలు చేస్తున్నాయి చూడు! వినబడలేదా! ఎంత మొద్దు నిద్రపోతున్నావో! నీలాంటి సుకుమారికి.. అందాల భరిణకు తగిన నిద్ర కాదు సుమా!"
"పక్షులు మా అలికిడికే నిద్రలేచాయనుకుంటున్నావేమో! బయటకు వచ్చి చూడు! బృహస్పతి అస్తమించాడు. తూర్పు దిక్కున శుక్రతార దేదీప్యమానంగా వెలుగుతోంది. శుక్రుడిని చూస్తూనే మునిపల్లెలో వేదాధ్యయనం మొదలైపోయింది. వినబడలేదా?" పిలిచింది సురభి.
"కృష్ణుడి కథలేమైనా చెప్తే గానీ బయటకు రావద్దని నియమం పెట్టుకున్నావా? ఓ పిల్లా! కృష్ణుడి అద్భుత శౌర్యగాధలు చెప్తే నువ్వు భయపడతావు. నీ లేడి కళ్ళలో భీతి కృష్ణుడే కాదు... మేమూ చూడలేము." విష్ణుప్రియ బెదిరించింది.
"ఓయమ్మో! నువ్వేదో పెద్ద ధైర్యస్తురాలివన్నట్టూ..!" నవ్వింది విష్ణుప్రియని చూస్తూ కమలిని.
"నాకేం భయం లేదు. కథ చెప్పి చూడండి కావాలంటే.." రోషపడింది విష్ణుప్రియ.
"సరే, ఎలాగూ ఆ అమ్మడూ లేచి రావాలి కదా.. కన్నయ్య లీల ఒకటి చెప్తాను. వినండి. ఒక రోజు ఆలమందలనూ, అల్లరి నేస్తాలనూ వెంటబెట్టుకుని కృష్ణుడు అడవిలోకి వెళ్ళాడట!" మొదలుపెట్టింది సురభి.
"ఊ.."
"పశువులన్నీ మేత మేసాయి. చల్లని నీళ్ళు తాగాయి. చెట్ల నీడల్లో పడుకుని తిన్న మేత నెమరేసుకుంటున్న మందలో ఒక్కసారి కలకలం మొదలయింది. 'ఏవిటా..!' అని గోపాలకులందరూ వెళ్ళి చూద్దురు కదా.. హిమాలయంలా ఓ పేద్ద కొంగ!"
"కొంగా!"
"ఆ.. అవును. కొంగే! పశువులు దాన్ని చూసి భయపడి పరుగులు తీయనారంభించాయి! పెద్ద కొండలా భీకరాకారంలో ఉన్న ఆ కొంగ సరాసరి కన్నయ్య మీదికి వచ్చేసింది!"
"హమ్మయ్యో!" బెదురుతూ అనబోయి తమాయించుకుంది విష్ణుప్రియ.
"ఊ.. పేద్ద నోరు తెరిచి కన్నయ్యని అమాంతం మింగేసింది. పక్కనున్న గొల్లపిల్లలందరూ హాహాకారాలు చేసారు. ఏం చెయ్యాలో తోచక తమ ములుగఱ్ఱలతో ఆ కొంగ మీదికి లంఘించి పొడవనారంభించారు. తనను మింగిన కొంగ గొంతులో కన్నయ్య అడ్డంగా నిలబడ్డాడు. మండే అగ్ని గోళాన్ని మింగినట్టు ఆ కొంగకి చెప్పలేని బాధ కలిగి నోరు తెరిచిందిట."
"ఆ..!!"
"నోట్లోంచి బయటకు వచ్చిన కన్నయ్య దాని ముక్కు పట్టుకుని విడదీసి చీల్చి చంపేసాడట!"
"హమ్మయో!" ఈ సారి తన కోలకళ్ళలో తొంగిచూస్తున్న బెదురుకి ముసుగు వెయ్యలేకపోయింది విష్ణుప్రియ.
"అదిగో.. చూసావా.. భయపడిపోయావు." నవ్వింది సురభి.
"ఏం కాదు. కన్నయ్యవన్నీ దుడుకు పనులే! ఆనందినీ.. ఎంచక్కా కమ్మని రామకథ చెప్పవచ్చు కదా!" ఆనందిని వైపు చూస్తూ అడిగింది.
"మనం కృష్ణుడికోసం వ్రతం చేస్తూ రాముడి కథెలందుకు? కన్నయ్య కథలెన్ని చెప్పుకున్నా తరగవు."అంది కమలిని.
ఆమె రామకథను కాదనడం ఎవరికీ నచ్చలేదు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వేళ్ళతో చీరకొంగు ముడి వేసి విప్పుతూ ఎటో చూస్తున్న ఆ వెర్రి గొల్ల పడుచు మనసులో, కృష్ణుడి మీదున్న ప్రేమ అర్ధమయింది ఒక్క ఆనందినికే! ఆమె చిన్నగా నవ్వుకుంది.
"సరే కమలినీ.. నువ్వెలా అంటే అలాగే! కన్నయ్య కథొకటి చెప్తాను వినండి." చెప్పడం మొదలుపెట్టింది.
"ఓ నాడు కన్నయ్య బువ్వ తిననని మారాం చేస్తున్నాడట. అవును మరి! పగలంతా ఊళ్ళో అందరి ఇళ్ళలోనూ దొంగతనంగా దూరి వెన్నలూ, పాలూ తిన్నంత తిని, తాగినంత తాగి, తన నెచ్చెలులకు పెట్టి, ఇంకా మిగిలితే కోతిపిల్లలకు పెట్టేవాడాయె .. ఇంక సందెవేళ ఆకలెలా వేస్తుంది!"
ప్రశాంతంగా మారిపోయాయందరి ముఖాలూ! చిన్ని కృష్ణుని కబుర్లు వెన్నముద్దలంత ముద్దుగా ఉంటాయి కదూ!
"అప్పుడేమో యశోద అల్లరి నల్లనయ్య వెనుక ఇల్లంతా పరుగులు పెట్టింది. "నాకొద్దంటే వద్దని" చిక్కకుండా లేడి కూనలా పరుగులు తీస్తూ కన్నయ్య...! యశోద అలా ఎంతో సేపు పరిగెట్టాక విసుగొచ్చి బువ్వ పెట్టకుండా ఊరుకుందామనుకుంది. ఓ స్థంభానికి చారపడి అలుపు తీర్చుకుంటోందట . ఉయ్యాల బల్ల మీద ఎక్కి కొంటె నవ్వులు నవ్వుతున్నాడట అల్లరి పిల్లాడు!"
"హ్హహ్హహ్హహా..!"
"యశోదకి పట్టలేని పంతం వచ్చింది. ఎలాగైనా తినిపించి తీరాలనుకుంది. కన్నయ్యకి ఇష్టమైన కథ చెప్పడం ప్రారంభించింది."
"ఏం కథా?"
"రామ చంద్రుడి కథ! పాయసం తిని కౌసల్య కన్న తియతియ్యని రాముని కథ."
"నువ్వు భలే దానివి సుమీ! ఊ.. చెప్పు చెప్పు!" వెన్నెల పువ్వు విచ్చుకున్నట్టు నవ్వేసింది కమలిని.
"రాముడు పుట్టాడు. శివధనువు విరిచి సీతాకాంతను చేపట్టాడు. కల్యాణమాడాడు. మంధర మాటలు విని కైక కూడని కోరికలు కోరింది. తండ్రి మాట దాటని రామయతండ్రి అడవుల పాలయ్యాడు."
"...."
"అదిగో.. అలా చూస్తే ఆపేస్తాను." సజలనయనాలతో చూస్తున్న చెలులని హెచ్చరించింది ఆనందిని.. తర్జని చూపుతూ!
"లేదులే చెప్పు."
"ఇంతలో పసిడి మాయలేడిని చూసి సీతమ్మ ముచ్చట పడిందా.. తెచ్చి ఇస్తానని రాముడు అడవిలోకి వెళ్ళాడు. అన్నకి సాయం లక్ష్మణుడిని పంపిందామె. మాయ రావణుడు బిక్ష వెయ్యమన్నాడు. గీత దాటిన సీతను ఎత్తుకుపోతున్నాడు.. ఆ పాటికే బువ్వ తినేసి అమ్మ కొంగుకి మూతి తుడుచుకుని, అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని మాగన్నుగా నిద్రపోతూ 'ఊ' కొడుతున్న కన్నయ్య హఠాత్తుగా మెరుపులా పైకి లేచి "సౌమిత్రే! ధనుః !!" "లక్ష్మణా, నా విల్లేదీ!" అని గర్జించాడట."
"అవునా!!" లక్కపిడతల్లా నోళ్ళు వెళ్ళబెట్టి, కళ్ళింతలు చేసి అడుగుతున్న వాళ్ళందరినీ చూసి ఫక్కున నవ్వేసింది ఆనందిని.
"నవ్వుతావేంటీ!? అలా అడిగాడా! నిజమా!" చిన్నబుచ్చుకుంది కమలిని.
"అడగడూ మరి! అతనే తానైనపుడు! అప్పుడు రాముడు - ఇప్పుడు కృష్ణుడు. అవసరాన్ని బట్టి వేషం వేస్తాడు జగన్నాటక సూత్రధారి."
"నిజమే కదూ! ఏంటో అలా మాట్లాడేసాను. అపచారం.. అపచారం!" లెంపలు వేసుకుంది కమలిని.
"పరవాలేదులే! తప్పులేని వారెవరు! "నీలమేఘనిభం.. అంజన కుంతలం.." అని వర్ణించారు కన్నయ్యని. రాముడూ కృష్ణుడూ నీలిమబ్బు వన్నె వారే! కాటుక నల్లని కురుల వారే! కలువ కన్నుల వారే!" నవ్వింది ఆనందిని.
ఇంకా నిద్రలేవని తమ సఖికి మేలుకొలుపు పాడనారంభించారు.
లలితశయనా! చలిత
హరిణ నయనా! లెమ్మ!
తెలవారుచున్నదమ్మా!
అలరు కొమ్మా! తళుకు
పసిడి బొమ్మా! లెమ్మ!
తెలవారుచున్నదమ్మ!
పులుగులవె మేతలకు తరలెను
మెల్లమెల్ల గురుడస్తమించేను
అల శుక్రతార మింట పొడిచెను
కలసి మాతో రమ్మ! కపటమును విడువమ్మ!
బకదైత్య వైరి! ఆ దశకంఠ సంహారి
అకలంక చరితముల ఒక చోట చేరి
ఈ పుణ్య దివసాన సకియలు పాడేరు
తీపారు వలినీట తీర్థమాడగదమ్మ!
తెలవారుచున్నదమ్మా!
లలితశయనా! హరిణనయనా!
నెమ్మదిగా విచ్చిన ఆమె కమలాల కనుల కెంజాయ జీర మెరిసింది. మంచు ముత్యాల గిలిగింతలకు నవకమలం విరిసింది. పూలసజ్జలు నింపుకుని వస్తున్న పూబంతులను చూసి పలకరింపుగా యమున తరగలతో నవ్వింది.
మాకు చెప్పి నీవే నిద్దరోతావా? - 14
మంచుతెరల దుప్పటి తొలగించుకుని నిద్ర లేచే ప్రయత్నం చేస్తోంది రేపల్లె. నిన్న రాత్రి చెలికాని చేత చిక్కి నేలజారిన జవరాలి జలతారు వల్లెవాటు క్రీనీడలలో మెరిసినట్టుంది యమున.
ఈనాటికి ఎన్ని రోజుల వ్రతం పూర్తయిందో లెక్కపెట్టుకుని సంతృప్తిగా పడకలు దిగారు కొందరు గొల్లెతలు. "ఇంకా సగం దూరమైనా రాలేదే!" అనుకుంటూ ఉస్సురని తలగడని కావలించుకుని, శయ్యల మీద ఇంకాసేఫు పొర్లసాగారు మరికొందరు. చెదిరిన కురులు సర్దుకుని బయటకు వచ్చి, పూలతోటలో తిరుగుతోంది కమలిని. ఆకు కనబడకుండా పూచిన నందివర్ధనాలను చూసి ముచ్చటపడింది. చెట్టు మొదట నేల కనబడకుండా రాలిన పారిజాతాలను ఏరింది. బయట అలికిడై అటుచూస్తే కదంబమాల నడిచివస్తున్నట్టు కిలకిలా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ చెలులందరూ తన ఇంటివైపే వస్తున్నారు. నవ్వుతూ ఎదురెళ్ళింది.
"నెచ్చెలులూ! పక్షుల కంటే ముందు పడతులే నిద్రలేస్తున్నారు రేపల్లెలో! బాగు బాగు! అందరూ వచ్చేసినట్టేనా?" పలకరించింది.
"తరళా.. ప్రియంవదా, ఉత్పలా.. అదిగో విష్ణుప్రియా.. " మునివేళ్ళ మీద లేచి లెక్కెట్టుకుంది. "ఆనందిని లేదు!!"
అందరూ ఒకరి మొహాలు మరో సారి చూసుకున్నారు. అందరికంటే ముందుండే ఆనందిని ఈ రోజు ఇంకా నిద్ర లేవలేదన్న ఆశ్చర్యం! దాని వెంబడే.. అన్నీ తెలిసిన పిల్ల ఒక వేళ ఇంకా నిద్రపోతే ఏం చెప్పి నిద్రలేపాలా? అని ఆలోచన!
"నిద్ర లేచే ఉంటుంది. దారిలో ఏ పువ్వులైనా కోస్తోందేమో!" సమాధానపరుచుకుంటూ చెప్పింది ఉత్పల.
"అవునవును. వాళ్ళ పెరటి కొలనులో తామరలు కోసి తెస్తానని నిన్న అంది. అందుకని ఆలస్యమయిందేమో!" గుర్తు చేసుకుంది విష్ణుప్రియ.
"సరే.. సరే.. పదండి." అని ఆనందిని ఇంటి వైపు కదిలారందరూ.
విశాలమైన ప్రాంగణంలో బొమ్మరిల్లులా ఉంటుంది ఆనందిని ఇల్లు. పెరటి వైపు అందమైన చిన్న కొలను. పెంపుడు లేడికూనలు ఓ పొదరింట ముడుచుకుని నిద్రపోతున్నాయి. మరో వైపు పలుపు తాడు నములుతూ అరుస్తోంది ఓ లేగదూడ. యజమానురాలు విప్పగానే చెంగున వెళ్ళి తల్లి పొదుగులో దూరిపోదామని ఆత్రపడుతోంది. ఇంటి చుట్టూ బారులుతీరిన చేమంతులు కళ్ళు విచ్చి, లోపలికి వస్తున్న ఆ ఇంతులను పలకరించాయి.
"అలికిడి లేదు! ఇంకా నిద్ర లేవనే లేదా.. ఏం!" ఆశ్చర్యంగా తలుపు దగ్గరకు వెళ్ళి తట్టి చూసారు. "రామా.. పరంధామా.. వాసుదేవా.. నారాయణమూర్తీ!" అని కైవారాలు చేసారు.
"ఆనందినీ! సర్వం ఎరిగిన పిల్లవి. నీకెలా మేలుకొలుపు పాడాలో మాకైతే అర్ధం కావడం లేదు. నిన్ను మేము నిద్ర లేపవలసి వస్తుందని ఊహించలేదు సుమా! లే.. మేలుకో హరిప్రియా! ఓ ఆనందినీ! లే లే!" పిలిచింది కమలిని.
ఔనంటే ఔనన్నారు చెలులు. కళ్ళు తెరిచేసరికి నవ్వుతూ పలకరించే అమ్మ, ఆ రోజు ఇంకా నిద్రపోతూంటే ఏం చెయ్యాలో తోచని పిల్లల్లా ఉంది వాళ్ళ పరిస్థితి.
"మేమెవరైనా నిద్ర లేవకపోతే మంచి మాటలు చెప్పి, తెలవారుతోందని గుర్తులు చూపించీ, కమ్మని కథలు చెప్పి నిద్రలేపేదానివి! నీకు చెప్పడానికి మాకు మాటలే దొరకట్లేదు!" బేలగా అంది విష్ణుప్రియ.
"మమ్మలని పరీక్షిస్తున్నావా ఆనందినీ! నిన్నటి దాకా నిద్ర లేవకుండా రోజుకొకరం గారాలుపోయామని మాపై కోపమొచ్చిందా?!" తరళ అనుమానంగా ప్రశ్నించింది. విష్ణుప్రియ, ప్రియంవదా, వారిజ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. 'నిజమేనేమో!' అని అనుమానపడ్డారు.
"అబ్బే! మీరలా బెంగ పెట్టుకోకండి. ఆనందిని అలాంటిది కాదు. వెన్న లాంటి మనసున్నది. మనని ముందు నిలబడి నడిపించేది. ఏదో కారణం లేనిదే ఇంతలా నిద్రపోదు! కన్నయ్యని తలుచుకుంటూ రాత్రంతా నిద్రపోలేదేమో! తెలవారు ఝామున గాఢంగా నిద్ర పట్టేసి ఉంటుంది." ధైర్యవచనాలు పలికింది సురభి.
"సురభీ! ఆనందినితో సమానంగా అన్నీ తెలిసిన దానివి! గొప్ప గొప్ప వేదాంత విషయాలు మీ ఇద్దరూ చర్చించుకుంటారు కూడా! నువ్వే ఆమెను నిద్ర లేపేందుకు సమర్ధురాలివి." తరళ ప్రోత్సహించింది.
"అందరం ప్రయత్నిద్దాం!" తలుపు దగ్గరగా వెళ్ళింది సురభి.
"ఓ ఆనందినీ! అమ్మడూ! అందరూ నిద్రలేచారు. నీ గుమ్మం ముందు నిలబడ్డారు. నువ్వు నిద్ర లేచి వస్తావని, బోలెడు కబుర్లు చెప్తావని ఎదురు చూస్తున్నారు. మాటైనా మాటాడక నిద్రపోతున్నావా? అదిగో! నీ పెరటికొలనులో నల్ల కలువలు ముకుళించాయి. ఎర్ర తామరలు విరబూస్తున్నాయి. మంచు బిందువులు నిలచి చలిగాలికి తలలూచుతున్న ఆ కెందామరలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా! నువ్వే వచ్చి చూడు..! "
గాజుల గలగలలో, కాలిమువ్వల శబ్దమైనా వినబడుతుందని ఒక్క క్షణం అందరూ జాగ్రత్తగా విన్నారు. ఊహూ.. పాన్పుపై పక్కకు తిరిగి ఆనందిని మంత్రమేసినట్టు నిద్రపోతోంది.
యమున ఒడ్డున సైకతవేదికలపై చెలియలతో కలిసి దాగుడుమూతలాడుతోంది ఆనందిని. హఠాత్తుగా వెనుకనుంచి నల్లకలువల్లాంటి ఆమె కళ్ళను మూసిన చిరపరిచితమైన చేతుల స్పర్శ!! శంఖాకృతిలో వెలుగులు చిమ్ముతున్న ఆమె మెడ మీదుగా వెచ్చగా.. "ఎవరో చెప్పుకో చూద్దాం!!" అని వనమాలా సౌరభం వెంటరాగా మధురమైన స్వరమొకటి వినిపించింది. "ఎవరని చెప్పాలి..!? మునిజన మానస రాజహంస అనా! గోపికా హృదయ చోరుడనా! మోహన మురళీధరుడనా! నందనందనుడనా! ముల్లోకాల వేల్పు అనా!" పెదవి పలకని మాటలెరిగిన వాడు.. కొంటెగా నవ్వుతున్నాడు! కెందమ్మి కన్నులతో.. పగడాల పెదవితో.. తెలిముత్తెపు పలువరుసతో.. తననే చూస్తూ నవ్వుతున్నాడు.
"నల్ల కలువలు ముడుచుకున్నాయీ.. ఎర్ర తామరలు విచ్చుకున్నాయీ... అంటే నీ కనులు మూసి నవ్వుతున్న యదునందనుడిని తలుచుకుంటున్నావేమో! కలలు చాలించి నిద్ర లేవమ్మా! మమ్మల్ని నిద్రలేపుతానని మాటిచ్చి ఈ రోజు నువ్వే పడక దిగి రానంటున్నావే! నిన్ను అంత మురిపిస్తున్న ఆ స్వప్నమేవిటో!" బయట నుంచి పిలుస్తోంది ఉత్పల.
"పోనీ.. ఇంకో గుర్తు చెప్తాం విను. మీ ఇంటికి వస్తున్న దారిలో మాకు జీయరులు ఎదురయ్యారు. కాషాయాంబరాలు ధరించారు. హరి నామస్మరణ చేస్తున్నారు. వారు "హరీ..!" అని పెదవి తెరచినప్పుడల్లా వారి పలువరుస తళుక్కున మెరుస్తోంది. వారి చేతిలో తాళపు చెవులున్నాయి. కుంచెకోలలతో బీగం తెరిచి కోవెల తలుపు తీసి సుప్రభాత సేవ చేసేందుకు వెళ్తున్నారు. తెలవారిందని నమ్ముతావా.. లే ఆనందినీ! లే బంగారు తల్లీ!"
కలువ కనుమూసినది
కమలమ్ము పూచినది
కలికిరో! నీ పెరటి కొలనులో!
తెలిదంతముల జియ్యరులు, కావి తాలుపులు,
తరలేరు కుంచెకోలల తెరవ కోవెలలు
మిమ్ము నేనే వచ్చి మేలుకొలిపెదనని
అమ్మచెల్లా! నీవు నిదురింతువే!
కమ్మగా నెరవాది మాటలన్నీ ఆడి
ఎమ్మెలాడీ! నీవు సిగ్గుపడవే!
వరశంఖ చక్రధారిని, హరిని, శౌరిని,
పురుషోత్తముని, వికచజలజ లోచనుని,
తరుణులందరితోడ తనివారగా పొగడ
తరలిరావమ్మ! నిద్దురమాని, ఓ కొమ్మ!
"నీకు చెప్పేందుకు నీకు తెలియని కథలేమీ మాకు తెలియవు! అయినా మాకందరికీ బోలెడు సుద్దులు చెప్పి, నువ్వే నిద్రపోతున్నావా! సిగ్గుగా లేదూ!" నిష్టూరమే గతి అనుకుని సూటిపోటి మాటలాడనారంభించింది కమలిని.
"ఊరుకో పిల్లా! పరుషం పలకూడదని వ్రత నియమం! మర్చిపోయావా!" హెచ్చరించింది తరళ.
"ఓ అమ్మాయీ! ఆ కన్నయ్య చేతిలో ఉండే పాంచజన్యమెంత అదృష్టం చేసుకుందో తెలుసా! అతడి అధర సుధాపానం చేసే అదృష్టం!! ఆ ఎర్రని పెదవిపై ఆనే ఆ శంఖం పుణ్యమెంత గొప్పదో! ఆ వరద హస్తాన నిలచే జన్మ ఎంత సార్ధకమో కదా!! అలాంటి భాగ్యం కోసం వ్రతం చేస్తున్నాం! వేళ మించే పని చెయ్యబోకు సుమా! నిద్ర లేచి రా!"
చటుక్కున కళ్ళు విప్పి, ఒక్క ఉదుటున తలుపు తీసింది ఆనందిని.
"అయ్యో! ఎంత మొద్దు నిద్రపోయాను!" సిగ్గుగా నొచ్చుకుంటూ బయటకు వచ్చింది.
"హమ్మయ్య! లేచావా!! నొచ్చుకోవడం తరువాత.. అంత కమ్మని కలేమిటో చెప్పాల్సిందే!" అల్లరిగా అడిగింది ఉత్పల.
"యమున ఒడ్డున మనమందరం దాగుడు ముతలాడుతున్నామట! ఇంతలో వెనుక నుంచి..." ఆనందిని చెప్తూ యమున వైపు అడుగులు వేసింది. ఆమెను అనుసరిస్తూ కదిలారు "కాత్యాయనీ పూజ" చేసేందుకై గోపబాలలందరూ..
నేనా 'గడుసరి'ని! మరి మీరో? - 15
యదుశేఖరునికి కనిపించకుండా పూపొదరింట దాగింది వల్లరి. గోపభామినులందరూ కృష్ణుడితో కలిసి బృందావనిలో దాగుడుమూతలాడుతున్నారు. ఓ పొన్నచెట్టు వెనుక దాగిన కమలినిని చెయ్యిపట్టుకు బయటకు లాగి "దొంగ దొరికింది!" అని నవ్వాడు వెన్నదొంగ. కూడబలుక్కుని ఓ తిన్నెచాటున నక్కిన వారిజనూ, విష్ణుప్రియనూ చెవులుపట్టి కుందేలుపిల్లల్ని లేపినట్టు లేపాడు. "ఓడిపోయాం లే కన్నా! చెవి వదులూ!" అని వేడుకున్నారిద్దరూ! గుబురుగా ఉన్న కరవీర కుసుమాల మధ్యలోంచి కనిపిస్తున్న లేడికనుల మంజరిని, చటుక్కున వెళ్ళి వెనుక నుంచి కావలించుకు బయటకు లాక్కొచ్చాడు. కిలకిలా నవ్విందా పిల్ల. జట్టుగా ఓ నికుంజంలో దాగిన ఆనందిని, ప్రియంవద, ఉత్పల, వకుళ ఒకేసారి కృష్ణుని చేత చిక్కారు. ఇంక మిగిలినది వల్లరి!
బయట చెలుల నవ్వులు, అతని మాటలు వినిపించి పొదరింట ఇంకా ముడుచుకుని కూర్చుంది. ఆకుపచ్చని పావడా కట్టుకొచ్చినందుకు మరో సారి తనని తనే అభినందించుకుంది. పసిడి పాదాల మువ్వల్ని, చేతి గాజుల్నీ సడిచేయవద్దని వేడుకుంది. "కన్నయ్య ఇంకా రావట్లేదే! నేను గుర్తులేనా? చెలులైనా చూసుకోలేదా?" ఓ సారి బయటకి తొంగిచూద్దామనుకుని అలికిడి విని ఆగిపోయింది. గుబురుగా చిక్కగా అల్లుకున్న ఆ పొదరింట కూర్చుంటే, బయటకి కనపడే అవకాశమే లేదు! అందరినీ ఓడించే కన్నయ్య ఈరోజు తన చేతిలో ఓడిపోతున్నాడని సంబరపడింది. అడుగుల సడి దగ్గరవుతూంటే తన గుండె కొట్టుకోవడం తనకే తెలుస్తోంది. చటుక్కున లేచి బయటకు పరుగెత్తి అతడిని గాఢంగా కౌగిలించుకోవాలని వెర్రి మోహం కలిగిందామెకి! తనని తనే వెనక్కి లాక్కుంది. పాదాలు కూడా బయటకి కనిపించకుండా ఒదిగి కూర్చుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తన పెంపుడు చిలుక రివ్వున ఎగిరొచ్చి పక్కన వాలి గోలగోలగా అరిచింది."ష్..ష్.. మాట్లాడకూ! ష్షూ.. " వల్లరి గాభరాగా అంది. ముక్కుతో ఆమె చేతి ఉంగరాన్ని కొరుకుతూ ఆమె మణికట్టుమీద వాలి కిమ్మనకుండా ఉండిపోయిందా చిలుక. మాట విన్నందుకు మెచ్చుకుంటూ ముద్దుపెట్టుకుంది వల్లరి. యజమానురాలు మెచ్చుకున్నందుకు సంబరంగా "కృష్ణా.. కృష్ణా..!" అని తనకి నేర్పిన పలుకుని వల్లెవేసిందది. మరుక్షణం వల్లరి కృష్ణుని బిగికౌగిట బందీయై ఉంది.
"దొంగా! దొరికిపోయావ్!! ఎంత వెతికానూ.. ఎంత వెతికానూ! నాకు చిక్కకుండా పోదామనే!" కళ్ళు మిలమిలా మెరిపిస్తూ అడిగాడు మోహనకృష్ణుడు.
"ఊ..!" నవ్వింది వల్లరి.
ఎగిరొచ్చి అతడి భుజం మీద వాలిందా రాచిలుక.
"నీకు జామ కాయ పెట్టనా.. వెన్నముద్ద పెట్టనా! ఈ అల్లరి వల్లరిని పట్టిచ్చావు కదా!" దానిని చేతితో నిమురుతూ ఓ తిన్నె మీద కుర్చుంటూ అడిగాడు.
"ఎంత గొల్లపల్లెలో చిలుకైతే మాత్రం.. వెన్న తింటుందా!?" వల్లరి ప్రశ్నించింది, పక్కనే కూర్చుంటూ.
"నేను పెడితే ఎందుకు తినదూ! అవునూ! ఇంతకీ ఈ చిలుకకి అంత తీయగా పలుకులు నేర్పిన కలకంఠి .. రేపల్లెలో 'శారికాకీరపంక్తికి చదువులు గరిపే చిన్నది' ఏం తింటుందో! జుంటి తేనెలా? చెరకు పానకాలా?" మనోహరంగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూసాడు.
ఇంక మారు మాట్లాడగలదా? కృష్ణుని చూపులు తూపులై గుండెల్లో గుచ్చుకుంటే మారాడగలదా? అతని మేని సుగంధం..!! చందనమా.. ఊహూ.. కస్తూరీ.. హ్మ్.. కర్పూర పరాగం.. కాదు.. వనమాల.. ఇవేవీ కాదు.. మరేదో!! విరజాజుల పరిమళం మనసంతా మత్తు మత్తుగా కమ్మేసినట్టుందామెకు!
"ఇంకా నిద్దరోతున్నావా! ఈ రోజు నీ వంతా భామామణీ! ఏం కలలు కంటున్నావో!"
కృష్ణుడి కౌగిలిలోంచి.. అమాంతం తన పడకగదిలోకి వచ్చిపడడం అసలు నచ్చలేదు వల్లరికి. తెలవారిపోవడం ఇంకా నచ్చలేదు. కోపమొచ్చింది. ఎవరిపై అలక పూనాలో అర్ధం కాలేదు."ఈ చెలులొకరూ! పిట్టలు లేచాయీ.. పశువులు అరిచాయీ.. అని మొదలెడతారింక. అప్పుడే తెల్లవారాలా? అప్పుడే కల కరిగిపోవాలా! అబ్బ! ఒక్క క్షణం.. ఇంకొక్క క్షణం ఆ ఆలింగన సౌఖ్యాన్ని, ఆ మోహన రూపాన్నీ అనుభవించనివ్వకుండా..!" అలకతో రంజిల్లుతున్న ఆ మోము మహ ముద్దుగా ఉంది. కనురెప్పలు కినుకగా బిగించింది.
"ఓ చిరుత రాచిలుక లేచి రావేమే! లేచియున్నామే!"
బయట నుంచి చెలులు పిలుస్తున్నారు. చిలుక ఊసెత్తేసరికి ఇంకా కోపం వచ్చిందామెకు. ఉక్రోషంగా లోపల నుండే బదులిచ్చింది.
"వేచేవారి నిదుర దోచుకున్నానో! ఓ చెలులు
నా నిదుర దాచుకున్నానో! లేచి వచ్చేనే!"
లోపల నుండి జవాబు వినిపించేసరికి ఉలిక్కిపడ్డారందరూ! ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు.
"ఓ అమ్మాయీ! లతాంగీ! నిద్ర లేచేవా.. మరి బయటకు రాకుండా లోపలేం చేస్తున్నావు?"
ఇంకా పెరిగిపోయిందామె ఉక్రోషం. లోపలేం చేస్తాను! నేనేమైనా కృష్ణ పరిష్వంగన సుఖాన్ని అనుభవిస్తున్నానేమో అనా వీళ్ళ అనుమానం?
"ఆ.. కన్నయ్యకి తిలకం దిద్దుతున్నాను. నిన్న రాత్రి నుండీ నా కౌగిల్లోనే ఉన్నాడేమో! చమటకు చెదిరిపోయింది!" సన్నాయి నొక్కులు నొక్కుతూ సమాధానం చెప్పింది వల్లరి.
బుగ్గలు నొక్కుకున్నారందరూ! నిజంగా కృష్ణుడి కౌగిల్లోనే ఉన్న పిల్ల నోరు మెదిపి ఈ లోకపు బంధాలతో మాట్లాడలేదని ఎరిగిన వారు కదూ!
"భళి భళీ! ఎంత నుడికారితనమే!
తెలుసులే నీ నంగనాచితనము మాకు!"
గతుక్కుమంది వల్లరి. "నిజంగానే కన్నయ్య ఉన్నాడని అనుకుంటున్నారా ఏం! ఉంటే మాత్రం!! అంతలేసి మాటలంటారా నన్ను?" ముక్కు పుటాలెగరేసింది. అంతలోనే బయట చలిలో ఎదురుచూస్తున్న చెలులు గుర్తొచ్చారు. అయినా తగ్గేది లేదనుకుని సమాధానం చెప్పింది.
"మీరు గడుసరులు కారేమో పాపము!
నేనె కాబోలంత నేరువని దాన!
వచ్చిరో అందరును నెచ్చెలులు?"
"చూడు! చూడూ! "అందరూ వచ్చారా!" అని ప్రశ్నిస్తోంది దొరసాని! ఈవిడ మాత్రం ఇంట్లో గువ్వపిట్టలా కూర్చుని.. చలిలో గజగజ వణుకుతున్న మనని లెక్కలు అడుగుతోంది!" కయ్యానికి సిధ్ధమైపోయింది ఉత్పల. తలుపుకు దగ్గరా వెళ్ళి గొంతు హెచ్చించి సమాధానం చెప్పింది.
"ఆ! వచ్చి నీవే లెక్కపెట్టుకోవె!
విచ్చేయవే అమ్మ చెచ్చెర! లేకున్న
మచ్చిక పని యున్నదేమో ఏదైన!"
ఉత్పల సమాధానం విని నొచ్చుకుంది వల్లరి. నిజంగానే కన్నయ్యని పడకటింట్లో అట్టే పెట్టుకున్నాననుకుంటున్నారు నేస్తాలందరూ! దోరముగ్గిన జాంపండునైనా కాకెంగిలి చేసి పంచనిదే ఒక్క ముక్కైనా తినని దానినని తెలీదూ! అంతలేసి మాటలనేస్తున్నారు! ఒక్కదాన్ని చేసి ఆడిపోసుకుంటున్నారని చిన్నబుచ్చుకుంది. ఈలోగా బయట ఉత్పలను సురభి మందలించడం వినిపించి తలుపు దగ్గరకు వచ్చి వినసాగింది.
"తప్పు తప్పు! మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు. చెప్పకనేం! హరినామస్మరణతో నిద్రలేపే చెలుల కోసం పడక దిగకుండా కూర్చుందామని నాకే ఉదయాన్నే బుధ్ధి పుట్టింది. "కృష్ణా..!" అని మేలుకొలుపు పాడు! కలహాలతోనూ, సాధింపులతోనూ కాదు. కృష్ణునికి ప్రియమైన వారెవరైనా మనకి ఆప్తులు కావాలి. అది కదూ ప్రేమ అంటే!" మెత్త మెత్తగా మందలించింది. ఒక్క క్షణం ఆరిపోయిన ఉత్పల ముఖం వెంటనే సర్దుకుని మళ్ళీ కళకళ్ళాడింది.
"నిజమే సురభీ! మీదపడే 'కువలయాపీడం' లాంటిది కోపం! కన్నయ్య దాని పొగరణచినట్టు మనమూ అదుపులో పెట్టుకోవాలి."
"బాగు బాగు! ముందా చిలుక పాపాయిని నిద్ర లేపండి! ఓ అమ్మాయీ! అందరమూ వచ్చాం. నువ్వొచ్చి లెక్క పెట్టుకో! వరుసగా నిలబడతాం. ఒకటీ రెండూ మూడూ.. అని నీ కోమలమైన చేతితో మమ్మల్ని తాకి లెక్కపెట్టుకో! పరుసవేది తాకగానే ఇనుము బంగారమైనట్టు నీ స్పర్శతో మేమూ పుణ్యాన్ని పొందుతాము. కృష్ణుని ప్రియసఖివి. లేత రాచిలుకలా ఆతని పేరు నిత్యం పలికే దానివి. నువ్వు లేక మా సమూహం చిన్నబోయింది. రా.. అందరం కలిసి ఆ వంశీమనోహరుడి లీలలు పాడుతూ యమున చేరుదాం. చన్నీట "హరిహరీ!" అని మునుగుదాం. 'కాత్యాయని'కి పరిమళాలు విరజిమ్మే పూలతో పూజ చేద్దాం. సగం దూరం వచ్చేసాం అమ్మీ! ఇప్పుడు వ్రతానికి వేళ మించనివ్వకు! కృష్ణుడనే మావిగున్నకు అల్లుకుని చివురులేసే లతవి! అనురాగ వల్లరివి! రా! బయటికి వచ్చి మాతో చేరు!"
ఉరుమత్తగజకుంభ మరియ మొత్తినవాని,
అరులదర్పమ్ము నరవర చేయువాని,
అరిది గుణముల వాని, హరిని కీర్తింప,
అరుగగా వలయు బిరబిర రమ్మ! ఓ అమ్మ!
ఓ చిరుత రాచిలుక! లేచి రావేమే! వేచియున్నామే!
తటాలున తలుపు తీసి చిరునగవుతో బయటకు వచ్చిన వల్లరిని, ఆహ్లాదంగా నవ్వుతూ తమ బృందంలో చేరుచుకున్నారు చెలులు. అందరూ యమున వైపు అడుగులు వేసారు. నిద్ర ఆపుకుని ఈ విడ్డూరం ఇంతవరకూ చూసిన నెలవంక నవ్వుకుంటూ ఆవులించింది.
తలుపు తీయవా, అన్నా! - 16
యమున ఒడ్డుకు వచ్చి చేరిన గొల్లపడుచులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
"అందరూ వచ్చేసారా? నమ్మశక్యంగా లేదు!" అంది సురభి.
"అందరం ఉన్నాం. ఆలస్యమెందుకు? స్నానానికి పదండి చెలులూ!" బయలుదేరదీసింది కమలిని.
పొద్దు పొడవక ముందే యమునలో స్నానం చేసి, తడి ఇసుకతో కాత్యాయని ప్రతిమను చేసి, దివ్వెలు వెలిగించారు. ధూపం సుడులు తిరుగుతోంది. వేడి వేడి పొంగలి ఘుమఘుమలు గాలిలో తేలివస్తున్నాయి. సుగంధాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో 'కాత్యాయని'కి పూజచేసారా గోపకాంతలు. దేవికి మంగళ హారతులుపాడి మనసులో కోరికలు విన్నవించుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న యమున అట్టే సద్దు చెయ్యకుండా వింటోంది. నెలవంక చుక్కభామతో కలిసి ఇంటికేళ్ళే సన్నాహంలో ఉన్నాడు. శుక్రతార జిగేలున మెరుస్తోంది.
"తెలివెలుగు రేఖలైనా రాకుండానే పూజ చేసుకున్నాం. హమ్మయ్య!"
"అవును! ఇప్పుడేం చేద్దాం?"
"ఏం చేస్తాం? ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి పనులు చేసుకోవడమే!"
"ఇంకా పొద్దు పొడవలేదు. కన్నయ్యని చూసేందుకు వెళ్తేనో!" ఉన్నట్టుండి మెరిసిన ఆలోచనను టక్కున చెప్పింది సురభి.
"కన్నయ్యనా..? ఇంకా నిద్దుర లేవడేమో!"సందేహాల పుట్ట విష్ణుప్రియ వెనక్కిలాగింది.
"నిద్ర లేపుదాం. ఈ పదిరోజులుగా మొద్దు నిద్దురపోయే చెలులనే నిద్రలేపాం!" పదిజతల కళ్ళు ఈ మాటలన్న సురభి వైపు గుర్రుగా చూసాయి.
"కృష్ణుడిని ఈ వేళప్పుడు చూడాలంటే కుదిరే పనేనా! ఎక్కడో 'ఆ మూల సౌధమ్ములో..' నిద్దరోయే స్వామిని చేరే దారి అంత సులువైనది కాదు సుమా!" అంది కమలిని.
"నిజమే! కష్టమేమో కానీ అసాధ్యమైతే కాదు."
"ఏ బలదేవుడో, యశోదమ్మో ఎదురై ఏం కావాలి? వేళకాని వేళ కన్నయ్యతో పనేమిటని అడిగితే! బృందావనికి మనతో ఆటలాడేందుకు వచ్చే కన్నయ్య వేరు. ఆ ఇంట్లో దొరబిడ్డ వేరు. " బెరుగ్గా వెనుకడుగు వేసింది తరళ.
"మనకి 'పర'వాద్యమిస్తానని మాట ఇచ్చాడు కదా! అందుకని వచ్చామని చెప్దాం."
"మంచి ఆలోచన. మంచి ఆలోచన!" అందరూ తేజస్వినిని మెచ్చుకున్నారు.
"అవును కదూ! మనం వ్రతం మొదలుపెట్టి పదిహేను రోజులు కావొస్తోంది. పర ఊసే మరచిపోయాం. సమయానికి గుర్తొచ్చింది. పదండి వెళ్దాం." బయలుదేరింది ఆనందిని.
అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉత్సాహంగా నందగోపుని భవనమున్న వీధిమొగ దాకా వచ్చారు. చుక్కల మధ్య జాబిలిలా వెలిగిపోతోందా ఇల్లు! ఆ వైభవం, ఇంటి బయట ఉన్న కాపలాదారుని చూసేసరికి, ఒక్కసారి అందరి మనసుల్లోనూ రక రకాల ప్రశ్నలు. రణగొణ ధ్వనితో ఒకరి అనుమానం ఒకరితో చెప్పసాగారు.
"ష్.. ఆగండి. అలా గోల చేస్తే వీధంతా నిద్ర లేస్తుంది. మనం మేలుకొలపాల్సింది కృష్ణుడిని మాత్రమే! పదండి వెళ్దాం."అడుగు వెయ్యబోయింది సురభి.
ఆమె భుజం పట్టుకుని ఆపుతూ "అక్కడ కాపలాదారు ఉన్నాడు. ఆపుతాడు. రాక్షస భయం మిక్కుటంగా ఉందని పగలూ రేయీ ఇంటికి కావలి కాసే భటుడిని నియమించాడు నందగోపుడు." హెచ్చరించింది ఆనందిని.
"చెప్దాం! కృష్ణుడికోసమని వచ్చామని చెప్దాం! మనకేమైనా భయమా?"
"అదే! ఏం చెప్తావ్! ఎలా మాట్లాడుతావ్?"
"ఓ కావలిభటుడా! కన్నయ్యని చూడాలీ! తలుపు తియ్య్!" అని చెప్తాం."
"ఇంకా నయం! అతనితో మంచిగా ఉంటేనే మన పని అవుతుంది. జాగ్రత్తగా మాట్లాడాలి." చెప్పింది ఆనందిని.
"సరే! నువ్వే మాట్లాడు. ఏమని మాట్లాడాలో!"
"అదే! ఓ నందగోపుని మందిర రక్షకా!" అని పిలుద్దాం."
"కన్నయ్య ఇంటి కావలి వాడా! అనకూడదా?" పెంకెగా ప్రశ్నించింది ఉత్పల.
"ఊహూ.. అనకూడదు! అలా అంటే కన్నయ్యకి నచ్చదు."
"నీకెలా తెలుసమ్మా?" బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది ఆనందినిని.
"రావణ సంహారం ముగించి పుష్పకమెక్కి సీతా లక్ష్మణ సమేతంగా వస్తున్న రామచంద్రుడూ.. అల్లంత దూరంలో అయోధ్య కనిపించగానే సంబరం పట్టలేక సీతకు చూపించి ఏం చెప్పాడటో తెలుసా!"
"ఊ.. ఏం చెప్పాడు?"
"రాజధానీ పితుర్మమ!" మా నాన్నగారి రాజధాని అదిగో! అని చూపించాడట. అది పధ్ధతి. 'నాది' అని చెప్పుకోవడం శిష్ట లక్షణం కాదు."
"అవునా! వెర్రి గొల్లలం! ఈ రాచపధ్ధతులు పెద్ద పెద్ద విషయాలూ మనకేం తెలుస్తాయి! పోన్లే.. నువ్వు చెప్పావు కనుక తెలిసింది. సరే! అలాగే పిలుద్దాం." అడుగు ముందుకు వేసారందరూ!
బంగారు చిరుగంటలు గాలికి అల్లనల్లన మ్రోగుతూండగా, కాగడాల వెలుగులో మెరుస్తోంది రాజుగారి ఇంటి సింహ ద్వారం. తలుపు గొళ్ళాలకు తాపడం చేసిన మణులు జిగేల్మంటున్నాయి. పైన గరుడ ధ్వజం గాలికి రెపరెపలాడుతోంది.
"రతనాలు తాపిన గొళ్ళాలున్నాయ్!!" ఆశ్చర్యపోయింది కమలిని.
"ఆ మణుల్లో మనని మనం చూసుకుంటూ ఒక్క క్షణం మైమరిచామా! ఇంక కృష్ణుని చూడలేం!"
"అవునా!!"
"అవును. ఆ తలుపులే అహంకార మమకారాలు. మెరిసే మణులు పొదిగిన గడియ, అందమైన ఆ తోరణం ఇవన్నీ మన దృష్టిని మరల్చే పాశాలు, బంధాలు! వాటి అందం మాయలో పడి కనుమరల్చామా.. కన్నయ్య చిక్కడు." చెప్పింది సురభి.
"అంత అంతరార్ధముందా!" అని నోరు వెళ్ళబెట్టి కదిలారందరూ.
"కన్నయ్య పుట్టాకే ఈ గరుడ ధ్వజం ఎగరేసారట కదా!" తలెత్తి దాన్ని చూస్తూ అడిగింది కమలిని.
ఏమి నోముఫలమొ యింత ప్రొద్దొక వార్త, వింటి మబలలార వీనులార!
మన యశోద చిన్ని మగవానిని గనెనట, చూచి వత్తమమ్మ, సుదతులార!!
అని యశోద నోముల పంట, తమ పుణ్యము కొద్దీ పుట్టిన వాడేనని ఎక్కడెక్కడి నుంచో తరుణులు సింగారించుకుని వచ్చారట!"మురిసిపోతూ చెప్పింది సురభి.
"అంతేనా!
పాపనికి నూనె దలయంటి పసుపు బూసి
బోరుకాడించి హరిరక్ష పొమ్మటంచు
జలములొకకిన్ని చుట్టి రాజల్లి తొట్ల
నునిచి దీవించి పాడిరయ్యువిదలెల్ల
కన్నయ్య తలకు నూనె అంటి, పసుపు రాసి నలుగు పెట్టి తలంటిపోసి "శ్రీరామరక్ష" చుట్టి, సాంబ్రాణి పొగ వేసి, దిష్టి చుక్క పెట్టి ఉయ్యాలలో వేసారట! ఆ వైభోగం చూసిన వారివే కనులు!! అప్పుడు ఎగురవేసినదే ఈ గరుడధ్వజం! రాత్రీ పగలూ అనకుండా వచ్చే ప్రజకు దారి తెలిసేందుకు ఆ గరుడధ్వజాన్ని, తోరణాన్నీ కట్టించారు రాజుగారు." కళ్ళింతలు చేసి చెప్పింది ఆనందిని.
ఇంటి ముందుకొచ్చి నిలబడ్డారందరూ! బ్రహ్మాండమైన వైకుంఠ ద్వారాలల్లే తోచాయా తలుపులు. ఆ తలుపుల వెనుక ఉండేది వైకుంఠనాథుడే మరి! నోట మాట లేకుండా నిలబడిన ఆ పడుచులను, నీరు కారుతున్న పొడవైన తడి జుత్తుని కొసముడి వేసుకు వచ్చిన వారి తీరును చూసి "ఎవరా?" అని ఒక్క అడుగు ముందుకు వేసాడా ద్వార పాలకుడు. 'ఊళ్ళో ఆడపిల్లల్లా ఉన్నార'నుకున్నాడు. అనుమానించుట భటుని లక్షణం. ఏ రక్కసి మూక ఏ రూపంలో వస్తుందో తెలియదాయె! వారి బేల మొహాలను చూసి మోసపోకూడదనుకున్నాడు.
"ఎవరమ్మాయిలూ!" గర్జించాడు. గజగజలాడారందరూ!
ధైర్యం కూడగట్టుకుని ముందుకొచ్చిన సురభి, ఆనందిని, కమలిని మొహాలు చూసుకుని నువ్వెళ్ళంటే నువ్వని ఒకరినొకరు ముందుకు తోసుకున్నారు.
"ఓ నందగోపస్వామి మందిర రక్షకా! మేము కాత్యాయనీ వ్రతం చేస్తున్న గొల్ల పడుచులం." కమలిని ధైర్యం చేసింది.
"ఓహో! మరి ఇక్కడికెందుకు వచ్చారు?" అడిగాడతను.
"మేము కృష్ణుడి కోసం వచ్చాం. ఇదిగిదిగో.. ముందే కాదని చెప్పకుండా, దయచేసి సావధానంగా మా మాట విను." అభ్యర్ధనతో ముందరికాళ్ళకి బంధం వేసానని చెలులవైపు గర్వంగా చూసింది కమలిని.
"కృష్ణుడినా..?! ఈ వేళలోనా!! తెల్లారాక రండి." ఇక దయచేయమన్నట్టు చూసాడాయన.
"అయ్యయ్యో! అలా వెళ్ళిపోమని చెప్పకయ్యా! తెల్లారాక కాదు. ఇప్పుడే చూడాలి." బతిమాలుతున్న ధోరణిల్లో చెప్పింది ఆనందిని.
"ఇంకా పొద్దు పొడవలేదు. కటిక చీకటి, చలి రాత్రులు! మీరేదో వ్రతమని నిద్రలేచారని ఆ అయ్య నిద్రలేస్తాడా? నిద్దరోతున్నాడు. పగలంతా ఆతనికి పనే! ఎంతమందిని చూడాలీ! ఎన్ని రాచకార్యాలూ! మధ్యలో ఊరి మీద పడే రాక్షసులు.. వారి పీచమడచాలి!"ఏకరవు పెట్టాడు ద్వారపాలకుడు.
"అవును. కానీ మేము కృష్ణుడిని ఇప్పుడే చూడాలి. నిద్రపోతున్నప్పుడే చూడాలి. ఆ తామరరేకుల కనులు మూసుకుని, చిరునగవు చెదరనివ్వక ఓ చెయ్యి తలకింద పెట్టుకుని, హాయిగా నిద్దరోతున్న ఆ యదువంశదీపకుడిని చూడాలి. ఆ మోహనరూపం మా కళ్ళలో ముద్దర వేసుకోవాలి." తన్మయురాలై చెప్పింది సురభి.
"భలే వారే! ఏం ప్రేమమ్మా మీది? నిద్దరోతున్న సామిని చూసి, అలికిడి చేసి నిద్ర పాడు చేస్తారా? చాలు చాల్లెండి. వెళ్ళండింక. చూసి వెళ్తారట.. చూసి వెళ్తారు!" విసుక్కుని మళ్ళీ ద్వారం దగ్గరకి వెళ్ళి నిలబడ్డాడతడు.
ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కొందరి కళ్ళు వర్షించడానికి సిధ్ధమైన మేఘాల్లా ఉన్నాయి. ఇంకొందరు వెనక్కి మరలేందుకు సిధ్ధమైపోయారు. ముందుకొచ్చిన తేజస్విని అందరికీ ధైర్యం చెప్పింది. "మనం వచ్చిన పని చెప్దాం. అతన్ని బతిమాలనిదే మనకి తలుపులు తియ్యడు. అలా బెంబేలు పడితే ఏం లాభం?పదండి" అని ధైర్యం నూరిపోసిందందరికీ. "సరే"నని ముందుకెళ్ళింది ఆనందిని.
"ఓ ద్వారపాలకా! నువ్వెంత గొప్ప వాడివి! ముల్లోకాల్ని కాచే ఆ పరమాత్మకు కావలి ఉంటున్నావు. రక్కసుల బారి నుండి అతడి నిద్రని కాచేవాడివి. అలసి సొలసిన ఆ కన్నులు సుఖమైన నిద్రపోకుండా మేలుకొలపడం తప్పే! కానీ, మాకు దిక్కు అతడే!
పూర్వం తాటకినీ, మారీచ సుబాహుల్నీ దునుమాడి మునిజనాన్ని రక్షించేందుకు విశ్వామిత్రుని వెంట దండకారణ్యానికి వెళ్ళిన రామచంద్రుడు, లక్ష్మణుడు రాత్రివేళ మార్గమధ్యంలో నిద్రపోయారట. తెలవారింది. ఆ పసిబాలుల ముద్దు మోము చూసి విశ్వామిత్రునికి మేలుకొలుపు పలకాలని అనిపించి ఉండకపోతే రాక్షసవధ జరిగేదా? "కౌసల్యా సుప్రజా.. రామా.. పుర్వాసంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం!" అని తీయగా మేలుకొలుపు పాడలేదూ! అమ్మ పేరు విని ప్రశాంతంగా నిద్రలేచి ఉంటాడు రామచంద్రుడు! మేమూ కృష్ణుడిని ఉలిక్కిపడేలా నిద్రలేపము. కమ్మని పాటలతో మేలుకొలుపుతాం. తీయని పలుకులతో కర్తవ్య బోధ చేస్తాం!"
"కర్తవ్య బోధా!? హ్హహ్హహా.. వెర్రి గొల్లపిల్లలూ! మీరే కర్తవ్య బోధ చేస్తారూ? విశ్వామిత్రునికీ, మీకూ పోలికా? హ్హహ్హహ్హహా!" పగలబడి నవ్వాడతడు.
"రేపల్లెలో నెలకు మూడు వర్షాలు పడాలని, పాడీ పంటా సమృధ్ధిగా ఉండాలనీ మేము ఈ వ్రతం తలపెట్టాం. వ్రతానికి మాకు 'పర' అనే వాయిద్యం కావాలి. మాకు కావలసిన సంభారాలు కన్నయ్యని అడిగి తీసుకోమని నందగోపుడే ఆ రోజు మాకు చెప్పాడు. తండ్రి చెప్పిన పని చెయ్యడం కుమారుని కర్తవ్యం కాదా! మాకు దిక్కెవరు! ఆ నందనందనుడు తప్ప!" ఆక్రోశించారు గొల్ల పడుచులందరూ!
వాళ్ళ దీనవదనాలు చుసి, చలిగాలికి ఎర్రబారిన వారి లేతముఖాలు చూసి కాస్త కరిగిందతని మనసు. దయగా చూస్తూ మార్దవంగా చెప్పాడు.
"అది సరే, అమ్మాయిలూ! కానీ నేరుగా కృష్ణుడి దగ్గరకి ఎలా పంపేది? మీరు అమాయకమైన పిల్లల్లా కనిపిస్తున్నారు. మీకు పెద్దల పధ్ధతులు తెలీవు. కృష్ణ స్వామి కంటే ముందు రాజుగారిని దాటి వెళ్ళాలి. కన్నయ్యకి ఎలాంటి ఆపదా రాకుండా నేను బయట కాపలా కాస్తున్నా.. లోపల ఆ మారాజుకి రేయంతా నిద్దరుండదు. పాపం! ఉలికీ ఉలికీ లేస్తూనే ఉంటారు. ఆయమ్మ యశోదమ్మా అంతే! ఝాము ఝాముకీ లేచి చూస్తూనే ఉంటుంది. మీరిలా బిలబిలా లోపలికి వెళ్ళారే అనుకోండి.. ఏ ఆవుల మంద రూపంలోనో రాక్షసులొచ్చారనుకుని రాజుగారు కత్తి దూసినా ఆశ్చర్యం లేదు. అంతేనా? తమ్ముడిని కంటికి రెప్పగా కాచుకునే బలరాముడున్నాడు లోపల. నాగలి చేతికందే దూరంలో ఉంచుకుని నిద్దరోతాడతను. చీమ చిటుక్కుమన్నా నిద్రలేస్తాడు. ఇంత మందిని దాటి మీరెలా రాచబిడ్డ దాకా వెళ్తారు? ఎప్పుడో పదిహేను రోజుల క్రితం మీరు అడిగిన వస్తువు గురించి ఎవరికి గుర్తు? వాళ్ళకి నిద్ర లేస్తే తామరతంపరగా వచ్చీపోయే జనాలు, రాచకార్యాలూనాయె! గుర్తుంటుందా అని!"
ఒక్క సారి ఉస్సురన్నారందరూ! ఆనందిని మాత్రం ఆశ కోల్పోలేదు.
"అయ్యో! అలా అనకు అన్నా! రాచకుటుంబం మాట తప్పరు. నందగోపుడికి ప్రజలు పిల్లలతో సమానం. అతడు మర్చిపోడు. కన్నయ్య అసలు మర్చిపోడు. సర్వం ఎరిగిన వాడాయన! లక్ష్మీసంపన్నుడు. మాకు ఇచ్చే వాయిద్యమొక లెక్కా అతడికి. "రామోద్విర్నావిభాషతే!" రాముడు రెండు మాటలు మాట్లాడడు. ఆడిన మాట తప్పడు. ఆ రాముడే ఈ కృష్ణుడు. కల్లలాడడు. లేదు పొమ్మనడు. మాకు నమ్మకముంది. నువ్వు మా ఆశల మీద పాల పొంగు మీద నీళ్ళు జల్లినట్టు నిరాశను చిలకరించకు. మణులతో పొదిగిన ఆ గొళ్ళెం తెరు! మమ్మల్ని లోపలికి వెళ్ళనీ..!" వేడుకుంది ఆనందిని.
ఆమె మాటలలో ఆవేదనకు చలించిన ద్వారపాలకుడు తలుపు తీయబోయి, ఒక్క క్షణమాగాడు. "తెలవారుతోంది. ఇంక యశోదమ్మ కృష్ణుని నిద్ర లేపి, నలుగు పెట్టి స్నానం చేయిస్తుంది. కుదురుగా తిలకం దిద్దుతుంది. ఈ పనులన్నీ ఈ గోపబాలికల వల్ల వేళ మించిపోతే.. నందుడు తనపై కోపం తెచ్చుకుని దండిస్తే! దండిస్తే పరవాలేదు.. తన సమర్ధతని శంకించి ఉద్యోగం మరొకరికి ఇచ్చేస్తే!? కృష్ణుడు నిదురించే మందిరం బయట నిలబడడమే అదృష్టమని మురిసిపోతున్నాడే తను! "జయవిజయుల సాటి నా పెనివిటి" అని తన భార్య అందరితోనూ ఎంతో గొప్పగా చెప్పుకుంటోంది కదా! వీళ్ళని ఈ వేళలో లోపలికి పంపి ఆ భాగ్యానికి ముప్పు తెచ్చుకోవడమా!" అని ఆలోచించసాగాడు.
అతని ముఖంలో ఆలోచన చూసి గొల్లెతలందరూ ఒకటిగా వేడుకున్నారతడిని.
"ఓ ద్వార పాలకా! వెర్రి గొల్ల పడతులం! స్నానం చేసి పరిశుధ్ధులమై, నిష్కల్మషమైన మనసులతో వచ్చాం. నల్లనయ్య మాకు మాటిచ్చి నిద్దురపోతున్నాడు. ఆ మాయవానిని మేము వెళ్ళి మేలుకొలపాలి. రతనాల తలుపు గొళ్ళెము తీయవా అన్నా!"
నందగోప స్వామి మందిర రక్షకా!
సుందర ధ్వజ తోరణ ద్వార పాలకా!
వల్ల కాదనకు! వలదనకు మునుమున్నె!
అల్లన రతనాల తలుపు గొళ్ళెము తీయ!
కల్లకపటము లేని గొల్లకన్నెలమన్న!
నల్లని తిరుమేనివానికై వచ్చేము
మ్రోయు పరవాద్యమిడెదనని నిన్ననే
మాయలాడు తానే మాట ఇచ్చేనని
ఈయెడ తానమాడి ఏతెంచినా మన్న!
తీయుమా తలుపు! పాడేము మేల్కొలుపు!
ఆర్ద్రంగా మధురంగా పాడుతున్న వారిని చూసి, నవ్వి చెప్పాడు ద్వారపాలకుడు. "ఓ అమ్మాయిలూ! తప్పకుండా తలుపు తీస్తాను. కానీ మీరు రేపు రండి. ఈ రోజు వేళ మించిపోయింది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, మంగళ స్నానం చేసి, కృష్ణుడు చెయ్యవలసిన పనులెన్నో ఉన్నాయి. మీరు రేఫు ఇంకాస్త ముందు బయలుదేరి రండి. మారు మాటాడక లోనికి పంపుతాను. మీరు కృష్ణుడిని మేలుకొలిపి మీకు కావలసిన వస్తువు అడిగి పట్టుకెళ్ళండి."
ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. తప్పేదేముందని వెనక్కి తిరిగారు. ఆశ ప్రేమకు నీడ! వదిలిపోదు. బాలభానుని తొలికిరణాలలాగే వారి మనసుల్లో ఆశ ఉజ్వలంగా వెలుగుతోంది.
"రేపు రావచ్చు. కన్నయ్యని చూడవచ్చు!"
తల్లీ! వ్రజవల్లీ! మేలుకో! - 17
"పచ్చవిల్తుడట.. నల్లకలువల బాణాలట! వాటికి ఇంత బలమెక్కడిదో.. ప్రియంవదా! పగలు ముందుకు పోదు. రేయి నిద్దుర రాదు!!" వాపోయింది నెచ్చెలితో కమలిని.
"హ్మ్.. యమునలో మునకలు తప్ప ఈ విరహకీలను చల్లార్చే దారి లేదు కదా! ఈ రోజు కృష్ణుడిని చూడవచ్చు. పెదవి విప్పి చెప్పే పనేముంది. అంతర్యామి ఎరుగని సంగతి ఉండదు కదా! ఓపిక పట్టాలి."ఊరడించింది ప్రియంవద.
యమున దగ్గర ఎదురుచూస్తున్న చెలులను చేరి స్నానమాచరించి, యథావిధిగా కాత్యాయనిని అర్చించి, ఉరకలేసే జలపాతాల్లా పరుగుపరుగున నందగోపుని ఇంటిముంగిలి చేరారు.
అల్లంత దూరాన గోపబాలలను చూసి నవ్వుకున్నాడు ద్వారపాలకుడు.
"అప్పుడే వచ్చేసారే! పూజ పూర్తి చేసుకున్నారా?" పలకరించాడు.
"ఓ! అయింది.. మేం లోపలికి వెళ్ళవచ్చునా!" ఎగసే గుండెలను అదుపులో పెట్టుకుంటూ అడిగారందరూ!
"తప్పకుండా వెళ్ళచ్చు. కానీ, ఒక్క మాట!"
ఇంకా ఏమిటన్నట్టున్నాయి వాళ్ళ చూపులు.
" మీరు కృష్ణుడిని చూసేందుకు అనుమతి ఇచ్చేవాడిని నేను కాదు. రాజుగారూ, రాణిగారూను! లోపల నందగోపుని మందిరం ఉంటుంది. యశోద ఉంటుంది. ముందు వాళ్ళని మేలుకొలిపి, అనుమతి పొంది అప్పుడు ముందుకు వెళ్ళండి. తెలిసిందా!" హెచ్చరించాడతను.
"సరే సరే!" ఏకకంఠంతో పలికారందరూ!
"సరే! శుభం! జాగ్రత్త! " రతనాల తలుపు గొళ్ళేం తీసి తలుపులు ఒక్క సారి తెరిచాడతడు. బంగారు ద్వారాలకున్న చిరుగంటలు ఘల్లుమని సవ్వడి చేసాయ్! "మ్రోగినది తమ గుండెలేనేమో!" అనుకున్నారు గోపతరుణులు. వణుకుతున్న పాదాలతో గడపదాటి లోనికి అడుగుపెట్టారు.
"నేరుగా కన్నయ్య వద్దకి వెళ్ళవద్దంటాడేం, ఆ కాపలాదారు?" ప్రశ్నించింది కమలిని.
"అవును మరి! మనకి ఎంత గొప్పనేస్తమైనా అమ్మ కొంగు చాటు బిడ్డేగా! అయినా ప్రజలందరూ సుఖంగా ఉండేలా కాపాడుతున్న రాజుగారు నందగోపుడు. ఆయన చెప్పనిదే మనలాంటి అమాయక గొల్లలకు ఏది చెయ్యాలో, ఏది కూడదో తెలిసేదా? నందగోపుడే మనకు మంచి త్రోవ చూపే గురువు! ఆ గురువు నేర్పే మంత్రం లాంటిది యశోదమ్మ. వారికి విన్నపం చేసుకోనిదే, వారి అంగీకారం, మార్గదర్శకత్వం లేనిదే ముందుకు వెళ్ళడం అసాధ్యం. పదండి వారినే నిద్రలేపుదాం!" ముందుకు నడిచింది ఆనందిని.
కప్పురపు దివ్వెల వెలుగులో విరాజిల్లుతున్న మందిరపు తలుపుల దగ్గర నిలబడ్డారు.
"ఓ నందగోపా..! నిద్ర లేవయ్యా! మా గొల్లలకు నీరూ, ఆహారమూ, కట్టుకోడానికి వస్త్రాలూ వేళకు అందేలా, లేవడి లేకుండా సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాలను గడిపే సదుపాయం చేస్తున్న ఏలికవు! మమ్మల్ని చల్లగా పాలిస్తున్న రాజువి! నీ పాలనలో పల్లె సుభిక్షంగా ఉంది. ఇకపై ఎలాంటి ఇక్కట్లూ లేకుండా నెలకు మూడు వానలు పడాలని కాత్యాయనీ వ్రతం చేస్తున్నాం. మాకు కావలసిన 'పర'వాద్యం నీ కుమారుడు కృష్ణుడు ఇస్తాడని చెప్పావు. మమ్మల్ని అతని వద్దకు పంపే దారి చూపాల్సిన వాడివి నువ్వే! నీ ఆనతి లేనిదే మేము ముందుకు పోలేము. నిద్ర లే!"
అలికిడి లేదు! "చీమ చిటుక్కుమంటే నిద్రలేస్తాడు. ఎల్లవేళలా కృష్ణుడిని కాచుకుని ఉంటాడు!" అని ఎన్ని గొప్పలు చెప్పాడు ద్వారపాలకుడు! నేరుగా లోపలికి వచ్చి పిలుస్తున్నా పలకడం లేదే! అని ఆశ్చర్యపోయారు. "మనని పరీక్షిస్తున్నారేమో! పధ్ధతి ప్రకారం పెద్దలనే నిద్రలేపుతారో, నేరుగా కన్నయ్య దగ్గరికి చనువుగా వెళ్ళిపోతారో అని చూస్తున్నారేమో!" అని గుసగుసలాడుకున్నారు. "అయ్యవారిని పిలిచాం. ఇక యశోదమ్మనీ పిలిచేద్దాం. ఆమైనా నిద్రలేస్తుందేమో!" అనుకున్నారు.
"ఓ యశోదా! వ్రజవల్లీ! నీటిప్రబ్బలితీగెలా నందుని అల్లుకున్న లతవు. నీవు మా గోపకులానికి రాణివి. వెన్నలాంటి మనసున్న తల్లివి. నందగోపుని ఇంటి దీపానివి. రాజు తండ్రి వంటి వాడని చెప్తారు కదా! పిల్లలకు కావలసినవన్నీ తండ్రిని అడిగి పొందే మార్గం తల్లే కదూ! నువ్వు చెప్పకపోతే నందగోపునికి మాపై కరుణ కలుగుతుందా! నిద్ర లేవమ్మా! లేచివురు వలె మనోజ్ఞమైన నీ రూపం ఉదయాన్నే చూడనీ! నీ పోలిక పుణికి పుచ్చుకున్న ఆ కృష్ణుడే మాకు దిక్కు. అతనికి మా విన్నపం చెప్పుకోవాలంటే నీ అనుమతి కావాలి. నిద్ర లేచి రావమ్మా!"
మేలుకో! మేలుకో!
చాలించి నిదుర - మేలుకో!
ఏ లేవడి రానీక, ఎల్లవేళలరసే మా
ఏలికా! నందగోపాలకా! మేలుకో!
చాలించి నిదుర - మేలుకో!
తల్లీ! వ్రజవల్లీ! నవపల్లవాభిరామా!
అల్లన లేవమ్మా! యశోదమ్మ! నందగృహ దీపమ!
మేలుకో! మేలుకో!
గొంతెత్తి పిలిచినా, మేలుకొలుపు పాడినా అలికిడి లేకపోయేసరికి, కమలిని ఇంకాగలేక ఒక్క అడుగు ముందుకేసి కన్నయ్యనే పిలిచేసింది. "ఓ కన్నయ్యా! ఆకాశం, భూమీ, ఆపై బలిచక్రవర్తి తలా కొలిచిన సర్వవ్యాపి నువ్వని చెప్తారు. త్రివిక్రముడని పొగుడుతారు! ముల్లోకాల ఏలికవు! మేమడుగుతున్న చిన్న వాయిద్యం ఇచ్చేందుకు నిద్రలేచి రాలేవా? మేలుకో!"
భువిని దివిని మీరి భువన భువనముల నిండే
త్రివిక్రమా! పురుషోత్తమా! దేవదేవ! శ్రీకృష్ణా!
మేలుకో! మేలుకో!
చప్పున వెనక్కి లాగి వారించింది సురభి. "ఆగు కమలినీ! రాజదర్శనం అంత త్వరగా అయ్యేది కాదు! మనని పరీక్షిస్తున్నారేమో! నువ్వు సరాసరి కన్నయ్యని పిలిచేస్తే బలదేవునికి కోపమొస్తేనో!"
"వస్తే నందగోపునికో, యశోదమ్మకో రావాలి కానీ, బలదేవునికెందుకూ కోపం?"
"అయ్యో! ఎంత మాట! బలరాముడేమైనా సామాన్యుడనుకున్నావా? దేవకీ గర్భాన పడిన ఏడవ శిశువే బలదేవుడు. కంసుని బారి నుండి రక్షించేందు అతడిని సంకర్షించి, రోహిణీ గర్భాన ప్రవేశపెట్టారు. అందుకే బలరాముని "సంకర్షణుడు" అంటారు. నేలపడి బట్టకట్టిన ఏడవ బిడ్డయని దృష్టి తగలకుండా, బలదేవుని కాలికి ఓ అపరంజి కడియం వేసిందట రోహిణి. ఆ కాలు ముందుకు వేసినప్పుడల్లా బలదేవుడు "తాను కృష్ణుడి అన్నగారినని, అడుగడుగునా అతనిని కాపాడవలసిన బాధ్యత తనపై ఉందనీ" అనుకుంటూ ఉంటాడట! అందుకనే ఆతడు కన్నయ్యని విడిచి ఉండడు."
"లోకాలను కాపాడే వానిని కాపాడే వాడు బలరాముడన్నమాట!"
"అవును! ఇంకో సంగతి విను! వనవాసానికి వెన్నంటి వస్తానని బయలుదేరిన లక్ష్మణుడిని "నువ్వెందుకూ, రావద్దూ!" అని వారించాడట రాముడు. "క్రుధ్నంతీ కుశకంటకాః" నువ్వు నడిచే దారిలో గీసుకునే దర్భల్నీ, గుచ్చుకునే ముళ్ళనీ తొలగిస్తాను.. రానివ్వమని" వేడుకున్నాడట లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడే ఈ బలరాముడు." చెప్పింది సురభి.
"అవునా! భలే! ఎంత అదృష్టవంతుడో కదా! ఏ అవతారంలో అయినా వెంటుండే అదృష్టం!!"
"కాదూ మరి! ఈ బలదేవుడూ, ఆనాడు లక్ష్మణుడూ సాక్షాత్తూ ఆదిశేషుని అంశ! ఆదిశేషుడెంత అదృష్టవంతుడో తెలుసా!
నివాస శయ్యాసనపాదుకాంశుక
ఉపధానవర్షాతపవారణాదిభిః
శరీరభేదైస్తవ శేషతాంగతైః
యథోచితం శేష ఇతీరితే జనైః
ఆ పరంధాముడికి ఉండేందుకు నివాసము, నిదురించేందుకు శయ్య, పాదాలను ఉంచుకునే పీఠము, తలగడ, పైన ఉత్తరీయము, ఎండా వానా కాచే గొడుగూ అన్నీ నీవే అయి.. శేషుడనే పేరుకు తగినవాడివి నువ్వేనయ్యా! అని మెచ్చుకున్నారట ఆదిశేషుడిని!" ఆనందిని చెప్పింది.
"అవునా!! అపచారం అపచారం! బలదేవుని విస్మరించనే కూడదు! భగవంతుని కంటే ముందు భాగవతులను పూజించమని చెప్తారు కదూ పెద్దలు. బలదేవుడినే వేడుకుందాం!" నొచ్చుకుంటూ చెప్పింది కమలిని.
"మంచి పిల్లవి! బుధ్ధిశాలివి! పిలు మరి!" నవ్వుతూ కమలినినే ముందుకు వెళ్ళమన్నట్టు సైగ చేసింది ఆనందిని.
"ఓ బలదేవా! ఆదిశేషుని అంశవి నువ్వు! ఎంతో గొప్ప వాడివి! నీ శౌర్యం కృష్ణుడికి ఎల్లవేళలా రక్ష కావాలి! వీరోచితమైన ఆపరంజి కడియం నీ కాలికి అలంకరించబడి ఉంటుంది కదా! నీ చలవ వలనే కన్నయ్య మాకు దక్కాడు! ఆ పాదం నేలను మోపి లేచి రా! నీ తమ్ముని నువ్వే నిద్ర లేపి బయటకు రా! ఇద్దరు చందమామలు నేలమీద వెలిగేది ఒక్క మా రేపల్లెలోనే! బలరామకృష్ణులు!! అందంలోనూ, పరాక్రమంలోనూ, కరుణలోనూ కన్నయ్యకు దీటైన వాడివి. దయ చూపించవయ్యా! నిద్రలేచి బయటకు రా!"
కనక వీరమంజీరము ఘనపదముల తొడవుగా
తనరే బలదేవా! నీ తమ్మునితో మేలుకో!
ఆలించి మనవి మా మేలెంచి మేలుకో!
మెల్లగా తలుపు తెరచి బలరాముడు బయటకు వచ్చాడు. గోపకాంతలు సంబరంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రమణీయమైన ముఖాలతో, మనోహరమైన చిరునవ్వులతో మేలుకొలుపు పాడిన వారిని చూసి ప్రసన్నంగా నవ్వుతూ పలకరించాడు బలదేవుడు.
"అమ్మాయిలూ! ఇంత ఉదయాన్నే ఇలా వచ్చారేం? ఏమిటి పని?"
తామొచ్చిన పనిని వినయంగా చెప్పారు గోపికలు. విని తల పంకించాడాయన.
"అమ్మాయిలూ.. మీరు నన్ను అనుమతి అడిగినందుకు చాలా సంతోషం! కానీ కృష్ణుడు పసిబాలుడు కాదు. అమ్మ సందిట నిద్రపోతున్నాడనుకుంటున్నారా? ఇప్పుడు అతడు నీలాదేవి పెనిమిటి! ఆమె అంతఃపురంలో సుఖశయ్యపై నిద్దరోతూ ఉంటాడు. అంత సులువుగా నిద్రలేచి రాడు. అక్కడికే వెళ్ళి మేలుకొలుపు పాడండి. మీరు కోరిన పరవాద్యం ఇస్తాడు." అని చెప్పాడు. ఒకరివైపొకరు చూసుకుని సరేనని ముందుకు కదలబోయారు.
"ఒక్క మాట! తెల్లారబోతోంది. మీరు ఇప్పుడు వెళ్ళి అతగాని నిద్ర లేపి, కృష్ణుడు బయటకు వచ్చి, మీ విన్నపం వినే లోపు మీకు పనులకు వేళ మించిపోదూ! ఆలోచించుకోండి. రేపు తెలవారక మునుపే వచ్చి నేరుగా నీలామందిరానికే వెళ్ళండి. ఏమంటారు!" వెనక్కి లాగాడు బలదేవుడు.
ఉసూరంటూ ఇళ్ళకు బయలుదేరారు ఆ గొల్ల పిల్లలు. కళతప్పిన వారి ముఖాలను చూసి కమలిని ధైర్యం చెప్పింది. "అమ్మాయిలూ! కష్టపడి సాధించిన పండుకి రుచెక్కువ! ఎన్ని పరీక్షలైనా తట్టుకుని నిలబడితేనే మన వ్రతం ఫలిస్తుంది. కృష్ణుడు మనకు దక్కుతాడు. చిటికెలో రోజు గడిచిపోతుంది. రేపు కాత్యాయనీ పూజ అవగానే నేరుగా కన్నయ్య దగ్గరకే వెళ్ళవచ్చు.. నిరాశ పడకండి!" "అవునంటే అవునని" ఉత్సాహంగా ఇళ్ళకు చేరారందరూ! గొల్లపల్లె నిద్రలేచింది. పశువుల అంబారావాలతో, పాలు పితికే శబ్దాలతో, లయగా చల్లతరచే పడుచుల గాజుల సవ్వడితో, ఇవన్నీ చూసేందుకు ఉదయించిన దినమణి నులివెచ్చని కిరణాలతో..
గురివింద పొదలందు పలికేను గోరింక! మేలుకో! - 18
నందగోపుని మందిరపు మొగసాల నిలిచిన గోపకాంతలు పులు కడిగిన మాణిక్యాల వలె ప్రకాశిస్తున్నారు. యమునలో స్నానమాడి, కాత్యాయనికి పూజ చేసి, రయమున రాజమందిరానికి వచ్చి నిలచారు. శుక్లపక్ష చంద్రుడు తోడున్నానని హామీ ఇచ్చి ముందుకెళ్ళమన్నట్టు నవ్వుతున్నాడు. ద్వారపాలకుని ధైర్యవచనాలు నెమరు వేసుకుంటూ, బలదేవుడు చెప్పినట్టు నేరుగా నీలా మందిరం వైపు నడవనారంభించారు.
"సురభీ! నీలాదేవి మందిరం ఎంత వైభోగంగా ఉంది! ఇంద్రభవనానికైనా వంక పెట్టవచ్చేమో కానీ ఈ మందిరానికి మచ్చలేదు కదా! ఆ తటాకాలు, పూలతోటలూ చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ మణిఖచిత వేదిక మీద నీలా కృష్ణులు కూర్చుని ఉంటారా? ఈ బంగారు తూగుటూయలలో కన్నయ్య ఊగి ఉంటాడా? ఏం భోగం! ఏం ఐశ్వర్యం! ఈ గాలిలోనే ఏమి దివ్య పరిమళం? అసలు ఈ భవనాన్ని విడిచి బృందావనిలో చెట్ల కింద, అరుగుల మీద, యమున ఒడ్డున ఇసుక తిన్నెలమీద మనతో కృష్ణుడు కలిసి ఆడి పాడాడంటే నమ్మశక్యంగా లేదు! ఎంత అదృష్టవంతులం మనం!" ఆశ్చర్యపోయింది తరళ.
"సాక్షాత్తూ యశోద మేనకోడలు నీల! ఆగర్భ శ్రీమంతురాలు. కోరి వలచి, ఉంకువ చెల్లించి కృష్ణుడు పరిణయమాడిన మామ కూతురు. ఈ వైభోగం ఆమెకు పుట్టుకతో వచ్చినదే!" చెప్పింది సురభి.
"ఏవిటేవిటీ!! ఉంకువ చెల్లించాడా? అంత పుట్టు శ్రీమంతురాలంటున్నావు? ఇంకా శుల్కమెందుకు?"
"వెర్రి దానా! కృష్ణుని పరాక్రమమే ఉంకువ! ధనమో, ఆలమందలో కాదు. తన బాహుబలమే శుల్కంగా చెల్లించి ఈమెను చేపట్టాడు కృష్ణుడు." నవ్వింది సురభి.
"అబ్బా.. వివరంగా చెప్దూ!" చుట్టూ గరుడపచ్చలు పొదిగిన చలువరాతి తిన్నెపై కూర్చుంటూ అడిగింది.
"విదేహ రాష్ట్రంలో గొప్ప శ్రీమంతుడైన గొల్ల ఉండేవాడు. అతని పేరు కుంభకుడు. అతను యశోదకు అనుంగు తమ్ముడు. తనభార్య ధర్మద తో కలిసి పుణ్యకార్యాలు చేస్తూ, సొమ్ములు, పాలు, పెరుగూ అడిగినవారికి కాదనకుండా దానం చేస్తూ ఉండేవాడు. కుంభకునికి శ్రీ ధాముడు, 'నీల' అని ఇద్దరు సంతానం. నీలకే 'నాగ్నజితి' అని మరొక పేరు. పూర్వం తారకాసుర సంగ్రామంలో మహా విష్ణువు చేత చచ్చిన కాలనేమికి ఏడుగురు కుమారులున్నారు. వారు విష్ణువుపై పగబట్టి కృష్ణుని రూపంలో రేపల్లెలో పుట్టిన అతనిపై పగ తీర్చుకునేందుకు, కృష్ణుని మామ కుంభకుని ఇంట భయంకరమైన ఆబోతులుగా పుట్టారు. "కన్నయ్య ఎప్పుడైనా మేనమామ ఇంటికి రాడా! పగ తీర్చుకోకపోతామా!" అని వారి ఆలోచన. ఆ ఏడు ఎద్దులూ మహా క్రూరమైనవి. ఒక్కో ఎద్దూ ఏడు ఏనుగులను తుదముట్టించేంత బలం కలిగి ఉండేది! అవి ఊరిమీద పడి చేస్తున్న ఆగడాలకు కుంభకుడు ముకుతాడు వెయ్యలేకపోయాడు. వీటి ముట్టె పొగరణచిన వాడికి తన కుమార్తె నీలను ఇచ్చి వివాహం చేస్తానని చాటింపు వేయించాడు.
"ఊ.. కన్నయ్య వెళ్ళాడా!"
"వెళ్ళడూ మరి! ఆ సౌందర్యరాశి నీల మనసులో తన బావ కృష్ణుడినే వరించింది. ఆమెను చేపట్టేందుకు మేనమామ ఇంటికి వెళ్ళిన కృష్ణుడు, ఆ భయంకరమైన సప్త వృషభాలను తన ముష్టి ఘాతాలతో తుదముట్టించి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు"
"అవునా! మరి అంత గొప్పింటి పిల్ల మందిరానికి వెళ్ళి, కృష్ణుడిని బయటకు పంపమంటే ఆమె పంపుతుందా?" నిస్పృహతో అడిగింది కమలిని.
"ప్రయత్నిద్దాం. మంచిగా ఆమెను వేడుకుందాం."
"సరే! ద్వారపాలకునికే అన్ని పధ్ధతులున్నాయి కదా! మరి కృష్ణుని కొంగున కట్టుకున్న ఆ భాగ్యశాలిని ఎలా సంబోధించడం! ఆమెకు దయ కలిగేలా ఎలా మాట్లాడడం?" సందేహం వెలిబుచ్చింది కమలిని.
"వెర్రి దానా! అమ్మకు ఉన్నదే వాత్సల్యం. సాక్షాత్ లక్ష్మీరూపం నీల! సురుచిరాంగి.. మంచి మనసున్నదీ కూడా! అయితే ఏమని పిలిస్తే బాగుంటుందో!" సాలోచనగా ఆనందిని వైపు చూస్తూ అంది సురభి.
"ఆ.. ఏముంది. "నందగోపుని మందిర రక్షకా!" అని పిలిచాం. "నందగృహ దీపమా!" అని యశోదని పిలిచాం. అలాగే "నందగోపుని కోడలా..!" అంటే సరిపోతుంది." అల్లరిగా సమాధానం చెప్పింది తరళ.
"నవ్వులాటకు చెప్పినా సరైన మాట చెప్పావు. అలాగే పిలవాలి."నవ్వింది ఆనందిని.
"ఊరుకుందూ! యశోదకి మేనకోడలైతే, "నందుని కోడలా" అని ఎందుకూ పిలవడం!" అపనమ్మకంగా అడిగింది తరళ.
"మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే రామాయణంలోకి వెళ్ళాలి." అని నవ్వి చెప్పనారంభించింది ఆనందిని.
"అశోకవనిలో శోకంలో మునిగి, శింశుపా వృక్షం కింద కూర్చున్న సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు హనుమ. అతనితో తను ఎవరని చెప్పిందో తెలుసా సీతమ్మ? "స్నుషా దశరథస్యాహం! దశరథుని కోడలిని నేను!" అని చెప్పుకుంది. ఆ తరువాతే జానకినని, ఆ పై రాముని ఇల్లాలిననీ చెప్పింది."
"అవునా!"
"ఊ.. అంతే కాదు. రామునికి సీత అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? "దారా పితృకృతా ఇతీ!" మా తండ్రి అనుమతితో పాణిగ్రహణం చేసానీమెను! "మా నాన్నగారి కోడలు సీత!" అని చెప్పుకున్నాడు రామచంద్రుడు. కనుక "నందగోపుని కోడలా!" అని పిలిస్తేనే నీల, కృష్ణుడు కూడా సంతోషిస్తారు." చెప్పుకొచ్చింది ఆనందిని.
"సరే! అలాగే పిలుద్దాం. పదండి. వెళ్ళి నిద్ర లేపుదాం."లేచి మందిర ముఖ ద్వారం వైపు కదిలింది తరళ. వెనుకే మిగిలిన గోపకాంతలు.
మణికవాటాలకి వ్రేలాడుతున్న పల్చని తెల్లని జలతారు తెరలు కదులుతున్నాయి. 'ఏమని పిలవాలో, ఆమె బయటకు వస్తే ఏమని అడగాలో' ఒకటికి రెండు సార్లు ముందే అనుకుని నిర్ణయించుకున్నారు. తలుపు దగ్గరగా నిలబడి నెమ్మదిగా పిలిచింది కమలిని.
"ఓ నందగోపుని కోడలా! నీలా! మేలుకో! మద గజాలనోడించే భుజబలమున్న వాడు నంద గోపుడు. అతని కోడలివి నువ్వు! కాత్యాయనీ వ్రతానికి కావలసిన వస్తువులు నీ పెనిమిటి శ్రీకృష్ణుని అడిగి తీసుకెళ్ళాలని వచ్చాం. నువ్వు నిద్ర లేచి కృష్ణుని నిద్ర లేపు. నీ ముంగిట నిలిచి ఎదురుచూస్తున్నాం. లే నీలా! నిదుర లే!" తన వంతు పిలుపు అయిపోయిందన్నట్టు వెనక్కి తిరిగి చెలుల వైపు చూసింది కమలిని. ఉత్పల, తరళా పిలవనారంభించారు.
"నీలా! అదిగో కోళ్ళు కూస్తున్నాయి. తెలవారుతోంది. సద్భోధలు చేసే జీయరులు నిద్రలేచి హరినామ స్మరణ చేస్తున్నారు. వినిపించిందా? గురివింద పొదల్లో గొరవంకలు కూస్తున్నాయ్. నీ వద్ద సంగీత పాఠానికి సిధ్ధమై నీ శిష్యురాలు కోకిల వచ్చి మాధవీ లతపై కూర్చుంది. "కూ.. కూ.." అని నిన్నటి పాఠం వల్లెవేసి నిన్ను మెప్పించి, నిద్ర లేపాలని చూస్తోంది. మేమూ ఆ కోయిలలాంటి వాళ్ళమే! నీ పలుకుల కోసం ఎదురుచూస్తున్నాం. నిత్యవసంత శోభతో అలరారే వనలక్ష్మివి నువ్వు! నీకు కాకి కూత ఏదో, కోయిల పాటేదో తెలియదా? మా పిలుపులో మాధుర్యం, మన్నన నీకు వినిపించలేదా? మేము అలవికాని కోరికలు కోరే అత్యాశాపరులం కాదు. వెర్రి గొల్ల పొలతులం. మంచి మాటలు మాట్లాడేవాళ్ళం. మాపై దయ తలచకపోయినా ఆ పికానికి పాట నేర్పేందుకైనా నిద్ర లేవమ్మా!"
నీల అలసి సొలసి నిద్రపోతోందని నిశ్చయించుకున్నారందరూ! మళ్ళీ ప్రయత్నిద్దామని పిలవసాగింది సురభి.
"నీలా! ఓ సౌందర్య రాశీ! ఓ అన్నుల మిన్నా! నీ కంటే గొప్ప అందగత్తె ముల్లోకాలలోనూ ఉందా? నీ హొయలు మరొకతెకు సాధ్యమయ్యేదేనా? నీ అందాన్ని చూసి నిన్ను అనుకరించాలని ప్రతి కొమ్మా పూచింది. నీ సొగసు ముందు ఈ పువ్వులు ఓడిపోతున్నాయి! ఈ పూలని చూస్తే తెలుస్తుంది నీవెంత చక్కదనాల కొమ్మవో! విరగబూసిన ఈ పువ్వులను, కృష్ణుని కోసం ఎదురుచూస్తూ, నీ ఎర్రని నాజూకైన వేళ్ళతో మాలలు అల్లావు కాబోలు! ఆ మాలలను బంతులుగా చుట్టి మీరిద్దరూ ఆడుకున్నారేమో! సుమాల కంటే సుకుమారివి! పాపం! బంతులాడి ఆ పూలబంతి చేతిలో ఉండగానే నిద్రపోయావేమో! నిద్ర లే! నీ నీలాల కురుల నెత్తావి మమ్మల్ని తాకనీ! లే నీలా! ఓ మధుసూదనప్రియా! నిదుర లే!" అలికిడి లేని ఆ మందిరపు వాకిట నిలచి నిరాశగా ఒకరినొకరు చూసుకున్నారు వారందరూ!
"నీలా! మహా క్రూరమైన బలమైన ఏడు ఆబోతులను ఓడించి నిన్ను చేపట్టాడు నీ స్వామి! అతని భుజబలం నీకు తెలియనిది కాదు. మద జలమూరే చెక్కిళ్ళతో అడవిలో విహరించే ఏనుగు వంటి బాహుబలం కల స్వామి ఆ శ్రీకృష్ణుడు. అతని శరణు కోరి వచ్చాం. నువ్వు నిద్ర లేచి ఆయనను నిద్ర లేపాలి. ఎర్రని తమ్మి పూవులను పోలిన నీ చేతులకి ఉండే బంగారు కంకణాల వినసొంపైన ధ్వని మా చెవుల సోకనీ! ఆ పసిడి కంకణాలు కదిలేలా తలుపు తీయవా?"
నందగోపుని కొడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?
విందువా కోళ్ళు కూసేను. ఆ వంక
గురివింద పొదలందు పలికేను గోరింక
కందుకము వేళ్ళ సందిటను కలదాన!
అందమగు కురుల నెత్తావి కలదాన
కుందనపు కంకణాల్ చిందులాడీ పాడ
కెందమ్మి పోలేటి నీ సోగ కేల
సుందరుడు నీ స్వామి శుభనామములను మన
మనమందరమునూ కూడి పాడుకొందాము
క్రందుకొను గంధసింధుర బలముతో వైరి
బృందముల క్రిందుపడ జేయగల వాని
నందగోపుని కోడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?
అలికిడి లేదు. తలుపు తెరుచుకోలేదు. తెలవారింది. "ఇంత పిలచినా నిద్రలేవని నీలాకృష్ణులు ఎంత గాఢనిద్రలో ఉండి ఉంటారో!" అనుకుంటూ ఇళ్ళకు మరలారు గోపవనితలు. రేపటి రోజున మళ్ళీ వద్దామని ఒకరిని ఒకరు సముదాయించుకుని వెనుతిరిగారు.
పలుకవా నళినేక్షణా! - 19
తెలి వెన్నెల తెరలు కట్టిన నింగి పల్లకీ ఎక్కి ఊరేగుతున్న జాబిలిని చూసి నిట్టూర్చింది సురభి.
"రోజుకో కళ పెరుగుతూ మన విరహానికి ఆజ్యం పోస్తున్నాడు." సురభిని చూసి తానూ నిట్టూరుస్తూ చెప్పింది తరళ.
"పదండి. కాత్యాయనికి మనసారా మొక్కి నడవండి. ఈ రోజు నీలను నిద్ర లేపాల్సిందే! కృష్ణుని చూడాల్సిందే." బయలుదేరదీసింది ఆనందిని.
"ఈ రోజైనా మన మనోరథం నెరవేరేనా?" నిరాశగా అంది సురభి.
"సురభీ! నువ్వే ఇలా బెంబేలుపడితే మిగిలిన వారికి ధైర్యం చెప్పేదెవరు? ఒక్కో రాయీ పేర్చితేనే వారధి అయింది. రాముడికే తప్పలేదీ విరహం. మనబోంట్ల సంగతి చెప్పేదేముంది? సహనం వహించక తప్పదు. పదండి అమ్మాయిలూ!" చుక్కానిలా రెపరెపలాడింది చకచకా నడుస్తున్న ఆనందిని పైట కొంగు.
నీల మందిరపు ముంగిట నిలబడ్డారు. గాలిలో తేళివస్తున్న అగరు ధూపం, చందన పరిమళాలు వారి విరహబాధను రెట్టింపు చేస్తున్నాయి. బంగారు కిటికీలకు అలంకరించిన తెరలతో తెమ్మెర సరాగాలాడుతూ, ఆ పడకింటి అవ్యక్తమైన అందాలను, ఆ గోపవనితల ఊహకు అందిస్తోంది. ఆకుల సవ్వడి వినిపించినా అది నీల మంజీరాల రవళేమో అనుకుంటున్నారు. నాసికకు సోకే సుగంధంలో వనమాల సౌరభాన్ని వెతుక్కుంటున్నారు. కనురెప్పైనా వెయ్యక ఆ మందిర సౌందర్యాన్ని చూస్తున్నారు. ఆ తలుపుల వెనుక ఉన్న తమ మనోహరుని పిలవసాగారు.
"ఓ రాజీవ లోచనా! నీ నయన సౌందర్యానికి ఓడి నీ ముంగిట నీ కోసం ఎదురుచూస్తున్నాము. నీకు తెలియనిదేముంది! మేము అడగాల్సిన పనేముంది? అయినా అడుగుతున్నాం. మా వ్రత సాఫల్యానికి కావలసిన వాయిద్యం ఇస్తానని మాటిచ్చావు. నిష్ఠగా నోము నోచుకుంటున్నాం. రోజులు గడుస్తున్నాయే కానీ నీ దర్శనభాగ్యం లేదు. మా మాట మరచావేమో అని గుర్తు చేద్దామని వచ్చాం. కనీసం "ఓ"యని బదులైనా పలకలేవా? ఒక్క మాటైనా మాటాడకుండా, ఈ అమాయక గొల్లపడుచులందరినీ నీ ముంగిట నిలుపుకున్నావు. నీకిది న్యాయమా?" కన్నుల చిప్పిల్లుతున్న కవోష్ణ ధారలు కట్టు దాటకుండా ఉగ్గబట్టుకుంటూ పిలిచారు గొల్ల పడుచులు.
సమాధానం లేదు. కోపమొచ్చింది కొందరికి. నిరాశ నిస్సత్తువైపోయింది ఇంకొందరికి. అయినా పట్టువిడువక పిలిస్తున్నారు.
"నీల అనుపమాన సౌందర్యవతి. ఆ కలికి చనుగవ నీ తలగడగా చేసుకుని పడుకుని ఉంటావు, కృష్ణా! ఇంక మా పిలుపు నీకెలా వినబడుతుంది? కనీసం పెదవి విచ్చి ఒక్క మాట మాట్లాడలేవా?" నిష్టూరం రంగరించి పలికింది కమలిని. చెలులందరూ ఆమె వైపు నీకెలా తెలుసన్నట్టు చూసారు. ఇంకా ఏం ఊహించావని అడిగారు.
"ఆ మందిరంలో గుత్తులు గుత్తులుగా కప్పురపు దివ్వెలు వెలుగుతుంటాయి. ఆ దివ్వెల వెలుగులో నీల నీలాల కురుల పరిమళం తాకేలా ఆమె హృదయసీమ పై పవళించి ఉంటాడేమో!" చెప్పింది కమలిని.
"అంతేనా! తెల్లని దంతపు కోళ్ళతో ఉన్న పంచతల్పం పై శయనించి ఉంటాడు. అంత సుఖమైన నిద్ర కనుకే తెలివి రావట్లేదు." అంది సురభి.
"దంతపు కోళ్ళా? పంచతల్పమా?"
"అవును! మధురానగరానికి వెళ్ళిన బలరామకృష్ణులకు, మదమెక్కి రహదారిలో చిందులేస్తున్న కువలయాపీడమనే కంసుని పట్టపుటేనుగు ఎదురుపడిందట. కృష్ణుడు సింహం లంఘించినట్టు ఆ ఏనుగు కుంభస్థలం పైకి ఎగిరి చేతులతో మోది దాని ప్రాణాలు హరించాడు. కువలయాపీడానికి నాలుగు బ్రహ్మాండమైన దంతాలుండేవి. ఆ ఏనుగును సంహరించిన పిదప, తన పరాక్రమానికి గుర్తుగా ఆ నాలుగు దంతాలూ మంచపు కోళ్ళుగా చేసి నీలకు బహూకరించి ఉంటాడు."
"మరి పంచతల్పమంటేనో?"
"చలికాలములో వెచ్చగానూ - వేసవి కాలంలో చల్లగానూ ఉండేది, మెత్తనిదీ, విశాలమైనదీ, పరిమళాలు వెదజల్లేదీ, మల్లెపూవల్లే తెల్లగా ఉండే శయ్యను పంచతల్పమంటారు." చెప్పింది మంజుల. "అవునా!" అని ఆశ్చర్యపోయారు మిగిలిన వారు.
"అంత హాయిగా నిద్దరోతున్న స్వామి కళ్ళెలా విప్పుతాడు. నీల అయినా నిద్రలేస్తే బాగుండును."
"మన పిలుపు విని లేచి వద్దామని ఒక్క అడుగు వేసాడనుకో! ఆ నీల వెళ్ళనిస్తుందా? కనులతోనే వారించి మళ్ళీ తన గుండెల్లో దాచేసుకుందేమో!" అనుమానం వెలిబుచ్చింది విష్ణుప్రియ,
"లేదు. కృష్ణుడే మాయావి. ఆమె మంచిదే పాపం!" తనకు తెలుసన్నట్టు చెప్పింది కమలిని.
"ఓ నీలా! కాటుక రేఖలు తీర్చిన నీ సోగకన్నులను ఒక్క మారు అల్లన విచ్చి చూడవమ్మా! నీలాంటి సుగుణరాశికి తగినదేనా ఇది? భోగాలన్నీ విడిచి పల్లె కోసం, మాకోసం నోము నోచాము. నువ్వేమో హాయిగా కృష్ణుని కౌగిట ఒదిగి నిద్దరోతున్నావు. మా మొర వినబడదా? మాపై దయతలచి, నువ్వు ఒక్క అడుగు వేసేలోపు నీ విరహాన్ని క్షణమైనా భరించలేని అతడు నీ చెయ్యి పట్టి ఆపాడా.. ఏం?"
పలుకవా నళినేక్షణా
బదులైన
పలుకవా నవమోహనా!
పలుకవా రవ్వంత! పవ్వళింతువు గాని
కలికి చనుగవ పైని తలగడగ కేలూని
తళుకు దంతపుకోళ్ళ మంచమ్ము పై,
లలిత సురభిళ పంచ తల్పమ్ము పై,
ఒరిగి కప్పురపు దివ్వె వెలుగులో, అల నీల
నెరుల విరితావిలో, నిదురింతువే గాని!
గడెయైన విభుని ఎడబాయవు.
తడవైన గాని నిద్దుర లేపవు!
సొగసు కాటుక రేక సోగకన్నుల దాన!
తగదమ్మ నీ వంటి సుగుణవతికో చాన!
పలుకవా నళినేక్షణా!
"ఇంతలా మేలుకొలిపినా ప్రయోజనం లేదు! ఇంతేనా? మన వ్రతం నిష్ఫలమేనా?" ఉబికి వస్తున్న కన్నీళ్ళను కొనగోట చిదుముతూ దీనంగా అడిగింది సురభి. ఆమెను అక్కున చేర్చుకుంది ఆనందిని.
"వెర్రిపిల్లా! కన్నీళ్ళు పెడుతున్నావా? నీకిది తగదు సుమా! కృష్ణుడికి తెలియని సంగతి ఉంటుందా? లౌకికమైన ప్రయత్నం చెయ్యాలి కనుక మనం వచ్చి మేలుకొలుపులు పాడుతున్నామే కానీ.. "రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా! రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా!" జీవులను రక్షించేవాడు, ధర్మాన్ని నాలుగుపాదాలా నడిపించే వాడు, తన ధర్మమును, తన వారినీ కాపాడుకునే వాడూ ఆ రామచంద్రుడు. అని చెప్పలేదూ! అతను ఆడిస్తే ఆడే బొమ్మలం. నిరాశనీ, నిస్పృహనీ పక్కన పెట్టి చూడు. ఈ ప్రభాత వేళ కృష్ణుని మందిరం బయట నిలబడి అతని గుణసంపదను పాడే అదృష్టం రమ్మంటే వస్తుందా? రేపు మళ్ళీ వద్దాం. సముద్రాన్ని చేది పోయడమెంతో, ఆ పురుషోత్తముని గుణగానం చెయ్యడమూ అంతే! ఎన్ని పేర్ల పిలిచినా, ఎంత పొగిడినా తరిగేది కాదు." తన తీయని పలుకులతో సఖులకు ఊపిరూదింది ఆనందిని. వెనక్కి తిరిగి చూస్తూ, ఇంటిదారి పట్టారందరూ..
మేలుకో ఓ సిరీ! శాతోదరీ! - 20
సురభిళ సుమవల్లరులతో, నికుంజాలతో, బంగారు ఊయలలతో, స్పటికంలా మెరిసే నీటితో నిండిన తటాకాలతో ప్రకాశిస్తున్న పుష్పవనం దాటి నీల మందిరం చేరుకున్నారు గోపభామినులు. "ఏ క్షణమైనా తటాలున తలుపులు తెరచుకుని కృష్ణుడు వచ్చేస్తాడేమో!" అనే ఆశ వారి బేలకళ్ళలో నిండి ఉంది.
"శ్రీ కృష్ణా! ముల్లోకాలకూ దిక్కు నువ్వే! సకల చరాచర సృష్టికీ నాథుడవు నువ్వే! నీ చాలుబడి ఇంతా అంతానా? నీ పరాక్రమానికి పోలికే లేదు. అయితే మాకో అనుమానం! నీకు దేవతలే తప్ప సామాన్యులు కనబడరా? వారికి ఆపద వస్తే తక్షణం రక్షిస్తావు. నీ సుదర్శన చక్రాన్ని ఉపయోగించి దేవేంద్రునికి సింహాసనాన్ని గెలిచి ఇచ్చావు. "ఆకాశం పడిపోనీ, భూమి బ్రద్దలు కానీ, సముద్రము శుష్కించిపోనీ, హిమవత్పర్వతం ముక్కలైపోనీ.. నా మాట కల్ల కాదు." అని ఆశ్రితులకు అభయమిచ్చినవాడివి. ఋజువర్తనము మాకు నేర్పేవాడివి. మా కోసం నువ్వేమీ పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. నీ చిరునగవు మా ఈ కనులతో కరువుతీరా చూడనీ! అన్ని ప్రాణుల విషయంలోనూ సమదృష్టి కలిగి ఉంటానని చెప్పావు. అలాంటిది మమ్మల్ని నువ్వే చిన్న చూపు చూస్తావా? మేలుకో! బయటకు వచ్చి మా మొరాలకించు!"
మేలుకో శ్రీ కృష్ణ! మేలుకొనవేమీ!
చాలుబడి గల దేవ! మేలొసగు స్వామీ!
మున్నేగి ముప్పదియు మూడు కోటుల సురల
బన్నముల బాపు బలశాలీ! వనమాలీ!
వెన్ను దవిలి విరోధివితతికి వనటగూర్చి
చెన్ను తొలగించు ఆపన్నజనతావనా!
సమాధానం లేదు. ఉసూరని ఒకరినొకరు చూసుకున్నారు.
"నిన్న నీలను మనం నిష్టూరమాడిన మాటలు విని కన్నయ్య కోపం తెచ్చుకుని ఉంటాడా?" ఉన్నట్టుండి ప్రశ్నించింది సురభి. "ఏమో! అయి ఉంటుందా!" అని కలవరపడ్డారందరూ! పరుషవాక్యమేదైనా ధ్వనించిందేమో అని గుర్తు చేసుకున్నారు. "ఏమో! నోరుజారి ఏమైనా అనకూడదని మాట అన్నామేమో! నీలను విస్మరించి కృష్ణుని నేరుగా నిద్ర లేపామని ఆమెకు కోపమొచ్చి స్వామిని ఆపిందేమో!" అని భయపడ్డారు. ఆమెను ప్రసన్నం చేసుకోవాలని తలచి పిలువసాగారు.
"ఓ నీలా! అసితేక్షణా! నిద్ర లే! స్త్రీ హృదయం స్త్రీ కే తెలుస్తుందంటారు. లిప్తకాలం కృష్ణుని ఎడబాటు భరించలేని దానివి. మా విరహాన్ని నీకు వివరించి చెప్పాలా? మా పై జాలి కలగడం లేదూ! లోకాలేలే రేడుని కనుసన్నలలో మెలిగేలా చేసుకున్న దానివి. నీ ఆనతి లేనిదే మాకు ఒనరేదేమైనా ఉందా? ఒక్క సారి బయటకు రా! నీ సౌందర్యానికి కృష్ణుడే దాసుడయ్యాడు కదా! మా కన్నులతో ఒక్క సారి నీ హొయలు చూడనీ!" తేనెలొలికే పలుకులతో పిలుస్తున్న వారిపై కాస్త దయకలిగిందేమో నీలకి! చందువా తెరలు తొలగించి శయ్య దిగి, పసిడి మువ్వలు ఘల్లుమనేలా పదపల్లవాన్ని నేల మోపింది. ఆ సవ్వడికే పరమానందభరితులై గోప వనితలు ఇనుమడించిన ఉత్సాహంతో నీలను పిలువనారంభించారు!
"ఓ నీలా! కృష్ణుని ఇల్లాలా! నీ ఎరనెర్రని చిగురు పెదవి ఎంత కోమలంగా తేనెలురుతూ ఉండనిదే కృష్ణుడు నీ కొంగు విడవకుండా ఉంటాడు చెప్పు! నీ కలికితనం మా కన్నులతో చూడనీ! నిండైన చనుకట్టు కలదానివి. సింహ మధ్యమవి! నీ నలక నడుము అందం ఈ పూల తోటలో ఏ మంజరికీ అబ్బి ఉండదు! నీ సౌందర్యానికి పరిపూర్ణత కృష్ణ సంశ్లేషమే కదూ! అందమైన మాటకు అర్ధంలా, దివ్వెకు వెలుగులా, కుసుమానికి పరిమళంలా ఒకరినొకరు సంపూర్ణులను చేసుకోగలిగే వారే లక్ష్మీ నారాయణులు! యదుకుల మంగళ దీపం శ్రీకృష్ణుడు! ఆతని వెలుగువు నువ్వు! గోపకుల మంగళదీప రేఖా! మేలుకో! కురంగ నయనా! నీ కనులు విచ్చి మమ్మల్ని చూడు!"
పున్నమి జాబిల్లి లాంటి మోము కలదీ, తమ్మిరేకుల కన్నులదీ, అణువణువునా చక్కదనం ఒలికే చిన్నదీ.. కనులు తెరవగానే కృష్ణుని చూసే భాగ్యం దక్కిన ఐశ్వర్యవంతురాలు నీల నిదుర లేచింది. శింజినులు మ్రోగాయి. గాజులు గలగలమన్నాయి. 'నీలాతుంగ స్థనగిరి తటీ సుప్తుడైన' శ్రీకృష్ణుని నెమ్మదిగా తలగడపైకి చేర్చి, ఆపాదమస్తకమూ ఆతని మరొక్క మారు చూసుకుని శయ్య దిగి తలుపు తీసేందుకు కదలబోయింది.
మేలుకో ఓ సిరీ! శాతోదరీ!
మేలుకో ఓ నీల! పరిపూర్ణురాలా!
మేలుకో నవకిసలయాధరా!
కలశోపమపయోధరా!
బంగరు తలుపులు తెరచుకున్నాయి. పసిడి బొమ్మలా, పాలకడలి కన్న ముద్దుగుమ్మలా.. చిరునగవుతో, సిరి కనుల ముందు నిలబడితే ఇంక కావలసిందేముంది!
"సకియలూ! కుశలమేనా?" మధుస్వనానికి ఈ మధురిమ ఎక్కడిదీ? అందుకే ఈ నీల ఇంటితోటలో చేరి నేరుద్దామని వృధాప్రయాస చేస్తోందేమో!
"తూరుపు తెలవారక ముందే వచ్చి ముంగిట నిలచారు. ఏం కావాలో చెప్పేరు కాదు!"
అప్పుడే నిద్ర లేచినట్టు మాటలకు వెతుక్కున్నారు గోపకాంతలు. ఒకరివైపొకరు చూసుకుని "నువ్వంటే నువ్వని" గుసగుసలాడారు.
"నీలా! ఓ రాజాననా! నిన్ను చూస్తే చాలనిపిస్తోంది. కానీ నీ మేనిపరిమళానికి తోడై ఉన్న ఆ వనమాలా సౌరభం మాకు కర్తవ్యబోధ చేస్తోంది. మాకు కావలసినవి రెండు వస్తువులు. విసనకర్ర, అద్దము." చెప్పారు గోపబాలలు.
నీల నవ్వింది. లేలేత గులాబి రేకు అరవిచ్చినట్టు నవ్వింది. మువ్వ దొరలినట్టు నవ్వింది.
" చెలులూ! తప్పకుండా ఇస్తాను. ఇంత చలిలో ఇంత దూరం వచ్చినది ఆలవట్టమూ, అద్దమూ అడగడానికా! ఆశ్చర్యం!!" పాలుగారు నునుచెక్కిట ఎరనెర్రని చేయి చేర్చి వింతగా కనులార్పుతూ అడిగింది.
"నీకు ఈనాటి దాకా ఎప్పుడూ అనుభవంలోకి రానిదొకటి మాకు తెలుసు! అదే విరహం! గ్రీష్మంలో తపనుని కిరణాల గాడ్పు సోకినట్టుంది మాకు! నిదుర రాదు. మనసు కుదురు లేదు. యమునలో స్నానం తప్ప వేరే దారి కానరావడం లేదు. నీకు తెలిసే ఉంటుంది. మేము కాత్యాయనీ వ్రతం చేస్తున్నాం. నెలకు ముమ్మారు శ్రేష్ఠమైన వానలు పడాలని కోరుతూ నోము నోచాం. తెలవారక ముందు యమునలో స్నానమాచరిస్తున్నాం. కానీ ఆ మంచు కంటే చల్లని యమున నీళ్ళు సైతం మా విరహ తాపాన్ని చల్లార్చలేకపోతున్నాయి. స్నానం చేసి ఒడ్డుకు చేరే లోపు మళ్ళీ చెమటలు! తాపం!! అందుకని మాకొక విసనకర్ర కావాలి." చెప్పింది సురభి.
"అవునా! ఎంత బాధ పడుతున్నారు! అయ్యో! తప్పకుండా ఇస్తాను. మీ తాపాన్ని చల్లార్చే మార్గం ఉందంటే నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను. ఇంతకీ అద్దం దేనికి?"
"నీలా! అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటే మాకు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు! మాతో సర్వకాల సర్వావస్థలయందూ ఉన్నాడని ధీమా కలుగుతుంది. అందుకని మాకు అద్దం కావాలి."
"అయ్యో! వెర్రి అమ్మాయిలూ! ఎంత బాధపడుతున్నారు! మీకెంత ప్రేమ! ఇంతమంది హృదయారవిందాలలో కొలువున్న కృష్ణుడెంత భాగ్యశాలో అనిపిస్తోంది! తప్పకుండా అద్దం కూడా ఇస్తాను. ఇంకా ఏమైనా ఇవ్వగలదానినా? మొహమాటపడకుండా అడగండి. మీలో ఒకతెనని తలచి అడగండి." చెరగని స్వఛ్చమైన నవ్వుతో అడిగింది నీల.
ఒకరి ముఖాలొకరు చూస్కున్నారు. ఒక నిర్ణయానికి వచ్చి అడిగేసారు.
"ఓ నీలా! మాతో కృష్ణుడిని స్నానానికి పంపు."
"కృష్ణుడినా!"
"అవును! మావి లౌకికమైన కోరికలని తలచకు! తప్పు పట్టుకోకు! "హరిసరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్నః ఖేదమద్యత్యజామి!" "హరి" అనే సరస్సులో స్నానమే ఈ సంసార తాపాన్ని తగ్గించగలిగినది. ఈ బాధకు విరుగుడు హరి సామీప్యమే! కృష్ణుని చెంత ఉండడమే! ఆ కృష్ణునితో కలిసి స్నానం చేస్తే మా తాపం తగ్గుతుందని ఆశ!
ఆలవట్టము, అద్దమొసగి నీ స్వామిని
ఆలసింపక పంపవమ్మ నీరాడ!" చెప్పారా గొల్ల పిల్లలు.
"సరే! మీకు నేను ఇవ్వగలిగిన వస్తువులు ఇస్తాను. కృష్ణుని ఇవ్వగలిగేంతటి దాన్ని కాదు. ఒక కౌగిట బందీయై ఉండేవాడు కాదని మీకూ ఎరుకే కదా! నేనూ మీలాంటి దాన్నే. నిదురపోతున్న కృష్ణుని వెళ్ళి తట్టి లేపగలిగేదాన్ని కాను. మీతో కలిసి కమ్మని పాటలతో మేలుకొలుపు పాడే భాగ్యం నాకూ పంచండి. రేపు తెలవారకనే రండి. నేనూ మీతో కలిసి కృష్ణునికి సుప్రభాతం పలుకుతాను." చెప్పింది నీల.
"సరే! తెలవారక ముందే వస్తామని, ఆమెను బయటకు వచ్చి ఉండమని" వేయి సార్లు చెప్పి ఆనందంగా ఇళ్ళకు మరలారు అందరూ! సౌందర్యాధిదేవతలా అలరారుతున్న నీల చెంత లేనందుకైనా కృష్ణునికి తెలివి వస్తుందని వారి నమ్మకం!
మధుస్వనానికి మరియు ఆలవట్టమూ తేడా వివరించగలరు. ఈ రెండో మాట తెలుగా లేక సంస్కృతమా?
మధుస్వనమంటే కోకిల. ఆలవట్టమంటే గుడ్డతో చేసిన గుండ్రటి విసనకర్ర. పాత సినిమాల్లో చూస్తాం కదా! అదన్నమాట. ఆలవట్టము సంస్కృతం నుండి వచ్చినదేనేమో! పదం పుట్టుక తెలియదండీ!
మధుస్వనమంటే కోకిల. ఆలవట్టమంటే గుడ్డతో చేసిన గుండ్రటి విసనకర్ర. పాత సినిమాల్లో చూస్తాం కదా! అదన్నమాట. ఆలవట్టము సంస్కృతం నుండి వచ్చినదేనేమో! పదం పుట్టుక తెలియదండీ!
నందుని గారాల నందనా! మేలుకో! - 21
నీలి ముంగురులు గాలికి చెదిరి, వారి ముఖబింబాలకు వింత సోయగాలను అద్దుతున్నాయి. కెమ్మోవులపై చిరునవ్వులు చిందులు వేస్తున్నాయి. పైట చెంగులు గాలికి రెపరెపలాడుతూండగా గోపకాంతలు పరుగుపరుగున నీల మందిరాన్ని చేరారు. నీల చిరునవ్వుతో ఆహ్వానించింది. స్వామి ఇంకా నిద్దురపోతున్నారన్నట్టు సైగ చేసింది.
"నీలా! నువ్వు మాతో ఉన్నావు కనుక మాకింక భయమేమీ లేదు. కృష్ణుని ఇట్టే నిద్ర లేపుతామని" ధీమాగా పలికారు గోపికలు.
"సరే! వర్షాకాలంలో గుహలో నిద్దురపోతున్న సింహం వలే నిద్రపోతున్న స్వామిని, యోగనిద్ర నుండి నిద్ర లేఫడం బ్రహ్మాదులకే ఒకంతట సాధ్యమైన కార్యం కాదు. అలాంటిది మనం పూనుకున్నాం. ప్రయత్నిద్దాం!" అని చిరునవ్వుతో బదులిచ్చింది నీల. ఆ మాటలకు ఒక్క సారి పాలపొంగు పై నీళ్ళు చిలకరించినట్టు గోపతరుణుల ఉత్సాహం తగ్గింది.
"నిజమే కదూ! 'కృష్ణుడు మాతో కలిసి ఆడాడు, పాడాడు' అనే గర్వంతో అతని సామాన్యుడని తలచి, ఇంకా నిద్దురలేవడం లేదేమని వాపోతున్నాం! మహర్షులకు, యోగసాధకులకు, ఇంద్రాది దేవతలకు చేతకాని పని మా వల్ల అయ్యేనా? వేదవేద్యుడు! అతని కొంగున కట్టుకోవాలని సంకల్పించి నోము నోచుకున్నాం. ఇది జరిగే పనేనా!?" ఇలా సందేహాలతో వారి మనసులు కలవరపడసాగాయి. నీల నవ్వుకుంది.
"చెలియలూ! మీకు స్వామి చిన్ననాటి ఊసులన్నీ తెలుసు. బ్రహ్మగర్వాన్ని భంగపరచిన వృత్తాంతం తెలుసునా?" అని ప్రశ్నించింది.
"లేదు లేద"న్నారు గోపికలు.
"సరే! ఆలకించండని" ఓ ఊయలలో తను కూర్చుని ఎదురుగా ఉన్న తిన్నెలను చూపించింది. కోకిల కంఠంతో నీల చెప్తున్న కథను వినసాగారు గోపబాలలందరూ!
"కొండచిలువ రూపంలో వచ్చి ఆలమందలను, గోపబాలురనూ మింగిన అఘాసురుని నోటిలో కృష్ణుడు ప్రవేశించి, క్షణక్షణానికీ పెరుగుతూ ఆ కొండచిలువ నోటిని చీల్చిన విషయం మీకెరుకే కదా!"
"ఊ.. తెలుసు! తెలుసు!"
"ఆ తరువాత.. ఒకనాడు గోవులను మేఫుతూ చెలికాండ్రతో ఆటలాడుతున్న గోపకిశోరుడిని చూసి, చతుర్ముఖ బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. "ఇంత సామాన్యంగా కనిపిస్తున్న ఈ నల్లపిల్లాడు.. భయంకరమైన కొండచిలువ నోట చిక్కిన తన నేస్తాలనూ, ఆలమందలనూ ఎలా విడిపించుకు పోయాడు? నెత్తిన నెమలిపింఛమూ, మెడలో ముత్యాల పేర్లూ వేసుకుని, కొండ గోగుపూల మాలలు, తులసి దండలూ చుట్టుకుని, ధూళి ధూసరితమైన ఒంటితో, ఒక చేత్తో పిల్లనగ్రోవిని ధరించి, మరో చేత్తో చల్దిముద్ద పట్టుకుని పరుగులు పెడుతున్న ఈ గొల్లపిల్లాడు అంత శక్తిశాలా? సరే! పరీక్షిద్దా"మనుకున్నాడు. కన్నయ్య నీరు త్రాగడానికి ఓ కొండవాగువద్దకు వెళ్ళిన సమయంలో ఆలమందలనూ, గొల్లపిల్లలనూ దొంగిలించి తన మాయతో ఓ కొండగుహలో బంధించివేసాడు."
"అవునా!!"
"ఊ.. అవును! వెనక్కి వచ్చిన కృష్ణునికి తన వారెవ్వరూ కనిపించలేదు. గోవులూ కనిపించలేదు. నవ్వుకున్నాడు కన్నయ్య. తానే గోవులయ్యాడు. తానే తన తోటి గోపబాలురయ్యాడు. అన్ని రూపాలూ తానే ధరించాడు. ఇంటికి వెళ్ళాడు. గోవులు క్షీరధారలు కురియనారంభించాయి. పెయ్యలు తాగినవి తాగగా, పిదుకనవసరం లేకుండా పెట్టిన కడవ పెట్టినట్టు నిండిపోసాగింది! ఏ పిల్లాడిని హత్తుకున్నా వారివారి తల్లులకు పట్టలేని ఆనందం కలిగేది. అక్కడున్నది సాక్షాత్తూ కృష్ణుడేనాయె! రేపల్లెలో మునుపు లేని ఆనందమేదో ఆవరించింది. పిల్లలందరూ మునుపటివలే మామూలుగా ఉండసాగారు. ప్రతి ఉదయం కృష్ణునితో కలిసి ఆలమందలను అడవిలోకి తీసుకుపోయి మేపి, ఇళ్ళకు చేరేవారు. అన్నీ యధాతథంగా జరిగిపోతున్నాయి.
ఇలా ఒకరోజు, రెండు రోజులు కాదు. ఏడాది గడిచింది! ఒక్క బలరామునికి తప్ప వేరెవరికీ జరుగుతున్నది పసిగట్టే శక్తి లేదు. మనుషులకు ఒక యేడాది అంటే బ్రహ్మకు లిప్త కాలం. రేపల్లెలో ఏమవుతోందోనని చూసిన బ్రహ్మకు అంతా మామూలుగా కనిపించింది!! కృష్ణుడు తన చెలికాండ్రతో చల్దులారగిస్తున్నాడు. పశువులు నీడను పరుండి నెమరు వేస్తున్నాయి. ఇది వరకు లేని అందమేదో ఆ అడవి అంతా కమ్ముకుంది. మనోజ్ఞమైన తరువులతో, ఫలాలతో వంగిన కొమ్మలతో, మనోహరమైన పుష్ప సంపదతో నందనవనంలా ఉందా కాననం! ఏమీ అర్ధం కాక బ్రహ్మ తను గోవులనూ, గోపాలకులనూ దాచిన గుహలో చూసాడు. అక్కడ వారందరూ తన మాయకి బధ్ధులై నిద్రపోతున్నారు!
అడవిలో ఎటుచూసినా పరుగులు పెడుతూ ఆడుతూ, నవ్వుతూ గొల్లపిల్లలే! తరచి చూద్దుడు కదా.. గోపాలకులందరూ నీలమేఘశ్యాములయ్యారు. నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళు పురివిప్పి నాట్యమాడసాగాయి. పుష్పవర్షం కురవసాగింది. ఆ బాలురందరూ హారాలతో, కిరీటాలతో, కుండలాలతో, బంగారు అంగుళీయకాలతో, వనమాలికలతో వెలుగొందసాగారు. అందరికీ నాలుగు చేతులు! శంఖ చక్రాలతో గదలతో కమలాలతో నిండి ఉన్నాయి. వక్షస్థలంపై శ్రీవత్సపు చిహ్నమేర్పడింది. పసుపుపచ్చని పట్టు వలువలతో, తెలి వెన్నెల నగవులతో అందరూ శ్రీమన్నారాయణులవలే కనిపించసాగారు! హంస వాహనమెక్కి అవనీతలంపై నిలచిన బ్రహ్మ తన శిరస్సులు వంచి కృష్ణునికి మొక్కాడు. "పరాత్పరా! నీ మాయ ఎరుగని వాడనై, నీ శక్తినే శంకించి నిన్ను పరీక్షిద్దామనుకున్నాను. నువ్విచ్చిన పదవే నాకు గర్వాన్ని తలలకెక్కేలా చేసింది. నేను సృష్టికర్తననుకున్నాను. నన్ను సృష్టించినది నువ్వేనని విస్మరించాను. నీ మోహన రూపం చూసిన నా భాగ్యం ఏమని చెప్పను! క్రొక్కారు మెరుపుతో మేళవించిన మేఘం వలే, ఈ పసుపుపచ్చని ఉత్తరీయం ధరించి వెలుగుతున్నావు. నీ చెవులకు గురివిందలు పొదిగిన కుండలాలు ఎంత రమణీయంగా ఉన్నాయో! నెమలిపింఛంతో ఒప్పారుతున్న నీ నీలాల కురులు చూసిన కొద్దీ మోహాన్ని కలుగచేస్తున్నాయి. వనమాలికలతో అలరారే మనోహరమైన వక్షస్థలముతో, కెందామరల వంటి కరచరణాలతో నీ రూపం.. ఆపాదమస్తకం ఎన్నిమార్లు చూసినా తనివి తీరకున్నది. ఏమి పుణ్యము చేసుకున్నానో!" అని కృష్ణునికి నమస్కరించాడు. మాయను ఉపసంహరించి గోపబాలులను, ఆలమందలనూ కృష్ణునికి అప్పచెప్పాడు.
"అప్పుడేమయింది!?"
"ఏమవుతుంది. మాయ కమ్మిన బాలురకు ఏ మాత్రం తేడా తెలియనివారై మామూలుగా కృష్ణునితో కలిసి మెలగసాగారు. మలిసంజె వేళయిందని ఆలమందలను వాటి ముద్దు ముద్దు పేర్లతో
రా పూర్ణచంద్రిక రా గౌతమీ గంగ రా భాగీరథరాజతనయ
రా సుధాజలరాశి రా మేఘబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి
రా మనోహారిణి రా సర్వమంగళ రా భారతీ దేవి రా ధరిత్రి
రా శ్రీమహలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి
అని మురిపెంగా పిలుస్తూ ఆలకాపరి, నేస్తాలతో కలిసి రేపల్లెకు చేరాడు."
"అలా బ్రహ్మకు గర్వభంగం చేసాడన్నమాట! మాకు తెలియదే!" ఆశ్చర్యపోయింది సురభి. అందరి కళ్ళలోనూ అదే ఆశ్చర్యం.
"అవును. మరి దేవేంద్రుని గర్వమణచడం మీకు తెలిసిందే!"
"ఓ.. తెలుసు! చెరువుల్లో, నదుల్లో నీరు తాగిన మేఘాలను అడ్డి, వర్షం కురిపించేది గోవర్ధన గిరేనని, పూజలు దానికే జరగాలని చెప్పాడు కృష్ణుడు. అలాగే చేసామని ఇంద్రుడు కోపగించి ఉరుములూ, మెరుపులతో బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు!" కళ్ళు వెడల్పు చేసి చెప్పింది తరళ.
" ఏనుగులు తొండాలతో జలధారలు చిమ్ముతున్నట్టే! ఏం భీభత్సమైన వర్షమసలు! ఆలమందలనూ, గోపాలకులనూ కాపాడేందుకు గోవర్ధన గిరిని అమాంతం పైకెత్తి, చిటికెన వేలిపై నిలిపాడు కృష్ణుడు!! భయం లేదని నవ్వుతూ పిలిచాడు. ఆ నవ్వులో ఏం మాయ ఉందో! పరుగున వెళ్ళి తలదాచుకున్నాం."అంది కమలిని.
"కృష్ణుడికి తోడుగా మా తాత ములుగఱ్ఱ కొండకి దన్ను పెట్టాడులే!" నవ్వింది సురభి.
"దేవేంద్రుడు ఏడు రోజులకు తెలుసుకున్నాడు! పరుగున వచ్చి "సచ్చిదానంద రూపా! గోవర్ధన గిరిధారీ!" అని పాదాల మీద పడ్డాడు." గర్వంగా చెప్పింది కమలిని.
"అంతేనా! ఆషాఢ మాసం మొదలుకుని రెండునెలలు తనకూ, రెండు నెలలు కృష్ణుడికీ పూజా ఫలం దక్కేలా ఒప్పందం చేసుకున్నాడు. కృష్ణుడు ఉపేంద్రుడయ్యాడు!" సంబరంగా చెప్పింది తరళ.
"బ్రహ్మేంద్రాదులకు సైతం పూజ్యుడు శ్రీ కృష్ణుడు. వేద ప్రమాణానికి మాత్రమే గోచరమయ్యే పరంజ్యోతి స్వరూపుడు. అలాంటి వాడు మనతో మన మధ్య ఉన్నాడంటే, ఎన్ని జన్మలు బంగారు పువ్వులతో పూజలు చేసి ఉంటాం!" అంది నీల.
"నిజమే! ఓ శ్లోకం, ఓ వేదపాఠం ఏదీ తెలియని వెర్రి గొల్ల పిల్లలం! మాకు దక్కే భాగ్యమా చెప్పు! మాకేం చేతనవును!" మళ్ళీ నిస్సహాయత కమ్మేసింది అందరినీ.
"నేను చెప్పేదీ అదే! జపతపాలకు లొంగనివాడు ప్రేమకు లొంగుతాడు. మీ వద్ద ఉన్నదదే!"
"లేదులే నీలా! ఏదో మా వెర్రిగానీ!"
"మహర్షులు సైతం ఎదురుగా కనిపించిన కృష్ణస్వామి కమనీయ రూపానికి వివశులైపోతారట! "జపమముంచత. హోమమముంచత. తపమముంచత..!" అని జపం, తపం, హోమం అన్నీ వదిలి రెప్పవేయకుండా ఆతనిని చూస్తూ పరవశులైపోతారట. అది తప్పు కాదు. భగవదారాధనలో అతి ప్రధానమైన మార్గం ప్రేమ. గోపికల ఆస్తి అదే!" అని చెప్తున్న నీల వైపు అపనమ్మకంగా చూసారు అందరూ.
"నమ్మరా? రాముడి వెంట అడవులకు వెళ్ళి, అన్నకు నీడలా మసలుకున్న లక్ష్మణుడు ఏ జపమాచరించాడు? ఏ హోమం చేసాడు? మాధవుడు ప్రేమకి మాత్రమే కట్టుబడేవాడు." చిరునవ్వు వెన్నెలలు కురిపించింది నీల.
"నువ్వే మార్గ దర్శకురాలివి! స్వామిని నిద్ర లేపేందుకు ఏం చెయ్యాలో చెప్పు!" గోపికలు అడిగారు ఏకకంఠంతో.
"పిలవండి. మనసారా పిలవండి. అన్ని శంకలూ మాని పిలవండి. అరిషడ్వర్గాలు అంటని "శుధ్ధ సత్వరూపం" పరమాత్మ! మానవ రూపంలో ఉన్నా ఆయనని కామక్రోధాలు అంటవు. లోభమోహాలు సోకవు. మదమాత్సర్యాలు చేరవు. మనమూ వాటిని విడిచి పిలిస్తే పలుకుతాడు." వారి మనసులో మిగిలి ఉన్న సంశయాన్నీ, బాధనూ తొలిగించింది. నిష్కల్మషమైన మనసుతో కృష్ణుని ముంగిట నిలచి పాడసాగారందరూ!
బంగరు కడవల నిండా పాలు
పొంగి పొరల కురిపించే ఆలు
చాల కలుగు నందుని గారాల నందనా!
ముని హృదయస్యందనా!
వైకుంఠమ్ము విడిచి, లోక
లోకమ్ములు కడచి
మాకోసము దిగివచ్చిన స్వామీ! మేలుకో!
మేలుకో తేజోమయ! నీలాప్రియ! మేళుకో!
మేలుకో భక్తాశ్రితపాళీ సరసిజహేళీ!
వైరులు నీ శౌర్యమ్మునకోడి!
సైరింపక, నీ వాకిట కూడి,
బీరమేది శ్రీపదముల
వారల కొలిచే తీరున,
చేరి మంగళాశాసన
మును చేసి, ముదమ్మున కై
వారమ్ములు చేసి, వచ్చి
నార మయ్య, నిదురమాని మేలుకో!
కృష్ణుడు నిద్రలేవలేదు. అలికిడి చేయలేదు. పిలుపు విని పలుకలేదు.
"కృష్ణా! నందనందనా! నందుని వద్ద ఎన్ని కడవలైనా నింపే క్షీరధారలు గల ఆలమందలు వేలకు వేలున్నాయి. అది నీ మహిమే కదూ! మాకోసం ఎంత భోగ్యమైన వైకుంఠాన్ని వదిలి వచ్చావు! నీ దయ అపారం! తేజోమయా! నీలాప్రియా! మేలుకో! నిన్ను చూడాలని మా మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీ శౌర్యానికి ఓడి నీ ముంగిట నిలచిన శత్రువులను సైతం కాపాడే వాడివి. నువ్వే శరణమన్న విభీషణుడిని కాచావు. యుధ్ధభూమిలో విల్లు విరిగి నిలబడిన రావణుని దయతలచి, రేపటి దాకా సమయమిస్తున్నానని కరుణించి మరొక అవకాశం ఇచ్చావు. అంత దయామయుడివి! మాలాంటి గొల్లలకు ఇంత పరీక్ష ఎందుకు పెడుతున్నావో? నిన్నటి వరకూ మేము బాధతో అల్లాడుతున్నామనుకునే వారం. ఈ బాధలో తీపి ఈనాడు తెలిసొచ్చింది. మాదెంత పున్నెమో అర్ధమయింది. కృష్ణుడే మా వద్దకు వస్తాడనుకునే వారం. కానీ స్త్రీలమనే భావన కూడా విడిచి నీకోసం పరుగున వచ్చాం. ఇంక ఆగలేక వచ్చాం. నిన్ను చూడాలి. నీ సాన్నిధ్యం కావాలి. అనే కోరికతో వచ్చాం. మేలుకో!" అని పిలిచారు. ఎదురు చూసి చూసి "సరే! నిద్రపో! రేపు మళ్ళీ వస్తామని" వెనక్కి మరలారు.
"అయ్యో! ఇళ్ళకు వెళ్ళిపోతున్నారా?" అని జాలిపడింది నీల.
"నీలా! మహా లక్ష్మీ! నీ నోట మాధవుని గుణగానం విన్నాం. మాకది చాలు. రేఫు వస్తాం. రిక్కలనైనా లెక్కించవచ్చు. ఇసుక తిన్నెలో రేణువులెన్నున్నాయో గణించవచ్చు. సముద్రంలో నీటి బిందువులెన్నో కనుక్కోవచ్చు. ఆ పరంజ్యోతి, పరమపురుషుడు, కృష్ణుని సుగుణ గణన ఎవరి తరం?! ఎన్ని కథలు చెప్పుకుంటే కరువు తీరుతుంది! ఎన్ని పాటలు పాడితే తనివి తీరుతుంది! ఈ భాగ్యం కోసం ఎన్ని మార్లైనా వస్తాం. సెలవు!" అని వెనుదిరిగారు గోపవనితలు. తృప్తిగా నవ్వుకుంది నీల. వారి మనసులో సంశయం లేదు. బాధ లేదు. ఉన్నది ప్రేమ ఒక్కటే!
ఒక్క కనుకొస చూపే చాలును.. చాలును! - 22
రాయంచ నడకలతో నీల మందిరాన్ని చేరుకున్నారు గోపికలు. వారి ముఖాలు దీపకళికల్లా మెరుస్తున్నాయి. చూపులు నిబ్బరంగా ఉన్నాయి. కృష్ణుని శయన మందిరం వెలుపల నిలిచి కలకోకిలలు బృందగానం చేసినట్టు పలుకుతున్నారు.
"కృష్ణా! గోపాల చూడామణీ! ఈ పొద్దు లోకమెంతో అందంగా కనిపిస్తోంది. వద్దన్నా ఆగని చిరునవ్వు మా పెదవులపై చిందులేస్తోంది. ఇంత ప్రశాంతత ఇంతకు మునుపు మేమెరుగము. "పురుషుడే తన వద్దకు రావాలి" అని తలచుట స్త్రీస్వభావం. లోకతీరు. కానీ, మాకెందుకో అలా అనిపించడం లేదు. స్త్రీ సహజమైన బింకం వదిలి నీ వాకిట నిలచాం. నువ్వు పురుషోత్తమునివి. నిన్ను చేరేందుకు తపన పడని ప్రాణి ఏది?
మహా పరాక్రమవంతులు, అపరిమిత ఐశ్వర్యవంతులూ, లెక్కకు మిక్కిలి గజ తురగ పదాతి దళాలున్న మహరాజులూ సైతం నీ ఆధిపత్యం ముందు ఓడి తీరవలసినదే! నీ సింహాసనం ముందు తలవంచి నిలబడవలసిందే! వారి కిరీటాలలో ఉండే రతనాల వెలుగులో మెరిసే నీ పదకమలాల సౌందర్యానికి దాసులం! "నీవే తప్ప ఇతఃపరంబెరుగమని" మేమూ ఆ రాజులందరి వలే నీ పాదాల వద్దకు వచ్చి నిలచాం. నువ్వు తప్ప వేరే దిక్కు లేదని తలచి నీ ముంగిట నిలచాం. నిదుర లే! మేలుకుని బయటకురా!
కృష్ణా! అనంగుని అయ్యవు నువ్వు! నవమోహనాకారుడవు! నిన్నేమని వర్ణిస్తే మాకు తృప్తి కలుగుతుంది? పోలికకు అందే అందమా నీది! మాలో ఎన్నో అందమైన ఊహలు మెదలుతున్నాయి. నీ నయన సౌందర్యం చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీ కనులు ఎంత అందమైనవో తెలుసా, కృష్ణా! వేకువ ఝామున కొలనులో విచ్చుకోడానికి సిధ్ధమవుతున్న తమ్మిపూవులను చూస్తే మాకు నీ కనులే గుర్తొచ్చాయి. ఎంత లలిత లలితంగా వికసిస్తున్నాయో! మంచు బిందువుల తాకిడికి ఒక్కో రేకూ సుకుమారంగా విచ్చుకుంటూ "ఇంకా తెల్లవారలేదే!" అని సంశయిస్తూ, మువ్వ విచ్చుకున్నట్టు విరియబోతున్న ఆ తామరల సౌందర్యం చెప్పనలవి కాదు! మా పిలుపు విని, నువ్వు నీ రాజీవలోచనాలను నెమ్మదిగా విప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, నిదుర జాడలు వీడని నీ కళ్ళు కెంజాయ అలదుకొని అలాగే ఉంటాయేమో అనిపించింది. నీ కనుల చక్కదనాన్ని తలచుకుంటే చాలు.. మా మేను పులకాంకితమవుతోంది.
పుండరీకాక్షా! నీ కనులను పోల్చేందుకు పోలిక ఈ సృష్టిలోనే దొరకదు మాకు! నీ కనుల వంటివి నీ కనులే!! కానీ, మా వెర్రి కాంక్ష కొద్దీ పొగుడుతాం, పోలుస్తాం, కలువల్లో నీ కనుల పోలిక వెతుక్కుంటాం. ఎరనెర్రని తామరలతో పోల్చామని నీ చూపులు ఎర్రనివి కాదు సుమా! వెన్నెల కంటే చల్లగా ఉంటాయి. హాయి డోలలూపుతాయి. అరులకు ప్రచండ భానుడివి. సఖులకు సోముడివి. నీ వెన్నెల చూపుల తానాలాడాలి. మా తాపం తీరిపోవాలి. మేలుకో కృష్ణా! మమ్మల్ని చూడు..
ఏదీ! ఏదీ! నీ దయా వీక్షణము!
ఇంచుంచుక పరపుము మాపై మాపై
చిరుగజ్జెలవలె విరిసే ఎరనెర్రని తామరల
తెరగున వికసించే ఆ కెంజాయ కందోయి
అందమగు ఈ లోకమందలి ఏలికలు
అందరును మానాభిమానములు వీడి
సుందరము నీ గద్దెక్రింద బృందములైన
చందమున, నిలుచు మా డెందములు చల్లబడ!
ఒక్క కనుకొస చూపే చాలును చాలును-
పాపముల పరిమార్పను!
ఒక్క కనుకొన ప్రాపే చాలును చాలును
తాపముల చల్లార్పను
ఏదీ ఏదీ! నీ దయా వీక్షణము
ఇంచుంచుక పరపుము మాపై, మాపై!
కృష్ణా! కృపాజలనిధీ! నీ దయ అపారం. ఆ దయతో ఒక్క సారి మమ్మల్ని చూడు చాలు! ఒక్క కనుకొస చూపు చాలు. మా జన్మ జన్మల పాపాలు మాయమైపోతాయి. శబరి నీ చూపు సోకి పునీత అయింది. అహల్య నీ పాదస్పర్శతో శాపాన్ని పోగొట్టుకుంది. నిన్ను శరణు కోరిన విభిషణుడు శత్రువర్గం వాడయినా కాచావు. కాకాసురుడో! కలికి సీతను గాయపరచాడని కోపంతో బాణమే వేసావనుకో! ముల్లోకాల్లో వాడికి దిక్కేదీ? తిరిగి తిరిగి అలసి సొలసీ నీ చరణమే శరణన్నాడు. వాడినే చంపకుండా, కన్ను మాత్రం పొడిచి శిక్షించి వదిలి పెట్టావు. మాపై ఇంకాదయ రాలేదా! మేలుకోవా?"
ఎంత పిలిచినా పలకని కృష్ణుడిపై వారికి కోపం రాలేదు. తమకి ఇంకా ఈ ఎడబాటు ఎందుకు రాసి ఉందో అనుకున్నారు. 'ఇంకా ఏ కర్మ ఫలం మిగిలి కృష్ణుడికి దూరంగా నిలబడేలా చేసిందో!' అనుకున్నారు. "మనమేం చెయ్యగలం! అతనిదే బాధ్యత.. కన్నయ్యే దిక్క"ని అనుకుని వెనక్కి మరలబోతూ ఆగారు. ఇంకొక్క మాట చెప్పి వస్తానని సురభి తలుపు వద్దకు వెళ్ళి చెప్పింది.
"కృష్ణా! నువ్వే వస్తావని ఎదురు చూసాం. ఎందుకు రాడని అలిగాం. పిలిస్తే పలకడేమని నిందలు వేసాం. అవన్నీ కాదు. మా అహంకారాన్నీ, అభిమానాన్నీ విడిచి వచ్చాం. దురభిమానంతో తప్పించుకు తిరుగుతున్న మా పై నీ ప్రేమ అనే మత్తుమందు చల్లావు. నీకు బానిసలను చేసుకున్నావు. అన్ని మెట్లూ ఎక్కివచ్చాం. ఇంక నువ్వే దిక్కు. రేఫు వస్తాం. నిద్ర లేపుతాం."
మంత్ర ముగ్ధల్లా, యోగినుల్లా వెనుతిరిగిన ఆ గోపకాంతలు రేపటి కోసం ఎదురుచూస్తున్నారు.
సింహము వలె నడచిరా! - 23
యమున ఒడ్డున కాత్యాయనికి పూజ చేసి, హారతులిచ్చి, కృష్ణుని మేలుకొలిపేందుకు బయలుదేరిన గోపకాంతలు విచ్చిన పువ్వుల్లా కళకళలాడుతున్నారు. శుకపికాలకే ముచ్చట గొలిపేలా, కిలకిలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ కోలాహలంగా వెళ్తున్నారు.
"సురభీ! ఎంత హాయిగా ఉందో ఈవేళ! నీకూ అంతేనా?" అడిగింది కమలిని.
"ఓ..!"
"ఈ రోజు కృష్ణుడు మేలుకొంటాడేమో! బయటకు వచ్చేస్తాడేమో! శుభ సూచనలు కనపడుతున్నాయి." నవ్వింది కమలిని.
"అప్పుడేనా! ఈ విరహాగ్ని ఎంత హాయిగా ఉందో! ఈ ఎదురుచూపులే ఎంత బాగున్నాయో కదా!" అంది సురభి.
"అయ్యో! అలా అంటావేం చెలీ!" వారించింది తరళ.
"ఏమో! నాకు అలాగే అనిపిస్తోంది." అడిగింది సురభి.
"నీదే భారం, నేను నీవాడిని" అన్న విభీషణుడికే కాస్త ఎదురుచూపు తప్పలేదు. అయితే తనని కాపాడే భారం రాముడి భుజాలపైకి నెట్టేసాక అతనికి చింత ఏల? మనమూ అంతే."ఆనందిని నవ్వింది.
"విభీషణుడు పిలవగానే వినలేదా రాముడు?" సందేహం వ్యక్తపరిచింది కమలిని.
"హ్మ్.. ప్రతీ పనికీ ఒక పధ్ధతి ఉంటుంది కదా! వారధి నిర్మించి వారాశి దాటి లంకను చేరిన రాముని శరణు కోరాలని వచ్చాడు విభీషణుడు. "రాఘవుని శరణు కోరి వచ్చాననీ, తన వారందరినీ విడిచి వచ్చాననీ" చెప్పాడు."
"ఊ.. "
"శత్రువు తమ్ముడు మనకు మిత్రుడెలా అవుతాడని" రాముడిని లక్ష్మణుడు, సుగ్రీవుడు తదితరులు అడ్డుకున్నారు. వారికి నచ్చచెప్పాడు రాఘవుడు. "అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ!" అని దృఢంగా చెప్పాడు. ఆపై విభీషణుని తనవాడిని చేసుకున్నాడు. అదే పురుషోత్తముని సౌలభ్యం!"
"మరి మనమో!"
"మనమూ పధ్ధతి పాటించాము. ఆచార్యుని వంటి నందగోపుని ఆశ్రయించాం. మంత్రం వంటి యశోదని ఉపాసించాం. భాగవతుడైన బలరాముని సహకారం తీసుకున్నాం. ఆ పై పురుషకార భూతురాలైన దేవేరి "నీల"ను ప్రసన్నురాలిని చేసుకున్నాం. ఇక మిగిలినది మన పని కాదు.. ఆయనదే!"
"ఇంత చేసామా! ఆశ్చర్యంగా లేదూ!"
"తప్పు! మనం చెయ్యలేదు. మనకు పరోక్షంగా దిశానిర్దేశం చేసినది కృష్ణుడే! లేకపోతే మనకిన్ని తెలివితేటలెక్కడివీ!"
"అవును, ఆనందినీ! అయితే ఈ రోజు కృష్ణుని చూడగలమా!" ఆశగా, సంబరంగా అడిగింది కమలిని.
"ఊ.. ఇకనో, ఇప్పుడో!" ఊరించింది ఆనందిని నవ్వుతూ!
"అవునా! నాకు ఆనందంతో ఊపిరాడడం లేదు." ఉరకలు వేస్తున్న సంబరం అందరి ముఖాలలో.
"కృష్ణుడిని సింహగతితో నడిచి రమ్మని కోరుదాం." చెప్పింది ఆనందిని.
"సింహగతా? ఏమిటది?"
"వానకారులో వేట మాని గుహలో నిద్దురపోతున్న మృగరాజు ఎలా నిద్ర లేస్తాడో, అలా లేచి రమ్మందాం. అదిగో వచ్చేసాం. పదండి.." మందిరపు మునివాకిట నిలిచారందరూ.
"కృష్ణా! నువ్వు రావణుడనే గంధగజం పాలిటి రాఘవ సింహానివి. ప్రహ్లాదుని కాచిన నృహరివి! వర్షాకాలంలో కొండగుహలో నిదురిస్తున్న సింహం వలె యోగ నిద్రలో ఉన్నావు. సృష్టి చింతనలో ఉన్నావేమో! మా మొరాలించి ఇకనో, ఇప్పుడో నిద్రలేచి వస్తావు. మాకు అది తెలుసు. తెలివి రాగానే టక్కున పైకి లేచి, చరచరా నడిచి, తటాలున తలుపుతెరచి వచ్చేస్తావేమో! నువ్వలా రావద్దు. మాదొక కోరిక తీర్చాలి నువ్వు. నీ రాకలో సౌందర్యాన్ని తేరిపారా చూసి మా కనులు ధన్యమవ్వాలి." చెప్పింది ఆనందిని.
"ఎలా రమ్మంటావు కన్నయ్యని? అదీ చెప్పు సఖీ!" ప్రశ్నించారు మిగిలిన వారు కుతూహలంగా.
"కృష్ణా! సింహసంహననుడివి! నీ సర్వాంగ సౌందర్యాన్ని మేము ఆస్వాదించాలంటే, నువ్వు గబగబా నడిచి వచ్చేస్తే కుదరదు. ఇన్ని రోజుల మా ఎదురుచూపులు పండేలా, మా ఎడదలు నిండేలా నడిచి రా! "అయ్యో వెర్రి గొల్లెతలు, ఎదురుచూస్తున్నారే!" అని తొందరపడి అశ్వగతిలోనో, ఏ వృషభ గతిలోనో.. లేదా మరీ నిదానంగా గజగమనంలోనో రాకు. నువ్వు సింహగతిలో రావాలి. సింహంలా నడిచి రమ్మన్నాం కదా! అని లేచి వచ్చేస్తావేమో! విను.. నువ్వెలా నిద్రలేవాలో చెప్తాం. అలాగే మేలుకొని రావాలి. తెలిసిందా!
ఒకే చోట ఉన్న ప్రేమికులకు వర్ష ఋతువు ఎంత ఆహ్లాదకరమైనదో, విరహతాపంలో ఉన్నవారికి అంత దుస్సహం! 'వర్షాకాలం యుధ్ధానికి అనుకూలం కాదన్న' సుగ్రీవుని మాట విని, మాల్యవత్పర్వతంపై కొండ గుహలో విడిది చేసి ఉన్న సమయంలో.. సాక్షాత్తూ రామచంద్రుడే విరహి అయి, సీతావియోగాన్ని తాళలేక లక్ష్మణునితో చెప్పుకుని బాధపడ్డాడట! విరహోత్కంఠితలమై ఉన్నాము. ఎదురుచూపులనే వానకారు గడిచిందనే అనుకుంటున్నాం. మా విరహం తుదికొచ్చేసిందని మాకు తెలుస్తోంది. నీ దర్శనమింక ఈయక నీకూ తప్పదు, కన్నా!
గుహలో సింహంలా.. నిద్రలే! నీ ఎర్రని కన్నులను నెమ్మదిగా అరవిచ్చి చూడు. సింహం బధ్ధకంతో పొర్లినట్టు నీ సుఖశయ్యపై అటూ ఇటూ పొర్లు! పైకి నెమ్మదిగా లే! మృగేంద్రుడు జూలు విదిల్చినట్టు నీ నీలాల కురులు విదల్చు. ఎందుకో తెలుసా! నీ చుట్టూ రకరకాల పరిమళాలున్నాయి. నీల మందిరంలో అగరుధూపం, చందన సుగంధం, అత్తరు, పన్నీటి వాసనలూ.. ఇవన్నీ కాక 'అరవింద గంధి' నీల ఒంటి సువాసన నిన్ను పట్టి ఉంటుంది. మాకవేవీ అక్కర్లేదు. నీ కురుల సహజ పరిమళం ఆఘ్రాణించాలి. "సర్వగంధః సర్వరసః" అని నిన్ను పొగుడుతారే! అన్ని తావులూ నీలో నింపుకున్న వాడివి. నీ పరిమళం మాకు కావాలి. కురులు విదల్చు! ఆ పరిమళం తావిమోపరి మా దాకా మోసుకొస్తాడు. మేము మా గుండెల నిండా ఆ పరిమళం పీల్చుకుని మైమరచిపోవాలి.
అంతేనా! సింహం గుహలోనుండి బయటకు వచ్చినట్టు.. గంభీరంగా, అందంగా, హుందాగా నడిచిరా! మా కనురెప్పలు వెయ్యకుండా నీ నడక చూడాలి. శౌర్యాన్ని నింపుకున్న నీ కదలికలు చూడాలి. మగసిరి ఉట్టిపడే నీ ఆకృతిని చూడాలి. అలా బయటకు వచ్చి నిలబడిన నీ 'అవిసె పువ్వు'లాంటి మేనిఛాయ చూసి మురిసిపోతాం. ఎంత అందమైన వర్ణం నీది!! కాఠిన్యం ఇంచుకైనా లేని సుతిమెత్తని అతసీపుష్పాన్ని పోలిన నీ మేని కాంతులను చూడాలి. "అతసీ పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం!" కృష్ణా! యదుమోహనా! నీ మెడలో హారాలు, నీ చేతుల రత్నకంకణాల శింజితాలు మేము వినాలి. అలా వచ్చి అదిగో అక్కడ నీకో "మేటి రతనాలు పొదిగిన కనక రుచిర సింహాసనం" ఉంది. దానిపై కూర్చో! అది ధర్మపీఠం. అక్కడ కూర్చుని మా కోరికలు వింటే నువ్వు కాదనవు. మేమొచ్చిన పని పూర్తవుతుంది. కృష్ణా! విన్నావా! అలా మేలుకో! అలా నడిచి రా!"
తరలి రాగదే, దేవ! దయచేయగదే!
దరిసింపగవచ్చిన మా పని విని పాలింతుగాని! తరలి రాగదే!
వానకారులోన సింహమొకడు మేల్కాంచి, పొడవు
మేను సారించి, ధూళి తూలించి, కెంపు కనుల
మానుగ వీక్షించి, పరీమళభర సటలుగ, గహ్వ
రాన వెలువడు చందాన మందిరమునుండి, తరలి రాగదే!
భాసుర బహురత్న ఘటిత భర్మ సిం హ పీఠికా
ధ్యాసివై, అనుగ్రహోల్లాసివైన స్వామీ! అత
సీసుమ కోమల శ్యామమోహను, లోకావను, నిను
చూసి చూసి, మనసు వెళ్ళబోసి, కృతార్థులము కాగ - తరలిరాగదే!
"కృష్ణా! వింటున్నావు కదా! ఇవన్నీ మనసులో పెట్టుకో. రేపటి తెలవారు ఝామున వస్తాం! మా కోరిక తీరేలా దర్శనమివ్వు!" అని మళ్ళీ మళ్ళీ చెప్పి మరీ వెనుతిరిగారు గోపకాంతలు. ఇంకా శయనించే ఉన్న మాధవుని పెదవులపై లేనగవొకటి మెరిసింది.
మరిమరి నీ మగటిమికీ మంగళమన వస్తిమి! - 24
నీల మందిరపు తలుపు నెమ్మదిగా తెరచుకుంది. గోపికలు కోరినట్టే "గహ్వరము విడిచి బయటకు వచ్చే మృగరాజు వలే" నడుచుకుంటూ కృష్ణుడు వెలుపలకు వచ్చాడు. పరిమళ దీపాల వెలుగులో నల్లనయ్య మేనిరంగు వింత కాంతులు వెదజల్లుతోంది. రెప్ప వేయుట, ఊపిరి తీయుట మరచి చిత్తరువులై నిలబడిపోయారు గోపకాంతలు. వారిని దాటుకుని, వారి మాట ప్రకారం మణిఖచిత సింహాసనం పై పురుష సింహము ఆసీనుడయ్యాడు.
మునిజనానికి రాక్షస పీడ వదిలించేందుకు వెడలిన కోదండపాణిని, పసుపు గడపనానుకుని నిలబడి చూసిందట అరవిందలోచన 'సీతాకాంత'! ఆమె చూపులే హారాలై, హారతులై రాముని వెంట తోడున్నాయట! అలాగే ద్వారాన్ని ఆనుకుని నిలబడిన నీల, తన స్వామికి హారతి ఇచ్చింది.. తన చూపులతో, తన ప్రేమతో.. 'ఆద్వారమనువవ్రాజా మంగళాభిదక్షుసీ!'
గోపీజన మనోహరుడు ఆసీనుడయ్యాడు. చేష్టలుడిగి నిలబడిన గోపభామలను చూసాడు. చూపులతోనే కుశలమడిగాడు. ఆర్తిగా తనను తడుముతున్న వారి చూపులవానలో తడిసిపోయాడు. క్షణాలు గడుస్తున్నా ఉలకని పలకని గోపకాంతలను తానై పలకరించడం రాజోచితం కాదనుకున్నాడేమో! తనకు తానుగా వలచి వచ్చిన కాంత చులకన కదూ! విలాసంగా ఎడమ కాలు చాచుకున్నాడు. కుడికాలు పైకెత్తి ఎడమ కాలిపై వేసుకుని దర్పంగా కూర్చున్నాడు.
"సవ్యం పాదం ప్రసార్యా ఆశ్రిత దుహితహరం దక్షిణం కుంచయిత్వా.." అని పలికాయి ఆ గోపభామినుల లేపెదవులు. "అవును.. మీరు కోరినట్టే వచ్చానా..! మీరు కూర్చోమన్నట్టే కూర్చున్నానా..! ఇంకా..?" అన్నట్టు చూసాడు పుండరీకాక్షుడు. గోపికల చూపులు కృష్ణుని నీలాల కురులు సవరించి, కమలాల కనులు దాటి, పలువరుస వెన్నెలలు తాగి, సుందర బాహువులను తడిమి, విశాలంగా మగసిరి ఉట్టిపడుతున్న పీనవక్షస్థలంపై ఒక లిప్తకాలం తారట్లాడి, సన్నని దృఢమైన నడుము దాటి, పీతాంబరపు పసిమి గాంచి, అపరంజి కడియాలను ముద్దాడి, ఎరనెర్రని అరవిందాలవలే మెరుస్తున్న పాదాల వద్ద ఆగిపోయాయి. వాటి సౌందర్యం వర్ణించుట.. దేవాదిదేవతలు, మునిగణాలు, యోగిపుంగవులు, ధరణీపతులు, 'కవిత్వపటుత్వసంపదల్' కల్గిన కవిరాజులు.. ఎవరికి సాధ్యం? ఎవరి తరం? 'తన సౌందర్యగరిమ చూసి వలచి.. ఆ వెర్రి గొల్లలేమైపోతారో!' అని ఇసుమంతైనా జాలి లేని నిర్దయుడేమో కృష్ణస్వామి!
చూసారు.. తనివి తీరా చూద్దామనుకున్నారు.. తనివి తీరేదెప్పటికని!? ఉన్నట్టుండి ఆ అరుణిమ చూసి ఉలిక్కి పడ్డారు. 'కందిన ఆ పదరాజీవాలు ఎంత నొచ్చి ఉంటాయో!' అనే ఊహే అసిగాయమైంది వారి మనసుల్లో!
"కృష్ణా! గోపీజన నాథా! నీ చరణాంబుజముల వాలే షట్పదములు మా చూపులు! మా దృష్టే తగులుతోందయ్యా! చూడడమొక్కటేనా? ఎన్ని వెర్రి కోరికలు కోరాం నిన్ను! పొద్దైనా పొడవక ముందే నిద్రలేవమన్నాం. నీ కనుల ధావళ్యమే ఎరుగిన వాళ్ళం. ఈ కెంజాయ చూస్తే బాధగా ఉంది. నడిచి రమ్మన్నాం! మా మనవి విని వచ్చావు. చూడు.. నీ పాదాలు ఎంత కందిపోయాయో! అయ్యో! అయ్యో! ఏం చేయ్యడం!?"
"సురభీ.. వెన్నైనా లేదే!"
"కమలినీ.. పోనీ పువ్వులతో ఒత్తితే..!
"ఒద్దులే! మంచులో స్నానాలు చేసి ఉన్న కుసుమాలు బిరుసుగా ఉంటాయి. కన్నయ్యకి గుచ్చుకుంటాయి."
"ఎలా.. నీకు దిష్టి తగిలితే యశోద విలవిలలాడుతుంది! నందుడికి కోపమొస్తుంది! బలదేవుడికీ ఆగ్రహమొస్తుంది! నీల నొచ్చుకుంటుంది! ఎలా, కృష్ణా! నీకు దిష్టి తొలగించే మార్గమేమిటి?" ఇలా పలువిధాల మాట్లాడుకుంటున్న వారిని చూసి ఓ మందహాసం చిందించాడు కృష్ణుడు. ఆ నవ్వు చూసి ఇంకా మోహపరవశులైపోయారు వారందరూ!
"ఆనందినీ! కన్నయ్యకి తక్షణం దృష్టి దిగదుడవాలి. మార్గం చెప్పు!" ప్రశ్నించింది సురభి.
"నాకేం ఆలోచన రావట్లేదే! ఆ.. మంగళ హారతి పాడడమే!"
"అంతలేసి కళ్ళతో తేరిపార చూసేస్తున్నాం! వట్టి పాటలతో పోయే దిష్టా!"
"తప్పక పోతుంది. ఋజువులున్నాయి. విశ్వామిత్రుడు నిద్రపోతున్న రామచంద్రుని సౌందర్యానికి ముచ్చట పడి తన దృష్టే తగులుతుందేమో! అని మంగళవచనాలతో "కౌసల్యా సుప్రజా! రామా! లోకానికి మంగళమొనరించేవాడా! నీకు మంగళం!" అని పలికాడు."
"ఎంత రాచబిడ్డలకైనా అడవుల్లో ఉండే తాపసి అంతకన్నా ఎలా మంగళం పలుకుతాడు? ఉత్తుత్తి మాటలు కాదు ఆనందినీ! ఆలోచించు!" త్వరపెట్టారు అందరూ.
"చెలియలారా! నాకింకో విషయం గుర్తొచ్చింది."
"ఏమిటేమిటి?"
"తన గారాలపట్టి సీతను కన్యాదానం చేసేటపుడు జనక రాజర్షికీ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సీతాభామిని కరపల్లవాన్ని రాముని చేతిలో పెడుతూ.. ఒక్క లిప్త ఆ వరద హస్తపు ఎర్రదనాన్ని, సౌందర్యాన్నీ చూసి వివశుడయ్యాడట జనకుడు. "అయ్యో! రామభద్రునికి దృష్టి తగులుతుందేమో!" అని "ఇయం సీతా మమ సుతా సహధర్మచారిణీ తవ, ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా!" అని చెప్పాడట.
"ఇందులో వింతేముంది! నా కూతుర్ని పెళ్ళి చేసుకోవయ్యా!" అన్నాడు. రామయ్యకి దిష్టి తగిలే ఉంటుంది, పాపం!"
"భద్రం తే! అన్నాడు చూడు. నీకు భద్రమగు గాక! నీకు మంగళమగు గాక! అన్నాడన్నమాట!"
"అవునా! జనకుడు కూడా అన్నాడంటే.. మంగళవాక్యాలు సరిపోతాయేమో!" అని సరిపెట్టుకుని గోపాలచూడామణి వైపు చూసారు. వింత చూస్తూ వినోదిస్తున్నాడాయన!
మంగళమని పాడవస్తిమి.
మరిమరి నీ మగటిమికి మంగళమని!
ముంగిట నిలబడిన మా కొ
సంగుదువని పరవాద్యము
అల్లనాడు లోకమ్ముల
అలవోకగ కొలిచిన నీ
పల్లవారుణ శ్రీపద
పద్మమ్ములకు మంగళమని
పెల్లుగ నీవెత్తి వెడలి
సుందర లంకాద్వీపము
తల్లడబడ మాపిన నీ
దర్పమునకు మంగళం
కాలదన్ని ఒక త్రుటిలో
కరకు శకట దైత్యుని
నేలరాలు నటు జేసిన
నీ కీర్తికి మంగళమని
కూళను వత్సాసురు నవ
లీలగ చిరుకోల వలె
తూలవిసురు దుడుకు అడుగు
దోయికినీ మంగళం
దండిగ గోకులమునకై
దయదాలిచి గొడుగువోలె
కొండనెత్తి వేసిన నీ
గుణమునకూ మంగళమని
భండమున నొక వ్రేటున
పగతుర పీచమ్మడంచి
చెండాడిన నీ చేతి ప్ర
చండాసికి మంగళం
"కృష్ణా! మేము వచ్చినదైతే.. నువ్వు పరవాద్యమిస్తావనే! కానీ ఈ భువనమోహన రూపాన్ని చూసాక మాకు వేరే మాట రావడం లేదు. నిన్ను చూడాలని, చూస్తూనే ఉండిపోవాలనీ ఉంది. నరుని దృష్టి అతి శక్తివంతమైనదంటారు. నీ సద్గుణాలకూ, సౌందర్యానికీ మంగళహారతి ఈయనిదే మా మనసు ఊరుకోదు.
కృష్ణా! త్రివిక్రమా! మూడు అడుగులతో ముజ్జగాలనూ కొలిచావట! నీ పాద రజ మహిమ వల్లే భూమి రత్నగర్భ అయింది. పంటలు పండుతున్నాయి. పశు సంపద వృధ్ధి చెందుతోంది. ఆకాశం వర్షాన్ని కురుస్తోంది. బ్రహ్మ కడిగిన పాదానికి మంగళం! బ్రహ్మము తానైన పదపంకజానికి మంగళమగు గాక!
కొండకోనలు దాటి సీతమ్మ కోసం ఎంత కష్టపడ్డావో!సుందర లంకను ఏలే రావణుని, నేలకూల్చిన నీ శౌర్యానికి మంగళం!
కృష్ణా! నల్లనయ్యా! బంగారు తండ్రీ! బండి రిక్కలో పుట్టావని బండిని ముక్కలు చెయ్యాలా చెప్పు!? నెలల పసికందువి! బండిని తన్నావు! శకటాసురుని ముక్కలు ముక్కలు చేసావు! నీ మువ్వల పాదమెంత నొచ్చి ఉంటుందో! ఆ అందమైన పాదాలకు మంగళం!
అంతే కాదు! ఆవుదూడ రూపంలో వచ్చిన వత్సాసురుని చిన్నకట్టెని విసిరినట్టు గిరగిర తిప్పి విసిరావు. ఆ విసిరినప్పుడు భూమిపై నీ పాదాలు ఎంత నొక్కిపెట్టి, చేతులతో బలంగా విసిరి ఉంటావు! నీ పాదాలూ, చేతులూ ఎంత నొచ్చి ఉంటాయో! ఎంత దుడుకు వాడివి! నీ దుందుడుకు అడుగులకు కనుదిష్టి తగలకుండు గాక!
గోవర్ధన గిరిని సునాయాసంగా ఎత్తి చిటికెన వేలిపై నిలిపావు. మా కోసమే! మా గోకులాన్ని రక్షించడం కోసమే!! అలా ఒకటా రెండా..! ఏడు రోజులు విలాసంగా కాలు అటుదిటు చేసి మరీ నిలబడ్డావే! ఎంత నొప్పి కలిగి ఉంటుంది నీకు! వ్యత్యస్థ పాదారవిందుడవైన గోవర్ధన గిరిధారీ! నీకు మంగళం!
శార్జ్ఞపాణీ! వైరి వర్గానికి నీ శార్జ్ఞమంటే సింహస్వప్నం! నీ చేతి కత్తి కలలోకి వచ్చినా నీ శత్రువులందరూ బెదిరిపోతారు! అలాంటి ప్రచండాసి చేత దాల్చిన నీకు మంగళం! శుభ మంగళం!"
తనను చూపులతో అభిషేకించి, పలుకులతో, పాటలతో మంగళారతి పలికి, "ఇంకా అక్కడే నిలిస్తే మళ్ళీ కన్నయ్యని చూసేస్తామేమో!" అని వెనుతిరిగి వెళ్ళిపోతున్న ఆ అమాయక గొల్లపడతులను చూస్తూ మోహనకృష్ణుడు నవ్వుకున్నాడు. అతని అల్లరికి అంతేముంది!
ఒక అమ కొమరుడవై, వేరొక అమ ఒడిలో దాగి! - 25
ఒక లేమ అన్యమనస్కంగా చీరచెంగుని వేలితో ముడి వేస్తోంది. మరో ముదిత ముంగురులు మాటిమాటికీ సర్దుకుంటోంది. మరో లలన కింది పెదవి పదే పదే కొరుకుతూ, ఆలోచనలోంచి తేరుకోలేకపోతోంది. వేరొక చాన కృష్ణుని ఇంటి దారి పై నిలచిన చూపు మరల్చలేకపోతోంది. వేరొక అతివ తత్తరపాటుతో తన చీరకుచ్చిళ్ళు తానే తొక్కుకొని తూలబోయింది. ఇంకొక తరుణి కంపిస్తున్న చేతులతో పక్కనున్న భామిని చేతిని నలిపేస్తోంది. "కాత్యాయని" పూజకి స్నానించి సిధ్ధమైన గోపవనితలలో, ఏ ఒక్కరి మనసూ మనసులో లేదు. సైకత కాత్యాయని ప్రతిమను చూడగానే అమ్మని చూసిన పిల్లల్లా తమ మొర వినిపించారు. "కన్నయ్య ఎంత మాయ చేసాడో!" చెప్పుకు బాధపడ్డారు. "అతనికి అలవాటేగా!" అని కృష్ణుని మునుపటి చేష్ఠలు తలచుకున్నారు. పూజ పూర్తి చేసుకుని "నీదే భారమని" కాత్యాయనికి మరిమరి చెప్పి కృష్ణుని వద్దకు బయలుదేరారు.
"ఈ రోజు ఆ మాయవానికి లొంగిపోకూడదు. నిన్న కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకేం కావాలని అడగలేదు. ఇవాళ మాత్రం మనకు కావలసినవి అడిగేద్దాం." ఒకరితో ఒకరు చెప్పుకుని దృఢ నిశ్చయంతో కృష్ణుని ముంగిలి చేరారు.
కృష్ణుడు నిన్న కూర్చున్న చోటే.. అదే పైడిగద్దెనెక్కి కూర్చుని ఉన్నాడు. గోపబాలలను చూసి పలకరింపుగా నవ్వాడు! జర్రున జారిపోతున్న మనసులను ఒడిసిపట్టి, పెదవులపైకి దూకేస్తున్న మందహాసాన్ని అదిమిపట్టి, ముఖరాజీవాలను అలంకరించబోతున్న సంతోషాన్ని మరుగుపరచి.. బింకంగా నల్లనయ్య ఎదురుగా నిలబడ్డారు.
"పూబంతులూ.. కుశలమేనా?" మరుని వింటినారి ఝుమ్మంది.
"ఊ.." అతిప్రయాసపై బదులుపలికారు. అతని సమ్మోహన శక్తి సామాన్యమైనదా?
"వేగుచుక్క తోడుగా చక్కని చుక్కలు మేలుకొలిపేందుకు వస్తే బాగుంది కానీ, చలి..!! ఇంత దూరం నడిచి వచ్చారే! అయ్యో!"
"హ్మ్.." బింకం సడలిపోతోంది. ఏ క్షణమైనా దాసోహమనేసేలా ఉంది వారి పరిస్థితి.
"సరే! ఇంతకీ ఏ పని మీద వచ్చారు?" అమాయకంగా ప్రశ్నిస్తున్న కృష్ణుడిని చూస్తే, ఉక్రోషం ముంచుకొచ్చింది గోప వనితలకి.
"నువ్వు రప్పించుకునే వాడివి! మేము రావాల్సిన వాళ్ళమూను!" నిష్ఠూరంగా అన్నామనుకున్నారు.
"ఓహో! అవునా! హ్మ్.. పనేమిటో చెప్పారు కాదు!" కొంటెనవ్వు కలనేసిన ప్రశ్న సంధించాడు. గుచ్చుకుంది.
"కృష్ణా! పరవాద్యమిస్తావని వచ్చాం. నిన్ను అర్ధించి తీసుకెళ్దామని వచ్చాం."
"అయ్యో! ఎంత మాట! అర్ధించడమా!! అయినా మీకు ఇచ్చేంతటి వాడినా! ఏదో.. మీ ఇళ్ళలో పాలూ, వెన్నా దొంగలించి పెరిగిన వాడిని!" అమ్మకి చెప్పిన చాడీలను మర్చిపోతాడా, వెన్నదొంగ! హన్నన్నా!!
"మీ అమ్మకి నీ మీద కొండెం చెప్పామనే కదా! అప్పుడు తెలియదులేవయ్యా.. నువ్వింతటివాడివని!" ఉక్రోషంతో లలనల ముఖాలు ఎర్రబారిపోయాయి.
"ఇప్పుడైనా ఎంతటి వాడిని కనుక! గోవులు కాచే గోపన్నని!!" అమాయకత్వం కన్నయ్యకి పెట్టని ఆభరణం మరి!
"నీ గురించి మాకు తెలియదనుకున్నావా?" ప్రశ్నించారు వెర్రి గొల్లెతలు.
"నా గురించా.. ఏం తెలుసేంటి?" కవ్వించాడు అల్లరి కృష్ణుడు.
"నీ పుట్టుపూర్వోత్తరాలు ఎరిగిన వాళ్ళం. మాకేం తెలియదనుకున్నావా? ఆయమ్మకు పదవ మాసం ప్రవేశించిన పిదప ఐదు గ్రహాలు ఉచ్ఛ స్థానాలలో ఉన్న తరుణంలో శ్రావణ బహుళాష్టమి నాడు రోహిణీ నక్షత్రమందు జన్మించావు. ఇసుమంతైనా ప్రసవవేదన కలగనీయక నల్లని ఉంగరాల వంటి చిన్ని చిన్ని ముంగురులతో, తేనెసోనల వంటి చిరునవ్వుల చిందులతో, శ్రావణమేఘపు వన్నెతో.. ఉదయభానుని వలే కన్నులపండువగా పుట్టిన నిన్ను చూసి ఆ తలిదండ్రులు ఎంత మురిసి ఉంటారో!"
"ఊ.." తన చిన్ననాటి కబుర్లు వినాలనే ఆసక్తికి లోకేశ్వరుడైనా అతీతుడు కాదేమో!
"కంసుని బారి నుండి నిన్ను కాపాడేందుకు ఓ తట్టలో పడుకోబెట్టి, తలకెత్తుకుని ఆ అర్ధరాత్రి యమున దాటాడు.. నిను కన్న తండ్రి! నువ్వు సామాన్యుడివే అయితే.. మింటిధారలు నిన్ను తడపకుండా శేషుడు గొడుగై వెంట నడిచేవాడా! మెత్తని ఇసుకదారి విడిచి యమున రెండుగా చీలిపోయేదా?"
"అవునా.. అప్పుడు!"
"ఈయమ్మ పొత్తిల్లో పడుకోబెట్టాడు. నవమాసాలూ మోసిన పున్నెం ఆమెదైతే, పాలిచ్చి.. నీ ఊసులు, తారంగాలు, బోర్లా పడి పారాడే చిన్నెలు, తప్పటడుగులూ, పరుగులు, అల్లరి పనులు, అలకలూ, కబుర్లూ, కథలూ.. కనులారా చూసి, సొంతం చేసుకోవడం.. ఈ తల్లి పుణ్యాల ఫలం!" తల్లుల పేర్లు చెప్పకుండా రహస్యం రహస్యంగానే ఉంచి లౌక్యంగా మాట్లాడామనుకుని గర్వపడ్డారా గొల్లపిల్లలు!
"నల్ల పిల్లాడినని వెక్కిరించారుగా!" ఎనిమిదేళ్ళ ముద్దుల బుజ్జాయి ఉక్రోషంగా బుంగమూతి పెట్టుకుని అడుగుతున్నట్టే కనిపించి ఫక్కున నవ్వేసారు గోపికలందరూ!
"నల్ల పిల్లాడివే! మట్టిలో పొర్లాడి, నోటి నిండా పాల చారికలతో, వెన్న పూసుకుని, కాటుక అలికేసుకుని.. అబ్బెబ్బే.. నీలాంటి పిల్లాడిని మేమెక్కడా చూడలేదమ్మా!" కన్నయ్యని ఉడికించారా భాగ్యశాలులు!
"పోన్లెండి.. అలాంటి వాడి వెంట ఎందుకు పడతారు మరీ? వెళ్ళండి.. మీరేమో అన్నుల మిన్నలూ.. నేను నల్లనివాడిని..!" 'నల్లనివాడు.. పద్మనయనమ్ముల వాడు.. నవ్వు రాజిల్లెడు మోము వాడు.. మౌళి పరిసర్పిత పింఛము వాడు..' అలుక నటించాడు. అలిగిన కృష్ణుని అందాన్ని చూసి మురిసారా ముద్దు గుమ్మలు.
"కృష్ణా! సౌందర్యముద్రామణీ! త్రైలోక్య రక్షామణీ! నీ దొరతనాన్ని పొగిడే మాటలు మాకెక్కడివీ! సిరి తనకు తానుగా వలచి పెండ్లాడిన సుందరుడివి! అనురాగపు గనివి! నిను హింసించిన అసురులను దహించే మంటవు! అర్థులకు అమృతాల పంటవు!! నీ కల్యాణ గుణగానం చేస్తూ.. మమ్మల్ని మేము మరచిపోతాం. నీ తీయని పేరు తలిస్తే చాలు.. విరహమైనా మమ్మల్ని బాధించదు! మా పెద్దవారు చెప్పిన వ్రతానికి అవసరమైన పరవాద్యం మాకు ఇచ్చి పంపు."
అర్థులము, అనుగులము!
అంజలింప వచ్చినాము
అడిగిన వరమిడుదువని
అనురాగపు గని వనీ!
ఒక అమ కొమరుడవై, వే
రొక అమ ఒడిలో దాగి,
ఒదిగిన నిను హింసింపగ
ఊహించిన కంసునకు,
అసురునకు కడుపు మంటవు!
అర్థులకూ అమృతాల పంటవు!
సిరి కూడా వలచే నీ
దొరతనమూ, దోర్వీర్యము
పరవశమున పాడి, పాడి
విరహమెల్ల మరతుము!
పరవాద్యము కరుణింపుము
పరమానంద మొసంగుము!
నల్లనయ్య చల్లగా నవ్వాడు. "అపరంజి బొమ్మలూ! మీ శ్రమని గుర్తించని వాడిని కాను కానీ.. మీరడిగిన వస్తువు ఉందో లేదో, మంచీ చెడూ చూడాలి కదా! నాకు కొంచెం సమయం ఇవ్వండి. రేపు రండి."
చేసేదేముందని వెనుతిరిగిన గొల్లపడుచుల్లో కొందరికి కోపమొచ్చింది. "కృష్ణుని పొందాలని మనకే కానీ, అతనికి మనం అక్కర్లేదా?" అని దురుసుగా ప్రశ్నించారు. వారిని వారించి సమాధాన పరిచారు ఆనందిని, సురభి.
"అమ్మాయిలూ! అన్నీ తెలిసినవాడు కృష్ణుడు. నందుడే స్వయంగా "మీకు కృష్ణుడే సహాయపడగలడు." అని చెప్పి మరీ కాత్యాయనీ వ్రతానికి మద్దతు ఇచ్చాడు. నిర్విఘ్నంగా జరిగిపోతుంది. సంశయం వలదు." నమ్మకంగా చెప్పింది సురభి.
"ఏమోనమ్మా! మనం వెంట పడుతున్నాం. మనం విరహంలో వేగిపోతున్నామే కానీ.. కన్నయ్యకి కాస్తైనా దయ లేదే!" వాపోయింది ఓ కోమలి.
"అలా కలలో కూడా అనుకోకు చెలీ! మనకంటే మనని తన వద్దకు చేర్చుకోవాలని పరమాత్మకే ఎక్కువ చింత ఉంటుందట. రాముడూ సీత కోసం ఎంత పరితపించలేదు!" మౌనంగా అడుగులు వేస్తున్న నేస్తాలకు ఉత్సాహం తేవాలని రాముని కథ చెప్పనారంభించింది ఆనందిని.
"చూడామణిని హనుమ చేత ఉంచి "ఇది నా ప్రభువుకు చూపించు. వచ్చి నన్ను తీసుకెళ్ళమను. ఒక్క మాసం కంటే ఎక్కువ కాలం ఎదురుచూడలేనన్నానని చెప్పు. నెలదాటితే నీ సీత బతికి ఉండదని చెప్పు." అని సీతమ్మ చెప్పిందట.
"ఊ.." జాలిగా పలికాయి వారి గొంతులు.
"ఆ కబురు తెచ్చిన హనుమతో రామచంద్రుడేమన్నాడో తెలుసా!"
చిరంజీవతీ వైదేహీ యది మాసం ధరిష్యతీ
న జీవేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం
నయా మామపి తం దేశం యత్ర దృష్టా మమ ప్రియా
న తిష్ఠేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం
ఒక మాసం బతికేమాటుంటే వైదేహి ఎన్నాళ్ళైనా ఉండగలదు. నల్లని కన్నుల నా సీత లేనిదే క్షణమైనా జీవించలేను. అని బేలగా చెప్పాడట!"
"అవునా! అయ్యో!" జలజల రాలేందుకు నీటి ముత్యాలు సన్నిధ్ధమయ్యాయి.. వారి నల్ల నల్లని కన్నులలో..
"నా ప్రియభామిని ఉన్న దేశానికి నన్ను వెంటనే తీసుకెళ్ళు, హనుమా! క్షణమైనా ఆ అసితేక్షణకు దూరంగా ఉండలేను." అన్నాడట!
"మనసు వెన్న! కన్నయ్య కూడా అంతే! మనని అల్లరి పెట్టాలని కాదు. ఏదో కారణం లేకుండా రేపు రమ్మనడు!" హృదయాలను ఆర్ద్రం చేసిన రామకథను పదే పదే తలుచుకుంటూ ఇళ్ళకు చేరారు గోపకాంతలు.
అల్లరి చాలించు, కన్నా! - 26
"కృష్ణా!"
"ఊ.."
"కన్నా! వరాలమూటా!!"
"మా అమ్మ పిలిచినట్టు పిలిస్తే లొంగిపోతాననుకున్నారా?" అని మనసులో అనుకుంటూ ఓ చిరునవ్వు చిందించాడు.
"రేపు రండి. అని చెప్పి పంపించావు."
"ఊ.."
"వచ్చాము. మేము కోరిన వస్తువులిచ్చి పంపించవూ!"
"ఏం కావాలి మీకు?" వారి చూపులతో చూపులు కలిపి క్షణకాలం సూటిగా చూసాడు.
"నువ్వే! ఇంకేం కావాలి మాకు!" అని పలుకబోతున్న పెదవులను అతి ప్రయత్నం మీద అదుపు చేసుకున్నారు.
"నెలకు మూడు వానలు కురిసేనని పెద్దలు చెప్తే, అందరి హితం కొరకూ వ్రతం చేస్తున్నాం. "కావలసినవన్నీ కన్నయ్యనడిగి తీసుకోండి" అని మీ అయ్య నందయ్య మాతో చెప్పగా విన్నావు కదా! ఏమీ తెలియని వాడిలా ఈ పరీక్షలేమిటి కన్నా!?"
"అరెరే! భలే వారే! మీకేం కావాలో మీరు చెప్పకుండా నాకెలా తెలిసేను! ఇప్పుడు చెప్పండి. ఏమేం కావాలి. సంశయం లేకుండా అడగండి. ఏం కావాలి?" మాయ కన్నయ్య మాటలెంత మధురంగా ఉంటాయో!
గోపకాంతలు ఒకరితో ఒకరు 'ఏమేం కావాలో!' అని గుసగుసలాడుకున్నారు. మళ్ళీ కృష్ణుని మనసు మారకుండా అడగాలని నిశ్చయించుకుని చెప్పడం మొదలు పెట్టారు.
"కృష్ణా! వరదాయీ! మాకో శంఖం కావాలి."
"ఊ.. సరే.. శంఖము..." ఒక వేలు ముడిచి లెక్కపెట్టాడు.
"ఆగాగు! శంఖం అంటే అలాంటిలాంటి శంఖం కాదు. పాల వలే తెల్లనిది.. భూమి దద్దరిల్లేలా శబ్దం కలుగ చేసేది, నీ పాంచజన్యాన్ని పోలిన శంఖములు కావాలి."
"ఓహో.. అవునా! ఊ.. ఇంకా?"
"మహా శక్తివంతమైన శబ్దం చేసే పర వాద్యం కావాలి."
"అలాగే! శంఖములూ, పర వాద్యం .." రెండు వేళ్ళు ముడిచాడు.
"ఇంకా మాకు వ్రతం చేసేందుకు మంగళ మణి దీపికలు కావాలయ్యా!"
"ఓహో దీపాలు, మణిదీపాలూ.."
"నీ పేరు మరిమరి తలిచి, నీకు మంగళము పలికే పాటగాళ్ళు కావాలి."
"ఓహో.. ఊ..!"
"మేము వ్రతం చేపట్టిన వారమని ప్రజలకు తెలియాలంటే మాకో జెండా ఉండాలి కదా! ఒక గరుడ ధ్వజం కావాలి."
"హ్మ్.. ఐదు.."
"ఇంకొక్కటి.. బంగారపు జలతారు చందువా, పసిడి పళ్ళెరాలు కూడా కావాలి."
"సరే! వితానమూ.. పళ్ళెరాలూ..." లెక్క చెప్పాడాయన.
"అవును. ఈ వస్తువులన్నీ కావాలి."
అవధరింతువా అనుగ్రహింతువా!
ఆశ్రిత జన వత్సలా! నీవవధరింతువా?
మార్గశిర స్నానమునకు మా నోమునకు
మాకు వలయు వానిని మహేంద్రమణి ప్రభామూర్తి!
క్ష్మా మండల మదిరిపడగ శబ్దించేవీ,
పాలవన్నె నొప్పారెడు పాంచజన్యమట్టివీ,
శంఖములూ, ప్రబల బహుళ
పటాహములూ పరవాద్యములనుగ్రహింతువా!
మంగళ మణిదీపికల,
భృంగారపు చందువాల,
బంగారపు పళ్ళెరాల,
రంగురంగు ధ్వజపటాల,
పొంగుచు మంగళాశాస
నము పాడే గాయకుల
అవధరింతువా! అనుగ్రహింతువా!
ఓ వటపత్ర శాయీ! వరదాయీ! వరదాయీ!
గోపికల కోరికలను విని నవ్వాడు గోవిందుడు. నవ్వి ఇలా చెప్పాడు. "ప్రియభామినులూ! నిన్న వచ్చి ఒక వస్తువడిగారు. ఈ రోజు ఇంకొన్ని వస్తువులు చేర్చి అడుగుతున్నారు. మీకేం కావాలో పది సార్లు కాకుండా ఒకే సారి అన్నీ చెప్పాలి. ఈ రోజు అడిగినవి ఇచ్చి పంపేస్తే, రేపు ఇంకో అవసరమొస్తే పాపం ఇంత దూరమొచ్చి మళ్ళీ అడగాలంటే.. పూవులకంటే సుకుమారులు.. కందిపోతారు! కనుక మీకేమేం కావాలో అన్నీ ఆలోచించుకుని రేపు అడగండి."
"నిజమే! ఏమేం కావాలో ఆలోచించుకుని వస్తాం." అని ఇళ్ళకు బయలుదేరారు గొల్లెతలు. ఆలోచన చేసేందుకు మధ్యాహ్నం యమున ఒడ్డున సమావేశమవుదామని నిర్ణయించుకున్నారు.
యమున ఒడ్డుకి ఒక్కొక్కరే వచ్చిన గోపీబృందం, తాము వచ్చిన పని మరచిపోయి కబుర్లలో పడ్డారు. కృష్ణుని మరి మరీ తలుచుకు పెరిగిన తాపాన్ని తగ్గించుకునేందుకు వారికి స్నానం చెయ్యాలనిపించింది. చుట్టూ చూసారు. ప్రశాంత సైకత వేదికలను ముద్దాడే యమున కెరటాల హోరు తప్ప వేరే శబ్దమేమీ వినబడలేదు. ఒక్కొకరూ ఒక్కో వలువా విప్పి ఓ పొదరింట విడిచారు. నీట మునిగి జలకాలు ప్రారంభించారు. జల్లు పోరాటాలతో జలక్రీడలాడుతూ, కిలకిలా నవ్వుతూ, కేరింతలు కొడుతున్న ఆ లావణ్యరాశులను దూరం నుండే చూసాడు కృష్ణుడు! తన నేస్తాలను అడవిలో ఉండమని పలికి, నెమ్మదిగా తానొక్కడే పిల్లి వలే నక్కి నక్కి ఆ చీరలన్నీ ఓ వల్లెవాటులో మూట కట్టాడు. నెమ్మదిగా పక్కనే ఉన్న ఎత్తైన కడిమినెక్కి ఆ చీరలమూట ఓ కొమ్మపై పెట్టి కూర్చున్నాడు. వినోదంగా గోపభామినులను చూడనారంభించాడు.
జలకాలాడుతున్న ఆడు ఏనుగులవలే నీరంతా చిమ్మి, కేరింతలు కొడుతున్న వారిని చూస్తూ మోహన మురళి మ్రోగించసాగాడు. తమ నవ్వుల ధ్వనిలో కలిసి వినిపిస్తున్న మురళీరవళికి ఒక్క మాటు ఉలిక్కిపడ్డారందరూ! చుట్టూ చూసారు. సమ్మోహనంగా వినిపిస్తున్న ఆ సంగీతమెక్కడినుంచని వెతికారు. అల్లంత దూరాన కడిమి చెట్టెక్కి చిటారు కొమ్మన కూర్చున్న అల్లరి కన్నయ్య కనిపించాడు. సిగ్గుతో ఎర్రబడ్డ కలువల్లా ఉన్న వారి ముఖాలను చూస్తూ నవ్వు రువ్వాడు యదునందనుడు.
"ఓ.. కన్నయ్యా! ఇక్కడేం చేస్తున్నావ్? ఆడపిల్లలు స్నానం చేస్తూంటే రావచ్చునా?" కమలిని ఎలుగెత్తి అడిగింది.
"యమున మీ పెరటి కొలనేం కాదే! ఇటుగా వచ్చాను. మీరూ ఇక్కడే ఉన్నారు."
"సరే లే! వస్తే వచ్చావు కానీ, ఆ ముద్దుల మురళి మ్రోగించడం మాని వెళ్ళిపో!"
"భలే వారే! "ఊదుమా నీదు మురళి ఒక్క మారు బాలకృష్ణా!" అని కోకిలగానంతో బతిమాలినది నువ్వేకదూ!"
"తీయతేనియ బరువు మోయలేదీ బ్రతుకు, మ్రోగించకోయ్ మురళి మ్రోగించకోయ్ కృష్ణా!"
"మీ ఇష్టమేనా అన్నీ?" పెంకెగా పెదాలు బిగించాడు మోహనవంశీధరుడు.
తరుణులందరూ గుసగుసలాడుకున్నారు. దారేమిటని ఆలోచించారు. అర్ధించాలని నిశ్చయించుకుని పలుకసాగారు.
"కృష్ణా! కన్నయ్యా! నీ అల్లరి మాకూ ముద్దే! కానీ చలిలో బిగుసుకుపోతున్నాం. తాపం తీర్చుకునేందుకు యమునలో దిగి చాలా సేపు జలకాలాడామేమో! చలిగా ఉంది. నువ్వు అటు వెళ్తే మేము బయటకు వచ్చి చీరలు కట్టుకుంటాం" అభ్యర్ధనగా, మంచిగా పలికారు.
"పాపం! చలిగా ఉందా! సరే! ఏవీ.. ఈ బట్టలేనా కట్టుకుంటారు? ఈ మావిడి చిగురు వల్లెవాటు సురభిది, ఈ సంపెంగ రంగు పావడా కమలినిదేనా? ఈ నారింజ చీర ఎవరిదబ్బా? ఆ.. తరళది!" మురళితో చీరలను కదుపుతూ అల్లరిగా అడిగాడు.
"హమ్మయ్యో!!! చూసుకోనేలేదు. చీరలెత్తుకెళ్ళావా?! దొంగా! అల్లరి పిల్లాడా!! ఇదేమైనా బాగుందా? ఈ కృష్ణుడి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. మీ అమ్మతో చెప్పామంటే చెప్పమూ మరి!" కోపంతో మరింత ఎర్రబారాయి వారి ముఖాలు.
"చెప్పండి చెప్పండి. తప్పక చెప్పండి. మీరు బయటకు వచ్చి ఈ చీరలు తీసుకుని సింగారించుకుని, చరచరా నడిచి నేరుగా మా అమ్మ దగ్గరికే వెళ్ళి చెప్పండి."
"చెప్పక ఊరుకుంటామనుకున్నావేమో! చెప్పి తీరుతాం." ఉక్రోషంతో ముక్కుపుటాలెగరేస్తూ బుసలు కొట్టారు గోపవనితలు.
"సరే సరే! రండి.. వచ్చి చీరలు తీసుకోండి."
క్షణాలు గడుస్తున్నాయి. గాలులు చల్లబడడం మొదలయ్యింది. గజగజా వణకసాగారు. ఇంక బతిమాలుకోక తప్పదని అర్ధమయింది గోపికలకి.
"కృష్ణా! కన్నయ్యా! మేము యశోదతో చెప్పనే చెప్పం కదా! మంచి వాడివి. బంగారు తండ్రివి! నీలాల రాశివి! మా చీరలివ్వవా? చలి..!! ఈ చలికి మేము బిగుసుకుపోతే నీదే పూచీ!"
"ఆహా.. నాదే పూచీ. మిమ్మల్ని చూస్తూంటే నాకే చలేస్తోంది. పాపం! త్వరగా బయటకు రండి. చేపపిల్లల్లా ఎంత సేఫు ఆ నీళ్ళలో!?" అమాయకంగా పిలిచాడు.
"ఎలా వస్తాం? నువ్వేమో అలా కన్నార్పకుండా చూసేస్తూ ఉంటే ఎలా?" సిగ్గుగా అడిగారు.
"ఈ ఎరుపు మీ లేత బుగ్గల సిగ్గుదా? సంజె వెలుగులదా? చీకటి పడుతుంది ఇంకో గడియలో! జాగు చేయక రండి భామలూ! నాకు బోలెడు పనులున్నాయి. మీ చీరలకు కావలి కాయడమేనా నా పని!?"
"ఎలా వస్తాం? నగ్నంగా ఉన్నామిక్కడ!" లజ్జతో తలలు వంచుకుని నెమ్మదిగా చెప్పారు.
"అయితే ఏం? వచ్చి తీసుకుంటే మీకే మంచిది. బాబోయ్! చలి చలి!" వణుకు అభినయిస్తూ నవ్వాడు.
"కన్నయ్యా! ఎలా రమ్మంటావు?"
"నడిచి రండి. నేనేమైనా పరాయి వాడినా?"
"అయ్యో! కాదు కాదు! కానీ.."
"కానీ...?"
"సిగ్గు..పట్టపగలు.."
"ఏం పరవాలేదు. బయటకు రండి. నాకు తెలియనిదేముంది? 'సర్వ వ్యాపీ, సర్వాత్మా!' అని పిలిచారుగా?"
"నిజమే కృష్ణా! కానీ.. నవయవ్వనంతో మిసమిసలాడుతూ, మోహాన్ని కలిగించే పురుషోత్తముడివి! మోహనాకారుడివి! నీ ఎదుటకు దిసెమొలతో రమ్మనడం భావ్యమా?"
"మీరూ చక్కని వారేగా! రండి! వచ్చి చీరలు తీసుకోండి."
పలుకలేక మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. తప్పేదేముందని ఎట్టకేలకు వారందరూ ధైర్యం తెచ్చుకుని సిగ్గుని పక్కకు నెట్టి, జలమధ్యం నుంచి వెలువడి, కంకణ కాంతులతో మెరుస్తున్న కరకమలాలతో ఊరువుల మధ్యభాగాన్ని కప్పుకుని ముడుచుకున్న తామరమొగ్గలవలే చలిగాలికి వణుకుతూ, ప్రౌఢలగు కామినులను ముందు నిలబడమని, మిగిలిన వారు వారి వెనుక దాగి ఒడ్డుకు వచ్చారు. సిగ్గుతో ఎర్రనైన చెక్కిళ్ళతో, లలిత దరహాసాలను దాచలేక తలలు వంచుకుని నిలబడ్డారు.
"మంచి పిల్లలు!"
"ఆ చీరలిలా విసురు, కన్నా!" అతికష్టం మీద అడిగారు.
"నాకు చేతులెత్తి మొక్కితే ఇస్తాను."
కంపించిపోయారు గోపభామలు! బేలగా చూసారు కృష్ణుడి వైపు! వేడుకున్నారిలా..
మామా వలువలు ముట్టకు, మామా కొనిపోకు మన్నింపు తగన్
మామాన మేలకొనియెదు, మామానపహరణ మేల మానుము కృష్ణా!
"నువ్వింతటి వాడివి. మాకు దిక్కు నువ్వే!"అని వట్టి మాటలేనా..? ఊ.. నమస్కరించండి!" గద్దించాడు.
అవనత శిరస్సులతో గుండెలకు అడ్డుపెట్టుకున్న చేతిని పైకెత్తి నమస్కారం చేసారు.
"ఒక్క చేత్తో నమస్కరించిన వాని చేతిని ఖండించమంది శాస్త్రం!"ఖణేల్మంది కృష్ణుని గొంతు.
రాబోతున్న కన్నీళ్ళను ఆపుకుని, కదలక మెదలక నిలబడ్డ వారిని చూసి, జాలి అంకురించిందాతని హృదయంలో!
"ముద్దు గుమ్మలూ! మీ మనసులనూ, మరియాదనూ కించపరచాలన్నది నా అభిమతము కానే కాదు. వ్రత నియమాలను ఉల్లంఘించి నగ్నంగా స్నానమాచరించుట తగునా? ఊరిప్రజల శ్రేయస్సు కోరి, నన్నే మనసులో నింపుకుని కఠోర నియమాలతో మీరు చేస్తున్న వ్రతానికి ముప్పు వాటిల్లబోతోందని తెలిసే ఈ పని చేసాను. మీరీ వ్రతం చక్కగా ఫలించాలని సంకల్పించుకుని చేతులెత్తి నాకు నమస్కారం చెయ్యండి. మీ వ్రతభంగం నాకు మాత్రమూ భరింపతగినదా? నాకు మాత్రం మీ సాన్నిధ్యం వద్దూ!" లాలనగా పలికాడు.
కృష్ణుని ప్రేమకు కరిగి నీరైనాయి గోపికల మనసులు. "తప్పు తెలుసుకుని, మన్నించమని, 'నేను' అనే అహం వదిలి" ఆ పురుషోత్తమునికి రెండు చేతులూ ఎత్తి, కంకణాలు గలగలమని సవ్వడి చేసేలా భక్తిగా, ప్రేమగా చేతులు ముకుళించి నమస్కారం చేసారు. మౌనంగా చీరలు అందుకుని ధరించి, కృష్ణుని మనోహర రూపాన్ని పెంపెక్కిన అనురాగంతో కనురెప్పపాటైనా లేకుండా చూడసాగారు.
"రతనాల కొమ్మలూ, మీ మనోగతాభిలాష ఎరుగని వాడిని కాను. నన్ను అర్చిస్తే మోక్షమే దక్కినప్పుడు మిగిలిన కోరికలదేముంది! కాత్యాయనీ వ్రతం సాంగోపాంగంగా సంపూర్తి చేసుకుని, అవశ్యం నా సాంగత్యాన్ని పొందగలరు." అని మధురంగా పలికి వారిని ఇళ్ళకు పంపివేసాడు గోపీవల్లభుడు.
మనసు నొప్పించినా, కపటకృత్యాలతో అల్లరి చేసినా, పరిహసించినా, ప్రాణప్రియుని చేతలు కామినులను కించపరుచవు కదా!
వేడ వచ్చునా మరికొన్ని! - 27
నెలవంకను పోలిన నుదుటిపై సరాగాలాడుతున్న ముంగురులను, కరకంకణాలు సవ్వడి చేసేలా సుతారంగా సవరించుకుంటూ, కెమ్మోవులపై చెంగలించే చిరు చిరు నగవులతో.. ఆ తిలకినీబృందం కాత్యాయనీ దేవిని అర్చించి, మంగళారతులిచ్చారు. పూజావిధి పూర్తి చేసి యమునాతటి పై కూర్చున్న వారికి ప్రకృతి మనోహరంగా తోచింది. అరుణోదయవేళకు సమాయత్తమవుతున్న తూర్పుకాంత మనోజ్ఞంగా ఉంది.
"చెలీ! ఇంత హాయిని కృష్ణుని సన్నిధిలో తప్ప వేరే వేళా ఎరుగమే! కన్నయ్య ఇక్కడెక్కడైనా ఉన్నాడంటావా?"
సురభి సందేహానికి ఉలిక్కి పడ్డారందరూ! నిన్న చీరలెత్తుకెళ్ళి అల్లరి చేసిన చిత్తచోరుడు అక్కడే ఉన్నాడేమో అనే ఊహ వారి చెక్కిళ్ళలో కెంపులు పూయించింది. తత్తరపడుతున్న నెన్నడుములతో, అందెలు ఘల్లనేలా అటూఇటూ కలియతిరిగారందరూ! ఎపుడొచ్చాడో, ఎటునుంచి వచ్చాడో తెలియదు కానీ, నవ్వుతున్న మోహన మురళీధరుడు తమ మధ్యలో.. మణిహారం మధ్యలో మెరిసే అనర్ఘ రత్నంలా తళుక్కుమన్నాడు. ఒక్కసారి తడబడ్డారు. ఎదురుచూడకనే ఎదురైన ఆనందానికి వారి మోములు దీపాల వలే మెరిసాయి.
"మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చాను." కృష్ణుడు పలికాడా? గండు తుమ్మెద ఝుమ్మందా? వారి కనులు కలువలయ్యాయి! శిఖిపింఛాన్నీ, నల్లని ముంగురులనూ, వనమాలనూ, పీతాంబరాన్నీ అల్లరిగా తాకివెళ్తున్న తెమ్మెరపై పట్టలేని ఇడుగడ కలిగింది గోపకాంతలకు.
"పూజ పూర్తి చేసుకున్నారా?"
"ఓ.."
"నా వద్దకేగా బయలుదేరబోతున్నారు!"
"ఊ.. అవును."
"నేనే వచ్చానుగా! చెప్పండి."
"కృష్ణా! ఎంత ఆనందంగా ఉందో!"
"ఊ..."
"ఎంత కష్టపడి తెలవారక మునుపే నిద్రలేచావో! ఇంత దూరం మా కోసం వచ్చావో!"
"మాయ మాటలు మాని ఏం కావాలో చెప్పండి, వయ్యారులూ!"
"ఏం కావాలన్నా ఇస్తావా?"
"నేనేం ఇవ్వడానికి సమర్ధుడనో మీకు తెలియదా!"
"నువ్వు వాసుదేవుడవు! నీకు సాధ్యం కానిది ఉందా?"
"అన్నీ తెలుసుకున్నారు కదా! ఏం కావాలో చెప్పండి మరి!"
"మాకు గాజులు కావాలి."
"పూలచెండ్లల్లే సుకుమారంగా ఉన్న మీ చేతులు సూడిగముల కాఠిన్యానికి నొచ్చవూ!"
"ఇదిగో.. మాయ మాటలొద్దు కన్నా!"
"ఊ.. సరే సరే! గాజులు.. అంతేనా?"
"జుమికీలూ, చెవి తమ్మెట్లకి అలంకరించుకునే పువ్వులూ కావాలి."
"తలిరాకుల చెవులకు పువ్వుల జుమికీలు, చెవాకులు! బాగు బాగు!"
"మరి మా కాళ్ళకు అందెలో!?"
"పదపల్లవాలకు లత్తుక చాలదూ! నూపురాలు ఒత్తుకుని నొచ్చితే, నేనేగా సేవలు చేయాల్సినవాడిని!"
కృష్ణుడి మాటలకు ఉక్రోషపడదామనుకుని ఆగిపోయారు. "చిక్కని పూపొదరింటో, ఏ పొగడ తిన్నె పైనో, మావి కొమ్మ ఊయలలోనో కూర్చున్న తన పాదాలకు నల్లనయ్య మక్కువగా పారాణి అద్దిన నాటి గురుతు" ప్రతి గోపిక మనసులోనూ మెదిలి వాగ్బంధనం చేసింది. చిగురుకటారి కోలలకు విలవిల్లాయి వారి ఎడదలు!
"సూడిగములు, జుమికీలు, చెవి ఆకులు, పాడగములు.. అంతేనా?"
ఇంకా ఏం అడుగుదామని ఒకరినొకరు చూసుకున్నారు. గాజులకి జోడు 'బాహుపురులు' కూడా ఉంటే చేతులు నిండుగా ఉంటాయని అనుకున్నారు.
"కేయూరములు కూడా కావాలి, కన్నా!"
"ఊ.." ఇంకా.. అన్నట్టు చూసాడు.
"ఆడువారికి చీరలంటే ఎంతో ప్రీతి. నీకు తెలిసిందే కదా! మాకు వన్నెల చీరలు కావాలి." తల తాటించి నవ్వాడు.
"ఆడు వారి కోరికలని నవ్వుకుంటున్నావా? మాకు పెద్ద పెద్ద కోరికలేమీ లేవయ్యా! తన అన్న వాలిని చంపమని సుగ్రీవుడు కోరితే కాదన్నావా? తమ్మునితో నేస్తం కట్టి అన్నని చంపావు కదా!" ఒక గోపి నిష్టూరాలు ఆడింది. మారాడక నవ్వాడు నల్లనయ్య.
"శత్రు వర్గం వాడైనా శరణుజొచ్చాడని విభీషణుడిని లంకాధిపతిని చేసావు. మాకు రాజ్యాలక్కర్లేదులే!" ఈ మాటకీ వెన్నలా చల్లని చిరునవ్వే సమాధానం!
"రాముడై ఏం చేసావో ఎందుకిప్పుడు! కృష్ణుడివై పుట్టావు. గోకులాన్ని కాచేందుకు కొండనెత్తావు. గోవిందుడవైనావు. గోవిందా! మాకోసం ఇప్పుడు నువ్వేమీ కొండలు ఎత్తక్కర్లేదయ్యా! కూడదనక మేమడిగిన చిన్ని చిన్ని కోరికలు తీర్చు చాలు!" తన వంతు మాటలు ఇంకో గొల్లెత అనేసింది.
"ఏదో, నీరాడి వచ్చి వ్రతం నోచుకున్న సంతోషంలో అడుగుతున్నామంతే! మా పూజ పూర్తి అయ్యే సమయానికి నువ్వు వచ్చావు. ఎంత ఆనందంగా ఉందో! ఈ ఆనందంలో నీతో కలిసి పాయసం తినాలని ఉంది కన్నా!" అందరి మనసులలోనూ ఉన్న కోరికను ఎరిగినట్టు కమలిని చెప్పింది. అవునన్నట్టు తలలూచారందరూ!
"గోపబాలురతో కలిసి చల్దులు భోంచేసావట! మా అన్నలు తమ్ములూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. "కన్నయ్య మా చల్ది తిన్నాడని, మా ఊరుగాయ బాగుందన్నాడనీ! నాకు తినిపించాడనీ, నా చేతి వెన్నముద్ద తిన్నాడనీ" మాకా భాగ్యం కలిగించవూ!" తమ చిరకాల వాంఛ బయటపెట్టారు గోపికలు!
"ఊహకే ఎంత ముద్దుగా ఉంటుందో! ఊరుగాయ నాకుతూ మాటిమాటికీ వేలు మడిచి ఊరించేదొకడు. ఒకని చల్దిముద్ద దొంగలించి గుటుక్కున మింగి "చూడు లేదని!" నోరు చూపునొకడు. ఇద్దరికి కలహం సృష్టించి వారి చల్దులు ఆరగించేవారట మిగిలిన వారు! "కృష్ణా! మా అమ్మ చేసిన భక్ష్యమిదిగో!" అని నీచేత తినిపించేదొకడు. నవ్వే వాడొకడు. నవ్వించేదొకడు. వింత చేష్టల వాడొకడు. వినోదించేవాడొకడు.. ఈ సందడిలో లేగదూడవలే ముద్దొచ్చే నువ్వెంత అందంగా ఉండి ఉంటావో!!
కడుపున దిండుగా గట్టిన వలువలో లాలితవంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును జాఱి రానీక డాంచక నిఱికి
మీగడ పెరుగుతో మేళవించిన చల్దిముద్ద డాపలి చేతమొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి
సంగిడీల నడుమ జక్కగ కూర్చుండి, నర్మ భాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుడమరులు వెఱగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె
వంశీ మోహనా! అల్లరి కన్నయ్యా!! నడుము చుట్టూ కట్టిన ఉత్తరీయం సందున నీ పిల్లనగ్రోవి, ఊదుకునే కొమ్ము బూర, పశువులనదలించే బెత్తం జారకుండా దూర్చుకుని, మీగడపెరుగుతో కలిపిన చల్ది ముద్ద ఎడమ చేత్తో భుజిస్తూ మధ్యలో చెలికాండ్రు తెచ్చిన ఊరుగాయలు వేళ్ళసందుల జిక్కించి నాకుతూ.. బ్రహ్మాదులు వింతగా చూసేలా, అసూయ చెందేలా గొల్లపిల్లలతో కలిసి చల్దులారగించావట! బ్రహ్మ ఆ అసూయతోనే గోపబాలురనూ, గోవులనూ దొంగలించి ఉంటాడు. యాగభోక్తవి! నీతో కలిసి చల్దులు తిన్న ఆ వెర్రి గొల్లలదెంత పున్నెమో! వారెంత ధన్యులో!!
మాకూ నీతో కలిసి బంతిన కూర్చుని పాయసము తాగాలని ఉంది. నేయి, పాలు పోసిన మధురమైన పరమాన్నం తినాలని ఉంది. తింటూ ఉంటే మోచేతి నుంచి నేయి ధారగా కారేలా, నీతో కలిసి భోగ్యమైన పాయసం ఆరగించాలని ఉంది, కన్నా!"
వేడవచ్చునా మరికొన్ని మా
వేడుకకై కొన్ని!
కూడని వారిని ఓడించే
శుభ గుణములు గల గోవిందా!
ఆడువారి కోరికలనుకోకు!
కూడదనకు గోవిందా! నీ
రాడి వచ్చి వ్రతమూనిన ముదమున
అడిగెదమంతే స్వామీ!
సూడిగములు, జుమికీలు, చెవాకులు,
పాడగములు, కేయూరములు,
తొడవులన్ని కయిసేయగవలదో!
తొడగవలదొ పలువన్నెల వలువలు!
ఇంతకన్న శుభవేళ ఏదీ?
ఇంతకన్న ఆనందమేదీ?
బంతులుగా నీతోడ గూడి,
ఇంతులమెల్లరము
నేయి వెన్న మీగడలు
తీయని తీయని పాయసము
చేయిమునుగగా ఆరగింపగా
చేయవా! చిత్తగింపగా!
గోపతరుణులు కోరిన కోరికా, పాడిన పాటా.. పాల పాయసమంత తీయగా ఉంటే గోవిందుడు కాదనగలడా!
"గోప భామలూ! మీ కోరిక సబబైనదే! గొల్లపిల్లలై ఉండీ ఇన్ని రోజులుగా నేయీ, పాలూ లేకుండా వ్రతమొనర్చారు. నన్ను మెప్పించారు. ఈ రోజు మీ కోరికను కాదనను. "అహం అన్నం అహమన్నాదః" అన్నమూ నేనే, అన్నము భుజించేదీ నేనే! మీకు దోషమంటదు. అదిగో.. గోపన్న తెచ్చిన పాయసం ఆరగిద్దాం రండి!" అని అటుగా చేయి చూపాడు.
నూట ఎనిమిది కడవలతో మధురమైన పాయసము సఖులతో కలిసి తెచ్చి గోవిందునికి సమర్పించాడు గోపన్న. ఆశ్చర్యంగా తనని చూస్తున్న చెల్లెలు అమృతని, మిగిలిన గోపబాలలనూ చూసి నవ్వాడు.
"అమ్మాయిలూ! ఇంత దీక్షగా వ్రతం చేస్తున్నారే! మీ కోరిక ఫలించాలని కోరుకుంటూ, కృష్ణ స్వామి మీపై దయ చూపిస్తే పాయసం తినిపిస్తానని మొక్కుకున్నాను. కన్నయ్యతో కూడి ఆరగించండి!" పాలతరగలా నవ్వుతూ చెప్పాడు గోపన్న.
ముత్యాల కోవలా కూర్చున్న గోపికల నడుమ నీలమణి వలే జిగేల్మంటున్న మోహనకృష్ణుడు! వారి మోచేతుల నుండి నేతిధారతో కలిసి కారుతూ కమ్మని తీయ తీయని పాయసం! నారింజ కాంతులు చిమ్ముతూ తూర్పున ఉదయిస్తున్న భాస్కరునికి.. శీతగాలిలో నేతి సువాసనతో కలిసి తేలుతున్న కుంకుమ పువ్వు, యాలకులు, పచ్చకప్పురపు ఘుమఘుమలు నోరూరించే ఉంటాయి!!
కాత్యాయనీ వ్రతం నియమాల ప్రకారం నెయ్యిని తాకరాదు అని రాశారు. మరి పొంగలీ, పరమాన్నం...?
అవునండీ, నిజంగా కాత్యాయనీ వ్రతం చేసేవారికి వ్రతసమయంలో నేయి (పొంగలిలో కూడా), పాలు పనికిరావు. (కాటుక, పూవులు, కొత్తబట్టలు, విలాసాలు కూడదు. ఏకభుక్తం ఉండాలి.) కూడారై నాడు స్వామి వారితో కూడి భుజించాడు కనుక ఆ రోజు మినహాయింపు దోషం అంటదని చెప్తారు.
అవునండీ, నిజంగా కాత్యాయనీ వ్రతం చేసేవారికి వ్రతసమయంలో నేయి (పొంగలిలో కూడా), పాలు పనికిరావు. (కాటుక, పూవులు, కొత్తబట్టలు, విలాసాలు కూడదు. ఏకభుక్తం ఉండాలి.) కూడారై నాడు స్వామి వారితో కూడి భుజించాడు కనుక ఆ రోజు మినహాయింపు దోషం అంటదని చెప్తారు.
వట్టి వెర్రి గొల్ల పొలతులము!- 28
"చెలియా! నిన్నటి ఆనందం వేరొకరికి దక్కేది కాదు. బ్రహ్మేంద్రాదులైనా తలక్రిందులుగా తపస్సు చేస్తే మాత్రం కన్నయ్య సరసన కూర్చుని భోజనం చెయ్యగలరా? మన పున్నెం ఎంతని చెప్పాలి! ఇంత పరమానందం మన సొంతమయినాక కూడా, పరవాద్యమీయమని కృష్ణుని ఎలా అడగడం?" వాపోయింది కమలిని.
"నిజమే! ఎన్ని మాటలన్నాము! ఎన్ని నిందలు మోపాము. ఇవేవీ పట్టనట్టు ఒక్క క్షణంలో మనని మహదానందంలో ముంచి వెళ్ళిపోతాడు కదా! కన్నయ్య కరుణ అపారం!" పూవులేరి సజ్జ నింపుతూ కమలినితో చెప్పింది సురభి.
చెంత చేరిన సాటి గొల్లెతలు వారి మాటలను విని తలొకరూ తాము చేసిన మునుపటి తప్పులను తలచుకోనారంభించారు. తోటి గోపబాలుర మధ్య సింహపు కొదమ వలే ఒప్పారే కృష్ణుని శైశవక్రీడలను మరి మరి తలచుకు మురిసారు. అతడు సామాన్యుడని తలచి "అల్లరి వాడని" యశోదకు చాడీలు చెప్పిన తమ తెలివితక్కువ తనాన్ని గురుతు తెచ్చుకుని బాధపడ్డారు.
కన్నయ్యకు కడుపు నిండుగా పాలిచ్చి, ముద్దులొలికే ఆ నందకిశోరుడి మోము చుట్టూ చేతులు తిప్పి, కణతలకు నొక్కుకుని మెటికెలు విరిచి, పాలబుగ్గన ముద్దిచ్చి, గృహకృత్యాలలో పడిన యశోద కళ్ళు గప్పి, ఇరుగుపొరుగుల ఇళ్ళలో దూరేవాడు నల్లనయ్య. గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే కవ్వాన్ని గట్టిగా పట్టుకుని ఆపి వెన్న పెట్టమని మాటి మాటికీ నిర్భంధించేవాడు. "కన్నయ్యా, ఏదీ ఒక మారు నృత్యం చేస్తివా.. ఇదిగో ఈ వెన్నముద్ద నీ చేత పెడతా"మని గోపికల చేత అడిగించుకుని ఘల్లుఘల్లుమంటున్న గజ్జెలతో, మొలనూలి మువ్వలతో, మొలక నవ్వు చిందులేస్తున్న ముద్దు మోముతో.. ఆడి కనువిందు చేసేవాడు. మైమరచి చూస్తున్న గోపికల చేత వెన్న ముద్దను తటాలున చేజిక్కించుకొని 'గున్న ఏనుగు తొండం చివర మెరిసే తెల్లకలువ మొగ్గవలే' అందాలు చిందే తన చేత వెన్నముద్దను చూపుతూ, నవ్వుతూ పరుగులు తీసేవాడు.
అందరి ఇళ్ళలోనూ చక్కగా కాగిన పాలు, రాయి వలే తోడుకున్న పెరుగు, నేయి, వెన్న, మీగడ తను తిన్నంత తిని స్నేహితులకు పెట్టి మిగిలిన కుండలు పగులగొట్టి పాలన్నీ నేలపాలు చేసి వెళ్ళేవాడు. ఎంతో ఎత్తున ఉట్లలో జాగ్రత్తగా పెట్టుకున్న వెన్న కడవలకు తూట్లు పొడిచి నవనీతం యధేచ్ఛగా ఆరగించేవాడు. ఇన్ని దొంగిలించి భోంచేసినా, ఏమీ ఎరుగని వాని వలే తల్లి ఒడిలో చేరి పాలిమ్మని మారాం చేసేవాడు.
తనతో పాటు బలరాముడు, మిగిలిన గోపబాలురను వెంటపెట్టుకుని "మీరు ఆవులు, నేను ఆబోతును" అని రంకెలు వేసే వాడు. "నేను రాజును, మీరు నా భటులు" అని రాజ కార్యాచరణకు ఉపక్రమించేవాడు. "నేనేమో దొంగను, మీరు గృహస్థులు" అని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారి సొమ్ములు అపహరించి, ఎవరికీ తెలియని స్థలంలో దాచి తనూ దాగేవాడు. చేతి బంతులతో ఆటలు, ఉయ్యాలలు, దాగిలిముతలు ఇలా అనేకవిధాలైన ఆకతాయి ఆటలు ఆడుతూ గొల్లపల్లెలో వాడవాడల గగ్గోలుగా పరుగులు తీసేవాడు.
గోపకిశోరుని అల్లరిపనులను గొల్లెతలు తాళలేక యశోదతో మొరపెట్టుకున్నారు.." ఓ యశోదమ్మా! నీ ముద్దులపట్టి వల్లమాలిన అల్లరితో మమ్ములను బతకనీయడం లేదమ్మా! మా కడవల్లో ఎర్రగా కాగినపాలన్నీ తన తోటి వారికి పోసి, తాను తాగి వెళ్ళిపోతే బాగుండేది. కడవలన్నీ ముక్కలుచేసి మిగిలిన పాలన్నీ నేలపాలు చేయడమేమైనా పిల్ల చేష్టా? పసివారికి పాలులేవని బాలెంతలు వాపోతూ ఉంటే, మీ వాడు లేగదూడలను విడిచిపెట్టి మా ఆవుల పొదుగుల్లో చుక్క పాలు మిగులనివ్వడు. ఈ అల్లరికి హద్దుందా?
బాలురకు బాలు లేవని, బాలింతలు మొఱలువెట్ట పకపక నగి యీ
బాలుడాలము సేయుచు, నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
వట్టి పసివాడని భ్రమసేవేమో! ఉట్టి మీద కుండలని అందుకోడానికి రోళ్ళు, పీటలు ఒక దానిపై ఒకటి పెట్టి ఎక్కేస్తాడు. తిన్నంత తిని కుండలకు తూట్లు పెట్టడమేమిటో? ఏమైనా బాగుందా? పోనీ వెళ్ళేవాడు వెళ్ళిపోకుండా నిదురిస్తున్న ఓ కోడలి మూతికి కాస్త వెన్న రాసి పోయాడు. దొంగిలించినది కోడలేనని అనుకుని అత్త నింద మోపిందని, అత్తాకోడళ్ళూ సిగపట్లు పట్టుకున్నారు. ఇంకొక ఇల్లు దూరి పాలన్నీ గుటుకు గుటుకు తాగి ఆ కుండలు వేరొక చోట విడిచి వచ్చాడట! ఆ రెండు కుటుంబాల పోరూ అంతా ఇంతా కాదు. మైమరచి నిద్రిస్తున్న ఆమె కొడుకు పిలకకు లేగదూడ తోకని ముడి వేసి దాన్ని వీధిలోకి తోలాడట నీ ముద్దుల కృష్ణుడు! ఏమైనా చిన్న ఆగడమా ఇది! వీధి చివర ఆడుకుంటున్న ఓ పిల్లాడి కుత్తుక వరకూ వెన్న బలవంతంగా తినిపించాడట! మా పిల్లలు పిల్లలు కారా? మేము ఈ గొల్లపల్లెలో బతకాలా, వద్దా?" అని ప్రశ్నించారు.
బిత్తర పోయి చూస్తున్న యశోద ముందుకు.. దురుసుగా ఒక అడుగు వేసిన ఓ గొల్లెత "ఓ యశోదమ్మా! మేము మీ అంత భాగ్యవంతులము కాదమ్మా! పది కడవల పాలు నేల దొర్లించి కడవలను పిండి చేసాడు. "నువ్వేం చేస్తున్నావని" నా మొగుడు నన్ను తిట్టిపోసాడు. తాళం పెట్టిన ఇంట్లో ఎలాదూరాడో, నీ మాయ పిల్లడు!" అని వాపోయింది. మరో గొల్ల పడుచు "మా లేగలు, ఆవులను ఒక చోట చేర్చి పెద్ద పెద్ద బొబ్బలు పెట్టాడు నీ కొడుకు! అవి బెదిరి అడవిలోకి పరుగులు తీసాయి. ఎంత వెతికినా కనిపించలేదు. మేమెలా బతకాలో నువ్వే చెప్పు!"అని కన్నీళ్ళు పెట్టుకుంది.
ఓయమ్మ నీ కుమారుడు మా యిండ్లను బాలుబెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడికైనను, మాయన్నల సురభులాన మంజులవాణీ!
"అందరూ కలిసి వేరే ఎక్కడికైనా వలసపోతాం, నువ్వూ, నీ గారాల కృష్ణుడూ ఒంటరిగా ఈ గొల్లపల్లెలో ఉట్టికట్టుకు ఊరేగండని" కోపంగా చెప్తున్న వారికి మంచి మాటలు చెప్పి, 'నా బిడ్డ నా చన్ను వీడి రాడ'ని ఒట్లు పెట్టి, వారిని శాంతింపచేసి ఇళ్ళకు పంపించింది యశోదమ్మ.
ఇంటికి వచ్చిన కన్నయ్య అన్యమనస్కంగా కూర్చున్న అమ్మ ఒడిలో దూరి "ఆకలేస్తోందమ్మా! పాలివ్వవూ!" అని ఒక చేత్తో ఆమె కొంగు లాగుతూ, మరో చేతిని ఆమె గడ్డం కింద ఉంచి ముద్దు ముద్దుగా బతిమాలాడు. కరిగి నీరైన ఆ తల్లి చప్పున కన్నయ్యకి పాలివ్వనారంభించింది. పాలునిండిన బొజ్జతో ఆయాస పడుతూ, పాలచారికలతో మెరిసే బుగ్గలతో అమాయకంగా తననే చూస్తున్న కృష్ణునితో "కన్నయ్యా! పాలు తాగి మనింట్లోనే ఉండి ఆడుకోరాదా? ఎందుకు ఇరుగుపొరుగు వారి మాటలు పడుతున్నావు! నా వద్ద పాలెప్పుడూ జాలై ప్రవహిస్తున్నవి కదా! "తల్లిపాలు గుక్కెడు - మిగిలినవి పుట్టెడు సరిసమాన"మన్న నానుడి నా పట్ల బొంకైనదేల! ఎందుకు నీకింతటి లేనిపోని రొష్టు?" అని ప్రశ్నించింది. మారాడక తల్లి గుండెలపై తల ఆన్చి కనులు ఓరగా మూసుకుని నిద్రపోయాడు కన్నయ్య.
తెల్లారిందో లేదో "అమ్మా! తమ్ముడు మన్ను తిన్నాడని" బలరాముడు పరుగున వచ్చి చెప్పాడు. నిన్న చెప్పిన సుద్దులు అప్పుడే పెడచెవిన పెట్టాడన్న కోపంతో పరుగు పరుగున కన్నయ్య వద్దకు వెళ్ళింది యశోద.
"కన్నా! మన్ను తిన్నావా? నీకు ఆకలైతే పాలూ, వెన్నా లేవా? అతి రుచికరమైన భక్ష్యాలు ఎల్లవేళలా ఇంట్లో ఉంటాయి కదా! మన్ను తినాల్సిన అగత్యమేమొచ్చింది?" అని గద్దించింది.
"లేదమ్మా.. అన్న కొండేలు చెప్తున్నాడు. నేనేమైనా వెర్రి వాడినా? కొంటె పనులు మానేసానమ్మా! వీళ్ళందరూ నాపై చాడీలు చెప్తున్నారు. నమ్మకం కుదరని దానివైతే ఇదిగో.. నా నోరు చూడు!" అని ముత్యాల పాల పలువరుసతో, ఎర్రనెర్రని చిట్టి నాలుకతో ప్రకాశిస్తున్న నోటిని తెరచి చూపాడు.
యశోద కృష్ణుని నోటిలోకి తేరిపారా చుసింది. ఎక్కడా మన్ను జాడలేదు. కానీ సూర్యచంద్రులూ, తారకలూ, గ్రహాలూ, సప్తసముద్రాలతో, పర్వతాలతో కళకళలాడుతున్న విశాలవిశ్వం సాక్షాత్కరించింది. ఆ మాయ 'కలో, నిజమో!' తెలియనిదై నందుని ఇల్లాలు చిగురాకువలే వణికింది.
కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర
స్థలమో బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్
"తన ఎదుట ఉన్నది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే"నని తెలుసుకుని కైమోడ్చి నమస్కరించింది. తృటిలో తన తల్లికి ఆ స్మృతి తొలగి మామూలుగా అయ్యేలా మాయ చేసాడు కన్నయ్య.
"అలాంటి కన్నయ్యని సామాన్యుడని తలచి ఎన్ని మాటలన్నాము! ఎన్ని పేర్ల పిలిచాము, మన పాపానికి నిష్కృతి లేదు. కృష్ణుడే దయ చూపి మనని అక్కున చేర్చుకోవలసినదే కానీ, మనం చేసేదేమీ లేదని" పదే పదే అనుకుంటూ కాత్యాయనికి పూజ పూర్తి చేసుకున్నారు గోపవనితలు. యమున ఒడ్డున కూర్చుని ఇప్పుడేమి చేద్దామన్నట్టు ఒకరినొకరు చూసుకున్నారు.
"చెలియలూ! గోవిందుని శరణనడం తప్ప మనం చేయగలిగినదేమీ లేదు. అతడెక్కడ లేదు కనుక! వెర్రి పొలతులమై ఆ ఇంట్లో ఉన్నాడని, ఈ తలుపు వెనుక ఉన్నాడని తలచి మేలుకొలుపులు పాడాము. వెర్రి కోరికలు కోరాము. "పరవాద్యము తప్ప వేరేదీ అక్కర్లేదని" మనసారా కృష్ణుని తలచి కలసి వేడుకుందాం." అని చెప్పింది ఆనందిని. "ఔనని, కృష్ణుడే శరణమ"ని ఏకకంఠంతో పాడసాగారు గోపవనితలు.
చీకాకు పడకూ - చిడుముడి పడకూ-
నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు?
మా పున్నెము వలన గదా
మా కోసమె గాదా, మా
గోపకులములోన దిగి
గోవిందుడవైనావు!
గోవులవెంబడి ఏవో
కోనలలో కానలలో, బడి
పోవు వట్టి వెర్రి గొల్ల
పొలతులము
చిన్ని పేర పిలిచాము ఎన్నొ మాటలన్నాము
ఎన్ని జన్మమములదో ఈ వీడని మన బంధము
ఇక దయచేయుము వరము పరవాద్యము
చీకాకు పడకు చిడుముడి పడకు
నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు!
"కృష్ణా! ఆశ్రిత వత్సలా! మాకేమీ తెలియదు. కుడిఎడమల తేడా ఎరుగని వెర్రి గొల్లలం. గోవుల వెంట కొండల్లో తిరిగే మా పున్నెం ఎంత గొప్పదో..! మా మధ్య మా వాడివై పుట్టావు. నీ అసలు రూపం తెలుసుకొనుట నీ తల్లికే సాధ్యపడలేదు. మా వల్లనయేదా చెప్పు! ఎన్ని మాటలన్నామో, ఎన్ని పేర్లతో పిలిచి నిన్ను చిన్నతనపరిచామో! మా యందు దయ ఉంచాలే తప్ప మాదేమీ లేదు. సూర్యుని కాంతి వీడనట్టు, పూవుని పరిమళం వీడిపోలేనట్టు నిన్ను విడిచి మేమూ లేము. మా వ్రత సంపూర్తికి పర వాద్యము వరమివ్వాల్సిన వాడివి నువ్వే!" అని వేడుకున్నారు.
అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయా ప్రసవభూః
కృతఘ్నో, దుర్మానీ స్మరపరవశో వంచన పరః
నృశంసః పాపిష్ఠః కథమిహమితో దుఖః జలధేః
అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః
"మర్యాద లేని వాడను, క్షుద్రుడను, చంచలమైన మనస్సు కలిగిన వాడను, అసూయ నిండిన మనసుతో పుట్టిన వాడను, కృతఘ్నుడను, మానము లేని వాడను, కామపీడితుడను, వంచనపరుడను, చెడ్డమాటలాడేవాడను, పాప కార్యాలను చేసేవాడను.. ఇన్ని దుర్గుణాలున్న నన్ను దుఖఃజలధి దాటించే నావ నీ చరణములే!" అని ఒప్పుకుని శరణన్న వాడికి పరమాత్మ క్షణమైనా వీడి ఉండలేడు. "అమ్మా.. తప్పు చేసాను." అని ఒప్పుకున్న వాడిని అక్కున చేర్చుకుని కన్నీరు తుడిచేదే తల్లి.. కదూ!
ఇవాళ్టి కథ చదవగానే ఏక శ్లోకీ భాగవతం గుర్తుకొచ్చింది....
ఆదౌ దేవకి దేవి గర్భ జననం
గోపీ గృహే వర్ధనం
మాయా పూతన జీవితాపహరణం
గోవర్దానోద్ధారణం
కంసఛ్చేదన కౌరవాది హననం
కుంతీ సుతం పాలనం
ఏతద్భాగవతం పురాణ ఖచితం
శ్రీ కృష్ణ లీలామృతం...
ఆదౌ దేవకి దేవి గర్భ జననం
గోపీ గృహే వర్ధనం
మాయా పూతన జీవితాపహరణం
గోవర్దానోద్ధారణం
కంసఛ్చేదన కౌరవాది హననం
కుంతీ సుతం పాలనం
ఏతద్భాగవతం పురాణ ఖచితం
శ్రీ కృష్ణ లీలామృతం...
మా మనసు నీకు తెలియదనా? - 29
కాత్యాయనీ వ్రతానికి ప్రత్యక్ష సాక్షియైన యమున నెమ్మదిగా కదులుతోంది. రేరేడు కొలువు చాలించి ఇంటికి బయలుదేరినవాడే.. గోపికల రాకను గమనించి ఆగి చూసాడు. తూర్పున శుక్రుడు ఉదయించాడు. రంగురంగుల పుష్పాలతో నిండిన సజ్జలను, పూజాద్రవ్యాలనూ చేతబూని ఆ ఎలనాగలు యమునాతటి చేరారు.
నీట మునిగి "హరిహరీ" అని పైకి లేచిన ఆ గోప తరుణులు ఎనలేని ప్రకాశంతో వెలుగొందసాగారు. సైకత "కాత్యాయని" ప్రతిమ ఎదుట మంగళ దీపికలు వెలిగించి, ధూపమునుంచి, విరులతో అర్చించి, వేడి పొంగలి నివేదన చేసి, కర్పూర హారతులిచ్చారు. కాత్యాయని నిండుగా నవ్వింది. పూజ సంతృప్తిగా పూర్తి చేసుకుని కృష్ణుని వద్దకు నడిచారు.
"రమణీ లలామలారా! మీరడిగిన పరవాద్యమదిగో! తీసుకుని మీ వ్రత పరిసమాప్తి కానివ్వండి." నగుమోముతో పలికాడు నల్లనయ్య.
"గోవిందా! పరిహాసమా?" ప్రశ్నించారు గోప తరుణులు.
"అయ్యో, మీరు విరిచేడెల వలే సుకుమారులు. మీ మనసులూ అంతే కోమలమైనవి. వాటిని కష్టపెట్టడానికి, మీతో పరిహాసాలాడడానికీ నాదేమైనా రాతి గుండె అనుకున్నారా? "
"లేదు కన్నా! నవనీతమంటి మనసు నీది!"
"మీరడిగిన పర వాద్యమిస్తే నిష్టూరాలాడుతున్నారే!"
"నిన్నటి వరకూ మేము పరవాద్యమనీ, ఆభరణాలనీ, పూజాద్రవ్యాలనీ అడిగిన మాట వాస్తవం. కానీ మాకు కావలసినవి అవి కావు."
"మరి వ్రతం సంపూర్ణమయ్యేదెలా?"
"విశ్వకర్తా! నీకు తెలియనిదుంటుందా! కేవలం వాచ్యార్థాన్నే తెలుసుకుని ఒక డప్పు కావాలని కోరుకున్నాం. నీ నామ సంకీర్తనతో మాలో పాపాలను పారద్రోలే శబ్దాన్ని దశదిశలా వ్యాపింపచేసే పరవాద్యం మాకు అవసరమని గ్రహించలేకపోయాం. "నారాయణా.." అని పలికితే ఆ శబ్దమే కోటి 'పర'ల సాటి."
"సరే! ఈ వాయిద్యం వద్దన్నారు. మీకేం కావాలో చెప్పండి!"
కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫః వాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే?
కృష్ణా! నీ పాదాంబుజాలనే పంజరంలో మా మానస రాజహంసను అవశ్యం ప్రవేశించనీ! ఎందుకో తెలుసా? ఈ భవజలధిలో పడి కొట్టుమిట్టాడుతూ జీవితపు చరమాంకానికి వచ్చేనాటికి కఫ,వాత,పిత్తాలచే మా గొంతు పూడుకుపోతుందేమో! అప్పుడు నిన్ను తలచేదెలా? అప్పటి దాకా మమ్మల్ని అజ్ఞానంలో పడిపోనీయక, ఇప్పుడే బంధించు.
"మీరు బాగా ఆలోచించుకునే అడుగుతున్నారా, అమ్మాయిలూ!"
"ముమ్మాటికీ నీ సాన్నిధ్యం తప్ప వేరే ఏ కోరికా లేదు, కృష్ణా! అయినా మా మధ్య పుట్టి, మా మనసులను దోచి, నీ వద్దకు రప్పించుకున్నది నువ్వే కదా! నువ్వు చేసిన పనిపై నీకే సందేహమా! మనసా, వాచా, కర్మణా.. మేము కృష్ణ పదదాసులము. వేరే భోగభాగ్యాలు మాకొద్దు. ఏడేడు జన్మలకు నీ సాంగత్యమున్న చాలు. మాకు నీ పై మనసు నిలిచేలా, మిగిలిన కోరికలు గాలిలో వదలివేసిన కర్పూరం తీరున హరించేలా వరమివ్వు చాలు."
"మరి మీ పెద్దలకేం చెప్తారు? నెలకు మూడు వానలు కావాలన్నారు! వ్రతం చేసినదే అందుకని కదా!"
"గోవు అంటే భూమి కదా! గోవిందుడవు.. ఈ భూమిభర్తవు నువ్వే! మా బాగోగులు నీకు తెలియదా? అయినా మాకు నీతో తప్ప వేరెవ్వరితోనూ బంధం వద్దు. మాకు తండ్రి, అన్న, బంధువు, భర్త, పుత్రుడు అన్నీ నువ్వే! "భ్రాతా భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ" అన్న లక్ష్మణుని వలే మా సర్వం నువ్వే కావాలి. మా ఈ సుందర తనూలతికను సృష్టింపబడింది పరదాస్యానికా? నీ పేరు పలికితే మది ఝల్లన పొంగే హాయి ముందు అమరభోగాలైనా తృణప్రాయం కదూ!
జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ధన్ నమాధోక్షజం
ఓ నాలుకా! నీలాల ముంగురుల నల్లనయ్యనే తలుచుకో. కేశవుని కల్యాణ గుణాలను పాడు!
ఓ చేతుల్లారా! సిరిని చేపట్టిన శ్రీధరుని అర్చించుట తప్ప వేరేదీ చేయకండి సుమా!
చెవులారా! అచ్యుతుని కథలు మాత్రమే వినండి. అన్యమైనవి మీకొద్దు.
ఓ లోచన ద్వయమా! కృష్ణుని చూడండి! ఆ అందగాడినే రెప్పవేయక చూడండి.
హరిని చేరే దారిలో నడవమని మా పాదాలను కోరుకుంటున్నాం.
నీ పాదాలనర్చించిన తులసి సుగంధం తప్ప వేరే సువాసనా సోకవలసిన అవసరమే లేదు.. మా నాసికకు! అధోక్షజునికి నమస్కరించడానికే మా శిరస్సు!
మురారీ! మోహన మురళీధరా! నీ చెంతనుండే భాగ్యమిస్తివా.. వేయి జన్మలెత్తేందుకైనా సిధ్ధం! మాకు జన్మ రాహిత్యమొద్దు. మోక్షమూ వద్దు. పరమపదము అసలే వద్దు. ఋషులు కైవల్యాన్ని కోరుకుంటారే కానీ, అక్కడ నువ్వు మాకింత చేరువగా ఉంటావో ఉండవో, నిన్ను ఇంత దగ్గరగా చూడగలమో లేదో, నిన్నిలా "గోవిందా!" అని పిలవచ్చో కూడదో.. మాకేం తెలుసు! మాకు కావలసినదల్లా ఇలా ఈ రేపల్లెలో నీ మ్రోల నిలచి నిన్ను కన్నార్పక చూడడం మాత్రమే!"
ఒకటే కోరిక మా కిక
ఓ స్వామీ! గోవిందా!
మా మనసు నీకు తెలియదనా?
ఈ మనవి చేసుకొనుట!
తెలవారక మున్నే, దేవా, నీ సన్నిధి
చెలులము చేరి, నీ కొలువే కోరి,
సరస సుందరములు
సంఫుల్ల సరోజములు నీ
చరణములకు మంగళా
శాసనము చేయుట
పరవాద్యమున కనా?
ఓ స్వామీ గోవిందా!
ఆల మేపి బతికే ఈ
బేలలలో ఒకడవై
అవతరించుటేల? మా
అనుగవు కానేల?
ఈ బంధము నిలుపుము ఏ
డేడు జన్మముల కైన!
ఈ కైంకర్యము మానము
ఏనాటికి ఎప్పటికీ!
వికసిత పద్మాల వలే అందాలు చిందే మోములతో, ఆర్ద్రమైన కన్నులతో, ముకుళించిన చేతులతో, హిమస్నాతలైన విరుల వలే స్వచ్చమైన హృదయాలతో.. అపరంజిబొమ్మల వలె తన చెంత ఆర్తితో నిలిచిన ఆ గొల్ల పడుచులను చూసి నవ్వాడు కృష్ణుడు. వెన్నెల సోన కురిసినట్టై గోపీమానస చకోరాలు పులకించాయి.
"ప్రియ భామినులూ! మీ కోరిక కాదనుట నావల్లనయే పనేనా!! మీ ప్రేమకు బానిసను!"కాత్యాయనీ వ్రతం" చక్కగా సంపూర్తి చేసుకున్నారు. నన్ను పొందడమే మీ గమ్యమైతే మీ అభీష్టం సిధ్ధించినట్టే! నా పరిష్వంగన సుఖం తప్ప వేరేదీ వద్దన్న మీ గాఢమైన కోరికకు, కౌగిలికి బందీనయ్యాను." అని మృదుమధురంగా పలికాడు. గోపికల మనసులు గోపాలకృష్ణునితో ఏకమయ్యాయి.
భోగ్యమైన రాసలీల - 30
పుచ్చపువ్వల్లే వెన్నెల కాసిన వేళ... మృదు మోహన మురళీ రవళి విని గోపికల మది ఝల్లన పొంగిన వేళ.. గొల్లపల్లెలో పడుచులందరూ చేతిలో ఉన్న పని విడిచి, కాలుచేయాడక.. నిశ్చేష్టితులై.. తృటిలో తేరుకుని వంశీకృష్ణుని చేరేందుకు.. మొగలి పొదవైపు నాగకన్నియలు పరుగులు తీసినట్లు, చరచరా పరుగులు తీసిన వేళ.. వీడిన సిగలతో, చెమటలో తడిసి కరిగి కుంకుమ ఎదలోయల్లోకి పారుతూండగా, జారిన పయ్యెదలతో, తడబడు అడుగులతో, తమ ప్రియుని.. మాధవుని వెదకే కనులతో, బంధాలను విడిచి బృందావని చేరారు. కృష్ణచంద్రుని కన్నార్పక చూచే కలువభామల వలే తనను పరివేష్టించిన గోపాంగనలను చూచి నల్లనయ్య నవ్వాడు.
"భామినులారా! ఇంత రాత్రివేళ ఎలా వచ్చారు? దారిలో అడవి పురుగూ బూచీ ఉంటాయే.. మీకు భయం కలుగలేదూ! మీ ఇంట్లో వారు ఏమనుకుంటారో! మురళీగానం విన్నారు కదా.. ఇంక మరలి వెళ్ళండి." అని పలికిన కృష్ణుని పలుకులు ఆ గోపతరుణుల మనసులలో మునుపు నాటిన సుమశరుని విరికోలలకంటే పదునుగా గుచ్చి గాయపరచినవి.
"కృష్ణా! మనోహరా! నిను కోరి కాత్యాయనీ వ్రతమొనర్చి, నీ పిల్లన గ్రోవి పాటకు మైమరచి.. బంధాలన్నీ తెంచి నిన్ను చేరాము. ఇదంతా నీ సంకల్పమే కదూ! ఇప్పుడు నువ్వే మమ్మల్ని వెనుతిరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నావే! నీకిది న్యాయమా? ఈ విశ్వంలో ఏ ప్రాణికైనా సంతత ప్రేమోద్దీపకుడవు! మదనుడైనా కన్నార్పక చూసే భువనమోహన సౌందర్యం నీది. నిను కోరి వచ్చిన వనితలను చులకన చేస్తావా?" అతివలు బేలగా అడిగారు.
"అయ్యో! పరపురుషుని కోరి వచ్చారే! మీకిది తగునా?" పగడాల పెదవిపై తర్జని ఆన్చి తప్పు వలదన్నాడు మాధవుడు.
"కృష్ణా! సర్వ భర్తవు! అగ్ని వలే దేనిని దహించినా మాలిన్యము అంటని వాడవు. తామర తేనియ రుచి మరిగిన తేటిని వేరే విరులు ఆకర్షించునా? మా మనసు నీ యందే లగ్నమై ఉన్నదన్న నిజం గ్రహించి, నీ చిరునగవు వెన్నలల కొరకు చకోరాలమై నీ ముందు నిలచిన మమ్మల్ని ఆత్మారాముడవై స్వీకరించవలసినదని" వేడుకున్నారు ఆ గోప వనితలు.
మదనకీలకు మరుగుతున్న వారి నిట్టూర్పులను తన చల్లని చూపులతో, స్పర్శతో శాంతింపజేసాడు యదునందనుడు. చుక్కల మధ్య నిండు జాబిలి వలే ప్రకాశిస్తూ గోపికలతో కలసి బృందావనిలో విహరించసాగాడు. ఆటలలో అకస్మాత్తుగా అల్లరికృష్ణుడు మాయమయ్యాడు. అది గ్రహించిన గొల్లపడుచులందరూ కలవరపడుతూ నలుదెసలా గాలించనారంభించారు. మోహావేశితలై, గద్గద స్వరంతో చెట్టునూ, పుట్టనూ ప్రశ్నించనారంభించారు.
"మన్మథుని శరాలకు మమ్మల్ని ఎర చేసిన ఆ మాధవుడు మాయచేసి ఈ నట్టడివిలో వీడిపోయాడు. ఇది న్యాయమా? ఓ పున్నాగమా! పురుషోత్తముడైన కృష్ణుని చూసావా? ఓ తిలకమా! ఘనసారమా! మా మనోహరుని చూసారా? ఓ వెదురు పొదా! నీ వెదురుతో చేసిన వంశిని చేతబూనిన ఆ అల్లరివాడిని నువ్వేమైనా చూసావా? ఓ చందన వృక్షమా! చల్లని మా స్వామి నీకు కనిపించాడా!
పున్నాగ కానవే పున్నాగవందితు దిలకంబ కానవే తిలకనిటలు
మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని
ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు
జందన కానవే చందన శీతలు గుందంబ కానవే కుందరదను
నల్లని వాడు పద్మ నయమబులవాడు కృపారసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలచాటున లేడుగదమ్మ చెప్పరే!
ఓ మల్లికలారా! మా కృష్ణుని గురుతులు మీకు చెప్తాము. అతడు నల్లని వాడు. పద్మనేత్రముల కృపారసమ్ము చిందించేవాడు. నవ్వుమోమున రాజిల్లు వాడు. నెమలిపింఛం అలంకరించుకున్న నీలాలకురుల సొగసుకాడు. మా మానధనం కొల్లగొట్టి మీ పొదల వెనుక దాగి ఉన్నాడేమో చెప్పరూ!
ఓ పాటలీ లతలారా! ఓ ఏలకీ లతలారా! మాధవీ వల్లికలారా! వాని బంధించి మాకు అప్పగించరూ! ఓ చూతమా! వాని చూసావా! ఓ కేతకీ, ఓ కోవిదారమా! మీ సురభిళ వీచికలతో మమ్మల్ని ఇంకా హింసింపక నల్లనయ్యను పట్టివ్వరూ! "అని బృందావని కలియతిరుగుతున్న గోపికల ఎదుట జగన్మోహనుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిలిచాడు.
ఎదుటపడిన ప్రియుని నిందించేదొకతె. తన చూపుల తీవెలతో అతని చుట్టి కనులు మూసి ఆతని రూపు హృదయమందు నిలిపి ఆనందపులకాంకితయైనది వేరొకతె. కోపము నటించేదొకతె. వాలుచూపుల వయ్యారి ఒకతె. గ్రక్కున కావలించేదొకతె. చేయి పట్టేదొకతె. గాటపు వలపున చుంబించేదొకతె. "నీ ఎడబాటున నేను మరణించలేదేలా!" అని కన్నీరై కరిగేదొకతె. "విడిచిపోకుమా!"యని కాళ్ళను బంధించేదొకతె. "ప్రాణేశ్వరా!" అని ఎలుగెత్తి పలవరించేదొకతె. "కృష్ణా!" అని ఆతని మోము తడిమిచూసేదొకతె.
"మగువలూ! మీరు చెప్పిన మాటే! ఎదురుచూసి కష్టపడి దక్కించుకున్న ఫలము బహు తీయన!" అని మనోహరంగా నవ్వాడు కృష్ణుడు. ఆ పిదప గోపభామినుల చేరి వేయి బంగరురేకుల తామరలో వెలిగే కర్ణికవలే ఒప్పారుతూ రాసలీలల తేలియాడాడు కృష్ణ స్వామి. లావణ్యవీణ మీటినదో లేమ. వల్లకి పలికించినదో తరుణి. అచ్చరలు పూవులవాన కురిపించగా, గంధర్వాదులు మోహవివశులవగా, చుక్కలు చంద్రుని సరసన చేరి మక్కువతో చూస్తూండగా గోపసుందరులతో కలసి రసనాట్యమాడాడు.
ఆపై గోపీసమేతుడై జలక్రీడలకు ఉపక్రమించాడు. గోపికలు నీటిలో నిదురిస్తున్న రాయంచలను అదల్చి తామరలను కోసి సిగలో తురుముకున్నారు. తామరాకులపై తపోనిద్రలో ఉన్న చక్రవాకాలను "తమ సొగసులకు సాటి రాలేరు పొమ్మని" వెక్కిరించారు. నీట మునిగి మోము మాత్రమే చూపి చందమామను పరిహసించారు. దోసిళ్ళతో వారు చిమ్మిన నీటి ముత్యాలు వినీలదేహంపై మెరుస్తూ ఉండగా.. ఆడు ఏనుగుల మధ్య చేరి జలకాలాడుతున్న మత్తేభం వలే కృష్ణమూర్తి కనువిందు చేసాడు.
నీళ్ళలో ఆటలాడి, అలసి.. పొద్దు పొడిచే వేళ బయటకు వెడలి సేదదీరుతున్న గోపకాంతల ఒడిలో చేరి ఒకడే వేయి కృష్ణులై, ఒకరికి ఒక కృష్ణుడై ఆత్మాభిరాముడై గోపీవల్లభుడు వినోదించాడు. వేయి కొలనులలో ప్రతిబింబించినా గగనాన దినమణి ఒక్కడే కదూ!
*********************************
కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం
క్రీ. శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో, పూర్వ ఫల్గునీ నక్షత్ర యుక్త శుభసమయాన, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే విష్ణుభక్తునికి తన పెరటి తోటలో ఒక తులసి మొక్క పాదులో, చైతన్యం గల ఒక అపరంజి బొమ్మ కనిపించింది. విష్ణుచిత్తులు ఆ పసికందును దైవప్రసాదంగా భావించి పుత్రికా వాత్సల్యంతో "కోదై" (గోదా) అని ఆమెకు పేరుపెట్టి పెంచుకోసాగారు. 'కోదై' అంటే తమిళంలో కుసుమ మాలిక.
విష్ణుచిత్తులకు ప్రతిరోజూ పరమభోగ్యములైన పుష్పమాలికలను వటపత్ర శాయికి సమర్పించి ఇంటికి రావడం అలవాటు. మగువలకు మాల్యధారణ బహుప్రీతిపాత్రమైనది కదా! ఆ సుకుమారి తండ్రి చూడకుండా, ఆ మాలలను అలంకరించుకుని, అద్దంలో చూసుకుని చప్పుడు చేయక మరల బుట్టలో ఉంచివేసేది. కొన్నాళ్ళకు పూవులదండలో చిక్కిన కేశమును చూచి విష్ణుచిత్తులు కుపితులై ఆమెను నిందించారు. ఆ వేళ మాలలు సమర్పించలేదు.
ఆ రాత్రి ఆయన కలలో కనిపించిన వటపత్రశాయి "ఆ చిన్నది ముడిచిన మాలలే తనకు ముద్దని" చెప్పగా విని విష్ణుచిత్తులు ఆమె మానవమాత్రురాలు కాదని, లక్ష్మీస్వరూపమని గ్రహించి ఆ నాటి నుండీ గోదా ముడిచిన మాలలనే స్వామికి సమర్పించేవారు. అందుకే ఆమెకు "ఆముక్తమాల్యద" అని పేరు.
యుక్త వయసు వచ్చిన ఆమె రంగనాధుని పతిగా వరించి ఆతని పొందేందుకు ధార్మికులనడిగి "భాగవతంలో" ప్రస్తావించబడిన "కాత్యాయనీ వ్రతాన్ని" విల్లి పుత్తూరునే రేపల్లెగాను, తన చెలులనే తోటి గోపికలుగాను, విల్లిపుత్తూరు వటపత్రశాయినే కృష్ణునిగానూ భావించి ముప్పది దినముల వ్రతమాచరించింది. ఆ సమయంలో రోజుకొక పాట చొప్పున కృష్ణునికి పూవులదండ వలే సమర్పించింది. ఆ పాటలే "తిరుప్పావై". ఉపనిషత్ సారమంతా అందమైన పాటల రూపంలో అందించిన గోదా వ్రత పరిసమాప్తి కాగానే రంగనాధుని కల్యాణమాడి ఆతనిలో ఐక్యమైనదని చరిత్ర. ఈ ముఫ్ఫై దినముల కాత్యాయనీ వ్రతమును శ్రధ్ధగా చేసిన వారు, చూసిన వారు ఇష్ట కామ్యార్థములను పొందగలరని ప్రతీతి.
* సదా వెన్నంటి ఉండే ఆచార్య కటాక్షాన్ని పొందిన నా పున్నెం ఈనాటిది కాదు.
కృష్ణ రసాన్ని గరిపిన తాతగారిని తలచుకుంటూ "కృష్ణార్పణం".
( ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)