Saturday, 14 June 2014

శ్రీ‌రాముడి పుట్టుక‌లో గ్ర‌హ‌బ‌లం ఎంతంటే..


గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం... ఇలా అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు. ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు. ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి. అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు.

పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది.

అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు; పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు... ఇవన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం వల్ల, ఆయనను భగవంతుడిగా కొలుస్తామంటారు కొందరు. భగవంతుడే ఒక నిండైన మహా వ్యక్తిగా అవతరించి, లోకానికి ఆరాధ్యుడయ్యాడని ఇంకొందరు చెబుతారు. ఈ రెండో అంశమే వాల్మీకాది మహర్షుల హృదయం!

ఆదర్శమూర్తి అయిన రాముడు- నారాయణుడి అవతారంగా ఎందరికో ఆరాధ్యుడు. రావణాది రాక్షసుల వల్ల సడలిన ధర్మవ్యవస్థను చక్కదిద్దడానికి రుషులు, దేవతలు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మను ఉపాసించారు. జగతికి ఆనందం కలిగించడానికి ఆ పరమాత్మను మంత్రం, తపస్సు, సాధనలతో ఆరాధించారు. వాటి ఫలంగా భగవంతుడు రాముడిగా అవతరించాడు.

రామారాధన అంటే, అది సాక్షాత్తు పరబ్రహ్మోపాసన. దీనికి తార్కాణంగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భిన్న భాషల్లో భిన్న రీతుల్లో పలువురు భక్తులు, యోగులు సాక్షాత్కరిస్తారు. తులసీదాసు, రామదాసు, కబీరు, త్యాగయ్య... ఇలా ఎందరో!

రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని ‘దేవ రహస్యం’ అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా- జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు- దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.

ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదు కోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా- సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు (గట్టి నియమ పాలన గలవాడు) శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ.

భారతజాతి గుండె చప్పుడుగా రామనామం మోగుతూనే ఉంది. ఆస్తిక జన హృదయాల్లో ఆయన దివ్యమంగళ విగ్రహం కొలువై ఉంది. రామ కథా సుధ తరగని జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది!

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు



ధర్మరాజు అశ్వమేధయాగం చేసి హయాన్ని వదిలాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే! పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు అతని నగరం చేరుకున్నారు.మయూరధ్వజుడు కృష్ణభక్తుడనీ, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. సరేనన్నాడు పాండవమధ్యముడు.

మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. సవ్యసాచి అతన్ని సంబాళించలేక పోయాడు. విధి లేక శౌరి సాయం ఆర్థించాడు. పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్యదైవంతో పోరాడటం ఇష్టం లేదు. కాని రణరంగంలో వెనుదీయడం క్షత్రియధర్మం కాదని తలచి “కృష్ణా! కృష్ణా!” అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించడం మొదలు పెట్టాడు. ఆ శరాల ధాటికి ఆ మహాయోగి కూడా చలించాడు.

“బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా?” అన్నాడు అర్జునుడు. పద్మనాభుడు మందహాసంతో “పార్థా! నీ గాండీవం గాని, నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద పనిచేయవు” అన్నాడు.

‘మయూరధ్వజుడు అంతటి భక్తుడా!’ అని గాండీవి విస్తుపోయాడు. మాధవభక్తులలో తనను మించిన వారు లేరని కృష్ణసఖునికి కించిత్తు గర్వముంది. అది మునుపే ఎరిగిన కృష్ణుడు మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. ఇద్దరూ అనాటికి యుద్ధం చాలించారు.

మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్ళారు. విప్రుల రాక గమనించి ఆ రాజు వారికి ఎదురేగి గౌరవ పురస్కారంగా మర్యాద చేశాడు.

“అయ్యా! మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించాడు. “రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకొక పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరితేగాని మేము మరొక విషయం ఆలోచించలేము” అన్నాడు మాయారూపంలో ఉన్న కృష్ణుడు.

“స్వామీ! మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను” అన్నాడు మయూరధ్వజుడు.

“రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత “మయూరధ్వజ మహారాజు శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు” అని అశరీరవాణి పలికింది. అందుకని నాకు పుత్ర భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అన్నాడు విప్రుని వేషంలో ఉన్న కృష్ణుడు.

“ఆహా! నా జన్మ తరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే ఏం కావాలి. అయ్యా! సందేహించకండి. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి” అని వారిని అర్థించాడు మయూరధ్వజుడు.

వెంటనే భార్యాబిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమన్నాడు.

మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారికి అర్థమైంది. మారుమాట్లాడక రాజుగారి శరీరాన్ని చేదించడం ప్రారంభించారు.

కృష్ణార్జునులు అనిమిషులై ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికొక వింత కనిపించింది.

మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కఠిన్యంతో “రాజా! బాధపడుతూ నువ్వేమీ నీ శరీరాన్ని నాకివ్వనవసరం లేదు. మనస్ఫూర్తిగా , సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వముంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడం నైచ్యమౌతుంది. మనమీద వున్న మమకారాన్ని మనం చంపుకోలేక పోవడం దీనికి కారణం. నీ కిష్టం లేని పనిని నీవు చెయ్యవద్దులే” అని వెనుదిరిగాడు.

మయూరధ్వజుడు కృష్ణుని చేతులు పట్టుకుని, “అయ్యా! నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధలేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ వుంటే రెండు కళ్ళూ కూడా నీరు కార్చాలి కదా! ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తోంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలో కుడిభాగం ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదనీ , వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమకన్ను దుఃఖిస్తోంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్నీ సాధించకుండానే, ఎవరికీ ఎట్టి ప్రయోజనాన్నీ కలిగించకుండానే ఖిలమైపోవాలి కదా అని చింతిస్తోంది” అన్నాడు.

ఈ మాటలు విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి అచ్యుతుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గుపడ్డాడు.

పునీతుడైన ప్రియబాంధవునితో సహా కృష్ణుడు తమ నిజరూపాలు తెలియజెప్పి మయూరధ్వజుని దీవించాడు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలుగచేశాడు.

మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునునికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు.