Friday, 28 November 2014

మహా గణపతిం.. మనసా స్మరామి





మహా గణపతిం.. మనసా స్మరామి


సర్వ విఘ్నాలను తొలిగించే దైవం విఘ్నేశ్వరుడు. తొలిపూజలు అందుకునే వేల్పుగా, దేవతాగణాలన్నింటికీ అధిపతిగా ఏకదంతుడిని కొలుస్తాం. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి ప్రతిమలనే పూజించి వినాయక వ్రతకల్పాన్ని కొత్త సంకల్పంతో జరుపుకుందాం.. .

గణపతి ప్రస్తావన మనకు అతి ప్రాచీనమైన రుగ్వేదంలో కనిపిస్తుంది. విఘ్న నివారుడిగా గణేశుడు యుగయుగాలుగా పూజలు అందుకుంటున్నాడు. కృత యుగంలో మహోద్ఘటుడు, త్రేతా యుగంలో మయూరేశుడు, ద్వాపర యుగంలో గజాననుడు, కలియుగంలో ధూమ్రకేతువుగా గణపతిని సేవిస్తున్నారు.

ప్రస్తుతం మనం విఘ్నాలు తొలగించే నాయకుడిగా గణపతిని కొలుస్తాం. దీనికొక కారణముంది. మన శరీరంలో అన్ని అవయవాలు ఏకోన్ముఖంగా పనిచేస్తాయి. అదే విధంగా ఒక పనిలో అనేక కోణాలుంటాయి. ఇవన్నీ విజయం దిశలో ప్రయాణించాలంటే ఆ ఏకదంతుడి ఆశీర్వాదం అవసరం. అందుకే పెళ్లి, పూజ, పితృకార్యాల్లోనూ ముందుగా గణపతిని పూజించాల్సిందే! ఆఖరికి వినాయక చవితినాడు కూడా మొదట పసుపు వినాయకుడికి.. మహాగణాధిపతియే నమః అంటూ పూజ చేశాకే వినాయక విగ్రహాన్ని పూజిస్తాం.

ఏకదంతం అనేక రూపం..
మన శాస్త్రాలలో నృత్య గణపతి, ఉత్తిష్ట గణపతి, విద్యా గణపతి, ఆనంద గణపతి, యోగ గణపతి, అక్షర గణపతి ఇలా మొత్తం 54 గణపతి రూపాలను పేర్కొన్నారు. ఈ మూర్తుల ముద్రల్లోను, భంగిమలలోను తేడాలుంటాయి. వీటిలో 16 మాత్రమే ప్రధానమైనవి. వీటిన్నింటిలోను చాలా ముఖ్యమైనది అక్షర గణపతి. ఒక అక్షరం పలకాలంటే నోటి నుంచి బయటకొచ్చే గాలికి విఘ్నం కలిగించాలి. ఎక్కడ గాలికి విఘ్నం కలిగిస్తే ఆ అక్షరాన్ని స్పష్టంగా పలకగలుగుతామో తెలిపే ప్రఙ్ఞ మనకు ఇచ్చినందుకు అక్షర గణపతిని మనం పూజించాలి. ఇదే అక్షర గణపతి తత్వం. అందుకే వినాయక చవితినాడు పుస్తకాలను దేవుడి ముందుంచి దండం పెట్టుకుంటారు.

ఆరాధించే పద్ధతి..
విఘ్నేశ్వరుడిని ఆరాధించేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. వీటిని ఆగమ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. సృజనాత్మకత పేరుతో విఘ్నేశ్వరుడి విగ్రహాలు విభిన్న రూపాలు సంతరించుకుంటున్నాయి. డ్యాన్స్‌ చేస్తున్నట్టు, క్రికెట్‌ ఆడుతున్నట్టు.. ఇలా ఇష్టమున్న రీతిలో, పోటీ పడి మరీ భారీ సైజుల్లో వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను పూజించటం సరికాదు. ఇవి అలంకారానికే తప్ప పూజకు పనికిరావు. అందుకే ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా దాని పాదాల దగ్గర 12 అంగుళాలు మించనటువంటి మట్టి వినాయకుడిని పెట్టి ఆ విగ్రహానికే పూజ చేస్తారు. ఒకవేళ భారీ విగ్రహాలకే ప్రాణప్రతిష్ట చేయదలిస్తే దానికి అంతటి పూజ చేయాల్సి ఉంటుందంటున్నారు పండితులు. అంతే సమానంగా అన్నదానం కూడా చేయాలని చెబుతున్నారు.

పృధ్వీతత్వ రూపం..
గణపతి పృధ్వీతత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే గణపతి మన శరీరంలో మూలాధారంలో ఉన్నట్టు చెప్తారు. మన శరీరానికి ఓ రూపం ఇచ్చేది మూలాధారం. ఇది పృధ్వీతత్వానికి సంబంధించినది. ప్రకృతి రూపుడైన విఘ్నేశ్వరుడిని పర్యావరణానికి హానికారుడిగా మార్చిన ఘనత మనకే దక్కుతుంది. భూమి బాగుండాలంటే వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారైన బొమ్మలను వాడకూడదు. పూర్వం చెరువు మట్టితో బొమ్మలు తయారుచేసేవారు. ఇలా చేయటం వల్ల చెరువులో పూడిక తీసిన ప్రయోజనంతోపాటు మట్టి విగ్రహాలు తయారుచేసిన ఫలం కూడా దక్కుతుంది. అందుకే మట్టి వినాయకుడినే మహా గణపతిగా కొలుద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం.

నిమజ్జనం చేయాల్సిందే..
వినాయకుడి పూజ చేశాక కచ్చితంగా నిమజ్జనం చేస్తాం. ఇలా నిమజ్జనం చేయకుండా ఉండకూడదా? అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. శాస్త్ర ప్రకారం 365 రోజులు ఇంట్లో ఉంచి పూజ చేయని విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేయాలి. నిమజ్జనాన్ని నీళ్లలోను, మట్టిలోను చేయవచ్చు. నీళ్ల సౌకర్యం లేనప్పుడు విగ్రహాలను పొలాల్లో వేయొచ్చు. ధాన్యపు గాదెల్లో దాచొచ్చు. వడ్లన్నీ అయిపోయాక విగ్రహం బయటపడుతుంది కదా! అప్పుడు దాన్ని తీసుకెళ్లి పొట్లపాదుల్లో ఉంచుతారు. వానాకాలం కాబట్టి వర్షం కురిసినప్పుడు పాదులోని మట్టిలో విగ్రహం కూడా కరిగి కలిసిపోతుంది.

విగ్రహం ఇలా ఉండాలి..

  • విగ్రహం డొల్లగా ఉండకూడదు. కాబట్టి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో అచ్చులు పోసి తయారు చేసిన విగ్రహాలు పూజకు పనికిరావు.
  • విగ్రహం వెండిదైనా, బంగారంతో తయారు చేసిందైనా డొల్లగా ఉంటే అలంకరణకే తప్ప పూజకు పనికిరాదు.
  • విగ్రహం ఆకారాన్ని బట్టి పూజ, సంకల్పం, నివేదన, అన్నదానం, సంతర్పణ చేయాలి.
  • గణపతిని గూర్చి మనం ఏ శక్తిని ఆశిస్తూ పూజ చేస్తున్నామో ఆ శక్తి అందాలంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజ చేయాలి.


Sunday, 26 October 2014

రావణుడు దేవుడెలా అవుతాడు?



రావణుడు దేవుడెలా అవుతాడు?

రావణాసురుడు దేవుడని, ఇటీవల కొందరు ప్రబుద్ధులు, పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే, ఒక్క రావణుడే కాదు మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు... ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారినీ వారు దేవతలంటున్నారు. అంతటితో ఆగకుండా, రావణుడిని అగ్రవర్ణాల వారు అణగదొక్కారని, అతనెంతో నీతిమంతుడని కూడా వాదిస్తున్నారు. వాల్మీకి రామాయణంలో అతడి గురించి తప్పుడు ప్రచారం జరిగిందన్న వాదననూ లేవదీశారు. వారి వాదన తప్పని చెప్పే ప్రయత్నమే ఇది.

రావణాసురుడి పుట్టుకే అతి జుగుప్సాకరమైంది. అగ్రవర్ణాల వారు వాడిని అణగ తొక్కారనే వాదన సరైంది కాదు. కారణం రామాయణం రాసిన వాల్మీకి అగ్రవర్ణానికి చెందిన వాడు కాకపోవడమే! అది కాకుండా రావణుడు పుట్టింది కూడా బ్రాహ్మణ-క్షత్రియ జంటకు. అలాంటప్పుడు వెనుకబడిన వర్గానికి చెందిన వాడెలా అవుతాడు? వాడు బుద్ధి తెల్సినప్పటి నుంచే ఘోరాలు-నేరాలు చేసిన వాడే! బ్రహ్మ గురించి తపస్సు చేసి, మనుష్యులను, అంతకన్నా తక్కువ జీవులను తాను లక్ష్య పెట్టనని, మిగిలిన వారితో చావు లేకుండా వరమివ్వమని అడిగి, అలాగే వరం పొందాడు. 
వర బలంతో లంకాధిపతి మరియు సవతి సోదరుడు అయిన కుబేరుడిని లంక నుంచి వెళ్ల గొట్టాడు. ముల్లోకాలను బాధ పెట్టడం వాడికొక దిన చర్య. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పని చెప్పిన అన్న కుబేరుడి మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ రోజులు గడిపేవాడు. నందీశ్వరుడిని అవమానించి శాపానికి గురయ్యాడు. కామంతో వేదవతిని అవమానించాడు. ఆమె పార్వతి శాపం నిజం చేస్తానని మళ్లీ శపిస్తుంది. అయోధ్య రాజు అనరణ్యుడిని అవమానించి ఆయన శాపానికీ గురవుతాడు. యముడి మీదకు, ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు. బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంట కనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది. రంభను చెరిచి నలకూబరుడి శాపానికి గురవుతాడు. కార్తవీర్యార్జునుడితో, వాలితో కయ్యానికి దిగి గర్వభంగమవుతాడు. సీతాదేవిని అపహరిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడు చేసినవన్నీ అరాచకాలే! వాడెలా దేవుడవుతాడు. 

మరిన్ని వివరాలకు పోతే.....
బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుడి కొడుకు విశ్రవసుడికి భరద్వాజుడి కూతురైన దేవవర్ణి ద్వారా కుబేరుడనే కొడుకు పుట్టాడు. ఆతడి నివాస స్థానం లంకా నగరం. దక్షిణ సముద్రంలో, త్రికూట పర్వత శిఖరంలో ఉంది లంక. దానిని రాక్షసులు కాపురం చేయడానికి విశ్వకర్మ నిర్మించాడు. బ్రహ్మ తనకిచ్చిన పుష్పక విమానంలో తిరుగుతూ కుబేరుడు అక్కడ కాపురముంటాడు. కుబేరుడు ఈశ్వరుడి స్నేహం సంపాదించుకుని కొడుకులతోను, మనుమలతోను, అక్కడ శాశ్వత సుఖాలను అనుభవిస్తుంటాడు. సుమాలి అనే రాక్షస రాజు కుబేరుడిని చూసి, తన రాక్షస వంశం వృద్ధి చెందాలంటే, అంతటి వాడి అవసరం ఉందని భావించాడు. కూతురు కైకసిని విశ్రవసువును వివాహం చేసుకోమంటాడు. తండ్రి సూచన ప్రకారం కైకసి విశ్రవసుడుని చేరబోతుంది. మునీశ్వరుడిని కామంతో చూస్తూ నిలుచుంటుంది. ఆమె వివరాలు అడిగి, మనసులోని భావాన్ని గ్రహించి, వచ్చిన సమయం మంచిది కానందున, క్రూరులైన రాక్షస శ్రేష్టులు ఆమెకు కొడుకులుగా పుట్తారని అంటాడు. విశ్రవసుడికి కైకసి వివాహిత భార్య కాదు. కొంతకాలానికి ఆమెకు నిడుపాటి కోరలు, పది తలలు, ఎర్రని వెంట్రుకలు, ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విశ్రవసుడు. ఆ తరువాత వాడికి రావణుడనే పేరు మిగిలింది. రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, అగ్ర కులాలకు చెందిన వాడే! మరి కొంతకాలానికి కైకసికి కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. వీరూ క్రూరులే. చివరకు విభీషణుడనే ధర్మాత్ముడైన కొడుకు పుట్టాడు.

గోకర్ణానికి పోయి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు దశకంఠుడు. మనుష్యులను, అంతకన్నా తక్కువ జీవులను తాను లక్ష్య పెట్టనని, మిగిలిన వారితో చావు లేకుండా తనకు వరమివ్వమని అడిగి, బ్రహ్మనుంచి అలాగే వరం పొందాడు. ప్రాణం పోయేంతవరకూ తన మనసు ధర్మమందే నిలవాలని విభీషణుడు కోరాడు. అడగకపోయినా విభీషణుడికి అమరత్వం, కుంభకర్ణుడికి నిద్రాత్వం వరంగా ఇచ్చాడు. లంకా నగరం రాక్షసులదని, సవతి సోదరుడు కుబేరుడి దగ్గర నుంచి దానిని వశ పర్చుకొమ్మని సుమాలి బోధించాడు. రాక్షసులను ఉద్ధరించమంటాడు. రావణుడు ప్రహస్తుడనే వాడిని కుబేరుడి దగ్గరకు పంపి తనకు లంకను వశం చేయమంటాడు. కుబేరుడు లంకను విడిచిపోవడానికి సమ్మతించి, తండ్రి సూచన మేరకు కైలాస పర్వతం దగ్గరకు పోతాడు. అమితమైన సంతోషంతో రావణుడు లంకా నగరం చేరాడు. సోదరి శూర్పణఖకు, విద్యుజ్జిహ్వుడనే వాడికిచ్చి వివాహం జరిపించాడు.


మయుడనేవాడు తన కూతురు మండోదరిని రావణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కూతురుతో పాటు మయుడు రావణుడికి "శక్తి" అనే ఒక అస్త్రాన్నిచ్చాడు. దానితోనే రావణుడు లక్ష్మణుడిని మూర్చ పోయేటట్లు చేయగలిగాడు యుద్ధంలో. తమ్ముడు కుంభకర్ణుడికి వైరోచనడి మనుమరాలైన వజ్ర జ్వాలను, శైలూషుడనే గంధర్వుడి కూతురు సరమను విభీషణుడికి ఇచ్చి వివాహం చేయించాడు రావణుడు. కొంతకాలానికి మండోదరి-రావణాసురుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడు భూమిమీద పడగానే మేఘాలు గర్జించడం వల్ల అతడి పేరు మేఘనాథుడని పెట్టాడు రావణుడు.


ఇక అప్పటినుంచి రావణుడు ముల్లోకాలను భాదించడం మొదలెట్టాడు. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పుడు పనులు మానమని కుబేరుడు బోధించాడు. కుబేరుడిని మీదకు యుద్ధానికి పోతాడు రావణుడు. యుద్ధంలో రావణ సేనదే పైచేయవుతుంది. కుబేరుడిని జయించి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు రావణుడు. పుష్పక విమానంలో లంకకు మరలిపోతుండగా, కైలాస గిరి ప్రాంతంలో, విమానం కదలదు. పార్వతితో కలిసి శంకరుడు క్రీడలో ఉన్న ఆ సమయంలో ఎవరికీ అటుగుండా పోవడం సాధ్యపడదని అన్న నందీశ్వరుడిని, కోతితో పోల్చి హేళన చేశాడు. కోతులే భవిష్యత్‍లో జరగబోయే యుద్ధంలో రావణ సేనను ఓడించుతారని నందీశ్వరుడు శపించాడు. రావణుడు కైలాసాన్ని పెకలించడానికి పూనుకుంటాడు. శివుడు తన కాలి బొటన వేలుతో, ఆ పర్వతాన్ని అణచి వేశాడు. రావణుడి చేతులు కొండ కింద పడి బాధించసాగాయి. ఏడవడం మొదలెట్టాడు. శంకరుడిని ప్రార్థించాడు. అలా వేయేళ్లు ఏడవగా శంకరుడు కరుణించాడు. ఆ విధంగా ముల్లోకాలు కలతచెందేట్లు ఏడ్చినందున అతడికి "రావణుడు" అని శివుడు పేరు పెట్టాడు. నాటి నుంచి రావణుడు శివపూజ చేయడం మొదలెట్టాడు. తనకు ఎదురులేదన్న గర్వంతో, ఇష్టం వచ్చినట్లు పుష్పక విమానం మీద తిరుగుతూ, శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ, తిరగసాగాడు.


హిమవత్పర్వత ప్రాంతంలో రావణుడికి వేదవతి కనిపించింది. కామంతో కళ్లు మూసుకున్న రావణుడు ఆమెను చేరబోయాడు. తల వెంట్రుకలు పట్టుకుని వేదవతిని లాగుతాడు. రావణుడు అవమానించిన ఆ దేహాన్ని ఇక తాను ఉంచుకోనంటుంది. అగ్ని ప్రవేశం చేస్తానని, రావణుడి గర్వమణచడానికి మళ్లీ జన్మించుతానని అంటూ, చెప్పినట్లే చేస్తుంది. అంతకు ముందు పార్వతి రావణుడిని స్త్రీ నిమిత్తంగా నాశనమవుతావని శపిస్తుంది ఒక సారి. దానికి తోడు ఇప్పుడు వేదవతి తానే ఆ స్త్రీనంటుంది. నందీశ్వరుడు శాపం ఎలాగూ ఉంది. ఆ విధంగా రావణ వినాశానికి బీజాలు పడ్డాయి. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది.


రావణుడు యజ్ఞం చేస్తున్న మరుత్తు అనే రాజును యుద్ధానికి రెచ్చగొట్టి, అక్కడున్న మునులందరినీ చంపి, వారి నెత్తురు తాగి, తృప్తి చెంది అక్కడ నుండి వెళ్లిపోతాడు. పరాక్రమం గల రాజుల వద్దకు పోయి యుద్ధమన్నా చేయాలని, లేదా, ఓడి పోయామనన్నా అనాలని బలవంతం చేస్తాడు. వాడు వర బలం కలవాడనీ, ఓడించడం శక్యం కాదనీ, భావించిన రాజులు ఓటమిని అంగీకరించారు. అయోధ్యకు వెళ్లాడు రావణుడు. ఆ సమయంలో అనరణ్యుడు అయోధ్యను పాలించేవాడు. ఆతడిని యుద్ధానికి పురిగొల్పాడు రావణుడు. యుద్ధంలో ఓడిపోయాడు అనరణ్యుడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు, యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు. ఇది రావణుడికి నాలుగో శాపం.


నరులను చంపటం ఆతడికి ధర్మం కాదని బోధించాడు నారదుడు రావణుడికి. దేవతలు, గంధర్వులు, యక్షులు, దీర్ఘకాలం బతికేవారని వారిని జయించడం గొప్ప అని అంటాడు. యముడిని యుద్ధంలో జయించమని రావణుడికి దుర్భోధ చేశాడు. యముడిని చంపడానికి పోతాడు. యమపురికి చేరుతూనే, పాప-పుణ్య ఫలాలను అనుభవిస్తున్న ప్రాణులను చూశాడు. కింకరులు రావణుడితో పోరాటానికి దిగారు. స్వయంగా యముడే రావణుడితో యుద్ధానికి బయలుదేరతాడు. యమ-రావణ యుద్ధం జరుగుతుంది. ఇరువురు సరిసమానంగా పోరు సల్పారు. రావణుడిపై యమ దండం వేయడానికి సిద్ధ పడతాడు యముడు. ఆ పని చేయవద్దని బ్రహ్మ దేవుడు యముడిని వారించాడు. దేవతల చేతుల్లో చావకుండా తాను రావణుడికి వరం ఇచ్చానని, తన మాట అసత్యం చేయవద్దని కోరాడు. యముడు అదృశ్యమైపోయాడు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమ పురిని విడిచి పోయాడు.


"నివాత-కవచు" లనే రాక్షసులు, రావణాసురుడితో సమరం చేయాలనుకుంటారు. వారు ఒకరిపై మరొకరు గెలవడం సాధ్యం కాదని, సంధి చేసుకోవాలని బ్రహ్మ సూచించాడు. తరువాత నశ్మ నగరాన్ని పాలిస్తున్న కాలకేయులను జయించి, వరుణ నగరంపై యుద్ధానికి పోతాడు. కాలకేయులను చంపే ప్రయత్నంలో, యుద్ధంలో గెలిచి తీరాలన్న పట్టుదలలో, దేహం తెలియక, రావణుడు బాణాలను ప్రయోగించగా, ఆ క్రమంలో శూర్పణఖ మొగుడు చనిపోతాడు. తనపై నిష్టూరాలాడిన శూర్పణఖను ఓదార్చడానికి, ఖర-దూషణులనే ఇద్దరు రాక్షసులను, పదునాలుగువేల సమూహంతో, ఆమెకు తోడుగా ఉండేందుకు దండకారణ్యాణంలోని జన స్థానానికి పంపుతాడు రావణుడు.


వరుణ నగరంలో కామధేనువును చూసి, తన యుద్ధ కాంక్షను రాజుకు కబురంపుతాడు. వరుణ తనయులు రావణుడితో యుద్ధం చేసి ఓడిపోతారు. వరుణుడు అప్పుడు రాజ్యంలో లేడు. రాజు లేనప్పుడు, కొడుకులు ఓడిపోయినప్పుడు, ఇక రావణుడు గెలిచినట్లేనని అంటాడు మంత్రి. ఎలాగూ గెలుపు తనదే కదా అనుకుంటూ, లంకా నగరానికి బయల్దేరాడు రావణుడు. పోతూ-పోతూ, దారిలో, బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. వారందరినీ పుష్పక విమానంలో పడేస్తాడు. వారిలో నాగ కన్యలు, మనుష్య స్త్రీలు, అసుర కాంతలు, రాక్షస వనితలు, యక్ష సతులు, దానవాంగనలున్నారు. వారిలో పెళ్లి ఐన వారు, కాని వారు కూడా వున్నారు. చెరబడిన స్త్రీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోడు. చెరబడిన స్త్రీలు రావణుడిని శపించారు. పర స్త్రీలను తన భార్యలుగా చేసుకోవాలను కోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.


చెరబట్టిన స్త్రీలను లంకకు చేర్చడం చూసిన విభీషణుడు అన్నకు నీతి బోధ చేస్తాడు. కీర్తిని, ధనాన్ని, వంశాన్ని నాశనం చేసే ఇలాంటి పని చేయడం తగదని అంటాడు. ఆ మాటలు లెక్క చేయకపోగా, చెల్లెలు కుంభీనసి భర్త మధును వెంట పెట్టుకుని దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. మార్గమధ్యంలో, దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. మూడు లోకాలలో తనను పోలిన మగవాడెవ్వడు లేడని, ఉపేంద్రుడైనా, ఇంద్రుడైనా, అశ్వినీ దేవతలైనా, చక్కదనంలో తనకు సాటి రారని, తనను విడిచి వేరొకని వద్దకు పోవద్దని వేడుకుంటాడు రంభను. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, తాను ఆయనకు వరుసకు కోడలని, తన మీద దయ చూపాలని, ఇతరులు తనను అవమానిస్తే రక్షించాల్సిన వాడు ఇలా చేయడం తగదని, తనను నగుబాట్లపాలు చేయవద్దని వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టించుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన చెడ్ద పనిని భర్త నలకూబరుడి(కుబేరుడి కొడుకు) తో చెప్తుంది రంభ. పర స్త్రీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపించుతాడు. రావణుడు బలవంతంగా ఎత్తుకుని వచ్చిన పతివ్రతా స్త్రీలు ఆ శాపం తెలిసికొని సంతోషించారు. రావణుడి వలన భయం వదిలారు. ఆ దినం మొదలుకుని, పర స్త్రీ సంగమం విషయంలో మనస్సు పోనిచ్చిన వాడు కాదు రావణుడు.


ఇంద్రుడి మీదకు యుద్ధానికి పోతాడు. దేవ-దానవ యుద్ధం జరుగుతుంది. రావణుడి కొడుకు మేఘనాధుడు ఇంద్రుడిని బంధించుతాడు. నాటి నుంచి వాడు ఇంద్రజిత్తుగా పిలవబడతాడు. బ్రహ్మ లంకకు వెళ్లి ఇంద్రుడిని విడిచి పెట్టమని అడుగుతాడు. ఆయన కోరికను అంగీకరించారు రావణ-ఇంద్రజిత్తులు. అప్పటినుంచి, తనకెలాగూ కుమారుడు ఇంద్రజిత్తు తోడున్నాడు కదా అని, మరింత లోక కంటకుడై విర్రవీగుతుండేవాడు రావణుడు. కనిపించిన ప్రతి వారినీ, రాజులందరినీ బాధించుతూ, భుజ బల గర్వంతో, కళ్లు మూసుకొనిపోయి, ఒకనాడు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తున్న కార్తవీర్యార్జునుడి మీదకు యుద్ధానికి పోతాడు. కార్తవీర్యార్జునుడు వాడిని బంధించి చెరసాలలో పడేశాడు. ఇది తెలుసుకున్న రావణుడి తాత పులస్త్యుడు అక్కడకు చేరుకుని, రావణుడిని చెరసాల నుంచి విడవమని కోరాడు. ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్యార్జునుడు. రావణుడు కార్తవీర్యార్జునుడితో స్నేహం చేస్తూ, తరువాత, మళ్లా రాజులను ఓడించాలన్న కోరికతో, పొగరు పడుతూ, భూమి మీద తిరుగుతుండేవాడు.


రావణుడు లోకాలలో సంచరిస్తూ, ఒకనాడు కిష్కింధకు వచ్చి, వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో వాలి సంధ్య వార్చడానికి నాలుగు సముద్రాలకు పోయాడు. అప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్య వారుస్తున్నాడని తెలుసుకుని పుష్పక విమానం ఎక్కి అక్కడకు చేరుకుంటాడు రావణుడు. వాలిని వెనుక నుంచి వెళ్ళి బంధించాలనుకుంటాడు. వాడి ఉద్దేశం కనిపెట్టిన వాలి, రావణుడిని తన చంకలో ఇరికించి, ఆకాశ మార్గంలో పోయి, పడమటి సముద్రంలో, ఉత్తర సముద్రంలో, తూర్పు సముద్రంలో సంధ్య వారుస్తాడు. కిష్కింధకు తిరిగొచ్చి రావణుడిని విడిచి, ఏమీ తెలియని వాడివలె అతడి క్షేమ సమాచారం అడుగుతాడు. తాను వాలితో యుద్ధం చేయడానికి వచ్చానని, గర్వభంగం ఐందనీ, అగ్ని సాక్షిగా అతడితో స్నేహం చేయాలని ఉందని అంటాడు. ఆ తరువాత వారిరువురు స్నేహితులౌతారు.


అరణ్యవాసం చేస్తున్న శ్రీరామ లక్ష్మణ సీతాదేవిలు పంచవటికి చేరుకుంటారు. రావణుడి సోదరి శూర్పణఖ శ్రీరాముడిని చూస్తుంది. తానతిడిని మోహిస్తున్నట్లు చెప్తుంది. తమ్ముడు లక్ష్మణుడు వద్దకు పొమ్మని సలహా ఇచ్చాడు రాముడు. శూర్పణఖ ముక్కు-చెవ్వులు కోస్తాడు లక్ష్మణుడు. కురూపిని చేస్తాడు. శూర్పణఖకు తోడుగా ఉన్న ఖరుడు ఆమె వికృత రూపాన్ని చూసి కోప్పడతాడు. రాముడి మీద యుద్ధానికి పద్నాలుగు వేల మంది రాక్షసులను పంపుతాడు. వారందరినీ చంపుతాడు రాముడు. స్వయంగా ఖరుడే యుద్ధానికి పోతాడు. ఆతడికి తోడుగా దూషణుడు వెళ్తాడు. ఖర-దూషణులిద్దరూ రాముడి చేతిలో ఓడి చనిపోతారు. ఇది గమనించిన అకంపనుడనే వేగులవాడు, లంకా నగరానికి పోయి, రావణాసురుడితో సీతాపహరణం చేయమని, శ్రీరామ వధోపాయం అదేనని సలహా ఇస్తాడు. సీతాదేవి సౌందర్యాన్ని రావణుడికి వివరంగా చెప్తాడు. శూర్పణఖ కూడా సీతాపహరణం చేయమని బోధిస్తుంది.


రాముడు శూర్పణఖను కురూపిని చేయడం, ఖర-దూషణాదులను సంహరించడం, ఇతర రాక్షసులను మట్టుబెట్టడం రావణుడి మదిలో మెలిగాయి. పగ తీర్చుకోవాలను కుంటాడు. రహస్యంగా మారీచుడి వద్దకు బయల్దేరాడు. సాయం చేయమని మారీచుడిని వేడుకుంటాడు. సీతాపహరణానికి తనకు తోడుగా రమ్మంటాడు. జవాబుగా మారీచుడు శ్రీరాముడి బల పరాక్రమాలను రావణుడికి తెలియ పరుస్తాడు. శ్రీరాముడితో తాను స్వయంగా పడిన పాట్లను వివరించాడు. ఎలా తాను రాముడి బారి నుంచి తప్పించుకున్నాడో తెలియచేశాడు. రావణుడు నిష్టూరాలాడి, పరుషంగా మాట్లాడి, తనకు తోడుగా రావడానికి మారీచుడిని అంగీకరింప చేశాడు. రావణ-మారీచులు పంచవటికి కలిసి పోతారు. మారీచుడు మాయ మృగం వేషం వేస్తాడు.


మాయా మృగం రూపంలో వున్న మారీచుడిని సీత చూస్తుంది. దాన్ని పట్టి తెమ్మని రాముడిని కోరుతుంది. దాని వెంటబడి పోతాడు. రాముడి బాణం తగలగానే, "హా లక్ష్మణా!" అని అరిచి మారీచుడు చనిపోతాడు. ఆ అరుపు విన్న సీత లక్ష్మణుడిని రాముడికి సహాయంగా పొమ్మంటుంది. లక్ష్మణుడు రాముడి దగ్గరకు వెళ్తాడు. ఇదే అదను అనుకుని రావణుడు సన్నాసి వేషంలో సీతను అపహరించదల్చి ఆమె దగ్గరకు పోయాడు. ఆ వేషంలో ఉన్న రావణుడిని సీత సత్కరిస్తుంది. రాక్షస నాయకుడు రావణాసురుడిని తానే అంటాడు. తన భార్యవు కమ్మని అంటాడు. సీత రావణుడిని నిష్టూరాలాడుతుంది. తన నిజ స్వరూపం చూపించి రావణుడు ఆమెను భయపెడ్తాడు. చివరకు సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకుని పోతాడు. దారిలో కనిపించిన జటాయువు రావణుడిని అడ్డుకుంటాడు. జటాయు-రావణుల మధ్య యుద్ధం జరుగుతుంది. రావణుడు జటాయువు రెక్కలు నరికేసి, సీతను ఎత్తుకుని పరుగెత్తుతాడు. సీత ఎంతగా రావణుడిని నిందించినా ఫలితం లేకపోతుంది. చివరకు సీతతో రావణుడు లంక చేరుకుంటాడు. సీత మీద రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచుతాడు. సీత తనను కామించడానికి పన్నెండు నెలల గడువిస్తాడు. ఆ మర్నాడు మాట వినని సీతను తన భోజనం కొరకు వంటవారు ముక్కలుగా కోసి వండుతారని బెదిరిస్తాడు.


రావణుడి రూపం, తేజం, బలం, ధైర్యం అనుపమానవైనవే. సౌందర్యం, సంపద, ఆకర్షణ రాముడిలో ఎంత ఉన్నాయో, రావణుడి దగ్గర కూడా అంతే మోతాదులో ఉన్నాయనవచ్చు. ఐతే, "రూప దాక్షిణ్య సంపన్నత", ఇతరుల పట్ల కరుణ, రక్షించాలనే బుద్ధి రాముడిలో ఉన్నాయి కాని రావణుడిలో లేవు. రావణుడు ధర్మ విరుద్ధమైన పనులే చేసి ఉండకపోతే, ఇంద్రుడున్న స్వర్గాన్ని కూడా తన శక్తి-యుక్తులతో పాలించేవాడేమో. వాడిది కఠినమైన మనస్సు. భూతదయ వాడికి లేనందునే జనులు దూషించారు. దేవదానవులు వణకుతున్నారు. రావణుడు, విధానాన్నసురించి ధర్మ శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేశాడు. ప్రపంచం మెచ్చే రీతిలో తపస్సు చేశాడు. ఇంత గొప్పవాడు పర పురుషుల స్త్రీలను బాధ పెట్టడం భావ్యమా? రాక్షస వంశాన్ని ఈ అధర్మ కార్యం, కూకటి వేళ్లతో నాశనం చేసే విపత్తుకు దారితీయదా? రావణుడిలాంటి బుద్ధిమంతుడు ఇలాంటి పనులు చేయవచ్చా? ఎంతో కష్టపడి తపస్సు చేసినా, అది మర్చిపోయి, తపో ధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేశాడు. అతడి తపస్సు వ్యర్థమైపోయింది. తన తపస్సుతో దేవదానవులెవరూ జయించకుండా వరం పొంది, ఇంక తనకేం భయమని గర్వపడ్డాడు. వాస్తవానికి, ఆ వరాలేవే అతన్ని ఎల్లప్పుడూ రక్షించ లేవనే సంగతి అతడి ఆలోచనకే రాలేదు. 


రావణుడు దేవతలతో - దానవులతో - రాక్షసులతో - గంధర్వులతో -నాగులతో చావకుండా వరం పొందాడు. ఆ వరాలు ఆయన నెట్లా రక్షిస్తాయి? ఆ వరాల బలంతో రావణుడెట్లా బ్రతుకుతాడు? కాబట్టి తపోబలం ఉందన్న గర్వం వదులుకోవాలి. చీకటి-వెలుతురు ఒకేసారి రానట్లే, పాప-పుణ్య ఫలాలు రెండూ ఒకేసారి అనుభవించలేం. పుణ్యం అనుభవించుతున్నంత వరకూ, పాప ఫలం దరికి రాదు. ధర్మ ఫలం అధర్మ ఫలాన్ని చెరిపేస్తుంది. చీకటి ఎలాగైతే వెలుతురును చెరచ లేదో, అలానే అధర్మ ఫలం ఇంకా రావణుడికి అనుభవం లోకి రాలేదు. తపఃఫలం వల్ల రావణుడు తనకు పాప ఫలం రాదనుకుంటున్నాడు! అష్టైర్యాలను అనుభవించే వాడికి రోగాలు రావా? రావణుడి తపస్సు అతడికి దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, వాడు చేసిన పర స్త్రీ అపహరణనే పాపపు పని వల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరగవు కాబట్టి, అతడి చావింత వరకూ ఆగింది. అతడి వ్రత ఫలంగా దేవ దానవుల చేతుల్లో చావు లేకుండా వరం కోరాడు. నర వానరులను నిషేధించాడు. వాడి తపఃఫలం వారి నుండి కాపాడదు. ఇక రావణుడి పూర్వ పుణ్యం పూర్వ పాపాన్నే హరిస్తుంది. కాని ఇప్పుడు చేస్తున్న పాప కార్యాలనుండి అతడిని రక్షించదు. నేడు చేస్తున్న భోజనం, నిన్నటి ఆకలి బాధ తీరుస్తుంది కాని, రేపటి బాధను కాదు కదా! పశ్చాత్తాపం చెందితే, ప్రాయశ్చిత్తముంటుంది. రావణుడు బలవంతంగా ఎత్తు కొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరి వారికి వారిని అప్పగిస్తే అతడి దోషం పోతుంది. తపఃఫలం సదా రక్షిస్తుందనేమాట భ్రాంతే! తపఃఫలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు.


సీతాన్వేషణలో భాగంగా లంకలో ప్రవేశించిన హనుమంతుడు, అశోక వనంలో ఉన్న సీత దగ్గరకు వచ్చిన రావణుడిని చూస్తాడు. కామంతో సీతను తలచుకుంటూ, మనసంతా సీతపైనే నిలిపి, అతిశయించిన కామ మదంతో, కామాన్ని కొంచెం కూడా అణచుకోలేని దుస్థితిలో, తన కున్న మహాసంపదనంతా ప్రదర్శిస్తూ కనిపిస్తాడు రావణుడప్పుడు. సీతకు తన కోరికను చెప్తాడు. ఆమెను "ప్రియురాలు" అని సంబోధిస్తాడు. జగదేక మోహినీ అంటాడు. సౌందర్య గనీ అంటాడు. సమీపంలో ఎవరూ లేరని, ఎవరూ చూడడం లేదని, తన కామం తీర్చమనీ పలుకుతాడు. పరుల భార్యలను అపహరించడం, వారిని పొందడం, ఇతరుల ధనం అపహరించడం, తమ రాక్షస కుల ధర్మం అంటాడు. సీతాదేవిని బెదిరించుతాడు. తాను ధనవంతుడినని, బలవంతుడినని, శౌర్యవంతుడినని, రూపవంతుడినని, లోకాలెల్ల "హా! హా!" అనేటంతటి వాడినని అరుస్తూ, తననెందుకు కాదంటున్నావని కోప్పడతాడు. ఆ సమయంలో ధాన్యమాలిని అనే రాక్షస స్త్రీ, రావణుడి చిన్న భార్య, సీతను బెదిరిస్తున్న రావణుడికి అడ్డు తగులుతుంది. రావణుడు అంతఃపురానికి వెళ్లిపోతాడు ఆనాటికి. సీతాదేవిని కలిసిన హనుమంతుడు, ఆ తరువాత, అశోక వనాన్ని పాడు చేస్తాడు. ఆ సంగతి రావణుడికి తెలిసి, హనుమంతుడిపై యుద్ధానికి కింకరులను పంపుతాడు. కింకరులను, చైత్య పాలకులను, ప్త్రహస్తుడి కొడుకు జంబుమాలిని, మంత్రి పుత్రులందరినీ, ఐదుగురు సేనా నాయకులను చంపుతాడు హనుమంతుడు. రావణుడి కొడుకు అక్షకుమారిడినీ చంపి రావణ వంశ ధ్వంసన ప్రారంభిస్తాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధించగా, కట్టేసి రావణుడి దగ్గరకు తీసుకుపోతారు రాక్షసులు. హనుమంతుడు రావణుడికి నీతి బోధ చేస్తాడు.


రావణుడు తపఃఫలం ఎంత వరకు అనుభవించాలో, అంతా ఇప్పటి వరకూ అనుభవిస్తూ వస్తున్నాడు. అది పూర్తయింది. ఇక నుండి చేసిన పాప ఫలం ఆ రోజు నుంచే అనుభవించాలి. దాని ఫలితం త్వరలోనే రావణుడికి అర్థమవుతుంది. జన స్థానంలో ఉన్న రావణుడి తమ్ములందరూ చావటంతో మొదలయింది అతడి పాప ఫలం అనుభవించే రోజు. తర్వాత స్నేహితుడు వాలి చచ్చాడు. అతడి విరోధి సుగ్రీవుడు రాముడికి మిత్రుడయ్యాడు. ఇవన్నీ రావణుడికి అరిష్ట సూచనలే! రావణుడి వశమందున్న జానకి ఉత్తమ స్త్రీ అని, ఆమె లంకనంతా పాడుచేసేందుకు వచ్చిన కాళ రాత్రని, ప్రళయ కాలంలో కాళ రాత్రి ఏ విధంగా లోకాన్నంతా నాశనం చేస్తుందో, అట్లాగే, ఈమె లంకంతా నాశనం చేయబోతున్నదని, రావణుడి మెడలో తగులుకున్న యమపాశం ఈమె అని, బ్రతకాలనుకుంటే, లంకను కాపాడు కోవాలంటే, ఆమెను వదిలిపెట్టటమొక్కటే మార్గమని అంటాడు హనుమంతుడు. మనుష్య్లులు - దేవతలు - అసురులు - యక్షులు - కింపురుషులు - గంధర్వులు - పన్నగులు - విద్యాధర సమూహాలు - సిధ్ధులు - ఇతర దేవ జాతుల వారు-కిన్నరులు, వీరందరిలో పరాక్రమంలో మొదటి వాడైన విష్ణుమూర్తితో సమానమైన వాడు శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే అని చెప్తాడు. రాముడిని యుద్ధంలో, ఎవ్వరూ-ఏ కాలంలో-ఏ ప్రదేశంలో-ఏ ప్రాణి కూడా ఎదిరించ లేదంటాడు. "అంశ" పూర్ణ స్వరూపాన్ని ఏదైనా ఎదిరించ గలదా? సముద్రంలోని అలలన్నీ కలిసినా, సముద్రంతో శత్రుత్వం తెచ్చుకుని బ్రతక గలవా? రాముడు త్రికాల సత్యమైన "పర బ్రహ్మ" స్వరూపం. పూజ్య స్వభావం కలిగి, సమస్త లోకాలకు ప్రభువైన రామచంద్రమూర్తికి రావణుడు ద్రోహం చేసాడు కనుక వాడు ఇప్పుడు ఏం చేసినా బ్రతుక లేవంటాడు. రావణుడు ఒక్కడే కాకుండా-వాడితోపాటు, నాగ-యక్ష- రాక్షస- గంధర్వ- దేవ దానవులందరినీ తెచ్చుకున్నా ఆయనపై  గెలుపు అసాధ్యం అని స్పష్టం చేశాడు. చిల్లరదేవుళ్ల మాట అటుంచి, రావణుడి మీద ప్రేమతో వరాలిచ్చిన స్వయంభు-చతురాస్యుడైన బ్రహ్మ దేవుడైనా, ముక్కంటి త్రిపురాంతకుడైన రుద్రుడైనా, ముప్పై మూడుకోట్ల దేవతలకు అధిపతైన ఇంద్రుడు-మహేంద్రుడైనా, లేక ఈ ముగ్గురూ కలిసొచ్చినా, యుద్ధంలో రాముడి బారినుండి రావణాసురుడిని రక్షించ లేరని, శరణాగతియే  రక్షణని, రాముడినే శరణు కోరమని సలహా ఇచ్చాడు.   


హనుమంతుడి మాటలను, అవి కఠినంగా ఉండడంతో, పైగా ధైర్యంగా నొక్కి చెప్పడంతో, సహించలేకపోయాడు. హనుమంతుడిని చూసిన రావణుడు ఆలోచనలో పడిపోతాడు. కైలాస పర్వతాన్ని పెకలించినప్పుడు తనను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా అని భయపడ్తాడు. హనుమంతుడిని చంపమని భటులను ఆజ్ఞాపించాడు. అది విన్న విభీషణుడు, రాజాజ్ఞ నీతికి విరోధమని, దోషమని అంటాడు. దూతను చంపడం దోషమని చెప్పాడు. రావణుడు క్షత్రియ ధర్మంలో పండితుడని, సామాన్య ధర్మం తెలిసిన వారిలో ఆయనకు సమానమైన వారు లేరని, పరమార్థం తెలిసిన పండితులలో శ్రేష్టుడని, ఔచిత్యం ఆలోచించి, దూత నెట్లు దండించాలో అలానే చేయమని బోధించాడు. చివరకు విభీషణుడి మాటలను ఆలకించిన రావణుడు, హనుమంతుడి తోక కాల్చమని ఆదేశించాడు. కాల్చిన తన తోకతోనే లంకను దహించి వేశాడు హనుమంతుడు. రాక్షస విలాపం జరుగుతుంది.


హనుమంతుడు చేసిన అసాధ్య కార్యం, రాక్షస వధ, రావణుడిని భయపెట్టింది. ఒక కోతే అంత పని చేస్తే, వానర సేనంతా వస్తే ఇంకెంత ఘోరం జరగబోతుందో అని ఆలోచనలో పడ్డాడు. మంత్రులను సలహా కోరతాడు. ఇంతలో శ్రీరాముడు కపిసేనతో సముద్ర తీరం చేరుతాడు. అప్పుడు విభీషణుడు రాజనీతిని తెలియచేస్తాడు. సామ, దాన, భేద ఉపాయాలను వివరించి, ఈ మూడింటి వల్ల కార్యం సాధ్యపడదేని అప్పుడే దండోపాయం అవలింభించాలని బోధించాడు. యుద్ధానికి దిగడం శాస్త్ర విరుద్ధం అంటాడు. రాముడి పరాక్రమం గురించి చెపుతాడు. సుగ్రీవుడి శక్తినీ తెలియచేస్తాడు. వానర సేనను తక్కువ అంచనా వేయొద్దని అంటాడు. అసలు రాముడు చేసిన అపకారం ఏంటి అని ప్రశ్నించాడు. రాముడి భార్యను అపహరించడం రావణుడు చేసిన తప్పని అంటాడు. తన భార్యను తాను మరల తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్పెలా అవుతుంది అని నిలదీశాడు. ఖర-దూషణులను చంపడం, శూర్పణఖ ముక్కుచెవ్వులు కోయడం విషయంలోనూ తప్పు ఆతడిది కాదంటాడు. సీతను వదిలిపెట్టమని సలహా ఇస్తాడు. శ్రీరాముడి దేహబలంతో పాటు దైవ బలం, ధర్మ బలం వుందని, ధర్మం వున్న చోట జయం తప్పక వుంటుందని స్పష్టం చేశాడు. ఈ మాటలు విన్న తరువాత, మొట్ట మొదటి సారి రాక్షసులకు రావణుడు సీత వృత్తాంతం చెప్తాడు. కుంభకర్ణుడు కూడా రావణుడిపై కోప్పడతాడు. ఎవరినడిగి సీతను అపహరించావని అడుగుతాడు. కొందరు మంత్రులు సీతను వదల రాదని, యుద్ధం చేయాల్సిందేనని సలహా ఇచ్చారు. తనకు ఎవరెవరు ఏఏ శాపాలు పెట్టారో మంత్రులకు చెప్పాడు రావణుడు. ఇంద్రజిత్తు విభీషణుడిని ధిక్కరించి మాట్లాడుతాడు. ఇరువురు ఒకరినొకరు నిందించుకుంటారు. రావణుడు విభీషణుడికి జ్ఞాతి లక్షణాలు చెప్పి నిష్టూరాలు పలుకుతాడు. విభీషణుడు సభను విడిచి ఆకాశానికి ఎగిరి రావణుడికి మరో మారు హితోక్తులు పలికి, నలుగురు మంత్రులతో కలిసి శ్రీరాముడున్న చోటుకు పోతాడు.


రావణుడు నియమించిన శార్దూలుడనే వేగులవాడు, యుద్ధాన్ని ఆపుచేయమంటాడు. రావణుడు వెంటనే శుకుడిని సుగ్రీవుడి దగ్గరకు రాయబారానికి పంపుతాడు. ఆ రాయభారం విఫలమవుతుంది. రావణుడు సీతను రాముడికి ఇవ్వడానికి అంగీకరించడు. శుక-సారణులతో కలిసి ప్రాసాదమెక్కి కపి సేనను పరికించి చూశాడు రావణుడు. అంగదాదుల గురించి రావణుడికి వివరిస్తారు వారు. హరాదియూధనాథుల గురించీ చెపుతారు. మైందాదుల గురించి చెపుతారు. శ్రీరామ లక్ష్మణులను చూపారు రావణుడికి. తాను చూసి వచ్చిన వానర సేనా సంఖ్యను శుకుడు రావణుడికి వివరించాడు. చేసేదేమీ లేక రావణుడు తమకీ విషయాలను తెలియచేసిన శుకసారణులను నిందించాడు. శ్రీరాముడి చర్యలను కనుగొని రమ్మని శార్దూలాదులను పంపుతాడు. వారు కపుల దాడికి గురవుతారు. వేగులవారి మాటలు విన్న రావణుడికి కించిత్తు భయం కలిగింది. మాయలు నేర్చిన రావణుడు, తన కంటె ఎక్కువ మాయలు నేర్చిన విద్యుజ్జిహ్వుడుని చూసి, సీతాదేవిని మోసగించాలంటాడు. ఏ మాత్రం భేదం లేకుండా ఉండే విధంగా, శ్రీరాముడి శిరస్సు, బాణంతోటి అతడి వింటిని, తన శక్తితో కల్పించి తన దగ్గరకు తీసుకు రమ్మంటాడు. ఆ తరువాత రావణుడు సీత దగ్గరకు పోయి రాముడు యుద్ధంలో చనిపోయాడంటాడు. అంతటితో ఆగకుండా సీతాదేవికి రాముడి కల్పిత శిరశ్చాపాలను చూపుతాడు. అవి చూసి సీత దుఃఖిస్తుంది. రావణుడు సీతను రక్షించేందుకు నియమించిన సరమ అనే రాక్షసి, సీతను ఓదార్చి, వాస్తవం చెపుతుంది. రాముడు చనిపోలేదని స్పష్టం చేస్తుంది.


ఇదిలా ఉండగా రావణుడి తల్లి కైకసి, మరో వృద్ధ మంత్రి విద్ధుడు, శ్రీరాముడికి సీతను ఇవ్వమని రావణుడికి బోధించారు. రావణుడి తల్లికి పెదనాన్న ఐన మాల్య వంతుడు కూడా సీతను ఇవ్వమని అంటాడు. రాముడికి వానర బలమే కాకుండా దైవ బలం కూడా ఉందంటాడు. " బ్రహ్మ దేవుడు లోకంలో ధర్మం, అధర్మం అని రెండు పక్షాలను సృష్టించాడు. గొప్ప బుద్ధికల దేవతలు ధర్మాన్ని ఆశ్రయించారు. అసురులు అధర్మాన్ని ఆశ్రయించారు. తనను ఆశ్రయించిన వారిని ఉద్దరించుట ధర్మం లక్షణం. అణగదొక్కడం, అధోగతి పాలు చేయడం అధర్మం లక్షణం" అని అంటూ మాల్య వంతుడు, రావణుడు పరాక్రమంతో ధర్మాన్ని నాశనం చేసి, అధర్మాన్ని సంపాదించాడని, అధర్మం ఆయనకు కీడు చేయక మానదని, జాగ్రత్తగా వుండమని చెప్తాడు. రావణుడు మాల్య వంతుడిని కూడా ధిక్కరించాడు. ఇక యుద్ధం తప్పదనుకున్న రావణుడు పుర ద్వారాలను రక్షించడానికి నాలుగు దిక్కులా నలుగురు ప్రముఖులను నియమించాడు.


ఈ నేపధ్యంలో యుద్ధం ఆరంభమవుతుంది. అంగదుడిని రాయబారానికి పంపుతాడు రావణుడి వద్దకు రాముడు. సగౌరవంగా సీతను తెచ్చి, వెంటనే తనకు అప్పగించి, శరణు వేడక పోయినట్లయితే, రావణుడిని చంపి, రాజ్యాన్ని విభీషణుడుకిస్తానని రాముడి మాటలుగా అంగదుడు రావణుడికి చెప్తాడు. అంగదుడిని పట్టుకుని చంపమంటాడు రావణుడు. రాక్షసులను చంపి శ్రీరాముడి వద్దకు తిరిగొస్తాడు అంగదుడు. రావణుడితో లంకను వానరులు ముట్టడి చేసారని చెప్తారు రాక్షసులు. యుద్ధానికి పొమ్మని రాక్షసులకు ఆజ్ఞ ఇస్తాడు రావణుడు. వానర రాక్షస ద్వంద్వ యుద్ధం ప్రారంభమవుతుంది. శ్రీరాముడు రాక్షసులను వధించుతాడు. యుద్ధంలో అంగదుడి చేతిలో ఓడిన ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేస్తాడు. శ్రీరామ లక్ష్మణులను నాగ పాశ బద్ధులను చేస్తాడు ఇంద్రజిత్తు. వారు చనిపోయారని రాక్షసులతో, తండ్రి రావణాసురుడితో చెప్తాడు. నాగ పాశ బద్ధులైన రామలక్ష్మణులను హనుమంతుడు-ఇతరులు వలయంగా పన్ని రక్షించుకుంటారు. రావణుడు రాక్షస స్త్రీలతో రాముడిని సీతాదేవికి చూపమని ఆజ్ఞాపించుతాడు. పుష్పక విమానంలోంచి సీతాదేవి వారిని చూసి దుఃఖిస్తుంది. రామలక్ష్మణులు జీవించే ఉన్నారని త్రిజట అనే రాక్షసి సీతాదేవికి చెప్తుంది. శ్రీరాముడు మూర్ఛ తేరుకుంటాడు. గరుత్మంతుడు వచ్చి శ్రీరామ లక్ష్మణులను నాగ పాశ బంధ విముక్తులను చేస్తాడు. అది చూసి కపులు ఆనందపడతారు. రావణుడికి ఈ విషయం తెలుస్తుంది. సంగతి తెలుసుకున్న రావణుడు చింతిస్తాడు. తన కుమారుడి మహాస్త్రాలెప్పుడూ వృధా కావని, అటువంటి బాణాలనే వారు విడిపించుకోగలిగారని, తన బలం ఇక తనను రక్షించుతుందన్న నమ్మకం లేదని, సందేహంలో పడతాడు.


ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, అకంపనుడు, ప్రహస్తుడు, ఒకరి వెంట ఒకరు యుద్ధానికి పోయి చని పోతారు. అప్పుడు రావణుడు తొలిసారిగా యుద్ధానికి బయల్దేరతాడు. ఇంతవరకు, ప్రభువైన రావణుడు ప్రత్యక్షంగా యుద్ధానికి పోకుండా, ఇతరులతో వానరులను జయించుదామనుకుంటాడు. ఎంతటి వారిని పంపినా వారు చనిపోవడంతో, తానింట కూర్చుండి ఇతరులను పంపిస్తున్నాడన్న నింద పడుతుందని ఆయనే బయలుదేరతాడు. శ్రీరాముడు రావణుడిని యుద్ధంలో చూసి ఆశ్చర్యపడతాడు. వాడి మీద తన కోపమంతా చూపిద్దామనుకుంటాడు. రావణుడు సుగ్రీవాదులతో పోరాడతాడు మొదలు. రావణుడు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లి పోతాడు. ఆ సమయంలో అతడిని ఎత్తుకుని పోయే ప్రయత్నం చేస్తాడు రావణుడు. ఇంతలో హనుమంతుడొచ్చి, రావణుడిని తన్ని, లక్ష్మణుడిని ఎత్తుకుని రాముడి దగ్గరకు పోతాడు. లక్ష్మణుడు మూర్చ నుంచి తేరుకుంటాడు.
శ్రీరాముడు, హనుమంతుడి పైకి ఎక్కి రావణుడి మీదకు యుద్ధానికి పోతాడు. రామ-రావణుల ప్రధమ యుద్ధం ఆరంభమవుతుంది. రామ బాణాల ధాటికి తట్టుకోలేక పోతాడు రావణుడు. చేతులో విల్లును బుద్ధిపూర్వకంగా వదిలి పెట్తాడు రావణుడు. విల్లు లేని వాడిని రాముడు చంపడని వాడికి తెలుసు. యుద్ధ ధర్మ పద్ధతిని అనుసరించి రాముడు, రావణుడి తలకు గురి పెట్టిన బాణంతో, కిరీటాన్ని మాత్రమే పడగొట్టాడు. ఐనా వాడికి జ్ఞానోదయం కాలేదు. కిరీటం పోయిందంటే వాడి ప్రభుత్వం కూలిపోయినట్లే కదా! ఇక కొట్టనని చెప్తూ, నిర్భయంగా లంకకు పారిపొమ్మంటాడు రావణుడిని రాముడు. పోయి బడలిక తీర్చుకుని, అస్త్రాలన్నీ తీసుకుని మళ్లీ యుద్ధానికి రమ్మంటాడు. అప్పుడు వాడిని విరథుని-నిరాయుధిడిని చేయకుండా చంపుతానని పరోక్షంగా హెచ్చరిస్తాడు. రావణుడు పరాజితుడై లంకకు పోతాడు. పోయి, తన పరాభవాన్ని తలచుకుంటూ దుఃఖిస్తాడు. ఒక మనుష్యుడిని గెలవలేక పోయానే అని చింతించాడు. దురహంకారంతో, తనను మనుష్యులేమీ చేయలేరని భావించి, వారితో చావు లేకుండా వరం పొందలేదే అని విచారించాడు. అనరణ్యుడిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకుంటాడు. వేదవతి శాపం కూడా గుర్తుకొచ్చింది. సీతే వేదవతి అని నిర్ధారించుకుంటాడు. సీతారాములిరువురు మనుష్య జాతి వారే అనుకుంటాడు. పార్వతి శాపం, రంభ నిమిత్తం నలకూబరుడిచ్చిన శాపం, బ్రహ్మ శాపం గుర్తుకొచ్చాయి. ఇవన్నీ గుర్తుకొచ్చి యుద్ధాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటాడు. కుంభకర్ణుడిని నిద్ర లేపమంటాడు.


రాక్షసులు కుంభకర్ణుడిని నిద్ర లేపుతారు. రావణుడు కుంభకర్ణుడితో రాముడివలన కలిగిన విపత్తును గురించి చెప్పాడు. విన్న కుంభకర్ణుడు రావణుడిని నిందించాడు. సీతను ఎత్తుకొచ్చినప్పుడు ఎందుకు తమను సంప్రదించలేదని ప్రశ్నించాడు. చేసింది తప్పంటాడు. కుంభకర్ణుడిపై కోపం ప్రదర్శించాడు రావణుడు. ప్రతిగా రావణుడిని సమాధాన పరిచాడు కుంభకర్ణుడు. యుద్ధానికి పోతానంటాడు. ఒంటిగా రాముడి మీదకు యుద్ధానికి పోవద్దని సలహా ఇస్తాడు. కుంభకర్ణుడు భీకరంగా యుద్ధం చేస్తాడు. శ్రీరాముడు కుంభకర్ణుడితో యుద్ధానికి దిగుతాడు. మొదలు కుంభకర్ణుడి కాళ్లు-చేతులు నరుకుతాడు. తరువాత వాడి శిరస్సును తెగ వేస్తాడు. వాడి మరణానికి రావణుడు దుఃఖపడ్తాడు. మత్తుడు-యుద్దోన్మత్తుడు అనే వారిని యుద్ధానికి పంపుతాడు. వారిరువురు, వారికి తోడుగా పోయిన మరికొందరు రాక్షస వీరులు కూడా యుద్ధంలో చనిపోతారు. మళ్లీ రావణుడిది అదే పరిస్థితి. దుఃఖిస్తాడు.


ఇంద్రజిత్తు మొదటిసారి యుద్ధానికి బయల్దేరతాడు. తన మాయా బలంతో, బ్రహ్మ వర బలంతో, యుద్ధంలో విజృంభించి పోరాడుతాడు ఇంద్రజిత్తు. యుద్ధానికి వెళ్లిన కుంభ నికుంభులు మరణిస్తారు. మకరాక్షుడికీ అదే గతి పడుతుంది. రెండో సారి ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్తాడు. ఇంద్రజిత్తును చంపమని లక్ష్మణుడిని పురమాయించాడు రాముడు. ఇంద్రజిత్తు-లక్ష్మణుల మధ్య యుద్ధం జరుగుతుంది. తన సారధి చనిపోవడంతో, లంకకు పోయి మరలి వచ్చి మళ్లీ యుద్ధం చేస్తాడు ఇంద్రజిత్తు. చివరకు లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించాడు. వాడి మరణానికి రావణుడు తీవ్రంగా విలపిస్తాడు. ఐనా జ్ఞానోదయం కలగని రావణుడు తన పరాక్రమాన్ని తానే పొగడుకుంటాడు. సీతను చంపబోతాడు. సుపార్శ్వడు రావణుడికి నీతి బోధ కావించి మరలిస్తాడు.


ఐన వారందరూ చచ్చిపోయారని దిగులు పట్టుకుంటుంది రావణుడికి. మిగిలిన రాక్షస సేనలను-మూల బలగాల్ని పిలుస్తాడు. చతురంగ సేనతో యుద్ధానికి పోయి, వానరులతో పోరాడకుండా, రాముడిని చుట్టుముట్టి, చంపమంటాడు. తాను యుద్ధానికి వచ్చేటప్పటికి రాముడిని అలసి పోయేటట్లు చేయమంటాడు. శ్రీరాముడు మూల బలాల్ని సంహరిస్తాడు. పౌరుషోక్తులు పలుకుతూ రావణుడు యుద్ధానికి వెళ్తాడు. వెళ్తున్న వాడికి అపశకునాలు కనిపిస్తాయి. విరూపాక్షుడిని, సహోదరుడిని, సుగ్రీవుడు చంపగా, మహాపార్శ్వుడు అంగదుడి చేతిలో హతమవుతాడు. రామ రావణ యుద్ధం మొదలవుతుంది. ఇరువురూ దివ్యాస్త్రాలతో పోరాడుతారు. మధ్యలో రావణ లక్ష్మణ యుద్ధం జరుగుతుంది. లక్ష్మణుడు రావణ శక్తి వల్ల మూర్ఛ పోతాడు. లక్ష్మణుడిని వానరులకు అప్పగించి రాముడు యుద్ధంలోకి దిగుతాడు. రావణుడు పరాజితుడై లంకకు పరుగెత్తుతాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చిన తరువాత లక్ష్మణుడు మూర్ఛనుంచి తేరుకుంటాడు. రామరావణుల కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది. రావణుడి శూలాన్ని విరగగొట్టాడు రాముడు. రావణుడిని కాపాడాలన్న ఉద్దేశంతో, రథాన్ని, సారథి మరలించుతాడు. ఆ పని చేసినందుకు సారధిని దూషించుతాడు రావణుడు. రావణుడి మేలు కోరి తానలా చేసానని అంటాడు సారథి. ఆ తరువాత మళ్లీ రాముడి మీదకు యుద్ధానికి పోతాడు. రావణుడి ధ్వజాన్ని నరుకుతాడు రాముడు. రావణుడి శిరస్సును ఖండించాడు. తల నరకగానే తల మొలిచింది కాని వాడు చనిపోవడం లేదు. చివరకు బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించాడు రాముడు. రావణుడి మరణానికి లోకాలన్నీ సంతోషించాయి.


కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది రామాయణం కావడంతో అది ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకో గలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. శ్రీ సీతారాముల పేరు విన్న ప్రతి ఆర్యుడు మనస్సులోనైనా భక్తితో నమస్కారం చేసుకోవాల్సిందే. సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో, తన శక్తికొలది వివరించాడు. రామాయణ గాథలో, శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకే మో ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది.


శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రావణుడి పాత్ర కూడా అందులో భాగమే!


వనం జ్వాలా నరసింహారావు

Saturday, 14 June 2014

శ్రీ‌రాముడి పుట్టుక‌లో గ్ర‌హ‌బ‌లం ఎంతంటే..


గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం... ఇలా అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు. ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు. ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి. అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు.

పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది.

అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు; పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు... ఇవన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం వల్ల, ఆయనను భగవంతుడిగా కొలుస్తామంటారు కొందరు. భగవంతుడే ఒక నిండైన మహా వ్యక్తిగా అవతరించి, లోకానికి ఆరాధ్యుడయ్యాడని ఇంకొందరు చెబుతారు. ఈ రెండో అంశమే వాల్మీకాది మహర్షుల హృదయం!

ఆదర్శమూర్తి అయిన రాముడు- నారాయణుడి అవతారంగా ఎందరికో ఆరాధ్యుడు. రావణాది రాక్షసుల వల్ల సడలిన ధర్మవ్యవస్థను చక్కదిద్దడానికి రుషులు, దేవతలు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మను ఉపాసించారు. జగతికి ఆనందం కలిగించడానికి ఆ పరమాత్మను మంత్రం, తపస్సు, సాధనలతో ఆరాధించారు. వాటి ఫలంగా భగవంతుడు రాముడిగా అవతరించాడు.

రామారాధన అంటే, అది సాక్షాత్తు పరబ్రహ్మోపాసన. దీనికి తార్కాణంగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భిన్న భాషల్లో భిన్న రీతుల్లో పలువురు భక్తులు, యోగులు సాక్షాత్కరిస్తారు. తులసీదాసు, రామదాసు, కబీరు, త్యాగయ్య... ఇలా ఎందరో!

రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని ‘దేవ రహస్యం’ అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా- జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు- దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.

ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదు కోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా- సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు (గట్టి నియమ పాలన గలవాడు) శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ.

భారతజాతి గుండె చప్పుడుగా రామనామం మోగుతూనే ఉంది. ఆస్తిక జన హృదయాల్లో ఆయన దివ్యమంగళ విగ్రహం కొలువై ఉంది. రామ కథా సుధ తరగని జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది!

మయూరధ్వజుడు

మయూరధ్వజుడు



ధర్మరాజు అశ్వమేధయాగం చేసి హయాన్ని వదిలాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే! పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు అతని నగరం చేరుకున్నారు.మయూరధ్వజుడు కృష్ణభక్తుడనీ, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. సరేనన్నాడు పాండవమధ్యముడు.

మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. సవ్యసాచి అతన్ని సంబాళించలేక పోయాడు. విధి లేక శౌరి సాయం ఆర్థించాడు. పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్యదైవంతో పోరాడటం ఇష్టం లేదు. కాని రణరంగంలో వెనుదీయడం క్షత్రియధర్మం కాదని తలచి “కృష్ణా! కృష్ణా!” అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించడం మొదలు పెట్టాడు. ఆ శరాల ధాటికి ఆ మహాయోగి కూడా చలించాడు.

“బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా?” అన్నాడు అర్జునుడు. పద్మనాభుడు మందహాసంతో “పార్థా! నీ గాండీవం గాని, నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద పనిచేయవు” అన్నాడు.

‘మయూరధ్వజుడు అంతటి భక్తుడా!’ అని గాండీవి విస్తుపోయాడు. మాధవభక్తులలో తనను మించిన వారు లేరని కృష్ణసఖునికి కించిత్తు గర్వముంది. అది మునుపే ఎరిగిన కృష్ణుడు మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. ఇద్దరూ అనాటికి యుద్ధం చాలించారు.

మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్ళారు. విప్రుల రాక గమనించి ఆ రాజు వారికి ఎదురేగి గౌరవ పురస్కారంగా మర్యాద చేశాడు.

“అయ్యా! మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించాడు. “రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకొక పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరితేగాని మేము మరొక విషయం ఆలోచించలేము” అన్నాడు మాయారూపంలో ఉన్న కృష్ణుడు.

“స్వామీ! మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను” అన్నాడు మయూరధ్వజుడు.

“రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత “మయూరధ్వజ మహారాజు శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు” అని అశరీరవాణి పలికింది. అందుకని నాకు పుత్ర భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అన్నాడు విప్రుని వేషంలో ఉన్న కృష్ణుడు.

“ఆహా! నా జన్మ తరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే ఏం కావాలి. అయ్యా! సందేహించకండి. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి” అని వారిని అర్థించాడు మయూరధ్వజుడు.

వెంటనే భార్యాబిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమన్నాడు.

మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారికి అర్థమైంది. మారుమాట్లాడక రాజుగారి శరీరాన్ని చేదించడం ప్రారంభించారు.

కృష్ణార్జునులు అనిమిషులై ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికొక వింత కనిపించింది.

మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కఠిన్యంతో “రాజా! బాధపడుతూ నువ్వేమీ నీ శరీరాన్ని నాకివ్వనవసరం లేదు. మనస్ఫూర్తిగా , సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వముంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడం నైచ్యమౌతుంది. మనమీద వున్న మమకారాన్ని మనం చంపుకోలేక పోవడం దీనికి కారణం. నీ కిష్టం లేని పనిని నీవు చెయ్యవద్దులే” అని వెనుదిరిగాడు.

మయూరధ్వజుడు కృష్ణుని చేతులు పట్టుకుని, “అయ్యా! నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధలేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ వుంటే రెండు కళ్ళూ కూడా నీరు కార్చాలి కదా! ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తోంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలో కుడిభాగం ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదనీ , వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమకన్ను దుఃఖిస్తోంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్నీ సాధించకుండానే, ఎవరికీ ఎట్టి ప్రయోజనాన్నీ కలిగించకుండానే ఖిలమైపోవాలి కదా అని చింతిస్తోంది” అన్నాడు.

ఈ మాటలు విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి అచ్యుతుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గుపడ్డాడు.

పునీతుడైన ప్రియబాంధవునితో సహా కృష్ణుడు తమ నిజరూపాలు తెలియజెప్పి మయూరధ్వజుని దీవించాడు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలుగచేశాడు.

మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునునికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు.

Sunday, 23 March 2014

పాండవులు - విజేతలు ఓడినవేళ





విజేతలు ఓడినవేళ

భారత యుద్ధంలో విజేతలైన పాండవులు కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని దర్శించారు.

భీష్ముడు ధర్మరాజుకి వివిధ ధర్మాలు బోధించి..‘నాయనా. నా కర్తవ్యం కూడా ముగిసింది. ఇక నేను తృప్తిగా ఈ లోకం విడిచి వెళ్తా. నా చివరి కోరిక తీరుస్తావా మనవడా?’ అన్నాడు.

‘ఎంత మాట తాతా, తప్పక తీరుస్తా’ అన్నాడు ధర్మరాజు.

అప్పుడు భీష్ముడు.. ఇంతకు ముందు ఏ శవమూ దహించని చోట తన దహన సంస్కారం జరిపించాలని కోరాడు.

ధర్మరాజు సరేనన్నాడు.

భీష్ముని కళ్లు శాశ్వతంగా మూతబడినై.

అనంతరం.. అన్నగారి ఆదేశానుసారం నల్గురు సోదరులూ నాల్గు దిక్కులా వెతికినా శవ దహనం జరగని చోటు దొరకలేదు. ఈ క్రమంలో ధర్మరాజుకి ఒక పండు ముసలి రైతు కనిపించగా ఆశగా, ఆతృతగా అడిగాడు.

దానికా రైతు.. ‘నా ఎరికలో.. అదుగో ఆ కన్పించే ఎత్తైన గుట్టమీద ఇంతవరకు అలాంటిది జరగలేదు’ అన్నాడు.

ధర్మరాజు ఎగిరి గంతేశాడు. దహనానికి ఏర్పాట్లు జరిగినై. తల కొరివి పెట్టడమే తరువాయి.

ఆ సమయంలో.. ‘ఈ గుట్ట మీద వంద మంది భీష్ములు, మూడు వందల మంది పాండవులు, వెయ్యిమంది ద్రోణులు, ఇక లెక్కకు మించి కర్ణులు దహించబడ్డారు’ అంటూ ఆకాశవాణి వినిపించింది.

దీంతో పాండవులు ఉలిక్కిపడ్డారు.

అయ్యో! తాతయ్య కడసారి కోరిక తీర్చలేకపోయాం గదా - అని నీరుగారిపోయారు.

అంతలోనే ధర్మరాజు గంభీరంగా నవ్వుతూ.. ‘తాతగారు మహా మనీషి. ఆయన మేధ అసాధారణం. ఆయన భావం మనమే గ్రహించలేకపోయాం. అర్జునా! మనందరికీ ఏదో ఒక గర్వం. నీకు సవ్యసాచివని గర్వం. భీమునికి భుజబలగర్వం. నకులునికి సౌందర్య గర్వం. సహదేవునికి శాస్త్ర, విద్యా గర్వం. ధార్మికుడినని నాకు గర్వం. ఇక భారత యుద్ధంలో గెల్చామనే వ్యర్థ గర్వం సరేసరి’ అన్నాడు.

‘ఆహా! మనలాంటి వారు కాదు కాదు, మనకన్నా గొప్పవారెందరో ఇక్కడ (ఈ భూమ్మీద) అంతరించారు.’ అన్నాడు భీముడు.

‘ఆ సత్యాన్ని ఎంత విలక్షణంగా బోధించాడు తాతయ్య’ అన్నాడు నకులుడు.

అలా.. విజేతలైన పాండవులు పితామహుని చేతిలో ఓడినా తమ గర్వాన్ని పోగొట్టిన ఆ ఓటమిలో ఎంతో ఆనందం, తృప్తి, మనశ్శాంతి పొందారు.
- తంగిరాల రాజేంద్ర ప్రసాద శర్మ 

Friday, 21 March 2014

శనిదోషాలు





శనిదోషాలు


సమస్త ప్రాణకోటి పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అగ్రజుడు. ఇద్దరూ న్యాయాధిపతులే. అయినా వీరిలో ఈ లోకంలోని జీవుల పాపపుణ్యాలను బట్టీ ఇక్కడే దోషాలను పరిహరించే బాధ్యతను నిర్వర్తిస్తున్న శనికి విశిష్ట స్థానం ఉంది. శని దోషకాలంలో దాగున్న పరమార్థం అదే.

జాతకంలో శనిదోషం ఉంది అనగానే చాలామంది ఆందోళన చెందుతుంటారు. శనిదోషం శుభప్రదమైనది కాకపోవడమే ఇందుకు కారణం. అయితే, శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎంతటి దోషం నుంచైనా ఉపశమనం లభిస్తుందనేది జ్యోతిషపరమైన వాస్తవం. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు ఆయా రాశుల్లో చేసే సంచారాన్ని అనుసరించి శనిదోషం ఉంటుంది. ఈ శనిదోషాలు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని మూడురకాలుగా ఉంటాయి.

ఏలినాటి శని
పూర్ణాయుష్కుడైన ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని మూడుసార్లు వస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శని ఏడున్నర సంవత్సరాలపాటు జాతకం మీద ప్రభావం చూపే కాలాన్ని ఏలినాటి శని అంటారు. దీన్నే ఏడునాడు శని అని కూడా వ్యవహరిస్తారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. ఇది శుభాశుభాల మిశ్రమకాలం. ఏ వ్యక్తి జాతక చక్రంలోనైనా పన్నెండు రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో సంబంధిత గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. జన్మరాశి నుంచి పన్నెండు, ఒకటి, రెండు స్థానాల్లో శని ఉన్న కాలాన్ని ఏలినాటి శని కాలంగా పేర్కొంటారు. మళ్లీ తిరిగి ఈ ఏడున్నర సంవత్సరాలను ద్వాదశ శని, జన్మశని, ద్వితీయశని అనే మూడు దశలుగా విభజిస్తారు. ఒక్కో దశా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. జన్మరాశి నుంచి పన్నెండో స్థానంలో శని ఉంటే దాన్ని ద్వాదశ శని అంటారు. ఈ కాలంలో ప్రమాదాలు, ధననష్టం, అపార్థాలు, అపోహలు అధికంగా ఉంటాయి. శనీశ్వరుడు ఒకటో స్థానంలో ఉన్న కాలాన్ని జన్మశని అంటారు. ఈ కాలంలో శారీరక, మానసిక అనారోగ్యాలు ఎక్కువవుతాయి. సంపాదన ఉంటుంది కానీ డబ్బు చేతిలో ఉండదు. జన్మరాశి నుంచి రెండో స్థానంలో శని ఉంటే ఆ కాలాన్ని ద్వితీయ శని అంటారు. ఏలినాటి శని చివరి దశ ఇది. ఈ కాలంలో ధననష్టం, అపార్థాలు ఉన్నప్పటికీ కోలుకునే దశ ప్రారంభమవుతుంది.

అర్ధాష్టమ శని
ఏలినాటి శని పూర్తయిన రెండున్నరేళ్ల తర్వాత అర్ధాష్టమ శని కాలం ప్రారంభమవుతుంది. జన్మరాశిలో శని నాలుగో ఇంట ఉన్న కాలాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి.

అష్టమశని
అర్ధాష్టమశని దోషం పూర్తయిన ఏడున్నర సంవత్సరాల తర్వాత అష్టమ శని ప్రారంభమవుతుంది. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన దోషకాలం. అపమృత్యుభయం, అనారోగ్యం, అవమానాలు వంటివన్నీ ఈ దోషకాలంలోనే జరుగుతాయి. అష్టమశని రెండున్నరేళ్ల కాలం పాటు ఉంటుంది.

ఇలా పరిహరిద్దాం 
ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం. ఇందుకోసం శాస్త్రాల్లో పేర్కొన్న చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి. ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవ గ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి.  శనివారంతోపాటు త్రయోదశి, అమావాస్య కలసివచ్చినప్పుడు శనీశ్వరుడిని తప్పక ఆరాధించాలి. పరమేశ్వరుడి పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి. ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. యాచకులకూ వికలాంగులకూ పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించడం మంచిది.



Sunday, 16 March 2014

చిరంజీవులు





చిరంజీవులు


చిరంజీవులు అంటే చిరకాలం జీవించి ఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు. వీరు ఏడుగురు చిరంజీవులు.

అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||

దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు.



మధుపర్కం - పంచామృతం





 మధుపర్కం - పంచామృతం 

మధుపర్కం అంటే ఏమిటి?
మధుపర్కం అంటే తేనేతో కూడుకున్న మిశ్రమం. ఆ మిశ్రమం వేటితో చేయాలి? దధి సర్పిర్జలం క్షౌద్రం సితా చైతైశ్వ పంచభిః – అంటే సమపాళ్ళలో పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇంకా జలం. వీటి మిశ్రమమే మధుపర్కం.

పంచామృతం మధుపర్కం తేడా?
పూజల్లో పంచామృతం వాడతారు కదా – మరి పంచామృతానికీ, మధుపర్కానికీ తేడా ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, తేనే ఇంకా చెక్కెర – ఈ క్రమంలో ఆయా పదార్థాలను విడి విడిగా స్నపనం చేసి, అలా వచ్చిన పదార్థాన్ని అంటే పంచామృతాన్ని తీర్థంగా స్వీకరించాలి. అన్నిటినీ కలిపేసి అభిషేకం చేస్తుంటారు. ఈ పద్ధతి ఎంతమటుకూ సరైనదో తెలియదు. పంచామృతంతో అభిషేకం చేస్తాము; మధుపర్కం స్వీకరించమని అంటే తాగమని సమర్పించుకుంటాము – అది తేడా.

మధుపర్కం ఎందుకు సమర్పిస్తారు?
గౌరవాన్ని సుచిస్తూ సమర్పించుకునేది మధుపర్కం. యజమాని అంటే పూజ చేయిస్తున్న గృహస్తు లేదా పెళ్ళిలో కన్యాదానం చేస్తున్నతను – మర్యాద పూర్వకంగా గౌరవాన్ని సూచిస్తూ మధుపర్కం సమర్పించుకోవాలి. పూజలో అయితే భగవంతుడికి, పెళ్ళిలో ఐతే నారాయణ స్వరూపమైన వరుడికి. మధుపర్కం సమర్పించుకోవటం ఎంతటి గౌరవ సూచకమో, దానిని పద్ధతిగా స్వీకరించటమూ అంతే మర్యాదతో కూడుకున్నది. సంస్కృత నిఘంటువులో  ‘A mixture of honey’, a respectful offering made to a guest or to the bridegroom on his arrival at the door of the father of the bride అని ఉంది.



యక్ష ప్రశ్నలు





72 చిక్కు ప్రశ్నలు
ధర్మరాజు ఇచ్చిన జవాబులు


మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు’’ అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.
అవి ...
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?
బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
దర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
సత్యం
5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును?
వేదం
6. దేని వలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టతవం వల్ల
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయం వలన
12. జీవన్మృతుడెవరు?
దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటే భారమైనది ఏది?
జనని
14. ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటే వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయటం వలన
21. జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకి ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయదాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
దానం
29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం
36. సుఖాల్లో గొప్పది ఏది?
జ. సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
జ. అహింస

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
జ. మనస్సు

39. ఎవరితో సంధి శిధిలమవదు?
జ. సజ్జనులతో

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది?
జ. యాగకర్మ

41. లోకానికి దిక్కు ఎవరు?
జ. సత్పురుషులు

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
జ. భూమి, ఆకాశములందు

43. లోకాన్ని కప్పివున్నది ఏది?
జ. అజ్ఞానం

44. శ్రాద్ధవిధికి సమయమేది?
జ. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు

45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
జ. వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో...

46. తపస్సు అంటే ఏమిటి?
జ. తన వృత్తికుల ధర్మం ఆచరించడం

47. క్షమ అంటే ఏమిటి?
జ. ద్వందాలు సహించడం

48. సిగ్గు అంటే ఏమిటి?
జ. చేయరాని పనులంటే జడవడం

49. సర్వధనియనదగు వాడెవడు?
జ. ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు

50. జ్ఞానం అంటే ఏమిటి?
జ. మంచి చెడ్డల్ని గుర్తించగలగడం

51. దయ అంటే ఏమిటి?
జ. ప్రాణులన్నింటి సుఖము కోరడం

52. అర్జవం అంటే ఏమిటి?
జ. సదా సమభావం కలిగి ఉండటం

53. సోమరితనం అంటే ఏమిటి?
జ. ధర్మకార్యములు చేయకుండుట

54. దుఃఖం అంటే ఏమిటి?
జ. అజ్ఞానం కలిగి ఉండటం

55. ధైర్యం అంటే ఏమిటి?
జ. ఇంద్రియ నిగ్రహం

56. స్నానం అంటే ఏమిటి?
జ. మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం

57. దానం అంటే ఏమిటి?
జ. సమస్తప్రాణుల్ని రక్షించడం

58. పండితుడెవరు?
జ. ధర్మం తెలిసినవాడు

59. మూర్ఖుడెవడు?
జ. ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు

60. ఏది కాయం?
జ. సంసారానికి కారణమైంది

61. అహంకారం అంటే ఏమిటి?
జ. అజ్ఞానం

62. డంభం అంటే ఏమిటి?
జ. తన గొప్పతానే చెప్పుకోవటం

63. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును?
జ. తన భార్యలో, తన భర్తలో

64. నరకం అనుభవించే వారెవరు?
జ. ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మ శాసా్త్రల్నీ, దేవతల్ని, పితృదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
జ. ప్రవర్తన మాత్రమే

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
జ. మైత్రి

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
జ. అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
జ. సుఖపడతాడు

69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
జ. అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు

70. ఏది ఆశ్చర్యం?
జ. ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం

71. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు?
జ. ప్రియయూ అప్రియయూ, సుఖమూ దుఃఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు

72. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు?
జ. నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదుఃఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడై ఎవరైతే ఉంటాడో వానిని.






Saturday, 15 March 2014

ధర్మక్షేత్రం కురుక్షేత్రంగా ఎలా?





ధర్మక్షేత్రం కురుక్షేత్రంగా ఎలా మారిందంటే..

మహాభారత యుద్ధం ప్రారంభమై పది రోజుల కూడా పూర్తికాక ముందే భీష్ముడు అంపశయ్యపై ఒరిగాడు. ఈ వార్త విన్న ధృతరాష్ట్రుడు నివ్వెరపోయాడు. ‘ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావాళ్లు, పాండు పుత్రులు సమరయోధులై ఉన్నారు. అక్కడ ఏం జరుగుతోంది?’ అని సంజయుడిని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు.

ధృతరాష్ట్రుడు అంధుడు. అతడికి ఉన్నది కేవలం అవయవలోపమే కాదు.. ఒకవిధంగా మానసిక వికలాంగుడు కూడా. అతడి మనసులో ఏదో తెలియని వెలితి. ఈ లోపం ఉన్నవారిని ఎప్పుడూ ఏదో లేదనే మనస్తాపం వెంటాడుతూనే ఉంటుంది. వారు ఆ వెలితి నుంచి బయటపడాలనే తపనతో సతమతమవుతుంటారు. ఇలాంటి వాళ్లకు ఎన్ని ఉన్నా ఏదీ కనపడదు. ‘ఇంకా ఏదో పొందాలి.. ఏదేదో అయిపోవాలి’ అనే ఆరాటం ఉంటుంది. ఇదే అసలైన అవిటితనం. ఈ అవిటితనమే మమకారానికి దారితీసింది. అందుకే ధృతరాష్ట్రుడు.. నావాళ్లు ఏమైపోయారో అంటూ సంజయుడి దగ్గర రోదించాడు.

తండ్రికి తగ్గ తనయుడు దుర్యోధనుడు. ఇతను అహంకారానికి అసలైన ప్రతీక. తనకు మించి ఎవ్వరూ ఉండరాదు. తనకన్నా ఎవరూ గొప్ప కాకూడదనే మితిమీరిన అహంకారం. ఈ అహంకారంతో గురువును కూడా ధిక్కరించేలా మాట్లాడాడు. ‘తవ శిష్యేణ ధీమతా..’, ‘మదర్థే త్యక్త జీవితాః’.. ‘నీ శిష్యుడైన దృష్టధ్యుమ్నునిచే పాండవ సైన్యం ఎలా కూర్చబడి ఉందో చూడు’, అలాగే.. ‘నా కోసం మీరందరూ జీవితాలను త్యాం చేసి వచ్చారు’ అనే ప్రేలాపనతో దుర్యోధనుడు తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఈ విధంగ ధర్మక్షేత్రం.. కురుక్షేత్రంగా మారడానికి అహంకార, మమకారాలే కారణమయ్యాయి.


స్వామి పరిపూర్ణానంద