Thursday, 21 April 2016

ఊర్మిళ






ఊర్మిళ

జీవితానికి రెండు పార్శాలుంటాయి. ఒకటి అంతర్గతం, మరొకటి బహిర్గతం. రెంటికీ మధ్య తేడా ఏముంటుంది జీవితం అంటే జీవితమే కదా! అని తీసిపారేసేంత చిన్నదీ కాదు. అల్పమైందీ కాదు జీవితం. ఎంతో లోతైనది. గంభీరమైనదీ, అతీతమైనదీ, అపూర్వమైనదీ జీవితం. ప్రపంచానికి కనిపించే జీవిత కోణం గురించి నాలుగు విధాలుగా మాత్రమే కాదు, నాలుగు వందల విధాలుగా మాట్లాడుకునే అధికారం, నిర్వచించేంత అమాయకత్వం సమాజానికి ఉందనే చెప్పాలి. అంతర్గతమై ఆవిష్కృతం కాని అపురూపమై అగాథమై స్వీయ అధికారానికే లొంగే జీవిత కోణం అర్థం చేసుకోవడమంటే ఎప్పటికీ అసాధ్యమే. కొన్ని జీవితాలు పైకి సామాన్యంగా కనిపించినా లోలోతున పరికించే ప్రయత్నం చేస్తే అబ్బురపరిచేవై దురవుతాయి. గొప్పగా కనిపించే జీవితాల లోతులు అర్థం కాని మజిలీలై తారసపడతాయి. అందుకే ఎవరి జీవిత నిర్వచనం వారికే సొంతమై వారితో మమేకమవుతుంటే మహనీయమై పరిచయంగా పలుకరిస్తుంది. అలాంటి జీవితాలలో ప్రత్యేకమై నిశ్శబ్ధంలో రాగమై పరిచయం తప్ప లోతెరుగనిదై కనిపిస్తూనే జీవితకోణాన్ని కొంగ్రొత్తగా చూపిస్తుంది ఊర్మిళ జీవితం.సీతకు చెల్లెలుగా, లక్ష్మణుని భార్యగా మాత్రమే ప్రపంచానికి పరిచయమైన ఊర్మిళ జీవిత నిర్వచనాన్ని తనదైన శైలిలో తెలియజెప్పిందంటే ఆశ్చర్యం, ఆనందం కలగలిసి మనలో ఆమెను గురించి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది.

రాచరికం, ఠీవి, చురుకుదనం పొందికైన అందం, అధికారాలపై పట్టు మిథిలానగరపు ధర్మశాసనాలు క్షుణ్ణంగా తెలిసిన సీత చాటు చెల్లెలు ఊర్మిళ. ఈమెకు అధికారం అంటే చిన్నతనం నుంచే మక్కువ. రాజధర్మాలన్నీ ఔపోసన పట్టిన యువరాణి. అయోధ్యలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ అక్కడి లౌకిక వ్యవహారాలన్నీ అర్థం చేసుకొని, విధులన్నీ చక్కబెట్టే బాధ్యతను తనకు తానుగా కౌసల్య నుండి స్వీకరించింది. గంభీరమైన ధీరవనిత ఊర్మిళ. ఇదంతా ఊర్మిళ జీవితంలో కొంతభాగం మాత్రమే. పైగా ప్రపంచానికి తెలియని విభిన్న కోణం ఇది.

ఊర్మిళ అంటే కేవలం రామాయణంలో నిద్రకు ప్రతిరూపంగా పద్నాలుగేళ్ళు సీతారామలక్ష్మణులు అరణ్య వాసంలోకి వెళితే ఊర్మిళ పద్నాలుగేళ్ళు నిద్ర పోయిందనే మనకు తెలుసు. ఏదో పురాణ కథనం ప్రకారం లక్ష్మణుడు త్యాగం చేసిన నిద్రను తాను మోసిందనే విషయచర్చ. ఊర్మిళ జీవితాన్ని అంతకే పరిమితం చేసింది. కానీ ఊర్మిళ పద్నాలుగేళ్ళు అజ్ఞాతవాసంలో ఉంది. ఆమె నిద్ర యోగ నిద్ర. మనిషనే రూపాన్ని చూడక ఎవరితో మాట్లాడక, తనవాళ్ళను గురించిన ఆలోచనే చేయక అన్ని సంవత్సరాలు ఒంటరిగా జీవించగలిగిందంటే ఎంతటి సాహసం. ఎంతటి కఠిన నిర్ణయం.

కైకేయి దశరథుణి రెండు వరాలు కోరడం, అందులో భాగంగా రాముడు అడవికి వెళ్లడం, రాముని వెంటే తానని సీత అడవులకు పయనమై ఉంటే కథ మరోలా ఉండేదేమో. కాని లక్ష్మణుడు రాముని సేవకే నేను పుట్టానని అన్నతోనే జీవితమని నిశ్చయించుకొని ఊర్మిళకు మాటైనా చెప్పక అడవులకు వెళతాడు. అయోధ్యంతా సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం గురించే దుఃఖిస్తుంది. కానీ ఊర్మిళ పరిస్థితే ఎవ్వరికీ తట్టలేదు. ఊర్మిళ మాత్రం వీటన్నింటికన్నా అతీతంగా ఆలోచించింది. అధికారంతో అనుబంధాలతో నాకు పనే లేదన్నట్లు పద్నాలుగేళ్ళు అజ్ఞాతవాసం చేసింది. నిద్రలోనే నిత్య సంఘర్షణ చేసింది. నిజానిజాలు తెలుసుకుంది. శాంతికి చేరుకునే రహస్యాన్ని ఛేదించింది. తన తపస్సుకు ఫలితంగా జీవిత ధర్మాన్ని తెలుసుకోగలిగింది. జీవితం మార్పును తీసుకొస్తే ఆ మార్పు తాకిడికి ఎటువంటి దశకు చేరుకుంటుందో చెప్పడం ఎవరితరం కాదు. అటువంటి మార్పే ఊర్మిళ జీవితంలో చోటు చేసుకుంది.

ఊర్మిళ జీవితంలోని ప్రతీ మలుపునూ ఆమె ఆహ్వానించింది. అంతకు మించి దానిని అర్థం చేసుకొని అందులో ఇమిడిపోతూనే అంతరార్థాన్ని తెలుసుకుంది. పద్నాలుగేళ్ల తర్వాత వచ్చిన సీతారాములను కోపంతోనో, ద్వేషంతోనో కాక అంతే అభిమానంతో గౌరవంతో చూసుకుంది. లక్ష్మణుడు తనను లెక్కచేయక, ఒక్కమాట అయినా చెప్పలేదనే అపవాదు రానీయక తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఆమె సహనానికీ, ఆలోచనా పరిపక్వతకూ నిదర్శనం ఆమెలోని నిశ్చయత్వం. చివరిదాకా తనదైన జీవినశైలిలో, తన వ్యక్తిత్వానికి వన్నె తరగకుండా ఎదురయ్యే సవాళ్ళనూ, మార్పులనూ ఎదుర్కొంటూనే జీవితం కొనసాగించిన ఊర్మిళ ఆదర్శానికి ఆస్కారమిస్తూనే అతి సామాన్యంగా తన పాత్రతత్వాన్ని చిత్రించుకోగలిగిందంటే స్త్రీలోని అంతర్గత శక్తులకు రూపమిచ్చిందనే చెప్పాలి. అధికారాలు, అనుబంధాలు ఆలోచనల్లో గాంభీర్యాన్ని తీసుకురానంత వరకూ వాటిని అర్థం చేసుకొనట్లేననీ వాటిని మనసు పెట్టకుండానే కొనసాగించినట్లేననీ చెప్పకనే చెప్పిన ఊర్మిళ ఉన్నత ఆలోచనాథృక్పథం జీవన సంకేతాన్ని వినూత్నంగా పరిచయం చేసిందంటే అతిశయోక్తి లేదు.
-ప్రమద్వర






కుచేలుడు






కుచేలుడు

సృష్టిలో బంధాలన్నింటికీ అర్థం ఉంటుంది. వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం ఎంతవరకు సామరస్యంతో, ప్రేమతో, బాధ్యతో వ్యవహరించగలమో అంతవరకూ అవి మనకు దూరం కావు. స్వార్థం కూడా బంధాల అమరికలో ముఖ్యపాత్ర పోషిస్తూ అమరికలకు ఆస్కారం ఇస్తూ ఉంటుంది. సంతోషం, ఇష్టం బంధాల రూపంలో దొరికినంత వరకూ మనలోని భావాలు పదిలంగా ఉంటాయి. కానీ కాస్త కష్టం కలిగిందో బంధాల మనోభావాలు తెబ్బతీస్తాయి. దూరంగా వెళ్లేందుకు సన్నద్ధం అవుతాయి. అయితే, అన్ని బంధాలు మన ప్రేమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చి చేరాయి. స్నేహబంధం మాత్రం మనం ఏరి,కోరి, నమ్మి, ఇష్టపడి చేరువయ్యే అద్భుతం, అదృష్టం. అది ఒక్కసారి బలపడిందో జీవితాంతం తోడుండేది. షరతులూ, హద్దులు లేనిది, స్వార్థం అంటని స్వచ్ఛమైనది స్నేహం. అటువంటి స్వచ్ఛమైన స్నేహం కుచేలుని రూపంలో ప్రపంచానికి పరిచయం అయింది. కృష్ణున్నే మైమరిపించింది. చిన్ననాటి స్నేహమే అయినా చిరకాలమై కుచేలునితత్వం కృష్ణుని మదిలో ఎదిగినదై స్థానం సంపాదించుకున్నది. కుచేలుని వ్యక్తివం విషయ విరక్తి అతన్ని నిశ్చయంగా ఉంచింది. కానీ బతుకు బాటలో ఆటుపోట్లు తప్పలేదు. చెదరని ఆత్మవిశ్వాసం, మేధస్సు, ప్రశాంత చిత్తం కుచేలుని బలాలు, బలహీనతలు.

కుచేలుని అసలు పేరు సుదాముడు. ధర్మ మార్గాన్నే అనుసరించిన వాడై, శాంత స్వభావియై, నిష్కామయోగిలా బతికాడు కుచేలుడు. ఈతని భార్య వామాక్షి. వీరికి చాలామంది సంతానం. కటిక దారిద్య్రం అనుభవించే పేదవాడే అయినా, కుచేలుడు అభిమానాన్ని చంపుకొని ఏనాడూ బతుకలేదు. ఎంతటి కష్టమొచ్చినా అతనిలోని సంతోషం చెక్కుచెదురలేదు. కృష్ణునితో కుచేలుని స్నేహం సాంతీపుడనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో కుదిరింది. చదువు ముగియడంతో మనుషులు దూరమైనా వారి మనుసుల్లో స్నేహం పదిలంగా నిలిచిపోయింది.

కృష్ణునికి కుచేలుడంటే ప్రత్యేకమైన అభిమానం, ఆదరణ. కుచేలునికీ కృష్ణుడంటే అవ్యాజమైన ప్రేమ. కృష్ణ లీలలు విన్నంతనే కుచేలుని మనసు ఉప్పొంగి పోయేది. ఎన్నడూ కృష్ణుడు తన స్నేహితుడనీ చెప్పుకొని గొప్పకు పోలేదు. ఎందుకంటే కుచేలునిది నిస్వార్థమైన స్నేహం. అతని ఉద్దేశం ప్రకారం కృష్ణుని స్నేహం వలన తనలో ఆనందమనే ప్రేమ జనించింది. అది కుచేలునిలో ప్రశాంతతను నెలకొల్పింది. శాంతం నిశ్శబ్ధ నిబద్ధతను కుచేలునికి అనుభవైకవేద్యంలా అందించింది. ఆ మౌనమే కుచేలునికి దైవత్వాన్ని ఆపాదించింది. అంటే బయట ప్రపంచం దృష్టిలో కృష్ణుడంటే రాజకుటుంబీకుడూ, దేవుడు. కుచేలుడంటే వేదవిదుడూ, పేదవాడు. కానీ కృష్ణునిలోని దైవత్వాన్ని తన వ్యక్తిత్వంలోనూ, కృష్ణునిపట్ల తనకున్న ప్రేమ, స్నేహంలోనూ పొందగలిగాడు కుచేలుడు. అందుకే ఇంతకన్నా గొప్ప సంపద స్నేహబంధంతో కాక మరెలా సాధ్యమని కుచేలుని సదాలోచన.

కుచేలుడు ఒకనాడు తన కుటుంబ పరిస్థితిని గురించి ఆలోచిస్తుండగా అతని భార్య వామాక్షి, కృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడ కదా! ఒక్కసారి వెళ్లి ఆయన్ను కలిస్తే మన బాధలన్నీ తీరిపోతాయని అనిపిస్తుందని అంటుంది. పిల్లల దీనస్థితి, భార్య మాట కుచేలున్ని కృష్ణుని కలుసుకునేందుకు ప్రేరేపించాయనే కన్నా, తన మిత్రుని కలుస్తాననే ఆనందానికి తోవయ్యాయి. వట్టి చేతులతో వెళ్లడం సబబుకాదని ఇంట్లో మూలన దొరికిన కాసిన్ని అటుకులను తన ఉత్తరీయంలో మూటగట్టుకొని బయలుదేరుతాడు కుచేలుడు.కుచేలునికి తన కష్టాలకిక కాలం చెల్లిందనే సంతోషం ఏమాత్రం లేదు. ఎందుకంటే కృష్ణుని దర్శించడమే అతని మనసంతా నిండిన ముఖ్యోద్దేశం. దాని పొడుగునా అనేక సంశయాలు. ఎప్పటిదో చిన్ననాటి స్నేహం నాదీ, కృష్ణునిదీ. అనంతమైన ద్వారకలో ఉండే కృష్ణున్ని కలవడానికి, కనీసం చూడటానికి నాకు అనుమతి దొరుకుతుందో, ఈ పేదవాని రూపం అందుకు తగినదేనా ! అయినా సరే, నాలోని ప్రేమ, నాస్నేహం కృష్ణునిపట్ల నిశ్చయమైనవే అయితే, తప్పక కలుస్తానని సంకల్పించుకొని వెళతాడు కుచేలుడు.కృష్ణుని కోసం రాజద్వారం దగ్గర వాకబు చేస్తూ, నేను కృష్ణున్ని కలువడానికై వచ్చానని కుచేలుడు అలా చెప్పాడో లేదో, స్వయంగా తన మందిరం వదిలి కృష్ణుడు హుటాహుటిన వచ్చి చేయిపట్టుకొని తన మందిరానికి తీసుకెళుతాడు. బంగారు ఆసనంపై కూర్చోబెట్టి, బంగారు పళ్లెంలో కుచేలుని పాదాల నుంచి సేవ చేస్తాడు కృష్ణుడు. మంచి విందు భోజనాన్ని కొసరి, కొసరి వడ్డిస్తూ, విజామరతో విసురుతూ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కుచేలునికి గుర్తు చేస్తాడు. కుశలప్రశ్నలు ప్రేమగా అడుగుతాడు. తాను తెచ్చిన అటుకులు తనకెంతో ఇష్టమైనవని తృప్తిగా ఆరగిస్తాడు. ఇదంతా కుచేలునికి అంతుపట్టని విశేషం. నా స్నేహానికి ఇంతటి ఔదార్యమా! ఇంతటి ప్రేమాభిమానాలా! అని ఆశ్చర్యపోతాడు కుచేలుడు. మరునాడు కృష్ణుని దగ్గర తృప్తిగా సెలవు తీసుకొని ఇంటిదారిపట్టిన కుచేలుని మనసులో తన్మయత్వం తప్ప మరేమీ లేదు.

కుచేలునికి తన కష్టాలేవి గుర్తులేవు. బాధల ఊసే లేదు. అలుపెరుగని ఆనందం తప్ప. ప్రపంచమంతా ఎవరిని సేవించాలనుకచుందో, అలాంటి కృష్ణుడు స్వయంగా నా కాళ్లు కడిగి శిరసున చల్లుకోవడమా! ఇంతకన్నా నాకు కావాల్సినదేంటని ఇంటికి చేరుకున్న కుచేలునికి తన పూరిగుడెసె స్థానంలో సకల సంపదలతో నిండిన అందమైన పాలరాతి మేడ కనిపించింది. కృష్ణుని వాత్సల్యానికి మనసారా నమస్కరించి కృతజ్ఞత తెలుపుకున్నాడు కుచేలుడు. కానీ ఆ సంపద వలన అహంకారాన్నీ, వాటిపై వ్యామోహాన్ని పెంచుకోక యోగిలా జీవిత చరమాంకం వరకూ బతికాడు కుచేలుడు.కుచేలుని విషయంలో జరిగిన ఈ అద్భుతం కృష్ణుని మహత్తులా కనిపించినప్పటికీ, కుచేలునికే పాత్రత, అర్హత లేకపోయినట్లయితే జరిగే పనేనా! కులచేలునిలోని నిస్వార్థ ప్రేమ, స్నేహం కృష్ణుడంతటి వాడినే తన్మయింపజేసిందనేది నిర్వివాదాంశం. స్నేహం పరస్పర వ్యక్తీకరణ కన్నా, భావ పరిభాకే అర్థమవుతుందనేది కుచేలుని వ్యక్తిత్వం చెబుతున్నది.
ప్రమద్వర



Tuesday, 5 April 2016

భీముడు






భీముడు

అన్యాయాన్ని చూసి సహించలేని వీరత్వం వెనుక ధర్మం రక్షించబడాలనే తపన, అంతా మంచే జరగాలన్న సున్నితత్వం, ఆవేశం అనర్థాలను మాత్రమే నివారించాలి గాని, నిశ్చలమైన జీవితాన్ని కాదనే ఉన్నత వ్యక్తిత్వం, అమోఘమైన తెలివితేటలు, భుజబలం, బుద్ధిబలం కలగలిసిన మూర్తిమత్వం మహానుభావుల రూపంలో చరిత్ర ఒడిలో ఒదిగిపోయినట్టే కనిపిస్తుంది గానీ, ఆ రూపం ఇచ్చే స్ఫూర్తి కొండలనైనా పిండి చేయగల సమర్థతకు ఊపిరి పోస్తుంది. న్యాయం, ధర్మం రక్షించబడాలంటే కొన్నికొన్ని సార్లు శాంతి ప్రబోధాలను పక్కనబెట్టి పోరాటాలూ, యుద్ధాలూ, ఉద్యమాలూ చేయక తప్పదనీ అవి మాత్రమే చెడును కూకటివేళ్ళతో సహా పెకిలించి వేయగలవనీ నిరూపితమైన సందర్భాలు కోకొల్లలు. చెడును ప్రక్షాళన చేసే క్రమంలో దయాదాక్షిణ్యాలు చూపించరాదనీ, జీవన యుద్ధం మంచిని బతికించేదే కావాలనీ తెలియ జెప్పిన భీముడు ఆవేశానికి చిరునామాగా కనిపించే కరుణాంత రంగుడు. ఆలోచనతో గెలిచే శక్తియుక్తులూ వృకోదరుడై ఆరితేరిన వంటనేర్పు, కడుపునిండా తిని కంటనిండా నిద్రించే అమాయకత్వం, అన్యాయం అన్నది వినిపించినా చాలు ఆవేశంతో రగిలిపోయే యోధుడిలా భీముడు చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.

పాండవులలో మధ్యముడు, కుంతీదేవికి వాయుదేవుని వరప్రసాదంగా పుట్టినవాడు, అత్యంత బలవంతుడు, అంతే మంచి మనసున్న వాడూ భీమసేనుడు. ఆవేశంతో తన వ్యక్తిత్వానికి ముడిపెట్టినా ఎవరినీ ద్వేషించని మనసు భీమునిది. కానీ అన్యాయాన్ని సహించలేని తత్వం భీముని జీవితంగా మారిందంటే ఆశ్చర్యం లేదు.

భీముడు పుట్టిన పదో రోజే కుంతీపాండురాజులు ఆ బాలుణ్ని తీసుకొని వనదేవత ఆశీర్వాదానికై వెళుతుంటే ఒక పులి వారిపై దూకపోయింది. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో బాల భీముడు కుంతి చేతుల నుండి జారిపోయి రాయిమీద పడిపోతాడు. కుంతీ పాండు రాజులు భీమునికేమయిందోనని చూడగా, ఆ రాయి తునాతునకలైంది. నవ్వుతూ కనిపించాడు భీముడు. అంతటి బలం భీమునిది. అదే కౌరవులకు ఇబ్బందిగా తోచింది. చిన్నతనంలో భీమునికి విషం పెట్టి, బంధించి నదిలో పడేస్తారు కౌరవులు. అవి భీమున్ని ఏ మాత్రం బాధించలేకపోయింది. భీముని హృదయం చాలా సరళమైంది. ఎత్తులు, యుక్తులు అతనికి చేతకావు. మంచికి సహకరించడం, చెడును నిర్మూలించడం మాత్రమే భీమునికి తెలుసు. అందుకే కౌరవులు ఎన్ని పన్నాగాలు పన్నినా వారిపై ఏ మాత్రం ద్వేషం కలగలేదు. కానీ వారిలోని చెడును తట్టుకోలేకపోయేవాడు భీముడు. వారి పక్షాన మాట్లాడే పెద్దలపట్ల కూడా ద్వేషం కాక కోపం ప్రదర్శించే వాడు భీముడు.తల్లిని అమితంగా ప్రేమిస్తూ, అన్న మాటకు కట్టుబడి, సోదరులను ఆదరిస్తూ బతికిన భీముడు ప్రతీ అనుకూల, ప్రతికూల సమయాలలో వారందరికీ అండగా నిలబడ్డాడు. లక్క ఇంటిలో తమ చావును నిర్ధారించిన కౌరవుల పన్నాగాన్ని పసిగట్టినవాడై గట్టి కాపాలా ఇచ్చాడు భీముడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని అడవిమార్గంలో వెళుతున్న వారందరూ అలసిపోతే భీముడు కుంతిని భుజంపై ఎక్కించుకొని నకుల సహదేవులను చంకనెత్తుకొని అర్జున ధర్మరాజులకు చెరో చేయినీ సాయమందించి ముందుకు నడిపిస్తాడు. ఆదమరచి అలసి సొలసి వారంతా నిద్రిస్తే కంటికి రెప్పలా కాపుకాసాడు భీముడు.

భీముని భుజపరాక్రమం వల్లనే కుంతీ పాండవుల జీవితం అడుగడుగునా రక్షించబడుతూ వచ్చింది. ధర్మరాజు రాజసూయయాగం చేస్తే లెక్కలేనన్ని ధనరాసులను తెచ్చిచ్చాడు భీముడు. యాగంలో శిశుపాలుడు కృష్ణుణ్ని అవమానిస్తే వాడిని చంపడానికి చూసాడు. బకాసురుణ్ని చంపి చక్రపురమనే ఊరును కాపాడాడు. జరాసంధుడనే మహాయోధుడినీ దుష్టుడైనందున సంహరించాడు భీముడు. ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత, ఆమెను చాలా జాగ్రత్తగా కాపాడిన వాడూ. ఆమె భావాలకు విలువనిచ్చేవాడూ భీముడే కావడం అతని మెత్తని మనసుకు నిదర్శనం.ధర్మరాజు జూదంలో తమనూ, రాజ్యాన్నీ ఓడినా మారుమాట్లాడని భీముడు, ద్రౌపదిని పణంగా పెట్టడం సహించలేకపోయాడు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయడం భీమునికి బొత్తిగా ఇష్టం లేదు. ఎందుకంటే, క్షత్రియధర్మం అన్యాయాన్ని ఎదిరించి పోరాడి గెలవమనే చెబుతుందనేది భీముని నమ్మకం. అరణ్యవాసంలో పాండవులకు ఎదురైన అనేక సమస్యలకు భీముడే పరిష్కారం చూపించాడు.అజ్ఞాతవాసంలో ద్రౌపదిని హింసించిన కీచకుణ్ని అత్యంత భయంకరంగా చంపిన భీముడు పరాయి స్త్రీలను వంచిస్తే ఇదే గతని చరిత్ర సాక్షిగా నిరూపించాడు. ఆనాడు సభలో ద్రౌపదిని పరాభవించిన దుశ్శాసన, దుర్యోధనులను చంపి వారి రక్తంతో ద్రౌపది కురులను ముడిచి, వారి పాపానికి తగిన శిక్ష వేసాడు. మహాబలవంతులైన దుష్టులందరూ భీముని చేతిలోనే చనిపోయారంటే భీమసేనుని ఆవేశం అన్యాయాన్ని బలి కోరుతుందని చెప్పకనే చెప్పింది.స్త్రీని గౌరవించడం, ఆమెను అడుగడుగునా కాపాడుకోవడం విద్యుక్తధర్మంగా, తన కుటుంబం, వారిని ఆదరించడం తన నైజంగా ధర్మ పక్షంలో ఉండేవారిని రక్షిస్తూ అధర్మ పక్షంలోని వారందరినీ సమూలంగా నాశనం చేయడమే ధ్యేయంగా తన బలం, తన ఓరిమి, తన వ్యక్తిత్వం సడలని ధృడ నిశ్చయాలుగా మలుచుకున్న భీముని తత్వం అత్యున్నతం. ఈతని పాకశాస్త్ర నైపుణ్యం అమోఘం. ఆతని ఆవేశం వెనకాల ఉన్న సున్నితత్వం అత్యంత రమణీయం.

ప్రమద్వర