Tuesday, 27 March 2018

రామాయణం - జీవన పారాయణం





రామాయణం జీవన పారాయణం

Fact about ramayanam.

రాముడు పుట్టడం మానవుడుగానే పుట్టాడు. కానీ, పెరగడం దైవిక లక్షణాలతో పెరిగాడు. ఆయన అనుసరించిన ఆదర్శాలన్నీ మానవ సాధ్యమైనవి కావు. మహిమలు చూపకపోతేనేం, మనిషిగా మన్ననలు అందుకున్నాడు. శత్రువుల నోట  కూడా ధర్మస్వరూపుడన్న ప్రశంసలు పొందినవాడు. ఆయన అనుసరించింది ధర్మం కాదు, ధర్మమే ఆయనను అనుసరించింది అన్నట్లుగా ప్రవర్తించాడు. తన నడవడికతో పరాక్రమంతో, ధర్మానుసరణతో, సుపరిపాలనతో దేవుడిగా జనం గుండెల్లో గూడు కట్టుకున్నాడు.

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పారాయణ చేసే గ్రంథం రామాయణం. ఎందుకంటే, రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణంలో ముందుగా చెప్పవలసింది సీత గురించే. భర్తపై ఒక స్త్రీకి ఎంతటి ప్రేమానురాగాలు ఉండాలో, భార్యగా భర్త పట్ల ఏ ధర్మాన్ని అనుసరించాలో సీత నుంచి తెలుసుకోవచ్చు. రేపే తన భర్తకు అయోధ్యానగరానికి రాజుగా పట్టాభిషేకం. తానేమో మహారాణి.

తెల్లారేసరికి భర్త వచ్చి, ‘నేను రాజును కావడం లేదు, పైగా నా తండ్రి నన్ను అడవులకి వెళ్లమన్నాడు, అదీ కూడా ఒకటి కాదు, రెండు పద్నాలుగేళ్లపాటు వనవాసం చే యాలి’ అని చెప్పాడు. అయినా సరే, సీతమ్మ పెదవి విప్పి ఒక్క పొల్లుమాట మాట్లాడలేదు. ఆధునిక కాలంలో లాగా ‘నువ్వు ఉట్టి చేతగాని భర్తవి’ అంటూ ఆడిపోసుకోలేదు. ఒక దేశానికి రాకుమార్తె అయి వుండి కూడా పుట్టింటికి వెళ్ళిపోతానని అనలేదు. వద్దు వద్దు అంటున్నా కానీ, తన భర్తనే అనుసరించింది. ఆయనతో కలసి అరణ్యవాసం చేసింది, అనేక కష్టాలు పడింది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలవాలని చెప్పకనే చెప్పింది. అదే సీత ఇచ్చే సందేశం.

లక్ష్మణుడి వంటి సోదరుడిని మనం చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. చరిత్ర ప్రారంభం నుంచి పరిశీలిస్తే రాజ్యం కోసం సొంత సోదరుల్నే కడతేర్చిన వారిని చూసి ఉంటాము. కన్నతండ్రినే ఆస్తికోసం కిరాతకంగా హతమార్చినవారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటిది అన్నగారి కోసం రాజభోగాల్ని వదిలి, కూడా వెళ్ళిన లక్ష్మణుడి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిగతా ఇద్దరు సోదరులు భరతుడు, శతృఘ్నుడు కూడా అన్నగారు లేని రాజ్యం తమకెందుకని సింహాసనంపై పాదుకలు వుంచి పరిపాలన చేశారు. ఇటువంటి అన్నదమ్ముల అనుబంధం ఎక్కడయినా వుంటుందా?

ఇక స్వామి భకిక్తి  సిసలైన నిదర్శనం  హనుమంతుడు. కాస్త ఎక్కువ జీతం ఇస్తే చాలు వెంటనే వుద్యోగం మారిపోయే ఈ రోజుల్లో హనుమంతుని వంటి నిస్వార్థ పరుడు, స్వామిభక్తి పరాయణుడి గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది వుంటారు? ఒకసారి తన ప్రభువుగా అంగీకరించిన తరువాత, తనకు రాముడు అప్పజెప్పిన పనిని పూర్తి చెయ్యలేకపోయానే మరలా నా స్వామికి నా ముఖం ఎలా చూపించను? అని ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడతాడు హనుమ.

అంతేగాని యజమాని చూడడం లేదు కాబట్టి ఈ పని పూర్తి చేసేసాను అని అబద్ధం చెప్పలేదు. రామ రావణ యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్ధమంతా తానే అయి నడిపించాడు హనుమ. అంతటి శక్తిమంతుడయి ఉండి కూడా ఎప్పుడూ తనవల్లే ఇదంతా జరుగుతుందని గొప్పలు చెప్పుకోలేదు. తన హృదయంలో కొలువయి వున్న రామనామం వల్లనే తనకింత బలం వచ్చిందని వినమ్రంగా చెపుతాడు హనుమ. అటువంటి సేవకుడిని మనమెప్పటికయినా ఎక్కడైనా చూడగలమా?

ఒక పరాయి స్త్రీని ఆశపడితే ఎంతటి విషమ పరిస్థితులని ఎదుర్కోవలసి వస్తుందో అన్నదానికి ఉదాహరణ రావణుడు. అవడానికి అసురుడైనా ఎంతో విద్వాంసుడు, మహా శివభక్తుడు. అయినా ఒక స్త్రీని బలాత్కరించబోయి యావత్‌ లంకానగరానికే ముప్పుని కొని తెచ్చుకున్నాడు. చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మనిషి ఎంత పతనమవుతాడో చెప్పడానికి రావణుడే ఒక ఉదాహరణ.సీతాదేవి నగలమూట దొరికినప్పుడు రాముడు నీళ్ళు నిండిన కళ్ళతో ‘లక్ష్మణా, ఇవి మీ వదినగారి నగలేనా చూడవయ్యా‘ అని అడిగితే, దానికి లక్ష్మణుడు ‘‘నేను వీటిలో వదినగారి కాలి మట్టెల్ని మాత్రమే గుర్తుపట్టగలను’’ అని చెప్పాడు. అంటే ఎప్పుడూ తన తల్లి లాంటి వదినగారి పాదాల వంక తప్ప పైకి కూడా చూడలేదన్న మాట. అదీ ఒక వదినకీ, మరిదికీ వుండవలసిన గౌరవం.

ఇక రాముడి గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. తండ్రికి మంచి తనయుడిగా, ఇల్లాలికి మంచి భర్తగా, సోదరులకి మంచి అన్నయ్యగా, సేవకుడికి మంచి యజమానిగా, స్నేహితుడికి మంచి స్నేహితుడిగా, శతృవుకి తగ్గ ప్రత్యర్థిగా... ఇలా రాముడి ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి సంఘటన మనకి ఒక సందేశాన్నిస్తూనే వుంటాయి. స్ఫూర్తిని నింపుతూనే వుంటాయి. వ్యక్తిగా ఆయన అనుసరించిన మార్గం మానవ సమాజంలో వున్న ప్రతీ వ్యక్తికీ దేశ, కాల, మత, కుల ప్రసక్తి లేకుండా అనుసరణీయం.ఎన్ని కష్టాలు ఎదురయినా తాను నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినవాడే చరిత్రలో ధీరోదాత్తుడిగా మిగిలిపోతాడు. రాముడి జీవితంలో ఆయన ఆచరించి చూపిన సద్గుణాల్లో కొన్నయినా ఆచరించగలిగితే ఈనాడు మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుంచి బయట పడగలుగుతుంది. అందుకే రామాయణం ఒక మహత్తర కావ్యం అయింది.




Tuesday, 20 March 2018

ఉగాది

















ఉగాది పండగ వచ్చిందీ...

ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. సకల చరాచర జీవరాశికీ మూల కారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజుని అత్యంత వైభవోపేతంగా జరపాలన్న కాంక్షతోనే సరికొత్త అందాలను మోసుకొచ్చే వసంత మాసపు తొలి రోజునే ఉగాదిగా ఎంచుకున్నాడు. అందుకే ఆ పండగకు సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ప్రకృతే వేదిక. మామిడి చిగురు తిన్న మత్తకోయిలల గానాలూ, సాయం సంధ్యల్లో మరు మల్లెల పరిమళాలూ, గిలిగింతలు పెట్టే వాసంత సమీరాలూ, వెండి వెన్నెలను కురిపించే చందమామ అందాలూ... అన్నీ ఈ పండగకు ప్రత్యేకతలే. అందమైన రేపటికి సంకేతాలే.

‘‘ఎవరదీ... నువ్వేనా ఉగాదీ!
కొమ్మల్లో కోయిల కూస్తుంటే
మా పెరటి రెమ్మల్లో మల్లియ పూస్తుంటే
ఈ మధుమాసోదయ వేళ
ఉగాదీ నిన్ను పోల్చుకున్నానులే’’

అంటాడు ఓ కవి చమత్కారంగా... నిజమే ఉగాది ఆగమనం అంత అందంగానే ఉంటుంది. పండగంటే మనింటిని తోరణాలతో ముస్తాబు చేయటమే మనకు తెలుసు ఈ పండగకు మాత్రం అనంత ప్రకృతీ సన్నద్ధమైపోతుంది. అందమైన వసంతానికి స్వాగతం పలుకుతుంది.

అందుకే గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం... ఋతూనాం కుసుమాకరః’ అంటాడు. అంటే మాసాల్లో మార్గశిరమూ, రుతువుల్లో వసంత రుతువూ తానేనని అర్థం. అంతటి మహత్యం ఉంది వసంత రుతువుకి. ప్రపంచంలో అత్యధికంగా పూలు వసంతంలోనే పూస్తాయట. ఎర్రటి ఎండాకాలంలో సుకుమారమైన మల్లెపూలు పూయడం, చుక్కనీరు లేని చోట రసాలు నిండిన మధుర ఫలాలు గుత్తులుగా విరగకాయడం ఈ మాసానికే సొంతమైన ప్రకృతి వింతలు. అలాంటి వింతలే కృష్ణుణ్ని సైతం కట్టిపడేశాయి. వసంతం అనే పదానికి ఏడాది అనే అర్థమూ ఉంది. ఒక్క తెలుగువారే కాదు చాంద్రమానాన్ని పాటించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలూ చైత్ర శుక్ల పాడ్యమిని నూతన సంవత్సరానికి తొలి దినంగా పరిగణిస్తారు. కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమినాడు ఉగాది జరుపుకునేవారట. త్రేతాయుగంలో వైశాఖశుద్ధ తదియ రోజు సంవత్సరాది పండగ వచ్చేది. దాన్నే మనం ఇప్పుడు అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం. ద్వాపరయుగం మొదలైంది మాఘ బహుళ అమావాస్య నాడు. అయితే అన్ని యుగాల ఆరంభమూ వసంత మాసంలోనే జరిగిందని చెబుతారు. ఆయా యుగాల్లో వసంతం ఆయా మాసాల్లో వచ్చేదట. మోడువారిన చెట్లు చిగురిస్తూ పచ్చని ప్రకృతి మనిషిని పరవశానికి గురిచేసే కాలం, ఏ యుగంలోనైనా కొత్త ఉగాదికి నాంది పలికేదిగానే ఉంటుంది మరి!

‘వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి’ అంటారు. అంటే వసంతకాలంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అర్థం. నిజానికి సాధారణ పండగల్లా ఉగాది ఏ దేవతకో సంబంధించిన పండగ కాదు. కాలాన్ని ఆరాధించే పండగ. నిరంతరమూ, నిత్యనూతనమూ అయిన కాలాన్ని కొలుచుకుని అనంత కాలగమనంలో మనమెక్కడ ఉన్నామో తెలుసుకుని మరొక్కసారి దేవుడు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరల్చుకునే ప్రయత్నానికి నాంది పలికే పండగ.

ఉగాది పుట్టిందిలా...
ఉగాదిని తొలుత యుగాదిగా పిలిచేవారు. యుగస్య ఆదిః అని అర్థం. అంటే ఉత్తర దక్షిణ ఆయనాలు రెండూ కలిసిఉండే సంవత్సరానికి చైత్రశుద్ధ పాడ్యమే ఆది కనుక ఆ రోజును యుగాది అంటారు. యుగాది అంటే బ్రహ్మసృష్టిని ప్రారంభించిన రోజని అర్థం. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో అంటే రెండో సగం జీవిత కాలంలో ఉన్నాడు. అందుకే ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు సంకల్పంలో కాలాన్ని ప్రస్తావిస్తూ ఆయన్ని గౌరవిస్తాం. అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశిన్‌ మహాయుగే, కలియుగే ప్రథమపాదే... అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విళంబి నామ సంవత్సరే చైత్ర మాసే, వసంత రుతౌ, శుక్లపక్షే, పాడ్యమ్యాం తిథౌ, భానువాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభ కరణే... అని చెబుతాం. అంటే ఏ కార్యాన్ని మొదలు పెట్టాలనుకున్నా మనం సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలు జరిగిన కాలాన్నంతా చెబుతూ మనం ఏడోదైన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగమైన కలియుగంలో విళంబి నామ సంవత్సరంలో ఉన్నామంటూ వర్తమాన సమయం దాకా చెబుతాం. గడచిన అనంత కాలం మొదలు ఈ ఏడాది ఈ రోజు దాకా కాలాన్ని నిమిషాలతో సహా లెక్కగట్టి నిత్య పూజా విధానాల్లో, శుభాశుభ కార్యాల్లో తప్పనిసరిగా మననం చేసుకునే ఉత్కృష్టత మన జీవన శైలిలో భాగం. అదీ మన సంప్రదాయంలో కాలానికున్న ప్రాధాన్యత. ఉగాది అచ్చంగా ఆ కాలానికి ప్రతిరూపమైన పండగే. కృష్ణపరమాత్మ కురుక్షేత్ర సమయంలో విశ్వరూపధారణ చేసినప్పుడు ‘నేను కాలాన్ని... ఈ వ్యవస్థను విధ్వంసం చేస్తాను’ అని అంటాడు. అంటే ఇక్కడ కాలం విష్ణుస్వరూపమే. కానీ ఆ కాలస్వరూపుడు చెప్పిన విధ్వంసం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ విధ్వంసం ఒక కొత్తసృష్టికీ, సరికొత్త వ్యవస్థ రూపకల్పనకూ పునాది అవుతుంది. ఏవైనా గడిచిన విషయాల గురించి చెప్పేటప్పుడు కాలగర్భంలో కలిసిపోవడం అనే పదాన్ని మనం అందుకే వాడతాం. పాతదాన్నంతటినీ తనలోకి లాక్కొనే కాలం నిరంతరం మనకు కొత్త సమయాన్నీ, కొత్త ఆశల్నీ అవకాశాల్నీ ఇస్తూనే ఉంటుంది.

ఇలా జరుపుకోవాలి...
ఏడాది తొలిరోజు ఎలా గడుస్తుందో అలాగే ఏడాదంతా గడుస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే ఆ రోజుని సకల శుభప్రదంగా జరుపుకునేందుకు అంతా సన్నద్ధమవుతారు. ఆ పండగ రోజుని ఎలా జరుపుకోవాలి అనే దానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. ప్రాతఃకాలంలోనే లేచి పెద్దవాళ్లతో తలకు నువ్వుల నూనె పెట్టించుకుని వాళ్ల ఆశీర్వాదం తీసుకుని అభ్యంగన స్నానం చేయాలి. తలమీద నీళ్లు కుమ్మరించుకుంటూ

గంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు

అనే శ్లోకాన్ని జపించాలి. తైలాభ్యంగనం వల్ల ఆకలి, దప్పిక, మలిన నిర్మూలనాలు జరుగుతాయనీ, మహాలక్ష్మీ కృప లభించి దరిద్రం తొలగిపోతుందనీ చెబుతారు. ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. నూతన వస్త్రంలో సకల దేవతలూ నివాసముంటారని శాస్త్రం చెబుతోంది. కొత్త బట్టలు కట్టుకుని కుటుంబ సభ్యులూ, ఇష్టమైన వారి సాంగత్యంలో గడిపితే లలితా, లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయట. దిష్టి పోయేందుకు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి. తర్వాత ఇష్టదేవతను ప్రార్థించి పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నది పురాణోక్తి. సర్వశుభప్రదమైన పంచాంగ శ్రవణాన్ని ఉగాది నాడు తప్పక వినాలి. అందులోనూ ఉత్తర ముఖంగా కూర్చుని పంచాంగశ్రవణం చేయడం వల్ల విశేషపుణ్య ఫలితాలు కలుగుతాయట.

పంచాంగ శ్రవణం...
శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వ్యిద్ధిద ముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం
నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్‌

పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. దుస్స్వప్నాలను హరించడంతో పాటు గంగానదీ స్నాన ఫలితాన్నిస్తుంది. గోదానం చేసిన భాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ, విద్యాబుద్ధులనూ, సత్సంతానాన్నీ ప్రసాదిస్తూ సకల విజయాలనూ సిద్ధింపజేస్తుంది. అందుకే పంచాగ శ్రవణం తప్పక చేయాలని చెబుతాయి శాస్త్ర గ్రంథాలు. ఉగాదినాడు చేసే పనుల్లో ఇదో ముఖ్య ఘట్టం. పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నోసార్లు గ్రహాల పేర్లను పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయి. ఫలితంగా పంచాగ శ్రవణం చేసిన వాళ్లకీ, విన్నవాళ్లకీ సూర్యుడివల్ల తేజస్సు, చంద్రుడివల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధి వికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శని వల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయని జ్యోతిషవాక్కు. పంచాంగ ప్రస్తావన వేదాలు మొదలు ఎన్నో శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. మన పంచాంగానికి మూలమైన కాల సిద్ధాంతాలున్న గ్రంథాన్ని క్రీ.శ.505లో వరాహమిహిరుడు ప్రతిపాదించాడు. మొత్తం 18 సిద్ధాంతాలుండగా అందులో ముఖ్యమైనవంటూ అయిదింటిని తన గ్రంథంలో ప్రస్తావించాడు. ఆ జ్యోతిష గ్రంథాన్ని ఉగాది నాడే ప్రజలకు అంకితం చేశాడట. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పంచాంగాలను అందులోని పూర్వగణిత, దృగ్గణిత సిద్ధాంతాల ఆధారంగా రూపొందిస్తున్నారు.

బ్రహ్మ మంత్రివర్గం
ఏడాదికి తొలిరోజుగా ఉగాదిని ప్రతిపాదించిన బ్రహ్మ ఆ సంవత్సరాన్ని ఎవరు పరిపాలించాలీ, ఏయే శాఖలకు ఎవరెవరు మంత్రులుగా ఆధిపత్యం చెలాయించాలీ అనే వ్యవహారాన్ని నవగ్రహాలకు అప్పగించాడు. దాని ప్రకారమే ఆయా శాఖల అధిపతుల స్వభావాన్ని బట్టి ఆ ఏడాది వారు ఆధిపత్యం వహించే అంశం ఎలా ఉంటుంది అనేది నిర్ణయమౌతుంది. ఈ ఏడాది ఎంత వర్షం కురుస్తుందీ, ఏయే పంటలు బాగా పండుతాయీ, ధరలెలా ఉండబోతున్నాయీలాంటి అంశాలన్నీ ఈ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ మంత్రివర్గంలో మొత్తం
నవనాయకులుంటారు. వాళ్లను ఎలా నిర్ణయిస్తారంటే...
1. చాంద్రమానాన్ని అనుసరించి ఏ వారం ఉగాది వచ్చిందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు
2. సౌరమాన సంవత్సరం ప్రారంభమైన రోజు ఏ వారం వస్తే ఆ వారాధిపతి మంత్రి
3. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారాధిపతి ఆ సంవత్సరానికి సేనా నాయకుడు
4. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటప్పుడు వారానికి అధిపతి సస్యాధిపతి
5. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారానికి అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి
6. సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించేనాటి వారాధిపతి అర్ఘాధిపతి (ధరలకు వాణిజ్యానికీ అధిపతి)
7. సూర్యుడు ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశించేనాటి వారానికి అధిపతి మేఘాధిపతి
8. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే రోజుకి వారాధిపతి రసాధిపతి
9. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున ఉన్న వారాధిపతి నీరసాధిపతి

పంచాంగ శ్రవణం మహా పుణ్యదాయకమైన విషయమే అయినా ఇందులో జీవన వికాస పాఠం కూడా నిగూఢంగా దాగి ఉంటుంది. ఏడాది తొలిరోజే ఆదాయ వ్యయాలూ, అవమాన రాజపూజ్యాలూ తెలుసుకోవడం ద్వారా మనిషి రాబోయే కష్టసుఖాలన్నింటికీ మానసికంగా సన్నద్ధమవుతాడు.

ఏ కొత్త బాధ్యతో మీద పడితే ‘ఆ రోజు చెప్పిన భారం ఇదేనన్నమాట’ అని సరిపెట్టుకుంటాడు. ఏ అనుకోని ఆపదో ఎదురైతే ‘గ్రహగతి మారుతుందని ముందే తెలిసిందేగా’ అని సర్దుకుంటాడు. చివరికి అనని మాటలు అన్నారన్నా, లేనిపోని వ్యవహారాల్లో ఇరుక్కున్నా ‘నీలాపనిందలు ఊహించినవేగా’ అని ఊరుకుంటాడు.

ఏ ఉన్నతాధికారో నలుగురి ముందూ అక్షింతలేస్తే ‘అవమానాలు అధికమని అనుకున్నదేగా’ అని మిన్నకుండిపోతాడు. సుఖసంతోషాలుంటాయి అన్న పంచాంగ వాక్యానికి పొంగిపోయి ‘ఈ ఏడాది నాకు ఇవీ ఉన్నాయన్నమాట’ అని నిండు మనసుతో ముందుకెళతాడు. మనిషి ధైర్యంతో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఏడాది తొలినాడు ఈ మాత్రం ఉత్సాహం చాలు. నిజానికి షడ్రుచులతో పంచే ఉగాది పచ్చడి ఆంతర్యమూ అదే. నాకు బెల్లమ్ముక్కలే కావాలంటే కుదరదు, అరటి పండొక్కటే తింటానంటే వీలు పడదు. వేప చేదునూ, మామిడి వగరునూ రుచి చూడాల్సిందే. చింతపండు పుల్లదనాన్నీ, మిరియాల ఘాటునీ అనుభవించాల్సిందే. అప్పుడే జయాపజయాల్నీ, లాభనష్టాల్నీ సమదృష్టితో చూసే మనోధైర్యం ఏర్పడేది. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాల్నీ, ఊహించని మలుపుల్నీ సులువుగా దాట గలిగే సత్తా వచ్చేది. ఉగాది పండగ నుంచి మనం నేర్చుకోవాల్సిందీ, ఆ రోజు నుంచి స్ఫూర్తి పొందాల్సిందీ ఈ కోణంలోనే.

ఎన్నేళ్లంటే...
బ్రహ్మ సృష్టి ఆరంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 118 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు వచ్చిన విళంబి నామ సంవత్సరం 119వది. కలియుగం ప్రారంభమై ఈ ఉగాదికి 5119 సంవత్సరాలు. శ్రీమహావిష్ణువు మత్య్సావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగించింది ఉగాది నాడేనట. కలియుగం ప్రారంభమైందీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగిందీ, కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు పీఠాన్నెక్కిందీ, వెయ్యేళ్లపాటు పాలన సాగించిన విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించిందీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసిందీ ఈ పర్వదినానే. అందుకే ఉగాదినాడు పనులు మొదలు పెడితే అందులో తిరుగుండదనేది చాలా మంది నమ్మకం. ఈ కారణంగానే కొన్ని చోట్ల రైతులు కొత్త నాగళ్లకు పూజ చేసి, లాంఛనంగా వ్యవసాయ పనుల్నీ ప్రారంభిస్తారు. ఉగాది రోజు ఇంటి ముందో, వీధిలోనో చలివేంద్రాన్ని స్థాపిస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. శుభ్రమైన చోట అలికి ముగ్గుపెట్టి కొత్త కుండల్లో నీరు నింపాలి. గణపతినీ ఇష్టదేవతలనూ ధ్యానించి కొబ్బరికాయ కొట్టి చలివేంద్రాన్ని ప్రారంభించాలి. ఈ రోజు చల్లటి మజ్జిగనో లేక పానకాన్నో అతిథులకూ బాటసారులకూ ఇచ్చినా పుణ్యమని పురాణవాక్కు. ఈ రోజు కొందరు పితృదేవతల్ని గుర్తు చేసుకుంటూ తర్పణాలూ వదులుతారు.

పంచ అంగాలు...
పంచాంగం అంటే అయిదు విభాగాలు అని అర్థం. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు పదిహేనూ, వారాలు ఏడూ, అశ్వని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలూ, విష్కంభం మొదలు వైధృతి వరకూ 27 యోగాలూ, బవ మొదలు కింస్తుఘ్నం వరకూ 11 కరణాలన్నింటిని గురించి తెలియజేసేదే పంచాంగం. ముహూర్తబలం కోసం ఈ అయిదింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అన్నది చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. తిథి విషయంలో జాగ్రత్తపడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.

- లక్ష్మీహరిత ఇంద్రగంటి
సహకారం: డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రి




షడ్రుచుల సారం... జీవనవేదం..!

పచ్చని వనాలూ పూల హరివిల్లులూ వేపపూత గుబాళింపులూ మావిచిగురు అందాలూ కోయిలమ్మ కుహుకుహురాగాలూ మరుమల్లెల పరిమళాలతో విరిసిన మధుమాసంలో అందంగా అరుదెంచింది విళంబి నామ ఉగాది...షడ్రుచుల సంవత్సరాది..!

చెట్లు చిగురిస్తాయి...ఆశల పల్లకీలో ఊరేగిస్తూ. పచ్చదనం పల్లవిస్తుంది... నేత్రానందాన్ని అందిస్తూ. మరుమల్లెలు విచ్చుకుంటాయి... మన్మథబాణాలు వేస్తూ. గండుకోయిలలు గళం విప్పుతాయి... వీనులవిందు చేస్తూ... ఇలా ఎటుచూసినా అందంగా కనువిందు చేస్తుంటుంది వసంతరుతువు. అది మొదలయ్యే రోజే ఉగాది... చైత్ర శుద్ధ పాడ్యమి. ఆయుర్వేద శాస్త్రరీత్యా ఇది రుతువులు మారే  సమయం... కఫ ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి తిక్త(చేదు), కషాయ(వగరు) రస ప్రధానమైన ఆహారం అవసరం అని చెబుతారు. వీటికి మరికొన్ని రుచులు జోడించి చేసేదే ఉగాది పచ్చడి. వాత, కఫ, పిత్త దోషాలను హరించే అద్భుత ఔషధం.

‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’
అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని తినాలని చెబుతోంది శాస్త్రం. దీన్నే నింబ కుసుమ భక్షణం, అశోక కళికాప్రాశనం అనీ అంటారు. అయితే సంవత్సరానికి ఒకసారి తింటే ఏడాది పొడవునా జబ్బులు రావా అన్న సందేహం సహజం. ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకూ వచ్చే రాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులపాటు పరగడుపునే ఉప్పు, కారం, వగరు, చేదు, పులుపు, తీపి అనే ఆరు రుచులు కలగలిసిన ఉప్పు, పచ్చిమిర్చి, మామిడికాయ, వేపపువ్వు, చింతపండు, బెల్లం కలిపి చేసిన ఈ పచ్చడిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నాయి శాస్త్రాలు. పూర్వం చైత్ర శుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ దీన్ని సేవించేవారు. ఒకప్పుడు మామిడిపిందెలకు బదులు మామిడి చిగుళ్లూ అశోక చిగుళ్లూ దంచి కలిపేవారట. కాలక్రమంలో చిగుళ్లకు బదులు మామిడి పిందెలు, లేత మామిడికాయలను వేస్తున్నారు. నిజానికి పూర్వం లేత వేపచిగుళ్లు, ఇంగువ, బెల్లం, సైంధవ లవణం, చింతపండు, తాటిబెల్లం, వాము, జీలకర్ర, పసుపు వేసి మెత్తగా నూరి పరగడుపున తినేవారని కొన్ని శాస్త్రాలు చెబుతుంటే; చింతపండుగుజ్జులో వేపపువ్వు, బెల్లం, నెయ్యి వేసి పరగడుపునే తీసుకునేవారని మరికొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ఆయుష్షు పెరిగి వజ్ర సమాన దేహం సిద్ధిస్తుందట. కానీ కాలానుగుణంగా ఆరు రుతువుల్లోనూ ఏర్పడే త్రిగుణాత్మక కష్టసుఖాలను అనుభవించడానికి సంసిద్ధంగా ఉన్నాం అన్నదానికి సూచనగా ఆరు రుచులనూ కలిపి సేవించడం మొదలైంది. ఏ కాలానికి ఏది వచ్చినా స్వీకరిస్తాం అని శపథం చేయడానికి సంకేతమే ఈ పచ్చడి సేవనం. అందుకే ప్రస్తుతం అంతా వేకువనే లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, ఇంటిని మామిడాకుల తోరణాలతో అలంకరించి, ఇష్టదేవతారాధన చేశాక ఉగాది పచ్చడిని తింటున్నారు.

శాస్త్రం ఇంకేమంటోంది?
‘జిహ్వాగ్రే వర్తతే సర్వమ్‌ (నాలుక చివరనే అంతా ఉంది)’ అని నీతిశాస్త్రం చెబుతోంది. నాలుక కొన్ని రుచులు ఇష్టపడి అనారోగ్యాన్ని కొనితెస్తుంది. అలా కాకుండా అన్ని రుచులనూ సమానంగా భరించడం తన కర్తవ్యంగా నాలుక  గుర్తించాలని ఈ పండుగ చెబుతోంది. నాలుకను నడిపించేది మనస్సు. కాబట్టి దానికి ఇదో హెచ్చరిక. అన్ని ప్రాణులూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు గుణాలు కలిగి ఉంటాయి.

వాటిల్లో ఏ ఒక్కటి హద్దుమీరినా దుర్గుణంగా మారి శత్రువు అవుతుంది. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. వాటిని జయించగలగడమే మానవ జన్మ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం అదే. తీపి కామానికీ, కారం క్రోధానికీ, ఉప్పు మోహానికీ, పులుపు లోభానికీ, చేదు మదానికీ, వగరు మాత్సర్యానికీ సంకేతాలు. మనం తినే పదార్థాలు ఏవైనా ఈ ఆరు రుచుల్లోకే వస్తాయి. ఏదో ఒక రుచి లేకుండా తినలేం. అన్ని రుచులనీ కలిపి తింటే మనం గెలిచినట్లు. ఏదో ఒక రుచిని మెచ్చుకుంటూ తింటే ఓడినట్టు. అందుకే అన్నింటినీ గెలుస్తాం అన్న దానికోసమే కొత్త ఏడాదిలో పరగడుపునే ఉగాది పచ్చడిని రుచి చూస్తారు. అటు జీవనసారాన్నీ బోధిస్తూ ఇటు ఆరోగ్యాన్నీ చాటే ఆ ఆరు రుచులేమిటంటే...

ఆరూ... ఆరోగ్యదాయకాలు!

చేదు: వేపపూత చేదుగా ఉంటుంది. నోటికి రుచించదు. జీవితంలో బాధ కలిగించే సంఘటనలన్నీ చేదుగానే ఉంటాయి. వాటిని సైతం తట్టుకుని మింగాలని చెప్పేదే ఈ వేపపూత. ఆరోగ్యపరంగా చూస్తే వేపపువ్వులోని చేదు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. మంటను తగ్గించి, రక్తశుద్ధికి తోడ్పడుతుంది. చర్మవ్యాధుల్ని రానివ్వదు. కంటిచూపుని మెరుగుపరుస్తుంది. పైత్యాన్ని పోగొడుతుంది. కుష్ఠువ్యాధిని రానివ్వదు. నాలుకకు రుచి జ్ఞానాన్ని కలిగిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. దీన్ని నూనెతోగానీ నెయ్యితోగానీ వేయించి, ఉప్పూ కారం కలిపి అన్నంతో తింటే సర్వరోగనివారిణిలా పనిచేస్తుందట.

తీపి: బెల్లం మధురంగా ఉంటుంది. ప్రతిమనిషి జీవితంలోనూ మధురానుభూతులు కొన్నే ఉంటాయి. ఎందుకంటే నిత్యం అవే అనుభవంలోకి వస్తే దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఉండదు. తియ్యగా ఉంది కదాని అతిగా తింటే, ఆ తీపి కూడా చేదెక్కుతుంది. ఆరోగ్యం పాడవుతుంది. బెల్లంలోని తీపి ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది. దీన్ని మితంగా తీసుకుంటే మనసుని ఆహ్లాదపరుస్తుంది. అందులో శరీరానికి కావాల్సిన విటమిన్లూ ఖనిజాలూ లభిస్తాయి. దగ్గు, అజీర్తి, అలర్జీ, మలబద్ధకాల్ని నివారిస్తుంది. శరీరకాంతికీ శిరోజాల పెరుగుదలకీ తోడ్పడుతుంది. కంఠస్వరం మెరుగవుతుంది. బరువును పెంచుతుంది. ఉదర వ్యాధుల్నీ వాతాన్నీ పోగొడుతుంది.

ఉప్పదనం: ఉప్పు లేని పప్పు రుచించదు. అంటే రుచికి కారణం ఉప్పే. దీన్ని ఉత్సాహానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఇది సరైన పాళ్లలోనే ఉండాలి. అప్పుడే జీవితంలోనూ విజయం వరిస్తుంది. ఆరోగ్యపరంగానూ ఉప్పు ఎక్కువయినా తక్కువయినా ముప్పు తప్పదు. కాబట్టి సమానంగా తీసుకుంటే ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను సమతౌల్యం చేస్తుంది. చెమటపట్టేలా చేస్తుంది. జీర్ణక్రియా వేగాన్ని పెంచుతుంది. శరీరంలోని కొవ్వునూ కంతులనూ కరిగిస్తుంది. జడత్వాన్ని పోగొడుతుంది.

పులుపు: చింతపండులోని పులుపు నేర్పునకు సంకేతం. నేర్పు లేకుండా జీవితంలో నెగ్గుకురాలేం. అందుకే పచ్చడిలో కాస్త పులుపూ పడాల్సిందే. ఆరోగ్యపరంగా ఇది ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. గుండెకి బలాన్ని కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతోబాటు విరోచనకారిగానూ పనిచేస్తుంది.
కారం: కారం/పచ్చిమిర్చి/మిరియాల్లోని కారం రుచిగానే ఉంటుంది. కానీ దాన్ని తినేటప్పుడు పుట్టే మంటను తట్టుకోవాలి. అంటే జీవనగమనంలో ఎదురయ్యే సంఘటనలకు సహనం ఉండాలి అని చెబుతుంది. అప్పుడే వాటి ఫలితాన్ని రుచి చూడగలం. ఆరోగ్యానికొస్తే ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కొవ్వుని కరిగించి చర్మ, కంఠ రోగాలను పోగొడుతుంది. వాపులను తగ్గిస్తుంది.

వగరు: మామిడిపిందెలు వగరుగా ఉంటాయి. ఇవి సవాళ్లకు సంకేతం. వాటిని స్వీకరించేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నదే వీటి సారాంశం. ఆరోగ్యపరంగా మామిడిపిందెలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. ముఖ్యంగా పొట్టలో పేరుకున్న వాయువులను పోగొడతాయి. పెద్ద పేగుకి బలాన్ని చేకూర్చడంతోబాటు, శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బను పోగొడతాయి.

ఎలా చేస్తారు?
కొత్త కుండలో లేదా గిన్నెలో చిక్కటి చింతపండు రసంలో బెల్లం, మామిడి పిందెల్ని దంచిన మిశ్రమం లేదా మామిడిముక్కలు కలపాలి. దీనికి వేపపువ్వు, ఉప్పు, మిరియాలపొడి లేదా పచ్చిమిర్చి లేదా కారం వేసి కలుపుతారు. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు, పుట్నాలపప్పు, చెరకుముక్కలు, తేనె కూడా జోడిస్తారు. ఇటీవల తమ అభిరుచులకు అనుగుణంగా ద్రాక్షపండ్లూ, దానిమ్మగింజలూ, ఖర్బూజ, పుచ్చ... ఇలా రకరకాల పండ్లనూ జోడించి చేస్తున్నారు.

ప్రాంతాన్నీ అభిరుచినీ బట్టి ఎవరు ఎలా చేసుకున్నా జీవితంలోని భిన్న భావోద్వేగాలకు ప్రతీకే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి.










ఎన్నో ఉగాదులున్నాయ్‌!  
మనం చైత్రశుద్ధపాడ్యమిని ఉగాదిగా భావించినట్టు.. ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో సంప్రదాయం. సూర్యమానం, చాంద్రమానం, వాటిల్లోనూ పలు సంప్రదాయాల వల్ల ఈ సంవత్సరాదిని జరుపుకునే కాలాల్లోనూ ఎన్నో వైవిధ్యాలున్నాయి. ఓ రకంగా జనవరి నుంచి డిసెంబర్‌దాకా ఏడాదిలో ఏదో ఒక రాష్ట్రం తమ సంప్రదాయ ఉగాదిని పాటిస్తూనే ఉంటాయని చెప్పొచ్చు. ఆ విభిన్న ఉగాదుల సమాచార సమాహారం ఇది..
గుడీపడ్వా 
మహారాష్ట్రలో జరుపుకునే ఉగాది ఇది. వాళ్లూ మనలాగే చైత్రశుద్ధ పాడ్యమినాడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పాడ్యమినే మరాఠీలో పడ్వా అంటారు. ఇక ‘గుడీ’ అంటే ధ్వజం. వెదురుపుల్లకు పట్టువస్త్రం చుట్టి, పూలతో అలంకరిస్తారు. పైన వెండి లేదా కంచు పాత్ర బోర్లిస్తారు. ఈ జెండాలాంటి ఆకారాన్ని బ్రహ్మధ్వజానికి ప్రతీకలా భావించి కొలుస్తారు. మన తెలుగువాళ్లలాగే బ్రహ్మ ఈ ఉగాది రోజే సృష్టి ఆరంభించాడని వాళ్లూ నమ్మతారు కాబట్టే ఈ పూజ! మరాఠీలూ షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. కాకపోతే దానికి వాము అదనంగా చేరుస్తారు. మనలాగే ఉగాదినాడు పండితుల పంచాంగ పఠనం కూడా వింటారు!
విశూ 
మలయాళీల సంవత్సరాది ఇది. సౌరమానం ప్రకారం లెక్కగడతారు కాబట్టి.. సూర్యుడు మేషంలో ప్రవేశించే తొలి రోజుని సంవత్సరాదిగా భావిస్తారు. ఈ తొలి నెలని వాళ్లు మేడం(మేషం) అనే పిలుస్తారు. ఏటా ఏప్రిల్‌ 14న వస్తుందీ వేడుక. పండగకి ముందు సాయంత్రం కుటుంబంలోని అందరికన్నా పెద్ద వయస్కురాలు ఓ పళ్లెంలో పచ్చిబియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు రంగుతేలిన దోసకాయలూ, అరటిపళ్లూ, తమలపాకులూ, అద్దం తీసుకుంటుంది. ఆ పళ్లాన్ని ఉరళి అంటారు. విశూ రోజు ఆమే ముందుగా లేచి ఉరళిని తీసుకెళ్లి నిద్రపోతున్నవాళ్లని మేల్కొలుపుతుంది. నిద్రలేచినవాళ్లు ఈ పాత్రనే మొదట చూడాలన్నమాట! ఇలా చూడటాన్నే ‘విశూ కని’ అంటారు. మలయాళంలో కని అంటే చూడటమని. ఇలా చేయడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని వాళ్ల నమ్మకం.
బైశాఖి
ఇది సౌరమానం ప్రకారం వస్తుంది. వాళ్ల తొలి నెల వైశాఖం. దీన్నే బైశాఖీ అని పిలుస్తారు. పంజాబీలు ఈ సంవత్సరాదిని.. మన సంక్రాంతిలా చేస్తారు. పంట చేతికొచ్చే సమయంలో కోలాహలంగా నిర్వహిస్తారు. పొలాల్లోనే ఆటాపాటలుంటాయి. కొత్తగా పండిన గోధుమలను పిండి పట్టించి, ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం, నెయ్యి కలిపి ఆరగిస్తారు. సాయంత్రాల్లో పంట కొట్టిన తుప్పతో పెద్ద మంటలు వేసి, వాటి చుట్టూ స్త్రీ, పురుషులు భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు.
బెస్తు వర్ష్‌ 
గుజరాతీలు మనలాకాకుండా కార్తికశుద్ధ పాడ్యమిరోజుని సంవత్సరాదిగా భావిస్తారు. అంటే.. దీపావళి మరుసటి రోజన్నమాట. దీన్ని బెస్తు వర్ష్‌ అంటారు. భాగవతంలో శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని పైకెత్తే పర్వం గుర్తుందా? ఆ గోవర్థననానికున్న మరోపేరే అన్నకూట్‌. అప్పుడే పండిన ధాన్యాలతో ఆహారం, తీపి పదార్థాలు ఓ పళ్లెంలో దేవుని ముందు కొండలా పెట్టి గొంతెత్తి పాడి దాన్ని ప్రసాదంలో తీసుకోవడమే ఈ పర్వదినాన ప్రధాన క్రతువు.





ఏ ఏడాదిలో ఏముంది..?

కొత్త చిగుళ్లూ, కోయిల పాటలూ, షడ్రుచులతో స్వాగతం చెప్పే తెలుగువారి నూతన సంవత్సరం. ఇంతకీ తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎందుకొచ్చాయో... వాటి అర్థమేంటో తెలుసా...

మనకు అరవై పేర్లతో అరవై తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అయితే, ఈ పేర్లు రావడానికి వెనుక ఓ కథ ఉంది. ఓసారి నారద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి అరవైమంది పుత్రులు జన్మిస్తారు. కానీ ఓ యుద్ధంలో ఆ కొడుకులందరూ మరణిస్తారు. అప్పుడు నారద మహర్షి విష్ణువుని ప్రార్థించగా ‘నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు. అలా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని వరమిస్తాడు నారాయణుడు. అవే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. వీటిలో ఒక్కో పేరుకీ ఒక్కో ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. ఈ ఏడాది విళంబి నామసంవత్సరాన్నే తీసుకుంటే... విళంబి... అంటే దేనికీ లోటు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటారని అర్థం.






























సౌర, చాంద్రమానాలెందుకు?
మనం ఉగాది పండగను చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం. తమిళులూ మలయాళీలూ సౌరమానం ప్రకారం మనకన్నా ఆలస్యంగా ఏప్రిల్‌ నెలలో చేసుకుంటారు. సంక్రాంతి పండగను మాత్రం సౌరమానం ప్రకారమే చేసుకుంటాం. అయితే ఇలా రెండు రకాల మానాలను ఎందుకు లెక్కలోకి తీసుకుంటున్నాం, అసలు కాలాన్ని రెండు పద్ధతుల్లో ఎందుకు లెక్కిస్తున్నాం, అన్న సందేహాలకు ప్రముఖ జ్యోతిష్కులు శంకరమంచి రామకృష్ణశాస్త్రి సమాధానమిస్తున్నారిలా...

‘కాలః కాలయితా మహం’ అంటాడు గీతాచార్యుడు. అంటే కంటికి కనిపించని ఆ కాల స్వరూపం నేనే అని అర్థం. మరి అలాంటి కాలాన్ని లెక్కించడం అంటే సామాన్యమా... గ్రహాలూ నక్షత్ర సంచారం గురించి ఎంతటి అవగాహన ఉండాలి! దానికి మరెంతటి పరిశీలన ఉండాలి! అయితే ప్రత్యక్షంగా కనిపించే కాలస్వరూప దైవం ఆదిత్యుడే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ సూర్యుడి గమనాన్ని మాత్రమే లెక్కించారు. కానీ భారతీయ ఖగోళనిపుణులు సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల ప్రభావాన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అదే జ్యోతిషశాస్త్రం. అందులో భాగంగానే సూర్యుడితోపాటూ చంద్రుడూ, బృహస్పతి గమనాలనూ లెక్కించారు. మనం సూర్య, చంద్ర గమనాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, సమప్రాధాన్యం ఇస్తున్నాం. ఎందుకంటే యజ్ఞయాగాదులు నిర్వహించాలంటే ఒక్క సౌరమానం సరిపోదు, చాంద్రమానంలోని తిథి, నక్షత్రాలు కూడా  తెలియాలి. అంతేకాదు, ఒక పగలుతోబాటు రాత్రి కలిస్తేనే రోజు పూర్తవుతుంది. ఆ రాత్రిని ప్రభావితం చేసేది చంద్రుడే. మనమీద ఆ ప్రభావం తెలుసుకోవాలంటే చంద్రగమనాన్నీ లెక్కించాల్సిందే. అందుకే మనవాళ్లు రెండింటినీ తీసుకుని సమన్వయం చేస్తున్నారు.
సౌరమానమంటే...
సూర్యగమన గణనమే సౌరమానం. సూర్యుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో సంచరిస్తుంటాడు (నిజానికి ఇక్కడ సూర్యుడు తిరుగుతున్నాడని కాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యనే సూర్యగమనంగా లెక్కించారు నాటి నిపుణులు). అలా సంచరించే కక్ష్యనే పన్నెండు భాగాలుగా విభజించారు. అవే మేషం, వృషభం, కుంభం... వంటి రాశులు. దీన్నే రాశి వృత్తం అంటారు. ఈ పన్నెండు రాశుల్లో సూర్యుడు సంచరించడానికి ఏడాది పడుతుంది. ఒక్కో రాశిలోనూ ఒక్కో నెల ఉంటాడు. ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే రాశి సంక్రమణం. అందుకే సంక్రాంతి అనేది ప్రతీ రాశికీ ఉంటుంది. కానీ ఈ రాశిచక్రం ద్వారా నెల మాత్రమే తెలుస్తుంది. ఆ రోజు తిథి, నక్షత్రాల గురించి తెలియాలంటే మాత్రం చాంద్రమానాన్ని అనుసరించాల్సిందే.
చాంద్రమానమంటే...
చంద్రుడి గమనం ద్వారా తిథినీ నక్షత్రాన్నీ కూడా తెలుసుకోవచ్చు. నిజానికి చాంద్రమానానికీ సూర్య(భూ)గమనమే కీలకం. సూర్యుడు తిరిగే కక్ష్యను రాశి చక్రం మాదిరిగానే మరో 27 భాగాలుగా విభజించారు. అవే నక్షత్రాలు. ఆ వృత్తాన్ని నక్షత్ర వృత్తం అంటారు. అయితే సూర్యుడు ఉన్న సమయంలో నక్షత్రాలు కనిపించవు. కాబట్టి ఆ సమయంలో నక్షత్ర గమనాన్ని లెక్కించలేం. నక్షత్ర గమనంతో కాలాన్ని లెక్కిస్తే అది దోషరహితంగానూ, స్థిరంగానూ ఉంటుంది. కోట్ల సంవత్సరాల నాటి సంఘటనల సమయాన్ని తెలుసుకోవాలంటే ఆ సమయంలో ఏ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయో చెబితే కచ్చితంగా లెక్కించగలగడానికి అదే కారణం. సూర్యుడికీ చంద్రుడికీ మధ్యలో భూమి అడ్డు రావడంవల్ల చంద్రుడి కళలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వాటినే తిథులుగా లెక్కించారు. అలాగే చంద్రుడు రోజుకి ఒక నక్షత్రం చొప్పున నెలలో 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు. అంటే ఏడాదికి చాంద్రమానం ప్రకారం 354 రోజులే. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల 11 నిమిషాల 31 సెకన్లు పడుతుంది. అదే చంద్రుడు తిరగడానికి 354 రోజులు పడుతుంది. అంటే... భూమి, చంద్రుడి గమనాల్లో 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడాని సరిచేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. వాటిని సైతం ఒక పద్ధతిలో 34, 35, 34, 35, 28 నెలలకోసారి వచ్చేలా లెక్కించారు.
చాంద్రమానమే ప్రధానం
ఈ సౌర, చాంద్రమానాలకీ ఉగాదికీ సంబంధం ఏమిటీ అనుకోవచ్చు. ‘ఉ’ అంటే నక్షత్రం. ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలుపెట్టిన రోజనే అర్థం అని కొందరి అభిప్రాయం. చాంద్రమానాన్ని అనుసరించే చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటున్నాం. తెలుగువారితోబాటు కన్నడిగులు, మహారాష్ట్రీయులు కూడా ఆ రోజునే ఈ పండగ జరుపుకుంటారు. సంక్రాంతిని మినహాయిస్తే ఉగాది సహా మిగిలిన పండగలన్నీ చాంద్రమానం ప్రకారమే ఉంటాయి. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం పండగలూ వ్రతాల విషయంలో కొన్ని తిథులు నిర్ణీత సమయంలోనే ఉండాలి. సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజే ఉగాది. మధ్యాహ్నానికి నవమి తిథి ఉంటేనే శ్రీరామనవమి. అర్ధరాత్రి సమయానికి అష్టమి తిథి ఉంటేనే శ్రీకృష్ణాష్టమి. మధ్యాహ్నానికి చవితి ఉంటే తప్ప అది వినాయకచవితి అనిపించుకోదు. ఇలా ప్రతీ పండగకీ నిర్ణీత సమయాలున్నాయి. అంతేకాదు, ఏ కాలమానాన్ని ఆచరించే వారైనప్పటికీ చంద్రునికీ నక్షత్రాలకీ పౌర్ణమితో ముడిపడిన చైత్రాది నామాలతోనే నెలలను పిలుస్తుంటారు. ఉదాహరణకు సౌరమానాన్ని పాటించే తమిళులు కూడా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ గల చాంద్రమాన పేర్లతోనే నెలలను లెక్కించడం విశేషం. అవన్నీ ఎలాగున్నా పంచాంగం చూసుకోవాలన్నా జాతకచక్రం తెలుసుకోవాలన్నా చాంద్రమానమే ప్రామాణికం!









Saturday, 17 March 2018

శ్రీకృష్ణుడు - తిరుప్పావై - ధనుర్మాసం





ధనుర్మాస వ్రతం - తిరుప్పావు



ధనుర్మాసంలో ఆచరించే వ్రతం తిరుప్పావు. ఈ తిరుప్పావును ఆర్ధ్రమైన హృదయంతో ఆండాళ్‌ ఆలపించింది. వీటిలో ఉన్నవి 30 పాశురాలే. ఆండాళ్‌ ఆళ్వార్ల వంశంలో పుట్టింది. ఆమె తండ్రి విష్ణుచిత్తుడు. నారాయణుడిని అపరిమితంగా ప్రేమించినవాడు. భక్తులు భగవంతుడు తమకు కనిపించాలని ఆశిస్తారు.

కానీ విష్ణుచిత్తుడు మాత్రం- నారాయణుడు కనిపిస్తే మానవ దిష్టి తగిలి అందం కమిలిపోతుందేమోనని భయపడ్డాడు. ‘రావద్దు తండ్రి..’ అని కోరుకున్న ప్రేమికుడు. అలాంటి విష్ణుచిత్తుడి కూతురు ఆండాళ్‌. కృష్ణుడి పట్ల పరిపూర్ణమైన ప్రేమ నిండిన వ్యక్తి. ప్రేమ వల్ల భయం నింపుకున్న వ్యక్తి. ‘పొత్తి..పొత్తి’ అని మంగళము పాడిన వ్యక్తి. తిరుప్పావులోని పాశురాలలో ఈ ప్రేమభయమే ప్రధానాంశం. శ్రీకృష్ణుడు అతి సౌందర్యవంతుడు. ఆయన ప్రేమ అజరామరం. అపురూపం. దీనిని పొందటానికి ప్రయత్నించిన వారు గోపికలు. ఈ గోపికాతత్వాన్ని తనకు తానుగా ఆపాదించుకున్న గోదాదేవి ప్రణయతత్వానికి ప్రతీక. ఆమెకు ఈ ప్రపంచమంతా ప్రయణతత్వమే కనిపిస్తుంది. నల్లని గోపికలు, తెల్లని ఆవులు, వేణువూదే గోబాలలు, నీలాకాశం, అందమైన సెలయేర్లు, ఆకాశాన్ని సవాలు చేసే పర్వతాలు, వాటిని ముద్దాడే మేఘాలు.. ఇలా అన్నింటిలోను ప్రణయ తత్వమే. ఇది ప్రతీకాత్మకం- గోద, నీలగిరి, కృష్ణుడు. గోదాదేవికి అణువణువు ప్రణయభాసితమే. ఇలా ప్రేమించే మనస్సున్నప్పుడు ప్రపంచమంతా సౌందర్యంగానే కనిపిస్తుంది. ఈ సౌందర్యభావన అతిశయించినప్పుడు కలిగే ఆనందమే గిరి. ఆ గిరిని చేరుకున్నప్పుడు అక్కడ లభించే ఫలితమే కృష్ణుడు. ఈ ముగ్గురి ప్రణయానంద ప్రతీకలే ఈ గేయాలు.


గోదా నాదస్తుతి తిరుప్పావై


శ్రీ వెల్లిపుత్తూరు పట్టణంలో విష్ణుచిత్తుడనే మహాభక్తుడి కుమార్తె శ్రీఆండాళ్‌. తల్లిదండ్రులు పెట్టిన నామం గోదా. ఆమె అయోనిజ. శ్రీకృష్ణుడంటే అపరమితమైన భక్తి. ఎంతలా అంటే భగవానుడి కోసం గుచ్చిన మాలికలు- ఆయనకు తగినట్లు ఉన్నాయా? లేదా? అనే సందేహంతో ముందు తాను ధరించి చూసేది. ఒక రోజు విష్ణుచిత్తుడు ఆమెను భగవతమాలలు ధరించి ఉన్నప్పుడు చూశాడు. తీవ్ర ఆగ్రహంతో ఆమెను దండించాడు.

పెరుమాళ్లకు ఆ హారాలను పంపలేదు. ఆ రోజు రాత్రి స్వామి స్వయంగా విష్ణుచిత్తుడి కలలోకి వచ్చి, శ్రీఆండాళ్‌ ధరించిన మాలికలను పంపమని ఆజ్ఞాపించాడు. సాక్షాత్తు నారాయణుడినే రక్షించటానికి ప్రయత్నించిన తల్లి కాబట్టి ఆమె శ్రీఆండాళ్‌ అయింది. భగవంతుడిని పొందటానికి రేపల్లెలో గోపికలు చేసిన శ్రీ కాత్యాయనీ వ్రతాన్ని అనుసరిస్తూ 30 రోజులు శ్రీఆండాళ్‌ ఒక వ్రతాన్ని ఆచరించింది. రోజుకొక పాటను ఆశువుగా స్వామి ముందు గానం చేసింది. తన ఊరే గోకులముగా, తోటివారంతా గోపీజనముగా, స్వామి మందిరం నందనందుని భవంతిగా, తానే గోపెమ్మగా గోదా చేసిన నాదస్తుతిలో భావనలెన్నో.

గోదా తొలి పాశురంలో గొల్లపడుచులకు వ్రతం గురించి వివరిస్తుంది. మార్గశిర మాసంలో యశోదమ్మ ముద్దుల తనయుడి ప్రేమను పొందటానికి అనువైన కాలమని విశదీకరిస్తుంది. రెండో పాశురంలో శ్రీకృష్ణుడి పరివారమెవరో పేర్కొంటోంది. నల్లనయ్యను పొందాలనుకున్నవారంతా ఈ వ్రతానుష్ఠానానికి యోగ్యులే. బాహ్యజాత్యాదులు అడ్డంకులు కావు. గొల్లతనం, స్త్రీత్వం, యవ్వనం, సంపదలనే భావనలేమిటో రెండో పాశురంలో శ్రీఆండాళ్‌ చెబుతుంది. గొల్లతనమంటే నారాయణుడు మనకిచ్చిన లక్షణాలు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తించటం సీ్త్రత్వం. శ్రీకృష్ణుడి సేవకు అంకితం కావటం యవ్వనం. శ్రీకృష్ణాగ్రహం తప్ప వేరేమి కోరకపోవటం సంపద. ఇవి ఉన్నవారంతా శ్రీకృష్ణపరివారమే. ఇక మూడో పాశురంలో వ్రతం చేయటం వల్ల కలిగే లాభాలను వివరిస్తుంది. ఈ వ్రతం వల్ల దేహాత్మాభిమానం, స్వాతంత్య్ర భావన, పరదాస్యం, స్వరక్షణ స్వాన్వయము, బంధులోలత, విషయవిలాసాలనే ఆరు దోషాలు తొలగిపోతాయి. జ్ఞానమనే పంట పండుతుంది.

నాలుగో పాశురంలో నారాయణుడికి ప్రణమిల్లే వరుణదేవుడిని వానలు కురిపించమని అభ్యర్థిస్తుంది. ఐదవ పాశురంలో అర్చామూర్తిని ఎలా పిలవాలో, ఎంతవాడై ఆలయాలల్లోకి వస్తాడో, ఏ పేర్లతో కీర్తిస్తే మన సకల పాపరాశిని పటాపంచలు చేస్తాడో, సమస్త పుణ్య ఫలాలు ప్రసాదిస్తాడో బహిర్గతం చేస్తుంది. ఆరవ పాశురంలో పదిమంది గోపికలకు బాహ్య పరిస్థితులు తెలియజేస్తూ కృష్ణానుభవానికి మేల్కొలుపుతుంది. ఈ పది మంది గోపికలను మేల్కొలపటంలో ఒక తాత్విక రహస్యముంది. మొత్తం తత్వాలు పది. మొదట పరమాత్మ. ఆ తర్వాత జీవుడు. మూడోవది ప్రకృతి శక్తులైన- భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము. ఇవన్నీ కలిపితే పది అవుతాయి. ఈ దశవిశేషాలు కలిగిన జ్ఞానులే ఈ గోపికలు. ఏడవ పాశురంలో ఉదయం అవుతోందని తెలియజేసే పరిస్థితులను వివరిస్తూ.. తొలి గోపికను మేల్కొలుపుతుంది.

గోదా అంతరార్థమిది


గోదాదేవి శ్రీరంగనాధుని పొందటానికి చేసిన ప్రయత్నం.. గోపికలు శ్రీకృష్ణుడిని చేరటానికి చేసిన ప్రయత్నం వెనక ఉన్న అంతర్యాన్ని గ్రహించగలిగితే భగవంతుడి లీలలు అర్థమవుతాయి.

సన్మార్గంలో ప్రయాణించే మానవుడు మూడు అంశాలను విధిగా పాటించాలి. వీటిలో మొదటిది శ్రవణం. రెండోది మననం. మూడోది ఆచరణ. ఈ మూడింటినీ ఈ 30 పాశురాల్లో వివరించింది శ్రీ ఆండాళ్లు. మొదటి ఏడు పాశురాలలోని పరమార్థాన్ని గతం వారం తెలుసుకున్నాం. ఈ వారం ఎనిమిదో పాశురం నుంచి ఉన్న విశేషాలు గమనిద్దాం.

గోపికా బాలికలను లేపుతూ గోదాదేవి కృష్ణుడి అంతఃస్వరూపాన్ని వివరిస్తోంది. ఎనిమిదో పాశురంలో మూడో గోపికాబాలికను నిద్ర లేపుతూ- తూరుపు తెలవారుతోంది. గేదెలు చిరుమేత కోసం బయట పచ్చిక బయళ్లలో తిరుగాడుతున్నాయి. నువ్వు తప్ప మిగిలినవారందరూ స్వామి సేవకై సిద్ధపడుతున్నారు.. అని తొందరపెడుతుంది. ఇక్కడ గేదెలను బాహ్య స్వరూపంలో కాకుండా- అజ్ఞానానికి, తమస్సుకు ప్రతీకలుగా భావించాలి. వెలుగు వచ్చినప్పుడు అవి బయటకు వెళ్లిపోతాయి. మళ్లీ రాత్రి అయితే తిరిగి వస్తాయి. మన అజ్ఞానాదులు కూడా అలాంటివే. గురోపదేశం వల్ల అవి బయటకు పోతాయి. మళ్లీ తిరిగి వస్తాయి. వాటిని రానిచ్చి- పాల వంటి మంచి విషయాలను మనం తీసుకొని, మళ్లీ బయటకు పంపేయాలి. అలా చేయటం వల్ల భగవంతుడికి దగ్గరవుతాం. ఇక తొమ్మిదో పాశురంలో నాలుగో గోపిక దాకా స్థిత ప్రజ్ఞుడికి ఉండాల్సిన యాతమావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రీయావస్థ, వశీకారావస్థల గురించి వివరిస్తోంది. దీనిని ఎలా పొందాలో కూడా చెబుతోంది. పదో పాశురంలో అత్యంత సౌందర్యవతి అయిన ఐదో గోపిక గురించి వివరిస్తుంది. ఈమె కోసం కృష్ణుడు కూడా అనేక తిప్పలు పడుతూ ఉంటాడు. కానీ ఆమె ఒక అలౌకికమైన స్థితిలో ఉంటుంది. కృష్ణుడి కూడా స్పందించదు. పరమయోగులకు మాత్రమే సాధ్యమయిన అలాంటి అలౌకిక స్థితిని పొందిన ఆ గోపికను నిద్ర లేవమని గోదాదేవి ప్రార్థిస్తుంది. పదకొండో పాశురంలో ఆరవ గోపిక బాహ్య సౌందర్యంతో పాటుగా అంతః సౌందర్యాన్ని కూడా గోదాదేవి వర్ణిస్తుంది. పన్నెండో పాశురంలో రామాయణం ప్రతీకగా జీవిత రహస్యాలను వివరిస్తూ- లోకవిలక్షణమైన సాత్విక నిద్ర నుంచి గోపికను లేవమని గోదా దేవి ప్రార్థిస్తుంది. మన జీవితంలో బందీపబడిన జీవుడే సీత. రావణుడి చెరబడ్డ సీతలా మనం మనసు చేత వంచించబడ్డాం. అహంకారానికి బానిసలయ్యాం. శ్రీరాముడే లంకలోకి ప్రవేశించి చెర నుంచి సీతను విడిపించినట్లు- ఆచార్యుడు మన చెరను విడిపిస్తాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఈ తత్వాన్ని గోదాదేవి ఈ పాశురంలో వివరించింది. ఇక ఎనిమిదో గోపికను నిద్ర లేపటానికి పదమూడో పాశురంలో గోదాదేవి ప్రయత్నిస్తుంది. ఈ ఎనిమిదో గోపిక అతి సుందర నేత్రి. ఈ నేత్రములు బాహ్య ప్రపంచాన్ని చూస్తాయి. కానీ అంతః ప్రపంచాన్ని చూసే నేత్రాలు వేరే ఉంటాయని ఈ పాశురంలో చెప్పకనే చెబుతుంది. పదనాలుగో పాశురంలో తొమ్మిదో గోపికను నిద్ర లేపటానికి ప్రయత్నిస్తుంది. ఈ గోపికకు నేర్పుగా మాట్లాడగలిగిన చాతుర్యముంది. అందరి కన్నా ముందు లేస్తానని చెప్పింది. కానీ లేవలేదు. దీని వెనకున్న రహస్యం గురించి ఈ పాశురంలో గోదాదేవి వివరిస్తుంది.

మేలుకో శ్రీకృష్ణా


శ్రీరంగడిని అనుగ్రహం కోరి వ్రతమాచరించిన గోదాదేవి.. పాశురాలతో స్వామిని మనసారా కీర్తించింది. శ్రీ కృష్ణుడి లీలలను, ఆయన చూపిన మాయలను మనోహరంగా వర్ణిస్తూ గోపికలను వ్రతానికి సన్నద్ధం చేస్తుంది. పరమాత్ముడి మహిమలను ముప్పయ్‌ పాశురాల్లో వివరించింది. తొలి పద్నాలుగు పాశురాల గురించి గతవారాల్లో తెలుసుకున్నాం. ఈ వారం పదిహేనో పాశురం నుంచి ఉన్న విశేషాలను తెలుసుకుందాం.

పదిహేనవ పాశురంలో ఆ నల్లనయ్య ఎంత బలవంతుడో గోపికలకు చెబుతుంది శ్రీ ఆండాల్‌. కువలయాపీడమనే బలిష్టమైన ఏనుగును స్వామి ఎలా చంపాడో వివరిస్తుంది. ఆ స్వామి విశేషాలను కీర్తిస్తూ వ్రతాన్ని అచరిద్దామంటూ పదవ గోపబాలికను మేల్కొలుపుతుంది. ఇక పదహారో పాశురంలో గోపికల సమేతంగా నందగోపుని ఇంటి చేరుతుంది. భవన ద్వారాలు తెరవ వలసినదిగా స్వామివారి ద్వార పాలకులను కోరుతుంది. స్వామిని మేల్కొలుపుటకు శ్రీ కృష్ణుడు ఇచ్చిన మాట మేరకే ఇక్కడికి వచ్చామని ద్వారపాలకులకు విన్నవించుకుంటుంది. పదిహేడవ పాశురంలో లోనికి ప్రవేశించిన గోపికలు స్వామిని వేనోళ్లా కీర్తిస్తూ మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు.

ముల్లోకాలు కొలిచే స్వామి నిదుర వీడి మేల్కొనుమంటూ స్తుతిస్తారు.

పద్దెనిమిదవ పాశురంలో నీళాదేవిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు గోపికలు. నీ మేనత్త కుమారుడైన శ్రీ కృష్ణుడిని మేల్కొలిపేందుకు వచ్చామని చెప్పుకుంటారు. తలుపు తీయమని కోరుతారు. పంతొమ్మిదో పాశురంలో నీళాదేవి, శ్రీ కృష్ణుడు ఇద్దరినీ మేల్కొలపాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. శ్రీ కృష్ణుడి మాయలను మరోసారి వర్ణిస్తారు. మా కోసమైనా నీ భర్తను ఒక్క క్షణం విడిచిపెట్టొచ్చు కదమ్మా అంటూ నీళాదేవిపై నిష్టూరాలాడతారు.

ఇరవయ్యవ పాశురంలో దేవతలను ఆ స్వామి ఎలా కాపాడాడో కీర్తిస్తుంది శ్రీ ఆండాళ్‌. అలాంటి స్వామిని చూసే అవకాశం ఇవ్వమంటూ నీళాదేవిని నిద్ర నుంచి మేల్కొనమంటుంది. ఇరవై ఒకటో పాశురంలో నీళాదేవితో కలిసి శ్రీకృష్ణుడిని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఆ నల్లనయ్య అనుగ్రహం కోసం శ్రీ ఆండాల్‌ పరిపరి విధాలా ప్రయత్నిస్తుంది

వందే కృష్ణం


శ్రీహరికి మార్గశిర మాసం అంటే ఎంతో ప్రీతి. అందుకే శ్రీ ఆండాల్‌ తిరుప్పావై వ్రతాన్ని ధనుర్మాసంలో ఆచరించింది. ముప్పయ్‌ రోజులు.. రోజుకో పాశురం చొప్పున కృష్ణ భగవానుడిని స్తుతించింది. మూడు వారాలుగా వ్రతదీక్షలోని గోదాదేవి.. ఆ నల్లనయ్యను కీర్తిస్తూ గోపికలను నిద్రలేపడం, కృష్ణ భగవానుడి భవనానికేగి అక్కడ నీళాదేవి అనుగ్రహం పొందిన వైనాన్ని సంక్షిప్తంగా తెలుసుకున్నాం. మిగతా పాశురాల్లో గోదాదేవి ఆ నందగోపాలుడ్ని ఇలా కీర్తించింది..

నీళాదేవి, గోపికల సమేతంగా శ్రీకృష్ణ మందిరానికి వెళ్లిన గోదాదేవి.. ఆదమరచి నిద్రిస్తున్న గోపాల దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పరిపరివిధాల ప్రయత్నిస్తుంది. దానికి కొనసాగింపుగా ఇరవైరెండో పాశురంలో ‘ధరణిపై పేద నుంచి రాజు వరకు అందరూ నీవే దిక్కనుచూ నీ చెంతకు చేరారు స్వామి. ఆడవారిమైనా మేమంతా కూడా నీ సన్నిధికి చేరాము. ఇకనైనా కనులు తెరచి మమ్మనుగ్రహింప ప్రార్థన’ అని వేడుకుంటుంది.

భక్తుల కోరిక మన్నించి నిదుర లేచిన స్వామిని ఇరవైమూడో పాశురంలో అద్భుతంగా స్తుతిస్తుంది శ్రీ ఆండాల్‌. ‘గుహలో ప్రశాంతంగా నిదురిస్తున్న సింహం మేల్కొని జూలు విదిల్చినట్టుగా.. నీవు గోచరిస్తున్నావు కృష్ణా’ అని కీర్తిస్తూ.. తమ మనో నిశ్చయమును నెరవేర్చాల్సిందిగా కోరుతుంది. ఇరవైనాలుగో పాశురంలో.. శ్రీహరి అవతార విశేషాలతో పాటు శ్రీకృష్ణుడిగా ఆయన చూపిన లీలావిలాసాలను ప్రస్తుతిస్తుంది. వామనమూర్తిగా వచ్చి ముల్లోకాలను కొలిచిన తీరు.. రాముడిగా రావణుడిని సంహరించి సీతమ్మను పొందిన గాథ.. ఇక కృష్ణావతారంలో బాల్యం నుంచి చూపిన మాయలు భక్తితో వర్ణిస్తూ తమపై దయ చూపమని వేడుకుంటుంది.

ఇద్దరమ్మల ముద్దుల బిడ్డడా అంటూ ఇరవైఅయిదో పాశురంలో బాలకృష్ణుడిని గుర్తుచేస్తుంది. ‘దేవకి పంటగా వెలిసి.. యశోదమ్మ చెంతన పెరిగి.. గోకులంలో ఆనందం పంచావు స్వామి. పంతమాడిన కంసుడిని సంహరించి లోకకల్యాణం గావించిన కృష్ణా.. నీ లీలామృతమును చెప్పినంత మాత్రాన మా జన్మ ధన్యమైంద’ని ప్రణమిల్లుతుంది.

ఇరవైఆరో పాశురంలో తిరుప్పావై వ్రతం ఆచరిస్తున్న విధం గురించి కృష్ణపరమాత్మకు వివరిస్తుంది శ్రీ ఆండాల్‌. ఇరవైఏడో పాశురంలో వ్రతమాచరించే క్రమంలో వారి అలంకార విశేషాలను స్వామికి తెలియజేస్తుంది. ఇరవైఎనిమిదో పాశురంలో ఈ వ్రతాన్ని చేయడంలో ఏవైనా లోపాలుంటే పెద్దమనసుతో మన్నింపమని, భక్తిపారవశ్యంలో మర్యాదలో ఏదైనా లోపం జరిగితే మనసులో పెట్టుకోకు స్వామి అని వేడుకుంటుంది. ఇరవైతొమ్మిదో పాశురంలో ఈ వ్రతం ఆచరించడం వెనకున్న ప్రధాన ఉద్దేశాన్ని వివరిస్తుంది గోదాదేవి.

‘స్వామి.. జన్మజన్మల వరకూ నీతో బంధుత్వం కలవారుగా ఉండాలని ఈ వ్రతం చేశామ’ని కోరుతుంది. ముప్పయవ పాశురంలో తిరుప్పావై వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలుపుతుంది. ముప్పది రోజులు రోజుకో పాశురం చొప్పున స్వామిని కీర్తిస్తూ తిరుప్పావై వ్రతం చేసిన వారికి స్వామి పరిపూర్ణ కటాక్షం సిద్ధిస్తుందని వివరిస్తుంది గోదాదేవి.

శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌









గోదా వైభవం


ఆళ్వారులు అనగా భగవదనుభవంలో మునిగి ఉన్నవారని అర్థం. ఆళ్వారులు పన్నెండు మంది, వీరినే ‘పన్నిద్ధాళ్వారుల’ని కూడా అంటారు. వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు. ఏ కులము వారైనా.. వారి భక్తి మార్గానికి, పాండిత్యానికి ప్రజలు వశులైనారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరే ఆండాళ్‌ (గోదాదేవి). కీ.శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో పూర్వ ఫలణీ నక్షత్రయుక్త శఖసమయాన దొరికింది. ఆండాళ్‌ అయోనిజ. ఆమె విష్ణు చిత్తులకు తులసీవనంలో లభించింది. విష్ణు చిత్తులకు ‘పెరియాళ్వారు’, భట్టినాథులు అనే నామాంతరాలు ఉన్నాయి. వీరు శ్రీవిల్లి పుత్తూరు (శ్రీధన్విపురం)లో ఉన్న వటపత్రశాయికి, నిత్యం పుష్పమాలికలను సమర్పించేవారు. భగవానుడి సేవలో తరించేవారు. ఓ రోజు తులసివనంలో యజ్ఞవాటిక కోసం తవ్వుతుండగా.. ఒక బాలిక కనిపించింది. వీరికి సంతానం లేకపోవడం వల్ల ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచి ‘కోదై’ (పూలదండ) అనే పేరుతో పిలిచేవారు. ఆమె చిన్నప్పటి నుంచి భగవంతుని పట్ల అచంచలమైన భక్తివిశ్వాసాలు కలిగి ఉండేది.

విష్ణు చిత్తులు వటపత్రశాయికి సమర్పించే పుష్పమాలికలను తాను ధరించాలనే కోరిక ఆండాళ్‌ మనసులో కలిగింది. ఆ మాలికలను ఎవరికీ తెలియకుండా తన శిరస్సున అలంకరించుకుని, తన ప్రతి రూపాన్ని నూతినీటిలో చూసి ఆనందించేది. ఓ రోజు విష్ణుచిత్తులు పూలమాలికలను ఆలయానికి తీసుకెళ్తుండగా అందులో తల వెంట్రుకలను చూశారు. అనుమానం వచ్చి ఆండాళ్‌ను అడుగగా, ఆమె తన తప్పు ఒప్పుకుంది. పుష్పమాలికలను స్వామికి సమర్పించలేక ఎంతో బాధపడ్డారు. ఆ రాత్రే విష్ణుచిత్తుల వారికి స్వామి కలలో కనిపించి ‘రోజూ నీవు తెచ్చిన పుష్పమాలికలు నీ కుమార్తె ధరించినవే, వాటిని నేను అత్యంత ప్రీతితో స్వీకరిస్తున్నాను. ఆమె ధరించిన మాలికలనే తీసుకొని రావాలని’ ఆదేశించారు. ఆనాటి నుంచి ఆండాళ్‌దేవికి ‘శూడికోడత్తనాచ్చియార్‌’ (ఆముక్తమాల్యద), ‘గోదాదేవి’ అనే పేర్లు కలిగాయి.


శ్రీరంగనాథుని రూపరేఖా విలాసాలను తండ్రి ద్వారా విన్న ఆండాళ్‌.. ఆ స్వామినే తన ప్రాణనాథునిగా పొందాలని నిశ్చయించుకుంది. ద్వాపర యుగంలో.. గోపికలు శ్రీ కృష్ణునిపై భక్తితో, అతడినే భర్తగా పొందదలచి ‘కాత్యాయనీ వ్రతం’ చేసి తరించారు. గోదాదేవి కూడా అదే వ్రతాన్ని కృష్ణుడిని భర్తగా పొందదలచి, శ్రీవిల్లి పుత్తూరునే గోకులంగా, తోటి చెలికత్తెలను గోపికలుగా, తనూ ఒక గోపికగా, అక్కడి రంగనాథుడినే తన నాథుడిగా భావించి మార్గశీర్షమాసంలో.. ముప్ఫయ్‌ రోజులు.. నిత్యం ఒక పాశురం (పాట)ను స్వామికి నివేదించి వ్రతసమాప్తి చేసింది. చివరి రోజున ‘భోగి పండు’గ నాడు ఆండాళ్‌ శ్రీరంగనాథునితో వివాహం జరుగుతుంది. ఈ తిరుప్పావై గ్రంథం సర్వవేదాలకు మూలం అంటారు. ఆండాళ్‌ భూదేవి అవతారమని అంటారు. ఆండాళ్‌ రచించిన ‘తిరుప్పావై’ వ్రతగ్రంథం తర్వాత రచించిన మరో గ్రంథం ‘నాచ్చియార్‌ తిరుమొళి’. ‘తిరుప్పావై’ వ్రతం అయ్యాక పాండ్యదేశం రాజైన వల్లభరాములకు శ్రీరంగనాథుడు దర్శనమిచ్చి, ఆండాళ్‌ను తన వద్దకు తీసుకొచ్చి వివాహం చేయమని ఆదేశించాడు. శ్రీరంగం వెళ్లి కల్యాణం జరిగే లోపు ఆండాళ్‌ అనుభవించిన ‘ఆర్తి’ వాక్‌రూపంలో బయటకు వచ్చి ‘నాచ్చియార్‌ తిరుమొళి’ గ్రంథంగా అవతరించింది.

డాక్టర్‌ చెలికాని మురళీకృష్ఱారావు






Dasara - Navaratrulu








బాలాత్రిపుర సుందరి దేవి మొదటి రోజు


"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"

శరన్నవరాత్రి ఉత్సవాలలో  మొదటి రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.
నైవేద్యం - పొంగలి




గాయత్రీ దేవి రెండో రోజు

"ముక్తా విద్రుమ హేమనీల
ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:
యుక్తామిందు నిబద్ధరత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాంకుశమ్
కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద
యుగళం హసైర్వాహంతీం భజే"

సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.

నైవేద్యం - అల్లం గారెలు




అన్నపూర్ణాదేవి మూడవ రోజు


"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"

దసరా ఉత్సవాలలో అమ్మవారిని ఆశ్వియుజ చవితి రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ. అన్నపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్పి, వాక్ సిద్ది, శుద్ధి, భక్తీ శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సర్వ లోకాల పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుంది.

అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం, పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.

నైవేద్యం - దధ్ధోజనం


మహాలక్ష్మీ దేవి నాల్గవ రోజు

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం
లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద
విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలిక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుంద ప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మన్మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. "యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోనో ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి.


నైవేద్యం - వడపప్పు



శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - ఐదవ రోజు

''యా కుందేందు తుషారహార
దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత
కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి
భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా"


నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈమె బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి, చతుష్షష్టి కళలను అనుగ్రహించినది సరస్వతీ దేవి. సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. పెసరపప్పు పాయసాన్ని సరస్వతీ దేవికి నైవేద్యంగా నివేదించాలి. 

నైవేద్యం - పెసరపప్పు పాయసం




శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరవ రోజు

ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్

త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి. 

నైవేద్యం - అప్పాలు,- పులిహోర



దుర్గాదేవి - ఏడవరోజు

విద్యుద్దామ సమప్రభాం
మృగపతి స్కందస్థితాం భీషణా౦
కన్యాభి: కరవాలఖేల
విలద్దస్తా భిరాసేవితాం!
హసైశ్చక్రగదాసిఖేట
విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం
దుర్గం త్రినేత్రం భజే

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. చక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.

నైవేద్యం - చక్రపొంగలి


శ్రీ మహిషాసురమర్దినీ దేవి - ఎనిమిదవ రోజు


మహిషమస్తక నృత్త వినోదిని
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదిని


దేవి తొమ్మిది అవవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమినే "మహర్నవమి"గా ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చండీ సప్తశతీ హోమం చేయాలి. "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మో హిన్యైస్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. కేసరి పూర్ణాలు నివేదన చేయాలి.

నైవేద్యం - కేసరి పూర్ణాలు




శ్రీ రాజరాజేశ్వరీదేవి - తొమ్మిదవ రోజు


అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.

నైవేద్యం - లడ్డూలు

















Friday, 16 March 2018

నవదుర్గలు







1. శైలపుత్రి – నవదుర్గలు

శైలపుత్రి

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.

సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.

తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.

సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.

‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.



2. బ్రహ్మచారిణి – నవదుర్గలు


బ్రహ్మచారిణిదధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“

దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.




3. చంద్రఘంట – నవదుర్గలు
చంద్రఘంట
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.




4. కూష్మాండ – నవదుర్గలు
కూష్మాండ

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.

ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.

ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.

ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.

నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.

శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.


5. స్కందమాత – నవదుర్గలు
స్కందమాత

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దుర్గా మాతయొక్క ఐదవస్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.

ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.

నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన ధ్యానవృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.

స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.

కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.



6. కాత్యాయని – నవదుర్గలు
కాత్యాయని

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాతనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ॥

దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.

ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.

కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది. ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన.

దుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది. ఈ చక్రంపై స్థిర మనస్సుగల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీ దేవి చరణాలలో సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయనీ మాత దర్శనం లభిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను, ప్రభావములను పొందగలడు. రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలైనవి అతడినుండి సర్వదా దూరమవుతాయి. జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసనయందూ తత్పరులము కావాలి.




7. కాళరాత్రి – నవదుర్గలు
కాళరాత్రి

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥

దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.

దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.



8. మహాగౌరి – నవదుర్గలు
మహాగౌరి

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ ।
బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥

కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‍కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీమాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాలనుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.



సిద్ధిదాత్రి – నవదుర్గలు
సిద్ధిదాత్రి

సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…

1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.

సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.

ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.

నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.

దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

శరన్నవరాత్రులు





దేవీ ఉపాసన కాలమే... శరన్నవరాత్రులు

శక్తి స్వరూపం.. ఆశ్వయుజమాసం
మనస్సు నిర్మలంగా ఉండాలంటే మహర్షులు చెప్పిన మార్గాల్లో శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది. శక్తి స్వరూపిణి పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. పరాశక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజ మాసానికి ఇష మాసం అనే పేరు ఉంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.

శరద్రుతువు
ఈ మాసం శరద్రుతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి పదిరాత్రులు జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారిస్తాయి. విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెపుతాయి.

శరన్నవరాత్రి ఉత్సవాలు

  • పది జన్మల పాపాలను పోగొడుతుంది
  • మొదటి మూడు రాత్రులు పార్వతి,
  • మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి,
  • చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు.

శరద్రుతువులో కాచే పండువెన్నెల వంటి కాంతి, చల్లని చూపు, మందహాసం, ముఖపద్మం కలిగినదిగా పరాశక్తిని రుషులు అభివర్ణిస్తారు. శరత్కాలంలో ఆవిర్భవించటం వల్ల ఆ పరాశక్తికి శారద అనే పేరు వచ్చింది. ఈ దేవిని ఉపాసించే కాలాన్ని ‘శరన్నవరాత్రి ఉత్సవాలుగా, దసరా ఉత్సవాలుగా జరుపుక్గుఇరు.

దేవీ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు పార్వతీదేవి, మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజులను

సరస్వతీదేవిని పూజించటం శుభప్రదం.
ప్రకృతి నియమాలను అనుసరించి ఈ శరత్కాలం సంధికాలం. ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి, వారి ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు లోనుకాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం. హస్తా నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ దశమికి దశహరా అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పొగొట్టేది అనే అర్థం కూడా ఉంది.

శరత్కాలంలోని తొలి తొమ్మిది రాత్రుళ్ళు దుర్గాదేవి
ని (పరాశక్తి) పూజిస్తే భక్తుల జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని ఒక నమ్మిక.. దేవిని ఉపాసన చేస్తూ నిర్వహించే ఉత్సవాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. దసరా ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి కాబట్టే వీటికి నవరాత్రులనే పేరు వచ్చింది. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దశమి రోజున వేద పండితులను, బ్రాహ్మణులను సత్కరించటం ఆనవాయితీగా వస్తోంది.

కుమారీపూజ ప్రత్యేకం
నవరాత్రి పూజావిధానాలలో కుమారీ పూజకు చాలా ప్రత్యేకత ఉంది. తొమ్మిది సంవత్సరాలలోపు బాలికను అలంకరించి నూతన వసా్త్రలను ధరింపజేసి, అమ్మస్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసే పూజను కుమారీ పూజ అంటారు. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. తొమ్మిది మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర అని పేర్లతో కుమారీలను ప్రత్యేకంగా పూజిస్తారు.

నవదుర్గలు
శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ,కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాతను లలితా త్రిపురసుందరి, కాత్యాయిని - సరస్వతీదేవి, కాలరాత్రిని దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.






విజయదశమి విశిష్టత.. శమీ పూజ ప్రాశస్త్యం


యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా!నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
సర్వ ప్రాణుల్లోనూ మాతృరూపంగా ఉన్న ఆ జగన్మాతకు నమస్కారములు అని చెప్పడమే ఈ శ్లోక భావం. సకల ప్రాణులకూ తల్లే మూలం అని దీని పరమార్థం. మాతృశబ్దం ఎంత గొప్పదో అంత బాధ్యతాయుతమైనది. బిడ్డలకు జన్మనివ్వడమే కాదు, వారిని తల్లి పెంచి పోషిస్తుంది. అందుకే సకల చరాచర సృష్టిలో జీవులన్నీ తల్లినే ఆశ్రయిస్తాయి. సర్వలోకాలకు తల్లి ఆ జగజ్జనని. ఆదిపరాశక్తి కాబట్టే ఆమె అమ్మలగన్న అమ్మ అయింది.

ఆది పరాశక్తి, ఆ జగన్మాత లోకకల్యాణార్థం రాక్షస సంహారం గావించింది. ఒకొక్కరోజు ఒకొక్క రూపం ధరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది రాక్షసులను సంహరించింది. సాధించిన విజయానికి గుర్తుగా ఆ తల్లిని ఆరాధిస్తూ తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసుకుంటారు. వీటినే దేవీ నవరాత్రులు అంటారు. చివరి రోజు ఈ విజయానికి గుర్తుగా విజయదశమిని పర్వదినంగా జరుపుకుంటారు. దేవీ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహ సాధనకు విశిష్టమైన రోజులు. శరదృతువులో ప్రారంభమవుతాయి కనుకనే వీటిని శరన్నవరాత్రులు అని వ్యవహరిస్తారు.

శరన్నవరాత్రుల విశిష్టత
వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు, మాఘ నవరాత్రులు అనే పేర్లతో సంవత్సరంలో నాలుగుసార్లు ఈ అమ్మ వారి నవరాత్రులను ఉత్సవాలుగా నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ జరిగే నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఇవి వసంత కాలంలో వస్తాయి. వీటినే రామ నవరాత్రులు అని కూడా అంటారు. ఆషాఢ శుక్లపక్షంలో జరిపే నవరాత్రులను ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులు అంటారు. మాఘమాసంలో తొమ్మిది రూపాలలో మాఘ శుక్ల పక్షాన జరుపు కునే నవరాత్రులను మాఘ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. ఈ మూడు నవరాత్రులను అన్ని ప్రాంతాల వారు నిర్వహించక పోవచ్చు కానీ శరత్‌ కాలంలో వచ్చే శరన్నవరాత్రులను దేశమంతటా ఘనంగా జరుపుతారు కాబట్టే ఈ నవరాత్రులకు అంత ప్రాముఖ్యం ఏర్పడింది.

అమ్మవారి పూజలో అంతరార్థం
దుర్గాదేవి తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా పదవరోజును విజయదశమిగా పాటిస్తున్నాం. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గానవరాత్రుల పూజలోని అంతరార్థం.

తొమ్మిది రోజులు - తొమ్మిది రూపాలు
నవరాత్రులలో మొదటి మూడు రోజులు దుర్గా స్వరూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో నవరాత్రులలో దేవిని పూజించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెబుతారు.

ప్రాంతీయ ఆచారాలను బట్టి నవరాత్రులలో దేవీ అలంకారాలు చేస్తారు. బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గా, మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీదేవిగా తొమ్మిది రోజులూ తొమ్మిది రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. చాలా చోట్ల ఈ అవతారాలకే పూజలు చేస్తారు, ఉత్తర భారతంలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి లాంటి తొమ్మిది రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. అయితే తెలుగునాట శ్రీశైలంలో అమ్మవారిని ఈ రూపాలలో అర్చిస్తారు.

కుమారీపూజ
శరన్నవరాత్రులలో దేవీపూజతో పాటు కొన్ని చోట్ల కుమారీపూజ కూడా చేస్తారు. ఇందులో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసున్న బాలికలను పూజిస్తారు. వారికి విందు చేసి, వస్ర్తాదులతో సత్కరిస్తారు. ఒకొక్కరోజు ఒకొక్క వయసున్న బాలికకు పూజలు చేస్తారు. రెండు సంవత్సరాలున్న బాలికను కుమారి అంటారు. ఇలా ఆమెను కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్య్ర దుఃఖాలు నశిస్తాయి. మూడు సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అంటారు. ఈ త్రిమూర్తి పూజవల్ల ధనధాన్య, పుుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగు సంవత్సరాలున్న బాలికను కల్యాణి అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి కలుగుతుంది. ఐదేళ్ళు వయసుగల బాలికను రోహిణి అంటారు. ఈమెను పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.

ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అంటారు. కాళికను పూజిస్తే శత్రు నాశనం జరుగుతుంది. ఏడు సంవత్సరాల వయసుగల బాలికను చండిక అంటారు. ఈ పూజ ఐశ్వర్యాన్నిస్తుంది. ఎనిమిది సంవత్సరాలున్న బాలికను శాంభవి అని వ్యవహరిస్తారు. ఈ పూజను నృపసమ్మోహకం అంటారు. ఈ పూజవల్ల అధి కారులు మనకు అనుగుణంగా ఉంటారు. తొమ్మిది సంవత్సరాల వయసుగల బాలికను దుర్గ అంటారు. ఈమెను పూజించడం వల్ల సర్వసుఖాలూ లభిస్తాయి. పది సంవత్సరాలున్న బాలికను సుభద్ర అంటారు. ఈపూజ వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి.

చివరి మూడు రోజులు - అత్యంత శ్రేయస్కరం
నవరాత్రులలో అన్ని రోజులూ పూజలు చేయలేనివారు కనీసం చివరి మూడు రోజులైనా అమ్మవారిని పూజించాలని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. సప్తమి, దుర్గాష్టమి, మహర్నవమి. ఈ మూడు రోజులూ త్రిమూర్త్యాత్మక దేవీ స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర మర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి దేవి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునే వారని పురాణాల్లో ఉంది.

విజయాలను చేకూర్చే విజయ దశమి
దశ హరా అంటే పదిరోజుల పండుగ! పది పాపాలను నాశనం చేసేది అని అర్థం. అదే దసరాగా వాడుకలోకి వచ్చింది. త్రిశక్త్యాత్మకంగా అమ్మవారు పూజలు అందుకుని పదవరోజున అపరాజితాదేవిగా కొలువు తీరుతుంది.

ఆశ్వయుజ శుక్ల దశమినాటి సాయం సంధ్యాసమయాన్నే విజయకాలం అంటాం. అది సర్వ కార్యసాధకమైన సమయం. ఆ దశమీ దినం శ్రవణా నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఈరోజున సీమోల్లంఘనం చేస్తారు. అంటే ఊరి పొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావడమన్నమాట. ఇందులో అంతరార్థం ఏమిటంటే సాధారణంగా శత్రువులూ, మిత్రులూ అనే అంశం వచ్చినప్పుడు వారిరువురి మధ్య కొన్ని హద్దులేర్పడతాయి. వాటిని తుడిచేసి శత్రువులు సైతం పాతకక్షలు మరిచిపోయి మిత్రులుగా ఉండాలనేది సీమోల్లంఘన భావన. ఈ విజయదశమి పుణ్య దినాన ప్రజలంతా చేరి ఊరిలో ఈశాన్య దిశలో ఉండే శమీవృక్ష ప్రదేశానికి వెళతారు. శమీవృక్షానికి పూజ చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.

శమీ శమీయతే పాపం శమీశతృ వినాశనం
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శనీ

అంటే శమీవృక్షము పాపాన్ని పరిహరిస్తుంది, శత్రువులను నాశనం చేస్తుందని అర్ధం. ఇది నాడు అర్జునుని ధనువును కాపాడింది, శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.


ముస్త్యాల రామచంద్రశర్మ









దుర్గుణాలను జయించండి


ఆధ్యాత్మిక దేశమైన భారతావనిలో శరన్నవరాత్రులకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ పండుగ పరమార్థం గ్రహించి జీవితాలను పరివర్తన చేసుకోవాలి. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రులు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. దశమి రోజున రాక్షసత్వంపై దైవం సాధించిన విజయానికి ప్రతీకగా దసరా చేసుకుంటారు.

ఆధ్యాత్మిక సాధనకు నవరాత్రులు మంచి వేదిక. మన మనసుల్లో పేరుకుపోయిన కామక్రోధాది వికారాలను జయించడానికి కావాల్సిన శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లో లక్ష్మీ, పార్వతి, సరస్వతి రూపాలుగా ఆ తల్లిని ఆరాధిస్తారు. త్రిశక్తి స్వరూపమైన జగన్మాత.. అష్టభుజాలతో ఖడ్గం, శూలం, సుదర్శన చక్రం, శంఖం, దీపం, గద మొదలైన ఆయుధాలు చేతబూని భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆయుధాలు ఆధ్యాత్మిక శక్తులకు నిదర్శనంగా భావించాలి.

దసర అనగా దశ శిర హార అని అంటారు. నేటి మానవుల్లో పెచ్చురిల్లుతున్న దశ వికారాలు.. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, నిర్లక్ష్యం, సోమరితనం.. ఈ పది వికారాలకు గుర్తుగా పది తలల రావణాసురుడిని చూపిస్తారు. అందుకే ఏటా విజయదశమి రోజున రావణ దహనం చేస్తారు. కానీ, మనలోనే ఉన్న ఈ పది దుర్గుణాలను జయించిన రోజునే నిజమైన దసరా.

ఈ వికారాలను జయించడం ఎలా..? 

ఈ వికారాలకు మూలం దేహభ్రాంతి, దీన్ని జయిస్తే మిగతా వికారాలు దూరమవుతాయి. అయితే దేహభ్రాంతి నుంచి బయటపడాలంటే జ్ఞానయోగాలనే అస్త్రాలు కావాలి. తనలోని నిజమైన స్వరూపాన్ని గుర్తుంచుకుని అంటే ఆత్మాభిమానంతో నిరంతరం పరమాత్ముని స్తుతిస్తూ జీవనం సాగిస్తే ఆత్మకు అష్టశక్తులు లభిస్తాయి. ఆ అష్టశక్తులే అమ్మవారి అష్టభుజాలు. అవి సంకీర్ణ శక్తి, సమీకరణ శక్తి, సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలనాశక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కునే శక్తి, సహనయోగ శక్తి. శివాత్మిక అయిన అమ్మవారిని ఆరాధించడం ఈ శక్తులు సిద్ధిస్తాయి. నవరాత్రుల్లో ఆ తల్లిని నిష్ఠగా సేవించి సద్గుణాలను పొందండి.



శరన్నవరాత్రుల్లో నవదుర్గలు


శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకార విశేషాలు.

శైలపుత్రి

శైలపుత్రీ నమోస్తుతే

శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు నంది వాహనంపై త్రిశూలం ధరించి, హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. ఈ రోజున భక్తి విశ్వాసాలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ దీవెనగా అందిస్తుంది.

నైవేద్యం: (శ్రీశైల సంప్రదాయం) కదంబం (సాంబారు అన్నం) మినపవడలు, గోధుమరవ్వ - చక్కెర పాయసం. బెల్లం, మిరియాలు, యాలకులతో పానకం.

నైవేద్యం: పులిహోర (చిత్రాన్నం)


పాహిమాం త్రిపుర సుందరీ
13-10-2015 21:43:36

‘‘హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌’’

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. త్రిశతీ పారాయణం చేస్తుంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.
నైవేద్యం: పాయసం




 శ్రీ గాయత్రీదేవి
గాయత్రీం భజే

‘‘ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌,
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే’’

సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రములకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది.
‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌’’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.

నైవేద్యం: అల్లపుగారెలు



అన్నపూర్ణాదేవి
అన్నపూర్ణే సదాపూజితే


‘‘ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.


దసరా ఉత్సవాలలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. శ్వేతవర్ణ పుష్పాలతో అమ్మను పూజించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
నైవేద్యం: దధ్యోదనం, కట్టెపొంగలి



శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి

నమామి లలితా

(ఆశ్వయుజ శుద్ధ పంచమి ఆదివారం రోజున)
‘‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌’’

త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో దర్శనమిస్తుంది. లక్ష్మీసరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువై ఉంటుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చెయ్యాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.
నైవేద్యం: అల్లం గారెలు


 శ్రీ సరస్వతీదేవి

సరస్వతీ నమస్తుభ్యం


(ఆశ్వయుజ శుద్ధ షష్టి, సోమవారం (మూలా నక్షత్రం) రోజున)

యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వసా్త్రన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట ప్రాముఖ్యం ఉంది. దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.

నైవేద్యం: దద్ధోజనం



 శ్రీ దుర్గాదేవి

పాహిమాం పరమేశ్వరీ


(ఆశ్వయుజ శుద్ధ సప్తమి, మంగళవారం రోజున)
‘‘సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే’’

దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయి. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకీ పారాయణం చేయాలి.

నైవేద్యం: కదంబం


శ్రీ మహిషాసురమర్దినీదేవి
జయజయహే మహిషాసురమర్దిని

(ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారం)
మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ
అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసురమర్దినీదేవిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

నైవేద్యం: బెల్లమన్నం, పులిహోర, గారెలు, వడపప్పు, పానకం



 శ్రీ రాజరాజేశ్వరీదేవి
రక్షమాం రాజరాజేశ్వరి

(ఆశ్వయుజ శుద్ధ దశమి, గురువారం)

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు ఈమె ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా అమ్మ పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.
నైవేద్యం: పరమాన్నం



పాహిమాం త్రిపుర సుందరీ
13-10-2015 21:43:36

‘‘హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌’’

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. త్రిశతీ పారాయణం చేస్తుంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.
నైవేద్యం: పాయసం
రేపటి అలంకారం: శ్రీ గాయత్రి దేవి