Sunday, 30 October 2016

మూడో అడుగు!

బలి చక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడి కొడుకు. మహాబలవంతుడు. జన్మరీత్యా రాక్షసుడైనప్పటికీ  సత్యం, దానం, ధర్మం అనే గుణాల వల్ల సత్ప్రవర్తనతో మహాదాతగా, గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే  రాక్షస సహజమైన ప్రవృత్తి వల్ల తన సవతి సోదరులైన దేవతలపై దండెత్తి, వారిని జయించి, నిర్దయగా వారిని వెళ్లగొట్టి, వారి రాజ్యాలను ఆక్రమించుకుని అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు. అంతటితో తృప్తి పడక ఇంద్రపదవిమీద కన్నేశాడు. ఇంద్రపదవి కావాలంటే బలపరాక్రమాలతోపాటు యజ్ఞయాగాదులు కూడా చేయాలని, నూరు అశ్వమేధయాగాలు చేస్తే ఇంద్రపదవి లభిస్తుందని రాక్షసుల గురువైన శుక్రాచార్యులవారి సూచన మేరకు 99 అశ్వమేధయాగాలు చేశాడు. మరొక్క మారు అశ్వమేధం చేస్తే చాలు ఇంద్రపదవి బలిచక్రవర్తి వశమౌతుంది. దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది. బలిచక్రవర్తి ఒక్కడూ మంచివాడు కావచ్చు కానీ మిగిలిన రాక్షసులు అలా కాదు కదా, తమ రాజు అండ చూసుకుని లోకాలన్నింటినీ నానాయాతనలకు గురి చేస్తారు కదా, మరి అప్పుడేం చేయాలి? అనుకుంటూ దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు.

 విష్ణువు ఇంద్రుడికి అభయమిచ్చాడు. దీనికితోడు రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతల తల్లి అదితి తన కుమారుల దీనస్థితికి తల్లడిల్లి, భర్త అయిన కశ్యపునితో మొరపెట్టుకుంది. కశ్యపుడు ఆమెకో దివ్యవ్రతాన్ని చెప్పి ఆచరింపజేశాడు. ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ఆమె కడుపున వామనుడై పుట్టాడు. బలి చక్రవర్తి నూరో అశ్వమేధయాగం చేస్తున్న సమయానికి ఆ యాగానికి వెళ్లాడు. బ్రహ్మతేజస్సుతో ముచ్చటగొలుపుతున్న ఆ బాల వటువును చూసిన బలిచక్రవర్తి ఏమికావాలో కోరుకోమన్నాడు.

మూడంటే మూడడుగుల చోటు కావాలన్నాడు వటువు. అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అబ్బురపడ్డ బలి చక్రవర్తి మరేదైనా కోరుకోమన్నాడు. తనకు మూడడుగుల చోటు తప్ప మరేదీ వద్దన్నాడు వామనుడు. ఆ బాల బ్రహ్మచారి కోరికకు అబ్బురపడుతూనే సరేనని అంగీకరించాడు బలి. అప్పుడు రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఆ వచ్చినవాడు సాక్షాత్తూ విష్ణువేనని, నీ రాజ్యాన్ని అపహరించి, నిన్ను పరాభవం చేయడానికే వచ్చాడని, కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం కాదని చెప్పి, ఆ దానకార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించాడు.

బలి అందుకు అంగీకరించలేదు. సాక్షాత్తూ విష్ణువే తనముందు వామనుడై చేతులు చాచి అర్థించడం, దానికి తాను సరేననడం తనకెంతో గర్వకారణమని అతిశయంతో అంటూ వామనుడడిగిన మూడడుగుల భూమిని ఇచ్చేందుకు దానపాత్ర చేత పుచ్చుకున్నాడు. కనీసం అప్పుడైనా ఆపుదామని శుక్రాచార్యుడు సూక్ష్మరూపంలో దానపాత్రలో ప్రవేశించి, దానినుంచి నీరు పడకుండా అడ్డుకున్నాడు. అప్పుడైనా అసలు విషయం గ్రహించని బలి అలాగే చూస్తుండి పోవడంతో వామనుడు పాత్రకు ఏదో అడ్డుపడిందంటూ తన చేతనున్న దర్భపుల్లతో పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడు కన్నుపోయి, ఒంటికంటివాడయ్యాడు. దానధార నే లమీద పడడంతోటే వామనుడు త్రివిక్రమరూపం ధరించి, నభోవీధివరకు వ్యాపించాడు. ఒక అడుగుతో నేలను, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసి, మూడో అడుగు ఎక్కడ వేయాలని అడిగాడు. బలి చక్రవర్తి తన శిరస్సు చూపడంతో, పాతాళానికి అణగదొక్కేశాడు. ఇక్కడ ఒక సందేహం తలెత్తవచ్చు. దానశీలిగా పేరుపొందిన బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కెయ్యడం ఎంతవరకు సమంజసమని...

బలి ఎంతో మంచివాడు, మరెంతో సత్యసంధుడు కావచ్చు, శౌర్యపరాక్రమాలలో ముల్లోకాలలోనూ ఎవరికీ సాటిలేనివాడు కావచ్చు. అయితే రాక్షసగుణాలు కలవాడు. దేవతలందరినీ జయించి, వారిని తరిమి కొట్టాడు. భవిష్యత్తులో ఇంద్రపదవి లభిస్తుందనే వరం ఉన్నప్పటికీ, ఇంద్రపదవిని చేజిక్కించుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేశాడు. అంతటితో తృప్తి చెందక భవిష్యత్తులో బ్రహ్మ కావడం కోసం రహస్యంగా అనేక యాగాలు చేశాడు. సాక్షాత్తూ విష్ణుమూర్తియే తన నుంచి దానం గ్రహిస్తున్నాడని అతిశయించాడు. అందుకే విష్ణువు వామనమూర్తిగా మారి అతని అహాన్ని పాతాళానికి తొక్కేశాడు. అయితే అతని మంచితనానికి, సత్యసంధతకు సంతోషించి, పాతాళలోకానికి చక్రవర్తిని చేశాడు. ఏడాదికోసారి అంటే దీపావళి అమావాస్య మరునాడు భూలోకానికి వచ్చి, తన ప్రజలను చూసేలా వరమిచ్చాడు. అదే బలిపాడ్యమి. ఎంతటి గొప్పవాడైనప్పటికీ అతని ఉన్నతిని అణచివేయడానికి అహం ఒక్కటీ ఉంటే చాలు అనేందుకు ఇదే ఉదాహరణ.
 - D.V.R.
 
Sakshi 

Saturday, 22 October 2016

బలరామ సత్యభామల గర్వభంగం!

ముక్కోపిగా, ముఖస్తుతికి లోబడే వ్యక్తిగా మహాభారతంలో కనిపించే బలరామునిలో తన శౌర్యపరాక్రమాలపై మితిమీరిన విశ్వాసం. 
కృష్ణుని ప్రియపత్నిగా పేరొందిన సత్యభామకు తన అందచందాలమీద ఎనలేని నమ్మకం. 
వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు శ్రీకృష్ణుడు సమయం కోసం ఎదురు చూస్తుండగా తగిన అవకాశం ఆంజనేయుడి రూపంలో రానే వచ్చింది.

త్రిలోక సంచారి అయిన నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ వెళ్తుండగా ఆ దాపులనే  రామనామాంకిత ధ్యానంలో మునిగిపోయి ఉన్న ఆంజనేయుడు కనిపించాడు.

నారదుడు కావాలనే శ్రీరామ స్మరణ చేశాడు. రామనామం వినగానే ఆంజనేయుడు పరుగున వచ్చి నారదుని ముందు వాలి, ‘‘ఓ రుషిపుంగవా, నా రామయ తండ్రి నామాన్ని స్మరిస్తున్నావంటే నీకు తప్పకుండా రామునితో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. నా స్వామిని చూసి చాలా కాలం అవుతోంది. ఒక్కసారి ఆయనను దర్శించుకోవాలని నా మనస్సు కొట్టుకులాడుతోంది. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’’ అంటూ అర్థించాడు.

‘‘ఓ వానరా! రాముణ్ని నేను చూసి కూడా చాలా కాలమయింది. అయితే రాముని కంటే అధిక శౌర్యపరాక్రమాలు కలవాడు, సీతమ్మకన్నా అందమైనదీ అయిన శ్రీకృష్ణ సత్యభామలు సమీపంలోనే ఉన్నారు. చూడాలనుంటే చెప్పు, తీసుకెళతాను’’ అన్నాడు.

‘‘ఏమిటీ, నా రామయ్య తండ్రి కన్నా బలమైనవాడు, సీతమ్మ తల్లికన్నా సౌశీల్యమైన  స్త్రీ మరొకరున్నారా? నన్నొకసారి అక్కడికి తీసుకెళ్లు. నేను చూసిన తర్వాత వారు అలా లేకపోవాలీ, నీ పని చెబుతాను’’ అంటూ నారదునితో కలసి ద్వారకను చేరాడు.

ఆంజనేయుడు బయటే ఉండి, ‘‘రామబంటునైన నేను అన్యుల మందిరానికి రాను. నీవే నీ కృష్ణుని ఇక్కడకు రమ్మను’’ అంటూ నారదుని లోనికి పంపించాడు. 

నారదుడు రాజప్రాసాదానికేగి, సత్యభామాసమేతంగా బలరాముడి చెంత ఆసీనుడైన గోపాలకృష్ణుని చూస్తూ ‘‘కృష్ణా! హనుమంతుడనే ఒక వానరాగ్రగణ్యుడు నీ దర్శనం కోసం ద్వారంలో వేచి ఉన్నాడు. అతడు మిమ్మల్నే తన కడకు రమ్మంటున్నాడు. ఒకవేళ రాకపోతే నీ మందిరాన్ని నాశనం చేసి, ద్వారకను సముద్రంలో ముంచేస్తానంటున్నాడు. నువ్వు త్వరగా పద, ఆ వానరాగ్రేసరుడిని దర్శించుకుందువు’’ అంటూ తొందర చేశాడు నారదుడు.

అహకారంలోనూ, మితిమీరిన ఆత్మాభిమానంలోనూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని సత్యభామ, బలరాములు వెంటనే అమితాగ్రహంతో ‘‘నారదా! ఒక వానరం వస్తే, వానిని చూడటానికి కృష్ణుడే స్వయంగా వెళ్లాలా? అలా రాకపోతే ఆ కోతి ద్వారకనే పెళ్లగించి సముద్రంలో పడేస్తుందా? ఏమిటీ వింత? ముందు నేనెళ్లి, వాడి సంగతి తేలుస్తాను’’ అంటూ తన హలాయుధాన్ని భుజానేసుకుని బయటికొచ్చాడు బలరాముడు.  అతణ్ణి అనుసరించబోయింది సత్యభామ.

బలరాముడు బయటకు వచ్చి, ఆంజనేయుణ్ణి చూసి, ‘‘ఓయీ, వృద్ధ వానరమా! నా తమ్ముడు కృష్ణుని చూడటానికి వచ్చి అతనినే బయటకు రమ్మంటున్నావా? నీకెంత అహంకారం? నువ్వు ద్వారకనే సముద్రంలో ముంచెయ్యగలిగేంత మొనగాడివా? ముందు నన్ను గెలువు, ఆ తర్వాత బతికుంటే చూద్దువుగాని’’ అంటూ దూసుకురాబోయిన బలరాముణ్ణి హనుమ తన తోకతో చుట్టి విసిరికొట్టబోతుండగా, నారదుడు ‘‘హనుమా! లోపల ఉన్నది రాముడే, ఈయన అతనికి ప్రియ సోదరుడు సుమీ’’ అంటూ హెచ్చరించాడు. 

హనుమ వెంటనే బలరాముణ్ణి తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని లోపలకు దారితీశాడు. ఈ లోగా కృష్ణుడు సత్యభామతో ‘‘భామా! నువ్వు సీతమ్మలా అలంకరించుకునిరా’’ అంటూ తాను రామునిలా రూపు మార్చుకున్నాడు.

ఈలోగా హనుమలోనికి రానే వచ్చాడు. వస్తూనే కృష్ణునికి నమస్కరించి, ‘‘ఎన్ని యుగాలయ్యింది స్వామీ నిన్ను చూసి?’’ అంటూ గాఢాలింగనం చేసుకుని, ‘‘నీ పక్కనే ఉన్న ఈమె ఎవరు స్వామీ ఎంతో వికారంగా ఉన్నా, ఇన్ని నగలు అలంకరించుకుని ఉంది? ఇంతకూ నా తల్లి సీతమ్మ ఎక్కడ’’ అంటూ ప్రశ్నించాడు.

సరిగ్గా అప్పుడే మందిరంలోనికి అతి సామాన్యమైన చీర, కట్టుబొట్టు... ప్రశాంతమైన ముఖం, పెదవులపై  చిరునగవే ఆభరణాలుగా ప్రవేశించిన రుక్మిణిని చూస్తూనే హనుమ ‘‘వచ్చావా సీతమ్మా’’ అంటూ చివాల్న ఆమె పాదాల మీద వాలిపోయాడు. 

హనుమ తోకతో చుట్టివేయడంతోనే ఒళ్లంతా ఉండచుట్టుకుపోయిన వీరాధివీరుడు, బలాఢ్యుడు అయిన బలరాముడు, అతిలోక సౌందర్యరాశి, ఐశ్వర్యవంతురాలు అయిన సత్యభామలు సిగ్గుతో తలలు వంచుకున్నారు.

Sunday, 16 October 2016

తారకాసురుడి మూర్ఖత్వం


పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేసి, చావులేకుండా ఉండే వరం కోరుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు, సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి, మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరేనన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించనటువంటి వరం కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే, శివుడి భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీవియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు.

అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి, తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట. సరేనన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కావడాన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబల తోడు కావడంతో తననెవరూ జయించలేరన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేనివిధంగా తయారయ్యాయి. వాడికి మిత్రుడైన శూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలనూ, మానవులనూ, మునులనూ, సాధుప్రాణులందరినీ నానా హింసలకూ గురిచేయసాగారు. దాంతో అందరూ కలసి బ్రహ్మదేవుడికి దగ్గరకెళ్లారు తమను ఆ దుష్టుడి నుంచి కాపాడమని.

ఆ రాక్షసుడి నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో! దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి, మనమందరం కలసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి. అప్పుడు మన పని సులువవుతుందన్నాడు. అందుకు సమర్థులెవరని వెతగ్గా, మన్మథుడు ముందుకొచ్చాడు. మన్మథుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ, లోకకల్యాణం కాబట్టి సరేనని ఒప్పుకుంది. సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామె. ఆమెకు చిన్నప్పటినుంచి శివుడంటే వల్లమాలిన భక్తి.

ఆ భక్తి కాస్తా ఆయన్ను పరిణయమాడాలనుకునేంతటి అనురక్తిగా మారింది. సాక్షాత్తూ పరమ శివుని పతిగా పొందాలంటే మాటలా మరి! అందుకే తపస్సు చేయడం మొదలెట్టింది. మన్మథుడి పని కాస్త సులువు చేసినట్లయింది. మహా వైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా, ఆయన తపస్తు చేసే ప్రదేశమంతా రోజూ చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టడం, ఆయన ఏమయినా తింటాడేమోనని పండ్లు తెచ్చి ముంగిట పెట్టడం.. ఇలా ఎంతకాలం గడిచినా, శివుడు కళ్లు తెరవనేలేదు కానీ, పార్వతి మాత్రం అన్నపానీయాలు మానేసి, కేవలం  పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది.

ఓరోజున మన్మథుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుని తోడు చేసుకుని, పూలబాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి, ఆయన కోపాగ్ని కీలల్లో బూడిదయ్యాడు. ఆ తర్వాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని పరిణయమాడడంతో, వారికి కుమారస్వామి జన్మించాడు. (కుమారస్వామి జనన వృత్తాంతం ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మరోసారి చెప్పుకుందాం). ఎప్పుడూ బాలుడిలా ఉంటాడు కాబట్టి, కుమారస్వామి అని, బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడనీ, కృత్తికా నక్షత్రాలు పాలివ్వగా ఆరుముఖాలతో పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడనీ, రెల్లుగడ్డిలో జన్మించిన కారణంగా శరవణ భవుడనీ, కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడన్న పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు.

అమిత బలపరాక్రమాలు, యుద్ధతంత్ర నైపుణ్యం కలిగిన బాలసుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యానికి అధిపతిగా నియమితుడయ్యాడు. ఏడోఏడు రానే వచ్చింది. అప్పుడు దేవతలు కుమారస్వామికి అతని జన్మకారణాన్ని తెలియజెప్పి, యుద్ధానికి సన్నద్ధుడిని చేశారు. అందుకోసమే ఎదురు చూస్తున్న కుమారస్వామి ఆశ్వయుజ బహుళ షష్ఠినాడు దేవతలందరినీ వెంటబెట్టుకెళ్ల్లి, తారకునిపై సమర శంఖం పూరించాడు. ఏడేళ్ల బాలుడు తననేమి చేయగలడన్న ధీమాతోనే కదా, తారకుడు అతడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావకుండా వరం కోరుకున్నాడు.

ఇప్పుడు కూడా అదే ధీమాను, నిర్లక్ష్యాన్ని వదులుకోలేదు. దాంతో ముందుగా శూరపద్ముడు, తర్వాత తారకుడు కుమారస్వామి వీరత్వం ముందు ఓడిపోయి, తర్వాత ప్రాణాలు కోల్పోక తప్పలేదు. ఆ విధంగా తారకాసురుడు మహా విరాగి అయిన శివుడికి కల్యాణం జరగదు, ఒకవేళ జరిగినా కొడుకులు పుట్టరు, పుట్టినా, ఏడేళ్లవాడవ్వాలి. ఏడేళ్లొచ్చినా, అంతటి పసివాడు తనను ఓడించలేడు అన్న అతి తెలివితో తన చావును తానే కొని తెచ్చుకున్నాడు.


Sunday, 9 October 2016

మహిషుని అహాన్ని అణచిన అమ్మ

పూర్వం మాహిష్మతి అనే గంధర్వకాంత ఇంద్రుడి శాపవశాన మహిషి అనే రాక్షసిగా జన్మించింది. ఆమె రంభుడు అనే రాక్షసుని వివాహమాడింది. వారికి మహిషుడనే కుమారుడు పుట్టాడు. పుట్టుకతోనే వాడు అమిత బలవంతుడయ్యాడు. అనతికాలంలోనే రాక్షస లక్షణాలను అలవరచుకున్నాడు. తన బలాన్ని మరింతగా పెంచుకోవాలనుకుని, బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా ఉండే వరం కోరుకున్నాడు.

బ్రహ్మ అందుకు అంగీకరించకపోవడంతో స్త్రీలంటే అతి చులకన భావం గల మహిషుడు శరీర నిర్మాణరీత్యా బలహీనంగా ఉండే స్త్రీ తనను ఏమీ చేయలేదనే ధీమాతో, స్త్రీ చేత తప్ప తాను ఎవరిచేతిలోనూ చావకుండా ఉండే వరం కోరుకున్నాడు.ఆ వరమదంతో దేవతలను, మునులను, మానవులను వాడు పెట్టే హింసకు అంతులేకుండా పోయింది. దేవతలు, మునులు కలిసి వాడి బారి నుంచి తమను రక్షించమని వైకుంఠనాథుడిని వేడుకున్నారు.

అందుకు విష్ణువు చిరునవ్వు నవ్వి, పురుషులమైన మనమెవ్వరమూ వాడిని సంహరించలేము. తానూ, తన సైన్యమూ కూడా ఆడవారి చేతిలో తప్ప మరణించనటువంటి వరం పొందాడు అంటూ సాలోచనగా చూశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చూపులు కలవడంతో వారి దృక్కుల నుండి ఒక కాంతిపుంజం జనించింది. ఆ కాంతిపుంజం వైపు పార్వతి, లక్ష్మి, సరస్వతి చూశారు. వారి చూపుల నుంచి కూడా ఒక కాంతిపుంజం వెలువడింది.

ఏమి జరుగుతోందా అన్న కుతూహలంతో దేవతలందరూ కలసి ఆ కాంతిపుంజాలవైపు చూడగా, వారి వారి ఆకారాలకు, తేజస్సుకు తగ్గట్టు లెక్కలేనన్ని వెలుగు కిరణాలు వెలువడి అన్నీ కలిసి ఒకటిగా మారాయి. ఆ విధంగా సకల దేవతల తేజోపుంజాలూ కలసి వాటినుంచి అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ మూర్తి ఉద్భవించింది. ఆమెకు దేవతలంతా కలసి సమస్త సంపదలనూ, ఆయుధాలనూ ఇచ్చారు. అమ్మ ఆ ఆయుధాలను ధరించి, సర్వశక్తులతో, తేజస్సుతో కూడి, మదగర్వితుడైన ఆ రాక్షసుని మీదికి దండయాత్రకు వెళ్ళింది.

ఆమెను చూసిన మహిషుడు ‘ఓ సుందరీ, ఎవరు నువ్వు? ఎక్కడినుంచి వచ్చావు? ఎంత అందంగా ఉన్నావు?’ అనడిగాడు.

నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అంటుంది అమ్మ.

ఆమె మాటలకు వికటంగా నవ్విన మహిషుడు ‘‘ఇంత అందంగా, సుకుమారంగా ఉన్న నీతో యుద్ధం చేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు. నన్ను పెళ్లి చేసుకుని నా అంతఃపుర కాంతగా ఉండు’’ అన్నాడు అహంకారంతో.

అందుకు అమ్మవారు సమ్మతించకపోవడంతో ఒక అబలవైన నీతో యుద్ధం చేయడానికి నేనెందుకు, నా అనుచరుడున్నాడు చాలు’’ అంటూ భండాసురుడిని పంపాడు.

అమ్మవారు తాను కూడా తొమ్మిదేళ్ల బాలికగా రూపు మార్చుకుని, శ్యామలాదేవిని సైన్యాధిపతిగా చేసుకుని భండాసురుని అవలీలగా చేధించింది. ఆ తర్వాత చండిగా, చాముండిగా చండాసురుని, ముండాసురుని సంహరించింది. నెత్తురు చుక్క నేల రాలితే వేలాదిమంది రాక్షసులను పుట్టించే లక్షణం గల రక్తబీజుడనే రాక్షసుని కాళికగా మారి, వాడి నెత్తురు నేలరాలకుండా రుధిర పానం చేసింది. ఆ విధంగా తొమ్మిదిరోజులపాటు ఆ రాక్షసుడు పంపిన అనుచర గణాలనందరినీ దునుమాడడంతో, విధిలేక తానే వచ్చాడు మహిషుడు.

అప్పుడు అమ్మ, సింహవాహనారూఢియై, వీరవిహారం చేసి దున్నపోతు రూపంలో ఉన్న ఆ రాక్షసుని నేలమీద పడవేసి, కాళ్లతో మట్టగించి చంపేసింది. ఆడది అబల, ఆమె తననేమీ చేయలేదన్న మహిషుని అహాన్ని ఆ విధంగా ఆదిపరాశక్తిగా మారి, అణచి వేసింది అమ్మ దుర్గమ్మ.

Sakshi