Friday, 23 November 2018

మండోదరి








నిత్య సుమంగళి మండోదరి


మయాసురుడనే రాక్షసుడు గొప్పశిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంట పడుతుంది. మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అయితే, ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి,  ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడసాగాడు. ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది.  రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయేముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కాని ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి.

యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే, శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తూ విష్ణువు అవతారమని గ్రహించి, స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరికి వితంతువు అయే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

Tuesday, 13 November 2018

దివ్వెల పండుగ దీపావళి








దివ్వెల పండుగ దీపావళి



సంబరాల దీపాల పండుగ, దీపావళి. ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది, దీపతోరణాలతో గృహాన్ని అలంకరించి, లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానిస్తూ, బాణాసంచాతో సంబరంగా జరుపుకునే ఐదు రోజుల పండుగ ఇది. నవ్యకాంతుల పర్వదినం. ఆనందాల వెలుగులను విరజి మ్ముతూ, ఉత్తేజాన్ని నింపే సంతోష సంరంభం. ఈరోజున భారతావనిలో ప్రతీ ఇల్లూ దీపపు కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతుంది. దీపావళిని పురస్కరించుకుని, ఆ పర్వదిన విశిష్టత తెలుసుకుందాం.

వెలుగుల పండుగ 'దీపావళి' నాడు ప్రతీ ఇల్లూ ఆనంద కాంతుల నిల యమే. ఇంటిని నూతనంగా అలంకరించి, కొత్త వస్త్రాలు ధరించి, లక్ష్మీపూజతో ఆ జ్ఞాన, సిరుల తల్లి శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు, ఆహ్వానిస్తారు. సాయంత్రం వేళ చిరు చిరు దివ్వెలు వెలుగులు పంచుతాయి. తారాజువ్వలు పైపైకి లేస్తాయి. కాకరపువ్వొత్తులు జిగేల్మంటాయి. ముఖాల్లో మతాబుల వెలు గులు నిండుతాయి. టపాసుల శబ్దాలు జీవితంలో నిండిన నిశ్శబ్దాన్ని పారదో లుతాయి. కేరింతలు కొట్టేలా మనస్సును ఉల్లాసపరుస్తాయి. అందుకే దీపావళి వస్తోందంటేనే పిల్లలకు సంబరం, పెద్దలకు ఉత్సాహం, ఉత్తేజం.

ఐదు రోజుల సంరంభం జీవితంలోని అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకునే సంతోషాల వేడుక దీపావళి. సాధారణంగా దీపావళి అంటే ఒక్కరోజు పండుగ అనుకుంటారు. కానీ నిజానికి దీపావళి ఐదు రోజుల పండుగ. ధన త్రయోదశితో ప్రారంభమై, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినీ హస్తభోజనంతో ముగుస్తుంది.

ధనత్రయోదశి
దీపావళి ఐదు రోజుల సంబరాలు ధన త్రయోదశితో మొదలవుతాయి. ఈ రోజున ధనాధి దేవత లక్ష్మీదేవిని, ధన్వంతరిని, ధనాధిపతి కుబే రుణ్ణి, పూజిస్తారు. సుఖ సంతోషాలు, సిరిసంపదలు ప్రసాదించమని ప్రార్థిస్తారు. దీనికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కథలో ఈ రోజున, అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడే పాలకడలి నుంచి శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఆమెను ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించాడు శ్రీమహావిష్ణువు. అందుకే ఆ రోజున ధనాధిదేవత లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని విశ్వాసం. అందుకే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజున బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా వస్తోంది.

నరక చతుర్దశి
రెండవరోజు నరక చతురశి. లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్ళనూ, వాకిళ్ళనూ అలంకరించి పూజలు చేస్తారు. ఉదయాన్నే ఇల్లంతా కడిగి, ఇంటి ముంగిట రంగవల్లులు దిద్దుతారు. ఆ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వులనూనెతో తలంటుకొని స్నానం చేయాలి. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలిచక్ర వర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.

దీపావళి
అమావాస్య మూడవరోజు దీపావళి జరుపుకుంటారు. ఈరోజు దరిద్ర దేవతను వెళ్ళ గొట్టేందుకు శ్రీమహాలక్ష్మిని పూజించాలి. సిరిసంపదలనొసంగమని, సుఖసంతోషాలను అందివ్వమని ప్రార్థిస్తారు. సాయంత్రం వేళ లక్ష్మీపూజ నిర్వహించి, ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, దీపాలతో అలంకరిస్తారు. ఆ తరువాత ఆనందంగా బాణాసంచా కాలుస్తూ, నింగిని వెలుగులతో నింపుతారు. ఇలా ఏ ఇల్లయితే దీపాల వెలుగులతో కాంతులు విరజిమ్ముతుందో ఆ ఇంట సిరుల నిచ్చే శ్రీమహాలక్ష్మి అడుగు పెడుతుందని నమ్మకం.

బలిపాడ్యమి
దీపావళి మర్నాడు నాలుగోరోజు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమ్మీదికి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈరోజును 'నవదివస్'గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే.

భగినీ హస్తభోజనం
దీపావళి ఐదో రోజు వేడుకను యమద్వితీయ, భాయిదూజ్గా జరుపు కుంటారు. ఈరోజు అన్నదమ్ములు తమ అక్కచెల్లెళ్ళ చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సూర్యభగవానుని కుమారుడు యముడు. కూతురు యమున. యమున తన సోదరుణ్ణి ఎంతో అభిమానించేది. తన ఇంట్లో విందుచేసి పొమ్మని యమున ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక వెళ్ళలేకపోయాడు యముడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వా నించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ప్రతి ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం అద్దం పడుతుంది.

ఇలా ఐదు రోజుల పండుగగా దీపావళిని భారతావని మొత్తం నూతనోత్సాహంతో జరుపుకుంటుంది. ఆరోజున బంధువులు, స్నేహితుల ఇళ్ళకు వెళ్ళడం, మిఠా యిలు పంచుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. అలాగే దీపావళినాడు నూతన గృహోపకరణాలు కొనడం చేస్తారు. రంగురంగుల, విభిన్న దీపాలతో, తోరణాలతో ఇంటిని అలంకరించుకుంటారు. నూతన వస్త్రాల కొనుగోళ్ళు జరుగుతాయి. ఇక బాణాసంచా సంగతి చెప్పనే అక్కరలేదు. పరిస్థి తులకనుగుణంగా, తాహతుకు తగ్గట్టుగా బాణాసంచా కొనుగోళ్ళు జరుగుతాయి. అయితే ఈ బాణాసంచా కాల్చడం వల్ల శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం పెరిగిపోతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు బాణాసంచాపై ఖర్చుపెడుతున్నారు. అందుకే కాలుష్యాన్ని నివారించడానికి సుప్రీంకోర్టు బాణాసంచా కాల్చడం పై పరిమితులు విధించింది. ఆ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని, హరిత దీపావళి జరుపుకోవాలని, బాంబులు కాల్చ కూడదని ఆంక్షలు విధించింది.

వీటిని పాటిస్తే ఆరోగ్యకర, ఆనందాల దీపావళి మీ ఇంట సిరులతోపాటు, ఆరోగ్యాన్నీ, ఉల్లాసాన్నీ పంచుతుంది. కాబట్టి దీపాల వెలుగులతో మీ ఇంటిని నందనవనంగా మార్చే దీపావళిని ఆనందంగా జరుపుకోండి. హ్యాపీ దీపావళి!


దీపాల కథలెన్నో...

దీపావళి అంటే దీపాల వరుస. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. అయితే దీపావళి ప్రాశస్త్యం గురించి, దీపావళి జరుపుకోవడానికి గల కారణాల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీకృష్ణపరమాత్మ సత్యభామా సమేతంగా గావించిన నరకాసుర వధ గాథను దీపావళి జరుపుకోవడానికి ముఖ్య కారణంగా చెబుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు.
 రాముడు రావణుణ్ణి సంహరించి, సీతా, లక్ష్మణుల సహా అయోధ్యకు విచ్చేస్తున్న శుభసందర్భంలో, ఆ రోజు అమావాస్య కావడంతో అయోధ్యావాసులు శ్రీరామునికి స్వాగతం పలికేందుకు దీపాలను వెలిగించి, అమావాస్య చీకట్లను పారదోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను జరుపుకుంటున్నట్టుగా చెబుతారు.
పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని, తమ రాజ్యానికి తిరిగివచ్చిన శుభసందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అప్పటినుంచి అదే ఆనవాయితీగా వస్తూ దీపాల పండుగను జరుపుకుంటున్నారనేది దీపావళి నేపథ్యంగా చెబుతారు.
అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగ చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆనందోల్లాసాలతో దీపాలు వెలిగించి, బాణా సంచాతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.



వివిధ దేశాల్లో...


ఆనందానికి, సంతోషానికి, ఉత్సాహానికి సంకేతం వెలుగు, కాంతి. మనస్సులోని బాధ, దుఃఖం వంటి చీకట్లను పారదోలి జీవితంలో వెలుగులను నింపుకోవడమే ఆనంద దీపావళి. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల్లో, తమ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ దీపాలు వెలిగిస్తుంటారు. దీపాల పండుగలు జరుపుకుంటారు. ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుకోవడా నికి వెలుగుదివ్వెల తారాజువ్వలతో నింగిని తేజోవంతం చేస్తారు. మరి వెలుగుల పండుగను జరుపుకునే కొన్ని దేశాల గురించి తెలుసుకుందామా!

జపాన్
తోరో నాగోషి పేరుతో దీపాల పండుగను నిర్వహిస్తారు. ముఖ్యంగా మూడు రోజుల పండుగ ఇది. బోట్లలో దీపాలను వదులుతారు. బంధువులు, స్నేహితులు బహుమతులు, స్వీట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు.

నేపాల్
నేపాల్లో 'తిహార్ పేరుతో దీపాల పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా ఇది ఐదు రోజులు పండుగ. ఒక్కోరోజుకు ఒక్కో విశిష్ట ప్రాధాన్యం ఉంది. మొదటిరోజు ఆవులను పూజిస్తారు. ఆరోజున లక్ష్మీదేవి ఆవుల్లో కొలువై ఉంటుందని నమ్మిక. అందుకే ఆ రోజున ఆవులను పూజించి, వాటికి ఆహారం అందిస్తారు. రెండోరోజు కుక్కల కోసం. ఆరోజు వాటికి ప్రత్యేక ఆహారం తయారుచేసి అందిస్తారు. మూడవరోజు సిరిసంపదల వృద్దికి, శ్రేయస్సుకు లక్ష్మీదేవిని ఆరాధించి, దీపాలతో ఇళ్ళను అలంకరిస్తారు. తినుబండారాలు ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. అలాగే నాలుగో రోజు యముడిని పూజి స్తారు. ఐదోరోజు భాయిదూజ్ జరుపుకుంటారు.

మలేసియా
మలేసియా హిందువులు 'హరి దీవాలీ' పేరుతో దీపావళి జరుపుకుంటారు. పండుగ రోజు సూర్యాస్తమయం కాకముందే తైలాభ్యంగనం (ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి, శనగపిండితో స్నానం చేయడం. ఇలాంటి స్నానంతో మన చర్మంలోని ప్రతి స్వేదరంధ్రమూ శుభ్రపడుతుంది.) చేసి, నూతన వస్త్రాలు ధరించి, దేవాలయాలకు వెళతారు. ఇళ్ళు వీధులు ప్రత్యేకంగా దీపకాంతులతో వెలిగిపోతుంటాయి.

థాయిలాండ్
ఇక్కడ 'లాయ్ క్రేథాంగ్' పేరుతో దీపావళి సంబరాలు సాగుతాయి. కాక పోతే మనం అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటే థాయిలాండ్ ప్రజలు మాత్రం థాయ్ క్యాలెండర్ ప్రకారం పున్నమి రోజున జరుపుకుంటారు. ఆ రోజున బాణాసంచా కాలుస్తారు. హాట్ ఎయిర్ బెలూన్స్లో దీపాలు ఉంచి నింగిలోకి వదులుతారు. ఇక్కడ దీపాల్ని వెలిగించడం పవిత్రకార్యంగా భావిస్తారు. బాణాసంచాను కాలుస్తారు.

బర్మా
ఇక్కడ 'అంగేజుల పండుగ అన్న పేరుతో దీపావళిని జరుపుకుంటారు. దీన్నే 'తంగజు' అని కూడా అంటారు.

ఇవేకాక చైనా, ఆస్ట్రేలియా, ఫిజి, మారిషస్, ఇండోనేసియా వంటి దేశాల్లో కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.

-నర్మద వాసిరెడ్డి


Wednesday, 7 November 2018

దీపావళి



ఆ వెలుగు నీదే!
దీపావళి అంటే అభ్యంగన స్నానాలు ఆచరించడమేనా?
దీపావళి అంటే సాయం సంధ్య వేళ దివ్వెలు వెలిగించడమేనా?
దీపావళి అంటే దిక్కులు మార్మోగేలా టపాసులు కాల్చడమేనా?
కాదు... అంతకు మించి... దీపావళి ఎన్నో అంతరార్థాలతో కూడిన పండగ...
ఈ రోజు విరబూసే ప్రతి వెలుగూ అంతరంగాన్ని వెలిగించాలి.
కొత్త ‘నిన్ను’ ఆవిష్కరించాలి... జీవితాన్ని దేదీప్యమానం చేయాలి...
దీపావళి వెలుగులు మనిషిని నిర్వచించాలి. మనిషిలోని రాక్షస ప్రవృత్తికి నిదర్శనమైన నరకాసురుని వధించినప్పుడు అది దీపావళి. దురహంకారానికి ప్రతీక అయిన బలి తలను పాతాళానికి అణచి వేసినప్పుడు... అజ్ఞానం మటుమాయమై జ్ఞానం విరజిమ్మినప్పుడు వెలుగుల పండగ ఆవిష్కృతమైంది. అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం, మూర్ఖత్వంపై వివేకం, చెడుపై మంచి పై చేయి సాధించడమే నిజమైన తిమిర సంహారం.  మనిషిని పునర్‌నిర్వచించే మధుర క్షణాలు అవే. మానవత్వాన్ని పునర్నిర్మించే మూల పదార్థాలూ అవే. చీకటిని తొలగించడం అనే మాటకు  నిజమైన అర్థం కూడా అదే. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటుంది వేదం... చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించు అని దీని అర్థం... చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు. చిన్న దివ్వెను వెలిగించిచూడు అనే అమృత ప్రబోధమే దీపావళి ఆంతర్యం. చీకటిని దుఃఖానికి, వెలుగును సంతోషానికి ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవి రెండూ తప్పవు. దుఃఖాన్ని జయించి, ఆనందాన్ని సాధించాలన్న మనిషి యత్నానికి దీపావళి  ఓ సంకేతం.
‘అమృత భావనలు అన్ని దిక్కుల నుంచి మనిషిని ఆవరించుగాక’ అని ఉపనిషత్తులు ఆకాంక్షించాయి. లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలంటూ దీవించాయి. ఆ లోకోత్తర భావనలు ఎప్పుడు సాకారం అవుతాయో, ఆ శుభాకాంక్షలు ఎప్పుడు ఫలిస్తాయో, ‘లోకమంతా ఒక్క ఇల్లై...’ అన్న కవుల భావనలు ఎప్పుడు నిజం అవుతాయో అదే నిజమైన దీపావళి. పురాణగాథలు చెప్పే పరమ సత్యం ఇదే. మన పూర్వీకులు ప్రతీకలుగా అందించిన ఆకర్షణీయమైన కథల సారాంశం అదే. అంతర్గత శబ్ద కాలుష్యానికి దూరంగా, దురాలోచనలకు అతీతంగా, అభ్యుదయ పథంలో మనిషి అడుగిడినప్పుడు లోకంలో దీపావళి నిత్యోత్సవమై విలసిల్లుతుంది. దీపోత్సవమై ప్రకాశిస్తుంది. అమృతోత్సవమై అలరారుతుంది. అప్పుడు మనిషి తిరిగి జన్మిస్తాడు. మనిషితనం తిరిగి నిర్వచింపబడుతుంది. ఆధునిక యుగంలో దీపావళి గురించి ఆలోచించాల్సిన సరికొత్త కోణమిది. మానవీయ దృక్పథమిది. పురాణగాథలు మనకందిస్తున్న సందేశమిది. ప్రాచీన, జానపద గాథల్లోని అంతరార్థాలు మనిషికి నేర్పుతున్న పాఠాలివి. ఆలోచనల కాలుష్యం నుంచి మనిషి బయటపడినప్పడు ఆనందం గుండె తలుపు తడుతుంది.  ధియో యో నః ప్రచోదయాత్‌... సరికొత్త ఆలోచనలు మొలకెత్తడానికి ఈ వెలుగులు దారి చూపుగాక. ఆధునిక మానవుడు అద్భుతమైన అభ్యుదయ భావాలతో ఈ లోకాన్ని వెలిగించాలి. రాబోయే తరాల ఆదర్శాలకు వెలుగు పంచాలి. ప్రాచీన రుషులు, ఆధునిక శాస్త్రవేత్తలు కన్న కలలకు, పడ్డ తపనలకు మనిషి సమాధానం కావాలి. అప్పుడే ఈ జనానికి ఆనంద దీపావళి.

నరక చతుర్దశి రోజు పితృ లోకాల్లోని మన పెద్దల్ని తలచుకుని వారి పేరిట ఒక్కొక్క దీపాన్ని వెలిగించి వారిని స్వర్గానికి తీసుకెళ్లమని ప్రార్థించాలి. ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ పితృదేవతలను తలచుకుంటే ఆ వెలుగులే వారి స్వర్గ పథానికి దారి దీపాలవుతాయని చెబుతారు. చతుర్దశి నుంచి మూడు రోజులు ప్రదోష కాలంలో మనోహర దీపాలను దేవాలయ ప్రాంగణంలో, మఠాల్లో, ప్రాకారాల్లో, గోశాలల్లో, వీధుల్లో వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. త్రయోదశి నాటి సాయంత్రం యమ దీపం పెట్టడం, దీపావళినాడు సాయంత్రం వేళలో దీపారాధన, పాడ్యమినాడు దారికోసం గడ్డి బొమ్మలను కట్టడం... వీటిని మార్గపాళీ బంధం అంటారు. అందుకే ఆరోజును ప్రేత చతుర్దశి అని కూడా అంటారు.
దీపావళి రోజు బాణసంచా కాల్చడం ఆచారంగా వస్తోంది. మహాలయ పక్షంలో భూలోకానికి కవ్య భోజనానికి వచ్చిన పితృదేవతలు స్వర్గానికి తిరిగి వెళ్లేటప్పుడు దీపాలు, బాణసంచా వెలుగులు వారికి దారి చూపుతాయని భావిస్తారు. అలక్ష్మి, దారిద్య్రం తొలగిపోవాలని దీపావళి నాటి రాత్రి వివిధ వాద్యాలను మోగించేవారు. ఆ వాద్యాలు తర్వాత టపాసులుగా మారాయని చెబుతారు.  ఇప్పటికీ పల్లెల్లో జొన్న చొప్పను, నువ్వుల కట్టెను కాల్చి జనాన్ని మధ్యలో నిలబెట్టి వారి చుట్టూ తిప్పుతారు. ఇందులో ఓ అగ్ని సంస్కారం ఉంది.  వర్షాకాలంలో అనేక రకాల సూక్ష్మ క్రిములు వాతావరణంలో ఉంటాయి. వాటిని చంపడం ఈ బాణసంచా ఉద్దేశంగా భావిస్తారు.
లక్ష్మీదేవి కాంతికి, ఆనందానికి అభ్యుదయానికి ప్రతీక. కాబట్టే దీపాల పండగను ప్రజలు లక్ష్మీ ఉత్సవంగా పిలిచేవారని ఆంధ్రుల సాహిత్య చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకునే సంప్రదాయం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. ఆ రోజు మహాలక్ష్మి భూలోకంలోనే ఉంటుందని, ఇంటింటికీ తిరుగుతూ ఉంటుందన్న నమ్మకంతో తెల్లవార్లూ లక్ష్మీ  ఆరాధన చేస్తారు. స్తోత్రాలు, భజనలు, నామ సంకీర్తనం, పురాణ శ్రవణాలతో అమ్మ కృప కోసం ప్రయత్నిస్తారు. గుజరాతీలు ఆ రోజు వాహిపూజ పేరుతో తమ ఖాతా పుస్తకాలను పూజిస్తారు. ఆరోజు వారి ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్లు భావిస్తారు.
దీపావళి పండగను సాధారణంగా నరకాసురుడి సంహారం జరిగిన రోజుగా భావిస్తారు. భూమి పుత్రుడైన నరకుడు దేవతల సింహాసనాన్ని ఆక్రమించి, ఎందరో స్త్రీలను చెరబట్టాడు. సత్యభామ సహకారంతో పరమాత్ముడు నరకుణ్ణి సంహరించిన రోజు లోకాలన్నీ చేసుకున్న పండగే దీపావళిగా ప్రాసశ్త్యంలో ఉంది. ‘నరకుడనేవాడు ఎక్కడో నక్కి లేడు మనసులో చిమ్మచీకటి మసలు చోట వానికున్నది ఉనికి..’ అని మన కవులు వర్ణించారు. ఆ చీకటికి జ్ఞానకాంతులే విరుగుడు. అదే దీపావళి అంతరార్థం  ఆధ్యాత్మికంగా నరకాసుర సంహారాన్ని మరోరకంగా వర్ణిస్తారు. నరక శబ్దానికి దుర్గతి అని అర్థం కూడా ఉంది. దాని నుంచి బయటపడవేసే చతుర్దశి ఇదేనని నమ్ముతారు. నరకమంటే కష్టం. దుఃఖం అని కూడా చెబుతారు. ఈ కష్టాలు, దుఃఖాలు తద్వారా కలిగే దుర్గతి నుంచి మానవులను ఉద్ధరించే చతుర్దశి దీపావళి. కృష్ణుడనేవాడు జ్ఞానానికి, సత్యభామ వివేకానికి సంకేతాలు. వాటి సాయంతో అజ్ఞానమనే నరకుణ్ణి నిర్మూలించడం మానవుల కర్తవ్యం. దాన్ని ప్రబోధించడమే దీపాల పండగ విశేషం.
ఐదు రోజుల దీపావళి.. ఒక్కోరోజు ఇలా.....

దీపావళిని ఆశ్వయుజ మాసాంతంలో వచ్చే అమావాస్యనాడు చేసుకుంటాం. దీన్ని అయిదు రోజుల పాటు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమావాస్యతో పాటు, ముందు, వెనక రెండు రోజులూ దీపావళి పర్వదినోత్సవంలో భాగాలే. ఆ అయిదు రోజుల్లో చేసుకునే వేడుకలన్నిట్లో అర్థం, పరమార్థం కనిపిస్తాయి. మానవ జీవితం మంగళకరం కావాలని, లోకానికి శ్రేయోదాయకంగా మారాలని ఇవి సూచిస్తాయి.
1వ రోజు
అమావాస్యకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని చేసుకుంటారు. ధన్‌తేరస్‌ అని పిలిచే ఈ పండగనాడు దీపాలు వెలిగించి, లక్ష్మీ దేవిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు సంపద వృద్ధి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలు భువికి దిగివచ్చే రోజుగా కూడా భావిస్తారు కాబట్టి వారికి దారి చూపేందుకు ఆ పవిత్ర దినాన ఇంటిముందు దీపాలు వెలిగించడం ఓ సంప్రదాయమైంది.
2వ రోజు
లోకకంటకుడైన నరకాసురుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు యుద్ధరంగానికి వెళ్లాడు. ఆమె సహకారంతో రాక్షస వధ చేశాడు. ఆ రోజు నరక చతుర్దశిగా నిలిచిపోయింది.
3వ రోజు
అమావాస్యనాడు వచ్చే దీపావళి పండగ రోజు ఇంటింటా దీపాలు వెలుగుతాయి. నరకాసుర వధకు సంతోషంగా టపాసులు కాల్చుతారు. వ్యాపార సముదాయాలు, నివాస గృహాల్లోకి లక్ష్మీ దేవి అడుగు పెడుతుందని నమ్మే ప్రజలు రాత్రి వేళల్లో ఆమె రాక కోసం తలుపులు తెరిచి ఉంచుతారు.
4వ రోజు
దీపావళి తరువాత రోజు బలిపాడ్యమి. ఆ రోజు మహా విష్ణువు వామనావతారం ధరించాడని, బలి చక్రవర్తి అహంకారం అణచాడని నమ్ముతారు. అంతేకాకుండా ఆ రోజే బలికి పాతాళ లోకపు ఆధిపత్యం కూడా లభించింది. అందుకే బలిపాడ్యమిని పర్వదినంగా చేసుకుంటారు.
5వ రోజు
చివరి రోజు యమద్వితీయగా నిర్వహిస్తారు. ఆరోజు సోదరి చేతి వంట తిని, ఆమెకు కానుకలివ్వడం ఆనవాయితీ.
- ఎర్రాప్రగడ రామకృష్ణ
























ఆనందాలను ఆహ్వనించే దీపావళి!

ఆనందాలను ఆహ్వనించే దీపావళి!

Tue,November 6, 2018 10:14 PM
దీపం వెలుగు మన ఒక్క ఇంటినే కాదు.. మన ఇంటికి స్థానమిచ్చిన సమస్త ప్రపంచాన్నీ వెలుగులతో నింపుతుంది.అలాంటి ఉదాత్త భావన, మహోన్నత ఆలోచన సర్వమాన సౌభ్రాతృత్వానికి ఆస్కారమిస్తూ జరుపుకొనేదే దీపావళి పండుగ. జీవితాలను ఆనందమయం చేసే దీపాల వెలుగు మానవత్వ దివ్యత్వాల సమాహారం.

సంస్కృతీ సౌరభాలు దీపాల కాంతితో కలగలిసి మానవీయ చరిత్రను పదికాలల పాటు శోభిల్లేలా చేస్తాయి. అంధకారాన్ని తరిమేసి వెలుగులు నింపితేనే జీవితం ఆనందమయంగా ఉంటుందనే తత్వానికి కూడా దీపావళి పర్వం సంకేతం.

దీపాల పండుగ
పంచ భూతాత్మక సృష్టికి ప్రతీక దీపం. దీప కాంతి జ్ఞానానికీ, శుభానికీ, శాంతికీ సంకేతమనే ఆర్య భావనా సంస్కృతి మనది. పర్యావరణహితంగా పూలు, రంగవల్లులు వాటి నడుమ వెలిగే అందమైన దీపాలు మనలో ఆనందాలు నింపే అసలైన వెలుగులు. ఒక చిన్న దీపం గదిలోని చీకటినంతటినీ తరిమేస్తుంది. అలాంటిది మంచి మనసుతో బంధాల అమరికతో ఒదిగిన కుటుంబమంతా కలిసి దీపాల వరుసను పేర్చి దీప జ్యోతిని ఆరాధిస్తే ఇల్లంతా నిజ కాంతితో వెలిగిపోతుంది. దీపారాధన భారతీయులకు నిత్య సమారాధన. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దేవుడి ముందు దీపాలను వెలిగించి అంతా మంచే జరుగాలని కోరుకుంటాం. ఏదైనా మంచి పనిని మొదలు పెట్టేముందు జ్యోతి ప్రజ్వలనం చేసి నిరాటంకంగా అనుకున్న పని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తాం. అలాగే దీపావళి రోజు ప్రపంచంలోని చెడంతా నశించి మంచితో నిండిపోవాలని వెలిగించే దీపాలు జీవిత వెలుగులకు సంకేతాలు.

అనుబంధాల వేదిక
ప్రతీ మనిషి బంధాలను కోరుకుంటాడు. మనకంటూ నలుగురున్నారన్న భరోసా ఇచ్చే వేదికలు పండుగలు. బంధాలను భద్రపరుస్తూ, అనుబంధాలను మాధుర్యంగా మలిచే వేదిక దీపావళి. దీపాలంకరణ, మనసుల నిండా భక్తిభావం, పిల్లల కేరింతలు, పెద్దల కాలక్షేపాలు, పిండి వంటలు, సంప్రదాయాలు, అతిథులు, సంస్కారాల కలయికలు దీపావళిని మరింత వైభవోపేతంగా మార్చేస్తుంటాయి. బంధాలు బలహీనపడితే, మనుషుల మధ్య మనస్పర్థలు వస్తే దీపావళిలాంటి వేదిక ఒక్కటి చాలు. అందమైన చిరునవ్వుతో ఆప్యాయంగా ఇంటికి వచ్చిన బంధువులనూ, అతిథులనూ చక్కగా పలకరిస్తే చాలు. అన్నీ సమసిపోయి ఆనందాలు వెల్లివిరుస్తాయి. సత్యం నుంచి సత్యంలోకి, చీకటి నుంచి వెలుగులోకి, మృత్యువులోంచి అమర్వతంలోకి నడిపించమనే వేదవాక్కు దీపావళి పండుగలో ఒప్పారే దివ్య సందేశంగా విరాజిల్లుతూ మన జీవితాలను వెలుగులమయం చేయాలని ఆకాంక్షిద్దాం.

మహాలక్ష్మి ఆరాధన
దివ్వెల పండుగ దీపావళి పర్వదినం శ్రీమహాలక్ష్మి ఆరాధనకు శుభసంరంభం. త్రయోదశినాడు దీపాలు వెలిగించి, స్నానాలు చేసి, నరక చతుర్దశినాడు ఉత్తరేణి కొమ్మలతో దిష్టి తీయించుకొని ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు అంటే దీపావళి నాడు కొత్త బట్టలు కట్టుకొని, ఇల్లంతా దీపాలతో అలంకరించి శ్రీమహాలక్ష్మిని.. సిరికి సంకేతమైన వెండిని, బంగారాన్ని విశేషంగా పూజించి ఆనందభరితంగా జరుపుకొనే దీపావళి అందరినీ ఒకటిగా చేసే సార్వత్రిక పర్వదినం.
- ఇట్టేడు అర్కనందనాదేవి

ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి?


ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి?

* ఆలయం అంటే పరమాత్ముని నిలయం. ఈ శరీరం ఆలయం చుట్టూ తిరగడమే ప్రదక్షిణం. గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మనసును దైవంపై నిలపాలి. ఈ ప్రపంచమంతా పరమాత్మకు ఆలయమనీ, భగవంతుడు సర్వాంతర్యామి అనీ వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. దైవం అంతటా ఉన్నాడన్న భావనతో మనం వేసే ప్రతి అడుగూ ప్రదక్షిణమే అవుతుందని ఆదిశంకరులు ప్రబోధించారు.

* గుళ్లో ప్రదక్షిణ విషయానికి వస్తే.. ప్రధాన ఆలయానికీ, ఉప ఆలయాలకూ కలిపి ఒకేసారి ప్రదక్షిణం చేయవచ్చు. ఎందుకంటే వివిధ ఆలయాల్లో, వివిధ రూపాలతో కొలువై ఉన్నా.. పరమాత్ముడు ఒక్కడే! ఈ సత్యాన్ని గుర్తించి అన్ని ఆలయాలకు కలిపి ఒకేసారి ప్రదక్షిణం చేయవచ్చు.

* ఆగమశాస్త్రం ప్రకారం మూలవిరాట్టులోని దైవీశక్తి ఉత్సవ విగ్రహం, పాదుకలు, ధ్వజస్తంభం, అర్చకునిలో కొలువై ఉంటుంది. కాబట్టి.. ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణ చేయాలని పెద్దల మాట.

* ఇన్ని ప్రదక్షిణలు చేయాలన్న నియమం ఎక్కడా లేదు.  సంఖ్య కన్నా ఎంత శుద్ధితో ప్రదక్షిణలు చేశామన్నదే ముఖ్యం. మనస్సు సత్వ, రజో, తామస గుణాలతో సమ్మిళితమై ఉంటుంది. త్రిగుణాలతో కూడిన మనస్సును, మన సంకల్పాలను దైవానికి సమర్పించడమే ప్రదక్షిణలోని ఆంతర్యం. కనుక మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు. ఎక్కువ చేస్తే తప్పేమీ కాదు. సరి, బేసి పట్టింపులూ అవసరం లేదు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

త్రిశంకువు

త్రిశంకువు

Sun,October 28, 2018 01:57 AM
Trishanku
స్వర్గంలో ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గానికి రావడం ధర్మవిరుద్ధమనీ, అయినా శాపంతో వచ్చిన నీకు ఎట్టి పరిస్థితులలోనూ స్వర్గంలో స్థానంలేదనీ త్రిశంకువును తిరిగి భూమ్మీదకు తలకిందులుగా వెళ్ళమని ఆదేశిస్తాడు. పట్టుదలతో మనిషి ఏదైనా సాధించగలడనేది ఎంత వాస్తవమో, మొండిపట్టు మాత్రం జీవితాలను అల్లకల్లోలం చేస్తుందనేది అంతే వాస్తవం. మనం ఏ పని చేసినా నలుగురూ మెచ్చేదై ఉండాలి. ఆ పని వల్ల ఎవరూ లాభపడకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరూ నొచ్చుకోకూడదు. పట్టుదల ఉన్నతమైన జీవితాన్ని నిర్దేశించాలే కానీ జీవితధర్మాన్నే మార్చేయకూడదు. కానీ కొన్నిసార్లు పట్టుదలతో, స్వీయకృషితో అద్భుత ఫలితాలు లభిస్తే, మరికొన్నిసార్లు మొండిపట్టు అవమానభారంతో ఎలాగైనా చేసి తీరాలనే కసితో తలపెట్టే పనులు కూడా అద్భుతాలై నిలుస్తాయి. ఆ క్రమంలో అసహనతలూ, అవమానాలూ, అనాలోచిత నిర్ణయాలూ మనపై, మనం చేసే పనిపై ప్రభావం చూపించి మనల్ని మరింత కుంగదీసే ప్రయత్నం చేస్తాయి. అందుకనే మొండిపట్టుతో ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచించి ముందడుగు వేయాలి. ప్రపంచం ఏమనుకున్నా తట్టుకునే తెగింపుకావాలి. ఒక్కోసారి మొండిపట్టు కూడా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందనే నిరూపణకు ప్రతీకగా నిలువాలి. అటువంటి నిరూపణకు నిదర్శనమే త్రిశంకువు. బొందితో స్వర్గానికి పోవాలనేదే అతని పట్టుదల. కానీ తన పేరుతో మారు స్వర్గాన్ని చరిత్రకు పరిచయం చేసిన చరితార్థుడు త్రిశంకువు.


సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడే త్రిశంకువు. ఈతని తండ్రి త్రిధన్యుడు. సత్యవ్రతుని భార్య సత్యరథ. ఇతని కొడుకే హరిశ్చంద్రుడు. సత్యవ్రతునికి మనసులో మూడుసార్లు కలిగిన చెడు తలంపులకూ, వాటి ఆచరణకూ గాను వశిష్ఠుడు అతన్ని త్రిశంకుడవు అయినావని అంటాడు. అలా త్రిశంకువుగానే ప్రపంచానికి పరిచయం అయ్యాడు.త్రిశంకువు సూర్యవంశంలో పుట్టిన సత్యవాదే అయినా తండ్రి కోపానికి గురై రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్తాడు. తనకు ప్రాణాలతోనే స్వర్గానికి వెళ్ళాలనుందనీ, తన ఆకాంక్షను ఎలాగైనా నెరవేర్చాలనీ కులగురువైన వశిష్ఠునీ అడుగుతాడు. లోక విరుద్ధమైన పనిని నేనెప్పుడూ ప్రోత్సహించనని నిరాకరిస్తాడు వశిష్ఠుడు. త్రిశంకువు అంతటితో వదులక వశిష్ఠుని నూరుగురు పుత్రులనూ కలిసి తన ఆకాంక్షను చెప్పి ఎలాగైనా నెరవేర్చుమని పట్టుబడతాడు. తమ తండ్రి కాదన్న పనిని మేమెలా చేస్తామని అంటారు వశిష్ఠ పుత్రులు.

త్రిశంకువు కోపంతో గురువూ తిరస్కరించాడు. గురుపుత్రులూ కాదన్నారు. ఇక మా వంశానికి మరో గురువును చూసుకుంటానని అంటాడు. నీ అర్థం లేని కోరిక కోసం అనాదిగా వస్తున్న వశిష్ఠ పౌరోహిత్యం నీ వంశానికి వద్దంటావా! నీ అహంకారంతో వశిష్ఠులవారినే అవమానిస్తావా? అని వశిష్ఠ పుత్రులు తిశ్రంకువును చండాలుడివి కమ్మని శపిస్తారు. అలా మారిన త్రిశంకువును అందరూ దూరం పెడుతారు. అయినా పట్టువదలక విశ్వామిత్రుని దగ్గరకు వెళతాడు. సూర్యవంశపు రాజుకు ఏమిటి దుస్థితని ప్రశ్నించిన విశ్వామిత్రునికి తన కోరికనూ, జరిగిన విషయాన్నీ వివరించి ఎలాగైనా నన్ను బొందితో స్వర్గానికి పంపించమని అర్థిస్తాడు త్రిశంకువు.

శబల అనే కామధేనువు విషయంలో వశిష్ఠునికీ, విశ్వామిత్రునికీ మనస్పర్థలు వచ్చాయి. వశిష్ఠుడు కాదన్నాడు కనుక త్రిశంకువు కోరికను నేను తప్పక నేరవేరుస్తానని ప్రతిన బూని తన పిల్లలను పిలిచి యజ్ఞానికి ఏర్పాట్లు చేయమనీ, మహాపండితులను ఆహ్వానించుకొని రమ్మని పురమాయిస్తాడు. త్రిశంకువు మొండిపట్టు, విశ్వామిత్రునికీ అంటుకుంది. తన తపఃశ్శక్తినంతా ధారపోసి త్రిశంకువును స్వర్గానికి పంపిస్తాడు. అక్కడ స్వర్గంలో ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గానికి రావడం ధర్మవిరుద్ధమనీ, అయినా శాపంతో వచ్చిన నీకు ఎట్టి పరిస్థితులలోనూ స్వర్గంలో స్థానంలేదనీ త్రిశంకువును తిరిగి భూమ్మీదకు తలకిందులుగా వెళ్ళమని ఆదేశిస్తాడు. అలా వస్తున్న త్రిశంకువును మధ్యలోనే ఆపి విశ్వామిత్రుడు ఇంద్రునితో చర్చించి, స్వర్గానికి పంపడం సాధ్యపడదనేసరికి త్రిశంకువు ఉన్న చోటనే మరో స్వర్గం నిర్మింపజేస్తాడు. స్వర్గంలోనివన్నీ సృష్టించిన విశ్వామిత్రుడు ఎక్కడ మరో ఇంద్రున్ని సృష్టిస్తాడనే భయంతో దేవతలు, కేవలం త్రిశంకువు కోసం లోకవిరుద్ధంగా చేయడం సరైనది కాదని వారిస్తారు. కానీ తానిచ్చిన మాట ప్రకారం తాను సృష్టి చేసిన స్వర్గం త్రిశంకు స్వర్గమై అలానే నిలిచిపోతుందనీ తలకిందులుగా అయినా సరే, త్రిశంకువు స్వర్గంలోనే ఉండిపోతాడని దీవిస్తాడు.

త్రిశంకువు తన పట్టుదల కోసం జీవితం అంతా తపించాడు. రాజ్యాన్నీ వదిలేశాడు, శాపానికి గురైనాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసేలా విశ్వామిత్రున్ని ప్రేరేపించాడు. అద్భుత దేవలోక నిర్మాణానికి మూల కారణమైనాడు. దేవతలతో సమానమైన కాంతిని పొందగలిగాడు. మొండిపట్టుతోనైనా అనుకున్నది సాధించి కృతార్థుడైనాడు. త్రిశంకువు తన తండ్రి రాజ్యంలో కరువు ఏర్పడి భయంకరపరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వామిత్రుని కుటుంబం ఆదరణ కోల్పోయింది. ఆ కుటుంబాన్ని కొంతకాలం పాటు అహర్నిశలూ శ్రమించి పోషించాడు త్రిశంకువు. ఆ కృతజ్ఞతా భావమే విశ్వామిత్రున్ని త్రిశంకువు కోసం అంతటి అద్భుతం చేయడానికి ప్రేరేపించింది. త్రిశంకువులా పట్టుదల స్వీయ శ్రేయస్సుకోసమే అయినా, లోకానికే వన్నెతెచ్చేలా పరిణమిస్తుంది. అందుకే లోకంలోని ప్రతీదీ ఎవరో ఒకరు పట్టుబట్టబట్టే సుసాధ్యాలయ్యాయనడానికి త్రిశంకువు గాథే తార్కాణం.

- ప్రమద్వర

భగినీహస్త భోజనమంటే..

భగినీహస్త భోజనమంటే..

యమ ద్వితీయ అంటే ఏమిటి?
ఆ రోజు అన్నదమ్ములు.. సోదరి ఇంట భోజనం చేయాలంటారు ఎందుకు?

దీపావళి పండగ తర్వాత రెండు రోజులకు వచ్చే కార్తీక శుద్ధ విదియను యమద్వితీయగా చేసుకుంటారు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పండగ. పురాణ కథలను అనుసరించి యముడికి ఒక సోదరి ఉన్నది. ఆమె పేరు యమి. సోదరి మనసులోని కూడని ఆలోచనలను పోగొట్టి యముడు ఆమెకు ధర్మాన్ని తెలియజెప్పిన రోజు ఇదేనని అంటారు.  ఆనాడు యముడు తన సోదరి ఇంట భోజనం చేశాడని కథ ప్రచారంలో ఉంది. నాటి నుంచి యమద్వితీయ పండగగా వాడుకలోకి వచ్చింది. ఆనాడు భగినీ (సోదరి)హస్త భోజనం ఒక ఆచారంగా స్థిరపడింది. అన్నదమ్ములు సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకొని.. అక్కడ భోజనం చేసే ఈ ఆచారం సామాజికంగా, కుటుంబపరంగా చాలా ప్రయోజనకరమైనది. తోడబుట్టిన వారి మధ్య అనుబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో.. సంవత్సరంలో ఒక్కనాడైనా సోదరి యోగక్షేమాలు విచారించాలని ఈ పండగ గుర్తు చేస్తోంది.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Saturday, 3 November 2018

దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపలక్ష్మీ నమోస్తుతే!

'దీపానికి హైందవ సంప్రదాయంలో విశేష స్థానం ఉంది. సకలదేవతలూ దీపంలోనే నిక్షిప్తమై ఉంటారన్నది శాస్త్రవచనం. త్రిసంధ్యలూ దీపాన్ని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయని చెబుతారు. దీపం జ్ఞానానికీ, సంపదకూ, శాంతికీ ప్రతీకగా భావిస్తారు. మనం చేయాలనుకున్న పనులకు ప్రత్యక్ష సాక్షి కూడా దీపమే. వెలుగు కిరణాలతో చుట్టూ ఆధ్యాత్మిక భావనను నింపే దీపం విశిష్టతనూ దీపారాధనలోని పరమార్థాన్నీ తరచి చూస్తే...


దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైంది. అన్ని ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు. ముక్కోటి దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలీ, దీపారాధన సమయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలీ మొదలైన అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలు. సాధారణంగా మూడు అడ్డ వత్తులు లేదా బొడ్డు వత్తులను చేసి, ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు. ప్రత్యేక పూజలూ నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమలవత్తుల పేరుతో ఎనిమిది పోగులూ... ఇలా రకరకాలుగా వత్తులను వెలిగిస్తారు. సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని చదువుతారు.

‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్‌
భక్త్యా దీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్‌ ఘోరాత్‌ దివ్యర్యోతి ర్నమోస్తుతే’

‘మూడు వత్తులను తీసుకుని, తైలంలో తడిపి, అగ్నిని జతచేసి శుభప్రదమైన, మూడులోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను’ అని రోజూ దీపానికి నమస్కరిస్తాం. చిన్న దీపం పెట్టి ‘అది నా ఇంటినే కాదు ముల్లోకాల్లోనూ వెలుగు నింపాల’న్నది ఎంత గొప్ప భావన! మరెంతటి ఉదాత్తమైన ఆలోచన! దీపంలో ఉపయోగించిన మూడు వత్తులు ముల్లోకాలకీ, సత్వ రజ తమోగుణాలకూ, త్రిసంధ్యలకూ సంకేతంగా భావిస్తారు. పూజలో చేసే దీపారాధనకే కాదు సంధ్యా దీపానికీ ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది హైందవ సంప్రదాయం. లోకానికి వెలుగునీ తేజస్సునీ ప్రసాదించే సూర్యుడు జీవులమీద దయతో వారికి జీవాన్నీ, శక్తినీ ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సర్వప్రాణులకూ ప్రాణప్రదాత అయిన సూర్యుడి అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. తిరిగి సూర్యోదయం వరకూ దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగమే.

లక్ష్మికి ప్రతిరూపం
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం
దీపేన హరతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే!
దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే... కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్నదానికీ ఒక కథ ఉంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలూ కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడనీ అప్పటినుంచే లక్ష్మీ దేవి దీపలక్ష్మీదేవి అయిందనీ చెబుతారు. తమిళులు కూడా లక్ష్మీపూజ దీప స్తంభానికే నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు. జ్ఞానసముపార్జనకూ ఊర్ధ్వదృష్టికీ ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తాం, ప్రదక్షిణలు చేస్తాం, పండగలు చేసుకుంటాం. మరో కథనం ప్రకారం... దీపం సకలదేవతలకూ సాక్షీభూతమని చెబుతారు. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్నీ పూజిస్తారు. పూలూ అక్షతలూ జల్లుతారు, నైవేద్యం పెడతారు.

ఏ దేవుడికి ఎలా?
దేవీదేవతలనుబట్టి దీపారాధనను సమర్పించే విధానమూ మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి. ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి, దానిమీద వెండికుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సూ, సాత్విక మార్గంలో సంపాదనా పెరుగుతాయంటారు. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుడిని పూజించడం మాట అటుంచితే తలచుకోడానికి కూడా చాలా మంది భయపడతారు. అయితే మనలోని జీవశక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకుని అందులో నల్లనువ్వులు పోసి మూటకట్టి దాన్నే వత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే శనిదోషాలు తొలగిపోతాయంటారు.

కార్తిక దీపం
దీపం మనలోని తమస్సును పోగొడుతుంది. కాబట్టి ‘తమసోమా జ్యోతిర్గమయా!’ అని రుషులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తికమాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తిక మాసంఅగ్ని ఆరాధనకు ముఖ్యమైంది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మరూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని  దీపరూపంలో ఆరాధించడమంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మానికి కృతజ్ఞతలు చెప్పడమేకాదు సమస్త ప్రాణకోటికీ లబ్ధి చేకూర్చడమేనని చెబుతారు.
కీటాఃపతాంగాః మశకాశ్చవృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాహి విప్రాః
అంటే... కీటకాలూ పక్షులూ వృక్షాలూ జలచరాలపైన నేను వెలిగించిన దీపపు కాంతి ప్రసరించి వాటికి మోక్షాన్ని ప్రసాదించమని అర్థం. కేవలం నేనూ నా కోసం అనే స్వార్థ చింతనకు తావులేని కార్తిక దీపం వల్ల ప్రకృతిలోని ప్రతిపాణీ తరిస్తుందన్న భావన ఎంత గొప్పదో కదా!
కార్తిక పురాణం ప్రకారం... కార్తిక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడనీ, వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తిక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడనీచెబుతారు. కార్తిక మాసం మొత్తం రెండు సంధ్యల్లోనూ దీపారాధన చేస్తుంటారు. అయితే ఇందులో సాయం సంధ్యా దీపం మరింత విశిష్టమైంది. సాయంత్ర వేళల్లో శివాలయంలో కానీ, వైష్ణవాలయంలోకానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలోÅ, ధ్వజస్తంభం దగ్గర... ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరనివారు ఇంట్లో పూజామందిరంలో కానీ, తులసికోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. వీటితోపాటు రావి, ఉసిరి లాంటి దేవతావృక్షాల కింద, నదీ తీరాల్లో దీపారాధన చేసినా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట.
ఒక్కరోజైనా...
కార్తిక మాసమనే కాదు నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం. అలా నిత్యదీపారాధన కుదరకపోతే కార్తికమాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తిక సోమవారాలూ, శుద్ధ ద్వాదశీ, చతుర్దశీ, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని చెబుతారు.
ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తిక పౌర్ణమి రోజైనా 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు.
దీపాలూ రకాలూ
సాధారణంగా దీపాన్ని లేదా దీపారాధనను మూడు రకాలుగా చెబుతారు. ఇంట్లో చేసే నిత్య దీపారాధన, ఆలయాల్లో వెలిగించే అఖండ దీపారాధన, ఏదైనా పనిని ప్రారంభించేముందు నిర్వహించే జ్యోతిప్రజ్వలనం. వీటితోపాటు దీపారాధన చేసే ప్రదేశాన్ని బట్టి కూడా దీపానికి పేరు మారుతుంది. లక్ష్మీదేవి విగ్రహం ముందు వెలిగిస్తే లక్ష్మీదీపం అంటారు. అలాగే నిత్యపూజలో భాగంగా వెలిగించే దాన్ని అర్చనాదీపంగా పేర్కొంటారు. గర్భాలయాల్లోని దీపాన్ని నందాదీపమనీ, తులసికోట దగ్గర చేస్తే బృందావన దీపమనీ చెబుతారు. పారాయణల్లో లేదా ఏదైనా దైవసంబంధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ముందుగా వెలిగించే దీపాన్ని అఖండదీపమంటారు. ఈ దీపం, తలపెట్టిన కార్యక్రమం పూర్తయ్యేవరకూ వెలుగుతూనే ఉంటుంది. ధ్వజస్తంభం మీద వెలిగించే దీపమే ఆకాశదీపం. సాధారణంగా కార్తిక మాసం నెలరోజులూ శివాలయాల్లో దీన్ని తప్పక వెలిగిస్తారు. మరీ చిన్నచిన్న ప్రమిదల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తే నిరంజన దీపావళి అనీ, కార్తిక పౌర్ణమిరోజున తోరణం మాదిరిగా వెలిగించే దీపాన్ని జ్వాలాతోరణమనీ పేర్కొంటారు.
దీప హారతులు
పూజ మొత్తం ముగిసిన తర్వాత మంగళహారతులు ఇవ్వడం పరిపాటి. హారతిని భక్తుడిలోని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. సాధారణంగా కర్పూర హారతినే ఇస్తూ ఉంటారు. అయితే దీపాన్నే హారతిగా సమర్పించే సంప్రదాయమూ కొన్ని కొన్ని దేవాలయాల్లో మనకి కనిపిస్తుంది. దేవుడికి ఎన్ని దీపాలతో హారతి ఇవ్వాలి, అలా ఇచ్చేవాటిని ఏమని పిలుస్తారన్న విషయాలను వేదాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకటి నుంచి 251 వరకూ వత్తులతో సమర్పించే ఈ హారతులకూ ఒక్కో పేరు ఉండటం విశేషం. అసలు దీపహారతిని సమర్పించే పళ్లెమే దైవస్వరూపంగా పేర్కొంటారు. ఆ పళ్లెం పై భాగం అగ్నికీ, పిడి భాగం ఈశ్వరుడికీ, అడుగు భాగం ప్రజాపతికీ ప్రతిరూపాలుగా చెబుతారు. ఒకే ఒక దీపంతో ఇచ్చే హారతిని ఏకహారతనీ, రెండు ఉంటే ద్విహారతనీ... వత్తుల సంఖ్యను బట్టీ హారతి పేర్లు కూడా మారిపోతుంటాయి. దీప హారతిని ఇచ్చే పళ్లాలను దీపపు సెమ్మెలు అంటారు. వీటిలో కూడా పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారంలో ఉంటే రథ దీపమనీ, కొండ - మేరు దీపమనీ, కుండ - కుంభదీపం... ఇలా అనేక రకాల దీపపు సెమ్మెలకు అనేక రకాల పేర్లున్నాయి. అలాగే దీపపు సెమ్మెల సంఖ్యను బట్టీ, ఆకారాన్ని బట్టీ ఈ దీపహారతులకు మహేశ్వరుడు, త్రిమూర్తులూ, పంచభూతాలూ, సప్తరుషులు, అష్టమూర్తులూ... మొదలైనవారిని ఆయా దీపాలకు అధిదేవతలుగా పేర్కొన్నారు.
దీప దానం
‘ఏక సర్వదానేని దీపదానం తదేకథః’ అంటే... ప్రపంచంలోని అన్ని దానాల్లో దీపదానమే శ్రేష్ఠమైందని భావం. అందుకే హైందవ సంప్రదాయంలో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారో దీపదానానికీ అంతే విశిష్టమైన స్థానాన్ని కల్పించారు. కార్తికమాసంలో చేసే దీపదానం వల్ల పద్దెనిమిది రకాలైన ఫలితాలు వస్తాయంటారు. జ్యోతిర్లింగాలను సందర్శిస్తే కలిగే ఫలితమే దీపం దానం చేసినా లభిస్తుందన్నది ఆర్యోక్తి. మనలోని అజ్ఞానపు చీకట్లను పోగొట్టడమే కాకుండా జ్ఞానజ్యోతులను పంచే ఈ దీపదానం చేయడానికి క్షీరాబ్ది ఏకాదశి, ద్వాదశి, కార్తిక పౌర్ణమి రోజులు అనుకూలమైనవిగా చెబుతారు. సాధారణంగా ఉసిరి కాయమీద బొడ్డు వత్తి వెలిగించిన దీపాన్ని దానమిస్తారు. దీంతో పాటు వెండి ప్రమిదలో బంగారు వత్తివేసి, దక్షిణతాంబూలాలతో సహా దానమివ్వడం పరిపాటి. మరికొన్ని నోముల్లో వ్రతాల్లో బియ్యం పిండి లేదా గోధుమపిండితో దీపాన్ని తయారుచేసి, దాన్ని ఆవునేతితో నింపి జ్యోతులు వెలిగించి వాటిని ముత్తయిదువులకు దానంగా అందిస్తారు. పూజలైనా దానమైనా ఉన్నది నలుగురితో పంచుకోవడమనే గొప్ప భావన వీటిలో దాగుంది.
* * * * * * * * * *
పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే!
ఎన్ని వత్తులు..?
దీపారాధన చేసే సమయంలో ఇన్ని వత్తులే వేయాలన్న నియమం ఏదీ స్పష్టంగా లేదు. రెండు వత్తులకు తగ్గకుండా తమ శక్తిమేరకు ఎన్ని వత్తులనైనా వెలిగించుకోవచ్చు. నిత్య దీపారాధన చేసేవాళ్లు సాధారణంగా కుందిలో నాలుగు వత్తులను రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు. అయితే చేసే పూజను బట్టీ ఆచరించే నోమును బట్టీ వత్తుల సంఖ్య మారుతూ వస్తుంది. కుంది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలనుకునేవారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలంటారు. ఇలా ఎందుకు చెబుతారంటే - అన్ని భారాల్నీ భరించే భూమాత దీపం వేడిని భరించలేదట. అందుకే వేడి తగలకుండా రెండు ప్రమిదలను ఒకదానిమీద ఒకటి ఉంచి వెలిగిస్తారు. ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే సర్వకార్యాల్లోనూ విజయం లభిస్తుందనీ, తూర్పు దిశగా పెడితే ఆరోగ్యమూ, మనశ్శాంతీ లభిస్తాయనీ నమ్మకం.
నిత్యదీపారాధనలో కాకుండా ఏ గుడిలోనో ఏ నదీప్రవాహం దగ్గరో విశేష దీపారాధన చేయాలనుకున్నవారికి వారి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని వత్తులు వెలిగించాలో శాస్త్రంలో సుస్పష్టంగా పేర్కొన్నారు.
మేష, కర్కాటక, ధనుస్సు రాశులు - 3 వత్తులు
వృషభ, కన్య, కుంభ రాశులు - 4 వత్తులు
సింహ, వృశ్చిక, మీన రాశులు - 5 వత్తులు
తులా రాశి - 6 వత్తులు
మిథున, మకర రాశులు - 7 వత్తులు

శివకేశవుల మాసం.. కార్తికం!

శివకేశవుల మాసం.. కార్తికం!



శివకేశవులకు ప్రీతికరమైన మాసం... ఆధ్యాత్మిక శోభను భావితరాలకు అందించే మాసం...  మనిషిని సంఘజీవిగా మలిచే మాసం... ఇలా చెప్పుకుంటూ పోతే కార్తిక మాసానికి ఎన్ని విశేషాలో. మనిషిగా వికసించడానికీ, ఆధ్యాత్మికంగా ఎదగడానికీ ఈ మాసం లోని ప్రతి తిథీ ఓ జీవనశైలి పాఠమే.
పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్లే ఈ నెలకు కార్తిక మాసం అని పేరు. శివకేశవులకు ఎలాంటి భేదం లేదని చెప్పడానికి ఈ మాసానికి మించిన ఉదాహరణ లేదు. కార్తిక సోమవారాలూ, మాసశివరాత్రులూ శివుడికి ప్రీతిపాత్రమైనవి అయితే, కార్తికంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవి. హరిహర మాసంగా పేర్కొనే ఈ మాసంలో కార్తిక స్నానం, దీపారాధన శ్రేష్ఠమైనవి. సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం చేసి, ఉసిరిచెట్టూ, రావిచెట్టూ లేదంటే తులసికోట దగ్గరో దీపం వెలిగించి, కార్తిక దామోదరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు. నిజానికి ఈ మాసంలోని ప్రతి తిథీ ప్రత్యేకమైందే ప్రతి రోజూ పండగే. వీటిలో కార్తిక పౌర్ణమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి మరింత ప్రత్యేకమైనవి.



కార్తిక పౌర్ణమి
కార్తికమాసం మొత్తానికీ పౌర్ణమి తలమానికంగా చెబుతారు. పూర్ణచంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుడి దర్శనం, అభిషేకాలూ అత్యంత శుభఫలితాలను ఇస్తాయంటారు. కార్తిక పౌర్ణమికి త్రిపురపౌర్ణమి అనే మరో పేరుంది. త్రిపురాసురులను శివుడు కార్తిక పౌర్ణమి రోజునే సంహరించడం వల్ల దీనికా పేరు వచ్చినట్టు పురాణ కథనం. తారకాసురుడికి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. తండ్రి మరణానంతరం దేవతలమీద ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సుచేశారు. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ అసురులు ‘రథంకాని రథం ఎక్కి విల్లుకాని విల్లుతో, నారికాని నారితో, బాణంకాని బాణాన్ని ఎక్కుపెట్టి ముగ్గుర్నీ ఒకేసారి కొట్టేవరకూ మాకు చావు రాకూడదు’ అని వరాన్ని కోరారు. విధాత అనుగ్రహించాడు. వరగర్వంతో వారు దేవతలనూ సాధువులనూ హింసించడం మొదలుపెట్టారు. ఆ అకృత్యాలు భరించలేని దేవతలు శివుడికి మొరపెట్టుకున్నారు. శివుడు త్రిపురాసురులను సంహరించటానికి సిద్ధం కాగా దేవతలందరూ శివుడికి సహకరించేందుకు ముందుకొచ్చారు. భూమి రథంగా, సూర్యచంద్రులు రథచక్రాలుగా, నాలుగువేదాలూ గుర్రాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా మారిన రథంమీద శివుడు యుద్ధానికి బయలుదేరుతాడు. మేరుపర్వతాన్ని విల్లుగా, ఆదిశేషువుని వింటినారిగా, మహావిష్ణువుని బాణంగా చేసుకుని పరమేశ్వరుడు ఆ రాక్షసులను అంతంచేశాడు. అందుకే కార్తిక పౌర్ణమి రోజున శివుడిని శుద్ధ జలాలతో అభిషేకించి, మారేడు దళాలతో, జిల్లేడు పూలతో అర్చించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయంటారు.



ఉత్తమమైంది ఉత్థాన ఏకాదశి
కార్తికంలో అత్యంత విశేషమైంది ఉత్థాన ఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుడి పాన్పుమీద ఆషాడ శుద్ధ ఏకాదశిరోజు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి రోజు కన్నులు విప్పి యోగనిద్రనుంచి మేల్కొన్న రోజునే ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజిస్తే యశస్సు, అపూర్వ వైభవాలు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి.

క్షీరాబ్ది ద్వాదశి
కార్తిక శుద్ధ ద్వాదశికే క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. పూర్వం దేవతలూ దానవులూ అమృతం కోసం ఈ ద్వాదశి రోజునే క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారట. ఈ కారణంగానే ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, మథన ద్వాదశి అని పేర్కొంటున్నారు. లక్ష్మీనారాయణులు ద్వాదశి నాడే బృందావనంలోకి ప్రవేశిస్తారని పురాణవచనం. అందువల్లనే ఈ రోజు తులసి పూజ చేస్తే సకలపాపాలూ హరిస్తాయని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీ కల్యాణం చేసే సంప్రదాయమూ కనిపిస్తుంది. విష్ణుమూర్తికి ప్రతీకగా ఉసిరి కొమ్మనూ లక్ష్మీదేవి నెలవైన తులసికోటలో ఉంచి లక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు.

సోమవారం ప్రత్యేకత

కార్తికంలో సోమవారానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పించారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. దేవతల్లో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల సోమవారాలకు మరింత విశిష్టత ఏర్పడింది. సోమ అంటే చంద్రుడు. శివుడి సిగలో వెలిగే చంద్రుని వారం కాబట్టి సోమవారం ఉపవాసానికి విశేష ఫలితం లభిస్తుందంటారు. వీటితోపాటు సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైందిగా పేర్కొంటారు. అందుకే భక్తులు కార్తిక మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహర మహాదేవ శంభో శంకర’ అంటూ స్తుతిస్తూ భక్తిసాగరంలో ఓలలాడతారు. కార్తిక మాసంలో ప్రతిరోజూ పరమపావనమైనదే కాబట్టి రోజంతా ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కైలాసవాసం సిద్ధిస్తుందన్నది శాస్త్రోక్తి. అలా నెలంతా చేయలేనివారు కనీసం కార్తిక సోమవారమైనా ఉపవాసం చేసి రాత్రి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణతాంబూలాలు ఇచ్చినా అంతే ఫలితం కలుగుతుందంటారు.

Friday, 2 November 2018

దీపావళి









తమోహరం... సంపత్ప్రదం!


దీపారాధన సనాతన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది. దీపం ప్రాధాన్యాన్ని ఋగ్వేదం ఎంతో గొప్పగా నిర్వచించింది. సృష్టి, స్థితి, లయాలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు. అందుకే -
‘‘దీపం పరంజ్యోతి కళాది నమో నమో
దీప మంగళ జ్యోతి నమో నమో
’’


‘పరంజ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభాలను ఇచ్చే దీపానికి నమస్కారం’ అని ప్రార్థిస్తాం.

‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే
ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌
’’
అన్నారు పూర్వ ఋషులు. అంటే ప్రబోధం అనే ప్రమిదలో, వైరాగ్యం అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.

నర(క) స్వభావం నశించి నారాయణత్వం
దీపావళికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నరకుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించగా, లోకాలన్నీ ఆనందంతో పండుగ చేసుకున్నాయనీ, ముల్లోకాలనూ చీకట్లలో నింపిన అసురుని మరణంతో తిరిగి వెలుగులను నింపి చీకట్లను తరిమేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా దీపాలను వెలిగించి, కాంతిని నింపారనీ ఒక కథనం.

నరకుని సంహారాన్ని లోతుగా పరిశీలిస్తే, అతనిలో నరతత్త్వం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రాగ్జ్యోతిషపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని అతను పరిపాలించేవాడు. అది నరకుని మనస్తత్త్వానికి దీటైనది. వెలుగు లేనిది. దుర్మార్గాలకు ఆలవాలమైనది. అరిషడ్వర్గాలనూ ఆసరాగా చేసుకొని, స్వార్థచింతనే పరమావధిగా భావించి అతను చేయని అకృత్యం లేదు. ద్వాపరంలో సత్యభామగా అవతరించిన భూదేవి తన కుమారుడి అకృత్యాలను చూడలేక... నరకుడిని వధించాలని తన పతి అయిన శ్రీకృష్ణుడిని కోరింది. నరక సంహారం జరిగింది.

చీకట్లు తొలగేయి. ప్రాగ్జ్యోతిషపురంలో శ్రీకృష్ణుని కారణంగా ఉదయకాంతులు వెల్లివిరిశాయి. ప్రజలందరూ ఆనంద హేలలో దీపాలను వెలిగించి దీపావళి చేసుకున్నారు. నారాయణుడిని నమ్మితే మనలోని నర(క) స్వభావాలు తొలగి, నారాయణత్వం సిద్ధిస్తుంది. దేహభావం నరకుడైతే, ఆత్మభావన నారాయణుడు. శరీరం తాను కాదనీ, అందులో ఉన్న క్షేత్రజ్ఞుడు (ఆత్మ) తాననీ తెలుసుకున్నప్పుడు పొందే అనుభూతే నరక సంహారం. ఇలా దీప ప్రజ్వలనాన్ని ప్రపంచంలో దాదాపు అన్ని మతాలవారూ సంప్రదాయబద్ధంగా ఆచరిస్తారు. సనాతన భారతీయ సంస్కృతికి సంకేతంగా నిలిచిన దీపారాధన - దీపావళి పర్వంగా ప్రాచుర్యం పొందింది.

లక్ష్మి స్థిరంగా ఉండేది అక్కడే!
ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన ‘హృదయా’న్ని ప్రమిదగా భావించి, అందులో ‘భక్తి’ అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.

కళ్ళలో కనిపించే వెలుగు దాని కాంతి. జ్ఞానాన్ని దీపకాంతిగా, అజ్ఞానాన్ని చీకటిగా సంభావించారు. దీపకాంతి బాహ్యంలో చీకట్లను తొలగించడమే కాక, ఆంతర్యంలో ఆధ్యాత్మికతకు బీజం వేస్తుంది. కాబట్టి ప్రతి ఇంటా ఉభయ సంధ్యలలో దీపాలు వెలిగించాలి. దీపకాంతులు విరజిమ్మే ఇంటిలో లక్ష్మిసుస్థిరంగా ఉంటుందనీ, ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనీ, అశుభాలకు తావు ఉండదనీ శాస్త్రాలు అంటున్నాయి. యజ్ఞరూపమైన దీపారాధనకూ, లక్ష్మీ కృప పొందేందుకూ దీపావళి దోహదకారి అయిన పర్వం. ప్రతి ఇంటి ముంగిట దీపావళి రోజున దీపాల వరుసలు ప్రసరించే వెలుగులు అమవస నిశిని పున్నమి వెన్నెలతో నింపుతాయి. ఎటు చూసినా ఆనంద హేల. ప్రతి ఒక్కరిలో సంతోషాల సంరంభం.

మన పురాణాల్లో... కావ్యాల్లో...
దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.

దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు. సంస్కృత కావ్యాల్లోనే కాదు, పాళీ భాషలో కూడా దీపావళి మహోత్సవ ప్రస్తావన ఉంది. కేవలం హిందువులేకాదు, జైన, బౌద్ధ మతానుయాయులు కూడా దీపావళి పండుగను పాటిస్తారు. క్రైస్తవ, మహమ్మదీయ మతస్థులు వారివారి ఆచార సంప్రదాయాలను అనుసరించి దీపాలను వెలిగించడం కద్దు.

ఎ. సీతారామారావు



అయిదు రోజులూ.... ఆనందావళి!


హిందువుల ప్రధాన పర్వదినాల్లో ఒకటైన దీపావళి అయిదు రోజుల పండుగ. ఈ వేడుకలు ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ప్రారంభమవుతాయి. కార్తిక శుద్ధ విదియతో ముగుస్తాయి. వీటిలో ఒక్కో రోజుకూ ఒక విశిష్టత, ఘనమైన పౌరాణిక నేపథ్యం ఉన్నాయి.

ధన త్రయోదశి
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ‘ధన త్రయోదశి’ అంటారు. దీన్ని సంపత్ప్రదాయకమైన రోజుగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే దినంగా పురాణాలు చెబుతున్నాయి. క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఇదేనని చెబుతారు. కాబట్టి ఈ రోజున లక్ష్మీ దేవినీ, ధనాధిపతి అయిన కుబేరుడినీ పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందంటారు. దీన్ని ‘కుబేర త్రయోదశి’, ‘ఐశ్వర్య త్రయోదశి’ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఈరోజును ‘ధన్‌ తేరస్‌’ అంటారు. ఈ రోజున బంగారం, వెండి కొంటే ఏడాది పొడుగునా లక్ష్మీదేవి ఇంట్లో కొలువవుతుందని విశ్వసిస్తారు. అంతేకాదు, పితృదేవతలు ఈ రోజున తమ వారసుల ఇళ్ళకు వస్తారనే నమ్మిక ఉంది.

లక్ష్మీదేవితో పాటు ఆరోగ్యానికి అధిపతి, ఆయుర్వేదానికి మూలపురుషుడు అయిన ధన్వంతరి కూడా క్షీరసాగరం నుంచి అమృత కలశాన్ని చేతబూని ఈ రోజే ఉద్భవించాడని పురాణాలు అంటున్నాయి. అందుకే దీన్ని ‘ధన్వంతరి త్రయోదశి’గా వ్యవహరిస్తారు. ఆయనను స్మరిస్తే ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు. ఈ రోజుకు ‘యమ త్రయోదశి’ అని మరో పేరు ఉంది. ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తారు. వాటిని ‘యమదీపాలు’ అంటారు. ఆ ఇలా దీపాలు వెలిగిస్తే యముడు ప్రసన్నుడవుతాడనీ, అకాల మృత్యువును నివారిస్తాడనీ పెద్దలు చెబుతారు.

నరక చతుర్దశి
లోకకంటకుడైన నరకాసురుని వధ జరిగిన రోజు కాబట్టి, ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటారు. నరకుని పీడ విరగడైనందుకు సంతోష సూచకంగా కొన్ని చోట్ల గడ్డి, తాకాలువంటి వాటితో నరకాసురుని బొమ్మలు తయారుచేసి దహనం చేస్తారు.

చతుర్దశ్యాంతు యే దీపాన్‌ నరకాయ దదంతి చ
తేషాం పితృగణాస్సర్వే నరకాత్‌ స్వర్గమాప్నుయాత్‌
నరక చతుర్దశి రోజున దీపాలను వెలిగిస్తే, నరకంలో ఉండే పితృదేవతలందరికీ స్వర్గ లోకం ప్రాప్తిస్తుందని భావం. మహాలయపక్షంలో తమ వారసులు సమర్పించే పిండదానాదులు స్వీకరించడానికి భూలోకానికివచ్చిన పితృదేవతలు తిరిగి వారి లోకాలకు ఈ రోజున బయలుదేరుతారట! వారికి దారి చూపుతూ దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది.

దీపావళి
ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజును దీపావళిగా ప్రజలు జరుపుకొంటారు. రాష్ట్రాల వారీగా సంప్రదాయాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఒకే స్థాయి ఉల్లాస, ఉత్సాహాలతో నిర్వహించే వేడుక ఇది. ఈ రోజు ఏ ఇంట దీపాలు వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందన్న విశ్వాసం ఉంది. అందుకే దీపాల వరుసలతో ఆమెకు స్వాగతం పలుకుతారు. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే, ఇంట ఆమె కొలువై ఉంటుందని నమ్మకం. సాయంత్రం లక్ష్మీరూపమైన తులసికోట ముందు ముందుగా దీపాలు వెలిగిస్తారు. తరువాత శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు. తరువాత పిల్లలూ, పెద్దలూ బాణాసంచా కాలుస్తూ దీపావళిని జరుపుకొంటారు.

బలి పాడ్యమి
కార్తిక మాసం తొలిరోజును... అంటే కార్తిక శుద్ధ పాడ్యమిని ‘బలి పాడ్యమి’ అంటారు. ప్రతి సంవత్సరం బలి పాడ్యమి రోజు సాయంత్రం తను పాలించిన భూలోకంలో ప్రజలు ఎలా ఉన్నారో చూసేందుకు బలి చక్రవర్తి పాతాళం నుంచి వస్తాడు. ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో, ముగ్గులతో, అలంకరణలతో వేడుకలు చేసుకోవడం చూసి, అతను ఆనందిస్తాడు. ఆ ఆనందం శాశ్వతం కావాలని కోరుకుంటూ తిరిగి వెళతాడు. పురాణాలు పేర్కొంటున్న కథ ఇది. ఈ రోజు ముగ్గు లేదా బియ్యంతో బలి చక్రవర్తి బొమ్మ తయారు చేసి, పూజించాలని పెద్దలు చెబుతారు. ఈ రోజు తప్పనిసరిగా దానం చేయాలనీ, అలా చేసిన వారికి తరగని సిరిసంపదలు లభిస్తాయనీ నమ్మకం. అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి నందగోకులాన్ని కాపాడిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు గోవర్ధన పూజ చేసే ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇంట్లో ఆవు పేడను కొండ ఆకారంలో తీర్చి, పూజిస్తారు. దానికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మథుర జిల్లాలో ఉన్న గోవర్ధన గిరి పరిక్రమను ఈ రోజుల్లో చెయ్యడం పవిత్రంగా భావిస్తారు. గోవర్ధన గిరి చుట్టూ సుమారు 23 కి.మీ. మేర సాగే ఈ పరిక్రమలో వేలాది భక్తులు పాల్గొంటారు. గుజరాతీయుల నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. వారు దీన్ని ‘బెస్తు వర్ష్‌’ అంటారు.

యమ ద్వితీయ
కార్తీక శుద్ధ విదియను ‘యమ విదియ’, ‘యమ ద్వితీయ’, ‘భాతృ విదియ’ అని అంటారు. యమధర్మరాజును ఆయన సోదరి యమీ (యమునా) దేవి ఈ రోజున ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చిందట. దానికి సంతృప్తుడైన యముడు ఈ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక బాధలు ఉండవని, అంతేకాకుండా వారి సౌభాగ్యం పెరుగుతుందనీ వరం ఇచ్చాడు. అలాగే సోదరి చేతి భోజనం చేసిన సోదరులకు అపమృత్యు దోషం ఉండదని చెప్పాడు. అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేస్తారు. దీన్నే ‘భగినీ హస్త భోజనం’ అని పిలుస్తారు. ఉత్తరాదిన ఈ రోజును ‘భాయ్‌ దూజ్‌’గా వ్యవహరిస్తారు.




ఎన్ని వత్తులు వాడాలి?


దీపావళి అంటేనే దీపాల పండుగ. సకల సంపదలనూ, సౌభాగ్యాన్నీ ప్రసాదించే శ్రీమహాలక్ష్మీ దేవికి వెలుగుల ద్వారా ఆహ్వానం పలికితే ఆమె కటాక్షం లభిస్తుందన్నది పెద్దల మాట. దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వులనూనె వినియోగించాలి. లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి పాల నుంచి ఉత్పత్తి అయిన నెయ్యి ఆమెకు ప్రీతికరం. అందుకని నెయ్యితో దీపాలు వెలిగించి, లక్ష్మీదేవిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని శాస్త్ర వచనం. దీపారాధనకు కొన్ని నియమాలున్నాయి. ఒకసారి వెలిగించిన వత్తిని మరోసారి వాడడం మంచిది కాదు. అలాగే ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించరాదంటారు. అగరువత్తులతోనో, అగ్గిపుల్లలతోనో దీపాన్ని వెలిగించాలి. కొవ్వొత్తుల వాడకం శ్రేష్ఠం కాదు.

మట్టి, వెండి, ఇత్తడి, పంచలోహాలతో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదల్లో దీపం పెడితే, ఒక ప్రమిద కింద మరో ప్రమిద పెట్టాలి. పూజ చేస్తున్నప్పుడు దీపం కొండెక్కిపోతే ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మళ్ళీ దీపం వెలిగించవచ్చు. దీపాల్లోని ముఖాలను బట్టి, అంటే వాటిలో పెట్టే వీలున్న వత్తుల సంఖ్యను బట్టి కూడా ఫలితాలు ఉంటాయంటోంది శాస్త్రం. దాని ప్రకారం, ఒకే వత్తి ఉండే ఏకముఖి దీపం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. రెండు వత్తుల ద్విముఖ దీపం కుటుంబ ఐక్యతకు దోహదం చేస్తుంది. మూడు వత్తుల త్రిముఖ దీపం ఉత్తమ సంతాన సౌభాగ్యాల్ని చేకూరుస్తుంది. చతుర్ముఖ దీపం పశుసంపదనూ, ధన సంపదనూ పెంచుతుంది. పంచముఖ దీపం సిరిసంపదలను వృద్ధి చేస్తుంది.