పూజలు, నోములు, వ్రతాలకు నెలవైన మాసం శ్రావణ మాసం. ఈ నెలలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. శ్రావణంలో జరుపుకునే ప్రతి నోముకూ ఓ విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మిక సాధనతో పాటు సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగి ఉన్నాయి. మానవ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందటమే శ్రావణ మాసపు వ్రతాల ప్రధాన ఉద్దేశం.
పౌర్ణమినాడుచంద్రుడు శ్రవణం నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ నెలలో వచ్చే శుక్రవారాలనే నోములకు, వ్రతాలకు కేటాయించడానికి ప్రత్యేక కారణం ఉంది. వేంకటేశ్వరస్వామి నక్షత్రం కూడా శ్రవణమే! కాబట్టి ఆయన భార్య లక్ష్మీదేవికి, సోదరి గౌరికి శ్రావణ శుక్రవారాల్లోనే ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. మిగతాకాలాలతో పోలిస్తే వర్షాకాలంలో శక్తి సన్నగిల్లుతుంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఈ కాలంలో తగినంత శక్తిని సముపార్జించుకోవాలని శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజిస్తారు.
నోముల మాసం..శ్రావణంలో ప్రధానంగా మంగళగౌరీవ్రతం, వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే ఏ మంగళవారంనాడైనా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పెళ్లికి ముందు నాలుగేళ్లు, పెళ్లి తర్వాత ఒక ఏడాదిపాటు జరుపుకుంటారు.
వరలక్ష్మీవ్రతం.. మాత్రం పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజున చేస్తారు. ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం ఐదోతనం కోసం, సంతానం కోసం జరుపుకుంటారు. ఇక వరలక్షీవ్రతాన్ని కుటుంబ సౌఖ్యం కోసం చేస్తారు. రెండు వ్రతాలు జరుపుకునే పద్ధతుల్లో, పాడే కథల్లో కూడా స్వల్ప వ్యత్యాసాలున్నాయి.
మంగళగౌరీ వ్రతం..ఈ వ్రతం చేసుకునే రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేయాలి. బెల్లం కలిపిన బియ్యంపిండితో ప్రమిదలు తయారుచేసి వాటిలో శ్రేష్టమైన ఆవు నెయ్యు పోసి పవిడి పత్తితో చేసిన ఒత్తులు వేసి వెలిగించాలి. ఈ దీపం నుంచి వెలువడే ధూపం సువాసనతో నిండి ఉంటుంది. ఇలా వెలిగే దీపం మీద ఇనుప కత్తి లేదా అట్లకాడను కదిలిస్తూ భర్త ఆయుర్దాయం కోసం నోములు నోచిన పతివ్రత కథను పాటగా పాడాలి. పాట పూర్తయ్యేలోపు కత్తికి దీపపు నుశి కాటుకలా అంటుకుంటుంది. ఈ కాటుకను వ్రతం జరుపుకునే సీ్త్ర తన కళ్లకు పెట్టుకోవాలి. తర్వాత ప్రమిదలు, ఒత్తితో సహా తినేయాలి.
వరలక్ష్మీ వ్రతం..ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి.. వీళ్లందరూ అష్టలక్ష్ములు. వరలక్ష్మి కటాక్షం పొందకుండా అష్టలక్ష్ములను ప్రసన్నం చేసుకున్నంత మాత్రాన జీవితంలో సంతృప్తి పొందలేం. అందుకే శ్రావణ మాసంలో మహిళలు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. వరలక్ష్మి సత్ప్రవర్తన కలిగిన వారిని వరిస్తుంది. అందుకే ఈ వ్రతాన్ని మంచి మనసున్న చారుమతి కథను పాటగా పాడుతూ జరుపుకుంటారు. వరలక్ష్మీవ్రతం రోజున పచ్చి బియ్యంపిండితో చలివిడి ఉండ్రాళ్లు చేసి వాయనంగా ఇస్తారు. 12 ఉండ్రాళ్లు అమ్మవారికి, 12 బ్రాహ్మణుడికి, 12 నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. వ్రతం ఆచరించిన మహిళ నైవేద్యంగా పెట్టిన 12 ఉండ్రాళ్లు తిని మిగిలినవి ముత్తయిదువులకు ఇస్తారు. తర్వాత ముత్తయిదువులందరికీ పూజ చేసి వాళ్లనే వరలక్ష్మి అమ్మవారిగా భావిస్తూ వాయనం సమర్పించుకుని దీవెనలందుకుంటారు. వాయనం ఇస్తున్నవారు ‘ఇచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ ఉంటే పుచ్చుకున్నవారు ‘పుచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ దీవిస్తారు.
ఆరోగ్య రహస్యాలు..వ్రతాలకు శ్రావణ మాసాన్ని ఎంచుకోవటంలోనే ఆరోగ్యపరమైన కారణాలున్నాయి. పూర్వం శ్రావణమాసంలో భర్తలు పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. అలాంటప్పుడు తీరుబడిగా ఇంటిపట్టున ఉండే భార్యలకు తగినంత కాలక్షేపం కోసం వ్రతాలు చేసుకునే ఆచారం మొదలైంది. ఈ వ్రతాల్లో ఆచరించే కట్టుబాట్లు, నియమాలు చక్కటి వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. నైవేద్యంగా సమర్పించి ఆరగించే చలివిడి చలువ చేస్తుంది. చలివిడి గర్భధారణ అవరోధాలను తొలగిస్తుంది. వరలక్ష్మీవ్రతం రోజు వాయనంగా ఇచ్చే మొలకెత్తిన శనగలు పోషక నిలయాలు. వీటిలోని మాంసకృతులు తక్షణ శక్తినిస్తాయి. అలాగే వర్షాకాలంలో పాదాలు ఎక్కవ సేపు తడిగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు కలుగుతుంటాయి. ఇలా ఇన్‌ఫెక్షన్లకు గురవ్వకుండా ఉండటం కోసమే కాళ్లకు పసుపు పూసుకోవటాన్ని ఈ వ్రతాల్లో భాగం చేశారు. ఆవునెయ్యితో వెలిగించే దీపాల ద్వారా విడుదలయ్యే ధూపం వాయు కాలుష్యాన్ని హరిస్తుంది.
వ్రతాల్లో సామాజిక అంశాలు..మనం జరుపుకునే ప్రతి పూజ, వ్రతం, నోముకూ ఓ సామాజిక, వెజ్ఞానిక కారణం ఉంటుంది. అలాగే మంగళ గౌరి, వరలక్ష్మి వ్రతాలకూ అలాంటి కారణాలే ఉన్నాయి.
- పూర్వం బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి అమ్మాయిలకు పూజా విధానంపై అవగాహన ఉండేది కాదు. కొత్త పెళ్లికూతురికి వీటి మీద పట్టు ఏర్పర్చడం కోసం నోములు, వ్రతాలు చేయించటం వెనకున్న ప్రథమోద్దేశం.
- ముత్తయిదువులకు వాయనాలివ్వటం, వారి కాళ్లకు పసుపు రాయటం వంటి పనుల ద్వారా సఖ్యత పెంపొందించటం, స్నేహ సంబంధాలు ఏర్పర్చుకోవటం, ఎదుటివారిని గౌరవించడం వంటి అలవాట్లను అలవరుచుకుంటారని వ్రతాల్లో వీటికి ప్రాధాన్యం ఇచ్చారు.
- అత్తా కోడళ్ల మధ్య సఖ్యత పెంచడానికి కూడా ఈ వ్రతాలు దోహదం చేస్తాయి. కొడుకు అభివృద్ధి కోసం, కోడలి కడుపు పండటం కోసం అత్తగారే దగ్గరుండి మరీ కోడలి చేత నిష్టగా వ్రతాలు చేయిస్తుంది.
- మంగళగౌరీ వ్రతంలో మొదటి వాయనం తల్లికే ఇవ్వాలనే నియమం ఉంది. పెళ్లి తర్వాత కూడా పిల్ల తల్లికి ప్రాధాన్యం తక్కువ కాకూడదనేదే ఇలాంటి ఆచారం వెనకున్న ఉద్దేశం.
శుభప్రదం శ్రావణం
వర్షరుతువుతో ఆగమించే శ్రావణమాసానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. తెలుగు సంవత్సరంలో ఐదో మాసంగా వచ్చే శ్రావణంలో పండుగలు, వ్రతాలతో ఆధ్యాత్మికత పరిఢవిల్లుతుంది. పట్నం నుంచి పల్లె వరకు పండుగ శోభ సంతరించుకుంటుంది. వైదిక ప్రమాణ రీత్యా కూడా శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
శ్రావణం చంద్రుడికి ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ పౌర్ణమి రోజున చంద్రుడు తన స్వ నక్షత్రమైన శ్రవణంపై సంచరిస్తాడు. అందుకే ఈ మాసానికి శ్రావణం అన్న పేరు వచ్చింది. పైగా శ్రవణం నక్షత్రం వేంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది. శ్రీహరి జన్మనక్షత్రం కూడా శ్రవణమే. అందుకే శ్రావణ మాసంలో శనివారాలు వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
వైదిక మాసం..శ్రావణ మాసానికి వైదిక మాసమని కూడా పేరుంది. ఈ నెలలో వేదాధ్యయనం మొదలవుతుంది. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.
వ్రతాల మాసం..శ్రావణ మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడిని కొలిచే సంప్రదాయం కనిపిస్తుంది. శ్రావణ మంగళవారాలు తమ కాపురం పదికాలాలు చల్లగా సాగాలని కోరుతూ నవ వధువులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుంటారు. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని కొలుస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. మహాలక్ష్మీదేవి భృగు మహర్షి, ఖ్యాతిలకు వరలక్ష్మిగా పౌర్ణమికి ముందు శుక్రవారం జన్మించిందని పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. దీన్ని పురస్కరించుకుని వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం సదాచారంగా వస్తోంది. రుగ్వేదంలోని శ్రీసూక్తం.. శ్రావణ లక్ష్మిగా అవతరించిందని.. మరో గాథ కనిపిస్తుంది. ఇక శ్రావణ శనివారాలు వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, కైంకర్యాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పండుగల మాసం..శ్రావణ మాసం రాకతోనే పండుగలు మొదలవుతాయి. నాగుల పంచమి మొదలు ఈ నెలలో ఎన్నో విశిష్టమైన తిథులు కనిపిస్తాయి. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దామోదర ద్వాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పూజిస్తారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌గా ఘనంగా జరుపుకునే శ్రావణ పౌర్ణమికి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. శ్రావణ పౌర్ణమి నాడే విష్ణు అవతారంగా భావించే హయగ్రీవుడి జయంతి జరుపుకుంటారు. శ్రావణ బహుళ విదియ రోజున రాఘవేంద్రస్వామి జన్మతిథిని నిర్వహిస్తారు. శ్రావణ బహుళ అష్టమి.. శ్రీకృష్ణాష్టమిగా భారతావనిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి.