Saturday, 21 March 2015

వసంతం : ఉగాది





ఆమనీ పాడవే హాయిగా..!

మావిచిగురు తిని జీరగొంతుతో తన జోడీని పిలవడం తప్ప కోయిల చేసేదేమీ లేదు. ఆమని కూడా అంతే. ప్రకృతి ఆదేశాల ప్రకారం ఒళ్లంతా పచ్చగా సింగారించుకోవడం తప్ప ఆ ఋతువుకి ఏ పాపమూ తెలియదు. కానీ ఈ రెంటిచుట్టూ మన సినీ కవులెన్ని కల్పనలు చేశారో. ఎన్నెన్ని కవితలల్లారో! వసంతం, కోయిలలపై వారి ఊహా విహారాలు కొన్ని చూద్దామా..

ఉగాది వసంతానికి నాంది. ఈ వేళ చెట్లు కొత్తచిగుళ్లను తొడుగుతాయి.. తొలిసంజె కిరణాలు మొదలు పున్నమి వెలుగుల వరకూ పరిసరాలు అద్భుతమనిపిస్తాయి. ప్రకృతిని చూడటం, స్పృశించడం, శ్వాసించడం, కోయిల గొంతుకని వినడం, పచ్చి పళ్ల రుచులు చూడటం.. ఇలా మనలోని పంచేంద్రియాలూ కొత్త తీయదనాన్ని చవిచూస్తాయి. మత్తుతో సోలిపోతాయి. అందుకే దీన్ని మధుమాసం అంటారు. ఆమని చేసే ఈ వేడుకనంతా ఓ పెళ్లిలా భావించాడు సినీ కవి వేటూరి. ‘కోకిలమ్మపెళ్లికి కోనంతా పందిరి.. చిగురాకుల తోరణాలు.. చిరుగాలి సన్నాయి..’ అన్నాడు. ‘మరి వరుడెవరూ..!’ అనే సందేహం వస్తుంది కదా! అందుకే ‘వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి.. పూలన్నీ తలంబ్రాలు.. పున్నమీ తొలిరేయి!’ అని చెప్పుకొచ్చాడు. చిలకలూ, గోరింకలూ వాటి కిలకిలారావాలు ఎన్నున్నా కోకిలే వసంతానికి ప్రతినిధి. మిసమిసలాడే లేతమామిడి చిగుళ్లు తిని తీయగా గొంతెత్తే ఈ కలకంఠి ప్రస్తావన లేని తెలుగు పాట చాలా అరుదు! ‘నాకుగాదులు లేవు.. ఉషస్సులు లేవు!’ అంటూ వైరాగ్యం ప్రకటించిన భావకవి కృష్ణశాస్త్రి కోకిల దగ్గరకొచ్చేటప్పటికి పరవశంతో ఎన్నో ప్రశ్నలు సంధించాడు. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా.. కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా!’ అంటూ ఎంతో మీమాంసకి  గురయ్యాడు. ‘జానకిరాముడు’ చిత్రంలో నాయకుడైతే ‘చిలకపచ్చ తోటలో చిలిపి కోయిలా.. తెలుగుపాట పాడవే తీయగా..హాయిగా!’ అంటూ కోయిల పంచమస్వరంలో తేట తెలుగు పదాలే వినాలనుకున్నాడు. పోతే పోనీ అనుకుందేమో కోయిలమ్మని కాస్త పక్కనపెట్టి వసంతాన వచ్చే ఓ చిలుకని చేరదీసింది ‘నిన్నే ప్రేమిస్తా..’ నాయిక. దాన్ని ‘కోయిలపాట బాగుందా కొమ్మల సడి బాగుందా...’ అని అడిగి ఆమని అందాలు ఎలా ఉన్నాయో ఆరాతీస్తుంది!

వారి మధ్య కోకిలమ్మ..
ఇక కోకిలమ్మని అడ్డుపెట్టుకుని మన నాయకానాయికలు చెప్పుకున్న ప్రేమ ఊసులకైతే లెక్కేలేదు. ‘కోకిల... కొక్కోక్కోకిల... కూతలా రసగీతలా... గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిల... నీపాటతో మరు పూదోటలో మదివేసింది మారాకిలా!’ అంటాడు ఓ నాయకుడు. ‘మావిచిగురు తిని... నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిల’ అని తన ప్రియునికి కోకిల చేతే శుభాకాంక్షలు చెప్పిస్తుంది ఓ నాయిక గడుసుగా. ‘కుహూ కుహూ తప్ప కోకిలమ్మకేం తెలుసు.. ఒహోం.. ఒహోం తప్ప కొండగాలికేం తెలుసు!’ అంటూ తాను ఆరాధించే అమ్మాయికే అన్నీ వచ్చంటాడు ‘ఆపద్బాంధవుడు’!

వసంతం...
వసంతం ఉండేది కొద్దికాలమే అయినా ఉన్నన్నాళ్లూ రంగులమయమే. ఏడాదిలో తర్వాత్తర్వాత ఎండలతో మాడ్చేసే గ్రీష్మాన్నీ, వరదలతో మంచెత్తే వర్షరుతువునీ, చలితో వణికించే శీతలాన్ని.. వీటన్నింటినీ తట్టుకునే ఆనంద పారవశ్యాన్ని ముందుగానే ఇస్తుంది. అందుకేనేమో ఓ ప్రియురాలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా..’. అంటుంది తన మనసుకి నచ్చినవాణ్ని. ప్రకృతి అందాలని తెలపడానికి మాత్రమే కాదు, స్ఫూర్తి పాఠం చెప్పేందుకూ వసంతాన్ని గుర్తుచేశారు మన కవులు.

‘తరలిరాదా తనే వసంతం... తన దరికిరాని వనాల కోసం’ అంటాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘రుద్రవీణ’లో. ‘గీతాంజలి’ కథానాయకుడి విషాదమేంటో అందరికీ తెలుసు. అందుకే ‘ఆమనీ పాడవే హాయిగా..’ అని ప్రాధేయపడతాడు. అతనెంత దీనావస్థలో ఉన్నా.. కారుచీకట్లో సన్నటి వెలుగులా నమ్మకమొకటి ఎక్కడో మిణుకుమిణుకుమంటూ ఉంటుంది కదా! ఆ నమ్మకాన్ని అతను ఉగాదిగానే చూశాడు. వసంతం తనకు మరో ప్రపంచాన్నే ఇస్తుందన్నాడు. ‘శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం, దివీ భువీ కలానిజం స్పృశించిన మహోదయం, మరో ప్రపంచమే మరింత చేరువై, నివాళి కోరిన ఉగాది వేళలో, గతించిపోని గాథ నేననీ..!’ అనంటాడు ఎంతో నమ్మకంగా! అతనికే కాదు మనందరికీ ఉగాది తన అందచందాలతో అందించే సందేశం ఆ చిన్నపాటి నమ్మకమే!





వసంతమాసమె హాయ్‌ హాయ్‌..!



ఓ పక్క పగలంతా చురుక్కుమనే సూరీడూ... మరో పక్క రాత్రి అయ్యేసరికి వీచే చల్లని గాలులూ... వెరసి వసంతరాత్రుల వైనమే వేరు. శిశిరంలో ఆకులు రాల్చి చిగురించిన చెట్లన్నీ ఆ గాలికి తలలూపుతూ ప్రతి గాలీ పైర గాలేననిపిస్తుంటే కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగిడిన జంటల పరిస్థితిని వర్ణించడానికి మాటలేముంటాయ్‌!

ప్రకృతితో మమేకమై జీవించే మనిషికి రుతువులే పండగలు. ఏ రుతువు విశేషాలు ఆ రుతువుకే ఉన్నా ఆరు రుతువుల్లోనూ వసంతానిది కొంచెం ఎక్కువ ప్రత్యేకత. ప్రకృతి కేలండరుకి తోడు మనిషి రూపొందించుకున్న కేలండరూ జత కలిసి వసంతాన్ని మధుర జ్ఞాపకాల మాలగా మారుస్తాయి. వసంతం... సంతోషానికి మరోపేరు. కొత్త సంవత్సరానికే కాదు, మరెన్నో విషయాల్లో కొత్తదనానికి శ్రీకారం చుట్టే సమయం.కోయిలమ్మల పాట కచేరీలూ లేలేత మామిడాకుల తోరణాలూ స్వాగత గీతికలు పాడుతుండగా చీకటి తెర తీసుకుని వచ్చే సూరీడు నెమ్మదిగా తన ప్రభావం చూపడం మొదలెడతాడు. సాయంత్రమయ్యేసరికి పెళ్లిళ్ల సందడీ, తెల్లవారుజామునే గృహప్రవేశాల హడావుడీ... వసంతం వచ్చిందంటే నిత్యం పేరంటమే. వీటన్నిటి మధ్యా విజయమే లక్ష్యంగా పిల్లల పరీక్షల సందడి. ప్రతి పరీక్షా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేదే కదా!

వసంత నవరాత్రులు
వసంత నవరాత్రుల వేడుకలు ఎల్లెడలా భక్తి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంటాయి.  కొన్ని రాష్ట్రాల్లో శరన్నవరాత్రుల్లాగే చైత్రంలోనూ దుర్గా నవరాత్రులు జరిపి అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. వసంత రుతువులో దేవీ నవరాత్రుల ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఉత్తరాదిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోసలని పాలించే వీరసేనుడనే రాజు యుద్ధంలో ఓడిపోవడంతో ఆయన వారసుడైన సుదర్శనుడు తల్లితో కలిసి భరద్వాజ ముని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతాడు. అక్కడ బీజాక్షరం ఉచ్చరించడం ద్వారా దేవి అనుగ్రహాన్నీ తద్వారా ఆయుధ శక్తినీ సమకూర్చుకుంటాడు. అతడి గురించి విన్న వారణాసి రాజు తన కుమార్తె శశికళను ఇచ్చి వివాహం చేస్తాడు. కోసల రాజ్యాన్ని తిరిగి వశపరుచుకోవడానికి సహాయపడతాడు. ఆయుధ శక్తినిచ్చి తోడ్పడిన దేవికి ఘనంగా పూజలు చేసి కృతజ్ఞతలు తెలుపుతాడు సుదర్శనుడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై ఏటా వసంత నవరాత్రులు నిర్వహించాలని ఆదేశించి అదృశ్యమవుతుంది. అప్పటినుంచి వసంతరుతువు రాగానే దేవీ నవరాత్రులను వేడుకగా జరపడం ఆచారంగా మారింది. సుదర్శనుడి వారసులే రామలక్ష్మణులు. రామ జన్మదిన, కల్యాణ వేడుకలు కూడా ఈ వసంత నవరాత్రుల్లో భాగమే. వసంత రుతువు రెండు నెలలూ ఎన్నో వేడుకలకు నెలవు! వాటికి తోడు పరవశింపజేసే వసంత యామినీ వెండి మబ్బుల అజ లేని వినీలాకాశమూ చల్లని వెన్నెల వెలుగులూ మత్తెక్కించే మల్లెపూల పరిమళాలూ... వసంతరాత్రుల సోయగాలకు ప్రణయావేశంతో పరవశించనివారుంటారా? అందుకే ఈ వసంత రుతువులో ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి జీవితం ఓ అందమైన పాటలాగా సాగిపోవాలని కోరుకుందాం!



Sunday, 15 March 2015

ఉత్తరాయణం పుణ్యకాలం





ఉత్తరాయణం పుణ్యకాలం



‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. ‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి.


సత్యనిష్ఠ మానవ ధర్మంగా ఉండాలి. అనుకోని క్షణంలో అనుకోని విధంగా పలకరించేందుకు మృత్యువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడొస్తుందో తెలియని మృత్యువుకు భయపడకుండా.. మానవులు తమ ధర్మం ఆచరించాలని ఆర్షవాక్కు. ఎలాంటి వాయిదాలకూ ఆస్కారం ఇవ్వకుండా దైవ, ధర్మకార్యాలు ఆచరించాలి. పగటి వేళ అయిన ఉత్తరాయణంలో దైవీశక్తులు మేల్కొని ఉంటాయి. పుణ్యకార్యాలు, దానధర్మాలకు అనువైన కాలమిది.

భీష్మాచార్యులు కురుక్షేత్ర సంగ్రామంలో కుప్పకూలినా స్వచ్ఛంద మరణ వర ప్రభావంతో ఉత్తరాయణం వచ్చే వరకు ఊపిరి విడువలేదు. ఆయన కన్నుమూయడానికి ముందు ధర్మరాజుకు విష్ణుసహస్రనామాలు ఉపదేశించాడు. ధార్మిక చింతనకు ఉత్తరాయణం పుణ్యప్రదం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పితృకార్యాలకూ ఉత్తరాయణం విశేషమైనది. ఈ కాలంలో మరణించిన వారికి పరమపదం కలుగుతుందని కొందరి విశ్వాసం.

నక్షత్రాలు ఇరవైఏడు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు. తొమ్మిది పాదాలకు ఓ రాశి. అలా పన్నెండు రాశులు 108 పాదాలలో విస్తరించి ఉంటాయి. ఈ రాశుల గుండా సూర్యుని ప్రయాణం సాగుతుంది. సూర్యుడు ఒకరాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సంక్రమణం అంటారు. ఇలా ఏడాదికి పన్నెండు సంక్రమణాలు వస్తాయి. వీటిలో మకర సంక్రమణం ఉత్కృష్టమైనది. మకర సంక్రమణంతో భాస్కరుని గమనం ఉత్తర దిశగా సాగుతుంది. ఉత్తర దిక్కు మోక్షాన్ని సూచిస్తుంది. అందుచేతనే ఉత్తరాయణ పుణ్యకాలం మోక్ష సాధనకు అనువైనదిగా పెద్దలు చెబుతారు.

మకర సంక్రమణం తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు గోచరిస్తాయి. అప్పటి వరకు వణికించిన చలి మెల్లగా తగ్గుముఖం పడుతుంది. సమశీతోష్ణ స్థితి నెలకొంటుంది. ఇన్ని విశేషాలున్న ఉత్తరాయణంలో తెలుగువారికి అత్యంత ప్రియమైన సంక్రాంతి పండుగ మరో ప్రత్యేక ఆకర్షణ. పాడిపంటలకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది ఈ పర్వదినం. వ్యవసాయంతో ముడిపడిన మూడు రోజుల పండుగ ఇది. మొదటి రోజున భోగి. శ్రీ రంగనాథుడు గోదాదేవిని వివాహం చేసుకుని భోగభాగ్యాలు ప్రసాదించినందున ‘భోగి’ ఏర్పడిందనేది ప్రసిద్ధం. భోగి నాడు తెల్లవారుజామునే భోగిపిడకలతో మంటలు వేసి.. ఇంట్లోని పనికిరాని సామాన్లు ఆ మంటలో వేస్తారు.

పాత పీడలు తొలగిపోయి నూతనత్వానికి స్వాగతం పలకడం ఇందులోని అంతరార్థం. అదేరోజు సాయంత్రం పిల్లలకు భోగిపండ్లు పోస్తారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన రేగుపళ్లను తలపైనుంచి పోయడం ద్వారా చిన్నారులకు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. రెండో రోజు సంక్రాంతి. ప్రతి లోగిలి ధాన్యరాసులతో తులతూగాలని కోరుకునే పండుగ ఇది. కొన్ని ప్రాంతాల్లో గౌరీదేవిని పూజించి పసుపు, కుంకుమలు ముత్తైదువులకు ఇచ్చే సంప్రదాయం ఉంది. చివరి రోజైన కనుమ కర్షకుల పండుగ. పశువుల కొట్టాలను శుభ్రం చేస్తారు. పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు.

ఈ పర్వదినం ఆచరణలో, తినే పదార్థాల వెనుక వైజ్ఞానికమైన ప్రాముఖ్యం కూడా ఉంది. ఈ కాలంలో శరీరానికి తగినంత వేడి, కొవ్వు అవసరం అవుతాయి. అందుకే నువ్వులు, బెల్లం, పిండివంటలు ఆరగిస్తారు. వీటి ద్వారా చలికాలంలో శారీరంలో కలిగిన మార్పులు సర్దుకుంటాయి.

మన సంస్కృతిలో ప్రతి పండుగ సారాంశం ఇతరుల మేలు కోరడమే. పంటలు ఇళ్లకు చేరే కాలంలో వచ్చే సంక్రాంతి కూడా అలాంటిదే. రైతులు తమ పొలంలో పని చేసిన కూలీలకు, అవసరార్థులకు తోచినంత ధాన్యం ఆత్మీయంగా దానం చేస్తారు. ఈ సయయంలోనే ఊరూరా తిరిగే హరిదాసులు, గంగిరెద్దులవాళ్లు, బుడబుక్కలవాళ్లకూ ఎంతో కొంత సమర్పించుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం సమస్త మానవాళికి పుణ్యప్రదం.



కుబేరుని గర్వభంగం





కుబేరుని గర్వభంగం

కుబేరుడు బంగారానికి ఆధిపతి. అతను తన ఐశ్వర్యాన్ని చూసుకుని విర్రవీగేవాడు. ఒకరోజు పరమేశ్వరుని ముందూ తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. కైలాసానికి వెళ్లి ‘స్వామీ! మీరు ఇరువురూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి’ అని కోరాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న శివుడు ఇతనికి గుణపాఠం నేర్పాలని అనుకుని ‘నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను’ అని చెప్పాడు. వెంటనే కుబేరుడు ‘నేను ఏర్పాట్లు చేశాను, మీరు మా ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరించాలి, మీరు రాకపోతే నేను బాధపడతాను’ అని అన్నాడు. అలా అయితే ‘నా కుమారున్ని పంపిస్తానని’ శివుడు అన్నాడు. దానికి కుబేరుడు సరే అన్నాడు. అయితే నీకొక ముఖ్య విషయం చెబుతాను.

వినాయకుడు కొంచెం ఎక్కువగా తింటాడు, ఫరవాలేదుగా అని అడిగాడు. మరేం ఫరవాలేదు స్వామీ. ఎంత తిన్నా నేను పెట్టగలను అని కుబేరుడు జవాబిచ్చాడు. అయితే సరే నా కుమారున్ని తీసుకెళ్లు అని శివుడు వినాయకున్ని పంపిస్తాడు. వినాయకుడు కుబేరుని ఇంట భోజనానికి కూర్చున్నాడు. ఆహారపదార్థాలు రుచిగా ఉండటంతో వినాయకుడు తృప్తిగా తినడం మొదలుపెట్టాడు. వడ్డిస్తూనే ఉన్నారు, వినాయకుడు తింటూనే ఉన్నాడు. ఇంతలో వంటవాడు వచ్చి కుబేరునితో వండిందంతా అయిపోయిందని చెప్పాడు. కుబేరునికి ఏం చేయాలో పాలుపోలేదు. వినాయకున్ని ఎలా శాంతపరచాలో కుబేరునికి తెలియలేదు. ‘‘వినాయకా! వండిందంతా ఆయిపోయింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు’ అని అడిగాడు.

‘‘నాకు ఏదో ఒకటి పెట్టు లేదంటే నిన్ను మింగేస్తాను’ అని వినాయకుడు హెచ్చరించాడు. దాంతో కుబేరునికి శివుడు గుర్తొచ్చాడు. ఆయనొక్కడే నన్ను కాపాడగలడు అనుకుని కైలాసానికి పరుగు పెట్టాడు. ‘‘నన్ను క్షమించు స్వామీ! నువ్వొక్కడివే నన్ను కాపాడగలవు’’అని మోకరిల్లి పడి వేడుకున్నాడు. శివుడు అతన్ని క్షమించి ‘నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నా కుమారునికి ప్రేమతో ఈ మరమరాలు సమర్పించు. నీకు అతని ఆశీర్వాదం లభిస్తుంది’ అని ఇచ్చి పంపించాడు. వెంటనే కుబేరుడు వినాయకుని దగ్గరకు వెళ్లి ‘తండ్రీ నన్ను క్షమించండి. ఈ మరమరాలు తీసుకుని నన్ను ఆశీర్వదించండి’ అని వేడుకున్నాడు. అవి తిన్న వినాయకునికి ఆకలి తీరింది. కుబేరున్ని ఆశీర్వదించాడు.





హయగ్రీవుడు





గురు స్వరూపం.. హయగ్రీవుడు!

భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో.. గురు స్వరూపం హయగ్రీవుడు. గుర్రం ముఖం, నర శరీరంతో ఉంటాడు. ఆయన అవతరించిన శ్రావణ శుద్ధ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.

హయగ్రీవుడి ఉత్పత్తి గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. సృష్టి ఆదిలో మహా విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నుంచి దేవతలు ఉద్భవించారు. దేవతలంతా తమ కర్తవ్యం ఏమిటని బ్రహ్మను అడిగారట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు.. విష్ణుమూర్తిని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు యజ్ఞం చేయాలని వారికి సూచించాడట. అయితే యజ్ఞం ఆచరించడానికి తగిన జ్ఞానం ప్రసాదించమని కోరాడట బ్రహ్మ. అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంలో ప్రకటితమై.. ‘‘ప్రపంచాన్ని సృష్టించి, నడపగలిగే జ్ఞానం, యజ్ఞ విజ్ఞానాన్ని ఇస్తున్నాన’’ని వేదాలను బ్రహ్మ దేవుడికి అనుగ్రహించాడట. ఈ వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు అపహరించగా.. హయగ్రీవుడు వాటిని సంరంక్షించి మళ్లీ బ్రహ్మకు అందజేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. హయగ్రీవుడి రూపం విచిత్రంగా ఉంటుంది. గుర్రం ముఖం చైతన్యానికి ప్రతీక. గుర్రం సకలింపు నుంచి బీజాక్షరాలు ఉద్భవించాయని అంటారు. శుద్ధ స్పటిక రూపం ఆయనది. నిర్మలత్వానికి చిహ్నం ఇది. రెండు చేతుల్లో శంఖ, చక్రాలు ధరించి ఉంటాడు. మరో చేతిలో పుస్తకం ఉంటుంది. ఇంకో చేతిని చిన్ముద్రతో చూపుతూ భక్తులను అనుగ్రహిస్తుంటాడీ దేవుడు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు. ఆయన్ను గురువుగా భావించి ఉపాసిస్తే.. సద్బుద్ధి కలుగుతుంది. సత్వ గుణం వికసిస్తుంది. విద్యాప్రాప్తి కలుగుతుంది. సకల దేవతా మంత్రాలు ఆధీనంలోకి వస్తాయని చెబుతారు.





Friday, 13 March 2015

సుందోపసుందులు





సుందోపసుందులు

పూర్వం కుంభుడనే రాక్షసుండేవాడు. వాడు మహాబలశాలి. వాడికి ఇద్దరు కుమారులు. వాళ్ళిద్దరూ మహాభయంకర దేహం కలవారు. పెద్దవాడు సుందుడు, రెండో వాడు ఉపసుందుడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. ఒకరోజు వారికి తమ పూర్వీకుల మాదిరిగా త్రిలోకాలను జయించాలనే కోరిక కలిగింది.

దాంతో వింధ్యపర్వతం చేరి తపస్సు చేయడం ప్రారంభించారు. అన్నపానీయాలు తీసుకోకుండా కఠోర తపస్సు చేశారు. గాలిని ఆహారంగా గ్రహిస్తూ బొటనవేలు మీద నిలుచుని తపస్సు చేశారు. ఆ సోదరుల తపస్సుకు భంగం కలిగించాలని దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఆ రాక్షససోదరులు చలించలేదు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరకోమన్నాడు. అప్పుడు వారు ప్రపంచంలో అస్త్ర శస్త్ర విద్యలన్నీ తమకు రావాలనీ, ఇంద్రజాల విద్యలన్నీ తమ ఆధీనంలో ఉండాలనీ, తమకు తాము వైరం వచ్చి ఒకరినొకరు చంపుకుంటే తప్ప మరొకరి వల్ల మరణం రాకూడదని కోరుకున్నారు. వారి కోరికను అనుగ్రహించి బ్రహ్మ అదృశ్యమయ్యాడు.

బ్రహ్మ ఇచ్చిన వరంతో వాళ్లు అమరావతిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూలోకం, నాగలోకం... ఇలా లోకాలన్నీ వశపరచుకున్నారు. మునులను హింసించారు. ఆశ్రమాలలో ప్రవేశించి యజ్ఞసామాగ్రిని ధ్వంసం చేశారు. వారి వల్ల ఎవ్వరికీ మనఃశ్శాంతి లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవతలు, మునులు బ్రహ్మను శరణు కోరారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి ‘‘మహాశిల్పీ! ప్రపంచంలో ఎంతటి వారైనా సరే కనుచూపుతో ఆకర్షించి పాదాక్రాంతం చేసుకోగల సుందరీమణిని సృష్టించు’’ అని అన్నాడు.

బ్రహ్మ ఆజ్ఞ మేరకు విశ్వకర్మ తిలోత్తమ అనే అందగత్తను రూపొందించారు. ఆమె అందం చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. దేవేంద్రుడు వెయ్యి కళ్లూ విప్పి చూశాడు. ఆ అందగత్తె తిలోత్తమ రాక్షస సోదరులున్న వింధ్యపర్వతాన్ని చేరుకుంది. మైకంలో తూళుతున్న ఆ సోదరులు తిలోత్తమను చూసి మైమరచి పోయారు. తిలోత్తమ భయాన్ని, సిగ్గుని అభినయిస్తూ ఓరచూపుతో ఇద్దరినీ రెచ్చగొట్టింది. ఒకడు కుడిచేయి అందుకుంటే మరొకడు ఎడమచేయి అందుకున్నాడు.

మద్యం మత్తులో ఉన్న సుందున్ని ఒక కంటితో, ఉపసుందున్ని మరో కంటితో రెచ్చగొట్టింది. ‘తమ్ముడూ! అన్న భార్య తల్లితో సమానం. నువ్వు తాకకూడదు’ అన్నాడు సుందుడు. ‘తమ్ముని భార్య కోడలితో సమానం. నువ్వుదూరంగా వెళ్లు’ అన్నాడు ఉపసుందుడు. నేనెవరికి దక్కాలో మీరిద్దరూ తేల్చుకోండి అంటూ పక్కకు తప్పుకుంది తిలోత్తమ. అంటే ముష్టిఘాతాలు కురిపించుకుని ఇద్దరు సోదరులు నేలకూలారు. కామపిశాచి ఎంతటి వారినైనా నేలకూలేలా చేస్తుందనడానికి ఈ కథ మంచి ఉదాహరణగా నిలిచింది.

శ్రీ కృష్ణుడు విశ్వరూపం దాల్చిన సమయాలు





శ్రీ కృష్ణుడు విశ్వరూపం దాల్చిన సమయాలు...


దుష్టశిక్షణార్థం భూలోకమున అవతరించిన శ్రీ కృష్ణుడు తన కృష్ణావతారంలో మూడుసార్లు విశ్వరూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి.

అందులో కౌరవ సభ ఒకటైతే.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేసే సమయం, దానకర్ణుడు యుద్ధభూమిలో ప్రాణాలను విడిచే సందర్భాన కృష్ణ పరమాత్మ విశ్వరూపమెత్తినట్లు పురాణాలు పేర్కొన్నాయి.