Saturday, 24 February 2018

రామాయణంలోని పాత్రలు





రామాయణంలోని  పాత్రలు



 


శ్రీమద్వాల్మీకి రామాయణంలోని అతి పవిత్రమైన సుందరకాండములో హనుమంతుడు సముద్రాన్ని దాటడం, దారిలో మైనాకుడి స్వాగతం, సురసను జయించడం, సింహికను హతమార్చడం ప్రధానంగా ఉన్నాయి. ఈ సర్గములో వచ్చిన పాత్రలు.. వాటి వివరాలు :

ఆంజనేయుడు :
అంజన కుమారుడు. అంజన వానర స్త్రీ. ఈమె కుంజరుడనే వానరుడి కుమార్తె. కేసరి అనే వానర యోధుడి భార్య. ప్రభాస తీర్థంలో మునులను బాధిస్తున్న శంఖశబలాలనే ఏనుగులను సంహరిస్తాడు. భరద్వాజుడు మెచ్చుకుని ఇతడికి కేసరి అని పేరు పెట్టి వరం కోరుకొమ్మంటాడు. కామరూపి, బలాఢ్యుడు ఐన పుత్రుడు కావాలని కోరుకుంటాడు. ఇతడికి అంజనతో వివాహం అయిన తర్వాత వాయుదేవుడి వరబలం వల్ల.. ఈ దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు.
సందర్భం :
సుందరకాండ యావత్తూ ఆంజనేయుడి వీరోచిత సుందర విజయ గాథే.

విద్యాధరులు:
ఉపదేవతలు. పూలమాలలు కట్టడం వీరి పని. సర్పయాగానికి ఇంద్రుడి వెంట వెళతారు.
సందర్భం :
ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించేందుకు తన శరీరాన్ని పెంచుతున్న సందర్భంలో వీరి ప్రస్తావన వస్తుంది.

మైనాకుడు :
మైనాకము ఓ పర్వతము. మేనకా హిమవంతులు కుమారుడు ( ఈ మేనక అప్సరస కాదు.. వైరాజులనే పితృదేవతల మానస పుత్రిక. హిమవంతుడిని పెళ్లాడుతుంది. వీరికి మైనాకుడితో పాటు క్రౌంచుడు అనే కుమారుడు, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనే కూతుళ్లూ జన్మిస్తారు) కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. దీంతో ఇష్టానుసారంగా ఎగురుతూ.. దేవ, ముని గణాలపై వాలుతుండేవి. వీరు ఇంద్రుణ్ణి ప్రార్థించడంతో.. కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు, వజ్రాయుధంతో.. పర్వతాల రెక్కలను తెగనరికాడు. ఆ సమయంలో.. మైనాకుడిని మిత్రుడు వాయుదేవుడు చాకచక్యంతో తప్పించి.. నేర్పుగా సముద్రంలో పడవేశాడు.
రెక్కలు తెగకుండానే మైనాకుడు సముద్రం గర్భంలో దాక్కుంటాడు. మైనాకుడు.. ఇష్టారీతిగా పైకి, కిందకి, పక్కలకు ఇలా ఎటు కావాలంటే అటు పెరిగిపోగల శక్తిమంతుడు.
సందర్భం :
తన మీదుగా ఎగురుతున్న ఆంజనేయుడు.. కాసేపు విశ్రమించేందుకు వీలుగా, మైనాకుడిని పెరగమని సముద్రుడు కోరతాడు. తనను గర్భంలో ఉంచుకుని, ఇంద్రుడినుంచి కాపాడుతున్న, సాగరుడి సూచనను మైనాకుడు పాటిస్తాడు. ఆంజనేయుడు మైనాకుడిపై స్వల్వ వ్యవధి విశ్రమిస్తాడు. రాముడి పని మీద వెళుతున్న ఆంజనేయుడికి ఈరీతిగా సేవ చేసిన మైనాకుడికి ఇంద్రుడు అభయాన్నిస్తాడు.


సురస : నాగమాత.
సందర్భం :
మైనాకుడి మీద నుంచి తిరిగి లంఘించిన ఆంజనేయుడి బలపరాక్రమాలను మళ్లీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో.... దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సురసాదేవిని పంపుతారు. ఆమె, అతి భయంకరమైన రూపంతో.. ఆంజనేయుడిని అడ్డగిస్తుంది. ముందుకు సాగాలంటే తన నోట్లోకి దూరి బయటకు వెళ్లాలని షరతు పెడుతుంది. ఆంజనేయుడు ఆమె నోట్లోకి ప్రవేశించి, తన దేహాన్ని అంతకంతకూ పెంచుతూ వెళతాడు. దానికి తగ్గట్లుగానే ఆమె కూడా తన నోటిని పెంచుతూ పోతుంటుంది. ఉన్నట్టుండి ఆంజనేయుడు సూక్ష్మరూపాన్ని ధరించి, ఒక్క ఉదుటన బయటకు వెళ్లిపోతాడు. ఆ రకంగా దేవతల పరీక్షను సమర్థంగా ఎదుర్కొంటాడు.



సింహిక :
రాక్షసి. దితి, కశ్యపులకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే కుమారులతో పాటు.. సింహిక జన్మిస్తుంది. ఈమె భర్త విప్రచిత్తి. ఈమె కామరూపిణి... ఛాయాగ్రాహిని. (అంటే కోరుకున్న రూపం దాల్చే శక్తి గలది.. దాంతో పాటే.. నీడను లాక్కు పోగలది.) ఈమె కుమారులే రాహుకేతులు. అందుకే వీరికి సైంహికేయులు అని పేరు.
సందర్భం :
సముద్రంపై నుంచి ఎగురుతున్న ఆంజనేయుడిని చూసి.. సింహిక తనకు మహాజంతువు ఆహారంగా లభించిందని భావించి, ఆంజనేయుడి నీడను లాక్కొని వెళుతుంది. దీంతో ఆంజనేయుడి శక్తి కాస్త తగ్గుతుంది. విషయాన్ని గమనించిన ఆంజనేయుడు తన శరీరాన్ని ఇంతలింతలుగా పెంచుతాడు. దానికి తగ్గట్లే నీడ కూడా పెరుగుతుంది. దాంతో, సింహిక కూడా నోటిని బాగా తెరవాల్సి వస్తుంది. ఆంజనేయుడు హఠాత్తుగా ఆమె నోట్లోకి ప్రవేశించి.. చీల్చి చెండాడుతాడు.

Wednesday, 21 February 2018

కార్తవీర్యార్జునుడు





కార్తవీర్యార్జునుడు

కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షికి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.

ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.

ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.

ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.

కార్తవీర్యార్జునుడు రావణునితో యుద్ధం చేసి బంధించెను.

కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.




మహిష్మతి కార్తావీరార్జునుని సామ్రాజ్య ముఖ్యపట్టణం కూడా. ఆయనా హైహతేయ రాజేను.

పురాణాల ప్రకారం కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులతో నర్మద ప్రవాహం ఆపి రాణులతో జలక్రీడలు ఆడుతూ ఒక్కసారిగా చేతులు అడ్డం తీస్తాడు. రావణుడి సైకతలింగం కొట్టుకుపోతే యుద్ధానికి వచ్చి ఓడిపోతాడు. పరుశురాముడు ఈ కార్తవీర్యార్జునుడుని చంపాడు.





Friday, 16 February 2018

ఆళ్వారులు





ఆళ్వారులు
శ్రీ మహావిష్ణు భక్తశిఖామణులను ఆళ్వారులు అంటారు. వీరు 12 మంది. వీరు 12 మంది కూడా శ్రీ వైకుంఠంలో ఉండే వారి అంశములతో భూమి పై జన్మించారు అని పెద్దలు చెపుతారు. వీరు స్వామి వారిని స్తుతిస్తూ వారి పై 4000 భక్తి శ్లోకములను/ పాశురములను రచించారు. ఈ 4000 శ్లోకములను కలిపి నాలావిర దివ్య ప్రభందం అంటారు. తమని తాము భగవత్ దాసులుగా చెప్పుకుంటారు. వీరు ముక్తి కాలంలో స్వయంగా శ్రీవారిలో లీనమయారు అని చెప్తారు. వీరు ఈ భూమిపై తిరుగాడిన కాలం క్రీ.శ. 6 నుండి క్రీ.శ 9వ శతాబ్దపు మధ్య కాలం అని చెప్తారు. ఇప్పుడు ఆ 12 మంది పేర్లు వారి వివరములు తెలుసుకుందాం!
  1. పోగై ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు : కాసార యోగి, పద్మ ముని
    • అంశ : పాంచజన్యం (శ్రీ మహా విష్ణు శంఖం)
  2. భూతనాధ్ ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు : సిద్ధార్ధి
    • అంశ : కౌమోదకి (గధ)
  3. పై ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు: కైరవ ముని
    • అంశ : నందకం (ఖడ్గం)
  4. తిరుమలిసై ఆళ్వార్:
    • కాలం : 7వ శతాబ్దం
    • ఇతర పేర్లు : భక్తిసారర్
    • అంశ : సుదర్శనం (చక్రం)
  5. తిరుమంగై ఆళ్వార్:
    • కాలం: 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు: నాలు కవి పెరుమాళ్
    • అంశ : శారంజ్ఞం (విల్లు)
  6. తొండరడిపొడి ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు : విప్ర నారాయణ
    • అంశ : వనమాల
  7. తిరుప్పాన్ ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు : పాణర్, యోగి వాహనర్
    • అంశ : శ్రీవత్సం
  8. కులశేఖర్ ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం
    • ఇతర పేర్లు: కొల్లిక్కావాలన్
    • అంశ : కౌస్తుభం
  9. పెరియాళ్వార్ :
    • కాలం : 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు: విష్ణు చిత్తర్
    • అంశం : గరుడ
  10. శ్రీ ఆండాళ్ :
    • కాలం: 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు : సూదికొడుత్ర నాంచియార్
    • అంశం: భూదేవి
  11. నమ్మాళ్వార్
    • కాలం: 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు: శఠగోపా, పరాంకుశం
    • అంశం: విష్వక్సేన
  12. మధుర కవి ఆళ్వార్ :
    • కాలం : 9వ శతాబ్దం
    • ఇతర పేర్లు: ఇంకవియర్
    • అంశం: వైనతేయ (గరుడ)


వైష్ణవ సంప్రదాయంలో సంస్కృత వేదాలకే కాక ద్రవిడ వేదాలు పిలువబడే నాలుగు వేల దివ్య ప్రబంధాలకూ మరింత ప్రాధాన్యత. ఇవి భగవత్ తత్వాన్ని దర్శించి ఆళ్వారులు పాడిన పాటలు. వేదాలను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, వాటిని సమగ్రంగా అర్థం చేసుకోగల మహనీయులు ఉంటే తప్ప మనకు తెలియవు. చెఱుకు గడనుండి రసాన్ని పీల్చినల్టు కష్టంగా ఉంటుంది. అట్లా కాక చెఱుకు గడనుండి రసాన్ని తీసి ఇస్తే ఎంత సులభంగా త్రాగ వీలు అవునో, అట్లా వేద సారం అని పిలవబడే దివ్య ప్రబంధాల ద్వారా భగవంతుడిని దర్శించడం సులభం. భగవంతుడే ఆళ్వారుల ద్వారా పాడించుకున్నాడు. ఆళ్వారులు వివిద కాలాలకు చెందినవారు. నలుగురు ద్వాపర యుగానికి మిగతా ఎనిమిది మంది కలియుగ మొదటి శతాబ్దానికి చెందినవారు. అందులో  ముదల్ ఆళ్వార్లుగా అంటే మొదటి ముగ్గురు ఆళ్వార్లుగా పిలువబడేవారు పోయగై ఆళ్వార్, బూతతాళ్వార్ మరియూ పెయ్-ఆళ్వార్. వీరంతా వేరు వేరు ప్రాంతాలకి చెందినవారు. అనుకోకుండా పరమాత్మ సంకల్పంవల్ల ఒక దగ్గర కలుసుకోవాల్సివచ్చింది తిరుకోవలూర్ లో.

మొదటి ముగ్గురు ఆళ్వార్లు అని పిలవబడే ఈ ముగ్గురూ ఒకే సంవత్సరంలో ఒకే మాస శుక్ల పక్షంలో వరుసగా మూడు రోజుల్లో పుట్టినవారు. అందరూ అయోనిజులు. మొదటి ఆళ్వార్ పోయగై-ఆళ్వార్ కంచీపురంలోని తిరువెక్క(యదోక్తకారి) వద్ద ఉన్న చిన్న చెరువు లో పుట్టారు. తమిళంలో పోయగై అంటే చిన్న చెరువు అని అర్థం. ఈయన శ్రీమన్నారాయణుడి ఒక ఆయుధంగా పిలవబడే పాంచజన్యం (శంఖం) యొక్క అంశ. రెండో ఆళ్వార్ బూతత్-ఆళ్వార్, ఈయన కడలిమలై (మహాబలిపురం) లో కరుక్కట్టి అనే పుష్పంలో పుట్టారు. ఈయన శ్రీమన్నారాయణుడి ఆయుధంగా పిలువబడే కౌమోదికం (గధ) యొక్క అంశ. మూడో ఆళ్వార్ పేయ్-ఆళ్వార్, ఈయన మైలాపూర్ లోని ఆదికేశవ పెరుమాళ్ దేవస్థానంలో ఒక కమలంలో పుట్టారు. ఆయన శ్రీమన్నారాయణుడి ఆయుదం నందకి(ఖడ్గం) యొక్క అంశ. ఈ ముగ్గురు ఆళ్వార్లు భగవత్ తత్వాని భావిస్తూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉండేవారు.


మనదేశం అనాదిగా కర్మభూమి. భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపదలకు నిలయం. ఎందరో నిష్కామకర్మపరాయణులు, భక్తులు, జ్ఞానులు, విరాగులు ఈ పుణ్యభూమిలో జన్మింఛి జాతిని పునీతం చేశారు . ఆళ్వార్లు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తశిఖామణులు . వీరు సంఖ్యలో 12 మంది కావడం వలన పన్నిద్దరాళ్వార్లుగా ప్రసిద్ధి పొందారు. ఆళ్వారనే తమిళపదానికి మునుగుట అని అర్థం. భగవంతుని యెడల ప్రేమతో, భగవంతుని అనుగ్రహంలో పూర్తిగా మునిగిన వారే ఆళ్వార్లని చెప్పవచ్చు . శ్రీ మహావిష్ణువు యొక్క పరివారం కలియుగంలో భక్తితత్వాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం ఆళ్వార్లుగా అవతరించారని భాగవతం బట్టి తెలుస్తోంది.
(1) పోయిగై ఆళ్వార్ – పాంచజన్యం ( శంఖం);
(2) పూదత్తాళ్వార్ –కౌమోదకి (గద);
(3) పేయాళ్వార్ –నందకము ( ఖడ్గం);
(4)తిరుమళి(డి)శైఆళ్వార్ -సుదర్శనం(చక్రం)
(5) కులశేఖరాళ్వార్( కౌస్తుభమణి);
(6) తొండరడిప్పొడి ఆళ్వార్ -(పుష్పమాల);
(7) తిరుప్పాణి ఆళ్వార్ – (శ్రీవత్సమనే పుట్టుమచ్చ);
(8) తిరుమంగై ఆళ్వార్- (శారంగము అనే ధనుస్సు);
(9) పెరియాళ్వార్ (విష్ణు రథం);
(10) చూడికురుత్తనాంచియార్ (గోదాదేవి/ఆండాళ్) - (భూదేవి);
(11) నమ్మాళ్వార్-(విష్వక్సేనుడనే సైన్యాధ్యక్షుడు)
(12) మధురకవి ఆళ్వార్- (గరుత్మంతుడు).

తర్కకర్కశమైన వాదోపవాదాలతో, శుష్కమైన కర్మకాండలతో, దీర్ఘ జటిలసాధనలతో మరుభూమిగా మారిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సహజమైన భక్తిప్రపత్తులతో ముంచెత్తి మోక్షమార్గాన్ని కరతలామలకం చేయ్యడానికి ఆళ్వారులు ఒకరి తరువాత ఒకరు అవతరించారు. శరణాగతి ద్వార మోక్షసామ్రాజ్యానికి బంగారుబాటలు వేశారు. వీరిలో కొంత మంది ఎక్కువ కులం వారు, కొంత మంది తక్కువ కులం వారు, ఇంకా కొంత మంది అంటరానివారు, ఒకరు స్త్రీ(‘చూడికురుత్తనాంచియార్’ స్త్రీ కావడం ఒక విశేషం.) కావడం గమనిస్తే ఆధ్యాత్మిక ప్రగతికి జాతి, కులం మొ|| ఆటంకాలు కావనిపించక మానదు. ఈమెనే గోదాదేవి అని పిలుస్తారు.

గోదాదేవిని అపార భగవద్భక్తిజ్ఞానవైరాగ్యశేవధిగా వర్ణించారు. ఈమె విష్ణుచిత్తుడను మరో పేరుగల పెరియాళ్వారు కూతురు. ఆతనికి తులసివనంలో దొరికింది. ఈ విధంగా ఒక ఆళ్వారుకు కూతురై , స్వయంగ ఆళ్వార్ల సరసన చోటు సంపాదించుకున్న గోదాదేవి చరిత్ర ఎంతో పవిత్రమైనది. స్త్రీలోకానికే ఆదర్శపాత్రమైనది. ‘చూడి కొడుత్తాళ్’ అనే పదానికి ఆముక్తమాల్యద అని అర్థం . అంటే భగవంతునికై అల్లినపూలమాలను ముందుగా తాను ధరించి తన అందాన్ని తనివితీరా చూసుకుని మురిసి ఆ తరువాతే దేవునికి సమర్పణ చేసేది.

గోదాదేవి చిన్నతనంలో తండ్రి వలన భగవల్లీలా విశేషాల్ని తెలుసుకొని చెలులకు చెప్పేది. తాను స్వయంగా సంగీత కవిత్వములయందు నేర్పరి కావడం చేత పూర్వజన్మ సంస్కారం వల్ల కల్గిన భక్తిభావంతో ఎల్లప్పుడు భగవంతుని యందు మనసు లగ్నం చేసి అతన్నే గానం చేస్తూ ఉండేది. భగవంతుని పొందు కోసమే నిరంతరం తహతహలాడేది. విష్ణుచిత్తుడు ఆమె మన:ప్రవృత్తిని గమనించి ఆశ్చర్యపడి భగవంతునకు మొఱపెట్టుకోగా అతడు ప్రత్యక్షమై విష్ణుచిత్తునితో ఓ భక్తశిఖామణి! భగవంతుని గుణగానం కంటే వేరొక తపస్సు ఏముంటుంది? నేను పూర్వం వరాహరూపం ధరించినపుడు నన్ను భూదేవి తనివితీరా గానం చేయలేక ఆ కొరతను తీర్చుకోడానికై నేడు గోదాదేవి పేరుతో నీ పుత్రికగా జన్మించింది. ఆమె నన్ను వలచింది. ఆమె ధరించిన మాలయే నాకు అత్యంతప్రియమైంది. నీవామెను శ్రీ రంగానికి తీసుకుపోయి రంగనాధునికి సమర్పించ’’మని ఆదేశించాడు. పిదప గోదాదేవి యధావిధిగా రంగనాధుని పెండ్లాడింది. ఈవిధంగా భక్తితో భగవంతునకు భార్యయైన గోదాదేవి ధన్యచరిత. ఆమె చరితం అనురాగ భక్తిరసభరితం.




ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం. దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సత్యం లోతులను, ఆనందం లోతులను అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులు ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే. (ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.) ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు. కాని, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ॥ శ॥ 824లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందువారే గాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నా భిప్రాయాలు ఉన్నాయి. ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు. ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం, పన్నెండు మంది అని మరో వాదం ఉంది. పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడిరది. ‘పన్నిద్దరాళ్వారులు’ అనే పదబంధం వాడుకలో ఉంది. ‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ, శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’ అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే. కాని, ఇందులో పదాలను చీల్చి శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ, యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి, మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల ఆళ్వారులు పన్నిద్దరైనారు.
పదుగురి పేర్లివి:

  1. భూత ఆళ్వారు (పూదత్త ఆళ్వారు అని వాడుక. కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం),
  2. పొయగై ఆళ్వారు. పాంచజన్యం అనే శంఖం అంశ. సరోయోగ అని కూడా అంటారు).
  3. పేయాళ్వార్‌ (మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక. నందకం అనే ఖడ్గం అంశ).
  4. తిరుమళిశై ఆళ్వారు (భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ).
  5. కులశేఖ రాళ్వారు (కౌస్తుభమణి అంశ).
  6. తొందర డిప్పొడి ఆళ్వారు (విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి. తులసీదళాలు, పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల/ వనమాల అంశ. ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం).
  7. తిరుప్పాణి ఆళ్వారు (యోగి వాహన ఆళ్వారు. ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు.) విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.)
  8. తిరుమంగై ఆళ్వారు (పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం. విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం).
  9. పెరియాళ్వారు (భట్టనాథ ఆళ్వారు. ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు. వైకుంఠంలోని విష్ణువు రథం అంశ.
  10. నమ్మాళ్వారు (పరాంకుశ ఆళ్వారు. విష్వక్సేనుడి అంశ. శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.)

ఈ పదిమందిగాక ఆండాళును, మధురకవిని కూడా ఆళ్వారులన్నారు. పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు. పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ. కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు. మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు. గరుడాంశగా చెపుతారు. భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు. కాని, ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.


వైష్ణవ దేవాలయాలలో మనం ఆళ్వార్లుని దర్శించుకుంటాం. ఆళ్వార్ అంటే నిమగ్నమై ఉన్నవాడు అని అర్ధం. తాము నమ్ముకున్న విధానంపట్ల అచంచల విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నారని అర్ధం. ఆ శ్రీమన్నారాయణుని పట్ల భక్తిని పెంచుకున్నారు. ఆ భక్తిభావం కలిగిన అనంతరం వేరే భావాన్ని మదిలోకి రానివన్నంత గాఢంగా విశ్వాసాన్ని పెంచుకున్నారు. అందుకే భగవంతునికి అంత చేరువ కాగలిగారు. ప్రస్తుతం 12 మంది ఆళ్వార్లు లేని వైష్ణవాలయం ఉండదంటే అతిశయోక్తి కాదు.వీరు ఉన్నపుడే ఆ ఆలయానికి పూర్ణత్వం సిద్ధిస్తుందని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారయణుడే వీరిని స్వయముగా అనుగ్రహించడం ఇక్కడ విశేషం. అంతగా స్వామి ధ్యానంలో పరవశులైనారు వీరు.

వీరంతా శ్రీమన్నారయణుడికి సంబంధించిన ఆయుధాలు, ఆభరణాల అంశతో జన్మించారని కూడా అంటారు. దాని గురించి తెలుసుకుందాం.

భూతం సరశ్చ మహాదాహ్వాయ భట్టనాధ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్సరాంకుశ మునిం ప్రణతోస్మినిత్యం

భూతయోగి - పూదత్తాళ్వార్ - కౌమోదకి అనే గద
సరోయోగి - పోయిగయాళ్వార్ - పాంచజన్యం అనే శంఖం
మహాయోగి - పేయాళ్వార్ - నందకం ఖడ్గం
భట్టనాధుడు - పెరియాళ్వార్ - గరుడుడు
ఆండాల్ - గోదాదేవి - లక్ష్మీదేవి అంశ
భక్తిసారయోగి - తిరుమళిసైయాళ్వార్ - సుదర్శన చక్రం అంశ
కులశేఖరాళ్వార్ - కౌస్తుభమణి అంశ
మునివాహనులు - తిరుప్పాణాళ్వార్ - శ్రీవత్సలాంచన అంశ
భక్తాంఘ్రిరేణువు - తొండరడిప్పొడియాళ్వార్ - వైయజంతి అను పూమాల అంశ
పరకాలయోగి - తిరుమంగైయాళ్వార్ - శారంగం అను ధనస్సు
మధురకవి ఆళ్వార్ - కుముదాంశ
శఠకోపముని - నమ్మాళ్వార్ - విశ్వక్సేనుని అంశ

ఈ వరుస క్రమముని ఒక్కోరు ఒక్కో విధంగా చెప్తారు. వీరంతా దాదాపుగా దక్షిణదేశానికి చెందినవారు. ఇక, వీరిలో నలుగురేమో పల్లవ రాజ్యానికి, ముగ్గురేమో చోళదేశానికి, ఒకరేమో కేరళ కి చెందినవారుకాగా, మరో నలుగురేమో పాండ్యదేశానికి చెందినవారు. కులమతాలకు అతీతంగా వీరిలో అందరూ ఉన్నారు. ముందు చెప్పిన విధంగా ఈ 12 మందిలో ఒకరు దేశాన్నేలే రాజు కాగా, మరొకరు చోరవృత్తి చేసే వారు కూడా ఉన్నారు. ఆళ్వార్లు అందరూ మంచి కవులే.

ఇక ఆండాల్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆమె సాక్షాత్తూ శ్రీరంగడి పత్నిగా ఆయన హృదయంలోనే ప్రతిష్టితురాలైన గొప్ప భక్తురాలు. తిరుప్పావై ఈమె వ్రాసినదే. ఆమె తండ్రి పెరాయాళ్వార్ విష్ణుచిత్తుడిగా పేరుపొందాడు.



నారాయణతత్వాన్ని దర్శించిన మొదటి ముగ్గురు ఆళ్వారులు
ముదల్ ఆళ్వార్లు

మనకు నాలుగు వేల దివ్య ప్రబంధాలను పాడి అందించిన వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు. ఆందులో మొదటి ముగ్గురు ఆళ్వార్లు కలియుగానికి ముందు జన్మించిన వారు. వారు అందమైన రీతిలో తత్వాన్ని దర్శించినవారు. అందుకు ఒక చరిత్ర ఉంది. అందులో ఒక ఆళ్వార్ సరస్సులో లభించారు. అందుకు ఆయనకు సరోయోగి అని పేరు. పొయ్-గై  అంటే ద్రవిడ భాషలో సరస్సు అని అర్థం.  మరోక ఆయన పుష్పంలో పుట్టారు అందుకే ఆయనకు పూదత్త, క్రమేపి భూత యోగి లేక భూదత్తాళ్వార్ అని పేరు వచ్చింది. మరొకాయనకు భగవంతుడు అంటే పిచ్చి వ్యామోహం, అందుకే ఆయనకు మహాయోగి అని పేరు. పేయ్ ఆళ్వార్ అని అంటారు. పేయ్ అంటే ద్రవిడ భాషలో పిచ్చి అని అర్థం.



Wednesday, 14 February 2018

శివరాత్రి











మాంపాహి మహేశ్వరా..!

‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టద’ని విశ్వసించి ఎనలేని నిశ్చింతను పొందినా... ‘శివరాత్రితో చలి శివ శివా అంటూ పోతుంద’ని ప్రకృతి మార్పును నానుడిగా ఏటా మురిపెంగా గుర్తుచేసుకున్నా... ఆఖరికి అశుభవాక్కులు వినపడినప్పుడు ‘శివశివా’ అని చెవులు మూసుకునే సున్నితత్వాన్ని ప్రదర్శించినా... తరతరాల తెలుగువారి సాంస్కృతిక జీవితంలో బోళాశంకరుడిది ప్రత్యేక స్థానం. జానపద కళల్లో, బైరాగి తత్వాల్లో, పాటల్లో, ఆటల్లో ఆ నటరాజ ముద్ర ప్రస్ఫుటం. అందుకే ఆ ఆదిదేవుడి తత్వం నేటికీ ఒక జీవన మార్గం.

హాలాహలాన్ని కంఠంలో, అగ్నిని ఫాలనేత్రంలో దాచుకుని కూడా చల్లని వెన్నెల్లాంటి వరాలు కురిపించే విలక్షణ దైవం హరుడు. భేషజాలకూ వైభవాలకూ దూరంగా నిరాడంబర జీవిత ప్రాముఖ్యం తెలిపి, లౌకిక జీవితంలోని మనందరికీ దారి చూపే తత్వం శివతత్వం. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, సమస్త జీవరాశి పట్లా దయతో మెలగడం, ప్రేమను నలుగురితో పంచుకోగలగడం... ఇవన్నీ ఆ తత్వంలో అంతర్లీనంగా కనిపించే అంశాలే. ఉన్నతికి దోహదపడే సోపానాలే.

పాలసముద్రము సిల్కెయాళ
నిను పాగల్‌గానిగ జేస్తిరయ్య!
అమృత మిడిసిపెట్టి ఇషమా..?
శబ్బాష్‌రా... శంకరా!!
అంటూ... తనికెళ్ల భరణి ‘ఆటగదరా శివా’లో ఆ దేవదేవుడి గురించి ఎంత చక్కగా చమత్కరించారు.
అమృతాన్ని సేవించేటప్పుడూ, అంతా కలిసి విందులూ, వినోదాలూ చేసుకునేటప్పుడూ అక్కడ శివుడి ఊసే ఉండదు. కానీ లోకాన్ని గడగడలాడించిన గరళాన్ని తాగాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరికీ శంకరుడే కావాలి. అయినా సరే విషాన్ని తాగేందుకు ఒక్క క్షణం ఆలోచించడు ఆ దేవదేవుడు. పట్టుబట్టలు కట్టే దేవుళ్లలో త్రిశూలధారి పేరే ఉండదు. కానీ మందమైన కరి చర్మం కట్టాలంటే అతడే దిక్కు. గంగస్నానాల పుణ్యం అందరికీ కావాలి కానీ ప్రళయ రూపంలో వచ్చే గంగమ్మను అడ్డుకోవాలంటే శివయ్యే రావాలి. భక్తుల వేషంలో వచ్చి కోర్కెలు కోరిన రాక్షసులకైనా వరాలిచ్చే శంకరుడి లాంటి బోళాదేవుడు, దీనబాంధవా నీవే దిక్కని వేడినంతనే కరిగిపోయే అల్పసంతోషీ ఇంకెక్కడా కనిపించడు. అలాంటి నవనీత హృదయుడిని శరణు శరణని మోకరిల్లితే చాలు వశుడైపోతాడు, పరమసంతోషంతో నెత్తినపెట్టేసుకుంటాడు.

నిరాడంబరం...
దేవదేవుడూ, పశుపతీ అయిన ఆ పరమేశ్వరుడు ఆడంబరాలకు దూరంగా ఉంటాడు. భిక్షాటనే జీవనాధారం. రుద్రభూమే శాశ్వత స్థానం. ఎప్పుడూ పులితోలు కప్పుకుని తిరుగుతుంటాడు. ఆభరణాల ఊసేలేదు సరికదా విషపునాగులను మాలలుగా ధరించి మురిసిపోతుంటాడు. రుద్రాక్షల్ని దండలుగా గుచ్చుకుని హారాలంటాడు. పోనీ, సిగలోని చంద్రుడినైనా చూసి ముచ్చటపడదామంటే అదీ కుదరదు. ఆ జడలను పట్టుకు వేలాడేవాడు వెన్నెల సోనలు వెదజల్లే నిండు చంద్రుడేం కాదు కళాకాంతీలేని సన్నని చంద్రవంక. రంకెలేయలేని ముసలి ఎద్దే వాహనంగా ఊరేగుతాడు. ఇక శివుడి చుట్టూ ఉండే పరివారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకటో రకం ప్రమథ గణం. నందికి నందే సాటి, భృంగికి భృంగే పోటీ. వీరినే మగపెళ్లివారిగా తీసుకుని పర్వత రాజు ఇంటికి ధూంధాంగా బయలుదేరాడట పశుపతి. వియ్యాలవారు ఈ దండు మొత్తాన్నీ చూసి ముక్కునవేలేసుకున్నారట. పర్వతరాజు వీరిని ఎలా సంబాళించుకురాగలడోననీ, పార్వతి సంసారం ఎలా సాగుతుందోననీ భయపడ్డారట. ఇంత సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నవాడు జగతికి ఏ రీతిన సందేశమివ్వగలడని సంశయించవచ్చు. అక్కడే ఉంది చిదంబర రహస్యం. కలియుగంలోని మనుషుల తీరు చంద్రశేఖరుడికి తెలిసినట్టుగా మరొకరికి తెలీదు. వెయ్యి చెబితే పదో పరకో అవగాహన చేసుకునే మనస్తత్వం మనది. కాబట్టే తనను తాను తక్కువగా చేసుకున్నట్లు కనిపిస్తూ నేలమీద నడవడమంటే ఇదేనంటూ మనిషి జీవితం ఇలానే ఉండాలంటూ సందేశాన్ని అందిస్తున్నాడు. ‘మామూలు మనుషులుగా ప్రేమ స్వరూపులుగా మెలగండి, ఆడంబరాలను నెత్తికెక్కించుకోకుండా మానవత్వంతో జీవించండి’ అనే హితోక్తులను తన ప్రవర్తన ద్వారా అందరికీ చెబుతున్నాడన్నమాట.

అర్ధనారీశ్వరం...
జగతికి తల్లీతండ్రీ అయిన శివపార్వతులు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేరు. విచిత్రమేంటంటే ఆదిదంపతులైన వీరివి భిన్న నేపథ్యాలు. పార్వతీ దేవి హిమవంతుని కుమార్తె. సిరిగలవారింట పుట్టిన పిల్ల. యువరాణి. బాల్యం నుంచీ భోగభాగ్యాలు అనుభవించింది. కానీ, జంగమయ్యను చేరాక అదంతా మటుమాయమైపోయింది. వల్లకాడులో సంసారం నడపమంటాడు. భవతీ భిక్షాందేహీ అంటూ కపాలం పట్టుకుని ఊరంతా తిరుగుతుంటాడు. రూపమయినా చక్కనిదా అంటే అదీకాదు. ఎగుడు దిగుడు కన్నులతో ఉంటుంది. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు, తక్కువచేసి మాట్లాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకల మీదికి తెచ్చుకుంటాడు శివుడు. కానీ ఆయన్ని పల్లెత్తుమాటయినా అనని మహా ఇల్లాలు పార్వతి. కఠోర తపస్సుచేసి మరీ శివుడిని తనవాడిగా చేసుకున్న ఆ తల్లికి ఆయన గురించి తెలియనిది అంటూ ఏదీ ఉండదు కదా! గంగమ్మను తెచ్చి సిగలో ఉంచుకున్నా లోకం కోసమే శివయ్య ఆ పని చేశాడని అర్థం చేసుకోగలిగింది. తనకంటే ప్రమథగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ మరోలా ఆలోచించలేదు. తనను నమ్మినవారిని నట్టేట ముంచని భర్త ప్రవర్తనను గర్వంగా చెప్పుకుంది. క్షీరసాగరాన్ని మధించే వేళ అమృతం పుడితే ఎవరో తాగుతారట. కామధేనువూ, కల్పతరువూ వేరెవరో తీసుకుంటారట. కానీ, కాలకూటం వెలువడినప్పుడు మాత్రం తన భర్తదగ్గరకే పరుగులు తీస్తారట. అయినాసరే కట్టుకున్నవాడు చేస్తున్న పని లోకరక్షణ కోసమే అయినప్పుడు తన పసుపుకుంకాలకు ఢోకా ఉండదన్న ధైర్యం ఆమెది. లయకారకుడయిన పతిని ఏ విషమయినా ఏం చేయగలుగుతుందని తనను తానే సమాధాన పరుచుకుంది. సర్వమంగళ అయిన తనకు చింత ఎందుకని సర్ది చెప్పుకుంది.

శంకరుడు నిశ్చలంగా విషాన్ని సేవిస్తుంటే ఆయన పక్కన అంతకంటే నిశ్చింతగా నిలవగలిగింది. రాయిలాంటి భర్తను రాగమయుడిగా, అనురాగమయుడిగా, ప్రేమస్వరూపుడిగా చేయగలిగింది. సదాశివుడూ అంతే, ఏ సందర్భంలోనూ సతికి అడ్డుచెప్పింది లేదు. ఆమె నిర్ణయాలను కోరికలను ప్రశ్నించిందీ లేదు. ఆమె స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఆమెవే అనుకునేవాడు. ఈశ్వరుడు జటాధారిగా, తోలుదుస్తులతో నడయాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో సర్వాలంకారశోభితయై అలరారుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆది దంపతులుగా వీరు జగత్ప్రసిద్ధమైంది ఇందుకే.

భక్తికి వశం...
శివుడిని శరణు కోరిన మార్కండేయుడు యమపాశం నుంచి బయటపడి చిరంజీవి అయ్యాడు. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన అనంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగర తీరంలో సైకత లింగాన్ని ప్రతిష్ఠించి, అర్చించి పాపవిముక్తుడయ్యాడు. శివుడికి తన కన్నులనే అర్పించిన తిన్నడు భక్తకన్నప్పగా ప్రసిద్ధి చెందాడు... ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో మహాభక్తుల చరితలు మనకు దృష్టాంతాలుగా కన్పిస్తాయి. అలాంటి నిగర్వి, నిరాకార, నిర్గుణ, నిరాడంబరుడైన నిలాక్షుడి ప్రేమానురాగాలు తెలిపే గాథలు అనంతం. ఎల్లలు లేనిది ఆయన మమకారం. ‘శివా’ అని ఆర్తిగా పిలిస్తే, మరుక్షణం చెంతనిలిచే ఆశ్రిత వత్సలుడాయన. అంతేనా, ఆ భక్తవశంకరుడి వాత్సల్యానికి సురాసుర భేదం లేదు. అందుకే కదా, భస్మాసురుడు ఆ నీలకంఠుడి నుంచి అవలీలగా వరాన్ని పొందగలిగాడు. ఎవరి తలమీద చెయ్యి పెడితే వాడే బుగ్గయి పోతాడన్న భరోసా దక్కించుకున్నాడు. శివుడి మీదనే ఆ వరబలాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అప్పుడిక ఆ రాక్షసుడి బారినపడకుండా తప్పించుకునేందుకు ఆ కైలాసనాథుడు నానాయాతనా పడాల్సివచ్చింది. రావణాసురుడూ అలాగే కదా ఆ పరమపావనుడిని ప్రసన్నం చేసుకున్నది. ఇక్కడే అంతర్లీనమైన ఒక ధర్మసూక్ష్మం ఉంది. దుష్టుల పట్ల జాగరూకతతో మెలగడం మనిషిలక్షణం. దుర్మార్గుడిని సైతం ప్రేమించగలగడం దైవత్వం. పశుపతి అసలైన దైవం కాబట్టే రాక్షసుల విషయంలోనూ దయనూ ప్రేమనూ ప్రకటించగలిగాడు. ఆ దిశగా యోచన చేసి తీరాలంటూ మానవాళికి హితవు చెప్పాడు.

మనలోని దైవం...
శివుడిని ప్రథమ దేవుడూ దేవాది దేవుడూ మహాదేవుడూ అంటూ ధ్యానించినా దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో అని కీర్తించినా ఆయనలోనూ మనిషికి మల్లేనే కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. కామం, క్రోధం, వాత్సల్యం, హాస్యచతురత, అనంతమైన ప్రేమ, అంతులేని అనుగ్రహం ఆయనలోనూ అగుపిస్తాయి. తనను ఒకింటివాడిగా చేద్దామని ప్రయత్నించిన మన్మథుడిని దహించివేస్తాడు శంకరుడు.  రతీదేవి బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్న తర్వాత కానీ మదనుడికి మరో జన్మ దక్కలేదు. ఈశ్వరుడు కోపంతో చేసినా, ప్రేమతో చేసినా ఆయన చేసిన ప్రతీ పనీ జగత్కల్యాణ కారకమవుతుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలా మనిషే శివుడూ దేవుడే మానవుడూ అని చాటిచెప్పడం వెనక కారణం లేకపోలేదు. ఎవరైనా ఎవరితోనయినా సరిపోల్చుకోవాలంటే పోలికలుంటేనే సులభవుతుంది. మనలాంటి వాడే శివుడూ అనుకుంటేనే అతగాడిని పలకరిస్తాం, నమస్కరిస్తాం. ఆయన దారిలో వెళ్లడం మొదలెడతాం. ఆయన తత్వాన్ని మనతత్వంగా మలచుకుంటాం. మహనీయులుగా రూపాంతరం చెందుతాం. ఇంతటి మార్మిక తార్కిక సిద్ధాంతం పార్వతీపతిలో లీనమై ఉంది. కాబట్టే, శంకర భగవత్పాదులు ‘శివ’ అనే రెండక్షరాలు పలికితే పాపాలన్నీ పటాపంచలయి పోతాయని చెప్పారు.

స్త్రీవాదం...
కైలాసనాథుడిని మించిన స్త్రీవాది, మహిళాపక్షపాతి మరొకరు ఉండరని చెప్పడానికి ఉదాహరణలు అనేకం. ఆడవారు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మనం ఇప్పుడు ప్రసంగాలిస్తున్నాం. కానీ, యుగాలనాడే ఈ వాదన వినిపించడమే కాదు, ఆచరణకు దిగిన ఆదిదేవుడు ఆయనే. తనలో అర్ధభాగాన్ని ఇచ్చానని ఈశ్వరుడెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సహజంగా, స్వతంత్రంగా ఆయన దేహంలో ఆమె కలిసిపోయింది. అలా ఆమె కలవడానికి అనువుగా మనసా వాచా కర్మణా తనను తాను మార్చుకోగలిగాడు. అంతెందుకు... ప్రదోషవేళలో తానొక్కడే ఆడిపాడి ఆనందించడు. నటరాజుగా నృత్యకేళీ విలాసాల్లో తేలుతున్నప్పుడూ శంకరుడు ఒంటరి కాదు. ఆదిశక్తితో కలిసి నర్తిస్తూ మహదానంద భరితుడవుతాడు. ఆ ఆటను చిత్కళగా భావించి గౌరవిస్తాడు. అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఈ ముక్కంటికి మించిన స్త్రీవాది ఎవరుంటారు? ఇంకా చెప్పాలంటే పార్వతమ్మ ముచ్చటపడి తయారుచేసి, ప్రాణం పోసి మరీ ఇంటి ద్వారపాలకుడిగా నియమించుకున్న బాలుడిని రెండు ముక్కలుగా చేసేస్తాడు ముక్కోపి. విషయం తెలిసి ఆమె ఘొల్లుమంటుంది. ఆమెను శాంతింపజేయడానికి ఏనుగు తలను తెచ్చి మరీ పిల్లాడికి అతికిస్తాడు. వినాయకుడిగా అక్కున చేర్చుకుంటాడు. గణాధిపతిగా అధికారాన్ని కట్టబెడతాడు. భార్యకు అంతగా విలువనిచ్చే పతి మహేశ్వరుడు.

ప్రకృతే రూపం...
సదా ధ్యానముద్రుడై కనిపించే ఆ పరమ శివుడి రూపం, ఆభరణాలూ, ఆయుధాలూ... ప్రతీదీ ఓ ప్రతీకే. త్రిశూలం సత్వ రజః తమో గుణాలకు ప్రతీక. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్థ చింతనకు మరోరూపం. ఏనుగంటే నిలువెత్తు గర్వం. వాటన్నింటినీ జయించినవాడు శివుడు. మనమూ వీటిని విడనాడాలి అని తెలిపేదే శివతత్వం. నంది ధర్మానికీ, సర్పాలు నిర్భయత్వానికీ నిదర్శనం.

ఆద్యంతరహితుడూ పంచభూతాత్మక స్వరూపుడూ అయిన మహా శివుడిని ‘నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంతో ధ్యానిస్తాం. ఈ మంత్రంలోని అయిదు బీజాక్షరాలూ విశ్వంలోని పంచభూతాలకూ ప్రతీకలు. ఇందులో న - భూమి, మః - జలం, శి - వాయువు, వా - అగ్ని, య - ఆకాశతత్వాలకు సూచికలుగా నిలుస్తున్నాయి. ఈ పంచభూతాల రూపాల్లో వెలసిన పంచభూత లింగాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నాయి. కంచిలో ఆ ముక్కంటి పృథ్వీలింగ రూపంలో ఆవిర్భవించాడు. తిరువణ్ణామలైలో తేజోరూపంలో ఉన్న అరుణాచలేశ్వరుడు అగ్నికి గుర్తు. జంబుకేశ్వరంలో జలలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో వాయులింగంగా... ఆ పరమశివుడు పూజలందుకుంటున్నాడు. ప్రకృతే శివుడూ శివమే ప్రకృతి అన్న సత్యాన్ని మానవాళికి చాటి చెప్పడమే ఇందులోని ఆంతర్యం, అంతరార్థం కూడా.

స్వార్థ చింతన, అసత్య భాషణం, కష్టాలకు కుంగిపోవడం, ప్రాణకోటిపట్ల దయలేకుండా ఉండటం... ఇలాంటి అవలక్షణాలే మన బాధలకూ కష్టాలకూ హేతువులు. వీటిని ఎలా దూరం చేసుకోవాలో, మనిషి మనిషిగా ఎలా బతకాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మనల్ని మనం ఎలా ఆవిష్కరించుకోవాలో తెలిపేదే శివతత్వం. ఒక్కమాటలో చెప్పాలంటే శివతత్వాన్ని అర్థం చేసుకోవడమంటే శివుడిలా మెలగడమే.

అంతా భ్రమని తెలుసు, బతుకంటే బొమ్మలాటనీ తెలుసు, కథని తెలుసు, కథలన్నీ కంచికే చేరుతాయనీ తెలుసు. అయినా జరిగేదీ జరుగుతోందీ నిత్యమనీ శాశ్వతమనీ భావించే అజ్ఞానపు మిడిసిపాటు మనిషిది. అనుకున్నది జరగకపోయినా, అనుకోని కష్టమొచ్చినా భరించలేని మనస్తత్వం... ఇలా చెప్పుకొంటూ పోతే మానవుల్లో తర్కించాల్సినవీ సరిచేసుకోవాల్సినవీ ఎన్నో. వీటన్నింటికీ శివ తత్వాన్ని అనుసరించడమే మనిషికి మార్గం. శివయ్యలా ప్రేమిస్తే, అలానే ఆదరిస్తే, అదేవిధంగా ఆలోచిస్తే... సమస్త విశ్వంలోనూ శివతత్వమే వెల్లివిరుస్తుంది. ప్రతి మనిషిలోనూ శివుడే కనిపిస్తాడు.

తెలుగు నేలపై...
పంచారామాలకు నెలవై, అష్టాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగమైన తెలుగు నేల నలుచెరగులా పరచుకున్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఎన్నో... మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని తెలిపే కథలూ, గాథలూ చిరస్మరణీయం. మూర్తి రూపంలోనూ, లింగాకారంగానూ పూజలందుకునే దైవం శివుడు. కానీ, లింగ రూపమే అందులో ప్రధానమైంది. ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని విశ్వసిస్తారు నాయనార్లు. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలను అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొంటారు. అందులో కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున లింగం ఒకటి. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆది శంకరాచార్యులు శివానందలహరిని ఇక్కడే రాశారని ప్రతీతి.

* పురాణాల ప్రకారం తారకాసురుడు నేలకూలడంతో అతనిలోని ఆత్మలింగం అయిదు ముక్కలైంది. దేవతలు ఆ అయిదింటినీ అయిదు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఆ ప్రసిద్ధ క్షేత్రాలే పంచారామాలుగా ఆ దేవదేవుని ఆవాసాలుగా వెలుగొందుతున్నాయి. అవే ఆంధ్రప్రదేశ్‌లోని... దక్షారామం (ద్రాక్షారామం, తూ.గో. జిల్లా), కుమారారామం (సామర్లకోట, తూ.గో. జిల్లా), క్షీరారామం (పాలకొల్లు, ప.గో. జిల్లా), సోమారామం (భీమవరం, ప.గో. జిల్లా), అమరారామం (అమరావతి, గుంటూరు జిల్లా). ఇవికాక శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగేశ్వరం, చిత్తూరులోని కపిలతీర్థం, పశ్చిమ గోదావరిలోని ముక్తేశ్వరం, గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ, కర్నూలులో మహానంది, అదే జిల్లాలోని యాగంటి ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి.

* తెలంగాణలో సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రామప్పదేవాలయం, వరంగల్‌లోని ఐనవోలులో కాకతీయులు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం, కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి దేవాలయం, వేములవాడలో చాళుక్య రాజులు నిర్మించిన కోడెమొక్కులరాజరాజేశ్వరస్వామి దేవాలయం... నేడు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్రలో’ నల్గొండ జిల్లా పానగల్లు ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీనమైన పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం ఇక్కడివే.
లింగోద్భవ కాలమే...
మన ముఖ్యమైన పండగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుతాం.ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా పూజలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైంది. దీన్ని అత్యంత విశిష్టమైందిగా భావిస్తారు. సృష్టి స్థితికారకులైన బ్రహ్మదేవుడికీ శ్రీమహావిష్ణువుకూ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంమీద వాగ్వాదం మొదలైంది. ఒక్కోజామూ గడిచేకొద్దీ వాదాల వేడి పెరుగుతోంది. వారిని శాంతింప చేయమంటూ దేవతలంతా ముక్కంటికి మొరపెట్టుకున్నారు. లయకారుడైన ఆ కైలాసనాథుడు తేజోలింగరూపాన వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సందేహాలు తీర్చాడు. అపోహలు పారదోలాడు. ఆ రోజు... బహుళ చతుర్దశి. భక్తకోటికి పరమ పవిత్రమైన శివరాత్రి.దిగంబరుడు లింగరూపంలో అవతరించిన కాలమే లింగోద్భవ పుణ్యకాలం. భక్తకోటికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి.ఉపవాసం శారీరక శుద్ధికీ, జాగారం చేస్తూ ధ్యానం చేయడం మనోశుద్ధికీ ఉపకరిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
దంతుర్తి లక్ష్మీప్రసన్న








శివోద్భవ రాత్రి

శివుడు లింగాకృతిలో స్వర్గ మర్త్య పాతాళాల్లో ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. ఇది ప్రతి ఏడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశినాడు అర్ధరాత్రివేళ సంభవిస్తుంది. ఈ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట. అంతులేని సిరుల మూట. ఉపాసనలకు నెలవు. పూజలకు కొలువు. శివుడు లింగాకృతిలో ఆవిర్భవించడానికి ఒక నేపథ్యం ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువులు ఆధిపత్యాల గురించి వాదించుకున్నారట. ఇంతలో వారి ఎదుట ఒక శివలింగం ఉద్భవిస్తుంది. వారు ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది పెరగడం ప్రారంభిస్తుంది. క్రమంగా భూమిని చీల్చుకొని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ వూర్ధ్వలోకాలకు విస్తరిస్తుంది. అప్పుడు బ్రహ్మవిష్ణువులిద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు.

బ్రహ్మదేవుడు హంసలా మారిపోయి, ఆకాశంలోకి ఎగిరి వెళతాడు. విష్ణువు వరాహంగా మారి, నేలను చీల్చుకుంటూ పాతాళానికి చేరతాడు. వారిద్దరూ అలుపూ సొలుపూ లేకుండా ఎంత దూరం వెళ్లినా, శివలింగం అంతాన్ని చూడలేకపోతారు. తిరిగి యథాపూర్వ స్థానానికే చేరుకుంటారు.అప్పుడు వారి ఎదుట పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. తాను శివలింగం అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు అసత్యం పలికాడట. విష్ణువు సత్యం పలుకుతాడు. అసత్యం మాట్లాడిన బ్రహ్మకు లోకంలో పూజార్హత ఉండదని శివుడు శపిస్తాడు. బ్రహ్మదేవుడు నిరసించడంతో, ఆ శివ దూషణను కాలభైరవుడు సహించలేకపోతాడు. శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి, బ్రహ్మ అయిదో తలను ఖండిస్తాడట. ఆనాటి నుంచి ఆయన నాలుగు తలలవాడయ్యాడని, అనంతరం బ్రహ్మవిష్ణువులిద్దరూ శివమహిమను అంగీకరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.

శివపూజారంభంలో భక్తుడు తనలో శివుణ్ని భావించుకుంటాడు. తనతో పాటు ఈ సమస్త ప్రపంచం శివమయం అని విశ్వసించి పూజించే పద్ధతినే ‘ఆత్మపూజ’ అంటారు. శంకర భగవత్పాదులు ‘శివానంద లహరి’లో ఈ పూజా విధానాన్ని వర్ణించారు. ‘ఓ పరమేశ్వరా! నా ఆత్మ నీవు. నా బుద్ధి పార్వతీదేవి. నా ప్రాణాలే మిత్రులు. నా శరీరమే ఇల్లు. నేను అనుభవిస్తున్న సౌఖ్యాలే నీ పూజలు. నా నిద్రే తపస్సు. నా సంచారమే నీకు ప్రదక్షిణం. నేను పలికే మాటలే నీ స్తోత్రాలు. నేను చేస్తున్న పనులన్నీ నీ ఆరాధనలే!’- ఈ మాటల్లో ఎంతో పరమార్థం ఉంది.

మనిషి శివుణ్ని నిష్కల్మషంగా పూజించాలనుకుంటే, తన ఆత్మ అంతా శివుడే నిండి ఉన్నట్లు భావించాలి. మనిషి శివారాధనలో చతుర్విధ ముక్తులూ పొందుతాడని శంకర భగవత్పాదుల ఉపదేశం. భక్తుడు తానే శివుడై చేసే పూజలో శివుడి ‘సారూప్యం’ (సమాన రూపం) ఉంటుంది. అందుకే ఇది సారూప్య ముక్తి. శివభక్తులతో సాహచర్యం చేస్తూ శివాలయాల్ని సందర్శించడం వల్ల ఆయన సమీపానికి చేరుకున్నట్లు అవుతుంది కనుక ఇది సామీప్య ముక్తి. ఈ ప్రపంచం అంతా శివమయమే కాబట్టి, ఈ లోకంలో తానూ ఉన్నందుకు మనిషికి ‘సాలోక్య ముక్తి’ లభిస్తుంది. శివుడితో మానసికమైన అనుసంధానం ఉంటుంది. ఆ కారణంగా ‘సాయుజ్య ముక్తి’ లభించినట్లే. ఇలా శివుడి పూజ వల్ల చతుర్విధ ముక్తులనూ ఇహలోకంలోనే పొందుతున్న మనిషి ధన్యుడు.

శివుడి అర్చనలోని వస్తువులన్నీ ఆయన ప్రసాదించినవే. శివ జటాజూటంలోని గంగానది నీళ్లను అనుగ్రహిస్తుంది. శివుడి నేత్రమైన సూర్య కిరణాల వల్ల పూలు లభిస్తున్నాయి. శివుడి తలపైన గల చంద్రుడి దయతో పండ్లు లభిస్తున్నాయి. బిల్వదళాలు చేతికి అందుతున్నాయి. అవన్నీ శివ ప్రసాదాలే!

ఇలా శివుడు ఇచ్చిన సంపదలన్నింటినీ ఆయనకే అర్పించడం శివార్చన. దాని పరమార్థం- ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదని, అవి సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవని గ్రహించడం. మానవ జీవనం భోగమయం కారాదని, త్యాగమయం కావాలని తెలియజేసేదే మహాశివరాత్రి!

అనునిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంలా రూపొందించాలి. తనలో అందరిని, అందరిలో తనను చూసుకొని ఈ ప్రపంచాన్ని శివుడిగా భావించడమే అతడి కర్తవ్యం. మహాశివరాత్రి పర్వదినం అందజేసే సందేశం ఇదే! ఈ శివభావనతో పరమశివుణ్ని ఆరాధిస్తేనే, లోకమంతా శివ(మంగళ)మయం అవుతుంది!





మహాశివరాత్రి

మన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఇది మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి మరీ ప్రీతికరమైంది. ఆ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణచతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు. శివరాత్రులు అయిదు రకాలు. అవి.. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. నిత్యశివరాత్రి అంటే ప్రతిరోజూ రాత్రిపూటచేసే శివారాధన. పక్ష శివరాత్రి అంటే ప్రతి పదిహేను రోజులకొకసారి శివార్చన కోసం నిర్దేశించిన రాత్రి. మాసశివరాత్రి అంటే ప్రతి మాసంలోనూ శివపూజకు ఉద్దేశించిన రాత్రి. మిగతా శివరాత్రులు ఏవి కుదిరినా కుదరకపోయినా ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రినాడు శివపూజ చేయడం పుణ్యప్రదం. యోగి అయినవాడు తన యోగబలం చేత యోగనిద్రలోకి వెళ్లే రాత్రిని యోగశివరాత్రి అని అంటారు. సాధారణంగా రాత్రిపూట దేవీపూజను, పగటిపూట దేవపూజను చేయడం ఒక ఆచారంగా ఉంటుంది. కానీ శివరాత్రి విషయంలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున రాత్రిపూటే శివపూజ జరుగుతుంది. త్రిమూర్తులలో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఇలా శివ ఆరాధన రాత్రిపూట జరగడానికి ఓ కారణం కూడా ఉంది. పూర్వం ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది. ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. శివరాత్రినాడు శివుడిని రాత్రిపూట మాత్రమే పూజించడం, మిగిలిన పండుగలలా పంచభక్ష్య పరమాన్నాలతో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఓ విశేషం. మహాశివరాత్రి వ్రతాచరణను గురించి లింగపురాణం పేర్కొంటోంది. వ్రత ఉద్యాపన గురించి స్కందపురాణంలో వివరంగా ఉంది. శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం, రాత్రిపూట లింగార్చన, జాగరణం చేస్తారు. లింగార్చన తరువాత పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేయడం కూడా ఓ అలవాటుగా వస్తోంది. శివరాత్రినాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాలలో కూడా కొన్ని పద్ధతులున్నాయి. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాములలోనూ నాలుగు సార్లు నాలుగు రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు. మొదటి జాములో పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెడతారు. రుగ్వేద మంత్ర పఠనం జరుపుతారు. రెండో జాములో పెరుగుతో అభిషేకం, తులసీ దళార్చనచేసి, పాయసం నైవేద్యంపెట్టి యజుర్వేద మంత్రాలను చదువుతారు. మూడోజాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, నువ్వుల పొడి కలిపిన తిను బండారాలను నివేదిస్తారు. సామవేద మంత్రపఠన చేస్తారు. నాలుగో జాములో తేనెతో అభిషేకంచేసి నల్ల కలువలతో పూజించి అన్నం నివేదిస్తారు. అధర్వణ వేద మంత్రాలను చదువుతారు. ఇలా అభిషేకాలు చేసే శక్తిలేనివారు అభిషేకం చేసేటప్పుడు శివదర్శనం చేసుకున్నా పుణ్యమేనంటారు. నాలుగో జాము ముగిశాక ఉదయంపూట శివుడిని ఊరేగిస్తారు. ఇలా ఊరేగించడం వెనుక ఓ సామాజిక అంతరార్థం ఉంది. ఎవరైనా ఏ కారణం చేతనైనా ఆలయాలకు వెళ్ళి శివదర్శనం చేసుకోలేకపోతే వారికి ఆ ఊరేగింపును చూసి పుణ్యం పొందే భాగ్యం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రినాడు విధిగా చేస్తుంటారు. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్ళు శివలింగం మీద పోసి మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగంమీద పెడితే బోళాశంకరుడు పరవశించి అలా చేసినవారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో కనిపిస్తున్నాయి.




అరుణాచలం.. శివమయాచలం!

స్మరించినంత మాత్రాన ముక్తినిచ్చే క్షేత్రం అరుణాచలం. స్వయంభువుగా కొలువైన అక్కడి శివుడు అరుణాచలేశ్వరుడు. ఈ క్షేత్ర మహిమ పురాణ ప్రసిద్ధం. శివ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణాల్లోనే కాకుండా ఋగ్వేద, అధర్వణ వేద మంత్రాల్లో కూడా అరుణాచల ప్రసక్తి ఉంది. కొన్ని ఉపనిషత్తులు, సంహితలు అరుణాచల మాహాత్మ్యాన్ని ప్రశంసించాయి.

శివరాత్రితో ముడిపడిన క్షేత్ర పురాణం!
అరుణాచలానికి ఎన్నో పేర్లున్నాయి. ప్రధానంగా శోణాద్రి (ఎర్రని కొండ)గా ప్రాశస్త్యం పొందింది. ఈ పేరు రావడానికీ, అరుణాచలానికీ- శివరాత్రికీ ఎంతో సంబంధం ఉంది.
దీనికి సంబంధించిన కథ ఇది.

బ్రహ్మ విష్ణువుల మధ్య ‘ఎవరు గొప్ప?’ అనే వాదం తలెత్తింది. అది వివాదంగా మారింది. యుద్ధానికి దారితీసింది. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్రాల ప్రయోగానికి వారు సిద్ధమవుతున్న సమయంలో- బ్రహ్మ విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభంగా పరమ శివుడు ఆవిర్భవించాడు. ఇదీ క్లుప్తంగా కథ.

అలా ఆవిర్భవించింది శివుడని తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు ప్రార్థించడంతో శివుడు సాక్షాత్కరించాడు. ‘‘త్రిమూర్తులలో ఎక్కువ, తక్కువలకు తావు లేదు. సృష్టి-స్థితి-లయాలకు ప్రతీకలుగా ముగ్గురినీ పరాశక్తి సృష్టించింది. ఆమె సంకల్పాలను నిర్వర్తించడమే మన కర్తవ్యం’’ అని హితబోధ చేశాడు.

శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘ కృష్ణ చతుర్దశి- అర్ధరాత్రి. ఆ రోజును మహా శివరాత్రి పర్వదినంగా యావద్భారతదేశం పాటిస్తోంది. మహాదేవుడికి తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, నిర్వహిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, శివనామాన్ని జపిస్తారు. శివాలయాలకు వెళ్తారు. రాత్రి జాగరణం చేసి, లింగోద్భవ సమయంలో (అర్ధరాత్రి) శివుడిని దర్శించి, అనుగ్రహ పాత్రులవుతారు.

ఆధ్యాత్మిక రమణాచలం!
మహాశివరాత్రి అనగానే తమిళనాడులోని అరుణాచలం గుర్తుకొస్తుంది. అరుణాచలం అనగానే భగవాన్‌ శ్రీ రమణ మహర్షి స్మరణకు వస్తారు. పధ్నాలుగేళ్ళ వయసులో అరుణాచలం వచ్చిన వెంకటరామన్‌ (రమణ మహర్షి) జీవితాంతం అరుణగిరి సానువులలోనే గడిపారు. అరుణాచలానికీ, రమణ మహర్షికీ మధ్య అంత విడదీయరాని బంధం ఉంది. ‘‘అరుణాచలాన్ని పాషాణాలు, ముళ్ళ పొదలతో కూడిన మామూలు పర్వతంగా భావించవద్దు. ఇది పరమేశ్వరుని ప్రతిరూపం. అరుణం అంటే శక్తి- పార్వతి, ప్రకృతి, అచలం అంటే నిశ్చలాత్మ, శివుడు, పురుషుడు. ప్రకృతీ పురుషుల సమ్మేళనం... సగుణ నిర్గుణా ఏకత్వ రూపం ఇది!’’ అని ఆయన అనేవారు.

హిమాలయాల కన్నా పురాతనం!
పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా అరుణగిరి గొప్పతనాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. సృష్టికి పూర్వమే అరుణగిరి ఉందనీ, సూర్యుడి నుంచి విడివడిన భూమి అగ్నిమయంగా ఉన్న దశ నుంచి ప్రకృతిలో సహజ సిద్ధమైన మార్పులు పొందుతూ చల్లబడి ఏర్పడిన తొలి పాషాణమయ స్థానం అనీ, ఇది ఆసియా ఖండంలో భాగం కాదనీ, అప్పటి మహా సముద్రంలో మునిగిన లెమోరియా ఖండంలో భాగమనీ, హిమాలయాల కన్నా పురాతనమైన పర్వతమనీ ధ్రువపరిచారు.
దీనికి సంబంధించి-

గంగాచ మూలభాగస్థాయమునా గగనస్థితా!సోమోద్భవ శిరోభాగేసేవంతే శోణ పర్వతః!!అని స్కాంద పురాణం స్పష్టంగా చెబుతోంది.
సాధారణంగా పర్వతాలు చెట్లూ, పుట్టలతో పచ్చగా ఉంటాయి. కాని అరుణగిరి ఆ పేరులోనే ఉన్న వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ‘‘అరుణగిరి అగ్నితత్త్వానికి సంకేతం. ఇది ధరిత్రికి హృదయం వంటిది. సత్య స్వరూపం. జ్ఞాన తేజస్సు. శ్రేష్టతమం’’ అని ఋగ్వేదం కీర్తించింది.

ముక్తిదాయకం గిరిప్రదక్షిణం
అరుణాచలేశ్వరుని దేవేరి అపీత కుచాంబ. నలుదిశలా ఎత్తైన ప్రాకారాలతో, అరుణగిరి సానువులో నెలకొన్న అతి విశాలమైన అరుణాచలాలయంలో శివ కుటుంబంలోని గణపతి, కుమారస్వామి ఆలయాలున్నాయి. ఈ గిరి చుట్టూ ముక్కోటి దేవతలు శివలింగాలను ప్రతిష్ఠించారు. అరుణగిరిపై దక్షిణామూర్తి కొలువు తీరాడు. బ్రహ్మాది దేవతలందరూ అరుణగిరి ప్రదక్షిణం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరమణ మహర్షి కూడా అరుణగిరి ప్రదక్షిణం చేయాల్సిందిగా భక్తులకు చెప్పడమే కాదు- ఆయన కూడా భక్తులతో కలిసి ప్రదక్షిణం చేసేవారు.

వైభవంగా శివరాత్రి
అరుణాచలంలో సంవత్సరంలో ఎన్నో పండుగలు, పర్వాలు జరుగుతాయి. అన్నిటిలో ప్రధానమైనది శివరాత్రి. ఆ రోజున దివారాత్రాలు అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఒక్కసారిగా గుడిలోని గంటలన్నీ మ్రోగుతాయి. శంఖనాదాలు మిన్నుముడతాయి. కర్పూర హారతి ప్రకాశిస్తూ ఆకాశంలో పున్నమి చంద్రుడి వెన్నెలను భాసింపజేస్తుంది. ‘‘అరుణాచల శివా! అరుణాచల శివా!’’ అనే శరణు ఘోష దశదిశశలా ప్రతిధ్వనిస్తుంది. అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనూ దర్శించి భక్తులు తన్మయులవుతారు.

అత్యద్భుతమైన ఈ ప్రాచీన ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు మంటపాలను, గోపురాలను నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ‘అరుణగిరి వాసం, ఇక్కడ మరణం ముక్తిదాయకం. ఇది గొప్ప తీర్థక్షేత్రం. స్మరించిన మాత్రాన ముక్తి కలుగుతుంది’ అని శివపురాణం ఉల్లేఖించింది. శివభక్తికి ప్రధాన క్షేత్రమైన అరుణాచలంలో ఈశ్వరుని, అపీత కుచాంబను, అరుణగిరిని దర్శించినవారికి ఆ ఆది దంపతుల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఏ.సీతారామారావు








Monday, 5 February 2018

విష్వక్సేనుడు

విష్వక్సేనుడు 


యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే


ప్రతి పదార్ధము:

యస్య  = ఎవరిని; ద్విరద = రెండు దంతములు గలది = ఏనుగు (దంతి అని కూడా అంటారు); వక్త్రః = ముఖము; ఆద్యః = కలిగియున్న; పారి = తొలగించు; షద్యః  = వెంటనే; పర = మరొక; శతం = నూరు; వంద;విఘ్నం = అడ్డంకి; నిఘ్నంతి = చంపు / తొలగించు; సతతం = ఎల్లప్పుడూ; విష్వక్సేనం = విష్వక్సేనుడు* (విష్ణువు యొక్క సైన్యాధిపతి); తం = వారిని; ఆశ్రయే = శరణు జొచ్చు, ఆశ్రించు.

తాత్పర్యము:
ఎవరైతే గజ ముఖుడైన, (విష్ణు సైన్యాదిపతియైన) విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు. 

విష్వక్సేనుడు  విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ గజ ముఖులే. కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు. రూపు రేఖలలో యితడు వినాయకుని పోలి ఉంటాడు. వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసే 'విష్ణు సహస్రనామ స్తోత్రం' లో మొదటి శ్లోకం అయిన "శుక్లాంబరధరం" తరువాత రెండవ శ్లోకంగా "యస్య ద్విరద వక్త్ర్యాద్యః" అనే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. ఈ శ్లోకం శ్రీమతి యం. ఎస్. సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామ స్తోత్రం లో ఉండదు. అయితే "శుక్లాంబరధరం" శ్లోకం గణపతి పైన అయినా కొందరు ఛాందసులు ఇది కూడా విష్ణు శ్లోకమే అని వాదించడం విన్నాను. ఎందుకంటే "శుక్లాంబరధరం విష్ణుం" లో విష్ణుం అని ఉంది కదా అని. కాని ఈ శ్లోకంలో "విష్ణుం' అంటే సర్వ వ్యాపకుడని అర్ధం.


విష్వక్సేనుడు
ఎవరైతే గజ ముఖుడైన, (విష్ణు సైన్యాదిపతియైన) విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు.
విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ గజ ముఖులే. కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు. రూపు రేఖలలో యితడు వినాయకుని పోలి ఉంటాడు. వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసే 'విష్ణు సహస్రనామ స్తోత్రం' లో మొదటి శ్లోకం అయిన "శుక్లాంబరధరం" తరువాత రెండవ శ్లోకంగా "యస్య ద్విరద వక్త్ర్యాద్యః" అనే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు.

నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో...
పూర్వం ఒకానొక భక్తుడు తన పుణ్యఫలం వలన వైకుంఠానికి చేరుకుని, ద్వారపాలకులైన జయ, విజయులను చూసి, నిత్యం స్వామి సేవలో ఉంటున్న వారి భాగ్యాన్ని చూసి పొగిడాడు. ద్వారపాలకులు తమ అదృష్టాన్ని ఒప్పుకున్నప్పటికీ, తమపై పెట్టబడిన బాధ్యత రీత్యా ఎప్పుడూ ద్వారం దగ్గరే ఉండిపోవాల్సి వస్తోందని, ఇంత వరకు వైకుంఠంలోకి వెళ్ళింది లేదనీ, అసలు వైకుంఠం లోపల ఎలా ఉంటుందో తమకు తెలియదని, అదే సమయంలో వైకుంఠంలోకి ఇలా వెళ్ళి, అలా వస్తుండే నారదుడు వంటి మునీశ్వరులే తమకంటే చాలా అదృష్టవంతులని అన్నారు.అనంతరం యాదృచ్ఛికంగా నారదుని చూసిన భక్తుడు, ఆయనతో ద్వారపాలకులు చెప్పిన విషయాలను ప్రస్తావించాడు. అతని మాటలతను విని సంతోషపడిన నారదుడు తాను వైంకుఠంలోకి వెళ్ళగలిగినప్పటికీ, ఎటువంటి అడ్డంకులు లేకుండా వైకుం ఠంలో సంచరించగలిగేది విష్వక్సేనుడూనని, అంతటి అదృష్టం తనకు దక్కలేదని చెబు తాడు. ఆ మరుక్షణమే భక్తుడు, విష్వక్సేనుని ముందుకెళ్ళి ఆయన అదృష్టాన్ని పొగడు తాడు. అది విన్న విష్వక్సేనుడు, తన కంటే గరుత్మంతునిదే అదృష్టమని అనగా, ఆ గరు త్మంతుడు, తనకంటే స్వామి పాదాలను ఒత్తుతూ, తరిస్తోన్న లక్ష్మీదేవిదే అదృష్టమని అంటారు. మరి, ఆ లక్ష్మీదేవేమో, తనకంటే ఆదిశేషుడు గొప్ప అదృష్టవంతుడని చెబు తుంది. స్వామికి ఆదిశేషుడు చేస్తున్నంత సేవను తాను చేయలేకపోతున్నానని అం టుంది. భక్తుడు ఆదిశేషుని ముందు నిలబడి ఆయన అదృష్టాన్ని కీర్తించాడు. అది విన్న ఆదిశేషుడు, ‘మా అందరికంటే నువ్వే అదృష్టవంతుడివి. మేమందరం ఆయన కోసం పరుగులు పెడుతోంటే, ఆ పరంధాముడు మీ వంటి భక్తుల కోసం పరుగులు పెడుతు న్నాడు. అదృష్టమంటే మీదేగా!’ అని అన్నాడు.ఇదిలా వుండగా, ఒకసారి రాక్షసులు పెట్టే బాధలను ఓర్చుకోలేకపోయిన దేవతలు, వైకుంఠానికి వచ్చి, తమను రాక్షసుల బారి నుండి కాపాడవలసిందంటూ శ్రీమన్నారాయ ణుని ప్రార్తించారు. అప్పుడు విష్ణుమూర్తి చంద్ర అనే వానిని పిలిచి, రాక్షసుల పని పట్ట మని చెప్పాడు. స్వామి ఆనతితో ఆ రాక్షసులను తనిమి తరిమి కొట్టిన చంద్ర యొక్క శౌర్యప్రతాపాలను మెచ్చుకున్న నారాయణుడు, అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయనే విష్వక్సేనుడు. శ్రీవైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణు రూపమే విష్వక్సేనుడని అం టారు. ఆయన సర్వమంగళనాయకుడు. విఘ్ననివారకుడు. ఎవరైతే విష్వక్సేనుని ఆరాధి స్తారో, ధ్యానిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని వైఖాన సాగమం చెబుతోంది.మేఘశ్యాముడు, సుమణిమకుటధారి అయిన విష్వక్సేనునికి సూత్రవతీ, జయ అనేవారు భార్యలు. విష్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి. శ్రీమన్నారాయణునికి సేనాపతి. ‘విశ్వ’ అంటే ఈ సకలలోకాలను, ‘సేనుడు’ అంటే నడిపించేవాడని కూడ అర్థం. ఈ సృష్టిలో ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలకు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే పధ్నాలుగు భువన ఖండాలకు అధిపతి. శైవాగమం గణపతిని ప్రతిశుభకార్యంలో ముందుగా పూజించి, అగ్రతాంబూలాన్ని సమర్పించినట్లు, శ్రీవైఖానసాగమం విష్వక్సే నుని ప్రతి కార్యక్రమంలోను పూజిస్తుంది. శైవాగమం గణపతిని పసుపు ముద్దగా చేసి పూజిస్తే, శ్రీవైష్ణవాగమాలు విష్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినపుడు అది సంకల్పబలం చేతనే విజయవంతం అవుతుంది. బల మైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీ దేవి. ఎవరైతే సంక ల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి.వినాయకునికి సిద్ధి, బుద్ధి భార్యలు. అంటే, బుద్ధి కలిగినపుడే కార్యక్రమం తలపెడతాము. సంకల్పం తీసుకుంటాం. ఎవరికైతే, స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుందని శైవాగమం చెబుతుంది. శ్రీవైష్ణవ ఆగమాలు కూడ చెబుతున్నది అదే. శ్రీవైఖానస ఆగమోత్తమ ప్రకారంగా నిత్యకైంకర్యాలు నిర్వహించే తిరుమల ఆలయంలో స్వామికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవ త్సరోత్సవాలలో విష్వక్సేనులవారు ప్రధాన పాత్ర వహిస్తారు.శ్రీవేష్ణవ ఆగమాలు విష్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి. విష్వక్సేనుల వారు నాలుగు భుజాలతో గోచరిస్తూ, శంఖు, చక్ర, గదలను ధరించి నాలుగువేళ్ళను మడిచి, చూపుడు వేలును పైకి చూపిస్తోన్న ముద్రతో దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రతిమలలో గదకు బదులుగా దండాయుధం కనబడుతుంటుంది. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.యస్య ద్విరద వక్త్రాద్యాఃపారిషద్యాః పరశ్శతమ్‌విఘ్నం నిఘ్నంతి సతతంవిష్వక్సేనం తమాశ్రయేఅని ఆ స్వామిని ధ్యానిస్తూ ధన్యులమవుదాము. ఆ స్వామి సేవలో తరించిపోదాము.

హిందూమతం





దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఇవన్నీ హిందూమతంలోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
  1. అద్వైతం లేదా స్మార్తం
  2. విశిష్టాద్వైతం లేదా వైష్ణవం
  3. ద్వైతం లేదా మధ్వం


హిందూమతాన్ని ఉద్ధరించిన ఆచార్యులలో ముఖ్యులు  త్రిమతాచార్యులు.
త్రిమతాచార్యులు:
  1. ఆది శంకరాచార్యులు
  2. రామానుజాచార్యులు
  3. మధ్వాచార్యులు
ఆది శంకరాచార్యులు:
సమకాలీన హిందూమతం పై అత్యంత ప్రభావం చూపిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. భజ గోవిందం, కనకథారా స్తోత్రం, శివానందలహరి (శ్రీశైలంలో రచించారు), సౌందర్యలహరి, గణేశ పంచరత్న స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఆది శంకరులు 108 గ్రంథాలు రచించారు. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు. తరువాత ఆది శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు.

ఆది శంకరాచార్యులు దేశం నలుమూలలా నాలుగు మఠాలను స్థాపించారు. వీటినే చతుర్ధామాలు, చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి నుంచి నేటి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏ ప్రాతిపదిక పై ఎంత పటిష్ఠంగా నిర్మించారో తెలుస్తుంది. ఆది శంకరులు స్థాపించిన ఆ నాలుగు మఠాలు ద్వారకా మఠము, గోవర్ధన మఠము, శృంగేరి మఠము, జ్యోతిర్మఠం మఠము.

ద్వారకా మఠము(గుజరాత్‌)
ఈ మఠము శంకరులచే దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. ఇది కీటవాళ సాంప్రదాయ మఠము. భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయమంటారు. ఈ మఠ సన్యాసులకు చివర 'తీర్ధ' అనిగాని 'ఆశ్రమ' అని గాని ఉంటుంది. ఈమఠానికి క్షేత్రం ద్వారక (గుజరాత్‌లో ఉంది); పీఠ దేవత సిద్ధేశ్వరుడు; పీఠ శక్తి భద్రకాళి; మఠము యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యులలో ఒకడైన పద్మపాదాచార్యుడు; గోమతీ నది ఈపీఠ తీర్థము.ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు.సన్యాసం తీసుకోబోయే ముందు బ్రహ్మచారిగా చేరి శిక్షణ పొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది. తత్త్వమసి అనేది ఈమఠం యొక్క మహావాక్యం. ఈ వాక్యం జీవ, బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది. బ్రహ్మచారులు అవిగత గోత్రానికి చెందినవారుగా పరిగణింపబడతారు. సింధు, సౌరాష్ట్ర, మహారాష్ట్రములు వాటి మధ్యనున్న పశ్చిమ భారత ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో హిందూమత ధర్మాన్ని సుస్థిరం చేయవలసిన బాధ్యత ఈ ద్వారకా మఠానిది.

గోవర్ధన మఠము
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు.ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో ఉంది.ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన','అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ);పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు; పీఠశక్తి వృషలాదేవి (సుభద్ర);మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు; మహోదధి ఈ మఠ తీర్థము.ఈమఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు.భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం.ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది.'ప్రజ్ఞానం బ్రహ్మ' అనేది ఈ మఠం యొక్క మహావాక్యము.ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ,వంగ,కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు.ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.

శృంగేరీ మఠము
ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమనీ పిలువబడుతుంది.కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది.ఈ పీఠ దేవత వరాహుడు; పీఠ శక్తి శ్రీ శారదాదేవి; పీఠ క్షేత్రం రామేశ్వరం; పీఠ తీర్థం తుంగ నది.ఇక్కడి బ్రహ్మచారులను చైతన్యులని పిలుస్తారు. ఈ మఠము యొక్క మొదటి అధిపతి సురేశ్వరాచార్యుడు.ఈ మఠ సన్యాసులు పదియోగపట్టములలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరు భూరివాళ సంప్రదాయానికి చెందిన వారు.భూరి అంటే బంగారము అని అర్థము.ఏ సాంప్రదాయం మానవులను కాంచనశక్తి (ధన వ్యామోహం,ధర్మబద్ధమైన ధనాపేక్షకాక) నుండి వారిస్తుందో అది భూరివాళ సాంప్రదాయం.ఇక్కడ యజుర్వేదం ప్రత్యేకంగా పఠించబడుతుంది.అహం బ్రహ్మాస్మి అనేది ఈ మఠము అనుసరించే మహావాక్యం. వీరిది భూర్భువ గోత్రం. ఆంధ్ర, కర్ణాట, ద్రవిడ, కేరళ ప్రాంతములు ఈ మఠ పరిధిలోకి వస్తాయి.

జ్యోతిర్మఠము
దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం; పీఠ దేవత నారాయణుడు; పీఠ శక్తి పూర్ణగిరి; పీఠ తీర్థం అలకనంద (గంగానది). వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.

శంకర మఠము(కంచికామకోటి పీఠము)
ఈ మఠము శంకర మఠముగా కన్నా కంచి మఠముగానే ప్రసిద్ధము. దీనిని సర్వజ్ఞ పీఠము అని కూడా అంటారు. ఇది దక్షిణ దేశములోని కాంచీపురములో ఉన్నది. ఇక్కడి ఆచార్యుల యోగ పట్టనామము 'ఇంద్రసరస్వతి'. ఈ నామము శ్రీ చంద్ర శేఖర ఇంద్ర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీవిజయేంద్ర సరస్వతి ఈ విధముగా వాడబడుతున్నది. కంచి పీఠములో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠప్రథమ ఆచార్యుడు సాక్షాత్తు ఆది శంకరుడే అంటారు. తన తర్వాత పీఠాధిపతిగా సర్వజ్ఞాత్ముడనే బాల సన్యాసిని ఏర్పరచి, శృంగేరీ పీఠాధిపతి అయిన సురేశ్వరాచార్యుడి సంరక్షణలో ఉంచాడని కంచి పీఠం చరిత్ర చెబుతోంది. ఐదవ శతాబ్దము నుండి కంచి పీఠము విజయ పథములో నడుపబడుతున్నది.

చతుర్మఠాలంటే ఏమిటి? కంచిమఠానికి ఎందుకంత ప్రాధాన్యత?
ఆధ్యాత్మిక జీవనం గడిపేందుకు సన్యాసులు, బ్రహ్మచారులు ఉండేదానిని మఠం అంటారు. దేవతను ప్రతిష్ఠించిన అనంతరం అది పీఠంగా ప్రభవిస్తుంది. శంకరాచార్యుడు దేశం నలుమూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడు. వీటినే చతుర్మఠాలని పిలుస్తారు. వీటిలో మొదటిది ద్వారకా మఠం. ఈ మఠానికి తొలి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యుడైన పద్మపాదాచార్యుడు. రెండవది గోవర్ధన మఠం. ఇది ఒడిశాలోని పూరీ పట్టణంలో ఉంది. ఈ మఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు. మూడవది శృంగేరీ మఠం. ఇది కర్ణాటకలోని శృంగేరిలో ఉంది. ఈ మఠం తొలి అధిపతి సురేశ్వరాచార్యుడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనేది ఈ మఠం అనుసరించే మహావాక్యం. నాలుగవది జ్యోతిర్మఠం. దీనిని బదరికాశ్రమము కూడా అంటారు. ఇక్కడ అథర్వణ వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలివి. వీటితోపాటు శంకరుడు ముక్తి పొందిన కంచి మఠం అయిదవది. దీనిని సర్వజ్ఞ పీఠం అని కూడా అంటారు. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కంచిపీఠంలో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠం ప్రథమ ఆచార్యుడు ఆది శంకరుడే అని చెబుతారు.


మొదటి ఆచార్యుడుమఠంపీఠ దేవతపీఠ శక్తిపీఠ తీర్థంమహావాక్యంవేదంసంప్రదాయం
హస్తామలకాచార్యుడుగోవర్ధన పీఠం
పూరి
పురుషోత్తముడు
(జగన్నాథుడు)
వృషలాదేవి (సుభద్ర) మహోదధిప్రజ్ఞానం బ్రహ్మాఋగ్వేదంభోగవార
సురేశ్వరాచార్యుడుశృంగేరి శారదాపీఠం
శృంగేరి
వరాహుడుశ్రీ శారదాదేవితుంగ నదిఅహం బ్రహ్మాస్మియజుర్వేదంభూరివార
పద్మపాదాచార్యుడుద్వారకా పీఠం
ద్వారక
సిద్ధేశ్వరుడుపీఠ శక్తి భద్రకాళిగోమతీ నది తత్వమసిసామవేదంకీటవార
తోటకాచాఱ్యుడుజ్యోతిర్మఠం
బదరీనాధ్
నారాయణుడుపూర్ణగిరిఅలకనంద
(గంగానది)
అయమాత్మా బ్రహ్మాఅథర్వవేదంఆనందవార
ఆది శంకరుడు సర్వజ్ఞాత్ముడు
చంద్రమౌళీశ్వరస్వామికామాక్షీదేవి.



శంకరాచార్యులు బోధించిన, ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు.  అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఆది శంకరుల "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -

బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః
బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, బ్రహ్మమునకు భేదం లేదు.

రామానుజాచార్యులు
రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యులు త్రిమతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆది శంకరాచార్యులు వారి అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు రామానుజాచార్యులు వారు. విశిష్టాద్వైతం వైదిక మతంలోని త్రివిధ విశ్వాసాలలో ఒకటి. మిగిలినవి అద్వైతం, ద్వైతం. విశిష్టాద్వైతం రామానుజుడికి పూర్వం నుంచి ఉంది. ఐతే,  దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.

తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు
తిరుమలలోని మూలవిరాట్టు (ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపి ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు. అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.

మధ్వాచార్యులు
త్రిమతాచార్యులలో మధ్వాచార్యులు మూడవవాడు. మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరియు భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు. యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు. దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.

ద్వైత వాదం
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.





పాంచరాత్రము
పాంచరాత్రమనగా శ్రీవైష్ణవులు పరమపవిత్రంగా భావించే ఆగమ శాస్త్రం.  చారిత్రక ఆధారాల ప్రకారం రామానుజుల వారి కాలంలో ఈ ఆగమ శాస్త్రం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ఇది నేడు ప్రామాణికం. పదకొండవ శతాబ్దిలో రామానుజులు ఆది శంకరుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరచారు. రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆగమం ముఖ్య పాత్రను వహిస్తుంది.

వైఖానసం
శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.

వైఖానస-పాంచరాత్ర వైరం
ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే. తమని  శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారు.






హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.
శైవులు - పరమ శివుని ఆరాధించే వారు
శాక్తేయులు - పరాశక్తిని ఆరాధించేవారు.
వైష్ణవులు - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
గాణాపత్యులు - గణపతి ఆరాధకులు.
కౌమారులు - కుమారస్వామి ని ఆరాధించేవారు.
సౌరులు - సూర్యుణ్ణి ఆరాధించేవారు.




శివ లింగము హిందూ మతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది.

సాధారణంగా లింగము శక్తికి, స్త్రీ సృజనాత్మక శక్తికి సూచిక అయిన యోనిలో ప్రతిష్టింపబడి ఉంటుంది. లింగ-యోనుల సంగమం నిష్క్రియాత్మక విశ్వం మరియు క్రియాత్మక కాలం యొక్క కలయికని, ద్వైతంలోని అనంత ఐక్యతని, జీవోద్భావనని సూచిస్తుంది.

పూర్వం శివుడ్ని విగ్రహ రూపంలోనే పూజించే వారు (హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు). వరాహపురాణంలోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది." అని శపిస్తాడు. అంటే అంతకు ముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం.

శివలింగము(మానుష లింగము)లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.

స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.
మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).

హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.
శైవులు - పరమ శివుని ఆరాధించే వారు
శాక్తేయులు - పరాశక్తిని ఆరాధించేవారు.
వైష్ణవులు - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
గాణాపత్యులు - గణపతి ఆరాధకులు.
కౌమారులు - కుమారస్వామి ని ఆరాధించేవారు.
సౌరులు - సూర్యుణ్ణి ఆరాధించేవారు.

పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.

1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - అన్నామలై
2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం:
4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు - కంచి:
5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి:

1. అమారారామము: అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
2. ద్రాక్షారామము: ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
3. కుమారారామము: సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
4 భీమారామము: భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
5. క్షీరారామము: పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, ఉమ

శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.

కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.

శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.

శివాలయం
పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం - శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురంలేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.

శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగం బ్రహ్మ స్థానంలో ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూ మూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణద్వార ముఖంగా ఉంటుంది.

సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం(శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.

చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.

అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.

అన్ని శివాలయాలలో బ్రహ్మ ముహూర్తంలో రుద్రాభిషేకం మరియు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలోఉన్నది. ప్రతి శివాలయంలో ఈ శివరాత్రి అతి ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.



ప్రతి ధర్మానికి కొన్ని ఆగమాలు ఉంటాయి.
వైష్ణవ దేవాలయాలలో చేసే అర్చనలకు మూలాధారమైనవి పాంచరాత్రాగమాలు. ఇవి 108పైనే ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 20 మాత్రమే అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో తెలుగులో లభించేవి 10 మాత్రమే. వీటిని తెలుసుకోవటం వల్ల వివిధ పుణ్యక్షేత్రాలలోని అర్చనాదులలోని అంతరార్థం తెలుస్తుంది.
భద్రాచలం సహా అనేక వైష్ణవ క్షేత్రాలలో ఆగమ ప్రమాణంగా భావించే శ్రీ కపింజల సంహిత.



శ్రీమన్నారాయణుని దేవాలయ నిర్మాణ పద్ధతి, ప్రతిష్ట, ఆరాధన మొదలైన వాటిని తేల్పే వైష్ణవాగమాలల్లో పాంచరాత్రాగమం, వైఖానసాగమం అని రెండు భేదాలున్నాయి. వాటిలో పాంచరాత్రాగమాన్ని నాథమునులు, యామున మునీంద్రులు, భగవద్రామానుజులు మొదలైనవారు విశేష శ్రమలకోర్చి ప్రచారం చేసినారు. శ్రీరంగాదిక్షేత్రాల్లో భగవదారాధన ఈ పద్ధతిననుసరించియే సాగుతూన్నది. ఈ విష్ణుసంహిత పాంచరాత్రాగమానికి చెందిన శాస్త్రం. దీనికి కొన్నిచోట్ల విష్ణుతంత్రమనే పేరు కూడా కన్పిస్తున్నది. అస్తు.

అదేం దురదృష్టమో కాని తెలుగువారు ఎక్కువగా అనుసరిస్తున్న పాంచరాత్రాగమ గ్రంథాలు 108 పైగా ఉంటే పట్టుమని పదిగ్రంథాలు కూడా తెలుగులిపిలో దొరకడం లేదు. అవీ చాలా పాతవి. ఎక్కడ దొరుకుతాయో తెలియని స్థితి. భద్రాచలదేవస్థానం వారు పాద్మం, పరమపురుషసంహితలు వేసినారు. అవీ ప్రస్తుతం అలభ్యం. శ్రీమాన్ రేజేటి వేంకట వేణుగోపాలాచార్యులువారు రాజమండ్రి వంటి మహానుభావులు అధిక శ్రమకోర్చి పాంచరాత్రాగమ గ్రంథాలను ముద్రిస్తూ సేవచేస్తున్నారు.

ఈ స్థితిలో అపర రామానుజులుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు ఈ కార్యక్రమానికి పూనుకొని క్రమక్రమంగా వీటిని తెలుగులిపిలో ముద్రిస్తున్నారు. తెలుగువారు భాగ్యవంతులౌతున్నారు. ఉడతాభక్తి సంప్రదాయ సేవగా ఈ గ్రంథాలను తెలుగులిపిలో ప్రచురించి భాగవతోత్తముల సేవచేయాలని దాసుని సంకల్పం. దానిలో భాగంగా తొలుత ప్రచురిస్తున్నదీ విష్ణుసంహిత.

దీన్ని ఔపమన్యువనే మహర్షికి తిరుమలలో తపస్సు చేసికొంటున్న సిద్ధుడు ఉపదేశించినట్లు కన్పిస్తుంది.

దీనిలో విష్ణువైభవం, క్షేత్రక్షేత్రజ్ఞనిర్ణయం, మంత్రోద్ధారవిధి, ఆరాధనా విధానం, ముద్రలు, అగ్నిసంస్కారం, మండలరచనావిధి, దీక్షా స్వీకార విధి, యాగభూమిలక్షణం, ప్రాసాదవిధి, ప్రతిమాలక్షణం మొదలైనవి అనేకం చెప్పబడ్డాయి.

సంక్షిప్తంగానైనా తెలుగు వివరణతో అందించడం ఈ గ్రంథంలోని ప్రత్యేకత.



ఆగమము అనగా వచ్చినది అని అర్దము. వైష్ణవ ఆగమము లలో రెండు రకములు ఉన్నాయి. అందులో ఒకటి వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము', రెండవది గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'. నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆసాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.





Sunday, 4 February 2018

ఏ పురాణంలో ఏముంది





పురాణాలు - వాటి ప్రత్యేకతలు

మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్ని పేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణుసహస్రనామంలో ‘‘వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే’’ అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వెల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకుందాం.

18 పురాణాలు…

  1. మత్స్యపురాణం : మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
  2. కూర్మపురాణం : కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
  3. వామన పురాణం : పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.
  4. వరాహ పురాణం : వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
  5. గరుడ పురాణం : గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది… వంటి విషయాలుంటాయి.
  6. వాయు పురాణం : వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
  7. నారద పురాణం : బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.
  8. స్కాంద పురాణం : కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం… తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.
  9. విష్ణుపురాణం : పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.
  10. భాగవత పురాణం : విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.
  11. అగ్నిపురాణం : “వామోహ్యాగ్నేయముచ్యతే” అన్న మాట ప్రకారం శ్రీ మహా విష్ణువుకి ఎడమ పాదంగా ఈ పురాణం వర్ణించబడుతోంది. ఈ పురాణంలో ఎన్నో ధార్మిక విషయాలతో పాటు ఆగమ, శిల్పశాస్త్ర, మంత్ర, తంత్ర, జ్యోతిషవిజ్ఞానానికి సంబంధించిన విశేషాలు, ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలు అలాగే నగర, గ్రామ, తటాక, ఆలయ ప్రతిష్ఠా పద్ధతులు.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.
  12. బ్రహ్మపురాణం : బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.
  13. ద్మపురాణం : ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. పురాణాలన్నింటిలోకీ పద్మపురాణం పెద్దది.
  14. మార్కండేయ పురాణం : శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి. పురాణాలన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది.
  15. బ్రహ్మవైవర్త పురాణం : ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగనివృత్తి సాధనాలు, తులసీ, సాలగ్రామ మహత్త్వాలు, హోమములో స్వాహకార ప్రాధాన్యము మొ. విషయాలు ఇందు వివరించబడ్డాయి.
  16. లింగపురాణం : లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
  17. బ్రహ్మాండ పురాణం : బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.
  18. భవిష్యపురాణం : సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.