Sunday, 25 September 2016

ధర్మజుని గర్వభంగం



ధర్మరాజు అశ్వమేథ యాగం చేశాడు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు, వస్తుదానాలు చేశాడు. యాగం చేసిన రుత్విక్కులకు, బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చాడు. ధర్మరాజు దానగుణానికి అందరూ అనేక విధాలుగా ప్రశంసిస్తున్నారు. అది చూసి ధర్మజునిలో కొద్దిగా అహంకారం పొడసూపింది.

ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక ముంగిస వచ్చింది. దాని శరీరం మూడువంతుల వరకు బంగారు రంగులో మెరుస్తోంది. అది సభాసదులను, ధర్మరాజును చూసి పకనకా నవ్వింది. 

అందరూ ఆశ్చర్యంగా, కోపంగా ‘‘ఎవరు నువ్వు? ఎలా వచ్చావిక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు?’’ అని అడిగారు.

‘‘నేనెవరినో, ఎందుకు వచ్చానో తర్వాత చెబుతాను. మీరంతా ధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే, రారాజైన ధర్మరాజు చేసిన యాగం కానీ, దానధర్మాలు కానీ నిరుపేద బ్రాహ్మణుడైన సక్రుప్రస్థుడు చేసిన దానికన్నా గొప్పవి కావు కాబట్టి నవ్వొచ్చింది’’ అంది.
‘‘ఇంతకీ ఎవరా సక్రుప్రస్థుడు?’’ అనడిగాడు ధర్మరాజు అసూయగా.
అప్పుడా ముంగిస ఇలా చెప్పింది.

‘‘కురుక్షేత్రంలో సక్రుప్రస్థుడనే పేద బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. వారు ఒక చిన్న పూరిపాక నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే నా బిలం ఉంది. ఆయన వెదురుబియ్యాన్ని ఏరుకొస్తే, దానినే పిండి చేసుకుని అందరూ జీవించేవారు. ఉన్నదానిలోనే ఆయన అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, సంతృప్తిగా జీవిస్తున్నాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు అందరూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. దాంతో ఆయనకు వెదురుబియ్యమే కాదు, ఎక్కడా భిక్ష కూడా దొరకడం లేదు. ఆకలి బాధకు అందరూ ప్రాణాలు కళ్లల్లో పెట్టుకుని ఉన్నారు.

ఈ పరిస్థితుల్లోనే ధర్మదేవతకు ఆయనను పరీక్షించాలని బుద్ధిపుట్టి వారి ఇంటికి బాటసారి వేషంలో అతిథిగా వచ్చాడు. అప్పటికే మూడురోజుల నుంచి పస్తులున్న ఆ కుటుంబం తలా పిడికెడు పేలపిండిని తినడానికి కూర్చున్నారు. ఇంతలో అతిథి రావడంతో ఇంటి యజమాని అతణ్ణి సాదరంగా ఆహ్వానించి, కాళ్లకు నీళ్లిచ్చి, విస్తరి వేసి తన వాటా పేలపిండిని సమర్పించాడు. అతిథికి ఆకలి తీరినట్టు కనిపించలేదు. దాంతో సక్రుప్రస్థుని భార్య తన వాటా ఇచ్చింది. అది తిన్నాక కూడా, అతిథి కళ్లల్లో ఆకలి తీరిన జాడలు కనిపించలేదు. కుమారుడు తన వంతు పేలపిండిని ఇచ్చాడు.

ఊహు.. ఆకలి తీరనే లేదు. కోడలు తన పేలపిండిని తెచ్చి వడ్డించింది. అప్పుడా అతిథి తృప్తిగా తేన్చాడు. ఒకపక్క ఆకలితో ప్రాణాలు కడగట్టిపోతున్నా సరే, అతిథినే దేవుడిగా ఎంచిన ఇంటి యజమాని, అతని ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించాడు. అతని బాటలోనే అతని భార్య, కొడుకు, కోడలు కూడా నడిచారు. వారి త్యాగానికి మెచ్చిన ధర్మదేవత తన నిజరూపంతో వారికి సాక్షాత్కారమిచ్చాడు. వారికోసం బ్రహ్మలోకం నుంచి విమానం వచ్చింది. ఆ నలుగురినీ వెంటబెట్టుకుని ధర్మదేవత సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లాడు.
 ఇదంతా చూసిన నేను సక్రుప్రస్థుడు అతిథికి అర్ఘ్యమిచ్చిన నీటిలో పొర్లాడాను.

ఆ నీటితో తడిసినంత మేరా నా శరీర భాగాలు బంగారు రంగులోకి మారిపోయాయి. మిగతావి కూడా సువర్ణమయం అవుతాయేమోనన్న ఆశతో నేను ఎన్నో యజ్ఞశాలలకు వెళ్లి, వారు యజ్ఞం చేసిన ప్రదేశంలో పొర్లాడుతున్నాను కానీ, నా శరీరం బురదమయం, బూడిద మయం అవుతున్నదేగానీ, సువర్ణరూపు సంతరించుకోనేలేదు. ఇంతలో ధర్మరాజు గురించి విని, ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకూ అతడు దానం చేసిన గోవులు తరలి వెళ్లగా ఏర్పడిన మడుగులో పొర్లాడి వచ్చాను కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది.

అది అతన్నే అడుగుదామని ఇక్కడికి వచ్చేసరికి మీరంతా అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం చూసి నాకు నవ్వు వచ్చింది. ధర్మరాజు చేసిన దాన ధర్మాలేవీ భక్తితో చేసినవి కాదు. అహంకారంతో కూడుకున్నవి. అసలు అదంతా అతని కష్టార్జితం అయితేనే కదా... దాని ఫలితం అతనికి దక్కేది’’ అంటూ మరోమారు ఫక్కున నవ్వింది. ధర్మరాజుకు తల తీసేసినట్లయింది. అసంకల్పితంగా కృష్ణునివైపు చూశాడు. శ్రీకృష్ణుడు చిద్విలాసంగా చూస్తూ, జగన్మోహనంగా నవ్వాడు. ధర్మరాజుకు తన తప్పు తెలిసి వచ్చింది.

- D.V.R

Sunday, 18 September 2016

గరుత్మంతుడు

కశ్యపప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ అత్యంత పొడవుగా, బలమైన దేహం కలిగిన వెయ్యిమంది పుత్రులను, తేజోవంతమైన శరీరంతో అత్యంత చురుకయిన ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంటారు. దాంతో కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కొంతకాలానికి కద్రువకు ఆదిశేషుడు, కర్కోటకుడు, వాసుకి మొదలైన పొడవాటి శరీరం గల వెయ్యిసర్పాలు పుడతాయి. వినతకు మాత్రం ఇంకా పుట్టరు. దాంతో తొందరపడి ఒక అండాన్ని పగులకొడుతుంది.

ఆ అండం నుంచి కాళ్లులేకుండా, మొండెం మాత్రమే ఉన్న తేజోరూపుడు పుడతాడు.

అతడు పుడుతూనే ‘‘నువ్వు సవతిని చూసి కుళ్లుపడి, గుడ్డును పగలగొట్టి నా అవిటి జన్మకు కారకురాలైనావు కాబట్టి నీ సవతికే దాసీగా ఉంటావు’’ అని శపిస్తాడు.

తన తప్పిదానికి కుమిలిపోతున్న తల్లితో బాధపడకు. ‘‘కనీసం రెండో అండాన్నైనా జాగ్రత్తగా ఉంచు. అందులోనుంచి జన్మించినవాడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు’’ అని చెప్పి, సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి సారథిగా వెళ్లిపోతాడు. అతడే మాతలి. సూర్యుని రథసారథి. అయితే తొడలు లేవు కాబట్టి అనూరుడుగానే సుపరిచితుడయ్యాడు. ఇది ఇట్లా ఉండగా వినత, కద్రువలు ఒక రోజు సముద్రతీరానికి విహారానికి వెళ్తారు. వారికి అక్కడ ఇంద్రుని రథాన్ని లాగే ఉచ్ఛైశ్రవం అనే గుర్రం కనిపిస్తుంది. దాన్ని చూపిస్తూ కద్రువ వినతతో ‘‘చూడు, ఆ గుర్రం ఎంతో తెల్లగా ఉంది కానీ, దాని తోక మాత్రం నల్లగా ఉంది’’ అంటుంది.

ఆపాదమస్తకం గుర్రం తెల్లగా ఉండటాన్ని చూసిన వినత ‘‘లేదక్కా, గుర్రం తోక కూడా పాలలా తెల్లగానే ఉంది కదా’’ అంటుంది.

ఆ విషయంలో ఇద్దరి మధ్యా వాదులాట జరుగుతుంది. ఆ పూట ఇక చీకటి పడింది కాబట్టి, మరునాడు వచ్చి, ఆ గుర్రాన్ని చూసి, దాని తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను. నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని పందెం వేస్తుంది కద్రువ. అందుకు అంగీకరిస్తుంది వినత.

ఆ రాత్రి కద్రువ తన కుమారులను పిలిచి, మీలో ఎవరైనా వెళ్లి ఉచ్ఛైశ్రవం తోకకు చుట్టుకుని, దానిని నల్లగా కనిపించేట్లు చేయండి అని అడుగుతుంది. అందుకు కర్కోటకుడనే నాగు తప్ప మిగిలిన ఎవరూ అంగీకరించరు. దాంతో కోపగించిన కద్రువ తల్లిమాట వినలేదు కాబట్టి మీరందరూ పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చస్తారని శపిస్తుంది.

కర్కోటకుడు వెళ్లి గుర్రం తోకను చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాడు.

పందెం ప్రకారం వినత కద్రువకు దాస్యం చేస్తుంటుంది.

కొంతకాలానికి రెండవ అండం పగిలి, అందులోనుంచి అత్యంత పరాక్రమవంతుడైన గరుడుడు పుడతాడు.

అతణ్ణి చూసిన కద్రువ ‘‘నువ్వు నాకు దాసీవి కాబట్టి నీకుమారుడు కూడా మాకు దాసుడే’’ అవుతావు అని చెప్పి, అతని చేత చాకిరీ చేయించుకుంటుంది.

కద్రువ కుమారులైన సర్పాలను తన వీపుమీద ఎక్కించుకుని రోజూ వినువీధికి వ్యాహ్యాళికి తీసుకెళ్లడం గరుత్మంతుడి విధుల్లో ఒకటి. ఓ రోజున అలా గరుడుడు సూర్యమండలం దాకా వెళ్లడంతో సర్పాలన్నీ నల్లగా మాడిపోతాయి. దాంతో కోపించిన పెద్దమ్మ గరుత్మంతుణ్ణి తిడుతుంది. మనస్తాపానికి గురైన గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విడిపించాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు తల్లీకొడుకులు బాగా ఆలోచించుకుని అసాధ్యమైన కార్యం కాబట్టి దేవలోకం నుంచి అమృతం తెచ్చిపెట్టమని అడుగుతారు.



గరుత్మంతుడు ఎట్లాగో కష్టపడి అమృతాన్ని తీసుకొచ్చి తల్లిని దాస్య విముక్తురాలిని చేసి, తానూ దాస్యం నుంచి బయటపడతాడు. అయితే అమృతం తాగితే నాగులకు అమరత్వం సిద్ధిస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ అమృతాన్ని వాటికి దక్కకుండా చేయడం వేరే కథ.

గరుత్మంతుడి వేగానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి అతణ్ణి తన వాహనంగా స్వీకరిస్తాడు. వినత కుమారుడు కాబట్టి అతడే వైనతేయుడుగా కూడా ప్రఖ్యాతి చెందుతాడు.

ఇక్కడ మనం గ్రహించలసినదేమంటే మత్సరం అంటే కుళ్లుబోతుతనం, తొందరపాటు తనం వల్లే కదా, వినత, ఆమె కుమారుడు అంత కష్టపడవలసి వచ్చింది! అందుకే ఆ రెండు అవలక్షణాలనూ వదిలిపెట్టాలని చెబుతారు పెద్దలు.
- D.V.R.


Sakshi

Friday, 16 September 2016

కష్టాలకు మారుపేరు ద్రౌపది

జీవితం ఎంత అందమైందో అంతే గంభీరమైంది. అందులోని అందాన్ని ఆస్వాదించడానికి దొరికే సమయం దానిని నెట్టుకొచ్చే గంభీరతలో కనిపించకుండానే కనుమరుగవుతుంది. జీవితాన్ని నడిపించకుండానే కనుమరుగవుతుంది. అయినా జీవితాన్ని నడిపించమంటుంది మన మానవనైజం. ఎలా ఉండాలో ఉదహరిస్తూనే, ఎలా ఉండకూడదో హెచ్చరిస్తుంది జీవితం. కష్టాలు నిన్నెంత కష్టపెట్టినా కాలుమడవని ధీరత్వం నీదని పదేపదే గుర్తుచేస్తూ సుఖం అంటే ఏంటో చూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే దానిని అనుభవించాలి. కష్టాన్ని మాత్రం వినిపించినా చాలు! అందులోని దుఃఖాన్ని అంచనా వేయడం అంతకష్టమేమీ కాదని చెబుతుంది జీవితం. పైగా సమాజం కష్టాన్ని విని కనికరించక పోగా కొన్ని జీవితాలే అంతని తోసిపుచ్చేస్తుంది. అవును.. ఆ కొన్ని జీవితాలే కష్టాలను పరిచయం చేయడం కాదు. కష్టమంటే గుండెనిబ్బరమనీ, చెరగని ఆత్మస్థయిర్యమనీ, అలుపెరుగని శ్రామికతనీ, అంతులేని గాంభీర్యమనీ తెలియజెపుతూ ఆ కష్టాలవారధిని దాటేందుకు బాసటై నిలుస్తామని నిరూపిస్తాయి. కష్టాలకు మారుపేరైన ద్రౌపది జీవితమే ఇందుకు తార్కాణం. ఒక గొప్ప కుటుంబంలో పుట్టి, ఓ గొప్ప ఇంటికి కోడలై ఒక స్త్రీగా తనదైన అస్తిత్వాన్ని కలిగిన ద్రౌపది కథ కష్టతరమైందేగాని కన్నీటి వ్యథ కాలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. ధైర్యమై నిలిచింది. ధర్మమై గెలిచింది.

పాంచాల దేశానికి రాజైన ద్రుపదుని కూతురే ద్రౌపది. యాగాగ్నిలోంచి జనించిన నిప్పు ఆమె. ధర్మ పరిరక్షణ కోసం ముఖ్య కారణమయ్యే స్త్రీ రత్నం ద్రుపదుని ఇంట జన్మించిందని చెప్పుకునే వారట. కౌరవుల పాలిట చీకటి కోణంలా మారే ద్రౌపది నల్లని శరీర ఛాయతో కృష్ణగా పేరొందింది. అందుకేనేమో కృష్ణ-కృష్ణుని అనుబంధం నల్లనిదే కాదు చల్లనైనది. వారిమధ్య గల సత్సంబంధం కూడా అనన్య భక్తిబంధమై అలరారింది. కృష్ణుని పట్ల ద్రౌపదికున్న గౌరవం, విశ్వాసం మాటలకందని మానసిక తత్తం.ద్రౌపది స్వయంవరం ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అపురూప లావణ్యంతో, గంభీర వ్యక్తిత్వంతో సభలోకి వచ్చిన ద్రౌపదిని చూసి మహామహులందరూ పోటీపడ్డారు. చివరికి బ్రాహ్మణుడిగా వచ్చిన అర్జునుడు ఆమెను చేపట్టాడు. పాండవులైదుగురూ సంతోషంగా ద్రౌపదిని ఇంటికి తీసుకెళ్ళి కుంతితో అమ్మా మేం అద్భుతమైన భిక్షను తీసుకొచ్చామని చెప్పగానే అదేమిటని కూడా అడుగక కుంతి ఎప్పటిలాగే ఐదుగురూ సమానంగా పంచుకోండని ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాటను శిరసావహించిన పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెళ్ళి చేసుకుంటారు. మారు మాట్లాడక అంగీకరిస్తుంది ద్రౌపది. ఎందుకంటే జీవితం చూపించే మజిలీలు దాటుకుంటూ వెళ్ళడమే గాని వెనుదిరిగే స్వభావం కాదు ఆమెది. ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఆవశ్యకమని చెప్పే చరిత్రను మలుపు తిప్పుతూ ఐదుగురి మగవాళ్ళ జీవితాల వెనుకుండి అసలు కథను నడిపింది. పాంచాలి పంచభర్తృక అన్న సమాజానికి అవును అది నాకు అత్యంత గౌరవప్రదమని చెప్పింది ద్రౌపది.

ద్రౌపది నిండుసభలో వస్ర్తాపహరణాన్ని సహించింది. అరణ్యవాసంలో పాండవులను జాగ్రత్తగా చూసుకుంది. సూర్యుని వరప్రసాదంతో పొందిన అద్భుత ఘటంతో అమ్మై వారికి అన్నం పెట్టింది. విరాటుని కొలువులో అజ్ఞాతవాసంలో సైరంధ్రియై కీచకుని ప్రవర్తనను మన్నించింది. కామ్యకవనంలో జయద్రధుడు ద్రౌపదితో అసభ్యంగా నడుచుకునే ప్రయత్నం చేసి పారిపోతాడు. అతణ్ని పట్టితెచ్చిన అర్జునునితో అతణ్ని వదిలేయమని చెబుతుంది. ఇలా ద్రౌపది జీవితంలో అధర్మంగా ప్రవేశించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, జయద్రధ, కీచకుల్లాంటి వారంతా మట్టిలో కలిసిపోయారు. భారతనారి అవమానం చరిత్రకే కళంకమని చాటి చెప్పిన ద్రౌపది జీవితం దుష్టులకు గుణపాఠంగా మారింది. ఎటువంటి పరిస్థితులెదురైనా వెనక్కి తగ్గలేదు. పాండవులనూ విడిచి వెళ్ళిపోలేదు. అనిశ్చిత పరిస్థితుల్లోనే మనకు లభించే తోడు అంతులేని ఆత్మధైర్యాన్నిస్తుందనడానికి ద్రౌపదీ పాండవులే ఉదాహరణ.అమోఘమైన తెలివితేటలు, త్యాగనిరతి, మంచితనం, ఉన్నతమైన ఆలోచన, భావగాంభీర్యం ద్రౌపదితో పుట్టి పెరిగిన విశేషాలు. ఇద్దరు భార్యాభర్తల్లోనే సఖ్యత, ప్రేమ లేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతుంటాయి. అలాంటిది ఐదుగురు భర్తలనూ, సవతులనూ, అత్త కుంతీదేవిని ఒకే తాటిపై ధర్మ వివేచనతో నిలబెట్టిన ద్రౌపది కౌశలం అపారం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కష్టం. ఐదుగురి ఇష్టాయిష్టాలు, పద్ధతులు, గుణగణాలు ఎరిగి వారితో మెలగడం గొప్ప విషయం.ధర్మరాజు కోసం నియమితులైన పదివేల మంది సేవకుల పేర్లు, గుర్రాల సంఖ్య, ఏనుగుల గుంపుల గుర్తులు, రాజ్యాధికార సంబంధిత విషయాలు తటపటాయించకుండా చెప్పేంత జ్ఞానం ద్రౌపదిది. ఇది కేవలం అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి పరిశీలించే మెతుకు వంటిది. అసలు ఆమె విజ్ఞాన, విశేషాలను అంచనా వేయాలనుకోవడం అమాయకత్వమే.

-ప్రమద్వర

Wednesday, 14 September 2016

వినాయకుడిని పత్రితోనే ఎందుకు పూజిస్తారు ?

వినాయకుడిని పత్రితోనే ఎందుకు పూజిస్తారు ?
పుష్పం పత్రం ఫలం తోయం..’ అన్నారు. గణనాథునికి పత్రార్చన అంటే..ఎంతో ప్రీతికరం. అందుకే వినాయక చవితి పూజల్లో వివిధ రకాల పత్రాలను ఎక్కువగా వినియోగిస్తారు. వీటి వినియోగం వల్ల స్వామి వారిపై భక్తితో పాటు..ఆరోగ్యమూ సిద్ధిస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. విఘ్నాధిపతి పూజకు వినియోగించే పత్రాల్లో ఒక్కో దానికి ఒక్కో ఔషధ గుణం ఉందని చెబుతున్నారు.
చవితి పండగ మొదలైంది. గణనాథుడి పూజలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. స్వామి సేవలో తరించేందుకు ఊరూవాడా నిమగ్నమైంది. గణనాథుని పూజలో పత్రాలది ప్రత్యేకత. శ్లోకాలు చదువుతూ.. వివిధ రకాల పవిత్ర వృక్షాల ఆకులు, రెమ్మలతో గణనాథునికి పూజలు చేస్తుంటారు. వీటికి ఆరోగ్య సమస్యలను హరించే గుణం ఉంటుందని పూర్వీకులు చెబుతున్నారు. స్వామి పూజలో వినియోగించే పత్రాలు వాటి ఔషధ గుణాలు ఇలా..
సింధూర పత్రం
ఈ పత్రం స్వామి వారికి ప్రీతికరమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటి కషాయం తాగితే.. జ్వరం ఇట్టే నయమవుతుంది. అలాగే..కీళ్లవా తలు, నొప్పులను తగ్గిస్తుంది.
దేవదారు పత్రం
వినాయక పూజల్లో దేవాదారు పత్రానికి ప్రత్యేకత ఉంది. ఈ పత్రం నీళ్లలో వేసి కాచి.. అనంతరం వచ్చిన కషాయాన్ని కళ్లకు పూయడం మంచిది. ఇలా చేస్తే కళ్లు అందంగా..ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చూత పత్రం
దీనిని మామిడి పత్రం అని కూడా పిలుస్తారు. జ్వరం వల్ల కలిగే మేహరపు మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది.
కరవీపత్రం
దీన్ని గన్నేరు ఆకు అంటారు. కణుతులను కరిగించే స్వభావం దీని సొంతం. అలాగే.. జుట్టులో ఉండే పేలును అరికట్టేందుకు ఈరసాన్ని వినియోగిస్తారు.
తులసి పత్రం
తులసి ఆకులులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్ణం, కడుపునొప్పి, నోటి దుర్వాసనను అరికడతాయి. తేలు విషాన్ని హరించే.. యాంటీ సెప్టిక్గా దీనిని ఉపయోగిస్తారు.
జాజిపత్రం
ఇది వాతవ పట్లు, పైత్యానికి విరుగుడునిచ్చే ఆకు. అంతే..కాకుండా మొల లను నివారించేందుకు ఔషధం కూడా. చర్మ రోగాలకు, మచ్చలకు గవద బిల్లల నివారణకు దీనిని చక్కగా వినియోగించుకోవచ్చు .
దాడిమి పత్రం
దానిమ్మ పత్రాన్ని దాడిమి పత్రం అని పిలుస్తారు. దీనివల్ల జీర్ణకోశం, మూత్ర, మలాశయ వ్యాధులు తగ్గుతాయి. అలాగే నోటిపూత, విరేచనాలు తగ్గించేలా పనిచేస్తుంది.
మాచీ పత్రం
దీని కషాయం సేవించడం వల్ల..శరీరంపై పుట్టే దద్దుర్లు తగ్గుతాయి. కుష్టు వ్యాధి తగ్గించేందుకు ఇది ఒక మంచి ఔషధం. తల నొప్పి, కీళ్ల నొప్పులను హరిస్తుంది.
బిల్వ పత్రం
దీనిని మారేడు లేక బిల్ల లేక బిత్తిరి పత్రం అని పిలుస్తారు. ఇది శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. దీని గుజ్జు, బంక విరేచనాలను తగ్గిస్తుంది.
గరిక
దీనిని కేవలం గడ్డిగానే చూస్తాం. కానీ పూజల్లో ఎంతో ప్రాధాన్యముంది. పశువులకు శ్రేష్టమైనది. ఇందులోని పత్రహరితం జీర్ణశక్తిని పెంచుతుంది. పూర్వం మేలైన గరికను పచ్చడిగా చేసి ఆహర పదార్థాలతో తీసుకునేవారు.
విష్ణు పత్రం
ఈ పత్రాలతో చేసిన కషాయం..పైత్యాన్ని తగ్గిస్తుంది. వివిధ విషజ్వరాలను నయం చేస్తుందని ప్రతీతి. అందుకే వీటిని పూర్వకాలం నుంచి పూజల్లో ఉపయోగిస్తుంటారు.
మరువక పత్రం
ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుందని పెద్దలు చెబుతుంటారు.
దత్తూర పత్రం
దీన్ని ఉమ్మెత్త పత్రం అని పిలుస్తారు. వీటి ఆకులను ఆముదంలో రాసి..దీపపు సెగ తగిలించి..అనంతరం మిశ్రమాన్ని గడ్డలపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.
బద్రిపత్రం
వీటిని రేగు ఆకులు అంటారు. జీర్ణకోశ వ్యాధులు నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రక్తదోషాలను హరించి బలాన్ని చేకూరుస్తుంది.
ఇలా..ఈ ఆకుల్లోని ఔషధ గుణాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆకారం
భారీ బొజ్జ, చేటల్లాంటి చెవులు, తొండంతో, ఏక దంతం పెద్ద తల, చిన్న కళ్లతో వినాయకుడు భిన్నంగా కనిపిస్తాడు. ఆయన రూ పం వెనక అనేక విశేషాలు దాగున్నాయని చాలా మందికి తెలియదు. విఘ్నేశ్వరుడి రూపం, ఆయనలోని ప్రతి అవయవం మనకు ఎన్నో సందేశాలను ఇస్తాయి. చూడగానే ఆకట్టుకునే ఆ సుందర రూపం వెనుక అనంత అంతరార్థం ఉంది.
పెద్ద తల : చక్కటి ఆలోచనలకు కేంద్రం
చిన్న కళ్లు : నిశిత దృష్టికి సంకేతం
చిట్టి నోరు : ఆచి తూచి మాట్లాడమని సూచన
తొండం : అత్యుత్తమ సామర్థ్యానికి ప్రతి రూపం
చేతిలో లడ్డూ : భక్తులకు వరాలు ఇవ్వడానికి సిద్ధమన్న భావన
చేటల్లాంటి చెవులు : భక్తుల మొరలాలకించడానికి సన్నద్ధత
గొడ్డలి : మానవుడిని బంధ విముక్తి చేయడం కోసమే
ఏక దంతం : చెడును అడ్డుకుని మంచిని మాత్రమే సంగ్రహించడం
అభయ హస్తం : భక్తలకు మోక్ష మార్గం ప్రసాదించడం
భారీ బొజ్జ : మంచి చెడులన్నింటినీ ఇముడ్చుకోగలిగిన శక్తి
ఎలుక : కోరికలకు చిహ్నం. ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖమయంగా ఉంటుంది.

అష్టగణేశావతారాలు

భారతీయ ఆరాధనా సంస్కృతిలో గణపతిని బహువిధ రూపాలతో పూజించడం కనిపిస్తుంది. పురాణాల్లో, మంత్రశాస్త్రాల్లో ఎన్నో వినాయకమూర్తులు ఉన్నాయి. వాటిని ఉపాసించే పద్ధతులూ అనేకం. గణపతి అవతారాలను కొన్ని పురాణాలు చక్కగా ఆవిష్కరించాయి. ఆ అవతారాల పేర్లను, గాథలను గమనిస్తే ఎంతో చక్కని అద్భుతమైన తత్వాలు గోచరిస్తాయి. మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరించుకోవడమే ఆధ్యాత్మిక సాధన అయితే, ఆ సాధనకు అవరోధాలే విఘ్నాలు. వాటిని తొలగించి గ్రహించే పరతత్వమే విఘ్నేశ్వరుడు.

‘ముద్గల పురాణం’లో ఎనిమిది గణేశావతారాలను వివరించారు:
1. వక్రతుండావతారం: ‘మత్సరా’సురుని సంహరించినది ఈ అవతారం. సింహ వాహనంపై ఉండే గణపతి ఇతడు. జీవుల ‘శరీరతత్వం’లోని దివ్యత్వం ఈ గణేశ రూపం. ‘దేహబ్రహ్మధారకుడు’ అని పురాణం పేర్కొంది.
2. ఏకదంతావతారం: ‘మదా’సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో ‘జీవ’ (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.
3. మహోదరావతారం: ‘మోహాసురు’ని నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు. ‘జ్ఞాన’చైతన్యానికి అధిపతి.
4. గజాననావతారం: సాంఖ్య (పరబ్రహ్మ) తత్వానికి అధిష్ఠానదేవతగా కొలిచే ఈ స్వామి జ్ఞానప్రదాత. ‘లోభా’సురుని సంహరించిన ఈ గణపతీ మూషికవాహనుడే.
5. లంబోదరావతారం: ‘క్రోధాసురుని మర్దించిన అవతారం. ‘శక్తి’ బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. ‘దేవీతత్వ’ స్వరూపం- గణపతి అని పురాణ భావం. మూషికాన్ని వాహనంగా కలిగిన స్వామి.
6. వికటావతారం: ‘కామా’సురుని సంహరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. ‘సూర్యబ్రహ్మ’గా సౌరతత్వంగా పూజలందుకుంటున్నాడు.
7. విఘ్నరాజావతారం: ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. ‘మమతా’సురుని సంహరించిన ఈ స్వరూపాన్ని ‘విష్ణుబ్రహ్మ’గా విష్ణుతత్వంగా చెబుతారు.
8. ధూమ్రవర్ణావతారం: ‘అభిమానాసురు’ని సంహరించిన ఈ అవతారం మూషిక వాహనంపై శోభిల్లుతున్నది. ‘శివ’రూపంగా అర్చించతగిన శైవతత్వమూర్తి ఇది.
ఈ ఎనిమిది అవతారాల వైనాలను గమనించితే ఒక చక్కని సమన్వయం తేటపడుతుంది.
1. శరీరంలోనూ, 2. జీవభావంలోనూ, 3. బుద్ధిశక్తిలోనూ, 4. బ్రహ్మజ్ఞానంలోనూ భాసించే భగవచ్ఛైతన్యం మొదటి నాలుగు అవతారాలు.
5. శక్తి, 6. సూర్య 7. విష్ణు, 8. శివ తత్వాలు ఒకే భగవంతుడి వ్యక్తస్వరూపాలు - అనే ఏకత్వం తరవాతి నాలుగు అవతారాలు.
పై ఎనిమిది రూపాలున్న గణేశుని ఆరాధించితే మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోతాయంటారు. అవి: మాత్సర్యం, మదం, మోహం, లోభం, క్రోధం, కామం, మమత (‘నాది’ అనే రాగం), అభిమానం (అహంకారం) - ఈ ఎనిమిది రకాల రాక్షసులే విఘ్నశక్తులు. వ్యక్తి పురోగతికి ఇవే విఘ్నాలు. ఈ అసురగుణాలను ఈశ్వరారాధన ద్వారా తొలగించుకోగలిగితే - అదే ఆరాధన, అర్చన, సాధన. వీటిని నశింపజేసే దైవబలాన్ని మనలో జాగృతపరచేందుకే వినాయకపూజ. పూజలో పరమార్థం - మానవుడు దివ్యత్వ స్థితికి పరిణమించడమే. భగవద్రూప, నామ, అవతార ఘట్టాల్లో ఋషులు చూసి, చూపించిన దివ్యభావాలివి.

అష్టావక్రగీత





అష్టావక్రగీత 

రామకృష్ణ పరమహంస దగ్గరకు నరేంద్రుడు (స్వామి వివేకానంద) జ్ఞాన సముపార్జన కోసం వెళ్తూ ఉండేవాడు. ఒకసారి నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస అష్టావక్రగీత పుస్తకాన్ని ఇచ్చి కొన్ని శ్లోకాలను సంస్కృతం నుంచి బెంగాలీలోకి అనువాదం చేయమన్నాడు. ఈ శ్లోకాల ద్వారా అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రుడికి తెలుస్తుందనేది రామకృష్ణుడి భావన. ఈ విషయాన్ని స్వామి నిత్యస్వరూపానంద 1950లో రాసిన ‘రామకృష్ణ పరమహంస చరిత్ర’లో పేర్కొన్నారు. భగవద్గీత గురించి తెలియని భారతీయులు అతి తక్కువ మంది ఉంటారు. మరి అష్టావక్రగీతో? వేదాంతపరంగా చాలా కీలకమైన అంశాలను చర్చించే ఈ గ్రంథం గురించి అతి తక్కువ మందికి తెలుసు.

అష్టావక్రుడు ఒక రుషి. అష్ట అంటే ఎనిమిది.. వక్ర అంటే వంకర అని అర్థం. శరీరంలో ఎనిమిది వంకరలు ఉన్నవాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుడు అనే పేరు వచ్చింది. అసలు అష్టావక్రుడి పుట్టుక గురించి మహాభారతంలో అరణ్యపర్వంలో ఉంది. అష్టావక్రుడి తండ్రి కహోడకుడు. తల్లి సుజాత. అష్టావక్రుడు సుజాత గర్భంలో ఉన్నప్పుడు.. ఒక రోజు కహోడకుడు వేదాలను మననం చేసుకుంటున్నాడు. కహోడకుడు చదువుతున్న వేదాలను అష్టావక్రుడు గర్భంలో నుంచి వింటున్నాడు. కహోడకుడు ఎనిమిదిసార్లు తప్పుగా ఉచ్ఛరించాడు.

అష్టావక్రుడు తల్లి గర్భంలో నుంచి.. తన తండ్రికి ‘నువ్వు తప్పుగా ఉచ్ఛరిస్తున్నావు’ అని చెప్పాడు.

దాంతో కహోడకుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ‘నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు ఎనిమిది వంకరలతో ఈ భూమి మీదకు రా.’ అని శపించాడు. ఇలా తండ్రి శాప ఫలితంగా అష్టావక్రుడు ఎనిమిది వంకరలతో పుట్టాడు.

కహోడకుడు గొప్ప పండితుడే కానీ అతని కన్నా గొప్పవాళ్లు అనేక మంది ఉండేవారు. ఒక సందర్భంలో కహోడకుడు విదీష రాజ్యంలో జరిగిన పండిత సభకు వెళ్లాడు. అక్కడ జరిగిన ఒక సంవాదంలో వందినుడు అనే పండితుడు కహోడకుడిని ఓడించాడు. ఆ రాజు కహోడకుడికి చెరశాలలో వేయించాడు. 12 ఏళ్ల వయస్సులో అష్టావక్రుడు తన తండ్రిని కాపాడటానికి విదీషకు వెళ్లి.. అక్కడి పండితులలో సంవాదానికి దిగి గెలిచాడు. తన తండ్రిని విముక్తున్ని చేస్తాడు. ఆ తర్వాత సామంగ (డెహ్రాడూన సమీపంలోని సాంగ్ అనే నది అని ప్రసిద్ధి) అనే నదిలో స్నానం చేసి.. తన వంకరలను పోగొట్టుకున్నాడు.

తన వంకరలన్నీ తొలగిపోయిన తర్వాత అష్టావక్రుడు దేశపర్యటన చేశాడు. మళ్లీ విదీష రాజ్యానికి వెళ్లి అక్కడ రాజు జనకుడి చేత అనేక సత్కారాలు పొందాడు.

ఈ సందర్భంలో జనకుడికి అష్టావక్రుడు చేసిన బోధలనే అష్టావక్ర గీత అంటారు. దీనిలో మొత్తం 20 అధ్యాయాలు ఉంటాయి. ఈ అష్టావక్ర గీతలో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తాయి. అష్టావక్రగీతను ఎప్పుడు రాశారు అనే విషయాన్ని చెప్పటం చాలా కష్టం. అయితే భగవద్గీతను రాసిన తర్వాతే దీనిని రాశారని చెప్పవచ్చు. సంస్కృతంలోని ఈ మూల గ్రంథాన్ని తర్వాతి కాలంలో అనేక భారతీయ భాషల్లోకి అనువాదం చేశారు. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టావక్రగీత సున్నితంగా స్పృశిస్తుంది.

సనాతన ధర్మంలో ఎనిమిది అంకెకు చాలా విశిష్టత ఉంది. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగాలను (రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, ఛాతి, నుదురు) ఈ ఎనిమిది సంఖ్య సూచిస్తుంది. ఈ ఎనిమిది సక్రమంగా ఉంటేనే భగవంతుడికి సాష్టాంగ ప్రమాణం చేయగలం.

Monday, 12 September 2016

నీళాదేవి






నీళాదేవి

నీళాదేవి కుంభకుడన్న వాని కూతురు. కాలనేమి అనే రాక్షసి కొడుకులు ఆబోతు రూపాలలో గొల్లపల్లెను బాధిస్తూ ఉండగా వారిని చంపినవానికి తన కూతురునిచ్చి పెళ్ళి చేస్తానని కుంభకుడు చాటిస్తే, శ్రీకృష్ణుడు వారిని చంపి నీళాదేవిని పెళ్ళి చేసుకున్నాడు.

కనరో భాగ్యము..

కనరో భాగ్యము..
సప్తగిరులపై వెలిసిన వేంకటేశుని దర్శించినంత మాత్రాన మనసు పరవశించి పోతుంది. లిప్తపాటులో మెరిసే ఆ దివ్య మంగళరూపం... కళ్ల ముందు కలకాలం నిలిచిపోతుంది. ఆ కోనేటి రాయుడి ఉత్సవమూర్తి తిరువీధుల్లో మలయప్పస్వామిగా వివిధ వాహనాలపై తిరుగాడుతుంటే ఇంకా చెప్పేదేముంటుంది. బ్రహ్మోత్సవ వేళ ఈ మనోహర దృశ్యం ప్రతిరోజూ ఆవిష్కృతం అవుతుంటుంది. ఈ సమయంలో తిరువీధులు ఆనందనిలయాన్ని మరిపిస్తాయి.

శ్రీహరి భక్త సులభుడు. భక్తులను అనుగ్రహించడానికే ఆయన ‘‘శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే’’ వచ్చి నిలిచాడు. కలియుగ దైవంగా ఏడుకొండలపై వేంకటేశుడిగా కొలువుదీరిన శ్రీహరి సన్నిధిలో నిత్య కల్యాణం.. పచ్చ తోరణం. బ్రహ్మోత్సవ సమయంలో ఈ వేడుక మరింత సంబరంగా ఉంటుంది.

బ్రహ్మ చేసెడి ఉత్సవం..
అధిక మాసం రావడంతో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా శ్రీనివాసుడే బ్రహ్మదేవుడిని పిలిచి బ్రహ్మోత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడు. ఆనాటి నుంచి ఏటా కన్యా మాసం (ఆశ్వయుజం)లో శ్రవణం నక్షత్రం నాటికి పూర్తయ్యేలా ముందు తొమ్మిది రోజులు వైఖానసాగయుక్తంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు.. బ్రహ్మాండంగా జరిపిన ఉత్సవమిది. స్వామి రథోత్సవం రోజున బ్రహ్మదేవుడు సైతం శ్రీవారి రథం పగ్గాలు లాగుతాడని ప్రతీతి. మిగతా రోజుల్లో శ్రీనివాసుడి వాహనం ముందు బ్రహ్మరథం నడుస్తుంది.

బ్రహ్మాండనాయకుడి దర్శనం..
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ ఏట అధికమాసం వస్తుంది. అప్పుడు భాద్రపదం లేదా శ్రావణ మాసాల్లో ఒక దఫా, ఆశ్వయుజ మాసంలో రెండో దఫా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటగా నిర్వహించే వాటిని వార్షిక బ్రహ్మోత్సవాలని, రెండోసారి చేసేవాటిని నవరాత్రి ఉత్సవాలని పిలుస్తుంటారు. ఒకప్పుడు ప్రతి నెలా బ్రహ్మోత్సవలు నిర్వహించే వారట. ఏడాది పొడుగునా ఆనంద నిలయంలో అంగరంగ వైభవంగా సేవలందుకునే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమాడ వీధుల్లో లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తాడు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే వాహన సేవలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సర్వలోకాలనూ కాపాడే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని సేవలో తరించడానికి దేవతలే వాహనాలుగా మారిపోయారు. ఈ భక్త సులభుడిని తన భుజస్కందాలపై మోసేందుకు భక్తాగ్రేసరులైన గరుడు, హనుమలు వాహనంగా మారి పరవశిస్తారు. సూర్య, చంద్రులు సైతం స్వామివారి వాహనాలుగా తన్మయులవుతారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులలో 14 వాహనాలపై స్వామి ఊరేగుతాడు.

ఆదిశేషుడిపై ఆదిదేవుడు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజు స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన ఆదిశేషుని వాహనంగా స్వీకరించాడు. శేషుడు కలియుగంలో గోవిందరాజ స్వామిగా తిరుపతిలో వేంచేశాడు. స్వామివారి సేవలో నిత్యం తరిస్తూనే ఉంటాడు ఆదిశేషుడు. శ్రీహరి నివాస పీఠంగా, శయ్యగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా.. ఆయా సమయాలకు అవసరమైన ఛత్రంగా శేషుడు సేవలు అందిస్తాడని యమునాచార్యులు వర్ణించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున ఉభయదేవేరుల సమేతంగా పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగుతాడు. ఏడు పడగల శేషుడిపై ఏడుకొండల దేవుడి సంచారం భక్తజనులకు ఆనందం కలిగిస్తుంది. ఆ మర్నాడు ఐదు పడగల చిన్న శేష వాహనాన్ని అధిరోహిస్తాడు.

హంసవాహనంపై పరమహంస..
క్షీరనీర న్యాయంగా ఆత్మానాత్మ వివేకానికి హంస ప్రతీక. ఈ సత్యం బోధపరచడానికి స్వామి హంస వాహనాన్ని ఎంచుకున్నాడు. రెండో రోజు రాత్రి సాగే హంసవాహన సేవ కన్నుల పండువగా సాగుతుంది. ఈ వాహనంపై స్వామివారు సరస్వతీ దేవి అలంకారభూషితుడై భక్తులకు దర్శనమిస్తాడు. మూడో రోజు ఉదయం మృగరాజు అయిన సింహ వాహనంపై దర్శనమిస్తాడు. అదే రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనంపై ఉభయ దేవేరుల సమేతంగా తిరువీధుల్లో విహరిస్తాడు. ఇక నాలుగో రోజు ఉదయం భక్తుల కోర్కెలు తీర్చడానికి కల్ప వృక్షవాహనంపై కనువిందు చేస్తాడు. ఆ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై కాలీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడు. ఐదో రోజు ఉదయం ‘పుంసాం మోహన రూపాయ..’ అన్నట్టు స్వామి మోహినీ అవతారంలో కనిపిస్తాడు.

భక్తి ముక్తి దాయకం..
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి వాహనం.. ముందు సంచరిస్తూ గజరాజులు శ్రీహరిని సేవిస్తాయి. గజేంద్రమోక్షం వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ ఆరో రోజు రాత్రి స్వామివారు గజవాహనాన్ని అధిరోహిస్తాడు. ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరు మాడవీధుల్లో సంచరిస్తాడు. ఎనిమిదో రోజు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం విశేషంగా సాగుతుంది. భక్తులందరూ రథాన్ని లాగుతూ స్వామివారి సేవలో పునీతులవుతారు. అదే రోజు రాత్రి అశ్వవాహనంపై ఖడ్గం ధరించి దర్శనిమస్తారు. ఆ మర్నాడు చక్రస్నానంతో ఉత్సవాలు సమాప్తం అవుతాయి. భక్తి ముక్తిదాయకమైన బ్రహ్మోత్సవాలను కన్నులారా వీక్షించిన చాలు జన్మ తరిస్తుంది.

భక్తాగ్రేసరులపై భక్తవత్సలుడు..
స్వామివారి విషయంలో ఎవరికీ దక్కని భాగ్యం గరుడునికి దక్కింది. ఆనంద నిలయంలో శ్రీవారి ఎదురుగా నిల్చుని నిరంతరం ఆ స్వామినే చూస్తూ ఆయన సేవకు సన్నద్ధంగా ఉంటాడు ఈ పక్షేంద్రుడు. అందుకే గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు శ్రీహరి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడ వాహనంపై ఊరేగుతాడు. వైభవంగా జరిగే గరుడవాహన సేవను తిలకిస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలోనే కాదు అన్ని వైష్ణవాలయాల్లోనూ గరుడ సేవకు ప్రత్యేకత ఉంది. శ్రీరంగంలో మరింత ప్రశస్తి. కంచి గరుడసేవ అనే సామెత కూడా ఉంది. ఆరో రోజు ఉదయం హనుమద్వాహనంపై దర్శనమిస్తాడు మలయప్పస్వామి. వేంకటాద్రిరాముడిగా తన భక్తుడిపై ఊరేగుతూ భక్తకోటికి వరాలిస్తాడు.

-R. అనంతపద్మనాభరావు
98665 86805

యక్ష ప్రశ్నలు

72 చిక్కు ప్రశ్నలు.. వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. 

అప్పుడు ఒక అశరీరవాణి - నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు’’ అని హెచ్చరిస్తుంది. 

దీనిని పట్టించుకోకుండా - నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. 

ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. అవి క్లుప్తంగా...

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?
బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
దర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా
నిలచియున్నాడు?
సత్యం
5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును?
వేదం
6. దేని వలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహాయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టతవం వల్ల
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మృత్యుభయం వలన
12. జీవన్మృతుడెవరు?
దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటే భారమైనది ఏది?
జనని
14. ఆకాశం కంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటే వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ఞం చేయటం వలన
21. జన్మించియు ప్రాణం లేనిది?
గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకి ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయదాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
దానం
29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం
36. సుఖాల్లో గొప్పది ఏది?
జ. సంతోషం
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
జ. అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
జ. మనస్సు
39. ఎవరితో సంధి శిధిలమవదు?
జ. సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది?
జ. యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు?
జ. సత్పురుషులు
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
జ. భూమి, ఆకాశములందు
43. లోకాన్ని కప్పివున్నది ఏది?
జ. అజ్ఞానం
44. శ్రాద్ధవిధికి సమయమేది?
జ. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
జ. వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో...
46. తపస్సు అంటే ఏమిటి?
జ. తన వృత్తికుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి?
జ. ద్వందాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి?
జ. చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవడు?
జ. ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు
50. జ్ఞానం అంటే ఏమిటి?
జ. మంచి చెడ్డల్ని గుర్తించగలగడం
51. దయ అంటే ఏమిటి?
జ. ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి?
జ. సదా సమభావం కలిగి ఉండటం
53. సోమరితనం అంటే ఏమిటి?
జ. ధర్మకార్యములు చేయకుండుట
54. దుఃఖం అంటే ఏమిటి?
జ. అజ్ఞానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి?
జ. ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి?
జ. మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
57. దానం అంటే ఏమిటి?
జ. సమస్తప్రాణుల్ని రక్షించడం
58. పండితుడెవరు?
జ. ధర్మం తెలిసినవాడు
59. మూర్ఖుడెవడు?
జ. ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు
60. ఏది కాయం?
జ. సంసారానికి కారణమైంది
61. అహంకారం అంటే ఏమిటి?
జ. అజ్ఞానం
62. డంభం అంటే ఏమిటి?
జ. తన గొప్పతానే చెప్పుకోవటం
63. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును?
జ. తన భార్యలో, తన భర్తలో
64. నరకం అనుభవించే వారెవరు?
జ. ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మ శాసా్త్రల్నీ, దేవతల్ని, పితృదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
జ. ప్రవర్తన మాత్రమే
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
జ. మైత్రి
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
జ. అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
జ. సుఖపడతాడు
69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
జ. అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు
70. ఏది ఆశ్చర్యం?
జ. ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు?
జ. ప్రియయూ అప్రియయూ, సుఖమూ దుఃఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు
72. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు?
జ. నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదుఃఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడై ఎవరైతే ఉంటాడో వానిని.

Sunday, 11 September 2016

కర్ణుడి క్షుద్బాధ


కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. సమీపంలో ఉన్న కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకుని నోటిముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కాస్తా బంగారు ద్రవంగా మారి, తాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారీ అంతే అయింది. ఈలోగా విపరీత మైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి, చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు.

మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప జేయడంతో వెంటనే పండు కొరికాడు. పండు కాస్తా పంటికింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి, దాహం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశా నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం, వెండి, ధనం రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకీ పరిస్థితి ఏర్పడింది’’ అని అశరీరవాణి పలికింది.

అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మడు తనను ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది మహారాజా! ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు కూడా! అయితే అపార ధనవంతుడను, అంగరాజ్యాధిపతిని అయిన నేను పేదసాదలకు అన్నం పెట్టి పంపితే, వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికీ తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి, సేవకులతో సంచీడు బంగారు నాణేలను తెప్పించి, అతని వీపుమీద పెట్టించడంతో, ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిలబడటం, తాను తిరస్కారంగా చూసి, భటుల చేత గెంటించడం గుర్తుకొచ్చింది.

బంగారం వెండి ధనం వజ్రవైఢూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడనే పేరొచ్చింది...  అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ, ఆకలన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు... బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలు పర చగలడు? కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తుకొచ్చాడు.

సూర్యుని వద్దకెళ్లి జరిగిన విషయమంతా వివరించి పరిపరివిధాల ప్రాధేయపడ్డాడు. సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కలసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశమిచ్చారు. అదేమంటే, సశరీరంగా భూలోకానికెళ్లి అక్కడ ఆర్తులందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యమినాడు వెళ్లి, అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

కర్ణుడు భూలోకంలో ఉన్న కాలానికే మహాలయ పక్షమని పేరు. ఎప్పుడైతే అన్నసమారాధనతో అందరి కడుపులూ నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి, దప్పిక ఆయనను ఎన్నడూ బాధించలేదు.
 ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి కడుపు నింపాలి కానీ డబ్బు, బంగారం దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? అన్నం పెట్టి, ఆకలి తీర్చినవారిని అన్నదాతా సుఖీభవ అని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. పితృదేవతల పేరిట ఆలయాలలో అన్నదానం చేయించడం వల్ల పేదల కడుపు నిండుతుంది, పితృలోకంలో ఉన్నవారికి ఆత్మశాంతి కలుగుతుంది.
- D.V.R..

స్త్రీ గణేశాయ నమః

స్త్రీ గణేశాయ నమః


‘ముదాకరాత్త మోదకం సదావిముక్తి సాధకం
కళాధరా వతంసకం.. నమామి తం వినాయకమ్!’

అని విఘ్ననాయకుణ్ని మనమంతా కొలిచే ఈ వేళ మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన్ని ‘విఘ్ననాయకి’గా ఆరాధిస్తారు! వైనాయకీ, విఘ్నేశ్వరీ, గణేశినీ, ఐన్గనీ అని కొలుస్తారు. వినాయకుణ్ని బ్రహ్మచారిగానే కొలుస్తాం. తల్లి తప్ప సతి నీడ తెలియని వాడుగానే భావిస్తాం. అలాంటిది ఆయన్ని ఏకంగా స్త్రీమూర్తిగానే ఎందుకు కొలుస్తున్నారు? ఎక్కడ కొలుస్తున్నారు?
తమిళనాడు
వినాయకి పూజకి తమిళనాడులో విశేష ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకంగా కాకపోయినా ఆలయాల్లోని ఉపదేవతలుగా పూజలు చేస్తున్నారక్కడ.

కన్యాకుమారిలోని శుచీంద్రంలో మనం ‘గణేశ్వరి’ని చూడొచ్చు! లలితాసినిగా ఇక్కడ వినాయకి దర్శనమిస్తుంది. తలపై చక్కటి అలంకరణలతో మకుటం.. పైచేతుల్లో అంకుశం, పాశం.. కింది చేతుల్లో అభయ, వరద ముద్రలతో కనిపిస్తుంది. మెడకింద స్త్రీ రూపం, హారం, శుక్లాంబరాలతో.. ఎడమపాదాన్ని తాకేంత పెద్ద తొండంతో ఉంటుందీ విగ్రహం. చతుర్థినాడు వినాయకుడికి ఇంట్లో పూజ చేసుకునే భక్తులు, ఈ రోజున గణేశ్వరిని ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేకంగా పూజిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని వినాయకి విగ్రహం విద్యాగణపతిగా ప్రసిద్ధి పొందింది.

మదురై అనగానే మనకు మీనాక్షి అమ్మవారి గుడే స్ఫురిస్తుంది. ఆ ఆలయంలోనూ విఘ్నేశ్వరిని దర్శించుకోవచ్చు. చొక్కనాథుని సన్నిధికి పక్కనే ఓ స్థూపంలో ‘అభంగ’... అంటే నిల్చున్న భంగిమలో వినాయకినిని గమనించొచ్చు. ఈ విగ్రహానికి నడుము కింది భాగం పులిరూపం! కనుకే ‘వ్యాఘ్రపాద వినాయకి’ అని పిలుస్తారు.
ఇదేలాంటి స్త్రీ రూప గణేశుణ్ని ప్రఖ్యాత శివాలయం చిదంబరంలోనూ చూడొచ్చు. ఇక్కడా వ్యాఘ్రపాద రూపిణియే కానీ.. చేతిలో ఆయుధాలకు బదులుగా పూలగుచ్ఛం ఉంటుంది!! శాంతికాముకిగా అనిపిస్తుంది.

కర్ణాటకలో
కర్ణాటకలోని శిరాలి చిత్రపూర్ మఠంలో పదో శతాబ్దానికి చెందిన వినాయకి లోహశిల్పం చాలా అందమైంది. ఇక్కడ వినాయకి.. వినాయకుడిలా బొజ్జతో ఉండదు. అందమైన నడుముతో అలరారుతూ ఉంటుంది.

మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ బెడాఘాట్ ప్రాంతంలోని చౌసాత్ యోగిని ఆలయంలో కనిపించే వినాయకి ఉత్తరభారత దేశమంతటా ప్రఖ్యాతి చెందింది. పదో శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని గణేశ్వరిని ‘శ్రీ ఐన్గని’ అని పిలుస్తారు. ఇప్పటి మన వినాయకుడి విగ్రహాల్లాగే చేతిలో పరశుతో ఉంటుందీ విగ్రహం. మధ్యప్రదేశ్ సాత్నాలోని భూతేశ్వర ఆలయంలోని విగ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సప్తమాతృకల నడుమ ఇక్కడ మనం చిన్నారి వినాయకినిని చూడొచ్చు! చిట్టిబొజ్జతో చేతిలో వినాయకుడిలా అంకుశంతో మనకిక్కడ దర్శనమిస్తుంది.

పుణే
పుణే దగ్గర్లోని భూలేశ్వర్ శివాలయంలోనూ దాదాపు ఇదేలాంటి చిట్టి విఘ్నేశ్వరి కనులపండగ చేస్తుంది.

బీహార్
బీహార్లోని గిర్యక్ ప్రాంతంలో బౌద్ధ మతస్థులు సృష్టించిన వైనాయకినిని వీక్షించొచ్చు.
మనదేశంలో తొలి వినాయకి విగ్రహం రాజస్థాన్లో దొరికింది. అది క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిందని చెబుతారు. మన పురాణాల్లోనూ వైనాయకి ప్రస్తావన ఉంది. వినాయకుని వివిధ రూపాలని విడమర్చి చెప్పే ముద్గల పురాణం.. విఘ్నాలను తొలగించే ఆయన స్త్రీరూపాన్నే ‘ప్రజాదేవి’గా కీర్తించింది. స్కందపురాణం కాశీని రక్షించడానికి శివుడు నియమించిన శక్తుల్లో విఘ్నేశ్వరి కూడా ఒకటని చెబుతుంది.  మత్స్యపురాణం, విష్ణుధర్మోత్తర పురాణంలోనూ వినాయకి ప్రస్తావన ఉంది. దేవీపురాణం విఘ్ననాయకుని శక్తి (సృష్టి) రూపమే వినాయకి అని వివరిస్తుంది.

కేవలం మనదేశంలోనే కాదు... విదేశాలలో కూడా.
ఇండొనేషియా
ఇండొనేషియాలోని బాలిలో గణేంద్రిగా పూజలు అందుకుంటుంది వినాయకి!
జపాన్
జపాన్లో వినాయకిని కాంగిటెన్గా పూజిస్తారు. ఇక్కడ వినాయకుడు ఆడా, మగా జంటగా ఆలింగన భంగిమలో ఉంటాడన్నదే విశేషం.

Wednesday, 7 September 2016

దేవ వ్రతుడు ( భీష్ముడు )



శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది.

'నన్ను పెళ్ళి చేసుకుంటావా?' అని అడిగాడు.

అందుకా అమ్మాయి నవ్వుతూ 'నేనెవరో తెలుసా?' అంది.

"నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు.

అప్పుడు ఆ అమ్మాయి, "మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది.

ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు.
వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - ఆమెనే గంగాదేవి.

పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు.

అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.

చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు. ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.

వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.

" పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు, వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.

ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.

" వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు.

అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.

కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి !' అన్నాడు.

వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు.

పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.

" ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.

అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.

ఆ పిల్లవాడే దేవవ్రతుడు.

వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.




Tuesday, 6 September 2016

పంచాయతనం





పంచాయతనం

పంచాయతనం అంటే ఐదుగురు దేవతా మూర్తులున్న పీఠం. ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, పరమేశ్వరుడు. మూర్తులంటే విగ్రహాలు కావు. ఆయా దేవతలకు ప్రతిరూపాలుగా భావించే శిలలు.

ఆదిత్యుడికి ప్రతి రూపం స్ఫటికం. గోళీకాయంత ప్రమాణంలో ఉండే స్ఫటికం సూర్యునిగా పూజలందుకుంటుంది.

అంబికకు ప్రతిరూపం నాపరాయి వలే ఉంటుంది. ఇందులో సువర్ణం ఉంటుందంటారు. కొన్ని నాపరాళ్లలో బంగరు రంగు గీతలుంటాయన్నది విదితమే కదా! దీనిని చంద్రశిల అంటారు.

విష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడని అందరికే తెలిసిన విషయమే. ఇందులో జీవశక్తి ఉంటుంది. ఈ సాలగ్రామాలు ఉత్తరాన, హిమాలయాల్లో ప్రవహించే గండకీ నదిలో లభ్యమౌతాయి.

గణపతి జేగురు రంగులో ఉండే శిలలో ఉంటాడు. ఇవి శోణా నదిలో ఉంటాయి. శోణం అంటే ఎరుపు, లేదా అగ్ని వర్ణం. శోణానది మైనాక పర్వతంలో పుట్టి గంగలో కలుస్తుంది. ఈ నదిలో లభించే శిలలను శోణభద్ర వినాయక మూర్తులని అంటారు.

మహేశ్వరుడు బాణలింగ రూపంలో పూజలందుకుంటాడు. ఇది కూడా చిహ్న రూపమే. బాణలింగాలు నర్మదా నదిలో లభిస్తాయి. ఇవి శివలింగాకృతిలో ఉంటాయి.

పంచాయతనం పూజా గృహాల్లోనూ, దేవతార్చనా మందిరాల్లోనూ ఉంటుంది. కొన్ని గర్భ గుడుల్లో కూడా ఉంటాయి. కానీ గుళ్ళల్లో ఉన్న పంచాయతనంలో విగ్రహాలుంటాయి. తిరుమలలో, శ్రీశైలంలో, కాళహస్తిలో పంచాయతనాలు లేవు.. మూల విరాట్ఠులు మాత్రమే ఉంటారు. గృహస్థులు ఎచటికేగినా పంచాయతనాన్ని తమ వెంట తీసుకుని వెళ్లి పూజలు చెయ్యాలి. మధ్యలో ఉన్న శిలను బట్టి పంచాయతనానికి పేరు ఉంటుంది.

ఉదాహరణ:
విష్ణుపంచాయతనం అంటే సాలగ్రామం మధ్యలో ఉంటుంది.


పంచాయతనం అంటే ఏమిటి?
‘ఆయతన’మంటే ఆకారం. 
‘పంచాయతన’మనగా అయిదు ఆకారాలు గల పరమాత్మ. 
పేరు పంచాతనుడు. 
ఆయన పూజ పంచాయతన పూజ. 
ఈ పూజలో శివ, విష్ణు, దేవి, గణపతి, సూర్య ఆకారాలలో పరమాత్మను ఒకేసారి అర్చన చేస్తారు. 
ఈ ఐదు ఆకారాలు పరమాత్మ ఆకారాలే అనే జ్ఞానంతో చేసే అర్చన పంచాయతన అర్చన. 
ఈ ఐదు ఆకారాలే ఎందుకు తీసుకోవాలంటే లోకంలో ఈ ఐదురకాల ఆకారాల మీదనే ప్రధానంగా ప్రతి విశేషము వుంటోంది. దేవతల పేర్లు చాలా వున్నా, ఈ దేవతలకే ప్రధాన దేవతలన్న ప్రశస్తి ఉపనిషత్తులలోను, పురాణాలలోను ఏర్పడివుంది. మంత్ర శాస్త్రంలోని మంత్రాలన్నీ కూడా, ఈ ఐదు దేవతల ఆధారంగానే విభజన చేయబడి వున్నాయి. 

ఈ కారణాలవల్ల ఈ ఐదు దేవతలనే స్వీకరించి పంచాయతన పూజా విధానాన్ని రచించటం జరిగింది. 

పంచాయతనం అంటే ఏమిటి? శంకరులు ఎందుకని పంచాయతనానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు? 
తేజస్సు పృధ్వి జలము కలిసి మహాగణపతి అనుకున్నాం. దివ్యులు అంటే దేవతలు లేదా దేవుళ్ళు వీరందరూ పేర్లు వేరైనా బ్రహ్మతత్త్వమూ, పరబ్రహ్మతత్త్వమూ తెలుసుకుంటే ఉన్నది ఒక్కటేనని తెలుస్తుంది. అలా తెలుసుకోగలగాంలటే పూర్వజన్మ సుకృతమూ అనేక జన్మల సాధనా, జ్ఞానమూ, దైవకృప కావాలి ! ఇవి అందరికీ ఉండవు గనుక అందరికీ పనికి వచ్చేలా మన మూర్తి లేదా విగ్ర్రహ పూజను పెద్దలు మనకు అందించారు. శివుడు గొప్పా?, విష్ణువు గొప్పా? లేదా అమ్మవారిని పూజించాలా? అన్న సమస్యలు అందరికీ కలుగుతూ వుంటాయిఠ. ఇలాటి సమస్యకు పరిష్కారంగా శివుడు, విష్ణువు, సూర్యుడు. గణపతి, అమ్మవారు ఈ అయిదు స్వరూపాలను ఒక్కచోట పెట్టి ఒక్కలాగ ఆరాధించే పద్ధతిని ఆదిశంకరులు మనకు అనుగ్రహించారు.

Saturday, 3 September 2016

శల్యుడు - శల్యసారథ్యం





నకుల సహదేవులకు మేనమామ అయిన శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. ఆయన సోదరి మాద్రిని పాండు రాజు వివాహం చేసుకున్నాడు. మాద్రికి అశ్వనీదేవతల వరంతో నకుల సహదేవులు జన్మించారు. పాండు రాజు మరణించడంతో పిల్లల బాధ్యతను కుంతికి అప్పగించి మాద్రి సతీసహగమనం చేసింది. కురుపాండవుల మధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో యుద్ధం అనివార్యమైంది. దీంతో కురుక్షేత్ర యుద్ధంలో తాను పాండవుల పక్షాన పోరాడుతానని ముందు శల్యుడు ప్రకటించాడు. అతడు హస్తినాపుర చేరుకోడానికి ముందే దుర్యోధనుడు మోసంచేసి తనకు అనుకూలంగా తిప్పుకున్నాడు.

రథ సారథ్యంలోనూ, యుద్ధం విద్యల్లోనూ నైపుణ్యం గల యోధుడు శల్యుడు. ఇది అతడికి జన్మతహా లభించిన వరం. దూకుడుగా వ్యవహరించి అతడిని గెలవడం కష్టం. ప్రశాంతంగా ఉండే వ్యక్తులు మాత్రమే అతడిని పోరాటంలో ఓడించగలరు. యుద్ధంలో అతడిని రెచ్చగొడితే ఓడించడం అసాధ్యం. అందుకే ప్రశాంతంగా ఉండే ధర్మరాజును అతడితో యుద్ధం చేయాలని కృష్ణుడు సూచించాడు. దుర్యోధునుడు మోసంతో తమ పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పించిన విషయం గ్రహించిన శల్యుడు తనను మన్నించమని ధర్మరాజును కోరాడు. కర్ణుడు రథసారథిగా వ్యవహరించి అతడిని నిరుత్సాహ పరచాలని శల్యుడితో ధర్మరాజు ప్రమాణం చేయించాడు.

శక్తివంతమైన ఆయుధాలు ప్రయోగించినప్పుడు కర్ణుడి స్థైర్యాన్ని దెబ్బతీస్తే అర్జునుడు విజయానికి ఉత్సహాం లభిస్తుందని తెలిపాడు. అయిష్టంగానే కదన రంగంలోకి ప్రవేశించిన శల్యుడు ఇరు వర్గాలకు చేసిన వాగ్దానాలకే కట్టుబడి ఉన్నాడు. కర్ణుడి రథసారథిగానే కాదు, అతడి మరణం తర్వాత కౌరవ సేనలకు శల్యుడు నాయకత్వం వహించాడు. మహాభారత యుద్ధం తొలిరోజున శల్యుడి చేతిలో అభిమన్యుడు బావమరిది ఉత్తర కుమారుడు మరణించాడు. అయితే చివరి రోజు ధర్మరాజు చేతిలో శల్యుడు వీర మరణం పొందాడు. అతడి మరణం తర్వాత ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు కురు సైన్యానికి సేనాపతిగా బాధ్యతలు స్వీకరించాడు. 



నకులసహదేవుల మేనమామ, పాండవ పక్షమున నిలిచి కౌరవసేనను చీల్చి చెండాడవలసిన మహాయోధుడు. కాని విధివైపరీత్యం వల్ల కౌరవసేనకు సైన్యాధ్యక్షుడిగా నిలిచి, పాండవసేనను దునుమాడవలసి రావడం దురదృష్టకరం. ముఖస్తుతి అంత ముప్పు తెచ్చిపెట్టింది. శల్య సారథ్యం, పార్థుసారథ్యానికి ఉన్న భేదం కొట్టొచ్చినట్లు మనకు కావ్యం పరిశీలిస్తే తెలుస్తుంది.

శల్యసారథ్యం గురించి తెలియనివాడంటూ తెలుగుదేశంలో ఉండడంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అతిరథవీరులలో బశల్యుడొకడు. ఇతడు మద్రదేశాధిపతి. నకులసహదేవులకు మేనమామ. అంచేత ఈయన పాండవ పక్షాన మహాభారత యుద్ధంలో కౌరవులను చీల్చిచెండాడవలసిన యోధాగ్రేసరుడు.

దుర్యోధనుడు విరాటపర్వంలో కీచకవధానంతరం పాండవుల ఉనికి ప్రస్తావిస్తూ... "సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు సమానబలము వార, లొండరులను గెలుచునుత్సాహమును గల రుద్ధతులును బాహుయుద్ధపరులు" అంటాడు.

కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు - ఈ నలుగురు సమానబలం కలవారు. ఒకరి నొకరు జయించుకొనవలెనని ఉత్సాహపడే గర్విష్టులు. మల్లయుద్ధ ప్రియులు. ఈ నలుగురి భుజబలాలతో సరితూగజాలే భుజబలం మరెక్కడా కనబడదు అని స్వయంగా గదాయుద్ధ, మల్లయుద్ధ నిపుణుడు దుర్యోధనుడు అన్నమాటలు.

పాండవుల అజ్ఞాతవాస పరిసమాప్తి తెలిసికొన్న శల్యుడు, పుత్రమిత్ర సమేతముగా నానాసేనాపతి సంకులంబుగా పాండవుల కడకు బయలుదేరాడు. అతని ముఖస్తుతి, మర్యాదకు ఉబ్బిపోవు స్వభావం తెలిసిన దుర్యోధనుడు, తాను చాటున నిలిచి ఆయన ప్రయాణించే మార్గమంతట చలువ పందిళ్లు వేయించినాడు. తీయని నీరు గల నడబావులు త్రవ్వించాడు. ఏనుగులు, గుర్రాలకు చావళ్లు, ఆస్థానమండపాలు ఏర్పాటు చేయడమే కాక, రుచికరపదార్థాలను సేనలకు అందివ్వడము, సకల మర్యాదలనూ అమాత్యుల ద్వారా జరిగేటట్లు ఏర్పరచి రహస్యంగా తను వెంట నడిచాడు. శల్యుడవి చూచి మార్గమధ్యముననే తన ఘనత కింతటి మర్యాదలు జరిగెనని ఉబ్బిపోయి, ఇవి జరిపించినది ధర్మజుడేయని భ్రమించి పరిజనంబు చూచి,

"ఇట్లు చతురంబుగా మనకు వలయువాని సమకూర్చటానికి కారకులైన ధర్మరాజు మంత్రులెవరు? వారిని తీసుకొని రండి. వారు మా అనుగ్రహానికి పాత్రులు" అని పలుకగానే, దాగి ఉన్న దుర్యోధనుడు ఇదే అదనని నమ్రతతో బయల్పడగా, శల్యుడు గౌరవంతో గట్టిగా కౌగలించుకుని బంగారు పీఠం మీద కూర్చుండబెట్టి "నీకేమి కావాలో కొరుకొ"మ్మనగా దుర్యోధనుడు - నీవు నాకు మంత్రివయి, పూని నా సైన్యాన్ని నడుపింపుమని భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లాడు.

శల్యుడు చేసేది లేక, "పాండవులు, మీరు ఒక్కటే కాబట్టి ముందుగా నన్ను సాదరంగా చూడటానికి వచ్చిన నిన్ను ప్రీతితో చేరతాను." అని సత్యవచనుడయ్యాడు.

నీవు హస్తినాపురం వెళ్లుమని చెప్పి, తాను పాండవులను కలసివస్తానని చెప్పాడు.

ఇచ్చిన వరం మాట మరువవద్దని జ్ఞాపకం చేశాడు దుర్యోధనుడు. సందేహపడవద్దని శల్యుడు భరోసా ఇచ్చాడు.

శల్యుడు చేయదలచుకొన్నదొకటి, చేసిన దింకొకటి. దుర్యోధనుని మర్యాద అతని కంత మత్తెక్కించినది. శల్యుడు, ధర్మనందనుని నివాసమున కేగాడు. ఆయన సమస్త బంధుగణంతో ఎదురేగి ప్రణమిల్లాడు. బంగారు గద్దియపై కూర్చుండబెట్టగానే, శల్యుడు, స్వాగతసత్కారములకు పొంగిపోయాడు. ధర్మజుని కౌగిలించుకుని కుశల ప్రశ్నానంతరం మార్గమధ్యమున తాను దుర్యోధనున కిచ్చిన మాటలను చెప్పాడు. ధర్మరాజు వెంటనే మంచిపని చేశారని ప్రస్తుతిస్తూ మామను ఒక్కవరం అనుగ్రహించమని వేడుకున్నాడు.

"అర్జునునకు కృష్ణుడు రథసారథ్యం చేయనున్నాడు. ప్రతివీరుడైన కర్ణునకు సారథ్యం చేయటానికి మీరు తప్ప అక్కడ ఇంకొకడు లేడు. యుద్ధ సమయంలో మీరు అనాదరించి పలికి, కర్ణుడి మనస్సుకు కలత పుట్టించి అర్జునుడిని రక్షించాలి. ఇది అకార్యమని సందేహించక నా ప్రార్థనపై ఏ విధంగానైనా సరే, దీన్ని చేయాలి" అని ప్రాధేయపడిన ధర్మజుని కోర్కెకు శల్యుడు సమ్మతించాడు.

ధర్మజుని దూరదృష్టి, రాజనీతిజ్ఞత ఇక్కడ ప్రశంసార్హం. దుర్యోధనుడి ఎత్తుకు పై ఎత్తు వేసి ధర్మరాజు అతడిని చిత్తు చేశాడు. తన కోరిక అకృత్యమని తెలిసినా రాజకీయాలలో సమర్థనీయం. ఈ కోరిక వలన శల్యుడు తన పక్షంలో ఉన్న దానికంటే పరపక్షంలో ఉండటమే ధర్మరాజుకు అధికతరమైన మేలు చేకూర్చింది.

ధర్మజుడు తన్ను పెద్ద చేసి నహుషోపాఖ్యానము చెప్పుమని అడుగుసరికి, శల్యుడుబ్బిపోయి ఆ కథ చెప్పి, ఏ నాలుకతో అంతకు ముందు సాయము చేయుదునని సుయోధనునకు మాట ఇచ్చాడో, ఇప్పుడు అదే నాలుకతో,

"కౌరవనాథుడా నహుషు కైవడి నాశము బొందు వాసవీ శ్రీరమణుడై, జయము సేకొని, ధర్మజు డంబురాశి వేలారశనా సముజ్జ్వల విలాస మనోహరమేదినీ వధూసార సమగ్ర భోగముల నన్నుతి కెక్కెడు తాను తమ్ములున్"


దుర్యోధనుడు ఆ నహుషుడి వలె నశిస్తాడు. ధర్మరాజు ఇంద్రవైభవంతో విజయం సాధించి, తమ్ములతో సముద్రతీరమనే మొలనూలి సముజ్జ్వల విలాసం చేత, అందమైన భూమి అనే స్త్రీయొక్క సారవంతాలైన సర్వభోగాలూ పొంది పొగడ్తకెక్కుతాడు, అని అన్నాడు.

సాదరసత్కారాల పిమ్మట ధర్మరాజు శల్యుని "యుద్ధంలో మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కర్ణుడిని నిరుత్సాహ పరుస్తూ మాట్లాడటం మరచిపోగూడదు." అని మళ్లీ జ్ఞాపకం చేశాడు.

శల్యసారథ్యము ప్రపంచదృష్టినాకర్షించు ఒక విశేషాంశము. ఇది ఆయనకొక విలాసవిద్య (హాబీ). ఈ విద్యలో శల్యశ్రీకృష్ణులు సిద్ధహస్తులు. ఒకరితో నొకరు లోలోపల పోటీ పడువారు.

భీష్ముడు దుర్యోధనునితో యుద్ధవీరుల సామర్థ్య నిర్ణయసమయంలో శల్యుడు అతిరథుడనీ, శ్రీకృష్ణుడిపై గల ఈర్ష్య వల్ల మేనల్లుళ్లయిన పాండవులను విడిచి నిన్ను చేరాడని పలికాడు. శల్యశ్రీకృష్ణుల సారథ్య సామర్థ్య ప్రదర్శనకు మహాభారత సంగ్రామము మంచి అవకాశము. పాండవపక్షమున వీరోత్తముడు పార్థుడు. విశేషించి అతడు శ్రీకృష్ణున కాత్మీయుడు. అందుచేతనే ఆయన పార్థసారథి అయ్యాడు. ఇక శల్యుని సారథ్యమునకీ పక్షమున చోటులేదు. కౌరవపక్షమున కర్ణుడొక్కడే పార్థునికి ప్రతివీరుడు, సర్వసమర్థుడు. కాని కర్ణుడన్న శల్యునికి గిట్టదు. కారణం అతడు తన కంటే తక్కువవాడని శల్యుని భావన (సూతసుతుడు). ఈ విషయం గ్రహించిన దుర్యోధనుడు సభాముఖమున శల్యుడి వద్దకు కర్ణుని గొనిపోయి, భక్తితో ప్రణమిల్లి, కర్ణునకు రథసారథ్యం వహించి తనకు జయం చేకూర్చుమని వేడుకొన్నాడు.

దీనికి శల్యుడు దుర్యోధనునితో, నన్ను అంత నికృష్టపు పని చేయమనటం నీకు తగదు అంతూ మూర్ధాభిషిక్తుడు, సుక్షత్రియుడైన తాను సూతపుత్రునకు రథచోదకుడను గాలేనని వర్ణధర్మా లెటువంటివో వివరించాడు.

(నేటి లౌకికదృష్టిలో ప్రభుత్వంలోని నాలుగవ తరగతి ఉద్యోగి క్రింద, రెండవ తరగతి ఉద్యోగిని పనిచేయమంటే ఒప్పుకోడు గదా).

కార్యసాధకుడైన దుర్యోధనుడు, శల్యుని మనస్సెరిగినవాడు, ఇంక ముఖస్తుతి ప్రారంభించాడు. మామా! నీవు గొప్ప శత్రువుల గుండెల్లో శల్యం (బాణం) వంటివాడవైనందువలన గదా నీకు శల్యుడనే పేరు వచ్చింది. రథికుడి కుండవలసిన లక్షణాలలో అర్జునుడి కంటే గొప్పవాడు కర్ణుడు. గుఱ్ఱాల మనస్సు తెలిసికొనటంలో కృష్ణుడి కంటే గొప్పవాడవు నీవు. అర్జునుడికి ప్రతివీరుడుగా మనం కర్ణుడిని తగినవాడిని చేశాము. మన ఈ నిర్ణయాన్ని కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి నిరుపయోగం చేస్తున్నాడు. దానికి తగిన ప్రతిక్రియ చేయాలంటే కృష్ణుడి ఎత్తులకు పైఎత్తులు పడాలంటే అందుకు సర్వసమర్థుడవు నీవొక్కడివే. ఇంత మహాకార్యం నీ వలననే జరగాలి కాని ఇతరుల వలన కాదు.

దీనికి శల్యుడు- " నను కృష్ణు కంటె అధికుండని యి మ్మనుజేంద్రకోటి యాకర్ణింపం గొనియాడితి విమలయశోఘనుడగు కర్ణునకు రథము నడిపెద నధిపా! "

రాజా! ఇంతమంది రాజులు వింటూ వుండగా నీవు నన్ను కృష్ణుడి కంటే గొప్పవాడివి అని ప్రశంసించినావు. దాతృత్వం మొదలైన కారణాలతో మంచిపేరు గల కర్ణునకు నేను రథం తప్పక తోలుతాను అన్నాడు.

ఎవరి నెట్లా పడగొట్టాలో దుర్యోధనునకు బాగా తెలుసు. శల్యుడి మాటలలో లోకరీతి బాగా తెలుస్తుంది. ఒకడి రథం నేను తోలటమేమనుకున్నప్పుడు, కర్ణుడు సూతజుడుగా, రాథేయుడుగా కనిపించాడు. నీవు కృష్ణుని కంటే గొప్పవాడవనేసరికి అదే కర్ణుడు విమలయశోఘనుడయ్యాడు.

ఎంత ఆశ్చర్యం! కాని మానవహృదయము మీద పొగడ్త ప్రభావము తాత్కాలికమే. దుర్యోధనుని పొగడ్తకు పొంగి శల్యుడు కర్ణసారథ్యం స్వీకరించినను తన కంటే తక్కువవాడన్నదే అతని హృదయమున స్థిరముగ నిలిచిన అభిప్రాయము.

నొగలెక్కి కూర్చున్న శల్యుని ఏదో గొప్పవాడవని పొగడుచు, కర్ణుడు తన పని చక్కబెట్టుకొనలేదు. శల్యుడెంత స్వాతిశయపరాయణుడో కర్ణుడంత కంటే నాలుగాకులెక్కువ చదివినవాడు. శల్యుడు నొగలెక్కినది మొదలు కర్ణుడు ఆత్మస్తుతి ప్రారంభించినాడు. శల్యుడు పరస్తుతి (అర్జున ప్రశంస) ప్రారంభించినాడు. కర్ణుడి ఆత్మస్తుతికీ, శల్యుని పరస్తుతికీ ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణయే శల్యసారథ్యమునకు నాంది. పార్థుని బాణముల కంటే శల్యుని మాటలు కర్ణుని హృదయమును క్రూరముగ గాయపరచినవి. ఈ శల్యసారథ్యమే కర్ణుని యుత్సాహమును క్రుంగదీసినది. నాగాస్త్రమును గురి తప్పించినది. ప్రత్యర్థియైన పార్థునకు మేలు చేసినది. అర్జునుడు నన్నే కనుక జయించినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుందని ప్రశ్నించిన కర్ణునితో, శల్యుడు నేను ఆ ఇద్దరినీ, అంటే కృష్ణార్జునులను చుట్టుముట్టి, పైకొని వారిని పదునైన అనేక బాణపరంపరల పాల్జేతునని చెప్పాడు. ఇదే విధమైన ప్రశ్నను అర్జునుడు అడుగగా, కృష్ణుడు హాస దీప్తవదనారవిందుడై, సూర్యుడు గగనము నుండి క్రింద పడినా, భూమి బ్రద్దలైనా, మేరుపర్వతం ఒక ప్రక్కకు వొరిగిపోయినా, కర్ణుడి చేతిలో నీవు ఓడిపోవటం జరుగదు అంటాడు.

పై వాక్యాలలోని భావాలు లోకానికి శల్య శ్రీకృష్ణులు మానవజాతికి ఇచ్చే శాశ్వత సందేశాలు. తాను చేయు పని స్థాయికి తగనిదని తలపోయువానికి తనపై అధికారి కంటే తానెంతో గొప్పవాడినని బాధపడువానికి, ఆయువుపట్టు వంటి పని అప్పగించరాదు. అతడు మనఃపూర్వకంగా ఆ పని చేయలేడు. పైవాని విజయమును కోరలేడు. విశేషించి అతని పతనమే ఇతని అభిమతము. అతని స్థానమే ఇతని ఆకాంక్షితము. పార్థసారథ్యమును శ్రీకృష్ణుడు ఆత్మీయముగా వరించినాడు. కర్ణసారథ్యమును శల్యుడు పరిస్థితుల ప్రాబల్యమునకు, ప్రలోభముల ప్రభావమునకులోనై చేపట్టినాడు. శ్రీకృష్ణుడు విజయసారథియైనాడు. శల్యుడు మాత్రం కర్ణసారథిగానే నిలిచినాడు.

ధర్మజుని అంచనా ప్రకారం శల్యుడు సారథిగా నొగలెక్కిననాడే కర్ణుని మృత్యువు తప్పదనేది తేటతెల్లమైంది. ఈ రహస్యం దుర్యోధనునకు తెలియదు. కర్ణుడెంత గూఢవర్తనుడో, శల్యుడు కూడా అంత గూఢవర్తనుడయ్యాడు. ఇద్దరూ రథిక సారథులుగా కుదరటం విధినిర్ణయం. శల్యుడెంత కుటిలసారథ్యం నెరపినను కడకు కర్ణుని పరాక్రమాతిశయము నతడు గుర్తింపకపోలేదు. కర్ణుడు హతుడైన తరువాత కంట తడిపెట్టిన కౌరవపతి కడకేగి శల్యుడు, ప్రభూ! మనం ఎన్నో యుద్ధాలు చూచాము కానీ క్రౌర్యంతో కర్ణార్జునుల యుద్ధం వంటిదానిని ఎన్నడూ చూడలేదు. దేవతలు కూడా ఆ యుద్ధాన్ని చూచి ఆశ్చర్యపోయారు. కర్ణుడి విక్రమానికి కృష్ణార్జునులే భయపడ్డారు. ఇది విధి విలాసం. దీనికి దుఃఖించి ప్రయోజనం లేదు.

"విను చెప్పెద, నెంతయు భీతి నొంది రా హరియు నరుండు కర్ణు వడి, కంత విధాత్రుడు తప్పె వానికిన్" అంటాడు.

సర్వసైన్యాధ్యక్షుడుగ నుండి శక్తి సామర్థ్యములు గలవాడనని భావించుకొనుచు తక్కువ స్థితిలో సామాన్య వీరుడిగ 17 దినములు పోరి, ఒక్కసారిగా ప్రభువుచే సర్వసైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైన శల్యుడు, యుద్ధభూమిలో సామాన్యుడుగా విజృంభించునా? కర్ణ పతనానంతరము కౌరవులచే అభిషిక్తుడై సమరభూమిలో సేనల నడిపించు శల్యుని విజృంభణమెంత మహోగ్రమో, శ్రీకృష్ణుడు ఊహించినాడు. శల్యుని మనస్తత్వమును, పరిస్థితుల ప్రభావమును పాండవులకు తెలియజెప్పి, ధర్మజుని పాండవ పక్షసైన్యాధ్యక్షుడుగ నిలిపినాడు. శల్యునికి సమరభూమిలో కృష్ణార్జునులు గాని, భీమసాత్యకులు గాని ఎదురైయున్నచో బహుశః వారు తుత్తునియలయ్యెడువారు. అతని విజృంభణమట్టిది. వారన్న అతని కోపమంతటిది. కాని ధర్మజుడెదురైనాడు. దానితో శల్యుని విజృంభణము సగము చచ్చినది. ధర్మజుడన్న శల్యునికి తగని గౌరవము, అవ్యాజప్రేమ, అంతేగాదు, వారిద్దరి మధ్యా ఒక రహస్యపు ఒప్పందము గూడ జరిగినది. శల్యుడు తన నోటిమీదుగా కౌరవనాథుడా నహుషు కైవడి నాశము బొందునని, తమ్ములతో గలసి నీవు సర్వంసహాచక్రవర్తిసముడవై పరిపాలింపగలవని ధర్మజుని ఆశీర్వదించియున్నాడు. ఇప్పుడు ధర్మజునిపై ఎలా విజృంభింపగలడు? ఆయన మనస్సు వెనుకాడదా? అదే జరిగింది. ఒకసారి ధర్మజుని మూరి్ఛతుని గావించి, శక్తికి బలియైనాడు.

" భూమి మీద నిట్లు బోరగిలం బడి మద్రనాథు డొప్పె మానవేంద్ర, లేమ యురము నందు లీలమై వ్రాలిన ప్రాణనాథు బోల్ప బట్టు గాగ "

ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ ప్రకారంగా నేల మీద బోరగిలబడిన శల్యుడు యౌవనవతి అయిన మగువ వక్షస్థలం మీద విలాసంతో ఒరిగిన ప్రియునితో పోల్చటానికి తగినట్లుగా ప్రకాశించాడు అని సంజయుడు, తను చూచిన యుద్ధాన్ని ధృతరాషు్ట్రనికి వర్ణించాడు.

శల్యుని పవిత్రమూర్తిత్వం, ధర్మస్వరూపం, వ్యక్తిత్వ సత్యం ఈ పద్యంలో మనకు తిక్కనగారు వివరించారు. రెండు ధర్మాలకు పరస్పర సంఘర్షణము, శల్యధర్మరాజుల యుద్ధంలోని అంతరార్థం. ధర్మరాజు చేతిలో మరణించడమే శల్యుని ఉత్తమత్యాగానికి నిదర్శనం. అతడు యుద్ధం చేసింది సగం దినం, మరి కొన్ని ఘడియలు మాత్రమే. పాండవులను సంహరించే ప్రతాపాన్ని ప్రదర్శించి మెఱపు వలె మెరసి ఆరిపోయాడు. ధర్మరాజు చేసిన ధర్మయుద్ధంలో చనిపోయిన శల్యుడు, శాస్త్రోక్తంగా సమర్పించిన హవిస్సులను స్వీకరించి చల్లారిన హోమాగ్ని వలె భాసించాడు.

లోకమున ముఖస్తుతులు, మర్యాదలు, మానవస్వభావముపై ఎంతటి ప్రభావము చూపగలవో, ఈ ముఖస్తుతులకు, మర్యాదలకు లొంగిపోవువారు, శక్తిసామర్థ్యములు గలిగి చిత్తశుద్ధి లేక ఉభయపక్షములకు మాట ఇచ్చి చావుతో పాటు చెడ్డ పేరెట్లు తెచ్చుకొందురో, శల్యుని పాత్రలో మహాభారతము ప్రదర్శించినది. పాండవధర్మపక్షాన నిలిచి పోరాడవలసిన మేనమామ అధర్మపక్షాన నిలిచి ఎంత అపకీర్తిని మూట గట్టుకొన్నాడో విజ్ఞులు గ్రహిస్తారనీ, దీనినే విధివైపరీత్యమని కవిత్రయభారతం దేశమానవాళికి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి.



కారణజన్మురాలు ద్రౌపది

అతి రూపవతి భార్యాశతు్రః ” అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది. రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది. ద్రౌపది అయోనిజ, కారణజన్మురాలు, పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. కోకిలాదేవి - పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.

త|| "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు
త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం
తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి
తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్"
వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.

రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని కన్ను కుట్టించింది. మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంస కంటే శత్రువు అసూయతోనైనా చేసే ప్రశంస సత్యము, ప్రశస్తమైనది.

“ద్రౌపదీదేవి అన్ని దేశాల నుండి రాజసూయ యాగం చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, దగ్గరి బంధువులను, స్నేహితులను, వీరభటులను, పనివాళ్లను, పేదలను, బైరాగులను, అందరినీ ప్రతిదినం స్వయంగా విచారించి, తగిన రీతిగా దయతో అన్నం పెట్టి, అందరు భుజించిన తర్వాత అర్ధరాత్రి కాని తను తృప్తిగా భుజించేది కాదు. అంతేకాదు, ఆ మహాయాగంలో అధముడు కూడా ప్రేమతో పూజలందుకొన్నాడు గాని, కోరుకొన్నది లభించనివాడు ఒక్కడైనా లేడు. ”

“రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు, సాత్యకి ముచ్చటగా ముత్యాల గొడుగు పట్టాడు. శ్రీకృష్ణపాండవులు పట్టాభిషిక్తులయిన రాజులందరిని వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మ్రొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే శ్రీకృష్ణపాండవులు, ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు.” అంటాడు.

ఈ నవ్వే దుర్యోధనుని హృదయంలో గాడంగా గ్రుచ్చుకొన్నది. మాయాద్యూతానికి ఆహ్వానింపబడి ధృతరాష్ట్ర మందిరానికి భర్తలతో ఏతెంచిన పాండవధర్మపత్నిని - “ అఖిలలావణ్య పుంజంబు నబ్జభవుడు మెలతగా దీని యందు నిర్మించె నొక్కొ కానినా డిట్టి కాంతి యే కాంత లందు నేల లేదని సామర్ష హృదయలయిరి ”

బ్రహ్మదేవుడు సమస్త సౌందర్యకాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీకాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు, ఇంతటి కాంతి ఏ యితర కాంతల్లోను కానరాదు - అని అక్కడి వాళ్లంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయ పడేటంత లావణ్యవతి ద్రౌపది. విశేషించి మయసభలో దుర్యోధనుడు పొందిన భంగపాటును చూచి, పరిచారికాపరివృతయై పక్కుమన్న ద్రౌపది నవ్వు, దుర్యోధనుని వేధించి వెంటాడి, అతనిలో ప్రతీకారజ్వాలలు రేపింది. దాని పర్యవసానమే మాయాద్యూతం. ఇందులో ధర్మజుడు తనను, తమ్ములను, తుదకు కట్టుకున్న భార్యను కూడా పణంగా ఒడ్డి ఓడిపోయాడు.

ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సూచించినవాడు, ద్రౌపదీ నగ్న సౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే. దీని పర్యవసానం భీముని భీష్మ ప్రతిజ్ఞలు. ఒకటి దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగటం, రెండు ఊరుభగ్నమొనర్చి, సుయోధనుని సంహరించటం. జగద్రక్షకుడైన నారాయణుని మహిమ వల్ల ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండటం చేత, ఆమె తన మానం కాపాడుకున్నది.

అరణ్యవాస సమయంలో ద్రౌపది, శ్రీకృష్ణునితో -
“నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని, వీరాధివీరులైన పాండవుల భార్యను, మహాబలశాలియైన ద్రుష్టద్యుమ్నుడి సహోదరిని, నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తల వెంట్రుకలు పట్టి ఈడ్చాడు, వలువ లొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్ధులు, బందువులు చూచి ఊరకున్నారు. శరణువేడిన వారిని కాపాడే పాండవులే, నన్ను రక్షించండని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు గదా! ఇంకా భీమార్జునుల భుజబలమెందులకు? ” అన్నది.

దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు
" నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడై అర్జునుడి కఠోరబాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరక తప్పదు. సప్తసాగరాలు ఇంకినప్పటికిన్నీ, పగలూ, రాత్రీ తారుమారైనప్పటికిన్నీ, నా మాట నిజంగా జరిగి తీరుతుంది. ” అని ఓదార్చాడు.

అరణ్యవాస సమయంలో ఏకాంతంగా ఉన్న నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లత వలె ఆ అడవినంతటిని తన శరీర ప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మోహించి, బలాత్కరించబోగా, భీముడు వాని వెంట్రుకలు గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదుశిఖలుగా నిలిపి అవమానించాడు.

అజ్ఞాతవాస సమయంలో విరాటుని అంతఃపురంలో పరిచారికా వేషములో ఉన్న ద్రౌపది సౌందర్యమే ఆమెకు చేటు తెచ్చి పెట్టినది. పురజనులు, సైరంధ్రీ వేషంలో ఉన్న ద్రౌపదిని చూచి ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని, మానవకాంత మాత్రం కాదు, తన రూపాధిక్యం చేత చూపరులను ఆకట్టుకొందనుకున్నారు. దీనిని బట్టి సుధేష్ణ గాని, కీచకాదులు గాని ఆమె ద్రౌపదీత్వాన్ని గుర్తించలేదు. దేవాంగనేమో అనే సందేహంలో పడ్డారు. ఆ భావనే ఆమెకు, ఆమె అజ్ఞాత వ్రతానికి శ్రీరామరక్షగా నిలిచింది.

సుధేష్ణ ద్రౌపదితో తొలి సమాగమంలోనే, “ భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళ్ళూరటం ఖాయం. అటువంటి నీచేత నేను ఎట్లా పని చేయించుకొంటాను? ఆడవాళ్లు కూడా నీమీద చూపులు నిలిపి వింతగా చూస్తారు.”

ఇంకా వేరే మాటలు ఎందుకు? భర్తలను మొదట అనుమానించటం స్త్రీల స్వభావం. తమ్ముడైన కీచకుడిని మాత్రం సుధేష్ణ శంకించలేదు. అనుకున్నదొకటి, జరిగింది వేరొకటి. ద్రౌపది సౌందర్యం సింహబలునకు కాముకతను కల్పించింది, తుదకు అతని అసువులనే హరించింది. కీచక వధాఘట్టమున ద్రౌపది వాక్చాతురి, నిర్వాహకత్వము తిక్కనగారు చిత్రించిన తీరు కడు ప్రశంసనీయమైనది.

సుధేష్ణ కోరిక పై కీచకమందిరానికి మద్యం తెచ్చేందుకు వెళ్లిన ద్రౌపది బలాత్కారానికి గురి కాబోయి తప్పించుకుని, పరుగుపరుగున విరాటరాజు కొలువు దీరిన సభ ప్రవేశించింది. కీచకుడు వెంటాడుతూ రాగా, కోపాతిశయంతో సమయం సందర్భం మాటమరచి, ఆగ్రహంతో ధర్మభీములున్న ఆ సభలో తన భర్తలకు తగిలి వచ్చేటట్లుగా మాట్లాడసాగింది.

“మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఉన్నా, ఈ విధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ మిన్నకుండటం ఆశ్చర్యం కాదా? ఇక ఎవ్వరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈ విధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను, ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న మీలో, కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్స్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజుననాలి. కీచకుడు చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదలిపెడతారా?” అని రోషంగా పలికింది.

ఆ మాటలకు విరాటుడు మారు పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వవాక్యాలతో సమాధానపరచి పంపాడు.

ప్రజలామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు.

ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజస్వరంతో ద్రౌపదితో “ ఓ వనితా, నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుధేష్ణ సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా, ఇప్పుడేమైనా, వారు కోపాన్ని ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలో ఇంతసేపు శంక లేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం సమంజసం కాదు.” అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడ నుండి కదలలేదు.

అప్పుడు ధర్మరాజు ఇలా మందలించాడు. “నీవు కులసతి గౌరవం కించపడేటట్లు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా మెలగటం తగునా?” అన్నాడు.

ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. “కంకుభట్టా! నా భర్త నటుడు. ఆ మాట నిజం. పెద్దవారి వలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతి వలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి ఆలికి మర్యాద ఎక్కడుంటుంది? ” అని ఆర్తితో అక్కడి నుండి సైరంధ్రి వెళ్లిపోయింది.

ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముని వద్దకు రహస్యంగా రాత్రి వెళ్లింది. కరస్పర్శతో లేపింది. తన అవమాన గాధనంతా వివరించి చెప్పింది. అన్న ధర్మజుడు వారించకపోతే కీచకుడి అంతు ఆనాడే చూచేవాడిననీ, కానీ అందువల్ల సమయ భంగమయ్యేదని వివరించాడు. మహాపద తప్పిందని ఇక కార్యసాధనకు ప్రణాళిక చెప్పాడు.

“ కీచకుణ్ణి ఉపాయంతో చంపాలి. వాడు రేపు నిన్ను సమీపిస్తే, ఒడబడినట్లు నటిస్తూ నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని ఒంటరిగా అర్ధరాత్రి రమ్మని నిర్దేశించుము. సంకేత స్థలంలో నీ బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే విజృంభించి చంపి నీకు చూపుతా.” అని అన్నాడు.

మరునాడు ద్రౌపది భీముడు చెప్పిన విధంగా చేసింది. అంతే, ఆ రాత్రి వాడు భీముని చేతిలో దుర్మరణం పొందాడు. భీముడు గూఢమర్దనక్రియలతో కీచకుడిని చంపి కాళ్లూ, చేతులూ, కడుపులోకి చొప్పించి, ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. ఆ వికృతాకారాన్ని ద్రౌపదికి చూపి “అదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమాన భారాన్ని మాన్చాను. నిజమా? ద్రౌపదీ, నీచింత తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్ను అవమానించ దలచుకొన్న ఎంత వీరుడి గతి అయినా ఇంతే. ఇది తెలిసి ఆనందించుము.” అని భీముడు పలికాడు.

భీమున్ని ఉత్తమనాయకుడుగా కీర్తించింది ద్రౌపది.

అజ్ఞాతవాస పరిసమాప్తి అనంతరం, సంధిసంధాతగా శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరినాడు. పతులందరూ సంధికావలెనని కోరుచున్నారు. ఈ సంకటస్థితిలో శ్రీకృష్ణుడు, ద్రౌపది అభిప్రాయమడిగినాడు. ఇక ద్రౌపది పతులను వ్యతిరేకించుటెట్లు? అట్లని అవమానము భరించుటెట్లు? అప్పుడామె ప్రదర్శించిన వాక్చాతురి, నిర్వాహకత్వమును, తిక్కన ఆంధ్రభారతమున వ్యక్తీకరించిన విధానము అద్వితీయము, అమోఘము.

"వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి,
నందు పాండుభూవరునకు కోడలైతి, జనవంద్యుల బొందితి,
నీతివిక్రమస్థిరులగు బుత్రులం వడసితిన్,
సహజన్ముల ప్రాపు గాంచితిన్ సరిసిజనాభ
యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్"
(పుట్టింటి గౌరవం, మెట్టినింటి గౌరవం, అత్తామామల గౌరవం, భర్తల గౌరవం తనకున్నాయని అంటుంది ద్రౌపది).

" ద్రౌపది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున
విడ్చి వెండ్రుకల్ దా వలచేత బూని, యసితచ్ఛవి
బొల్చు మహాభుజంగమోనా విలసిల్లి వ్రేలగ,
మనంబున బొంగు విషాదరోషముల్ గావగలేక
బాష్పముల్ గ్రమ్మగ దిగ్గన లేచి యార్తయై "

ద్రౌపది తన ఒప్పిదమైన కొప్పును గ్రక్కున విప్పి శిరోజాలను కుడి చేతదాల్చి, నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలె ప్రకాశిస్తూ వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుఃఖాన్నీ, క్రోధాన్నీ ఆపుకొనలేక, కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున పీఠం నుండి లేచి “కృష్ణా, ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చే వేళ అతడి చేతివ్రేళ్లలో చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వచనము లాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఈ నా తల శిరోజాలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతని దేహం యుద్ధంలో ప్రప్రథమంగా ఇంతింత ముక్కలై చెల్లాచెదురుగా నేలబడి రూపుమాసి ఉండగా చూచినప్పుడే నా మనస్తాపం చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడూ, నేను దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలమూ, ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవమధ్యముడి శౌర్యమూ తగులబెట్టనా ?. దుష్టులను శిక్షించటానికి, లోకాలను రక్షించటానికి పూనుకొని ఉన్న నీవంటి తోబుట్టువు, మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవజనిత క్రోధాగ్నిని, నిప్పును ఒడిలో నుంచుకొన్న చందాన రాక్షససహనంతో భరిస్తున్నాను. ఈ పరాభవానలం శమించటం ఇంకెప్పటికో.” అని రోదించింది ద్రౌపది.

దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు ద్రౌపదితో, “ అమ్మా! శపథం చేసి చెబుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులైన కౌరవులను యుద్ధంలో చంపి, ప్రకాశమానమైన, పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం. నమ్ముము.”

సభలో ద్రౌపదికి జరిగిన అవమానము ఆమె కడుపులో రగుల్కొన్న కోపాగ్ని మహాభారతసంగ్రామమునకు ఇతోధికముగ దోహదము చేసినవి. కౌరవనాశముతో అవి చల్లబడినవి.

కర్ణపర్వంలో 18 నాటి యుద్ధంలో దుశ్శాసనుడి మరణం సంభవిస్తుంది. భీముడెలా వాడిని చంపాడో తిక్కన గారి యుద్ధవర్ణనలో పరాకాష్ఠ -
" నరసింహుండసురేంద్రు వ్రచ్చు కరణి,
న్రౌద్రంబుదగ్రంబుగా నురమత్యుగ్రత జీరి,
క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట న్వెరవారంగొని త్రావు,
మెచ్చు జవికి, న్మేనున్ మొగంబున్ భయంకరరేఖం బొరయంగ జల్లికొను,
నక్కౌరవ్యు జూచుం బొరిన్ "

నరసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్ట చించినట్లు భీముడు ప్రచండరౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు బెట్టిదంగా దుశ్శాసనుడి రొమ్మును చీల్చి పొట్ట నుండి పొంగే నెత్తురును దోసిలి నిండా పట్టుకొని, ఆనందాతిశయంతో ఉబ్బి, మధువు త్రాగినట్లు గుటగుట త్రాగి ఒయ్యారమొలికించి పనితనం చూపాడు. త్రాగుతూ నెత్తురును మెచ్చుకొన్నాడు. ఇంకా కొంత రక్తాన్ని ముఖం మీద, ఒంటి మీద చల్లుకొని భయంకరమూర్తి అయి క్రూరవిన్యాసాన్ని ప్రదర్శిస్తూ మాటిమాటికీ ఆ దుస్శాసనుడిని చూచాడు. భీమునికి కౌరవులపై గల కసి, ఇట్లా చేయించింది. అతడి భయంకరరూపాన్ని చూచి యోధులు అందరూ యుద్ధం మాని నిశ్చేష్టులయ్యారు.

చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!

Thursday, 1 September 2016

శివుడొసగనిదేదీ లేదు

శివుడొసగనిదేదీ లేదు

శివుడూ ఎల్లవేళలా ఆనందంతో ధ్యానమగ్నుడై ఉంటాడు. తన భక్తులు క్షణం పాటు హరహర శంకరా భవహరా శంభోశంకరా అని అంటే చాలు వారికి ఎనలేని సంపదలనిస్తాడు. శివుడు ఒసగనిది ఏదీ ఉండదంటారు శివభక్తులు. అలాంటి శివుడు అభిషేకప్రియుడు. శివలింగంపై తెలిసో తెలియకో ఓ పూవు వేసినా ఓ ప్రతం వేసినా ఆఖరికి మంచినీరు పోసినా సరే వారికి అంతులేని సిరినిస్తాడు. అలాంటి పరమ పావనుడిని, పరమ శాంతుడ్ని కొలవటం భక్తులకు పరమ పావనం.
పాదరసంతో చేసిన లింగానికి అభిషేకాలు జరిపి, అర్చిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
చెక్కతోటి లింగాన్ని తయారుచేసి పూజించిన వారికి అమిత భోగాలను అందిస్తాడట అదిదేవుడు. రత్నమయమైన లింగాన్ని పూజించినవారికి సంపదలతోపాటు పాడిపంటలను కలిగిస్తాడట పార్వతిపతి.
రాతితో చేసిన లింగాన్ని అర్చించినవారికి సర్వసిద్ధులను ప్రసాదిస్తాడట పరమశివుడు.
మట్టితో చేసిన లింగపూజ చేసినవారికి అణిమాదిసిద్ధులను కలిగిస్తాడు మహాదేవుడు.
కాని ఇన్ని రకాలైన లింగాల కన్నా కూడా రాతి లింగార్చనకే ప్రాముఖ్యం ఉందంటోంది లింగపురాణం.