Friday, 31 August 2018

‘కంచి’ - బంగారు బల్లి కథ

 
వెళ్లాలి చూడాలి తాకాలి.. బంగారు బల్లి కథ ‘కంచి’కే!

ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు. మరి, కాంచీపురంగా పేరొందిన ఆ ‘కంచి’ కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.
ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు. మరి, కాంచీపురంగా పేరొందిన ఆ ‘కంచి’ కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాచీపురం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. కంచి పట్టు చీరలు, బంగారు బల్లి మాత్రమే కాదు. దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూడండి.
తమిళనాడులోని కాంచీపురంలో అడుగుపెట్టగానే.. మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72 కిమీలో మీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి ‘కంజీవరం’ అనే పేరు కూడా ఉంది. ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ‘కంచి’కి రావల్సిందేనని మన పూర్వికులు చెబుతుండేవారు. అందుకే కాబోలు కథలను ముగించేప్పుడు.. కథ ‘కంచి’కి అనేవారు.
హిందూ మత పురాణాల ప్రకారం.. ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను ‘పంచ భూత స్థలాలు’ అని అంటారు. ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉంది. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం, కైలసనతార్ ఆలయాలు కూడా సందర్శించతగినవి.
‘క’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అంటే లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. అంటే, సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం. అలాగే, కంచికి ఆ పేరు రావడం వెనుక మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. ‘క’ అంటే బ్రహ్ అని, ‘అంచి’ అంటే విష్ణువని చెబుతారు. అందుకే, ఆ ప్రాంతానికి కంచి అనే పేరు వచ్చిందంటారు.
ఏకాంబరేశ్వర, కైలాశనాథ్ ఆలయాల శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడిని పంచభూతాల్లో ఒక్కటైన భూమిగా పూజిస్తారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలోని దక్షిణ గోపురం ఎత్తు 58.5 మీటర్లు. ఈ ఆలయానికి మొత్తం 11 అంతస్థుల ఎత్తైన గోపురాలు ఔరా అనిపిస్తాయి. వైకుంఠ పెరుమల్ ఆలయం, వరద రాజ ఆలయాలు సైతం యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
కంచి వెళ్లినప్పుడు మీరు తప్పకుండా పై ఆలయాలనే కాదు, కంచి వస్త్రాలను కూడా షాపింగ్ చేయండి. వేదంతంగల్ పక్షుల అభయారణ్యం, ఎలగిరి హిల్స్, శ్రీపెరుంబదర్, కంచి పీఠం తదితర ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి.

‘బంగారు బల్లి’.. కథ!
కంచి కథ ముగించేప్పుడు.. ‘బంగారు బల్లి’ గురించి తెలుసుకోకపోతే కథ కంచికి వెళ్లదు. శరీరం మీద బల్లి పడగానే.. కంచి నుంచి వచ్చినవారిని తాకితే దోషం పోతుందని అంటారు. లేదా కంచి క్షేత్రానికి వెళ్లి వరదరాజ పెరుమళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లిని తాకాలని అంటారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. గౌతమ అనే మహర్షికి ఇద్దరు శిష్యుటు ఉండేవారు. ఒక రోజు వారిద్దరు నది నుంచి కుండతో నీరు తీసుకొస్తారు. అయితే, ఆ నీటిలో బల్లి పడిన విషయాన్ని గుర్తించారు. మహర్షి ఆ బల్లిని చూసి.. ఇద్దరిని బల్లులుగా మారిపోవాలని శపిస్తాడు. శపవిముక్తి కోసం ప్రార్థించగా.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉపశమనం లభిస్తుందని చెబుతాడు. దీంతో పెరుమాళ్ ఆలయంలో స్వామిని ప్రార్థించిన కొన్నాళ్లకు వారికి మోక్షం లభిస్తుంది. ఆ సమయంలో వారిద్దరూ సూర్య, చంద్రుల ప్రతిరూపాలుగా బంగారు, వెండి బల్లుల బొమ్మలుగా భక్తులకు దోషనివారణ చేయాలని ఆదేశిస్తాడు. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించారనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.

Wednesday, 15 August 2018

మృత్యుంజయ మంత్రం

మృత్యుంజయ మంత్రం

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుకం – ఇవ – బంధనం
మృత్యో ర్ముక్షీయ అమృతాత్

🕉🕉🕉🕉🕉🕉

🌸 మృత్యుంజయ మంత్రం పూర్తి అర్థములతో:-🌸🌹

🌹 *ఓం:-* 🌹

భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

🌹 *త్ర్యంబకం:-* 🌹

భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

🌹 *యజామహే:-* 🌹

అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

🌹 *సుగంధిం:-* 🌹

సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

🌹 *పుష్టివర్థనం :-* 🌹

మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

ఉర్వారుకం – ఇవ – బంధనం :-
దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృత్యో ర్ముక్షీయ:-
అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ :-
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.

శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻

🕉🕉🕉🕉🕉🕉

Sunday, 5 August 2018

విష్ణు సేనాపతి విష్వక్సేనుడు

విష్ణు సేనాపతి  విష్వక్సేనుడు

శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విష్వక్సేనుని స్మరిస్తారు,ç పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి. వైకుంఠ సేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు. కుడిచేతిలో అభయముద్రనిస్తూ ఎడమచేతిని కటి వద్ద ఉంచుకుని, పర హస్తములలో శంఖు చక్రాలను ధరించి దర్శనమిస్తాడు. వైష్ణవులు స్మరించే గురుపరంపరలో ఈయన స్థానం మూడవది. మొదట విష్ణువు, రెండు లక్ష్మీ దేవి. విష్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు.  బంగారుశరీర వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు. ఈయనను కశ్యపమహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను  నేర్పిస్తాడు.  తరువాత వృషభాద్రిపై  12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు.  తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో విష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది. అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తుల రద్దీ వలన ఈ సన్నిధి దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు.  తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈయన నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు వాహనంపై వేంచేస్తారు.

విజ్ఞానాన్నిచ్చే విష్వక్సేన రూపం
విష్వక్సేనుడు జ్ఞాన ప్రదాయకుడు. ఈయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజ హస్తాలతో కుడిచేత అభయ ముద్ర లేక సూచి హస్తం లేక పుష్పాన్ని ధరించి ఉంటాడు. కొన్నిచోట్ల దండాన్ని ధరించి కూడా కనిపిస్తాడు. ఎడమచేత కటి ముద్రను గాని, గదను గానీ ధరించి ఉంటాడు. పర హస్తాలలో శంఖు చక్రాలను ధరిస్తాడు. విష్ణు స్వరూపానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువుకు శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి. విష్వక్సేనుడికి అవి ఉండవు. వైష్ణవాగమాలైన పాంచరాత్రాగమం, వైఖానస ఆగమం విష్వక్సేన స్వరూపాన్ని చాలా చక్కగా వివరించాయి. ఈ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పరాశర సంహిత చెప్పింది.
– డా. ఛాయా కామాక్షీదేవి 

Thursday, 2 August 2018

పరశురాముడు






పరశురాముడు

దశావతారాల్లో ఆరవది పరశురామ అవతారం. త్రేతాయుగ ఆరంభంలో విష్ణుమూర్తి ఈ రూపాన్ని ధరించాడని చెబుతారు. జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతుల సంతానమే పరశురాముడు. పరమేశ్వరుడి పరమభక్తుడైన పరశురాముడు ఆ ముక్కంటి దగ్గరే సకల విద్యలూ నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తిమంతమైన పరశువు (గొడ్డలి)ని కానుకగా పొంది పరశురాముడన్న పేరును సార్థకం చేసుకున్నాడు.

ఓసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమంలోని మహిమాన్వితమైన గోవును చూశాడు. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంతమంది అతిథులు వచ్చినా, మృష్టాన్నం వడ్డించేవాడు. దాన్ని తనకు అప్పగించమని కార్తవీర్యార్జునుడు ఒత్తిడి చేశాడు. మహర్షి కాదనడంతో, బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. ఆ విషయం తెలిసిన పరశురాముడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడిని ఒక్క పెట్టున నేల కూల్చి, గోమాతను వెనక్కి తీసుకొచ్చాడు. అదీ పరశురాముడి శక్తి!

ఒకానొక సందర్భంలో అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మహర్షి ఆమె తలను తెగనరకమని కన్నకొడుకును ఆదేశించాడు. తండ్రిమాటను శిరసావహించాడా తనయుడు. పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తల్లి ప్రాణాల్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు పరశురాముడు. అలా తండ్రిమాట జవదాటకుండానే, తల్లి ప్రాణాల్ని కాపాడుకున్నాడు.

కార్తవీర్యార్జునుడి అహంకారం కారణంగా మొత్తం క్షత్రియజాతి మీదే కోపాన్ని పెంచుకున్న పరశురాముడు... ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియుల్ని అంతమొందించాడు. ఆ తర్వాత తాను గెలిచిన భూభాగాన్నంతా కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోడానికి వెళ్లాడు. మళ్లీ సీతాస్వయంవర సమయంలో వచ్చి తన ఆరాధ్యదైవమైన శివుడి చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. తానూ శ్రీరాముడూ వేరుకాదని గ్రహించాక, అహాన్ని త్యజించి అడవిబాట పట్టాడు.

తన ఆధ్యాత్మిక యాత్రలో అనేక ప్రాంతాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ, త్రిలింగదేశంగా పేరొందిన ఆంధ్ర రాజ్యానికి కూడా వచ్చాడు. స్వయంభూమూర్తిగా వెలసిన విజయవాడలోని యనమలకుదురులో కొలువైన పార్వతీ రామలింగేశ్వరాలయంలోని స్వామిని దర్శించుకుని, వేదోక్తంగా పునఃప్రతిష్ఠంచినట్టు స్థానికుల విశ్వాసం. అదే సమయంలో కొండపై నుంచి నదీప్రవాహం వరకూ మొత్తం నూటొక్క లింగాలను ప్రతిష్ఠించాడని అంటారు. కాలక్రమంలో అవి భూగర్భంలో కలసిపోయాయి. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగానూ ప్రసిద్ధమైంది. వనవాస సమయంలో సీతారాములు రామలింగేశ్వరస్వామిని పూజించారని కూడా ఓ కథనం.



రామాయణంలో ముఖ్య ఘట్టాలు



రామాయణంలో ముఖ్య ఘట్టాలు

డా. పద్మజా వేదాంతం

శ్రీమద్రామాయణం ఆదికావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు. ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇందులో ఆరు కాండలు ఉన్నాయి. (1) బాలకాండ (2) అయోధ్యకాండ (3) అరణ్యకాండ (4) కిష్కింధకాండ (5) సుందరకాండ (6) యుద్ధకాండం, (ఏడవది అయిన ఉత్తరకాండ తరువాత చేర్చబడింది.)

1) బాలకాండ
అయోధ్యానగర మహారాజు దశరధుడు. ఆయనకి ముగ్గురు భార్యలు. చాలా కాలం సంతానంన లేక, పుత్రకామేష్టి యాగం చేశాక, ఆయనకు నలుగురు పుత్రులు కలుగుతారు. కౌసల్యకి రాముడు, కౌకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. కులగురువైన వశిష్ట మహర్షి వద్ద వారు విద్యాభ్యాసం చేస్తారు. ఈ రాజకుమారుల జననం, విద్యాభ్యాసం వశిష్టమహర్షి ద్వారా జరుగుతాయి. వీరి వివాహం విశ్వామిత్ర మహర్షి ద్వారా జరుగుతుంది.

విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణకై రామలక్ష్మణులను తనవెంట తీసుకొని వెళ్లి వారకి బల, అతిబల అనే విద్యలనూ, తన తపస్సుచే సాధించిన అనేక విశేషమైన అస్త్రాలను రామునికి ప్రసాదిస్తాడు. (స్పెషల్‌ ట్రేయినింగ్‌ అన్నమాట).

తరువాత వారిని మిథిలానగర రాజైన జనక మహారాజువద్దకు తీసుకొనివెళతాడు. అక్కడ జనకుడు, తన కూతురైన సీత యెక్క స్వయంవరం ప్రకటిస్తాడు. శివధనుస్సు ఎక్కుపెట్టిన వారిక సీతను ఇచ్చి వివాహం చేస్తానని షరతుతో; ఎందరో రాజులు ప్రయత్నించి ఓడిపోయారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో శ్రీరాముడు శివధనుస్సు ఎత్తి, ఎక్కుపెట్టి, సీతను వివాహమాడుతాడు. మహర్షుల సలహాతో అప్పుడే జనకుని కూతురైన ఊర్మిళను లక్ష్మణునికి, ఆయన తమ్ముడి కూతుళ్లను భరత, శత్రఘ్నులకు ఇచ్చి వివాహం జరిపిస్తారు. దశరధుడు తన నలుగురు కొడుకులతో కోడళ్లతో అయోధ్యకు వెళ్లి, ఆనందంగా రాజ్యంచేస్తూ కాలం గడుపుతూ ఉంటారు.

2) అయోధ్యకాండ
దశరధుడు రామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్సిస్తాడు. కాని కైకేయి దాసి అయిన మంధర, భరతుని యువరాజుని చేయాలని కైకేయిని ప్రేరేపిస్తుంది. పూర్వం యుద్ధంలో కైకేయి, దశరధుని ప్రాణాలు కాపాడినప్పుడు, దశరధుడు ఆమెకు 2 వరాలు ఇస్తానని మాట ఇస్తాడు. వాటిని ఇప్పుడు కోరమని (వాడమని) మంధర సలహా ఇస్తుంది. ఈ విధంగా కైక, దశరధుని తాను అడిగిన వరాలు ఇవ్వమని దశరధుని నిర్భందిస్తుంది. ఆడిన మాట తప్పలేక, ఆమె అడిగిన వరాలు ఇవ్వలేక దశరధుడు సంకటస్థితిలో పడతాడు. కైక, రాముని పిలిచి, 14 ఏళ్లు వనవాసం చెయ్యమనీ, భరతునికి పట్టాభిషేకం జరగాలనే తన 2 వరాలు చెల్లించమని చెపుతుంది. రామునితో బాటు సీత, వారితో లక్ష్మణుడు వనవాసానికి వెల్లిపోతారు. పుత్రశోకంతో దశరధుడు మరణిస్తాడు. మేనమామల రాజ్యం నుంచి వచ్చిన భరతుడు జరిగిదంతా తెలుసుకొని చిత్రకూట పర్వతం మీద ఉన్న రాముని వద్దకు వెళ్లి, తిరిగి అయోధ్యకు రమ్మని కోరతాడు. కాని రాముడు మనమందరం తండ్రిమాట చెల్లించాలని చెప్పి, భరతుడు కోరగా తన పాదుకలను ఇస్తాడు. భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి తాను మాత్రం నంది గ్రామంలో వుంటూ వాటి తరపున రాజ్యం పాలిస్తూ ఉంటాడు. పాదుకలకే పట్టాభిషేకం చేసి తాను మాత్రం నంది గ్రామంలో వుంటూ వాటి తరపున రాజ్యం పాలిస్తూ ఉంటాడు.

3) అరణ్యకాండ
రాముడు సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యం ప్రవేశిస్తాడు. అక్కడ మునులను సేవిస్తూ, వారిని బాధించే రాక్షసులను సంహరిస్తూ, పదమూడేళ్లు గడుపుతాడు. అయితే శూర్పణఖ అనే రాక్షసి (లంకానగర రాజైన రావణుని చెల్లెలు) రాముని చూసి, మోహించి, తనను పెళ్ళి చేసుకోమని అడుగుతుంది. ఆ ప్రయత్నంలో శూర్పణఖ సీతను మింగి వేయడానికి వెళ్లి, లక్ష్మణుని చేతిలో ముక్కు చెవులూ కోయబడి, ప్రతీకారం తీర్చుకోవడానకి, సీతను అపహరించమని రావణుని పురికొల్పుతుంది.

రావణుడు మారీచుని బంగారపు మాయలేడిగా మారి సీతను భ్రమింపచేయమని ఆదేశిస్తాడు. మాయలేడిని చూసి సీత దానిని పట్టి తెమ్మని కోరగా, రాముడు దానివెంట పడతాడు. అది ఎంతకీ దొరకపోగా, దానిమీద బాణం వేస్తాడు. మారీచుడు చనిపోతూ, ”హా సీతా, హా లక్ష్మణా” అని అరుస్తాడు.. ఆ అరుపులు విన్న సీత, లక్ష్మణుని రాముని సహాయానికి పంపుతుంది. అక్కడే పొంచి ఉన్న రావణుడు జంగందేవర వేషంలో సీత వద్దకు వచ్చి భిక్ష అడుగుతాడు, ఆమె భిక్ష ఇవ్వడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను పట్టి, పుష్పక విమానంలో ఆకాశమార్గాన తన లంకకు తీసుకొని పోతాడు. తిరిగి వచ్చిన రామ లక్ష్మణులు సీత కోసం చుట్టు పక్కల వెదకుతారు. కాని ఆమె జాడ తెలియక రాముడు విలపిస్తాడు. చాలా దూరంలో వారికి రెక్కలు తెగి, మరణావస్థలో ఉన్న జటాయువు అనే పక్షి, ”సీతను లంకానగర రాజైన రావణాసురుడు దక్షిణ దిశగా విమానంలో తీసుకొని వెళుతున్నప్పుడు, ఆమె సహాయం కోసం కేకలు వేసింది. తాను ఆమెను రక్షించడానికి ప్రయత్నించగా, ఆ రాక్షస రాజు, తన రెక్కలు కోసివేశాడని” చెప్పి, చనిపోతుంది. దానికి దహన సంస్కారం చేసి, వారు ఇంకా దక్షిణానికి వెళ్లగా వారిని కబంధుడనే రాక్షసుడు తినబోగా, వారు అతనిని చంపివేస్తారు. శాపం తీరిన గంధర్వుడు వారికి శబరి గురించి చెబుతాడు. వారు ఇంకా ముందుకు వెళ్లగా, గిరిజన తాపసి అయిన శబరి వారికి ఫలాలను సమర్పించి, సుగ్రీవుడనే వారనరాజు యొక్క స్నేహం వారికి మంచిది అవుతుందని చెపుతుంది.

4). కిష్కింధకాండ
తన కోసం వెతుకుతూ వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడి, వారని గురించి వివరాలు తెలుసుకొమ్మనమని తన మంత్రి అయిన హనుమను పంపుతాడు. హనుమ మారువేషంలో వారివద్దకు వచ్చి, వారితో మాట్లాడి, వారిని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళతాడు. రామసుగ్రీవులు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసుకుంటారు.

వానర రాజైన సుగ్రీవుడు తన అన్న వాలికి భయపడి దేశదేశాలు తిరుగుతాడు. అన్యాయంగా రాజ్యాన్ని, తమ్ముని భార్యను గ్రహించిన వాలిని, రాముడు సంహరించి, సుగ్రీవుని మరల రాజుని చేస్తాడు. సుగ్రీవుడు కోట్లకొలది వానరులను, సీతాన్వేషణకై నాలుగు దిక్కులకూ పంపుతాడు. 2 నెలల గడువులో సీత గురించి సమాచారం తీసుకురావాలని ఆదేశిస్తాడు.

దక్షిణదిశగా వెళ్లే జట్టులో ఉన్న హనుమకు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఇచ్చి, సీతకు ఆనవాలుగా చూపమని చెపుతాడు. అంగదుని నాయకత్వలో జాంబవంతుని సలహా ప్రకారం, కొండలు గుహలు, అడవులు అన్నీ గాలించి, సముద్రతీరం చేరుతారు. ఇంక ఎక్కడ వెదకాలో తెలియక, అందరూ నిరాహార దీక్షతో ప్రాణాలు వదిలేద్దామని నిశ్చయించుకొని, రాముని కథను, తాము చేసిన ప్రయత్నాల గురించి చెప్పుకుంటూ ఉండగా, జటాయువు అన్న అయిన సంపాతి ఆహారం కోసం అక్కడకు వచ్చి, వారి మాటలు, విని, వారి వివరాలు అడుగుతాడు. రాముని భార్య అయిన సీతను వెదకడానికి వచ్చిన వారని తెలుసుకొని, వందయోజనాల దూరంలో సముద్రంలో ఉన్న లంకానగరంలో సీత ఉన్నదని తెలియచేస్తాడు. వానరులు సంతోషించి, ”ఎవరు అంతదూరం ఎగిరి వెళ్లి, సీతను చూసి మరల రాగలరు” అని చర్చించుకుంటారు. జంబవంతుని సూచన మేరకు, అంగదుని అనుమతితో హనుమ సముద్రాన్ని లంఘించడానికి పూనుకొంటాడు.

5). సుందరకాండ
సముద్రం మీద ఎగిరి వెళుతున్న హనుమకు, దారికి అడ్డంగా, సముద్రంలో నుండి, ఒక పర్వతం పైకి వస్తుంది. హనుమ కోపంతో దాన్ని ఢీ కొంటాడు. అప్పుడు ఆ పర్వత రాజైన మైనాకుడు ”హనుమా! నీకు విశ్రాంతి కలుగచేయమని సముద్రుడు చెప్పగా, నీ మిత్రుడుగా నేను వచ్చాను” అని చెపుతాడు. అప్పుడు హనుమ తనకు ఇప్పుడు విశ్రాంతి కొరకై ఆగే సమయం లేదని, రామకార్యం వెంటనే సాధించడం ముఖ్యమనీ చెప్పి, ‘హాండ్‌షేక్‌’ ఇచ్చి ముందుకు సాగుతాడు. మైనాకుడు అతడు విజయుడై తిరిగి రావాలని శుభాకాంక్షలు చెపుతాడు.

తరువాత దారిలో, సురస అనే నాగదేవత, తన నోరు పెద్గగా తెరిచి, హనుమను మ్రింగటానికి ప్రయత్నించింది. హనుమ తన శరీరాన్ని ఇంకా పెద్దగా పెంచుతాడు. ఆమె అందుకు తగినట్టుగా, ఇంకా తన నోటిని పెద్దదిగా చేస్తూ ఉంటుంది. చివరకు హనుమ తన శరీర పరిమాణాన్ని ఒక్కసారిగా బాగా తగ్గించి, ఆమె నోటిలోనికి వెళ్లి, వెంటనే మళ్లీ బయటకు వచ్చేస్తాడు. ఆమె సంతోషించి, ”సమయానుకూలంగా నువ్వు ప్రవర్తించగలవో లేదో తెలుసుకోవడానికి, నన్ను పంపారు, నువ్వు విజయుడవై తిరిగి వస్తావు” అని ఆశీర్వదిస్తుంది.

ఇంకా ముందుకు వెళుతున్న హనుమ, తన వేగం ఎందుకు తగ్గిపోతోందా అని క్రిందకు చూడగా, సింహిక అనే రాక్షసి, తన నీడను పట్టి లాగుతోంది అని గ్రహించి, దానిని సంహరిస్తాడు.

ఈ విధంగా హనుమ అన్ని రకాలైన అడ్డంకులను అధిగమించి, లంకను చేరుతాడు, లంకా నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, లంఖిణి (లంగానగర రక్షకురాలు) చూసి, అతనిని, అడ్డగిస్తుంది. హనుమ దానిని ఓడించి, చిన్నపిల్లి సైజులోకి తనను తగ్గించుకొని, లంకలోకి ప్రవేశిస్తాడు.

అక్కడ అన్ని భవనాలను, తోటలను, సీత ఎక్కడా కనబడక, చివరికి రావణుని అంతపురంలోకి ప్రవేశించి, అక్కడ అన్ని మూలలూ, వెదకి, రావణుని భార్య అయిన మండోదరిని చూసి, సీత అని భ్రమిస్తాడు. తప్పు తెలుసుకొని మళ్లీ, అన్ని ప్రాంతాలు గాలిస్తాడు. కాని సీత కనబడక, ఏమి చేయాలి అని చింతిస్తాడు. రాముని తలచుకొని, ధైర్యం తెచ్చుకొని, అశోకవనంలో ప్రవేశిస్తాడు, అక్కడ కూడా అంతటా వెదకుతూ, ఒక చెట్టుక్రింద, ఒక తేజో మూర్తి అయిన స్త్రీ మాసిన బట్టలతో, దీనవదనంతో, రాక్షస స్త్రీలు చుట్టూ కాపలాగా ఉండగా, దుఖిస్తూ ఉండటం గమనించి, ఆమెయే సీత అని భావించి, దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి, కూర్చుంటాడు. రావణుడు తెల్లవారకుండానే తన పరివారంతో ఆమె వద్దకు రావడం చూస్తాడు. రావణుడు ఎన్ని రకాలుగా ఆశ చూపినా, ఎన్ని విధాలుగా భయపెట్టినా, సీత అతనికి లొంగలేదు. తనను ఇప్పటికైనా, తన భర్త అయిన రాముని వద్దకు చేర్చి, చేసిన తప్పుకు క్షమార్పణ అడగమని లేకపోతే రాముడు తప్పక లంకతోబాటు, రావణుని నాశనం చేస్తాడని ధైర్యంగా, నమ్మకంగా చెపుతుంది. రావణుడు కోపంతో, ఇంకా 2 నెలలలో, తన మాట వినక పోతే రాక్షస స్త్రీలకు ఆమెను ఆహారంగా ఇస్తానని బెదిరించి వెళ్లిపోతాడు.

సీత భయంతో, బాధతో, తనను ఎవరూ రక్షించేవారు లేరని నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. చెట్టు పై నుండి ఇదంతా చూస్తున్న హనుమ రామ కథను వినిపించడం ద్వారా ఆమెకు ఆశను కలిగిస్తాడు. తరువాత చెట్టుదిగి, ఆమెకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, నమ్మకం కలిగిస్తాడు. సీత, ‘హనుమ నిజంగానే రాముడు పంపగా వచ్చాడు’ అన్న విశ్వాసంతో అతనితో, ”రామలక్ష్మణులకు తన పరిస్థితిని వివరించి, వెంటనే తనను రక్షించడానికి రమ్మనమని” చెప్పమని కోరుతుంది. తన జుట్టులోని మణిని తన గుర్తుగా చూపమని హనుమకు ఇస్తుంది.

హనుమ ఆమె అనుమతితో కొన్ని పళ్ళు తింటానని చెప్పి, ఆ వనంలో వృక్షాలను పెకలించి, అక్కడ ఉన్న కాపలా రాక్షసులను చంపివేస్తాడు. ఇది తెలిసిన రావణుడు, హనుమను శిక్షించడానికి ఎంతోమంది బలవంతులైన రాక్షసులను సైన్యంతో సహా పంపిస్తాడు. కాని హనుమ వారందరినీ సంహరిస్తాడు. చివరకు రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బందీచేసి, రావణ సభకు తీసుకొని వెళతాడు. అక్కడ హనుమ కూడా తాను రాముని దూతగా వచ్చానని, సీతను రామునికి అప్పగించి, తన రాజ్యాన్ని, వంశాన్నీ కాపాడుకోమని హితవు చెపుతాడు. కాని రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. కట్లు తెంచుకొని మండుతున్న తోకతో హనుమ, ఎగురుతూ లంకానగరాన్ని దహనం చేస్తాడు. తరువాత నీటితో తోకను చల్లార్చి, సీత క్షేమంగా ఉందని తెలుసుకొని, తిరిగి సముద్రాన్ని దాటి, తనకోసం, ఎదురుచూస్తున్న వానరులతో సహా రాముని వద్దకు వెళ్లి, సీత ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని రామునకు ఇస్తాడు. ఆమె ”రాముడు వచ్చి తనను రక్షిస్తాడు అనే ఆశతో బ్రతికి ఉన్నది” అని తెలియచేస్తాడు.

6). యుద్ధకాండం
రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వానర సేనలతో కలిసి సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ రావణుని తమ్ముడైన విభీషణుడు తన మంత్రులతో కలిసి వచ్చి రాముని శరణు కోరతాడు. రాముడు అతనిని లంకా నగరానికి రాజును చేస్తానని మాట ఇస్తాడు. రాముడు సముద్రుని ప్రార్థించి, ఆయన సలహా మేరకు తేలుతున్న రాళ్ళతో సేతువు(వారధి) అంటే బ్రిడ్జి కట్టిస్తాడు. దాని మీదగా వానర సైన్యం, లంక చేరుతుంది. రాముడు అంగదుని అప్పగించడానికి ఇష్టపడక, యుద్ధానికి కాలు దువ్వుతాడు. ఆ యుద్ధంలో ఒక్కొక్కరుగా అతని సైన్యాధిపతులు, తమ్ముడు కుంభకర్ణుడు, పుత్రుడు ఇంద్రజిత్తు అందరూ సంహరింపబడతారు. రావణుని భార్య అయిన మండోదరి ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని, సీతను రామునికి ఇచ్చేయ్యమని వేడుకుంటుంది. కాని రావణుడు ఆమె మాటను కూడా లెక్కచేయక, రామునితో యుద్ధానికి తలపడతాడు. ఘోరమైన యుద్ధం జరుగుతుంది. రామబాణానికి రావణుడు చనిపోతాడు. రాముడు విభీషణుని రాజుని చేసి, సీతను తీసుకురమ్మనమని చెపుతాడు. సీతను చూసి, రాముడు, ”పది నెలలు రాక్షసుని చెరలో ఉన్న నిన్ను, ప్రజలు రాణిగా అంగీకరిచరు కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లవచ్చు” అని పలుకుతాడు.. సీత అగ్నిప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు చల్లబడి, ”సీత మహాపతివ్రత. ఆమెను స్వీకరించమని” చెపుతాడు. అప్పుడు రాముడు ”సీత పరిశుద్ధురాలని లోకానికి తెలియపరచడానికి నేను ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది” అని సీతా, లక్ష్మణులతో వెంటనే అయ్యోధ్యకు పుష్పక విమానంలో బయలుదేరతాడు. అందులో వానరవీరులు, విభీషణుడు మొదలైన వారందరూ కూడా రాముని పట్టాభిషేకం చూడటానికి అయ్యోధకు వస్తారు.

భరతునితో బాటు రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. శ్రీరాముని మహారాజ పట్టాభిషేకం మహావైభవంగా జరుగుతుంది. సీత పట్టపురాణి అవుతుంది. భరతుని యువరాజును చేస్తాడు. సుగ్రీవుడు. విభీషణుడు వారివారి పరివారంతో వారి రాజ్యాలకు వెళ్లిపోతారు. హనుమ శ్రీరాముని బంటుగా ఆయనతోనే ఉండిపోతాడు.

అయోధ్య ప్రజలందరు రాముని రాజ్యంలో ఎటువంటి అలజడులు, అశాంతి లేకుండా సుభిక్షంగా ఉంటారు. శ్రీరాముడు 11వేల సంవత్సరాలు రాజ్యం చేసి, భూమి మీద ధర్మాన్ని సంరక్షించి, ఆదర్శ పాలనకు ఉదాహరణగా నిలిచాడు. ఉత్తరం నుండి దక్షిణ సముద్రం వరకు, తూర్పు నుండి పడమరకు మొత్తం భారతదేశంలో రామరాజ్యం ఏర్పడింది! సంపూర్ణ భారతదేశంలో ఇప్పటికీ ఆదర్శ రాజ్యం అంటే రామరాజ్యం అని కీర్తించబడుతోంది.

- శుభమస్తు -