ఏ శుభకార్యం చేసినా మొదటగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం తప్పనిసరి. చేపట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని గణపయ్యను పూజిస్తారు.
ఓం గణానామ్ త్వా గణపతిగ్‌మ్ హవామహే,
కవిం కవీనా ముపమశ్రవస్తవమ్!
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనఃశృణ్వన్నూతిభి స్సీదసాదనమ్!!
గణపతి గురించి వేదం చెప్పిన మంత్రం ఇది. ఈ మంత్రం గణపతిని మూడు విధాలుగా వర్ణిస్తుంది. లౌకిక రూపాన్నీ, తాత్త్విక స్వరూపాన్నీ, ఆత్మ చింతననూ తెలియజేస్తుందీ వేద మంత్రం.
‘‘గణాల్లో గణపతిగా ఉన్నవాడు, కవులకు కవియైు ఉన్నవాడు, అన్న సమృద్ధి కలవాడు, అందరికన్నా మొదటగా ప్రకటితమైన వాడు, వేద మంత్రాల్లో ప్రకాశించేవాడు అయిన గణపతిని.. మా ప్రార్థనలు విని సమస్త శక్తులతో మా సదనం (ఇంటి)లోకి రావయ్యా’’ అని పిలవడం ఈ మంత్రంలోని అర్థం.
తాత్త్విక అర్థాన్ని గ్రహిస్తే.. ‘‘గణములు అంటే సమూహం అని అర్థం. అనంత విశ్వం ఒక మహా గణం. ఈ గణాలన్నింటిలో ప్రకాశించే శక్తి గణపతి. గణములు ఎన్ని ఉన్నా.. గణపతి ఒక్కడే! గణపతి తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే.. భిన్న దృష్టి తొలగిపోయి ఏకత్వం అర్థం అవుతుంది. కర్మకు కావాల్సిన చైతన్యాన్నీ, ప్రపంచానికి అవసరమైన ఐశ్వర్యాన్నీ ప్రసాదించేది వినాయకుడే’’ అని వర్ణించారు.
మూడో అర్థాన్ని పరిశీలిస్తే.. ‘‘గణములు అంటే ఇంద్రియాలు అని కూడా అర్థం ఉంది. ఇంద్రియాలన్నీ కలిపితే ఒక గణం. మన ఇంద్రియాలన్నింటినీ శాసించే ఆత్మ- గణపతి. కవులు అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలకు మూలం ఆత్మ చైతన్యం. శరీర పోషణకు అన్నం కావాలి. దాని నుంచే ఇంద్రియాలకు శక్తి కలుగుతుంది. మనం చేసే కర్మలకు ఆయన అనుగ్రహం కావాలి. మొత్తంగా చూస్తే మన శరీరం అనే సదనంలో ఆత్మ స్వరూపంగా గణపతి ప్రకాశిస్తేనే మనుగడ సాధ్యమవుతుంద’’ని తాత్వికులు వర్ణించారు.
విఘ్నేశ్వరుడి రుపాన్ని పురాణాలు లోతుగా ఆవిష్కరించాయి. ఆదిలో పరమాత్మ నిరాకారుడు కనుక.. పసుపు ముద్దతో గణపతిని రూపొందించి కొలుస్తుంటాం. అవసరాన్ని బట్టి తన తత్వాన్ని తెలియజేసే రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు. అలా ధరించిన రూపమే విఘ్నేశ్వర రూపం. ఏనుగు ముఖంతో ఆయన ప్రకటించిన రూపం బలానికీ, పుష్టికీ సంకేతం. వక్ర తుండం అంటే వంకర తొండం కలవాడని అర్థం. వక్రములను తుండనం చేయువాడని మరో అర్థం. వంకరగా ఉన్న ఆలోచనలను తొలగించే శక్తి ఆయన. ఒక కార్యంలో విఘ్నాలను పరిహరించి.. దాన్ని సవ్యంగా నడిపేవాడు గణపతి. సత్కార్యానికి విఘ్నాలు తొలగించడంలోనే కాదు... దుష్కర్మలకు విఘ్నాలు కలిగించడంలోనూ ఆయన విఘ్నేశ్వరుడే! ఈ వినాయక చవితి రోజు ఆ గణపయ్యను ఆరాధించి.. మన ఆలోచనలు సవ్యంగా సాగాలని కోరుకుందాం. మనం చేసే సత్కర్మల్లో విఘ్నాలు తొలగించమని వేడుకుందాం.
సంకట హరుడు‘‘సృష్టి కార్యంలో బ్రహ్మదేవుడికి మొదట్లో అన్నీ విఘ్నాలే ఎదురయ్యాయట. అప్పుడు బ్రహ్మ తన జన్మకు మూలకారణమైన పరమాత్మను ‘ఓం’కారంతో ధ్యానించాడట. ‘ఓం’కారం ఒక రూపాన్ని ధరించి బ్రహ్మకు దర్శనమిచ్చాడట. ఆ రూపం ఏనుగు తల, వక్ర తుండం, మహాకాయంతో ఉందట! బ్రహ్మకు ‘వక్రతుండ’ మంత్రం ఉపదేశించి గణపతి అదృశ్యమయ్యాడట. బ్రహ్మను విఘ్నేశ్వరుడు అనుగ్రహించిన రోజు మాఘ బహుళ చతుర్థి. నాటి నుంచి ప్రతి మాసంలోనూ బహుళ చతుర్థిని సంకష్ట (సంకట) హర చతుర్థిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఎన్నోసార్లు అవతరించాడు. ఆ కారణంగానే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ తనయుడిగా.. వినాయకుడిగా.. ఉద్భవించాడు.