Monday, 28 August 2017

రుక్మిణీ కల్యాణం


సంస్కృతంలో వ్యాసభగవానుడు రచించిన 'శ్రీ భాగవతం'లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీ కృష్ణుడిని భర్తగా పొందడానికి ఆమె పడిన ఆరాటం ... ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. సాధారణంగా వివిధ గ్రంధాలను పారాయణం చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన, యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతోంది.

రుక్మిణీ కల్యాణం చదవడం వలన ... యువతులకు ఇష్టంలేని సంబంధాలు తప్పిపోయి, కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. అలా జరగడం కోసం వ్యాసభగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. ఇక అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారిని అనుగ్రహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.


సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని భార్య యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం. ఈ పద్యంలో బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు.

అనంత లీలాతాండవలోలుడైన పరమ శివునికి, మిక్కిలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మనస్సులనే సరోవరాలలో విరిసిన పద్మాలపై తుమ్మెదలా విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పూర్వకంగా ప్రణామం చేస్తున్నాను.

చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను ఛేధించే వాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధనులందరికీ శుభాలు ఒనగూర్చువాడూ ఐనట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నాను.

పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలు పోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించువాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్ళు కడపునిండా ఆరగించి మూషికరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.

అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ!

దుర్గాదేవి తల్లులందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచినయమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

బమ్మెర పోతన గారిచే రచించబడిన భాగవతం దశమ స్కంధము పూర్వ భాగము నుండి...


రుక్మిణీకల్యాణ కథారంభము:

సకల పురాణాలనూ వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూతమహర్షి, గొప్ప గుణాలచేత ఉత్తములైన శౌనకాది మహర్షులకు నైమిశారణ్యంలో భాగవతమును చెప్తున్నాడు...

శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా పలికాడు...

“పరీక్షిన్మహారాజా! పూర్వం రైవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని తీసుకొచ్చి బలరాముడి కిచ్చి పెళ్ళి చేసాడు. ఇంతకు ముందు విన్నావు కదా ఈ వృత్తాంతం?!!''

రేవతీ బలరాముల వివాహం:

(ఈ వృత్తాంతం నవమ స్కందము లోనిది)
ఆనర్తుడు అనే రాజుకు రైవతుడు జన్మించాడు. అతడు సముద్రం లోపల కుశస్థలి యను పట్టణాన్ని నిర్మించాడు. రైవతుడికి కాకుద్మి మొదలైన నూరు మంది కొడుకులు మరియు రేవతి అను కూతురు జన్మించారు. రేవతికి తగిన వరుడిని తెలుసుకొనగోరి రేవతితో పాటు రైవతుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. అచట బ్రహ్మ గంధర్వ కిన్నెర ఆట పాటల సందడిలో ఉండగా కాసేపు వేచిఉన్నాడు.

అంతట అవకాశము చిక్కినంతనే రైవతుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి, రేవతిని చూపి ఇట్లు అన్నాడు.

ఈ ముగ్ద యౌవ్వనవతి, సౌందర్యవతి, శుభాత్మురాలికి యోగ్యుడైన భర్తను తెలుపమని కోరగా, బ్రహ్మదేవుడు నవ్వి రైవతునితో ఇలా పలికాడు.

ఓ రైవతా! ఈమెకు తగిన వరుడు అని నువ్వు భావించిన వారు అందరూ కాలవశమున చనిపొయారు. కనీసం వారి బిడ్డలు, వారి మనుమలు, వారి గోత్రము కలిగిన వారు కూడా ఈ భూమి మీద నీకు కనిపించరు. నీవు యిచటికి వచ్చి వేచి ఉన్న సమయంలో భూమిపైన 27 సార్లు నాలుగు యుగాలూ గడిచిపోయాయి. నీవు ఇప్పుడు భూమికి తిరిగి వెళ్ళు. దేవదేవుడైన హరి బలరాముడుగా భూమి భారము తగ్గించుటకు పుట్టినాడు. ఆ సకల భూతాత్ముడికి ఈ కన్యామణిని ఇచ్చి వివాహం జరిపించు.

అని చెప్పిన బ్రహ్మకు నమస్కరించి, భూలోకానికి వచ్చి సోదరులు, స్వజనము లేని తన రాజ్యానికి వచ్చి, బలభద్రుడిని వెతికి, రేవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. తర్వాత రైవతుడు నారాయణాశ్రమం అయిన బదరికావనమునకు నిష్ఠగా తపస్సు చేసుకొనుటకు వెళ్ళాడు.

అలా రేవతీ బలరాముల వివాహం జరిగిన తరువాత...
పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించినట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజులందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.

అలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “స్వయంవరాని కొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్దతిలో రుక్మిణిని తన ద్వారకాపట్టణానికి తీసుకుపోయేడని చెప్పావు. కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు మొదలైనవారి నందరిని ఎలా జయించాడు. అంతేకాకుండా. . శుకమహర్షి! ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. విన్నకొద్దీ తెలుసుకొన్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటయి కదా అవి. రుక్మిణీ కల్యాణం వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు.”

గరుడవాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి.

ఇలా పరీక్షిత్తు అడుగగా, శుకముని ఇలా చెప్పసాగాడు.

రుక్మిణీ జననం:

విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కొడుకులు {రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది. ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది. బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆట్లాడుతోంది. గుజ్జన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపుటుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాటలాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది.

అలా రుక్మిణీదేవి దినదినప్రవర్దమాన అయి ఎదుగుతున్నప్పుడు... కృష్ణుడి కోరికలు విప్పారేలా, రుక్మిణి మేని మెరుపులు విరిసాయి. మనస్సు వికసించేలా, ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా, స్తనసంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా, నడుం సన్నబడింది. కృష్ణుడికి ప్రేమ పెరిగి పొంగేలా, శిరోజాలు చక్కగా వృద్ధిచెందేయి. కృష్ణుడికి సంతోషం కలిగించేలా, రుక్మిణికి నిండు యౌవనం తొణకిసలాడుతోంది.

ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది. తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం, బలం, సుగుణాలు తెలిసి భర్తగా వరించింది.

ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ది, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందామనుకొన్నాడు.

రుక్మిణిని బంధువులంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడికిద్దాం అనుకుంటున్నారు; కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.

రుక్మిణి సందేశము పంపుట:
తన అన్న ఆలోచన తెలిసిన రుక్మిణి, తన మేలుకోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది “బుద్ధిమంతుడా! గర్వంతో కన్నులుగానక మా అన్న రుక్మి నాకు చేదిదేశపువాడైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్ళి చేసేస్తానంటున్నాడు. ఏ విధంగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి పరిస్థితి తెలియజెప్పుము. ఓ బ్రాహ్మణోత్తమా! కొడుకుమాట మా నాన్న కూడ కాదనలేడు. అలా కాకూడదు. కనుక, నాప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు, శూరుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలువు.”

ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రతీహారుల ద్వారా తన రాక తెలిపాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్న కృష్ణుణ్ణి దర్శించి “కళ్యాణ ప్రాప్తిరస్తు” అని దీవించాడు. సంతోషించిన కృష్ణుడు గద్దె దిగి, ఆసీనుణ్ణి చేసి, భక్తిగా పూజించి, మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిజేరి లోకాల్ని కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ, కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.

“ఓ బ్రాహ్మణుడా! లోకులందరిచే గౌరవింపబడువాడ! నీ పద్దతి చక్కటిది, తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తిపడతాడు. తన దర్మాన్ని వదలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా, దరిద్రుడు కూడ యెంతో సుఖంగా ఉంటాడు. సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిచెందే వారు, శాంతస్వభావులు, మంచివారు, గర్వహీనులు అయిన విప్రులకి నేను నమస్కరిస్తాను.”

“బుద్దిశాలీ! మీరే దేశంలో ఉంటారు? ఎవని రాజ్యంలోనైతే మీరు కులాసాగా ఉంటారో, ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోట లోకి రావటం అంత సులువైనపని కాదు. మీరెలా వచ్చేరు? మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను.” అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకొచ్చిన విప్రుని పలకరించాడు.

ఇలా ఆ లీలామానవదేహధారి అయిన శ్రీకృష్ణపరమాత్మ అడుగగా, రుక్మిణీదేవి సందేశం తెచ్చిన ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు “భగవాన్! విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆ రాజు కూతురు రుక్మిణి. ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళంబైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది. సావధానంగా విను.
శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించినవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు. ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించేవాడవు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించలేదా? అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి?
ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహంనికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి యైన శశిపాలుడు నీ పదభక్తురాలనైన నన్ను(రుక్మిణి) తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు. రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోక కల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే; దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే; దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే; వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక! యుద్ధంలో శిశుపాలాది అధములు ఓడిపోవుదురు గాక!

ఓ పద్మనాభ! కృష్ణ! మహాత్మ! అడ్డుచెప్పడానికి లేదు; నీ పరాక్రమం చూపి, రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు, జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను (రుక్మిణిని) రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య! నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను. 

ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పుడక్కడ ఉన్న మీ బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా!” అని నీవు అనుకుంటే, దీనికి ఒక ఉపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా ఇలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ అలాగే నగరి వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో! 

జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి, శంకరునివలెనే, ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడవైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా! 

శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ;
పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ;
ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ;
ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండగ;
పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ;
మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు దండగ;
నాకు వద్దయ్యా!” 

(రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది. భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా! ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ)


ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి “ఏం చేయాలో చూడు” అని విన్నవించి, తగ్గిన స్వరంతో సౌమ్యంగా ఇంకా ఇలా చెప్పాడు...

“ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురాకుల వంటివి. తొడలు బంగారు అరటిబోదెల కన్న చక్కటివి. చేతులు ఎర్రటి కాంతులతో మనోహరమైనవి. అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది. నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది. స్తనాల జంట కనువిందు చేస్తుంది. నుదురు అర్థచంద్రుడి కంటె అందమైనది. జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది. చూపులు మన్మథ బాణాలకి సాటైనవి. కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు. ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది. ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ వాళ్ళతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.

వాసుదేవాగమన నిర్ణయము:

ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.

“సచ్చీలుడా! రుక్మిణీకన్య మీద నాకు గాఢమైన మనసుంది. రాత్రిళ్ళు నిద్రే రాదు. మా పెళ్ళికి ఇష్టపడక రుక్మి పెట్టే అడ్డంకులు నాకు ముందే తెలుసు. కట్టెలను అగ్ని దహించినట్లు, శత్రువులను మర్ధించి కన్యను తీసుకొస్తాను. విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీబాలను అలవోకగా తీసుకొస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్దంచేసి చిటికలో చీల్చి చెండాడుతాను.” అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు. 

ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసుకొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథియైన దారకుడు "సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము" లనే గుర్రాలు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథమెక్కేడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశుడు అయిన భీష్మకుడు కూతుర్ని శిశుపాలునికి ఇద్దామనుకుంటూ పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాడు.

ఆ కుండిన నగరమంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్రపరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.

భీష్మకుడు పద్దతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. పుణ్యాహవచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణాలతో అలంకరించాడు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. నవ దంపతుల శుభం కోసం భీష్మకుడు విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది ధానాలు చేసాడు. అప్పుడు...

విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులతో, రథాల వరుసలతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుర్రాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.

జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువులందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశుపాలుడికి బాలికను తెచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్టబెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.

ఇంకా వివిధ దేశాల నుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి...

బలరాముడు “అయ్యో! కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు; బాలికను తెచ్చేటప్పుడు యుద్దం తప్పదు; కృష్ణుడికి సాయం అవసరం.” అంటూ బలరాముడు కృష్ణుని వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.

ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలో తాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .

“నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహుర్తం దగ్గర కొచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? (అంటూ రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.) ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడాలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?” అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది.

రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తూ ఇంకా ఇలా అనుకోసాగింది...

“మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకొచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్నయ్య రుక్మికి ఇంక అడ్డే లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మధనపడుతోంది.
రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసులోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు. తనను తీసుకెళ్ళటానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మధనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోవటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చలులతో ముచ్చట్లు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోవటం లేదు. రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకోమని సందేశం పంపించింది. 

(అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకొచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం)

కృష్ణుడు తనను ప్రేమతో కరుణించడానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోవడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట. మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.

వాసుదేవాగమనం:

ఇలా కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి; అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు; అతని ముఖకవళికలు చూసి మిక్కలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదురెళ్ళింది; అప్పుడా బ్రహ్మణుడు ఇలా అన్నాడు. . .
“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగా వచ్చేడు. దేవదానవులడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచితనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.

అలా శుభవార్త చెప్పిన విప్రునితో విదర్భ రాకుమారి రుక్మిణి ఇలా అంది.
“ఓ సద్భ్రాహ్మణ శ్రేష్ఠుడా! ప్రియబాంధవోత్తముడా! నా సందేశం అందించి పద్మాక్షుడిని వెంటబెట్టుకొచ్చావు. నా ప్రాణాలు నిలబెట్టావు. నీ దయ వలన బతికిపోయాను. దీనికి తగిన మేలు చేయలేనయ్య. నమస్కారం మాత్రం పెడతాను.”

ఇలా రుక్మిణి, విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్మకుడు బలరామ కృష్ణులు తన పుత్రిక పెళ్ళికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేసాడు. వారివారి శౌర్య బల సంపదలకి వయస్సులకు అర్హమైన కోరిన పదార్ధాలన్ని ఇప్పించి మర్యాదలు చేసాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకొని, అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు...

“ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు, ఎంత మంచి జంటో. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్ళాడు గాక.” రుక్మిణీ స్వయంవరానికి వచ్చినప్పుడు కృష్ణుని దర్శించుకున్న కుండిన నగర పౌరులు వారిలో వారు అలా అనుకున్నారు...!

రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటకి బయలు దేరింది; ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి; సర్వాయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న శూరులు చుట్టూ కొలుస్తున్నారు; వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకొని వరసలు కట్టి ముందర నడుస్తున్నారు; సర్వాలంకార శోభితలైన విప్రుల భార్యలు పాటలు పాడుతూ వస్తున్నారు; మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళవాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి; చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు; తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు;

అక్కడక్కడ సూత వంది మాగధులు వంశకీర్తి, పరాక్రమం వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్ళు చదువుతున్నారు. స్వయంవర పెళ్ళికూతురు, రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాదేవి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూలమాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిచేత మొక్కించారు, అప్పుడు...

“తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్పూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మా. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి ఎప్పటికి హాని కలుగదు కదమ్మా. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!” అంటూ గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. రుక్మిణికి కృష్ణుడు వచ్చేడని తెలుసు కాని ఇంకా కలవలేదు.

రుక్మిణిదేవి గౌరమ్మకు అలా మొక్కింది. బ్రాహ్మణదంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకొనే తాళ్ళు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది.

వారు ఉత్సాహంతో చక్కగా దీవించి, ఆమె తల మీద అక్షతలు వేసారు. రుక్మణి ఆ ఆశీర్వచనాలు ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదలి బయటకొచ్చింది.

ఇలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడినుంచి బయటకు వస్తోంది. అప్పుడు ఆమె వర్షాకాలంలో మేఘాల్లోంచి బయట కొచ్చి మెరసే మేఘంలా, లేడి చిహ్నమున్న చంద్రమండలంలోంచి బయటకొచ్చిన లేడిలా ఉంది. బ్రహ్మదేవుడనే దర్శకుడు ఎత్తిన నాటకాల తెర మరుగునుంచి బయటకొచ్చి వేషం ధరించిన మోహినీదేవతలా ఉంది. సముద్రమధన సమయంలో దేవదానవులు చేతులు కలిపి వాసుకి అనే కవ్వం తాడు కట్టిన మంధర పర్వతమనే కవ్వం చిలుకుతుండగా పాలసముద్రం లోంచి వెలువడ్డ లక్మీదేవి లాంటి వైభవంతో, మానస సరోవరంలోని బంగారు కమలాల సమూహంలో విహరిస్తున్న కలహంసలా మందగమనంతో వస్తోంది. బంగారు జంట కలశాల్లాంటి స్తనద్వయం బరువుకి నడుము ఊగుతూంది. రత్నాల ఉంగరాలు అలంకరించిన చెయ్యి ఒక చెలికత్తె భుజం మీద వేసింది. రత్నాల బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళపై పరచు కుంటున్నాయి. పద్మాల సువాసనలకి మత్తెక్కిన తుమ్మెదల్లా ముంగురులు మోముపై కదుల్తున్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు నలు దిక్కులా లేత వెన్నెలలా ప్రకాశిస్తున్నాయి. దొండపండు లాంటి పెదవి కాంతుల వల్ల తెల్లని మల్లెమొగ్గల్లాంటి దంతాలు ఎర్రబారాయి. మన్మథుని జండాలా పైటకొంగు ఊగుతుంది. బంగారపు వడ్డాణం లోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనుస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి మన్మధుడి ఒరలోంచి దూసిన కత్తుల మెరపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి. మోగుతున్న కాలిగజ్జెల మనోఙ్ఞమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి. అలా కృష్ణుడిరాక కోసం ఎదురు చూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు...

తుమ్మెదల వంటి నల్లని ముంగురులు, పూర్ణ చంద్రుడు వంటి గుండ్రటి ముఖము, లేడి కన్నులు, పగడాల లాంటి పెదవులు, కోకిల కంఠధ్వని, కొంగ్రొత్త చిగురుల వంటి చేతులు, మదగజాల కుంభస్థలాల లాంటి స్తనాలు, ఇసుక తిన్నెల లాంటి పిరుదులు, దిగ్గజాల నడక లాంటి నడక, ఎర్రకలువ లాంటి అరచేతులు, గొప్ప పద్మాల వంటి సువాసనలు, సింహం నడుము కల ఆ రుక్మిణిని చూసి అందరు విభ్రాంతి చెందారు.

అంతేకాదు. అలా గౌరీపూజ పూజచేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీవనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరు ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓరచూపులకి మనసులు కరిగిపోయి, ధైర్యాలు వదలారు; గాంభీర్యాలు విడిచిపెట్టి. గౌరవమర్యాదలు మరిచారు; చేష్టలుదక్కి మైమరచారు; ఆయుధాలు జారవిడిచారు; ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కలేక నేలకు వాలారు; ఆ లేడి కన్నుల చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది; పైట సర్దుకుంటోంది; కడగంటి చూపులతో ఆ రాజ సమూహాన్ని పరిశీలిస్తోంది.

రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది; అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు; పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు; విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు;

రుక్మిణీ గ్రహణం:


అలా గౌరీపూజ చేసుకొని బయటకు వచ్చిన రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారక కెళ్ళే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.

"గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నరు. రాకుమారిని విడిపించలేకపోతే మన పరాక్రమాలెందుకు. మన అస్త్రశస్త్రాలెందుకు దండగ. సందుగొందుల్లో జనాలు నవ్వరా." అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.

అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే, శిశుపాలాదులు ఒకరికొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. జరాసంధుడు మొదలైనవారంతా పంతాలేసుకొని తమతమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. “ఆగక్కడ ఆగక్కడ” అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించి అడ్డుకున్నారు.

ప్రతిపక్ష సైన్యాల బాణాలు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి, సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతోను భయంతోను సిగ్గుతోను ముకుందుని (కృష్ణుని) ముఖంకేసి చూసింది.

ఇట్లు చూచిన.
ఇలా చకితహరిణేక్షణయై ఆమె కృష్ణుని చూడగా, కృష్ణుడు ఇలా చెప్పసాగాడు...
ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా “కమలనయనా! రుక్మిణీదేవి! కంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు. పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదురౌతారు, చచ్చిపోతారు చూస్తుండు.” అని ఊరడించసాగాడు.

ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రు సేనలో ఏనుగులు కూలిపోయాయి, గుర్రాలు చెల్లాచెదురయ్యాయి. రథాలు ముక్కలయ్యాయి, కాల్భంట్లు బెదిరి పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జెండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుర్రాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుర్రాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగు గుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుర్రాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత భేతాళాల కలకల ద్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు కదలాడాయి. మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.

రాజలోక పలాయనం:

కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిసారు. పెళ్ళాం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ముందు వెక్కుతున్న శిశుపాలుడిని చూచారు. “పోన్లే; శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా” అని ఓదార్చేరు.

కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు అతనిని ఓదారుస్తూ...

ఇంకా ఇలా చెప్పసాగారు “నాయనా చేదిరాజ! శిశుపాలా! దుఃఖించకు. ఒంట్లో ప్రాణాలుంటే ఎలాగైనా బ్రతకొచ్చు. బ్రతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు నువ్వు బ్రతికున్నావు. వద్దు. ఇంక అసలు దుఃఖించొద్దు.
ఇంకా విను. పురుషుడు స్వతంత్రుడు కాడు. కీలు బొమ్మలాడించే వాడిచేతిలోని కీలుబొమ్మ లాగ ఈశ్వర మాయకు లోనై సుఖదుఃఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మథుర మీద పదిహేడు సార్లు దండెత్తాను. పదిహేడు సార్లు మాధవుని చేతిలో ఓడి బలాల్ని నష్టపోయాను. బలరాముడి చేతికి చిక్కి కృష్ణుడు దయచూపి విడిపించాడు. పద్దెనిమిదో సారి ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించా. ఇలాంటి గెలుపోటములకు ఎప్పుడు మోదఖేదములు చెందను. ఇవాళ కనక రుద్రుణ్ణి కూడగొట్టుకొని మన రాజు లందరం పోరాడినా కృష్ణుణ్ణి గెలవలేము. ఇది ఇంతే. కాల మహిమని బట్టే లోకం నడుస్తుంటుంది. అంతేకాక... ఇవాళ వారికి కాలం అనుకూలమైంది. ముల్లోకాలలో ప్రసిద్దికెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు జయించారు. కాలం కలిసొస్తే మనం కూడ పగవారిని యుద్దం లో పడగొడతాం. ఇంతోటి దానికి విచారించడం ఎందుకు?”

రుక్మి యనువాని భంగం:

ఇలా చెప్పి శిశుపాలుడి మనోవేదన పోగొట్టి జరాసంధుడు అక్కడి రాజులు తమతమ దేశాలకి వెళ్ళిపోయారు. శిశుపాలుడు తన సేనతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రుక్మిణీదేవి అన్న రుక్మి అనువాడు, కృష్ణుడు తన చెల్లెలిని తీసుకుపోవడం సహించక, యుద్దానికి సిద్దమై ఒక అక్షౌహిణి సేనతో చక్రి వెంటబడి సారథితో ఇలా అన్నాడు.

“బలవంతుడను. భీష్మకమహారాజు కొడుకుని. రుక్మిని, నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహా శూరుడిని అనుకుంటు నా చెల్లెలు రుక్మిణిని పట్టుకు పోతున్నాడు. సారథి! వాని వెంటనంటి రథం తోలు. నా ప్రతాపం చూపిస్తా. పదునైన బాణాలతో వాని మదం తీస్తా.”

ఇలా పలికి. రుక్మి మాధవుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలి పోయి “ఓ గొల్లవాడా! వెన్న దొంగ! ఒక్క నిమిషం ఆగు” అని అదలించాడు. పెద్ద వింటిని సంధించి మూడు వాడి తూపులతో(బాణాలతో) చక్రిని కొట్టాడు. నువ్వు మాతో సమానుడవా ఏమిటి (భగవంతుడు కదా మాకన్న అధికుడవు). ఎంత మాత్రం వాడివి (మేరకందని వాడవు). వంశ మేదైనా ఉందా (స్వయంభువుడవు). ఎక్కడ పుట్టావు (పుట్టు కన్నది లేని శాశ్వతుడవు). ఎక్కడ పెరిగావు (వికార రహితుడవు కనుక వృద్ధిక్షయాలు లేనివాడవు). ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు (అంతుపట్టని నడవడిక కలవాడవు). అభిమానం లేదు (సాటివారు లేరుకనుక మానాభిమానాలు లేని వాడవు). హద్దు పద్దు లేదు (కొలతలకు అందని హద్దులు లేని వాడవు). మాయ చేయకుండ మెలగవు (మాయ స్వీకరించి అవతారాలు ఎత్తుతావు). స్వస్వరూపాన్ని పగవారికి చూపవు (నిర్గుణ నిరాకారుడవు). క్షత్రియుడవు కావు (జాతి మతాలకు అతీతుడవు). వావివరసలు లేవు (అద్వితీయుడవు ఏకోనారాయణుడవు). అసలు నీకు గుణాలే లేవు (త్రిగుణాతీతుడవు). అలాంటి నీకు ఆడపిల్ల ఎందుకు. మా పిల్లని మాకు ఇచ్చెయ్యి. విడిచిపెట్టు. విడువకపోతే యుద్దంలో ప్రళయకాల అగ్ని కీలల వంటి వాడి బాణాలతో నీ పీచమణుస్తా.”

ఇలా రుక్మిప్రగల్భాలు పలుకుతుంటే, గోవర్దనగిరిధారి కృష్ణుడు నవ్వి, ఒక బాణంతో వాని విల్లు విరిచాడు. ఆరు బాణాలు శరీరంలో దిగేసాడు. ఎనిమిది బాణాలతో రథాశ్వాలని కూల్చేసాడు. రెండింటితో సారథిని చంపాడు. మూడు బాణాలతో జండాకర్ర విరిచాడు. ఇంకొక విల్లు తీసుకొంటే దానిని విరిచాడు. అలా వరసగా పట్టిన ఇంకో ధనుస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం అన్నిటిని ముక్కలు చేసాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చు పై వచ్చి పడే మిడతలా, రథం దిగి కత్తి పట్టి రాగా కత్తి, కవచం పిండిపిండి చేసేసాడు. ఒరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జళిపించి వాని తల నరకబోగా, రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకొంది.

“ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడ! సకల లోకాలని కాపాడేవాడా! దిక్కులేని వారికి దిక్కైనవాడ! దయామయా! శ్రీకృష్ణ! వీడు రుక్మి మా అన్న. నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేసాడు. నన్ను మన్నించి వీనిని క్షమించు. ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యాడని, మేము అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో మునిగిపోతారు నాథా!”

ఇలా రుక్మిణి గద్గదస్వరంతో మిక్కలి భయ కంపితురాలై వేడుకొంది. అప్పుడు ఆమె దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి గుండెలు తడిసాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిని చంపక వెనుదిరిగేడు.

ఇలా చంపడం మాని, శ్రీకృష్ణుడు వానిని “బావా! రా” అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతు పట్టి బంధించాడు. ఓ కత్తిలాంటి పదునైన బాణంతో అతని గడ్డం మీసాలు తలకట్టు చారలు చారలుగా గీసి వికృతరూపిని చేసాడు. అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమేసి అక్కడకి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిని చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు.

“కృష్ణా! మహాత్మా! రుక్మిని తప్పుకోమనకుండ ఇలా తల మూతి గుండు చేయటం తగిన పని కాదు కదా. బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించుట చంపటంకంటె తుచ్చమైన పని.” అని బలరాముడు చెప్పసాగాడు.

శాశ్వతుడవైన దేవా! నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు. ఎవరిని కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్య ఇలాంటి భేదబుద్ది? (రుక్మి శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు అన్నాడు)

ఇలా కృష్ణుని విమర్శించిన బలరాముడు, రుక్మిణితో ఇలా అన్నాడు “అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు. మా కృష్ణుడిని నిందించబోకు తల్లీ! పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించ వలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు. చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు. వదిలెయ్యాలి. అలాకాక చంపితే పాపం, తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి. రాజ్యకాంక్షతో తోబుట్టినవానిని అయినాసరే, తోడబుట్టిన వాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మం. మానవంతులు ధనమదాంధులు అయ్యి, రాజ్యం కోసం ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అర్రులు చాచి కిందు మీదు కానరు. ఇతరులను హింసిస్తారు. రుక్మిణీ! శ్రద్దగా విను. దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ది కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైనవానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారులందరికి ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి, పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకొని, త్రిగుణాలైన సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలుతో కూడినదై, అవిద్య అనే అజ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసారచక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచర మయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశనమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడుకి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహనికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అజ్ఞాని సత్యంకాని విషయార్థాలలో అనుభవం కలిగించు కొంటాడు. అందుచేత... పద్మం లాంటి ముఖము కలదానా! రుక్మిణీ! అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞానదృష్టితో విడిచిపెట్టు. నీ లాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగ దుఃఖించుట తగదు. ” అంటు బలరాముడు రుక్మిణిని సముదాయించసాగాడు.

ఇలా బలరామునిచేత ప్రభోధింపబడి, రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి, అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ “కృష్ణుని గెలచి కాని కుండినపురం ప్రవేశించ” నని ప్రతిఙ్ఞ చేసి, పట్టణం బయటే ఉన్నాడు.


రుక్మిణీ కల్యాణం:


పద్మాక్షుడు కృష్ణుడు రాజుల నందరిని జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైన తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకొచ్చేడు. బంధువులంతా పొగిడారు. అంతట ద్వారకానగరంలో పెళ్ళి పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న స్త్రీ పురుషులు గుంపులు గూడుతున్నారు. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎంతోమంది రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్న మదజలంతో రాజమార్గాలు కళ్ళాపిజల్లినట్లు తడుస్తున్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల మంగళాచారం కోసం పోకమొక్కలు అరటిబోదెలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరుధూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలతో తోరణాలు కట్టారు. జెండాలు ఎగరేసారు. అప్పుడు...

రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం, మహావైభవం, గాంభీర్యాలతో మెలగుతుంది. సకల సంపదలు కలిగిస్తుంది. సాధువులను బంధువులను చక్కగ సత్కరిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తుంది, మహాదరిద్రాన్ని పోగొడుతుంది. చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన, అలాంటి సుగుణాల నారీ శిరోమణి, తన మనోహారి యైన రుక్మిణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు. శాశ్వతమైన యశస్సు పొందాడు.

అపార కృపా వర్ధిష్ణులు, అఖండ తేజో విరాజితులు రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో వచ్చి మనస్పూర్తిగా కానుకలు తెచ్చి ఇచ్చారు.
శ్రీకృష్ణమూర్తి కల్యాణానికి, రాజులందరిలోను కేకయ, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు అధికమైన పరమానందం పొందారు.

“ముకుందుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అపూర్వంగా తీసుకొచ్చి యిలా వివాహమాడిన విధము, బహు దుస్సాధ్యమైన విషయం అనుచు ప్రపంచంలోని రాజులు, రాకుమారులు, అందరు అచ్చరువొందారు.”
అంటూ పరీక్షిత్తునకు శుకుడు చెప్పసాగాడు.
పుణ్యాత్ముడైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మి యొక్క అవతారమైన రుక్మిణితో క్రీడిస్తున్న శ్రీకృష్ణమూర్తిని చూసి ద్వారకానగరంలోని పౌరులు భయాలు విడనాడి మిక్కిలి సంతోషంతో విలసిల్లారు.
శుకమహర్షి ఇలా పరీక్షిత్తునకు భాగవతమును చెప్పసాగాడు..

భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా!
కలువ రేకుల వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా!
భూమండలంలోని భూపతులందరికి శిరోభూషణ మైనవాడా!
పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా!
నీకు వందనం!

పద్మాల వంటి హస్తములు కలవాడా!
ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా!
సాటిలేని మంగళ స్వరూపము కలవాడా!
స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా!
శత్రువుల గుండెలను ఖండించు వాడా!
భక్త సమూహానికి మేలు చేయువాడా!
పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా!
భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా!
నీకు వందనములు! 

ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్యులచే రచించబడిన శ్రీమహాభాగవతంలోని రుక్మిణీ జననం; రుక్మిణీ సందేశం; వాసుదేవాగమనం; రుక్మిణీ గ్రహణంబును; రాజలోక పలాయనం; రుక్మి అనువాని భంగం; రుక్మిణీ కల్యాణం అను కథలు గల దశమస్కంధం నందు పూర్వభాగము సమాప్తము.

రుక్మి ప్రగల్భాలు

భీష్మక మహారాజు కుమారుడు రుక్మి మహా పరాక్రమవంతుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు. రుక్మిణీ దేవికి అన్న. గంధమాదన పర్వతం మీద ఉన్న ద్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల ‘విజయం’ అనే దివ్యధనుస్సును సంపాదించాడు. 

లోకంలో శ్రేష్ఠమైన దివ్య ధనుస్సులు మూడే ఉన్నాయి. వాటిలో ఒకటి విష్ణుమూర్తి సారంగం అనే ధనువు. శ్రీ కృష్ణుడు దానిని ధరించాడు. మరొకటి గాండీవం. ఖాండవ వన దహన సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికీ ధనుస్సు ఇచ్చాడు. ఇక మూడోవది విజయం. ద్రుముణ్ణి ఆరాధించి రుక్మి విజయ నామక చాపాన్ని అతని నుండి సంపాదించాడు. 

రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీ కృష్ణుడు ఆమెను రథం మీద తీసుకుపోతుంటే రుక్మి బలగర్వితుడై డాంబికాలు పలుకుతూ కృష్ణుణ్ణి ఎదిరించి నిందారోపణలు చేశాడు. తీరా కృష్ణుడు రథం నిలిపి బలాబలాలు చూసుకుందాం రమ్మని పిలిస్తే ఎదుర్కోలేక అవమానాలపాలయ్యాడు.

కురుపాండవ సంగ్రామం జరగబోతోందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల దగ్గరకు వెళ్ళాడు రుక్మి. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. అతిథి సత్కారాలు అందుకున్నాక రుక్మి అందరూ వింటూఉండగా పార్థుణ్ణి పిలిచి, ‘‘అర్జునా! రాబోయే సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో! నేను నీకు అండగా ఉంటాను. నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు. పైగా నా దగ్గర తేజోమయమయిన ధనుస్సు ఉంది. దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్యాది కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. ఈ రాజ్యం నీ వశం చేస్తాను. సరేనా’’ అన్నాడు.


అర్జునుడు నవ్వుకున్నాడు.


‘‘మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే కృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయంగా ఉంటాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆయన సాయం ఉంటే ఇంకెవరి అండదండలూ అక్కర్లేదు మాకు. పైగా నా చేతిలో గాండీవం ఉంది. సాక్షాత్తూ ఇంద్రుడే వజ్రాయుధం ధరించి వచ్చినప్పటికీ నేను భయపడను’
 అన్నాడు అర్జునుడు రుక్మితో.

ఆ మాటలు రుక్మికి కోపం తెప్పించాయి. వెంటనే తన సైన్యాన్ని తీసుకుని సుయోధనుడి దగ్గరకు వెళ్ళాడు. 

‘‘రాబోయే కురుపాండవ యుద్ధంలో నేను మీ పక్షం ఉంటాను, మీ విజయానికి తోడ్పడతాను. పాండవుల పొగరు అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ యమపురికి చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను.’’ అన్నాడు. 

అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతను కూడా రుక్మి సహాయం అక్కర్లేదని చెప్పాడు. రుక్మి సిగ్గుపడ్డాడు. దుర్యోధనుడు కూడా తిరస్కరించాక వచ్చిన దారినే తన నగరానికి తిరిగి వెళ్ళాడు. తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్నీ, శక్తినీ తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు. రుక్మికి ఈ అలవాటు మొదటినుంచీ ఉంది. అందుకే అనేకసార్లు పరాభవాలు పొందాడు.

Friday, 25 August 2017

వినాయకుడు - గరికతో ప్రసన్నం





గరికతో ప్రసన్నం

ఒకసారి యమలోకంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో నాట్యకత్తెలు నృత్యం చేస్తున్నారు. అందులో తిలోత్తమ నాట్యం చేస్తుండగా చూసి యముడు ఆమెను మోహించాడు. అందుకు పర్యవసానంగా అనిలాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు జన్మించాడు. అనిలాసురుడు ఎక్కడికెళ్లినా అగ్ని ఉద్భవించి అంతా భస్మీపటలం అయ్యేది. అటువంటి భయంకరమైన రాక్షసుడు దేవతలపై దండెత్తుతాడు. అప్పుడు దేవతలు భయకంపితులై గణపతిని ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనలు విన్న వినాయకుడు బాలగణేశుని రూపంలో ప్రత్యక్షమై అనిలాసురుణ్ణి సంహరిస్తానని మాటిస్తాడు. ఆ మాటలు విన్న దేవతలు సంతోషిస్తారు. అదే సమయంలో నలుదిశలు భస్మం చేస్తూ అనిలాసురుడు అక్కడికి వచ్చాడు. ఆ రాక్షసుణ్ణి చూసి దేవగణమంతా తలోదిక్కూ పారిపోయారు. బాలగణేశుడు మాత్రం అక్కడే నిలుచుని ఉన్నాడు. అదిచూసి అనిలాసురుడు బాలగణేషున్ని మింగేయాలని ముందుకు వచ్చాడు. కానీ బాలగజాననుడే పర్వతమంత ఎత్తు ఎదిగి అనిలాసురుణ్ణి మింగేశాడు. సాక్షాత్తు అగ్నిస్వరూపుడైన అనిలాసురుణ్ణి మింగిన కారణంగా గణేశునికి ఒళ్లంతా మంట పుట్టింది. ఆ మంటను భరించలేక గణేశుడు నేల మీద పడి దొర్లసాగాడు. గణేశుని బాధ చూసి దేవతలంతా అక్కడకు వచ్చారు. గణేశుని బాధను తగ్గించడానికి రకరకాల ఉపాయాలు ఆలోచించారు. ఇంద్రుడు గణేశుని తలమీద అమృతమయమైన చంద్రుణ్ణి ఉంచాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు కన్యలను రప్పించాడు. విష్ణుమూర్తి తన చేతిలోని చల్లటి కమలం ఇచ్చాడు. వరుణుడు చల్లటి వర్షం కురిపించాడు. శివుడు తన సర్పాన్ని గణేశుడి ఉదరానికి చుట్టాడు. ఇవన్నీ చేసినా మంటలు చల్లారలేదు. అప్పుడు 88వేల మంది మునులు ప్రతి ఒక్కరు 21 పచ్చటి గరికలు గజాననుడి శిరస్సుపై ఉంచారు. అప్పుడు గణేశుని దేహం చల్లారి శాంతి పొందింది. గణేశుడు ప్రసన్నమై ఇలా సెలవిచ్చాడు. ‘ఈ రోజు నుంచి నాకు గరికలు సమర్పించే వారికి కొన్ని వేల యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది’ అన్నాడు.

Sunday, 20 August 2017

వినాయక చవితి - వినాయకుడు

విశ్వ వినాయకుడు
వినాయకుడు కేవలం హిందూమతానికి మాత్రమే, కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. వినాయకుణ్ని జైనులు, బౌద్ధులు కూడా తమ తమ రీతుల్లో ఆరాధిస్తారు. భారతదేశంతో పాటు పలు ఆసియా దేశాల్లో వినాయకుడి ఆరాధన వేల ఏళ్ల కిందటే ఉండేదనేందుకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రమథ గణనాయకుడైన వినాయకుడు నిజానికి విశ్వవినాయకుడు. భారత భూభాగానికి వెలుపల గజాననుడి ఆరాధన విశేషాలు మీ కోసం...

వినాయకుణ్ని వ్యాపారవర్గాల వారు విశేషంగా ఆరాధించేవారు. సముద్ర వర్తకుల పుణ్యమా అని వినాయకుడు భారత భూభాగాన్ని దాటి బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, జపాన్‌ తదితర దేశాలకు విస్తరించాడు. హిందువుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్‌లోను, శ్రీలంకలోను, నేపాల్‌కు పొరుగునే ఉండే భూటాన్, టిబెట్‌ ప్రాంతాలలో కూడా శతాబ్దాల కిందటే వినాయకుడి ఆరాధన ఉండేది. హిందూ మతస్తులతో పాటు వారితో సన్నిహితంగా మెలగిన జైనులు, బౌద్ధులు కూడా వినాయకుణ్ని ఆరాధించేవారు.

జైన వినాయకుడు
జైన మత నిబంధనలకు సంబంధించిన సాహిత్యంలో ఎక్కడా వినాయకుడి ప్రస్తావన కనిపించకపోయినా, జైనులు వినాయకుణ్ని శతాబ్దాల కిందటే ఆరాధించేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. పన్నెండో శతాబ్దికి చెందిన జైన గురువు హేమచంద్ర రాసిన ‘అభిధాన చింతామణి’, పదిహేనో శతాబ్దికి చెందిన జైన గురువు వర్ధమాన సూరి రాసిన ‘ఆచార దినకర’ వంటి గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుణ్ని ఈ గ్రంథాలలో హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా అభివర్ణించారు. ఇవి శ్వేతాంబర జైన గ్రంథాలు. దిగంబర జైన గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన పెద్దగా కనిపించదు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని ఖండగిరి, ఉదయగిరి గుహలలోను, మథురలోను మధ్యయుగాల నాటి జైన ఆరాధనా కేంద్రాలలో వినాయకుడి శిల్పాలు కనిపిస్తాయి. రాజస్తాన్, గుజరాత్‌లలోని జైన ఆలయాల్లోనూ వినాయకుడి చిత్రాలు కనిపిస్తాయి.

బౌద్ధ వినాయకుడు
ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. గుప్తుల కాలం నాటి బౌద్ధ శిల్పాలలో వినాయకుడి శిల్పాలు కూడా కనిపిస్తాయి. టిబెటన్ల వినాయకుడు రుధిరవర్ణంలో ఉగ్రరూపంలో కనిపిస్తాడు. ‘మహారక్త’ గణపతిగా టిబెటన్లు వినాయకుణ్ని తాంత్రిక పద్ధతుల్లో కొలిచేవారు. టిబెట్‌లోని వజ్రయాన బౌద్ధులు, చైనాలోని షింగాన్‌ బౌద్ధులు వినాయకుణ్ని ఆరాధించేవారు. షింగాన్‌ బౌద్ధుల ద్వారానే వినాయకుడి ఆరాధన జపాన్‌కు పాకింది. జపాన్‌ రాజధాని టోక్యో శివార్లలోని అసాకుసా ప్రాంతంలో పన్నెండో శతాబ్ది నాటి గణపతి ఆలయం ఉంది. బౌద్ధులు గణపతిని తమ దైవాలలో ఒకరిగా ఆరాధిస్తే, హిందువుల గణపతి పురాణం, ముద్గల పురాణాలు బుద్ధుణ్ని గణపతి అవతారంగా అభివర్ణించడం విశేషం. థాయ్‌లాండ్‌ వాసులు వినాయకుణ్ని ఆరాధించడం ద్వారా అదృష్టం కలసి వస్తుందని, విజయాలు వరిస్తాయని విశ్వసిస్తారు. ఇండోనేసియన్లు గణపతిని జ్ఞానప్రదాతగా పూజిస్తారు. ఇండోనేసియాలోని బేండుంగ్‌లో గణేశుడి పేరిట ఒక వీధి ఉంది. జావాకు చేరువలోని ఒక దీవిలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటి పురాతన వినాయకుడి విగ్రహం బయటపడింది. ఇండోనేసియాలోని ప్రంబానన్‌ ఆలయంలో తొమ్మిదో శతాబ్ది నాటి వినాయకుడి విగ్రహం ఉంది. ఇవన్నీ ప్రాచీనకాలం నుంచే ఇతర దేశాల్లోని వినాయకుడి ఆరాధనకు, ఉనికికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్నాయి.

వినాయక చవితి...
దేవుడికి అలసట అంటూ ఒకటి ఉండదేమో! ఎలా కొలిచినా తనవాణ్ని చేసేసుకుంటాడు. ఇక విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరున్న వినాయకుడికైతే ఏటా పెద్ద ఉత్సవమే నిర్వహిస్తాం. ఇంట్లో చిన్న వినాయకుణ్ని పెట్టుకుంటాం. వీధిలో పదడుగులు ఉంటుంది ఒక విగ్రహం. ఓ ఊర్లో యాభై అడుగులు ఉంటుంది ఇంకో విగ్రహం. ఎలా కొలిచినా సరే కదా అని చెప్పి రకరకాల రంగులు వాడేస్తున్నాం. విగ్రహం తయారీకి ఏవేవో కృత్రిమ పదార్థాలు వాడేస్తున్నాం. అవన్నీ నిమజ్జనం రోజున చెరువుల్లో, నదుల్లో మునిగిపోయి ప్రకృతిని పాడు చేస్తున్నాయి. విఘ్నాలను తొలగించే దేవుణ్ని కొలిచేందుకు ప్రకృతికి ఎన్ని విఘ్నాలు కలిగిస్తున్నాం? అందుకే ఇప్పటికైనా ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణహిత) మార్గానికి వెళ్దాం అంటూ పుట్టుకొచ్చిన కొత్త వినాయకుణ్ని కొలుద్దాం...

దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే వినాయకుడికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజున మొదలయ్యే ఈ ఉత్సవాన్ని ఏటా తొమ్మిది నుంచి 21 రోజుల పాటు జరుపుతున్నాం. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఆయన మరణం తర్వాత ఈ వేడుక మళ్లీ ఇంటివరకే చేసుకునే పండుగగానే మిగిలిపోయింది. 1880వ దశకంలో, బ్రిటిష్‌ పాలన జరుగుతున్న రోజుల్లో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలను మరోసారి పెద్ద ఎత్తున నిర్వహించడం మొదలైంది. ఇక నాటినుంచి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అదే స్థాయిలో జరుగుతూనే వస్తున్నాయి.

మొదట్లో వినాయక చవితి ఉత్సవాలకు పూర్తిగా మట్టి విగ్రహాలనే తయారు చేసేవారు. ఆ తర్వాత ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ రాకతో విగ్రహాల తయారీల ఖర్చు ఊహించని స్థాయిలో తగ్గడం, సులువుగా, కలర్‌ఫుల్‌గా విగ్రహాలను తయారుచేసే అవకాశం దొరకడంతో దాదాపుగా సమాజమంతా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలకే ఓటు వేస్తూ వచ్చింది. అయితే విగ్రహాల తయారీకి ఇలా వాడుతోన్న ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, కృత్రిమ రంగులు వినాయక నిమజ్జనం తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయని, పర్యావరణానికి హాని చేస్తున్నాయని చెబుతూ గత ఐదారు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల వైపుకు సమాజం అడుగులేస్తోంది. ఏటా ఇదే విషయంపై ఎన్నో క్యాంపెయిన్స్‌ నడుస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు.

కుబేరుని అహంకారం బాలగణపతి సమాధానం


అలకాధిపుని అహమణచిన బాలగణపతి

అలకాపురాధీశుడు, ధనాధిపతి కుబేరునికి తన సంపదనంతా చూసుకునేసరికి  అహంకారం తలెత్తింది. ముల్లోకాలలో తనను మించిన ధనవంతుడే లేడనుకున్నాడు. తన వైభోగాన్ని చాటుకునేందుకు దేవతలందరికీ గొప్ప విందు ఇవ్వదలచుకున్నాడు. అనుకున్నదే తడవు సమస్త దేవతలనూ విందుకు ఆహ్వానించాడు. ఒంటినిండా బూడిద పూసుకుని, మొలకు గజచర్మాన్ని చుట్టుకుని, శ్మశానాలలో పుర్రెపట్టుకుని పొట్టపోసుకునే పరమేశ్వరుడంటే చిన్నచూపు. ఆయనను విందుకు పిలవకూడదనుకున్నాడు. అయినా, తన వైభోగాన్ని చాటుకోవాలంటే పిలవక తప్పదనుకుని,  అయిష్టంగా వెళ్లాడు. పరమేశ్వరునికి కుబేరుని ఆంతర్యం అర్థమైంది.

కపట భక్తి నటిస్తూ, తనను పిలిచేందుకు వచ్చిన కుబేరునితో ‘అలకాధీశా! అనివార్య కారణాల వల్ల నేను విందుకు రాలేకపోతున్నాను. కాని నా బదులుగా నా పెద్ద కుమారుడిని పంపుతాను. అతనికింత అన్నం పెడితే చాలు– నా కడుపు నిండిపోతుంద’న్నాడు.

సరేనంటూ సమ్మతించాడు అలకాధిపుడు.

తీరా, విందు రోజు రానే వచ్చింది. దేవతలందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంతలో గుజ్జురూపంలో ఉన్న బాలగణేశుడు వచ్చాడు. వస్తూనే బొజ్జ నిమురుకుంటూ ‘ఆకలి’ అన్నాడు.

పసిపిల్లవాడు కదా, ముందుగా పెట్టేద్దామనుకున్నాడు కుబేరుడు. వెంటనే బంగారు విస్తరిని పరిచి అందులో కొద్ది కొద్దిగా భోజన పదార్థాలు, పిండివంటలు వడ్డింపించాడు. వాటన్నింటినీ కలిపి ఒక్కముద్దగా చేసి నోట్లో పెట్టుకుని, ఇంకాస్త... అన్నట్లు చూశాడు. చిన్నవాడైనా తిండి పుష్ఠి గలవాడే అనుకున్న కుబేరుడు ఈసారి ఇంకొద్దిగా ఎక్కువ మొత్తంలో వడ్డించాడు. కన్ను మూసి తెరిచేలోపు అంతా ఖాళీ అయింది. అలా కుబేరుని దాసీజనం వడ్డిస్తూనే ఉన్నారు, పదార్థాలన్నీ ఖాళీ అయిపోతూనే ఉన్నాయి కాని వినాయకుడి చిన్ని బొజ్జ నిండటం లేదు. తనశక్తితో ధనాగారంలోని స్వర్ణరాశులన్నింటినీ ఆహారంగా మార్చి బాలగణపతికి భోజనంగా అందిస్తున్నా అదంతా హాంఫట్‌ అయిపోసాగింది.

వినాయకుడికి బొజ్జ నిండకపోవడంతో అందుబాటులో ఉన్న వంటపాత్రలను కూడా కరకరా నమిలి తినేయసాగాడు. ఆయనకు తోడు ఆయన మూషికం కూడా వీర విహారం చేయసాగింది.

ఈలోగా దేవతలందరూ విచ్చేసి, వడ్డనకోసం ఎదురు చూడసాగారు. అందరిముందూ పరువు పోయే పరిస్థితి తలెత్తడంతో  ఏం చేయాలో పాలుపోలేదు కుబేరునికి.

దాంతో తన తప్పు తెలిసి వచ్చి, పార్వతీ పరమేశ్వరుల వద్దకు పరుగెత్తుకుని వెళ్లి, వారి పాదాల మీద వాలి శరణు కోరాడు. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో కాసిన్ని బియ్యాన్ని నీటితో తడిపి, పంచాక్షరీ మంత్రంతో అభిమంత్రించి బాలగణేశుని నోటిలో పెట్టింది. అమ్మ పెట్టిన ఆ బియ్యపు గింజలతో బాలగణపతి బొజ్జ నిండి, బ్రేవ్‌మని త్రేన్చాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో భోజనపదార్థాలన్నీ యథాప్రకారం నిండిపోయాయి. దేవతలందరూ తృప్తిగా విందుభోజనం చేసి, కుబేరుని కొనియాడుతూ ఇళ్లకు వెళ్లారు. కుబేరుడు జీవితంలో మరెన్నడూ అహాన్ని ప్రదర్శించలేదు.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

రాహుకేతువులు - సూర్యచంద్రులు

చేటు తెచ్చిన కామం

అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం, ఆ తర్వాత ఉచ్ఛైశ్రవం, పారిజాతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, లక్ష్మీదేవితో సహా అనేకానేక దివ్యమైన వస్తువులు, దివ్యశరీర ధారులు ఉద్భవం అవుతున్నారు. అంతిమంగా వైద్యశాస్త్రానికంతటికీ అధిదేవత, శంఖుచక్ర గదాపద్మాలను ధరించి, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును పోలి ఉన్న దివ్యపురుషుడు ధన్వంతరి అమృత భాండంతో ఆవిర్భవించాడు.

అంతవరకు ఎంతో క్రమశిక్షణతో అమృతాన్ని చిలుకుతున్న దేవదానవులకు కళ్లముందు అమృతభాండం కనిపించడంతో అవతలి వారికి వాటా ఇవ్వాలనే విషయాన్ని విస్మరించి, ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కున్నారు. తమ మటుకు తామే అమృతాన్ని తాగేద్దామని సముద్రపుటొడ్డున పరుగులు తీస్తున్నారు. ముందుగా రాక్షసులు అమృత పాత్రను పట్టుకుని పారిపోతుంటే దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మోహిని రూపం ధరించాడు.

మోహిని జగన్మోహనంగా నవ్వుతూ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలుచుంది. 


కామానికి లొంగిపోయిన రాక్షసులు మోహినిని చూసి లొట్టలు వేసుకుంటూ, ‘‘అమృతాన్ని నీవే మాకు న్యాయంగా పంచు. అని ఆమెను కోరారు. 

‘‘నేనెవరినో మీకు తెలియదు. నన్ను పెద్ద చేసి, మీరు చేతిలో అమృతపాత్ర పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా నన్నడగలేదు. ఇప్పుడు నేను ఈ పాత్రను పట్టుకుపోతే మీరు ఏమయిపోతారు?’’అని అడిగింది. 

మోహిని మాటలు విన్న తర్వాత కూడా వారు ‘‘అమృతాన్ని నీవే మాకు పంచాలి అన్నారు.

మోహిని వారి నుంచి అమృతపాత్రను అందుకుని, ‘‘మీరు చక్కగా స్నానం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు, దేవతలంతా ఒకవైపు కూర్చోండి. అమృతాన్ని పోస్తాను.’’ అని అంది. 


వారలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే, ఆమె శరీర పృష్టభాగం రాక్షసులకు కనపడుతుంది. దాంతో వారు అమృతం మీద దృష్టిపెట్టకుండా, మోహిని అంగాంగాల మీద దృష్టిపెట్టారు. అదే వారి పతనానికి కారణమయ్యింది. 

మోహిని దేవతలకు పవిత్రంగా కనపడుతోంది. 

రాక్షసులకు మాత్రం మోహజనకంగా కనపడుతోంది.

దీనిని రాహువు అనే రాక్షసుడు గమనించాడు. వెళ్లి దేవతల పంక్తిలో సూర్యచంద్రుల మధ్యన కూర్చున్నాడు. అది తెలుసుకున్న సూర్యచంద్రులు మోహినికి సైగ చేశారు. కానీ, పంక్తి ధర్మాన్ని పాటించిన విష్ణువు రాహువుకు కూడా అమృతాన్ని పోశాడు కానీ, అది గొంతు దిగేలోగానే తన చక్రం చేత ఖండించాడు. అయితే అమృతంతో కూడినందువల్ల తల మాత్రం పడిపోలేదు. మొండేనికి కూడా ప్రాణం వచ్చింది. అదే కేతువు. 


తన ఉనికిని గురించి విష్ణుమూర్తికి తెలియజెప్పారనే కోపంతోనే రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతూ ఉంటారు. అదే సూర్యచంద్రగ్రహణాలు.

Friday, 4 August 2017

అమ్మవారి పూజలో అంతరార్థమిదీ!

అమ్మవారి పూజలో అంతరార్థమిదీ!
  లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీమన్మన్దకటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేన్ద్ర గంగాధరాం!
త్వాం త్రైలోక్యకుటుమ్బినీం సరసిజాం వన్దే ముకున్దప్రియామ్‌॥

లక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించే పర్వదినం నేడు. వరాలిచ్చే మాతను కొలువు దీర్చడం, ధూపదీప నైవేద్యాలతో అర్చించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం అన్నీ ప్రాముఖ్యం కలిగినవే. అంతే కాదండోయ్‌! తరచి చూస్తే, పండితుల్ని ఆరాతీస్తే అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలెన్నో! జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలెన్నో! అవే విపులీకరిస్తున్నారు ప్రముఖ పండితులు టి.కె.వి. రాఘవ.

లక్ష్మి అంటే గుర్తు చెప్పేది. భగవత్‌ తత్వం ఏమిటో తెలియజెప్పేది. స్త్రీ శక్తిని విశదపరిచేది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతర దేవతలతో పనులు చేయిస్తుంది. గుణముల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. వర అంటే శ్రేష్ఠమైనది. అంటే ప్రపంచంలో అత్యంత యోగ్యమైన ప్రయోజనాలను మనకు అందిస్తుంది.

కలశం: 
సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశానికి కట్టే సూత్రం అనుబంధానికి సూచిక. ఒక్క నీటి చుక్కలో కదలిక ఉంటే చాలు, దానంతటదే వ్యాపిస్తుంది. అలాగే పండుగ రోజున మంచి ఆలోచనలు, మనల్ని ముందుకు నడిపించే యోచనలు చేయాలి. అవి బహుముఖీన విస్తరించాలని అమ్మవారిని కోరుకోవడమే కలశ ప్రాధాన్యం. కలశం అడుగున ధాన్యం ఉంచుతాం. ధాన్యమంటే.. జీవనాధారం. అంటే జీవిక కోసం మనం ఏ వృత్తి చేపట్టినా శ్రద్ధగా చేయాలనేదే దాని భావం.

కలశ వస్త్రం: 
వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పితృ దేవతలు, నక్షత్రాలు ఉంటారు. అగ్ని దేవుడు శుభ్రతను నేర్పుతాడు. సూర్యుడు తేజస్సు, వనస్పతి త్యాగం, పితృదేవతలు అనుబంధం, నక్షత్రాలు స్థిరత్వానికి నిదర్శనం. వస్త్రానికి చంద్రుడు అధిదేవత. చంద్రుడి నుంచి సౌఖ్యం, అమృతత్వం ప్రాప్తిస్తాయి. పైగా అతడు అమ్మవారికి తమ్ముడు. కాబట్టే మనకు చందమామ. ఒక కుటుంబ వ్యవస్థను సూచించే ఈ వ్రతం నుంచి.. మహిళలే కాదు.. పురుషులూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

మామిడి ఆకులు: 
కలశానికి మామిడి ఆకులతో అలంకరణ చేస్తాం. మామిడి ప్రాణశక్తిని అందిస్తుంది. చెడును పరిహరిస్తుంది. అందుకే బంధుమిత్రులు వచ్చే సమయంలో... శుభకార్యాల వేళలో మామిడి తోరణాలు తప్పనిసరి.

కొబ్బరికాయ: 
నిస్వార్థమైన జీవితానికి, అందులోని నీరు మనం పొందాల్సిన ఆనందానికి సంకేతాలు. కష్టపడి కోయడం, పెచ్చుతీయడం, పగులగొట్టి పెంకు తొలగించడం... ఇవన్నీ చేస్తే కానీ కొబ్బరి, తియ్యని నీళ్లు రావు. ‘‘ ఆ కష్టం మాకు తెలుసు, అయినప్పటికీ అన్ని సందర్భాల్లో మేం ఆ స్థాయిని ప్రదర్శించలేం. అలంకరించిన ఈ కొబ్బరికాయని సమర్పిస్తున్నాం. స్వీకరించి మాకు శుభాలనివ్వు తల్లీ!’’ అంటూ వరలక్ష్మిని కోరుకోవడమే నారీకేళం విశిష్టత.
పసుపు కుంకుమలు: ఎరుపు అనురాగానికి ప్రతీక. పసుపు త్యాగాన్ని సూచిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా, సాఫీగా సాగడానికి ఈ రెండూ అవసరం. అవి కుటుంబంలోని అందరికీ ప్రసాదించమని అమ్మవారిని మనసారా ప్రార్థించాలి.

పానకం, వడపప్పు: 
ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పుల్ని తట్టుకోవడానికి స్త్రీలకు శక్తి కావాలి. శరీరానికి చలవ అవసరం. అమ్మవారికి నైవేద్యం పెట్టే పెసరపప్పు, పానకంలో అవి లభిస్తాయి. పెసరపప్పు శక్తినిస్తుంది. పానకం చలవ. తేనె భార్యభర్తల అనురాగాన్ని.. పాలు.. ఆత్మీయ అనుబంధాన్నీ సూచిస్తాయి.


పూలసేవ: 

వరలక్ష్మీ దేవతా మూర్తిని పూలతో పూజిస్తాం. అందుకు కలువ, మందార పూలు ప్రశస్తమైనవి. కలువ పూలకు సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధం.. అనే మూడు విశేష లక్షణాలున్నాయి. ఇవి స్త్రీ తత్వాన్ని, ప్రత్యేకతను, విలువను తెలపుతాయి. కలువలది ఎంత సౌందర్యం అంటే నీటిలోంచి తీయగానే వాడిపోతాయి. ఎంత సౌకుమార్యమంటే చేత్తో తాకితేనే కందిపోతాయి. సౌగంధం అంటే పరిమళాన్నందించడం. ఏ ఇబ్బందులు లేకుండా, విరహం ఎదురవకుండా, భర్తతో ఆనందమయ జీవితాన్ని కోరుకుంటూ అమ్మవారికి కలువ పూలతో పూజ చేయాలి. మందార పూలు వైవాహిక జీవితానికి సంకేతం. అందంగా విరిసిన నాలుగు రేకులు, పుప్పొడి కుటుంబ వ్యవస్థను ప్రతిఫలిస్తాయి. మందారం అంటేనే సంతోషం కలిగించేదని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే కుటుంబ శ్రేయస్సుని కాంక్షించడమే.


అష్టోత్తర శతనామాలు: 

అమ్మవారిని 108 నామాలతో పూజిస్తాం. ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత. వేదాల్లో వాటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీ మాత వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి అద్భుతంగా చెప్పబడింది. అమ్మవారి పూజలో పదహారు శ్రీ సూక్తాలున్నాయి. ఉపచారాలున్నాయి. ఆ పూజ అమేయ శక్తినిస్తుంది. అనేక శుభాలను ఒనగూరుస్తుంది. ధనలాభం, సౌభాగ్యం, విద్య, సంసార సౌఖ్యం, వాగ్ధాటి, వాహన ప్రాప్తి, శరీరకాంతి, ధైర్యం... ఇలా పదహారు ప్రయోజనాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


మహత్యం: 

లక్ష్మీ అమ్మవారిని బిల్వ నిలయ అంటారు. బిల్వవృక్షం వద్ద యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. అప్పుడు రాక్షసులు చెట్టు దాకా రాగలరు. ఏ ఆటంకం కలిగించలేరు. అమ్మవారు నిర్దాక్షిణ్యంగా కట్టడి చేసి యజ్ఞ కార్యానికి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అంతటి ప్రభావాన్వితమైన వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, శక్తి, సంపదలు సంప్రాప్తిస్తాయి.


పూజా పుష్పాల్లో... ఓషధులెన్నో! 
జగాలనేలే తల్లికి.. వరాలనిచ్చే లక్ష్మికి.. చిట్టి చేమంతులు, పరిమళాల సన్నజాజులు, నల్ల కలువలు పున్నాగలు... ఇలా పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. వీటితో పూజించడం వల్ల ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఓషధి విలువలున్న ఆ పూల వాడకం వల్ల ఆరోగ్యానికీ ఎంతో మేలు అని ఆయుర్వేద గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం.
ప్రకృతి మనకు ఎన్నో సంపదలు ప్రసాదించే వరాల తల్లి. తిరిగి ఆ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకొంటూ ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు వాటిని వినియోగిస్తాం. అలా చేయడం వల్ల భక్తి భావన, ఆరోగ్య సంరక్షణ మనకు అందుతాయి.
ఓం రమాయై నమః... జాజిపుష్పం సమర్పయామి
విరజాజులు, సన్నజాజులు స్వచ్ఛతకు చిహ్నం. వీటికి ఉద్రేక భావనలను నియంత్రించే శక్తి ఉంది. చర్మ సంబంధ వ్యాధులను దూరం చేయడంలో ఉపకరిస్తాయి.
ఓం ఇందిరాయై నమః.. పుగ పుష్పం సమర్పయామి
పోక పువ్వులో ఎన్నో వైద్య విలువలున్నాయి. వీటికి చలువ చేసే గుణం ఉంది. వీటి పరిసర ప్రాంతాల్లో ఉంటూ గాలి పీల్చడం వల్ల అజీర్ణం, మూత్రకోశ సంబంధ సమస్యలు దరిచేరవు.
ఓం పద్మప్రియాయై నమః పున్నాగ సమర్పయామి
పున్నాగ పూలంటే అమ్మవారికి మహా ఇష్టం. వీటితో మహాలక్ష్మిని పూజించడం వల్ల మనసు, దేహం ప్రశాంతంగా మారతాయి. ఆధ్యాత్మిక భావనలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. పున్నాగ పూలు, ఆకులు, బెరడుకు అమోఘమైన వైద్య విలువలున్నాయి. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులను తగ్గించే గుణం ఉంది.
ఓం హరిప్రియాయై నమః వకులా పుష్పం సమర్పయామి
పొగడ చెట్టు పూలు, పండ్లు, విత్తనాలు, బెరడు అన్నింటికి వైద్య విలువలున్నాయి. వాటికి గాయాలను మాన్పించే శక్తి ఉంది.
ఓం లోకమాత్రే నమః మల్లికాపుష్పం సమర్పయామి
మల్లెలు మనసుని మురిపిస్తాయి. మధుర భావనలు కలిగిస్తాయి. వీటికి అహాన్ని తగ్గించే శక్తి ఉంది. ఈ చెట్టు వేర్లు, పూవులు, ఆకులను చర్మ, అల్సర్ల నివారణలో ఉపయోగిస్తారు.
ఓం కమలవాసిన్యై నమః సేవంతికా పుష్పం సమర్పయామి
చామంతి పూవులనే సేవంతికా పువ్వులంటారు. వీటిని ధరించడం వల్ల, శరీరానికి తేజస్సు లభిస్తుంది. చామంతి ఆకులు, పువ్వులు కంటిని కాంతిమంతం చేస్తాయి. జ్వరం, తలనొప్పి, న్యుమోనియా వంటి సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి.
ఓం పద్మనిలయామై నమః పద్మ పుష్పం సమర్పయామి
పద్మ పుష్పానికి భౌతిక భావనలతో సతమతమయ్యే వారిని వాటి నుంచి దూరం చేసి... ఆధ్యాత్మిక శక్తినందించే శక్తి ఉంది. ఆసాంతం వైద్య విలువలకు ఉపకరిస్తుంది. ఈ పుష్పానికి మేనికి వర్ఛస్సునిచ్చే, సంకుచితత్వాన్ని పోగొట్టి మనస్సు పరిధిని విశాలం చేసే గుణం ఉంది అని మానసిక నిపుణులు చెబుతుంటారు.
వరలక్ష్మ్యై నమః నీలోత్పల పుష్పం సమర్పయామి
నల్ల కలువలనే నీలోత్పలాలు అంటారు. వీటికి మెదడును చైతన్యపరిచే శక్తి ఉంది. వరలక్ష్మీ మాతను వీటితో పూజించడం వల్ల ఆలోచనల్లో.. లక్ష్యాల్లో స్పష్టత వస్తుందని భక్తుల నమ్మకం. వీటి విత్తనాలు, పువ్వులకు మధుమేహాన్ని నివారించే శక్తి ఉంది.