Sunday, 31 July 2016

సుందోపసుందులు

పూర్వం హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందుడు అనే కొడుకులు ఉండేవారు. వారిద్దరికీ ముల్లోకాలనూ జయించాలనే కోరిక ఉండేది. అంతటి ఘనకార్యం ఘోర తపస్సుతో తప్ప సాధ్యం కాదని తలచి, అన్నదమ్ములిద్దరూ ఒక కీకారణ్యానికి చేరుకుని తపస్సు ప్రారంభించారు. మండు వేసవిలో పంచాగ్నుల మధ్య నిలిచి, వణికించే శీతకాలంలో జలాశయాల్లో మునిగి ఏళ్ల తరబడి ఘోర తపస్సు సాగించారు. వారి తపస్సు తీవ్రతకు ప్రకృతి గతి తప్పింది. ముల్లోకాలలో సంక్షోభాలు తలెత్తాయి. ఆ పరిస్థితికి దేవతలు సైతం బెంబేలెత్తిపోయారు. వారి తపస్సును విరమించేలా చేయాలంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు.

దేవతల గోడు విన్న బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్న సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. కామరూపం, కామగమనం వంటి సకల మాయావిద్యలను అనుగ్రహించాలని, తమకు ఇతరుల వల్ల మరణం రాకుండా ఉండేలా వరమివ్వాలని, అమరత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. అమరత్వం తప్ప వారు కోరుకున్న మిగిలిన వరాలన్నింటినీ ప్రసాదించాడు బ్రహ్మదేవుడు.

అసలే రాక్షసులు, ఆపై బ్రహ్మదేవుడి వరాలు కూడా పొందినవారు. ఇక ఆగుతారా? వరగర్వంతో నానా అకృత్యాలూ ప్రారంభించారు. మునులు తలపెట్టిన యజ్ఞయాగాలకు భంగం కలిగించసాగారు. కామరూప విద్యతో క్రూరమృగాల రూపం ధరించి, ఊళ్లపై పడి అమాయక ప్రజలను పీడించసాగారు. వారి దాష్టీకాలకు లోకమంతా హాహాకారాలు మిన్నుముట్టసాగాయి. సుందోపసుందులను ఎలా నియంత్రించాలో అర్థంకాక మునులందరూ బ్రహ్మదేవుడి వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు.

‘దేవా! నీవిచ్చిన వరాల ప్రభావంతోనే సుందోపసుందులు చెలరేగిపోతున్నారు.

లోకులను నానా రకాలుగా పీడిస్తున్నారు. వారి పీడ విరగడయ్యే పరిష్కారం నువ్వే చూడాలి’ అంటూ గోడు వెళ్లబోసుకున్నారు.

‘వారికి నేను అన్ని వరాలూ ఇచ్చానే గాని, అమరత్వాన్ని ప్రసాదించలేదు. నేనిచ్చిన వరం వల్ల ఇతరుల చేతుల్లో వారి మరణం అసంభవం. వారిలో వారికే కలహం వచ్చి, పరస్పర యుద్ధానికి దిగితే తప్ప వారి పీడ విరగడ కావడం సాధ్యం కాదు’ అన్నాడు బ్రహ్మదేవుడు.

అయితే, కలహించుకోవడానికి సుందోపసుందులు పరస్పర శత్రువులేమీ కాదు. ఒకరిపై మరొకరికి అనురాగం గల అన్నదమ్ములు. వాళ్ల మధ్య కలహం పుట్టించడం ఎలా అన్నదే సమస్య. దీనికి ఏం చేయాలో తోచని బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరినీ సమావేశపరచాడు. తానిచ్చిన వరాల వల్ల గర్వాంధులైన సుందోపసుందులు ముల్లోకాలనూ ఎలా పీడిస్తున్నదీ వివరించాడు. వారి పీడ విరగడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు.

అప్పుడు విశ్వకర్మ ముందుకు వచ్చి ‘అన్నదమ్ముల మధ్య కలహం పుట్టించడానికి ఆడది చాలు. నేను సృష్టించిన అప్సరస తిలోత్తమ ఆ పనిని అవలీలగా సాధించగలదు.’ అని పలికాడు.

విశ్వకర్మ మాటలతో బ్రహ్మదేవుడికి కాస్త ధైర్యం వచ్చింది. ఇంద్రసభలో ఉన్న తిలోత్తమకు కబురు పంపాడు. బ్రహ్మదేవుడి వర్తమానం అందడంతో జగదేక సుందరి అయిన తిలోత్తమ బ్రహ్మ సమక్షానికి వచ్చి నిలుచుంది.

‘నీ అందచందాలతో లోకాలను పీడిస్తున్న సుందోపసుందులను ఆకర్షించు. చాకచక్యంగా వాళ్లిద్దరి మధ్య కలహం పుట్టించు.’ అని ఆదేశించాడు.

బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తిలోత్తమ భూలోకానికి చేరుకుంది. సుందోపసుందులకు కనిపించేలా వారు తరచూ సంచరించే వనంలో విహరించసాగింది. వన విహారానికి వచ్చిన సుందోపసుందులిద్దరూ ఒకేసారి ఆమెను చూశారు. ఆమె అందానికి వారి మతులు పోయాయి.
‘ప్రాణేశ్వరీ’ అంటూ సుందుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
‘హృదయేశ్వరీ’ అంటూ ఉపసుందుడు ఆమె మరో చేతిని పట్టుకున్నాడు.

ఆమె నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకున్నారు. వారి వాదన ఎటూ తేలని స్థితిలో తిలోత్తమ చిరునవ్వులు చిందిస్తూ ‘మీ ఇద్దరికీ నేనొకత్తెనే ఎలా భార్య కాగలను? మీరిద్దరిలో ఎవరు వీరులో వారిని నేను తప్పక పెళ్లాడతాను.’ అని పలికింది.

ఎలాగైనా తిలోత్తమను దక్కించుకోవాలనే పట్టుదలతో సుందోపసుందులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. ఇద్దరూ సమాన బలవంతులే. భీకరంగా పోరాడుకున్నారు. సింహనాదాలు చేస్తూ ఒకరిపై మరొకరు కలబడి ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చివరకు ఇద్దరూ మరణించారు.

Friday, 29 July 2016

మాతా మానస దేవి

త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లనిచూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పొగొడుతుంది. అందుకనే కాలసర్ప దోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు వుండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

సర్పరక్షకురాలు
మాతా మానసదేవి అన్న వాసుకి. ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరోపేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు అస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమజేయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. రుత్వికుల మంత్ర పఠనంతో భూమండలం మీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్టుడైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తీకుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన అస్తీకునికి జనమజేయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమజేయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి.సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతానఫలం కలుగుతుంది.

బిల్వ పర్వతం పై ఆలయం
హరిద్వార్లోని బిల్వపర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు వున్నాయి. మూడు ఆలయాలు శక్తిపీఠాలు కావడం విశేషం. పర్వతంపై వున్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్ల మార్గం లేదా రోప్వే వుంది. రోప్వేలో వెళ్లే సమయంలో గంగానది పరివాహక సుందరదృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్నిధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడుకోవాలి. అమ్మవారి అభీష్టంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగిఆలయాన్ని దర్శించుకోవాలి.

ఎలా చేరుకోవాలి
  • ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పట్టణానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి రవాణా సౌకర్యాలున్నాయి.
  • డెహ్రాడూన్లో విమానాశ్రయముంది. అక్కడ నుంచి హరిద్వార్ 35 కి.మీ. దూరం. ప్రైవేటు వాహనాల ద్వారా హరిద్వార్ చేరుకోవచ్చు.
  • హరిద్వార్ రైల్వేస్టేషన్ నుంచి ఆలయం 2.5 కి.మీ.దూరంలో వుంది.
  • రోప్వే ద్వారా వెళితే హిమాలయపర్వతశ్రేణిలోని శివాలిక్ అందాలు, గంగానది ప్రవాహాన్ని వీక్షించవచ్చు.

Sunday, 24 July 2016

విశ్వామిత్రుడి భంగపాటు



గాధి కొడుకైన విశ్వామిత్రుడు తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని తన బలసంపదతో అపారంగా విస్తరించాడు. అతడిని ఎదిరించే రాజులే ఉండేవారు కాదు. దాంతో బలగర్వం పెరిగి, క్షాత్రబలాన్ని మించినది లేదనే భ్రమలో బతికేవాడు. రోజూ సభలో కొలువుదీరి వందిమాగధుల స్తోత్రపాఠాలు వింటూ పొద్దుపుచ్చేవాడు.  ఇలా ఉండగా, విశ్వామిత్రుడికి ఒకనాడు వేటకు వెళ్లాలనే సరదా పుట్టింది. విశ్వామిత్రుడు, అతడి పరివారం ఆయుధాలు ధరించి వేట కోసం అరణ్యమార్గం పట్టారు. కీకారణ్యానికి చేరుకుని, పొద్దంతా వేట సాగించారు. పొద్దుగూకే వేళకు బాగా అలసట చెందారు.

ఇక వేట చాలించి, ఆహారాన్వేషణలో పడ్డారు. కొంత దూరం ముందుకు వెళ్లగా, కొందరు ముని బాలకులు కట్టెలు, దర్భగడ్డి ఏరుకుంటూ కనిపించారు. అక్కడకు కనుచూపు మేరలోనే ఒక ఆశ్రమం కనిపించింది.

విశ్వామిత్రుడు ఆ మునిబాలకుల దగ్గరకు వెళ్లి ‘అదిగో! అక్కడ కనిపిస్తున్న ఆశ్రమం ఎవరిది?’ అని అడిగాడు.

‘మహారాజా! అది మహర్షి వశిష్ఠుల వారి ఆశ్రమం. మేము ఆయన శిష్యులమే’ అని బదులిచ్చారు.
శిష్యుల ద్వారా విశ్వామిత్రుడి రాక గురించి సమాచారం తెలుసుకున్న వశిష్ఠుడు వెంటనే విశ్వామిత్రుడికి ఎదురేగి, స్వాగతం పలికాడు. అర్ఘ్య పాద్యాదులిచ్చి సత్కరించాడు.

వశిష్ఠుడి వద్ద నందిని అనే హోమధేనువు ఉండేది. కామధేనువులాంటి ఆ హోమధేనువు కోరినవన్నీ ఇచ్చేది. వేటలో అలసి సొలసిన విశ్వామిత్రుడికి, అతడి పరివారానికి హోమధేనువు మహిమతో పంచభక్ష్య పరమాన్నాలు తృప్తిగా వడ్డించాడు.

నందిని మహిమను చూశాక విశ్వామిత్రుడికి వశిష్ఠుడి వైభోగంపై కన్ను కుట్టింది. కోరినదల్లా ఇచ్చే ఇలాంటి ధేనువు తన వద్ద ఉండాలే తప్ప ముక్కుమూసుకుని అడవుల్లో తపస్సు చేసుకునే వశిష్ఠుడి వంటి ముని వద్ద కాదని అనుకున్నాడు. నయాన అయినా భయాన అయినా వశిష్ఠుడి నుంచి నందినిని ఎలాగైనా దక్కించుకోవాలని కూడా అనుకున్నాడు.

భోజనాదికాలు ముగిశాక విశ్వామిత్రుడు, అతడి పరివారం విశ్రమించారు. విశ్వామిత్రుడికి మాత్రం వశిష్ఠుడి హోమధేనువును ఎలా దక్కించుకోవాలా అనే ధ్యాసతో కునుకు పట్టలేదు. ఉదయాన్నే నిద్రలేచి, స్నాన సంధ్యలు ముగించుకున్న తర్వాత విశ్వామిత్రుడి పరివారం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.

వీడ్కోలు పలకడానికి వచ్చిన వశిష్ఠుడిని నందినిని తనకు ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు.

‘మునివర్యా! అడవులలో తపస్సు చేసుకునే మీకు సంపదలనిచ్చే హోమధేనువు దేనికి? పాల కోసమే అయితే వేరేదైనా ధేనువును పెంచుకోవచ్చు కదా! దీనిని నాకు అప్పగిస్తే, దీని బదులు పాలిచ్చే లక్ష గోవులను నీకు ఇస్తా’ అని పలికాడు.

‘రాజా! దీని బదులు లక్ష గోవులు దేనికి? వాటిని నేనెలా మేపగలను? అయినా, ఇది పవిత్రమైన హోమధేనువు. దీనిని ఇతరులకు ఇవ్వతగదు’ అని వశిష్ఠుడు బదులిచ్చాడు.

వశిష్ఠుడి సమాధానంతో విశ్వామిత్రుడికి చర్రున కోపం వచ్చింది. ‘మునివర్యా! నయాన ఇవ్వకుంటే, బలవంతంగానైనా నీ ధేనువును తీసుకుపోగలను. నువ్వు నన్నేమీ చేయలేవు’ అన్నాడు.

నందినిని వెంట తీసుకు రమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. భటులు దానిని పట్టి తేవడానికి వెళ్లారు. ఉన్న చోటు నుంచి కదలడానికి నందిని మొరాయించింది. భటులు బలప్రయోగం చేశారు. ఆర్తనాదాలు చేస్తూ అది వశిష్ఠుడి వద్దకు వచ్చింది.

‘మునివర్యా! నన్ను ఈ దుర్మార్గులకు ఎందుకు ఇచ్చేస్తున్నావు?’ అని దీనంగా అడిగింది.

వశిష్ఠుడు బదులు పలకలేదు.

వశిష్ఠుడు తనను వారికి ఇవ్వలేదని నందినికి అర్థమైంది. విశ్వామిత్రుడి భటులు మళ్లీ దానిని బలవంతంగా లాక్కుపోవడానికి ప్రయత్నించారు.



ఈసారి నందిని నిస్సహాయంగా ఆక్రందనలు చేయలేదు. క్రోధావేశంతో తోక ఝాడించి, కొమ్ములు ఝుళిపించింది. నందిని శరీరం నుంచి వేలాదిగా సాయుధ సైనికులు పుట్టుకొచ్చారు. ఒక్కుమ్మడిగా దాడి చేసి విశ్వామిత్రుడి సైనికులను తరిమి తరిమి కొట్టారు. క్షాత్రబలమే గొప్పదనే భ్రమలో ఉన్న విశ్వామిత్రుడికి కళ్లు తెరుచుకున్నాయి. తపోబలమే క్షాత్రబలం కంటే గొప్పదని గ్రహించాడు. తపోసాధనకు ఉపక్రమించాడు.

Sunday, 17 July 2016

అంగారపర్ణుడి గర్వభంగం


అంగారపర్ణుడు అనే గంధర్వుడు కుబేరుడి స్నేహితుడు. కుబేరుడంతటి వాడు తనకు స్నేహితుడైనందున గర్వం తలకెక్కించుకున్నాడు. ఎంతటి వారినైనా లెక్కచేయకుండా విచ్చలవిడిగా సంచరించేవాడు. పైగా స్త్రీలోలుడు. అర్ధరాత్రి వేళలో తన భార్యతో, అంతఃపుర కాంతలతో గంగానది వద్దకు వచ్చి జలక్రీడలతో వినోదం పొందేవాడు. అంగారపర్ణుడు జలక్రీడలాడే సమయంలో అటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ఒకవేళ కర్మకాలి వచ్చినా, అతడి చేతిలో చచ్చి పరలోకగతులయ్యేవారు.
అంగారపర్ణుడు ఇలా స్వైరవిహారం చేస్తున్న కాలంలో పాండవులు ఏకచక్రపురంలో ఉండేవారు. బకాసురుడిని భీముడు వధించాక ఇక ఏకచక్రపురంలో ఉండి చేసేదేమీ లేదని వారు భావించారు. ఈలోగా ద్రుపద మహారాజు ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించాడు. స్వయంవరానికి వెళ్లాలని పాండవులు ఉవ్విళ్లూర డంతో కుంతీదేవి అందుకు సమ్మతించింది. పాంచాల రాజ్యంలో సురక్షితంగా ఉండవచ్చని కూడా ఆమె తలపోసింది. ఒకనాడు పాండవులు ఏకచక్రపురాన్ని వీడి పాంచాల రాజ్యానికి కాలినడకన బయలుదేరారు. ఒకనాటి రాత్రి పాండవులు గంగానది సమీపానికి చేరుకున్నారు.

గంగాతీరంలోని సోమశ్రవ తీర్థంలో స్నానమాచరించి, గంగను పూజించాలని వారు సంకల్పించారు. అదే మార్గంలో అర్జునుడు ముందు నడవగా మిగిలిన వారు అతడిని అనుసరిస్తూ నడక సాగించారు. వారు నది ఒడ్డుకు చేరుకునే సమయానికి అంగారపర్ణుడు తన అంతఃపురకాంతలతో నదిలో జలక్రీడలు ఆడుతూ కేళీవినోదంలో మునిగి ఉన్నాడు. అపరిచితుల పదఘట్టనలు వినిపించడంతో చిరాకుపడి ఒడ్డుకు వచ్చి, అర్జునుడిని అడ్డగించాడు. అకస్మాత్తుగా గంధర్వుడు ప్రత్యక్షం కావడంతో అర్జునుడితో పాటు, అతడి వెనుకగా వస్తున్న మిగిలిన పాండవులు, కుంతీదేవి తటాలున నిలిచిపోయారు.

‘ఓరీ నరుడా! సంధ్యవేళలు, అర్ధరాత్రి సమయాలు యక్షగంధర్వ దానవులు స్వేచ్ఛగా సంచరించే సమయాలు. ఎంతటి బలవంతులైన రాజులైనా నరులు ఈ సమయాల్లో ఈ ప్రాంతాల్లో సంచరించరు. అర్ధరాత్రివేళ నేను సంచరించే ప్రాంతంలోకి ఎందుకు అడుగుపెట్టారు? నేనెవరినో తెలియదా? నా పేరెప్పుడూ వినలేదా? నేను అంగారపర్ణుడిని. కుబేరుడి అనుంగు మిత్రుడిని... ఇప్పటికైనా మించినది లేదు. వెనుదిరిగి ప్రాణాలు దక్కించుకోండి’ అంటూ గద్దించాడు.

అర్జునుడు వాని పలుకులు విని నవ్వుతూ ‘సంధ్యా సమయాలు, అర్ధరాత్రి వేళల్లో సంచరించడానికి అశక్తులు, అర్భకులు భయపడతారు. మాకు అలాంటి భయాలేవీ లేవు. నువ్వు కుబేరుడి మిత్రుడివి కావచ్చు గాక. ఇది పవిత్ర గంగానది. ఈ నదిలో స్నానమాచరించే హక్కు, పూజలు చేసుకునే హక్కు అందరికీ సమానమే. ఇది నీ సొత్తు కాదు’ అని బదులిచ్చాడు.

అర్జునుడి ప్రత్యుత్తరంతో అంగారపర్ణుడు మండిపడ్డాడు. ‘నన్నే ధిక్కరిస్తావా..? ఎంత ధైర్యం..?’ అంటూ అస్త్రాలను ఎక్కుపెట్టాడు. అర్జునుడు ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన గాండీవాన్ని సంధించాడు. ఇద్దరికీ హోరాహోరీ పోరు జరిగింది. చివరకు అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించడంతో అంగారపర్ణుడు సొమ్మసిల్లి నేలకూలాడు. అర్జునుడు అతడిని పట్టి తెచ్చి ధర్మరాజు కాళ్ల ముందు పడేశాడు. ఈలోగా అంగారపర్ణుడి పట్టమహిషి కుంభీనన విలపిస్తూ కుంతీదేవి కాళ్లపై పడి తనకు పతిభిక్ష పెట్టాలంటూ వేడుకుంది. కుంతి ఆమెకు అభయమిచ్చింది. ఈలోగా అంగారపర్ణుడు స్పృహలోకి వచ్చాడు. కుంభీననకు తల్లి అభయమివ్వడంతో ధర్మరాజు ఆమె కోరికను మన్నించి, అంగారపర్ణుడిని ఆమెకు అప్పగించాడు.

‘కుబేరుడంతటి వాడు నా స్నేహితుడనే గర్వం తలకెక్కి మిమ్మల్ని అడ్డుకున్నాను. మీ శౌర్యప్రతాపాలను తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించండి’ అంటూ అంగారపర్ణుడు వేడుకున్నాడు. ’బలగర్వంతో ఎవరినీ కించపరచకు. ఎవరినీ హింసించకు. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తుకాదు’ అంటూ ధర్మరాజు అతడికి హితబోధ చేసి, విడిచిపెట్టాడు.