Friday, 24 February 2017

శివరాత్రి. ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

                 శివరాత్రి. ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?



ఎలా ఉండాలి?
పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అదే మన సనాతన సంస్కృతి.

ఏ పండుగ జరుపుకోవడానికైనా, అసలు కారణాలు తెలుసుకుంటే కానీ, ఆంతర్యం బోధపడదు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్‌ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు పెద్దలు.

జీవారాధన ముఖ్యం
మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్థాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. ఎందుకంటే, అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అన్నారు. అందుకే ‘జీవారాధనే శివారాధన’ అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.

ఉపవాసం
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం. బాలలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణులకు, ఔషధ సేవనం చేయాల్సిన వారికి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయడం వల్ల ఉపవాస ఫలం ఉండదు.

ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి.

ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.
మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతునివైపు మనసును తిప్పడం కష్టం.

శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.
∙ఆహారానికి, నిద్రకే కాదు... మాటలకు కూడా..!

శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి.

వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే!
ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారికి ఆరోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. అలాంటప్పుడు అవసరమైనంతవరకే మాట్లాడండి, ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.

మహిమాన్వితం... మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి.

శివ.. ధ్యానం.. కీర్తనం.. స్మరణం


మార్కండేయుడు మృకండ మహర్షి, మరుద్వతి దంపతుల కుమారుడు. ఈశ్వర అనుగ్రహంతో కలిగిన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటారు వాళ్లు. అయితే ఆ బాలకుడు 16 ఏళ్లు మాత్రమే జీవించి ఉంటాడని చెబుతాడు పరమేశ్వరుడు. అతనికి పదహారేళ్లు వచ్చాక తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖిస్తారు. వారి చింతకు కారణం తెలుసుకున్న మార్కండేయుడు పరమేశ్వరుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి వచ్చిన యముడు సైతం ఆతడి తపోదీక్షకు నివ్వెరపోతాడు. బాలకుడిపై పాశం వేయగా.. పరమేశ్వరుడు కాలరూపుడుగా ప్రత్యక్షమవుతాడు. మార్కండేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు.

ప్రతి మాసం కృష్ణ పక్షంలో చతుర్దశి పరివ్యాప్తమై ఉన్న రోజును శివరాత్రిగా భావిస్తారు. మాఘమాస కృష్ణ చతుర్దశిని ‘మహాశివరాత్రి’గా జరుపుకుంటారు. ఈ రోజునే మహాలింగం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. మాఘ మాసాన్ని సంవత్సర సారం అంటారు. అందుకే మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రిగా నిర్ణయించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాశివరాత్రి వ్రతం ఆచరిస్తే.. సంవత్సరంలోని అన్ని మాస శివరాత్రులూ వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు.

శివరాత్రి వ్రతం గురించి శివ పురాణం, స్కంద పురాణాల్లో విస్తృతంగా ప్రస్తావించారు. శివరాత్రి వ్రతం అంటే ముఖ్యంగా ఉపవాసం ఆచరించాలి. జాగరణ చేయాలి. ఈ వ్రతం చేయాలనుకునే వారు మహాశివరాత్రి నాడు నిద్ర లేవడంతోనే.. ఉపవాస దీక్ష చేపడుతున్నట్టుగా సంకల్పించుకోవాలి. ప్రాతఃకాలంలోనే చన్నీటితో తలస్నానం చేయాలి. వీలైతే నదీ స్నానం లేదా తటాక స్నానం ఆచరించాలి. లేనిపక్షంలో ఇంట్లో చేయాలి. స్నానం చేసే సమయంలో ‘‘శ్రీ శివాయ నమస్తుభ్యం మహాదేవాయతే నమః’’ అనే మంత్రాన్ని పఠించాలి. అనంతరం నిత్యపూజలు చేసుకుని, పరమేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించాలి. ప్రాతఃకాలం, మధ్యాహ్నం, ప్రదోష సమయం (సాయం సంధ్యా సమయం), లింగోద్భవ కాలం (అర్ధరాత్రి) మహాలింగానికి అభిషేకం నిర్వహించాలి.

ఉపవాసం అంటే ఆహారం తీసుకోకపోవడం. అయితే శారీరక స్థితులను అనుసరించి ఉపవాసం పట్టాలి. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు, రోగగ్రస్థులు ఉపవాస దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదు. శారీరక పటుత్వం ఉన్నవారు కఠిన ఉపవాసం చేయవచ్చు. అయితే అవసరానుగుణంగా పాలు సేవిస్తూ ఉపవాసం ఉండవచ్చునని శాస్త్రం చెబుతోంది. ఉపవాస దీక్షలోని భౌతికమైన అర్థం అన్నపానీయాలకు దూరంగా ఉండటం. ప్రదోష సమయంలో లింగార్చన తర్వాత ఉపవాస దీక్ష పరిసమాప్తం అవుతుంది. తర్వాత కూడా పళ్లు, పానీయాలు మాత్రమే స్వీకరిస్తారు తప్ప అన్నం జోలికి వెళ్లరు.

ఆధ్యాత్మికంగా చూస్తే ‘ఉప’ అంటే దగ్గరగా.. ‘వాసం’ అంటే ఉండటం అని అర్థం. దైవానికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం. మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో మనం వేటి గురించి ఆలోచిస్తామో.. అదంతా ఆహారమే. వీటిని వదిలిపెట్టి పరమాత్ముని గురించి ఆలోచించడమే నిజమైన ఉపవాసం. అప్పుడే దీక్ష పరిపూర్ణం అవుతుంది. ఆధ్యాత్మికంగా అంతర్ముఖత్వ సాధనకు ఉపవాసం ఒక మార్గం.శివరాత్రి నాడు ఉపవాసానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. జాగరణకు అంత విశిష్టత ఉంది. రాత్రి అనే శబ్దానికి యోగ భాషలో స్పృహ లేకుండా ఉండటం అని అర్థం ఉన్నది. భౌతిక విషయాలపై స్పృహ లేకుండా.. చిత్తం శివుడికి అర్పించి జాగృతంగా ఉండటమే జాగరణ. ధ్యానానికి శివరాత్రి అనుకూలమైన సమయం. అందుకే సిద్ధులు శివరాత్రి పర్వదినాన గంటల తరబడి తపోదీక్షలో ఉండిపోతారు.

ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఇది సాధ్యం కానప్పుడు సంకీర్తనం చేయవచ్చు. శివుడి లీలలు భజనగా, కీర్తనగా ఆలపిస్తూ జాగరణ కొనసాగించాలి. సంకీర్తనం వల్ల వాక్కు పరిశుద్ధమవుతుంది. ఇదీ సాధ్యం కాకపోతే స్మరణ చాలు. జంగమదేవుడి కథలు వినడం, కైలాసనాథుడి చరిత్రను నలుగురితో పంచుకోవడం, మహేశ్వర వైభవాన్ని చాటే పురాణాలు చదవడం వంటివి చేయాలి. సూర్యోదయం అయ్యే వరకు భగవంతుని సన్నిధిలో జాగారం చేయడం వల్ల శివరాత్రి వ్రతం పూర్తవుతుంది. అనంతరం స్నానాధికాలు పూర్తి చేసుకుని, నిత్య పూజ చేయాలి. తర్వాత స్వామివారికి అన్నం నైవేద్యంగా సమర్పించి భోజనాలు చేసుకోవాలి. శారీరక, మానసిక పరిశుభ్రతను పాటిస్తూ.. శివరాత్రి వ్రతాన్ని ఆచరించేవారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

శ్రీకాళహస్తిలో శ్రీ అనగా సాలీడు, కాళము అనగా సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు అక్కడి వాయులింగేశ్వరుడ్ని నిష్టగా కొలుస్తుంటాయి. సాలీడు స్వామికి గూడు కట్టి తన భక్తిని చాటుకుంటుంది. ఏనుగు నిత్యం జలాలను తన తొండంతో తీసుకువచ్చి స్వామిని అభిషేకిస్తుంటుంది. సర్పం మణులతో స్వామిని పూజిస్తుంటుంది. అయితే వీటి మధ్య పరస్పర వైరం కలుగుతుంది. తన భక్తి గొప్పదంటే తన భక్తే గొప్పదని కలహించుకుని ప్రాణాలు విడుస్తాయి.
కణ్వస

ముక్కంటికి కన్ను

శ్రీకాళహస్తి సమీపంలోని అడవిలో తిన్నయ్య అనే కోయవాడు ఉండేవాడు. రోజూ వేటకు అడవికి వచ్చే వాడు. ఓ రోజు వేట సమయంలో భారీ వర్షం కురవడంతో తిన్నడు శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లి తలదాచుకుంటాడు. తెల్లవారి ఆలయ అర్చకుడు వచ్చి తిన్నయ్యను గుళ్లో నుంచి తరిమేస్తాడు. శివాలయంలో అపచారం చేయకూడదని దూషిస్తాడు. దీంతో ఆగ్రహించిన తిన్నడు తనను కష్టాలపాలు చేసిన శివుడు దేవులు ఎలా అవుతాడంటూ అర్చకుడ్ని తిడతాడు. అప్పుడు ఆ అర్చకుడు తిన్నయ్యకు ‘శివపంచాక్షరీ’ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. త్రికరణ శుద్ధిగా ఆ మంత్రాన్ని పఠిస్తాడు తిన్నడు. అతడికి పరమేశ్వరుడి సాక్ష్యాత్కారం అవుతుంది.

కొందరు తిన్నడి భక్తిని అనుమానిస్తారు. వారికి బుద్ధి చెప్పాలని పరమేశ్వరుడు తిన్నడి భక్తికి పరీక్ష పెడతాడు. ఆలయంలోని వాయులింగం కంటి నుంచి రక్తం వచ్చేలా చేస్తాడు. అది చూసిన తిన్నడు మారు ఆలోచన లేకుండా బాణంతో తన కంటిని తీసి.. లింగానికి అమర్చుతాడు. లింగానికి ఉన్న మరో కంటి నుంచి ధారగా రక్తప్రవాహం మొదలవుతుంది. తిన్నడు తన రెండో కంటిని స్వామికి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై.. తిన్నడి భక్తిని ప్రశంసిస్తాడు. లోకులంతా అతడి నిజమైన భక్తిని అర్థం చేసుకుంటారు. శ్రీకాళహస్తీశ్వరుడికి తన కళ్లను సమర్పించిన తిన్నయ్య తర్వాతి కాలంలో భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. 

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యం గురించి తెలుసా..?

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదట. తింటే వచ్చే ప్రమాదం ఏమిటి?
ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు. అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి.  ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆరోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యంపై ఒక అవలోకనం...

ఒక్క ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే....

ఉత్తర ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది.

ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లూ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిథి ఉన్నరోజు, రథసప్తమి రోజు, స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈరోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

ఏకాదశి ప్రాశస్త్యం
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించిన వివరణ అనేక పురాణాలలో ఉంది.. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ఈ మురాసురుని అక్రమాలు, ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శ్రీమహా విష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసర మని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ‘‘ఏకాదశి’’ అని నామకరణం చేశారు. వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధిచెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు.

విశేష ఆరాధన
వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.

- ముస్త్యాల రామచంద్ర శర్మ, అవధాని

Wednesday, 22 February 2017

భక్తి లేని పూజ!

అది అమరావతి. మహేంద్రపురిలోని ఇంద్రభవంతి. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనకలు సంప్రదాయ వస్త్రాలతో ఒద్దికగా కూర్చుని ఉన్నారు. అష్టదిక్పాలకులు ఆసీనులై ఉన్నారు. దేవగురువు బృహస్పతి ఉచితాసనాన్ని అలంకరించి ఉన్నాడు. గంధర్వులు గానం చేస్తున్నారు. మునులు హోమాలు, యజ్ఞయాగాది క్రతువులలో నిమగ్నమై ఉన్నారు. దేవేంద్రుడు నారాయణ యజ్ఞంలో లీనమై ఉన్నాడు. యజ్ఞపరిసమాప్తి అయింది. ఫలప్రదాత అయిన నారాయణుడు మాత్రం ఆ ఫలాన్ని అందుకోవడానికి రాలేదు. అంత వరకూ యజ్ఞం సజావుగా జరిగిందని సంతోషంగా ఉన్న ఇంద్రుని మోములోని చిరునగవు మాయమై, ఆ స్థానంలో అసంతృప్తి చోటు చేసుకుంది. తనవల్ల ఏమి తప్పిదం జరిగిందోనన్న ఆందోళన మొదలైంది. అసలు తను ఆ యజ్ఞం చేయవలసి వచ్చిన కారణం కన్నుల ముందు కదలాడింది.

ఓ రోజు ఇలాగే తాను పూజ చేస్తున్నాడు. అయితే పక్కనే అప్సరాంగనల నృత్య ప్రదర్శన, శచీదేవి సపర్యలు సాగుతూ ఉన్నాయి. చేతులు, పెదవులు యాంత్రికంగా పని చేసుకుపోతున్నాయి కానీ, మనసు ఏమాత్రం లగ్నం కావడం లేదు. దాంతో బ్రహ్మదేవుడికి ఆగ్రహం వచ్చింది. ‘‘దేవేంద్రా! ఏ పదవిని, భోగాలని చూసుకుని నువ్వు విర్రవీగుతున్నావో, అవే నీకిక నిద్రాహారాలను దూరం చేస్తాయి. ఏ పూజాది క్రతువులపైన అయితే, నీవు మనస్సును లగ్నం చేయలేకపోతున్నావో, అదే పూజలు, జపతపహోమాదులతో శ్రీహరిని మెప్పించి మునులు మహేంద్రపదవిని పొందుతారు. రాక్షసులు నీ మీద దండయాత్రలు చేస్తూ, నీ రాజ్యాన్ని, సింహాసనాన్ని ఆక్రమించుకుంటూ నీకు మనః స్థిమితం లేకుండా చేస్తూ ఉంటారు గాక’’ అని శపించాడు.

దాంతో ఇంద్రుడికి తన తప్పిదం తెలిసి వచ్చింది. సురాధిపుడంటే నిత్యం నృత్యగానాలు, అప్సరాంగనల సాంగత్యం, సోమరసపానం కాదని, బాధ్యతాయుతమైన పదవి అని, ఎట్టి పరిస్థితులలోనూ పెద్దలను విస్మరించరాదని గ్రహించాడు. బ్రహ్మ శాపం తిరుగులేనిది. అయితే విష్ణుమూర్తిని వేడుకుంటే కనీసం శాపాంతం అయినా తెలుస్తుందని గురువర్యులు బృహస్పతి సలహా ఇచ్చిన మీదట ఈ పూజాయజ్ఞం తలపెట్టాడు. అంతా అనుకున్నట్లుగా జరిగింది, ఇక శ్రీమన్నారాయణుడు స్వయంగా విచ్చేసి, యజ్ఞఫలాన్ని స్వీకిరంచడమే తరువాయి అనుకుంటే ఇప్పుడిలా జరిగిందేమిటి? ఇదే సందేహాన్ని గురువర్యుల ముందుంచాడు.

అప్పుడు బృహస్పతి ‘‘దేవేంద్రా! ఇప్పుడిక నీవే స్వయంగా వెళ్లి రమాపతిని ప్రార్థించి, సగౌరవంగా తోడ్కొని రావడం ఉత్తమం’’ అని సూచించాడు. దాంతో ప్రాణం కుదుటపడింది దేవేంద్రుడికి.

వెంటనే తన పరివారాన్ని వెంటబెట్టుకుని, నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ, వైకుంఠానికి వెళ్లాడు. వైకుంఠ ద్వారాలు తెరిచే ఉన్నాయి. పాలసముద్రం తెల్లగా తళతళలాడుతూనే ఉంది. ఆదిశేషువు తన పాన్పుతో సిద్ధంగానే ఉన్నాడు స్వామికి సేదదీర్చేందుకు. కానీ, నారాయణుడుంటేగా అక్కడ? ఒకవేళ ఆయనగారేమైనా ముక్కంటి వద్దకెళ్లాడేమోనన్న సందేహం వచ్చింది ఇంద్రుడికి. దాంతో అటునుంచి అటే కైలాసానికి పయనమయ్యాడు.

వెండికొండలు మిలమిలా మెరిసిపోతున్నాయి. మలయ మారుతం వీస్తోంది. సతీదేవి అద్భుతంగా గానం చేస్తుండగా, ఆనంద పారవశ్యంతో తాండవమాడుతున్నాడు శివయ్య. ఓం నమశ్శివాయ అంటూ భక్తితో దణ్ణం పెట్టి, తాము వచ్చిన కారణాన్ని విన్నవించారు స్వామికి.

తళతళలాడుతున్న అర్ధనిమీలిత నేత్రాలను మెరిపిస్తూ కేశవుడి జాడ తనకు తెలిసినట్లుగా తెలియజెబుతూనే, మూసి ఉన్న మూడవకన్నును అటూ ఇటూ ఆడిస్తూ, ‘‘నారాయణుడి జాడను కనిపెట్టడం అంత సులువేమీ కాదు, నీవే వెళ్లి వెదుకు’’ అంటూ తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు ఈశ్వరుడు.

దాంతో అటునుంచి అటే సత్యలోకానికి వెళ్లాడు శచీపతి. వీరి రాకను ముందే గమనించినట్లుగా బ్రహ్మదేవుడు తన దర్శనభాగ్యం కూడా కల్పించకుండానే ‘‘ఇంద్రా! నీవు వెంటనే భూలోకానికి వెళ్లి, అన్వేషించు శ్రీహరి నీకు కనిపిస్తాడు’’ అంటూ సరస్వతితో చెప్పించాడు.

ఉస్సురనుకుంటూ ఇంద్రుడు, పరివారమూ దివినుంచి భువిలో అడుగుపెట్టారు. అక్కడ అన్నిచోట్లా శ్రీహరి నిలువెత్తు కాంస్య విగ్రహాలు, పటాటోపపు పూజలు, ధగద్ధగాయ మానంగా మెరిసిపోతున్న రజత, సువర్ణ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి కానీ శ్రీహరి జాడ మాత్రం లేదు. ఇంతలోనే శ్రీమన్నారాయణుని లీలాగానం దివ్యంగా చెవిసోకింది. దాంతో దృష్టి అటు సారించి విస్మయంతో, తన కన్నులను తానే నమ్మలేనట్లుగా చూశాడు దేవేంద్రుడు.

అక్కడ ఒక చర్మకారుడి చేతులు మాత్రం ఎవరివో చెప్పులు కుడుతున్నాయి. మనస్సు, వాక్కు మాత్రం శ్రీహరి మీదనే లగ్నమై, దివ్యంగా గానం చేస్తున్నాడు. మైమరచిపోయి వింటూ, పారవశ్యంతో తలపంకిస్తున్నాడు హరి. అప్పుడర్థమైంది ఇంద్రుడికి స్వామికి కావలసింది ఆడంబరపూజలు, కపట భక్తీ, హంగులూ, ఆర్భాటాలూ కావని, నిర్మల భక్తి, నిరాడంబర పూజలకే ప్రసన్నుడవుతాడనీ! పాహి పాహి అంటూ హరి చరణ కమలాలను పట్టుకున్నాడు ఇంద్రుడు.

భగీరథప్రయత్నం

వెండికొండమీద అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు పార్వతీపతి. ఇంతలో తననెవరో ఆర్తితో పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఎవరా ఆ పిలుస్తున్నది అని తరచి చూశాడు. భూలోకంలో భగీరథుడనే మహారాజు తనకోసం తీవ్రమైన తపస్సు చేస్తూ, కనిపించాడు. అతని తపస్సులోని నిస్వార్థాన్ని తెలుసుకున్న ముక్కంటి క్షణం కూడా ఆలసించకుండా వెంటనే వెళ్లి భగీరథుడి ముందు నిలిచాడు.

‘‘వత్సా! నీ తపస్సు నన్ను మెప్పించింది. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు మేఘగంభీరమైన స్వరంతో పరమేశ్వరుడు.
ఉలిక్కిపడి కన్నులు తెరిచాడు భగీరథుడు. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ, అభయ హస్తంతో సాక్షాత్కరించిన ముక్కంటిని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో  నోటమాట రాలేదు భగీరథునికి.

భక్తిపారవశ్యం నుంచి తేరుకున్న తర్వాత తానెందుకోసం తపస్సు చేసిందీ శివుడితో చెప్పసాగాడిలా ‘‘సర్వజ్ఞులైన మీరు ఎరుగనిది కాదు నా గాథ. అయినా, చెప్పడం నా ధర్మం.  సుమారు లక్షసంవత్సరాల క్రితం సగరుడనే చక్రవర్తి లోకకల్యాణం కోసం అశ్వమేధ యాగం యాగం చేశాడు. చివరలో యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. దానిని అనుసరించి, ఆ రాజుకు జన్మించిన 60 వేలమంది కుమారులూ వెళ్లేవారు. అది అన్ని రాజ్యాలకూ వెళ్లి, యథేచ్ఛగా సంచరించేది. ఆయా రాజులందరూ దాని రాకను గౌరవించి, సగరుడికి సామంతులుగా మారి పోయేవారు. చివరికో రోజున ఆ అశ్వం రాజపుత్రులందరి కళ్లూ కప్పి, ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లింది. రాజుకీవిషయం తెలిసి, దాన్ని వెతుక్కురమ్మని కుమారులను పంపాడు. అశ్వం లేకుండా రాజ్యంలోకి అడుగుపెట్టనివ్వనని చెప్పాడు.

రాజకుమారులు యాగాశ్వం కోసం భూమండలమంతా వెదికినా ప్రయోజనం లేకపోవడంతో పాతాళంలో వెదకాలని నిశ్చయించుకుని ఒక్కొక్కరు ఒక్కో యోజనం చొప్పున భూమిని తవ్వుతూ పాతాళంలోకి ప్రవేశించారు. ఆశ్చర్యం! వారికి పాతాళంలో వారి అశ్వం ఒక బయలులో పచ్చిక మేస్తూ కనిపించింది. దాని చెంతనే కపిలముని తపస్సులో నిమగ్నమై ఉండటం చూసి, ఆయనే తమ అశ్వాన్ని బంధించాడేమోనని భావించి, ఆయన గడ్డం పట్టుకుని లాగారు. తపోభంగం కావడంతో కళ్లు తెరిచి వారి వంక చుర్రున చూశాడు కపిలముని. ఆ కన్నుల నుండి అగ్నికీలలు వెలువడి వారందరూ బూడిద కుప్పలుగా మారిపోయారు. సగరపుత్రులు ఎంతకాలానికీ రాజ్యానికి చేరుకోకపోవడంతో వారికోసం అన్వేషిస్తూ వారి వారసుడైన అంశుమంతుడు పాతాళ లోకానికిళ్లాడు. అక్కడ బూడిద కుప్పలుగా మారిన పితరుల భస్మరాశులను, పక్కనే తపోధాన్యంలో లీనమై ఉన్న కపిలమునిని చూసి, విషయం గ్రహించి, మునిని ప్రార్థించాడు.

అప్పుడు ముని, శివుని శిరస్సుపై ఉన్న గంగ వచ్చి, వీరి భస్మరాసులపై ప్రవహిస్తే వీరికి మోక్షం కలుగుతుందని చెప్పాడు. నాటి నుంచి మా వంశంలోని వారందరూ గంగను భువికి రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరికి నేను ఎలాగైనా సాధించాలని మిమ్ములను ప్రార్థించాను స్వామీ, కాబట్టి దయచేసి మా పితరులకు సద్గతులు కలగడంతోపాటు, అందరి పాపాలనూ ప్రక్షాళన చేయగల పరమ పావనమైన గంగను దయచేసి నాతో పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను’’ అని కోరాడు.  

అతని వినయానికి, పట్టుదలకు ముగ్ధుడైన శివుడు ‘‘భక్తా! గంగను నీ వెంట పంపడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు కానీ, దివి నుంచి జాలువారే గంగాప్రవాహ ఉద్ధృతిని తట్టుకోవడం ఎవరి తరమూ కాదు, గంగా ప్రవాహంతో భూమిలో ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. అందువల్ల నేను ఇక్కడే కూర్చుని, గంగాప్రవాహ వేగాన్ని నా జటాజూటాలతో నిలువరిస్తాను’’ అని వరమిచ్చాడు.

మాట మేరకు శివుడు దివి నుంచి మహోద్ధృతవేగంతో దుముకుతున్న గంగను తన జటాజూటాలతో బంధించి, ఏడు పాయలుగా చేసి, భూమి మీదకు వదిలాడు. అయినప్పటికీ గంగాప్రవాహ వేగానికి జహ్నుమహర్షి ఆశ్రమం మునిగిపోవడంతో ఆయన కోపించి, గంగను ఒక్క గుక్కలో ఔపోసన పట్టేశాడు. భగీరథుని ప్రార్థనకు తన చెవి నుంచి వదిలిపెట్టాడు. జాహ్నవిగా మారిన గంగ అనేక దేశాలు, రాజ్యాలు, నగరాలు దాటుకుంటూ వచ్చి, చివరికి భగీరథుడి ముత్తాతల భస్మరాశుల మీద ప్రవహించి, వారికి ఉత్తమ గతులు కల్పించింది. అలా దివి నుంచి గంగను భువికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి నందువల్ల భగీరథ ప్రయత్నమనే నానుడి ఏర్పడింది. అలాగే భగీరథుని అనుసరించి వచ్చింది కనుక గంగకు భాగీరథి అనే పేరు స్థిరపడింది. పరమశివుని భక్తవత్సలతను, ఒక మంచి ప్రయత్నం చేయడానికి ఎన్నో ఆటంకాలను, అవరోధాలను అధిగమించాలని ఈ ఉదంతం నిరూపిస్తోంది.

పరమ శివుడు అవతారాలు

19 అవతారాలుతో దర్శనమిచ్చే పరమ శివుడు

సాదారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజానికి శివునికి 19 అవతారాలు ఉన్నాయి.

దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది. శివుని గురించి మాట్లాడితే, మాకు 19 అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. శివుని యొక్క19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ అవతారాల గురించి తెలుసుకుందాం .

పిప్లాద్ అవతారం: 
శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్ గా జన్మించెను. అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయెను. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొనెను. అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించెను. 
తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించేను. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకుడదని చెప్పెను. అందువల్ల శివడుని పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు.

నంది అవతారం: 
నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు. ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది. రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకొని ఉంటారు.

వీరభద్ర అవతారం:
సతీ దేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత,శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రెంపి మైదానంలోకి విసిరెను. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. అతను పుర్రెల దండ ధరించి, భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్ళతో ఒక డార్క్ దేవుడుగా కనపడతారు. శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను త్రెంచబడింది.

భైరవ అవతారం:
శివుడు, బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పట్టింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్దం చెప్పిన సమయంలో,శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేను. బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసెను. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్పుతారు.

అశ్వత్థామ అవతారం: 
క్షీరసాగర మథన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకొనెను. అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది.లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతావని వరం ఇచ్చెను. మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పెను. అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించెను.

శరభ అవతారం :
శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి,మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివ పురాణం ప్రకారం, విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తెను .

గ్రిహపతి అవతారం: 
శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించెను. విశ్వనర్ అతని కొడుకుకు గ్రిహపతి అనే పేరు పెట్టెను. గ్రిహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లితండ్రులకు చెప్పెను. అందువలన,గ్రిహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళెను. గ్రిహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను.

దుర్వాస అవతారం: 
శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ది గాంచారు.

హనుమాన్ అవతారం: 
హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి. రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు.

వృషభ అవతారం :
సముద్ర మంథనం తర్వాత, ఒకసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళలు పట్ల తీవ్రమైన మొహాన్ని కలిగి ఉండెను. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు. 
కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేదించటం ప్రారంభించారు. అప్పుడు లార్డ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణు మూర్తి యొక్క కుమారులను చంపివేసెను. అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చెను. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత,అతను అతని నివాసం తిరిగి వెళ్ళిపోయెను.

యతినాథ్ అవతారం: 
ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతను,అతని బార్య శివుని యొక్క భక్తులు. ఒక రోజు శివుడు యతినాథ్ రూపంలో వారికీ దర్శనం ఇచ్చెను. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ ను లోపల పడుకోమని చెప్పెను. దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు.ఉదయం, ఆహుక్ చనిపోయినట్లు కనుకొని, తను కూడా చనిపోవాలని నిర్ణయించుకొనెను. అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మ లో ఆమె మరియు ఆమె భర్త నల మహారాజు మరియు దమయంతిలుగా జన్మిస్తారని చెప్పెను. అప్పుడు వారు శివునిలో ఐక్యం అయ్యారు .

కృష్ణ దర్శన్ అవతారం :
శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను ఈ లోకానికి తెలియచేయడానికి  ఈ అవతారం జరిగింది.

భిక్షువర్య అవతారం :
శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగెను.

సురేశ్వర్ అవతారం: 
శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఈ అవతారంను సురేశ్వర్ అవతారం అని చెప్పుతారు.

కిరీట్ లేదా వేటగాడు అవతారం :
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను. దుర్యోధనుడు అర్జునుడుని చంపటానికి మూక అనే రాక్షసుణ్ణి పంపెను. మూక ఒక పంది రూపంలో వచ్చెను. అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా,తన ఏకాగ్రతను భంగపరస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చెను. అప్పుడు కళ్ళు తెరచి మూకను చూసేను. అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేసెను. ఇద్దరు కలిపి పందిని ఓడించెను. అర్జునుడుతో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను. అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యంను మెచ్చి పాశుపత అస్త్రంను బహుమతిగా ఇచ్చెను.

సుంతన్ తారక అవతారం: 
శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి హిమాలయా నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తేను.

 బ్రహ్మచారి అవతారం: 
పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో,శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను.

యక్షేశ్వర్ అవతారం: 
శివుడు దేవతల యొక్క మనస్సులలోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం జరిగేను.

అవధూత్ అవతారం: 
ఇంద్రుని యొక్క అహంకారంను తగ్గించటానికి శివుడు ఈ అవతారంను తీసుకున్నారు.

మహాశివరాత్రి రోజు

మహాశివరాత్రి రోజున శివార్చన, ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత

ప్రతీ రోజు నిత్య శివరాత్రి. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి,మాస శివరాత్రి. మాఘ మాసం లో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది “మహా శివరాత్రి”.

మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే “మహా శివరాత్రి”. శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు.

శివార్చన :
తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.ముఖ్యంగా శివాలయం గోపుర శిఖరదర్శనం చేసుకున్న తరువాత శివాలయంలోపల శివలింగంను దర్శించుకుంటే మంచిది . ఈ రోజున పేదవారికి అన్నదానం,వస్త్రదానం చేయాలి.

రుద్రాభిషేకం
వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే “రుద్రాభిషేకం” (Rudrabhisheka) అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్ర
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

ఉపవాసం :
ఉపవాసమంటే మనసులో శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని వయసు అయినవారు,షుగర్ ఉన్నవారు అనారోగ్యంతో భాదపడుతున్నవారు ఆహారం తీసుకోకుండా శరీరాన్నిబాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది.

జాగరణ:
నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని హిందువుల విశ్వాసం. ఈనాడు చేసే జాగారాన్ని ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివాలయంలో కూర్చుని శివాలయంలో నిర్వహించే అభిషేకాలు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో చేసే అభిషేకం చూడడం శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుంది.

జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివపురాణములతో ఇవన్నీ చేయలేకపోయిన ఒక్క ఓం నమఃశివాయ అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామంలలో శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని ప్రజల విశ్వాసం.

ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి.

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో 14వ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది .

ఈ రోజున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నోరకాల పుణ్య స్నానములు, దానములు, పుష్ప, నైవేద్యం సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి.

ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

శివరాత్రితో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.

మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. ఆ కధ – "ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం ఆ చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట ఆకలితో భాధ పడుతూ ఒక వ్యక్తి కనిపించగా అతనికి తనదగ్గర ఉన్న ఆహారం ముందు అతడికి ఇచ్చి తర్వాత తన కుటుంబసభ్యులు తను తిన్నాడు. ఆ వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వవృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరిక ఆహారం సమర్పించి తను సేవించాడు.

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని అందుకే పరమ శివుడును అభిషేకప్రియుడు అని పిలుస్తారు. శివుడికి అర్చన చేసే ఆర్ధికస్తోమత లేనివారు శివలింగం మీదు కొంచం నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు.

శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన శివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ,ఒడుదొడుకులు తొలగిపోతుంది.

ఎలాంటి లింగాలని ఏ మాసంలో

ఎలాంటి లింగాలని ఏ మాసంలో పూజిస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారు?

లింగపురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని పూజించాలని,
శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్ని అభిషేకించాలని,
వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్ని అర్చించాలి.
స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు.
స్త్రీలు మాత్రం భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాన్ని పూజించాలని అలాగే భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాన్ని కాని అర్చిస్తే మంచిదని లింగపురాణం చెబుతోంది.
అయితే స్త్రీలు అన్ని వయస్సుల వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.



shivalingam types



ఏ లింగాన్ని పూజచేస్తే ఏం ఫలితం పొందవచ్చును:
ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏ ఫలితముంటు౦దొ కూడా లింగ పురాణం వివరించింది.
రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦ మరియు వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది.
ధాతుజ లింగం భోగ విలాసాలనిస్తుంది.
మృత్తికా లింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.
కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది.
అన్నిటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహ లింగం.

ఏ మాసంలో ఈ లింగాన్ని పూజించాలి :
ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది.
వైశాఖంలో వజ్రలింగాన్ని
జ్యేష్ట౦లోమరకత లింగాన్ని
శ్రావణంలో నీలపు లింగాన్ని
భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని
ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని
కార్తికంలో ప్రవాళలింగాన్ని
మార్గశిరంలో వైడూర్య లింగాన్ని
పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని
మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని
ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి.

అయితే ప్రస్తుత కాలంలో అందరూ కూడా యాంత్రిక జీవనం అయిపోయింది కాబట్టి అందరకీ ఆ ఆ మాసాలులో లింగాల దగ్గరకు పోయి పూజ చేయటం వీలుపడకపోవచ్చు ఆర్దికంగా కొతమంది, సమయం దొరకక కొంతమంది,ఆరోగ్యం సహకరించలేకపోవడం వలన కొంతమంది, ముసలివారు  చెయ్యలేకపోవచ్చు వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను మీ దగ్గరలో ఉండే శివాలయాలలో కూడా పూజించవచ్చు.

అతి పవిత్ర బాణలింగం:
అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి.

స్థాపర, జంగమ లింగాలు :
జగత్తంతా శివమయం, అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరూపమైనప్పుడు, సృష్టి స్థితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి - పర్వతాలు, చెట్లు  మొదలైనవి), జంగమాలు(కదిలేవి -మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి) కూడా లింగరూపాలే అవుతాయి. వీటికి స్తావరలింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా శివపుజలోకే వస్తుంది.

వైతరణి నదిలో జరిగే భయంకరమైన నిజాలు

గరుడపురాణంలో మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైనది ఈ వైతరణి గురుంచి ఇది ఒక నది.. పేరులో ఉన్న గమ్మత్తు నధిలో ఉండదు..  మనిషి మరణించిన అనంతరం చేసిన పాపానుసారం నరకానికి వెళతారని గరుడ పురాణం సారంశం. 

ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాద వర్ణనాతీతం.
అది నూరు(100) యోజనాల వెడల్పు ఉంటుంది ఈ నది కొన్ని వేల మైళ్ళ వెడల్పు కలిగి ఉన్నది.
 అందు పాపులు మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తుంటారు. 

అంతే కాక మరణానంతర క్రియలు,
యమలోక వివరణ, 
నరకలోకం, 
బలవన్మరణము, 
వివిధ దానములు, 
జనన మరణాదికము,
యమలోక బాధలు మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం.

ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని ఉంటాయి.

సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.

గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. 

పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.

హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట.

తప్పు చేసినవారు వైతరణి దాటాల్సిందే..
ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, 
నెత్తురు,
ఎముకలు, 
కేశాలు, 
ప్రేతాల గుంపులు, 
ముసురుకుంటున్న ఈగలు, 
క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి.
 ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు.

అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు.
అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో.. . అవి చదివితే భయపడడం సహజమే. అందుకే గరుడపురాణం ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. కాని అన్ని పురాణాల్లా దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వాలంటే హంస ప్రతిమతో కలిపి ఇవ్వాలి అని శాస్త్రవచనం .


Thursday, 9 February 2017

చిరంజీవి అశ్వత్థామ!





చిరంజీవి అశ్వత్థామ!

కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు. కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు. భీముడికి, దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. భీముడు చివరకి దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. తొడలు విరిగి, చచ్చిన పులిలా పడున్న దుర్యోధనుడిని చూసి అమితంగా బాధపడ్డాడు. 


‘‘ఎలాగైనా సరే, నీకు సంతోషాన్ని కలిగిస్తాను’’ అని శవసాక్షిగా ప్రతిజ్ఞ చేసి, వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లాడు. 

శిబిరంలో అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న ఉపపాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి, దుర్యోధనుడి దేహం ముందు పడవేసి, ప్రభు రుణం తీరిపోయినట్లుగా భావించి, శ్రద్ధాంజలి ఘటించాడు. 

తెల్లవారింది. 

ఉపపాండవుల మరణవార్త వ్యాపించింది. పాండవుల శిబిరాలన్నీ దుఃఖంతో గొల్లుమన్నాయి. పాండుపుత్రుల తల్లి ద్రౌపది తీవ్ర దిగ్భ్రాంతికిలోనై, కుప్పకూలిపోయింది. 

అర్జునుడు ముందుగా తనను తాను దిటవు పరచుకున్నాడు. తర్వాత మెల్లగా ద్రౌపదిని లేపి, ‘‘పాంచాలీ! సుక్షత్రియ వంశంలో పుట్టి, వీరాధివీరులైన పాండవులకు పత్నిగా ఉన్న నీవు ఇంతగా దుఃఖించడం తగదు. దుర్మార్గుడైన అశ్వత్థామ అర్ధరాత్రప్పుడు దొంగచాటుగా శిబిరంలో దూరి పసిబిడ్డలైన ఉపపాండవులను మరచి తన పొట్టన పెట్టుకున్నాడు. ఇందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నేను ఇప్పుడే వెళ్లి, ఆ ధర్మభ్రష్టుని శిరస్సును ఖండించి తీసుకు వచ్చి, నీ కాళ్లముందు పడవేస్తాను. నువ్వు ఆ నీచుని తలను నీ కాళ్లతో తొక్కి, ఛిద్రం చేసి, నీ శోకాన్ని బాపుకో’’ అని ఓదార్చాడు.

అర్జునుడి మాటలు విన్న ద్రౌపది మనస్సు కొద్దిగా ఊరట పొందింది. బలంగా ఒక నిట్టూర్పు విడిచి, పక్కనే ఉన్న శ్రీకృష్ణుని వంక భావగర్భితంగా చూసింది. అప్పుడు కృష్ణుడు రథాన్ని సిద్ధం చేసి, అర్జునుడిని రథంలో కూర్చుండబెట్టుకుని, ఆ రథానికి పూన్చిన గుర్రాలను అదిలించాడు. దూరంగా వస్తున్న పార్థుడి రథాన్ని చూడగానే అశ్వత్థామ ప్రాణభయంతో పరుగెత్తి సమీపంలోనే ఉన్న ఓ నీటిమడుగులో దాక్కున్నాడు. దిక్కుతోచని స్థితిలో ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియనటువంటి మహా శక్తిమంతమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం వింతకాంతులు చిమ్ముకుంటూ శరవేగంగా అర్జునుడిని సమీపించసాగింది.

కృష్ణుడు ‘‘పార్థా! ఇది బ్రహ్మశిరోనామకాస్త్రం. దీనిని ఎదుర్కొనాలంటే తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాలి.’’ అని చెప్పాడు.

నిప్పులు కక్కుతూ తనమీదకు దూసుకొస్తున్న ఆ అస్త్రాన్ని నిలువరించేందుకు తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ రెండు అస్త్రాలూ ఒకదానినొకటి ఢీకొనడంతో భూనభోంతరాళాలు దద్దరిల్లేట్లు శబ్దాలు వచ్చాయి. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. తీవ్రమైన అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. శ్రీకృష్ణుని సూచన మేరకు అర్జునుడు ఉపసంహార మంత్రం పఠిస్తూ ఆ అస్త్రానికి భక్తితో ప్రణమిల్లాడు. వెంటనే రెండు అస్త్రాలూ శాంతించి, అర్జునుడి అమ్ములపొదిలో చేరిపోయాయి. నోరు వెళ్లబెట్టి ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయిన అశ్వత్థామ మీదకు సింహంలా లంఘించి, అతణ్ణి తాళ్లతో బంధించి, రథానికి కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ద్రౌపది ముందు పడేశాడు.

ద్రౌపది అతనికి చేతులు జోడించి, ‘‘శిశువులను చంపడానికి పచ్చినెత్తురు తాగే రాక్షసులు సైతం వెనకాడతారే, అలాంటిది గురుపుత్రులు, ధర్మాధర్మాలు తెలిసిన వారయి ఉండీ కాస్తంత అయినా కనికరం లేక అమాయకులైన పసిబిడ్డలను చంపడానికి మీకు చేతులెట్లా వచ్చాయి? మీ గుండె అంత బండరాయిగా ఎలా మారింది..’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ద్రౌపదిని వారిస్తూ, ‘‘ఉచ్చనీచాలు మరచిన పాషాణం లాంటి ఈ దుర్మార్గుడితో ఇంకా మాటలెందుకు?’’ అంటూ కత్తిదూసి అశ్వత్థామను చంపబోయాడు పార్థుడు.

అప్పుడు ద్రౌపది ‘‘వీరాధివీరులైన మీరు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతణ్ణి చంపితే ఇక మీకూ అతనికీ తేడా ఏముంది? దయచేసి వదిలేయండి’’ అంటూ దణ్ణం పెట్టింది.

‘‘మరి నా ప్రతిజ్ఞ ఎలా....’’ అంటున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు, ‘‘పార్థా! ఇతని తల గొరిగి, అతన్ని క్షమించి వదిలెయ్‌’’ వీరుడికి అది శిరచ్ఛేదంతో సమానం’’ అని చెప్పి, అశ్వత్థామవైపు తిరిగి, ‘‘ఓరీ! నీవు చేసిన పనికి ఒళ్లంతా కుళ్లిపోయి, రక్తమాంసాలతో కంపుకొడుతూ చావు కోసం ఎదురు చూస్తూ ఈ యుగమంతా ఇలాగే జీవిస్తావు’’ అని శపించాడు.

అశ్వత్థామ ఆ విధంగా చిరంజీవి అయ్యాడు. నాటి నుంచి కురుక్షేత్రంలో చావలేక, చావురాక, క్షణ క్షణం చస్తూ బతుకుతున్నాడు. అయినా, చావుకన్నా అదే సరైన శిక్ష కదా అశ్వత్థామకు.

– డి.వి.ఆర్‌.భాస్కర్‌



Wednesday, 8 February 2017

హిడింబి







హిడింబి

సృష్టి మనుగడ మనిషితోనే సాధ్యపడుతుంది. మరి మనిషి మనుగడ ఇచ్చిపుచ్చుకోవడంతో తృప్తిపడుతుంది. ఇది విశ్వజనీన సత్యం. కానీ తీసుకోవడంలో చూపించే ఆసక్తి, శ్రద్ధ ఇవ్వడంలో వెనక్కి తగ్గుతాయి. వాటి స్థానంలో గర్వం, హేళన, స్వార్థం పేరును అడ్డుపెట్టుకొని ఇవ్వడంలోని ఆంతర్యాన్నే మార్చేస్తున్నాయి. ఒక చేత్తో ఇచ్చిన విషయం మరో చేయికి కూడా తెలియకూడదని చెప్పారు మన పెద్దలు. అంటే ఇవ్వడం అనేది ఒక నిగూఢమైన హుందాతనం. దాన్నే చులకన చేస్తే మనం ఇచ్చినా లాభమేమీ ఉండదు. ప్రపంచం, ప్రకృతి, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మనిషి విలువనూ, మనసు స్వచ్ఛతనూ ఎరిగిన గొప్పవాళ్లు, స్నేహం - ప్రేమ-సహృదయత గలిగిన మహనీయులు... వీరికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. ఎంతసేపూ ఇవ్వాలనే తాపత్రయం తప్ప, బదులు తీసుకోవాలనే తలంపేరాని తత్వం లోకంలో విశాల దక్పథమై నిన్న, నేడు, రేపు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం అనుభవైకవేద్యమేగానీ అనిర్వచనీయం. కానీ హిడింబి పాత్ర ఇవ్వడంలోని మాధ్యుర్యాన్నీ, ఔదార్యాన్నీ, గొప్పతనాన్నీ పరిచయం చేసింది.

భారతంలో ఘటోత్కచుని వంటి మహావీరుని తల్లిగా, భీముని ఒకానొక భార్యగా, రాక్షసజాతికి చెందిన స్త్రీగా చరిత్రకు పరిచయమైన హిడింబి వ్యక్తిగత విశేషాలు తనకంటూ ప్రత్యేకంగా కేటాయించుకోనే లేదు. పాండవుల శ్రేయస్సు కోసం తన జీవితాన్నే అంకితం చేసింది.లక్క ఇంటి నుంచి ప్రాణాలు దక్కించుకొని అడవుల్లో నడుస్తూ, నడుస్తూ అలసి సొలసి ఒక మర్రిచెట్టు నీడలో సేదతీరుతారు కుంతీ పాండవులు. తల్లీ, సోదరులూ నిద్రపోతుంటే రెప్పవాల్చకుండా కాపాలా కాస్తుంటాడు. మనుషుల వాసనతో వారెక్కడున్నారో తెలుసుకోగల శక్తిమంతుడు హిడింబాసురుడు. అతని చెల్లెలే హిడింబి. కుంతీ పాండవుల వాసనతో హిడింబాసురుని ఆకలి మరింత పెరిగింది. వారి జాడ చెప్పి, వారిని చంపి తెచ్చి తనకు వండిపెట్టుమని హిడింబిని పురమాయిస్తాడు హిండిబాసురుడు. నరమాంస భక్షణ ఇన్నాళ్ళకు కడుపారా దొరికిందనీ వారిని చంపి తెమ్మని మరీమరీ హిడింబితో చెబుతాడు హిడింబాసురుడు.హిడింబి అన్న ఆజ్ఞానుసారం మర్రిచెట్టు నీడన ఉన్న కుంతీపాండువులను ఓ చెట్టు చాటు నుంచి చూసింది. కుంతీదేవి, తన నలుగురు సోదరులూ నిద్రలో ఉంటే కాపాలాకాస్తున్న భీముని చూసింది హిడింబి. భీమునిలోని ధైర్యం, పరాక్రమం, రౌద్రం భుజబలం ప్రపంచమంతా గుర్తించింది. వేనోళ్ళ కీర్తిస్తుంది. కానీ ఆ మహాకాయంలోను ఒక మనసుంటుందనీ, తన వారిపైన తాను చూపించే ప్రేమ నిబద్ధతనూ, సహృదయతనూ అర్థం చేసుకున్న ఏకైక స్త్రీ హిడింబి. భీమున్ని చూసి మనసులోనే వరించి, ఒక అందమైన స్త్రీగా మారి భీముని ముందుకు వెళుతుంది. నా అన్న మిమ్ములను చంపి తీసుకురమ్మన్నాడనీ, ఆలస్యం అయితే తనే వచ్చి మిమ్మల్నందరినీ నిమిషాల్లో నమిలి మింగేస్తాడనీ, నేను నిన్ను వరించాను కనుక నీ చావునూ, నీతో పాటు నీ వారి బలినీ చూడలేననీ, అనుమతిస్తే మిమ్ములందరినీ అమాంతం ఎత్తుకెళ్లి సురక్షిత ప్రాంతంలో దిగబెడుతాననీ అంటుంది హిడింబి. భీముడు అందుకు ఒప్పుకోకపోవడం, హిడింబాసురునితో యుద్ధం, ఆ రాక్షసున్ని మట్టుపెట్టడం, హిడింబినీ చంపే ప్రయత్నం చేస్తుండగా ధర్మరాజు స్త్రీని చంపడం భావ్యం కాదని వారించడం జరిగాయి. కుంతీదేవితోనూ, ధర్మరాజుతోనూ నేను భీమసేనున్ని ఇష్టపడుతున్నాను. అన్నింటినీ వదిలి తన కోసం వచ్చేశాను. పైగా మీ మంచి కోరి నాకళ్ళముందే నా అన్ననూ పోగొట్టుకున్నాను. నేను రాక్షసజాతికి చెందిన దాన్ని అనుకోకండి. నేను హక్కును కాదు. కేవలం భీముని ప్రేమను మాత్రమే కోరుకుంటున్నానని నిర్భయంగా చెబుతుంది హిడింబి.

హిడింబి మాటల్లోని నిజాయితీని గమనించిన కుంతీ, ధర్మరాజు భీమునితో హిడింబిని భార్యగా అంగీకరించమని చెబుతారు. కుంతీ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళేవరకూ వారితోనే ఉండి, తర్వాత అక్కడి నుంచి వారి జీవితాల్లోంచి దూరంగా వెళుతుంది. పైగా వారితో కలిసి ఉన్నప్పుడే ఇక్కడి నుంచి కాస్త దూరంగా వెళితే సరోవరం ఒకటి ఉంటుందనీ దాంట్లోని నీరు తాగితే అరణ్యవాస కాలంలో శీతోష్ణవర్షాది బాధలుండవు. పైగా వ్యాసుడే మిమ్మల్ని కలిసి దారి చూపుతాడనీ వారికి ధైర్యం చెబుతుంది. హిడింబికి భూతవర్తమాన భవిష్యత్ కాలాలను గురించి తెలుసుకోగల శక్తి ఉంది.హిడింబి పాండవులతో ఉన్నన్నాళ్లూ వారికీ, కుంతీదేవికీ సేవచేసింది. భీముని ముక్కోపాన్ని సంభాళించింది. అతన్ని ప్రేమగా చూసుకుంది. అపరిమిత బలపరాక్రమాలు గల కుమారుడు ఘటోత్కచుని భీమపుత్రునిగా అందించింది. ఘటోత్కచునికి పాండవులంటే మహాగౌరవం. వారు తలుచుకున్నప్పుడల్లా వారి ముందు ప్రత్యక్షమవుతానని మాటిస్తాడు. హిడింబి తనలోని తనను భీమునికి ఇచ్చేసింది. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు.

లోకంలోని అన్యాయాన్నీ, కుట్రలనూ చూసి తట్టుకోలేని అసహనమే భీముని ఆక్రోషం తప్ప, నిజంగా భీమునిలోని సున్నితత్వం, ధర్మ చింతనను సరిగ్గా అర్థం చేసుకున్న స్త్రీ హిడింబి. తనకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. ఇవ్వడంలోని ఆనందానికి తననే నిర్వచనంగా మలుచుకున్న రాక్షసజాతి ఆణిముత్యం హిడింబి.

ప్రమద్వర




హిరణ్యాక్షుడు - శ్రీహరి వరాహావతారం



హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేశాడనీ, అప్పుడు శ్రీహరి వరాహావతారం దాల్చి, భూమిని పైకి లేపి, వాడిని సంహరించాడంటారు కదా, మరి అప్పుడు భూమి ఉన్న ప్రదేశం ఏది?
మనకున్న పధ్నాలుగు లోకాల్లోనూ, ఏ లోకానికి ఆ లోకం కొంత కొంత ప్రాణి సమూహంతోనే ఉంది. మనం ఈలోకానికి చెందినవాళ్లం కాబట్టి భూమిని చుట్టి పడేశాడని చెప్పగానే అసలు భూమే లేదని భావిస్తాం. శ్రీమద్రామాయణంలో సగర పుత్రులు భూమిని తవ్వుకుంటూ పాతాళం వరకూ వెళ్లారని ఉంది. మరి వాళ్లెక్కడ నిలబడగలిగారు భూమి లేకపోతే? 
కాబట్టి ఏ లోకానికి సంబంధించిన ప్రాణులు ఆ లోకంలో తిరుగాడేందుకు వీలుగా అక్కడ కూడా భూమి ఉందన్నమాట.

Friday, 3 February 2017

అంతా ఆదిత్యమయం

అంతా ఆదిత్యమయం!
కనిపిస్తాడు. కరుణిస్తాడు. కిరణాల భరణాలు కురిపిస్తాడు. భౌతికదృష్టితో చూస్తే - మండుతున్న అగ్నిగోళం, వైజ్ఞానిక నేత్రాలతో పరికిస్తే - ఒకానొక నక్షత్రం, ఉపాసనా దృక్కులతో దర్శించుకుంటే- సప్తాశ్వరథమారూఢం! ఈ మూడుకోణాల్నీ మిళితం చేస్తేనే... ప్రత్యక్ష భగవానుడి పరిపూర్ణతత్వం బోధపడేది (ఫిబ్రవరి 3న, రథసప్తమి).



నీ మండలం రుగ్వేదం.
నీ దేహం యజుర్వేదం.
నీ కిరణాలు సామవేదం.
- మంత్రమహార్ణవ వర్ణనం

ప్రభాతంలో బ్రహ్మ స్వరూపానివి.
మిట్టమధ్యాహ్నం మహేశ్వర తత్వానివి.
సంధ్యాసమయంలో సదా విష్ణుమూర్తివి.
- బ్రహ్మాండాది పురాణ ప్రశస్తి

ఓం ఆదిత్యాయ విద్మహే
సహస్ర కిరణాయ ధీమహి
తన్నో సూర్య ప్రచోదయాత్‌
- ఉపనిషత్‌ వాక్కు

అదిగదిగో బాలభానుడు....
లేతమొగ్గ విచ్చుకుని పువ్వవుతుంది, గూట్లో ఒదిగి కూర్చున్న గువ్వపిల్ల రెక్కలల్లార్చుకుని గాల్లోకి ఎగురుతుంది, గాజుముక్కలా నిస్తేజంగా నీటి మీద పడున్న మంచుబిందువు ముత్యమై మెరుస్తుంది. చీకటి బూచికి భయపడి అమ్మను చుట్టేసుకుని పడుకున్న పసివాడు బుడిబుడి అడుగులేస్తూ ధైర్యంగా వీధిలోకొస్తాడు. నిన్నటి అలసటను మరచిన రైతన్న భుజానికి నాగలెత్తుకుని ఉత్సాహంగా పొలానికి బయల్దేరతాడు. కార్ఖానాకు వెళ్లాల్సిన శ్రామికుడు తూర్పు గోడ మీద వేలాడుతున్న గడియారాన్ని గమనిస్తూ పనులు చేసుకుంటాడు. పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థికైతే ఆ బింబం బెత్తంపట్టుకున్న ఉపాధ్యాయుడిలా కనిపిస్తుంది. అప్పటికే అమ్మ, వంటింట్లో ఓ పాతిక రొట్టెల సూర్యులను సృష్టించి ఉంటుంది.

ఆ ప్రభాత కిరణాలు మోసుకొస్తున్నది... ఒట్టి వెలుతుర్నో, వెచ్చదనాన్నో కాదు - అపారమైన ప్రాణశక్తిని. ఆ అనంత అమృతరశ్ముల్ని పంపినవాడు - భాస్కరుడు, ప్రభాకరుడు, విభాకరుడు...సూర్యనారాయణుడు!

ఆ కాలపురుషుడిని వేదాలు కొలిచాయి. ఉపనిషత్తులు ఉపాసించాయి. పురాణాలు ప్రస్తుతించాయి. మానవుడికైతే అతడు నడయాడే పరమాత్మ! సూర్యుడితో మనిషి అనుబంధం రాతియుగాల నాటికే బలపడిపోయింది. సూర్యాస్తమయం కాగానే, దారితప్పిన లేగదూడలా బెంబేలెత్తిపోయేవాడు. చిటారు కొమ్మ మీదో, చీకటి గుహలోనో నక్కినక్కి దాక్కునేవాడు. ఏ సింహాలో పీక్కుతింటాయన్న భయం, ఏ విషసర్పాలో కాటేస్తాయన్న వణుకు. వెలుతురు కిరణాలు వెచ్చగా ఒంటిని తాకగానే, ఎవరో వెన్నుతట్టి అభయమిచ్చినంత ధైర్యం వచ్చేది. విల్లంబులు ధరించి బయల్దేరేవాడు. ఇక, పొద్దువాలే దాకా నిస్సందేహంగా అడవి అతడిదే, వేటా అతడిదే! ఆ కృతజ్ఞత కొద్దే భాస్కరుడిని తొలి దేవుడిగా గుర్తించాడు.

బాలభానుడు....
కాలసాక్షి గాథ బ్రహ్మపురాణంలో ఉంది. కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి... ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. ‘బిడ్డని ఆకలితో చంపేస్తావా?’ అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే... లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి... రథసప్తమి! ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.

అవక్ర పరాక్రముడైన పసివాడి నాయకత్వంలో అసురసేనల్ని సునాయాసంగా ఓడించింది సురగణం. విశ్వకర్మ తనయ సంజ్ఞను మనువాడాడు యువరవి. యమ, యమి ఆ దంపతుల పిల్లలు. ఎంత ఓరిమిగల ఇల్లాలైనా, నిప్పుల కుంపటితో ఎంతకాలమని కాపురం చేస్తుందీ. తన ఛాయను అక్కడే వదిలేసి, అశ్వరూపం ధరించి అడవులకెళ్లిపోయింది. సూర్యుడు ఆ నీడనే తనతోడని భ్రమించాడు. సావర్ణుడూ, శనైశ్చరుడూ... ఛాయాసూర్యనారాయణుల సంతానం! కాలక్రమంలో...ఛాయ మనసు కలుషితమైంది. సంజ్ఞ కడుపున పుట్టిన పిల్లల్ని వేధించ సాగింది. యమ, యమి ఆ విషయాన్ని నేరుగా తండ్రికి ఫిర్యాదు చేశారు. అప్పుడే, సంజ్ఞ నిర్వాకం బయటపడింది. ఆ పంచాయతీ తేల్చమంటూ మామ విశ్వకర్మ ఇంటికెళ్లాడు సూర్యుడు. ‘నీ తేజస్సు మాలాంటివారికే ముచ్చెమటలు పట్టిస్తుందే. సుకుమారి సంజ్ఞ ఎలా భరిస్తుంది చెప్పూ!’ అంటూ అల్లుడిని వూరడించాడు విశ్వకర్మ. తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి... అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి...తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడు... ఇలా అనేకానేక మలుపులతో సాగిపోతుంది భానుడి కథ.

వేదాలు సూర్యుడిని విరాట్‌ స్వరూపుడిగా కొలిచాయి. దాదాపుగా ప్రతి పురాణంలోనూ దినకర ప్రస్తావన ఉంది. సూర్య వైభవాన్ని చాటే ఆదిత్య హృదయ స్తోత్రం రామాయణంలోనిదే. రాముడికి అరుణుడంటే ఆరాధనా భావం. అరణ్యకాండలో ఓచోట, కొండలూగుట్టలూ దాటుకుని వెళ్లి సూర్యుడి మెడలో కొండగోగుపూలతో అల్లిన మాల వేసిరావాలని ఉందంటాడు. దశకంఠుడితో పోరాడి అలసిన రామచంద్రుడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. సూర్యుడిని తలుచుకోగానే ఎక్కడలేని బలం వచ్చింది. పదితలల్నీ ఒక్క వేటుతో కూల్చేశాడు. బాలకాండలో - ‘కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే...తెలవారుతోంది, సంధ్యాది విధులకు సమయం అవుతోంది’ అంటూ విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడిని నిద్రలేపుతాడు. గాయత్రీమంత్రాన్ని ఉపదేశిస్తాడు. రామాయణం అంటే రాముడి ప్రయాణం. రాక్షస సంహారం కోసం రాముడి తొలి ప్రయాణమూ అదే. మళ్లీ యుద్ధకాండలో...ఆదిత్యహృదయ స్తోత్ర పఠనంతో ఆదికావ్యంలో అత్యంత కీలక ఘట్టం పరిసమాప్తం అవుతుంది. గాయత్రీమంత్రానికి విస్తరణే ఆదిత్యహృదయమని అంటారు. బాల హనుమంతుడైతే, ఉషోదయాన్ని చూసి ఎర్రెర్రని పండేదో అనుకుంటాడు. జిహ్వచాపల్యం కొద్దీ గుటుక్కున మింగేస్తాడు. గురుదేవుడై మారుతికి వేద విద్యలు నేర్పింది కూడా సూర్యుడే. ఓచోట పీఠమేసుకుని కూర్చునేంత తీరికా ఓపికా సూర్యుడికెక్కడిదీ! కుదరదు పొమ్మన్నాడు. అయినా హనుమ పట్టు వీడలేదు. సూక్ష్మరూపంలో భానుడి రథ వేగాన్ని అందుకుంటూ... వేదవేదాంగాలూ, వ్యాకరణశాస్త్రాలూ అభ్యసించాడు.

మహాభారతంలోనూ సూర్యోపాసన కనిపిస్తుంది. తెలిసీ తెలియని వయసులో... కుంతీదేవి సూర్యనారాయణుడిని ప్రార్థించడంతో...అసలు సిసలు భారతం ఆరంభమౌతుంది. పాండురాజు రెండోభార్య మాద్రి పిల్లలైన నకుల సహదేవులు కూడా అశ్వినీదేవతల వరమే. అశ్వినుల తండ్రీ సూర్యుడే. ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజ్ఞాదేవి అశ్వరూపంలో అడవుల్లో సంచరిస్తున్నప్పుడు, మగ గుర్రమై ఆమెతో రమిస్తాడు. అలా పుట్టినవారే అశ్వినీ దేవతలు. అశ్వమంటే కిరణమన్న అర్థమూ ఉంది.

భాగవతంలో...మోహినీరూపంలోని విష్ణుమూర్తి చాలా తెలివిగా, మహా ఒడుపుగా దేవతలకు మాత్రమే అందేలా అమృతాన్ని పంచుతూ ఉంటాడు. వేషం మార్చుకుని వచ్చి ఏమార్చే ప్రయత్నం చేస్తారు రాహుకేతువులు. ఆ రాక్షస మాయల్ని సూర్యుడు రట్టుచేస్తాడు. రాహుకేతువులు రచ్చచేస్తారు. ఆ గండమే గ్రహణమైంది. కృష్ణుడి అష్టభామల్లో ఒకరైన సత్యాదేవి తండ్రి సత్రాజిత్తు సూర్యోపాసకుడు. మణుగులకొద్దీ సంపదనిచ్చే శ్యమంతకమణి అతడికి సూర్యుడి వరమే. వనవాస కాలంలో, పాండవులకు అక్షయపాత్రను ప్రసాదించింది కూడా ఆదిత్యుడే. భగవద్గీతలో కృష్ణపరమాత్మ ‘ఆదిత్యగతమైన తేజాన్ని నేనే’ అని ప్రకటించాడు.

సూర్యుడు సారస్వతదేవుడు. ఆదికవుల నుంచి ఆధునికుల దాకా...పిండికొద్ది రొట్టె అన్నట్టు, ఎవరి స్థాయిలో వారు ఉదయభానుడిని అక్షరాలతో అర్చించారు. సూర్యోదయం - బ్రహ్మాండం ఓ మేడలా మారితే, ఆ ఇంట వెలుతురు దీపం; ఆకాశమంతా ఓ కిరీటం అయితే; అందులో మెరుపుల దివ్యమణి; ఇంకా.... ప్రభాతలక్ష్మి సిగలో ఎర్రకలువ, సిందూరం ధరించిన ప్రౌఢ, జవ్వని చేతిలో అద్దం, సముద్రంలోంచి తడుస్తూ లేస్తున్న ఎర్రపిట్ట...ఇలా ఎన్నో పోలికలు. విశ్వనాథవారి కవిత్వంలో అయితే సూర్యతత్వమంతా ప్రతిఫలిస్తుంది...‘వెలుగుమరొక్కపేరఖిల విద్యలకున్‌...పరమార్థభూతమై వెలుగులు తన్నుమించి మరి విశ్వమునందున వేరుచోట లేవు...అలఘుడు విశ్వవత్సలుడు అంబుధిశోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్‌ గురూత్తమునకున్‌ జగదక్షునకున్‌ నమస్కృతుల్‌...’

భారతీయం...
భా...అంటే కాంతి. భారతీయులు... వెలుతుర్ని ఇష్టపడేవారు. వెలుగులు విజ్ఞానానికి ప్రతీకలు. మిగతా ప్రపంచమంతా సూర్యుడి గురించి మిడిమిడి జ్ఞానపు మాటలు మాట్లాడుతున్న సమయానికే...భారతీయులు ఆ ధగధగల దేవుడిని ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రూపాల్లో దర్శించుకున్నారు. అసలు, ఉదయాస్తమానాలు లేనేలేవని గుర్తించారు. సృష్టిలో అనేకానేక సూర్యుళ్లు ఉన్నారన్న నిర్ధరణకు వచ్చారు. చంద్రుడు స్వయంప్రకాశుడు కానేకాదనీ తేల్చారు. ఆకులోని హరిత రేణువులు సూర్యకాంతిని గ్రహించి పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయని లోకానికి చాటారు. అందులోనూ, సూర్యుడి గమనాన్ని లెక్కగట్టడంలో, కాంతి వేగాన్ని అంచనా వేయడంలో భారతీయులకు సాటిలేదు. ఆ నైపుణ్యాన్ని ఆలయవాస్తుకు జోడించి... అనేక అద్భుతాలు చేశారు. రథసప్తమి, సంక్రాంతి తదితర ప్రత్యేక సందర్భాల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టును స్పృశించేలా గర్భాలయాల్ని నిర్మించారు. వేదాలు కాంతి కిరణాల వేగాన్నీ లెక్కగట్టాయి. నిమేషార్ధం...రెప్పపాటులో సగం సమయంలోనే సూర్యకాంతి 2,202 యోజనాలు ప్రయాణిస్తుందని నిరూపించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవలే, అటూ ఇటుగా అవే అంకెల్ని వల్లెవేసింది. ఈ అద్భుతాలకు శాస్త్రీయ విజ్ఞానం ఒక్కటే సరిపోదు. సూర్యతత్వం పట్ల శ్రద్ధా భక్తీ ఉండాలి. అది భారతీయుల్లో పుష్కలం. గాణపత్యమూ, శాక్తేయమూ మొదలైన ఆరు ప్రాచీన ధర్మాల్లో సౌరమతం ఒకటి. కొద్దిపాటి తేడాతో, భవిష్యోత్తర పురాణంలోనూ ఆదిత్యస్తోత్రం ఉంది. దీన్ని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. అసావాదిత్యో బ్రహ్మ ...‘అదిగో ఆ ఆదిత్యుడే బ్రహ్మ’ అంటాయి గాయత్రీ మంత్రాలు. ఏకచక్రంతో, ఏడుగుర్రాలతో వింతగా కనిపించే సూర్యరథం కాలగమనానికి ప్రతీక.

ఆదిత్యుడు... నిలువెత్తు వికాసమూర్తి. ఆది నుంచి అస్తమయం దాకా ప్రతి కదలికా ప్రపంచానికి ఒక పాఠమే. క్రమశిక్షణకు మారుపేరు; ఆరునూరైనా తెల్లారేలోపు తూరుపుకొండ ఎక్కేస్తాడు. శ్రమకు సంకేతం; సాయంత్రం సెలవు తీసుకునేదాకా అహరహం గమనమే. మహా సమవర్తి; సంపన్నుడికైనా అదే ఎండ, సామాన్యుడికైనా అదే ఎండ. ఎంతో నిస్వార్థపరుడు; అన్నీ ఇస్తాడు కానీ, ఏదీ ఆశించడు. అంతటి పరోపకారికి ఎన్ని పరీక్షలూ! రాహుకేతువుల పీడ ఇప్పటికి కూడా వదల్లేదు. అయినా, సూర్యుడు తన తత్వాన్ని మార్చుకోలేదు, సహజ స్వభావాన్ని వదులుకోలేదు. అలాంటి దేవుడే ఎదురైతే ‘నమస్తే, నమస్తే నమః’ అంటూ పాదాభివందనం చేయాలి. అలాంటి మనిషే తారసపడితే ‘హితుడా...’ అంటూ గాఢంగా గుండెలకు హత్తుకోవాలి. రెండూ కాకుండా, ఏ మండే అగ్నిగోళమో అయినా సరే, దూరం నుంచే ఆ దొడ్డగుణానికి దండం పెట్టుకోవాలి.

ఖగోళ సూర్యుడు
ఖగోళశాస్త్రం ప్రకారం... అర్కుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్‌, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది. భూమి మీది నుంచి ఏ రాకెట్టో ఎక్కి, భానుడి నివాసానికి వెళ్లాలంటే... పదిహేను కోట్ల మైళ్లు ప్రయాణించాలి. ఆ మహోజ్వల కాంతి భూమిని చేరడానికి ఎనిమిదిన్నర నిమిషాలు పడుతుంది. సూర్య కిరణాలు అనంత శక్తికేంద్రాలు. ఓ అరవై నిమిషాలు నేలను తాకిన సౌరశక్తినంతా విద్యుచ్ఛక్తిగా మార్చుకున్నా చాలు... ప్రపంచం మొత్తం, ఏడాది పాటూ ‘కోతలు’ లేకుండా కరెంటు వాడుకోవచ్చు. అందులోనూ భారతదేశం మీద సూర్యుడి కటాక్ష వీక్షణాలకు కొదవే లేదు. ఏడాదిలో మూడొందల రోజులూ ఎండే. కాలుష్యభయం ఉండదు. అరిగిపోతుందనో కరిగిపోతుందనో ఆందోళన చెందాల్సిన పన్లేదు.

‘సౌరశక్తి’లో సామాజిక సమస్యలకూ పరిష్కారం ఉంది. అనేకానేక పరిమితుల్ని అధిగమిస్తూ...హరీశ్‌హండే అనే నిపుణుడు దీన్నో సేవా వ్యాపారంగా ఎంచుకున్నాడు. అఖిల్‌ జైసింఘానీ ‘మేరా గావ్‌ పవర్‌’ అనే సంస్థ ద్వారా విద్యుత్‌ సౌకర్యంలేని గ్రామాల్లో లక్షా యాభైవేల దీపాలు వెలిగిస్తున్నాడు. సౌర కాంతి బతుకు చీకట్లనూ తరిమేయగలదు... ఉపాధి కల్పనకూ, పేదరిక నిర్మూలనకూ, అక్షరాస్యత సాధనకూ అండగా నిలబడగలదు. దీపం ఉన్నచోట మంచి ఉంటుంది. సంపద తాండవిస్తుంది. మానవత్వం పరిమళిస్తుంది.

అయినా ఎక్కడో ఏదో లోపం. ఆ ఆత్మీయ హస్తాన్ని మనిషి మనస్ఫూర్తిగా అందుకోలేకపోతున్నాడు. సంప్రదాయ ఇంధనాల మోజులో పడిపోయి....హ్రస్వదృష్టితో వ్యవహరిస్తున్నాడు. ఇక, ప్రభుత్వాల చొరవా అంతంతమాత్రమే. ‘సౌరశక్తి వినియోగం ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం, సూర్యుడు ఏ బహుళజాతి సంస్థల అబ్బసొత్తో కాకపోవడమే’ అంటారు రాల్ఫ్‌నాడార్‌ అనే నిపుణుడు. ఈ మాటా నిజమే.

భాస్కరాదిచ్ఛేత్‌...
చెట్టూచేమా కాంతిని గ్రహించి...ఆహారాన్ని తయారు చేసుకున్నట్టు, సౌర పలకలు సూర్యకాంతితో ఇంధనశక్తిని సృష్టించుకున్నట్టు...మనిషి సౌరశక్తిని ప్రాణశక్తిగా ఎందుకు మలుచుకోకూడదు? అదీ అసాధ్యం కాదంటారు, ‘ఒక యోగి ఆత్మకథ’ రచయిత పరమహంస యోగానంద. ఆ దిశగా భారతీయ రుషులు ఎప్పుడో విజయం సాధించారనీ, కాసేపు ఎండలో నిలబడగానే పంచభక్ష్య పరమాన్నాలు తిన్నట్టుగా తృప్తిపడిపోయే సాధుసంతుల్ని సేవించి తరించాననీ ఓ చోట ప్రస్తావించారు. డాక్టర్‌ మాణిక్‌ అనే నిపుణుడు తాను సౌరాహారంతోనే బతుకుతున్నట్టు ప్రకటించారు. ఆయన మీద వివిధ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేశాయి.

సూర్యుడిలోని అపారశక్తిని ప్రతీకాత్మకంగా వెల్లడించింది ఆదిత్యహృదయం. ఆ స్తోత్ర పఠనం వెనుకా ఓ ఆరోగ్యసూత్రం ఇమిడి ఉందంటారు విజ్ఞులు. ‘ఛందోబద్ధమైన వాక్కు శ్వాసను నియంత్రించి ప్రాణశక్తిగా మార్చగలదు. ఆ ఉచ్ఛ్వాసనిశ్వాసాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజుల్లా పనిచేసి...శరీరంలోని రుగ్మతల్ని దూరం చేస్తాయి’ అన్నది విశ్లేషణ. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌ - అన్న మాట ఉండనే ఉంది. సూర్యుడు వెళ్లని చోట రోగాలు రాజ్యమేలతాయి. యోగాలో సూర్యయోగ ఓ ప్రత్యేక విభాగం. సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు నేరుగా శరీరాన్ని తాకేలా ...పూర్వాభిముఖంగా నిలబడి సాధన చేస్తారు. ఎముకల్ని శక్తిమంతం చేసే విటమిన్‌-డిని ‘విటమిన్‌-దినకర’గానూ చెప్పుకోవచ్చు. విష్ణువు అలంకార ప్రియుడూ, శివుడు అభిషేకప్రియుడూ అయినట్టే...సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యనమస్కారాలు...శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆధునిక పరిశోధనలు కూడా నిర్ధరించాయి. సిడార్స్‌-సినానీ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనం ప్రకారం...సూర్యుడి కిరణాలు సోకని శరీరాలు మధుమేహం, గుండెజబ్బు తదితర తీవ్ర రుగ్మతల బారిన పడే ఆస్కారం ఎక్కువే. రోజూ కనీసం ఓ పది నిమిషాలు ఎండలో కూర్చుంటే, హార్మోన్ల సమతౌల్యాన్ని సాధించవచ్చనీ, కేశ సంబంధమైన రుగ్మతల్నీ, చర్మ సమస్యల్నీ అధిగమించవచ్చనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృత్రిమమైన కాంతిలో బతికేవారు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడే ప్రమాదమూ ఉందంటున్నారు. ఒత్తిడి హార్మోను కార్టిసోల్‌ సూర్యకాంతిని ఆస్వాదించేవారి దరిదాపుల్లోకి కూడా రాదని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో నిపుణుల మాట. ‘సూర్యస్నానం’ వూబకాయాన్నీ నియంత్రిస్తుంది. సహజమైన వెలుతురు మనిషిలోని సహజ సృజనను మెరుగుపరుస్తుందని చెప్పడానికి ఆధారాలున్నాయి.

ఏ కొరియర్‌ కుర్రాడో పార్సిలు పట్టుకుని వస్తున్నాడంటేనే... గేటు తెరిచి మరీ కాచుకుని నిలబడతామే! అంతదూరం నుంచీ ప్రాణశక్తిని ప్రేమగా మోసుకొచ్చి ఇచ్చే హిరణ్యగర్భుడికి మాత్రం, పాచిమొహపు పలకరింతా కరవేనా! ఆ నిర్లిప్త నిర్లక్ష్య ధోరణి అక్షరాలా కృతఘ్నతే! సూర్యుడి సంగతి పక్కన పెట్టినా, మనకోసమైనా మనం సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. ఆ సాధనతో మన మీద మనం పట్టుసాధిస్తాం, కాలం మీదా పట్టు సాధిస్తాం. ఏ వికాససాహిత్యం తిరగేసినా, ప్రతి విజేత దినచర్యా బ్రాహ్మీ ముహూర్తంలోనే మొదలవుతుంది. మనసు మీదా సూర్యుడి ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సుప్రభాతవేళ మనసు మహా ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం నాటికి ఎక్కడలేని చికాకు వచ్చేస్తుంది. సూర్యాస్తమయ సమయానికి నిద్రలేచే, అసురీప్రవృత్తి... నడిరేతిరి దాకా నాట్యమాడుతుంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం కూడా... పొద్దు కుంగుతున్నకొద్దీ హింస పెరుగుతోంది.

ఇచ్చేవాడినే గిచ్చేతత్వం మనిషిది. పవిత్ర గంగను పరమచండాలం చేసేశాడు. స్వచ్ఛమైన గాలిని అపరిశుభ్రంగా మార్చేశాడు. చివరికి సూర్య కిరణాల్నీ వదల్లేదు. ‘కాంతి కాలుష్యం’ భవిష్యత్తులో తీవ్ర సమస్యగా పరిణమించబోతోంది. వందేళ్ల క్రితంతో పోలిస్తే ... సూర్యకాంతిలో మెరుపు తగ్గింది. స్పష్టత లోపించింది. కారణం..ప్రకృతిలోని కాలుష్య కణజాలమే. కాంతిలోకి చొచ్చుకుపోతున్న ఆ ధూళికణాలూ రసాయనాలూ... అమృత రశ్మిని విషపూరితం చేస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే, అది ‘మిత్ర’ ద్రోహమే! ఆ వికృతతత్వాన్ని ప్రకృతి కూడా క్షమించదు. ఏదో ఒకరోజు ఇంతకింతా అనుభవించాల్సివస్తుంది. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తపడేంత ప్రాప్తకాలజ్ఞత మనిషికి ఉందనే భావిద్దాం.

* * * శత్రువుల్ని తొలగిస్తుంది, శుభాల్ని కలిగిస్తుంది, కష్టాల నుంచి ఒడ్డునపడేస్తుంది, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది - ఇలా సాగుతుంది ఆదిత్యహృదయస్తోత్ర ఫలశ్రుతి.

ఇదంతా - ఆదిత్య హృదయాన్ని వల్లెవేయడం వల్ల జరగదు, ఆదిత్యుడి హృదయాన్ని మనలో ప్రతిష్ఠించుకోవడం వల్లే సాధ్యం అవుతుంది. సూర్యుడు మన హృదయ స్థానంలో ఉన్నాడనుకుంటే - సూర్యుడిలా విశాలంగా ఆలోచిస్తాం, సూర్యుడిలా సమాజానికి ఉపకారం చేస్తాం, సూర్యుడిలా క్రమశిక్షణతో మెలుగుతాం. అలాంటి వారికి - ఓటమి ఉండదు, శత్రుభయం ఉండదు, రోగాలూ దరిచేరవు. అప్పుడిక... నరుడే భాస్కరుడు!

గ్రీకుపురాణం ప్రకారం సూర్యుడికో ప్రేమకథ ఉంది. అసలే అందగాడు కాబట్టి, చాలామంది అమ్మాయిలే మనసుపడ్డారు. అందులో ఓ వనదేవతా ఉంది. కానీ సూర్యుడేమో జలదేవత కూతుర్ని ప్రేమించాడు. ఆ యువతి సూర్యుడి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. వనదేవత ఆ ఎడబాటును భరించలేక పొద్దుతిరుగుడు మొక్కగా మారిపోయింది. అయినా పూర్వజన్మ జ్ఞాపకాలు పోలేదు. పొద్దు వెనకాలే సుద్దులు చెబుతూ బయల్దేరుతుంది. సైన్స్‌ ప్రకారం ఆ తిరుగుడుకు కారణం...‘ఫొటోట్రాపిజమ్‌’.
ఇంకో ఐదొందల కోట్ల సంవత్సరాల తర్వాత...సూర్యుడు మాయమైపోయే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యుడి మీదున్న హైడ్రోజన్‌ అంతా మండిపోతే మహావిస్ఫోటనం (సూపర్‌నోవా) తప్పదు. జీవరాశి మొత్తం నశించకా తప్పదు.
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో భూమి సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. దీంతో ఆ కిరణాలు మనల్ని చేరుకోడానికి ఎక్కువ సమయం ప్రయాణిస్తాయి. ఆ సుదీర్ఘయాత్రలో...తక్కువగా చెదిరిపోయే స్వభావమున్న ఎరుపురంగు ఎక్కువగా మన కంటికి చేరడం వల్లే...సంధ్యాకిరణాలు బంగారపు రంగులో మెరిసిపోతుంటాయి.
ఈజిప్షియన్ల ముఖ్యదేవత పేరు...రా! ఆ దేవత చుట్టూ ఓ కాంతివలయం ఉంటుంది. అది సూర్యతత్వానికి ప్రతీక. సూర్యుడు కలలోకి వస్తే అంతా మంచే జరుగుతుందని ఓ నమ్మకం. అందులోనూ, సూర్యోదయ దృశ్యం పరిపూర్ణ ఆరోగ్యానికి గుర్తు.
చంద్రుడితో పోలిస్తే సూర్యుడు నాలుగువందల రెట్లు పెద్ద. చంద్రుడి కంటే నాలుగువందల రెట్లు దూరం కూడా. ఆ కారణంగానే, సూర్యచంద్రులిద్దరూ తూర్పుపడమర దేశాల్లో స్థిరపడిపోయిన కవలల్లా అనిపిస్తారు.
అంగారకగ్రహం మీద జనావాసమంటూ ఉంటే, ఆ జనానికంటూ మనలానే కాస్తంత కవితాహృదయం ఉంటే..ఉదయించే సూర్యుడిని ఆపిల్‌తోనో, టమాటాతోనో చచ్చినా పోల్చరు. చక్కగా, ఏ ‘నీలమణి’నో ఉపమానంగా తీసుకుంటారు. ఎందుకంటే, అంగారకగ్రహం మీది నుంచి చూస్తే సూర్యుడు నీలమేఘశ్యాముడిగా దర్శనమిస్తాడు. సూర్య ఆలయాలు...
భారతదేశంలోని ప్రతి సూర్యక్షేత్రం వెనుకా... ఓ ఖగోళపరమైన నిగూఢ రహస్యమున్నట్టు పాశ్చాత్య పరిశోధకులు గుర్తించారు. అపార సౌరశక్తి అక్కడ నిక్షిప్తమైనట్టు కూడా నిరూపించారు. శ్రీకాకుళంజిల్లా అరసవల్లిలోని ఆలయం క్రీస్తుపూర్వం నాటిదని చెబుతారు. హనుమకొండలోని వేయిస్తంభాల గుడిలో పూర్వం సూర్య విగ్రహమూ ఉండేదని అంటారు. ఒడిశాలోని కోణార్క్‌ సూర్యాలయం జగత్‌ ప్రసిద్ధం. ఆ నిర్మాణశైలీ అద్భుతమే. కృష్ణుడి కుమారుడైన సాంబుడు...ఓ మహర్షి ఇచ్చిన శాపం నుంచి మిముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేశాడనీ, ‘త్వం మాతా, త్వం దాతా...’ అంటూ సూర్యదేవుడిని ఉపాసించాడని ఐతిహ్యం. కోణార్క్‌ ఆలయం అద్భుత రథాకృతిలో ఉంటుంది. కాశీ క్షేత్రంలో సూర్యుడు ద్వాదశాదిత్యుడిగా...పన్నెండు రూపాల్లో కొలువుదీరాడు.