Monday, 22 October 2018

కృష్ణం వందే జగద్గురుం!








కృష్ణం వందే జగద్గురుం!



శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఇష్టమైనవారికి జగన్నాటక సూత్రధారి. గిట్టనివారికి కపట నాటక సూత్రధారి. విలక్షణమైన వైరుధ్యాలతో మాయచేసే గమ్మత్తయిన వ్యక్తిత్వం కాబట్టే కృష్ణుడంటే అంత ఆకర్షణ. ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకెక్కడా కనిపించడు అనిపిస్తుంది. మరు నిమిషంలోనే మన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది. గోపబాలురతో ఆడిపాడినా గోవర్ధనగిరిని కొనగోటితో ఎత్తినా భారతాన్ని బాధ్యతగా నడిపించినా ఆయన ప్రతి అడుగూ మానవజీవితానికి మార్గనిర్దేశనం చేసేదే. అందుకే కన్నయ్య పుట్టిన రోజంటే (ఈరోజు కృష్ణాష్టమి) జగతికి పండగ రోజే.

శ్రావణ బహుళ అష్టమి... కృష్ణ జన్మాష్టమి. దేవకీదేవికి అష్టమ గర్భంలో ప్రవేశించిన కథానాయకుడు శ్రీకృష్ణుడు.

జన్మిస్తూనే తన నిజరూప సందర్శన భాగ్యాన్ని జననీ జనకులకు కలిగించిన మధుమోహనుడు. వారికి తన జన్మ కారణాన్నీ, వారి తక్షణ కర్తవ్యాన్నీ వివరించాడు. నందుని ఇంట నడయాడాడు. యదు కులాన్ని ఉద్ధరించాడు. బృదావనాన్ని ప్రేమతో నింపేశాడు. రేపల్లె రాగంతాళం రాజీవం చేశాడు. మరోవైపు దుష్టశిక్షణా శిష్టరక్షణా చేసి మానవజాతిని ధర్మపథాన నడిచేలా చేశాడు. మానవుడే మాధవుడిగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే ఇదీ అని రేపటి తరాలకు చాటిచెప్పాడు. ప్రేమతో పిలిచినా, భక్తితో ధ్యానించినా, వైరంతో దూషించినా... ఇలా ఏ విధంగా తనను ఆశ్రయించినా మోక్షమిచ్చే కరుణామయుడు కృష్ణస్వామి. జీవితంలో కష్టనష్టాలూ సుఖదుఃఖాలూ ఎత్తుపల్లాలూ ప్రతీదీ ఓ భాగమే అంటాడు. వాటన్నింటిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో తన జీవన విధానంతో ఆచరించి చూపిన జ్ఞానస్వరూపుడు. గోకులంలో లీలలు చూపినా, యుద్ధం వద్దని రాయబారం నడిపినా, కురుక్షేత్రంలో వివశుడైన అర్జునుడికి గీతోపదేశం చేసినా... ప్రతిదీ మధుర ఘట్టమే. రేపటి తరానికి ఒక వ్యక్తిత్వ పాఠమే. అందుకే కంప్యూటర్‌ కంటే వేగంగా కాలానికి పోటీగా పరుగులు తీయాలని ఉవ్విళ్లూరుతున్న వేళకూడా మానవజాతి కృష్ణతత్వాన్ని వదల్లేకపోతోంది. ఆ ప్రేమతత్వాన్ని మనసావాచా మననం చేసుకుంటోంది.

ఆనందగోవిందం
‘అధరం మధురం నయనం మధురం... మధురాధిపతే అఖిలం మధురం...’ అంటూ కన్నయ్య ముగ్ధమనోహర రూపాన్ని ఎంత కీర్తించినా తనివితీరదు. ఒక్క రూపమేనా, నల్లనయ్య... కన్నయ్య... కిట్టయ్య... గోపాలుడు... ఇలా ఆ మధుసూదనుడి పేరు తలచినా అలవికాని ఆనందమే. ‘కృష్ణుడు’ అంటేనే ‘అందరి హృదయాలనూ ఆకర్షించేవాడు’ అని అర్థం.

నిజానికి కృష్ణుడికి వశంకాని ప్రాణి ఏదీ లోకంలో లేదు. ప్రేమతో గోపికలూ, భయంతో కంసాది రాక్షసులూ, బంధుత్వంతో యాదవ పాండవులూ... ఇలా అందరూ ఆ రసరమ్య రూపాన్ని పొదివిపట్టుకోవాలని చూసినవారే. తమని తాము అర్పించుకుని తరించినవారే. మార్గాలే వేరు అందరి గమ్యమూ ఒక్కటే... కృష్ణుడిలో చేరిపోవడం. ఆయన్ను చేరుకోవడమంటే కృష్ణ తత్వాన్ని మన జీవనంలోకి ఆహ్వానించడమే. మన మనసును చైతన్యవంతంగా నిత్యనూతనంగా మహదానంద భరితంగా మలచుకోవడమే. జీవితంలో ఎదురైన ప్రతిపనిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో యుగాలనాడే చేసిచూపాడు ఆ కృష్ణస్వామి. బాలుడిగా పారాడుతూనే అమ్మచనుబాలు తాగినంత సులువుగా పూతనను తుదముట్టించాడు. చేతిలో వెన్నముద్దను పెట్టుకున్నంత ఆనందంగా గోవర్ధన గిరినిమోసి గోకులాన్ని రక్షించాడు. పూబంతులు విసిరినంత అవలీలగా పరమ రాక్షసుడైన కంసమామ గుండెలమీద పిడిగుద్దుల వర్షం కురిపించి సంహరించాడు. కాళీయుడి విషపుపడగలమీద కూడా ఆనందతాండవం చేయగల చిద్విలాసరూపుడు. వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంమీద కూర్చోబెట్టినా తన కళ్లముందే ద్వారకాపట్టణం సముద్రంలో కుంగిపోతున్నా రెండూ కర్మననుసరించి వచ్చిన ఫలితాలే అంటాడు. రెంటినీ అంతే ఆనందంగా స్వీకరిస్తాడు. సమస్య తలెత్తినప్పుడూ అదే నవ్వూ... గెలిచిన తర్వాతా అదే చిరునవ్వూ. ఆ నవ్వే కృష్ణతత్వం.

సంసారాన్ని వీడడు... ఏదీ త్యాగంచేయడు... కష్టాలు ఎదురైనప్పుడు కూడా సంతోష సాగరంలో ఎలా మునకలువేయాలో సులువుగా చేసిచూపడమే మానసచోరుడి లీలావినోదం.

పూర్ణగోవిందం
జీవితం అంటే ఏమిటీ... అని ప్రశ్నించుకునే మనుషులకు పరిపూర్ణం నుంచి ఉద్భవించిన మానవ జన్మ తిరిగి పరిపూర్ణంలోనే కలిసిపోయే నిర్దిష్టమైన గమనమన్నాడు గీతాచార్యుడు. ఈ ప్రయాణం అంత సులువైంది కాదన్నాడు. అది బంధాలతో అల్లుకుంటుందనీ బాధ్యతలతో నిండి ఉంటుందనీ, శిఖరాలను చూపిస్తుందనీ, లోతుల్లోకి తోసేస్తుందనీ తెలిపాడు. ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఆచరించి చూపాడు. అందుకే కృష్ణుడి జీవితం మానవాళికి ఓ విలువైన సందేశం. నందనందనుడు నమ్మి చేరిన వారిని కాదన్న సందర్భమే లేదు. ఒకవైపు ప్రేమను పంచుతూనే మరోవైపు ధర్మాన్ని నిలబెట్టాడు. మనిషిగా పరిపూర్ణత్వాన్ని ఎలా సాధించాలో మొత్తం మానవజాతికి చెప్పకనే చెప్పాడు. కృష్ణుడు దేవుడు కాబట్టి ఆయన జీవితం అంతా ఆనందంగానే సాగిందనుకుంటే పొరపాటే. కృష్ణపరమాత్మ సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమే కావచ్చు. ఆయనలో దేవతాంశ ఉండిఉండొచ్చు. కానీ ఇవేవీ దేవకీసుతుడిని దేవుడిగా నిలబెట్టలేదు. కేవలం ఆయనలోని స్థితప్రజ్ఞత, వర్ణించనలవికాని వ్యక్తిత్వమే గోపబాలుడిని గోవిందుడ్ని చేశాయి. అవే మానవ రూపంలో జన్మించినప్పటికీ మాధవుడిగా నిలిపాయి. నడయాడి యుగాలు గడిచినా ఆయన రూపాన్ని మన మనసుపొరల్లో సుస్థిరం చేశాయి.

శ్రీకృష్ణుడి జీవితం ఆద్యంతం మానవాళిని జాగృతం చేసే గీతాపాఠమే. యద్భావం తద్భవతిగా నిలిచిన పూర్ణజ్ఞాన స్వరూపమే. నిజానికి కృష్ణుడిని అనేకులు అనేక విధాలుగా చూశారు. రకరకాలుగా అర్థం చేసుకున్నారు. అనుభూతి చెందారు. దుర్యోధనుడి మాటల్లో చెప్పాలంటే... ‘అందరితోనూ నవ్వుతూ తిరిగే అసలు సిసలైన మోసగాడు. ఏదైనా చేయగల సమర్థుడు. వయోభేదంలేకుండా ఎవరితోనైనా ఆడిపాడగల నేర్పరి...’ ఇదీ దుర్యోధనుడి అవగాహన. ‘కృష్ణుడంటేనే ప్రేమ, ప్రేమంటేనే కృష్ణుడు. ఆయన ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా ప్రేమకు వశుడే...’ ఇదీ కన్నయ్య చిననాటి ప్రేమికురాలు రాధమ్మ అనుభూతి. ‘దేవదేవుడైన శ్రీకృష్ణుడిని మించిన బలం, బలగం మరొకటిలేదు. ఆయనుండగా వేరే ఏదీ అవసరం రాదు కూడా...’ ఇదీ పాండవమధ్యముడి నమ్మకం. కృష్ణుడు పరిపూర్ణమైన విశ్వంలాంటివాడు. సూర్యుడూ చంద్రుడూ కృష్ణబిలాలూ గ్రహశకలాలూ... అన్నీ అందులో భాగమే. ఎవరు ఏది కోరుకుంటే, దేన్ని చూడాలనుకుంటే అవే కనిపిస్తాయి. కృష్ణస్వరూపమూ అంతే.

ప్రేమైకగోవిందం
కన్నయ్యకు బంధాలంటే అమితమైన తీపి. అందుకే ఆయన అందరికీ బంధువే. ప్రతి బంధాన్నీ వెన్నముద్దల్లా అపురూపంగా ఒడిసిపట్టాడు. బంధుత్వాలను ఎలా కొనసాగించాలో చెప్పకనే చెప్పాడు. బంధాలు మనకి బంధనాలు కావనీ ఆయా రూపాల్లో భగవంతుడేననీ గ్రహించమంటూ భాగవత సూత్రాన్ని అలవోకగా వివరించాడు.

మురళీగాన లోలుడు కదా... ఆ గానం ఎంత మధురమో ఆయన ఉపదేశమూ అంతే సమ్మోహనం. మధుసూదనుడు అవతార పురుషుడే అయినా అమ్మంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అమితబలశాలి అయినా అమ్మచేతి మూరెడు తాడుకు కట్టుబడ్డాడు. అందుకే పోతన సైతం చిన్నికృష్ణయ్య లీలను ఇలా చెబుతాడు...

చిక్కడు సిరి కౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్‌
జిక్కడు శృతిలతికావలి
జిక్కెనతండు లీల దల్లి చేతన్‌ రోలన్‌
... యోగుల తపస్సులకు సైతం అందలేదు. అమ్మవారి బిగికౌగిలిలోనూ ఇమడలేదు. అలాంటి అనంతాకారుడు అమ్మప్రేమకు బందీ అయ్యాడు మరి.

అన్న బలరాముడన్నా ఆయనకు అలవికాని అనురాగం. అంతకు మించిన గురు భావం. మరోవైపు అన్నగా నిలబడి సుభద్రా కళ్యాణాన్ని ముందుండి జరిపించాడు. సోదరికి సవతి అయినా ద్రౌపదినీ తోబుట్టువులాగే ఆదరించాడు. చీరకొంగును చింపి వేలికి చుట్టినందుకే పరమానంద భరితుడయ్యాడు. అది ఆమె మెట్టినిల్లే చూట్టూ ఉన్నది సొంతవాళ్లే అయినా అయిదుగురు భర్తలూ పక్కనే ఉన్నప్పటికీ... కష్టకాలంలో ద్రౌపదికి తోడునిలిచింది కన్నయ్యే. అన్నా అంటూ ఆర్తిగా పిలవగానే అక్కున చేర్చుకున్నాడు. చీరలు అందించి ఆమె మానాన్ని కాపాడాడు.

భీష్మాచార్యుడు యోధుడు.వరుసకి తాత. కృష్ణుడంటే అమితమైన ప్రేమ. ఆయనంటే కన్నయ్యకూ అంతే గౌరవం. కానీ కౌరవ పక్షాననిలిచి ఆయనకు వ్యతిరేకంగా పోరాడాడు. నేలకొరిగే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం ఆయన కృష్ణుడి సాన్నిధ్యాన్నే కోరుకున్నాడు. మాధవుడు వచ్చేవరకూ ప్రాణాలు అరచేతపట్టుకుని ఎదురుచూశాడు.

అలాగే స్నేహం ఎలా చేయాలో స్నేహితులు ఎలా ఉండాలో కృష్ణుడిని చూసి ఈతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జతగాడైన కుచేలుడిని ఆదుకున్న తీరు అద్భుతం. కుచేలుడు నిరుపేద. శ్రీకృష్ణుడు రాజ్యాధినేత. మొహమాట పడుతూ తనవద్దకు వచ్చిన నేస్తాన్ని అడిగిమరీ అటుకుల మూట తీసుకున్నాడు. అడక్కపోయినా సకలసౌభాగ్యాలూ ప్రసాదించాడు. స్నేహితుడిని సమాదరించి, స్నేహబంధం అన్నింటికీ అతీతమైందని నిరూపించాడు కృష్ణస్వామి.

జ్ఞానగోవిందం
పదవులకోసం పాకులాడటం, స్కాంల కోసం స్కీంలు వేయడం కాక రాజకీయమంటే ఏమిటో, దాన్ని రసవత్తరంగా ఎలా నడపాలో చూపిన రాజకీయ దురంధరుడు శ్రీకృష్ణుడు. ధర్మ రక్షణ కోసం ఆ మధుసూదనుడు నెరిపిన రాజకీయ చదరంగమే కురుక్షేత్ర యుద్ధం. దుష్టులను శిక్షించడానికీ ధర్మం పక్షాన నిలబడటానికీ మాధవుడు వేయని ఎత్తుగడ లేదు, చేయని రాజకీయం లేదు. కాళీయ మర్దనం నుంచీ కురుక్షేత్ర సంగ్రామం వరకూ ప్రతిదీ కన్నయ్య ప్రణాళికే. అంతటి రాజనీతిజ్ఞుడు మరొకడుండడు. మహాభారతాన్ని రాజకీయకోణంలో చూస్తే కృష్ణుడిదే కీలక పాత్ర. కౌరవుల దుర్మార్గాన్నీ, దుర్బుద్ధినీ దెబ్బతీయడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తాను కావాలా లేక కోట్ల సైన్యం కావాలా అని ప్రశ్నించి తెలివిగా తప్పుదోవ పట్టించాడు. రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించాడు. సర్వవేదాంత సారమైన గీతా శాస్త్రాన్ని మానవాళికి అందించాడు. కురుక్షేత్ర రణరంగంలో సారధిగా అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసి మార్గదర్శి అయ్యాడు. ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన చేరి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు. మహాభారత సంగ్రామంలో పాండవులకే విజయాన్ని కట్టబెట్టి అంతిమ విజయం ధర్మానిదేనని రుజువుచేశాడు. బలగం కంటే బలం, జ్ఞానం కంటే బుద్ధీ గొప్పవని చాటిచెప్పాడు.

గురుగోవిందం
నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య యుగాలనాడే చూపించాడు. ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడిపారిపోకూడదు. చివరివరకూ విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి. గోకులంలో ఉన్నప్పుడు ఊరి సమస్యను తనదిగా భావించాడు కాబట్టే గోకులాన్ని రక్షించడానికి గోవర్ధనగిరిని చిటికెనవేలిమీద మోశాడు. తనవారికి కష్టం వచ్చినప్పుడు తాను ముందుండి పోరాడి జగత్తుకి దిశానిర్దేశం చేశాడు. జీవితమంటేనే పోరాటమని తెలిసినవాడు కాబట్టే జరాసంధుడితో పదిహేడుసార్లు యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు. యుద్ధంలో ఓడిపోయే సందర్భం ఎదురైన ప్రతిసారీ జరాసంధుడు పారిపోయేవాడు. కానీ మళ్లీ బలం పుంజుకుని యుద్ధానికి సై అనేవాడు. దీంతో వరుస యుద్ధాలు చేయక తప్పలేదు కన్నయ్యకు. సమస్యలకు దూరంగా ఉండటమే కాదు, అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చేసి చూపాడు. ఎప్పుడూ ఎదురెళ్లి పోరాడటమేకాదు ఒక్క అడుగు వెనక్కివేసినట్టు కనిపించైనా శత్రువుని తుదముట్టించడమూ ఆయనకి తెలుసు. కాలయవనుడి ఉదంతంలో కృష్ణుడు ఈ ఎత్తుగడనే వేశాడు. అక్షౌహిణులకొద్దీ సైన్యంతో తనమీద యుద్ధానికి వచ్చిన కాలయవనుడికి నిరాయుధుడై ఎదురునిలిచాడు. భయపడినట్టు నటించాడు. కొండకోనల్లోకి పరుగులు తీశాడు. ఓ పాడుబడ్డ గుహను చేరాడు. ముందూ వెనకా ఆలోచించకుండా కన్నయ్యనే వెంబడిస్తూ గుహలోకి అడుగుపెట్టాడు కాలయవనుడు. గాఢాంధకారంలో నిద్రపోతున్న ఓ వృద్ధుడిని చూసి శ్రీకృష్ణుడిగా భ్రమించి ముచికుంద మహర్షిని తట్టిలేపాడు. ఆ ముని ఆగ్రహంతో కళ్లుతెరిచేసరికి నిలువునా భస్మమైపోయాడు. అదీ గోవిందుడి వ్యూహమంటే. భారతంలోనూ అంతే, పాండవ పక్షపాతిలా కనిపించినా వారికీ ఏమీ చేసినట్లుండడు. దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా... ఏ సహాయమూ చేయడు. కానీ తాను నిలిచిన పక్షపు బలాబలాలను తెలుసుకుంటూ ఎత్తూలూ పై ఎత్తూలూ వేస్తూ పాండవులను విజయపథాన నడిపించాడు. నాయకుడు ప్రణాళిక, వ్యూహం అన్నీ సమపాళ్లలో రంగరించి బృందాన్ని ముందుకు నడిపించాలనీ, కదనరంగంలో కత్తిపట్టితీరాలనేమీ లేదనీ వ్యవహారాన్ని చక్కదిద్దే నేర్పు ఉంటే చాలనీ చాటిచెప్పాడు. శ్రీకృష్ణుడనే నాయకుడే లేకపోతే పాండవుల విజయాన్ని ఊహించనేలేం.

భాగవత భారతాల్లో మరపురాని మధుర ఘట్టాలకు మూలకారకుడు మాత్రమే కాదు, మానవులకు జీవిత పర్యంతం పాఠాలు నేర్పే జగద్గురువు శ్రీకృష్ణుడు. జీవితంలోని ప్రతిదశనూ పరిపూర్ణంగా ఆస్వాదించాడు గోపాలుడు. చిలిపి అల్లరితో తన బాల్యాన్ని తరతరాలకూ చిరస్మరణీయం చేశాడు. మధురమైన మురళీ గానంతో ప్రకృతిని సైతం ఆనందడోలికల్లో ఓలలాడించాడు. తలచినంతనే చెంతచేరి పదహారువేల మంది గోపికల్నీ ప్రేమధారల్లో ముంచెత్తాడు. మేధాశక్తితో నారితో సైతం వింటినారిని పట్టించాడు. యుద్ధంలో పాంచజన్యాన్ని పూరించి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాడు. అయినా... ఏ మూసలోనూ ఒదగడు. ఏ అధికారానికీ లొంగడు. అందుకే శ్రీకృష్ణుడు ‘అయినవాడే అందరికీ - అయినా అందడు ఎవ్వరికీ’!




కృష్ణమంత్రం


భూమ్మీద మనిషి మనుగడ మొదలై ఎన్ని యుగాలు దాటినా... ఎన్ని కాలాలు మారినా... మనసులో ఏదో వెలితి. ఇంకేదో అశాంతి. వ్యవస్థలకు తగ్గట్టు వ్యక్తినీ, వ్యక్తిత్వానికి నప్పేట్టు మనసునీ మార్చేసుకుంటున్నా ఆ లోటు మాత్రం గుండెను మెలిపెడుతూనే ఉంది. పనిలో ధర్మాన్ని నిలుపుతూ, ప్రవర్తనలో నీతిని చూపుతూ, అలవాటుగా న్యాయాన్ని అందించే ఒకేఒక్క మంత్రం కృష్ణతత్వం. ఎందుకంటే... కృష్ణుడు న్యాయం వైపు ఉన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించాడు. సర్వాంతర్యామే అయినా అందరితోనూ అంటీముట్టనట్టు వ్యవహరించాడు. అదే సమయంలో కోరి పిలిస్తే ఆలోచించకుండా ఆదుకున్నాడు. ఏమీ తెలీనట్లే ఉంటాడు. కానీ న్యాయం ఎక్కడుంటే అక్కడుంటాడు. కష్టాలూ, సవాళ్లూ ఎదురైనప్పుడు.. ధైర్యంగా అడుగు ముందుకు వేయమంటాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోమంటాడు. మానసిక ధైర్యాన్ని అలవర్చుకోమంటాడు. అందుకే కృష్ణతత్వం...సమస్యల సుడిగుండంలో కూరుకుపోయినవారికి నిచ్చెనలు మాత్రమే ఉండే పరమపదసోపానం, గమ్యమేంటో తెలియక పరుగులు తీసేవారికి దారిచూపే వెలుగురేఖ, ఒత్తిడితో సతమతమయ్యే వారికి తిరుగులేని ఔషధం.


రాధామాధవం


ప్రేమంటే రాధ. రాధంటేనే ప్రేమ. కృష్ణుడి ఆనందం తప్పమరేమీ ఆశించని ప్రేమ ఆమెకే సాధ్యం. ఆ ప్రేమే రాధను రసరాణిని చేసింది. దేవదేవుడైన కృష్ణుడిని రాధాదాసుడిగా మార్చింది. అందుకే ఆ ఇద్దర్నీ ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. రాధాకృష్ణుల్లో ఏ ఒక్కరు లేకపోయినా ఆ ప్రేమ పరిపూర్ణంకాదు. అలాంటి ప్రేమను శ్రీకృష్ణుడు ఓసారి పరీక్షించాలనుకుంటాడు. గోపిక వేషం కడతాడు. గోపదేవిగా రాధను ఏడిపిస్తాడు. తాను గోవర్ధన గిరివైపు వెళ్తున్నప్పుడు కృష్ణుడు తన వెంట పడ్డాడనీ, పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశాడనీ గోపదేవి రాధతో చెప్తుంది. కృష్ణుడి ధోరణి తనకి ఎంత మాత్రం నచ్చలేదంటూ అందగాడినని మిడిసిపడుతున్న కృష్ణుడి ప్రేమను తిరస్కరించి తగిన అవమానం చేశాననీ అంటుంది. ఆ మాటలు తట్టుకోలేనట్టుగా రాధ కన్నీళ్ల పర్యంతమవుతుంది. నవనీత హృదయుడి అంతరంగాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లనే గోపదేవి అంత కఠినంగా మాట్లాడగలుగుతోందని అంటుంది. ఆమె ప్రవర్తనకు గోపాలుడి మనసు ఎంత గాయపడిందోనని ఆవేదన చెందుతుంది. దీంతో రాధ హృదయంలో తనకి ఉన్న స్థానం ఎంత గొప్పదో కృష్ణుడికి అర్థమైపోతుంది. ఆయన గోపదేవి రూపాన్ని విడిచి నిజరూపంలో రాధ ఎదుట నిలుస్తాడు. ఆశ్చర్యపోయిన రాధ ఆనందబాష్పాలతో కృష్ణుడి కౌగిలిలో ఒదిగిపోతుంది.


- దంతుర్తి లక్ష్మీప్రసన్న

Sunday, 21 October 2018

అన్నం పరమాన్నం








అన్నం పరమాన్నం


నవరాత్రి పండుగ అంటే  తొమ్మిదిరోజుల పాటు శక్తిని ఆరాధించడం. నవ అనే పదానికి తొమ్మిది అని అర్థం. తొమ్మిది రాత్రులు ఆ తల్లిని పూజించి పదో రోజు విజయ దశమి రోజున వేడుకగా, భక్తిశ్రద్ధలతో ఆచరించడం. మన అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, మనసును ఆధ్యాత్మికత వైపుకు మళ్లించమని, భగవంతుని ముందు దీపం వెలిగించి ఆ తల్లిని ప్రార్థించడం ఈ పండుగ ప్రాధాన్యత.

1. గుడాన్నప్రీత మానసా: ఈపండుగలో గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. అందుకే లలితా సహస్రంలో గుడాన్నప్రీత మానసా అని అర్చిస్తారు.

2. స్నిగ్ధౌదన ప్రియా: స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెలుపు స్వచ్ఛతకు, పరిశుభ్రతకు, నిర్మలమైన అంతరంగానికి మారుపేరు. మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే చేసే పనులు అంత స్వచ్ఛంగా ఉంటాయని పండితులు చెబుతారు. పని పట్ల నిబద్ధత, భక్తిభావం కలిగి ఉండాలని, అమ్మవారిలాగే మనం ఆచరించే కర్మలు స్వచ్ఛంగా ఉండాలని ఈ ప్రసాదం సూచిస్తుంది. అందుకే స్నిగ్ధౌదన ప్రియా అని ఆ తల్లిని అర్చిస్తారు.

3. పాయసాన్నప్రియా: పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు ఇతరులకు మధురంగా అనిపించాలి. మధురపదార్థం జిహ్వను తాకగానే మనసు ఆనంద తరంగాలలో డోలలూగుతుంది. మధురమైన సంభాషణలు పలికితే ఇతరుల మనసులు కూడా ఆనందసాగరంలో తేలియాడుతాయి. అందువల్లే ఆ తల్లి పాయసాన్నప్రియా నామం ద్వారా తియ్యని మాటలను పలుకమని బోధిస్తోంది.

4. మధుప్రీతా: మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేనె సకల వ్యాధులకు నివారణోపాయం. తేనెను స్వీకరించడం  ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే అంతరార్థంతో ఆ తల్లిని మధుప్రీతా అని అర్చిస్తాం.

5. దద్ధ్యన్నాసక్త హృదయా: దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం, హృదయా అంటే అంతటి మనస్సు కలిగినది. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం. పాలను కాచి, తోడు వేస్తే కాని పెరుగు లభించదు. పెరుగుకు అన్నం జోడించి తయారుచేసేదే దద్ధ్యోదనం. కార్యంలో విజయం సులువుగా లభించదని, లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల, దీక్ష అవసరమని ఈ నైవేద్యం ద్వారా ఆ తల్లి చెబుతోంది. ఎంతో కొంత శ్రమకోర్చితేనే పెరుగు లభిస్తుంది. కాని సాధించిన తర్వాత లభించే రుచి వర్ణనాతీతం అని ఈ మంత్రం తెలియచేస్తోంది.

6. ముద్గౌదనాసక్త హృదయా: ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగిన, హృదయా అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి. నిత్యం గుప్పెడు పెసలు తింటే ఆరోగ్యం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈ పదార్థాలను తిని ఆరోగ్యంగా జీవించమని ఆ తల్లి చెబుతోంది. అందుకే ఆమెను ముద్గౌదనాసక్త హృదయా అని ఆరాధిస్తున్నాం

7. హరిద్రాన్నైక రసికా: హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిల్చుకుంటాం. పసుపు శుభానికి సూచిక. సర్వ సూక్ష్మజీవులను హరించే శక్తి కలిగి ఉన్న పదార్థం. పసుపుతో తయారయిన అన్నం కడుపులోని అనారోగ్యాలను దూరం చేస్తుందని అంతరార్థం. ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ. అందుకే హరిద్రాన్న + ఏక అంటున్నాం. ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది.

8. సర్వౌదనప్రీతచిత్తా: సర్వ అంటే అన్నిరకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్తా అంటే మనసు కలిగి ఉండటం. అన్నిరకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం. ఆశ్వీయుజ మాసంలో వరి పంట ఇంటికి చేరుతుంది. కాయగూరలు తాజాగా ఉంటాయి. కొత్తబియ్యం, కొత్త బెల్లం, ఆవు పాడి... వీటితో ఈ తొమ్మిదినాళ్లు తొమ్మిది రకాల నైవేద్యాలను నివేదన చేస్తారు.

లలితా సహస్రంలో నైవేద్యాలు
లలితా సహస్రంలో చెప్పిన ఈ నైవేద్యాలన్నీ అతి సులువుగా జీర్ణమై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నవరాత్రులలో చాలామంది ఏకభుక్తం ఉంటారు. ఆ ఒక్కపూట కూడా సులువుగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే స్వీకరిస్తారు. అలా ఆ తల్లిని తొమ్మిది రోజులు ధ్యానించి, తేలికపాటి నైవేద్యాలను ఆ శక్తికి నివేదించి, స్వీకరించి ఆరోగ్యాన్ని వరంగా పొందాలన్నదే ఈ నామాల పరమార్థం అని పండితులు చెబుతున్నారు.





అష్ట ఇష్ట  నైవేద్యాలు

ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారికి ఏమేమి పదార్థాలు ఇష్టమో అడిగి తెలుసుకుని వండి ప్రేమగా వడ్డిస్తాం. ఇవి దసరా నవరాత్రులు. అమ్మవారు మన ఇంటికి అతిథిగా అడుగుపెట్టారు. మరి ఆమెకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని రుచిగా శుచిగా వండి, భక్తి శ్రద్ధలతో ఆమెకు నివేదిస్తే ఎంత బాగుంటుంది? ఆమెకు ఇష్టమైనవాటిని లలితా సహస్రంలో వర్ణించారు. వాటినే మేము ఇక్కడ మీకోసం వండాం. ఇంకెందుకాలస్యం? మీరూ ప్రయత్నం చేయండి... అమ్మవారికి ఆరగింపు చేయండి.

1 గుడాన్నం (బెల్లం అన్నం) (గుడాన్న ప్రీత మానసా)
కావలసినవి: బాస్మతి బియ్యం – 400 గ్రా.; బెల్లం పొడి – 250 గ్రా; లవంగాలు – 4; నీళ్లు – 4 కప్పులు; నెయ్యి – 100 గ్రా; ఏలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙ఈ రుచికరమైన వంటకాన్ని తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు అరగంటసేపు నానబెట్టాలి ∙ఒక పెద్ద గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి, స్టౌ మీద సన్నటి మంట మీద నీళ్లు మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగిన తరవాత బియ్యం వేసి కలియబెట్టాలి∙బియ్యంతో పాటు లవంగాలు కూడా వేయాలి ∙అన్నం మెత్తగా ఉడికిన తరవాత గంజి ఉంటే వార్చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙బాదం పప్పుల తరుగు వేసి దోరగా వేయించాక, బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ∙బెల్లం బాగా కరిగిన తరవాత ఏలకుల పొడి వేసి కలిపి, ఉడికించిన అన్నం కూడా వేసి కలియబెట్టాలి ∙అన్నం గోధుమరంగులోకి వచ్చేవరకు కలిపి, మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙అమ్మవారికి తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి ఆ తల్లి కృపకు పాత్రులవుదాం.

కొబ్బరి అన్నం(స్నిగ్ధౌదన ప్రియా)
కావలసినవి:  బియ్యం – అరకిలో; నెయ్యి – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు ; ఆవాలు – ఒక టీ స్పూను ; జీలకర్ర – ఒక టీ స్పూను ; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను ; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; ఇంగువ – చిటికెడు ; కరివేపాకు – రెండు రెమ్మలు ; పచ్చిమిర్చి – 5; కొత్తిమీర – తగినంత; ఉప్పు – తగినంత ; జీడి పప్పులు – 10

తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో జీడి పప్పులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ  వేసి వేయించాలి ∙పోపు బాగా వేగిన తరవాత తరిగిన పచ్చిమిర్చి వేసి మరోమారు వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, వేయించిన పచ్చి కొబ్బరి మిశ్రమం, తాలింపు, వేయించిన జీడి పప్పులు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా కొత్తిమీరతో అలంకరించి, అమ్మవారికి నివేదన చేసి, మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మ ప్రసాదంగా స్వీకరించాలి.

క్షీరాన్నం (పాయసాన్న ప్రియా)
కావలసినవి: కొత్త బియ్యం – అర కప్పు; పాలు – 3 కప్పులు; నెయ్యి – పావు కప్పు; బెల్లం పొడి – అరకప్పుకి కొద్దిగా తక్కువ; నీళ్లు – ముప్పావు కప్పు; జీడిపప్పులు – 10; బాదం పప్పులు – 5; కిస్‌మిస్‌ – 10; ఏలకుల పొడి – పావు టీ స్పూను

తయారీ: ∙ఒక పాత్రలో బెల్లం పొడి, పాలు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి, వడబోసి పక్కన ఉంచాలి ∙మందపాటి బాణలిని స్టౌ మీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙జీడి పప్పులు, బాదం పప్పులు, కిస్‌మిస్‌ జత చేసి వేయించి తీసిపక్కన ఉంచాలి ∙అదే నేతికి బియ్యం జత చేసి దోరగా వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙ బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙ అన్నం బాగా ఉడికిన తరవాత బెల్లం పాకం జత చేస్తూ ఆపకుండా కలుపుతుండాలి ∙మిశ్రమం బాగా దగ్గరపడేవరకు కలపాలి ∙మిగిలిన నేతిని జత చేయాలి ∙ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్‌ జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙అమ్మవారికి నివేదించి ప్రసాదంగా సేవించాలి.

తేనె గారెలు(మధు ప్రీతా)
కావలసినవి: మినప్పప్పు – రెండు కప్పులుఉప్పు – చిటికెడుతేనె – తగినంతనూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ: ∙మినప్పప్పును బాగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి నీళ్లు ఎక్కువ పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి ∙బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాచాలి ∙పిండికి ఉప్పు జతచేసి కలపాలి ∙చేతికి తడి చేసుకుని కొద్దిగా పిండిని అరటి ఆకు మీద గారె మాదిరిగా ఒత్తి, కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙తయారుచేసుకున్న గారెల మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీర్వాదం పొందాలి.

దద్ధ్యోదనం(దధ్ద్యన్నాసక్త హృదయా)
కావలసినవి: బియ్యం – పావు కిలో; పాలు – అర లీటరు; చిక్కటి పెరుగు – అర లీటరు; ఉప్పు – తగినంత ; నూనె – అర కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీస్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను ; ఎండు మిర్చి – 4 ; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు ; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; జీడి పప్పులు – 10 ; కొత్తిమీర – కొద్దిగా; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు

తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి పక్కన ఉంచాలి ∙ ఒక పాత్రలో పాలు పోసి కాచి చల్లార్చాలి ∙ అన్నం బాగా చల్లారాక ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి ∙అందులో కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙ అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙పెరుగు కలిపిన అన్నంలో పోపు, వేయించిన జీడిపప్పులు వేసి కలియబెట్టాలి ∙చివరగా అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ∙ ఆ తల్లి దీవెనలు అందుకుని ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థించాలి.

పొంగల్‌ (ముద్గౌదనాసక్త హృదయా)
కావలసినవి: పెసరపప్పు – 150 గ్రా.; కొత్త బియ్యం – 100 గ్రా.; మిరియాలు – 15 (పొడి చేయాలి); పచ్చి మిర్చి – 6; పచ్చి కొబ్బరి – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 15; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండుమిర్చి – 3; మినప్పప్పు + సెనగ పప్పు – 2 టేబల్‌ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు తగినంత ; ఇంగువ – కొద్దిగా

తయారీ: ∙దళసరి పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙పెసర పప్పు వేసి దోరగా వేయించాలి ∙బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా వేసి సుమారు ఐదు నిమిషాల పాటు బాగా వేయించి (తెలుపు రంగు పోకూడదు) తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, మిరియాల పొడి వేసి వేయించాక, జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి, వేయించిన బియ్యం, పెసరపప్పు ఇవన్నీ వేసి కుకర్‌లో వుంచి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙అందులో ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న పొంగలిలో వేయాలి ∙ఉప్పు వేసి బాగా కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ∙‘మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అని ప్రార్ధించాలి 

పులిహోర(హరిద్రాన్నైక  రసికా)
కావలసినవి: బియ్యం – అర కేజీ; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; పచ్చి మిర్చి – 4; నూనె – 100 గ్రా.; పల్లీలు – 100 గ్రా.; ఇంగువ – మూడు రెమ్మలు; పసుపు – తగినంత; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను (పులుపు చాలకపోతే మరి కాస్త రసం జత చేయాలి)

తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, వెడల్పాటి పాత్రలో పోసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పల్లీలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించి, అన్నంలో వేసి కలపాలి ∙పసుపు, ఉప్పు, నిమ్మరసం జతచేసి మరోమారు బాగా కలిపి అమ్మవారిని నివేదన చేసి, ప్రసాదంగా సేవించాలి.

కదంబం (సర్వౌదన ప్రీత చిత్తా)
కావలసినవి: కంది పప్పు – అర కప్పు; కొత్త బియ్యం – అర కప్పు; వంకాయ ముక్కలు, సొర కాయ ముక్కలు, దోస కాయ ముక్కలు, బీన్స్‌ తరుగు, బంగాళ దుంప ముక్కలు, క్యారెట్‌ తరుగు, టొమాటో తరుగు –  అన్నీ కలిపి రెండు కప్పుల ముక్కలు; పల్లీలు – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – తగినంత ; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా తరగాలి); నెయ్యి – పావు కప్పు; చింతపండు గుజ్జు – పావు కప్పు (చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు; సాంబారు పొడి – 3 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఇంగువ – చిటికెడు

తయారీ ∙కాయగూరలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి ∙బియ్యం, కందిపప్పులను శుభ్రంగా కడగాలి ∙కుకర్‌లో బియ్యం, కందిపప్పు, తరిగిన కూరగాయ ముక్కలు (టొమాటో వేయకూడదు), తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, టొమాటో తరుగు వేసి దోరగా వేయించాలి ∙ చింతపండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా ఉడికించాలి ∙సాంబారు పొడి వేసి మరిగించాలి ∙బాగా ఉడికిన తరవాత ఆ గ్రేవీని ఉడికించిన బియ్యం, కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి మరోమారు కొద్దిసేపు ఉడికించాలి ∙ చివరగా కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒకసారి ఉడికించి దింపేయాలి ∙వేడి నెయ్యి జత చేసి, అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందుదాం. 

అమ్మల గన్న యమ్మ...








అమ్మల గన్న యమ్మ...



దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి
దారిద్య్ర దుఃఖభయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా

నేటి నుంచి శరన్నవరాత్రులు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు కొలువుదీరిన క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని నవరాత్రుల సందర్భంగా నవవిధ రూపాల్లో కొలుస్తారు. అందులోనూ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆరాధన ఈ రోజుల్లో అత్యంత విశేషం. ఈ నవరాత్రుల్లో నవదుర్గల అలంకార విశేషాలు, సమర్పించే నైవేద్యాలు రోజూ ‘నవ్య’ పాఠకుల కోసం...

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి


నేటి అలంకరణ :శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి బుధవారం
నైవేద్యం:చక్కెర పొంగలి, గారెలు, మినప పిండితో చేసిన ఇతర వంటలు
అలంకరించే చీర రంగు:బంగారు వర్ణం
అర్చించే పూల రంగు:ఎరుపు
పారాయణ :దుర్గా సప్తశతి

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారి తొలి అలంకారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఇతిహాసం ప్రకారం, పూర్వం మాధవవర్మ మహారాజు విజయవాటికాపురి (నేటి విజయవాడ)ని ధర్మం నాలుగు పాదాలా నడిచేలా, జనప్రియంగా పరిపాలించేవాడు. అతడు గొప్ప దేవీ భక్తుడు. ఒకరోజు ఆయన కుమారుడు నగర సందర్శన సమయంలో అతని రథ చక్రాల కింద ఒక బాలుడు పడి మరణించాడు. ఆ బాలుడి తల్లితండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం చేయాలని రాజును కోరారు. విచారించిన రాజు తన కుమారుడిని దోషిగా నిర్ణయించి, అతడికి మరణశిక్ష విధించాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు (దుర్గాదేవి) మృతిచెందిన బాలుడికి ప్రాణభిక్ష పెట్టారు. విజయవాటికాపురిలో కొన్ని గంటల పాటు కనకవర్షాన్ని కురిపించారు. అప్పటి నుంచి ఈ అమ్మవారు ‘కనకదుర్గగా పూజలందుకుంటున్నారు. ‘దుర్గా’ అంటే దుర్గతులు నశిస్తాయనీ, ఆ తల్లిని దర్శించుకోవడం వల్ల సకల దారిద్య్రాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందనీ నమ్మిక.


బాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గామాత


నేటి అలంకరణ :బాలాత్రిపుర సుందరీదేవి
ఆశ్వయుజ శుద్ధ విదియ, గురువారం
నైవేద్యం:పాయసం, పులగం
అలంకరించే చీర రంగు:లేత గులాబీ రంగు
అర్చించే పూల రంగు:ఎరుపు
పారాయణ :లలితా త్రిశతి

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలామ్‌
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితామజ్జ్వలాం
తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీమ్‌

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదనీ, శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా గొప్పదనీ ఆధ్యాత్మికుల ఉవాచ. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదటగా ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో తొలి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని పెద్దలు చెబుతారు.

త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురా త్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఆమె అధిష్ఠాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ‘లలితా త్రిశ తి’ పారాయణం చేస్తుంటారు.

మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయంటారు. ఆమె సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. సకల దారిద్ర్యాలు నశిస్తాయి. త్రిమూర్తి స్వరూపమైన ఆమెను కొలిచిన వారికి జ్ఞానం కలుగుతుంది. జీవనోపాధి లభిస్తుంది. చదువులలో ఉన్నతులవుతారు. ఇది అనాదిగా భక్తుల విశ్వాసం.


వరదాయిని గాయత్రి!!


నేటి అలంకరణ :శ్రీ గాయత్రీ దేవి
NA
నైవేద్యం:అల్లం గారెలు, ఐదు రకాల పిండివంటలు
అలంకరించే చీర రంగు:కాషాయ వర్ణం
అర్చించే పూల రంగు:NA
పారాయణ :గాయత్రీ మంత్రం

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్‌ ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌
గాయత్రీం వరదాభయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే!

నవరాత్రుల్లో మూడో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా.. త్రిమూర్త్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుతోంది. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. అందుకే ఆ యా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీగాయత్రి, విష్ణుగాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెబుతారు. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆ యా దేవతలకు నివేదన చేస్తారు. గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత సూర్యభగవానుడు.

గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు సౌరశక్తి ప్రాప్తమవుతుంది. ఆరోగ్యం లభిస్తుంది. వరదాభయహస్తాలతో... సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగానూ, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ ఉపాసనతో బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుంది. గాయత్రిని వేదమాతగా కొలుస్తూ, ఆమెను దర్శించడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారు. ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. పూజించిన వారికి సద్బుద్ధులు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. అజ్ఞానం తొలగిపోతుంది. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.


 లలితా త్రిపుర సుందరీమ్‌ ఆశ్రయే!


నేటి అలంకరణ : శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి
NA
నైవేద్యం:అల్లం గారెలు, ఐదురకాల తీపి పదార్థాలు
అలంకరించే చీర రంగు:బంగారు వర్ణం
అర్చించే పూల రంగు:వివిధ రకాలు
పారాయణ :లలితా సహస్రనామం

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌ శ్రీశ్రీ

నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా కొలువై.. తనను కొలిచే భక్తులనూ, ఉపాసకులనూ అనురగ్రహిస్తుంది. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమెది. లక్ష్మీసరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా, శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువై ఉంటుంది.

చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి, శివుడి వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలిస్తుందనీ, పంచ, దశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్నీ, ఉపాసకుల్నీ అనుగ్రహిస్తుందనీ భక్తులు నమ్ముతారు. లలితాదేవి విద్యా స్వరూపిణి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అనీ, మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనీ విశ్వాసం.. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చెయ్యాలనీ, వివిధ పూలతో, కుంకుమతో అర్చించాలనీ పురాణాలు పేర్కొంటున్నాయి. త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారనీ, ఆమెను ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయనీ చెబుతున్నాయి.


సర్వసిద్ధికరీ... సరస్వతీ!


నేటి అలంకరణ : సరస్వతీదేవి
NA
నైవేద్యం:దద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు
అలంకరించే చీర రంగు:తెలుపు
అర్చించే పూల రంగు:కలువ పూలు
పారాయణ :సరస్వతీ స్తోత్రాలు

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై స్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. మూలానక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన దుర్గాదేవి తన నిజ స్వరూపంతో సాక్షాత్కరించడమే మూలానక్షత్రం సందర్భంగా సరస్వతిదేవి అలంకారం విశిష్టత. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్ఠాన దేవత. అమ్మవారి అనుగ్రహం కోరుకున్నవారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. మూలానక్షత్రం నాటి నుంచి విజయదశమి విశేష దివ్యదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహాసరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయిని. ఆమెను కొలిస్తే విద్యార్థులకు చదువు బాగా వస్తుందనీ, జ్ఞానజ్యోతులను ఆమె ప్రసాదిస్తుందనీ, వాక్సుద్ధి, మంచి బుద్ధీ ఇస్తుందనీ నమ్మిక.





సౌభాగ్యదాం... భాగ్యదాం


నేటి అలంకరణ : శ్రీ మహాలక్ష్మి
NA
నైవేద్యం:రవ్వ కేసరి, గారెలు, చిత్రాన్నం, పాయసం
అలంకరించే చీర రంగు:గులాబీ (పింక్‌)
అర్చించే పూల రంగు:తామర పుష్పాలు
పారాయణ :లక్ష్మీ స్తోత్రాలు


లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్‌ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుందప్రియాం

నవరాత్రి మహోత్సవాల్లో ఏడో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారం చేయడం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణి మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. మహా లక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం సంపత్ప్రదం. ఈ రూపంలో ఆమెను అర్చిస్తే ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దర్శించడం వల్ల భక్తులకు ఐశ్వర్యం, విజయం లభిస్తాయనీ, పూజించడం వల్ల దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయన్నది భక్తుల నమ్మిక. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి ఆదిపరాశక్తి దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ... గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తుందంటారు పెద్దలు.




దుర్గే దుర్గతి నాశని!


నేటి అలంకరణ : దుర్గాదేవి
NA
నైవేద్యం:గారెలు, చిత్రాన్నం
అలంకరించే చీర రంగు:ఎరుపు
వేటితో అర్చించాలి:గులాబీలు, ఎర్రటిపూలు, కుంకుమ, ఎర్రటి అక్షతలు
పారాయణ :దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకీ


సర్వస్వరూపే సర్వేశ సర్వశక్తి సమన్వితే
భయేభ్య స్ర్తాహి నో దేవి దుర్గ్గే దేవీ నమోస్తుతే!

దేవీ నవరాత్రి మహోత్సవాల్లో ఎనిమిదో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవిగా దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడిని వధించి, దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దుర్గగా స్వయంభువై అమ్మవారు వెలుగొందినది అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ అష్టమిని ‘దుర్గాష్టమి’ అని వ్యవహరిస్తారు. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది.

భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయి. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ నమ్మిక. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం శుభాలను కలుగజేస్తుందనీ, దివ్యరూపిణి దుర్గమ్మ వారి దర్శనం సకల శ్రేయోదాయకమనీ పెద్దల మాట.




జయ జయహే మహిషాసురమర్దిని!


నేటి అలంకరణ : మహిషాసురమర్దిని
అయిగిరినందిని, నందితమేదిని, విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరికుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే!!

నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన 18వ తేదీ గురువారం ఒకేరోజు రెండు అలంకారాలలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమివ్వనుంది. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 11 గంటల వరకు అమ్మ వారు మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో, సింహవాహినిగా మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కులుడు, బిడాలుడు వంటి రాక్షసులందర్నీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువైంది.

ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం ఇదే. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన చండీ దేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందంటారు. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయనీ, శత్రు పరాజయం కలుగుతుందనీ, అంతః శత్రువులు కూడా నశిస్తాయనీ, ధైర్యం కలుగుతుందనీ, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందనీ నమ్మకం. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అరిషడ్వర్గాలు నశిస్తాయి. సాత్విక భావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పటాపంచలవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరతాయి.

ఆశ్వయుజ శుద్ధ నవమి
నైవేద్యం:బెల్లపు అన్నం, పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు
అలంకరించే చీర రంగు:గోదుమ, ఎరుపు కలనేత జరీ
అర్చించే పూల రంగు:తామర పుష్పాలు
పారాయణ :మహిషాసురమర్దినీ స్తోత్రం

రాజరాజేశ్వరీదేవి


నేటి అలంకరణ : రాజరాజేశ్వరీదేవి

అంబా శాంభవి చంద్రమౌళి రబలా అపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఆమె సకల భువన, బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన అమ్మను మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంతి స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గా పిలుస్తారని ప్రతీతి. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది.

మాయామోహితులైన మానవుల్లో చైతన్యాన్ని యోగమూర్తిగా ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్ఠాన దేవత. ఆమెను కొలిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, ఆ అమ్మ భక్తుల కోరికలను నెరవేరుస్తుందనీ, మనసారా కొలిస్తే బ్రహ్మజ్ఞానం కలుగజేస్తుందనీ నమ్మిక. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని భక్తులందరికీ అందించే చల్లని తల్లి దుర్గమ్మను రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు భక్తులకు లభిస్తాయి.

ఆశ్వయుజ శుద్ధ దశమి- విజయదశమి
నైవేద్యం:పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రసోపేత) పదార్థాలు
అలంకరించే చీర రంగు:ఆకుపచ్చ, తెలుపు
అర్చించే పూల రంగు:ఎరుపు
పారాయణ :చెయ్యాల్సింది: లలితా సహస్రనామం
అర్చన :ఎర్రటి గాజులతో అలంకరించి, కుంకుమార్చన









బతుకమ్మ












బతుకు ఎలా ఉండాలో నేర్పే బతుకమ్మ



మనకు శిల, దారు, లోహాలతో విగ్రహం తయారుచేసి పూజించే సంప్రదాయం ఉంది. కానీ.. పుష్పాలను ఆరాధ్యదేవతగా చేసుకుని పూజించే సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉంది. సుందరంగా ఉండే ఈ నిసర్గచక్రంలో ముగ్ధమనోహరంగా కనిపించేవి పుష్పాలు. ఆ పువ్వులు ప్రకృతికే అలంకారమయ్యే రుతువు శరత్కాలం. వర్ణ సంశోభితమైన పుష్పాలను కళాత్మకంగా ఏర్చికూర్చే ఈ సంబరం చూసిన కన్నులే కన్నులు. బతుకమ్మలను తీర్చిదిద్దడం, ఆ తర్వాత వాటిచుట్టూ స్త్రీలు తమ సంగీత, నృత్య, సాహిత్య కౌశలాన్ని ప్రదర్శించేందుకకు ఆడే ఆటలు, పాటలు మరో వినూత్న చైతన్యాన్ని తెలియజేస్తాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మనాడు కలిసి ప్రసాదాలు పంచుకుని ఆడిపాడి ఆనందాన్ని పంచుకొనే దృశ్యం మన పండుగల సామాజిక దృష్టిని తెలియజేస్తున్నది. అదేరోజు సాయం సమయాన నీటిలో తేలియాడుతూ పూలరథాలుగా పయనించే వర్ణశోభిత బతుమ్మల సౌందర్యంలో భాషకందని భావాలతో సాగనంపే స్త్రీమూర్తుల ఆరాధన వ్యక్తమవుతుంది.

ఈ బతుకమ్మ.. వర్షరుతువు సమాప్తిని, శరదృతువు ఆగమనాన్ని సూచిస్తూ ఏటా మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి మహాగౌరీపూజతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో తయారుచేసే బతుకమ్మలను ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పేర్లముందున్న పదార్థాలే నైవేద్యాలు. బతుకమ్మ శబ్దం ‘బృహతమ్మ’ నుంచి వచ్చిందని కొందరు చెబుతారు. కాకతీయుల వంశదేవత కాకతమ్మనే బతుకమ్మగా మారిందని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో తంగేడు పువ్వుగా పుట్టిన చెల్లెలే బతుకమ్మ అని జానపదగాథలు చెబుతున్నాయి.

సంప్రదాయాలు తెలిసినవారు నవరాత్రుల్లో శ్రీచక్రాన్ని ముందు పెట్టుకొని నవావరణ పూజ చేస్తే.. సామాన్య స్త్రీలు ఎలాంటి రసాయనాలూ లేకుండా పూచే తంగేడు, గుమ్మడి, బీర, కట్ల గోరింట, గునుగు, అల్లి, టేకు పూలతో బతుకమ్మను మేరుప్రస్థ శ్రీచక్రం ఆకారంలో అమర్చి ఆరాధిస్తారు. స్త్రీలు ఇంటిపనులకే పరిమితం కాకుండా ఆట, పాటలలో నిమగ్నమై సామూహిక నిమజ్జనం (సామాజిక దృష్టి) చేసి సరికొత్త ఆలోచనలకు తెరతీస్తారు. అందరూ కలిసి ఆడిపాడి కులసమానత్వాన్ని సాధిస్తారు. సద్దుల బతుకమ్మనాడు అందరూ ఇళ్లనుంచి తెచ్చుకున్న ప్రసాదాలు పంచుకుని తినడం అంటే.. రుచికరమైన పదార్థం అందరూ తినాలనే ఆత్మీయత అందులో ఉంటుంది. మాతృ ఆరాధనకు నెలవుగా ఉన్న ఈ పండుగ స్త్రీత్వాన్ని గౌరవించాలని తెలుపుతుంది. అమ్మదనం ఉండి అందరూ బతకాలి.. అందరినీ బతికించాలి అనే సందేశం ఈ పండుగలో నిగూఢమై ఉంది.

-డా.పి.భాస్కరయోగి










బతుకమ్మ... బతుకమ్మ ఉయ్యాలో!




బతుకమ్మ...తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా జరుపుకొనే పూల పండగ. దసరా పండగ ముందు వచ్చే అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకూ తొమ్మిది రోజులపాటు చేసే ఈ పండగ ప్రత్యేకత అంతా ఇంతా కాదు. మన చుట్టూ లభించే పూలతో అందమైన బతుకమ్మలని పేర్చి... లయబద్ధంగా అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ... రకరకాల నైవేద్యాలు సమర్పించడం ఈ పండగ విశిష్టత.

బతుకమ్మ ఎవరంటే:
ధరచోళ దేశంలో ధర్మాంగుడనే రాజు, ఆయన భార్య సత్యవతి. వారికి చాలామంది మగసంతానం. అయితే వాళ్లందరు యుద్ధంలో మరణించడంతో ఆ దంపతులు అడవులకు వెళ్లి లక్ష్మి దేవి గురించి తపస్సు చేస్తారు. ఆమె ప్రత్యక్షమై వరం కోరుకో అంటుంది. తన కుమార్తెగా ఆమె పుట్టాలని అడుగుతారు. వారి కోరిక మేరకు సత్యవతికి అమ్మాయిగా పుడుతుంది. చుట్టు పక్కల మునులు ఆమెకు ‘కనీసం నువ్వైనా బతుకు’ అని ఆ పేరు పెడతారు.

మందారాలు మొదలు:
పూలను దొంతరలుగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో ఎక్కువగా గునుగు, తంగేడు, కట్లపూలు, కలువలు, గన్నేరు, మందారాలు... వంటి పూలు కనిపిస్తాయి. లలితా సహస్రనామంలో అమ్మవారిని చైతన్య కుసుమ ప్రియ అంటారు. చైతన్య కుసుమం అంటే గుమ్మడి పువ్వు. గుమ్మడి పువ్వును బతుకమ్మ పైన గౌరమ్మలా పెడతారు. ఆ పువ్వులోని పుప్పొడి పసుపు గౌరమ్మలా కనిపిస్తుంది. అమ్మవారిని గుమ్మంలో తెచ్చుకుని పూజిస్తారు. అయితే అంతకన్నా ముందు... వినాయక నిమజ్జనం తరువాత పాడ్యమి నుంచి పదకొండు రోజుల వరకు పదకొండేళ్ల లోపు ఆడపిల్లలంతా బొడ్డెమ్మ ఆడతారు. దాని తరువాత మహాలయ అమావాస్య రోజు బతుకమ్మను ఆడతారు. బతుకమ్మను వెదురు సిబ్బి (పళ్లెం లాంటిది)బుట్టల్లో మాత్రమే పేరుస్తారు. వెదురు అంటే పార్వతి మాతకు చాలా ఇష్టం. అందుకే వీటిలోనే బతుకమ్మలు చేస్తారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లతో పాటలు పాడతారు. ఈ చప్పట్ల ద్వారా అమ్మవారిని స్తుతిస్తూ ఆమెకు శక్తినిస్తుంటారు.

ఏమేమీ పువ్వప్పునే గౌరమ్మ... ఏమేవీ కాయప్పునే గౌరమ్మ
గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ


మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ


గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ... గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ అంటూ అమ్మవారిని పూజిస్తూ బతుకమ్మ ఆడతారు. మహాలయ అమావాస్య రోజున తెలంగాణ ప్రాంతంలో తమ పితృదేవతల (చనిపోయిన కుటుంబ పెద్దలు)ను గుర్తు చేసుకుంటూ బ్రాహ్మణులకు బియ్యం, కాయగూరలు, ఆకుకూరలు వంటివన్నీ ఇస్తారు. పెద్దలకు నైవేద్యంగా గారెలు, వడలు, పాయసం కూడా అర్పిస్తారు. వాటిని ఎక్కువగా పెసలతోనే తయారు చేస్తారు. ఈ నానబెట్టిన పెసలు, దోసముక్కలను సాయంకాలం బతుకమ్మ దగ్గర కూడా ప్రసాదంగా పెడతారు. అందుకే ఆ బతుకమ్మకు ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరొచ్చింది. మరికొన్ని చోట్ల అంతకుముందు రాత్రి పూలు తెచ్చి వాడటం వల్ల కూడా ఆ పేరు వచ్చిందంటారు. మరికొన్ని ప్రాంతాల్లో అటుకులు, బెల్లం ముక్కలను నైవేద్యంగా అర్పిస్తారు.

ఈ రోజున ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లాన్ని కలిపి ముద్దలు చేస్తారు. ముందుగా నూకలు దోరగా వేయించి బెల్లం పానకం చేసి నూకల పిండి, నువ్వులతో కలిపి ముద్దలు చేస్తారు. వీటిని విడిగా కూడా వెంట తీసుకెళ్తారు. వీటితోపాటుగా కొన్ని ప్రాంతాల్లో తులసి ఆకులు, వక్కపొడి, పసుపు కుంకుమలను కూడా తీసుకెళతారు. నువ్వుల్లో మాంసకృత్తులు, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. బెల్లంలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. నూకల్లో త్వరగా జీర్ణం అయ్యే పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి.

- డాక్టర్‌ ఆర్‌. కమల, రచయిత్రి


రెండో రోజు అటుకుల బతుకమ్మ

తొమ్మిది రోజుల బతుకమ్మ పండగలో రెండో రోజున అటుకుల బతుకమ్మ చేస్తారు. పూల అలంకరణ మామూలుగానే ఉన్నా... నైవేద్యాల తయారీ కాస్త భిన్నంగా ఉంటుంది. సప్పటి పప్పు, బెల్లం అటుకులు నివేదిస్తారు. సప్పటి పప్పును వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా తయారుచేస్తారు. ఇందుకు పెసర లేదా కందిపప్పును నానబెట్టి దాంతో ప్రసాదం తయారుచేస్తారు. మరికొన్ని చోట్ల కంది లేదా పెసర పప్పునకు వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు చాలినంత కలిపి ఉడకపెడతారు. దీన్ని బయటకు తీసి మెత్తగా రుబ్బుతారు. తరువాత మరికొన్ని నీళ్లను కలిపి రసంలా చేసి కాస్త గట్టిగా అయ్యే వరకు పొయ్యి మీద ఉడికిస్తారు. వీటికి కొత్తిమీర, పుదీనాతోపాటు మసాల దినుసుల పొడిని కలుపుతారు. దీన్నే సప్పటి పప్పు అంటారు. కొన్నిచోట్ల దీన్ని రసం మాదిరి చేస్తారు. మరికొన్ని చోట్ల ముద్దగా ఉంటుంది. ఈ వంటకం చేయనివారు పప్పు బెల్లం కలిపి తీసుకువెళతారు. వీటికి అటుకులు కూడా కలిపి బతుకమ్మ వద్ద పంచుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అటుకుల ముద్దలు తయారుచేస్తారు. బెల్లాన్ని ముదురుపాకం పట్టి అప్పటికే నెయ్యిలో వేయించి పెట్టుకున్న అటుకులను కలిపి ముద్దగా చేస్తారు. కొందరు అటుకులను నానబెట్టి రుబ్బి వాటితో రొట్టెలు చేస్తారు. ఇలా అటుకులనే ప్రధాన సద్దిగా తీసుకెళతారు. అందుకే దీన్ని అటుకుల బతుకమ్మ అంటారు. పెసరపప్పులో ఎక్కువగా మాంసకృత్తులుంటాయి. బెల్లం నుంచి ఇనుము అందుతుంది. ఈ రెండు అన్నివర్గాల మహిళలకు అత్యంత మేలుచేస్తాయి.

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ

ఈ రోజు బతుకమ్మకు ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేసి తీసుకెళతారు. కందిపప్పులో కొద్దిగా జీలకర్ర, కాస్త నూనె, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్‌లో ఉడికిస్తారు. తరువాత పప్పుగుత్తితో మెత్తగా చేసి, కొత్తిమీర కలుపుతారు. కొన్నిచోట్ల దీన్ని గట్టిగా చేసి చేతిలో పెట్టుకుని తింటారు. దీంతోపాటు పాలుబెల్లంతో కలిపిన ప్రసాదం కూడా ఉంటుంది. ముద్దపప్పులో మాంసకృత్తులు ఎక్కువ. నూనె తక్కువగా వాడతాం కాబట్టి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలు సంపూర్ణ ఆహారం. ఎముకలు దృఢంగా మారతాయి. ఈ రోజూ ప్రసాదంలో కూడా బెల్లం ఉంటుంది కాబట్టి అన్నీ ఆరోగ్యానికి మేలుచేసేవే.

నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ

పూల పండగ బతుకమ్మలో భాగంగా నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు నానబెట్టిన బియ్యంతో ప్రసాదం చేస్తారు. నానబెట్టిన బియ్యానికి పాలు, బెల్లం కలిపి వండుతారు. మొదట బియ్యాన్ని కొంచెంసేపు నానబెట్టాలి. దానికి పాలు, నీరు కలిపి మెత్తగా ఉడికించాలి. ఆ అన్నానికి సరిపడా బెల్లం తీసుకుని నీటిలో కరిగిస్తారు. ఆ పానకాన్ని మెత్తగా వండిన అన్నానికి కలపాలి. దీన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి దగ్గరపడుతున్నప్పుడు మరో గిన్నెలో నెయ్యి తీసుకుని అందులో జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి ఆ అన్నంలో వేస్తారు. దీన్ని వేడివేడిగా తయారుచేసుకుని బతుకమ్మ ఆడేచోటకు తీసుకెళ్తారు. అమ్మవారికి నివేదించి... తరువాత ఇతరులకు పంచుతారు.

ఐదో రోజు అట్ల బతుకమ్మ

బతుకమ్మకు అట్లు ప్రసాదంగా పెడతారు. అందుకే అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. బియ్యప్పిండిని అట్లుగా పోస్తారు. బియ్యం, రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పెరుగు సమపాళ్లలో తీసుకుని ముద్దలా చేస్తారు. దీనికి కొంత నీళ్లు కలిపి సాధారణంగా రోజు చేసుకునే దోశ కంటే కాస్త మందంగా వేస్తారు. ఈ పిండిని ఒకరోజు ముందు చేసి పెట్టుకుంటే అట్లు బాగా వస్తాయి. ఇలా చేసుకున్న అట్లకు కొందరు బెల్లం లేదా చక్కెర అదీ కాదంటే వారికి ఇష్టం వచ్చిన చట్నీతో కలిపి తింటారు. బతుకమ్మను ఆడిన తరువాత అట్లను ఒకరికొకరు పంచుకుంటారు.


ఆరో రోజు అలిగిన బతుకమ్మ

ఆరో బతుకమ్మ ఆటకు సెలవు. ఈ రోజును అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. అంటే బతుకమ్మను పేర్చరు. కొన్నిచోట్ల పేర్చినా ఆటలు ఆడరు. ప్రసాదం కూడా నివేదనగా ఇవ్వరు. ఐదు రోజులుగా ఆటల్లో మునిగిన మహిళలకు ఇంటి, వ్యవసాయ పనులు మిగిలిపోతాయి. కాబట్టి వాటిని పూర్తి చేసుకోవడానికి ఇలా మధ్యలో ఒకరోజు ఆటను పక్కన పెడతారని చెబుతారు. మరికొన్ని చోట్ల గౌరీదేవి శివుడి మీద అలుగుతుందనే పురాణ గాథ కూడా ఉందని బతుకమ్మ పై పుస్తకాలు రాసిన రచయితలు, కవులు చెబుతారు.




ఏడో రోజు చకినాల బతుకమ్మ

--





ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ

ఈ బతుకమ్మకు వెన్నతో తయారుచేసిన నువ్వుల ఉండలను నైవేద్యంగా పెడతారు. నువ్వులకు వెన్న, నెయ్యి వాడటం వల్ల రుచి వస్తుంది. ముందుగా బెల్లంపాకం పట్టి దానికి బియ్యప్పిండిని కలిపి ముద్దగా చేసుకోవాలి. తరువాత నువ్వులను దోరగా నెయ్యిలో వేయించి బియ్యప్పిండికి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసుకోవాలి. వీటిని వెన్నతో కలిపి తినాలి. తెలంగాణ వంటకాల్లో ఎక్కువగా బెల్లం వాడతారు. నెయ్యి తక్కువగా వాడినా... బతుకమ్మ ప్రసాదంలో ఇవి తప్పక ఉండాలనే ఉద్దేశంతో రెండింటినీ ఎంచుకుంటారు. ఇవి రెండూ శరీరానికి ఇనుము, మాంసకృత్తులు, కొవ్వులను అందిస్తాయి. చిన్న పిల్లలకు వెన్న పెట్టడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు.



తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ

ఈ రోజున అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు నివేదిస్తారు. వీటినే సద్దులుగా పిలుస్తారు. అందుకే ఇది సద్దుల బతుకమ్మ అయ్యింది. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి తురుము సద్దులను అన్నంతో తయారు చేస్తారు. ఇక, నువ్వుల పొడి, సత్తుపిండి, కొబ్బరిపొడి, మలీద ముద్దలు, సజ్జ ముద్దలు, పండ్లు (సీతాఫలం, అరటి) వంటివీ నైవేద్యంగా పెడతారు. అందరూ కలిసి ఆడిపాడతారు.










దసరా నవరాత్రులు









దసరా నవరాత్రులు
దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు



దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలాత్రిపుర సుందరి .. గాయత్రి .. అన్నపూర్ణ .. మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చి అమ్మవారి రూపాలేంటో తెలుసుకుందాం.

దేవీ నవరాత్రులు – విశేషాలు
చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రునితో కలసి ఉండే నక్షత్రాన్ని బట్టి ఆమాసం పేరు వస్తుంది పౌర్ణమితో కూడిన అశ్వినీ నక్షత్రం గల మాసం ఆశ్వయుజ మాసం. ఇదే శరదృతువుకు లేదా చలికాలానికి ప్రారంభం. ఈ మాసంలో శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల నవ రాత్రులను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. దక్షిణాయనంలో ఇది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత గల పండుగ ఉపనిషద్వాక్యమైన ‘మాత్రు దేవోభవకు ప్రతిబింబంగా మన సంస్కృతిని పరివారాన్ని సమైక్యతను పరిరక్షించే పవిత్ర స్త్రీ మూర్తిని ఈ శరన్నవరాత్రులలో సర్వ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపంలో శక్తి ప్రదాతయైన దుర్గగా జ్ఞానప్రదాతయైన సరస్వతిగా ఐశ్వర్య ప్రదాతయైన లక్ష్మిగా పూజిస్తాం.

ఎందరో మహా యోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి యందు గల చరాచర వస్తువులన్నింటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టియందు గల జ్యోతిర్మండలాలు, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయమే. ఆ శక్తినే మహేశ్వరి శక్తిగానూ, పరాశక్తి గాను, జగన్మాత శక్తిగానూ పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాల్లో ఏ నోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాం.

శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే
ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని శక్తి రూపమే ‘దుర్గ’ అని ఆదిశంకరాచార్యుల వారు అమృతవాక్కులో పేర్కొన్నారు.

ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమౌతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్య్సపురాణం మనకు తెలియచెప్తోంది. దేవతలు భండాసురుడనే రాక్షసుడి బారి నుంచి రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండమంది వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టం నెరవేర్చింది. ఒక్కో రాక్షసుడిని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుంచి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా పేరొందాయి.

నవదుర్గలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయినీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఈ రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది.

తొలుత ఈ దేవదేవి ‘శ్రీకృష్ణ పరమాత్మ’ ద్వారా గోకులం, బృందావనంలలో పూజలందుకుంది. మధు కైటభుల బారి నుంచి రక్షణకు బ్రహ్మ ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. త్రిపురాసుర సంహారమందు పరమేశ్వరుడు ఈ జగన్మాతను ఆరాధించి విజయం సాధించాడు. దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలసిపోగా దేవేంద్రుడు ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగాడు.

ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు ద్వారా ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవీ కటాక్షానికి పాత్రులవుతున్నారు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రముతో ఉన్న శుభదినాన ఈ దేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. ఆ రోజు నుంచి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు.

‘‘మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను విడనాడడం, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి’’ అని పెద్దలు చెబుతారు.

నవరాత్రి ఉత్సవాలలో దేవి నవాంశల పూజలు చేస్తారు. రెండేళ్ళ నుంచి పదేళ్ళ బాలిక వరకు అనేక రూపాల్లో వారిని పూజిస్తుంటారు. కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసింది.

ఈ పర్వదినాలను మనం దసరా పండుగగా జరుపుకుంటాము ‘దసరా’ లేదా ‘దశహర’ అంటే దశ (పది)ని హరించడం, అంటే రావణుని పదితలలను హరించి శ్రీరాముడు విజయాన్ని పొందిన రోజు విజయదశమి. అంతేకాదు మహాభారతంలో పాండవులు విరాటుని కొలువులో అజ్ఞాతవాసం చేసే సమయంలో కురుసైన్యం ఉత్తర గోగ్రహణం జరపగా శాపవశాన బృహన్నలగా ఉన్న పాండవ మధ్యముడైన అర్జునుడు శమి వృక్షంపై తాము భద్రంగా దాచిన ఆయుధాలను దించిన రోజిది. ఇదే రోజున గాండివ ధారియై కురుసేనలను చెండాడి, విరాటరాజు గోవులను సంరక్షించి విజయంతో తిరిగి వచ్చినది కూడా విజయదశమి నాడే. అందుకే ఈ విజయదశమి రోజు ఆయుధపూజ చేయడం ఆనవాయితీగా మారింది. కాలక్రమేణా ఆయుధాలకు బదులు వాహనాలకు, తమతమ వృత్తులలో ఉపయోగించే ఉపకరణాలకు లేదా పనిముట్లకు, ఆఖరికి ప్రస్తుత కాలంలో కంప్యూటర్లకు ఆయుధపూజ చేస్తున్నాం.

మనకు దసరాలలో బొమ్మలకొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. కొందరు సంక్రాంతికి పెడతారు. రకరకాల బొమ్మలను కొలువుగా తీర్చిదిద్ది పిల్లలను ముత్తైదువులను పేరంటానికి పిలిచి, రోజుకొక తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదిస్తారు. పాటలతో భజనలతో ప్రార్థనలతో జగదంబను స్తుతిస్తారు.

దసరాలో నవమిని మహానవమి, మహార్నవమి అంటాం. ఇది అత్యంత ప్రధానమైన రోజు. మహార్నవమిరోజు జగదంబను తప్పనిసరిగా పూజించాలి.

దశమినాడు పున్ణ పూజ, ఉద్వాసన జరుపుతారు.
విద్యార్ధులు తదితర చదువరులు మూలనక్షత్రంలో సరస్వతీ పూజ చేయాలి. ఎక్కువగా ఉత్తరభారతీయులు విజయదశమినాడు శమీ పూజ చేస్తారు. ఈ రోజు పురజనులు ఊరి సరిహద్దులు దాటి ఈశాన్యదిక్కుగా ప్రయాణించి శమీపూజ నిర్వహించి వెనక్కి తిరిగి వస్తారు. దీనినే సీమోల్లంఘన అంటారు. అంటే సీమ (సరిహద్దు)ను ఉల్లంఘించడం (దాటడం).

విజయదశమి నాడే షిరిడి సాయిబాబా మహా సమాధి చెందారు.
ఈ దసరా నవరాత్రులు ఎంతో సరదాగా సందడిగా ఉండి మనలో భక్తిని స్నేహాన్ని సౌభ్రాతృత్వాన్ని కలిగిస్తాయి. అనంత నామాలు రూపాలు గల అమ్మవారిని ఏ నామంతోగాని ఏ రూపంతో గాని భక్తి -ప్రపత్తులతో ఆరాధించే వారికి సర్వము మంగళకరము, శుభప్రదము.

అమ్మవారి అలంకరణలు.
1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి – శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
2వ రోజు – ఆశ్వయుజ విదియ – శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు – ఆశ్వయుజ తదియ – శ్రీ గాయత్రి దేవి
4వ రోజు – ఆశ్వయుజ చవితి – శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు – ఆశ్వయుజ పంచమి – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి
6వ రోజు – ఆశ్వయుజ షష్టి – శ్రీ మహా లక్ష్మీ దేవి – మహాషష్టి
7వ రోజు – ఆశ్వయుజ సప్తమి – శ్రీ మహా సరస్వతీ దేవి – మహా సప్తమి
8వ రోజు – ఆశ్వయుజ అష్టమి – శ్రీ దుర్గా దేవి – దుర్గాష్టమి
9వ రోజు – ఆశ్వయుజ మహానవమి – శ్రీ మహిషాసురమర్దిని – మహార్నవమి
10వ రోజు – ఆశ్వయుజ దసమి – శ్రీ రాజరాజేశ్వరి – విజయదశిమి

మొదటిరోజు: బాలాత్రిపుర సుందరి
మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి. శ్రీశక్తి కౌమారి రూపం “బాల” -. అమ్మవారి మూడు రూపాలలో కనిపిస్తుంది – ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రిపురభైరవి. బాల త్రిగుణైక శక్తి – సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నది. బాల ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక.

మనసు, బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్శమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యసంతోషం కలుగుతుంది. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహంకోసం ఉపాసకులు ముందు బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలందుకుంటుంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి, కొత్తబట్టలు పెట్టాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యై నమ్ణ” అని నూటా ఎనిమిది సార్లు చదవాలి. అమ్మవారికి ప్రత్యేకంగా పాయస నైవేద్యం పెట్టాలి. త్రిశతి పారాయణం చెయ్యాలి.
హ్రీంకారాసన గర్భితానల శిఖాం స్ణౌక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశాంకుశధరామ్ స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం
.
రెండోరోజు: శక్తి అవతారం “గాయత్రి దేవి”
రెండో రోజు అమ్మవారిని గాయత్రిదేవిగా అలంకరిస్తారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారు.
అమ్మ ప్రాత్ణకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజలందుకుంటోంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.
ముక్తా విద్రుమ హేమ నీలధవళచాయై ముఖైస్త్రీ క్షణ్ణైయుక్తా
మిందు నిబద్ధరత్న మకుటామ్ తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదా భయాంకుశకశాశ్శుభ్రమ్ కపాలం గదామ్
శంఖం చక్రమధార విందం యుగళమ్హసైర్వహం తీం భజే
.
మూడోరోజు: మహాలక్ష్మి
కమలాలు రెండు చేతులలో ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా మూడోరోజు శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి, ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
“యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి.లక్ష్మి యంత్రాన్ని పూజించాలి, ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
.
నాలుగోరోజు: అన్నపూర్ణ
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. “హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
ఉర్వీసర్వజయేస్వరీ జయకరీ మాతాకృపా సాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
.
అయిదోరోజు: లలితా త్రిపురసుందరి
త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్య్ర ద్ణుఖాలను తొలిగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి.
కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముత్తైదువులకు) ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని సార్లు జపించాలి.
ప్రాత్ణస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృధులమౌక్తిక శోభినామ్
ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
.
ఆరో రోజు: సరస్వతి
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది.
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి.ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని “విజయారంభం” అని పిలుస్తారు.
ఘంటాశూల హలాని సంఖమునలే చక్రం ధనుస్సాయకం
హస్తాబ్జేర్దధతీం ఘనాంత విలసిచ్చీతాంశు తుల్య ప్రభాం
గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారాభూతాం
మహాపూర్వా మాత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీం
.
ఏడో రోజు: దుర్గాదేవి
దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు.ఈ దినం పూజింపబడే నవదుర్గ మాత “మహాదుర్గ”. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని పూజించడం కద్దు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమ్ణ” అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.ఈ దినం “ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు (కొన్ని చోట్ల నవమి రోజు, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా చేస్తారు). తాము వాడే పనిముట్లని, సామాగ్రిని శుభ్రపరిచి, వాటికి పూజ చేస్తారు.
అలాగే నవరాత్రులలో ప్రతీ దినం “సుహాసినీ పూజ” చెయ్యడానికి అనుకూలమే ఐనా చాలాచోట్ల అష్టమిరోజున ప్రత్యేకంగా సుహాసినీ పూజ చేస్తారు. ఈ పూజలో ముత్తైదువు ఐన స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించి, దక్షిణ, పండ్లు, కొత్తబట్టలూ సమర్పించి, భోజనం అర్పిస్తారు. తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్యరోజున మొదలై, అష్టమిరోజు ముగుస్తుంది. గౌరీ దేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకొని, దానికి కుంకుమ కలిపి భక్తితో మెత్తపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకుని వెళ్ళి సమర్పిస్తారు.ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడుతారు.
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం
కన్యాభ్ణి కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖే విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే
.
ఎనిమిదో రోజు: మహిషాసుర మర్ధిని
ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే “మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరిమ్చి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి ¬మం చెయ్యాలి. అమ్మవారికి “ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం (పులి¬ర), గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.కొన్ని ప్రదేశాలలో ఈ రోజున అమ్మవారి ఉగ్రరూపానికి జంతుబలులు ఇస్తారు. కానీ ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది.
మహిష మస్తక నృత్తవినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని
.
తొమ్మిదో రోజు (విజయదశిమి): రాజరాజేశ్వరీ దేవి
శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే “దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులి¬ర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే… “శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.

ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. “రామలీల ఉత్సవాలు”. పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు.
శమీపూజ:
సాయంత్రం క్రొత్త బట్టలు కట్టుకుంటారు. గుడికి వెళతారు. . విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ.. పై శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మిచెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. జమ్మి ఆకులను కోసికొని ఇంటికి తిరిగి వస్తారు. కొంతమంది జమ్మి చెట్టు మొదలులో వుండే మట్టిని తీసుకుని ఇంటికి వస్తారు.

పురాణలలో విజయదశిమి:
అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు.అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించారు.ఇకపోతే.. శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయకాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించడం వల్ల ఆ శమీవృక్షము, “రామస్య ప్రియదర్శిని” అయ్యింది. అందుచేత అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, సర్వదుఖాల నుంచి ఉపశమనం పొందాలన్నా, దారిద్య్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో జీవించాలన్నా నవరాత్రుల్లో ఆ దేవదేవిని పూజించడంతో పాటు శమీపూజ, శ్రీలలితా సహస్రనామ పారాయణలు చేయాలని పురోహితులు అంటున్నారు.

మన రాష్ట్రంలో అమ్మవారికి పూజలు:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ, బాసరలో సరస్వతీదేవి, ఇంకా అమ్మవారి శక్తి పీఠాలలో విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికధలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు. కనకదుర్గమ్మకి కృష్ణానదిలో హంస పడవలో మీద మల్లేశ్వరస్వామివారి ఆలయం నుండి తెప్పోత్సవం విశేషంగా జరుగుతుంది. దసరాలలో అమ్మవారిని ఒక్కరోజైనా దర్శనం చేసుకోవడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు.

పూజా విధానం
ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే ‘దేవీనవరాత్రులు’ అని పిలుస్తారు. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.
పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖంగాని కూర్చోవాలి. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను.
ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవరాత్రి) గాని, ఏడు రోజులు గానీ, హీన పక్షం మూడు రోజులు కానీ, లేదా ఒక్క రాత్రి శాస్త్రానుసారము దీక్ష చేయాలి. పూజాకాలంలో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతమాచరించాలి. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలగాలి.

ఆయుధ పూజ:
పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అగ్నాతవాసము చేసినారు. వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది. విజయదసమి నాడు వారి అగ్నాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున సమి వృక్షనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాదు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయబదుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను.

అపరాజితా శమీపూజ:
శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం… అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి.
మధ్యే అపరాజితాయై నమ్ణ ఇత్యవరాజితామావాహ్య
తద్దక్షిణే క్రియా శ్క్యైనమ్ణ ఇతి జయాం నామత్ణ
ఉమాయైనమ్ణ ఇతి విజయామా వాహ్మ అపరాజితా
యైనమ్ణ జయాయైనమ్ణ విజయాయై నమ్ణ
అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము.
కాని ఏకాదశి స్పర్శ ఉండరాదు

దసరా ఉత్సవాల ప్రాశస్త్యం









శమీ శమయతే పాపం.. శమీ శతృ వినాశినీ!



దసరా చాలా ప్రత్యేకమైంది. పల్లెల్లో దసరా శోభ వైభవోపేతంగా ఉంటుంది. కాలం మారుతున్నా.. నేటి పోకడలు మారుతున్నా, పండుగ తీరుతెన్నులు సాంప్రదాయ బద్ధంగానే జరుగుతున్నాయి. కొత్త బట్టలు వేసుకోవడం, జంబికెళ్లడం, పాలపిట్టను దర్శించుకోవడం, జొన్నకర్రలతో కోలాహలం, ఆత్మీయులతో అలయ్ బలయ్, ఆడపడుచుల దీవెనలు పొందడం వంటి వాటితో ఒకటే సంబురం. ఇదే సమయంలో ఇక దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాతను ప్రతిష్టించి నిష్టగా పూజిస్తూ, సల్లంగా చూడాలని తల్లిని కోరుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. చెడుపై విజయమే విజయదశమి. ఈ పండుగ మనకు అందరికీ మంచి చేయాలని అమ్మవారిని కోరుతూ ఈ కథనం.
- దాయి శ్రీశైలం

దసరా ఒక పండుగ మాత్రమే కాదు. ఇదొక మానవతా సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. దుర్గామాత ప్రతిష్టాపన నుంచి నరకాసుర వధ వరకు అన్నీ అట్టహాసంగా, వైభవంగా జరుపుతారు. పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు సంబురాలు జరుపుకొంటారు.

దసరా ఉత్సవాల ప్రాశస్త్యం
ఇంత గొప్ప పండుగ ప్రాశస్త్యం ఏంటో? దేవీ నవరాత్రి ఉత్సవాల వైభవం ఎలాంటిదో? అమ్మవారి అవతారాలెన్ని? ఆమెకు ఏమంటే ఇష్టం? విజయ దశమి దేనికి సంకేతం? చెడుపై మంచి విజయం ఎలా సాధ్యం? వంటి విషయాలు తెలుసుకొని విజయ దశమిని సంపూర్ణం చేద్దాం.

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ శ్రీరామస్య ప్రియదర్శినీం
శమీ శమయతే పాపం శమీ కంటకలోహితా
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ


విజయదశమి రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం మన సంప్రదాయం. జమ్మిచెట్టు పాపాలను పోగొడుతుంది. శత్రువులను నిర్మూలిస్తుంది. పుణ్యం ప్రసాదిస్తుంది. విజయసిద్థికి యాత్ర చేసే మానవాళికి ఆటంకాలను తొలగించి విజయాలను సాధించి పెడుతుంది. ఇంతటి మహిమగల శమీ పూజతో కూడిన పుణ్యదినం కాబట్టే ఈ పవిత్ర రోజుకు విజయదశమి అని పేరొచ్చింది అంటారు. దసరానాడు జమ్మిచెట్టును పూజించడాన్నే శమీపూజ అంటారు. జమ్మిచెట్టు విజయానికి సంకేతం. పూర్వం ద్వాపరయుగంలో పాండవులు తమ ఆయుధాలను అన్నింటినీ ఈ జమ్మిచెట్టుపైనే సంరక్షించి, తర్వాత వాడుకొన్నారు. వారికి యుద్ధంలో విజయం లభించింది. జమ్మిచెట్టు పాపాలను హరిస్తుందనీ, శత్రువులను తుదముట్టిస్తుందనీ, అర్జునునివంటి మహావీరునికి ధనుర్బాణాలను ప్రసాదించిందనీ, రామునికి ప్రియాన్ని చేకూర్చిందనీ, విజయయాత్రలలో సత్ఫలితాలను ప్రసాదించిందనీ, ఎలాంటి ఆటంకాలు లేని జీవితాన్ని ప్రసాదించిందన్నది పూజలోని పరిమార్థం.

పూజా విధానం
నవరాత్రుల కలశ స్థాపన చేస్తారు. పూజా మందిరంలో కలశ స్థాపన చేసేందుకు వేదిక ఏర్పాటు చేస్తారు. గోమయంతో చదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పూజా సామగ్రితో పాటు ఐదు రకాల లేత చిగుళ్లు కలిగిన చెట్టు కొమ్మలు, గరిక పోచలు సిద్ధం చేస్తారు. తెల్లవారుజామునే అభ్యంగ స్నానం చేసి పట్టు వస్ర్తాలు కట్టుకొని, ఎర్రని పట్టు వస్త్రంపై కూర్చొని అమ్మవారిని ఆరాధిస్తారు.

ఆయుధ పూజ
ఈ పూజ దసరా రోజున చేస్తారు. పాండవులు శమీ వృక్షంపైన ఆయుధాలను దాచి అజ్ఞాతవాసం చేశారు. విజయదశమిన అజ్ఞాతవాసం ముగిసింది. ఆయుధ పూజ రోజు శమీ వృక్షానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అష్టమి దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా చెప్తారు. దుర్‌గతులను నాశనం చేసి సుగతులను ప్రసాదించే దుర్గాదేవిని ఆయుధ రూపిణిగా ఈ రోజున ఆరాధిస్తారు. మానవ జీవనోపయుక్తాలైన యంత్రాలనూ, వాహనాలకూ, ఆయుధాలకూ పూజలు చేస్తారు.




మీ పండుగే మీకు విజయం
పూర్వం రాజులు తమ రాజ్య విస్తరణ కోసం విజయదశమి నాడే జైత్రయాత్ర ప్రారంభించేవారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు కూడా మీ పనులను వేగవంతం చేసేందుకు, మంచి పనుల కోసం విజయదశమి నుంచే ప్రారంభించండి. విజయదశమి రోజున ప్రకృతిలో అపరాజిత అనే శక్తి ఆవహించి ఉంటుందనీ, ఆ శక్తి విజయాలను అందిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే విజయదశమి రోజున సాయంత్రం పూట ప్రజలంతా కలిసి ఊరి పొలిమేరలు దాటి వస్తారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవండి. పాలపిట్ట విజయానికి సంకేతం. తాము చేయబోయే పనులు ఫలించాలనే ఒక పాజిటివ్ దృక్పథం, శుభసూచకం కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను దర్శించుకుంటే సంవత్సరమంతా విజయాలు వరిస్తాయని ప్రజల నమ్మకం. మీరూ పాలపిట్టను దర్శించండి.
-పేర్వాల బలరామ శర్మ, పురోహితులు




తొమ్మిది అవతారాలు
అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. మహర్షుల సూచన ప్రకారం అమ్మవారు.. ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్థం, పంచమం స్కంధమాతేతి, షష్టిమం కాత్యాయనీ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తితగా కొలుస్తారు భక్తులు.

1 శైలపుత్రి
పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని పుత్రిక ఈమె. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి, శూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చుంటారు అమ్మవారు. పరమేశ్వరుడే తనకు పతిగా కావాలని కోరుతుంది.

2 బ్రహ్మచారిణి
పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందును అపర్ణగా ప్రసిద్ధిగాంచింది. కన్యాకుమారీ అని మరో పేరు కూడా ఉంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా విజయాలు ప్రాప్తిస్తాయి.

3 చంద్రఘంట
అమ్మవారి మూడవ అవతారం. ఈ రూపం మిక్కిలి కల్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

4 కూష్మాండ
నాలుగవ స్వరూప నామం కూష్మాండ. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజదేవి అంటారు.

5 స్కందమాత
అయిదో అవతారం స్కందమాత. స్కంధుడు అంటే కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాతగా పిలుస్తారు. నమ్మిన భక్తులకు పతనం లేకుండా దీవిస్తుంది అనడానికి ఈ అవతారం సంకేతం.

6 కాత్యాయని
దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. కొత్స అనే రుషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురు జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సు అంశతో ఒక దేవిని సృష్టిస్తారు. అశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

7 కాళరాత్రి
దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. అమ్మవారి శరీర ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవిని కాళరాత్రి అంటారు. ఈ తల్లిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి శుభంకరి అని పిలుస్తారు.

8 మహాగౌరి
పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేయడం వల్ల ఆమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు. దాని వల్ల ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

9 సిద్ధిధాత్రి
దుర్గామాత తొమ్మిదవ శక్తిరూపం సిద్ధిధాత్రి. ఈ అమ్మ అన్ని సిద్ధులనూ ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని పురాణాలు చెప్తున్నాయి.





రోజుతిథిఅలంకారంఅలంకారంనైవేద్యం
1 ఆశ్వీయుజ పాడ్యమిశ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి శాలిపుత్రి అమ్మవారికి పాదాల నెయ్యితో చేసిన పొంగిలి సమర్పిస్తారు. వ్యాధులు, రోగాల నుంచి కాపాడాలని అమ్మవారిని నెయ్యి నైవేద్యం సమర్పించి కోరుతారు.
2 ఆశ్వీయుజ విదియ శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిబ్రహ్మచారిణిసాధారణ ఆహారాన్ని ఇష్టపడుతారు. చక్కెర, పండ్లతో చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు.
3 ఆశ్వీయుజ తదియ శ్రీ గాయత్రి దేవి చంద్రఘంట అమ్మవారికి పాలు, మిఠాయిలు, ఖీర్ నైవేద్యంగా సమర్పిస్తారు.
4 ఆశ్వయుజ చవితి శ్రీ అన్నపూర్ణా దేవి కుష్మందా అమ్మవారికి బూరెలు సమర్పిస్తారు.
5 ఆశ్వయుజ పంచమి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిస్కందమాత అమ్మవారికి అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రజలందర్నీ ఆరోగ్యంగా ఉంచాలని భక్తులు అరటి పండ్ల నైవేద్యం పెట్టి కోరుతారు.
6 ఆశ్వీయుజ షష్టి or మహాష్టమి శ్రీ మహాలక్ష్మీ దేవి కాత్యాయనీ అమ్మవారికి తీపి పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు.
7 ఆశ్వీయుజ సప్తమి or మహా సప్తమిశ్రీ మహా సరస్వతీ దేవి కాలరాత్రి అమ్మవారికి తీపి పదార్థాలతో చేసిన లడ్డూలు, బెల్లం సమర్పిస్తారు.
8 ఆశ్వీయుజ అష్టమి or దుర్గాష్టమిశ్రీ దుర్గా దేవిమహాగౌరి అమ్మవారికి కొబ్బరి కాయలతో నైవేద్యం సమర్పిస్తారు.
9 ఆశ్వీయుజ మహా నవమి or మహర్నవమిశ్రీ మహిషాసుర మర్దిని సిద్ధిధాత్రిఅమ్మవారికి నువ్వులు, తేనె నైవేద్యంగా సమర్పిస్తారు. భోగ భాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటారు భక్తులు.
10 ఆశ్వీయుజ దశమి or విజయదశమిశ్రీ రాజరాజేశ్వరి




చెడుపై విజయమే విజయదశమి
స్వార్థం, కామం, మోహం, క్రోదం, అన్యాయం, అమానవీయం, అహంకారం, మోదం, లోభం, మదం, మాత్సర్యాలను జయిస్తేనే మంచి జీవనశైలి ఏర్పడుతుంది. మనకు హాని చేసే ఈ పది చెడు లక్షణాలను తొలగించుకొని నిజమైన విజయదశమి జరుపుకోండి.

స్వార్థం: నేను అనే తపన కలిగించడానికి మనలోకి ప్రవేశించిన గుణమే స్వార్థం. ఇతరులను నాశనం చేసైనా సరే తాము బాగుపడాలనే స్వార్థం దురాశ. స్వార్థం ఉండటం తప్పు కాదు. కానీ దాన్ని నిప్పులా తయారు చేసి వినాశకారిగా మార్చడం తప్పు. స్వార్థాన్ని కూడా నిస్వార్థంగా వాడగలిగితే జీవితానికి అర్థం తెలిసినట్టే.

అన్యాయం: అన్యాయమే అభివృద్ధికి వనరుగా మారుతున్న రోజులివి. ఉన్నోడు అన్యాయానికి పాల్పడటం, లేనోడు అన్యాయానికి గురికావడం అతి సాధారణమైన క్రియ. ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలకైతే లెక్కేలేదు. అన్యాయంపై పోరాడక పోయినా కనీసం దానికి కారణమైన వాళ్లకు తప్పు గుర్తు వచ్చేట్లు చేయాలి.

అహంకారం: మిడిమిడి జ్ఞానంతో కొట్టుమిట్టాడే వాళ్లు మాత్రమే తనకు తెలిసిన కొద్ది సంగతులే ప్రపంచం అన్నట్లు తానే అందరికంటే గొప్పవాడిననే అహంకారాన్ని పెంచుకుంటారు. దీనిని విడిచిపెడితేనే ఉన్నతి ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి.

మదం: అంటే హద్దుల్లేని అహంకారం. మదం ఉన్నవాళ్లు ఎదుటివారిని తనకంటే తక్కువచేసి వారిపై పెత్తనం చెలాయించడానికి దుర్మార్గపు పనులు, దురాలోచనలు చేస్తారు. దీనివల్ల వారిలో అసూయ పెరిగి ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారు. దసరా వంటి పెద్ద పండుగ రోజున మదాన్ని పారదోలితే విజయాలు మీ సొంతం.

మాత్సర్యం: అంటే అసూయ. ఇది చాలా ప్రమాదకరం. మాత్సర్యం వల్ల మనిషి తనలోని మానవత్వాన్ని కోల్పోయి అశాంతితో గడుపుతాడు. ఎవరికి చేతనైంది వాళ్లు చేస్తూ క్రమంగా ఉత్తమ ఫలితాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేయాలిగానీ ఈర్ష్యాసూయలకు పోతే పతనం ఖాయం అని తెలుసుకుంటే విజయం సొంతం.

లోభం: అంటే పిసినారితనం. సంపాదించిన ధనాన్ని తాను అనుభవించకుండా కనీసం తనవారిని కూడా అనుభవించనీయకుండా దాచిపెట్టడం లోభత్వం. లోభియైనవాడు ఏ విధంగానైనా ధనాన్ని ఆర్జించడం కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. దాచిపెట్టి మట్టి పాలు చేస్తే లాభమేంటి? కాబట్టి లోభత్వాన్ని జయిస్తే విజయాలు సొంతమవుతాయి.

మోహం: కోరిక, వ్యామోహం, కాంక్ష మరీ ముఖ్యంగా శరీరకాంక్షలు మితిమీరిన కామంతో కూడిన మోహానికి సంబంధించినవి. ఇది వ్యక్తిగతంగా కాకపోయినా ఒక వ్యవస్థ విజయానికి, ఒక దేశ విజయానికి కూడా అడ్డంకిగా మారుతుంది. ఇది తొలగి సమాజంలో స్వచ్ఛమైన సోదరభావం పెంపొందిన రోజే మనకు నిజమైన విజయదశమి.

అమానవత్వం: మనిషికి ఉండాల్సిన మొదటి గుణం మానవత్వం. ఇది లేకపోతే మనం మనుషులమెందుకవుతాం? అమానవత్వాన్ని జయిస్తేనే మనిషి విజయం సాధించినట్టు.

క్రోదం: క్రోదం అంటే కోపం. క్రోదం మనుషులను దూరం చేస్తుంది. ఆవేశకావేశాలకు పోయి హద్దులు దాటే క్రోదం వల్ల ఎప్పటికీ నష్టమే. కాబట్టి దీన్ని పారదోలి నిజమైన విజయదశమిని జరుపుకుందాం.



కుంభకర్ణుడు









కుంభకర్ణుడు


జీవితకాలం చాలా చిన్నది. అందులో దాదాపు సగం కాలం నిద్రలోనే గడిచిపోతుంది. మిగతాసగంజీవితంలో ఎదురయ్యే పరిస్థితుల సంక్షోభంలో నిద్రలేని రాత్రులను మనం గడిపేలా చేస్తుంది. వేకువ ఆలోచననిస్తే, నిద్ర ప్రశాంతతనిస్తుంది. కానీ, నిద్రలోని గొప్పతనమేమిటంటే శరీరాన్ని మాత్రమే సాంత్వన పరుస్తూ, మనిషిలోని మేధస్సును పదునుపెడుతూనే ఉంటుంది. మనిషి నిద్రావస్థలో ఉన్నా మస్తిష్కం జాగ్రదవస్థనే ఆశ్రయిస్తుంది. ఆహారం శారీరక శక్తినిస్తే, నిద్ర మేధశ్శక్తిని పెంపొందిస్తుంది. నిద్ర ప్రాపంచిక చింతల నుంచి మనిషిని దూరంగా ఉంచుతుంది. నిద్ర మనుషుల మధ్య భేదాలను దూరం చేస్తుంది. రాజు నిద్ర, బంటు నిద్ర ఒక్కటేనన్న విశ్వజనీన సత్యమే అందుకు నిదర్శనం. అటువంటి నిద్రను శాపంలో వరంగా పొందినవాడూ, సహజసిద్ధ వీరాధివీరుడూ, విలువలూ, ధర్మాలూ తెలిసినవాడూ, తన శక్తిని సామాజిక విరుద్ధంగా ఉపయోగించని విశాల హృదయుడూ కుంభకర్ణుడు. రాజనీతి, ధర్మనీతి తెలిసిన విద్వజ్ఞుడు బంగారు లంకలో జీవితకాలంలో చాలా సంవత్సరాలు హాయిగా నిద్రపోయాడు.

కైకసీ విశ్రవసుల కొడుకు, రావణుని తమ్ముడు, విభీషణుడి అన్న మహాకాయుడు కుంభకర్ణుడు. పుట్టుకతోనే ప్రచండమైన ఆకలి గలవాడు. పుట్టిన వెంటనే పెద్దపెద్ద జంతువులను తిని జీర్ణం చేసుకున్నవాడు. ఆకలి తప్ప మరొకటి ఎరుగని వాడుగా కుంభకర్ణుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తుంటాడు.

కుంభకర్ణుని ఆకలికి ప్రపంచంలోని ఏ ప్రాణి మిగలకుండా పోతుండేది. దీంతో అల్లాడిపోయిన ఋషులూ, దేవతలూ బ్రహ్మను ఆశ్రయించగా, వెంటనే కుంభకర్ణున్ని పిలిపిస్తాడు బ్రహ్మ. కుంభకర్ణా! లోకంలోని జీవరాశినంతటినీ నీ ఆకలికి ఆహుతి చేయడానికే నీ తండ్రి నిన్ను కన్నట్టున్నాడు. ఇక నీవు తిన్నది చాలు. ఇకపై చచ్చినట్టు చచ్చేదాకా నిద్రపో అని శపిస్తాడు బ్రహ్మ. విషయం తెలిసిన రావణుడు తన అసలైన బలమైన కుంభకర్ణుడికి బ్రహ్మ ఇచ్చిన శాపాన్ని నిద్రలేవడానికి, ఆహారం తీసుకోవడానికి సమయాన్ని నిర్దేశించేలా సడలించమని వేడుకుంటాడు. అలా కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు. ఒక్కరోజు మేల్కొని రోజంతా తింటూనే ఉంటాడు. మరునాడు మళ్ళీ నిద్రపోతాడు. కానీ మధ్యలో నిద్రలేపడం మాత్రం శుభం కాదని హెచ్చరిస్తాడు బ్రహ్మ.

నిద్ర లేచిన వెంటనే ఆహార భక్షణ, తిరిగి మళ్ళీ నిద్ర అదే కుంభకర్ణుని జీవితంగా మారిపోయింది. కుంభకర్ణుడు మహాకాయుడు. అందుకనే అతని భవనం కూడా బంగారు లంకలో ఒకటిన్నర యోజన వైశాల్యంతో అత్యద్భుతంగా ఉంటుంది. రాముని చేతిలో పరాభవం తర్వాత రావణునికి కుంభకర్ణుడు ఒక్కడే దిక్కు అనే తలంపు వచ్చింది. కుంభకర్ణుడు నిద్రపోయి ఆనాటికి తొమ్మిది రోజులే అయ్యింది. కానీ తప్పని పరిస్థితుల్లో కుంభకర్ణున్ని ఎలాగైనా నిద్ర లేపాలని నిశ్చయించుకున్నాడు రావణుడు. కుంభకర్ణున్ని నిద్రలేపేందుకు పదివేలమంది రాక్షసులు బంగారు పాత్రలలో ఆహారం సిద్ధం చేసుకొని కుంభకర్ణుని భవనానికి వెళ్తారు. విశ్వప్రయత్నం చేసి ఎంతోమంది ప్రాణాలకు తెగించి కుంభకర్ణున్ని నానా విధానాలను ఉపయోగించి ఎలాగోలా నిద్రలేపుతారు. అంతే నిద్రాభంగం తర్వాత మేల్కొన్న కుంభకర్ణుడు ఆకలి ఆకలి అంటూ రాక్షసులు తెచ్చిన ఆహారాన్నంతా తినేస్తాడు.

కుంభకర్ణుడు దాదాపు రెండువేల కడవల మద్యం తాగేస్తాడు. తిండితిన్న కుంభకర్ణుడు మళ్ళీ నిద్రలోకి వెళ్ళకముందే విషయం చెప్పాలని రావణుని మంత్రి యూపాక్షుడు కుంభకార్ణ! నిన్ను ప్రయత్న పూర్వకంగా నిద్రలేపాల్సి వచ్చినందుకు క్షమించు, లంకకు ఆపద వచ్చి పడిందని అనగానే, కుంభకర్ణుడు అన్న రావణుడు అత్యవసరమైతే తప్ప నన్ను నిద్రలేపడనీ, ముందు ఆపదను నివారించే రావణుని దర్శిస్తాననీ బయలుదేరబోతుంటే వారిస్తాడు యూపాక్షుడు.

కుంభకర్ణుడు రావణుని సభకు బయలుదేరుతాడు. తాను నడుస్తుంటే భూమే చలి జ్వరం వచ్చినట్టు వణికిందట. లంకకు ఆవల ఉన్న వానరులు కూడా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఎవరీ మహాకాయుడు అని మాట్లాడుకోసాగారు. అలా అందరూ చూస్తుండగానే రావణ సభలోకి ప్రవేశించి తన కోసం సిద్ధంగా ఉన్న భారీ ఆసనంపై రావణుడికి నమస్కరించి కూర్చున్నాడు. రామదండును సమూలంగా నాశనం చేయగల సమర్థుడవి నీవే, అందుకనే నిన్ను నిద్ర నుంచి ప్రయత్న పూర్వకంగా లేపాల్సి వచ్చిందనీ రావణుడు అన్నప్పుడు, అన్నతో కుంభకర్ణుడు పలికిన మాటలు వివేకంతో పరిమళించాయి. కుంభకర్ణుని నిలువెత్తు వ్యక్తిత్వానికి నిదర్శనమే అవి.

పరస్త్రీ వ్యామోహం తగదనీ, బలం ఉంది కదా అని ముందు చేయాల్సిన పనులు వెనుక, వెనుక చేయాల్సిన పనులు ముందూ చేయకూడదనీ, ప్రతీ విషయంలోనూ మంచీ చెడులు బేరీజు వేసుకోవాలనీ, దూరాన ఉన్న శత్రువుకన్నా మెప్పుకోసం మిడిమిడి జ్ఞానంతో రెచ్చగొట్టే వారు ప్రమాదకరమనీ, అసలు అన్నింటికన్నా ధర్మమే శ్రేష్ఠమనీ చెబుతూనే ఇప్పటికైనా సీతమ్మను రామునికి అప్పగిద్దామని అర్థిస్తాడు కుంభకర్ణుడు.

రావణుడు కుంభకర్ణుడు ఎంత చెప్పినా వినకపోయే సరికి చేసేది లేక యుద్ధానికి బయలుదేరతాడు కుంభకర్ణుడు. అతని భారీకాయంతో లక్షల సంఖ్యలో వానరుల్ని హతమారుస్తాడు. వానర ప్రముఖులెందరో కుంభకర్ణుని ఎదురించి ఓడిపోతారు. ఇటు కుంభకర్ణుడూ, అటు వానరులూ భయంకర యుద్ధం చేస్తారు. చివరకు రాముని చేతిలో వీరమరణం పొందుతాడు. రామబాణానికి కుంభకర్ణుని తల తెగి లంకాశిఖరాన్ని పడగొట్టింది. అతని మహాకాయం సముద్రంలో పడీపడగానే సముద్రపు నీరు ఆకాశాన్నంటింది.
లోకనీతి తెలిసినా, రావణుని అధర్మం రుచించకపోయినా కుంభకర్ణుడు రావణునికి తమ్ముడైనందుకు తన బాధ్యతను నిర్వర్తించాడు. లోకంలో మన అనుకున్నప్పుడు మనవారు చేసిన తప్పులోనూ, ఒప్పులోనూ వారిని వదిలి పెట్టక, మనలోని ధర్మనిరతిని విస్మరించక మనవారి కోసం అంకితం కావాలనే మానవీయ ధర్మానికి భాష్యం చెప్పినవాడు కుంభకర్ణుడంటే అతిశయోక్తి కాదు.

కుంభకర్ణా! లోకంలోని జీవరాశినంతటినీ నీ ఆకలికి ఆహుతి చేయడానికే నీ తండ్రి నిన్ను కన్నట్టున్నాడు. ఇక నీవు తిన్నది చాలు. ఇకపై చచ్చినట్టు చచ్చేదాకా నిద్రపో అని శపిస్తాడు బ్రహ్మ.

- ప్రమద్వర