Tuesday, 30 January 2018

ద్వారక అస్తమయం





ద్వారక అస్తమయం
మౌసల పర్వము
(తెలుగు వికీపీడియా వారి సౌజన్యంతో)


ధర్మరాజుకు పట్టాభిషేకము జరిగి 35 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత 36వ సంవత్సరములో కొన్ని ఉత్పాతాలు జరిగాయి. ఉదయము పూట తీవ్రమైన గాలులు వీచాయి, ఇసుక తుఫానులు వీచాయి, ఆకాశము నుండి ఉల్కలు రాలి పడ్డాయి. మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి. సూర్యుడికి, చంద్రుడికి చుట్టూ ఎర్రటి వలయాలు ఏర్పడ్డాయి, మంచుకురిసింది, వేసవి కాలములో కూడా చలిగాలులు వీచాయి. ఇలా అనేక ఉత్పాతాలు సంభవించాయి. ప్రతిరోజూ ఎదో ఒక ఉత్పాతము కనపడసాగింది. ఈ ఉత్పాతాలకు కారణము తెలియక ధర్మరాజు మనసు కలవరపడ సాగింది. కొంత కాలానికి ధర్మరాజుకు ఒక దుర్వార్త అందింది. దాని సారాంశము ఏమిటంటే శ్రీకృష్ణుడు, బలరాముడు తప్ప మిగిలిన యాదవులు అందరూ ఒకరితో ఒకరు కలహించుకుని మరణించారన్నది. ఈ దుర్వార్తను విన్న ధర్మరాజు వెంటనే తమ్ములను పిలిచి ఈ వార్త తెలిపాడు. ఈ దుర్వార్తను విన్న అందరూ శోకసముద్రములో మునిగి పోయారు " ఇలా వైశంపాయనుడు ఈ మాట చెప్పగానే జనమేజయుడు " మునీంద్రా ! యాదవులు అందరూ కలహించుకుని మరణించటము ఎమిటి ? ఇలా ఎలా జరిగింది ? " అని అడిగాడు.

మునులు యాదువంశమును శపించుట
జనమేజయుడి ప్రశ్నకు బదులుగా వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ఈ విషయము ఇప్పటిది కాదు. చాలాకాలము కిందట జరిగిన దానికి ఇది ఫలితము. చాలాకాలము కిందట కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మొదలైన మునులు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వచ్చారు. ఈ మునులను చూసిన యాదవులకు ఆ మునులను ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలిగింది. వెంటనే వారు వారిలో చిన్న వాడైన సాంబుడికి ఆడవేషము వేసి అతడిని మునుల వద్దకు తీసుకు వచ్చి " మునులారా " ఈమె మా స్నేహితుడు బభ్రుడి భార్య. వారికి చాలా రోజులుగా సంతానము లేదు. అసలు వారికి సంతానము కలుగుతుందా లేదా ? తెలియజేయండి " అని అడిగారు. వారి మిఖాలు చూడగానే మునులు వారు తమను హేళన చేస్తున్న విషయము గ్రహించి " వీడు శ్రీకృష్ణుడి కుమారుడు ఇతడు మగవాడు. వీడు ఒక ముసలమును కంటాడు. ఆ ముసలము శ్రీకృష్ణుడు, బలరాములను తప్ప మిగిలిన యాదవులు అందరిని సర్వనాశనము చేస్తుంది. బలరాముడు మాత్రము యోగనిష్టతో సముద్రములో ప్రవేశిస్తాడు. శ్రీకృష్ణుడు నేలమీద పదుకుని ఉండగా జర అను రాక్షసి శ్రీకృష్ణుడిని చంపుతుంది. మీ

రోకలిని రుద్దుతున్న యాదవులు
కపటనాటకముకు ఇది తగినశిక్ష " అని శపించిన ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండా వెళ్ళిపోయారు. ఈ విషయము శ్రీకృష్ణుడికి తెలిసినా జరగనున్నది జరగక మానదు అని మిన్నకుండి పోయాడు. మరుసటి రోజే మునుల శాపము ఫలించి సాంబుడు ఒక ముసలమును ప్రసవించాడు. అది చూసి యాదవులు ఆశ్చర్యచకితులై ముసలమును సాంబుడిని వసుదేవుడి వద్దకు తీసుకు వెళ్ళారు. వసుదేవుడు భయభ్రాంతుడు అయ్యాడు. వసుదేవుడు ఆ ముసలమును చూర్ణము చేసి సముద్రములో కలపమని యాదవులకు చెప్పాడు. అందువలన వసుదేవుడు ఇక ఆ ముసలము వలన ఆపద ఉండదు అనుకున్నాడు. యాదవులు వసుదేవుడు చెప్పినట్లు చేసి ఆ విషయము అంతటితో మరచిపోయారు. కాలము గడచింది మహాభారత యుద్ధము జరిగింది. తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి తన కుమారుల వలెనే యాదవులు అందరూ దుర్మరణము పాలు కాగలరని శపించింది. తరువాత కొంత కాలానికి ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి. దానికి తోడు యమధర్మరాజు తన చేత యమపాశము ధరించి ద్వారకలో సంచరిస్తున్నాడన్న వార్త ద్వారకలో పొక్కింది. అది విన్న యాదవులు భయభ్రాంతులు అయ్యారు.

ద్వారకలో దుశ్శకునాలు
ద్వారకలో అనేక దుశ్శకునాలు పొడచూపసాగాయి. చిలుకలు రాత్రుళ్ళు గుడ్లగూబలలా వికృతముగా అరవసాగాయి. మేకలు నక్కల వలె పగటి వేళలో ఊళ వేయసాగాయి. యాదవులందరూ దుర్వ్యసనాలలో మునిగి తేలుతూ మునులను, బ్రాహ్మణులను అవమానించసాగారు. యదవులు త్రాగుడు, జూదానికి బానిసలు అయ్యారు. యాదవ స్త్రీలు భర్తలను లెక్కచేయక బానిసల వలె ప్రవర్తించసాగారు. తినే ఆహారములో అప్పటికి అప్పుడే పురుగులు వస్తున్నాయి. ఈ అశుభములను చూసి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. నాడు గాంధారి ఇచ్చిన శాపము 35 సంవత్సరముల అనంతరము పని చేయడము మొదలైంది. యాదవులకు ఇక సర్వనాశనము తప్పదు. ఒకరితో ఒకరు కలహించుకుని మరణించక తప్పదు. అది ఒక పుణ్యభూమిలో కొట్టుకుంటే పుణ్యము వస్తుంది అనుకుని యాదవులతో ఒకసభ చేసి " యాదవులారా ! మనము అందరము కలసి సముద్రుడికి ఒక జాతర చేయాలి. ఈ విషయము అందరికీ తెలిసేలా ఒక చాటింపు వేయించండి " అని ఆదేశించాడు. అలా సముద్రుడికి జాతర చేసే విషయము ద్వారకావాసులు అందరికి తెలిసింది. ఆ రోజు రాత్రి యాదవులు అందరికి వింత స్వప్నములు వచ్చాయి. నల్లగా భయంకరముగా ఉన్న స్త్రీలు ఇళ్ళలోకి జొరబడి తమ స్త్రీలను బలవంతముగా ఈడ్చుకు వెళ్ళారు. వారి ఆయుధములను నాశనము చేసారు. వారి ఆభరణములను దొంగలు ఎత్తుకు పోయారు. మరునాడు శ్రీకృష్ణుడి చక్రాయుధము, గరుడధ్వజము, శ్రీకృష్ణుడి రధముకు కట్టే అశ్వములు శైభ్యము, వలాకము, సుగ్రీవము, మేఘపుష్పము అనే నాలుగు, ఆయన రధము అన్ని ఆకాశములోకి ఎగిరి పోయాయి. ఇంతలో ఆకాశము నుండి " యాదవులు అందరూ సముద్రతీరానికి బయలుదేరండి " అని బిగ్గరగా వినిపించింది.

సముద్రుడికి జాతర
యాదవులకు శ్రీకృష్ణుడి ఆయుధములు , రధము ఆకాశముకు ఎగిరి పోయినా, వారి ఆయుధములు నాశనము అయినా, ఆభరణములు దొంగలు ఎత్తుకు పోయినా ఇసుమంత కూడ బాధ కలగ లేదు. వారంతా మద్య మాంసములు భుజించడములో మునిగిపోయారు. వివిధములైన భక్ష్య, భోజ్యములను తయారు చేసుకున్నారు. ఆహారపదార్ధములను, మద్యమును బండ్లకు ఎక్కించుకుని సముద్రతీరానికి బయలుదేరారు. అన్నీ తెలిసినా ఏమీ ఎరుగనట్లు శ్రీకృష్ణుడు వారి వెంట నిర్వికారముగా బయలు దేరాడు. బలరాముడు కూడా తన ఆభరణములను తీసివేసి నిరాడంబరముగా కాలి నడకన వారి వెంట నడిచాడు. యాదవస్త్రీలంతా చక్కగా అలంకారములు చేసుకుని పల్లకీలలో బయలుదేరారు. అందరూ సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ ముందే వేసి ఉన్న పందిళ్ళలో కూర్చున్నారు. ఉద్ధవుడు తపస్సు చేసుకుంటానని శ్రీకృష్ణుడికి చెప్పి హిమాలయాలకు వెళ్ళాడు. బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చుని యోగ సమాధిలోకి వెళ్ళాడు. యాదవులు ఇవేమీ పట్టించుకొనక మద్యమాంసములు సేవించి విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. బ్రాహ్మణ సంతర్పణకు తయారు చేసిన పదార్ధములను కోతులకు పంచి పెట్టారు. అవి తినడము చూసి కేరింతలు కొట్టసాగారు. మద్యమాంసములు సేవించి శరీరము స్వాధీనత తప్పేలా ప్రవర్తించ సాగారు.

యాదవులలో చెలరేగిన స్పర్ధ
యాదవ ప్రముఖులు అయిన సాత్యకి, కృతవర్మ, గదుడు, చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు కూడా మద్యము సేవించి ఒకరితో ఒకరు పరిహాసాలు ఆడుకూంటున్నారు. అప్పుడు సాత్యకి కృతవర్మను చూసి రోషముగా " ఒరేయ్ కృతవర్మా ! శత్రువులైనా ! నిద్రించేసమయాన చచ్చిన వారితో సమానము. అలాంటి వారిని చంపడానికి ఏ నీచుడూ ప్రయత్నించడు. అలాంటిది ఈ కృతవర్మ అంతటి నీచకార్యానికి ఎలా ఒడిగట్టాడు రా ! ఏరా ప్రద్యుమ్నా ! అదీ ఒక వీరత్వమా ! అదీ ఒక శత్రుసంహారమా ! అది పాపకార్యమని నీకు తెలియదా ఏమి ? " అని హేళన చేసాడు. ప్రద్యుమ్నుడు " ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు వాదన ఎందుకు పోనివ్వు. ఈ కృతవర్మ చేసిన దానికి ప్రజలు అందరూ ఇతడిని నానా తిట్లు తిడుతున్నారు. ఇంకా మీరు ఎందుకు తిట్టడము " అని అన్నాడు. సాత్యకి అన్న దానికి కృతవర్మకు కోపము నఫాళానికి అంటింది " ఒరేయ్ సాత్యకి ! నీకు సిగ్గు లేదురా ! నా సంగతి నేను చేసిన యుద్ధము సంగతి నీకు ఎందుకురా ! నీ సంగతి నీవు చూసుకో. అర్జునుడు చేయి నరికినందుకు భూరిశ్రవుడు యోగసమాధిలోకి వెళ్ళాడు. అటువంటి వాడి తల నరికిన విషయము అప్పుడే మరిచావా ! అదీ ఒక యుద్ధమేనా ! అప్పుడే ఆ విషయము మరిచావా ! పైగా శ్రీకృష్ణుడు కూడా పక్కనే ఉన్నాడు కదా " అన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడికి కోపము వచ్చింది. కోపముగా కృతవర్మ వంక చూసాడు. అప్పుడు " సాత్యకి " అన్నయ్యా ! వీడి సంగతి ఎవరికి తెలియదు. నాడు సత్రాజిత్తు వద్ద ఉన్న మణిని కాజేయడానికి వీడు తమ్ముడు శతధ్వనుడితో చేరి సత్రాజిత్తును చంపలేదా ! " అని అన్నాడు. ఆ మాటాలు విన్న సత్యభామ తన తండ్రి మరణము గుర్తుకు వచ్చి ఏడుస్తూ కృష్ణుడి వద్దకు వచ్చింది. ఏడుస్తున్న ముద్దుల భార్యను చూసి శ్రీకృష్ణుడు కోపముతో ఊగిపోయాడు.

సాత్యకి కృతవర్మను వధించుట
అది చూసిన సాత్యకి అన్నకు వదినకు సంతోషము కలిగించేలా ఒక్క ఉదుటున కృతవర్మ మీదకు దూకి " అందరూ వినండి ఈ దుర్మార్గుడు కృతవర్మ అశ్వత్థామతో చేరి నిద్రిస్తున్న ఉపపాండవులను నిర్దాక్షిణ్యముగా చంపాడు. వీడిని ఇక వదలకూడదు. వీడిక బ్రతక కూడదు. వీడు కూడా అలాగేచావాలి " అని అరచి వరలో నుండి కత్తిని బయటకులాగి ఒక్క ఉదుటున కృతవర్మ తల నరికాడు. సాత్యకి అంతటితో ఆగక కృతవర్మకు చెందిన భోజకులందరితో కలబడ్డాడు. అది చూసిన భోజకులు, అంధకులు విజృంభించి సాత్యకిని చుట్టుముట్టారు. ఇంత జరుగుతున్నా శ్రీకృష్ణుడు తన తమ్ముడు సాత్యకిని వారించడానికి కాని, రక్షించడానికి కాని ప్రత్నించక మౌనంగా చుస్తూ ఉన్నాడు. ప్రద్యుమ్నుడు మాత్రము సాత్యకికి అండగా నిలిచాడు. ప్రద్యుమ్నుడి అండ చూసుకుని సాత్యకి విజృంభించి తన వారితొ కలసి భోజక అంధక కులముల వారితో యుద్ధముకు దిగాడు. ఇరువర్గాలకు యుద్ధము జరిగింది. అక్కడ ఏ ఆయుధములు లేవు. అక్కడ సముద్ర ఒడ్డు పొడుగున పెరిగిన తుంగ మొక్కలను పెరికి ఒకరితో ఒకరు కలబడ్డారు. చాలాకాలము కిందట యాదవులు చేసిన చిలిపిపనికి ఫలితముగా మునులు ఇచ్చిన శాపానికి పుట్టిన ముసలమును అరగదీసి సముద్రములో కలిపారు. అది సముద్రము నుండి కొట్టుకు వచ్చి ఒడ్డున ఇప్పుడు తుంగగా రూపుదాల్చి సముద్రపు ఒడ్డున మొలిచి ఉంది. ఆ తుంగలో ముసలము శక్తి నిక్షిప్తము అయి ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత మునుల శాపము ఫలించింది. ఆ తుంగ మొక్కలతోనె యాదవులు ఇప్పుడు కొట్టుకుంటూన్నారు.

ఘర్షణ పడుతున్న యాదవులు
ఆ సమయములో యాదవులు అందరూ మద్యము సేవించిన మత్తులో ఉన్నారు. ఆ తుంగ మొక్కలతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క యాదవుడు చస్తున్నాడు. ఈ విషయము వారికి ఆ మత్తులోఅవగతము కాలేదు. తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, బావమరిది అనే విచక్షణ లేకుండా కొట్టు కుంటూన్నారు. అంతా కింద పడుతున్నారు. తిరిగి లేచి చచ్చేలా కొట్టుకుంటున్నారు. కాని కృతవర్మకు చెందిన అంధక, భోజకులస్థులు ఎక్కువగా ఉండడముతో సాత్యకికి చెందిన వృష్టి వంశస్థులు అందరూ నశించారు. అనిరుద్దుడు, గదుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు సాంబుడు చచ్చి కింద పడ్డారు. ఇది చూసిన కృష్ణుడికి మునుల శాపము వలన అలవి మాలిన కోపము వచ్చింది. మిగిలిన తుంగకర్రలను తీసుకుని చావగా మిగిలిన భోజక, అంధక వంశస్థులను అందరినీ సమూలంగా నాశనము చేసాడు. యాదవ వంశము అంతా సమూలముగా నాశనము అయింది. ఆ రణభూమిలో కృష్ణుడు ఒంటరిగా నిలబడి పోయాడు. చావగా మిగిలిన వారిలో కృష్ణుడి రథసారథి దారుకుడు, బభ్రుడు మిగిలారు. వారు భయము భయముగా కృష్ణుడి వద్దకు వచ్చి " కృష్ణా ! యాదవులు అందరూ మరణించారు. బలరాముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మనము వెంటనే బలరాముడిని వెదకటము మంచిది " అన్నారు.

బలరాముని పరలోక యాత్ర
అందరూ బలరాముడిని వెతుకుతూ వెళ్ళారు. ఆ సమయములో బలరాముడు ఒకచెట్టు కింద యోగ సమాధిలో కూర్చుని ఉన్నాడు. కృష్ణుడు దారికుని చూసి " దారుకా ! నీవు వెంటనే హస్థినకు వెళ్ళు. ఇక్కడ యాదవ కులము అంతా సర్వనాశనము అయింది అని చెప్పి అర్జునుడిని తీసుకురా ! " అని అన్నాడు. వెంటనే దారుకుడు రథము ఎక్కి హస్థినకు వెళ్ళాడు. కృష్ణుడు బభ్రుడిని చూసి " నీవు వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉన్న స్త్రీలను అంతఃపుర జనాలను ద్వారకకు చేర్చు " అన్నాడు. సరే అని బభ్రుడు వెళ్ళబోతున్న సమయములో అంతలో అటుగా వెడుతున్న బోయవాడి చెతిలోని తుమ్మపరక ఎగిరి వచ్చి బభ్రుడికి తగిలి బభ్రుడు అక్కడికక్కడే మరణించారు. ఋషుల శాప ప్రభావము చూసి కృష్ణుడు సైతము ఆశ్చర్యపోయాడు. తరువాత కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్ళి " అన్నయ్యా ! నువ్వూ నేను తప్ప యాదవులు అందరూ మరణించారు. నేను వెళ్ళి అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు " అన్నాడు. తరువాత కృష్ణుడు సముద్రతీరానికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. తరువాత తండ్రి వసుదేవుడి వద్దకువెళ్ళి " తండ్రీ ! నేను భారతయుద్ధము చూసాను. అక్కడ కురుపాండవులు నాశనము కావడము చూసాను. ఈ రోజు యాదవులు అందరు కొట్టుకుని మరణించడము చూసాను. మీరు, నేను, బలరాముడు తప్ప యాదవులు అందరూ మరణించారు. బంధువులు, మిత్రులు లేని చోట నేనిక ఉండలేను. నా కంటే ముందుగా బలరాముడు యోగసమాధి లోకి వెళ్ళాడు. నే కూడా వెళ్ళి అతడితో పాటు తపసు చేస్తాను. ఇక్కడ విషయాలు అన్నీ ఇక మీరు చూసుకోండి. నేడో, రేపో అర్జునుడు ఇక్కడికి వస్తాడు. అతడు మీకు తోడుగా ఉంటాడు " అన్నాడు. ఆ తరువాత కృష్ణుడు వసుదేవుడి పాదములకు నమస్కరించాడు. అప్పటికే యాదవుల మరణవార్త విన్న వసుదేవుడు శ్రీకృష్ణుడి వీడ్కోలు వినగానే చైతన్యము కోల్పోయి నిశ్చేష్టుడై స్ప్రృహ తప్పిపడిపోయాడు. వసుదేవుడి పరిస్థితి చూసి అంతఃపుర స్త్రీలు హాహాకారాలు చేసారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ " ఏడవకండి. అర్జునుడు ఇక్కడకు వస్తాడు. అతడు ఇక్కడ చెయవలసిన పనులు చేస్తాడు. నేను అన్నగారి వద్దకు వెడతాను " అని చెప్పి బలరాముడి వద్దకు వెళ్ళి " అన్నయ్యా ! అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చాను. తండ్రిగారి అనుమతి తీసుకుని ఇక్కడకు వచ్చాను " అన్నాడు. బలరాముడిలో చలనము లేదు. బలరాముడి ముఖము నుండి ఒక పెద్ద నాగము వెలువడి బయటకు రాగానే బలరాముడు యోగశక్తితో ప్రాణములు శరీరము నుండి వదిలి పెట్టాడు. బలరాముడి ప్రాణాలు సముద్రము మీదుగా వెళ్ళి ఆకాశములో కలిసిపోయాయి. ఆదిశేషుడి అవతారమైన బలరాముడికి నాగజాతి ఎదురుగా వచ్చి స్వాగతము పలికింది. నాగ ప్రముఖులు అందరూ బలరాముడి ఆత్మకు స్వాగతము పలికారు. అలా బలరాముడు విష్ణులోకములో ప్రవేశించి చివరకు విష్ణుమూర్తిలో కలసి పోయాడు.

శ్రీకృష్ణుడి నిర్యాణము 
బలరాముడు ఈ తన అవతారము చాలించడము కళ్ళారా చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా అవతారము చాలించవలసిన సమయము వచ్చిందని అనుకున్నాడు. తాను ఈ భూలోకములో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో అది ఎలా నిర్వహించాడో తలచుకుంటూ దిక్కుతోచకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు తాను ఎలా ఈ శరీరము వదిలి పెట్టాలో అని ఆలోచించసాగాడు. శ్రీకృష్ణుడికి గతము గుర్తుకు వచ్చింది. ఒకసారి దుర్వాసుడు తన ఒంటికి పాయసము పూయమని కోరినప్పుడు తాను శరీరము అంతా పూసి అరికాలుకు పూయలేదు. అప్పుడు దుర్వాసుడు " కృష్ణా ! నీ మరణము అరికాలులో ఉంది " అన్నాడు. అది గుర్తుకురాగానే తాను ఎలా ప్రాణాలు వదిలి పెట్టాలో అర్ధము అయింది. శ్రీకృష్ణుడు నేలమీద పడుకుని ఇంద్రియములను నిగ్రహించి యోగసమాధిలోకి వెళ్ళాడు. అ సమయములో జర ఆరణ్యములో ప్రవేశించింది. జర అక్కడ తిరుగుతున్న వేటగాడిని ఆవహించింది. అతడి కళ్ళకు పడుకుని ఉన్న కృష్ణుడి కాళ్ళు ఒక లేడి అనే భ్రాంతిని కలుగజేసింది. వెంటనే వేటగాడూ పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి కాలుకు గురిపెట్టి ఒక బాణమును వదిలాడు. ఆ బాణము పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి పాదములో గుచ్చుకుని బయటకు పొడుచుకు వచ్చింది. ఆహా జింక చచ్చింది అనుకుని దానిని తీసుకు పోవాలని అనుకుని దగ్గరకు వచ్చిన వేటగాడికి దగ్గరకు రాగానే మాయ తొలగిపోయి అక్కడ ఉన్నది జింక కాదని శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. అది చూసిన వేటగాడు భయముతో వణికి పోయి భోరుమని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి తాను ఈ మానవ శరీరమును వదిలి వైకుంఠము చేరుకున్నాడు. వైకుంఠములో ఉన్న ఋషులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, మునులు, విశ్వదేవతలు, స్వర్గాధిపతి దేవేంద్రుడు తిరిగి వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడికి ఘనస్వాగతము చెప్పారు.

శ్రీకృష్ణుడు వైకుంఠమును చేరుట
వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడితో దేవేంద్రుడు " మహాత్మా ! ధర్మరక్షణలో ఒక భాగముగా నీవు ఆడే జగన్నాటకములో ఒక భాగంగా ఈ భూమిమీద అవతరించావు. కంసుడు, నరకుడు మొదలైన లోక కంటకులను సంహరించావు. భ్రష్టుపట్టిన భరత కులమును పరిశుభ్రము చేసావు. తిరిగి వైకుంఠము చేరుకున్నావు. నీవు ఆది పురుషుడవు, అజరామరుడవు నీకు ఆది అంతము లేదు. నీకు మరణము ఏమిటి. శ్రీకృష్ణుడిగా జన్మించడము, మరణించడము అంతా నీ లీల. ఓ మహాత్మా మానవుల కష్టాలు నీ కష్టాలుగా భావిస్తావు కనుక నిన్ను నమ్ముకున్న నీ భక్తుల కష్టాలు తీరడానికి నీవు ప్రతి యుగములోను అవతరించాలి " అన్నాడు. ఆ మాటలను చిరునవ్వుతో విన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చి చేతులు జోడించి వేదమంత్రములతో స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు అందరినీ చూసి " అనిరుద్ధమనే పేరు కలిగింది, ప్రద్యుమ్నమనే కాంతి కలిగింది, సంకర్షణమనే భావముతో ప్రకాశించేది, వాసుదేవుడు అనే నామముతో పిలువబడేది, అనన్యమైనది, అద్వితీయమైనది, జ్ఞానముతో కూడుకున్నది, ఏ దోషము లేనుది అయిన విష్ణుపదమును నాకు నేనుగా సిద్ధించుకున్నాను. పరమ మంగళకరమైన ఈ విష్ణు పదమును నేను స్వీకరిస్తున్నాను. ఒ సుకృతులారా మీరు అందరూ మీ మీ నెలవులకు వెళ్ళండి " అన్నాడు. అలా మునులను దేవతలను పంపిన తరువాత నారాయణుడు తన మూలస్థానము చేరుకున్నాడు.

దారుకుడు హస్థినకు చేరుట
శ్రీకృష్ణుడి ఆదేశముతో హస్థినకు చేరిన దారుకుడు హస్థినకు పోయి పాండవులను కలుసుకుని యాదవులకు వారి చిన్నతనములో మునులు ఇచ్చిన శాపము. ఆ శాపఫలితముగా యాదవులు అందరూ మద్యము సేవించి ఆ మత్తులో ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించడము. యాదవ కులము అంతా అంతరించడము అంతా వివరించి చెప్పాడు. బలరామ కృష్ణులు అడవిలోకి వెళ్ళిన విషయము చెప్పాడు. అర్జునుడిని తీసుకుని శ్రీకృష్ణుడు రమ్మని చెప్పిన విషయము చెప్పాడు. యాదవులు అందరూ నశించిన విషయము విన్న పాండవులు శోక సముద్రములో మునిగిపోయారు. అంతఃపురానికి ఈ వార్త అందింది. ద్రౌపది, సుభద్ర మొదలగు వారు పెద్ద పెట్టున ఏడవడము మొదలు పెట్టారు. అంతా సద్దుమణిగాక దారుకుడు " అర్జునా ! శ్రీకృష్ణుల వారు తమరిని వెంటనే ద్వారకకు రమ్మని ఆదేశించారు " అన్నాడు. అర్జునుడు ధర్మరాజు అనుమతి తీసుకుని వెంటనే ద్వారకకు బయలుదేరాడు.

అర్జునుడి ద్వారక ప్రవేశము
అర్జునుడు దారుకుడితో వేగంగా ద్వారక చేరుకున్నాడు. ద్వారక అంతా నిర్మానుష్యముగా ఉంది. ఎక్కడా జనసంచారము లేదు. శ్రీకృష్ణుడు బలరాముడు ఎక్కడా కనిపించ లేదు. అర్జునుడి మనసు కీడు శంకించింది. ఏదో విపరీతము జరిగి ఉంటుంది అనుకున్నాడు. అర్జునుడు దారుకుడు వెంటరాగా రాజసౌధానికి వెళ్ళాడు. అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు అందరూ భోరుమని ఏడ్చారు. అర్జునుడు కూడా వారి బాధను చూసి తట్టుకో లేక శోకముతో కింద పడి పోయాడు. రుక్మిణీ, సత్యభామలు అర్జునుడి సమీపానికి వచ్చి దుఃఖము ఎక్కువై కిందపడి ఏడుస్తున్నారు. వారిని అందరిని ఓదార్చడము అర్జునుడి వంతయింది.

వసుదేవుడు విలపించుట
తరువాత అర్జునుడు దారుకుడు వెంట రాగా వసుదేవుడిని చూదడానికి వెళ్ళాడు. అర్జునుడికి ఒక సందేహము పట్టుకుంది. మామూలుగా యాదవులు బంధువులు చనిపోతే ఏడవడము ఒక విధముగా ఉంటుంది. ఇప్పుడు వీరంతా ఏడవడము వేరు విధముగా ఉంది. ఇంతకూ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు. అతడికి ఏమైంది. అతడిని గురించి ఎవరు చెప్తారు అని దిక్కులు చూస్తున్నాడు. దారుకుడికి కూడా ఏమి తెలియక అతడు కూడా బిక్కమొఖము వేసుకుని చూస్తున్నాడు. వసుదేవుడు కూడా శయ్యమీద పడుకుని భోరున ఏడుస్తున్నాడు. అర్జునుడిని చూడగానే వసుదేవుడు పైకి లేచి అర్జునుడిని పట్టుకుని విలపించాడు. చనిపోయిన యాదవులను అందరినీ పేరుపేరున తలచుకుని ఏడుస్తున్నాడు. కాసేపటికి వసుదేవుడి దుఃఖము ఉపశమించింది. తరువాత వసుదేవుడు అర్జునుడితో " అర్జునా ! ఎంతో పరాక్రమవంతులు, దేవతల చేత కూడా పొగడబడిన వారు అయిన యాదవవీరులు ఒకరితొ ఒకరు కలహించుకుని సమూలముగా నాశనము అయ్యారు. ఈ ఘోరము ఎక్కడైనా ఉందా ! నీకు ఒక విషయము తెలుసా ! నీ శిష్యుడు ప్రద్యుమ్నుడు, సాత్యకి ముందుగా మరణించారు. ఇంత ఘోరము జరిగిన తరువాత కూడా నేనింకా బ్రతికి ఉన్నాను. నాదీ ఒక బ్రతుకేనా ! అయినా వీళ్ళకేమి చెడుకాలము దాపురించింది. సాత్యకి, కృతవర్మ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారట. దానితో కొట్టుకోవడము మొదలైంది. ఇదంతా ముందే నిర్ణయించబడింది. వీళ్ళు చిన్నతనములో చేసిన పాపము మునుల శాపము ఇలా పరిణమించినది. యాదవకులము నాశనము అయింది. ఒకరిని అనుకుని ఎమి లాభము. నీ కొక విషయము తెలుసా అర్జునా ఇదంతా శ్రీకృష్ణుడి సమక్షములో జరిగినది. శ్రీకృష్ణుడు తలచుకుంటే ఈ పోట్లాట ఆపలేడా ! అయినా ఆపలేదంటే యాదవ కులనాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసు అందుకనే ఆపలేదు. ఇదంతా విధిలిఖితము. యాదవ నాశనము కావాలని శ్రీకృష్ణుడికి తెలుసు. లేకపోతే ఉత్తర గర్భములో ఉన్న పరీక్షిత్తును కాపాడిన వాడికి ఇది ఒక పెద్ద విషయమా చెప్పు. విధి నిర్ణయము అని సరిపెట్టు కోవడము తప్ప మనము చేయగలిగినది ఏమీ లేదు " అన్నాడు.

వసుదేవుడు కృష్ణుడిని గురించి చెప్పుట
అర్జునుడు ఆలోచిస్తున్నాడు వసుదేవుడు యాదవుల పోట్లాట గురించి చెప్తున్నాడు కాని కృష్ణుడికి ఏమయ్యింది ఎక్కడ ఉన్నాడు అని చెప్పలేదు. కనుక శ్రీకృష్ణుడు క్షేమముగా ఉన్నాడు. అతడికి ఏమి కాలేదు అని తన మనసును సమాధాన పరచుకున్నాడు. అర్జునుడు అలా ఆలోచిస్తున్న సమయములో వసుదేవుడు తిరిగి అర్జునుడితో " ఏమి చెప్పను అర్జునా ! అలా యాదవులు తుంగకర్రలతో కొట్టుకుని మరణించిన తరువాత శ్రీకృష్ణుడు అంతఃపుర కాంతలను వెంట పెట్టుకుని ద్వారకకు వచ్చాడు " అన్నాడు. అర్జునుడు ఇక ఆగలేక " అదిసరే ! ప్రస్తుతము కృష్ణుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడు. నేను కృష్ణుడిని వెంటనే చూడాలి " అని వసుదేవుడితో అన్నాడు. వసుదేవుడు " ఇక్కడే ఉన్నాడు. అంతఃపుర కాంతలను తీసుకు వచ్చిన తరువాత నా వద్దకు వచ్చి " తండ్రీ ! ప్రస్తుతము భోజక, అంధక కుల యాదవులు వృష్టి వంశము వారు ఒకరితో ఒకరు కలహించుకుని సమూలముగా మరణించారు. నేను అర్జునుడి కొరకు దారుకుడిని పంపాను. అర్జునుడు ఈ సమయానికి వస్తూ ఉంటాడు. అర్జునుడు నీకు భక్తుడు, నీ ఆజ్ఞను పాటిస్తాడు, అన్ని పనులు చేయగల సమర్ధుడు, కార్యదక్షుడు, పరాక్రమవంతుడు నాకు అర్జునుడికి ఏ భేదము లేదు. నేనే అతడూ అతడే నేను అతడి సాయంతో నీవు మిగిలిన యాదవులను రక్షించు. అర్జునుడు అంతఃపుర కాంతలను, బాలురను, వృద్ధులను కాపాడతాడు. ఇంక కొన్ని దినములలో సముద్రము పొంగి ద్వారకానగరము సముద్రములో కలసి పోతుంది. యాదవులు ఈ విధముగా కొట్టుకుని మరణిస్తున్న తరుణములో బలరాముడు అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని యోగసమాధిలో మునిగి పోయాడు. నాకు కూడా ఆ మార్గము ఉత్తమము అని అనిపిస్తుంది. కనుక మీరు నాకు తపసు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి నేనిక అడవిలో తపమాచరిస్తాను. నీవు అర్జునుడు చెప్పిన విధముగా చెయ్యి. మరణించిన యాదవులకు అర్జునుడు ఉత్తర క్రియలు నిర్వహిస్తాడు. అంతే కాదు కాలక్రమంలో అర్జునుడే మీకు అందరికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు " అని శ్రీకృష్ణుడు నాతో చెప్పాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇప్పుడు నీవు వచ్చావు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు. అర్జునా ! ఏ కారణము లేకుండా కొడుకులు, మనుమలు, బంధువులు ఇలా హటాత్తుగా పీనుగులు అయినప్పుడు ఆ బాధ తట్టు కోవడము నా వలన ఔతుందా చెప్పు. ఆహారము, నీరు కూడా సహించడము లేదు. నా ప్రాణము మాత్రము ఈ దేహమును విడిచి పోవడము లేదు. ఏమి చెయ్యను ? నా వల్ల ఏమీకాదు. ఇక ఈ యాదవకుల స్త్రీలను, బాలురను, వృద్ధులను, అశ్వసంపదను నీవే కాపాడాలి. ఈ బాధ్యతను శ్రీకృష్ణుడు నీ భుజస్కందముల మీద పెట్టాడుకదా ! " అన్నాడు.

అర్జునుడు ద్వారకాపుర వాసులను హస్థినకు ఆహ్వానించుట
వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు మనసులో ఇలా అనుకున్నాడు. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో నేను మాత్రము ఎలా ఉండగలను. వేంటనే హస్థినకు వెళ్ళాలి అనుకుని వసుదేవుడితొ " అనఘా ! ఈ విషయములో ధర్మరాజు ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఆ నిర్ణయము ప్రకారము నేను అంతఃపుర కాంతలను, యాదవ స్త్రీలను, బాలురను, వృద్ధులను తీసుకుని హస్థినకు వెళతాను. అక్కడ వారంతా సుఖముగా ఉండే ఏర్పాటు జరిపిస్తాము. మీరు దయచేసి నాతో హస్థినకు రండి. అంతా విధిలిఖితము అనుకుని ఊరడిల్లండి " అన్నాడు. తరువాత అర్జునుడు దారుకుడితో " దారుకా ! మనము శ్రీకృష్ణుడు వెళ్ళిన దారిన వెళ్ళి శ్రీకృష్ణుడి కొరకు వెతుకుతాము. ఇక్కడ జరుగవలసిన పనులను అందరినీ పిలిచి ఆదేశాలు ఇస్తాము. అందు వలన అందరినీ పిలువు " అన్నాడు. దారుకుడు ద్వారకలో ఉన్న మంత్రులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, పుర ప్రముఖులను అందరినీ సుధర్మ అనే రాజమందిరముకు పిలిచి " ఈ రోజు మొదలు ఏడవనాటికి సముద్రము పొంగి ద్వారకసముద్రములో మునిగి పోతుంది అని ఆకాశవాణి చెప్పగా అందరూ విన్నారు. కనుక మనము అందరము ద్వారకను విడిచి ఇంద్రప్రస్థనగరానికి వెళదాము. అక్కడ మీరు అందరూ సుఖముగా ఉండవచ్చు. మీకు అవసరమైన సామాను మూటలు కట్టండి. స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు బండ్లు కట్టండి. అన్నింటినీ సిద్ధముగా ఉంచుకుని ఎప్పుడైనా ద్వారకను వదలడానికి సిద్ధముగా ఉండండి. ధర్మరాజు పాలనలో మీరు అందరూ ద్వారకలో ఉన్నంత సుఖముగా ఉండగలరు " అని అందరికీ ఆదేశాలు ఇచ్చాడు. వారందరూ వెళ్ళిన తరువాత మంత్రులతో సమాలోచన జరుపుతూ " ఏనుగులతోను, గుర్రాలతోను, లాగే బండ్లను, రధములను సిద్ధము చెయ్యండి. స్త్రీలను బాలురను తీసుకు వెళ్ళడానికి పల్లకీలను, బండ్లను ఏర్పాటు చెయ్యండి. ఏయే సామానులు ఎలా ఇంద్రప్రస్థము చేర్చాలో ప్రణాళిక వెయ్యండి. మీలో ఓర్పును నశింపజేయకండి. చనిపోయిన యాదవులు ఇక ఎలాగూరారు. ధర్మరాజు మీకు మీ దుఃఖాలను మరిపించే పాలన అందిస్తాడు. వసుదేవుడి మనుమడైన వజ్రదేవుడిని ఇంద్రప్రస్థానికి రాజుగా ధర్మరాజు నియమించ వచ్చు. కనుక ఈ విషయములో మీరు కలత చెందవలసిన పని లేదు " అన్నాడు.

వసుదేవుడు తనువు చాలించుట
ఆరోజు రాత్రికి కృష్ణుడు ఉన్న మందిరములోనే పూజలు భజనలతో కాలము గడిపాడు. మరునాడు సూర్యోదయము కాగానే కాలకృత్యాలు సంధ్యావందనాలు పూర్తిచేసుకుని బయటకు రాగానే వసుదేవుడు తన పాంచభౌతిక కాయాన్ని వదిలి పెట్టాడాన్న విషయము తెలిసింది. అప్పటికే అంతఃపుర స్త్రీలు వసుదేవుడి మరణానికి పెద్దపెట్టున శోకిస్తునారు. వసుదేవుడి భార్యలు వసుదేవుడితో సహగమనానినికి సిద్ధము ఔతున్నారు. అర్జునుడు భారమైన హృదయముతో వసుదేవుడి మందిరానికి వచ్చాడు వసుదేవుడి శరీరానికి పన్నీటిస్నానము చేయించాడు. వసుదేవుడికి పట్టువస్త్రాలను ధరింపజేసి ఆభరణాలతొ అలకంకరింప జేయించి పులమాలలతో అలంకరింప జేయించబడిన రథము మీదకు ఉంచారు. ముందు వేదపండితులు వేదమంత్రములు పఠిస్తూ నడువగా వసుదేవుడి శవయాత్ర సాగింది. అర్జునుడు పాదాచారియై రథము వెంట నడిచాడు. వసుదేవుడి భార్యలైన దేవకీదేవి, రోహిణి, భద్ర, మదిర చక్కగా అలంకరించికొని పల్లకీలలో కూర్చున్నారు. ఆ పల్లకీలు కూడా శవయాత్ర వెంట సాగాయి. ద్వారకా నగరవాసులు అందరూ శవయాత్రలో కన్నీరుగా మున్నీరుగా ఏడుస్తూ వెంట నడిచారు. వసుదేవుడి ఉద్యానవనంలో మంచిగంధపు చెక్కలతో చితి పేర్చారు. వసుదేవుడి శరీరాన్ని చితి మీద ఉంచారు. అర్జునుడు శాస్త్రోక్తంగా శవదహన క్రియను జరిపించాడు. వసుదేవుడి వెంట వసుదేవుడి భార్యలు చితిలో ప్రవేశించారు. ఆ దృశ్యము చూసిన కంటతడి పెట్టని వారు లేరు. కొందరు చితిలో నెయ్యిపోసి మటలను ప్రజ్వలింపజేసాడు. జనము హాహాకారాలు చేసారు. ఆ విధముగా వసుదేవుడి అంత్యక్రయలు పూర్తి అయ్యాయి. తరువాత వజృడు మొదలైన వారు, ఆడవారు వసుదేవుడికి తర్పణములు వదిలారు. అందరూ ద్వారకకు చేరుకున్నారు.

అర్జునుడు యాదవులకు దహన సంస్కారములు చేయించుట
అర్జునుడు తరువాత యాదవులైన భోజక, అంధక, వృష్టి వంశాల వారు కొట్టుకుని మరణించిన ప్రదేశానికి బ్రాహ్మణులను, పండితులను తీసుకుని వెళ్ళాడు. వారితో పాటు ఆ కొట్లాటలో చనిపోయిన వారి బంధువులు కూడా వచ్చారు. ఒక్కొక్కరు తమ బంధువులను గుర్తుపట్తి ఏడుస్తునారు. కొందరు ముర్ఛపోయారు. అది చూసిన అర్జునుడు చింతాక్రాంతుడై అక్కడ శోకిస్తున్నవారిని ఓదార్చాడు. తరువాత అక్కడ చనిపొయిన వారికి యదోచితముగా వేదోక్తముగా అగ్ని సంస్కారము చేయించాడు. చనిపోయిన వారి బంధువుల చేత వారికి తర్పణములు విడిపించారు. సామూహికంగా దశదిన కర్మలు చేయించాడు. అర్జునుడు ఆ విధముగా యాదవులందరికి ఉత్తమలోక ప్రాప్తి కలిగేలా చేసాడు. అర్జునుడి మనసులో ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూస్తామా అని ఆతురతగా ఉంది. అంతఃపుర స్త్రీలను, ద్వారకాపుర వాసులను, బాలురను, వృద్ధులను, సమస్త ద్వారకాపుర వాసులను ఇంద్రప్రస్థముకుచెర్చమని దారుకుదికి చెప్పాడు. అందుకు తగిన ఎర్పాట్లు చేసాడు.

అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు వెదకుట
అర్జునుడు ఆ తరువాత కృష్ణుడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అర్జునుడు మనసులో " అయ్యో కృష్ణా ! నువ్వు నీ తండ్రిని సంరక్షించడానికి నన్ను హస్థిన నుండి ద్వారకకు పిలిపించావు. నేను ఇప్పుడు మీ తండ్రి మరణవార్తను నీకు చెప్పడానికి నీ వద్దకు వస్తున్నను. ఎవరికైనా ఇంతటి దౌర్భాగ్యము కలుగుతుందా ! అయినా నేనిప్పుడు వసుదేవుడి మరణవార్తను బలరామ, కృష్ణులకు చెప్పడము ఎందుకు ? మీరు చెప్పిన పనిని సక్రమంగా పుర్తి చేసాను అని చెపితే సరిపోతుంది కదా ! " అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఇంతలో అర్జునుడికి గాంధారి ఇచ్చిన శాపము మనసులో మెదిలింది. గాంధారి శాపము ఇచ్చే సమయములో అర్జునుడు కృష్ణుడి పక్కనే ఉన్నాడు. గాంధారి " ఎవ్వరూ నీ పక్కన లేనప్పుడు నువ్వు దిక్కు లేకుండా చస్తావు " అని శపించింది. అయినా మహానుభావుడైన శ్రీకృష్ణుడి మీద ఇలాంటి శాపాలు ఫలిస్తాయా ! ఇలా పరిపరి విధముల ఆలోచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు పిచ్చివాడిలా పరితపిస్తూ వెతకసాగాడు. అర్జునుడి వెంట వస్తున్న వాళ్ళకు ఇటు కాదు అటు అని చెప్పడానికి సాహసించ లేక పోతున్నారు. అలా కొన్ని రోజులు వెదికిన తరువాత ఒక రోజు ఒక బోయవాడు వారితో " మీరు దేని కొరకు వెదుకుతున్నారు? "అని అడిగాడు. అర్జునుడు " ఇక్కడ ఎక్కడో శ్రీకృష్ణుడు తపసు చేసుకుంటున్నాడట అతడి కొరకు మేము వెదుకుతున్నాము " అన్నాడు. ఆ బోయవాడు " నేను శ్రీకృష్ణుడిని చాలా రోజుల కిందట చూసాను. తరువాత చూడలేదు. నేను కూడా మీ వెంటవచ్చి వెతుకుతాను రండి " అన్నాడు. ఆ బోయవాడితో చేరి అర్జునుడు కృష్ణుడి కొరకు వెదకసాగాడు. ఆ బోయవాడూ చెప్పిన ఆధారాలను అనుసరించి వారు కృష్ణుడు పడిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు దిక్కు లేకుండా దివ్యకాంతులు వెదజల్లుతూ పడి ఉన్న శ్రీకృష్ణుడి పార్ధివదేహాన్ని చూసారు. ఆ దృశ్యము చూసిన అర్జునుడు అక్కడకక్కడే మూర్ఛిల్లాడు. పక్కన ఉన్న వారు నీళ్ళు తీసుకువచ్చి అర్జునుడి ముఖము మీద చల్లారు. అర్జునుడు మూర్ఛ నుండి లేచి శ్రీకృష్ణుడి శరీరాన్ని కౌగలించుకుని భోరున ఏడ్చాడు. అప్పటి వరకు ఉన్న ధైర్యమూ నిగ్రహము అతడిలో సడలిపోయాయి. కళ్ళ వెంట నీరు ధరాపాతంగా కారి పోతున్నాయి. నోటమాట రాలేదు. పక్కన ఉన్న వారికి అర్జునుడిని పలకరించే సాహసము చెయ్యలేక పోయారు. కొంచము సేపటికి తెప్పరిల్లిన అర్జునుడు " అయ్యో ! కృష్ణా ! నీకా ఈ దురవస్థ. నీ వంటి మహాత్ముడు ఇలా కటిక నేల మీద పడి ఉండడమా ! అంటూ కృష్ణుడి పాదాల వంక చూసి అరికాలులో దిగిన బాణము గమనించాడు. అతడికి దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చాయి. అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపొయాడు. కృష్ణుడి దేహము అంతా పరికించి చూసాడు. అరికాలు మాత్రము నల్లగా కమిలి ఉంది. మిగిలిన దేహము దివ్య కాంతులు వెదజల్లుతూ ఉంది. నిదురిస్తున్నట్లు కనిపిస్తున్న శ్రీకృష్ణుడిని అర్జునుడు కళ్లు ఆర్పకుండా చూడసాగాడు. పక్కన ఉన్న వాళ్ళు " అయ్యా ! తరువాత కార్యక్రమాలు చూడండి. మనము పోయి ద్వారకలో ఉన్న వారిని పిలిచి అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దాము. లేకున్న శ్రీకృష్ణుడి శరీరాన్ని ద్వారకకు తీసుకు వెడదాము. ఎలా చెయ్యాలో మీరే శలవియ్యండి " అన్నారు.

అర్జునుడు శ్రీకృష్ణుడికి బలరామునికి దహనక్రియలు నిర్వహించుట
అర్జునుడు ఆలోచించి చూడగా ద్వారక మునిగి పోతుంది అన్న రోజు మరునాడే అని గ్రహించాడు. అర్జునుడు తన వెంట వచ్చిన వారితో " రేపు ఉదయము ద్వారక సముద్రములో మునుగుతుంది. కనుక మనము ఈ రాత్రికి ద్వారకకు వేళ్ళాలి. అందరినీ సమాయత్తము చేసి రేపు ఉదయానికి ముందుగా ద్వారకను విడిచి పెట్టాలి. లేకున్న అంతు లేని ప్రాణనష్టము జరుగుతుంది కనుక మనము శ్రీకృష్ణుడి నిర్యాణము గురించి ఎవ్వరికీ ఇప్పుడు చెప్పవద్దు. ప్రస్తుతము శ్రీకృష్ణుడి అంత్యక్రియలు మనము నిర్వహిస్తాము " అన్నాడు. బరువెక్కిన హృదయముతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు చేసాడు అర్జునుడు. శ్రీకృష్ణుడి పార్ధివదేహాన్ని వేదోక్తంగా దహనము చేసాడు. బలరాముడు కూడా ఆ పరిసరాలలో ఉంటాడని అనుకుని చుట్టుపక్కల వెదుకసాగారు. కొంత సేపటికి వారిశ్రమ ఫలించి ఒక చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న యోగసమాధిలో ప్రాణములు వదిలిన బలరాముడి పార్ధివ శరీరము వారికి కనిపించింది. అర్జునుడికి ఏడవడానికి కూడా సమయము చిక్కలేదు. భక్తిశ్రద్ధలతో బలరాముడికి దహన సంస్కారము చేసాడు. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణ బలరాములకు అత్యంత భక్తిశ్రద్ధలతో దహనసంస్కారములు చేసాడు. తరువాత తనవెంట వచ్చిన వారిని తీసుకుని ద్వారకకు వేళ్ళాడు. మార్గమధ్యములో దారుకుడితో " దారుకా ! మనము చేసిన పని సరి అయినది అని నేను నమ్ముతునాను. లేకున్న శ్రీకృష్ణుని మరణవార్తను విన్న రుక్మిణీ, సత్యభామ మొదలైన భార్యల దుఃఖము ఆపడము మనతరమా చెప్పు. వారంతా సహగమనము చేస్తాము అంటే మనము ఆపగలమా ! రాత్రంతా వారిని ఓదారుస్తుంటే తెల్లవారిన తరువాత సముద్రము పొంగి ద్వారక మునిగి పోతుంటే ద్వారకవాసులను కాపాడ లేదన్న అపఖ్యాతి నాకు వస్తుంది. పైగా శ్రీకృష్ణుడి మాట తప్పిన వాడిని ఔతాను. కనుక మనము వడిగా ద్వారకకు చేరుకుంటాము " అన్నాడు. అందరూ కలసి త్వరగా ద్వారక చేరుకున్నారు.

యాదవ స్త్రీల అపహరణ
అప్పటికి ద్వారకలో ప్రయాణఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రుక్మిణి మొదలైన అష్టభార్యలు, 16 వేల భార్యలు, అంతఃపుర స్త్రీలు, ద్వారకాపుర వాసులు అందరూ పల్లకీలలోను, రథముల, బండ్ల, ఏనుగుల, అశ్వముల మొదలైన వాహనముల మీద ద్వారకను దాటడానికి సిద్ధముగా ఉన్నారు. అర్జునుడు, దారుకుడు రాగానే అందరూ కదిలారు. అర్జునుడి నాయకత్వములో దారుకుడు అందరినీ ద్వారక నుండి ప్రయాణము చేయించాడు. శ్రీకృష్ణుడి అంతఃపుర స్త్రీలు 16 వేల మంది, 8 మంది భార్యలు, బలరాముని నలుగురు భార్యలు, పల్లకీలలో కుర్చున్నారు. వారివెంట సేవకులు నడుస్తున్నారు. వారివెంట బండ్లలో వారికి కావలసిన సామానులు తీసుకుని వెళుతున్నారు. వారి వెనుక ద్వారకాపురి వాసులు అందరూ తమతమ వాహనములు ఎక్కి వెళుతున్నారు. వారందరికి వెనుకగా అర్జునుడు తన రథము మీద బయలుదేరాడు. వారందరూ ద్వారకను దాటగానే సూర్యోదయము అయింది. సూర్యుడు రాగానే సముద్రము ఒక్కసారిగా పొంగింది. ద్వారకానగరాన్ని సముద్రపు అలలు ముంచెత్తాయి. అర్జునుడు యాదవులు ఒక్కసారి వెనుతిరిగి చూసారు. సముద్రము ఒక్కసారిగా ద్వారకను ముంచెత్తడము చూసి గగ్గోలుపెట్టారు. అర్జునుడి నేతృత్వములో వారంతా ఇంద్రప్రస్థము వైపు ప్రయాణము సాగించారు. అందరూ దారిలో విడిది చేసారు. ఆ రాత్రి దొంగల దండు ఒకటి వారి మీద దాడి చేసింది. కేవలము యాదవులు స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారి వెంట ఒక్క వీరుడు మాత్రమే ఉన్నాడు. అతడిని కట్టడిచేస్తే అపారమైన ధనసంపద దోచుకోవచ్చు అనుకున్నారు. ఒక్కసారిగా నిద్రిస్తున్న స్త్రీల మీద, యాదవుల మీద పడి వారి వద్ద ఉన్న నగలు, ధనము అపహరించడము మొదలు పెట్టారు. ఇంతలో అర్జునుడు అక్కడకు వచ్చి వారిని మర్యాదగా వెళ్లిపొమ్మని హెచ్చరించాడు. అయినా దొంగలు వినక స్త్రీల నుండి నగలు అపహరించడము ఆపలేదు. అర్జునుడు కోపించి వారి మీద బాణములు ప్రయోగించాడు. మొరటుతనముతో రాటుదేలి ఉన్న దొంగలను ఆబాణములు ఏమాత్రము గాయపరచ లేకపోయాయి. అర్జునుడు తమమీద బాణములు వెయ్యడము చుసి దొంగలు అర్జునుడి మీద ఎదురు దాడి చేసారు. అర్జునుడు ఎదురు దాడికి దిగ లేదు. అతడికి ఏ అస్త్రములు స్పురించ లేదు. అందు వలన మామూలు బాణములు ప్రయోగించడము మొదలు పెట్టాడు. అర్జునుడి తూణీరములో బాణములు అయిపోయాయి కాని దొంగలు దోపిడీ చేయడము ఆపలేదు. అర్జునుడికి ఇదంతా దైవలీల అని అర్ధము అయింది. ధనము, నగలు వదిలి పెట్టి రుక్మిణీ మొదలైన స్త్రీలను రక్షించాడు. దొంగలు దొచుకున్న నగలు, ధనముతో పారి పోయారు. రథములు, బండ్లు తీసుకు వెళ్ళడానికి వీలు కాక అక్కడే వదిలి వెళ్ళారు. అలా సర్వమూ కోల్పోయి కట్టుబట్టలతో వారంతా కురుక్షేత్రము చేరుకున్నారు. వారి రాక విన్న హస్థినాపురవాసులు అక్కడకు వచ్చారు. జరిగిన విషయాలను అర్జునుడు వారికి వివరంచాడు.

హస్థినలో యాదవులకు తగిన ఏర్పాటు చేయుట
అన్న ధర్మరాజు ఆజ్ఞానుసారము అర్జునుడు యాదవ స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు తగిన ఏర్పాట్లను చేసాడు. కృతవర్మ కుమారుని అతడి తల్లి, కుమారులతో మృత్తికావత పురములో నివసించడానికి ఏర్పాటు చేసాడు. మృత్తికావత పురానికి కృతవర్మ కుమారుడిని పట్టాభిషిక్తుడిని చేసాడు. సాత్యకి కుమారుడిని సరస్వతీ నగరానికి పట్టాభిషిక్తుడిని చేసాడు. మిగిలిన వారిని ఇంద్రప్రస్థముకు తీసుకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడి మనుమడు వజృడిని ఇంద్రప్రస్థానికి పట్టాభిషిక్తుడిని చేసాడు. అక్రూరుడి భార్యను, అతడి కుమారులను వజృడి సంరక్షణలో ఉంచాడు. అందరిని తగు ప్రదేశములలో సురక్షితముగా ఉంచాడు. ఇక శ్రీకృష్ణుడి అష్టభార్యలు, బలరాముడి భార్యలు అర్జునుడితో ఉన్నారు. వారికి బలరామ, శ్రీకృష్ణుల నిర్యాణ వార్తను ఎలా చెప్పాలా అని ఆలోచించ సాగాడు.

శ్రీకృష్ణ నిర్యాణ వార్తను ఎరిగించుట
అర్జునుడు ఒకరోజు మనసు దిటవు చేసుకుని రుక్మిణి, సత్యభామ తదితరులను సమావేసపరిచి తాను దారుకుడితో బలరామ శ్రీకృష్ణులను వెదకడము అక్కడ బోయవాడు కనిపించడము అతడిని స్రీకృష్ణుని గురించి అదగడము వరకు చెప్పి ఆ తరువాత ఏడుస్తూ ఉండి పోయాడు. వారందరికి బలరామ శ్రీకృష్ణులు పరమ పదించారు అన్న విషయము అర్ధము అయింది. అందరు పెద్ద పెట్టున రోదించడము మొదలు పెట్టారు. కొంతసేపు అయిన తరువాత వారు మనసు దిటవు చేసుకుని " నాయనా ! అర్జునా ! అయినది ఏదో అయినది. తరువాత ఏమి జరిగినదో చెప్పు " అన్నారు. అర్జునుడు " దారుకుడు నేను బలరామ, కృష్ణులను వెదుకుతూ ద్వారకానగరము మరిచాము. రోజులు లెక్కించి ఆ మరునాడు ద్వారక మునిగి పోతుంది అని తెలుసుకున్నాము. ఈ విషయము మీకు చెబితే మీరు చేయవలసిన కార్యక్రమాలలో మునిగిపోయి ద్వారకానగరముతో సహా మునిగి పోతారని భావించి మేమే బలరామ క్రిష్ణులకు అంత్యక్రియలు నిర్వహించాము. ఆ రాత్రికి రాత్రి మిమ్ములను ద్వారకానగరము దాటించాము. మీ అందరి ప్రాణాలను రక్షించాలని ఇలా చేసాము కాని నా మనసులో ఏదో తప్పు చేసానన్న బాధ వేధిస్తున్నది. ఏమీ చేయలేని పరిస్థితి. మీరంతా నన్ను మన్నించి నాకు ఏపాపము అంటకుండా చూడడండి " అని వారికి ప్రణామము చేసాడు. రుక్మిణీ తదితరులు అర్జునుడిని లెవనెత్తి " నాయనా అర్జునా ! విధి నిర్ణయము అలా ఉంటే నీవు మాత్రము ఏమి చేస్తావు ? నీవేమి కావాలని చెయ్యలేదు కదా ! ఇక జరగవలసిన కార్యక్రమాలు చూడు " అన్నారు. శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలలో రుక్మిణీ, జామవతి తదితరులు శ్రీకృష్ణుడితో సహగమనము చెస్తామని అన్నారు. అది విని బంధువులు అందరూ ఏడ్చారు. వారిని వారించడానికి ప్రయత్నించారు. కాని వారు వినలేదు. వారిని పల్లకీలలో ఊరేగించి చితి వద్దకు తీసుకు వచ్చారు. మంచి గంధపు చెక్కలతో చితిపేర్చి బ్రాహ్మణులు అగ్ని కార్యము నిర్వహించారు. సహగమనము చెయదలచిన వారు చితిలో దూకారు. సత్యభామ తదితరులు తపసు చెసుకోవడనికి అడవులకు వెళ్ళారు.

అర్జునుడు వ్యాసుడిని దర్శించుట
రుక్మిణి తదితరుల సహగమనము తరువాత అర్జునుడు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళి అతడిని దర్శించుకున్నాడు. అర్జునుడు వ్యాసుడికి భక్తితో నమస్కరించి " మహాత్మా ! యాదవులు అందరూ తమలో తాము కొట్టుకుని మరణించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు పాంచభౌతిక శరీరాలను వదిలి తమ స్వస్థానము చేరారు. ద్వారకానగరము సముద్రములో మునిగి పోయింది. నేను అంతఃపురస్త్రీలను, యాదవులను తీసుకు వస్తుండగా దారి మధ్యలో దొంగలు మా సర్వస్వము దోచుకుని వెళ్ళారు. ఆ సమయములో నాకు ఏ అస్త్రము మంత్రసహితముగా స్పురణకు రాలేదు. గాండీవము దాని శక్తి చూప లేదు. నాకు మాత్రము కారణము తెలియ లేదు. అమ్ములపొదిలో అమ్ములు అయిపోయాయి. కేవలము మనుషులను మాత్రమే కాపాడి వారిని ఇంద్రప్రస్థము చేర్చాను. సాత్యకి, కృతవర్మ సంతతిని రాజ్యాభిషిక్తులను చేసి యాదవులను వారి స్థానములలో నిలిపాను. తమవద్దకు వచ్చాను. తరువాతి కర్తవ్యము భోదించండి " అని ప్రార్థించాడు. వ్యాసుడు " అర్జునా ! దుర్వాసుడి పలుకులు, యాదవులకు మునులు ఇచ్చిన శాపము, గాంధారి శాపము వృధా పోదు కదా ! అంతా విధివిలాసము ఎవరికి తప్పింపశక్యము కాదు. యాదవనాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసుకనుకనే వారు కలహించుకునే సమయములో తటస్థంగా ఉన్నాడు కాని వారిని వారించడానికి ప్రయత్నము చెయ్యలేదు. శ్రీకృష్ణుడికి మునుల శాపమును నివారించడము తెలియదా ! అలా చెయ్యడము శ్రీకృష్ణుడికి ఇష్టము లేదు కనుకనే ఉపేక్ష వహించాడు. యాదవనాశనము జరగాలన్నది శ్రీకృష్ణుడి సంకల్పము. నీవు యుద్ధము చేస్తున్నప్పుడు నీ ముందు శ్రీకృష్ణుడు రధము మీద కూర్చుని రుద్రుడి సాయముతో నీ శత్రువులను చంపాడు. నీవు నీ పరాక్రమంతో చంపానని అనుకున్నావు. అలాంటి కృష్ణుడు కాలము కలసి రాకుంటే దొంగలబారి నుండి నిన్ను రక్షించలేదు. శ్రీకృష్ణుడు అవతారపురుషుడు. భూభారము తగ్గించి ధర్మరక్షణ చేయడానికి అవతారము ఎత్తాడు. తాను సంకల్పించిన కార్యక్రమాలు నెరవేర్చి అవతారము చాలించి స్వస్థానము చేరుకున్నాడు. అటువంటి కృష్ణుడి వలన గీతాభోద విన్న నీవు దుఃఖించ తగదు. శ్రీకృష్ణుడి సాయంతో భూభారాన్ని తగ్గించడానికి మాత్రమే నీ అక్షయ తుణీరాలు, గాండీవము ఉపయోగపడ్డాయి. ఆ కార్యము నెరవెరగానే అవి నిర్వీర్యము అయ్యాయి. అస్త్రములు కాని, శస్త్రములు కాని పురుషప్రయత్నము కాని దైవానుగ్రహము ఉంటేనే ఫలిస్తాయి. నీవు జ్ఞానివి దీనికి శోకించతగదు. నా వలననే అంతా జరిగిందని గర్వించకూడదు. మీ పాండవులు కూడా ఈ శరీరము వదల వలసిన సమయము ఆసన్నము అయింది. అందుకు తగిన ప్రయత్నములు చేసి ఉత్తమగతులు పొందండి " అని వ్యాసుడు పలికాడు. ఆ మాటలు విన్న అర్జునుడి మనసులో శోకము, మోహము దూరము అయ్యాయి. అతడి మనసు నిశ్చలానందముతో తొణికిసలాడింది. ఆతరువాత అర్జునుడు హస్థినాపురముకు వచ్చాడు. ధర్మరాజు తదితరులకు అప్పటి వరకుజరిగిన విషయాలు బలరామ, శ్రీకృష్ణుల నిర్యాణము, తాను వ్యాసుడిని దర్శించడము అంతా సవివరముగా చెప్పాడు " అని వైంపాయనుడు జనమేజయుడికి భారతకథను చెప్పసాగాడు.




Sunday, 21 January 2018

పవిత్ర మాఘం





పవిత్ర మాఘం

పర్వదినాలు అంటే ‘పూర్ణిమ’ రోజులు. ఇవి దేవతలకు అత్యంత ప్రీతికరమని భక్తులు విశ్వసిస్తారు. మాఘమాసంలో పవిత్ర స్నానాలు చేసి, ఇష్టదైవాల్ని పూజిస్తారు. సాగర తీరాన నివసించేవారు అక్కడ స్నానాదులు ముగించి జపాలు, దానాల వంటి సత్కర్మలు ఆచరిస్తారు. నదీస్నానం చేసినా, అందుకు అవకాశం లేనివారు బావి లేదా చెరువు నీటితో గంగను స్మరిస్తూ స్నానం గావించినా అదీ పుణ్యప్రదమేనని ఓ నమ్మకం.

మాఘమాసంలో మరో నాలుగు పండుగలున్నాయి. మాఘ శుద్ధ అష్టమి మఘా నక్షత్రంనాడు- భీష్మాష్టమి. సప్తమి-సూర్య సప్తమి (రథ సప్తమి). మాఘ బహుళ చతుర్దశి- శివరాత్రి. మాఘ బహుళ అమావాస్య, మాఘ మాసాంతం- ద్వాపర యుగాది.

మాఘశుద్ధ అష్టమి తిథినాడు భీష్ముడు పరమపదించాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరవాత, మాఘ శుద్ధ అష్టమినాడు ఆయన స్వచ్ఛంద మరణం పొందాడని ‘మహాభారతం’ చెబుతోంది. శ్రీకృష్ణుడు ఆయన దగ్గరే ఉన్నాడు. తన మరణానంతరం వచ్చే ఏకాదశి పుణ్యదినాన్ని ‘భీష్మ ఏకాదశి’గా లోకం గుర్తించేలా వరం కోరతాడు భీష్ముడు. కృష్ణుడు  అనుగ్రహించాడని ‘నారద పురాణం’ విశదీకరిస్తోంది. భారత యుద్ధం ముగిశాక, అంపశయ్యమీద ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉన్న భీష్ముడికి కృష్ణుడు తన వాగ్దానం ప్రకారం దర్శనమిస్తాడు. అప్పుడు భీష్ముడు చేసిన స్తుతి ‘భీష్మ స్తవం’గా పేరొందింది. దాన్ని ఆయన ‘కృష్ణాయ నమః’ అని ముగిస్తాడు. అది శ్రీకృష్ణ మహామంత్రంగా నిలిచిపోయింది.

ఇదే మాసంలో స్మరించాల్సిన పౌరాణిక గాథల్లో మార్కండేయుడి చరిత్ర ఒకటి. అతడికి పరమేశ్వరుడు ప్రసాదించింది పదహారు సంవత్సరాల ఆయుర్దాయమే! అది పూర్తయిన వెంటనే  భటుల్ని పంపుతాడు యముడు. ఆ సమయంలో అతడు శివ ధ్యానం చేస్తుండటంతో, భటులు ఆ దరిదాపులకైనా వెళ్లలేకపోతారు. ఒక మహా తేజస్సు వారిని అక్కడి నుంచి తరిమేస్తుంది. విషయం తెలిసి, యమధర్మరాజే అక్కడికి చేరుకుంటాడు. పాశంతో మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతడు శివలింగాన్ని హత్తుకొని, ఆ స్వామిని ధ్యానిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, యముడి పైకి త్రిశూలాన్ని ప్రయోగించి, భక్త మార్కండేయకు చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. అన్నింటికీ మూలం మాఘంలో రోజూ ఉదయమే సాగిన గంగాస్నానం, ఈశ్వర ధ్యానం అని వివరిస్తుంది ‘మాఘ పురాణం’.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యముంది. పలు విధాల స్నానాలుంటాయి. అవి-  మంత్ర, వాయవ్య, ఆగ్నేయ, కాపిల, వారుణ, మునుమానస స్నానాలు. వేదమంత్రాలు చదువుతూ చేసేది మంత్ర స్నానం. గోధూళి పైన చల్లుకొని చేసే స్నానం వాయవ్యం. విభూతి రాసుకొని చేస్తే ఆగ్నేయం. శరీరం పైభాగాల్ని తడి వస్త్రంతో తుడుచుకోవడం కాపిలం. ఎండలో స్నానం ఆచరించడం ఆతపం. సాధారణ స్నానం - వారుణం. విష్ణుస్తుతితో చేసే స్నానం మునుమానసం. ఇవన్నీ శారీరక, మానసిక పరిశుభ్రతకు దోహదపడతాయి. మాఘస్నానం చేసి, విష్ణువును పూజించి, దానం తరవాత పురాణ శ్రవణం నిర్వర్తించడం సంప్రదాయం.

అన్ని అంతరాలకూ అతీతంగా పాటించాల్సిన పద్ధతులివి. మాఘమాసం శివకేశవులిద్దరికీ ఇష్టమైనది. దేవతార్చనలో- శివుణ్ని, విష్ణువును, వారి అవతార మూర్తులను స్తుతించవచ్చు. మాఘ స్నానం వల్ల  బుద్ధి, వికాసం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతాయి. శరీరం ఉల్లాసభరితమవుతుంది. విష్ణువుకు ఇష్టమైన మాఘ శుద్ధ ఏకాదశి పరమ పవిత్రం. అఘం అంటే పాపం. దాన్ని పోగొట్టేది మాఘం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మాసం అత్యంత విశేషమైనది. ఇటువంటి పవిత్ర స్నానాల సంస్కృతి దేశంలో అతి ప్రాచీన కాలం నుంచీ ఉందని పురాణాలెన్నో తేటతెల్లం చేస్తున్నాయి.

- పి.భారతి



వివాహం





రాక్షస వివాహాలు

రఘువంశంలో కాళిదాసు చెప్పిన ‘సంచారిణీ దీప శిఖేవ’ శ్లోకం సుప్రసిద్ధమైనది.  ఇందుమతీ దేవి స్వయంవరం జరుగుతోంది, అనేక మంది రాజులూ, రాకుమారులూ ఆమెను దక్కించుకోవాలనే ఆశతో విచ్చేశారు స్వయంవరానికి. నిర్ణీత సమయానికి  నెచ్చెలి సునంద వెంటరాగా వరమాలను చేత ధరించి ఇందుమతీ దేవి ఒక్కొక్క రాజునే చూస్తూ ముందుకు నడుస్తున్నది. సునంద ఆ రాజును గురించి అమెకు పరిచయం చేస్తుంటే ఒక్క క్షణం ఆతని ముఖాన్ని పరకాయించి చూస్తున్నది. ఆ క్షణాన ఆ రాజు ముఖం వెలిగిపోతున్నది – “ ఇందుమతి నన్నే చూస్తోంది! ఇక మాల మెడలో పడడమే తరువాయి” అన్న ఊహ అతని ముఖాన్ని దీప్తిమంతం చేస్తున్నది. అంతలో ఇందుమతి  ముందుకు వెళ్ళి పోతుంది. చివరికి ఇందుమతి అజ మహారాజును వరించింది. ఆ సన్నివేశంలో ఆ రాకుమారినీ, ఆయా రాజవంశీయులనూ కవి కాళిదాసు ఇలా వర్ణించాడు:

 “సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం సస భూమిపాల”

- ఆ స్వయంవర సభలో ఇందుమతి నడుస్తున్న దీపశిఖలా ఉందట. చీకట్లో రాజవీధిలో ఓ దీపశిఖ నడిచిపోతూ వుంటే ఒక్కో రాజభవనపు గుమ్మం, జ్వాల దగ్గరవుతున్నకొద్దీ ప్రకాశమానమవుతూ, జ్వాల దాటి పోగానే చీకట్లో మునిగిపోతున్నట్లుగా ఒక్కో రాజు ముఖం ఇందుమతి సమీపిస్తూ ఉంటే ప్రకాశిస్తూ, తనను దాటిపోతుంటే నల్లబడిపోతోంది.

వీధులను రాత్రిపూట కాంతివంతంగా ఉంచడానికి నాటి కాలంలో దివితీలను పట్టుకొని పహారా కాచేవారు. ఆ పనిచేసే వారు దివిటీ పట్టి నడిచిపోతున్నప్పుడు అతను ఏ ఇంటిముందు ఉంటే ఆ ఇల్లు దివిటీ కాంతికి ప్రకాశవంతంగా కనబడేది. ఆ యింటిని ఆ వ్యక్తి దాటి వెళ్లి పోయేక తిరిగి ప్రకాశ హీనమయ్యేది.

ఎంతగా దీన్ని మనసులో ఉంచుకున్నాడో, మహాకవి కాళిదాసు గారు, ఈ విషయాన్ని పై శ్లోకం లో రాకుమారి ఇందుమతిని దీపశిఖ గాను, వెలిగి ఆరిపోతున్న ఇండ్లను ఆమె తమను దాటి వెళ్లిపోతుంటే వివర్ణమవుతున్న రాజుల ముఖాలతోనూ పోల్చి చెప్పాడు - ఎంతైనా ఉపమాలంకారానికి పేరుగాంచిన కవి కదా కాళిదాసు! ఈ ఉపమానం చెప్పడం వలన ఆయన్ని 'దీపశిఖా కాళిదాసు' అనేవారట! ఈ శ్లోకం ఉన్న కావ్యం రఘువంశం.

పూర్వం రాకుమార్తెలు అలా తమ భర్తలను తామే ఎంపిక చేసుకొనేవారు. కూతురు ఎంచుకొన్న వరుడితో ప్రభువులు- భాగవతంలో పోతన చెప్పినట్లు, ‘కన్యన్‌ చేకొన ఇన్ని లోకముల నీకన్నన్‌ ఘనుండైన రాజన్యుండెవ్వడు? నీ గుణంబులకును ఆశ్చర్యంబునుంబొంది...’ నిన్ను కోరుకొంది- అంటూ ఆయనకు ఇచ్చి పెళ్లి జరిపించేవారు. దేశదేశాల యువరాజుల్లో బాగా నచ్చినవారిని తామే స్వయంగా వరించే ఆ ప్రక్రియను ‘స్వయంవరం’ అనేవారు. కాళింది మాత్రం అర్జునుణ్ని మధ్యవర్తిగా పెట్టుకొంది. ‘విష్ణుం ప్రభున్‌ వరుగా గోరి తపంబు సేయుదు పరున్‌ వాంఛింప’ అని చెప్పి ఆయన సాయంతో కృష్ణుణ్ని పెళ్లాడింది. నూతిలో పడి ఉన్న దేవయానికి యయాతి కుడిచేతిని అందించి పైకి లాగాడు. ‘ఇది దేవుడి సంకల్పం... నువ్వే నా భర్తవి’ అంది దేవయాని. కారణమూ చెప్పింది. ‘నను పాణిగ్రహణంబు చేసితి కదా! నా భర్తవున్నీవ! దైవ నియోగంబిది’ అనేసి తన నిశ్చయాన్ని ప్రకటించింది. పూర్వం స్వేచ్ఛగా అమ్మాయిలిలా వలచి వరించి, అవసరం అయితే, ‘రాక్షస వివాహమునన్‌ భవదీయ శౌర్యమే ఉంకువ (కన్యాశుల్కం లేదా ఓలి) చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము వచ్చెదన్‌’ అని రుక్మిణి మాదిరిగా ధైర్యంగా వర్తమానాలు పంపేవారు. ఎంత మంచికాలం అది!

అద్భుతం అనే భావాన్ని ఒక్క అక్షరంలో చెబితే అది- స్త్రీ.
ఆ అద్భుతాన్ని పురుషుడికి సొంతం చేసే రెండక్షరాల ప్రక్రియ పేరు పెళ్లి.
మూడుముళ్లతో బలపడే బంధాన్ని మూడు అక్షరాల్లో పలికితే అది దాంపత్యం!
దాంపత్య జీవితంలో స్త్రీ అనే వీణను ప్రేమగా శ్రుతిచేసే విద్వాంసుడి నాలుగక్షరాల పేరు- పురుషుడు.
వారిద్దరి ఆత్మీయ బంధానికి అయిదక్షరాల మాట- ఆలుమగలు

ఆడ, మగలను ఆలుమగల్ని చేసే ఆరక్షరాల తంతు- వివాహ ప్రక్రియ.
భార్యాభర్తలు తలకెత్తుకొనే సామాజిక బాధ్యతకు ఏడక్షరాల పేరు- గృహస్థాశ్రమ ధర్మం.
ఇది సప్తపది. వేద విధి.
ఏడు అంచెల మాంగల్య మహా సూత్రమిది.

యుక్తవయసు రాగానే పిల్లవాణ్ని పిలిచి ‘చదివితివి ఎల్ల శాస్త్రములు... వివాహ యోగమగు నట్టిది గాన కళత్రమున్‌(భార్యను) వరింపదగు, మఖ క్రియల్‌(యాగాలు) పొనరుపందగు పుత్రుల గాంచగా దగున్‌’ అని పెద్దలు చెప్పాలన్నారు దేవీభాగవతంలో తిరుపతి వేంకటకవులు. పితృరుణం అంటే అదే.

‘ముదమలరన్‌ మమున్‌ రుణవిముక్తుల చేయదగుం కుమారకా’ అంటూ గృహస్థాశ్రమ ధర్మ పరమావధిని వారు లోకానికి బోధించారు.

‘పెండ్లియన వినోద విక్షేపమా... కాదు, దీర్ఘ సత్రయాగ దివ్యదీక్ష’ అన్నది పెద్దల నిర్దేశం. దాన్ని అండగా చేసుకొని దంపతులు నిండుగా జీవితాన్ని పండించుకోవడమే పెళ్లికి పరమార్థం.

‘కలదు విశిష్ట అద్వైతము, కలదు అద్వైత సుషమైక కైవల్యమ్ముల్‌, కలదు కదద్వైతమును... మతత్రయమును మన దాంపత్యములో’ అన్న నండూరి రామకృష్ణమాచార్యుల మాట ఏ జంట జీవనయానంలో నిజమవుతుందో- వారి జన్మ ధన్యం!

‘ఓ సుకుమారతా ప్రియ మహోదయ శేఖర, స్వీకరింపుమా, నా సుహృద అంతరంగ సుమన శ్శుభ శోభన ధన్యవాదముల్‌’ అన్నట్లుగా ఉండాలట నూతన దంపతుల హృదయ స్పందన. వేదం అదే చెప్పింది.

‘సఖా సప్తపదాభవ...’ నా స్నేహితురాలివి కా, ‘సంప్రియారోచిష్ణూ! చిరకాలం ప్రేయసీ ప్రియులుగా గడుపుదాం’ అని వధూవరుల చేత సప్తపది మంత్రాల్లో వాగ్దానం చేయిస్తుంది.

వివాహం అనే మాటకు- వి, వహనం, బాధ్యతలను విశేషంగా వహించడం అని అర్థం. ఉత్తమ రీతిలో వహించడం అనే అర్థంలో ఉద్వాహం అనీ అంటారు. ‘తలపులందు, బ్రతుకు మలుపులందు ధర్మ నిర్వహణమె దాంపత్యమునకు ఆత్మ!’ అన్నారు కవులు.

బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం... అనే ఎనిమిది రకాల వివాహాలను చెప్పాయి ధర్మశాస్త్రాలు. వాటిలో చివరిది నీచతమం. నిద్రిస్తున్న లేక మైకంలో ఏమరుపాటుగా ఉన్న స్త్రీని బలవంతంగా ఎత్తుకురావడం పైశాచికం. కనుక ‘పైశాచశ్చ అష్టమో అధమః’ అన్నాడు మనువు.

బిహార్‌లో పెరిగిపోతున్న ‘పకడ్వా వివాహ్‌’ ప్రక్రియను మనం ఆ ఎనిమిదో బాపతుగా చెప్పవచ్చు. పెళ్లికాని కుర్రాడు కనపడితే తలకు తుపాకీ గురిపెట్టి ఎత్తుకెళ్లిపోయి, ఏడ్చి మొత్తుకుంటున్నా వినకుండా ముక్కూ మొహం తెలియని అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించడం అక్కడి ఆచారం.

‘ఇది వలపొ జన్మజన్మాలను అదుము సౌహృదమ్మొ, లోన ఆత్మల పిల్పు దాచుకున్న పుణ్యమో’ అని భావకవులు పలవరించేవేవీ అక్కడ చెల్లుబాటు కావు.

‘ప్రణయినీ ప్రసూనాంగ సంస్పర్శ తగిలి తగులని విధాన కలిగినంతనె అనంత దివ్యరాగ స్రవంతిలో తేలిపోదు’ అని నాయని సుబ్బారావు చెప్పిన మధురానుభూతులతో ప్రమేయమే లేదు.

పైపెచ్చు భోరున ఏడుస్తూ తాళి కడుతుండే ఆ అబ్బాయికి ‘ప్రతి మంచి పెళ్లీ కన్నీళ్లతోనే మొదలవుతుంది’ అని బిహారీలు తరచుగా నచ్చజెబుతుంటారట.

‘రుక్మి కృష్ణుని ఎడ చాల విరోధము చేసి మత్త పుష్పంధయవేణి(రుక్మిణి) నిత్తు శిశుపాలునికి’ అని మూర్ఖంగా ఆలోచించినప్పుడు రుక్మిణి ఎంతగా బాధపడిందో అనిపిస్తుంది ఇది వింటుంటే.

‘వీనుదోయికెట్లు వినిపించు చప్పట్లు చేరకుండ రెండు చేతులు ఎలమి’ అన్నట్లు రెండు మనసులూ ఏకం కాకపోతే దిక్కేమిటన్నది ఇక్కడి ప్రశ్న!




Monday, 15 January 2018

ఉద్దవ గీత





మహాభారతం – విశేషములు

ఉద్దవుడు శ్రీకృష్ణునికి బాల్యమిత్రుడు. శ్రీకృష్ణుడు ఉద్దవుని చాలా సార్లు ఒంటరి ప్రదేశంలో ధ్యానము కొనసాగించి జ్ఞానసిద్ధి పొందమని ప్రభోదించాడు. కాని, ఎదురుగా పరబ్రహ్మమును పెట్టుకుని ఎక్కడో అరణ్యములో ధ్యానము చెయ్యడమేమిటని ఉద్దవుడు శ్రీకృష్ణభగవానుని మాట వినలేదు. 

"ఉద్దవా! నా తత్వమును ఈ ఒక్క శరీరానికే పరిమితము చేస్తే, శ్రీ కృష్ణ తత్వము నీకు బోధపడదు. చెప్పిన మాట విని ధ్యానము చెయ్యి." అని బాల్యమిత్రునికి తిరిగి చెప్పాడు. 

అయినా ఉద్దవుడు శ్రీకృష్ణుని విడవక సేవిస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో ఉద్ధవుడు "స్వామి నా సంగతి ఏమిటి" అని మన స్వామిని అడుగుతాడు. 

"నీసంగతి నువ్వే చూచుకోవాలి అని చాలా సార్లు చెప్పాను. అయినా నువ్వు వినలేదు." అంటాడు స్వామి. 

"స్వామి మనది 100 సంవత్సరాల పైగా ఉన్న స్నేహము. అది వృధాయేనా ? " అని ఉద్ధవుడు బాధపడతాడు. 

బాల్యమిత్రుని ఉద్దరించడానికి మన స్వామి ఆయనకు చేసిన జ్ఞానబోధయే "ఉద్దవ గీత" గా ప్రసిద్ధి చెందినది. 

ఆ బోధచేసి ఉద్ధవునితో "నీవు బదరీకాశ్రమము వెళ్ళి, అక్కడ తపస్సు చేసి జ్ఞానము పొందు" అని అదేశిస్తాడు. 

అప్పుడు అక్కడే ఉన్న మైత్రేయ మహర్షి కూడా ఉద్దవ గీత విన్నాడు. 

స్వామి ఆయనను అడిగాడు "మహర్షి ఈ బోధ విన్నారుగా! అర్ధమయ్యింది కదా!" 
మైత్రేయ మహర్షి "స్వామి! మీరు ఉద్ధవునికదా బోధ చేసింది, నాకు కాదు కదా! అయినా జగదాచార్యుల బోధ పూర్తిగా అర్ధం చేసుకున్నాను" అని మైత్రేయుడు చెబుతే, 

"మహర్షి! ఈ బోధ మీరు ఇతరులకు అందించండి. విదురుడు నా దగ్గర ఉపదేశం కోసం బయలుదేరాడు. కాని ఆయనకు సందేహం వచ్చింది. జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దగ్గర ఉపదేశం పొందే అర్హత నాకు ఉన్నదా? అన్న అనుమానం వచ్చి మరింత పరిపక్వతకొరకు తపస్సు చేస్తున్నాడు. విదురుడు మిమ్ములను ప్రభాస తీర్ధములో కలుస్తాడు. అప్పుడు ఆయనకు మీరు ఈ బోధ అందించండి." 

ప్రభాస తీర్ధములో విదురునితో "నాయనా అందరూ నిర్యాణసమయములో స్వామిని తలుస్తూంటే, ఆ స్వామి తన నిర్యాణ సమయములో నిన్ను తలచి, నీకు ఈ బోధ చెయ్యమని ఆదేశించాడు. నీతోపాటు నన్ను ధన్యుడిని చేశావు" అని విదురునికి ఉద్ధవగీత బోధ చేస్తాడు.

ఇది ఉద్ధవగీత సంబంధించిన వృత్తాంతము.



కృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు ఎందుకు కష్టపడ్డారు?

కృష్ణ : నేను అవతారం చాలించే సమయం వచ్చేసింది, ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏమి అడగలేదు, ఏమైనా ఉంటె అడుగు మళ్ళీ దొరకను.

ఉద్దవ : కృష్ణా నాకు ఎటువంటి కోరికలు లేవు కాని కొన్ని సందేహాలు ఉన్నాయి, అనుమతిస్తే నివృత్తి చేసుకుంటాను.
కృష్ణ : తప్పకుండా మిత్రమా, అడుగు…

ఉద్దవ : నిజమైన స్నేహితుడు అంటే ఎవరు ?
కృష్ణ : నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నీ పిలుపు కోసం ఎదురుచూడకుండా వచ్చి సాయం చేసేవాడు.

ఉద్దవ : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?


కృష్ణ : ఉద్దవా! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురుచూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధనమన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటె రాకుండా ఉంటానా.

ఉద్దవ : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?


కృష్ణ : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మ ని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీది గమనిస్తూ ఉంటాను.

ఉద్దవ : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?


కృష్ణ : ఉద్దవా! నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి, నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.

కృష్ణుడు ఏది వూరికే చేయడు, మన పక్కనే ఉంటాడు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు మన లైఫ్ చాలా స్మూత్ గా సాగిపోతుందన్నమాట. భారతంలో అర్జునిడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధానం భగవద్గీత అయితే, భాగవతంలో ఉద్ధవుడి ప్రశ్నలకు సమాధానం ఉద్ధవగీత(హంస గీత)గా ఉంది.



Sunday, 14 January 2018

మహాభారత యుద్ధ కథ - 2


తిక్కన సోమయాజి మహాభారత యుద్ధకథ

రచన: కె. వి. ఎస్. రామారావు

పదిహేడవ రోజు


మన బలగాలు యుద్ధానికి బయల్దేరినయ్. తమ్ముళ్లు, కర్ణుడు పక్కన నడవగా నీ కొడుకు ఆర్భాటంగా కదిలాడు. అప్పుడు కర్ణుడు తన రథాన్ని దుర్యోధనుడి రథం దగ్గరికి నడిపించి అతనితో “ఈరోజు యుద్ధంలో నేను అర్జునుణ్ణి చంపబోతున్నా. అతన్నెలా చంపాలో రాత్రంతా బాగా ఆలోచించి ఒక పథకం తయారుచేశా. మా ఇద్దర్ని పోల్చి చూస్తే దివ్యశరజాలాల్లో నాకతను ఉజ్జీ. దృఢత్వంలో, లాఘవంలో నాకన్నా తక్కువ. దూరంగా వున్న వాటిని ఛేదించటంలో కూడ వెనకే. సౌష్టవరేఖలో సమానుడు. ధైర్యం, శౌర్యం, భుజబలంలో చాలా తక్కువ. ఐతే అతని దగ్గర గాండీవం వుంది. నా దగ్గర విజయం అనే ఒక గొప్ప విల్లుంది. విశ్వకర్మ ఇంద్రుడి కోసం దాన్ని తయారుచేశాడు. అతను దాంతో అనేకమంది రాక్షసుల్ని జయించాడు. దాన్నతను పరశురాముడికిస్తే దాంతో అతను ఇరవయ్యొక్క సార్లు తిరిగి రాజుల్ని చంపాడు. నామీది ప్రేమతో అతనా ధనుస్సుని నాకిచ్చాడు. అది గాండీవంతో సమానం. అతనికి అక్షయతూణీరాలు, అగ్ని ఇచ్చిన అవధ్యాలైన గుర్రాలున్నయ్, ఐనా పర్లేదు, అదో పెద్ద విషయం కాదు. నాతో పాటు బళ్లకొద్ది ఆయుధాలు తెస్తా, గట్టి గట్టి రథాల్ని, దిట్టమైన గుర్రాల్ని దగ్గర్లో వుంచుతా. ఇకపోతే అతనికి సారథి కృష్ణుడు. కృష్ణుడి మూలానే అర్జునుడు అంతగా పరాక్రమించ గలుగుతున్నాడు. మనవైపు సారథ్యంలో శల్యుడు కృష్ణుడితో సమవుజ్జీ అంటారు, పైగా శల్యుడికి కృష్ణుడికన్నా అశ్వజ్ఞానం ఎక్కువ. కనక ఎలాగైనా నువ్వు శల్యుణ్ణి నాకు సారథిగా చేశావంటే చాలు, ఇంక నా యుద్ధకౌశలం ఏమిటో చూపిస్తా” అని తన ఆలోచనని సమగ్రంగా వివరించాడు.

అది విని ఆనందించాడు దుర్యోధనుడు. శల్యుణ్ణి తప్పకుండా సారథిని చేస్తానని మాట ఇచ్చాడు. ఇద్దరూ కలిసి శల్యుడి దగ్గరికి వెళ్లారు. దుర్యోధనుడతనికి భక్తితో నమస్కరించాడు. అతన్ని బాగా పొగిడాడు. “ఇవాళ మనం అర్జునుణ్ణి చంపబోతున్నాం. నువ్వందుకు కర్ణుడికి సాయం చెయ్యాలి. భీష్మ ద్రోణులు పోయాక సన్నగిల్లిన బలగాల్తోనే నేను యుద్ధం కొనసాగిస్తున్నానంటే అది నిన్నూ, కర్ణుణ్ణీ చూసుకునే. కాబట్టి నువ్వితనికి సారథ్యం వహించి నన్ను కరుణించు” అని వేడుకున్నాడు.

ఆ మాటలకి పట్టరాని కోపంతో ఊగిపోయాడు శల్యుడు. కళ్లు కెంపెక్కినయ్. కనుబొమలు ఉగ్రంగా కదిలినయ్. మొహాన చెమటలు పట్టినయ్. “నాకింత నీచపు పని చెప్పటం నీకు న్యాయం కాదు. మూర్థాభిషిక్తుడైన రాజు ఒక సూతసుతుడికి సూతుడిగా వుండటమా? ఐనా ఇతను నాకన్నా బలవంతుడా? తల్చుకుంటే నేనొక్కణ్ణే పాండవులందర్నీ చంపి నీకు రాజ్యం ఇవ్వగలను. ఈ కర్ణుడు నాలో పద్నాలుగో వంతు వుండడు, ఇతనికి నేను సారథినా? నీకు నా సంగతి సరిగా తెలీక ఇలా అన్నట్టున్నావ్, తెలిసే కావాలని అవమానిస్తుంటే చెప్పు, నేను హాయిగా మా వూరికి తిరిగిపోతా” అని బయల్దేరాడతను.

దుర్యోధనుడు సాంత్వనవచనాల్తో అతనికి సర్దిచెప్పటానికి ప్రయత్నించాడు. “రథికగుణాల్లో కర్ణుడు అర్జునుడి కన్నా మిన్న, అశ్వహృదయంలో నువ్వు కృష్ణుడి కన్నా గొప్ప. మనం అర్జునుడికి పోటీగా కర్ణుణ్ణి అనుకున్నాం. కృష్ణుడి కన్న గొప్పవాడివి నువ్వు తప్ప సారథ్యానికి సరైన వాళ్లు ఇంకెవరున్నారు?” అంటే శల్యుడు “ఇంతమందిలో నన్ను కృష్ణుడి కన్నా గొప్పవాణ్ణని చెప్పి నాకు ఆనందం కలిగించావ్. కనక ఇతనికి సారథిగా ఉండటానికి ఒప్పుకుంటున్నా. ఐతే ఒక్క మాట, సారథ్యం చేస్తూ నాకు తోచిన మాటలు విచ్చలవిడిగా మాట్లాడతా, దాన్ని మాత్రం ఎవరూ తప్పు పట్టకూడదు” అని తన షరతు చెప్పాడు. కర్ణుడి వంక చూశాడు దుర్యోధనుడు. “అలాగే కానిద్దాం” అని చెప్పి, శల్యుడితో “ఒప్పుకుంటున్నా” అన్నాడు.

దుర్యోధనుడికి ఇంకా అతను మనసు మార్చుకుంటాడేమోనని అనుమానం వుండి మార్కండేయ మహాముని తన తండ్రికి చెప్తుంటే తను విన్న త్రిపురాసుర సంహారకథని శల్యుడికి వినిపించాడు. రథిక, సారథులు చాతుర్యంలో సమానులు కావటం మహాసంగ్రామాల్లో ఎలా అవసరమో వివరించాడు. మహాదేవుడి మేరురథానికి బ్రహ్మ సారథ్యం ఎలా అవసరమైందో అలా కర్ణుడికి శల్యసారథ్యం అవసరమని ఉద్ఘాటించాడు. అది విన్న తర్వాత శల్యుడు తృప్తిచెందాడు.

అంతతో ఊరుకోక దుర్యోధనుడు శల్యుడి మరో సందేహాన్ని కూడ తీర్చటానికి పూనుకున్నాడు. “భార్గవరాముడు దివ్యాస్త్రాల కోసం ఎంతోకాలం పరమేశ్వర తపస్సు చేశాడు. అతనికి శివుడు ప్రత్యక్షమై అశుచులైన వాళ్లకి ఈ దివ్యాస్త్రాలు వశం కావు, కనక నువ్వు పరమశుచివైనప్పుడే వీటిని పొందగలవు అంటే దానికా పరశురాముడు తనకెప్పుడు అంతటి శుచిత్వం వస్తుందో అప్పుడు వచ్చి అస్త్రాల్ని దయచెయ్యమని శివుణ్ణి ప్రార్థించాడు. ఆ భార్గవరాముడు తిరిగివెళ్లి నియమనిష్టాపరుడై శివానుష్టానంలో లీనమై వుండగా కొన్నాళ్లకి దేవతలు రాక్షసుల ఉపద్రవాలు పోగొట్టమని అడగటానికి శివుడి దగ్గరకు వచ్చారు. ఆయన భార్గవుణ్ణి పిలిచి దివ్యాస్త్రాలిచ్చి వాటితో రాక్షసుల్ని జయించమని పంపాడు. అతనలాగే చేసి వచ్చాక ఆనందించి పరమశివుడు ఆ అస్త్రాల్ని అతనికి ధారపోశాడు. ఆ భార్గవరాముడు తర్వాత తన ప్రియశిష్యుడైన కర్ణుడికి ఆ దివ్యాస్త్రాలిచ్చాడు. ఇతను హీనకులజాతుడైతే అంతటి మహానుభావుడు శివానుగ్రహంతో పొందిన దివ్యాస్త్రాల్ని అలా ఇచ్చేవాడా? పైగా కర్ణుడి ముఖవర్ఛస్సు, సహజ కవచకుండలాలు అతను ఉత్కృష్టయోని జాతుడని చెప్పటం లేదా? కనక అతని జననం గురించి నీకెలాటి అనుమానమూ వద్దు, అతను తప్పకుండా ఉన్నతవంశజుడే” అని నచ్చజెప్పాడు. “నువ్వు సారథివైతే రథికుడి కన్నా అధికుడైన సారథి వున్న రథం ఔతుంది మీది, నువ్విలా ఒప్పుకోవటం నాకు చాలా ఆనందం కలిగించింది” అని అతన్నింకా పొగిడి సంతోషింపజేశాడు.

శల్యుడతన్ని కౌగిలించి సారథ్యానికి సిద్ధమయాడు. కర్ణుడు తన సారథిని పంపి దృఢమైన రథాన్ని తెప్పించాడు. దానికి పురోహితుడు పూజలు చేశాడు. కర్ణుడు రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శల్యుణ్ణి రథం ఎక్కమని కోరితే అతను చెంగున ఎగిరి నొగలెక్కి కూర్చున్నాడు. అతని వెనకనే కర్ణుడూ రథారోహణం చేశాడు.

కళ్లపండగ్గా కనిపించారు కర్ణ శల్యులు దుర్యోధనుడికి. “భీష్ముడు అర్జునుణ్ణి, ద్రోణుడు భీముణ్ణి చంపుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అలా జరగలేదు. నువ్వైనా ఆపని చేసి నాకు ఆనందం కలిగించు, వాళ్లూ వీళ్లూ అని లేకుండా శత్రువులందర్నీ మట్టుబెట్టు” అని కర్ణుణ్ణి ఉత్సాహపరిచాడు. శంఖ భేరీ నాదాల మధ్య శల్యుడు రథాన్ని ముందుకు కదిలించాడు. ఆవేశంగా కర్ణుడు “నా బాణాల ధాటికి బెంబేలెత్తిపోయి పాండవులు దిక్కుతోచక పరిగెత్తటం ఇప్పుడు చూద్దువుగాని” అన్నాడతనితో. శల్యుడికది నచ్చలేదు “ఎందుకీ గాలిమాటలు? అఖిలశస్త్రాస్త్ర కోవిదులు, భుజబలసంపన్నులు, ఇంద్రుణ్ణైనా గెలిచేవాళ్లు పాండవులు. వాళ్లనిప్పుడింత చులకనగా మాట్టాడుతున్నావ్ గాని గాండీవజ్యా నినదంతో నీచెవులు బద్దలౌతుంటే, భీముడి గదనుంచి రాలే నిప్పుల్తో కళ్లు మిరుమిట్లు గొలుపుతుంటే అప్పుడు భయంతో నీనోరు మూతబడుతుందిలే. భీమార్జునులు విజృంభించి మన సేనా నివహాన్ని చించిచెండాడుతుంటే అప్పుడు నీనోట్లోంచి ఎలాటి మాటలొస్తాయో చూస్తాగా” అని దెప్పిపొడిచాడు. ఆమాటలు వినపడనట్టు నటించాడు కర్ణుడు.

కర్ణుణ్ణి చూసి మన సైన్యాలు కేరింతలు కొట్టినయ్. అతను పాండవుల్ని చంపి జయం చేకూర్చబోతున్నాడని అంతా ఆశపడ్డారు. అదంతా చూసి కర్ణుడికీ పరమోత్సాహం కలిగింది. “ఇప్పుడు యుద్ధానికి ఇంద్రుడే వచ్చినా గడ్డిపోచ కింద పోరాడతా, నాకు వీళ్లెంత? భీష్మ ద్రోణుల్ని చంపామని విర్రవీగుతూ వచ్చే అర్జునుడు, మిగిలిన పాండవుల్ని ఒళ్లంతా తూట్లు పొడిచి యుద్ధం ఎలా చెయ్యాలో నేర్పిస్తా. భార్గవరాముడిచ్చిన ఈ రథం, దివ్యాస్త్రాల మహిమ ఏమిటో అర్జునుణ్ణి చంపి అందరికీ చూపిస్తా. కురురాజు ఋణం తీర్చుకుంటా” అన్నాడు గర్వంగా.

శల్యుడు ఊరుకోలేదు. “ఎవరన్నా వింటే ఈ కర్ణుడేమిటి ఇంత అవివేకి అంటారు, మెల్లగా మాట్టాడు. యుద్ధాల్లో నీ పనితనం, అర్జునుడి గొప్పతనం ఇదివరకు ఎవరూ చూడలేదా? అతను అద్భుత విక్రముడని, నువ్వు పౌరుషహీనుడివని జనానికి తెలీదా? రాత్రి వేళ వచ్చి తలపడి పోరి మగతనం పోగొట్టుకున్న అంగారపర్ణుడి కంటె, ఘోషయాత్రలో దుర్యోధనుణ్ణి చెరబట్టి పరువు పోగొట్టుకున్న చిత్రసేనుడి కంటె, ఖాండవవనాన్ని రక్షించుకోలేక సిగ్గుతో తిరిగిపోయిన ఇంద్రుడి కంటె, మాయాకిరాతుడై పంది కోసం పోరి భంగపడ్డ పరమశివుడి కంటె గొప్పవాడైన వీరుడెవడన్నా అర్జునుణ్ణి మించిన పోటుగాణ్ణంటే అర్థం వుంది గాని మన్లాటి వాళ్లు అలాటి మాటలనటం నోటిదురదే ఔతుంది. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, నువ్వు, అశ్వత్థామ, కృపుడు అంతా కలిసి ఉత్తరగోగ్రహణం నాడు పడ్డపాట్లు మర్చిపోయావా? అర్జునుడి బాణాలు ఇంతలోనే తుప్పుపట్టాయా? అప్పుడైతే సిగ్గులేకుండా పారిపోయావ్. కనీసం ఇప్పుడు గట్టిగా నిలబడి పోరతానని ఒట్టేసుకో. అతని చేతిలో చచ్చినా కనీసం వెనకడుగెయ్యకుండా అర్జునుడితో యుద్ధం చేశావన్న పేరన్నా మిగుల్తుంది” అని బాగా తగిలించాడతనికి.

కర్ణుడు కోపాన్ని దిగమింగుకుని “మేం ఇద్దరం హోరాహోరీగా పోరాడేప్పుడు చూసి చెబ్దువు గాని మాలో ఎవరు శక్తివంతులో” అంటే అలాగే చేస్తానని ఊరుకున్నాడు శల్యుడు. రథాన్ని కదిలించమని కర్ణుడంటే మనసేనల మధ్యలోకి తీసుకొచ్చాడు శల్యుడు. కర్ణుడు మన సేనలందర్నీ కేకేసి పిలిచి “మీలో ఎవరు నాకు ముందుగా ఇదుగో అర్జునుడని చూపిస్తారో వాళ్లు కోరుకున్న కోరికలు తీరుస్తా. అంతేకాకుండా కృష్ణార్జునులిద్దర్నీ చంపాక వాళ్ల ఆభరణాలు కూడ వాళ్లకే ఇస్తా. అందరూ జాగ్రత్తగా అర్జునుడి కోసం చూస్తూండండి” అని ప్రకటించి శంఖం పూరిస్తే దుర్యోధనుడు పరమానందభరితుడయాడు. మన బలంలో నిస్సానాది తూర్యధ్వనులు మిన్నుముట్టినయ్.

శల్యుడు పరిహాసపు నవ్వుతో కర్ణుణ్ణి చూస్తూ “అర్జునుణ్ణి చూపించమని వాళ్లనీ వీళ్లనీ అడగటం, చూపించినందుకు ధనాలు ఇవ్వటం ఎందుకు – ఇప్పుడే అతనే నీదగ్గరికి వస్తాడులే. అంత డబ్బెక్కువైతే ఏవన్నా సత్యార్యాలకి వాడొచ్చుగా? పైగా కృష్ణార్జునుల్ని చంపుతానని బీరాలు కూడానా? ఎక్కడన్నా నక్క వెళ్లి సింహాల్ని చంపటం చూశామా? ఏమైనా దుర్యోధనుడికిచ్చిన మాట ప్రకారం అతని మంచి కోరి నీకు సలహా చెప్తున్నా, కోపం తెచ్చుకోకు. బుద్ధిగా చుట్టూ బోలెడంత సైన్యాన్నుంచుకుని గాని అర్జునుడి మీదికి వెళ్లకు” అని ఉచితసలహా పడేశాడు.

దానికి కర్ణుడు “ఇలాటి మాటల్తో నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీద్దామని చూస్తున్నావ్, అది ఇంద్రుడంతటి వాడి వల్లే కాదు, నీలాటి వాళ్ల మాట చెప్పాలా?” అని అధిక్షేపించాడు. దానికి శల్యుడు “నేను చెప్పే బుద్ధులు నీకేం ఎక్కుతయ్ లే! అర్జునుడి చేతిలో చావుదెబ్బలు తింటున్నప్పుడు బుద్ధిమంతుడివౌదువు గాని. అర్జునుడితో సమానమనుకునే నువ్వు సింహం మీదికి దూకే జింకవి, మదపుటేనుగుతో తలపడే కుందేలువి, పులితో పెట్టుకునే కుక్కవి, గరుత్మంతుడి అంతుచూద్దామనుకునే పామువి” అని అగ్ని మీద ఆజ్యం పోశాడు.

కోపంతో కర్ణుడి కళ్లెర్రబడినయ్. “గుణహీనుడివి నీకు గుణవంతుల గుణాలెలా తెలుస్తయ్? అర్జునుడి సంగతి నాకు తెలుసు గాని నీకేం తెలుసు? నేనెంతో కాలం నుంచి దాచి పూజిస్తున్న దివ్యాస్త్రం ఒక ఇనపబాణం నా దగ్గరుంది. అది శత్రువుని జయించి తీరుతుంది. దాంతో ఒకడు, పరశురాముడిచ్చిన భార్గవాస్త్రంతో మరొకడు – ఇలా కృష్ణార్జునులిద్దరూ నా అస్త్రాలకి బలికాబోతున్నారు. యుద్ధం గురించి నీకేం తెలుసు? అదీగాక పాపపుదేశం మద్రదేశం నీది. చిన్నపిల్లల్నడిగినా చెప్తారు నువ్వు నీచుడివి, కుటిలుడివి, స్నేహితులకి అపకారం చేసేవాడివని. వావివరసలు లేకుండా ఆడా మగా ఎవరుబడితే వాళ్లతో తిరుగుతారు, పాలకన్నా ముందే కల్లు తాగే జాతి నీది. ఎవరెవరికో పుట్టి ఎప్పుడూ కల్లులో మునిగితేలే మీకు మంచీ చెడూ ఎలా తెలుస్తయ్, మంచిమాటలెలా వస్తయ్? నేను గదతో నీ తల పగలకొట్టకముందే ఇక్కణ్ణుంచి బయల్దేరు” అని గద్దించాడు.

శల్యుడు తాపీగా, “నీ మంచి కోరి చెప్పే మాటలు నీకు చెవి నాటటం లేదు. ఐనా చెప్పటం నా బాధ్యత, చెప్తా. ఇప్పుడో చిన్న కథ విను. విన్నాక నా సలహా పాటించావా మంచిది, లేదా అంతకన్నా మంచిది. ఒక ద్వీపాన ధర్మవర్తి అనే రాజు పట్టణంలో ఒక వైశ్యుడున్నాడు. చాలా ధనవంతుడు, దానశీలి. అతనికి అనేకమంది కొడుకులు. ఓ కాకి ఆ పిల్లలు పడేసే ఎంగిళ్లు మెక్కి బాగా బలిసింది. వాళ్లూ దాంతో ఆడుకుంటూ దాన్ని పొగిడితే అది నిజమేననుకుని కనపడ్డ పక్షులన్నిటి కంటే తనే గొప్పదాన్నని గర్వంతో తిరుగుతుంది. ఒకనాడు ఓ హంసల గుంపు అక్కడికొస్తే పిల్లలు కాకితో “నిన్ను మించిన పక్షి ఈ ప్రపంచంలో లేదు, ఈ హంసల్తో పోటీపడి వాటినోడించు” అంటే ఆ బుద్ధిలేని పిల్లల మాటలు ఆ మూర్ఖపు కాకి నిజమేననుకుని వెళ్లి పందానికి రమ్మని ఆ హంసల్ని పిలిచింది. అవి విరగబడి నవ్వి “మానస సరోవరంలో విహరిస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎంతదూరమైనా సునాయాసంగా ఎగిరి వెళ్లే మాతో కాకివి నీకు పోటీ ఏమిటి?” అన్నయ్. కాకి మాత్రం ఏమాత్రం తగ్గకుండా “నేను రకరకాలుగా ఎగురుతా, మీరు నాకో లెక్కా?” అని చులకన చేసింది. “సరే ఐతే ఆ సముద్రం మీదుగా నేరుగా ఎగురుదాం పద” అని ఒక హంస దాంతో పందానికి బయల్దేరింది. మిగిలిన కాకులు వద్దని వారిస్తున్నా ఆ బలిసిన కాకి హంసతో పోటీగా సముద్రం మీద ఎగిరింది.

హంస మెల్లగా నేరుగా వెళ్తుంటే కాకి రకరకాల చేష్టలు వెయ్యటం మొదలెట్టింది. హంస చుట్టూ చక్కర్లు కొట్టటం, దాన్ని కవ్వించటం చేస్తుంటే మిగిలిన కాకులు ఇదీ బాగానే వుందే అని కేరింతలు కొడుతూ హంస ఓడిపోయిందని అరవటం మొదలెట్టినయ్. దాంతో హంస ఉత్సాహం పుంజుకుని ఎగురుతుంటే కాకి దాన్ని అందుకోలేక రొప్పటం మొదలెట్టింది. ఇంకాసేపటికి కాకి నీళ్లలోకి పడిపోయే స్థితికి వచ్చి పళ్లబిగువున మునక్కుండా చావుబతుకుల్లో వుండి బుద్ధితెచ్చుకుని హంసని వేడుకుంటే ఆ హంస కనికరంతో దాన్ని లేపి తన బుజమ్మీద వేసుకుని ఒడ్డుకి తెచ్చి దించింది. “ఇంకెప్పుడూ కొవ్వెక్కి ఇలాటి బుద్ధిలేని పందాలకు పోవద్ద”ని హంసలు దానికి బుద్ధిచెప్పి ఎగిరిపోయినయ్.

ఆ కోమటి కొడుకుల ఎంగిళ్లు తిని బలిసి తన బలం ఏమితో మర్చిపోయిన కాకిలాటి వాడివి నువ్వు. అవతలి వాళ్ల బలం తెలీక ముందుకి దూకుతున్నావ్. ఇది పొరపాటు. వాళ్లతో తలపడగలవాళ్లని వాళ్లమీదికి పంపు, నీకు తగ్గవాళ్లని నువ్వు చూసుకుని వాళ్లతో యుద్ధం చెయ్యి, పేరు తెచ్చుకో” అని వినిపించాడు.

“కృష్ణార్జునుల సంగతి నాకు పూర్తిగా తెలుసు. తెలుసుకునే వాళ్లతో యుద్ధానికి సిద్ధమయ్యా. ఐతే ఒక్క విషయం మీకందరికీ చెప్పాలి” అని చుట్టూ వున్న వాళ్లకి వినపడేట్టు ఇలా చెప్పాడు – “నాకున్న లోపాలల్లా రెండు; ఒకటి పరశురాముడి శాపం, రెండోది బ్రాహ్మణ శాపం. అవి లేకుంటేనా, ఎవరూ నాముందు ఆగరు. నేను అస్త్ర విద్య కోసం మహేంద్రగిరిలో వున్న పరశురాముడి దగ్గరికి వెళ్లినప్పుడు నా కులమేమిటని అడిగితే బ్రహ్మాస్త్రం సంపాయించాలని బ్రాహ్మణుణ్ణని అబద్ధం చెప్పా. ఆయన నాకు బ్రహ్మాస్త్రంతో సహా అనేక దివ్యాస్త్రాలిచ్చాడు. ఒకరోజు ఆయన నా తొడ మీద తలపెట్టి పడుకుని నిద్రపోతున్నప్పుడు ఒక విచిత్రమైన పురుగు నా తొడని తొలవటం మొదలెట్టింది. కదిల్తే గురువుగారికి నిద్రాభంగం ఔతుందని నేను రక్తం పారుతున్నా బిగబట్టి కూర్చున్నా. ఆయన నిద్రలేచి ఆ రక్తం చూసి నా ధైర్యానికి ఆశ్చర్యపడి నువ్వు బ్రాహ్మణుడివి కాదు, ఎవరివని గద్దిస్తే తప్పక నిజం చెప్పా. ఆయన మండిపడి కపటంతో నువ్వు తీసుకున్న బ్రహ్మాస్త్రం అవసరానికి నీకు గుర్తు రాదు, చావు సమయంలోనే అది గుర్తుకొస్తుంది; నీకాపద వచ్చినప్పుడు భార్గవాస్త్రం కూడ నీకు తోచదు పో అని శపించాడు.

అలాగే ఒకసారి నేను అస్త్రవిద్యని అభ్యాసం చేస్తుండగా అనుకోకుండా ఒక బాణం ఒక గోవుని చంపింది. అప్పుడు దాని యజమాని అది హోమధేనువు పెయ్య అని మహాక్రోధంతో చావుబతుకుల సంగ్రామ వేళ నా రథచక్రం కుంగుతుందని, ఎవరిని చంపటానికి నేను ప్రయత్నిస్తున్నానో వాళ్ల చేతిలో చస్తానని శపించాడు. ఎన్ని విధాలుగా బతిమాలినా, ఆశలు చూపించినా వినకుండా వెళ్లిపోయాడు.

ఏమైనా, ఇప్పుడు బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం రెండూ గుర్తుకొస్తున్నయ్, కాబట్టి కృష్ణార్జునుల్ని చంపటానికి ఇదే సరైన సమయం. విలుకాడైనవాడి జీవితానికి సాఫల్యత మేటివిలుకాడని పేరు తెచ్చుకున్న గాండీవితో తలపడటంలోనే వుంది. ఆ అర్జునుణ్ణి ఢీకొని ముప్పుతిప్పలు పెట్టే భాగ్యం నాకు దొరకబోతుంది, ఇంకా ఆలస్యం ఎందుకు అతని మీదికి పద” అని ఆదేశించాడు కర్ణుడు.

అది విని శల్యుడు లోలోపలే ఆనందించాడు. తన మాటల ప్రభావం కర్ణుడి మీద బాగానే పనిచేసిందని, దానివల్లనే అర్జునుడి చేతిలో చావు తప్పదని నిశ్చయించుకుని అందుకు కారణం మాత్రం తను అర్జునుడికి తక్కువ కావటం కాదు, శాపాల వల్ల అని అందర్నీ నమ్మించటానికే ఆ విషయాలు అంత పెద్దగా అందరికీ వినిపించాడని అర్థం చేసుకున్నాడు. ఐతే కర్ణుడతని మనోభావాన్ని తనూ అర్థం చేసుకున్నట్టు “నువ్వేదో నన్ను భయపెట్టి అర్జునుణ్ణి గెలిపిద్దామని చూస్తున్నట్టున్నావ్, నాముందు ఆ పప్పులుడకవ్. దుర్యోధనుడు నీకిచ్చిన మాట వల్ల నువ్వేమన్నా భరిస్తున్నా గాని లేకుంటే నీ కారుకూతలకి ఈపాటికే నీ తల నరికేవాడిని. నికృష్టపు కథలు చెప్పి నా మనసు విరిచే ప్రయత్నం మానుకో. కృష్ణార్జునుల్ని నేనెలా జయిస్తానో చూడు” అంటే శల్యుడు “ఉన్నమాట చెప్తా విను, వెయ్యిమంది కర్ణులు వచ్చినా అర్జునుణ్ణి గెలవలేరు” అని వడ్డించాడు. కర్ణుడికి ఒళ్లు మండిపోయింది. “ధృతరాష్ట్రుడి దగ్గర గోష్టిలో ఒక వృద్ధబ్రాహ్మణుడు చెప్తుంటే విన్నా. బాహ్లిక దేశం వాళ్లు గోమాంసం నంచుకుంటూ మద్యపానం చేసి నగ్నంగా నోటికొచ్చినట్టు మాట్టాడుకుంటూ తిరుగుతారని. ఆ బాహ్లికులు నీకు స్నేహితులు. మీ మద్రదేశం వాళ్లు కూడ అవినీతిలో బాహ్లికుల కన్నా నాలుగాకులు ఎక్కువే చదివారని విన్నా. కాబట్టి నోరు మూసుకుని కూర్చో” అని గద్దించాడతన్ని.

శల్యుడు ఊరుకోలేదు. “నీ మొనగాడితనం గురించి ఇదివరకు భీష్ముడు చెప్పింది గుర్తు తెచ్చుకో. అన్ని విధాలుగా ఆలోచించి నిన్ను వట్టి అర్థరథుడివని లెక్కకట్టాడు కదా? పైగా అధములైన వాళ్లకి ఇతరుల తప్పులు కనపడతయ్ గాని సొంత తప్పులు కనపడవన్నట్టు మీ అంగదేశం వాళ్లు డబ్బుల కోసం స్నేహితుల్ని చుట్టాల్ని మోసాలు చేస్తారు, భార్యల్నైనా సరైన ధర వస్తే అమ్మేస్తారు. అట్లాటి వాళ్ల రాజువి నువ్వు. నువ్వు ఇతరుల లోపాల గురించి మాట్టాడితే ఎలా? ఐనా ఏ దేశంలోనైనా మంచి వాళ్లుంటారు, చెడ్డ వాళ్లూ వుంటారు అంతేగాని మంచిదేశం, చెడ్డదేశం అని వుండవ్. బుద్ధిలేని మాటలెందుకు?” అని బదులిచ్చాడు. ఇదిచూసిన దుర్యోధనుడు వచ్చి ఇద్దరినీ బతిమాలి మైత్రి చేశాడు.

ఒకపక్క త్రిగర్త సైన్యాలు అర్జునుణ్ణి చుట్టుముట్టినయ్. దుర్యోధనుడు మనపక్షంలో దొరలందర్నీ యుద్ధానికి ఉత్సాహపరిచాడు. అశ్వత్థామ కూడ నిరాయుధుడైన తన తండ్రిని నీచంగా చంపిన ధృష్టద్యుమ్నుణ్ణి చంపేవరకు కవచం తియ్యనని ప్రతిజ్ఞ చేశాడు. మన వాళ్లందరూ ఉత్సాహంగా కేకలు వేసి శంఖాలు పూరించారు.

దుర్యోధనుడు గజసైన్యంతో భీముణ్ణి ఢీకొన్నాడు. కర్ణుడు ఉగ్రరూపంతో ధర్మజుడి మీదికి వెళ్లాడు.

ధృతరాష్ట్రుడికో సందేహం కలిగింది. “కర్ణుడు అర్జునుడితో తలపడతాడనుకున్నా. ఇలా ధర్మరాజుతో పోరటం ఎలా జరిగింది? అర్జునుడు అడ్డుపడి అతన్ని ఆపి తనే కర్ణుడితో ఎందుకు పోరాడలేదు?” అనడిగాడు. సంజయుడు ఇలా చెప్పుకొచ్చాడు.

అసలు యుద్ధం మొదలు కాకముందు కర్ణుడు పన్నిన వ్యూహాన్ని చూసి ధర్మరాజు అర్జునుడితో “చూశావా కర్ణుడి వ్యూహం ఎంత పటిష్టంగా వుందో? అదలా వచ్చి మనబలం మీద పడితే తట్టుకోవటం కష్టం. అలా జరక్కుండా ఆపే వ్యూహాన్ని నువ్వు తయారుచెయ్” అని పురమాయించాడు. దానికి అర్జునుడు “ఇక్కడ ముఖ్యమైన పని కర్ణుణ్ణి చంపటం. అది నాకు కష్టం కాదు, చేసి చూపిస్తాగా” అని భరోసా ఇచ్చాడు. ధర్మజుడు ఆనందించి “బాగుంది, ఐతే నువ్వాపని చెయ్. భీముడు దుర్యోధనుడితో, నకులుడు వృషసేనుడితో, సహదేవుడు సౌబలుడితో, శతానీకుడు దుశ్శాసనుడితో, సాత్యకి కృతవర్మతో, ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామతో ద్రౌపదేయులు, శిఖండి కలిసి మిగిలిన ధార్తరాష్ట్రుల్తో, నేను కృపుడితో తలపడదాం” అని తన ఆలోచన చెప్తే అలాగేనని అర్జునుడు వెళ్లి మిగిలిన వాళ్లందరికీ చెప్పి వచ్చాడు.

రెండు సైన్యాలు ముందుకురికినయ్. అర్జునుడు కర్ణుడున్న చోటికి బయల్దేరాడు. ఐతే దార్లో అతన్ని సంశప్తకసైన్యాలు అడ్డుకున్నయ్. ప్రాణాల్ని లెక్కచెయ్యకుండా చుట్టుముట్టి పోరాడసాగినయ్. అదిచూసి కర్ణుడు పాంచాలబలాల మీదికి దూకాడు. దుర్యోధనుడతనికి సాయంగా నిలిచాడు. చేది సైన్యాలు పాండవ సైన్యాల్ని మట్టుబెట్ట సాగినయ్. కర్ణుడు పాంచాల సైన్యాల్ని పీనుగుపెంటలు చేశాడు. విచిత్రరథప్రచారాల్తో తిరుగుతూ కనిపించిన బలగాలన్నిట్నీ తన బాణాలకి బలిచేశాడు. అంతలో ధర్మరాజు కేతనం కనిపిస్తే అటు బయల్దేరాడు కర్ణుడు.

అతనికి ధృష్టద్యుమ్నుడు తన సైన్యంతో అడ్డుపడ్డాడు. పాంచాలబలాలు అతన్ని దాటుకుని వెళ్లి కర్ణుడితో తలపడినయ్. అతను అప్పటికప్పుడే భానుదేవ, చిత్రసేన, సేనాబిందు, తపన, శూరసేనులనే పాంచాలరాజుల్ని చంపాడు. ఇంకా ముప్పైమంది దొరల్నీ యముడి దగ్గరికి పంపాడు. అతని చక్రరక్షకులు సుషేణ సత్యసేనులు, కొడుకు వృషసేనుడు మరో ఇరవైమూడు మంది కొడుకులు అతనికి తోడుగా సమరకౌశలాన్ని చూపిస్తుంటే ముందుకు సాగాడు కర్ణుడు. ధృష్టద్యుమ్న, శిఖండులతో పాంచాలసైన్యం, సాత్యకి, నకుల సహదేవులు, భీముడు తోడుగా పాండవబలాలు అతన్ని అడ్డుకున్నయ్. అదిచూసి దుర్యోధనుడు దుశ్శాసన శకునుల్తో కలిసి కర్ణుడికి తోడుగా వచ్చి నిలిచాడు.

కర్ణుడి కొడుకులు భీముడితో తలపడ్డారు. వాళ్లలో సుషేణుడు ఒక భల్లంతో భీముడి విల్లు తుంచి ఏడు నారసాలు వక్షాన నాటి పెద్దగా అరిచాడు. భీముడు ఉగ్రుడై ఇంకో విల్లు తీసుకుని వాడి వింటిని విరిచి ఇరవై ఏడు బాణాలు వాడి ఒంటికి నాటాడు. కర్ణుడు కమ్ముకుంటే అతన్ని డెబ్భైమూడు ఉబ్బువాలాల్తో వారించి అతని కొడుకు సత్యసేనుడు దగ్గరికొస్తే వాడి గుర్రాల్ని, సూతుణ్ణి, విల్లుని, జెండాని విరిచి ఒక కత్తిబాణంతో వాడి మెడ నరికాడు. ఇంక భీముడు విజృంభించి కనిపించిన వీరులందర్నీ విళ్లు తుంచి, రథాల్ని నుగ్గుచేసి వీరవిహారం చేస్తుంటే అతనికి మళ్లీ సుషేణుడు కనిపిస్తే వాడి వెంటపడి ఒక గట్టినారసం వేస్తే దాన్ని కర్ణుడు మద్యలోనే ఖండించాడు. ఇంకోసారి అలాటి బాణమే వేస్తే దాన్నీ కర్ణుడు తుంచాడు.

ఇంతలో నకులుడు సుషేణుడికి ఇరవై అమ్ముల్తో గాయాలు చేశాడు. కోపంతో సుషేణుడు తొమ్మిది బాణాలతని ఒంటికి నాటి విల్లు విరిచి అరిస్తే నకులుడింకో విల్లు తీసుకుని వాడి వింటిని విరిచాడు. వాళ్లలా ఘోరయుద్ధం చేస్తుంటే వృషసేనుడు సాత్యకితో తలపడ్డాడు. సాత్యకి మూడుబాణాల్తో సారథిని, ఒక భల్లంతో వింటిని, ఏడస్త్రాల్తో గుర్రాల్ని చంపి, ఒక కాండంతో కేతనాన్ని విరిచి మూడు బాణాలతని రొమ్మున నాటాడు. మూర్ఛపడి లేచి వృషసేనుడు వాలూ పలకా తీసుకుని వస్తే అవీ నుగ్గుచేశాడు. ఇలా విరథుడు, నిరాయుధుడు ఐన వృషసేనుణ్ణి దుశ్శాసనుడు తన రథం మీద ఎక్కించుకుని తీసుకుపోయాడు. మరో రథం తీసుకుని తిరిగివచ్చి తండ్రికి తోడుగా నిలిచాడు వృషసేనుడు.

కర్ణుడు సాత్యకి మీదికి కదిల్తే ద్రౌపదేయులు, ధృష్టద్యుమ్నుడు సాత్యకికి సాయంగా కర్ణుడితో తలపడ్డారు. ఐతే కర్ణుడు తన బాణపరంపరల్తో వాళ్లందర్నీ ముంచెత్తి వాళ్లకి దిక్కుతోచకుండా చేశాడు. వాళ్లు దైన్యంగా చూస్తుంటే ధర్మరాజు మీదికి కదిలాడు కర్ణుడు. సాత్యకి, శిఖండి వచ్చి అతన్ని అడ్డుకున్నారు. కాని కర్ణుడి ధాటికి నిలవలేకపోయారు వాళ్లు. దావాగ్నిలా కర్ణుడు పాండవసైన్యాల్ని కాల్చాడు. వాళ్ల సైన్యంలో మేటిదొరలంతా నోటమాట రాక చూస్తూ నిలబడ్డారు.

ధర్మరాజు కర్ణుడి మీద బాణవర్షం కురిపించాడు. ఐతే అతను నవ్వుతూ వాటిని మధ్యలోనే తుంచాడు. ధర్మజుడి విల్లు సగానికి విరిచి తొంభై వాడిబాణాల్తో అతని కవచాన్ని భేదించాడు. మణిమయాభరణాల్తో సుందరమైన అతని శరీరాన్ని రక్తమయం చేశాడు. ఐనా రాజధర్మానికి బద్ధుడై ధర్మరాజు కదలకుండా నిలబడి సమరం సాగించాడు. వేగంగా ఒక శక్తిని కర్ణుడి మీద విసిరితే అతను దాన్ని ఏడు భల్లాల్తో ఖండించాడు. ధర్మరాజు నాలుగు తోమరాలు వేసి అతని వక్షాన్ని చేతుల్ని గాయపరిచాడు. కర్ణుడు క్రూరంగా అతని సారథిని చంపి, జెండా కూల్చి పదునైన బాణాల్తో నొప్పించాడు. సాత్యకి, శిఖండి తిరిగొచ్చి అతన్ని వారించబోయారు కాని అతను వేగంగా వాళ్ల రథాలు, విళ్లు విరిచి శరీరాలకి బాణాలు నాటి గాయాలు చేసి మళ్లీ ధర్మరాజుని అనేక బాణాల్తో నొప్పించాడు.

ఆ ధాటికి నిలవలేక రథాన్ని తనే తోలుకుంటూ ధర్మజుడు పారిపోబోతుంటే కర్ణుడతని వెంటబడి ఆపాడు. “నీకు ధర్మాధర్మాలు తెలుసునంటారే మరి క్షత్రియుడివే ఐతే ప్రాణాల మీది తీపితో ఇలా పారిపోతావా? బ్రాహ్మణుడిలా యాగాధ్యయనాలు చేసుకోపో. నేనుగాబట్టి వదిలేస్తున్నా గాని మరెవరైనా ఐతే చచ్చేవాడివి, కృష్ణార్జునులెక్కడున్నారో వెదుక్కుని వాళ్ల దగ్గరికి పో” అని కుంతికిచ్చిన మాట వల్ల చంపకుండా వదిలేశాడతన్ని.

ధర్మరాజు అవమానంతో ఖిన్నుడై వెనక్కి తిరిగాడు. అతనితో పాటే వాళ్ల సైన్యాలు కూడ వెనక్కి మళ్లినయ్. మనవాళ్లు సంతోషంతో కేకలు పెట్టారు. భేరీమృదంగ వాద్యాల్తో మన సైన్యం చిందులేసింది. ఇదిచూసి ధర్మరాజు తన వాళ్లందర్నీ పెద్దగా అరిచి పిలిచి యుద్ధం ఆపొద్దని బతిమాలాడు. అప్పుడు వాళ్లు కొంత ధైర్యం తెచ్చుకుని వెనక్కి తిరిగివస్తే మనబలాలు మళ్లీ తలపడినయ్. భీముడు విజృంభించి మన సేనల్ని కలగించాడు. ధర్మరాజు పరాభవాన్ని చూసి సాత్యకి, శిఖండులతో “నేను చూస్తుండగానే ఆ దుష్టదుర్యోధనుడికి ప్రీతి కలిగించటానికి కర్ణుడు మన రాజుని అవమానించాడు. మీకు ధర్మరాజుని అప్పగిస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి, ఈ పూట నేనో కర్ణుడో తేలిపోవాలి” అని అప్పగింతలు చెప్పి సింహనాదం చేస్తూ కర్ణుడి మీదికి బయల్దేరాడు.

అలా వస్తున్న భీముణ్ణి గమనించాడు శల్యుడు. “చూస్తున్నావా, భీముడు మహాకోపంతో మనమీదికొస్తున్నాడు. ఇతనికి కోపం వస్తే ముల్లోకాల్నీ లెక్కచెయ్యడు. అభిమన్యుడు, ఘటోత్కచుడు మరణించినప్పుడు కూడ రాని కోపం ఇప్పుడొచ్చిందితనికి. ఇది నీ భుజబలం చూపించాల్సిన సమయం” అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. కర్ణుడు కూడ “ఔను, భీముడు మహాపరాక్రమశాలి. వందమంది కీచకుల్ని ఒక్కడే కడతేర్చిన వాడు. బలాఢ్యుడని ప్రపంచఖ్యాతి పొందినవాడు. ఐనా నాకితనో లెక్క కాదు. కాకుంటే అర్జునుణ్ణి చంపటమే నా లక్ష్యం కనక ఇతన్ని చంపను, మరీ గాయపరచను” అని తన ఆలోచన చెప్పాడతనికి. శల్యుడు రథాన్ని భీముడికెదురుగా తిప్పాడు. కర్ణుడు భీముణ్ణి బాణవర్షంలో ముంచేశాడు. అదేసమయంలో వేగంగా అతని విల్లు విరిచి అతని శరీరానికి తూటు పొడిచేలా ఒక మార్గణాన్ని వేశాడు. భీముడింకో విల్లు తీసుకుని కర్ణుడి వక్షాన్ని అనేక బాణాల్తో కొట్టి అరిచాడు. వెనక్కి తగ్గకుండా కర్ణుడు బలంగా ఇరవై ఐదు నారాచాలేశాడు. అవి భీముడి కవచాన్ని చించుకుని అతని శరీరం నుంచి దూసుకుని వెళ్లి భూమిలో దిగబడినయ్.

భీముడి కోపం కట్టలు దాటింది. ఒక ఉగ్రభల్లాన్ని విసిరేస్తే అదో కులిశం లాగా వెళ్లి కర్ణుడి వక్షాన్ని మోదితే అతను చచ్చినట్టు రథమ్మీద మూర్ఛపడ్డాడు. మనసైన్యాలు గగ్గోలు పెట్టినయ్. భీముడు తన రథాన్ని కర్ణుడి రథం దగ్గరికి తెచ్చాడు. “ఈ నీచుడి నాలిక తెగ్గోస్తా” అని చురకత్తి తీసుకుని కర్ణుడి రథం మీదికి దూకబోతుంటే శల్యుడతన్ని వారించాడు – “ఇది మూర్ఛే, వీడు చావలేదు. నువ్వీ స్థితిలో నాలిక్కోశావంటే మాత్రం చావటం ఖాయం. ఇతన్ని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు చంపితే అతని పరిస్థితేమిటో ఆలోచించు” అని.

భీముడు శాంతించి “నువ్వన్నది నిజమే మామా, వీడు ధర్మజుణ్ణి అవమానించాడనే కోపంలో అర్జునుడి ప్రతిజ్ఞ విషయం మర్చిపోయా. గుర్తు చేసి చాలా మంచిపని చేశావ్. తొందరపడి ఇప్పుడు వీడి నాలిక్కోస్తే చచ్చేవాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నా చేసుకోవచ్చు, అలా ఐతే కృష్ణుడు, ధర్మరాజూ కూడ ఉండరు. నీ మూలాన ఇంత ప్రమాదం తప్పింది, నీ ఆజ్ఞ శిరసావహిస్తా” అని తన ప్రయత్నం మానుకున్నాడు. సంతోషంగా శల్యుడు రథాన్నక్కడి నుంచి దాటించాడు.

కర్ణుడలా పడేసరికి దుర్యోధనుడు తన తమ్ముల్ని వేగంగా భీముడి మీదికి పంపాడు. వాళ్లు భీముణ్ణి చుట్టుముట్టారు. అతను వాళ్ల అనుచరులు ఐదువందల యాభై మంది వీరరథికుల్ని అప్పటికప్పుడు చంపి ఒక భల్లంతో శ్రుతవర్మ శిరాన్ని ఖండించి నేలపడేశాడు. రెండు బాణాల్తో వికటుణ్ణి, సముణ్ణి చంపాడు. ఒక తీవ్రనారాచంతో క్రాథుణ్ణి కూల్చాడు. అనేకబాణాలేసి నందోపనందుల్నిద్దర్నీ ఒకేసారి చంపాడు. ఇలా నీకొడుకులు ఆరుగురి చావుతో మిగిలిన వాళ్లు పారిపోయారు.

కర్ణుడప్పటికి తేరుకుని భీముడితో మళ్లీ తలపడ్డాడు. ఇద్దరూ నానా నారాచాల్తో ఘోరంగా పోరారు. కర్ణుడు భీముణ్ణి పది బాణాల్తో నొప్పించి అతని విల్లు విరిచాడు. భీకరమైన గదని విసిరాడు భీముడు. దాన్ని దార్లోనే ఖండించాడు కర్ణుడు. మరో విల్లు తీసుకుని భీముడు విజృంభిస్తే కర్ణుడతన్ని పది అస్త్రాల్తో కొట్టాడు. భీముడు కోపంతో ఓ గట్టి నారసాన్నతని వక్షానికి సూటిగా వేస్తే అదతని ఒంట్లోంచి దూసుకుపోయి బయటికొచ్చింది. రోషారుణ నేత్రాల్తో కర్ణుడు వందబాణాలతని మీద కురిపించి విల్లు విరిచి గుర్రాల్ని కూల్చాడు. భీముడు సంరంభంగా ఒక పెద్ద గద చేతబట్టి కిందికురికాడు. అది చూసి దుర్యోధనుడు పదివేల ఏనుగుల్ని అతని మీదికి పురిగొల్పాడు. భీముడు మహోత్సాహంతో వాటిని వాటి మీదున్న యోధుల్ని మట్టుబెట్టి పన్లో పనిగా మూడు వేల మంది ఆశ్వికుల్ని కూడ నేల పడేసి వీరవిహారం చేశాడు. ఐదువందల మంది శకుని వైపు రథికులు వస్తే వాళ్లని రథాల్తో సహా నుగ్గుచేశాడు. శకుని మూడువేలమంది యవనదేశీయులైన ఆశ్వికుల్ని ముందుకు పంపితే వాళ్లనీ తన గదకి బలిచేశాడు. ఇలా గదపండగ చేసుకుని మరో రథం ఎక్కి మన సైన్యం మీద పడ్డాడు భీముడు.

మరోవంక కర్ణుడు ధర్మరాజుతో తలపడ్డాడు. అతని ధాటికి ఆగలేక ధర్మరాజు సతమతమౌతుంటే సారథి రథాన్ని దాటేశాడు. వదలక కర్ణుడు వెంటబడితే భీముడు వేగంగా వచ్చి అతన్ని అడ్డుకున్నాడు. కర్ణుడి దెబ్బకి భీముడు కూడ అవస్థ పడుతుంటే సాత్యకి సాయంగా వచ్చి భీముణ్ణి దాటుకుని వెళ్లి కర్ణుడితో కలబడ్డాడు. ఇద్దరూ ఒకరికొకరు తగ్గకుండా రణం సాగించారు. కృపుడు, సౌబలుడు, కృతవర్మ, అశ్వత్థామ కర్ణుడి పక్కల నుంచి పాండవసేనని ఢీకొంటే మనబలాలు ఉప్పొంగినయ్. అలాగే పాండవ వీరుల లాఘవాన్ని చూసుకుని వాళ్ల సేనలూ ఉత్సాహంగా యుద్ధం చేసినయ్. దుమ్మూ ధూళీ మధ్యాన్న సూర్యుడిని కప్పేసినయ్. ఎవరికి వారు వాళ్ల పేర్లూ బిరుదులూ అరిచి చెప్పుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఆకాశం బద్దలయ్యేలా సింహనాదాలు వినపడుతున్నయ్.

ఇంకోచోట అర్జునుడు త్రిగర్త, కోసల, నారాయణ యాదవ బలాల్తో పోరాడుతున్నాడు. త్రిగర్తాధిపతి సుశర్మ పది అస్త్రాల్తో అర్జునుణ్ణి, మూడు బాణాల్తో కృష్ణుణ్ణి కొట్టి మరో బాణంతో జెండాని కదిలించాడు. కేతనం మీదున్న ఆంజనేయుడు ఆర్చాడు. దాంతో సంశప్తకులంతా మహోత్సాహంతో అర్జున రథాన్ని చుట్టుముట్టారు. రథం కదలటానికి కూడ చోటు లేకుండా చుట్టుకున్న ఆ సైన్యాన్ని కృష్ణుడు మునుకోలతో, కాళ్లూ చేతుల్తో కొడుతుంటే కురచబాణాల్తో అర్జునుడు చెల్లాచెదురు చేశాడు. అలా కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం రావటంతో అర్జునుడు చిరునవ్వు నవ్వి కృష్ణుడితో “రథం కదిలే సందు కూడ ఇవ్వకుండా శత్రువులిలా చుట్టుముడితే రాచపుటక పుట్టినవాడెవడైనా వాళ్లని చంపకుండా వదుల్తాడా? నా ప్రతాపం ఇప్పుడు చూపిస్తా చూడు” అంటూ నాగాస్త్రం ప్రయోగిస్తే అది సంశప్తకుల కాళ్లు కదలకుండా బంధించింది. అతను బాణవర్షంలో ముంచి వాళ్లని ఊచకోత కోశాడు. అది గమనించిన సుశర్మ వెంటనే గరుడాస్త్రం వేసి ఆ కట్లూడదీశాడు. మళ్లీ వాళ్లు అర్జునుడి మీదికి దూకారు. సుశర్మ ఒక నిశితాస్త్రంతో అర్జునుడి వక్షాన్ని కొడితే అతనికి మూర్ఛవచ్చి రథమ్మీద చతికిల పడ్డాడు. సుశర్మ దెబ్బకి అర్జునుడు చచ్చాడని మనసైన్యంలో కోలాహలం చెలరేగింది.

అంతలో తేరుకున్నాడు అర్జునుడు. కాలాంతకుడిలా విజృంభించాడు. అతని బాణాలకి సుశర్మ బిత్తరపోయాడు. అర్జునుడు ఇంద్రాస్త్రం వేస్తే దాన్నుంచి అనేక రకాల ఆయుధాలు బయటికి వచ్చి పదివేల మంది సంశప్తక యోధుల్ని చంపినయ్. చావగా మిగిలిన పధ్నాలుగు వేలమంది ఒకరినొకరు పురిగొల్పుకుని అర్జునుడి మీదికి దూకితే అతను విక్రమించి వాళ్లతో తలపడ్డాడు.

అదిచూసి ఇతర చోట్ల పాండవబలాల్తో పోరుతున్న మనసైన్యం కూడ నీరసపడితే కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు వాళ్లకి ధైర్యం చెప్పి ఉత్సాహపరిచారు. కృపుడు పాంచాల బలాల్తో పోరుతుంటే శిఖండి అతనితో తలపడ్డాడు. కృపుడతని గుర్రాల్ని, సూతుణ్ణి చంపాడు. శిఖండి వాలూ పలకా తీసుకుని కిందికి దూకి కృపుడి మీదికి వెళ్లాడు. అతనికి సాయపడకుండా ధృష్టద్యుమ్నుణ్ణి కృతవర్మ, ధర్మరాజుని అశ్వత్థామ, భీముణ్ణి కర్ణుడు అడ్డుకున్నారు. కృపుడు శిఖండి పలకని ముక్కలు చేశాడు. ఐనా తగ్గక అతను కేవలం కత్తితోనే కృపుడి మీదికి దూకితే అతను అనేక బాణాలు అతని శరీరాన నాటాడు. ఇంతలో సుకేతుడనే పాంచాల రాకుమారుడు కృపుడితో తలపడ్డాడు. కృపుడు సునాయాసంగా కత్తివాతి బాణంతో వాడి తలని నరికి కిందపడేశాడు.

ధృష్టద్యుమ్నుడు కృతవర్మని మూడుచెరువుల నీళ్లు తాగించాడు. కృతవర్మ అతని మీద అనేకాస్త్రాలు వేస్తే ధృష్టద్యుమ్నుడు సైంధవవధ రోజు ద్రోణుడి రథానికి తన రథాన్ని తగిలించినట్టు కృతవర్మ రథానికి అతి దగ్గరగా తన రథాన్ని పోనిచ్చి కత్తి తీసుకుని అతని మీదికి దూకాడు. కృతవర్మ గద పుచ్చుకున్నాడు గాని దాన్ని విసిరే స్థలం లేక గబాల్న రథం మీంచి దూకి పరిగెత్తాడు. అది గమనించని ధృష్టద్యుమ్నుడు రథమ్మీద అతను కనపడక సారథి కంఠాన్ని ఖండించాడు. అది తను కాదు కదా అని సంతోషించి కృతవర్మ ఇక్కడ ఇక్కడ అని కేకేసి తనెక్కడున్నది చెప్తే ధృష్టద్యుమ్నుడు తన రథం మీదికి తిరిగెళ్లి అతని మీద బాణాలెయ్యబోతే మరో రథికుడొచ్చి కృతవర్మని త్వరితంగా ఎక్కించుకుని యుద్ధభూమి బయటికి దాటించాడు.

దుర్యోధనుడు నకుల సహదేవుల్తో పోరుతూ వాళ్లని వివిధాస్త్రాల్తో బాధించాడు. వాళ్లిద్దరికీ కాలం దాపరించిందనుకున్నా రందరూ. ధృష్టద్యుమ్నుడు వాళ్లకి అడ్డంగా వచ్చి దుర్యోధనుడితో తలపడ్డాడు. దుర్యోధనుడొక నారసాన్ని అతని నుదుటికి నాటాడు. దాంతో అతను తీవ్రోద్రేకంతో నీ కొడుకు విల్లు తుంచి, గుర్రాల్ని సారథిని చంపి, జెండాని విరిచాడు. నీకొడుకు శక్తిని వేస్తే దాన్ని తుంచాడు. కత్తి తీసుకుంటే దాన్ని తునకలు చేశాడు. గద పట్టుకుంటే దాన్నీ ముక్కలు చేశాడు. అలా ఆయుధాలన్నీ ఐపోయిన దుర్యోధనుణ్ణి అతని తమ్ముడు దండధారుడు తన రథం ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్లాడు.

అది చూసి కర్ణుడు ధృష్టద్యుమ్నుడి మీదికి దూకాడు. ఐతే సాత్యకి అతన్ని వదలకుండా వెంటపడ్డాడు. అలా కర్ణ ధృష్టద్యుమ్నులకి ఘోరసమరం ఐంది. కనిపించిన అనేకమంది పాంచాల వీరుల్ని కర్ణుడు కడతేర్చాడు. మరోచోట అర్జునుడు సంశప్తక బలాల్ని చెల్లాచెదురు చేసి కాంభోజసైన్యాల్ని అల్లకల్లోలం చేశాడు. యవన, శక సైన్యాలు కమ్ముకుంటే వాటిని అనేకాస్త్రాల్తో కలగించి రక్తం ఏరులు పారించాడు. అప్పుడా అర్జునుడి సమరకౌశలాన్ని చూడటానికి పదివేల కళ్లున్నా చాలవు! అలా పోరాడుతున్న అర్జునుణ్ణి చెయ్యెత్తి పిలిచాడు అశ్వత్థామ. “నేను నీకు అతిథిననుకో. నాకు నీతో యుద్ధం కావాలి. ఇవ్వగలవా?” అనడిగాడు. కృష్ణుడు రథాన్ని అతనివైపుకి మళ్లించాడు. “దుర్యోధనుడికి నీ ఋణం తీర్చుకుందువు గాని, అర్జునుడి బాహుబలం ముందు ఆగి నిలబడు చూద్దాం” అని కృష్ణుడంటే అలాగే అని అతను ఆరు బాణాల్తో కృష్ణుణ్ణి, మూడు బాణాల్తో అర్జునుణ్ణి కొట్టాడు. అర్జునుడతని విల్లు విరిస్తే దృఢమైన ఇంకో విల్లు తీసుకుని వాళ్లని బాణవర్షంలో ముంచెత్తాడు.

అతని దెబ్బకి వాళ్లిద్దరూ బిత్తరపోయారు. కాళ్లూ చేతులూ ఆడకుండా అతనలా బాణాలు కురుస్తుంటే అర్జునుడు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. కృష్ణుడు తేరుకుని “నీ చేతుల్లో చేవ చచ్చిందా, గురువు కొడుకని వీడి మీద కోపం తెచ్చుకోవటం లేదా? వాడి చేతిలో నువ్వోడావంటే ఎంత అవమానమో ఆలోచించు” అంటే కోపం తెచ్చుకుని అర్జునుడు “ఏదో కొన్ని బాణాలు చకచకా వేస్తే వాడు గెలిచినట్టేనా? ఇప్పుడు చూడు” అని భల్లాల్తో అశ్వత్థామ బాణాల్ని తుంచి ఒకే దెబ్బలో అతని విల్లు, ఛత్రం, కేతనం విరిచాడు. అతను శక్తి తీస్తే దాన్ని, గద వెయ్యబోతే దాన్నీ కూడ ముక్కలు చేశాడు. ఇంతలో అంగ, వంగ, నిషాద, కళింగ బలాలు అర్జునుడి మీదికి దూకినయ్. అశ్వత్థామ తెప్పరిల్లి మరోవిల్లు తీసుకుని బాణవర్షం సాగించాడు. “తెగులు కనపట్టం తోటే నాశనం చెయ్యాలి, ఊరుకుంటే తరవాత ముప్పు; వీడి సంగతి ఇప్పుడే చూడు” అని కృష్ణుడు బోధిస్తే అర్జునుడు విజృంభించి అశ్వత్థామ తల, కంఠం, చేతులు, రొమ్ము, కాళ్లు అన్నింటా బాణాల్తో కప్పి, గుర్రాల పగ్గాలు తెంచితే అవి రథాన్ని లాక్కుని దూరంగా పరిగెత్తినయ్. ఉసూరుమంటూ అశ్వత్థామ తిరిగొచ్చి కర్ణుడి దగ్గరికి వెళ్లాడు.

ఇంతలో దండధారుడనే మగధరాజు మదపుటేనుగునెక్కి పాండవబలమ్మీదికి వెళ్తుంటే కృష్ణుడు చూసి “ఈ దండధారుడు కూడ భగదత్తుడి లాటి వాడు,ముందు వాణ్ణి చంపి మిగిలిన పన్లు చూసుకుందాం” అంటే అలాగే నని అటువైపుకి కదిలాడు అర్జునుడు. దిగ్గజంలా మాగధుడి ఏనుగు పాండవసైన్యాన్ని నుగ్గుచేస్తుంటే అర్జునుడు రథాన్ని ఇంకా వేగంగా పోనివ్వమని కృష్ణుణ్ణి తొందరపెట్టాడు. అలా వెళ్లి అర్జునుడు దండధారుడితో తలపడితే వాడు తన ఏనుగు మీది నుంచి అర్జున రథాన్ని, సారథిని, రథిని అమ్ములతో కప్పేశాడు. మహాక్రోధుడై కిరీటి వాడి బాహువుల్ని నరికి తలని కూడ తుంచి కింద పడేశాడు. అదిచూసి వాడి తమ్ముడు దండుడు అతని మీద తోమరాలు విసురుతుంటే అర్జునుడు వాడి తలనీ నరికాడు. అలాగే మాగధ సైన్యం మీదికి దూకి వాళ్ల ఏనుగుల్ని చెండాడుతుంటే ఆ సైన్యాలు చెల్లాచెదురైనై.

అంతకుముందు కర్ణుడు పుళింద, బాహ్లిక, టేంకణ, ఆంధ్ర, భోజ సైన్యాల సాయంతో పాండవబలాల్ని మోదుతుంటే మలయధ్వజుడనే పాండ్యరాజు ఆ సేనల్ని అడ్డుకున్నాడు. అతను తననెవరన్నా భీష్మ ద్రోణుల్తో సమానుడంటే ఒప్పుకోడు, కృష్ణార్జునులు తనకు ఎక్కువని నమ్మడు. మహా భుజశాలి. అతను మన సేనల్ని చీకాకు పెడుతుంటే అశ్వత్థామ “సామాన్య సైన్యాన్ని బాగానే చంపుతున్నావ్ గాని నాతో తలపడి చూడు” అని పిలిస్తే అంతకన్నానా అని ఆనందంగా మలయధ్వజుడతనితో యుద్ధానికి పూనుకున్నాడు. ఇద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. అశ్వత్థామ అతని మీద తొమ్మిది బాణాలేస్తే మలయధ్వజుడు వాటికి ప్రతిశరాలు వేశాడు. ఐదు విరిగినయ్ కాని మిగతా నాలుగూ అతని గుర్రాల్ని చంపినయ్. అతని పరివారం ఇంతలో అతనికి మరో రథం తెస్తే అది ఎక్కి వాయవ్యాస్త్రంతో అశ్వత్థామ చక్రరక్షకుల్ని చంపాడు. అశ్వత్థామ కూడ అతని సహచరుల్ని, గుర్రాల్ని, సారథిని చంపి రథాన్ని నుగ్గుచేశాడు. ఐనా వెనక్కి తగ్గకుండా మలయధ్వజుడు శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తూ యుద్ధం చేశాడు. అశ్వత్థామ సరదాగా అతనితో ఇంకొంచెం సేపు యుద్ధం సాగించాడు. ఇంతలో మలయధ్వజుడొక ఏనుగునెక్కి దాన్ని అశ్వత్థామ మీదికి తోలి ఒక తోమరాన్ని విసిరాడు. దాని దెబ్బకి అతని శిరోభూషణం రాలి కింద పడింది. తోక తొక్కిన తాచులా అశ్వత్థామ వాడి పక్కనున్న ఆరుగుర్ని చంపి ఏనుగు తుండం నరికి పాండ్యుడి పాదాలు, చేతులు, తల తీవ్రభల్లాల్తో కోశాడు. వాడి సైన్యాలు పరిగెత్తినయ్. దుర్యోధనుడు వచ్చి అశ్వత్థామని మెచ్చుకుని పొగిడాడు.

భీముడు పరుగున వచ్చి ఆ బలాల్ని నిలిపి మన సైన్యం మీద దూకాడు. మన సైన్యం చెల్లాచెదురౌతుంటే కర్ణుడొచ్చాడు. అశ్వత్థామ అతనికి సాయంగా నిలిచి చాలామంది పాంచాలదొరల్ని చంపాడు. దూరాన్నుంచి మలయధ్వజుడి చావు చూసిన కృష్ణుడు అక్కడ భీమాదులు కర్ణుడితో తలపడటం చూసి మనం కూడ వెళ్లటం మంచిదంటే అర్జునుడు సరే నన్నాడు. వాళ్లలా వెళ్తుండగా అశ్వత్థామ ధృష్టద్యుమ్నుణ్ణి కేకేసి పిలిచి “నికృష్టుడా, అర్జునుడిక్కడికి రాకముందే నీ అంతు చూస్తా, పారిపోకుండా నిలబడు” అంటే “నీ తండ్రి తల కోసిన కత్తి నీకోసం సిద్ధంగా వుంది, నీకూ అదే గతి పట్టిస్తా రా” అని అతనూ బదులిచ్చాడు. ఇద్దరూ ఘోరంగా పోరాడారు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ విల్లు విరిస్తే అతను వెంటనే మరోటి తీసుకుని అతని సూతుడు, గుర్రాల్ని చంపి కేతనాన్ని గొడుగుని విరిచాడు. అతను శక్తినెత్తితే దాన్ని, గద వెయ్యబోతే దాన్నీ నుగ్గుచేశాడు. వాలూ పలకా తీసుకుంటే వాటినీ తుంచి అతనికి శరీరాన బాణాలు నాటాడు. ఐనా అతను నిబ్బరంగా వుంటే ఆశ్చర్యపడి అశ్వత్థామ వింటిని విసిరేసి తళతళలాడే కత్తితో కాలినడకన అతని మీదికి బయల్దేరాడు.

కృష్ణుడు అర్జునుడితో “ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామకి చిక్కాడు. అతన్ని కాపాడాలి” అని తొందరచేస్తే అర్జునుడక్కడినుంచే అశ్వత్థామ మీద బాణాలు కురిపిస్తూ అక్కడికి బయల్దేరాడు. అశ్వత్థామ ఆ ధాటికి తట్టుకోలేక వెనక్కి తిరిగి తన రథం ఎక్కి అర్జునుడితో తలపడ్డాడు. ఈలోగా సహదేవుడు ధృష్టద్యుమ్నుణ్ణి తన రథం ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అర్జునుడి నిశితబాణానికి అశ్వత్థామ తూలితే అతని సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. పాండవబలాలు కేరింతలు కొట్టినయ్.

ఒక పక్క కర్ణుడు, మరో పక్క సంశప్తకులు తనతో పోరాడాలని సిద్ధమౌతుంటే ముందు సంశప్తకుల పని చూద్దామన్నాడు అర్జునుడు. కర్ణుడు పాంచాలసేనల మీదికి పోయాడు. అతనా సేనలో గగ్గోలు పుట్టిస్తుంటే ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు అడ్డుపడ్డారు. అతను విజృంభించి వాళ్లందర్నీ ముప్పుతిప్పలు పెట్టాడు. నీ కొడుకులు ధర్మరాజుని పట్టుకుందామని ప్రయత్నించారు గాని భీముడు, సాత్యకి అది సాధ్యం కానివ్వలేదు. అప్పుడు భీముడు ఉగ్రరూపంతో మన సైన్యం మీద పడి చెండాడాడు. అతని దెబ్బకి మన చతురంగబలాలు తలో దిక్కు పారిపోయినయ్. ఇదంతా చూసి కృష్ణుడు అర్జునుడికి చెప్తే అతను మనమూ అక్కడికి వెళ్దాం అన్నాడు.

దుర్యోధనుడు భీముణ్ణి నిలవరించి అతనితో తలపడ్డాడు. కర్ణుడతనికి సాయంగా వచ్చాడు. పాంచాల దొరలు భీముడికి తోడుగా వచ్చారు. ఇరుపక్షాలు ఉత్సాహంగా సమరం చేసినయ్. భీముడు దుర్యోధనుడి సారథిని చంపి గుర్రాలని మోదితే అతను రథాన్ని తోలుకుంటూ యుద్ధభూమికి దూరంగా వెళ్లాడు. అశ్వత్థామ పెద్ద సైన్యసహాయంతో అర్జునుణ్ణి ఢీకొన్నాడు. అర్జునుడతని మీద దివ్యాస్త్రాలు వేస్తే అతనూ వాటిని ప్రయోగించి ఉపసంహరించాడు. అశ్వత్థామ వేసిన మూడు ఉగ్రబాణాలు అర్జునుడి కుడి భుజాన దూరినయ్. ఐనా అతను లెక్కచెయ్యకుండా యుద్ధం చేశాడు.

దుర్యోధనుణ్ణి కవలలు ఢీకొన్నారు. అతనికి సాయంగా వచ్చి కర్ణుడు దివ్యబాణాల్తో పాండవసైన్యాన్ని మట్టుబెడుతున్నాడు. ధర్మరాజు వాళ్లని కూడగట్టి కర్ణుడితో తలపడ్డాడు. కర్ణుడతని మీద అనేక బాణాలేసి ఒక నారసాన్ని అతని రొమ్ముకి నాటాడు. ఆ దెబ్బకి ధర్మరాజు చతికిలపడి రథాన్ని దూరంగా తీసుకుపొమ్మని సారథికి చెప్పాడు. వాడలాగే చేశాడు. ఐతే అతను వెళ్లకుండా కౌరవబలాలు అడ్డుపడితే కేకయపాంచాల బలగాలు వాటిని తాకినయ్. కర్ణుడు మాత్రం వదలకుండా ధర్మరాజు వెంటపడ్డాడు. భీముడు దుర్యోధనుణ్ణి ఆపి అతనితో తలపడ్డాడు. ధర్మరాజు శిబిరానికి పోతుంటే వెనకనుంచి కర్ణుడతని మీద బాణాలు కురిపించాడు. దగ్గర్లో ఉన్న నకులసహదేవులది చూసి కర్ణుడికి అడ్డు తగిలారు. అతను నకులుడి విల్లు విరిచి గుర్రాల్ని చంపితే అతను సహదేవుడి రథం ఎక్కాడు.

కర్ణుడు ఆ ముగ్గురితోనూ పోరుతూ అందరికీ గాయాలు చేస్తుంటే శల్యుడతన్ని వారించి “ఎందుకు నీకు ధర్మరాజు మీద అంత కోపం? ఇప్పుడు నువ్వతన్ని చంపితే అర్జునుడొచ్చి నిన్నూ కౌరవుల్నీ అందర్నీ నాశనం చేస్తాడు. అర్జునుణ్ణి చంపితేనే దుర్యోధనుడికి రాజ్యం దక్కేది. అటుచూడు, అక్కడ భీముడి చేతిలో దుర్యోధనుడు ఇప్పుడే చచ్చేట్టున్నాడు. అతన్ని కాపాడుకోలేకపోతే ఇక్కడ నువ్వు ఎవర్ని చంపీ ఉపయోగం లేదు, ఆలోచించుకో” అన్నాడు. కర్ణుడు కూడ అటు చూసి దుర్యోధనుడు చిక్కుల్లో ఉన్నట్టు గమనించి అతన్ని రక్షించటానికి బయల్దేరాడు. నకుల సహదేవుల్తో కలిసి తన శిబిరానికి వెళ్లాడు ధర్మరాజు.

అది విన్న ధృతరాష్ట్రుడు కుమిలిపోయాడు. “నా కొడుకు భీముడికి చాలకపోవటం ఏమిటి, కర్ణుడలా చేతికి చిక్కిన ధర్మరాజుని ప్రాణాల్తో వదిలెయ్యటం ఏమిటి? ఎంత బుద్ధితక్కువ పని చేశాడా కర్ణుడు?” అని వాపోయాడు. సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు.

అలా ధర్మరాజు యుద్ధభూమి నుంచి తిరిగెళ్లి మంచం మీద మేనువాల్చాడు. ఒంటికి గుచ్చుకున్న బాణాల్ని లాగించాడు. ఐతే అతని హృదయవేదన మాత్రం క్షణక్షణం పెరిగిందే తప్ప తగ్గలేదు. విషణ్ణవదనుడై నకులసహదేవుల్ని భీముడి దగ్గరకి వెళ్లమని పంపేశాడు.

అక్కడ అశ్వత్థామ అర్జునుణ్ణి ముప్పుతిప్పలు పెడుతూ యుద్ధం చేస్తున్నాడు. చివరికి అర్జునుడు విసుగుతో కూడిన కోపంతో అతని గుర్రాల్ని బాణాల్తో కొట్టి వాటి పగ్గాలు తెంపితే అవి రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా లాక్కెళ్లినయ్. మనబలాలు చెల్లాచెదురైనై, వాళ్ల బలాలు ఉప్పొంగినయ్. నీ కొడుకు కర్ణుడి దగ్గరికెళ్లి “నీ భుజసంపద చూపించటానికి ఇదే సమయం. ఎన్నో దివ్యాస్త్రాలున్న నీలాటి వాడి రక్షణలో కూడ మన సైన్యం ఇలా బెంబేలెత్తటం సమంజసం కాదు” అంటే రాధేయుడు వీరోద్రేకంతో శల్యుడితో “ఇప్పుడు నేను కృష్ణార్జునుల్ని, భీముణ్ణి మట్టుబెట్టబోతున్నా, సారథ్యంలో నీ ప్రతిభ చూపించు” అని తన ధనుస్సు “విజయా”న్ని చూసి “నీ ముందు గాండీవం ఓ లెక్కలోదా?” అని మన సైన్యాన్ని ఆపి నిలిపి శత్రుసైన్యం మీద భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు.

ఆ భార్గవాస్త్రం అనేక శరాల రూపంలో వెళ్లి పాండవసైన్యాన్ని నాశనం చేసింది. గుర్రాల నెత్తురు, భటుల శరీరావయవాలు, రథాల ముక్కచెక్కలు అన్నీ కలిసి భీభత్సాన్ని సృష్టించినయ్. శత్రుసైన్యాలు చెల్లాచెదురై వెనక్కి తిరిగి పరిగెత్తినయ్. మనవాళ్లు వాళ్ల వెంటబడి దొరికిన వాళ్లని దొరికినట్టు నరుకుతుంటే కర్ణుడు మహోత్సాహంతో బాణవృష్టి కురిపిస్తూ తరిమాడు. పాండవ సైన్యం కృష్ణార్జునుల దగ్గరికి పరిగెత్తింది.

అశ్వత్థామతో ఘోరరణంలో అలిసిపోయిన అర్జునుడు నీరుగారి పోయాడు. కృష్ణుడితో అన్నాడూ “కర్ణుడు వీరవిక్రముడై విజృంభించి యుద్ధం చేస్తున్నాడు, చూస్తున్నావా! అతన్ని తేరి చూడాలంటేనే భయం వేస్తుంది. తొందరపడి అతనితో పోరాడి ఓడిపోవటం కంటె నేర్పుగా పక్కదారి చూసుకుని ప్రాణాలు నిలుపుకోవటం మేలు. బతికుంటే ముందు ముందైనా గెలిచే అవకాశం వుంది” అని. కృష్ణుడు భీముడి వైపు చూశాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, ద్రౌపదేయులు కలిసి కర్ణుడితో తలపడితే భీముడు తమ సైన్యాన్ని నిలవరించి తను కౌరవ సైన్యాన్ని నుగ్గుచెయ్యటం మొదలెట్టాడు. “ఇప్పటికి కర్ణుణ్ణి వీళ్లు ఆపుతారు, అలిసిపోయిన అర్జునుడు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు” అనుకుని రథాన్ని భీముడి వైపుకి నడుపుతూ కృష్ణుడు “ఇందాక నువ్వు అశ్వత్థామతో పోరేప్పుడు ధర్మరాజు కర్ణుడితో యుద్ధంలో కష్టపడుతున్నట్టు కనిపించాడు. అతనికేవన్నా గాయాలయాయేమో చూసి ఆ తర్వాత మనం వచ్చి కర్ణుడి సంగతి చూద్దాం” అన్నాడు. అన్న కర్ణుడి చేతికి చిక్కాడన్న మాట వినగానే అర్జునుడికి గుండె కలుక్కుమంది. చుట్టూ చూస్తే ధర్మరాజు కనిపించలేదు. ఆదుర్దాగా భీముడి దగ్గరికి వెళ్లి అతన్నడిగితే జరిగింది చెప్పాడు. “అయ్యయ్యో, భీష్మ ద్రోణుల్తో మడమ తిప్పకుండా నిలబడి పోరినవాడు ఇప్పుడిలా కర్ణుడి చేతిలో భంగపడాల్సొచ్చిందా” అని బాధపడి భీముడితో “నువ్వెళ్లి ఆయన ఎలా వున్నాడో చూసి రా, అందాకా వీళ్ల సంగతి నేను చూస్తా” అంటే భీముడు “అలాటి పని నీకు సరిపోతుంది గాని నేనిప్పుడు రణరంగం విడిచివెళ్తే ఓడిపోయి పారిపోయా ననుకుంటారందరూ. నువ్వే వెళ్లు” అన్నాడు.

కృష్ణార్జునులు ధర్మరాజుని చూడటానికి బయల్దేరారు. కృష్ణుడు త్వరితంగా గుర్రాల్ని నడిపి ధర్మరాజు శిబిరానికి చేర్చాడు. ఇద్దరూ లోనికి వెళ్లి ధర్మరాజు కుశలంగానే వుండటం చూసి సంతోషించారు. ధర్మరాజు వాళ్లిద్దర్ని చూశాడు. కర్ణుణ్ణి చంపి ఆ మాట తనకి చెప్పటానికి వచ్చారనుకున్నాడు. దిగ్గున లేచి కూర్చున్నాడు. “సురలకైనా అలివి కాని వీరాగ్రణి కర్ణుణ్ణి మీకెలాటి ఆపదా కలక్కుండా చంపి వచ్చారు, మిమ్మల్ని ఏం పొగడగలను? నా మనస్సులో వున్న బాధంతా ఇప్పుడు తీరిపోయింది. ఇందాక నాతో యుద్ధంలో మనవాళ్లంతా చూస్తుండగా వాడు నా కేతనాన్ని చించి, సూతుణ్ణి గుర్రాల్ని చంపి నా ఒళ్లంతా తూట్లు పొడిచి గాయాలు చేశాడు. భీముడి చేతిలో దుర్యోధనుడు చావుబతుకుల్లో వున్నాడని నన్ను వదిలి అటు పోతే బతుకు జీవుడా అని నేనిటు వచ్చా. ఏమైనా, గడిచిన పదమూడేళ్లుగా కర్ణుణ్ణి తలుచుకుని నాకు కునుకు పట్టలేదు. భీష్ముడి చేత గాని, ద్రోణుడి చేత గాని పడని అవమానం వాడి చేత పడ్డాను నేను. మన కష్టాలన్నిటికీ మూలం వాడు. అలాటి వాణ్ణి వాడి కొడుకులు చుట్టాలు చూస్తుండగా నీకెలాటి గాయాలూ కాకుండా చంపగలిగావంటే వీరుడివంటే నువ్వే. ఎలా చంపావ్ వాణ్ణి, భల్లంతో తల నరికావా, రొమ్మున గొప్ప నారసాన్ని నాటి చంపావా?” అని తేలికపడ్డ మనస్సుతో పట్టలేని ఆనందంతో పొగిడుతూ అడిగాడు ధర్మరాజు.

అర్జునుడు అవాక్కయ్యాడు. “నేను సంశప్తకుల్తో పోరుతుంటే అనేకమంది రథికుల్ని తీసుకుని అశ్వత్థామ వచ్చి తలపడ్డాడు. ఎన్ని విధాలుగా పోరినా వదలక అతని బాణవర్షంలో మా ఇద్దర్నీ ముంచి ఎక్కడ ఏం వుందో కనపడనంతగా కప్పేశాడు. చివరికి ఎంతో కష్టం మీద అతన్ని వొదిలించుకుని నీ కోసం చూస్తే నువ్వు కనపడలేదు. భీముడు తప్ప మనవాళ్లెవరూ కర్ణుడి ముందు నిలబడ్డ వాళ్లు లేరు. నీ గురించి అడిగితే భీముడు ఇక్కడికి వచ్చినట్టు చెప్పాడు, నీ క్షేమం చూసి వెళ్దామని వచ్చాం, ఇక వెళ్లి కర్ణుడి అంతు చూస్తాం” అని చెప్పాడతను.

తననుకున్నట్టు కాక కర్ణుడు చక్కగా బతికేవున్నాడని తెలిసే సరికి ధర్మరాజుకి ఒళ్లు మండిపోయింది. “యుద్ధంలో చావటమో పక్కకి తొలిగిపోవటమో సరైనవే గాని ఎంత గాయాలైనా ఇలా పారిపోయి రావటం కాదు. వచ్చి అందరికీ చులకనయ్యా నేను. నువ్వూ ఏం తక్కువ తిన్లేదు. ఇదివరకే నకుల సహదేవులు ఓడారు. ఇంక మనమెవ్వరం యుద్ధానికి తిరిగి వెళ్లక్కర్లేదు. నేరుగా అడవులకి పోదాం పద. లేకపోతే దుర్యోధనుడి దగ్గరికి పోయి యాచిస్తే ఏదన్నా పనిస్తాడేమో చూసుకుందాం. నువ్విలాటి వాడివని ముందే ద్వైతవనంలో చెప్తే అసలింతదూరం తెచ్చి యుద్ధంలో కొడుకుల్ని బంధువుల్ని చంపుకునే వాణ్ణి కాదు కదా! అప్పుడు నేను కర్ణుణ్ణి చంపుతా అని చేసిన నీ ప్రతిజ్ఞ వట్టి మాటేనని తేలిపోయింది. దేవతలిచ్చిన రథం, గుర్రాలు, కపికేతనం ఉన్నయ్. పెద్ద తాటిచెట్టంత గాండీవం వుంది. స్వయాన కృష్ణుడే సారథి. ఇన్నీ ఉన్నా కర్ణుడికి ఓడి ఇలా పరిగెత్తుకొచ్చావంటే ఏమనుకోవాలి? దుర్యోధనుడప్పుడే చెప్పాడు, కర్ణుడు ఎదటపడితే నువ్వు పరిగెత్తుతావని, నేను విన్నానా? ఇప్పుడే గనక అభిమన్యుడో ఘటోత్కచుడో వుంటే నాకింత పరాభవం కలగనిచ్చేవాళ్లా? అసలు నువ్వంటే గడ్డిపోచ కింద లెక్కేసేగా కర్ణుడు నన్నవమానించటానికి వెనకాడంది? ఏ మొహం పెట్టుకుని ఇలా పారిపోయొచ్చావ్? నీ గాండీవం కృష్ణుడి చేతికిచ్చి నువ్వు సారథ్యం చేస్తే అతను ఒక్క క్షణంలో ఆ కర్ణుణ్ణి చంపేవాడు కదా? అసలు కుంతి కడుపున ఎట్లా పుట్టావో నువ్వు?” అని చడామడా తిడుతుంటే –

అర్జునుడు కత్తి దూసి ధర్మరాజుని చంపటానికి లంఘించబోతుంటే అడ్డుకున్నాడు కృష్ణుడు. “ఇక్కడ శత్రువులెవరూ లేరే, ఎందుకీ కత్తులు దుయ్యటం?” అంటే అర్జునుడు “గాండీవాన్ని ఇతరులకియ్యమని ఎవరన్నా అంటే వాళ్ల తల బద్దలు కొడతానని ఇదివరకే ప్రతిజ్ఞ చేసుకున్నా. ఇప్పుడితను ఆ మాట అనటం నువ్వే విన్నావ్, సత్యవ్రతుణ్ణి నేను. నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు” అన్నాడు క్రోధంగా. కృష్ణుడు “మతిలేని మాటలు మాట్టాడకు” అని అతన్నదిల్చి “పెద్ద వాళ్ల దగ్గరుండి సేవ చెయ్యనందువల్ల నీకు ధర్మసూక్ష్మాలు తెలీవు. సత్యం ఎప్పుడు ధర్మం, ఎప్పుడు కాదు, అనేది తేలికైన విషయం కాదు. చెప్తా విను. సత్యం, అహింస – ఈ రెండు అత్యుత్తమ ధర్మాలు. ఐతే అహింసతో సత్యాన్ని కాపాడాలి, అవసరమైతే అసత్యంతో నైనా అహింసని కాపాడాలి. ఇలా సత్యరక్షణం కోసం అన్నని చంపుతాననటం ధర్మమార్గం కాదు. ప్రాణహాని వేళ, సర్వధనాలూ పోయే వేళ చెప్పే సత్యం అనృతం, అసత్యమే సూనృతం. నీలాగే కౌశికుడనే వాడొకడు ఒక గ్రామానికి దగ్గర్లో తపస్సు చేసుకునేవాడు. అతను సత్యవ్రతం పట్టి ఎప్పుడూ సత్యమే చెప్పేవాడు. ఒకరోజు కొందర్ని దొంగలు తరుముతుంటే వాళ్లు అతని దగ్గర్లో దాక్కున్నారు. దొంగలొచ్చి కౌశికుణ్ణి వాళ్లెక్కడున్నారని అడిగితే సత్యవాది కనక అతను వాళ్లెక్కడుందీ చూపించాడు, దొంగలు వాళ్లని కొట్టి చంపి వాళ్ల ధనమంతా అపహరించారు. ఆ దోషం వల్ల అతను నరకానికి పోయాడు. కనక హింసకి దారి తీసే సత్యం ధర్మం కాదు. పెద్దలనడిగి తెలుసుకోకుండా మూర్ఖులు అధోగతికి పోతారు. కాబట్టి ఇప్పుడు చెప్పు ఈ అజాతశత్రువుని చంపటం ధర్మమా అధర్మమా?” అని గద్దించాడు.

అర్జునుడు మెత్తబడ్డాడు. “అలాగైతే నాకు అసత్యదోషం అంటకుండా, ధర్మరాజుకి కీడు కలక్కుండా వుండే ధర్మమార్గం ఏదో నువ్వే చెప్పు” అనడిగాడు. ” అతన్ని నువ్విలాటి వాడివి అలాటి వాడివని తిట్టు, అదే చంపటంతో సమానం. ఆ తర్వాత నమస్కారం చేసి ప్రసన్నుణ్ణి చేసుకో” అని బోధించాడు కృష్ణుడు. అర్జునుడికి ఆ ఆలోచన నచ్చింది. ధర్మరాజు నుద్దేశించి “శత్రుమూకల్ని నేలమట్టం చేసే మహాబాహుబలుడు భీముడు నన్నంటే అర్థం వుంది గాని పిరికిపందవై పారిపోయొచ్చిన నీకు నన్ను తిట్టే అర్హత ఎక్కడిది? ఎప్పుడు ఏ యుద్ధంలో నువ్వు ఏం వుద్ధరించావని నన్నిన్ని మాటలన్నావ్? మనకి కౌరవుల్తో వైరం రావటానికి కారణం నీ జూదం. రాజ్యం పోవటానికి, మనందరం అడవుల్లో నానా కష్టాలు పడటానికి అదే కారణం. ఐనా ఐందేదో ఐంది, ఇకనుంచైనా ఇలాటి దుర్బుద్ధితనాలు మాని మేము పౌరుషంతో సంపాయించి తెచ్చింది అనుభవించు. నోటికొచ్చినట్టు మాట్టాడితే పడేవారెవరూ లేరిక్కడ” అని దూషించాడు అర్జునుడు.

అంతలోనే బాధపడి కత్తిని ఒరనుంచి లాగాడు. “మళ్లీ ఏమైంది కత్తి తీశావ్” అని కృష్ణుడంటే “ఈ మహానుభావుణ్ణి ఇంతగా తిట్టినందుకు నాకు ప్రాయశ్చిత్తం తల తెంచుకోవటమే” అని అందుకు సిద్ధమౌతుంటే ఆపి “అందుకు తలతెంచుకోనక్కర్లేదు, ఆత్మస్తుతి చాలు. నిన్ను నువ్వు పొగుడుకోవటం చావుతో సమానం” అని సమాధాన పరిచాడు కృష్ణుడు. అలాగే అని అర్జునుడు గాండీవం చేతబట్టి “పరమశివుడు తప్ప నాతో ఉజ్జీ ఈ మూడు లోకాల్లోనూ లేడు. అన్ని దిక్కులా గెలిచి లెక్కలేనంత ధనాన్ని నీకు తెచ్చి ఇచ్చి రాజసూయం చేయించాను గుర్తుందా? వీరగణాలైన సంశప్తకుల్ని ఏదో కొద్దిమంది తప్ప అందర్నీ పరలోకాలకి పంపించా. నా మూలానే కురుసేన చాలాభాగం హరించిపోయింది” అని చెప్పుకుని వినయంగా ధర్మరాజుకి నమస్కరించి “నేనిప్పుడు పలికిన కారుకూతల్ని పట్టించుకోవద్దు. నీకంటె నాకు పెద్ద ఎవరూ లేరు. నన్ను దీవించి పంపితే వెళ్లి కౌరవసేనని అల్లకల్లోలం చేసి కర్ణుణ్ణి చంపి దుర్యోధనుడికి దుఃఖం కలిగిస్తా. ఇవాళ నేనో కర్ణుడో తేలిపోవాలి” అన్నాడు.

“నా మూలానే మీకందరికీ అనేక కష్టాలు కలిగినయ్. కుటుంబానికింత హాని కలిగించిన నన్ను చంపటమే ధర్మం. నువ్వు కనికరించి వదిలినా నేను అడవులకి పోతా. నాలాటి భీరువు, అసమర్థుడు రాజుగా తగడు. మీరు భీమసేనుడికి పట్టం గట్టండి,” అని లేచి అడవులకి బయల్దేరాడు ధర్మరాజు. కృష్ణుడతన్ని ఆపి ప్రణామం చేస్తూ “అర్జునుడి ప్రతిజ్ఞ విషయం మనకి తెలియదు గనక పొరపాటు జరిగిపోయింది. అందువల్ల ధర్మహాని కలక్కుండా అతను నిన్ను కొన్ని పరుషపు మాటలనాల్సి వచ్చింది. అవి మనసులో వుంచుకోవద్దు. ఈరోజు కర్ణుడి చావు ఖాయం, నన్ను నమ్ము. నీకెప్పుడైతే కోపం తెప్పించాడో అప్పుడే వాడి చావు సిద్ధమై పోయింది” అని అనునయించాడు. దాంతో ధర్మరాజు శాంతుడయాడు. “నేనూ నోరు జారాను, అది పొరపాటే. ఏమైనా సరైన ధర్మాన్ని బోధించి మమ్మల్నిద్దర్నీ కాపాడావ్” అని కృష్ణుణ్ణి స్తుతించాడతను.

అర్జునుడింకా దుఃఖితుడై వుండటం చూసి కృష్ణుడు “అన్న ఆశీస్సులందుకో, మనం వెళ్లి కర్ణుణ్ణి చంపాల్సిన పని వుంది. ఇది విచారానికి సమయం కాదు” అంటే అతను ఏడుస్తూ అన్న పాదాల మీద వాలాడు. ధర్మరాజూ అతన్ని ఆదరంగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ కొంచెంసేపు ఏడ్చారు. ఇంతలో కృష్ణుడు పరిజనుల చేత నీళ్లు తెప్పిస్తే ఇద్దరూ ముఖాలు కడుక్కుని స్వస్థులయారు. ధర్మరాజు తమ్ముణ్ణి మళ్లీ కౌగిలించుకున్నాడు. “కర్ణుడి మూలానే ఇదంతా. నన్నెంతగానో అవమానించిన ఆ ధూర్తుణ్ణి నువ్వు వధించివస్తే తప్ప నేను బతకలేను” అన్నాడతను. అర్జునుడు కూడ “వాణ్ణీ వాడి బంధువుల్నీ చంపకుండా నేను తిరిగిరాను, నీ పాదాల మీద ఆన. మీరద్దరూ వాడు చావాలని కోరండి, నేను సాధించి వస్తా” అని బదులిచ్చాడు.

గుర్రాలకి మేత పెట్టించి, నీళ్లు తాగించి రథం సిద్ధం చేసి ధర్మరాజు ఆశీస్సులు తీసుకుని కృష్ణార్జునులు కర్ణవధకి బయల్దేరారు. దార్లో అర్జునుడికి చెమటలు పట్టటం గమనించాడు కృష్ణుడు. “దేవతలకైనా అసాధ్యులైన వాళ్లెందర్నో జయించిన వాడివి నువ్వు. నీకు ఎదురెవరు? భీష్మ ద్రోణుల్ని నీ దివ్యాస్త్రాల్తో ఓడించావ్, అత్యాశ్చర్యకరంగా సైంధవుణ్ణి చంపావ్. నిన్ను మించిన వాళ్లెవరూ లేరు. ఎలాటి సందేహమూ నీమనసులో వద్దు. నీకున్న దివ్యబాణాలు, నీ ధనుర్వేదకౌశలం ఇంకెవరికున్నయ్? కౌరవులేదో కర్ణుడు నీ సరిజోదు అనుకుంటున్నారు గాని, అతనికి చావూ నీకు కీర్తీ తథ్యం. మన భీముడైనా మరెవరైనా విజృంభిస్తున్నారంటే అది నీ అస్త్రాల మహిమ వల్లే. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, శల్యుడు – వీళ్లంతా నీచేతిలో చచ్చేవాళ్లే. పోనీ కృపుణ్ణి, అశ్వత్థామని దయతల్చి వదిలేద్దామని నీకనిపిస్తే అలాగే చేద్దాం. మిగిలిన వాళ్లు చావటం మాత్రం తప్పదు. కర్ణుడు మిమ్మల్ని పెట్టిన కష్టాలు గుర్తు తెచ్చుకో. ఆనాడు నిండుకొలువులో ద్రౌపదిని సమర్థుడైన భర్తని మరొకణ్ణి చూసుకోమని వాడన్న మాట మర్చిపోయావా? నేను సంధి చెయ్యటానికి వెళ్తే నన్ను బంధించాలని చూసింది వాడే. వంచనతో అభిమన్యుడి చేతివిల్లు విరిచి ఆ చిన్నబిడ్డ ప్రాణాలు తీయించిన వాడు కర్ణుడే. ఇప్పటికీ అది తలుచుకుంటే మనసు కలుక్కుమంటుంది. అడుగో కర్ణుడు, వాణ్ణి చంపి మనవాళ్లందరికీ ఆనందం కలిగించు” అని అతన్ని ప్రోత్సహించాడు కృష్ణుడు.

అర్జునుడు సమరావేశంతో “నువ్వు నా పక్కనుంటే ఇప్పుడు త్రిలోకాల్నీ జయిస్తా, ఈ కర్ణుడొక లెక్కా?” అని సంరంభంగా ఆదిశేషుడి వంటి తన హస్తంతో కొండలాటి గాండీవాన్నెత్తి నారిసారించి “ఇప్పుడు నా బాణాల దెబ్బల్తో కౌరవులకి వాళ్లు చేసిన దుశ్చర్యల్ని గుర్తుకు తెప్పిస్తా. రాజ్యం ధర్మరాజుకి ఇప్పిస్తా. ఆకాశచారులంతా నా ప్రతాపాన్నే పొగుడుకుంటూ వెళ్లేట్టు చేస్తా. మనవాళ్లంతా నన్ను గౌరవించేట్టు చూస్తా” అని ఆవేశంగా మాట్లాడాడు.

ఈలోగా కర్ణుడి కొడుకొకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు. శోకంతో, క్రోధంతో కర్ణుడతని గుర్రాల్ని చంపి కేతనాన్ని విరిస్తే అతను కత్తి తీసుకుని కిందికి దూకి దగ్గర్లో వున్న కృపాచార్యుడి గుర్రాల్ని కూల్చి శిఖండి రథం ఎక్కాడు. విరథుడై కింద పడ్డ కృపుణ్ణి కొట్టటానికి మనసు రాక వదిలేశాడు శిఖండి. అశ్వత్థామ వేగంగా వచ్చి మేనమామని తన రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

మరోవంక భీముడు అర్జునుడు ఎంతసేపైనా రాలేదేమిటని వ్యాకులపడ్డాడు. ఒకవేళ ధర్మరాజుకేమైనా ఐందేమోనని సందేహం కలిగిందతనికి. ఐతే యుద్ధభూమిని విడిచి వెళ్లి పరామర్శించే అవకాశం లేకపోవటంతో ప్రస్తుతానికి దుఃఖోపశమనానికి మందు కౌరవుల్ని చంపటమే అని నిశ్చయించుకున్నాడు. తన సారథి విశోకుడితో “ఎదురుగా కౌరవులు ఎవరెవరున్నారో సరిగా చూసుకో, మనకి కావాల్సినన్ని బాణాలున్నయ్యో లేదో చూడు” అంటే అతను “ఎదురుగా ఎవరుంటే ఏం, వాళ్లలో నీ ముందు నిలవగలిగే వాళ్లెవరు? ఇక అస్త్రశస్త్రాలంటావా, ఆరెడ్ల బండి నిండా వున్నయ్. ఐనా నీ గద వుండగా ఇవన్నీ నీకెందుకు?” అని ఉత్సాహపరిచాడతను. ఆదరంగా అతని చేతిని తట్టాడు భీముడు. “ఇప్పుడు నేనీ కౌరవమూకని చేతులతీట తీరేట్టు చెండుతా చూడు. సభలో చేసిన ప్రతిజ్ఞలు తీర్చే సమయం దగ్గరపడింది” అంటూనే దూరంగా కౌరవసేనల కోలాహలం చూసి “మనం మొదలుపెట్టక ముందే కౌరవసైన్యం అటుపక్క కకావికలై పరిగెత్తుతుంది, అర్జునుడటు వచ్చాడా ఏమిటి?” అనడిగాడు.

విశోకుడటు చూసి ఆనందంగా “నిజమే, అదుగో కపిధ్వజం. కౌరవ గజసైన్యాన్ని తరుముతున్నాడు అర్జునుడు. కృష్ణుడి మేనికాంతి, అర్జునుడి కిరీటకాంతి ధగధగలు ఆకాశం నిండుతున్నయ్” అంటే “ఇంత సంతోషకరమైన మాట చెప్పావ్, నీకు వందమంది దాసీల్ని, ఇరవై గుర్రాల్ని, పద్నాలుగు గ్రామాల్నిస్తున్నా” అని చెప్పాడు భీముడు సంతోషంతో పొంగిపోతూ.

గజసైన్యాన్ని కరువు తీరా మర్దించి భీముడున్న వైపుకి బయల్దేరాడు అర్జునుడు. మన బలాలు అతనికి అడ్డుపడి కమ్ముకుంటే పాముపిల్లల్ని పరిహరించే గరుత్మంతుడిలా అతను మన చతురంగబలాల్ని చావుదెబ్బలు కొట్టాడు. ఎదురుగా యుద్ధానికి వువ్విళ్లూరుతూ కర్ణుడి వ్యూహం కనిపిస్తే దాని మీదికి కదిలాడు అర్జునుడు. అదిచూసి భీముడు మహోత్సాహంతో తన ముందున్న మన మొన మీదికి దాడి చేశాడు. దుర్యోధనుడు మనమొనలోని దొరల్ని అతని మీదికి పురిగొల్పాడు కాని భీముడా సైన్యాన్ని నుగ్గుచేశాడు. అప్పుడు నీ కొడుకు శకునిని అతని మీదికి పంపాడు. శకుని తీవ్రంగా అతన్నెదుర్కుని అనేక బాణాలు అతని వక్షాన కొట్టాడు. భీముడవి లెక్క చెయ్యకుండా ఒక క్రూర నారాచాన్నతని మీద వేస్తే గొప్ప లఘువుతో శకుని దాన్ని ఇరవైమూడు అమ్ముల్తో ముక్కలు చేశాడు. భీముడతని విల్లు విరిచాడు. నీ మరిది ఇంకో విల్లు తీసుకుని పదహారు బాణాల్తో అతని వింటిని, కేతువుని విరిచి గుర్రాల్ని, సూతుణ్ణి గాయపరిచాడు. మహాక్రోధంతో భీముడు యముడి నాలిక లాటి శక్తినొకదాన్ని విసిరితే శకుని దాన్ని పట్టుకుని తిరిగి భీముడి మీదికే విసిరేశాడు. అది భీముడి చేతికి తగిలి గాయం చేసింది. భీముడింక సహించలేక ఒక దృఢమైన వింటిని తీసుకుని శకుని విల్లు విరిచి అనేక నిశితాస్త్రాల్తో అతన్ని కొట్టాడు. ఆ దెబ్బకి శకుని చచ్చినట్టు నేలమీద పడ్డాడు. దుర్యోధనుడతన్ని తన రథం మీద వేసుకుని దూరంగా తీసుకెళ్లాడు. మన సైన్యం హాహాకారాలు చేసింది. దొరలు వెనక్కి తిరిగితే భటులూ వాళ్ల కన్నా ముందే పరిగెత్తారు.

కర్ణుడు మన సేనల్ని కూడగట్టి నిలిపి కరూశ, పాంచాల, చేది సైన్యాల్ని కల్లోలం చేయసాగాడు. భీముడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదేయులు, సాత్యకి అతన్నడ్డుకోవటానికి ప్రయత్నించారు. అలాగే నకుల సహదేవులు కూడ వచ్చి వాళ్లతో కలిశారు. ఐనా క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్సాహంతో కర్ణుడు అందరికీ అన్ని రూపులై వాళ్ల బలగాల్ని చించి చెండాడుతూ నెత్తుటి మడుగులు పారించాడు. దూరాన మరోవైపున్న మన సైన్యాన్ని మర్దిస్తున్న అర్జునుడది చూసి ఇక మనం వెళ్లి కర్ణుడితో తలపడదాం అంటే కృష్ణుడలాగే రథాన్ని కదిలించాడు. మహావేగంగా వస్తున్న ఆ రథాన్ని గమనించాడు శల్యుడు. కర్ణుడితో “కపిధ్వజం భీకరంగా ఎగురుతుంటే కృష్ణుడు అద్భుత చాతుర్యంతో నడుపుతుంటే శ్వేతాశ్వాల్తో వెలుగులు చిమ్ముతూ వస్తున్నాడు అర్జునుడు, అటు చూడు. అతనికి అటూ ఇటూ తోడుగా ఎవరూ లేరు. ఒకడే నీతో తలపడటానికి వస్తున్నాడు. మనం తప్ప అతన్నాపే వాళ్లెవరూ లేరిక్కడ” అంటే కర్ణుడు విజయుడి వీరవిక్రమాల్ని, కృష్ణుడి మహత్యాన్ని పొగిడి “అలాటి వాళ్లతో తలపడగలవాణ్ణి నేనొక్కణ్ణే. ఇంతకన్నా కావలసిందేమిటి మన రథం వాళ్లకెదురుగా పోనివ్వు” అన్నాడు ఉత్సాహంగా.

అదిచూసి దుర్యోధనుడు కృప, కృతవర్మ, అశ్వత్థామ, శకునుల్ని పురిగొల్పితే వాళ్లు కర్ణుణ్ణి దాటి వెళ్లి అర్జునుణ్ణి చుట్టుముట్టారు. అర్జునుడు వాళ్లని లెక్కచెయ్యకుండా అందర్నీ అనేక విధాలుగా హింసించి భీముడి దగ్గరికి వెళ్లి అతనికి ధర్మరాజు క్షేమం చెప్పి నువ్వింక కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి మన సైన్యం మీదికి జింకల గుంపు మీద దూకే సింహంలా విజృంభించాడు.

నీ కొడుకులు పదిమంది వేగంగా వెళ్లి అతన్ని చుట్టుముడితే అతను వాళ్ల తురగ, కేతన, సూతుల్ని చెండాడి మెరుగుబాణాల్తో వాళ్ల మెడలు నరికాడు. కౌరవరథికులు తొంభైమంది దాడికి దిగితే అన్నే బాణాల్తో వాళ్లందర్నీ రణభూమికి బలిచ్చాడు. పదమూడువందల మదపుటేనుగుల దళంతో ఆభీరులు మొదలైన మ్లేచ్ఛ సైన్యాలు కమ్ముకుంటే వాళ్ల మీద అనేక బాణాలేశాడతను. ఐనా వాళ్లు ఆగకపోతే భీముడొచ్చి అతన్నాదుకున్నాడు. అప్పటికీ అవి పోకపోతే భీముడు గద తీసుకుని రథం మీంచి దూకి వీరవిహారం చేస్తుంటే అర్జునుడు మరోవంక అంపవర్షం కురుస్తూ గాయాలు కాని చతురంగబలం లేకుండా చూశాడు.

మనసైన్యాలింక నిలవలేక కర్ణుడి రక్షణకి పరిగెత్తితే అతను వాళ్లనాదుకుని అడ్డుపడ్డాడు. నీ కొడుకులు కూడ అతనికి తోడుగా నిలబడ్డారు. అలా మన వ్యూహాన్ని నిలబెట్టి అర్జునుడి మీదికి కదిలాడు కర్ణుడు. అటుపక్క భీముడు కూడ తన రథం ఎక్కి అర్జునుణ్ణి కలుసుకున్నాడు. ఐతే వాళ్లిద్దర్నీ దాటుకుని పాంచాలబలాలు కర్ణుడితో తలపడినయ్. సాత్యకి, ద్రౌపదేయుల్తో పాండవబలాలు కూడ వాళ్లతో జతకూడినయ్.

కర్ణుడు శత్రువీరులందర్ని ముప్పుతిప్పలు పెట్టి కేకయకుమారుణ్ణి బాణానికి బలిచేస్తే వాడి తండ్రి కోపోద్రేకంతో కర్ణుడి కొడుకు ప్రసేనుణ్ణి అతని తండ్రి ఎదుటే చంపాడు. పుత్రశోకం, కోపం కలగలిసి కర్ణుడతన్ని అప్పటికప్పుడే కొడుకు దగ్గరికి పంపేశాడు. ఇంతలో సాత్యకి వేరే గుర్రాల్ని కట్టుకుని వచ్చి కర్ణుడి కొడుకు సుషేణుణ్ణి పట్టుకున్నాడు. వాడి గుర్రాల్ని చంపి ముప్పై నిశితాస్త్రాల్తో వాణ్ణీ పైకి సాగనంపితే కర్ణుడు మహోగ్రుడై ఒక తీవ్రనారసాన్ని సాత్యకి మీద వేస్తే దాన్ని శిఖండి మూడు శిలీముఖాల్తో మధ్యలోనే తుంచి మరోమూడు ప్రదరాల్ని కర్ణుడికి గుచ్చాడు. కర్ణుడు శిఖండి ధనువుని, ధ్వజాన్ని విరిచి ధృష్టద్యుమ్నుడి కొడుకు సుదేవుణ్ణి వాడి తండ్రి ఎదుటే చంపాడు.

పాంచాలరథికులు కర్ణుణ్ణి కమ్ముకున్నారు. వాళ్లని దాటి అర్జునుడతనితో తలపడబోతే అతన్ని దాటుకుని ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యుడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు కర్ణుణ్ణి తాకారు. ఐతే అతను ఏమాత్రం తొట్రుపడకుండా వాళ్లందరినీ బాణవర్షంలో ముంచెత్తి కేతువుల్ని, గుర్రాల్ని, సూతుల్ని, ధనుస్సుల్ని, తూణీరాల్ని ముక్కలుముక్కలు చేసి సింహనాదం చేశాడు. ద్రౌపది కొడుకులు అతని మీదికి కదిలారు. వాళ్లు వేసే బాణాల్ని మధ్యలోనే తుంచుతూ అతనికి సాయపడుతున్న దుర్యోధనుడి శరీరాన ఎనిమిది నిశితబాణాలు నాటాడు సాత్యకి. దుర్యోధనుడితో పాటు కర్ణ, కృప, కృతవర్మలు సాత్యకితో పోరారు. ఘోరసమరమైంది.

అప్పుడు దుశ్శాసనుడు భీముడితో తలపడ్డాడు. భీముడు మహోత్సాహంతో దుశ్శాసనుణ్ణి చూసి “నాకు ఇలాటి అవకాశం ఇచ్చి ఆ బ్రహ్మ ఇన్నాళ్లకి దయచూపించాడు. ఆ సభలో నీకున్న బాకీ అంతా వడ్డీతో సహా తీర్చేస్తారా తమ్ముడా” అంటే “సభలోనే కాదు, లక్క యింట్లో చిచ్చు పెట్టటం, నీ అన్న మామ చేతిలో జూదంలో ఓడటంతో మీరంతా అడవుల్లో తిరగటం, చివరికి విరాటుడి కొలువులో దీనంగా బతకటం ఇవన్నీ జగమెరిగిన సత్యాలే. ఐనా యుద్ధానికొచ్చి వృథామాటలెందుకు?” అన్నాడు దుశ్శాసనుడు. భీముడు మూడు భల్లాల్తో అతని కేతనాన్ని, వింటిని, సారథిని నరికి ఒక నారసాన్ని అతని మొహాన నాటాడు. దుశ్శాసనుడు తగ్గకుండా రథం తనే నడుపుకుంటూ ఇంకో విల్లు తీసుకుని పన్నెండమ్ములు భీముడికి నాటాడు. అంతతో ఊరుకోకుండా భీముడి విల్లు విరిచి ఆరమ్ములు సారథికి గుచ్చి ముప్పై బాణాలు భీముడి శరీరానికి కొట్టాడు. భీముడు మరోవిల్లు తీసుకుని ఏభై నిశితాస్త్రాలు దుశ్శాసనుడి ఒంటికి గుచ్చితే అతను భల్లాల్తో గుర్రాల్ని చంపాడు.

విరథుడై ఒక భీకరమైన గద తీసుకుని కిందికి దూకాడు భీముడు. దుశ్శాసనుడి గుర్రాల్ని మోది చంపాడు. భుజబలంతో నీ కొడుకు రథాన్ని ఒక్క తోపున పడేశాడు. ఈలోగా దుశ్శాసనుడొక గట్టి తోమరాన్ని తీసుకుని లాఘవంగా కిందికి దూకి తప్పించుకున్నాడు. ఆ తోమరంతో భీముడి వక్షాన మోదాడతను. పదమూడేళ్లు పడ్డపాట్లు కళ్లముందు కదుల్తుంటే భీముడు వీరావేశంతో గదని అతని మీద విసిరాడు. దాంతో దుశ్శాసనుడు నెత్తురు పారుతుండగా నేలబడ్డాడు. భీముడతని మీద లంఘించి మెడ తొక్కి పట్టి “నువ్వప్పుడు సభలో అన్న మాటలు చాలక ఇప్పుడు నువ్వేమంటావో విందామని వచ్చా, ఏమంటావో అను, వింటా” అని మన సేన వంక చుట్టూ చూస్తే దావాగ్ని వెంటబడితే పరిగెత్తే జంతువుల్లాగా పరిగెత్తారందరూ. నీ సైన్యంలో సమర్థులైన వాళ్లు కూడ ఏమీ చెయ్యటానికి చేతులు రాక అవాక్కులై చూస్తూ నిలబడిపోయారు.

భీముడు దుశ్శాసనుణ్ణి పట్టి పైకెత్తి గిరగిర తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తన్ని మోకాళ్లతో పొడిచి మొహాన్న పిడిగుద్దులు గుద్ది మెడ తొక్కిపట్టి భీభత్సంగా కుమ్మి “ఇప్పుడు నీ రక్తం తాగబోతున్నా, నీ దిక్కున్న వాళ్లని పిలువ్, ఎవడన్నా ఒచ్చి నిన్ను రక్షిస్తాడేమో” అని కత్తి దూసి అతని మొహం మీద ఝళిపించి ఉగ్రనరసింహుడు రాక్షసుణ్ణి చంపినట్టు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఎగజిమ్ముతున్న రక్తం దోసిటపట్టి తాగి మొహానికి, ఒంటికి పూసుకుని లేచి చుట్టూ చూశాడు. “తల్లిపాల కన్నా, రకరకాల తేనెల కన్నా, ఖండచక్కెర పాల కన్నా రుచిగా వుందీ రక్తం” అని అరిచి చెప్తుంటే సైన్యాలు భయపడి పరిగెత్తినయ్, కొందరు ఆయుధాలు పారేసి పారుతుంటే మరికొందరు మహాభీతితో మూర్ఛపోయారు. ఒక చేత్తో దుశ్శాసనుడి కాలు పట్టుకుని లేపి చుట్టూ తిప్పుతూ “నేను చేస్తానన్న పనుల్లో ఒకటిప్పుడు పూర్తయింది. ఇక దుర్యోధనుణ్ణి పడేసి తన్నే పని ఒక్కటి మిగిలుంది” అని అతను అరిచి చెప్తుంటే కర్ణుడాదిగా అందరూ బొమ్మల్లా చూస్తూ నిలబడిపోయారు. భీతితో సకలేంద్రియాలు వాళ్ల వశం తప్పినయ్. అర్జునుడు మాత్రం భీముడు ప్రతిజ్ఞ తీర్చకుండా ఎవరన్నా అడ్డుపడతారా అని జాగ్రత్తగా అందర్నీ గమనిస్తూ అలా ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో తృప్తి చెందాడు. ఇంతలో నీ కొడుకులు కవచి, నిషంగి, పాశి, దండధారుడు, ధనుర్గ్రహుడు, నలోలుపుడు, సహుడు, షండుడు, వాతవేగుడు, సువర్చసుడు కలిసి భీముడి మీద అనేక బాణాలేస్తూ కమ్ముకున్నారు. ఐతే పదిభల్లాల్తో అతనా పదిమందినీ చంపాడు.

ఇదంతా చూస్తూ కర్ణుడు వెలవెలబోతూ నిలబడ్డాడు తప్ప ఏమీ చెయ్యలేదు. శల్యుడతనితో “భీముడలా దుశ్శాసనుడి రొమ్ము రక్తం తాగుతుంటే చేతలుడిగిపోయి నిలబడ్డారందరూ. నువ్వు సేనాపతివి, అందర్నీ కూడగట్టి యుద్ధం చేయించటం నీపని. నీకొడుకు వృషసేనుడొక్కడే తేరుకుని పాండవుల మీదికెళ్తున్నాడు. అర్జునుణ్ణి ఢీకొనేపని నీది కదా?” అంటే తెలివి తెచ్చుకుని కర్ణుడు సమరోన్ముఖుడయ్యాడు.

వృషసేనుడు భీముడి మీదికి దూకితే నకులుడడ్డుపడి అతని కేతనం, గొడుగు, విల్లు ఖండించాడు. వృషసేనుడు మరో విల్లు తీసుకుని నకులుడి రథాన్ని, గుర్రాల్ని కూల్చాడు. వాలు, పలక తీసుకుని నకులుడు కిందికి దూకి చుట్టుపక్కలున్న భటుల్ని మట్టుబెట్టాడు. వృషసేనుడు పలక ముక్కలు చేసి కత్తిని నరికి నకులుడికి నారసాలు నాటాడు. దాంతో ధృష్టద్యుమ్నుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, శిఖండి, జనమేజయుడు, సాత్యకి, ద్రౌపదేయులు వృషసేనుణ్ణి చుట్టుముడితే మనవైపు నుంచి కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, శకుని, అతని సోదరులు వెళ్లి వాళ్లతో తలపడ్డారు.

కళింగ గజసేనలు వచ్చి మన వాళ్లని చిక్కుపరిస్తే కృతవర్మ, సుయోధనుడు, శకుని వాటినెదిరించి భీభత్సంగా పీనుగుపెంటలు చేశారు. భీముడు, ఇతర శత్రురథికులు ఆ ముగ్గుర్నీ ఢీకొన్నారు. రణం దారుణం ఐంది. కర్ణుడి వెనక భాగాన గజసైన్యం మీద యుద్ధం చేస్తున్న నకులుడి కొడుకు శతానీకుడి మీద వృషసేనుడు అమ్ములవాన కురిసి ఒక భల్లంతో అతని సారథిని చంపాడు. అదిచూసి భీమార్జునులు వృషసేనుడితో తలపడ్డారు. వృషసేనుడా ముగ్గుర్నీ మూడేసి అమ్ముల్తో కొట్టి ఏడు బాణాలు నకులుడికి గుచ్చి కృష్ణుడి మీద పన్నెండు సాయకాలు వేశాడు. అర్జునుడు వేగంగా మిగిలిన వాళ్లని దాటి వృషసేనుడితో ఎదురుగా తలపడితే వృషసేనుడతని వీపున పది వాడితూపులు గుచ్చి కృష్ణుణ్ణి తొమ్మిది బాణాల్తో కొట్టాడు. క్రోధంతో ముడిబడ్డ కనుబొమల్తో సరభసంగా అర్జునుడతని విల్లు విరిచి బాహువులు నొంచి ఒక క్రూరభల్లంతో తల నరికాడు. అక్కడే వున్న కర్ణుడు శోకవ్యాకులుడై కన్నీళ్లు ధారగా కారుతుంటే అర్జునుడికి ఎదురుగా నిలబడి యుద్ధానికి పిలిచాడతన్ని.

అలా ఇద్దరూ ఎదురుగా నిలబడి యుద్ధం ఆరంభిస్తే మిగిలిన వాళ్లంతా ఆపేసి ఆసక్తిగా వాళ్లనే చూస్తూ నిలబడ్డారు. ఆకాశంలో సుర, పితృ, విద్యాధర, సిద్ధ గణాలు, ఇంద్ర, బ్రహ్మ, మహాశివులు కూడ ఆ యుద్ధం చూడటానికి వచ్చి నిలిచారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మకి నమస్కరించి “నరనారాయణులకి అపజయం లేదని ఇదివరకే చెప్పావు, కనక ఇప్పుడీ యుద్ధంలో అర్జునుడే గెలుస్తాడని నిశ్చయించు. కర్ణుడు పుణ్యలోకాలు పొందుతాడు, ఇంతకాలం ఎన్నో కష్టాలు పడ్డ అర్జునుడు కొంతకాలం రాజ్యసుఖాలు అనుభవిస్తాడు” అని కోరాడు. “వీళ్ల జయాపజయాలు మనం నిశ్చయించటం ఎందుకు?” అని బ్రహ్మ సందేహిస్తే శివుడు “దాన్లో తప్పేం వుంది? ఇప్పుడే నిర్ణయిద్దాం, లోకహితార్థం పుట్టిన ఈ మునుల్ని ఇతరులు ధిక్కరించటం లోకహితం కాదు. కాబట్టి నరనారాయణులకి గెలుపు తథ్యం” అని చెప్తే అందుకు బ్రహ్మ కూడ అంగీకరించాడు. ఇంద్రుడా విషయాన్ని అక్కడున్న మునులకి చెప్పి “మీరు కూడ అర్జునుడి విజయాన్నే కోరండి” అంటే వాళ్లూ అందుకొప్పుకున్నారు. దేవతలు దివ్యదుందుభులు మోగించి పుష్పవృష్టి కురిపించారు.

కృష్ణార్జునులు, కర్ణశల్యులు శంఖాలు పూరించారు. సైన్యమంతా నిశ్శబ్దంగా నిలబడింది.

ముందుగా అర్జునుడి కపికేతనం, కర్ణుడి హస్తికేతనం యుద్ధం చేసుకున్నయ్. కపికేతనం గెలిచింది. తరవాత కృష్ణ శల్యులు, కర్ణార్జునులు తీక్షణాలైన చూపుల్తో ఒకర్నొకరు ఢీకొన్నారు. కృష్ణార్జునుల బలం, కర్ణశల్యుల దుర్బలత్వం తేటతెల్లమయినయ్. కర్ణుడు శల్యుడితో “అర్జునుడు నన్ను చంపితే నువ్వేం చేస్తావ్?” అంటే “కృష్ణార్జునులిద్దర్నీ నా బాహుబలంతో ఓడిస్తా” అన్నాడు శల్యుడు. అదే ప్రశ్న అర్జునుడు కృష్ణుణ్ణడిగితే “సూర్యుడు రాలనీ భూమి పగలనీ మేరువే ఒరగనీ కర్ణుడి చేతిలో నువ్వు ఓడేది జరగదు. విధి వక్రించి అక్కడిదాకా వస్తే కౌరవసేన నంతట్నీ నాశనం చేసి ధర్మరాజుకి పట్టం కడతా” అన్నాడు కృష్ణుడు. దానికి అర్జునుడు కూడ “నవ్వులాటకి అన్నా గాని ఈ కర్ణ శల్యుల్ని చంపటం నాకో లెక్కా? ఇవాళ నువ్వు సంతోషవార్తని ద్రౌపదికి, ధర్మరాజుకి చెప్పటం నిశ్చయం” అని బదులిచ్చాడు.

పాండవ సైన్యాలన్నీ అర్జునుడి వెనకా, పక్కలా నిలబడినయ్. అలాగే మన సైన్యాలు కర్ణుడి వెనకా, పక్కలా నిలబడినయ్. కర్ణార్జునులు యుద్ధానికి సిద్ధమౌతున్నారు. అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికెళ్లి అతని చేతిని తట్టి ఇలా అన్నాడు “భీష్మ ద్రోణులిద్దరూ యుద్ధంలో అర్జునుడి అస్త్రాలకి పడ్డారు. కర్ణుడు వాళ్లని మించినవాడు కాడు. నేను అర్జునుణ్ణి ఆపుతా, నువ్వు కర్ణుణ్ణి నిలుపు. ధర్మరాజుతో సంధి చేసుకో. మిగిలిన పాండవులు అతని మాట దాటరు. కృష్ణుడు కూడ దార్లోకి వస్తాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణే రాజుని చేస్తాడు, పాండురాజు రాజ్యాన్ని పాండవులు పంచుకుంటారు. బతికుంటే సుఖం, చస్తే ఏమొస్తుంది? ఇప్పుటికైనా సంధి చేసుకోకపోతే ముప్పు తప్పదు. నేనూ కృపుడూ అవధ్యులం కనక నీకు రాజ్యం తెచ్చిపెడతామనుకోకు” అని బోధించాడు. దుర్యోధనుడికది నచ్చలేదు “భీముడు దుశ్శాసనుణ్ణి చంపి ఇక తన రెండో ప్రతిజ్ఞ నెరవేరుస్తానని సిద్ధంగా వుంటే ఇప్పుడా సంధి? ఐనా కర్ణుడు అర్జునుణ్ణి చంపటం ఖాయం, ఈ విషయాలెందుకు?” అన్నాడు.

కర్ణార్జునులు తలపడ్డారు. “అర్జునా, నీ ముందు కర్ణుడెంత? వాణ్ణి భల్లాల్తో కొట్టు, అస్త్రాల్తో నరుకు” అని పాంచాల బలాలు అర్జునుణ్ణి రెచ్చగొడుతుంటే “ఇంకా ఆలస్యం ఎందుకు, చంపు అర్జునుణ్ణి. దాంతో పాండవులు యుద్ధం మానేసి అడవులకి పోతారు, రారాజు ఏకచ్ఛత్రంగా పాలిస్తాడు” అని మనవాళ్లు కర్ణుణ్ణి ప్రోత్సహించారు. పొద్దు వాలుతున్నది. ఐనా ఇద్దరు వీరులూ కాలాంతకుల్లా యుద్ధం సాగించారు. ఒకరినొకరు బాణవర్షంలో ముంచెత్తారు.

అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అగ్నిజ్వాలలు కక్కుతూ ఆ మహాస్త్రం ఆకాశానికెగిసింది. కర్ణుడు ఏమాత్రం అనుమానం లేకుండా వారుణాస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. ఫల్గుణుడు మేఘాస్త్రం వేస్తే అంతా అంధకారమయమైంది. అనిలాస్త్రంతో కర్ణుడా చీకటిని మాయం చేశాడు. భక్తితో మంత్రించి ఇంద్రాస్త్రం వేశాడు అర్జునుడు. మన సైన్యం హాహాకారాలు చేసింది. కర్ణుడు అనేక బాణాల్ని అభిమంత్రించి వేసి దాన్ని శక్తిహీనంగా చేసి అర్జునుడి శరీరాన కొన్ని బాణాలు నాటాడు. పక్కనే ఉన్న భీముడు కోపంతో అర్జునుణ్ణి చూసి “వాడు నీ ఎదుటికొచ్చి నిలబడటమే కాకుండా నీ అస్త్రాలకి బదులిచ్చి నిన్ను గాయపరుస్తున్నాడు. ఇంద్రుడు నివ్వెరబోయి చూస్తుంటే ఖాండవం దహనం చేయించావే, అది గుర్తుకు తెచ్చుకో. వీణ్ణి త్వరగా చంపు. నీ ప్రతిజ్ఞ మూలాన గాని లేకపోతే నేనిప్పుడే నా గదతో వీడికి కపాలమోక్షం కలిగిస్తా” అన్నాడు. కృష్ణుడు కూడ “ఇలా నీ దివ్యాస్త్రాలు కొరగాకుండా పోవటం చూస్తూ మన సైన్యాలు ఏమనుకుంటాయో ఆలోచించావా? కావాలంటే నా చక్రం ఇస్తా, తీసుకుని వాణ్ణి చంపు” అన్నాడు.

నవ్వి అర్జునుడు నిష్టగా బ్రహ్మాస్త్రాన్ని సంధించి వేశాడు. ఐతే కర్ణుడూ అదే అస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. చేసి మూడేసి క్రూరాస్త్రాల్తో అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి కొడితే అర్జునుడు తొమ్మిదేసి బాణాల్తో కర్ణుడికి, శల్యుడికి నాటాడు. అర్జునుడు కర్ణుడి అల్లెతాటిని తెంచి అస్త్రాల్తో కొడితే కర్ణుడు తనూ అదే పని చేశాడు. ఇలా ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుంటే అర్జునుడు కర్ణుడి కవచం చీల్చి బాణాలు గుచ్చితే అతను బాధపడుతూనే యుద్ధం సాగించాడు. అర్జునుడు కర్ణుణ్ణి, అతని చుట్టూ వున్నవాళ్లని శరపరంపరలో ముంచితే కర్ణుడి చక్రరక్షకులు, ఇతర సహాయకులు అందరూ చూస్తున్నారన్న ధ్యాస కూడ లేకుండా పారిపోయారు.

గాయాల్నుంచి కారుతున్న రక్తాన్ని లెక్కచెయ్యకుండా కర్ణుడు పోరుతున్నాడు. గాండీవి పటిష్టమైన బాణాల్తో అతని శరీరాన్ని కప్పేస్తున్నాడు. ఐనా పళ్లబిగువున ఒళ్లుదాచుకోకుండా శ్రమిస్తున్నాడు కర్ణుడు.

అతను అలిసిపోతున్నాడని గుర్తించి దుర్యోధనుడు మన సేనల్ని కేకేసి అర్జునుడి మీదికి పురిగొల్పాడు. ఐతే అవతలి వాళ్లెవరూ యుద్ధం చెయ్యనప్పుడు అలా వెళ్లటం ధర్మం కాదు గనక మన సైన్యంలో భటులు హడావుడి చేసినా దొరలెవరూ కదల్లేదు. దుర్యోధనుడు భారమంతా కర్ణుడి మీదే వేసి ఊరికే చూస్తున్నారని వాళ్ల మీద రుసరుసలాడి అర్జునుడి మీదికి తరలిస్తే అనుమానంగానే అతని మీదికి కమ్ముకున్నారు వాళ్లు. ఐతే అర్జునుడు అమ్ములవాన కురిపిస్తే వెనక్కి పరిగెత్తారందరూ. అర్జునుడి ముందున్న యుద్ధస్థలాన్ని ఖాళీగా ఉంచటం ఓడిపోయినట్టు ఒప్పుకోవటంతో సమానం కనక కర్ణుడొక్కడే మళ్లీ అర్జునుడితో తలపడ్డాడు. ఇద్దరూ దివ్యాస్త్రాల్తో తీవ్రంగా పోరాడారు. అలిసిపోతున్నా పట్టువదలకుండా ఒకరినొకరు గాయపరుచుకోవటానికి అన్ని విధాలుగానూ ప్రయత్నించారు.

తక్షకుడి కొడుకు, తక్షకుడి సోదరుడు ఐరావంతుడి పోషణలో పెరిగిన వాడు, అశ్వసేనుడనే నాగకుమారుడు సర్పముఖాస్త్రంగా కర్ణుడి దగ్గర ఎంతకాలంగానో పూజలందుకుంటూ వున్నాడు. రోషావేశంతో ఆ అస్త్రాన్ని బయటికి తీశాడు కర్ణుడు. అగ్నిజ్వాలలు ఆకాశానికి పాకుతుంటే పాండవసైన్యాలు హాహాకారాలు చేస్తుంటే దాన్ని తన వింటికి తొడిగి అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. ఐతే ఆ గురి సరిగ్గా కంఠానికి కాకుండా కొంచెం పైకి వున్నట్టు గమనించాడు శల్యుడు. అది నెపం పెట్టుకుని కర్ణుడి గురి చెదరగొట్టటానికి “నువ్వు సరిగా గురిపెట్టలేదు, ఇంకోసారి చక్కగా చూసుకుని మళ్లీ గురిపెట్టుకో” అని ఉచితసలహా ఇచ్చాడు కర్ణుడికి. కర్ణుడికి ఒళ్లు మండిపోయింది.”నాకు చెప్పేంత గొప్ప విలుకాడివా నువ్వు? పైగా ఒకే బాణాన్ని రెండుసార్లు తొడిగితే చూసేవాళ్లు నవ్విపోతారు” అని అతన్ని విదిలించి “అర్జునా ఈ దెబ్బతో నీ చావు తథ్యం” అని అరిచి ఆ అస్త్రాన్ని ఒదిలాడు. ప్రచండంగా మండుతూ దూసుకువస్తున్న ఆ నాగాస్త్రం దిశని గమనించి కృష్ణుడు వెంటనే రథాన్ని ఐదంగుళాలు కిందికి తొక్కాడు. ఆ శరం క్షణక్షణం అమితవేగాన్ని పుంజుకుంటూ వచ్చి రమణీయరత్నచ్ఛటల్తో వెలిగే అర్జున కిరీటాన్ని హరించి నేలపడేసింది. చూసేవాళ్లంతా అవాక్కులయారు. అర్జునుడి అతిశయం సన్నగిల్లింది. దిక్పాలకులకైనా భేదించటం అసాధ్యమైన ఆ కిరీటి కిరీటం కర్ణుడి బాణానికి బలయ్యింది. ఇంద్రుడెంతో నిష్టగా తపస్సు చేస్తే పరమశివుడతనికి ప్రీతితో ఇచ్చిన కిరీటం అది. సముద్రంలో దాగిన నివాతకవచులనే రాక్షసులు ఇంద్రుడికి అజేయులైతే అర్జునుడు వెళ్లి వాళ్లని హతమార్చినప్పుడు ఆనందంతో అతనికి ఇంద్రుడిచ్చాడు దాన్ని. అలాటి కిరీటం భగ్గున మండుతూ నేలపాలు కావటం అర్జునుడికి తలవంపైంది.

కిరీటం కోల్పోయిన అర్జునుడి తెల్లజుట్టుతలకి ఒక పాగా గట్టిగా చుట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడతను. ఐతే అతని కిరీటాన్ని హరించిన నాగం తిరిగి అతని ప్రాణాల్ని తియ్యటానికి బయల్దేరింది. కృష్ణుడది గుర్తించి అర్జునుణ్ణి హెచ్చరించాడు. “ఎక్కడిదీ పాము, ఇలా ఎందుకు వెంటపడుతుంది?” అని అర్జునుడడిగితే “మర్చిపోయావా, ఖాండవదహన సమయంలో తన తల్లిని రక్షించుకుని బయటికి తీసుకుపోవటానికి వీడు ప్రయత్నిస్తే నువ్వు బాణం వేశావ్, వాడి తల్లి చనిపోయింది. ఆ పగ తీర్చుకోవటానికి వచ్చిన అశ్వసేనుడు వీడు, మొదటిసారి నిన్ను చంపలేకపోయానని తనంతట తనే నీ మీదికొస్తున్నాడు” అని కృష్ణుడు చెప్పాడు. ఆరు పదునైన భల్లాల్తో ఆ నాగాస్త్రాన్ని సంహరించాడు అర్జునుడు.
తర్వాత కర్ణుడి వైపుకి తిరిగి పది పన్నెండు బాణాలేసి ఒక ఉగ్రనారసాన్ని అతని శరీరాన నాటితే అది కర్ణుడి శరీరాన్ని చీల్చుకుని బయటికి వచ్చింది. దండంతో కొట్టిన పాములా ఉగ్రమూర్తి అయాడు కర్ణుడు. నాగాస్త్రానికి అర్జునుడు చావకపోవటానికి ఆశ్చర్యపోతూనే పన్నెండు వాలాల్తో కృష్ణుణ్ణి కొట్టి తొంభై తొమ్మిది బాణాల్తో అర్జునుణ్ణి గుచ్చాడు. ఇంకొన్ని బాణాల్తో అర్జునుడి వక్షాన్ని కొట్టి కర్ణుడు ఆకాశం అదిరేలా అరిచి అట్టహాసం చేశాడు.

అర్జునుడు వీరావేశంతో గట్టి భల్లాలు వేసి కర్ణుడి కవచాన్ని ముక్కలు చేసి అతని కిరీటాన్ని విరిచి కుండలాల్ని కత్తిరించాడు. తలనుంచి, చెవులనుంచి నెత్తురు కాలవలు కారుతున్నా లెక్కచెయ్యకుండా స్థిరుడై నిలబడి సాయకపరంపరలు ఫల్గుణుడి మీదికి పంపాడు కర్ణుడు. అర్జునుడు వాటిని నరికి నాలుగు వందల బాణాల్తో కర్ణుడి శరీరమంతా రక్తసిక్తం చేశాడు. అంతటితో ఆగకుండా పదునుపెట్టిన గోవుదూడల పళ్లున్న అనేక బాణాల్ని వడివడిగా వేసి సారథిని, గుర్రాల్ని, కేతనాన్ని కప్పేశాడు. గాయాలు శరీరమంతా నిండినా వెనక్కి తగ్గకుండా కర్ణుడు బాణపరంపరలు సారిస్తూ అర్జునుడి శరాల్ని విరుస్తూ చూసేవాళ్లకి విభ్రాంతి కలిగేట్టు రణం కొనసాగిస్తున్నాడు.

పరశురాముడిచ్చిన భీషణమైన భార్గవాస్త్రం కర్ణుడికి కనిపించలేదప్పుడు. అంతలో రథం చక్రం ఒకటి భూమిలో కుంగింది. అలా పరశురామ శాపం, బ్రాహ్మణ శాపం ఒకేసారి తగలటంతో కర్ణుడు బిత్తరపోయాడు. “ధర్మాన్ని రక్షించే వాళ్లని ధర్మం రక్షిస్తుందంటారు. ఆ మాట అబద్ధమని తేలిపోయింది. నావంటి ధర్మపరుడికి ఇప్పుడిలా జరగటం ధర్మమా?” అని ధర్మాన్ని తిట్టిపోశాడు. నాగాస్త్రానికి అర్జునుడు చావలేదనే బాధ కూడ దానికి తోడైంది. విషాదంతో ఇంకా శాపనార్థాలు పెట్టాడు. ఐతే ఒకవంక అర్జునుడి బాణాలు వచ్చి పడుతూనే వున్నయ్ గనక వాటిని ఎదుర్కుంటూ కృష్ణార్జునుల్ని తన బాణాల్తో బాధిస్తూ రణం కొనసాగిస్తున్నాడు.

అర్జునుడు ఆరు విశిఖాల్ని కర్ణుడి ఒంట్లోంచి దూసుకుపోయేట్టు వేస్తే కర్ణుడతని మీద బ్రహ్మాస్త్రం వేశాడు. అర్జునుడు బదులుగా ఇంద్రాస్త్రం వేశాడు. ఐతే బ్రహ్మాస్త్రం ఇంద్రాస్త్రాన్ని నిర్వీర్యం చేసింది. అర్జునుడు విషణ్ణుడయాడు. కృష్ణుడతన్ని ఓదారుస్తూ “కర్ణుడి అస్త్రం ముందు నీది వృథా ఐంది, పర్లేదు మరోటి వెయ్యి” అంటే అర్జునుడూ బ్రహ్మాస్త్రం వేసి దాన్ని ఉపసంహరించాడు.

అర్జునుడి విల్లుతాడు ఊడేట్టు దృఢంగా ఒక బాణం వేశాడు కర్ణుడు. అర్జునుడు త్రుటిలో దాన్ని మళ్లీ అమర్చుకుని కర్ణుడి మీద బాణాలేశాడు. కర్ణుడు వాటిని దార్లోనే తుంచి మరికొన్ని బాణాల్తో అర్జునుణ్ణి కొట్టాడు. కృష్ణుడు కల్పించుకుని “కర్ణుడు నిన్ను కొట్టేవాడా? నీ శరలాఘవం చూపించి వాణ్ణి అంతం చెయ్యి” అని ప్రోత్సహించాడు. ఇంతలో కర్ణుడు మరొక నాగాస్త్రాన్ని రోషంగా మంత్రించి వింటికి తొడిగి వెయ్యబోయేంతలో అదివరకు కుంగిన రథచక్రం అతనికి బాణం వేసే అవకాశం ఇవ్వనంతగా ఇంకా లోపలికి దిగబడింది. రోషవిషాదాల్తో కర్ణుడికి కన్నీళ్లుబికినయ్. రథం దిగి అర్జునుడి వైపుకి తిరిగి “రథచక్రం బాగా లోతుగా దిగబడింది గనక దాన్నెత్తబోతున్నా. ఈలోగా నువ్వు నామీద బాణాలెయ్యకు. రణకోవిదుడివైన నీకు తెలియని ధర్మం కాదు, ఐనా చెప్తున్నా. నీకూ కృష్ణుడికీ భయపడి ఏ మాత్రం కాదు” అన్నాడతను.

దానికి కృష్ణుడు మండిపడ్డాడు. “ఏమిటీ, ఇవాళ హఠాత్తుగా నీకు ధర్మం గుర్తొచ్చిందా? నీ గర్వం, దురభిమానం ఏమై పోయినయ్? పరమధర్మపరులైన పాండవులకి జయం, ధర్మహీనులైన కౌరవులకి చావు తప్పవు. వాళ్లంతా నిద్రలో వున్నప్పుడు లక్క ఇంటికి నిప్పు పెట్టారే, కపటజూదంలో ధర్మరాజు సంపదనంతా దోచుకున్నది చాలక పతివ్రత ద్రౌపదిని నిండుసభలోకీడ్చి పరాభవించారే, వాళ్లు అడవుల్లో వున్నా చంపటానికని ఘోషయాత్ర మిష పెట్టుకుని పోయారే, బాలుడు అభిమన్యుణ్ణి మహారథులు మీరంతా కలిసి చంపారే, వీటన్నిటికీ ముఖ్య కారణం నువ్వు” అని కర్ణుణ్ణి దెప్పిపొడుస్తుంటే ఒక్కో మాటకే అర్జునుడి క్రోధం ఆకాశాన్నంట సాగింది.

ఐనా అతను వేస్తున్న బాణాల్ని వారిస్తూ కర్ణుడు అవకాశం దొరికినప్పుడల్లా అతని శరీరానికి గాయాలు చేస్తూ నొప్పిస్తుంటే ఒక నిశితభల్లంతో కర్ణుడి కేతనాన్ని మధ్యకి విరిచాడు పార్థుడు. అది అందరి యశో బల దర్పాలకి జరిగిన అవమానంగా భావించి మనవాళ్లందరూ హాహాకారాలు చేశారు. క్రూరనారాచాల్ని కృష్ణార్జునుల మీద కురిసి కుంగిన రథచక్రాన్ని పైకెత్తటానికి పూనుకున్నాడు కర్ణుడు.

ఎంతో ప్రయాస మీద చుట్టూ వున్న భూమితో సహా ఆరంగుళాలు పైకి లేచింది చక్రం. అలా రథం కొంత కుదుటపడటంతో రథం ఎక్కి అంతకుముందు వెయ్యటానికి పూనుకున్న నాగాస్త్రాన్ని మళ్లీ సంధించబోయాడు. ఐతే చక్రం మళ్లీ యథాతథంగా కుంగిపోయింది. దాన్నెత్తటానికి కిందికి దూకాడు కర్ణుడు.

కృష్ణుడు మహోత్సాహంగా ప్రోత్సహిస్తుంటే అర్జునుడు అంజలికాకారంలో వున్న భీకరమైన ఒక అస్త్రాన్ని వింటికి తొడిగి “నేనే గనక తపసులో, దానంలో, గురుజనభక్తిలో నియమం తప్పని వాడినైతే ఈ అస్త్రం కర్ణుడి తల తెంచుతుంది” అని తాటిని ఆసాంతం లాగి వదిలాడు. ఆ అస్త్రకాంతికి రోదసీకుహరం అంతా నిండిపోయింది. ఇరువైపుల సైన్యాలు మూర్ఛలో మునిగినయ్. మిరుమిట్లు గొలిపే వెలుగులు విరజిమ్ముతూ ఆ దివ్యాస్త్రం కర్ణుడి శిరస్సు ఖండించింది. అతని సుందరశరీరం నేల మీద పడింది.

అందరూ కళ్లు తెరిచి చూసేసరికి అతని శరీరాన్నుంచి ఒక అద్భుత తేజం బయటికొచ్చి సూర్యబింబంలో కలిసిపోయింది.

అప్పటివరకు కుంగి వున్న రథచక్రం ఎప్పటిలా చక్కగా భూమి మీద నిలబడింది.

పాంచాల సైన్యాలు తూర్యనాదాల మధ్య సంతోషంతో అరిచినయ్. పాండవ సేనలూ ఆనందంతో ఉప్పొంగినయ్.

మృతుడైన రాధేయుణ్ణి చేతుల్తో అంటుకున్నందుకు స్నానం చెయ్యబోతున్నాడేమో అన్నట్టు సూర్యుడు పశ్చిమసముద్రంలోకి మునిగాడు.

రథికుణ్ణి, కేతనాన్ని కోల్పోయి మోడైన రథాన్ని వెనక్కి తిప్పాడు శల్యుడు.

బలీయమైన ఆబోతుని పులి చంపితే పరిగెత్తే పశువుల్లా కౌరవ సేనలు వెనక్కి తిరిగి పరిగెత్తినయ్.

సంతోషంతో దిక్కులు పిక్కటిల్లేట్టు అరిచాడు భీముడు.

దుర్యోధనుడు దుఃఖంలో మునిగి కన్నీళ్లు కార్చాడు.

కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాలు పూరించారు.

మన సైన్యాలు యుద్ధం కొనసాగించేట్టు కనిపించక అప్పటికిక యుద్ధం చాలించి మర్నాడు తర్వాత విషయాలు చూసుకుందామని శల్యుడు నీకొడుక్కి సలహా చెప్పాడు. అలాగే చేశాడు దుర్యోధనుడు. అందరూ కర్ణుణ్ణి తల్చుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ శిబిరాలకి కదిలారు.

కృష్ణార్జునులు శరీరాలకు గుచ్చుకున్న బాణాల్ని పెరికించి ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ తమ సైన్యాల్ని మళ్లించి శిబిరాలకి బయల్దేరారు. పాంచాల దొరలు ముందుగా ధర్మరాజుని కలిసి దీవనలు పొందారు. కృష్ణార్జునులు, భీమ నకుల సహదేవులు ధర్మరాజుకి నమస్కరించి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కృష్ణుడు ధర్మరాజుతో “నీ కోపమే ఆ కర్ణుణ్ణి చంపింది గాని లేకుంటే ముల్లోకాలొక్కటైనా అతన్ని చంపటం సాధ్యమా? కర్ణుడి చావుతో నీకింక అడ్డు లేదు. యుద్ధం ముగిసిపోతున్నట్టే” అని అభినందించాడు. “నీకు భక్తులైన మాకు జయం కలగటంలో ఆశ్చర్యం ఏముంది? అంతా నీ మహిమేగా! ఈరోజు నేను ఎలాటి విచారాలూ లేకుండా హాయిగా నిద్రపోతా” అని ధర్మజుడతన్ని పొగిడాడు.

తర్వాత పోలికలనికి వెళ్లి చూడాలని వుందని ధర్మరాజు అడిగితే కృష్ణుడందుకు అనుమతించాడు. అనేకమంది కాగడాలు పట్టుకుని దారి చూపుతుంటే బంధుమిత్రుల్తో రథాలెక్కి బయల్దేరాడు ధర్మరాజు. కర్ణుడు, అతని కొడుకుల శవాల్ని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్లీ కొత్తజన్మ ఎత్తినట్టు భావించుకున్నాడు. కలతలు తీరి యిక సుఖాలు దాపుల్లో వున్నాయని నిట్టూర్చాడు. కృష్ణుడి మహత్యాన్ని, అర్జునుడి కోదండవిద్యావిలాసాన్ని పదే పదే చెప్పుకుంటూ అందరూ వెనక్కి తిరిగారు.

అప్పటివరకు విన్న జనమేజయుడు ఉత్సాహంగా ఆ తర్వాత యుద్ధక్రమం ఎలా జరిగిందో చెప్పమని వైశంపాయన ఋషిని వేడుకున్నాడు. అతనిలా చెప్పాడు: కర్ణుడి చావుతో బిక్కచచ్చి మిగిలిన కొద్ది కౌరవసైన్యంతో దుర్యోధనుడు శిబిరానికి తిరిగెళ్లాడు. శ్రేయోభిలాషుల ఓదార్పుతో తేరుకుని, శల్యుణ్ణి సేనాపతిగా చేసుకుని మర్నాటి యుద్ధానికి సిద్ధమయాడు. భీకర సమరం జరిగాక మధ్యాన్నానికి ధర్మరాజు చేతిలో శల్యుడు మరణించాడు. మిగిలిన కౌరవసైన్యం కూడ దాదాపు సమూలంగా నాశనమైంది. దాంతో దుర్యోధనుడి ధైర్యం నీరుగారింది. ఒంటరిగా రణరంగం విడిచి వెళ్లి ఒక మడుగులో దాక్కున్నాడు. ఆ విషయం తెలిసిన పాండవులు, వాళ్ల బలాలు వెళ్లి చుట్టుముట్టి పిలిస్తే బయటికొచ్చి భీముడితో చాలాసేపు గదాయుద్ధం చేసి అతని దెబ్బకి తొడలు విరిగి పడ్డాడు. ఆ తర్వాత రాత్రివేళ అశ్వత్థామ కృపకృతవర్మలు తనకి తోడుగా పాండవ శిబిరాల్లో జొరబడి అక్కడ ఉన్న వాళ్లందర్నీ హతమార్చాడు.

తిరిగి తెల్లవారాక సంజయుడు కురుక్షేత్రాన్నుంచి హస్తినకి వచ్చాడు.

అతని కళ్లనుంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నయ్. కాళ్లు తడబడుతున్నయ్. ఆపలేని దుఃఖంతో, చేతులు పైకెత్తి ఏడుస్తూ ఎవరు కనిపించినా “రారాజిక మనకి లేడు, అందరికీ ఆనందం కలిగించిన వాడు చివరికి అన్యాయానికి బలయ్యాడు”అని ఆక్రోశిస్తూ నడిచి నడిచి ధృతరాష్ట్రుడి మందిరంలోకి వెళ్లాడు. లోపలి కొలువులో ధృతరాష్ట్రుణ్ణి చూశాడు. అతని చుట్టూ గాంధారి, కోడళ్లు, విదురుడు వున్నారు. అందరూ దీనంగా యుద్ధవార్తలు తలుచుకుని దుఃఖిస్తున్నారు. సంజయుడు బిగ్గరగా ఏడుస్తూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి తనెవరో చెప్పుకుని నమస్కరించి ఎలుగు రాచిన గొంతుతో “మహారాజా, శల్యుడు మరణించాడు, శకుని పరలోకాలకి పోయాడు, ఉలూకుడు అంతరించాడు. సంశప్తకులంతా యముడికి అతిథులయ్యారు. కాంభోజులు, యవనులు, పర్వతీయులు, మ్లేచ్ఛులు, అంతా గతించారు. నాలుగు దిక్కుల రాజులూ శవాలై పడ్డారు. నీ కొడుకులు, కర్ణుడి కొడుకులు నిష్క్రమించారు. భీముడి ప్రతిజ్ఞ తీరి రారాజు తొడలు విరిగి దుమ్మూ ధూళిలో కలిశాడు. వాళ్లవైపు ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమౌజుడు, యుధామన్యుడు మొదలైన పాంచాలురంతా పరలోకాలకి పోయారు. మత్స్య, ప్రభద్రక బలాలన్నీ మట్టిగలిసినయ్. నీ మనవలు ప్రతివింధ్యుడు మొదలైన ద్రౌపదేయులైదుగురూ అస్తమించారు. పాండవసైన్యంలో ఏనుగులు, గుర్రాలు, భటులు ఒక్కరు మిగల్లేదు. కౌరవ శిబిరాల్లో గాని పాండవ శిబిరాల్లో గాని మగపురుగన్నది మచ్చుకైనా లేదు. మనవైపు అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ – ఈ ముగ్గురే ప్రాణాల్తో వున్నారు. వాళ్లవైపు ఐదుగురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, నీకొడుకు యుయుత్సుడు – ఈ ఎనిమిది మంది మాత్రం మిగిలారు. నీ కొడుకు కోసం పదకొండక్షౌహిణులు, అతన్ని చంపటానికి ఏడక్షౌహిణులు – మొత్తం పద్దెనిమిదక్షౌహిణుల సేనలు యుద్ధభూమికి బలయినయ్” అని చెప్పేసరికి ధృతరాష్ట్రుడు మూర్ఛపడ్డాడు. విదురుడు వివశుడై కిందపడ్డాడు. గాంధారి, మిగిలిన స్త్రీలు నేలమీద పడి ఏడ్చారు. చుట్టూ వున్న చుట్టాలు మొహాల్లో కళంతా పోయి నిశ్చేష్టులై నిలబడ్డారు.

సంజయుడు అనేక ప్రయత్నాల్తో అందర్నీ తెలివిలోకి తెచ్చాడు. ధృతరాష్ట్రుడికి శరీరమంతా ఒణుకొచ్చింది. నాలిక పిడచగట్టుకుపోయింది. అతిప్రయత్నం మీద విదురుడి వంకకి తిరిగి “కొడుకులంతా పోయారు, దిక్కూమొక్కూ లేనివాణ్ణయాను, తమ్ముడా నాకూ మీ వదినకీ ఇంక నువ్వేరా దిక్కు”అని బావురుమన్నాడు. మళ్లీ మూర్ఛలో మునిగాడు. చల్లటి నీళ్లు చల్లి, విసనకర్రల్తో విసిరి అతన్ని సేదదీర్చారు. కడవలో చిక్కిన మహాసర్పంలా బుసలుకొట్టాడు ధృతరాష్ట్రుడు. శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. అక్కడ వున్న వాళ్లంతా గొల్లుమన్నారు. కాసేపటికి కోలుకుని విదురుడితో “నాయనా, వదిన్ని, కోడళ్లని, చుట్టాల్ని వాళ్ల వాళ్ల నివాసాలకి పంపు”అని చెప్తే అతను ఒక్కొక్కర్ని ఓదార్చి తగిన వాహనాలు ఏర్పాటుచేసి ఇళ్లకి పంపించాడు. అందరూ భోరుభోరున ఏడుస్తూ అక్కణ్ణుంచి కదిలారు.

ధృతరాష్ట్రుడు ఉసూరుమంటూ కూర్చున్నాడు. “ఇంక ఇప్పుడేమిటి గతి” అని వాపోయాడు. సంజయుణ్ణి చూసి “కొడుకులంతా కాటికిపోయారు కాని పాండవులైదుగురూ చెక్కుచెదరకుండా వున్నారంటే నా మనసు భగ్గున మండుతున్నది. ఇన్నాళ్లూ వాళ్ల మాటలు వినటమే కాని కొడుకుల్ని కంటితో చూసుకున్నది లేదు. ఇప్పుడిక ఆ మాటలు కూడ కరువైనయ్. భక్తితో కొలుచుకునే పెద్దకొడుకు లేడు. యుద్ధం మాట వచ్చినప్పుడు ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ మనవైపున్నారు, నాకు పాండవులొక లెక్కా అన్నాడు. కర్ణుడొక్కడు చాలు వాళ్లందర్నీ కట్టగట్టి మట్టుబెట్టటానికన్నాడు. వాళ్లంతా కాక బాహ్లికుడు, సోమదత్తుడు, భగదత్తుడు, శకుని, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, సైంధవుడు, విందానువిందులు – ఇంతమంది మనవైపున్నారు, గెలుపు తథ్యం అన్నాడు. నేనూ నిజమే అనుకున్నా. చివరికి పాండవులు మిగిలారు, మనవాళ్లంతా మడిశారు. భీష్ముడు సామాన్యుడా? వీరసింహుడు. అంత మహాత్ముణ్ణి నక్కలాటి శిఖండిని అడ్డుపెట్టుకుని జయించాడు అర్జునుడు. యోధాగ్రేసరుడు ద్రోణాచార్యుడికి ఎందుకూ కొరగాని వాడి చేతిలో చావొచ్చిపడింది. వీరవిక్రముడు సైంధవుడు అనవసరంగా బలయ్యాడు. మహావీరులైన బాహ్లిక సోమదత్తుల్ని శత్రువులు అవలీలగా చంపారు. విధినేమనుకోవచ్చు? ఏనుగంతవాడు భూరిశ్రవుడు. ఎదురన్నది లేనివాడు భగదత్తుడు. ఇద్దరూ దూదిపింజల్లా ఎగిరిపోయారు.

శత్రుభయంకరుడు కర్ణుడు. ఐనా శత్రువుల్లో ఒక్కణ్ణి కూడ చంపలేకపోయాడు. లోకాలన్నీ చెప్పుకునే భుజవిక్రమం శల్యుడిది. ఏం సాధించింది? ఇంతమంది మహానుభావుల్నీ శత్రువులు తేలిగ్గా చంపేశారు. పాండవుల్ని చంపటానికి తనూ తన తమ్ముళ్లూ చాలనుకున్నాడు, ఆ తమ్ముళ్లందర్నీ ఊచకోత కోశారు, తనని తొడలు విరిచి కింద పడేశారు.

అంతా ఐపోయింది. నాకు మిగిలింది అడవులకి పోయి ఆకులూ అలములూ తినటం. ఇక్కడే వుంటే ఆ భీముడు రోజూ నన్ను సూటిపోటి మాటల్తో చంపుతాడు. దుర్యోధనుడి గురించి, దుశ్శాసనుడి గురించి పదేపదే చెప్పి నన్ను దెప్పిపొడుస్తాడు. నా బతుకు నిత్య చావౌతుంది. దుర్యోధనుడు మూర్ఖుడు, వీడివల్ల రాజలోకం అంతటికీ కీడు మూడుతుందని ఇదివరకే విదురుడు చెప్పాడు. బుర్రతక్కువ వాళ్లు అతని మాట వినలేదు. దైవం నన్ను కూడ వాళ్ల మాటలే వినేట్టు చేసింది. దానికి ఫలితం ఇప్పుడనుభవిస్తున్నా. ఏం అనుకుని ఏం లాభం?

కర్ణుడి చావు తర్వాత యుద్ధం ఎలా జరిగిందో చెప్పు. ఎవర్ని మనబలాలకి సేనాధిపతిగా నియమించారు? అర్జునుణ్ణెదుర్కుని అతనెలా నిలబడ్డాడు? అంతా వివరంగా చెప్పు నాకు”అని సంజయుణ్ణడిగాడు ధృతరాష్ట్రుడు.

సంజయుడు చివరిరోజు యుద్ధక్రమాన్ని వివరించటం ప్రారంభించాడు.

కర్ణుడు, అతనితో పాటు అనేకమంది శూరులు, రాజులు, చతురంగబలాలు సమసినయ్. మనసేనలు బాగా సన్నగిల్లినయ్. ఆ రోజు కలిగిన ఓటమిని తల్చుకుంటూ బాధగా వెనక్కితిరిగి శిబిరాలకేసి కదిలాడు దుర్యోధనుడు. మందిరానికి వెళ్లకుండా బయటనే ఒక విశాల స్థలంలో బంధుమిత్రుల్తో కొలువుదీరాడు. అప్పుడు కృపాచార్యుడతనితో ఇలా అన్నాడు: “యుద్ధం రాజధర్మం, అది నువ్వు ఆచరిస్తున్నావ్, మంచిపనే. ఐతే నేను చెప్పే మాటలు కూడ విను. నచ్చితే ఆచరించు, కాదంటే మాను, నీ ఇష్టం.

యుద్ధం మొదలై పదిహేడు రోజులైంది. మనవైపు మహామహులు ఎందరో మరణించారు. మన సైన్యం అలిసిపోయి వుంది. అటువైపు కృష్ణుడి రక్షణలో ముఖ్యులంతా క్షేమంగా వున్నారు. అర్జునుడు అడ్డూ ఆపూ లేకుండా మనసేనల్ని రణభూమికి బలిస్తున్నాడు. ద్రోణుడు, కర్ణుడు మిగిలిన మహారథులం అంతా రక్షిస్తున్న సైంధవుణ్ణి అతను అవలీలగా చంపాడు, మానవమాత్రులకి సాధ్యమయ్యే పనేనా అది? అతని బలిమితో వాళ్ల సైన్యం చీకూచింతా లేకుండా వుంది. ఇప్పుడు మిగిలున్న మనసైన్యాన్ని ఊచకోత కొయ్యటం అతనికి సులువు.

బలంగా వున్నప్పుడు యుద్ధం, బలం తగ్గినప్పుడు సంధి సరైన మార్గాలని పెద్దలు చెప్పారు. మనకిది సంధి సమయం. ఆత్మవినాశనం ఘోరపాపం. బతికుంటే అన్ని రకాల శుభాలూ పొందొచ్చు. అవసరమైంది చేసి తన్ని తను రక్షించుకోవాలి ముందు.

సంధి చేసుకో. ధర్మరాజు ఎలాగూ ధృతరాష్ట్రుడికీ, నీకూ రాజ్యభాగాలిస్తాడు. కృష్ణుడు కూడ కాదనడు. వాళ్లిద్దరి మాట మిగిలిన పాండవులు జవదాటరు. నీ మంచి కోరే చెప్తున్నా, నా ప్రాణాలు కాచుకోవటానికి కాదు.”

అంతా విని దుర్యోధనుడొక పెద్ద నిట్టూర్పు విడిచాడు. కళ్లు మూసుకుని కొంతసేపు ఆలోచించాడు. అతని వైపు తిరిగి “నువ్వు చెప్పిందంతా నా మంచి కోసమే. కాని అది నాకు హితం కాదు. ఎందుకంటే, ఇంతగడిచాక ఇప్పుడు సంధి అంటే భీముడు నా మీద తన ప్రతిజ్ఞ చెల్లిస్తాడని భయపడి అలా చేశాననుకుంటారంతా. పైగా ఇంతకాలం ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించి సామంతులందరి సేవలందుకున్న నేను ఎవడో దయ తలిచి ఇచ్చే రాజ్యం తీసుకోవాలా? ఇప్పటికి మించిపోయిందేమీ లేదు, మనందరం కలిసి విక్రమిస్తే పాండవుల్ని ఓడించటం కష్టం కాదు. నీ మాట వినలేదని బాధ వద్దు. రణమే మనకి శరణం” అని తెగేసి చెప్పాడు దుర్యోధనుడు. చుట్టూ వున్న రాజులంతా అతన్ని మెచ్చుకుని మరుసటి రోజు యుద్ధంలో పరాక్రమించటానికి ఉవ్విళ్లూరారు.

అప్పుడు కృప, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, శల్యులు కూడబలుక్కుని దుర్యోధనుడితో “ఈ రాత్రి మనం ఇక్కడుండటం మంచిది కాదు, కర్ణుడు లేడని ధైర్యంతో శత్రువులు రాత్రికి రాత్రి మన మీద పడొచ్చు. చతురంగబలాల్తో దూరంగా వెళ్లి వుండి వాళ్లు ఊహించని దిక్కునుంచి రేపు దాడి చేద్దాం, అలా మనం విజయం పొందొచ్చు”అని చెప్తే అతను అలాగేనన్నాడు. అక్కడికి రెండామడల దూరంలో సరస్వతీ నది ఒడ్డున బలాల్ని మోహరించి, అంతా నదిలో హాయిగా స్నానాలు చేసి వెంట తెచ్చుకున్న ఆహారాలు భోంచేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సేనాపతిగా ఒకరిని నియమించమని దుర్యోధనుణ్ణి కోరారు. అతను తన మిత్రుడైన అశ్వత్థామని సలహా అడిగితే అతను “యుద్ధనైపుణ్యంలో, శౌర్యంలో, భుజబలంలో, పరాక్రమంలో, ధైర్యసంపదలో శల్యుడు తనకి తనే సాటి. తన మేనల్లుళ్లు పాండవుల్ని కాదని నీతో చేరిన అతని కన్న నీకు దగ్గరి వాళ్లు ఇంకెవరు? శల్యుణ్ణి సర్వసేనాపతిని చెయ్యి”అని చెప్పాడు. దుర్యోధనుడు సింహాసనం దిగి వినయంగా శల్యుడితో “నిజమైన స్నేహితుడివి నువ్వు. నా సైన్యానికి అధిపతివై మమ్మల్నందర్నీ గట్టెక్కించు, పాండవుల్ని మట్టుబెట్టు. నువ్వు ముందుంటే మేమంతా నీ వెనక నడుస్తాం” అని ప్రార్థించాడు. శల్యుడు ఎంతగానో ఆనందించాడు. “నేను నీ వైపుకి వచ్చినప్పుడే నా ధనం, ప్రాణం, సైన్యం నీ వశమైనయ్, ఇప్పుడింతగా ప్రాధేయపడాలా? తప్పకుండా నీ సైన్యాన్ని రక్షిస్తా. నాకు కృష్ణార్జునులు ఓ లెక్కకాదు. నా బాణపరంపరల్తో పాండవబలాల్ని చీకాకు పరిచి భీష్మ, ద్రోణ, కర్ణుల్ని మించి విక్రమిస్తా. దేవతలంతా నన్ను పొగిడేట్టు చేస్తా, చూడు” అని చెప్తే నీకొడుకు సుప్రీతుడయాడు.

కనక కలశాల్లో సరస్వతీ జలాల్ని తెప్పించి తను, తగిన రాజులు సేనామధ్యంలో అతన్ని అభిషేకించి సైన్యాధిపత్య పట్టాన్ని అతనికి కట్టారు. మంగళ తూర్య రావాలు చెలరేగినయ్. సైనికులు సింహనాదాలు చేశారు. తర్వాత అందరూ సుఖనిద్ర చేశారు.

అక్కడ ధర్మరాజు కూడ ఆరుబయట కొలువు దీరి మనవార్తల కోసం వెళ్లిన గూఢచారుల కోసం ఎదురుచూస్తూ వినోదాల్లో పొద్దుపుచ్చుతున్నాడు. ఇంతలో మనవైపు నుంచి మంగళ వాద్యాల ధ్వనులు వినిపించినయ్, వాళ్ల చారులు వెళ్లి ఇక్కడ జరిగిన విశేషాలు వినిపించారు. ధర్మరాజు కర్తవ్యమేమిటని కృష్ణుణ్ణడిగాడు. కృష్ణుడతనితో “శల్యుడు సామాన్యుడు కాడు, భీష్మ, ద్రోణ, కర్ణుల్లో ఎవరికీ తక్కువ కాడు. దానికి తోడు ఇప్పుడు తనకి కలిగిన గౌరవంతో ఇంకా ఉత్సాహంగా యుద్ధంలో విజృంభిస్తాడు రేపు. అతన్ని చంపే వాళ్లు మనసైన్యంలో ఒక్కరే వున్నారు, అది నువ్వే. మేనమామనే దయాదాక్షిణ్యాలు వదిలి రేపే అతన్ని నువ్వు చంపాలి. దాంతో దుర్యోధనుడు పూర్తిగా నీరుగారిపోతాడు. యుద్ధం పరిసమాప్తమౌతుంది” అని కార్యం బోధించాడు. ధర్మరాజు “నీమాటకి నేను ఎదురుచెప్తానా?”అని అందర్నీ విడుదులకి వెళ్లమని చెప్పి తనూ వెళ్లి హాయిగా నిద్రపోయాడు.

అప్పుడు నేనిక్కడికి తిరిగొచ్చి నీకు కర్ణుడి మరణం వరకు జరిగిన యుద్ధక్రమం చెప్పి వెళ్లా. అలా నే వెళ్లేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతున్నది.

పద్దెనిమిదవ రోజు

ఉదయాన్నే దుర్యోధనుడు చిన్ననాయకుల్ని పిలిచి దొరల్నందర్నీ వాళ్ల వాళ్ల సైన్యాల్ని యుద్ధసన్నద్ధుల్ని చెయ్యమని చెప్పటానికి పంపాడు. అందరూ లేచి ఉత్సాహంగా సాధన సామాగ్రిని సిద్ధం చేశారు. ఆ రోజు యుద్ధంలో ఎవరూ ఒక్కరుగా ఒక శత్రువుతో తలపడకూడదని, మూకుమ్మడిగా శత్రువుల మీద పడాలని నిశ్చయించుకుని అలా ఒకరికొకరు మాటిచ్చుకున్నారు. శల్యుడు ముందుగా కదిలాడు, అతని వెనక మన సైన్యం నడిచింది. సర్వతోభద్ర వ్యూహం పన్నాడు శల్యుడు. ముందుగా శల్యుడు. అతని చుట్టూ కర్ణుడి కొడుకులు, వాళ్ల పరివారాలు. కుడిపక్క శక, యవన సైన్యాల్తో కృపుడు. ఎడమపక్క త్రిగర్త సైన్యాల్తో కృతవర్మ. వెనక కాంభోజ సైన్యాల్తో అశ్వత్థామ. మధ్యలో కురువీరుల రక్షణలో దుర్యోధనుడు. అతని ముందు ఏనుగుదండుతో శకుని.

పాండవులు మూడు వ్యూహాలు పన్నారు. ఒకదానికి ధృష్టద్యుమ్నుడు, మరోదానికి సాత్యకి, మూడోదానికి శిఖండి నాయకులు.

అప్పటికి మనవైపు పదకొండువేల రథాలు, పదివేల ఏడొందల ఏనుగులు, రెండులక్షల గుర్రాలు, మూడుకోట్ల పదాతులు వున్నారు. వాళ్లవైపు ఆరువేల రథాలు, మూడువేల ఏనుగులు, లక్ష గుర్రాలు, కోటి కాల్బలం మిగిలినయ్.

భేరీనాదాలు దిక్కులు నిండినయ్. సూర్యుడు ఉదయాద్రి మీదెక్కి యుద్ధం చూట్టానికి సిద్ధమయాడు.

పోరు ఘోరంగా ప్రారంభమైంది. భీమార్జునులు మన బలాల మీద విరుచుకుపడ్డారు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి ధర్మరాజుతో కలిసి మరోచోట మన వ్యూహాన్ని భేదించారు. సాత్యకి, కవలలు కూడ ఇంకోచోట దాడి చేశారు. హాహాకారాల్తో మన బలాలు పరిగెత్తినయ్. అదిచూసి శల్యుడు రథాన్ని ధర్మరాజు మీదికి పోనివ్వమని సారథికి చెప్పాడు. వెళ్లి పాండవసేనల్ని తాకాడు. అతన్ని చూసి పారిపోతున్న మన సైన్యాలు నిలబడినయ్, శత్రువుల్తో తలపడినయ్.

ఒకవైపు నకులుడు, కర్ణుడి కొడుకు చిత్రసేనుడు యుద్ధం చేస్తున్నారు. చిత్రసేనుడొక గట్టి బాణంతో నకులుడి ధనుస్సు విరిచాడు. మూడు బాణాల్ని అతని నొసట నాటాడు. గుర్రాల్ని, కేతనాన్ని కూల్చాడు. సారథిని చంపాడు. అతను వాలూ పలకా తీసుకుని వస్తే అనేక భల్లాలతని మీద విసిరాడు. ఐతే నకులుడా భల్లాలు తగలకుండా పలకని అడ్డం పెట్టుకుని వేగంగా అతని రథమ్మీదికి లంఘించి క్షణంలో కత్తితో తల నరికాడు.

అదిచూసి వాడి సోదరులు సత్యసేనుడు, సుశర్ముడు శోకరోషాల్తో నకులుడి మీదికి దూకారు. అతనింకో రథం ఎక్కి పెద్దవిల్లు తీసుకుని వాళ్లనెదుర్కున్నాడు. వాళ్లిద్దరూ భల్లాల్తో అతని రథాన్ని నుగ్గుచెయ్యసాగారు. నకులుడు చిరునవ్వుతో సత్యసేనుడి గుర్రాల్ని కూల్చి విల్లు నరికితే అతను వేగంగా మరో రథం ఎక్కి ఇంకో విల్లు తీసుకుంటే నకులుడతన్ని రెండు పదునైన బాణాల్తో పొడిచాడు. సుశర్ముడు నకులుడి విల్లు విరిచాడు. నకులుడు మరో విల్లు తీసుకుని సత్యసేనుడి విల్లు మళ్లీ విరిచాడు. సత్యసేనుడు మరోవింటితో నకులుడి మీద బాణవృష్టి కురిపిస్తే అతను వాటిని వారించి నూరుబాణాల్తో అతని వక్షాన్ని కొట్టి రెండు బాణాలతని తమ్ముని ఒంటికి నాటాడు.

కోపంతో అన్నదమ్ములు నకులుడి సారథిని చంపి, విల్లు విరిచి రథాన్ని ముక్కలు చేశారు. ఇలా విరథుడైన నకులుడు ధీరుడై నిలబడి ఒక ఘోరమైన శక్తితో సత్యసేనుణ్ణి చంపాడు. అన్న చావు చూసి భయం, క్రోధం కలిగినయ్ సుశర్ముడికి. ఇంతలో భీముడి కొడుకు శ్రుతసోముడొచ్చి నకులుణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు. ఇద్దరూ కలిసి సుశర్ముడి మీద బాణపరంపరలు కురిపించారు. సుశర్ముడు నకులుడికి మూడు బాణాలు నాటి ఇరవై బాణాల్తో శ్రుతసోముడి వక్షాన్ని కొడితే ఒక అర్థచంద్ర బాణంతో వాడి తల నరికాడు నకులుడు. నకులుడి విజృంభణ చూసి మనసేనలు వెనక్కి పరిగెత్తినయ్. శల్యుడు ఆగండాగండని పిలిచి నిలవరించి సైన్యాన్ని కూడగట్టాడు. కృష్ణుడి రక్షణలో పాండవులు భయం లేకుండా పోరుతుంటే వాళ్ల అండ చూసుకుని ధృష్టద్యుమ్నుడు మొదలైన రథికులు మన బలగాల్ని చించిచెండాడారు. వాళ్లందరి ప్రతాపానికి కౌరవసేనలు చెల్లాచెదురౌతుంటే శల్యుడొక్కడే ధర్మరాజు వైపుకి దూసుకుపోయి అతని పక్కల కాపు కాస్తున్న భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదేయులు, నకుల సహదేవుల్ని తలా పదిబాణాల్తో తలపడ్డాడు. పాంచాల, ప్రభద్రక బలాలతన్ని చుట్టుముట్టినయ్. శల్యుడు సాహసంగా ఆ బలగాల్ని చిందరవందర చేసి తన బాణపరంపరల్తో పీనుగుపెంటలు చేశాడు. ఎటుచూసినా తనే ఐ బాణవర్షం కురిపించాడు. మనసైన్యాలు ఉప్పొంగినయ్, పాంచాలసైన్యాలు అల్లకల్లోలమై ధర్మరాజు వెనక్కి పరిగెత్తినయ్. ధర్మరాజు ఆ బలగాల్ని కూడగట్టుకుని శల్యుణ్ణి ఎదుర్కుని బాణవృష్టి కురిస్తే శల్యుడొక క్రూరనారాచంతో ధర్మరాజుని కొట్టాడు, అదతని ఒంట్లోంచి దూసుకువెళ్లింది.

భీముడు, ఇతరులు ధర్మరాజుని దాటుకుని వచ్చి శల్యుణ్ణి తాకారు. ఏడు బాణాల్తో భీముడు, ఐదు శరాల్తో సహదేవుడు, తొమ్మిది బాణాల్తో నకులుడు, ఎన్నో నారసాల్తో ద్రౌపదేయులు శల్యుణ్ణి కొట్టారు. కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, అతని కొడుకు ఉలూకుడు, నీ కొడుకులు శల్యుడికి సాయంగా వచ్చి నిలబడ్డారు. అశ్వత్థామ కూడ వచ్చి వాళ్లని కలుసుకున్నాడు. కృపుడు, ధృష్టద్యుమ్నుడు ఒకరితో ఒకరు తలపడ్డారు. అశ్వత్థామ ఐదుగురు ద్రౌపదేయుల్తో రణం సాగించాడు. శల్యుడు, భీముడు ఒకర్నొకరు ఎదుర్కున్నారు. శల్యుడు భీముడి గుర్రాల్ని నేలకూల్చాడు. భీముడు గదతో కిందికి దిగి కౌరవసైన్యాన్ని మోదటం సాగించాడు. సహదేవుడు శల్యుణ్ణి బాణవర్షంలో ముంచెత్తాడు. శల్యుడతని గుర్రాల్ని కూడ చంపాడు. సహదేవుణ్ణి దాటుకుని ఇతర శత్రు రథికులు శల్యుణ్ణెదుర్కున్నారు. శల్యుడి కొడుకు సహదేవుడి మీద బాణాలు విసిరాడు. సహదేవుడొక కరకు కత్తిని తీసుకుని అతని బాణాల్ని ఖండిస్తూ వేగంగా రథం మీదికురికి అవలీలగా అతని తల నరికి నేలపడేసి ఒక్క గెంతులో మరో రథం మీదికి దూకాడు.

కొడుకు చావుతో కోపోద్రేకాన శల్యుడు పాండవసైన్యాన్ని తన బాణాల్తో చిందరవందర చేశాడు. ధర్మరాజు మీదికి దూకి అతని మీద బాణపరంపరలు కురిపించాడు. అదిచూసి భీముడు అమిత కోపంతో శత్రుభీకరమైన తన ఎనిమిదంచుల గదాదండాన్ని తీసుకుని శల్యుడి గుర్రాల్ని మోదిచంపాడు. శల్యుడొక ఘోరతోమరాన్ని అతని వక్షాన నాటాడు. అలా వక్షాన నాటిన తోమరాన్ని ఎడమచేత్తో పెరికి దాంతోనే శల్యుడి సారథిని పొడిచి చంపాడు భీముడు. అలా విరథుడైనా వీరోద్రేకంతో శల్యుడొక భూరిగదని తీసుకుని చండయుముడిలా కిందికి దిగాడు. అదిచూసి భీముడు కూడ అతనికెదురుగా నడిచాడు. భీముడితో గదాయుద్ధంలో పోటీపడాలంటే శల్యుడికే సాధ్యం, శల్యుడికి తగ్గ వీరుడు భీముడే అని అంతా యుద్ధం మాని వాళ్ల గదాసమర ప్రకారాన్ని చూడటానికి బొమ్మల్లా నిలబడిపోయారు.

ఇద్దరు ఒకర్నొకరు క్రూరంగా చూసుకుంటూ గర్జిస్తూ రంకెలేస్తూ మండలప్రచార గతుల్లో ఒకరికొకరు తీసిపోకుండా తలపడ్డారు. వాళ్ల గదల రాపిడుల్లో నిప్పులెగిసి ఆకాశానికి ఎగురుతున్నయ్. క్షణక్షణానికి పెరుగుతున్న వేగంతో వాళ్ల సమరం భీకరమైంది. ధిక్కారాలు, భూమి కంపించే పదఘట్టనలు మారుమోగుతున్నయ్. శరీరాంగాలు గదల తాకిడికి నెత్తురు చిమ్ముతున్నా లెక్కచెయ్యకుండా పోరు సాగించారు. ఒక్కోసారి ఎనిమిదడుగుల దాకా వెనక్కి వెళ్లి పరిగెత్తుకుని ముందుకు వచ్చి ఒకరినొకరు ఢీకొంటున్నారు. శరీరాలు హూనమౌతుంటే ఆవేశాలు పెరుగుతున్నయ్. చివరికి ఒకరి మెడ మీద మరొకరు మోదుకుని ఇద్దరూ మూర్ఛపడ్డారు. చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. కృపాచార్యుడు పరుగున వచ్చి శల్యుణ్ణి ఆదరంగా ఎత్తుకుని తన రథం మీద ఎక్కించుకున్నాడు, కింద పడ్డా గదని గట్టిగానే పట్టుకుని వున్న అతని శౌర్యానికి విస్తుపోతూ.

ఇంతలో భీముడు తనంత తనే లేచి ఇంకా లేవని శల్యుణ్ణి చూపించి గేలిచేశాడు. అదిచూసి ఊరుకోలేక దుర్యోధనుడు, తన చుట్టూ వున్న సైన్యంతో భీముడి మీదికి నడిస్తే ధర్మరాజు పక్కనున్న చేకితానుడు మొదలైన వాళ్లు పెద్దగా అరుస్తూ భీముణ్ణి దాటివెళ్లి ఆ సైన్యాన్ని తాకారు. దుర్యోధనుడొక పదునైన ఈటెని బలంగా విసిరి చేకితానుడి ప్రాణాల్ని గాల్లో కలిపాడు. దాంతో పాండవులు కోపోద్రేకంగా కౌరవసైన్యం మీదికి ఉరికారు. శల్యుడు ధర్మరాజుని, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుణ్ణి, మూడువేల రథాల త్రిగర్తుల్తో కలిసి అశ్వత్థామ అర్జునుణ్ణి మహోత్సాహంతో ఎదిరించారు. ఆ రభసలో ఒకరికొకరు కనపడనంతగా దుమ్ము రేగింది. వాళ్ల వాళ్ల పేర్లు, బిరుదులు అరిచి చెప్పుకుంటూ సమరం సాగిస్తున్నారు రథికులు. అంతటా “కొట్టండి, పొడవండి” అన్న ధ్వనులే వినపడుతున్నయ్.

శల్యుడు ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజు పద్నాలుగు శరాల్తో శల్యుణ్ణి కొడితే అతనొక పదును బాణాన్ని ధర్మరాజు వక్షాన నాటాడు. దానికి కోపంతో ధర్మరాజు చండసేనుడనే శల్యుడి చక్రరక్షకుణ్ణి చంపి తొమ్మిది నారాచాలు అతని సారథికి గుచ్చాడు. అప్పుడు సాత్యకి, భీముడు చేదిబలాల్తో శల్యుణ్ణి తాకారు. అతను వెనకాడకుండా ఐదు గట్టిబాణాల్తో భీముణ్ణి గాయపరిచాడు, ఇరవై ఏడు అమ్ముల్తో సాత్యకిని బాధించి ఇరవై ఐదుగురు చేదిరథికుల్ని చంపాడు. నకులసహదేవులు వస్తే నిశితసాయకాల్తో వాళ్ల శరీరాలు తూట్లు పొడిచాడు. సహించక ధర్మరాజు అతని మీద బాణపరంపరలు కురిపించి జెండాని విరిస్తే అతను లెక్కచెయ్యకుండా అనేకబాణాల్తో ధర్మరాజుని, పదేసి బాణాల్తో సాత్యకి, భీముడు, నకులసహదేవుల్ని సమాధానపరిచాడు. ఇంకో కేతనాన్ని ఎత్తించి పాండవ వీరులందర్ని తనొక్కడే ముప్పుతిప్పలు పెట్టాడు. వాళ్ల బాణాల దెబ్బలకి అతని శరీరం అంతా రక్తమయమైంది. ఐనా అతని ఉత్సాహం పెరిగిందే తప్ప తగ్గలేదు. ధర్మరాజుకీ అతనికీ ఘోరసమరం జరిగింది. ఐతే శల్యుడి బలమైన పదిబాణాల దెబ్బలకి ధర్మరాజు శోషవచ్చి రథం మీద ఒరిగాడు.

కోపంతో సాత్యకి శల్యుడి మీద బాణవృష్టి కురిపించాడు. శల్యుడొక భల్లంతో అతని విల్లు ముక్కలుచేశాడు. మూడేసి బాణాల్తో నకులుణ్ణి, భీముణ్ణి, సహదేవుణ్ణి కొట్టాడు. ఇంతలో తెలివొచ్చి ధర్మరాజు అతని మీద ఒక ముద్గరం విసిరాడు, సాత్యకి ఒక తోమరాన్ని, భీముడు భల్లాన్ని, నకులుడు శక్తిని, సహదేవుడు గదని ఒకేసారి అతని మీద ప్రయోగించారు. ఐతే శల్యుడు వాటన్నిటినీ బాణాల్తో దార్లోనే విరిచి వాళ్లందరి మీద బాణవర్షం కురిశాడు. శల్యుడి వల్ల తనకి రాజ్యం రాబోతుందని మురిసిపోయాడు దుర్యోధనుడు.

అలా ఎవరినీ లెక్కచెయ్యకుండా అందర్నీ హడలు కొట్టిస్తున్న శల్యుణ్ణి చూసి ధర్మరాజుకి విషాదం కమ్ముకుంది. కృష్ణుడు తన చేతిలో శల్యుడు చస్తాడని చెప్పిన మాట అబద్ధమయ్యేట్టుందనిపించింది.

అశ్వత్థామ అండ చూసుకుని సంశప్తకులు అర్జునుణ్ణి చుట్టుముట్టారు. ఐతే ఆ మహారథికుడు అనేక రకాలైన బాణాల్తో వాళ్లందర్నీ చిందరవందర చేశాడు. ఆ ప్రాంతమంతా రక్తపుమడుగైంది. అశ్వత్థామ అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడతని సూతుణ్ణి, గుర్రాల్ని అవలీలగా చంపాడు. ఇంతలో సురథుడనే పాంచాల రాకుమారుడు అశ్వత్థామ మీదికి తన రథాన్ని తోలిస్తే అతను ఒక్క బాణంతో వాణ్ణి చంపి పడేసి వాడి రథం మీదికి ఎగిరి ఆ రథం మీదనుంచే అర్జునుడితో మళ్లీ తలపడ్డాడు.

తమ్ముల్తో కలిసి దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో పోరాడాడు. కృపుడు శిఖండితో, కృతవర్మ ప్రభద్రకుల్తో శరపరంపరలు కురిపించారు. శల్యుడు ధర్మజ, భీమ, నకుల సహదేవ, సాత్యకుల్తో తనొక్కడే తీవ్రరూపంతో తలపడ్డాడు. వాళ్లందర్నీ బాణాల్లో ముంచెత్తాడు. అతని ప్రతాపానికి మనసేనలు ఉప్పొంగినయ్. సేనలన్నీ ఆ దిక్కుకి పరిగెత్తి శత్రుసైన్యాల్తో ఢీకొన్నయ్. అదిచూసి కృష్ణార్జునులు వాళ్ల సైన్యాన్ని కూడ ఏకముఖంగా అమర్చుకుని మనసేనల్ని తాకారు. అర్జునుడు కృప, కృతవర్మల్ని, సహదేవుడు సౌబలుణ్ణి, ద్రౌపదేయులు కొందరు రాజుల్ని, శిఖండి అశ్వత్థామని, భీముడు దుర్యోధనుణ్ణి, నకులుడి సాయంతో ధర్మరాజు శల్యుణ్ణి ఎదిరించారు. మిగిలిన యోధులు వాళ్లకి తగ్గవాళ్లతో యుద్ధం సాగిస్తున్నారు.

శల్యుడి ప్రతాపాగ్నికి శత్రుసైన్యాలు మిడతల్లా ఆహుతౌతున్నయ్. బాణాలు, భల్లాలు యధేచ్ఛగా కురిపిస్తూ అతను అందర్నీ ముప్పుతిప్పలు పెడుతుంటే రెండువైపుల సైన్యాలు కూడ అతని యుద్ధకౌశలానికి అబ్బురపడినయ్. పాండవబలగాలు ధర్మరాజు వారిస్తున్నా వినకుండా చెల్లాచెదురై పరిగెత్తినయ్. చివరికి ధర్మరాజు తెగించి తనే శల్యుణ్ణి కేకేసి పిలిచి అతనితో తలపడితే అది చూసి వాళ్లసేనలు తిరిగొచ్చి మళ్లీ యుద్ధంలో నిలబడినయ్. తమ్ముల్ని, దొరల్ని దగ్గరికి పిలిచి ధర్మరాజు “మీరు భీష్మ ద్రోణాదుల్ని మీమీ పౌరుషాల్తో ఓడించారు. ఇప్పుడీ శల్యుడి చావు నాచేతిలో వుంది, ఇది తప్పదు. దానికి మార్గం ఇది – నా రథానికి కుడివైపు నకులుడు, సాత్యకి కావలిగా వుంటారు; ధృష్టద్యుమ్నుడు, సహదేవుడు ఎడమపక్క. నా ముందు భీముడు, నా వెనక అర్జునుడు వుంటారు. ఇంత తంతు ఎందుకని అడగొద్దు. ఇవాళ నేనో శల్యుడో తేలిపోవాలి. అతన్ని రక్షించటానికి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, సౌబలుడు, సుయోధనుడు అడ్డం పడొచ్చు, వాళ్ల సంగతి మీరు చూడాలి. నా పరాక్రమం ఏమిటో చూపిస్తా, శల్యుడి చావు చూస్తా” అని చెప్తే అందరూ దానికి ఒప్పుకుని అతని రథం మీద అవసరమైన ఆయుధాలన్నీ చేర్పించి వాళ్ల వాళ్ల స్థానాల్లో సన్నద్ధులై నిలబడ్డారు.

అలా కూడగట్టుకుని వస్తున్న పాండవుల్ని చూసి దుర్యోధనుడు మనసేనల్ని వాళ్ల మీదికి ఉరికించాడు. ధర్మజ శల్యులు పులుల్లా తలపడ్డారు. నీ కొడుకొక అర్థచంద్ర బాణంతో భీముడి కేతనాన్ని నరికాడు. మణికింకిణీనాదంతో ఆ సింహకేతనం నేల రాలింది. అలాగే అతని వింటినీ విరిచాడు దుర్యోధనుడు. మహాకోపంతో భీముడొక ఉగ్రశక్తితో అతని వక్షాన్ని కొడితే నీకొడుకు మూర్ఛపోయి రథం మీద పడ్డాడు. భీముడు మరో వింటిని తీసుకుని అతని సూతుణ్ణి చంపితే గుర్రాలు రథాన్ని లాక్కుని దూరంగా పరిగెత్తినయ్. అదిచూసి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ మనసేన ముందుకు దూకారు. అర్జునుడు వాళ్లతో తలపడ్డాడు. రణం ఘోరమైంది.

మనసేనలు శల్యుణ్ణి దాటివెళ్లి ధర్మరాజుని చుట్టుముట్టినయ్. అతను నిర్భయంగా తన బాణవర్షంతో వాళ్లని వెనక్కి నెట్టాడు. శల్యుడతని మీద శరాలు కురిపిస్తే ధర్మజుడు వాటిని తన బాణాల్తో వమ్ముచేశాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం సాగిస్తున్నారు. ద్రోణశిక్షణలో ధర్మరాజింత విలుకాడయాడా అని అంతా ఆశ్చర్యపోయారు. శల్యుణ్ణి చంపి ధర్మరాజు రాజ్యం సాధిస్తాడా లేక ధర్మరాజునే చంపి శల్యుడు దుర్యోధనుడికి రాజ్యం సంపాయించిపెడతాడా అని అందరూ ఆత్రంగా వాళ్ల యుద్ధాన్ని చూస్తున్నారు. శల్యుడు ధర్మజుడి విల్లు విరిచి అతన్ని వందబాణాల్తో కొట్టాడు. ధర్మరాజు వెంటనే మరో విల్లు తీసుకుని అతని వింటిని విరిచి మూడొందల బాణాల్తో శల్యుణ్ణి కొట్టాడు. అంతటితో ఆగకుండా అతని గుర్రాల్ని, సారథిని వెంటవెంటనే చంపాడు ధర్మరాజు. అలా కదల్లేని రథంతో వున్న శల్యుడికి ఏ అపాయమూ జరక్కుండా అశ్వత్థామ వచ్చి తన రథం మీద ఎక్కించుకున్నాడు.

అదిచూసి ఉత్సాహంతో ధర్మరాజు మనసైన్యం మీద విరుచుకుపడ్డాడు. ఇంతలో శల్యుడు మరో రథం సమకూర్చుకుని వచ్చి మళ్లీ ధర్మజుడితో తలపడ్డాడు. ఆ దగ్గర్లో వున్న సాత్యకి, భీముడు, నకుల సహదేవులూ వచ్చి అతన్నెదుర్కున్నారు. అతను వాళ్లందరి మీద బాణాలు కురిపించాడు. ధర్మరాజుని దాటుకుని తనకి దగ్గరగా వస్తున్న పాండవసైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు.

ధర్మరాజు సాత్యకి, భీమ, నకుల సహదేవుల సాయంతో శల్యుణ్ణెదుర్కున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు బాణాల్తో నొప్పించుకున్నారు, శరీరాలు రక్తసిక్తాలైనయ్. నీ కొడుకు శల్యుడికి సాయంగా మనసైన్యాల్ని తరిమాడు. వాళ్లు భీమాదుల్తో పోరారు. శల్యుడొక బలమైన నారసాన్ని ధర్మరాజు వక్షాన నాటితే అతనొక ఉగ్రనారాచంతో శల్యుణ్ణి కొట్టాడు. శల్యుడు మూర్ఛపడ్డాడు. వెంటనే తేరుకుని ఒక పదునుబాణంతో ధర్మజుణ్ణి కొడితే అతను ఆరుబాణాల్తో శల్యుడి బంగారుకవచాన్ని ముక్కలుచేసి తొమ్మిది వాలుటమ్ముల్తో అతని వక్షాన్ని గాయం చేశాడు. శల్యుడు రెండు క్రూరభల్లాల్తో అతని ధనువు విరిచాడు. అతనింకో ధనుస్సు తీసుకుని శల్యుడికి అనేక బాణాలు గుచ్చాడు. భీముడు అన్నకి తోడుగా బాణాలు ప్రయోగించాడు. శల్యుడికి తోడుగా కృపుడు వచ్చాడు.

ఇంతలో శల్యుడు మరో కవచాన్ని ధరించి ధర్మరాజునెదుర్కున్నాడు. కృపుడు ధర్మరాజు సారథిని చంపితే శల్యుడతని గుర్రాల్ని నేలకూల్చాడు. తన చేతిలో శల్యుడు చస్తాడని కృష్ణుడన్న మాట అబద్ధమౌతుందా అని ధర్మరాజుకి కొంచెం అనుమానం కలిగింది. ఐతే అంతలోనే సంభాళించుకుని కృష్ణుడి మాట తప్పదని కూడబలుక్కుని రణం కొనసాగించాడు. ఐతే అతను వేసిన బాణాలు మెల్లగా కదలటం గమనించాడు శల్యుడు. ధర్మరాజుకి భయం వేసి అలా చేస్తున్నాడని లెక్కేసుకుని ఇంకా విజృంభించాడు. ఇంతలో భీముడతని విల్లు నరికి, రెండుబాణాలతని శరీరాన గుచ్చి, గుర్రాల్ని చంపి, సారథి తల నరికాడు. అతివేగంగా భల్లాలు విరిసి అతని కవచాన్ని నుగ్గుచేసి కిందపడేశాడు.

అలా రథం, విల్లు పోగా కోపోద్రేకంతో కత్తీ డాలూ తీసుకుని కిందికి దూకాడు శల్యుడు. ధర్మరాజు మీదికి లంఘించాడు. ఐతే భీముడతి రౌద్రంగా మధ్యలోనే ఆ వాలూ పలకా ముక్కలు చేశాడు. ఇంతలో సాహసం, నేర్పు వున్న పరిజనాలు పరిగెత్తుకొచ్చి శల్యుడికి కవచం, గద అందించారు. అతను కవచం తొడిగి గదని చిత్రవిచిత్ర గతుల్లో తిప్పుతూ ధర్మరాజు వైపుకి కదిలాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదేయులు, భీముడు, నకుల సహదేవులు అంతా కలిసి అతని మీద బాణవర్షం కురిపిస్తున్నా లెక్కచెయ్యక వాటిని తన గదాదండంతో అడ్డుకుంటూ సాగాడతను.

గుర్రాలు, సారథి లేని రథం మీద ఉన్నాడు ధర్మరాజు. సింహంలా తనవైపుకి కదిలొస్తున్న శల్యుణ్ణి చూశాడు. తను రోజూ గంధపుష్పాల్తో పూజించే మహిమాన్వితమైన శక్తి వంక చూశాడు. కృష్ణుణ్ణి మనసులో ధ్యానించుకున్నాడు. శక్తికి మొక్కాడు. దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. త్రిపురాసుర సంహార సంరంభియైన శూలిలా దాన్ని శల్యుడి వక్షానికి గురిపెట్టాడు. దాని గంటల మోతలు మనసైన్యం చెవులు బద్దలు చేస్తున్నయ్. దాని మణిదండం వెలుగులు వాళ్ల కళ్లకి మిరుమిట్లు గొలుపుతున్నయ్. శల్యుడి విశాల వక్షానికి సూటిగా వెళ్లి తాకిందా ఘోరశక్తి. అతని కవచాన్ని చించి, వక్షాన్ని చీల్చి, శరీరాన్ని దూసుకు వెళ్లి వెనక భూమిలో గుచ్చుకుంది.

శల్యుడి ముక్కులు, చెవులు, కళ్లలోంచి ధారాపాతంగా రక్తం కారసాగింది. రెండు చేతులూ ముందుకి చాచి ఒక పర్వతంలా బోర్లాపడి ప్రాణాలు విడిచాడతను.

అలా ధర్మరాజు చేతిలో, ధర్మయుద్ధంలో మరణించాడు శల్యుడు.

అన్న చావు చూసి శల్యుడి తమ్ముడు వీరావేశంగా ధర్మరాజు మీదికి ఉరికాడు. ధర్మరాజు చిత్రచాపంతో వాడి విల్లుని, కేతువుని తుంచి వెంటనే ఒక భీకరమైన భల్లంతో వాడి తల వయ్యలు చేశాడు. పాండవసైన్యాలు సింహనాదాలు చేసినయ్. వాళ్ల వైపు తూర్యధ్వనులు మోగినయ్. మనసేనలు దిక్కులేక పరిగెత్తినయ్. సాత్యకి వెంటబడి “పోనివ్వకండి, కొట్టండి” అంటూ తరిమాడు.

కృతవర్మ అతనికి అడ్డుపడ్డాడు. ఆ యాదవయోధులిద్దరి మధ్య ఘోరసమరం సాగింది. కృతవర్మ సాత్యకి విల్లు విరిచి పదిబాణాలతని శరీరానికి నాటితే అతను వేగంగా మరో విల్లు తీసుకుని కృతవర్మ గుర్రాల్ని, సారథిని, రథాన్ని నరికితే కృపుడు హడావుడిగా వచ్చి అతన్ని తన రథం మీద తీసుకెళ్లాడు. సాత్యకి ధాటికి మనసేనలు పరిగెత్తుతుంటే నీ కొడుకు ఒక్కడే అడ్డు నిలబడి అతన్నెదిరించాడు. ఇంతలో మరో రథం ఎక్కి కృతవర్మ తిరిగొచ్చాడు. ధర్మరాజు కృతవర్మ గుర్రాల్ని చంపితే అశ్వత్థామ అతన్ని తన రథం మీద దూరంగా తీసుకెళ్లాడు. కృపాచార్యుడు, ధర్మరాజు తలపడ్డారు. నీ కొడుకొక భద్రగజం ఎక్కి మన సైన్యానికి ఉత్సాహం కలిగిస్తూ నిలబడ్డాడు.

శల్యుడి చుట్టాలు దుర్యోధనుణ్ణి దాటుకుని పెద్దరొదతో వెళ్లి పాండవుల్ని చుట్టుముట్టారు. దుర్యోధనుడు వాళ్లని వారించి తన వెనకే వుండమని చెప్పాడు గాని వాళ్లతని మాటలు వినిపించుకోకుండా ముందుకు దూకి ధర్మరాజు మీద దాడి చేశారు. పాండవుల వైపు నుంచి దొరలంతా చతురంగబలాల్ని సమకూర్చుకుని వాళ్లనెదుర్కున్నారు. దూరంగా వుండి చూస్తూ ఊరుకున్న దుర్యోధనుడితో శకుని “ఇలా వాళ్ల మానాన వాళ్లని వదిలేసి ఊరుకోవటం నీకు ఉచితం కాదు. చూసే వాళ్లంతా ఏమనుకుంటారు?” అంటే అతను “ఔనౌను, నేను వాళ్లని వదిలెయ్యను, సాయపడతా” అని తన సైన్యాన్ని పోగుచేసుకుని వాళ్లకి సాయంగా బయల్దేరాడు. ఐతే ఈలోగానే పాండవుల చేతిలో శల్యుడి బంధుగణం అంతా నాశనం ఐంది. అదిచూసి మన సేనలు కాలికి బుద్ధి చెప్పినయ్. దుర్యోధనుడు ఎంతగా పిలుస్తున్నా వినకుండా పారిపోతుంటే అతను తన రథసారథిని పిలిచి “ఇలా ఏనుగు మీద నుంచి సైన్యాన్ని కూడగట్టటం కష్టం, నువ్వు త్వరగా రథాన్ని సిద్ధం చేసుకురా” అంటే అతను వెంటనే వెళ్లి రథాన్ని తీసుకొచ్చాడు.

అదంతా చూస్తున్న పాండవసేన “ఈపూటతో యుద్ధం ముగుస్తుంది, ధర్మరాజుకి రాజ్యం వచ్చేస్తుంది, దుర్యోధనుడి చావు దగ్గర్లోనే వుంది” అని ఆనందించింది. దుర్యోధనుడు తన రథం మీద బయల్దేరి పారిపోతున్న సైన్యానికి అడ్డంగా నిలబడ్డాడు. “ఇలా పారిపోవటం మగతనమా? పోతే మిమ్మల్ని పాండవులు ఒదుల్తారా? ఎక్కడున్నా వెదికి పట్టి చంపుతారు. అప్పుడు యుద్ధం చేసినందుకు ఫలితం కూడ దక్కదు. యుద్ధభూమిలో చస్తే కనీసం సద్గతులైనా వస్తయ్. పైగా పాండవుల బలగం మనకన్నా చిన్నది, వాళ్లంతా అలిసిపోయి వున్నారు. మనం గెలవటానికి ఇదే సరైన అదును” అని అరిచి చెప్పి పిలిస్తే అప్పుడు నిజమేనని మన సేనలు వెనుదిరిగినయ్.

దుర్యోధనుడు ముందుండగా అతని వెనక మన సైన్యం నడిచింది. శత్రుసైన్యాన్ని భీముడు ముందుండి నడిపిస్తున్నాడు. మన పదాతిసేనలతన్ని చుట్టుముట్టినయ్. దాంతో అతను గదాదండాన్ని ధరించి ఘోరాకారంతో రథం దిగి మనసేనల్ని నుగ్గుచేశాడు. అతని ధాటికి ఇరవయ్యొక్క వేల మంది సుభటులు అసువులు పోగొట్టుకున్నారు. పాండవుల మీదికి దూకిన కరి, హయ, రథ బృందాల్ని నాశనం చేసి అర్జునుడు తన చేతుల తీట తీర్చుకున్నాడు. నకుల సహదేవులు, సాత్యకి శకుని మీదికి బాణాలు సారించారు.

సాల్వుడో మదగజం ఎక్కి పాండవసేనలో జొరబడ్డాడు. వాళ్ల రథాల్ని, గుర్రాల్ని, ఏనుగుల గుంపుల్ని దారుణంగా తొక్కించాడు. అతనలా భీభత్సం సృష్టిస్తుంటే ధృష్టద్యుమ్నుడతన్ని ఎదుర్కున్నాడు. సాల్వుడు తన ఏనుగుని అతన్ని తొక్కటానికి ఉసిగొల్పాడు. ధృష్టద్యుమ్నుడు పదును నారాచాల్తో దాని కుంభాన్ని కొడితే అది బాధగా పరిగెత్తింది. అతి ప్రయత్నం మీద ఆ గజాన్ని మళ్లించుకుని మళ్లీ ధృష్టద్యుమ్నుడి మీదికి దూకాడు సాల్వుడు. అతని ఏనుగు ధృష్టద్యుమ్నుడి రథాన్ని తొండంతో పట్టి ఎత్తింది. అతను భయంతో గదని తీసుకుని రథమ్మీంచి కిందికి దూకాడు. సారథి, గుర్రాల్తో సహా అతని రథాన్ని ఆకాశానికెత్తి నేలకేసి కొట్టి నుగ్గు చేసిందా ఏనుగు. పరుగున వచ్చి భీముడు, శిఖండి, సాత్యకి సాల్వుడి మీద బాణవర్షం కురిపించారు. అతను వాళ్లందర్నీ ఒంటరిగా ఎదిర్చి నిలబడ్డాడు.

ధృష్టద్యుమ్నుడింతలో కుదటపడి గదతో పైకెగిరి ఆ ఏనుగు కుంభస్థలాన్ని బలంగా మోదాడు. అది భీషణంగా అరుస్తూ నేలకూలింది. అదే సమయంలో సాత్యకి వెడల్పు మొన వున్న ఒక బాణంతో సాల్వుడి శిరసుని ఖండించాడు. మన సేనలు గగ్గోలు పెట్టినయ్. వాళ్ల మీద విజృంభించి దూకుతున్న సాత్యకిని మళ్లీ కృతవర్మ ఎదుర్కున్నాడు. పెద్దగా అరిచి పిలిచి పారుతున్న మనసేనల్ని నిలబెట్టాడు. ఇద్దరూ తీవ్రంగా యుద్ధం సాగించారు. ఎనిమిది శరాల్తో కృతవర్మని కొట్టాడు సాత్యకి. అతని వింటిని విరిచాడు కృతవర్మ. బలమైన మరో విల్లు తీసుకుని అతని గుర్రాల్ని, సారథిని చంపాడు సాత్యకి. అలా విరథుడై ఒక భయంకరమైన శూలాన్నతని మీద విసిరాడు కృతవర్మ. దాన్ని భల్లంతో ముక్కలు చేశాడు సాత్యకి. సాత్యకి బాణధాటికి చావుకి దగ్గరౌతున్న కృతవర్మని అక్కణ్ణుంచి తప్పించాడు కృపుడు. మనసేనలు విరిగినయ్.

నీ కొడుకొక్కడే పాండవుల్ని తన బాణధారల్లో ముంచెత్తుతున్నాడు. అప్పుడతని యుద్ధం చూస్తున్న నాకు రెండు సైన్యాల్లోనూ అతనికి సమానుల్లేరనిపించింది. పాండవపక్షం దొరలంతా అతనితో తలపడ్డారు. ఐనా ఎవర్నీ లెక్కచెయ్యకుండా అందరికీ అన్ని రూపులై సమరం సాగించాడతను. అదిచూసి ఉత్సాహం తెచ్చుకుని మన సైన్యాలు అతనికి సాయంగా వెళ్లి శత్రువుల్ని ఢీకొన్నయ్.

భీముడు, అశ్వత్థామ ఒకవంక ఒకరికొకరు పోటీగా యుద్ధం చేస్తున్నారు. సౌబలుడు (శకుని) ధర్మరాజు నెదిరించి నాలుగు బాణాల్తో అతని గుర్రాల్ని చంపాడు. సహదేవుడు అన్నని తన రథం మీద ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్లాడు. ధర్మరాజు మరో రథాన్ని సమకూర్చుకుని వేగంగా తిరిగొచ్చి సౌబలుణ్ణి తాకాడు. వాళ్లిద్దరి మధ్యా పోరు ఘోరమైంది. శకుని కొడుకు నకులుడితో, సాత్యకి కృతవర్మతో, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో యుద్ధం సాగించారు. ఇలా అన్నిచోట్లా భయంకరంగా పోరు కొనసాగింది. చివరికి మనమొనలో దొరలు శత్రువుల దెబ్బకి నిలబడలేక వెనక్కి తిరిగితే దుర్యోధనుడు వాళ్లందర్నీ కూడగట్టి శత్రువులమీదికి ఉసిగొలిపితే ధర్మరాజు కోపంగా మూడు బాణాల్తో కృపుడి వింటినారిని తెంచి నాలుగు బాణాల్తో కృతవర్మ గుర్రాల్ని కూల్చితే అశ్వత్థామ అతన్ని తన రథం మీద పక్కకి తీసుకుపోయాడు. దుర్యోధనుడికి మండిపోయింది, ఏడువందల రథాల్ని ధర్మరాజు మీదికి పంపాడు. వాళ్లతన్ని చుట్టుముట్టి బాణాలు కురిపిస్తుంటే శిఖండి మొదలైన యోధులు వచ్చి వాళ్లని చెల్లాచెదురు చేశారు.

అప్పుడు శకుని మన యోధుల్తో “మీరు ధర్మరాజుని వదలకుండా పోరాడుతూండండి, నేను వెనక నుంచి వచ్చి వాళ్లని చంపుతా” అని బయల్దేరాడు. శల్యుడి సైన్యం ముందునుంచి దాడి చేసింది. ఐతే పాండవసేనల ధాటికి ఆగలేక వెనక్కి తగ్గింది. ఇంతలో శకుని పదివేల ఆశ్వికసైన్యంతో శత్రుసైన్యం వెనకభాగాన్నుంచి ముట్టడించాడు. అది చూసి మనసైన్యం ఉత్సాహంగా పోరాడింది. ధర్మరాజు సహదేవుణ్ణి ఐదువేల ఆశ్వికుల్తో, ద్రౌపదేయుల్ని తీసుకుని వెంటనే వెళ్లి శకునిని ఎదిరించమని పంపాడు. సహదేవుడలాగే వెళ్లి శకునితో తలపడ్డాడు. రెండు ఆశ్వికసేనలకీ భీకరరణం జరిగింది. సహదేవుడి ప్రతాపానికి శకుని నాలుగువేల మందిని పోగొట్టుకుని ఆరువేల బలగంతో వెనక్కి తిరగాల్సొచ్చింది. చావగా మిగిలిన మూడువేల బలంతో సహదేవుడు అన్న దగ్గరికి తిరిగి చేరుకున్నాడు.

చుట్టు తిరిగొచ్చి శకుని ధృష్టద్యుమ్నుడి సైన్యం మీద దాడిచేశాడు. ఐతే ధృష్టద్యుమ్నుడా హయసేనని చించిచెండాడాడు. అతని దెబ్బకి ఐదువేల మూడొందల గుర్రాలు చచ్చినయ్. ఐనా శకుని శక్తికొద్దీ పోరాడాడు. చివరికి కేవలం వందమంది ఆశ్వికులు మిగిల్తే వాళ్లతో అక్కణ్ణుంచి పక్కకి తొలిగాడు శకుని.

దుర్యోధనుడి కోసం చూస్తే అతను కనిపించలేదు. ఎటు వెళ్లాడని శకుని చుట్టుపక్కల వాళ్లనడిగితే వాళ్లతనికి దూరంగా ధవళవర్ణ రథాన్ని చూపించి అది దుర్యోధనుడిదని చెప్పారు. అతను వెంటనే అక్కడికి వెళ్లి దుర్యోధనుణ్ణి కలిసి “శత్రువుల గుర్రాల్ని నేను నాశనం చేశా, ఇక రథాల పని పట్టాల్సుంది. రథాలు, ఏనుగులు పోతేగాని కాల్బలాన్ని ఊచకోత కొయ్యలేం, పాండవుల్ని జయించలేం” అని చెప్పాడు. అది విని మన సైన్యం ఆనందించింది. దుర్యోధనుడు ఉత్సాహంగా శత్రువుల మీదికి బయల్దేరాడు.

కృష్ణార్జునులది చూశారు. అర్జునుడు కృష్ణుడితో “ఆ దుర్యోధనుడికి ఎదురుగా మన రథాన్ని వేగంగా పోనివ్వు, ఆ సైన్యం అంతు చూద్దాం. యుద్ధం మొదలైనప్పుడు సముద్రంలా కనపడ్డ వాళ్ల సైన్యం ఇప్పుడు చూశావా చిన్నగుంటలాగా ఉంది? వీళ్ల బుద్ధికి బుద్ధుంటే ఇంత వినాశనాన్ని కొని తెచ్చుకుంటారా? భీష్ముడు పడినప్పుడైనా కళ్లు తెరిచి సంధి మార్గానికొస్తారనుకున్నా. ఆయన కూడ ఎంతగానో చెప్పి చూశాడు. ఆ మాటలు విననప్పుడు గాని నాకర్థం కాలేదు దుర్యోధనాదులు బుద్ధిహీనులని. మరెవరైనా ఐతే భీష్ముడు పడ్డాక పరిస్థితి అర్థం చేసుకోకుండా వుంటారా? మత్తగజంతో సహా సోమదత్తుడు చచ్చినప్పుడు, సైంధవుణ్ణి రక్షించబోయి ఎంతోమంది రాజులు బలైనప్పుడు, ద్రోణాచార్యుడు ప్రాణాలు విడిచినప్పుడు కూడ ఆవగింజంతైనా ఆలోచించలేదే, ఇలాటి మూర్ఖులు కూడ ఉంటారా? దుశ్శాసనుడు మొదలైన అనేకమంది తమ్ముళ్లు పోయారు, కొడుకులు చుట్టాల్తో కలిసి కర్ణుడు కాటికి పోయాడు – ఇవేవీ చూడలేదా ఈ దుర్యోధనుడు? వీడు బతికుండగా ధర్మరాజుకి రాజ్యం రాదని తేలిపోయింది. కనక ఇప్పుడు మన కర్తవ్యం దుర్యోధనుణ్ణి చంపటం” అని వివరించాడు.

అందుకు అంగీకరిస్తూ కృష్ణుడు “ఔను, నేను సంధికి వెళ్లినప్పుడు విదురుడు కూడ, దుర్యోధనుడు బుద్ధిహీనుడు, తన బొందిలో ప్రాణం వుండగా పాండవులకి రాజ్యాన్నివ్వడని చెప్పాడు. నిజానికి వాడు పుట్టినప్పుడే మునులు ఈ పాపాత్ముడి వల్ల క్షత్రియలోకం అంతా నాశనం ఔతుందని జోస్యం చెప్పారు కదా” అన్నాడతనితో. అర్జునుడు “వాళ్ల మాటలే నిజమయినయ్. వీడిప్పటికి అందర్నీ చంపించాడు, ఇక తనూ చస్తే తప్ప ధర్మరాజుకి రాజ్యం రాదు, అది నిశ్చయం. త్వరగా ఆ దిక్కుకి పోదాం పద, ఆ దుర్నీతిపరుడు చూస్తుండగానే వాడి దుర్బలమైన సేనని తుదముట్టిస్తా చూడు” అని కార్చిచ్చు లాగా కౌరవసేనా వనంలోకి ప్రవేశించాడు అర్జునుడు. అతని భీకర బాణాలు మన సేనల్ని కాలుస్తుంటే నిలవలేక కాలికి బుద్ధి చెప్పినయ్. నీ కొడుకొక్కడే స్థిరంగా నిలబడి అందర్నీ పిలిచి కూడగట్టి పాండవబలాల మీదికి ఉసిగొల్పాడు.

ధృష్టద్యుమ్నుడు, శిఖండి, శతానీకుడు వాళ్లనెదుర్కుని శరపరంపరల్లో ముంచెత్తారు. దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి వక్షాన అనేక బాణాలు నాటితే అతను కోపంతో దుర్యోధనుడి గుర్రాల్ని, సారథిని చంపాడు. దుర్యోధనుడు తటాల్న రథం దిగి ఒక గుర్రాన్నెక్కాడు. ఎక్కి పక్కకెళ్లి ఏనుగుల గుంపుల్ని పాండవుల మీదికి పంపాడు. అవి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టినయ్. అర్జునుడు ఘోరనారాచ ధారల్తో వాటిని చెల్లాచెదురు చేస్తుంటే భీముడు తన గదాదండంతో కిందికి దూకి ఏనుగుల తుండాలు తునకలు చేస్తూ కుంభాలు నుజ్జు చేస్తూ వీరవిహారం సాగించాడు. మరోపక్క నుంచి పాండవసైన్యం మీదికి దూకుతున్న ఏనుగుల్ని ఆపటానికి ధర్మజ, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు మొదలైన యోధులు అటు పరిగెత్తారు.

ఇంతలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ రథికుల మధ్య దుర్యోధనుడు కనిపించక యుద్ధంలో మరణించాడేమోనని అనుమానిస్తూ అక్కడున్న వాళ్లనడిగితే కొందరతను శకుని దగ్గర వున్నాడన్నారు, ఇంకొందరు కంగారెందుకు, బతికుంటే తర్వాత కనపడతాడుగా, ఇప్పుడు మనం యుద్ధం చెయ్యటం ముఖ్యం అని శత్రువుల్తో పోరాటంలో మునిగిపోయారు. ఆ ముగ్గురు రథికులు శకుని వున్న చోటికి బయల్దేరారు.

ఇలా రక్షించే వాళ్లెవరూ లేని ఆ సైన్య భాగాన్ని పాంచాల వీరులు చుట్టుముట్టి మట్టుబెట్టారు. అప్పుడు అక్కడే వున్న నేను ధృష్టద్యుమ్నుడికి చిక్కకుండా తప్పించుకున్నా గాని అంతలో నాలుగొందల రథాల్తో అటే వచ్చిన సాత్యకి చేతికి దొరికిపోయా.

ఇంతలో ఏనుగుల్ని మోదటం ముగించి భీముడు కనపడితే నీ కొడుకులు దుర్విషహుడు, దుష్ప్రదర్శనుడు, ఇంకా కొంతమంది కలిసి అతనితో తలపడ్డారు. అతను రథం ఎక్కి భల్లాలు, నారాచాల్తో వాళ్లలో చాలామందిని చంపాడు. అదిచూసి చావగా మిగిలిన నీ బలాలు శోకంతో, క్రోధంతో అతన్ని చుట్టుముట్టినయ్. ఐతే అతను అవలీలగా ఐదొందల రథాల్ని, నూటడెబ్భై ఏనుగుల్ని, ఎనిమిదొందల గుర్రాల్ని పదివేల పదాతుల్ని అప్పటికప్పుడు తన బాణాలకి బలిచేశాడు. మిగిలిన మన బలాలు బిక్కచచ్చి అతని వైపు చూడటానిక్కూడా సాహసించలేకపోయినయ్. నీ కొడుకుల్లో కేవలం దుర్యోధనుడు, సుదర్శనుడు మాత్రం మిగిలారు. అలా అంతమందిని చంపి ఆనందంగా మదాతిరేకంతో భీముడు మల్లచరిస్తే మనవాళ్లంతా నిర్ఘాంతపోయి నిలబడ్డారు తప్ప కాలు కదపలేదు.

కృష్ణుడు అర్జునుడితో “శత్రువులు దాదాపుగా నశించినట్టే. నీ ప్రతాపం వల్ల నీ సోదరులంతా క్షేమంగా వున్నారు. సాత్యకి సంజయుణ్ణి పట్టి తెచ్చాడు. ధృష్టద్యుమ్నుడు ఆరోగ్యంగా వున్నాడు. శత్రుపక్షాన ఇక మిగిలింది ఆ ఎదురుగా కనపడే గుర్రాల దండు. దాని మధ్య బిక్కుబిక్కుమంటూ నివురుగప్పిన నిప్పులా దుర్యోధనుడు, అతనితో ఒక్క తమ్ముడు. ఈ చిన్నసేన పనిపూర్తి చెయ్యటం నీకో లెక్కలోది కాదు. పద, దుర్యోధనుణ్ణి పరలోకాలకి పంపుదువు గాని” అని ప్రోత్సహించాడు. “ఇదీ ఒక సైన్యమేనా? రెండొందల రథాలు, వంద ఏనుగులు, రెండువేల పదాతులు. శకునితో ఐదొందల గుర్రాలు. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ కాపుండి నిలబెడితే వుంది గాని నా బాణాల దెబ్బలు తగులుతుంటే ఎంతసేపుంటుందీ సైన్యం? సగం మంది చస్తే మిగతా సగం వెనక్కి చూడకుండా పారిపోతారు. అప్పుడిక దుర్యోధనుడు బయటపడక తప్పదు. ఎదిరించాడా నా బాణాలకి ఆహుతౌతాడు. ఈ పూటతో ఈ యుద్ధం సమాప్తం కాబోతుంది” అన్నాడు అర్జునుడు ఆవేశంగా.

దుర్యోధనుడి కెదురుగా కదిలింది అర్జునుడి రథం. అది చూసి భీముడు, సహదేవుడు ఆ దిక్కుగా వేగంగా వచ్చారు. వాళ్లనెదిరించటానికి శకుని సిద్ధమయాడు. అందరికీ తీవ్రావేశాలు కమ్ముకున్నయ్. శకుని, సుశర్ముడు అర్జునుణ్ణి ఎదుర్కున్నారు. సుదర్శనుడు భీముడితో, దుర్యోధనుడు సహదేవుడితో తలపడ్డారు. సహదేవుడు పదునైన బాణాలేసి దుర్యోధనుడు తూలేట్టు చేశాడు. దుర్యోధనుడు సహదేవుడి నుదుట బలంగా కొట్టాడు. అతను తూలి పడబోయి నిలదొక్కుకుని దుర్యోధనుడి మీద బాణాలు కురిపించాడు.

గాంధారదేశపు గుర్రం రౌతులు అర్జునుణ్ణి చుట్టుముట్టారు. శక్తుల్ని, తోమరాల్ని అతని మీద విసిరారు. ఐతే అతను క్రూరభల్లాల్తో వాళ్ల శిరసుల్ని పుచ్చకాయల్లా దొర్లించాడు. గాంధారబలాల చావుతో త్రిగర్తదేశపు రౌతులతన్ని కమ్ముకున్నారు. వాళ్లలో సత్యకర్ముడి తలని తళతళలాడే కుండలకాంతుల్తో నేలమీద పొర్లించాడు అర్జునుడు. అలాగే సత్యేషుణ్ణీ క్షణంలో పైకి సాగనంపాడు. ఇంతలో సుశర్మ కనిపించాడు. ఇన్నాళ్లూ తనని తిప్పలు పెట్టిన అతని మీద వేడివేడి చూపులు రగులుస్తూ మూడు బాణాలతని ఒంటికి నాటాడు. దాంతో సుశర్మ సైన్యంలో రథికులంతా ఒక్కసారిగా అతన్ని కమ్ముకున్నారు. అతను వాళ్లని చిటికలో చిందరవందర చేసి ఒక ఘోరభల్లంతో వాడి రొమ్ము చీల్చి ప్రాణాలు తీశాడు. అతని కొడుకులు ఏడుగుర్ని ఒక వరసన, ఎనిమిది మందిని ఇంకో వరసన, ముప్పై మందిని మరో వరసన తలలు నరికి తండ్రితో పాటు ప్రయాణం కట్టించాడు. ఇక మిగిలిన త్రిగర్త సైన్యం తలా ఓ దిక్కు పరిగెత్తింది.

భీముడి బారిన పడ్డ సుదర్శనుడు ఎక్కువసేపు బతకలేదు. అతని బలాలు భీముణ్ణి చుట్టుముడితే అతను బలమైన బాణాల్తో వాటిని చంపి చెల్లాచెదురు చేశాడు. అదిచూసి సహించలేక దుర్యోధనుడి ముందున్న సైన్యం పాండవబలాల మీదికి దూకింది. శకుని సహదేవుడితో తలపడ్డాడు. శకుని కొడుకు ఉలూకుడతనికి తోడుగా నిలబడ్డాడు. చిన్నతమ్ముడికి తోడుగా భీముడు వచ్చాడు. శకుని మూడు భల్లాల్తో సహదేవుణ్ణి పొడిచి పదినారాచాలు అతని శరీరానికి గుచ్చితే మండిపడి భీముడు, సహదేవుడు భీభత్సంగా శకుని సైన్యాన్ని చించిచెండాడారు. శకుని ఆశ్వికదళం సమూలంగా నాశనమైంది. ఐనా వెనక్కి తగ్గకుండా శకుని మూడుమొనల చిన్న ఈటెని బలంగా విసిరితే ఆ దెబ్బకి సహదేవుడు రథం మీద మూర్ఛపడ్డాడు. భీముడు వీరావేశంతో మన సేన మీద పడ్డాడు. అతని ధాటికి నిలవలేక మన సైన్యం పారిపోతుంటే దుర్యోధనుడు అందర్నీ గట్టిగా అరిచి పిల్చి నిలబెట్టాడు. ఒక రథాన్నెక్కి శకునిని కలిసి అంతా కలిసి పాండవ సేన మీద దాడి చేశారు.

పాండవ సేనలు వాళ్ల మీద తిరగబడినయ్. ఇంతలో సహదేవుడు కూడ తెలివొచ్చి లేచి పదిబాణాల్తో శకునిని కొట్టి అతని విల్లు విరిచాడు. అతనింకో విల్లు తీసుకునేంతలో భీముడు, నకులుడు అతని మీద బాణాలేస్తుంటే శకుని కొడుకు ఉలూకుడు వాళ్లనడ్డుకున్నాడు. ఇలా తండ్రీ కొడుకులు పోరాడుతుంటే భీముడు ఉలూకుణ్ణి అనేక బాణాల్తో కొట్టి శకునికి అరవై బాణాలు నాటించి అతని అనుచరుల్ని చెల్లాచెదురు చేశాడు. కోపంతో ఉలూకుడు సహదేవుణ్ణి బాణవర్షంలో ముంచాడు. అతను మహాకోపంతో ఒక భల్లాన వాడి తల నరికాడు. కొడుకు చావు చూసి శకుని కళ్ల నీళ్లు కుక్కుకున్నాడు. అప్పుడతనికి విదురుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినయ్. పెద్ద నిట్టూర్పు విడిచి సహదేవుడి మీద మూడు నారాచాలేశాడు. సహదేవుడు వాటిని మధ్యలో విరిచి అతని విల్లు తుంచాడు. శకుని కత్తితో కలిసిన ఇనపసమ్మెటని సహదేవుడి మీద విసిరాడు. దాన్ని కూడ అతను అనేకబాణాల్తో మధ్యలోనే నరికాడు. అదిచూసి శకుని పక్కనున్న వాళ్లు పారిపోయారు. వాళ్లని చూసి అతను కూడ దూరంగా పారిపోయాడు. దుర్యోధనుడు దీనుడయ్యాడు.

ఐతే సహదేవుడు శకునిని పోనివ్వకుండా వెంటపడ్డాడు. శకుని వెనక వున్న మన పక్షం వాళ్లు కూడ అతన్ని యుద్ధానికి ముందుకి తోశారు. ఇక తప్పేదిలేక తన గుర్రపుదండుతో సహదేవుణ్ణి ఎదుర్కున్నాడు శకుని. సహదేవుడతనికి మాయాజూదం గుర్తుచేసి ఆ రోజు సభలో నవ్వినవాళ్లలో మిగిలున్న దుర్యోధనుడు చూస్తుండగానే శకుని తలని ముక్కలు చేస్తానని చెప్తూ పదిబాణాలతనికి గుచ్చాడు. అతని గుర్రాల్ని, గొడుగుని, జెండాని, విల్లుని ముక్కలు చేశాడు. శకుని ఒక నిష్టురశక్తిని తీసి సహదేవుడి వక్షానికి గురిపెట్టాడు. ఐతే సహదేవుడొక భల్లంతో దాన్ని విరిచి ఇంకో రెండు భల్లాల్తో అతని రెండు చేతులూ నుజ్జు చేశాడు. తర్వాత మరో పదునైన భల్లంతో అతని తల నరికి కింద పడేశాడు.

ధర్మరాజు ఆనందంగా తన శంఖాన్నూదితే వాళ్ల సేనలో మిగిలిన దొరలు కూడ వాళ్ల శంఖాలు పూరించారు. మన సైన్యం అల్లకల్లోలమైంది. శకుని సైన్యం మాత్రం పారిపోకుండా నిలబడి సహదేవుడి మీద శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తే అర్జునుడు, భీముడు వాటన్నిటిని వారించి ఆ సేనని చిత్తు చేశారు. దుర్యోధనుడు ఇంకా మిగిలున్న కొద్దిమంది సైన్యాన్నీ పురిగొల్పితే వాళ్లు అర్జునుడితో తలపడ్డారు. తన చుట్టూ రక్షణగా వున్న సైన్యం బాగా పలచబడటం గమనించి దుర్యోధనుడు అక్కణ్ణుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ఆ సమయాన పాండవ సైన్యం పరిమాణం రెండువేల రథాలు, ఏడొందల ఏనుగులు, ఐదువేల గుర్రాలు, పదివేల పదాతులు. మనవైపు సైన్యమంతా దాదాపుగా సమసిపోయింది. ఆ పరిస్థితి చూసి నీ కొడుకు గుర్రం దిగి గద బుజాన పెట్టుకుని ఒంటరిగా కాలినడకన ఎక్కడికో కదిలిపోయాడు.

ధృతరాష్ట్రుడది విని నిర్ఘాంతపోయాడు. “రారాజుగా బతికినవాడు శత్రువుల చేతిలో ఓడి ఒంటరిగా కేవలం గద మాత్రమే తోడుగా ఎక్కడికి పోయాడో కదా, ఇంతకన్నా దైన్యం ఇంకోటుందా?” అని మొత్తుకున్నాడు. సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు. “ఔను, పదకొండక్షౌహిణుల సైన్యాన్ని శాశించి చివరికి ఒక్కడు కూడ తన వెనకలేని స్థితిలో అక్కడికి కొద్దిదూరంలో ఈశాన్యాన ఒక మడుగుంటే దాన్లో దాక్కుందామని వెళ్లాడు. అప్పుడతనికి విదురుడి నీతిబోధలు గుర్తొచ్చినయ్, అవి వినకుండా తను ఇంతదూరం తెచ్చుకున్నానని గుర్తింపొచ్చింది.

అవతల మిగిలున్న మనసేనలు ధైర్యంగా పోరాడినా వాటిని నాశనం చెయ్యటం అర్జునుడికి పెద్దపని కాలేదు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ తప్ప మనసేనంతా నిశ్శేషంగా సమసిపోయింది. అప్పుడు ధృష్టద్యుమ్నుడు నన్ను గమనించి సాత్యకితో “వీడిప్పుడు మనకేం హాని చేస్తాడు? వదిలెయ్యరాదూ” అంటే సాత్యకి, “వీడు ద్రోహి, వీణ్ణిప్పుడే నా కత్తికి బలిస్తా” అని కత్తి దూసేసరికి వ్యాసమహర్షి హఠాత్తుగా ప్రత్యక్షమై “సంజయుణ్ణి చంపటం అనుచితం, వదిలెయ్యి” అని చెప్తే అతను ఆయన మీది గౌరవంతో నన్ను వదిలేశాడు. వ్యాసుడు “ఇప్పటికి బతికిపోయావ్, ఎక్కడన్నా దూరంగా పో” అని నాతో అని మాయమయాడు.

నేను దుర్యోధనుణ్ణి వెదుక్కుంటూ అక్కడికి కోసెడు దూరంలో వున్న మడుగు దగ్గరికెళ్లా. అక్కడతను కళ్ల నీళ్లు పెట్టుకుని దుఃఖిస్తూ నన్ను తేరిపార చూశాడు. నేనూ కాసేపేమీ మాట్టాడలేక నిలబడిపోయా. మనలో ఎవరన్నా బతికున్నారా అని అడిగాడతను. అశ్వత్థామ, కృప, కృతవర్మల గురించి చెప్పాన్నేను. అప్పుడతను నా బుజం తట్టి నీతో చెప్పటానికి నాతో ఇలా అన్నాడు – “మనవాళ్లంతా మరణించారు, శత్రువులు, వాళ్ల చుట్టాలు దిట్టంగా వున్నారు. ఇప్పటికి నేను తప్పించుకుని ఎక్కడికన్నా పోయి వుండి మెల్లగా బలం కూడగట్టుకుని ఎప్పటికైనా పగ తీరుస్తానని చెప్పు”.

తర్వాత మాయాప్రభావంతో నీళ్లు తనని అంటకుండా ఆ మడుగులో జలస్తంభనంలో కూర్చున్నాడు దుర్యోధనుడు.

ఇంతలో అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ అటువైపు వచ్చారు. వాళ్ల రథాశ్వాలు అలిసిపోయి కదల్లేక కదులుతున్నయ్. వాళ్లు కూడ శస్త్రాస్త్రాల దెబ్బలకి ఒళ్లు హూనమై దయనీయస్థితిలో వున్నారు. నన్ను చూసి ఇంకా బతికేవున్నానని ఆశ్చర్యపడ్డారు. దుర్యోధనుడి జాడ తెలుసునా అని నన్నడిగితే, నేనక్కడ జరిగిందంతా వాళ్లకి చెప్పా. మేమిలా మాట్టాడుకునేంతలో ఆ చుట్టుపక్కల పాండవులొస్తున్న శబ్దాలు వినిపిస్తే హడావుడిగా అక్కణ్ణుంచి మన శిబిరానికి వెళ్లాం.

అక్కడంతా భీభత్సంగా వుంది. అప్పటికే హతశేషులైన పనివాళ్ల వల్ల యోధులంతా మరణించారని విని ఆడవాళ్లంతా బిగ్గరగా దీనంగా ఘోరంగా ఏడుస్తున్నారు, ఎక్కడ చూసినా రోదనధ్వనులే వినబడుతున్నయ్. అంతఃపురకాంతల్ని తగు వాహనాల మీద హస్తినకి పంపుతున్నారు పరిచారకులు. అదెలా జరిగిందంటే, కౌరవకాంతల రోదనలు విని యుయుత్సుడికి కడుపు తరుక్కుపోయింది. వేగంగా ధర్మరాజు దగ్గరికి వెళ్లి వాళ్లని హస్తినకి తీసుకెళ్లి దించటానికి అనుజ్ఞ అడిగితే అతను కృష్ణుడి అనుమతితో అది చాలా మంచి ఆలోచనని యుయుత్సుణ్ణి అభినందించి కౌగిలించి సాదరంగా పంపించాడు. యుయుత్సుడు మన శిబిరంలోని వృద్ధకంచుకుల్తో కలిసి ఎవరెవరికి ఎలాటి వాహనాలు ఏర్పాటు చెయ్యాలో అవి ఏర్పాటు చేసి అందర్నీ తీసుకుని హస్తినకి వచ్చాడు. అప్పుడతనికి ఎదురుగా విదురుడు కనిపించాడు. యుద్ధరంగంలో జరిగిన విషయాలు యుయుత్సుడతనికి చెప్తే విదురుడు “ఇప్పటి వరకు సంజయుడు వచ్చి మహారాజుకి యుద్ధవార్తలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ విషయం చెప్పటం బాగుండదు. సంజయుడు వచ్చేవరకు ఈ కౌరవకాంతల్ని నువ్వు నీ ఇంట్లో వుంచుకో, యుద్ధం విషయాలు బయటికి పొక్కకుండా మనం కట్టుదిట్టం చేద్దాం” అని చెప్పి వాళ్లిద్దరు కలిసి అలాగే చేశారు. యుయుత్సుడు స్త్రీలందర్నీ తన మందిరంలో వుంచి గట్టి కాపలాలు పెట్టించాడు.

అలా, స్త్రీలందరూ వెళ్లిపోవటంతో మన శిబిరాలు నిశ్శబ్దమై పోయినయ్. కేవలం పరిచారకులు మాత్రం మిగిలారు. ఇంతలో దుర్యోధనుడి కోసం వెదుకుతూ పాండవులు వస్తున్న కలకలం వినపడి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ ఎక్కడికో వెళ్లిపోయారు. పాండవులు వెదికి వెదికి అతను కనిపించక తిరిగెళ్లారు. ఆ తర్వాత మళ్లీ నేనూ, మన ముగ్గురు యోధులూ మడుగు దగ్గరికెళ్లాం.

ఆ ముగ్గురూ దుర్యోధనుణ్ణి ఆప్యాయంగా పలకరించారు. “రారాజా, నీలాటి వాడికిది యోగ్యమైన పని కాదు. బయటికి రా, మనం వెళ్లి పాండవుల్ని చించిచెండాడుదాం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు మా వెనకుండు, మేం నీకు రాజ్యం తెచ్చిపెడతాం. అలా జరగదా, అందరం కలిసి వీరస్వర్గం చేరుదాం” అని ఉత్సాహపరిచారతన్ని. ఐతే దుర్యోధనుడి ఆలోచన వేరేగా వుంది. “అస్త్ర శస్త్రాల దెబ్బలకి ఒళ్లు అవిసిపోయింది, మనసు వశం తప్పింది. మీ మాటల బట్టి మీరూ బాగా అలిసినట్టనిపిస్తుంది. ఇవాల్టికి విశ్రాంతి తీసుకుందాం, రేపు ఉదయమే లేచి వాళ్ల పనిపడదాం” అన్నాడతను వాళ్లతో. అశ్వత్థామ సాహసంగా “నీకెలాటి అనుమానం వద్దు, నేను పాంచాల సైన్యాల్ని సమూలంగా నాశనం చేసి నీకూ, నా తండ్రికీ ఋణం తీరుస్తా, అప్పటివరకు కవచం విడవను” అని ప్రతిజ్ఞ చేశాడు.

ఈ లోగా ఏం జరిగిందంటే – భీముడి కోసం మాంసం మోసుకుపోతున్న కిరాతులు కొందరు నీళ్ల కోసం అదే మడుగు దగ్గర ఆగి దప్పి తీర్చుకుంటుండగా వాళ్లకి మేం కనపడ్డాం. అంతకు ముందే ధర్మరాజు దుర్యోధనుడెక్కడన్నా అడవుల్లో కనపడితే చెప్పమని అడవిజాతుల వాళ్లకి చెప్పి వున్నాడు గనక ఈ కిరాతులు మేం మాట్టాడుకునే మాటలన్నీ జాగ్రత్తగా విన్నారు. ఆ తర్వాత దుర్యోధనుడు కూడ మాతో సంభాషించటం విని వెంటనే ఆ మాంసపు మూటల్నక్కడే పడేసి దుర్యోధనుడి జాడ భీముడికి చెప్తే అంతకన్న ఎక్కువ బహుమానాలు దొరుకుతాయని పరుగున అతనికి దగ్గరకి వెళ్లి అడ్డొచ్చిన వాళ్లని పక్కకి తోసుకుంటూ అతని దర్శనం చేసి దుర్యోధనుణ్ణి చూశామని అతనికి చెప్పారు. అతను ఆనందంతో వాళ్లకి మోయలేనన్ని బహుమానాలిచ్చి అన్న దగ్గరికి వాళ్లని తీసుకెళ్లి వాళ్లు మడుగు దగ్గర చూసింది, విన్నది మళ్లీ చెప్పించాడు. అంతా విని ధర్మరాజు కూడ వాళ్లకి అనేక బహుమానాలిచ్చి వెంటనే తన బంధు బలగాల్తో మడుక్కేసి బయల్దేరాడు.

అలా, మేం దుర్యోధనుడితో మాట్టాడుతుండగానే పాండవులక్కడికి వేగంగా వస్తున్న ధ్వనులు వినపడినయ్. మన రథికులు ఆత్రుతగా దుర్యోధనుడితో “రారాజా, ఇప్పుడు కర్తవ్యం ఏమిటో త్వరగా నిర్ణయించాలి నువ్వు. బయటికి వచ్చావా, ఇక్కడే వాళ్లతో తలపడి యుద్ధం చేద్దాం, లేదూ ఇప్పుడు కాదు, తర్వాత అంటే నిన్ను ఎప్పుడు ఎక్కడ కలవమంటావో చెప్పు, అప్పుడు అక్కడికి వచ్చి కలుస్తాం” అనడిగారతన్ని. దుర్యోధనుడు “ఇప్పటికి ఇక్కడ వుండకుండా ఎక్కడికన్నా వెళ్లి చీకటి పడ్డాక ఇక్కడికే రండి. అందాకా నేను నా జలస్తంభన విద్యతో నీళ్లలోనే వుంటా, నన్ను బయటికి రప్పించటం వాళ్ల తరం కాదు” అని చెప్పి పంపించాడు మమ్మల్ని. మేమంతా రథాల మీద బయల్దేరాం కాని అతన్ని ఒంటరిగా అలా విడిచి వెళ్లటానికి మనసొప్పక కొంచెం దూరం వెళ్లాక నేను దిగిపోయా. కాకపోతే పాండవుల చారులు ఆ చుట్టుపక్కలంతా గాలిస్తున్నారు గనక వెంటనే దుర్యోధనుడి దగ్గరికి వెళ్లకుండా ఒక పొదలో నక్కి కూర్చుని అక్కడ జరిగేదంతా చూస్తున్నా. మిగిలిన ముగ్గురూ దూరంగా వెళ్లి ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని విచారిస్తున్నారు.

ఇక్కడ, కిలకిల నవ్వుకుంటూ సరససంభాషణలు చేసుకుంటూ, పాంచాల కుమారులు వెనక వస్తుంటే ఆర్భాటంగా కదిలొచ్చారు పాండవులు. ఎదురుగా మడుగులో జలస్తంభనంతో హాయిగా వున్న దుర్యోధనుడి సంగతి గ్రహించారు. ధర్మరాజు కృష్ణుడితో మెల్లగా అన్నాడూ “చూశావా, ఎలా దాక్కున్నాడో? మనం ఎవరం తన దగ్గరికి వెళ్లలేం, అది తెలిసి తనూ ఏమాత్రం భయం లేకుండా వున్నాడు” అని. కృష్ణుడు కూడ అతనితో గుసగుసగా “మాయల బుద్ధి ఇప్పటికీ పోనిచ్చుకున్నాడు కాడు. కాకపోతే ఇదివరకు ఎంతమంది రాక్షసులు మాయల్తో విర్రవీగలేదూ, వాళ్లకి తగిన ఉపాయాల్తో వాళ్లని విష్ణువు, ఇంద్రుడు చంపలేదు? వీణ్ణీ ఎలాగో బయటికి రప్పించే ఉపాయం ఆలోచించు” అని బదులిచ్చాడు.

మడుగులో వున్న దుర్యోధనుణ్ణి సూటిపోటి మాటల్తో బయటికి రప్పించదల్చుకున్నాడు ధర్మరాజు. “సుయోధనా, ఇలాటి దౌర్భాగ్య పరిస్థితి లోకంలో ఎక్కడన్నా విన్నామా, కన్నామా? నీకోసం పోరాడి అసంఖ్యాకులైన రాజులు, బంధువులు, మిత్రులు చస్తే నువ్వొక్కడివి ప్రాణాలు కాపాడుకోవటానికి నీళ్లలో దాక్కున్నావా? నిన్ను వీరుడంటారు, శూరుడంటారు, అభిమానధనుడంటారు. రాజువి, అందునా కౌరవవంశాన పుట్టినవాడివి. అంతా నవ్వే ఈ నీ ప్రవర్తన వంశానికే తలవంపులు కాదా? రాజధర్మం వదిలిన వాడికి ఇహముందా, పరముందా? కొడుకులు, తమ్ముళ్లు యుద్ధాన ఘోరపుచావులు చచ్చినా నీ శరీరాన్ని రక్షించుకోవటానికిలా మడుగులో దాక్కున్నావే, ఇంత నీచపు బతుకా? పాండవులకి భయపడి రాజరాజు వెళ్లి మడుగులో దాక్కున్నాడని లోకమైంతా కోడైకూస్తుందే, చివరికిదా నువ్వు కోరుకున్న కీర్తి? కర్ణ, శకుని, దుశ్శాసనులు నిన్నుద్ధరిస్తారనుకున్నావ్, అది సాగకపోయేసరికి ఇలా పిరికిపందవై పారిపోయొచ్చావ్. రాజధర్మం ప్రకారం వచ్చి శత్రువుల్తో తలపడు, చావో రేవో తేల్చుకో. గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం. ఏదైనా రాజులకి సమ్మతమైన మార్గమే. నీళ్లలో దాక్కోవటం వల్ల నగుబాటు తప్ప ఏమీ ఉపయోగం లేదు. తెంపు చేసి దూకటం మగతనం, దాక్కోవటం కాదు” అని అతనంటే, నీళ్లలోంచే ఇలా బదులిచ్చాడు దుర్యోధనుడు –

“ప్రాణభయం కాదు, నేనా ఒంటరివాణ్ణి; ఆయుధాలు లేవు, పరివారాలు లేవు, బంధుమిత్రులు లేరు. అలిసిపోయా, దప్పికతో వున్నా, ఒళ్లంతా హూనమై వున్నా. బుద్ధి యుద్ధం మీదికి పోక వున్నా. విశ్రాంతి తీసుకుంటున్నా తప్ప యుద్ధం మానేశానని కాదు. మీరూ అలిసినట్టున్నారు. బడలిక తీరాక వద్దురు, అప్పుడు చేద్దాం యుద్ధం”.

అతని మాటలకి ధర్మరాజు విసుక్కున్నాడు. “నువ్విప్పటివరకు తీసుకున్న విశ్రాంతి చాలు, బడలికా బాగానే తీరింది. మాటలెందుకు, యుద్ధానికి సిద్ధపడు” అన్నాడతనితో. దుర్యోధనుడికీ ఒళ్లు మండింది. “ఎవరికోసం రాజ్యం, భోగాలు కావాలనుకున్నానో ఆ కొడుకులు, తమ్ముళ్లు ఇకలేరు. ఈ రాజ్యం నాకెందుకు, నువ్వే కట్టుకుని ఊరేగు. నీ తమ్ముళ్లు, చుట్టాలు బతికేవున్నారు, ఏనుగులూ గుర్రాలూ లేకపోతేనేం? ఈ బీడుబడ్డ రాజ్యం నీదే, ఏలుకో పో” అన్నాడతను ఈసడింపుగా.

అది విని చిరునవ్వు నవ్వాడు ధర్మరాజు. “కొడుకులు, తమ్ముళ్లు అంతా చచ్చాక కూడ శల్యుడి సాయంతో మమ్మల్ని గెలుద్దామని బయల్దేరావు కదా, ఇంతలోనే విడ్డూరంగా అదేమీ జరగనట్టు మాట్టాడుతున్నావ్! ఐనా నువ్వుండగా నేను రాజునెలా ఔతాను? నిన్ను చంపి నేను రాజునౌతా, లేదా నన్నోడించి నువ్వు రాజ్యం తీసుకో. అంతేగాని రాజ్యం ఇస్తున్నా అనే మాటకి అర్థం వుందా? కృష్ణుడు రాయబారిగా నీ దగ్గరికొచ్చినప్పుడు సూదిమొన మోపినంత చోటివ్వనన్నావే, నువ్వే రాజ్యం ఇచ్చేవాడివైతే కురువంశం అంతా ఇలా ఎందుకు నాశనం ఔతుంది? గెలిచే దారి కనిపించక ఈ మాటలంటున్నావ్ గాని నువ్వు కావాలని రాజ్యం ఇస్తావా? అసలు శత్రువులకి సంపదలిస్తాననే వెర్రివాడుంటాడా? పైగా, నువ్విప్పుడు రాజ్యం ఇచ్చినా నిన్ను వదుల్తాననుకున్నావా? ఐనా ఇంత నీచమైన పనెందుకు, రాజోచితంగా ప్రవర్తించు” అని చీవాట్లు పెట్టాడు.

మిగతా పాండవులు, చుట్టుపక్కలున్న వాళ్లు కూడ అలాటి సూటిపోటి మాటల్తో హింసించారతన్ని. అవి వింటూ ఎక్కువసేపు భరించలేకపోయాడు దుర్యోధనుడు. చివరికి యుద్ధానికే నిశ్చయించుకున్నాడు. ధర్మరాజుతో “మీరా ఐదుగురన్నదమ్ములు, చుట్టాలు, పరివారం ఇంతమంది వున్నారు, నేనొక్కణ్ణి. ఇంతమంది ఒకడితో యుద్ధం చెయ్యటం ధర్మం కాదు. కాబట్టి మీరు ఒక్కొక్కరే రండి, నేను మీ అందర్నీ వరసగా చంపుతా. అలా కాదంటే నువ్వు, నీ తమ్ముళ్లు, సాత్యకి, ద్రౌపది అన్నదమ్ములు – మీరంతా ఒక్కసారి రండి. ఒక్క దెబ్బతో చంపుతా. ఏదో మీకు భయపడి ఇలా అంటున్నానుకోకు, సమరధర్మం చెప్తున్నానంతే. ఇప్పుడే వచ్చి మిమ్మల్ని చంపి భీష్మ, ద్రోణ, కర్ణ, భగదత్త, బాహ్లిక, సైంధవ, శకుని, శల్యాది బంధుమిత్రుల ఋణం తీరుస్తా” అన్నాడతను పౌరుషంగా.

ధర్మరాజు అతను దారికి వస్తున్నాడని సంతోషించాడు. “యుద్ధధర్మం గుర్తుంచుకుని శత్రువుల్ని గెలవాలని నువ్వుబలాటపడటం బాగుంది. ఒక్కడివే వచ్చి ఇంతమందితో తలపడతాననటం నీ ధైర్యసాహసాలకి గుర్తు. ఐతే నువ్వలా అన్నంతమాత్రాన నేను ఒప్పుకుంటాననుకోకు. నీక్కావల్సిన శస్త్రాస్త్రాలు, వాహనం తీసుకో. మాలో ఒక్కడు నీతో పోరాడతాడు, మిగతా అందరం పక్కన నిలబడి చూస్తాం. నువ్వు గెలిస్తే రాజ్యం నీదే ” అన్నాడతనితో.

దానికి దుర్యోధనుడు “ఇదీ బాగానే వుంది, ఇన్నాళ్లూ రథాల మీద అస్త్రశస్త్రాల్తో రణాలు చేశాం, చూశాం. వింతకూరలు భోజనానికి రుచినిచ్చినట్టు కొత్త రకాల యుద్ధమార్గాలు కూడ వీరుడికి ప్రీతికరాలే. నేను గదాదండాన్ని ధరించి పదాతినై నిలబడతా, మీ అంతు చూస్తా” అన్నాడు ఉత్సాహంగా. వెంటనే ధర్మరాజు “అలాగే, వేరే ఎవరో ఎందుకు, నేనే గదాధారినై వచ్చి నీ చావు చూస్తా” అని ఉద్రేకంగా బదులిస్తే దుర్యోధనుడు గతుక్కుమన్నాడు, ఆ మాటలతనికి గుచ్చుకున్నయ్. బుట్టలో చిక్కిన మహాసర్పంలా బుసలు కొట్టాడతను. ఆవేశంగా జలాల్ని చీల్చుకుని గదాదండం భుజాన అమర్చుకుని కాలదండం ధరించివచ్చే యముడిలా కదిలి వచ్చాడు.

అలా అతను బయటికి రావటంతో పాండవులు, పాంచాలురు ఒకర్నొకరు బుజాలు చరుచుకున్నారు, వెకిలినవ్వులు నవ్వారు. అవమానంతో దుర్యోధనుడి గుండె రగిలిపోయింది. “నవ్వండి, నవ్వండి. నా గదాఘట్టనలకి ఒక్కొక్కడు మట్టిగరుస్తుంటే అప్పుడింకా పగలబడి నవ్వుదురు గాని” అని ఈసడించుకున్నాడు వాళ్లని. ఐతే అంతలోనే వాళ్లంతా ఒక్కసారిగా తన మీద పడతారేమోనని భయం వేసిందతనికి. ధర్మరాజుతో “మీరొక్కకళ్లే రండి, అంతా ఒక్కసారి రావటం ధర్మం కాదు సుమా” అన్నాడు అనుమానంగా.

ధర్మరాజు “పసివాడు అభిమన్యుణ్ణి ఒక్కడనుకోకుండా పెద్దపెద్ద యోధులు మీరంతా కలిసి చంపారు గుర్తుందా, అలాగే ఇప్పుడూను” అని అతన్నెత్తిపొడిచి, “మాట వరసకన్నా గాని, అది యుద్ధధర్మం కాదని నాకు తెలుసు. జుట్టంతా చక్కగా ముడుచుకో, దిండుతో గట్టిగా బంధించుకో. నీకు ఆనందం కలిగించే విషయం మరోటి చెప్తా విను. మా ఐదుగుర్లో నువ్వే ఎవరో ఒకర్ని ఏరుకో, వాణ్ణి చంపితే నువ్వే రాజువి, లేదా స్వర్గసామ్రాజ్యం నీది. ఇవిగో అన్ని రకాల ఆయుధాలు, పరికరాలు. నీకేవి కావాలో తీసుకో. ప్రాణాల్తో నిన్ను వదలమని తప్ప నీకేం కావలసినా కోరుకో” అన్నాడు.

దుర్యోధనుడు కనకచిత్రితాలైన శిరస్త్రాణాలు, కవచాలు తీసుకుని ధరించాడు. పర్వతం లాటి గదని చేతిలో అమర్చుకున్నాడు. భీకరాకారుడై నిలబడ్డాడు. “నకుల సహదేవులా, అర్జునుడా, భీముడా, నువ్వా, ఎవడు గదాయుద్ధంలో నా ముందు నిలబడే వాడు? ఒక్కొక్కడే రండి, అందర్నీ యముడి దగ్గరికి పంపుతా. నాతో గదాయుద్ధం ఆ ఫాలాక్షుడికే తరం కాదు, మీరో లెక్కా? ఇప్పుడిక నానుంచి మిమ్మల్నెవడు కాపాడతాడో చూస్తా” అని పెద్దగా అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ సమరోత్సాహంతో ఊగిపోతుంటే అతనికి వినపడకుండా కృష్ణుడు గుసగుసగా ధర్మరాజుతో “కొంపముంచావే, ఇప్పుడతను మీ ఐదుగుర్లో ఎవర్నెంచుకున్నా చిక్కే. గదాయుద్ధంలో అతని కౌశలం ముందు మీరెవరూ చాలరు. ఇన్నాళ్లూ ఇంత కష్టపడి ఇంతమందిని చంపి చివరికి ఈ యుద్ధాన్ని కూడ జూదం కిందికి తీసుకొచ్చావే? అప్పుడు శకునికి మాయాద్యూతంలో సంపదలన్నీ పదమూడేళ్లు అనుభవించే పందెం కాసినట్టు ఇప్పుడు ఇన్నాళ్ల శ్రమతో సాధించిందంతా ఒక్క పందెంలో ఒడ్డేస్తున్నావే? భీముణ్ణి యుద్ధానికి పంపుదామంటే అతనికి భుజబలం వుంది గాని దుర్యోధనుడికున్నంత నేర్పు లేదు. ఇప్పుడెలా?” అంటూంటే భీముడు అందుకుని “ఈ మాత్రానికే ఆయన్ని అంతలేసి మాటలంటావెందుకు? ఒక్కసారి గద నాచేతికొచ్చిందంటే వాణ్ణి ప్రాణాల్తో వదుల్తానా? వాడు నన్నేమీ చెయ్యలేడు, చూస్తుండు” అన్నాడతనితో.

అతని నిశ్చయం చూసి ముచ్చటపడ్డాడు కృష్ణుడు. “ఆలోచించకుండా అన్న మాటలవి, పట్టించుకోకు. బకాసురుడి బింకం అణిచావ్, హిడింబుణ్ణి అవలీలగా చంపావ్, కీచకుణ్ణి ముద్దకింద కొట్టావ్, జరాసంధుణ్ణి చిత్రవధ చేశావ్, ఇవి మనుషులు చేసే పన్లేనా? నీ ముందు నిలబడటం మానవమాత్రులకి సాధ్యమయే పనా? యుద్ధంలో కాళిందాదుల ఏనుగుమూకల్ని నేలబెట్టి చావగొట్టావ్, కౌరవులందర్నీ కాటికి పంపావ్. నువ్వు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతుంటే ఇతనూ అక్కడే వుండి చూస్తూ నిలబడ్డాడు తప్ప నిన్నాపగలిగాడా?

అందరూ వెళ్లి ఒక్కసారి మీదపడి చంపకుండా ధర్మరాజు ఎందుకింత శ్రమ కలిగించాడా అని అనుకున్న మాట వాస్తవం, ఐతే నీ పోటుతనం తల్చుకుని ఊరడిల్లుతున్నా. ఆనాడు సభలో వాళ్లు ద్రౌపదిని పరాభవించినప్పుడు నువ్వు చేసిన ప్రతిజ్ఞల్లో ఒకటి మిగిలుంది, అదిప్పుడు పూర్తి చెయ్యాలి నువ్వు. యుద్ధం పూర్తి చెయ్, ధర్మరాజుకి రాజ్యం ఇప్పించు. నీ గదపండగని చూట్టానికి అందరమూ ఎదురుచూస్తున్నాం. నువ్వు గెలవటం ఖాయం. నా మాట గుర్తు పెట్టుకో. ఐతే దుర్యోధనుడు తక్కువవాడు కాడు, నువ్వు గట్టిగా యుద్ధం చెయ్యాలి సుమా” అని హెచ్చరించాడతన్ని. మిగిలిన వాళ్లంతా కూడ భీముణ్ణి పొగిడారు, ఉత్సాహం కలిగించారు.

దుష్టదుర్యోధనుణ్ణి చంపి రాజ్యం అన్న పరం చేస్తానని మాటిచ్చి గదని చేతికమర్చుకుని దుర్యోధనుడి కెదురుగా నిలబడ్డాడు భీముడు – వృత్రాసురుడిపైకి దూకబోయే ఇంద్రుడిలా. ఇనుమడిస్తున్న సమరోత్సాహంతో దుర్యోధనుడితో “పాపపుపనని కొంచెమైనా జంకులేకుండా మమ్మల్ని లక్కయింటిలో కాల్చబోయావ్, శకుని మాయాజూదంలో ధర్మజుణ్ణి వంచించి ద్రౌపదిని సభామధ్యంలో అవమానపరిచావ్, ఆ పాడుపన్ల ఫలితం ఇప్పుడనుభవించబోతున్నావ్. నీకోసం పోరాడి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు గతించారు, అనేకమంది చుట్టాలు, స్నేహితులు వాళ్ల బంధుమిత్రుల్తో సహా చచ్చారు. అన్నిటికి మూలమైన శకుని కాటికి పోయాడు. నువ్వొక్కడివి మిగిలావ్, ఇప్పుడు నా గదాదండానికి నిన్ను బలిస్తా, తయారై రా” అన్నాడతన్ని కవ్విస్తూ. దుర్యోధనుడు కూడ “ఎందుకీ పనికిరాని మాటలు? చేవుంటే నా గదా సమర కౌశలాన్ని రుచిచూద్దువు రా. గదాయుద్ధంలో నన్ను జయించటం నీకే కాదు, ఆ ఇంద్రుడికైనా అసాధ్యం. ధర్మయుద్ధం చెయ్, నువ్ చావకపోతే చూడు” అని అంతే పదునుగా బదులిచ్చాడు.

ఆ మాటల యుద్ధం చూసి అక్కడున్న రాజులంతా మెచ్చుకున్నారు. దుర్యోధనుడు ఉత్సాహపడ్డాడు. మదగజ ఘీంకారాలు, అశ్వహేషలు చెలరేగినయ్. అందరు కాస్త దూరంగా చుట్టూ కూర్చున్నారు. మధ్యలో భీమ దుర్యోధనులు ప్రచండగదాసమరానికి సిద్ధమౌతున్నారు. వాళ్ల పదఘట్టనలు నేలని వణికిస్తున్నయ్.

అంతలో ఆ ఇద్దరికి గదాయుద్ధంలో గురువైన బలరాముడు వాళ్ల యుద్ధవార్త విని అతివేగంగా అక్కడికి వస్తూ కనిపించాడు. అందరూ గౌరవంగా అతనికెదురెళ్లారు. నమస్కారాలు చేశారు. అతనూ ప్రత్యభివందనం చేశాడు. ధర్మరాజు ప్రీతితో అతన్ని కౌగిలించుకున్నాడు. అర్జున, నకుల, సహదేవులు వందనం చేశారు. కృష్ణుడు, సాత్యకి వినయంగా నమస్కరిస్తే అతను వాళ్లిద్దర్నీ ఆనందంగా ఆలింగనం చేశాడు. అంతా కుశలప్రశ్నలు వేసుకున్నారు. బలరాముడు “నేను తీర్థయాత్రలకి వెళ్లి చాలా రోజులైంది. మిమ్మల్నందర్నీ చూట్టానికి, నా శిష్యుల గదాయుద్ధం పరిశీలించటానికి వచ్చా”నని వివరించాడు. దుర్యోధనుడు, భీముడు చేతిలో గదల్తోనే వెళ్లి అతనికి వినయవినమితులయారు. ధర్మరాజు వాళ్ల గదాయుద్ధానికి అనుమతివ్వమని బలరాముణ్ణి కోరితే అతనలాగేనని ఆనతిచ్చాడు.

అది విన్న జనమేజయుడు వైశంపాయనుడితో “ఇరుసైన్యాలు సమరానికి సమాయత్తమౌతున్న సమయాన బలరాముడు వచ్చి కృష్ణుడు పాండవపక్షపాతి అని విరాటాది బంధువులంతా వింటుండగా చెప్పి అతనికి తెలీని ధర్మసూక్ష్మాలు నాకేం తెలుస్తయ్, ఇక్కడ జరగబోయేది నేను చూడలేను, వినలేను, సరస్వతీ తీర్థానికి యాత్రకి వెళ్తూ మీకు చెబ్దామని ఇలా వచ్చా అని ధర్మరాజుతో అని అలా వెళ్లాడని విన్నా, అతను వెళ్లి ఏం చూశాడో ఏం చేశాడో వినాలని కుతూహలంగా వుంది” అని అడిగితే వైశంపాయనుడతనికి సరస్వతీ తీర్థం గురించి, ప్రభావతీ తీర్థం గురించి, మంకణమహాముని మహాత్మ్యం గురించి వివరించి, కుమారస్వామికి దేవసేనానిగా అభిషేకం చేసిన చోటు గురించి చెప్పి ఆ కుమారుడెలా తారకాసురుణ్ణి వధించాడో సవివరంగా వినిపించాడు. కురుక్షేత్రం ఆ దగ్గర్లో ఉన్నదని, ఆ కురుక్షేత్రంలో వీరమరణం పొందిన వారికి స్వర్లోకప్రాప్తి కలుగుతుందని తెలిపాడు.

బలరాముడు ఆ తీర్థాలన్నీ సేవించి కురుక్షేత్ర సమీపంలో పూర్వం విష్ణువు తపస్సు చేసిన ఒక ఆశ్రమం దగ్గర ఒక కొండ మీద అనేకమంది మునుల్తో కలిసి కూర్చుని వుండగా నారదుడక్కడికి వచ్చాడు. అంతా అతనికి నమస్కరించి కూర్చోబెట్టారు. బలరాముడతన్ని కౌరవ పాండవ యుద్ధ విశేషాలడిగితే భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య మరణాల్ని గురించి చెప్పి అప్పటివరకు జరిగిన యుద్ధక్రమం టూకీగా వినిపించి భీమ దుర్యోధనుల గదాయుద్ధం త్వరలో ప్రారంభం కాబోతున్నదని తెలియజేశాడు. వాళ్లిద్దరూ తన శిష్యులే గనక వాళ్ల గదాయుద్ధం చూడటం బావుంటుందని బలరాముడికి సలహా ఇచ్చాడు నారదుడు. బలరాముడు వెంటనే బయల్దేరి తనతో వచ్చిన బంధువులందర్నీ ద్వారకకి పంపి తను రథమ్మీద అమితవేగంగా అక్కడికి వచ్చాడని వైశంపాయనుడు జనమేజయుడికి వివరించాడు.

అలా బలరాముణ్ణి చూసేసరికి దుర్యోధనుడికి ఒక్కసారిగా ప్రాణాలు లేచివచ్చినయ్. మనసు వికసించింది. శరీరం ఉప్పొంగింది. మొహం విప్పారింది. తెలివొచ్చింది. అప్పుడు వాళ్లున్న ద్వైపాయన హ్రదం శమంతకపంచకం లోది కాదు గనక అప్పటివరకు యుద్ధం జరిగిన పొలికలనికి తిరిగి వెళ్దాం అని దుర్యోధనుడంటే ధర్మరాజందుకు ఒప్పుకున్నాడు. అందరూ కలిసి అక్కడికి నడిచారు.

భీముడు కూడ బంగారుకవచం ధరించి గదతో దుర్యోధనుడికెదురుగా నిలబడ్డాడు. దుర్యోధనుడు ధర్మరాజుతో “మా ఇద్దరి గదాయుద్ధం చూడటానికి కుతూహలంగా వున్న జనం సంఖ్య పెరుగుతుంది, వాళ్లు చేసే సందడి కూడ ఎక్కువౌతున్నది. అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే బాగుంటుంది” అంటే ధర్మరాజు తనవైపు వాళ్లందర్నీ కూర్చోమని చెప్పి, బలరామకృష్ణుల్తో తనూ మధ్యలో ఆశీనుడయాడు. భీముణ్ణి గదాయుద్ధానికి పిలిచాడు దుర్యోధనుడు. భీముడు అన్న వైపు తిరిగి “వీణ్ణి గెలవటం నాకు చిన్నపని. ఐతే మన ఇన్నాళ్ల బాధలకి ఫలితం అనుభవించేట్టు వీడి తొడలు పొడిచేసి దారుణంగా చంపుతా చూడు” అనిచెప్పి దుర్యోధనుడితో “నా చేతికి చిక్కావిప్పుడు, ఇంక తప్పించుకుపోనివ్వను. ఈ పూటతో నీకథ ముగుస్తుంది” అన్నాడు.

దానికి దుర్యోధనుడు “యుద్ధం చెయ్యకుండా ఈ ప్రగల్భం మాటలెందుకు? మాటలయుద్ధం గెలుస్తావేమో గాని గదాయుద్ధంలో గెలవటం నీవల్ల కాదు. ఒళ్లు చూసుకుని సంబర పడుతున్నట్టున్నావ్. నా గదాదండం దెబ్బల ముందు నీ భుజబలం ఎందుకూ చాలదు. ఆ పరమశివుడే గదాయుద్ధంలో నన్నెదిరించలేడు, నువ్వో లెక్కా? నా గదాకౌశలం చూసేవాళ్లంతా ఆహా అనేట్టు, నీ పాట్లు చూసి మీవాళ్లంతా హా, హా అనేట్టు చేస్తా. రా ముందుకి” అని గర్జించాడు.

శత్రువులైనా పాంచాలాదులు అతని సాహసాన్ని పొగిడారు, అదిచూసి దుర్యోధనుడింకా ఉప్పొంగాడు.

ఇద్దరు వీరులూ భీకరంగా గదాసమరం ప్రారంభించారు. రెండుగదల రాపిళ్లనుంచి మంటలెగిసి ఆకాశాన్నంటుతున్నయ్. వాళ్ల పదఘట్టనలకి భూమి కంపిస్తున్నది. రకరకాల మండలప్రచారాల్తో, చిత్ర విచిత్ర గదాప్రహారాల్తో యుద్ధం సాగిస్తున్నారు. వాళ్ల బాహుబలం, వేగం, నేర్పు, గుండెదిటవు చూసేవాళ్లకి భయం కలిగిస్తున్నయ్. ముందుగా ఇద్దరి కవచాలూ విరిగి, పగిలి, ముక్కలై నేలరాలినయ్. ఒకవైపుకి వేస్తున్నట్టు నటించి రెండోవైపు దెబ్బ వెయ్యటం, వేగంగా వంగి దెబ్బ తప్పించుకోవటం, అదేవేగంతో దెబ్బ వెయ్యటం, అవతలి వాళ్ల గదని తూలించటం – ఇలా అనేక విన్యాసాల్తో ఒకరికొకరు తీసిపోకుండా రణం కొనసాగిస్తున్నారు.

గదతో గదని చుట్టి చుట్టూతిరగటం, సాహసంగా ఎగిరి అనుకున్న వైపు కాక మరోవైపుకి దూకటం, దెబ్బవేసి వెనక్కి తప్పుకోవటం, పాదాలు, బాహువులు, నడుం, వక్షం అసంభావ్యమైన అనేక రీతుల్లో తిప్పటం, దెబ్బ తప్పించుకున్నప్పుడు తనని తను అభినందించుకోవటం, దెబ్బ పడినప్పుడు శరీరాన్ని పెంచటం – ఇలా పోరుతున్నారు. అంగాలన్నీ రక్తమయాలౌతున్నయ్. ఇద్దరిలో ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడుతున్నారో చెప్పటం దేవతలక్కూడ సాధ్యం కావటం లేదు.

దుర్యోధనుడు కుడివైపు నుంచి వస్తే భీముడు ఎడమవైపుగా తిరిగాడు, దుర్యోధనుడతని పక్కటెముకల మీద మోదాడు. భీముడతని చేతిమీద కొడితే అతని గద వదులై జారింది. జారిన గదని తీసుకుని దుర్యోధనుడతని తలమీద వేటు వేశాడు. దానికి భీముడు ఆవంతైనా చలించకపోవటం అందర్నీ ఆశ్చర్యమగ్నుల్ని చేసింది. ఐతే అమితక్రోధంతో భీముడు గిరగిర తిప్పి గదనతని విశాలవక్షానికి సూటిగా విసిరాడు. దుర్యోధనుడు లాఘవంగా దాన్ని తప్పించుకున్నాడు. భీముడు అద్భుతవేగంతో తన గదని పుచ్చుకునేలోగా దుర్యోధనుడతని వక్షాన్ని దారుణంగా బాదాడు. ఆ దెబ్బకి భీముడు తూలటంతో పాండవ పాంచాల వీరుల గుండెలు గుభేలుమన్నయ్.

భీముడంతలోనే తెలివి తెచ్చుకుని దుర్యోధనుడి పక్కలు విరిగేలా మోదాడు. ఆ దెబ్బకి దుర్యోధనుడు చతికిలబడ్డాడు. శత్రువులు ఫక్కున నవ్వారదిచూసి. కాని అతనంతలోనే లేచి భీముడి ఫాలానికి చెవికి మధ్యభాగాన్ని బద్దలు కొట్టాడు. భీముడు మళ్లీ తూలి చెక్కిళ్ల మీద కారుతున్న రక్తాన్ని లెక్కచెయ్యకుండా గదతో బలంగా దుర్యోధనుడి మెడ మీద కొడితే అతను కిందపడ్డాడు. ధర్మరాజాదులు ఆనందంతో అరిచారు. దుర్యోధనుడు కాలాంతకుడిలా లేచి రకరకాల విన్యాసాల్తో శరీరాన్ని పొడిచేసి భీముణ్ణి నేలకూల్చి సింహనాదం చేశాడు. భీముడు చచ్చాడనే అనుకున్నాడతను.

భీముడికి అంతలోనే తెలివొచ్చి లేచి కళ్లు పైకెత్తి చూశాడు. ఇంతలో సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, నకులుడు, సహదేవుడు “నేను తలపడతా, నేను తలపడతా” అని దుర్యోధనుడి మీదికి వెళ్లబోతుంటే భీముడు వాళ్లందర్నీ వారించి మళ్లీ దుర్యోధనుడి మీదికి దూకాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి “వీళ్లిద్దరి యుద్ధాల్లో ఏం తారతమ్యాలు కనిపిస్తున్నయ్ నీకు? ఉన్నదున్నట్టుగా చెప్పు” అనడిగితే దానికతను “గురూపదేశం వల్ల నేర్చిన విద్య ఇద్దరిదీ సమానం. భీముడికి బాహుబలం ఎక్కువ, దుర్యోధనుడు ఎక్కువ పరిశ్రమ చేసి గదావిద్యలో ఆరితేరాడు. అందువల్లనే బలవంతుడైన భీముడతని యుద్ధకౌశలం ముందు నిలవలేకపోతున్నాడు. ధర్మయుద్ధంలో దుర్యోధనుణ్ణి జయించటం కష్టసాధ్యం. ఎలాగోలా నాడు సభలో చేసిన ప్రతిజ్ఞ పేరు చెప్పుకుని అతని తొడలు విరగ్గొట్టటమే మార్గం. మాయావి వాడు, కనక మాయతోనే జయించామనొచ్చు. అలా చెయ్యకుండా ధర్మయుద్ధమని నాభికి దిగువ కొట్టకుండా సాగిస్తే మొదటికి మోసం వస్తుంది. అప్పుడు అందరం కలిసి మీదపడి వాణ్ణి చంపాల్సొస్తుంది.

ఏమైనా ధర్మరాజు వల్ల ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. భీష్మ ద్రోణాది మహావీరుల్ని గెలిచి జయం, యశం తెచ్చుకునే సమయాన ఇలా ఒకరితో పోరాడి గెలిచి రాజ్యం తీసుకో అని దుర్యోధనుడికి చెప్పటం ఏమిటి, దానికి భీముణ్ణి పంపటం ఏమిటి? బంధుమిత్రులంతా చచ్చి రాజ్యం మీద ఆశ వదలుకుని మడుగులో దాక్కున్న వాణ్ణి వెతికి బయటికి పిలిచి మరీ ఇలాటి అవకాశం ఇస్తారా ఎవరైనా? వాడేమో భీముడితో గదాయుద్ధానికి ఈ పదమూడేళ్ల పాటూ బాగా పరిశ్రమ చేసి సిద్ధంగా వున్నాడు, చిత్రవిచిత్ర విన్యాసాల్తో ఇతన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. భీముడా, ఇన్నాళ్లూ అలవాటు తప్పిపోయి అతనిచేత దెబ్బలు తింటున్నాడు. ఇప్పటికైనా ఇతను ధర్మం అని పట్టింపు పెట్టుకోకుండా వీణ్ణి హతమార్చాలే తప్ప ఇంకాసేపాగితే తనే చావటం ఖాయం, ఆ దుర్మార్గుడు మీకు రాజు కావటమూ తప్పదు” అని అర్జునుడితో తన మనసులో మాట చెప్పాడు.

అర్జునుడు వెంటనే, భీముడు తనవైపు చూసే సమయంలో చేత్తో తనతొడల మీద కొట్టి చూపించాడు. దానర్థం వెంటనే గ్రహించాడు భీముడు. అధర్మమైనా సరే తొడలు విరగ్గొట్టమని కృష్ణుడు సలహా ఇస్తే అర్జునుడు దాన్ని తనకలా అందజేశాడని తేల్చుకున్నాడు.

భీముడు ఇంకొంతసేపలా వివిధవిన్యాసాల్తో రణం సాగించాడు. దుర్యోధనుడూ చిత్రవిచిత్రగతుల్లో కదుల్తున్నాడు. భీముడు గదని దుర్యోధనుడి మీదికి బలంగా విసిరితే దుర్యోధనుడు ఎగిరి తప్పించుకున్నాడు. భీముడు వేగంగా వెళ్లి గదనందుకున్నాడు. దుర్యోధనుడి దెబ్బకి భీముడు తూలి కిందపడ్డాడు. అది గమనించక దుర్యోధనుడు పైకెగిరాడు. అంతలో భీముడు తెలివితెచ్చుకుని భీషణంగా అతన్ని కొట్టబోయాడు. దాన్ని తప్పించుకోవటానికి దుర్యోధనుడు భీముడి పైగా ఊర్ధ్వపరిభ్రమణం చేశాడు. అదే అవకాశంగా భీముడతని తొడలు విరిగేట్టు బలంకొద్దీ బాదాడతన్ని. వజ్రాయుధం దెబ్బకి రెక్కలు విరిగి పడ్డ మహాపర్వతంలా కూలాడు దుర్యోధనుడు.

అనేక ఉత్పాతాలు కలిగినయ్ అప్పుడు. ఉల్కలు నేలరాలినయ్, రక్తవర్ణంగా వర్షం కురిసింది, జంతువులు వికృతంగా అరిచినయ్. రారాజు పాటుకి సంతోషంతో అరిచిన పాండవ, పాంచాల వీరులు సిగ్గున తలలు వంచుకున్నారు.

ఇంతలో భీముడు దుర్యోధనుడి దగ్గరికెళ్లి “నిండుసభలో ద్రౌపదిని ఈడ్చుకురమ్మని తెప్పించి చేసిన పరాభవానికి ఫలితం అనుభవించు” అని ఎడం కాలితో ఈడ్చి తన్నాడతని తలని. ఒక పెలుచనవ్వు నవ్వి అక్కడున్న వాళ్లందర్నీ చూసి “మమ్మల్ని ఇదివరకు నానామాటలన్న ముష్కరులందర్నీ బంధుమిత్ర సపరివార సహితంగా చంపాం, మా పగతీరింది. ఇందుకు మాకు స్వర్గమే రానీ, నరకమే కానీ, నాకేం ఫరవాలేదు” అని గదతో నీ కొడుకు గొంతు నొక్కి మళ్లీ అతని తలని కాల్తో తన్నాడు భీముడు.

మొదటిసారి తన్నిన దానికే బాధపడుతున్న ధర్మరాజు కోపంతో “ఏమిటీ తులువతనం? అతని తల తన్నటం ఎంత అధర్మమో నీకు తెలీదా? తమ్ముళ్లు, మిగతా బంధువులు అంతా నేలకూలినా రాజధర్మాన్ని పాటించి నీతో పోరాడి యుద్ధంలో పడ్డ వాణ్ణి ఇలా చేశావే, నీ పనిని లోకం హర్షిస్తుందా? ఇన్నాళ్లూ ధర్మపరుడివని అందరూ అనుకునే మాటని పొరపాటని చూపించటం తప్ప నువ్వు సాధించిందేమిటి?” అని గద్దించాడు.

ధర్మరాజు దుర్యోధనుడి వంక చూసి నీళ్లు నిండిన కళ్లతో “విధి వక్రదృష్టివల్ల మనకి వైరం కలిగింది, ఒకరొకరి మీద కోపాలు పెంచుకున్నాం, ఇతర ద్రోహాల వల్ల ఇంతదూరం తెచ్చుకున్నాం. నీ అధర్మపరత, లోభం, పిల్లవాడి మనస్తత్వం, మదం నిన్నీస్థితికి తెచ్చినయ్. నీమూలాన నా బంధువులు మరణించారు, ధృతరాష్ట్రుడి కోడళ్లు వాళ్ల వైధవ్యాలకి నేనే కారణం అనుకుంటారు, వాళ్ల దైన్యం తల్చుకుంటే నా గుండె తరుక్కుపోతున్నది.” అని బాధపడ్డాడు.

ఇంతలో బలరాముడు క్రోధాతిరేకంతో మొహమంతా ఎర్రబడి లేచి చేతులు పైకెత్తి అందర్నీ చూస్తూ “రాజులంతా చూశారుగా ఈ భీముడి దుర్నీతి? గదాయుద్ధంలో నాభికి దిగువన కొట్టకూడదనే నియమం తెలిసి తెలిసి ఇలా ప్రవర్తించిన వీడికి తగిన శిక్ష పడాల్సిందే” అని వేగంగా తన రథం మీది హలాయుధాన్ని బుజానికి అమర్చుకుని భూమి కంపించేట్టు నడుస్తూ భీముడి వైపుకి కదిలాడు. ఐతే భీముడు మాత్రం అన్నదమ్ముల అండ చూసుకుని ఏ మాత్రం తగ్గకుండా నిలబడ్డాడు.

కృష్ణుడు దిగ్గున లేచి అన్నకి ఎదురెళ్లి తన దీర్ఘబాహువుల్తో అతన్ని పట్టి ఆపి దృఢస్వరంతో “ఎవరికైనా శుభం కలిగించే మార్గాలు తన వృద్ధి, మిత్రుల వృద్ధి, వాళ్ల మిత్రుల వృద్ధి కలగటం, శత్రువులకి ఈ మూడు విధాలుగానూ వృద్ధి జరక్కపోవటం అనేవి. అందుకు వ్యతిరేకంగా జరక్కూడదు. అందువల్ల తన మిత్రులకి కీడు జరగబోతుంటే మైత్రిపరుడైన పరాక్రమశాలి దాన్ని ఆపుతాడు. పాండవులు మనకి పరమమిత్రులు, ముఖ్యంగా మన మేనత్త కొడుకులు, దుర్మార్గుల చేత అవమానాల పాలైనవాళ్లు. వీళ్ల మంచి కోరటం నీ కర్తవ్యం. నిండుసభలో తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చటానికి భీముడతని తొడలు విరగ్గొట్టాల్సొచ్చింది, చేసిన ప్రతిజ్ఞలు చెల్లించటం రాజులకి పరమధర్మమని అందరూ అంగీకరించిందే కదా? పైగా భీముడి గదకి అతని తొడలు విరుగుతాయని మైత్రేయ మహాముని శాపం కూడ, అది తప్పుతుందా? అది భీముడి తప్పెలా ఔతుంది? కోపం ఉపశమించు, పాండవుల అభివృద్ధి మనకు సమృద్ధిని కలిగిస్తుందని గ్రహించు” అని అన్నని శాంతింపజెయ్యటానికి ప్రయత్నించాడు.

దానికి బలరాముడు మండిపడ్డాడు “ధర్మార్థ కామాలు ఆ వరసలో సాధించాలి గాని అర్థకామాల కోసం ధర్మాన్ని బలిచ్చేవాడు అవినీతి పరుడనిపించుకుంటాడు. మునిశాపం అన్నావ్, ప్రతిజ్ఞ అన్నావ్. అవి అధర్మమార్గానే జరగాలా? ధర్మంగా జరపొచ్చు కదా?” కృష్ణుడతన్ని అనునయిస్తూ “లోకమంతా నిన్ను ధర్మనిరతుడివని, మంచిచెడుల్ని ఎంచగలిగినవాడివని, కోపం లేనివాడివని ఎప్పుడూ పొగుడుతుంటుంది, నీకీ కోపం తగదు. తన ప్రతిజ్ఞ చెల్లించటానికి ఇతను చేసిన పని అధర్మం కాదు. పైగా దుర్యోధనుడేం ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యటం లేదుగదా ఇది జరిగినప్పుడు? అదో గొప్పతనంగా పైకెగిరి కొట్టబోతుంటే తనని తను కాపాడుకోవటానికి భీముడలా గద విసరాల్సొచ్చింది, అలా చెయ్యకుండా అతన్ని తన్నులు తిని చావమన్నావా? భీముడి ప్రతిజ్ఞ సంగతి దుర్యోధనుడికి తెలీందా? తెలిసి కూడ తనని తను కాపాడుకోకపోతే అది భీముడి తప్పా? కలియుగం కూడ దగ్గరపడింది, ఇలాటి వాటిని అధర్మవర్తనలుగా అనుకోకూడదు. అసలు, పుట్టిన దగ్గర్నుంచి ఏదో ఒక కపట మార్గాన వీళ్లని చంపటానికి ప్రయత్నించిన ఈ దుర్మార్గుణ్ణి కపటంగా కొట్టటం తప్పే కాదు. పాండవ యాదవ వంశ వర్ధనుడు అభిమన్యుణ్ణి వీడు ఎలా అధర్మయుద్ధంలో చంపాడో తెలిసి కూడ నువ్విలా అనటం భావ్యం కాదు” అని అనేక రకాల తర్కాల్తో సర్దిచెప్పాడు.

ఇవేవీ బలరాముణ్ణి శాంతింప జెయ్యలేక పోయినయ్. మొహాన గంటు పెట్టుకుని అందర్నీ ఈసడించుకుంటూ “ఇలాటి పనికి మాలిన గెలుపు గెలిచి భీముడు కీర్తి మూట గట్టుకోనీ, రణధర్మం తప్పకుండా ధర్మయుద్ధం చేసిన దుర్యోధనుడికి ఉత్తమగతులు కలక్కతప్పదు” అని గట్టిగా చెప్పి పరుగున వెళ్లి తన రథం ఎక్కి ద్వారక వైపుకి సాగిపోయాడు. పాండవులు, పాంచాలురు, యాదవులు – అక్కడున్న వాళ్లంతా చిన్నబోయారు. వాళ్ల గుండెలు జారిపోయినయ్. విషాదవదనాల్తో నేలచూపులు చూస్తూ నీరసంగా వుండిపోయారు.

కృష్ణుడు వాళ్లని హుషారు పరచటానికి పూనుకున్నాడు. ధర్మరాజుతో “బంధునాశకుడు, పాపాత్ముడు దుర్యోధనుడు. వాడి తొడలు విరిచి తలదన్నాడు భీముడు. ఇది నిజంగా అధర్మమేనా, ఆలోచించి చూడు. భీముడి ప్రతిజ్ఞలో వాడి తల తన్నటం అనే అంశం కూడ ఉందని గుర్తు తెచ్చుకో” అని చెప్పిచూశాడు. దానికి ధర్మరాజు “బంధువులంతా మరణించారని బాధలో వున్న నాకు భీముడిలా రారాజు తలతన్నటం ఎలా ఉంటుందో నువ్వూ ఆలోచించు. కాకుంటే ఆ దుర్యోధనుడి వల్ల ఇన్నాళ్ల కష్టాలు తలుచుకుని భీముడలా చెయ్యటమూ అసంగతం కాదు. ఏమైనా ఇంకా పుణ్యపాపాల చింత ఎందుకు, పోనిద్దాం” అని సర్దుకున్నాడు.

అర్జునుడు మాత్రం అందుకు ఒప్పుకోలేక మౌనంగా వుండిపోయాడు. భీముడు ఆనందంగా అన్నని “దుర్మార్గులైన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు అంతా అంతరించారు. మన పగ తీరింది. ఇంక నువ్వు హాయిగా రాజ్యం పాలించు” అని అభినందించాడు. ధర్మరాజు కూడ తమ్ముడి భుజబలాన్ని పొగిడాడు. పాండవపక్షం వాళ్లంతా కోలాహలంగా పరస్పరం ప్రశంసించుకుంటూ శంఖాలు, భేరులు, ఇతర వాయిద్యాలు మోగిస్తూ సంబరాలు చేసుకున్నారు. పాంచాల వర్గం అంతా భీముణ్ణి ఆకాశానికెత్తుతూ పొగిడారు.

ఐనా ఇంకెవరికైనా దుర్యోధనుణ్ణి అధర్మంగా పడేశారని అనుమానంగా ఉందేమోనని కృష్ణుడు అందర్నీ ఉద్దేశించి ప్రసంగించాడు – “భీముడు ధర్మం తప్పి వీణ్ణి కొట్టాడని ఎవరూ అనుకోవద్దు. ఆవంతైనా అనుమానం లేకుండా ద్రౌపదిని దురవమానం చేసిన దుర్యోధనుణ్ణి కేవలం తన తండ్రి భాగం ఇవ్వు చాలు అనడిగాడు ధర్మరాజు. అందుక్కూడ ఒప్పుకోలేదు వీడు. విదురాదులు ఎంతగానో చెప్పిచూశారు, ఐనా తన పట్టు వదల్లేదు. అలాటి వాణ్ణి తన ప్రతిన చెల్లించుకోవటానికి భీముడు తొడలు విరగ్గొట్టటం ఎందుకు ధర్మం కాదో మీరే ఆలోచించుకోండి. దీనంగా పడున్నాడు కదాని వీడి పాపాల్ని మనం మర్చిపోకూడదు. వాడి మీద దయ చూపకూడదు. పదండి, పదండి, రథాలెక్కండి” అని బోధించాడు.

అంతా చూస్తూ వింటూ వున్న దుర్యోధనుడు ఇంక ఆగలేకపోయాడు. చేతుల మీద బలం మోపి శరీరం పైభాగం పైకెత్తి దెబ్బ పడితే కోపంతో చూసే మహాభుజంగంలా తల ఎత్తి కృష్ణుణ్ణి తీక్షణంగా చూస్తూ “కంసుడి బానిస కొడకా, నువ్వేదో పత్తిత్తులాగా ఉపన్యాసాలిస్తున్నావే, అధర్మంగా నా తొడలు విరగ్గొట్టమని అర్జునుడి చేత సైగ చేయించావ్, శిఖండి పేరు చెప్పి అర్జునుడి చేత భీష్ముణ్ణి పడేయించావ్, ధర్మరాజు చేత అబద్ధం చెప్పించి ద్రోణుణ్ణి చంపించావ్, రథం భూమిలో కుంగినప్పుడు కర్ణుణ్ణి కొట్టించావ్, ఇంకొకరితో యుద్ధం చేస్తున్న భూరిశ్రవుణ్ణి దొంగచాటుగా పడగొట్టించావ్, దొంగచీకటి అడ్డుపెట్టుకుని సైంధవుణ్ణి చంపించావ్. లేకుంటే మీరంతా ఎప్పుడో చచ్చేవాళ్లు. ఇన్ని చేసి ఇప్పుడు నీతులు చెప్పకు” అంటూ విషం కక్కాడు.

కృష్ణుడు ఏమాత్రం వెనకాడకుండా “బాలుడిగా వున్నప్పుడే భీముణ్ణి పాముల్తో కరిపించావ్, నీళ్లలో ముంచావ్, చంపటానికి రకరకాలుగా ప్రయత్నించావ్. కుంతి, కొడుకులు నిద్రలో ఉన్నప్పుడు లక్కయింటికి నిప్పు పెట్టించావ్, అజాతశత్రుడు ధర్మరాజు సంపదల్ని మాయాజూదంలో అపహరించావ్, అంతటితో ఆగకుండా పాంచాలిని పదిమంది ముందు పరాభవించావ్. అప్పుడే నీకీ గతి పట్టించాల్సింది, ఐనా వీళ్లు ఓర్పుతో జూదం నియమాల ప్రకారం చేసి వచ్చి నన్ను సంధికి పంపితే సూదిమొనంత కూడ ఇవ్వనన్నావ్. అదే నీకీ గతి పట్టించింది. నీ లోభం వల్ల ఏ పాపమూ ఎరుగని భీష్మ ద్రోణులకి ముప్పు తెచ్చిపెట్టావ్.

ఏవో అధర్మాలు చేశామన్నావే, సరిగా విను. శిఖండి, ధృష్టద్యుమ్నులు పుట్టిందే భీష్మ ద్రోణుల్ని చంపటానికి. అది జరక్కుండా ఆపటానికి మనమెవరం? ఎంతోమందితో యుద్ధం చేసి అలిసిపోయి ఊగులాడుతున్న సాత్యకిని భూరిశ్రవుడు చంపబోతుంటే చూస్తూ వూరుకుంటామనుకున్నావా? ఎందరో మహావీరులు కలిసి అన్యాయంగా బాలుడు అభిమన్యుణ్ణి చంపితే అందుక్కారణమైన దుర్మార్గుడు సైంధవుణ్ణి, అందునా అరణ్యంలో ద్రౌపదికి అవమానం చెయ్యబోయినవాణ్ణి, చంపకుండా వదిలేసి అర్జునుణ్ణి అగ్ని ప్రవేశం చెయ్యనిస్తామనా నీ ఉద్దేశం? మీ పాపాలన్నిటికి మూలమైన కర్ణుడి రథం భూమిలో కుంగితే అది పైకి లేచేవరకు అర్జునుడు ఎదురుచూస్తూ కూచోవాలా? బ్రాహ్మణశాపం ప్రకారం వాడు చచ్చేవరకు అది పైకి లేవదే మరి? నీ తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చెయ్యటం నీకు తెలియని విషయం కాదు గదా, మరి అలా ప్రతిజ్ఞ చేసిన వాడు తొడలు విరగ్గొట్టకుండా వీపున గుద్దుతాడనుకున్నావా? ఇంకా నయం, శల్యుణ్ణి కూడ అధర్మంగానే చంపామనలేదు నువ్వు. పాండవులెప్పుడూ అధర్మపరులు కారు. ఘోషయాత్రలో గాని, గోగ్రహణ సందర్భంలో గాని నిన్ను చంపటానికి అవకాశం వున్నా చంపలేదు గదా? కురువంశం నాశనం కావటానికి కారణం నువ్వే, మరెవరూ కారు. నీ మూలానే, నీ దుర్నీతి వల్ల, నీ అసూయ వల్ల, నీ లోభం వల్ల ఇంతా జరిగిందని గ్రహించు. ఎందుకీ వ్యర్థపుమాటలు?” అని జాడించాడతన్ని.

దుర్యోధనుడు నిర్వికారంగా “వేదాలు చదివా, యాగాలు చేశా, అనేకమంది రాజులు కొలిచే రారాజుగా వెలిగా, శత్రువుల గుండెల్లో నిద్రపోయా, చివరికి బంధుమిత్రుల్తో ఆనందంగా స్వర్గానికి పోతున్నా. నీదృష్టిలో ఎలాటివాడినైతే నాకేం? మీరే రోజూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ బతుకులు ఈడుద్దురు గాని” అన్నాడతనితో.

ఆ మాటలకి అతని మీద పుష్పవృష్టి కురిసింది, దేవదుందుభులు మోగినయ్, చల్లగాలులు సువాసనల్తో మెల్లగా వీచినయ్. అదంతా చూసిన పాండవులకి అప్పటివరకు జరిగిన యుద్ధం కొత్తగా కనిపించింది, శత్రువుల్లో ముఖ్యులందర్నీ అధర్మంగా చంపామనే అనుమానం పట్టుకుంది. మొహాలు వేలాడినయ్.

అది గమనించాడు కృష్ణుడు. “భీష్మ ద్రోణాదుల్ని కపటమార్గాల్లో ఓడించామని మీకు చింత వద్దు. మీరు కేవలం నిమిత్తమాత్రులు. వాళ్లు ఉగ్రాస్త్రవేదులు, మహావీరులు. వాళ్లని చంపటం సామాన్యమైన విషయం కాదు. కనక అవసరానికి తగ్గ ఉపాయాలు చూసి ఇదంతా నేనే చేయించా. పైగా ఇలా జరగాలని విధిరాత, అలా జరిగింది. అంతే. దైవఘటనల్ని తప్పించటం మీ పనా? ఇది సంతోషసమయం, విచారానికి కాదు. మనం అనుకున్నది సాధించాం. అది ముఖ్యం. పొద్దుపోతున్నది, పదండి. విడుదులకెళ్లి విశ్రాంతి తీసుకుందాం” అని హడావుడి చేస్తే అప్పటికి వాళ్ల మొహాల్లో కాస్త కళవచ్చింది. కృష్ణుడు ముందుగా పాంచజన్యం పూరిస్తే తర్వాత అందరూ వాళ్ల శంఖాలూదారు.

అక్కణ్ణుంచి పాండవులు, కృష్ణుడు, సాత్యకి కౌరవశిబిరాలకి వెళ్లారు. మిగిలిన వాళ్లంతా విశ్రాంతి కోసం వాళ్ల వాళ్ల శిబిరాలకి వెళ్లారు. అందరూ మర్నాడు హస్తినాపురానికి వెళ్లటానికి నిర్ణయించుకున్నారు.

కౌరవశిబిరానికి వెళ్లి పాండవులు దుర్యోధనుడి నివాసం ప్రవేశించారు. అక్కడి పరిచారకులు, కోశాగారాధ్యక్షులు వచ్చి ధర్మరాజుని ఆహ్వానించారు. అందరూ రథాలు దిగుతుంటే కృష్ణుడు ముందుగా అమ్ములపొదుల్ని, గాండీవాన్ని దూరంగా పెట్టించి అర్జునుడు దిగాక తను దిగుతానని చెప్పాడు. అర్జునుడలాగే చేశాడు. పగ్గాల్ని నొగల్లో ఉంచి చివరగా దిగాడు కృష్ణుడు. అతను దిగిన వెంటనే గుర్రాల్తో సహా ఆ రథం మండిబూడిదైంది. “ఇది ద్రోణ కర్ణుల అస్త్రాగ్నుల ప్రభావం. వాటి ప్రభావాన్ని దాచి రథం దగ్ధం కాకుండా కాపాడానిన్నాళ్లూ. ఇప్పుడిక యుద్ధం ఐపోయింది గనక వాటి ప్రభావం బహిర్గతమైంది” అని వివరించాడు కృష్ణుడు.

ధర్మరాజుని కౌగిలించి అతనితో “నేను ఉపప్లావ్యానికి వచ్చినప్పుడు నువ్వు అర్జునుణ్ణి రక్షించమని నాకప్పగించావ్, అందుకు నేనూ ఒప్పుకున్నా. ఆ పని నెరవేర్చానిప్పుడు. ఇక ముందు జరపాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించు” అని చెప్పాడు. ధర్మరాజు కూడ “నువ్వు లేకుంటే యుద్ధంలో గెలవటం మాకసాధ్యం. వ్యాసమహాముని ముందే చెప్పాడు నువ్వెటు వుంటే అటు విజయం కలుగుతుందని. ఇదంతా నీ ప్రసాదం తప్ప మా గొప్పతనం కాదు” అని పొగిడాడతన్ని.

అందుకు కృష్ణుడు, “నిజానికి ఈ విజయానికి కారణం విజయుడే. అతనికి శివుడు అస్త్రాలిచ్చినప్పుడు నా అంత వాడివి కమ్మని దీవించాడు, ఆ మాట అబద్ధమౌతుందా? ఏదో గురువులని, బంధువులని శత్రువుల మీద జాలిపడి చంపటానికి వెనకాడుతుంటే అతని అనుమానాల్ని తొలిగించటమే నేను చేసింది. ఒక్కసారిగా చంపటానికి ఇష్టం లేక ఇన్నాళ్లూ ఇదో ఆట లాగా సాగించాడు గాని అతను తల్చుకుంటే త్రిలోకాల్ని నాశనం చెయ్యటానికి నిమిషమున్నర పట్టదు. పక్కనుండి సరైన మార్గం చెప్పటమే నా పని, చేసిందంతా తనే” అని అర్జునుడి శస్త్రాస్త్రసంపదల్ని పొగిడాడు.

ఇలా సుఖసల్లాపాలాడుకుంటూ వాళ్లు కౌరవ భాండాగారాన్ని, మిగిలున్న చతురంగ బలాల్ని, పరిచారవర్గాల్ని వశం చేసుకున్నారు. కొంతసేపటి తర్వాత కృష్ణుడు వాళ్లతో “ఈ పాడుబడిన చోట మనం రాత్రి గడపటం మంచిది కాదు, ఎక్కడన్నా శుభ్రంగా వున్న బయలుకి వెళ్లి నిద్రచేద్దాం” అని చెప్పి అంతకు ముందే తన సారథి దారుకుడు తన రథాన్ని సిద్ధం చేసి తీసుకొస్తే దాని మీద బయల్దేరాడు. మిగిలిన వాళ్లూ వాహనాలు చూసుకుని అతన్ననుసరించారు. ఓఘవతి అనే ఒక పుణ్యనది దగ్గర్లో వుంటే దాని తీరాన ఆ రాత్రికి విడిది చేశారు వాళ్లు.

ఇంతలో ధర్మరాజు, తము అధర్మమార్గాన దుర్యోధనుణ్ణి పడగొట్టిన విషయం విని గాంధారి తమని శపిస్తుందని భయపడి ఆమెని శాంతింపజెయ్యటానికి కృష్ణుణ్ణి హస్తినకి వెళ్లమని ప్రార్థించాడు. కృష్ణుడా పనికి ఒప్పుకుని వెంటనే బయల్దేరి వేగంగా ధృతరాష్ట్ర మందిరానికి వెళ్లి తన రాకని చెప్పిపంపి అతని అనుమతితో లోపలికి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని ఓదారుస్తూ కనిపించాడు. కృష్ణుడు వినయంగా అతనికి సాష్టాంగనమస్కారం చేశాడు. ధృతరాష్ట్ర గాంధారులకు ప్రణామాలు చేశాడు.

వ్యాసుడు కులపతి గనక ఆయన ఎదట నేలమీదే కూర్చుని వున్నాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు వెళ్లి తనూ అతని పక్కన కూర్చుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అనునయిస్తూ కళ్లనుంచి దుఃఖబాష్పాలు రాలుతుండగా బిగ్గరగా విలపించాడు. తర్వాత ఆ దగ్గర్లో వున్న కనకకలశాల నీళ్లతో ముఖం కడుక్కుని ఎలుగు రాచిన గొంతుతో “అయ్యయ్యో, అకారణంగా వంశమంతా నాశనం ఐపోతున్నది. మహాత్ములు పాండవులు ఈ పరిస్థితి రాకుండా వుండటానికి ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయారు. అప్పటికీ సంధి కూర్చమని నన్ను పంపటం, అప్పుడు జరిగిన సంగతులన్నీ నీకు తెలిసినవే. ఐనా, జూదాలు ఆడటం, వాటిలో గెలవటం కొత్త విషయాలా, కాని గెలిచినంత మాత్రాన పుణ్యకాంతల్ని జుట్టుబట్టి కొలువులోకి ఈడ్పించి గుడ్డలూడదియ్యబోవటం ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా, కన్నామా? అంత జరిగినా కూడా పాండవులు పన్నెండేళ్లు అడవుల్లో తిరిగారు, ఏడాది పాటు విరాటుడి రాజ్యంలో పడరాని పాట్లు పడ్డారు. అంతా అయాక ఒక్కొకరికి ఒక్కో ఊరిస్తే చాలునన్నారు. దానిక్కూడా ఒప్పుకోలేదే నీ కొడుకులు? నువ్వూ వాళ్లకి వంత పాడావు గాని విదురాది మహనీయులు వెయ్యిమంది చెప్పిన మాటలు పెడచెవిన పెట్టావ్. కాలోపహతులు మేలేదో కీడేదో తెలుసుకోలేరు గదా, ఇప్పుడిక అనుకుని ప్రయోజనమేమిటి? పాండవులు కల్మషం లేనివాళ్లు, నీపట్ల ఆదరణ వున్నవాళ్లు. నీకు నమస్కరించి వేడుకుంటా, వాళ్ల మీద మీరు కోపం వుంచుకోవద్దు. నీకూ గాంధారికీ ఇక పరలోకక్రియా కలాపాలు చేసేదీ వాళ్లేనని గుర్తుంచుకో. వాళ్లకి శుభం కలగాలని కోరుకో. జరిగినదానికి ధర్మరాజు ఎంతగా బాధపడుతున్నాడో మాటల్లో చెప్పటం అసాధ్యం” అని ధృతరాష్ట్రుడితో చెప్పి, గాంధారి నుద్దేశించి ఇలా అన్నాడు కృష్ణుడు.

“రాజలోకంలో ఎక్కడా నీలాంటి మహాగుణవతి మరొకరు లేరు. రాజులంతా వింటుండగా కొడుక్కి ఎన్నో మంచిమాటలు చెప్పావ్, అది నా మనసుకి నాటి ఇప్పటికీ ఎప్పుడూ గుర్తొస్తూనే వుంటుంది. లోకవృత్తం సరిగా తెలీని చపలుడు గనక దుర్యోధనుడు ఆ మాటలు పెడచెవిని పెట్టి పరిస్థితులు ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వప్పుడే చెప్పావ్ నీ మాటలు వినకపోతే కీడు జరుగుతుందని, విన్నాడా? సరిగ్గా నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇందులో పాండవుల తప్పు లేదని నీకు తెలుసు. వాళ్ల మీద నీకు కోపం వద్దు. నువ్వలిగి చూస్తే త్రిలోకాలు భస్మం ఔతయ్. నిన్ను ప్రార్థిస్తున్నా, వాళ్ల మీద దయచూపు”. దానికామె, “ఔను, నువ్వన్నది నిజమే” అని ఒప్పుకుని, “ఇక ఈ అంధుడు, వృద్ధుడు, దీనుడైన రాజుకి నువ్వూ పాండవులే దిక్కు” అని చీరచెంగు మొహానికి అద్దుకుని బిగ్గరగా ఏడ్చింది. సాంత్వన వాక్యాల్తో ఆమెని, ధృతరాష్ట్రుణ్ణి సముదాయించాడు కృష్ణుడు.

ఇంతలో అతనికి హఠాత్తుగా అశ్వత్థామ, అతని పౌరుషం గుర్తుకొచ్చినయ్. దిగ్గున లేచాడు. వ్యాసుడికి, ధృతరాష్ట్రుడికి ప్రణమిల్లి అతనితో “అశ్వత్థామకి పాండవుల మీద అమితకోపం వస్తుంది, ఆ కోపంలో అతనేం అఘాయిత్యం చేస్తాడో ! నేను త్వరగా వెళ్లాలి, నాకు అనుమతివ్వండి” అంటే వాళ్లంతా నిజమేనని అతన్ని వీడ్కొలిపారు. వ్యాసుడు ఇంకొంత సేపు వాళ్లతో ఉండి కృష్ణుడి మాటల ప్రకారం చెయ్యమని ఉపదేశించి అంతర్థానమయాడు.

కృష్ణుడు అతివేగంగా ప్రయాణించి ఓఘవతీ తీరానికి చేరుకుని తను చేసివచ్చిన పని ధర్మరాజుకి వివరించాడు. దుర్యోధనుడు పడ్డ విషయం వాళ్లకింకా తెలియదని, తనూ చెప్పలేదని, ఏదో చుట్టపుచూపుగా వచ్చినట్టు ప్రవర్తించి ఈ యుద్ధమంతటికీ దుర్యోధనుడే కారణమని, పాండవుల మీద ఎలాటి కోపమూ తెచ్చుకోవద్దని మెత్తగా చెప్పి వాళ్లని శాంతపరిచానని క్లుప్తంగా వినిపించాడు.

వైశంపాయనుడు ఇదంతా జనమేజయుడికి చెప్పి ఇక సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్న కథనాన్ని మళ్లీ కొనసాగించాడిలా –

పాండవులు దుర్యోధనుడున్న మడుగు దగ్గరకి వచ్చేటప్పటికి నేను ఆ దగ్గర్లోనే ఉన్న ఒక పొదలో నక్కిచూస్తున్నానని చెప్పా కదా, దుర్యోధనుణ్ణి బయటికి రప్పించి వాళ్లంతా పొలికలనికి నడిచి వెళ్లేప్పుడు నేనూ వాళ్ల వెనకే అక్కడికి వెళ్లా. ఆ తర్వాత అతను తొడలు విరిగి పడ్డాక పాండవపక్షం వాళ్లంతా సంబరాలు చేసుకుంటూ అక్కణ్ణుంచి వెళ్లారని కూడ చెప్పానిదివరకే.

అప్పుడు నేను ఏడుస్తూ దీనంగా మట్టిలో పడివున్న నీకొడుకు దగ్గరికెళ్లా. అతను నన్ను చూసి కన్నీళ్లు కారుస్తూ “చతుస్సముద్రవేలావలయితమైన సామ్రాజ్యాన్ని పాలిస్తుండగా చూసిన కళ్లతోటే నన్నీ హీనస్థితిలో చూస్తున్నావ్, విధివైపరీత్యం ఏమని చెప్తాం? ఐతే, యుద్ధంలో పాండవులు చేసిన అధర్మాలన్నీ మనవాళ్లందరికీ వివరించి చెప్పాలి నువ్వు. మన మహారాజు, రాణులు యుద్ధపుతగువులు తీర్చగలుగుతారు. వాళ్లకి ప్రత్యేకించి చెప్పాలి నువ్వు, పాండవులెలా ఇంతకుముందు భీష్మ, ద్రోణ, భూరిశల్య, కర్ణుల్ని అధర్మమార్గాన చంపారో, ఇప్పుడు నన్నెలా పాపకర్ముడై భీముడు తొడల మీద కొట్టాడో. అలాగే అశ్వత్థామ, కృప, కృతవర్మలకి కూడ ఈ విషయాలన్నీ వివరించి చెప్పు. పాండవులని మించిన మోసకారులు ఈ భూమ్మీద లేరని, చేతిలో గుండెకాయ పెట్టినా వాళ్లని నమ్మొద్దని నామాటగా చెప్పు. దుర్యోధనుడు ఎవరికీ తలవంచకుండా జీవించి, పదకొండక్షౌహిణుల సైన్యాన్ని శాసించి, బంధువుల్ని, మిత్రుల్ని ఎంతో సమ్మానించి, చివరికి శమంతకపంచక స్థలంలో వీరమరణం పొంది ఉన్నతగతులకి వెళ్తున్నాడని చెప్పు” అని అప్పగింతలు పెట్టాడు నాకు.

ఇంతలో అతని గురించి విని ఆ చుట్టుపక్కల వాళ్లు ఎంతోమంది దుర్యోధనుణ్ణి చూట్టానికి వచ్చారు. వాళ్లందరికీ అవే మాటలు చెప్పి పాండవుల దుష్కృత్యాల్ని వినిపించాడతను. వాళ్లదంతా విని ఏడుస్తూ వెళ్లారు, వాళ్లలో కొందరు అశ్వత్థామ, మిగిలిన వాళ్లు ఎక్కడున్నారో కనుక్కుని వాళ్లకీ వార్తనందిస్తే ఆ రథికత్రయం పరుగుపరుగున రారాజు దగ్గరికి వచ్చింది.

దూరాన్నుంచే దుర్యోధనుణ్ణాస్థితిలో చూసి దుఃఖిస్తూ, వణుకుతూ వచ్చి అతని చుట్టూ కూర్చున్నారు ముగ్గురూ. అశ్వత్థామ అతని దీనదశకి పెద్దగా రోదించాడు. దుర్యోధనుడతన్ని ఓదార్చాల్సొచ్చింది. వాళ్లు అతన్ని వదిలి వెళ్లాక జరిగిన వ్యవహారమంతా చెప్పమని నన్ను పురమాయిస్తే అంతా వాళ్లకి వివరించి చెప్పాన్నేను. అంతా విని అశ్వత్థామ ప్రళయకాల లయకారుడిలా కోపంతో ఊగిపోయాడు. “ఆ దుర్మార్గులు నా తండ్రిని దారుణంగా చంపినప్పుడు కూడ నాకింత కోపం కలగలేదు. ఇప్పుడే వెళ్లి నా మహోగ్రాస్త్ర పరంపరల్తో ఆ పాండవుల్ని, పాంచాల బలగాల్తో సహా మట్టుబెట్టి వస్తా, ఇదే నీకు మాటిస్తున్నా, నన్ను పంపు” అని కురురాజు అనుమతి కోరాడతను.

ఆ మాటలకెంతో ఆనందించాడు దుర్యోధనుడు. కృపాచార్యుణ్ణి ఓ కలశంలో నీళ్లు తెమ్మని కోరాడు. అతను మమ్మల్ని చూట్టానికి వచ్చి వున్న ఆశ్రమ మునికుమారుల్ని ప్రార్థించి కలశం తెప్పించి దాన్నిండా నీళ్లు నింపి తెచ్చాడు. ఆ నీళ్లతో అశ్వత్థామని తన సేనాపతిగా అభిషేకించమని కోరాడు దుర్యోధనుడు. అతనలాగే చేశాడు. అశ్వత్థామ ఆ గౌరవానికి పులకించిపోయి దుర్యోధనుణ్ణి ప్రీతిగా కౌగిలించుకుని సింహనాదం చేశాడు.

కృప, కృతవర్మలు చెరోపక్క నడవగా మహోగ్రరూపంతో పాండవశిబిరాల వైపుకి బయల్దేరాడు అశ్వత్థామ.

వాళ్లలా వెళ్లి శిబిరాల దాపుకి వచ్చేసరికి అక్కడంతా కోలాహలంగా వుంది. యుద్ధంలో జయం కలిగిన సంరంభంలో అంతా ఆడుతూ పాడుతూ తింటూ తాగుతూ తిరుగుతున్నట్టనిపించింది వాళ్లకి. ఆ సమయంలో అక్కడికి వెళ్తే వాళ్లంతా కలిసి మూకకట్టుగా మీదపడే అవకాశం వుందని గ్రహించి ముందుగా ఎక్కడైనా దూరంగా వెళ్లి కర్తవ్యం ఆలోచిద్దామని వాళ్లు అడవిలో కొంతదూరం ప్రయాణించి అక్కడొక మడుగు దగ్గర ఆగారు. సూతులు గుర్రాల్ని నీళ్లకి వదిలారు.

సూర్యాస్తమయం ఐంది. సాంధ్యసమయ కృత్యాలు నిర్వర్తించి ఒక మర్రిచెట్టు దగ్గర కూర్చున్నారు ముగ్గురూ. ఆకాశాన చుక్కలు పొడిచినయ్, వాళ్ల మనసుల్లో విషాదమేఘాలు కమ్ముకున్నయ్. తమ సైన్యంలో మహావీరులంతా ఎలా మరణించారో తల్చుకుంటూ వాళ్ల గురించి మాట్లాడుకుంటూ అలాగే నేల మీద ఒరిగారు. బాగా అలిసిపోయినందువల్ల కృపుడు, కృతవర్మ అలాగే నిద్రలోకి జారిపోయారు. అశ్వత్థామ మాత్రం కోపాతిశయం వల్ల నిద్రరాక పైకి చూస్తూ పడుకున్నాడు.

అతనలా చూస్తుండగా చీకటిముద్దలాటి ఒక గుడ్లగూబ ఎగురుతూ వచ్చిందక్కడికి. ఆ చెట్టు మీద అనేక కాకిగూళ్లున్నయ్. గుడ్లగూబ మెల్లగా శబ్దం చెయ్యకుండా ఆ గూళ్ల దగ్గరికి చేరి మంచి నిద్రలో వున్న ఆ కాకుల్ని కొన్నిటికి గొంతులు పిసికి, కొన్నిటికి కాళ్లు విరిచి, కొన్నిటి రెక్కలు పీకి, కొన్నిటి పొట్టలు చీల్చి, కొన్నిటిని నోట్లో వేసుకుని ఎముకలు నమిలి, అన్నిట్నీ స్వాహా చేసేసింది. అంతా అయాక ఆనందంగా ఒళ్లు విరుచుకుని రెక్కలు కొట్టింది.

అశ్వత్థామ అదిచూసి ఉత్తేజితుడయ్యాడు. “ఈ పక్షి నాకు ఉపదేశమివ్వటానికే వచ్చిందిలా. నిద్రలో వున్న నా శత్రువుల్ని చంపే మార్గం ఇదే, ఇంతసేపూ నాకు తట్టనే లేదు. రారాజుకి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇదొక్కటే దారి. నేరుగా వెళ్లి తలపడి పాండవులంత శక్తివంతుల్ని జయించటం నాకు సాధ్యమయే పని కాదు. పైగా ఇప్పుడు కాదు, తర్వాత వాళ్లని ఎలాగోలా చంపుదామంటే అప్పటిదాకా దుర్యోధనుడు బతికుండకపోవచ్చు. వేరేదారి లేనప్పుడు నిద్రలో వున్న శత్రువుల్ని చంపటం శాస్త్రసమ్మతం కూడాను. ఇదే తక్షణకర్తవ్యం” అని నిర్ణయించుకుని మామని, కృతవర్మని నిద్రలేపాడు అశ్వత్థామ.

అలాటి ఆతురతరుణాన సైతం నిద్రావశులైనందుకు లజ్జ పడుతూ లేచారు వాళ్లు. అశ్వత్థామ వాళ్లకి పాండవుల ఘోరాల్ని మరోసారి గుర్తుచేసి, “ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి” అనడిగాడు. దానికి కృపాచార్యుడు “ఏపనికైనా సాహసంతో పాటు దైవబలం కూడ తోడు రావాలి. ధర్మం తప్పని పనికి దైవం సాయం చేస్తుంది. కనక మనం తొందర పడకుండా ఏం చేసినా ధర్మమార్గాన చేద్దాం. దుర్యోధనుడు అవివేకి, మంచివాళ్లైన పాండవుల్ని అవమానాల పాలు చేశాడు, ఎవరి మాటలూ వినక ఇంత చేటు తెచ్చిపెట్టుకున్నాడు. మనం ముందు హస్తినకి వెళ్లి ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు కలిసి ఆలోచించి ఏం చెయ్యమని మనల్ని ఆజ్ఞాపిస్తారో అలా చేద్దాం” అని సలహా ఇచ్చాడు.

అశ్వత్థామకది రుచించలేదు. “ఈ ధర్మపన్నాలకిది సమయం కాదు. దివ్యాస్త్రమహిమోన్నతుడైన తండ్రిని యుద్ధంలో అధర్మంగా చంపిన నీచుడు సంబరాలు చేసుకుంటుంటే శాంతంగా వుండటం నావల్ల కాదు. యుద్ధంలో గెలిచామని ఆదమరచి ఆయుధాల్లేకుండా నిర్భీతిగా నిశ్చింతగా నిద్రపోతుంటారు శత్రువులంతా. వాళ్లని ముక్కలుముక్కలుగా నరకటానికి ఇంతకుమించిన మంచితరుణం దొరకదు. నేను వెళ్లి నా శస్త్రాస్త్రాల్తో ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలయోధుల్ని, పాండవుల్ని కత్తికో కండగా నరికి పోగులు పెట్టి అప్పుడు శుచినై వెళ్లి నా తండ్రికి అంత్యక్రియలు చేస్తా. ఇదే నా నిశ్చయం” అని తేల్చిచెప్పాడతను.

కృపుడు అతన్ని అనునయిస్తూ “తప్పకుండా శత్రువుల్ని జయిద్దాం, నీ మాటకి తిరుగులేదు. ఐతే బాగా అలిసిపోయివున్నావ్, సరిగా నిద్రలేదు. కాసేపు పడుకో. తెల్లవారగానే లేచి వెళ్దాం, శత్రువుల అంతు చూద్దాం. దివ్యాస్త్రవిదుడివి నువ్వు, బాహుబలంలో కూడ నీకు దీటెవరూ లేరు. రెండో ద్రోణుడివి. కృతవర్మా, నేనూ కూడ తక్కువ వాళ్లం కాదు. మనం ముగ్గురం కలిసి కృతనిశ్చయులమై మీద పడితే ఎలాటి సైన్యాలూ మనల్ని అడ్డుకోలేవు. కాబట్టి నువ్వు ధనువుని పక్కనబెట్టి కవచం తీసేసి కాసేపు హాయిగా నిద్రపో. పొద్దున్నే వెళ్లి వాళ్లో మనమో తేల్చుకుందాం” అని బోధించాడతనికి.

అశ్వత్థామ “మామా, నా మంచికోసమే నువ్వింతా చెప్తున్నావ్. ఐనా, మనం లేనప్పుడు మనరాజుని శత్రువులు ధర్మవిరుద్ధంగా కొట్టిన తీరు వింటే రాతిగుండెల వాళ్లకైనా కన్నీళ్లు కరుగుతయ్. అతను నాకు మిత్రుడు, ఎంతో మంచి చేసినవాడు. నేనిలా సిగపువ్వాడకుండా వుంటే అతనలా అన్నిపాట్లు పడటం విన్న నాకు నిద్రెలా వస్తుంది చెప్పు? పైగా పగలు వెళ్లి పాండవులతో తలపడదామంటావే, కృష్ణార్జునుల రక్షణలో వున్న వాళ్లని జయించటం ఎవరివల్లౌతుంది? ఇలా రాత్రివేళ వెళ్లి చంపటం తప్ప వేరే మార్గం లేదు. నా మనసు మార్చటానికి ప్రయత్నించకు. వాళ్లందర్నీ చంపి వచ్చాకే నాకు నిద్ర” అని బదులిచ్చాడు.

కృపాచార్యుడు వదలకుండా “నిద్రపోయేవాళ్లు పీనుగుల్తో సమానం. అలాటివాళ్లని చంపితే నరకానికి పోతావ్. మహాస్త్రవిదుల్లో మేటివే, ఇంతవరకు ఎలాటి మచ్చలేని వాడివే, ఇప్పుడీ దారుణమైన పని చెయ్యటం నీకు తగదు. సూర్యోదయమయాక సూర్యతేజుడివై శాత్రవవధ చేద్దువు” అని మళ్లీ చెప్పాడతనికి. అశ్వత్థామకి ఓర్పు పూర్తిగా నశించింది. “దయచేసి నాకింకేమీ చెప్పొద్దు. యుద్ధంలో జరిగిన అధర్మాలు తల్చుకుంటుంటే నా మనసు కుతకుతలాడుతుంది. నేను చెయ్యబోయే పని వల్ల నాకు కీటకజన్మ వచ్చినా పరవాలేదు, నేను అన్నిటికీ సిద్ధమే” అని కృతనిశ్చయుడై దిగ్గున వెళ్లి రథం ఎక్కాడు.

అతన్ని వారించటం అసంభవమని తేలిపోయింది కృపుడికి. “మమ్మల్ని వేరుగా చేసి నువ్వొక్కడివే వెళ్లటం భావ్యం కాదు. రారాజు పనికి ముగ్గురమూ ఒకే అభిప్రాయంతో వుందాం. మేమూ నీతో పాటే” అన్నాడతనితో. అశ్వత్థామ ఆనందించాడు. “ముందుగా నేవెళ్లి ధృష్టద్యుమ్నుణ్ణి కుక్కచావు చంపుతా. మీరూ మీకు తోచిన విధంగా చేద్దురు గాని, పదండి” అని కదిలాడు. పాండవసేనా శిబిరాల్ని కార్చిచ్చులాగా కాల్చటానికి బయల్దేరారా ముగ్గురు రథికులు.

ముగ్గుర్లోనూ ముందుగా శిబిరాల దగ్గరికి చేరుకున్నాడు అశ్వత్థామ.

అప్పుడొక మహాభూతం అతని ఎదుట నిలబడింది. అది విలాసంగా బుజమ్మీద వేసుకున్న శార్దూలచర్మం నుంచి ఇంకా రక్తం కారుతూనే వుంది. మహాసర్పాలు జంధ్యాల్లాగా వేలాడుతున్నయ్. విశాలమైన నోట్లోంచి వికృత నిశిత దంష్ట్రలు వెళ్లుకొచ్చినయ్. వేలకొద్ది కళ్లు వెలుగులు చిమ్ముతున్నయ్. ఒకేసారి ఉగ్రంగా, సుందరంగా, ఉజ్జ్వలంగా ఉన్న ఆ భూతం ఎవరూ కన్నదీ విన్నదీ కాదు. దాన్ని చూస్తే కొండలకైనా భయం వెయ్యాల్సిందే. దాని నోరు, కళ్లు, ముక్కులు, చెవులు అన్నిటినుంచి మంటలెగిసి మింటినంటుతున్నయ్. దాని తేజోపుంజాన్నుంచి శంఖ, చక్ర, గదా హస్తులైన విష్ణురూపులనేకులు బయటికి వస్తున్నట్టనిపించిందతనికి.

ఆ భయంకరాకారాన్ని చూసి ఏమాత్రం భయపడలేదు అశ్వత్థామ. వింటిని సారించి భల్లముఖ బాణవర్షాన్ని కురిపించాడు. ఐతే భూతం అన్నిటినీ అనాయాసంగా మింగేసింది. ఒక ఉగ్రశక్తిని విసిరాడతను. అది భూతానికి తగిలి విస్ఫోటనాలు రగిలిస్తూ ముక్కలుముక్కలై నేలరాలింది. మహోగ్ర ఖడ్గాన్ని బలంగా విసిరాడు. అదా భూతాన్ని తాకి దూదిపింజలా ఎగిరిపడింది. తోమరాల్ని, చక్రాల్ని ఎడతెగకుండా ప్రయోగించాడు. చిరునవ్వుతో వాటన్నిటిని గుటుక్కున మింగింది భూతం. అతను తగ్గకుండా మహాశక్తివంతమైన గదని బాహుబలమంతా ఉపయోగించి వేశాడు. సునాయాసంగా దాన్నీ మింగింది భూతం.

అశ్వత్థామకి ఇంకేం చెయ్యాలో తోచలేదు. ఇది తను చెయ్యబోతున్న అధర్మకార్యానికి దైవం కలిగిస్తున్న ఆటంకమా అని కాసేపు సందేహించాడు. దృఢచిత్తంతో శివుణ్ణి ధ్యానించాడు. రథం దిగి నేలమీద కూర్చుని మహాశివ ప్రార్థన చేశాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తే భూతనాథుణ్ణి నానా భూతోపహారాల్తో అర్చిస్తానని భావించుకున్నాడు. అతనికెదురుగా ఒక బంగారు వేదిక తోచింది. దాన్లో అగ్ని ప్రజ్జ్వరిల్లుతుంది. శివుడికి ఆత్మసమర్పణం చెయ్యటానికి నిశ్చయించుకున్నాడతను.

అతని నిశ్చయాన్ని పరీక్షించటానికా అన్నట్టు అనేక వికృతాకారులు అతనికి కనిపించారు. మృగాల శిరసులు, రకరకాల శరీర వర్ణాలు, వేలంత పొడవు నుంచి పర్వతాలంత వున్నవాళ్లు, అన్ని రకాల వికృతులూ వాళ్లలో వున్నయ్. వాళ్లు ఆడుతూ పాడుతూ తాగుతూ గెంతుతూ కపాలాల బంతులాడుతూ వికృతశబ్దాలు చేస్తూ అగుపించారు. అశ్వత్థామ ఎలాటి భయమూ లేకుండా చిరునవ్వుతో రథమ్మీది కోదండం అందుకుని దాని సాయంతో ఆ కుండం లోని చిచ్చులోకి దూకాడు. తన శరీరాన్ని కాల్చటానికి సరిపడే ఇంధనం అక్కడ లేకపోవటాన్ని గుర్తించి తిరిగి రథమ్మీదికి వచ్చి అక్కడున్న ఆయుధాలన్నీ కుండంలో వేసి అవి భగభగమండుతుంటే మహాదేవుణ్ణి ధ్యానిస్తూ ఊర్ధ్వబాహుడు, మహితాకారుడు, ఘనసమాధినిష్టుడు ఐ దాన్లో తిరిగి దూకాడు.

అలా దూకినా అతన్ని అగ్ని అంటనేలేదు. శివుడు ప్రత్యక్షమై ప్రీతితో అతన్ని పలకరించి “కృష్ణుడు నాకు, నేను అతనికి ప్రియం చేసేవాళ్లం కనక భూతరూపంలో నీకు అడ్డం వచ్చాను. నీ ధైర్యాన్ని పరీక్షించటానికి ఇలా అనేక రూపాల్లో ప్రయత్నించాను. కృష్ణుడికి నా కర్తవ్యం నెరవేర్చాను. పాంచాలురందరికీ కాలం తీరింది. ఇదిగో ఈ మహనీయ ఖడ్గం ఈ పనిలో నీకు సహకరిస్తుంది” అని ఒక ఉజ్జ్వలమైన ఖడ్గాన్నతనికిచ్చి అతనికి తెలియకుండా తేజోరూపంలో అతన్నావేశించాడు భూతనాథుడు. భూతం మింగిన ఆయుధాలన్నీ యధాపూర్వంగానే అతని రథం మీద వున్నయ్. రథం ఎక్కి శిబిరాన్ని చేరాడతను. ఇంతలోనే కృప కృతవర్మలు కూడ వచ్చి కలుసుకున్నారు.

అనేక శరాసనాలు, ఆయుధాలు తన రథం మీద వేసుకుని లోపలికి ప్రవేశించాడు అశ్వత్థామ. వాళ్లిద్దర్నీ వాకిలి దగ్గరే వుంచి బయటికి వచ్చే వాళ్లని నిర్దాక్షిణ్యంగా చంపమని చెప్పాడు. అదివరకు చారులు చెప్పినప్పుడు తను విన్న గుర్తుల ఆధారంగా ముందుగా ధృష్టద్యుమ్నుడి మందిరం వైపుకి కదిలాడు.

పగటి యుద్ధాన అలిసి పోయి, శత్రువులంతా చచ్చారని భయం తీరి, శిబిరాల్లో ఆదమరిచి నిద్రపోతున్నారంతా. దారి చూసుకుంటూ మెల్లమెల్లగా సాగాడు అశ్వత్థామ. ధృష్టద్యుమ్నుడి మందిరం ప్రవేశించాడు. అక్కడ అందమైన తెరలు వేలాడుతున్నయ్, మేలైన చాందినీలు మెరుస్తున్నయ్, దివిటీలు వెలుగులు చిమ్ముతున్నయ్. మెత్తటి పాన్పు మీద గాఢనిద్రలో వున్నాడు గురుద్రోహి. పట్టరాని క్రోధంతో పాదాల్తో నేలని తన్ని వాణ్ణి నిద్ర లేపాడు అశ్వత్థామ. ధృష్టద్యుమ్నుడు దిగ్గున లేచాడు గాని గాఢనిద్ర మూలాన అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదతనికి.

అశ్వత్థామ విల్లు పక్కన పెట్టి అతని మీద లంఘించి జుట్టు పట్టుకుని మెడని వెనక్కి విరిచి కిందికి ఈడ్చిపారేశాడు. రొమ్ముని మోకాల్తో మోదాడు. గుద్దుల్తో మొహాన్ని పచ్చడి చేశాడు. ధృష్టద్యుమ్నుడు అచేతనంగా పడ్డాడు. కళ్లు తేలేసి చూస్తున్నాడు. అశ్వత్థామ వింటిని తీసుకుని దాని తాటిని ఊడలాగాడు. ధృష్టద్యుమ్నుడి మెడకి చుట్టి మెలిపెట్టాడు. రొమ్ముని మెడని రెండుకాళ్లతో కుమ్ముతూ పైశాచికంగా తాటిని లాగసాగాడు. ధృష్టద్యుమ్నుడికి ఊపిరాడటం లేదు, కెక్కుకెక్కుమని శబ్దాలు తప్ప నోట మాట పలకటం లేదు. అతికష్టం మీద పదం పదం చొప్పున “బాణంతో చంపి నన్ను పుణ్యగతికి పోనివ్వు, ఎంత పగవాడినైనా ఇది కనీసధర్మం” అనగలిగాడు. అశ్వత్థామ కరగలేదు. “గురుద్రోహివి, నీకు ఉత్తమగతులా? కుత్సితంగా చంపావ్ నా తండ్రిని, నిన్నూ అలాగే చంపుతా” అని అతని గొంతు నులుముతుంటే అక్కడ వున్న వాళ్లంతా నిద్రలేచీ భయంతో నిశ్శబ్దంగా వుండిపోయారు. ధృష్టద్యుమ్నుణ్ణి కాళ్లతో, పాదాల్తో, ముష్టిఘాతాల్తో గుద్దిగుద్ది క్రూరంగా చంపాడు. గిలగిల కొట్టుకుని నెత్తురు కక్కుకుంటూ గాల్లో కలిశాడతను.

అలా అతన్ని చంపి పగదీర్చిన తృప్తితో అల్లెతాటిని తీసి వింటికి అమర్చాడు. ఒక బాణాన్ని సంధించి బైటికొచ్చి చిరునవ్వుతో రథం ఎక్కాడు. ముఖ్యమైన వాళ్ల మందిరాల కోసం చూస్తూ కదిలాడు.

ఇంతలో ధృష్టద్యుమ్నుడి మందిరంలో గగ్గోలుగా ఏడుపులు లేచినయ్. చుట్టుపక్కల వాళ్లంతా లేచి ఏమైందని పరిగెత్తుకొచ్చారు. “మనిషో రాక్షసుడో తెలీదు, ఎవడో ఒక్కడే వచ్చి ధృష్టద్యుమ్నుణ్ణి చంపి రథమ్మీద వెళ్తున్నాడు” అని చెప్పారు అక్కడివాళ్లు. చేతికి దొరికిన ఆయుధాలు తీసుకుని అశ్వత్థామ వెంటపడ్డారు కొందరు. అతను అదొక ఆటలా వాళ్లందర్నీ తన బాణాలకి బలిచ్చాడు. అక్కణ్ణుంచి ఉత్తమౌజుడి మందిరం చేరాడు. శివుడిచ్చిన కత్తిని తీసుకుని లోపలికి వెళ్లాడు. అతను మేలుకుని పాన్పు మీదే వుంటే ధృష్టద్యుమ్నుడి లాగానే జుట్టుపట్టి కిందికి ఈడ్చి పడేసి అతన్ని చంపినట్టే పశువులాగా కొట్టి బాది చంపాడు. ఆ దగ్గర్లో మరో పాన్పు మీద నిద్రిస్తున్న యుధామన్యుడు అతన్ని ఎవడో రాక్షసుడనుకున్నాడు. ఐనా భయపడకుండా అశ్వత్థామనొక గదతో మోదాడు. ఆవేశంలో వున్న అశ్వత్థామ దానికేమాత్రం చలించకుండా వెనక్కి తిరిగి వాణ్ణీ వాడి అన్నని చంపినట్టే కొట్టి చంపాడు.

అలా ఆ అన్నదమ్ముల్ని వధించి రెట్టించిన ఉత్సాహంతో రక్తధారలు కారుతున్న కత్తితో ఒక్కో మందిరంలోకి వెళ్లి కనిపించిన వాళ్లని కనిపించినట్టే నరికేశాడు. నిద్రలో వున్న వాళ్లని, సగం మేలుకున్న వాళ్లని, లేచి ఆయుధాల్తో ఎదుర్కున్న వాళ్లని, తనతో పోరాడిన వాళ్లని – అందర్నీ ఒకేరీతిగా నరికి పోగులేశాడు. అక్కణ్ణుంచి ఏనుగులు, గుర్రాల శాలలకి దారితీశాడు. ఆ జంతువులన్నిట్నీ విచక్షణారహితంగా నానా అంగాలూ నరికాడు. పీనుగుపెంటలు పోశాడు. యుద్ధ సామాగ్రులు నిలవచేసే పెద్ద భవంతుల్లోకి వెళ్లి కనిపించిన వాళ్లందర్నీ కత్తికి బలిచ్చి నాశనం చేశాడు. అలా పక్కపక్కనున్న మందిరాల్లోకి నడిచెళ్లి, దూరంగా వున్న వాటికి రథం ఎక్కి వెళ్లి, క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్సాహంతో విజృంభించి శత్రువుల రక్తంతో కత్తికి దాహం తీరుస్తూ సాగాడు. అప్పుడతను రక్తసిక్తమైన శరీరంతో నడుస్తున్న రాక్షసుడిలా వుంటే అతని కత్తి ఘోరాకారమైన రాక్షసిలా అతన్నంటిపెట్టుకుని వుంది. పాంచాల మందిరాలన్నీ తిరిగి దీక్షగా మారణహోమం సాగించాడతను.

అక్కణ్ణుంచి చేది సైన్యాలున్న చోటికి వెళ్లి అదే కార్యక్రమాన్ని కొనసాగించాడు. ఆ సైన్యాన్నీ సమూలంగా నాశనం చేసి పాండవులుండే రాజమందిరాల వైపుకి బయల్దేరాడు. అక్కడ శిఖండి, ద్రౌపదేయులు, ప్రభద్రక, మత్స్య బలగాల్ని సమకూర్చుకుని వచ్చి శస్త్రాస్త్రాల్తో అతన్ని తాకారు. లేళ్ల గుంపుని చూసిన సింహంలా అతను వాలూ కత్తితో వాళ్లమీదికి దూకాడు. చిత్ర విచిత్ర విన్యాసాల్తో ఆ బలాల్ని చెదరగొట్టి ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుణ్ణి రెండు ముక్కలుగా నరికాడు. అదిచూసి శోకంతో భీముడి కొడుకు శ్రుతసోముడు గుర్రాన్నెక్కి వచ్చి ఒక ఈటెతో అతన్నెదుర్కున్నాడు. అశ్వత్థామ లెక్కచెయ్యకుండా అతన్నీ, గుర్రాన్నీ ఒకే దెబ్బకి చంపాడు. నకులుడి కొడుకు శతానీకుడు భీకరమైన చక్రంతో అతని వక్షాన్ని రక్తం చిప్పిల్లేలా మోదాడు. దానికి తట్టుకుని నిలబడి బలమైన వేటుతో అతని తల నరికాడు అశ్వత్థామ. సహదేవుడి కొడుకు శ్రుతసేనుడు పరిగెత్తుకొచ్చి అతని మీద గద విసరబోతే అశ్వత్థామ వాడి మెడమీద తల లేకుండా చేశాడు. అర్జునుడి కొడుకు శ్రుతకీర్తి అతని మీద బాణవర్షం కురిపించాడు. అశ్వత్థామ ఆ బాణాలన్నిట్నీ అలాగే అతని శిరస్సునీ ఖండించాడు.

ఇలా ద్రౌపదేయులు ఐదుగురూ పరలోకాలకి ప్రయాణం కట్టటంతో ప్రభద్రకులు, శిఖండి వీరావేశంతో అతన్ని చుట్టుముట్టారు. అన్ని రకాల ఆయుధాల్ని అతని మీద ప్రయోగించారు. ఐతే అశ్వత్థామ ప్రభద్రకుల్ని నరుకుతూ వీరవిహారం చేశాడు. ఖడ్గంతో శిఖండి శిరస్సుని రెండు ముక్కలు చేశాడు. దొరలంతా అశ్వత్థామ దారుణవధల్లో క్రూరంగా మరణించినా వెనక్కితిరక్కుండా మిగిలిన సైన్యాలతనితో తలపడినయ్. కాని అతను శివమెత్తినట్టు దొరికిన వాళ్లని దొరికినట్టు అందిన అవయవాల్ని అందినట్టు ఖండిస్తూ చించిచెండాడుతుంటే నిలవలేక విచ్చిపోయినయ్. బతికిన వాళ్లు తలపాగాలు జారిపోతున్నా పట్టించుకోకుండా బయటికి పరుగులు పెట్టారు. అలా వాకిలి దగ్గరికి వచ్చిన వాళ్లని ఎంత ప్రాధేయపడుతున్నా వదలకుండా రాక్షసావేశంతో కృప కృతవర్మలు కత్తుల్తో, భల్లాల్తో ఊచకోత కోశారు, ఎవరూ ప్రాణాల్తో బయటపడకుండా చేశారు.

శిబిరంలో ప్రాణంతో వున్న జీవి లేకుండా చేసి సంతృప్తిగా బయటికి వచ్చాడు అశ్వత్థామ. ఒళ్లూ, కత్తీ శత్రువుల రక్తంలో మునిగివున్నయ్. కత్తి కూడ అతని శరీరంలో ఒక భాగం ఐంది.

అతను లోపలికి వెళ్లేముందు ఎంత నిశ్శబ్దంగా వున్నాయో ఇప్పుడూ అంతే నిశ్శబ్దంగా వున్నయ్ పాండవశిబిరాలు. అప్పుడే తెలతెలవారుతున్నది.

దుర్యోధనుడితో అన్న మాట అలా నిలుపుకున్న అశ్వత్థామ బయటికి వచ్చి కృప, కృతవర్మల్ని కలుసుకున్నాడు. “పాంచాలురంతా పరలోకాలకి పోయారు. పాంచాలి కొడుకులూ వాళ్లతో కలిశారు. చేది, మత్స్య, ప్రభద్రక బలాలు మనిషి మిగలకుండా మడిసినయ్. అసలు గుర్రం, ఏనుగు, మనిషి అని తేడా లేకుండా అన్నీ నాశనం ఐనయ్. పాండవులు ఐదుగురూ, కృష్ణుడు, సాత్యకి ఎటుపోయారో తెలీదు; తప్పించుకున్నారు. శివుడి అనుగ్రహం, మీ ఇద్దరి సహాయం మనకార్యాన్ని విజయవంతంగా పూర్తిచేయించినయ్” అని ఆవేశంగా చెప్పాడు వాళ్లతో.

ఐతే వాళ్లిద్దరూ రాక్షసుల్లా తము చేసిన నీచప్పని తల్చుకుని సిగ్గుపడుతూ అతని ఉత్సాహంలో పాలుపంచుకోలేకపోయారు. అతనికి తమ పశ్చాత్తాపం చూపించటానికి ఇష్టం లేక మొక్కుబడిగా మాత్రం అతన్ని పొగిడారు. ఈ విషయం అంతా వినటానికి దుర్యోధనుడింకా బతికే వున్నాడో లేడో అని హడావుడిగా అతని దగ్గరికి బయల్దేరారు ముగ్గురూ.

అక్కడ దుర్యోధనుడు చావుకి దగ్గర్లో వున్నాడు. ఊపిరి సన్నగిల్లుతున్నది. శరీరంలో కదలికలు తగ్గుముఖం పట్టినయ్. దిక్కులేక దీనంగా నేలమీదే పడి వున్నాడు. ఆ స్థితిలో అతన్ని చూసేసరికి వాళ్ల గుండెలు తరుక్కుపోయినయ్. రథాల మీంచి కిందికి దూకి ధనుస్సులు విసిరి పారేసి కన్నీళ్లు ధారలుగా కారుతుంటే అతన్ని చేరుకున్నారు. అతని శరీరాన్ని తాకిచూశారు. “రారాజా, మేం ఎవరమో గుర్తించగలవా?” అని ఏడుస్తూ పలకరిస్తే అతను అతికష్టం మీద కళ్లు తెరిచాడు. అతని వంకే చూస్తూ అశ్వత్థామ గద్గదకంఠంతో “గదాయుద్ధంలో నీతో సమానులెవరూ లేరని నిరూపించావ్, ఒక దుర్మార్గుడి అధర్మ వర్తనతో ఇలా నిస్సహాయుడివై నేల మీద పడ్డావ్. రాజధర్మాన్ని చివరివరకు నిర్వర్తించి పుణ్యలోకాలకి ప్రయాణం కట్టబోతున్నావ్. బలరాముడు తన శిష్యులందర్లో నువ్వే అగ్రగణ్యుడివని ఎప్పుడూ అంటుంటాడు, ఆ మాట నువ్వు నిలబెట్టావ్. అధర్మయుద్ధంలో నిన్ను ఓడించటానికి కృష్ణుడు, అర్జునుడు, భీముడు కలిసి కుట్రచెయ్యాల్సొచ్చింది. భీముడు చేసిన పనిని చూస్తూ కూడ అతన్ని దండించలేకపోయాడే ధర్మరాజు, అతనూ ఒక రాజేనా? పైకి వేషాలే గాని అతనికి లోపలంతా కుత్సితమే. ఇలాటి గెలుపు వల్ల వాళ్లు ఏం బావుకుంటారు? వాళ్ల కీర్తికి కళంకం తెచ్చిపెట్టుకున్నారు. నీకు యశస్సు, వాళ్లకి మాయని మచ్చ దక్కినయ్. లోకానికి నీ ఔన్నత్యం తెలిసింది.

నేను తిన్న తిండి, కట్టిన బట్ట, చుట్టాల పెట్టుపోతలు, చేసిన దానాలు, యాగాలు, అన్నీ నువ్విచ్చిన సంపదల మూలానే. ఇన్నాళ్లూ కొండంత అండగా నిలబడ్డ నువ్వు పుణ్యలోకాలకి పోతుంటే ఒళ్లు దాచుకుని బతికేవున్నా, నేనూ ఒక సేవకుణ్ణేనా? ఇప్పుడు నీతో రాలేకపోతున్నా నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోగలిగా, నీ విరోధుల్ని నాశనం చేశా. నువ్వు నా తండ్రిని చూసినప్పుడు తనకి ద్రోహం చేసిన ఆ నీచుడు ధృష్టద్యుమ్నుణ్ణి పశువుని చంపినట్టు చంపానని చెప్పు. నా బదులుగా ఆయన్ని నువ్వు కౌగిలించుకో. నీ చెవులకి అమృతం పోసేట్టు నేను చేసిన పని చెప్తా విను. రాత్రివేళ శత్రుశిబిరాలు ప్రవేశించి ముందుగా ఆ పాపాత్ముడు ధృష్టద్యుమ్నుణ్ణి పశువునిలా చంపా. తర్వాత వాడి చుట్టాలందర్నీ ఊచకోత కోశా. ద్రౌపది కొడుకుల్ని ఒక్కణ్ణి వదలకుండా వరసపెట్టి నరికా. ఆ ప్రదేశం అంతా పీనుగుల పెంటలు పోశా. ఏనుగులు, గుర్రాలు, మనుషులు అని చూడకుండా బతికున్న దాన్నల్లా చంపా. పాండవపంచకం, కృష్ణుడు, సాత్యకి నాకు దొరకలేదు గాని మిగతా వాళ్లు ఒక్కరు కూడ మిగల్లేదు. ఈ ఇద్దరు మహావీరులు నాకు తోడుగా ఈ మారణహోమాన్ని దిగ్విజయం చేశారు” అని వివరించాడు.

ఆ మాటలు విని దుర్యోధనుడికి ప్రాణం లేచొచ్చింది. నాలిక్కి బలం వచ్చింది. “నువ్వూ, ఈ యోధులు కలిసి నా శత్రువులకి కలిగించినంత నష్టం భీష్ముడు గాని ద్రోణుడు గాని కలిగించలేకపోయారు. మొనగాడనుకున్న కర్ణుడు గాని, అతన్ని కూడ మించిన శల్యుడు గాని సాధించలేని దాన్ని నువ్వు సాధించావ్. మీరు నాకు ప్రీతి కలిగించారు, కృతకృత్యులయారు. సుఖంగా జీవించండి. మళ్లీ స్వర్గంలోనే మన పునర్దర్శనం” అని చెప్పి తృప్తిగా కన్నుమూశాడు నీ కొడుకు.

వాళ్లతన్ని వదల్లేక వదల్లేక వదిలి దుఃఖంతో పొగుల్తూ రథాలెక్కి వెళ్లిపోయారు. తెల్లవారింది. వ్యాసుడు నాకిచ్చిన వరం దుర్యోధనుడి మరణంతో ముగిసిపోయింది. అక్కడ నేను చూసినదంతా నీకు వివరించి చెప్పటానికి నేనిలా వచ్చాను” అని తన భారతయుద్ధ కథనాన్ని ముగించాడు సంజయుడు.

“ఆ తర్వాత పాండవులు ఏం చేశారు?” అని వైశంపాయనుణ్ణి జనమేజయుడు కుతూహలంగా అడిగాడు. అతను ఇలా చెప్పుకొచ్చాడు.

సూర్యోదయం కావటంతో ధర్మరాజు తమ్ముల్తో కృష్ణ సాత్యకుల్తో కూర్చుని వున్నాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడి సారథి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. అశ్వత్థామ ఒక్కడే శిబిరాల్లోకి వచ్చి ఎలా నిద్రలో వున్న అందర్నీ దయాదాక్షిణ్యాలు లేకుండా చంపి శవాల గుట్టలు పోశాడో వినిపించాడు. తను కృతవర్మ చేతిలో పడితే అతను సూతుడనే దయతో తనని వదిలేశాడని, అలా బతికి బయటపడి రాగలిగానని చెప్పాడు.

అదివిన్న ధర్మరాజు శోకావేశంతో మూర్ఛపోయి కిందపడ్డాడు. అందరూ కలిసి అతన్ని పట్టుకుని మూర్ఛతేర్చారు. అతను ఏడుపుగొంతుతో “శత్రువులందర్నీ, వాళ్ల బంధుమిత్రుల్తో సహా చంపి రాజ్యం సంపాయించామని ఇక్కడ నేను ఆనందిస్తుంటే అక్కడ మనవాళ్లందరూ విరోధుల చేతిలో మూకచావు చచ్చారు. నేను గెలిచినట్టా ఓడినట్టా? లోకం ఏమనుకుంటుంది? భీష్ముడి ప్రతాపాగ్ని జ్వాలల నుంచి బయటపడి, ద్రోణుడి సునిశితబాణపరంపరలకి తట్టుకుని, రాధాతనయుడి ఘోరాస్త్ర శస్త్రాలకి చిక్కకుండా నిలబడి, చివరికిలా కొందరు దుండగుల చేతుల్లో బిడ్డలంతా బలయ్యారే ! సముద్రమంతా దాటుకుని వచ్చి పిల్లకాలవలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నట్టయింది కదా. తండ్రి చావుతోనే దుఃఖిస్తున్న పాంచాలి ఇప్పుడు కొడుకులు, తమ్ముళ్లు అంతా ఒకేసారి మరణించారని విని ఎలా తట్టుకోగలుగుతుంది? తనకెప్పుడూ రానంత కష్టం ఇప్పుడు వచ్చిపడింది” అని ఎంతగానో బాధపడ్డాడు.

ద్రుపదుడు, విరాటుడు మరణించాక వాళ్ల భార్యల్ని అనునయించటానికి సుభద్రని, కోడళ్లని వెంటబెట్టుకు వెళ్లిన ద్రౌపది అప్పుడు ఉపప్లావ్యంలో వుంది. ధర్మరాజు నకులుణ్ణి పిలిచి మంచి త్వరితమైన గుర్రాల్ని తీసుకుని అక్కడికి వెళ్లి ద్రౌపదిని, ఆమె బంధువర్గంలోని స్త్రీలందర్నీ తీసుకుని విడిదులకి వెళ్లమని చెప్పాడు. వాళ్లక్కడికి చేరేసరికి ఇటునుంచి కూడ అందరమూ అక్కడికి చేరతామని చెప్పాడతనికి. నకులుడు బయల్దేరి వెళ్లాడు.

పాండవులు, కృష్ణుడు, సాత్యకి శిబిరాలకి వెళ్లి అక్కడ జరిగిన దారుణాన్ని కళ్లారా చూశారు. శవాలై వికృతాకారాల్తో పడున్న కొడుకులు, బంధువుల్ని చూసి పాండవులు, కృష్ణుడు మూర్ఛపోయారు. సాత్యకి అతిప్రయత్నం మీద అందర్నీ తెలివిలోకి తెచ్చాడు. కొడుకులు ఒక్కొక్కర్ని చూసుకుంటూ ధర్మరాజు గోలుగోలున ఏడ్చాడు. చివరికి ఏడుపు ఆపి కొడుకులు, బంధువులకి చెయ్యవలసిన అగ్నికార్యాలు చేశాడు. అందరూ ద్రౌపది రాక కోసం ఎదురుచూస్తున్నారు.

అక్కడ ద్రౌపది నకులుడి నుంచి కొడుకులు, తమ్ముల చావు గురించి విని గుండెలవిసేలా ఏడ్చింది. స్త్రీలంతా కలిసి విడిదులకి వచ్చారు. ద్రౌపది దూరాన్నుంచే ధర్మరాజుని చూసి ఆక్రందనలు చేస్తుంటే నకులుడామెని చెయ్యిపట్టి రథం దించాడు. మిగిలిన స్త్రీలు కూడ వాహనాలు దిగి ఆమెను చుట్టుకున్నారు. తూలుతూ కొన్ని అడుగులు వేసి పడిపోయింది ద్రౌపది. భీముడు పరుగున వెళ్లి ఆమెని పట్టిలేపి ధర్మరాజు దగ్గరికి ఎత్తుకెళ్లాడు.

అప్పుడామె అతిప్రయత్నం మీద లేచి నిలబడి కన్నీళ్లు ధారలుగా పారుతుంటే ” సామ్రాజ్యం దక్కింది, నా కొడుకులంతా నీకు చేదోడువాదోడుగా వుంటూ కళ్లెదుటే తిరుగుతుంటే చూద్దామనుకున్న నా కలలు కల్లలయినయ్. అమేయపరాక్రమశాలి సుభద్ర కొడుకూ యుద్ధానికి బలయ్యాడు. ఎన్ని భోగాలు కలిగినా వాటి కోసం బిడ్డల్ని పోగొట్టుకుంటామా? గాఢనిద్రలో వున్న నా కొడుకుల్ని నీచంగా చంపిన ఆ పాపాత్ముడు అశ్వత్థామ బతికుంటే నాకు శాంతి లేదు. ఇప్పుడే భీముణ్ణి పంపి వాణ్ణి చంపించకపోతే నేను ప్రాయోపవేశం చేసి మరణిస్తా, వేరే దారే లేదు” అని తెగేసి చెప్పింది ధర్మరాజుతో.

అతనూ “రాచబిడ్డలు యుద్ధంలో మరణించటం పుణ్యగతులకి దారి అని నీకు చెప్పనక్కర్లేదు. బిడ్డల కోసం బాధపడకు. ఆ పాతకుడు అశ్వత్థామని చంపటం నాకూ అభిమతమే. ఐతే వాడు అడవులు పట్టి పోయినట్టున్నాడు, వాణ్ణి చంపినట్టు నీకు తెలిసేదెలా?” అంటే ద్రౌపది “వాడి దగ్గర సహజమైన శిరోమణి ఉన్నదని విన్నా, దాన్ని తీసుకొచ్చి నాకు చూపిస్తే అప్పుడే నేను ప్రాణాల్తో వుంటా” అని నొక్కి చెప్పిందతనికి. భీముణ్ణి చెయ్యితట్టి “రాజధర్మం పాటించి వెళ్లి ఆ పాపిని చంపి రా. నా శోకాన్ని తగ్గించి ప్రాణాన్ని కాపాడు. లక్కయిల్లు కాలినప్పుడు చూపించిన పౌరుషాన్ని, మహోగ్రంగా అడ్డుకున్న హిడింబాసురుడి మీద చూపిన చొరవని, యక్షులు చుట్టుముడితే ఓడించి సౌగంధికా పుష్పాన్ని తెచ్చిన బాహుబలాన్ని, నీచ కీచకుడి మీద సాగించిన విక్రమాన్ని కలగలిపి, మనల్ని గెలిచానని విర్రవీగుతున్న ఆ అశ్వత్థామని మట్టిగరిపించు” అని అతన్ని ప్రోత్సహించింది.

అంతకు ముందు ధర్మరాజు ద్రౌపదితో అన్న మాటలు తను అశ్వత్థామ మీదికి వెళ్లటానికి అనుమతిగా అర్థం చేసుకున్నాడు భీముడు. వెంటనే రథాన్ని సిద్ధం చెయ్యమని నకులుణ్ణి కోరాడు. అతనూ అశ్వత్థామ అంతు చూడటానికి ఉవ్విళ్లూరుతూ రథం సిద్ధం చేసి, ఆయుధాల్ని ఎక్కించి తనే సారథ్యానికి పూనుకున్నాడు. ఇద్దరూ శిబిరాన్ని వదిలి రథాల గుర్తులు చూసుకుంటూ వెళ్లి దార్లో కనిపించిన వాళ్లని అశ్వత్థామ ఎటు వెళ్లాడో కనుక్కోసాగారు. అతను కృప, కృతవర్మల్తో కలిసి హస్తినాపురం వైపుకి వెళ్లి మళ్లీ గంగాతీరానికి తిరిగొచ్చి అక్కడ కృపుణ్ణీ, కృతవర్మనీ వదిలి తనొక్కడే వ్యాసమహాముని ఆశ్రమం వైపు వెళ్లి అక్కడే వుంటున్నాడని విన్నట్టు కొందరు చెప్పారు. అటు దారితీశాడు భీముడు.

అక్కడ భీముడిలా బయల్దేరిన వార్త విని కృష్ణుడు ధర్మరాజుతో “ఇలా భీముడొక్కడే అశ్వత్థామ మీదికెళ్లటం ప్రమాదకరం. ద్రోణుడు బ్రహ్మశిరోనామకం అనే దివ్యాస్త్రాన్ని అశ్వత్థామ కిచ్చాడు. అది భూమి మొత్తాన్ని దహించగలిగేంత శక్తివంతమైంది. అదే అస్త్రాన్ని అర్జునుడిక్కూడ ఇచ్చాడు. ఐతే అశ్వత్థామకి అర్జునుడి అస్త్రనైపుణ్యమంటే అసూయ వున్నదని, జాగ్రత్తగా వుండకపోతే అతను దాన్ని పాండవుల మీద ప్రయోగిస్తాడని భయపడ్డాడు ద్రోణుడు. అందుకని కొడుకుతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగించొద్దని, అలా చేస్తే తనకే గొప్ప అశుభం జరుగుతుందని వివరించాడు. ఎలాటి ఆపదలు వచ్చినా అది తప్ప వేరే ఉపాయాల్తో బయటపడమని నొక్కిచెప్పాడు. అంత చెప్పినా వీడు తన మాట వినడని లోపల అనుకున్న విషయం పైకే అనేశాడు. అది విని అశ్వత్థామ ఎంతో బాధపడ్డాడు కాని తండ్రి మాటల్ని మాత్రం పూర్తిగా మనసు కెక్కించుకోలేదు.

వీడెలాటివాడో చెప్పటానికి ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తా. మీరు అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఒకసారి ద్వారకకి వచ్చి తనకి నా చక్రాన్నిస్తే తను నాకు బదులుగా బ్రహ్మశిరోనామకాన్ని ఇస్తానన్నాడు. ఎందుకంటే ఆ చక్రంతో ఈ యుద్ధంలో నన్నూ అర్జునుణ్ణీ ఓడించాలని వాడి కోరికట. దానికి నేనేమో, అతిథిగా వచ్చిన నీ దగ్గర నేనేమీ కోరను, నా ఆయుధాల్లో నీకు ఇష్టమైంది ఏదో ఒకటి తీసుకో అని చెప్పా. వాడు ఆనందంగా వెళ్లి చక్రాన్ని ఎత్తటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంచెమైనా కదిలించ లేకపోయాడు. నా అన్నదమ్ములు గాని, నాకు అత్యంత ప్రేమపాత్రుడైన అర్జునుడు గాని ఏనాడూ నా చక్రం కావాలని అడగలేదు. అలాటిది ఆ బ్రహ్మశిరోనామకం వల్ల కలిగిన గర్వంతో వాడు నా చక్రాన్ని కోరుకున్నాడు. అలాటి వాడు ఇప్పుడు భీముడి మీద దాన్ని ప్రయోగించటానికి ఏమాత్రం వెనకాడడు. మనం వెంటనే బయల్దేరి వెళదాం” అని సాత్యకిని, సహదేవుణ్ణి శిబిరం దగ్గర వుంచి ధర్మరాజుని, అర్జునుణ్ణి తన రథం మీద ఎక్కించుకుని తనే సారథ్యం వహించి బయల్దేరాడు కృష్ణుడు.

కృష్ణ సారథ్యంలో ఆ ఉత్తమాశ్వాలు వేగంగా వెళ్లి భీముడి రథాన్ని కలుసుకున్నయ్. ఐతే వాళ్లు తనని అశ్వత్థామ మీదికి వెళ్లకుండా ఆపటానికి వచ్చారని భీముడు వాళ్ల మాటలు వినకుండా ముందుకు దూసుకుపోయాడు. అక్కడ నదీసమీపంలో శిష్యబృందం మధ్యలో వ్యాసభగవానుడు వుంటే ఆయనకి మనసులోనే నమస్కరించుకుని చుట్టూ చూశాడు. కొంచెం దూరంగా ఒంటినిండా బూడిద పూసుకుని పద్మాసనంలో కూర్చుని కనిపించాడు అశ్వత్థామ. మహాకోపంతో ధనుస్సుకి బాణాన్ని సంధించాడు భీముడు. “ఓరి బ్రాహ్మణాధమా, ఇంతలోనే బూడిద పూసుకుని ముక్కుమూసుకు కూచుంటే మునివై పోతాననుకున్నావా? ఈ దొంగవేషాలు చాలుగాని ధనుస్సు తీసుకో, యుద్ధానికి బయల్దేరు” అని అతన్ని సవాలు చేశాడు.

ఎదురుగా భీముణ్ణి, అతని వెనకనే వస్తున్న కృష్ణార్జునుల్ని చూశాడు అశ్వత్థామ. అర్జునుడి దివ్యాస్త్ర వైభవాన్ని తల్చుకున్నాడు. అసూయతో అతని మనసు భగ్గుమంది. వెంటనే బ్రహ్మశిరోనామకాన్ని చేతిలోని దర్భల్లోకి ఆవాహన చేసి “ఈ అస్త్రంతో పాండవులన్నవాళ్లు మిగలకుండా నశించిపోవాలి” అని నిశ్చయించి ప్రయోగించాడు. ఆ మహాదివ్యాస్త్రం ప్రళయభీకరంగా ప్రపంచాన్నంతటినీ భస్మీభూతం చెయ్యటానికి అగ్నిజ్వాలల నాలుకలు చాస్తూ బయల్దేరింది.

కృష్ణుడు త్వరితంగా “అర్జునా, అర్జునా, అది బ్రహ్మశిరోనామకం, వేరే అస్త్రం ఏదీ దాన్ని ఆపలేదు. దాన్ని వెంటనే బ్రహ్మశిరోనామకంతోనే నాశనం చెయ్యాలి, త్వరపడు” అంటే అర్జునుడు గబాల్న రథం దిగి నియతుడై ఆచార్యుణ్ణి మనసులో స్మరించుకుని శరాన్ని సంధించి ముందుగా అశ్వత్థామకి ఎలాటి కీడు కలక్కూడదని, తర్వాత తనకీ తన వారికీ శుభం కలగాలనీ కోరుకుని అస్త్రదేవతలకి నమస్కరించుకుని అస్త్రం అస్త్రంతో ప్రతిహతం కావాలని భావించుకుని ప్రయోగించాడు. ఆ అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన దాన్ని ఆక్రమించబోతే అది దొరక్కుండా ఇంకా ప్రజ్జ్వరిల్లింది. అలా ఆ రెండు అస్త్రాల మధ్య జరుగుతున్న ఘోరసమరానికి సముద్రాలు అల్లకల్లోలమయినయ్, భూమి కంపించింది, కులపర్వతాలు కదిలినయ్.

అప్పుడు నారదముని వ్యాసుణ్ణి సమీపించాడు. వాళ్లిద్దరు కలిసి ప్రళయం సృష్టిస్తున్న ఆ అస్త్రాల్ని ఆపటానికి అర్జున, అశ్వత్థామల మధ్య నిలబడ్డారు. “మీకన్న ముందు వచ్చిన ఎంతోమంది మహాత్ములు ఎన్నో యుద్ధాలు చేశారు కాని ఎవరైనా ఇలాటి అస్త్రాల్ని మనుషుల మీద ప్రయోగించటానికి సాహసించారా? మీరిద్దరూ మహావీరులు, మీకిది ఉచితం కాదు” అని చెప్పారు వాళ్లిద్దరితో. అర్జునుడు వాళ్లతో “కేవలం అతను ప్రయోగించిన అస్త్రాన్ని ఆపటానికే నేను ప్రయోగించా, మీరు కోరితే ఇప్పుడే ఉపసంహరిస్తా. ఐతే నేను ఉపసంహరిస్తే ఆ పాపాత్ముడు మమ్మల్ని సంహరించవచ్చు. కనక మా క్షేమాన్ని మీ దృష్టిలో పెట్టుకోండి” అని అప్పటికప్పుడే తన అస్త్రాన్ని ఉపసంహరించాడు.

ధృతరాష్ట్ర మహారాజా, అలా బ్రహ్మశిరోనామకాన్ని ఉపసంహరించటం చాలా గొప్ప విషయం. తపం, బ్రహ్మచర్యం, దానం, సత్యం ఉన్న ఆ అర్జునుడికి సాధ్యం ఐంది తప్ప ఇతరులకి ఆ మహోగ్రాస్త్రాన్ని వెనక్కి తిప్పటం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా సాహసించి వారించినా అది వాళ్ల తలనే నరుకుతుంది. గురుభక్తి, వ్రతయుక్తి పుష్కలంగా వున్న అర్జునుడే అలా తిప్పి బతగ్గలిగాడు. మునులిద్దరూ అతని శక్తికి విస్తుపోయారు.

ఇక అశ్వత్థామ కూడ తన అస్త్రాన్ని మరలుద్దామని చూశాడు కాని అదతనికి సాధ్యం కాలేదు. దీనుడై వ్యాసుణ్ణి చూశాడు – ఆ మహాముని ఏదైనా ఉపాయం ఆలోచించలేకపోతాడా అని. అతనితో “రారాజుని అధర్మ యుద్ధంలో చంపిందే కాక ఈ భీముడు నన్ను చంపటానికీ సిద్ధమయాడు, మీరంతా చూశారు. పరాభవం వల్ల, ప్రాణభయం వల్ల ఆలోచన లేకుండా నేనీ మహాస్త్రాన్ని ప్రయోగించా; ఐతే ఇది పాండవ వంశనాశనం చెయ్యకుండా ఆగదు. నాకెలాటి పాపాలు చుట్టుకున్నా చుట్టుకోనీ” అని నిక్కచ్చిగా చెప్పాడు.

వ్యాసుడతన్ని సూటిగా చూస్తూ “నీ తండ్రి అర్జునుడి మీది వాత్సల్యం వల్ల అతనికీ అస్త్రాన్నిచ్చాడు. అతను కూడ నీ అస్త్రాన్ని ఉపసంహరించటానికే తనూ వేశాడు కాని నీకు కీడు తలపెట్టి కాదు. మేం వద్దంటే తన అస్త్రాన్ని తను వెనక్కి తీసుకున్నాడు. అలాటి అస్త్రవిద్యావిశారదుణ్ణి చంపటం నీ తరమౌతుందా? అవసరమైతే నీ అస్త్రాన్ని అతని అస్త్రం ఆపుతుంది. అదీగాక, మనుషుల మీద ఈ అస్త్రాన్ని వేస్తే వేసిన వాళ్లకి అశుభం కలుగుతుంది. ఇంకా, ఒకడు ప్రయోగించి, మరొకడు తన అస్త్రాన్ని ఉపసంహరిస్తే ఆ దేశానికి పన్నెండేళ్లు అనావృష్టి కలుగుతుంది. కాబట్టి, పాండవుల్ని, నిన్ను, ఈ దేశాన్ని రక్షించే మార్గం చెప్తా, విను. నువ్వు నీ అస్త్రాన్ని ఉపసంహరించి నీ శిరోమణిని అర్జునుడి కివ్వు. నిన్ను ప్రాణాల్తో వదిలి వాళ్లు వెళ్తారు. ఇప్పటికిది అన్ని విధాల శ్రేయస్కరమైన సంధి మార్గం” అని బోధించాడు.

అది అశ్వత్థామకి మింగుడు పడలేదు. “రత్నాలు కావాలంటే పాండవులకి ఇప్పుడేం కొదవ? కౌరవభాండాగారంలో వున్న సంపదంతా వాళ్లదే. ఇకపోతే ఈ శిరోమణి వల్ల సర్పభయం గాని, తస్కరభయం గాని, రాక్షసభయం గాని, దేవభయం గాని వుండవు; ఆకలిదప్పులు, నిద్ర, రోగాలు దాపులకి రావు. నాలాటి వాడికి ఇది అవసరం కాని వాళ్లకెందుకు? ఐనా నీ మాట శిరోధార్యం. మణిని నీకిస్తా, నీకు న్యాయం అనిపించింది చెయ్యి. ఇక నా అస్త్రం పాండవుల్ని వదిలి పాండవేయ పత్నుల గర్భాల్ని మాత్రం విచ్ఛిన్నం చేసి శాంతిస్తుంది” అని మరో దారి సూచించాడు.

వ్యాసుడు దానికి “అలాగే చెయ్యి; కాని మరీ అత్యాశకి పోకు” అన్నాడు. వ్యాసుడి ఉద్దేశం అది కేవలం పాండవ పత్నుల గర్భనాశనంతో ఆగాలని, పాండవుల కొడుకుల పత్నుల్ని వదిలెయ్యాలని అని అశ్వత్థామకి అర్థం ఐంది. ఐతే దాని గురించి మళ్లీ వాదం ఎందుకని, వ్యాసుడి మాటలకి అంగీకరించినట్టు నటించి తను చెయ్యదల్చుకుంది తను చేద్దామని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం వ్యాసుడు గ్రహించాడు. అది కృష్ణుడూ గ్రహించాడని వ్యాసుడు గ్రహించాడు. కృష్ణుడు మాట్టాడబోతున్నాడని తను మౌనం వహించాడు.

అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో “పాండవుల కొడుకులందర్నీ చంపావ్, అది చాలక ఇప్పుడు వాళ్ల పత్నుల గర్భాల్ని కూడ చంపాలని చూస్తున్నావ్, పాపాన పోతావ్. కనీసం వాటిలో ఒకదాన్నైనా వదిలెయ్” అన్నాడు కఠినంగా. అశ్వత్థామ ఉద్రేకంగా అతనితో “నీ పక్షపాత బుద్ధి చూపించుకున్నావ్. ఉత్తర గర్భాన్ని రక్షించాలని నీ ప్రయత్నం. నేను ఎవర్నీ వదలను, నా అస్త్రం అన్ని పిండాల్నీ నాశనం చెయ్యాల్సిందే” అని పట్టుబట్టాడు. కృష్ణుడు దానికి “అభిమన్యుడి తేజాన్ని మోస్తున్నది ఉత్తర. నువ్వేం చేసినా సరే నేనా బిడ్డని బతికించి దీర్ఘాయువిస్తా” అని బదులిస్తే అశ్వత్థామ నవ్వి “అస్త్రదగ్ధుణ్ణి నిజంగానే నువ్వు బతికించగలిగితే అప్పుడు నీ గొప్పతనం బయటపడుతుందిలే” అని హేళన చేశాడు.

కృష్ణుడు కోపంగా “బాలఘాతివైన నువ్వు తినటానికి తిండి దొరక్క తోడెవరూ లేక దుర్గంధరక్తంతో శరీరం కుళ్లిపోతుంటే మూడువేల ఏళ్లు తిరుగుతావ్ పో. అభిమన్యుడి కొడుకుని నేను రక్షిస్తా, అతను పరీక్షిత్తు అనే పేరుతో కృపాచార్యుడి దగ్గర ధనుర్వేదం చదివి సర్వశస్త్రాస్త్రాలు పొంది ఎంతో కాలం పాలిస్తాడు. అతని కొడుకు జనమేజయుడు మహాశక్తి సంపన్నుడై రాజ్యం పాలించటం కూడ నువ్వు చూస్తావ్. నా మహిమ ఏమిటో చూడాలన్నావుగా, చూద్దువు గాని” అన్నాడతనితో.

వ్యాసుడు కూడ “బ్రాహ్మణుడివై వుండీ క్రూరుడివై, నా మాటల్ని లక్ష్యపెట్టకుండా పాపానికి పూనుకున్నావ్, కృష్ణుడన్నట్టే ఔతుంది నీ గతి. నా ఎదట ఉండొద్దు, పో” అని ఈసడిస్తే అశ్వత్థామ “నువ్వు ఎప్పటికీ మనుషుల్లోనే ఉంటావు పో” అని అతనికి ప్రతిశాపం ఇచ్చి “నీ దగ్గరలోనే నేనూ ఉంటా” అని చెప్పి శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి పోయాడు. పాండవులు, కృష్ణుడు ఆ మునులకి నమస్కరించి వేగంగా వెనక్కి తిరిగారు.

ఏడుస్తున్న ద్రౌపది దగ్గరికి వెళ్లి ఆమె చుట్టూ కూర్చున్నారు. ధర్మరాజు ఆజ్ఞతో భీముడు మణిని ఆమెకిచ్చాడు. “యుద్ధం పూర్తయింది, శత్రువులంతా చచ్చారు. నీకీ దుఃఖం తగదు. యుద్ధం అన్నాక చావులు తప్పవు. నువ్వు ధైర్యంగా వుంటేనే ధర్మరాజు రాజ్యం చెయ్యగలిగేది. ధృతరాష్ట్రుడి వంశాన మగపురుగు లేకుండా చేశా, దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగా, దుర్యోధనుడి తొడలు విరిచి తలని కాలితో తన్నా. ఇది మనకి ఆనందసమయం, దీన్ని శోకమయం చెయ్యకు. గురువు కొడుకు గనక అశ్వత్థామని చంపకుండా వదిలాడు అర్జునుడు. ఐతే వాడిప్పుడు జీవచ్ఛవం. ఇక మనకి ఎదురు లేదు. ధర్మరాజు నిర్మలయశస్సుతో పాలించబోతున్నాడు” అని ఎంతో అనునయంగా చెప్పాడామెకి. మెల్లగా ద్రౌపది మొహంలో కళవచ్చింది. అరిచేతిలో వున్న మణిని ఆదరంగా చూసింది. “దీన్ని చూడటంతో నా మనస్సు కుదటపడింది. ఈ మహనీయమణిని ధరించే అర్హుడు ధర్మరాజే” అని దాన్నతనికిస్తే అతను ప్రీతితో దాన్ని తలమీద ధరించాడు.

అశ్వత్థామ దగ్గరికి వెళ్లినప్పుడు జరిగిన వృత్తాంతమంతా ధర్మరాజు వివరంగా అందరికీ వినిపించాడు. అప్పటికే ఒక్క ఉత్తర తప్ప మిగిలిన పాండవకాంతలందరికీ గర్భస్రావాలైనయ్. ఉత్తరని కూడ అశ్వత్థామ అస్త్రం బాధించింది గాని అదామెకి గాని మరెవరికి గాని తెలియకుండా చేశాడు కృష్ణుడు తన ప్రభావంతో.

ధర్మరాజు అశ్వత్థామ ఒక్కడే శిబిరాల్లోకి వచ్చి అంతమంది వీరాధివీరుల్ని ఎలా చంపగలిగాడని ఆశ్చర్యంగా అడిగితే కృష్ణుడు అది శివుడి అనుగ్రహమని, అశ్వత్థామ గొప్ప భక్తితో శివార్చన చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడని, అందుకే అలా విజృంభించి అంత నాశనం చెయ్యగలిగాడని వివరించాడు.

ఇదంతా వింటున్న జనమేజయుడికి కొన్ని సందేహాలు కలిగినయ్. “సంజయుడు దుర్యోధనుడి చావు గురించి చెప్పాక ధృతరాష్ట్రుడేం చేశాడు? అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, దుర్యోధనుడి చావు తర్వాత హస్తినాపురం వైపుకి వెళ్లి మళ్లీ అంతలోనే వెనక్కి తిరిగారని చెప్పావు కదా, ఎందుకలా చేశారు?” అని అడిగాడతను వైశంపాయనుణ్ణి. వైశంపాయనుడు ఇలా చెప్పుకొచ్చాడు.

సంజయుడి మాటలు విని ధృతరాష్ట్రుడు విలపిస్తూ కూర్చున్నాడు. అది చూసి సంజయుడు “అందరూ పోయాక ఇంకిప్పుడు వగచి ప్రయోజనం ఏముంది? ఐనా ఎవరి గురించని ఏడుస్తావ్, పోయిన వాళ్లలో ఎవరు తక్కువ వాళ్లు – మొత్తం పద్దెనిమిది అక్షౌహిణుల వాళ్లు మంటగలిశారే? ఇప్పుడు కర్తవ్యం వాళ్లకి అగ్నికార్యాలు నిర్వర్తించటం, నీ వాళ్లకి తిలోదకాలివ్వటం. పొలికలనికి వెళ్దాం పద” అని సలహా చెప్పాడు. ఐనా వినక ధృతరాష్ట్రుడు నేలమీద పడి దొర్లుతూ కొడుకుల్ని తలుచుకుని విలపించసాగాడు.

విదురుడతనికి శరీరాలు క్షణభంగురాలని, రాచధర్మాన్నాచరించి స్వర్గాన్ని చేరిన వారి కోసం ఏడవటం తగదని ఎంతగానో హితోక్తులు చెప్పాడు. వ్యాసమహాముని కూడ వచ్చి జరిగినదంతా విధికృతమని తను ఒకప్పుడు దేవసభలో ఉండగా భూదేవి అక్కడికి వచ్చి భారం తగ్గించమని నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆయన ధృతరాష్ట్రుడనే రాజుకి నూరుగురు కొడుకులు పుడతారు, వారి వల్ల గొప్ప యుద్ధం సంభవించి నీ భారం తీరుతుందని ఆమెని ఊరడించి పంపాడని వివరించి చెప్పాడు. పాండవుల్ని తన కొడుకులుగా భావించుకుని శేషజీవితం గడపమని బోధించాడు. చివరికి ధృతరాష్ట్రుడు శాంతించి వ్యాసుడి మాటలు పాటించటానికి ఒప్పుకున్నాడు.

కొంతసేపటి తర్వాత పొలికలనికి వెళ్లటానికి స్త్రీలందర్నీ సిద్ధం చెయ్యమని ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు. విదుర, సంజయులు పూనుకుని అందర్నీ తగిన వాహనాల మీద ఎక్కించి బయల్దేరించారు. హస్తినగరం అంతా అసూర్యంపశ్యలైన అతివల ఆర్తనాదాల్తో నిండిపోయింది. కన్నీళ్లు పెట్టనివారు నగరంలోనే లేరు. యుద్ధంలో పాల్గొనని ఇతరవృత్తుల వాళ్లు కూడ అందరూ వాళ్ల వెంట బయల్దేరారు. అలా ఒక కోసెడు దూరం వెళ్లేసరికి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ వాళ్లకి ఎదురొచ్చారు. ధృతరాష్ట్రుణ్ణి చూసి కుమిలి ఏడ్చి దుర్యోధనుణ్ణి భీముడు అధర్మంగా కొట్టటం గురించి, అంతకు ముందు రాత్రి ముగ్గురూ వెళ్లి పాండవసేనలన్నిట్నీ నాశనం చెయ్యటం గురించి చెప్పి ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని ఊరడించి పాండవులు వచ్చి పట్టుకుంటారేమోననే భయంతో హడావుడిగా వెనక్కి తిరిగి గంగాతీరానికి వెళ్లారు. అక్కడ ముగ్గురూ విడిపోయి కృపుడు హస్తినాపురానికి, కృతవర్మ ద్వారకకి, అశ్వత్థామ వ్యాసాశ్రమానికి దారితీశారు. అక్కడ జరిగిన వ్యవహారం మనం ఇంతకుముందే విన్నాం.

ఇక ఆ ముగ్గురు వెళ్లిపోయాక వాళ్ల మాటలు తల్చుకుని ధృతరాష్ట్రుడికి మళ్లీ కొత్తగా దుఃఖం పుట్టుకొచ్చింది. అక్కడక్కడ ఆగుతూ మెల్లమెల్లగా పొలికలనికి సాగాడతను.
ఈలోగా ధృతరాష్ట్రుడి రాక గురించి విన్న ధర్మరాజు అతనికెదురుగా ప్రయాణమయాడు. కృష్ణుడు, సాత్యకి, తమ్ముళ్లు, ద్రౌపది, ఆమె దగ్గరి బంధువర్గంలో స్త్రీలు అతనితో బయల్దేరారు. హస్తినాపురం నుంచి తిరిగొచ్చిన యుయుత్సుడు కూడ వాళ్లతో వున్నాడు. అందరూ పొలికలనికి చేరుకున్నారు.

కౌరవస్త్రీలు శోకిస్తూ ధర్మరాజుని తిట్టిపోశారు. అతనూ పోయిన తనవాళ్లని తల్చుకుని ఏడుస్తూ వెళ్లి ధృతరాష్ట్రుడికి నమస్కరించాడు. అతను లోపల్లోపల వెగటుగా వున్నా పైకి మాత్రం ఆప్యాయంగా ధర్మరాజుని కౌగిలించుకున్నాడు. భీమార్జున నకుల సహదేవులు కూడ వరసగా వచ్చారని అతని పక్కనున్నవాళ్లు చెప్పారతనికి. భీముడి పేరు వినటం తోనే ధృతరాష్ట్రుడికి పట్టలేని కోపం కలిగింది. ఐతే ఇలా జరగబోతున్నదని ముందే గ్రహించి ఒక ఇనపవిగ్రహాన్ని చేయించి రహస్యంగా ఆ దగ్గర్లో వుంచిన కృష్ణుడు భీముణ్ణి వెళ్లనివ్వకుండా ఆ విగ్రహాన్ని ధృతరాష్ట్రుడి ముందుకి తోశాడు.

ధృతరాష్ట్రుడు మహాక్రోధంతో ఆ విగ్రహాన్ని తన బాహువుల్లో బంధించి పదివేల ఏనుగుల బలంతో దాన్ని అదుముకుని ముక్కలుగా విరిచాడు. చేతుల చర్మం తెగిపోతున్నా, వక్షాన ఎముకలు వంగుతున్నా, ముక్కులనుంచి రక్తం కారుతున్నా లెక్కచెయ్యలేదతను. తన కొడుకుని చంపిన వాణ్ణి చంపి పగతీర్చాననే తృప్తితో లోపల సంతోషం పొంగుతున్నా పైకిమాత్రం మెరమెచ్చుల కోసం హాహాకారాల్తో భీముడి గురించి ఏడవటం మొదలెట్టాడు.

కృష్ణుడు చిరునవ్వుతో “నువ్విలాటి పని చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే భీముణ్ణి నీ ముందుకి రానివ్వకుండా ఇనపవిగ్రహాన్ని పంపా. ఐనా నీకిదేం బుద్ధి, అతన్ని చంపితే పోయిన నీ వాళ్లు తిరిగొస్తారా? తప్పులన్నీ చేసింది నీ కొడుకు. అది గుర్తించి వీళ్లని అనుగ్రహంతో చూడు” అని చెప్పాడతనికి. రక్తసిక్తమైన అతని ఒంటిని పరిచారకులు నీళ్లు తెచ్చి తుడిచారు. ధృతరాష్ట్రుడు కూడ శాంతించాడు. “నీ మాటల ప్రకారమే చేస్తా, పాండవులు నాకు ప్రీతి కలిగించేట్టు నడుచుకుంటా” అని మాట ఇచ్చాడు.

అప్పుడు కృష్ణుడు భీమార్జున నకుల సహదేవుల్ని పిలిస్తే వాళ్లని కౌగిలించి ఆదరించాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు యుయుత్సుణ్ణి కూడ పంపాడు. ధృతరాష్ట్రుడతన్ని వాత్సల్యంతో అక్కున చేర్చుకున్నాడు. పాండవుల్ని గాంధారి దగ్గరికి వెళ్లమని పంపాడు.

కృష్ణుడితో కలిసి పాండవులు గాంధారి దగ్గరికెళ్లారు. ఆమె వాళ్లని దీవించటానికి నిరాకరించి ధర్మరాజుని శపించటానికి పూనుకుంటుంటే వ్యాసభగవానుడు ప్రత్యక్షమై “కోడల, కోడలా, శపించకు, శాంతించు. నా మాట విను. ఇతను ధర్మపరుడు. నీకు గుర్తుందో లేదో, దుర్యోధనుడు యుద్ధానికి బయల్దేరుతూ నిన్ను దీవించమంటే నువ్వు ధర్మం ఎటుందో అటే జయమౌతుందన్నావ్. ధర్మరాజు గెలిచాడు గనక నీమాట ప్రకారం ధర్మం అతని వైపే వుంది కదా. జరిగిన వాటి గురించి కాదు ఆలోచించవలసింది. వీళ్లూ నీ కొడుకులే, వీళ్ల మీద నీకు కోపం వద్దు” అని నచ్చజెప్పాడు. దానికామె “నాకు వీళ్ల మీద కోపం లేదు. ఇక కుంతికిలాగే మాకూ వీళ్లే కదా. యుద్ధంలో అందరి చావులూ నన్ను బాధించవు గాని గదాయుద్ధంలో నాభికి కింద కొట్టి దుర్యోధనుణ్ణి చంపటం మాత్రం నా గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటుంది” అన్నది.

భయంతో వణికిపోతూ భీముడామెకి నమస్కరించి, “అమ్మా, ధర్మమో అధర్మమో నాకు తెలీదు, ఆ పరిస్థితుల్లో ప్రాణభయంతో నేనలా చేశాను. నీకొడుకు గదాయుద్ధంలో ఎంతో నైపుణ్యం వున్నవాడు, అతనితో పోరాట్టం ఎంతో కష్టమైంది. అదీగాక, నీ కోడలికి నిండుసభలో వాళ్లంతా చేసిన అవమానాలు, తొడకొట్టి అన్నమాటలు నీకు తెలీనివి కావు. ఆ సందర్భంలో ఆవేశంలో నేను ప్రతిజ్ఞ చేశా, మరి దాన్ని తీర్చటం ఉత్తమక్షత్రియుడిగా నా ధర్మం కదా. ఐనా సంధి చెయ్యటానికి, ఈ యుద్ధం రాకుండా చెయ్యటానికి మేం ఎన్ని విధాలుగా ప్రయత్నించామో నీకు తెలుసు. ఒకసారి యుద్ధం అన్నాక మరి పగ తీర్చటానికి చెయ్యవలసినవన్నీ చేస్తాం కదా, నీకు తెలీని విషయమా?” అన్నాడు వినయంగా.

దానికామె “నువ్వన్నదంతా నిజమే, వాడికి సరైన చావే వచ్చింది, చచ్చాడు. కాని యుద్ధంలో ఎవరైనా శత్రువుల రక్తం తాగుతారా, నువ్వు తప్ప? రాక్షసులు చేసే పని చేశావే” అని ఎత్తిపొడిచింది.

భీముడిలా సమాధానం చెప్పాడు “సభలో వాడు ద్రౌపది జుట్టుపట్టి ఈడుస్తుంటే వీరావేశంలో అన్న మాటలే తప్ప నేను నిజంగా నెత్తురు తాగలేదు, తాగినట్టు నటించానంతే. యుద్ధంలో చుట్టూ కౌరవయోధానుయోధులు నా మీద పడటానికి సిద్ధంగా వుంటే వాళ్లని భయపెట్టాలని అలా రక్తం తాగినట్టు చేసి మొహానికి పూసుకున్నా తప్ప, నిజంగా తాగటానికి నేను రాక్షసుణ్ణా? అంత పాపినా తల్లీ?” అతనలా అంటే తిరిగి ఏమనాలో ఆమెకి తోచలేదు. “అంధులం మేము. మాకు చేయూతగా ఒక్కణ్ణంటే ఒక్కణ్ణి మిగిల్చలేకపోయారా? వందమందినీ చంపాలా? ఒక్కడుంటే ధర్మరాజుని రాజ్యం చెయ్యనివ్వడా?” అని ధర్మరాజు వైపుకి చూసింది.

భయంతో వణుకుతూ చేతులు మొగిడ్చి దీనంగా ధర్మరాజు ఆమె ముందుకెళ్లాడు. “అమ్మా, వీడే నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముడు, క్రూరుడు. శాపం పెట్టి దండించు తల్లీ. భూమ్మీద ఉన్న రాజుల్ని, వాళ్ల సైన్యాల్ని చంపటానికి కంకణం కట్టుకున్న దౌర్భాగ్యుడు వీడే, దండించు. బిడ్డల్ని, చుట్టాల్ని చంపుకున్న ఈ ద్రోహికి రాజ్యం ఎందుకు? భోగం ఎందుకు? శపించమ్మా, శపించు” అనేసరికి ఏమ్మాట్టాట్టానికీ నోరు రాక మౌనంగా వుండిపోయింది గాంధారి. ఐతే కళ్లకి కట్టుకున్న గుడ్డనుంచి వచ్చిన ఆమె చూపులు అతని కాలివేళ్లకి తగిలి బొబ్బలెక్కినయ్. అర్జునుడు భయంతో వెళ్లి కృష్ణుడి వెనక నిలబడ్డాడు. గాంధారి శాంతించి కుంతి దగ్గరికి వెళ్లమని పంపింది వాళ్లని.

కుంతి వాళ్లందర్ని తనివితీరా చూసుకుని కౌగిలించుకుని శరీరాలు తడిమి చూసి గాయాల్ని చేత్తో నిమిరి గోడుగోడున ఏడ్చింది. ఇంతలో ద్రౌపది కూడ శోకిస్తూ వచ్చి ఆమెని చుట్టుకుని గొల్లుమంది. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని కిందపడి ఘోరంగా ఏడ్చారు. చివరికి తేరుకుని అందరు కలిసి గాంధారి దగ్గరికెళ్లారు. ద్రౌపది గాంధారికి నమస్కరిస్తే అందరూ మళ్లీ విలపించారు.

వ్యాసుడు ప్రత్యక్షమై అగ్నికార్యాలు తీర్చమని పాండవులకి, ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అలాగే గాంధారికి రణరంగం అంతా కనిపించే విధంగా దివ్యదృష్టిని కలిగించాడు. కాకులు గద్దలు రాబందులు చీల్చుకుపోయి, రాక్షసులు పీక్కుపోయి ఏ అవయవాలు ఎవరివో తెలియకుండా అక్కడ పడివున్న కొడుకుల్ని, మనవల్ని, బంధువుల్ని చూసి భోరుభోరున ఏడ్చింది గాంధారి. దుర్యోధనుడి శవం మీద పడి దీనంగా శోకించింది.

చివరికి కృష్ణుణ్ణి చూసి “ఎంతో శక్తివంతుడివి, వాక్చాతుర్యంలో దిట్టవి, నువ్వు తల్చుకుంటే ఈ యుద్ధం ఆపటం పెద్ద పని కాదు. ఐనా నా కొడుకుల్ని నాశనం చెయ్యటానికి పూనుకున్నావ్. ఇంతకింత అనుభవిస్తావ్. దాయాదుల మధ్య చిచ్చు రగిల్చి చంపించావు గనక నీ దాయాదులూ ఇలాగే కొట్టుకు చస్తారు. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఆరేళ్లకి నువ్వూ దిక్కుమాలిన చావు చస్తావ్. మీ ఆడవాళ్లూ వీళ్ల లాగే గుండెలు పగిలేలా ఏడుస్తారు, ఇదే నా శాపం” అని మహాకోపంతో అన్నది గాంధారి.

చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. “దీన్లో కొత్తేం వుంది, ఇదివరకే ముని శాపం వుంది. ఇలా చెప్పిందే చెప్పటం వల్ల నీకు ఒరిగిందేవిటి? యాదవుల్ని దేవతలు కూడ చంపలేరు, వాళ్లలో వాళ్లే కొట్టుకుచస్తారు. ఇక లేద్దాం, అవతల అగ్నికార్యాలు చెయ్యవలసిన పనుంది. ఐనా నీ కొడుకు ఎవరి మాటా వినక ఇంతకి తెచ్చుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఇప్పటికైనా నిజం గ్రహించి శాంతించు” అంటే నోరెత్తలేకపోయిందామె.

కృష్ణుడి మాటలు విన్న పాండవులకి గుండెలు జారిపోయినయ్. వాళ్లు వాళ్ల జీవితాల మీద ఆశలొదులుకున్నారు.

కౌరవులకి ధర్మరాజు, ధృతరాష్ట్రుడు నిష్టతో చితులు పేర్పించి అగ్నిసంస్కారాలు చేశారు. మిగిలిన బంధువులకి విదురుడు, సంజయుడు అలాగే చేశారు. బయటివాళ్ల శవాల్ని గుట్టలుగా పేర్పించి సామూహిక దహనాలు చేశారు. ఆకాశమంతా పొగల్తో నిండిపోయింది.

అప్పుడు కుంతి అందరూ వింటూండగా పాండవుల్తో ఇలా చెప్పింది – “తన విల్లు కౌరవసామ్రాజ్యానికి పెట్టనికోటగా వుంచి, యుద్ధరంగంలో మిమ్మల్నందర్నీ ముప్పుతిప్పలు పెట్టిన కర్ణుడు రాధేయుడని అందరూ అనుకున్నారు, మీరూ అలాగే అనుకున్నారు. అది నిజం కాదు, అతను నా తొలిచూలు కొడుకు, సూర్యవరప్రసాది. అతనికి కూడ మీరు తిలోదకాలివ్వాలి” అని కర్ణుడి వృత్తాంతం అంతా వివరించింది.

అందరూ నిర్ఘాంతపోయారు. ధర్మరాజు తప్ప మిగిలిన పాండవులంతా నిశ్చేష్టులయారు. ధర్మరాజు తల్లడిల్లిపోతూ తల్లితో “కొంగున అగ్నిని మూటకట్టినట్టు ఇన్నాళ్లు ఈ విషయం ఎలా దాచావమ్మా? అర్జునుడు తప్ప అతన్నెదుర్కునే వీరుడు ముల్లోకాల్లో లేడే ! అతను మా అన్న అని నువ్వు చెప్పిన మాట అభిమన్యుడి మరణం కంటే, ద్రౌపదేయులందరి చావు కంటే నా గుండెని కోస్తున్నది. ఈ విషయం ముందే తెలిస్తే ఇంత మారణహోమం జరిగేది కాదు గదా” అని విలపించాడు. కౌరవకాంతలు కూడ అందరూ అది విని ఆక్రోశించారు.

పాండవులంతా భక్తితో కర్ణుడికీ తిలోదకాలిచ్చారు. ధర్మరాజు కర్ణుడి భార్యల్ని రప్పించి గౌరవించాడు. అతని కోసం అనేక పుణ్యకర్మలు చేయించాడు.

(సమాప్తం.)