Monday, 23 April 2018

గుహుడు






గుహుడి నిలువెత్తు సంస్కారం

ధర్మరక్షణ కోసం తరతరాలుగా, యుగయుగాలుగా ఎందరో మహానుభావులు జన్మిస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. కానీ బిందువూ బిందువూ కలిస్తేనే సింధువుగా మారినట్లు ప్రత్యక్ష పరోక్ష పాత్రల్లో ధర్మ సంస్థాపనకు సహకరించిన వారెందరో.. అది తమ విద్యుక్త ధర్మమని తలంచి ప్రపంచమనే వేదికపైకి రాకుండా తెరవెనుక ఆణిముత్యాలై చరితార్థులయ్యారు. అందులో ప్రత్యేకమైన స్థానం నిషాదరాజైన గుహుడికి దక్కింది. మంచితనం, విలువలు గుహుడి వ్యక్తిత్వ స్వరూపాలుగా మారి ధర్మరక్షణ సభ్య సమాజ రక్షణేనని తెలుపకనే తెలిపాయంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచంలో కారణం లేకుండా ఏ పనీ జరుగదు. మరి మనిషి పుట్టుక వెనుక ఉన్న మహోన్నత కారణం అసలు సిసలైన మనిషిగా బతకడమేననీ, ఆ బతుకుబాట ఒంటరిగా కొనసాగదనీ, వ్యక్తి కుటుంబం వ్యవస్థ దిశగా విలువలే వారధిగా సాగిపోతుందనీ తెలియజెప్పిన వ్యక్తి గుహుడు. మంచి వ్యక్తిగా మంచి రాజుగా, రామసేవాంకితుడిగా చరిత్రలో నిలిచిపోయిన గుహుడి వ్యక్తిత్వం సాధారణ వ్యక్తిని అసాధారణ మానవత్వంతో పరిమళించేలా చేసింది.

వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు పాపం అంటని పావన నది గంగాతీరంలోని శృంగిబేరపురం దగ్గర ఆగుతారు. ఆ ప్రాంతం గుహుడి రాజ్యపరిధి లోనిది. మహాబలవంతుడైన గుహుడు స్థిపతి బిరుదుతో రాజ్యమేలుతున్నాడు. బోయజాతివాడు. అందమైన మనసున్న వాడు. రాముని రాకను తెలుసుకుని గంగా తీరానికి చేరుకుని శ్రీరామునికి అతిథి మర్యాదలు చేయసాగాడు. సంతోషంగా స్నేహహస్తం అందించిన గుహుడిని ఆర్తితో పలుకరించాడు రాముడు. గుహుడి మంచితనంలోని పారదర్శకతే దానికి నిదర్శనం.

గుహుడికి రాముడంటే ప్రాణం. రాముని వల్లనే రాజ్యాన్నీ, ధర్మజ్ఞానాన్నీ పొందానని బలంగా నమ్మే వ్యక్తి గుహుడు. సీతారాములు కటిక నేలమీద నిద్రించడాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మణుని బాధను సహృదయంతో ఆలకించి చలించిపోయిన గుహుడు రాముడెక్కడుంటే అదే వైకుంఠమని సాంత్వన పరుస్తాడు. సీతారామ లక్ష్మణులు గంగను దాటడానికి అందమైన నావను సిద్ధం చేసి, రాముని కోరిక మేరకు మర్రిపాలను ఏర్పాటు చేసి, వనవాస దీక్షలో రామలక్ష్మణుల జుట్టు జడలుగా చేసుకునేందుకు సహకరించాడు.

గుహుడు ఏర్పాటు చేసిన నావను ఎక్కుతూ అరణ్యంలోనే వనవాసం చేయాలని నా తండ్రి ఆజ్ఞ. అందుకే నీ జన సంచార సంజనితమైన రాజ్యంలో ఉండలేకపోతున్నాననీ, రాముడన్నాడు. దానికి నీ మాటే నాకు వేదవాక్కు. రామా! నీవెక్కడున్నా నా మనసు నీ చెంతనే ఆనందంతో తేలియాడుతుందని చెప్పి వీడ్కోలు చెబుతాడు. రాముడు కనుమరుగయ్యేంత వరకూ తన చూపు మరల్చక చూస్తుండిపోయిన గుహుని నిస్వార్థ ప్రేమ అద్వితీయమైంది.

గంగాతీరంలో మరోసారి అయోధ్య పురమంతా దాదాపుగా మజిలీ చేసినట్టు తెలుసుకున్న గుహుడు భరతుని సారథ్యంలో ఇదంతా సాధ్యమైందని గమనించి కైకేయీ భరతులు అడవికెళ్లినా రామున్ని వదిలిపెట్టరా! రాజ్యం ముందు రక్తసంబంధాలు అంత అల్పమైనవా! అని బాధపడి, అంతలోనే తేరుకున్నాడు. భరతుడి ఉద్దేశం రాముని ప్రశాంతతకు భంగం కలిగించేదే అయితే గంగను దాటనీయక పోరాడుదామనీ, సదుద్దేశమే అయితే ఆహ్వానం పలుకుదామనీ చతురంగా బలాలనూ పురమాయించిన గుహుడు యుద్ధ తంత్రంలో తొందరపాటు చూపలేదు. సరికదా అసలు భరతుని మనసులో ఏముందో తెలుసుకుందామని భరతుని గుడారానికి వెళతాడు.

భరతుడితోపాటు సమస్త బలగానికీ ఆతిథ్యాన్ని ఆహ్వానంగా అందిస్తాడు.

రాముని జాడ తెలుపమని అడిగిన భరతునితో గుహుడు వినయం తగ్గని స్వరంతోనే సూటిగా ప్రశ్నిస్తాడు. రాముడు క్షత్రియుడైనా సాధుజీవి. ఎవ్వరికీ అపకారం తలపెట్టని వాడు. ఇంత సైన్యంతో ఆయుధాలతో రామదర్శనం ఎందుకో తెలుసుకోవచ్చా? అని నిర్భయంగా అడుగుతాడు. గుహుని సందేహాన్ని తప్పుబట్టని భరతుడు అయోధ్యకు రామున్ని తిరిగి రమ్మని అడిగేందుకే ఈ తపన అంటూ సమాధానపరుస్తాడు.

అధర్మంగా వచ్చిన రాజ్యాన్ని తృణీకరించిన భరతునిపై పెరిగిన ఒకింత గౌరవాన్ని వ్యక్త పరుస్తూ సమస్త బలగానికీ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో గడిపిన కొన్ని ఘడియలనీ మధురమైన జ్ఞాపకాలుగా భరతునికి వినిపిస్తాడు. చెదిరిన భరతుని మనసును తృప్తి పరుస్తాడు. రామదర్శనమే నా తక్షణ కర్తవ్యమని భరతుడు చెప్పగానే ఐదువందల నావలను సిద్ధం చేసి, స్వస్తికం అనే ప్రత్యేక నావను భరత శత్రుఘ్నులకూ రాజమాతలకూ ఏర్పాటు చేస్తాడు. విశాలమైన గంగానదిలో గుహుడు ఏర్పాటు చేసిన నావలు అద్భుతమై ఆగుపించాయి. ఇంతటి గుహుడు తన సామర్థ్యాన్ని ఎక్కడా ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. రామకార్యంలో నిశ్చలమై ఒదిగిపోయింది.

సీతాన్వేషణలో భాగంగా సీత ఉత్తరీయంలోని చిన్న ముక్కను సుగ్రీవుడు గుహుడికివ్వగా దానిని రామునికి అందించి ఆణగారి పోయిన రాముని ఆశలకు ప్రాణం పోశాడు గుహుడు. ఇలా.. రామునిపై అకుంఠిత విశ్వాసం, రాముని సేవా ధర్మ పరిరక్షణేనని భావించే తత్తం, రామకార్యానికి అడ్డు పడేందుకు ప్రయత్నించిన వారిని నిర్భయంగా ప్రశ్నించే భావ వ్యక్తీకరణ, నిగ్గు తేలిని ధైర్యం, నిరాడంబరత, మనుషులను అర్థం చేసుకుని మనసులకు సాంత్వన చేకూర్చే పరిపక్వత, తన గాథనే రాముని చరితంగా మలుచుకుని మురిసిపోయిన అమాయకత్వం.. బోయవాడైన గుహుడిని మనసున్న మంచి తనానికి, మానవత్వం రూపుదాల్చిన ధర్మానికీ ప్రతీకగా దర్శించేలా చేసింది. నిలువెత్తు సంస్కారానికి నిజరూపంగా వ్యక్తీకరించేందుకు అవకాశం ఇచ్చింది.
ప్రమద్వర 

Sunday, 22 April 2018

మంధర

మంధరపుట్టింటి దాసీ ధర్మం

చరిత్రలో కొందరి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే, వారిపైకి కనిపించే స్వభావస్వరూపాల ఆంతరంగిక ఆలోచనలోనితత్తం విభిన్నమై అర్థంకాని వృత్యాసంతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మంచీ చెడుల సందిగ్థావస్థను మనకొదిలేసి, తాను నిలువెత్తు చెడుకు ప్రతిరూపంగా నిలిచి, లోక కళ్యాణానికి ముఖ్య హేతువయ్యింది మంధర.

మంధర ఎవరో, ఎక్కడ పుట్టిందో ఎవ్వరికీ తెలియదు. కైకేయి పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న దాసి మంధర. కైకేయికి గూనిదైనా మంధరంటే మహా ఇష్టం. అయోధ్య రాజ్యంలో దాసీ అయినా కైకేయి వల్ల ఓ వెలుగు వెలుగుతూ ఉండేది మంధర. కైకేయిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. కైకేయి కూడా సలహాలూ, సంప్రదింపులూ మంధరతోనే చేసేది. కైకేయి మీద ఈగ వాలినా సహించేది కాదు మంధర. పుట్టింటి నుంచి తనతో రావటం వల్ల కైకకూ మంధరంటే వల్లమాలిన అభిమానం. అందుకేనేమో రామకథలో ఓ ప్రధాన ఘట్టానికి నాంది పలికింది మంధర.రామాయణంలో కైకేయి జీవితాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేస్తున్నట్లు కనిపించే మంధర గర్వంతో విర్రవీగుతూ అతి సామాన్యమైన పాత్రలా మిగిలిపోయింది. కానీ అసలు రామకథను మలుపు తిప్పడంలో ప్రధానపాత్ర తనదే.

తెల్లవారితే రామాభిషేకం అనగా మంధర ఒక కిటికీలోంచి అయోధ్యపుర ప్రజల హడావుడి చూసింది. కౌసల్యాదేవి ఆనందంతో ప్రజలందరికీ దానధర్మాలు చేయడం చూసి జీర్ణించుకోలేకపోయింది. మరో దాసిని పిలిచి ఏమిటీ హడావుడని అడుగుతుంది మంధర. ఆమె పట్టలేని సంబరంతో శ్రీరామ పట్టాభిషేకమని చెబుతుంది. అంతే, మంధర మొహం వివర్ణమైంది. పళ్ళు పటపటా కొరుకుతూ కైకేయి మందిరం వైపు కదిలింది. నిద్రకు ఉపక్రమిస్తున్న కైకేయి ప్రశాంతతను భంగం చేస్తూ.. కైకాదేవీ! నీ వైభవాన్ని చూసి విర్రవీగేదాన్ని. నీ పుట్టింటి దాసిగా నీ భోగాన్ని తలుచుకుంటూ నీతో వచ్చినందుకు నా జీవితానికి లోటు లేదని భావించిన నాకు ఇది జరగాల్సిందే. ఎండాకాలంలో ఏరు ఎండిపోయినట్టు అడుగంటి పోతుంది నీ అదృష్టం అంటూ భోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ మొసలి కన్నీళ్ళ వెనుక అగాథమైన తుఫాను దాగుంది.

కైకేయి ఏమీ పాలుపోక మంధరా జరిగిందేమిటో చెప్పమని సూటిగా అడిగింది. దశరథుడు మంచివాడు కాదు. నీపై ప్రేమ నటిస్తూనే నిన్ను మోసం చేస్తున్నాడు. భరతున్ని కావాలనే మేనమామ ఇంటికి పంపి రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీవూ, నేనూ అందరూ రాజమాత కౌసల్యకు సేవకులమే అన్న మంధర మాటల్లో కైకేయికి రామపట్టాభిషేకం మాత్రమే వినపడింది. ఆనందంతో పొంగిపోయింది. శుభవార్త చెప్పావంటూ మంధరకు ముత్యాలహారం బహుకరించింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ ముత్యాలదండను విసిరిగొట్టి మహా సముద్రంలో నిన్ను నీవుగా ముంచేసుకుంటావనీ, నేను చెప్పేవరకూ రామపట్టాభిషేకం విషయం తెలియదంటే నీ విలువేంటో తెలుసుకోమనీ రెచ్చగొడుతుంది.
మంధర మాటల ప్రభావం కైకేయిని ఆలోచనల్లో పడేసింది. కైకేయిలో కోపం కట్టలు తెంచుకుంది. మంధర మాత్రం మనసులో నిప్పురాజేశాను. మహా అగ్ని ఆవరించడమే ఆలస్యమని సంతోషించింది. చివరికి కైకేయి ఈ విషయ పరిస్థితిని దాటే ఉపాయం చెప్పమని మంధరను ప్రాధేయపడే స్థాయికి కైకేయిని తీసుకొచ్చింది మంధర. దేవాసుర యుద్ధాన్ని గుర్తుచేసి, దశరథుడు కైకేయికిచ్చిన రెండు వరాలు ఇంకా తీరనే లేదనీ, వాటిని తీర్చుకునే సమయం వచ్చిందనీ ఆ రెండు వరాల్లో ఒకటి భరతునికి పట్టాభిషేకం, రెండవది రాముడి వనవాసంగా కోరుకొమ్మంటుంది. రాముని వనవాసం అతి ముఖ్యమని పదేపదే చెప్పి కైకేయితో అనుకున్నదంతా చేయించిన ఘటకురాలు మంధర.

పుట్టింటి దాసీ ధర్మాన్ని పాటించిందని కైకేయి మంధరను మెచ్చుకుంటుంది. గూనివారికి తెలివితేటలు ఎక్కువని పొగుడుతుంది. కానీ మంధర చేసిన రాద్ధాంతం కుటుంబాన్ని విడగొట్టి, అయోధ్యను కకలావికలం చేయడం కోసం కాదు. రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరగాలనే. శబరయోగిని మంధర శరీరంలో ప్రవేశించి కైక చేత వరాలు అడిగేలా ప్రణాళిక ఏర్పడిందనీ మరొక కథనం. మంధర ఆలోచనా దృక్పథాన్ని ఆవిష్కరించినప్పటికీ, మంధర జీవితం పాపాల పుట్టగా, వర్ణించినప్పటికీ ఆమె జన్మ లోకరక్షణే ధ్యేయంగా చెప్పాలి.

సంకుచితమైన చిన్న వలయమే ఈ ప్రపంచం. మనలో చాలామంది కొన్ని అడుగుల ఆవల చూడలేకపోవడం వల్ల, మనం దుష్టులం, అవినీతి పరులం అవుతున్నాం. ఇదే మన అశక్తత. ప్రతి దుర్భావం ద్వేషపూరిత ఆలోచన అతి రహస్యంగా ఏ గుహలోనో దాగి తలంచినా ఎప్పుడో ఒకప్పుడు అప్రతిహత శక్తితో బయటపడక తప్పదు. మంధర విషయంలో జరిగిందదే. కాని మంధర దుర్భావం వెనుక అసామాన్యమైన లోక సుభిక్షాకార్యం దాగుంది. దానిని జరిగేలా చూసేందుకు చరిత్ర పుటల్లో చీకటి కోణాన్ని పులుముకొని తన గాథకు నల్లరంగును పూసుకొని మంధర మానవత్వాన్ని పరిమళింపజేసేందుకు తానూ ఓ పుప్పొడి రేణువయ్యింది.

విభీషణుడు

విభీషణుడు

Sun,July 30, 2017 01:01 AM
అద్భుతమైన సృష్టిలో మనిషి జీవితం చాలా విచిత్రమైంది. మనిషి జీవితాన్ని సార్థకం చేసేవి అతను చేసే మంచిపనులే. మంచి ఆలోచనలే మంచి పనులకు ప్రేరణనిస్తాయి. మన జీవితాన్ని మంచి మార్గంలో
నడిపిస్తాయి. మనిషి పుట్టిన వంశం, కులం, జీవన విధానాలు ఎటువంటివైనా ఆశయాలూ, లక్ష్యాలూ, విలువలూ ఉన్నతంగా ఉంటే మనిషి మహనీయుడవుతాడనీ, తాను మానసికంగా ఎంతటి వ్యథను
అనుభవించినా, తనవారినే నిరోధించాల్సి వచ్చినా ధర్మమార్గమే తన మార్గమని తలంచి చివరిదాకా దానికి కట్టుబడి జీవించిన మనిషే మనిషనీ నిరూపించిన మహానుభావుడు విభీషణుడు. రాక్షసకులంలో
జన్మించినా రత్నంగా, ధార్మిక జగతిలో శిరోమణిగా, రామాయణ గాథలో కీలకమైన వ్యక్తిగా సమాజానికి పరిచయమైన విభీషణుని మనో విజ్ఞానం అత్యద్భుతం, భావితరాలకు ఆదర్శం.

కైకసీ విశ్రవుల మూడో కొడుకు, రావణుని సోదరుడూ, మంత్రి, శ్రీరామచంద్రునికి అత్యంత ఆప్తుడు విభీషణుడు. శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ ఈతని భార్య. రాక్షస లంకలో రామనామ జపాన్ని రహస్యంగా ధ్వనిస్తూనే ఆ నామ తరంగాలను రాక్షసత్వాన్ని పావనం చేసేందుకు తపించిన రాక్షసోత్తముడు విభీషణుడు. ఒక వ్యక్తి జీవితాన్నీ, అతనిలోని భావోద్వేగాలనూ సంపూర్ణంగా ఓ అంచనాకు తేవడం అసాధ్యం. మన జీవితాన్నే సరిగ్గా వ్యక్తపరచలేని మనం ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వెనుకడుగు వేయక తప్పదు. విభీషణుని జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే రాక్షసత్వంలోంచి పరిమళించిన ధార్మికత, నైతికత లోకకళ్యాణం కోసం మరింత నిగ్గుదేలాయనడానికి విభీషణుని వ్యక్తిత్వమే ప్రతీక.

పుట్టుక రాక్షసజాతి నిర్దేశించింది. కానీ విభీషణుని వ్యక్తిత్వం మానవీయ కోణంలో ఎదిగింది. తనజాతి లక్షణాలు స్వతాహాగా మనిషి కోణంలో ఎదిగాయి. తన జాతి లక్షణాలు స్వతహాగా మనిషిలో ప్రభావితమవుతున్నా వాటి జోలికి పోకుండా ఎటువంటి ప్రలోభాలు ప్రేరేపించినా తలొగ్గక, ఎంతటి భోగాలు ఆకర్షించినా ఏమాత్రం సడలక తనదైన వ్యక్తిత్వంతో ధర్మసాధన చేసి విభీషణుడు మహోన్నతుడయ్యాడు. తన కుటుంబం, తన లంకానగరం, తన అన్న రావణుడూ ధర్మం నీడలో బతకాలని కాంక్షించి దానిని కొనసాగించడం కోసం అహర్నిశలూ తపించాడు.
Ramayanam

మహావీరుడూ, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సారమెరిగినవాడూ, సకల కళలలో ప్రావీణ్యం గలవాడూ, లంకను సర్వస్వతంత్ర సామ్రాజ్యంగా నిలబెట్టిన చక్రవర్తి. బంగారు లంకను స్థాపించిన రావణుడంటే విభీషణునికి అభిమానం, ప్రేమ, గౌరవం. రావణుడు తన అన్న అయినందుకు ఒకింత గర్వం. కానీ ఒక స్త్రీ వ్యామోహంతో లంకాపతనానికి పూనుకున్నందుకు రావణున్ని వారించిన తీరు ధర్మజగతిలో ఓ మైలురాయి.
దండకారణ్యం నుంచి సీతాపహరణం చేసుకొని వచ్చాడన్న వార్త వినగానే ఆగామి రోజుల్లో జరుగబోయే పీడను శంకించిన విభీషణుడు రావణుడు చనిపోయేంత వరకూ తను చేసేది, చేస్తుంది అధర్మమని చెబుతూనే ఉన్నాడు. బతిమాలాడూ, వాదించాడూ, చర్చించాడూ, హెచ్చరించాడు. అయినా రావణుడు పంతం వీడలేదు.
హనుమంతుడు దూతగా వచ్చినప్పుడు రావణుడు ఒక కోతి వచ్చి నాకు ధర్మబోధ చేస్తుందా! అని పరిహసిస్తూ హనుమను చంపమని ఆదేశిస్తే, విభీషణుడు దూతను చంపడం అత్యంత దుర్మార్గమనీ, కావాలంటే అతను మనకు చేసిన నష్టానికి గానూ ఏదైనా శిక్షను విధించి వదిలేయమని సమాధానపరుస్తాడు. రావణునితో ప్రశాంతంగా ఆలోచించు! నీ శత్రువుకు నీవేంటో తెలియాలంటే దూతను వదిలేయడమే ధర్మమని చెబుతాడు.
రామరావణ యుద్ధాన్ని వారించేందుకు విభీషణుడు పడ్డపాట్లు అన్నీ, ఇన్నీ కావు. రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు నాడు త్రేతాయుగాన్నే కాదు, నేటి కలియుగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అహంకారం నాడే కాదు, నేడు కూడా కుటుంబాలు నాశనమయ్యేందుకు, జీవితాలు పతనమయ్యేందుకు కాచుకొని కూర్చుంటుందనే గుణపాఠం ఆ మాటల అంతరార్థం.

విభీషణుడు రావణునితో.. స్త్రీ వల్లే ధనం, కీర్తి వస్తాయి. స్త్రీ వల్లే సర్వం తుడిచిపెట్టుకుపోతాయి. దేవతలకు కూడా లభించని అమరసుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్నీ చేజేతులా పాడుచేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న లంకానగరవాసుల్ని ఒక స్త్రీ కారణంగా మృత్యుఒడిలోకి నెట్టొద్దు. నేను నీకు ఆప్తుడనూ, మంత్రినీ. అహాన్ని వదిలి సీతమ్మను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిద్దాం. అన్నింటినీ సమూలంగా నాశనం చేసే కోపాన్ని విడిచిపెట్టు. అన్నింటికీ ఆలవాలమైన ధర్మాన్ని పాటించు. కోపాన్నీ అహాన్ని, మైథిలినీ వదిలి రావణుడు కీర్తిని పోందాలనీ, అధర్మాన్ని వీడి ధర్మమార్గంలో నడవాలనీ భావించే ఈ విభీషణుడు నీ మంచే కోరుకుంటాడని ప్రాధేయపడతాడు.
రావణుని మిగతా సోదరులూ, మంత్రులూ, కొడుకులూ రావణుని వైభవాన్ని చాటుతున్నామనుకొని రావణున్ని రెచ్చగొడుతుంటే చూసి సహించలేని విభీషణుడు వారితో రాచధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే రాజుకు మంచే చెప్పాలి. అది కఠినంగా ఉన్నా సరే. అధర్మంతో రాక్షస వినాశనానికి పూనుకుంటుంటే సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించాడు. ఇలా ఎన్నో విధాలుగా చెప్పీ, చెప్పీ అలిసిపోయిన విభీషణుడు ధర్మమే నిలబడుతుందనీ, న్యాయమే గెలుస్తుందనీ నమ్మి రాముని శరణుకోరాడు. రావణుని జయించడానికి అనేక ఉపాయాలూ, రహస్యాలూ రామునికి తెలిపి సహకరించాడు. రావణుడు నేలకొరగడం చూసి తట్టుకోలేక విలపించాడు. అనుకున్నదంతా అయ్యిందనీ, ఒక స్త్రీ వ్యామోహంతో రావణుడంతటి వాడూ, అనంతమైన లంక పతనం అయ్యిందనీ బాధపడి రావణునికి అంతిమ సంస్కారం చేసి సద్గతులకై ప్రార్థించాడు విభీషనుడు.

ధర్మరాజు

ధర్మానికి స్థానం యుధిష్ఠిరుడు

Sun,June 25, 2017 02:06 AM
మనకు మనం చేసుకొనే స్వయం సూచన, సామాజిక సూచనగా ఎదిగేందుకు మనిషి మాత్రమే వేదికవుతాడని చెప్పిన యుధిష్ఠిరుడు ధర్మానికి నిలయమై ధర్మరాజుగా ఖ్యాతిగాంచాడు. ధర్మరాజు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం నిజమైన ధర్మాన్వేషకులం కావాలి. జీవితం పట్ల ఖచ్చితత్వం, భిన్నమైన మనస్తత్వం, దృఢత్వం, సహనం, వినయం, విధేయత, జాలి, మంచి నడవడిక, ఓర్చుకునే గుణం, తనవారిపట్ల సడలని ప్రేమ, ఆలోచించే ఉన్నత దృక్పథం.. లాంటి ఎన్నో విశేషాలు ధర్మరాజు వ్యక్తిత్వాన్ని మలచడంలో కీలకపాత్ర పోషించాయి. మరెన్నో సుగుణాలు నిగర్వియైన ధర్మజుని వ్యక్తిత్వ నిర్మాణంలోనే ఒదిగిపోయి అతన్ని చరిత్రలో నిలబెట్టాయి.

యుధిష్ఠిరుని జీవితంలో జరిగిన కీలక విషయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహించే ధర్మ స్రవంతి ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా తట్టుకొని నిలబడితే ైస్థెర్యాన్నిచ్చిందని ధర్మజుని విశ్వాసం. పాండురాజు తదనంతరం ధర్మజుని పాలన చూసి ఓర్వలేని కౌరవులు లక్క ఇంటిలో తమని చంపాలని చూసినా, మారుమాట్లాడక ప్రాణాలు దక్కించుకొని అడవుల్లో కాలం గడిపారు. పాండవులు ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకొని ధృతరాష్ర్టుడు విదురునితో కబురు పంపితే, రాజ్యాన్ని పంచుతాననీ, దాన్ని ఏలుకోమనీ అన్నప్పుడు సరేనంటాడు ధర్మరాజు. కుంతిగానీ, ద్రౌపదిగానీ, భీమార్జున నకుల సహదేవులు గానీ ఏనాడూ ధర్మజుని నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. ధృతరాష్ర్టుని ప్రస్తావన మన్నించి ఇంద్రప్రస్థమనే రాజ్యాన్ని అమోఘంగా నిర్మించి విస్తరించిన ధర్మజుని కౌశల్యం పగలూ, ప్రతీకారాలూ జీవితాన్ని మరింత వెనక్కు నెట్టేస్తాయనీ, గతాన్ని మరిస్తేనే భవిత బాగుంటుందనీ నిరూపించింది.మంచిని ఓర్వలేని కౌరవులు పాండవుల వైభవాన్ని చూసి తట్టుకోలేక జూదానికి పిలిస్తే క్షత్రియ ధర్మం ప్రకారం ఆహ్వానాన్ని కాదనడం అగౌరవమనీ, నేను రాను అనడం అవమానకరమనీ భావించి వెళ్ళిన ధర్మరాజు తననూ, తన సోదరులనూ, ద్రౌపదినీ పందెం కాసి ఓడిపోయాడు. మళ్ళీ అడవుల పాలయ్యాడు. అడవుల్లో అనుభవించిన కష్టాలూ, చేసిన సాహసాలూ అనేకమే. అయినా ధర్మరాజు నిశ్చితత్వాన్ని ఏమాత్రం సడలించలేకపోయాయి.
NAMA-VACHAKAM

హస్తినాపురాన్ని వదిలి పాండవులు వెళ్ళిపోతుంటే ధర్మరాజుపై గౌరవంతో ఎంతోమంది బ్రాహ్మణులు వెంటరాగా వారందరికీ ఆతిథ్యమిచ్చి, నచ్చజెప్పి వెనక్కి పంపించేస్తాడు. ద్వైతవనంలో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నప్పుడు పాండవుల పరిస్థితిని తెలుసుకుందామని వచ్చిన కౌరవులు గంధర్వుల సరస్సులో స్నానం చేయడానికని దిగి వారి చేతిలో ధర్మరాజే వారిని విడిపిస్తాడు. ధుర్యోధనుని బావమరిది ద్రౌపదితో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నిస్తే పాండవులతన్ని చంపబోగా నివారించి క్షమిస్తాడు. మంచితనంతో, మానవత్వంతో ఆలోచించే యుధిష్ఠురుని ధర్మనిరతి తనని అజాత శత్రువుగా ప్రపంచంలో స్థిరీకరించింది.యక్షప్రశ్నలకు సమాధానమిస్తూ మనుషులు మరణించడం మనం ప్రతీక్షణం చూస్తూనే మనమెప్పుడూ మరణించమని భావించే ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోలేక పోవడం మనిషి బలహీనతంటాడు ధర్మజుడు. అరణ్యవాసం అయిపోయాక రాజ్యంలో సగభాగాన్ని తిరిగి ఇవ్వాలని ధృతరాష్ర్టుని దగ్గరకు యుధిష్ఠిరుడు దూతను పంపగా సూది మొనంత కూడా నేలనివ్వనని చెప్పిన దుర్యోధనుని మాటలకు నొచ్చుకోక కనీసం ఐదూళ్ళైనా ఇవ్వమని కృష్ణుని రాయబారిగా పంపిస్తాడు. శాంతిని కోరిన ధర్మజుడు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి యుద్ధానికి ఒప్పుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షంలోనే నిలిచిన పెద్దలందరి ఆశీర్వాదాన్ని తీసుకొని యుద్ధానికి తలపడిన యుధిష్ఠిరుని వ్యక్తిత్వం అద్భుతం.

చివరి నిమిషంలో కూడా దుర్యోధనునికి తన ప్రాణాలు ఎవరి చేతిలో పోవాలో నిర్ణయించుకోమంటాడు. విశాలమైన మనసుగల ధర్మరాజు శత్రువును సైతం మానవత్వంతో చూడాలని చెబుతాడని అంటుందీ ఘటన. యుద్ధం ముగిసి విజయం వచ్చినా ఒకింత గర్వమెరుగని యుధిష్ఠిరుడు గాంధారీ ధృతరాష్ర్టులను గౌరవంగా చూసుకుంటాడు. వారి పిల్లలు చేసిన తప్పులకు వారెలా బాధ్యులని అంటాడు. చక్రవర్తిగా పాలన చేయడానికి నా మనసు అంగీకరించడం లేదనీ తన వారంతా పోయాక ఎవరిని పాలించాలనీ అన్న ధర్మజుని సున్నితత్వం అమోఘం. 33 సంవత్సరాలు రాజ్యపాలన చేసి కృష్ణ నిర్యాణం తర్వాత ద్రౌపదీ, సోదరులతో హిమాలయాలకు మహా ప్రస్థానం సాగిస్తాడు ధర్మరాజు.నైతికత, విలువలు, ధర్మం, శాస్త్రం, లోకరీతి, యుద్ధం, మంచితనం, నిండైన వ్యక్తిత్వంగా రూపుదిద్దుకున్న యుధిష్ఠిరుని జీవిత ప్రతిభ భారతీయులకే దక్కిన వారసత్వ సంపద. ఆ ధార్మికతను కాపాడుకోవడమే మన కర్తవ్యం.

ద్రౌపది

కష్టాలకు మారుపేరు ద్రౌపది

Sun,July 23, 2017 01:05 AM
జీవితం ఎంత అందమైందో అంతే గంభీరమైంది. అందులోని అందాన్ని ఆస్వాదించడానికి దొరికే సమయం దానిని నెట్టుకొచ్చే గంభీరతలో కనిపించకుండానే కనుమరుగవుతుంది. జీవితాన్ని నడిపించకుండానే కనుమరుగవుతుంది. అయినా జీవితాన్ని నడిపించమంటుంది మన మానవనైజం. ఎలా ఉండాలో ఉదహరిస్తూనే, ఎలా ఉండకూడదో హెచ్చరిస్తుంది జీవితం. కష్టాలు నిన్నెంత కష్టపెట్టినా కాలుమడవని ధీరత్వం నీదని పదేపదే గుర్తుచేస్తూ సుఖం అంటే ఏంటో చూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే దానిని అనుభవించాలి. కష్టాన్ని మాత్రం వినిపించినా చాలు! అందులోని దుఃఖాన్ని అంచనా వేయడం అంతకష్టమేమీ కాదని చెబుతుంది జీవితం. పైగా సమాజం కష్టాన్ని విని కనికరించక పోగా కొన్ని జీవితాలే అంతని తోసిపుచ్చేస్తుంది. అవును.. ఆ కొన్ని జీవితాలే కష్టాలను పరిచయం చేయడం కాదు. కష్టమంటే గుండెనిబ్బరమనీ, చెరగని ఆత్మస్థయిర్యమనీ, అలుపెరుగని శ్రామికతనీ, అంతులేని గాంభీర్యమనీ తెలియజెపుతూ ఆ కష్టాలవారధిని దాటేందుకు బాసటై నిలుస్తామని నిరూపిస్తాయి. కష్టాలకు మారుపేరైన ద్రౌపది జీవితమే ఇందుకు తార్కాణం. ఒక గొప్ప కుటుంబంలో పుట్టి, ఓ గొప్ప ఇంటికి కోడలై ఒక స్త్రీగా తనదైన అస్తిత్వాన్ని కలిగిన ద్రౌపది కథ కష్టతరమైందేగాని కన్నీటి వ్యథ కాలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. ధైర్యమై నిలిచింది. ధర్మమై గెలిచింది.

-ప్రమద్వర

పాంచాల దేశానికి రాజైన ద్రుపదుని కూతురే ద్రౌపది. యాగాగ్నిలోంచి జనించిన నిప్పు ఆమె. ధర్మ పరిరక్షణ కోసం ముఖ్య కారణమయ్యే స్త్రీ రత్నం ద్రుపదుని ఇంట జన్మించిందని చెప్పుకునే వారట. కౌరవుల పాలిట చీకటి కోణంలా మారే ద్రౌపది నల్లని శరీర ఛాయతో కృష్ణగా పేరొందింది. అందుకేనేమో కృష్ణ-కృష్ణుని అనుబంధం నల్లనిదే కాదు చల్లనైనది. వారిమధ్య గల సత్సంబంధం కూడా అనన్య భక్తిబంధమై అలరారింది. కృష్ణుని పట్ల ద్రౌపదికున్న గౌరవం, విశ్వాసం మాటలకందని మానసిక తత్తం.ద్రౌపది స్వయంవరం ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అపురూప లావణ్యంతో, గంభీర వ్యక్తిత్వంతో సభలోకి వచ్చిన ద్రౌపదిని చూసి మహామహులందరూ పోటీపడ్డారు. చివరికి బ్రాహ్మణుడిగా వచ్చిన అర్జునుడు ఆమెను చేపట్టాడు. పాండవులైదుగురూ సంతోషంగా ద్రౌపదిని ఇంటికి తీసుకెళ్ళి కుంతితో అమ్మా మేం అద్భుతమైన భిక్షను తీసుకొచ్చామని చెప్పగానే అదేమిటని కూడా అడుగక కుంతి ఎప్పటిలాగే ఐదుగురూ సమానంగా పంచుకోండని ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాటను శిరసావహించిన పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెళ్ళి చేసుకుంటారు. మారు మాట్లాడక అంగీకరిస్తుంది ద్రౌపది. ఎందుకంటే జీవితం చూపించే మజిలీలు దాటుకుంటూ వెళ్ళడమే గాని వెనుదిరిగే స్వభావం కాదు ఆమెది. ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఆవశ్యకమని చెప్పే చరిత్రను మలుపు తిప్పుతూ ఐదుగురి మగవాళ్ళ జీవితాల వెనుకుండి అసలు కథను నడిపింది. పాంచాలి పంచభర్తృక అన్న సమాజానికి అవును అది నాకు అత్యంత గౌరవప్రదమని చెప్పింది ద్రౌపది.

venu
ద్రౌపది నిండుసభలో వస్ర్తాపహరణాన్ని సహించింది. అరణ్యవాసంలో పాండవులను జాగ్రత్తగా చూసుకుంది. సూర్యుని వరప్రసాదంతో పొందిన అద్భుత ఘటంతో అమ్మై వారికి అన్నం పెట్టింది. విరాటుని కొలువులో అజ్ఞాతవాసంలో సైరంధ్రియై కీచకుని ప్రవర్తనను మన్నించింది. కామ్యకవనంలో జయద్రధుడు ద్రౌపదితో అసభ్యంగా నడుచుకునే ప్రయత్నం చేసి పారిపోతాడు. అతణ్ని పట్టితెచ్చిన అర్జునునితో అతణ్ని వదిలేయమని చెబుతుంది. ఇలా ద్రౌపది జీవితంలో అధర్మంగా ప్రవేశించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, జయద్రధ, కీచకుల్లాంటి వారంతా మట్టిలో కలిసిపోయారు. భారతనారి అవమానం చరిత్రకే కళంకమని చాటి చెప్పిన ద్రౌపది జీవితం దుష్టులకు గుణపాఠంగా మారింది. ఎటువంటి పరిస్థితులెదురైనా వెనక్కి తగ్గలేదు. పాండవులనూ విడిచి వెళ్ళిపోలేదు. అనిశ్చిత పరిస్థితుల్లోనే మనకు లభించే తోడు అంతులేని ఆత్మధైర్యాన్నిస్తుందనడానికి ద్రౌపదీ పాండవులే ఉదాహరణ.అమోఘమైన తెలివితేటలు, త్యాగనిరతి, మంచితనం, ఉన్నతమైన ఆలోచన, భావగాంభీర్యం ద్రౌపదితో పుట్టి పెరిగిన విశేషాలు. ఇద్దరు భార్యాభర్తల్లోనే సఖ్యత, ప్రేమ లేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతుంటాయి. అలాంటిది ఐదుగురు భర్తలనూ, సవతులనూ, అత్త కుంతీదేవిని ఒకే తాటిపై ధర్మ వివేచనతో నిలబెట్టిన ద్రౌపది కౌశలం అపారం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కష్టం. ఐదుగురి ఇష్టాయిష్టాలు, పద్ధతులు, గుణగణాలు ఎరిగి వారితో మెలగడం గొప్ప విషయం.ధర్మరాజు కోసం నియమితులైన పదివేల మంది సేవకుల పేర్లు, గుర్రాల సంఖ్య, ఏనుగుల గుంపుల గుర్తులు, రాజ్యాధికార సంబంధిత విషయాలు తటపటాయించకుండా చెప్పేంత జ్ఞానం ద్రౌపదిది. ఇది కేవలం అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి పరిశీలించే మెతుకు వంటిది. అసలు ఆమె విజ్ఞాన, విశేషాలను అంచనా వేయాలనుకోవడం అమాయకత్వమే.

Saturday, 21 April 2018

బలరాముడు






బలరాముడు

సంస్కారవంతులైన వ్యక్తులు ఎల్లప్పుడూ ఆర్భాటాలకూ, అట్టహాసాలకూ దూరంగానే ఉంటారు. లోకరీతి తెలియని వాళ్లనే అపవాదు వీరికేం చేదుకాదు. ఎందుకంటే వీరికి లోకనీతి తెలుసు కనుక. ధర్మం కాపాడాలనే అవ్యక్తమైన అలజడి వీరి అంతరంగాల్లో అంతర్లీనమై కొనసాగుతూనే ఉంటుంది. ఆ అలజడి వెనుక అందరూ బాగుండాలనే ఆంతర్యం అవ్యాజమానమై శోభిల్లుతుంది. చరిత్రలో అంతర్భాగమైన మహానుభావులు అంత త్వరగా అర్థం కారనేది లోకోక్తి. కానీ వారి సహృదయతను ఆకళింపు చేసుకోవడంలో ప్రయత్నలోపం కనుక ఉండకపోతే జాతి హృదయపు అరల్లో నిత్య సత్యమైన ఆకర్షణ మనల్ని తన వైపునకు లాక్కుంటుంది. యుగయుగాల చరితలో విభిన్నమైన ఆలోచన, అందరికీ మంచే జరుగాలనే సదుద్దేశం బలరాముడై కన్పించింది. భూత, వర్తమాన, భవిష్యత్తులు మన చేజేతులా లిఖించుకొని వ్యథ చెంది రోజును చూడకూడదనుకున్న వైవిధ్యత ఆ బలరామునిదనే చెప్పాలి.

కృష్ణునికి అన్న, రోహిణీ వసుదేవుల కొడుకు, యాదవులకు ఆప్తుడు, భీమ దుర్యోధనుల గురువు. కృతనిశ్చయం గల ధీరుడు. మంచిని మాత్రమే కోరుకునేవాడు. తప్పును నిక్కచ్చిగా నిలదీసేవాడు. ద్వాపరధర్మాలైన దయ, తపస్సును వీడనివాడు బలరాముడు. ఇతని గొప్ప గుణాలు ఎంత చెప్పినా తరుగవు. బలరామునికి ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమేనన్నది నానుడి. సంకర్షణుడనీ, బలుడనీ, బలరాముడనీ పిలుపులతో యదువంశంలో చుక్కానిలా బతికాడు. భీమునికి మల్లయుద్ధమునూ, దుర్యోధనునికి గదా యుద్ధమునూ నేర్పించిన గురుతుల్యుడు బలరాముడు. అందుకే కురుక్షేత్రం చివరలో వీరిద్దరి మధ్య పోరును చూసి తట్టుకోలేకపోయాడు. భీమదుర్యోధనులు నాకు రెండు కళ్లలాంటివాళ్లు. వారి ప్రతాపం ప్రజల రక్షణకు ఉపయోగపడాలే గానీ పరస్పర వైరం కోసం కాదని పరితపించాడు. కృష్ణుడు పాండవ పక్షపాతి అయితే.. బలరాముడు కౌరవుల పక్షపాతి. అలాగని అధర్మానికి సహకరించేవాడని కాదు. వారూ, వీరు మన బంధువులే కదా.. ఇద్దరి క్షేమం కోరడంలోనే న్యాయముందనేంత అమాయకత్వం బలరామునిది.

ఒకసారి జాంబవతి కొడుకైన సాంబుడు హస్తినాపురానికి వెళ్లినప్పుడు అక్కడ దుర్యోధనుని కూతురు లక్షణను చూసి, ఇష్టపడి తనను పెళ్లి చేసుకోవాలనుకొని రథంపై ఎక్కించుకొని ద్వారకకు బయలుదేరుతాడు. కౌరవులకు విషయం తెలిసి అతడిని బంధించారు. ఈ విషయం తెలిసిన బలరాముడు వారితో యుద్ధం చేయడం సబబు కాదు, ఎందుకంటే వారు మన బంధువులు. నేనే చుట్టం చూపుగా వెళ్లి విషయం చర్చిస్తానని అంటాడు. దుర్యోధనుని ఉద్దేశించి బలరాముడు మీలాంటి యోధులు చిన్న యువకుని బంధించడం సరికాదు, బంధు మర్యాద పాటించే వాడిని గనుక సావధానంగా మాట్లాడుతున్నానంటాడు. అది విన్న దుర్యోధనుడు రెచ్చిపోయి కాలికి తొడుగాల్సిన చెప్పులు తలకెక్కడం అంటే ఇదే. మీరెంత? మీ బతుకెంత? కురువంశీయుల బంధుత్వంతో లోకంలో నామరూపాలు తెచ్చి పెట్టుకొని మాటలు చెప్పొచ్చారని అనగానే కోపంతో బలరాముడు బంధుప్రీతి వీరి పట్ల పనికి రాదని, తన నాగలితో హస్తినాపుర నగరాన్ని సగానికి చీల్చాడు. అల్లకల్లోలం మొదలైంది. కురు ప్రముఖులంతా వచ్చి క్షమాపణ కోరితే శాంతించాడు బలరాముడు.

ఉత్తర అభిమన్యుల వివాహ విందులో భాగంగా విరాటుని కొలువులో మొట్టమొదటిసారిగా బలరాముడు కౌరవ పాండవుల విషయంలో తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. అంత జరిగినా బంధుత్వంలో వచ్చే విభేదాలు సమాజానికి అధర్మపు మార్గాన్ని సూచిస్తాయనీ, అది అర్థం కాని స్థితిలో లేనివారు కాదు కురుపాండవులనీ సదా బాధపడేవాడు బలరాముడు. కృష్ణుడు పాండవులు పడ్డ కష్టాలింక చాలు, ఇక తిరిగి అర్ధ రాజ్యానికి హక్కుదారులై పాండవులు బతకాలనుకున్నప్పుడు, బలరాముడు కృష్ణుడు చెప్పింది బంధుహితం. మంచి దూతను పంపి పాండవుల హక్కుగా కాక, కోరికగా అర్ధ రాజ్యాన్ని అర్థించడం మంచిదంటాడు. బలరాముని ఆలోచనేంటంటే మళ్లీ ఈ నెపంతో కురుపాండవుల మధ్య యుద్ధం రాకూడదనే భావన. కానీ యుద్ధం తప్పలేదు. దానిని జీర్ణించుకోలేదు బలరాముడు. బంధుప్రీతి మంచినే కోరుకుంటుందనడానికి బలరాముని ఆలోచనే ప్రతీక.

ద్వేషం, కోపం, అత్యాశ కారణాలే కౌరవ పాండవుల మధ్యన కురుక్షేత్ర యుద్ధాన్ని సృష్టించాయి. అది వారి వరకే పరిమితం కాక లక్షల మంది ప్రాణాలను ఫణంగా పెట్టబోతుంది. నేను ఎవరి వినాశనాన్నీ చూడలేను. అందుకే యుద్ధానికి దూరంగా తీర్థయాత్రలకు వెళ్లిపోతానని నిశ్చయించుకున్నానని కురుపాండవుల సమక్షంలో పిలుపునిచ్చాడు బలరాముడు. కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా ముగిసింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనాయి. ప్రముఖులందరూ కన్నుమూశారు. ఇలాంటివన్నీ వినాల్సి వచ్చినందుకు వ్యథ చెందుతూనే హస్తినకు సమీపిస్తుండగా చివరి ఘట్టంగా భీమ దుర్యోధనుల యుద్ధం కంటపడింది. భయంకరంగా దుర్యోధనుని తొడలు చీల్చుతున్న భీమున్ని వారిస్తూ అధర్మమని తన నాగలి తీసి భీమునిపైకి యుద్ధానికి వస్తే బలరాముని కృష్ణుడు వారించి క్షత్రియ ధర్మం ప్రకారం న్యాయమని సర్ది చెబితే, ఏమీ చేయలేక తన శిష్యులిద్దరూ పరస్పరం కలహించుకుంటుంటే చూడలేక ద్వారకకు తరలి వెళ్లాడు.


-ప్రమద్వర




శిబి చక్రవర్తి


Sun,February 11, 2018 12:44 AM
నుష్యత్వం అనేది ప్రపంచ పరిభాషలో ఒకనొక జీవికి, లోకంలోని అన్యప్రాణులకంటే భిన్నమైన దానికీ వర్తించే తత్వం మాత్రమే కాదు. ఆలోచన, వివేకం, విచక్షణ, ప్రేమ, భావ ప్రకటన, అపారమైన మేధస్సు, కొండలనైనా పిండిచేయగల శక్తి, సాహసం, మధురవాక్కు, సహృదయం, గంభీరమైన దేహం తనకు స్థానమిచ్చిన ప్రపంచానికి రూపమిచ్చే అద్భుతం మనిషి. అటువంటి మనిషి తన తత్వమైన మానవత్వాన్ని వ్యక్తీకరించుకునే క్రమంలో తనతోపాటు భూప్రపంచంలో బతికే సకల జీవరాశినీ, ప్రకృతినీ ప్రేమించే గుణాన్నీ, సత్యసంధతనూ ఆసరా చేసుకున్నాడు. మానవత్వాన్ని ఆపాదించుకున్న మనం మన బతుకుకోసం ప్రపంచ సంపదను వినియోగించుకోవడమే కాదు. మన వంతు కర్తవ్యంగా సత్యవిప్లవాన్ని ఆసరా చేసుకొని ప్రపంచ మనగడకు చేయూతనివ్వాలని ఎందరో మహనీయులు తమ జీవితమే అద్దంలా చూపించారు. ఆ పారదర్శకత సత్య విప్లవమై విజృంభిస్తేనే మానవత్వం మంటగలిసిపోదనే విషయాన్ని శిబిచక్రవర్తి నిరూపించాడు. సత్యసంధతను తనలో భాగం చేసుకున్న శిబి మానవతకు అసలైన అర్థం చెప్పాడు.
sibhi-chakravarthy
-ఇట్టేడు అర్కనందనా దేవి

ఉశీనరదేశానికి అధిపతి అయిన ఉశీనరుని పుత్రుడే శిబి. ఈతని తల్లి మాధవి. శిబి అసలు పేరు అరిందుడు. ఏడు దీవుల విస్తీర్ణం కల మహారాజ్యం శిబిచక్రవర్తిది. ఏడుదీవులలో కూడా శత్రువనే మాటే ఎరుగని మహోన్నతుడు శిబి.
ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటేనే రాజ్యం సమర్థంగా నిర్వహించబడుతుందనీ ప్రతీ ప్రాణికీ తమ జీవితంపై సంపూర్ణమైన హక్కుంటుందనీ శిబి నమ్మిన సిద్ధాంతాలు. జీవం ఉన్న ప్రతీ దాన్ని ప్రేమించాలనీ కారుణ్యం చూపించాలనీ, ఆదరించాలనీ చెప్పే శిబి తన జీవితకాల పర్యంతం ఆచరించి చూపించాడు.
శిబి గుణంలోనే ఉన్నతత్వం ఉంది. ఆలోచన పరిపక్వతకు రూపమైంది. అందుకేనేమో దేవతలూ మెచ్చి శిబికి అక్షయ ధనాన్నిచ్చారు. శిబి చక్రవర్తి నమ్మిన, ఆచరించిన సత్యవిప్లవం ఎంతగా విస్తరించిందంటే కలలో కూడా అసత్యపు తలంపు రానంత. సత్యం మరుగున పడిపోయినా మాట మరుగైపోదు. అందుకే ఆడినమాట తప్పని నిజాయితీ శరణాగత రక్షణ, సత్యసంధత శిబి చక్రవర్తి ప్రతిరూపాలుగా నిలిచాయి.

గొప్పవారి ఆలోచనలు వారివరకే పరిమితం అయితే ఆదర్శమనే మాటకు అర్థం ఉండదన్నట్లు ఇంద్రాగ్నులు ఇద్దరూ శిబి చక్రవర్తిని పరీక్షించడమనే నెపంతో, శిబి చరిత్రను జగతికి తెలియజెప్పేందుకు డేగ, పావురం రూపాలు ధరించి పావురాన్ని డేగ తినడానికని తరుముకుంటూ శిబి చక్రవర్తి సభలోకి చేరుతాయి. డేగ పావురాన్ని వెంబడిస్తుంటే పావురం కాస్త వేగంగా శిబి చెంతకు చేరి అభయమివ్వమని అడుగుతుంది. నన్ను ఆశ్రయించిన నీ కోసం ఎంత దూరమైనా వెళతానని మాట ఇస్తాడు. ఇంతలో డేగ పావురాన్ని తరుముతూ దాని రెక్కలు విరిగిపడిన ఆనవాళ్ళతో శిబి చక్రవర్తి సభకు చేరుకుంటుంది. శిబిని శరణు పొందిన పావురం తన ఆహారం అనీ, దానిని తనకు దొరుకకుండా అడ్డుపడడం అన్యాయం అని అంటుంది డేగ.

డేగ మళ్ళీ మాట్లాడుతూ నీవు న్యాయ విదుడివి కదా! లోకధర్మం ప్రకారం పావురం నా ఆహారంగా మారడంలో ఎటువంటి అనుచితం లేదు. ఏది సరైందో నువ్వే న్యాయం చెప్పమని శిబిని కోరింది.



శిబి డేగతో పావురం నన్ను శరణుపొందింది. నీకు ఆహారం కావాలి కదా! ఆహారం కోసం ఇంకేదైనా అడుగు, నేను తక్షణం ఏర్పాటు చేస్తానంటాడు. డేగ సరే అయితే పావురం బరువుతో సమానమైన మాంసం నీ శరీరం నుంచి తీసి నాకివ్వమని అడుగుతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరేనని అంగీకరించిన శిబి తూకంలో ఒకవైపు పావురాన్నుంచి మరోవైపు తన తొడనుంచి మాంసాన్ని కోసి సరిచూస్తాడు. ఎంత మాంసం వేసినా పావురం బరువే ఎక్కువగా కనిపిస్తుంది. చివరికి తనను తాను పూర్తిగా పావురం బరువుకు సరిచూస్తాడు. అతని ఉదాత్తతకు చలించిన ఇంద్రాగ్నులు పావురం, డేగ రూపాల నుంచి బయటికొచ్చి విషయం తెలియపరుస్తారు. శిబికి యథా శరీరాన్ని అనుగ్రహిస్తారు. శిబి స్థానంలో తామున్నా ఇంతటి సాహసం చేయబోమని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

శరణాగత రక్షణను సత్యసంధత సాక్షిగా పరిరక్షించే క్రమంలో తన్నుతాను సమర్పించుకునేంత గొప్పచరిత్ర లోకంలో శిబిచక్రవర్తికే దక్కింది. సత్యవిప్లవాన్ని ప్రచారం చేసే క్రమంలోనూ శిబి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆనందంతో స్వీకరించాడే గానీ, ఏమాత్రం కలత చెందలేదు. కీర్తి ప్రతిష్టల కోసమో, రాజ్య విస్తరణ కోసమో కాక జీవితమంతా సత్య ప్రతిష్ఠాకర్తవ్యంతో బ్రతికిన శిబి చక్రవర్తి జీవితం ఆదర్శానికి పెద్దపీట వేసింది.

శిఖండి

శిఖండి

Sun,February 4, 2018 12:56 AM
బంధాలకు వారధిగా నిలచేవి రెండే రెండు. ప్రేమ, పగ. బంధాలను పెనవేస్తూ మనలోని ఆత్మబలాన్ని పెంచేలా చేసేది ప్రేమ. బంధాలను కాలరాస్తూ మనలోని అంతఃశక్తిని కఠినంగా మార్చి రాటుదేలేలా చేసేది పగ. ఈ రెండూ కూడా పెంచుకుంటే పెరిగేవే. తుంచుకుంటే క్షణకాలంలో రాలిపోయేవే. కానీ ఈ రెంటికీ అసామాన్యమైన శక్తి ఉంది. ఎంతదూరమైనా వెళ్ళేందుకు ప్రోద్బలం అందించే తిరుగులేని అస్ర్తాలు ప్రేమా, పగ. అందుకే అన్నారేమో ఒక ఆంగ్ల సామెత రూపంలో, ప్రేమలో, పగలో అన్నీ సముచితమేనని. జన్మజన్మాంతరాలంలో కూడా ఎడతెగని బంధంగా నిలిచిపోయేవి ప్రేమ, పగ. మనిషి సంకల్పాన్ని దృఢంగా చేసి నిర్ణయాలు తీసుకోవడంలో నిశితత్వానికీ, సునిశితకూ చోటునిస్తూ, ఎటువంటి అడుగైనా జంకనే లేక ముందుకు సాగిస్తూ, తన జీవితాన్నే అర్పించేందుకు వెనుకాడనీయని సంసిద్ధకు ఆస్కారమిస్తూ మనిషి తదనుగుణంగా మార్చుకోగల మహాశక్తులుగా మారగలవే ప్రేమ పగలూ. కానీ ప్రేమ కన్నీటి నీడలో కారుణ్యాన్నీ, అనుభూతినీ పంచితే పగ కారుణ్యాన్ని కరుడుగట్టేలా చేసి జీవిత మాధుర్యాన్ని అంతంచేసి జీవిత దృక్పథాన్నే మార్చేస్తుంది. పగకూ, ప్రతీకారానికీ నిలువెత్తు నిదర్శనంగా మారిన అంబ తనను తాను శిఖండిలా మార్చుకున్నది.

-ఇట్టేడు అర్కనందనా దేవి
Shikandi
హోత్రవాహనుడనే కాశీరాజు పెద్దకూతురే అంబ. అంబిక, అంబాలికలు ఈమె చెల్లెల్లు. అంబ తండ్రి తన ముగ్గురు కూతుర్లకూ స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి మహామహులైన రాజులెందరో వచ్చారు. ఎందుకంటే ఆ ముగ్గురి గుణగణాలు అంత గొప్పవి. అంబ తన మనసులోనే సాల్వుని వరించింది. ఈ విషయం సాల్వునికీ తెలిసింది. సాల్వ చక్రవర్తే తనను వరించి తీసుకెళుతాడనే విశ్వాసంతో, ఆనందంతో స్వయంవర సభకు వచ్చిన అంబకు అనూహ్య సంఘటన ఎదురైంది. ఆ స్వయంవరానికి భీష్ముడు వచ్చి అక్కడున్న రాజులందరినీ ఓడించి, ఘోరంగా పరాభవించి అంబ, అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్య్రవర్యునికిచ్చి వివాహం చేయాలనుకొని వారిని బలవంతంగా హస్తినాపురానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అంబభీష్ముని వేడుకుంటూ తాను సాల్వుని ప్రేమించాననీ, తనను వదిలేయమనీ అడుగుతుంది. ఇంకొకరిని మనసులో ఉంచుకొని తన తమ్ముడిని వివాహం చేసుకోవడం ఉచితం కాదని భీష్ముడు అంబను పంపించేస్తాడు. అక్కడినుంచి నేరుగా అంబ సాల్వుని చెంతకు వెళుతుంది. కానీ అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవమే కలిగింది. సాల్వుడు ఆమెను స్వీకరించలేననీ, ఇంకొకరు నిన్ను గెలిచి తీసుకెళ్ళిన క్షణం నువ్వు నువ్వు కావు. పరత్వం అంటిన నిన్ను నేనెలా చేపడతానని అంటాడు సాల్వుడు.

భీష్ముడు తన తమ్మునికిచ్చి వివాహం చేయాలని మమ్ములను తీసుకెళ్ళాడు. నేను నిన్నే వరించానని చెప్పి వచ్చాను. అతనూ అంగీకరించి పంపాడు. ఇందులో నా దోషమేమీ లేదు. అంబ ఎంత చెప్పినా సాల్వుడు వినిపించుకోలేదు. తనలో ప్రేమ భీష్ముని కారణంగానే దూరమైందనీ, తన జీవితం ఇలా కావడానికి భీష్ముడే బాధ్యుడనీ భావించి పగను పెంచుకుంది అంబ. ఎలాగైనా భీష్ముని ఓడించి అంతమొందించాలనే పట్టుదలతో తపస్సు చేయడం మొదలుపెట్టింది. దారీ తెన్నూ తెలియక పయనిస్తూ తగిన చోటు చూసుకొని తపస్సు ప్రారంభించగానే మునులు నీలాంటి సుకుమారమైన స్త్రీ కఠిన నియమాలతో కూడిన తపస్సు చేయడం తగదనీ, సహించలేవనీ నిరుత్సాహపరుస్తారు. కానీ ఆమె పగ వెనుకడుగు వేయలేదు. ఎవరూ చూడని ప్రదేశంలో తపస్సు చేయాలని నిశ్చయించుకొని ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో తన తండ్రి హోత్రవాహనుడు కనబడతాడు. జరిగిన విషయం చెప్పి చాలా విచారిస్తుంది అంబ. తామున్న చోటుకు మరునాడు పరశురాముడు వస్తున్నట్లు సమాచారం అందనీ, ఆయన్ను కలిస్తే తప్పక నీ పగ చల్లారుతు ఉందనీ నచ్చజెప్పుతాడు అంబ తండ్రి.

హోత్రవాహనుడు అంబతో కలిసి పరశురాముని దర్శించుకుంటాడు. తన కూతురి దుర్దశను వివరిస్తాడు. అంబతో పరశురాముడు సాల్వుని గర్వం అణచాలా? భీష్ముని పరాభవించాలా? అని అడిగితే భీష్మున్నే ఓడించమనీ, అప్పుడే తన పగతీరుతుందనీ అంటుంది. పరశురాముడు అంబను వెంటబెట్టుకొని భీష్ముని దగ్గరకు వెళతాడు. అంబను అతని తమ్మునికిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. వేరే వ్యక్తిని ఇష్టపడిన ఆమెను గ్రహించలేమని నిరాకరిస్తాడు భీష్ముడు. పరశురాముడు భీష్మునితో ఇరవైనాలుగు రోజులు యుద్ధం చేయగా, ఎడతెగని ఆయుధాన్ని ఆపడానికి ఋషులూ, చక్రవర్తులూ తరలివచ్చి మరీ యుద్ధాన్ని ఆపారు. పరశురాముడు చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలాగైనా ఇక తానే భీష్ముని జయించాలని తీర్మానించుకొని ఘోరతపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా మరో జన్మలో ద్రుపద రాజుకు శిఖండిలా పుట్టి భీష్ముని మరణానికి హేతువవగలదనే వరం పొందుతుంది అంబ. తనకు తానుగా చితి పేర్చుకొని శరీరాన్ని దహించుకుంది. మరోజన్మలో ద్రుపదునికి పుత్రిగా జనించింది. ఆమెకు శిఖండిగా పేరుపెట్టారు. కానీ శిఖండి కూతురనే విషయాన్ని దాచి కొడుకులా ప్రచారం చేసి అంబ తల్లిదండ్రులు ద్రోణుని దగ్గర శస్త్ర, అస్త్ర విద్యలు నేర్పించారు. సమాజం కోసం ఆడపిైల్లెన శిఖండికి మరో ఆడపిల్లనిచ్చి పెండ్లి చేశారు. ఈ నిజం బయటపడగానే శిఖండి ఒక యక్షుని ద్వారా పురుషత్వాన్ని పొందాడు. ద్రుపదుని కొడుకుగా మారి నపుంసకత్వాన్ని ఆపాదించుకొని కురుక్షేత్రంలో పాండవుల పక్షంలో పోరాడాడు. భీష్మునికి స్త్రీలు, నపుంసకులతో యుద్ధం చేయననే నియమం ఉంది. అదే అదునుగా చేసుకొని పాండవులు భీష్ముని ముందుకు శిఖండిని పంపిస్తారు. శిఖండిని చూడగానే అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. వెంటనే బాణాలు సంధించాడు అర్జునుడు. అలా అంబ.. శిఖండి వల్లనే భీష్మునికి మరణం కలుగడం, అంబ అదే శిఖండి పగ చల్లారడం జరిగింది. జీవితం ఎంత చిత్రమైందో కదా! ప్రేమలూ, పగలూ జీవితం రూపురేఖల్నే మార్చేస్తాయంటే అతిశయోక్తి కాదు.

భారతకథలో చాలా చిన్న పాత్రగా కనిపించే అంబ స్త్రీలోని ప్రేమ తత్వానికి చిహ్నమే అయినప్పటికీ పగకారణంగా స్త్రీత్వాన్నే వదులుకుంది. తనకు జరిగిన అన్యాయంలో అణువంతైనా తన తప్పు లేకపోయినా ఒక బాధ్యురాలిగా మిగిలిపోయిన ఆవేదనా రూపమే అంబ.

దిలీపమహారాజు

దిలీపుడు

ఆదర్శానికి కొదువలేని అవని మనది. ఆదరణ, గుర్తింపు అవసరం లేకుండానే నింగికెగిసే కీర్తికెరటం మనది. అందుకే అంటారేమో.. సహచర్యం, సాలోచన, సహృదయత గొప్పవారి నుంచి మనం అందుకోగలిగితే జీవితానికి అర్థం చేకూరినట్టేనని. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాం. పొలంలోని పంట కాలాన్ని బట్టి ఎదగడం, పండడం, చేతికందడం.. దాన్ని పండించిన మనిషి గొప్పతనమే! వేసిన పంట గొప్పతనం కాదు. సారవంతమైన భూమి గొప్పతనం. అలాగే గొప్పవారు లోకంలోని రావడం ఈ నేల గొప్పతనం. అలాంటి గొప్పవారి జన్మతో తరించిన నేల మహాద్భుతమై భాసిల్లింది. ఎందరో మహనీయుల మార్గంలో అడుగుపెట్టి ఆ మార్గాన్ని మరింత ఉన్నతంగా మలిచిన మానవతా చక్రవర్తి దిలీపమహారాజు. భూమికి రాజై, తన వ్యక్తిత్వంతో చక్రవర్తిలా ఎదిగిన ధీరోధాత్తుడు దిలీపుడు.

-ప్రమద్వర

వైవస్వతమను వంశీయులైన సూర్యవంశ రాజుల కథ దిలీపునితోనే మొదలవుతుంది. దిలీపుని కన్నాముందు ఎందరో రాజుల చరిత్ర సూర్యవంశంలో ఉన్నప్పటికీ కాళిదాసు దృష్టికోణంలో దిలీపుడే ప్రథమ స్థానంలో నిలబడగలిగాడంటే, తన పూర్వీకుల ఆశీస్సుల ఫలంగా జనజీవితాలకు అంకితమవుతూ అసలైన మానవతామూర్తిగా ప్రపంచానికి పరిచయమయ్యాడు దిలీపుడు. అంశుమంతుని కొడుకే దిలీపుడు. ఈతని భార్య సుదక్షిణ.

ఆజన్మపరిశుద్ధుడూ, ఆఫలోదయకర్ముడూ, సత్యనిష్టాగరిష్టుడూ, మానవతాపరుడూ అయిన దిలీపుని గుణగణాలు ఉత్తమ ఆదర్శాలకే ఉదాహరణగా నిలిచాయి. కర్తవ్య సాధన కోసం ఎల్లప్పుడూ తనను తాను సంసిద్ధంగా ఉంచుకునే వాడట దిలీపుడు. ఆయన తెలివి, విద్య, కార్యదక్షత ఆయన రూపానికి తగ్గట్టుగానే ఉండేవట. దిలీపునికి ఎంతసేపూ ప్రజా సంరక్షణే ధ్యాస, శ్వాస. విశాల భూమండలాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలిన దిలీపుడు పక్షపాతమనేదే ఎరుగక అంతటినీ తన ఇంటిలా భావించిన గొప్ప మనసుతో బతికినవాడై ఆదర్శనీయతను తన ఇంటిపేరుగా మలుచుకున్నాడు.

దిలీపుని వ్యక్తిత్వ నిర్మాణం ఎంత గొప్పగా జరిగిందంటే జ్ఞానం-మౌనం, క్షమ-శక్తి, త్యాగం-ఆత్మశ్లాఘం అనే భావాలు ఒక ఒరలో దూరని రెండు కత్తుల వంటివి. కానీ ఈ భావాలు దిలీపునిలో ఒదిగినవే గాక మరింత నిగ్గుతేలాయి. ధార్మికత, మానవత రక్తంలోనే ఇమిడిపోయాయి. మగధ రాజు పుత్రికైన సుదక్షిణను తన భార్యగా స్వీకరించి, ఆమెను అమితంగా గౌరవించే భర్తగా దిలీపుడు నిలిచిపోయాడు. సుదక్షిణా దీలిపులకు అన్నీ వున్నాయి గానీ సంతానం కలుగలేదు. అసలు సూర్యవంశీయులకు అసాధ్యమన్నదే లేదు. వారికి అసాధ్యమైన వాటన్నింటికీ పరిష్కార మార్గం చూపేందుకు వసిష్టుల వారు ఉండనే ఉన్నారు.




దిలీపుని వసిష్ఠుడినే ఆశ్రయించి తమకు సంతానం కలిగే ఉపాయం చెప్పమని అర్థించాడు. మనిషన్నాక అన్నీ నిండుగా ఉంటే జీవితం చప్పగా సాగుతుంది. అందుకే ఏదో లోటు. ఆ లోటును పూరించడానికి ఒక ఆలోచన, ఒక ముందడుగు మనిషి జీవితాన్ని ఆసక్తికరంగా మలుస్తుంది. దిలీపుని విషయంలోనూ అదే జరిగింది. వసిష్ఠుడు దిలీపునిలోనూ, అతని ధర్మపత్ని సుదక్షిణతోనూ నందినీ ధేనువు నియమ నిష్ఠలతో సేవిస్తే సంతానం కలుగుతుందనీ, తన ఆశ్రమంలోనే ఉంటూ నందినీ ధేనువును సేవించండనీ చెబుతాడు. దిలీప సుదక్షిణలు వసిష్ఠుడు చెప్పినట్టుగానే ఆశ్రమ జీవితం గడుపుతూ నందినీ ధేనువును సేవించుకుంటున్నారు. దిలీపునికైతే నందినీ ధేనువే లోకమైంది. ఆశ్రమ ప్రజలతో కలిసిపోయి అంతరాలు లేని జీవితాన్ని ఆస్వాదించసాగాడు దిలీపుడు. ఒకనాడు పర్వత ప్రాంతంలో పచ్చని పచ్చికకై వెళ్ళిన నందినీ ధేనువు ఓ గుహలోనికి వెళుతుంది.

ఆ గుహలో ఒక సింహం ఉంది. అది నందినీ ధేనువును తినేద్దామనేలోపే దిలీపుడెళ్ళి దాన్ని వారిస్తాడు. సింహం మనిషిలా మాట్లాడుతూ, ఆ ధేనువు నాకాహరమనీ, దానిని వదిలేదే లేదనీ అంటుంది. అందుకు దిలీపుడు దానికి బదులుగా తనను ఆహారంగా స్వీకరించమని అంటాడు. దిలీపుని మాటలకు చలించిన నందినీ ధేనువు ఇదంతా కేవలం పరీక్షేనని, దానిని దిలీపుడు గెలిచాడనీ చెప్పి సంతానం కలుగునట్లు అనుగ్రహిస్తుంది. పరీక్షలకు తలొగ్గని జీవితం ఉండదనడానికీ, ఎంతటి పరీక్షలనైనా సాహసంతో ఎదుర్కోవాలనీ నిరూపించిన దిలీప చక్రవర్తి జీవితం విలువ తెలియజెప్పాడు. నందినీ ధేనువు అనుగ్రహంతోనూ, దిలీప సుదక్షిణల తపఃఫలితంగానూ రఘువును జన్మించాడు.

దిలీప చక్రవర్తి చాలా సంవత్సరాలు సుపరిపాలన చేసి తర్వాత రఘువుకు పట్టంగట్టి సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. కానీ బలపరాక్రమాలతో పాటు వినయవిధేతలూ, అధికారంతో పాటు అణకువ, ఐశ్వర్యంతో పాటు నిరాడంబరత కలిగిన మనుషులు అరుదు. అటువంటి అరుదైన మానవ జాతిలో ముఖ్యుడు దిలీపుడంటే అతిశయోక్తి కాదు.

దిలీపుని జీవితకాలమంతా సరైన ప్రణాళికతో నడిపించగల సర్వతో ముఖాభివృద్ధి మహోన్నతమైనదైనా, అంతా భగవంతుని లీలగా, విధి లిఖితంగా భావించడం దిలీపుని గొప్పతనానికి ప్రతీక. ఉత్తమ వంశంలో జన్మించాడు. జీవితంలో దేనికీ లోటులేదు. అటువంటి జీవితం లభిస్తే ఎవరైనా గొప్పవారుగానే కీర్తించబడతారనేది అపోహ మాత్రమే. ఎంతటి జీవితమైనా సవాళ్ళను ఎదుర్కోక తప్పదు అనడానికి దిలీపుడే ఉదాహరణ.

దిలీపుని మానవతా దృక్పథం, ప్రజల పట్ల తనకున్న అంకితభావం, సమస్త భూమండలం తన కుటుంబమేనన్న విశాల హృదయం అరుదైన అద్భుతం. దిలీపుడంటేనే మానవీయ చరితం. రాచరికానికి ఆదర్శం. మంచితనానికి మరోరూపం.

అశ్వత్థామ

అశ్వత్థామ


మనిషి పుట్టుకతోనే తనకంటూ ఒక స్వభావాన్ని అందిపుచ్చుకొని కాలానికనుగుణంగా, పరిస్థితుల ప్రభావసిద్ధంగా ఎదుగుతుంటాడు. వ్యక్తిత్వం పరిపూర్ణత్వం సంతరించుకోవడంలో పూర్తిగా తనదైన బాధ్యతే ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం పెరిగే వాతావరణం, విభిన్న మనస్తత్వాలున్న మనుషుల స్వభావాలూ, ఆలోచనలూ మన వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం ఎంత బలీయమైందంటే మనలోని తెలివితేటలూ, కుటుంబ నేపథ్యం, విలువలూ, ఆలోచనలూ, జీవిత దృక్పథాలూ ఏమాత్రం అక్కరకురాని స్థాయిలో మన వ్యక్తిత్వం రాటేదేలుతుంది. చివరికి ఎలాంటి జీవితం ఎటువంటి పరిస్థితుల్లోకి వెళుతుందో తెలియరానంతగా మార్పు చోటు చేసుకుంటుంది. ఎటూ పాలుపోని సమయాన అజ్ఞాతవాసమే గతియని భావించి మనల్ని మనమే మరుగున పడేసుకునేంతగా జీవితాలు మారిపోతాయనే విషయాన్ని చారిత్రక అనుభవపటం కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది. ఆ విభిన్న జీవితశైలిని తనకూ ఆపాదించుకున్న అశ్వత్థామ తాను నమ్మిన ధర్మం కోసం అధర్మపక్షంలో నిలబడి అన్యాయానికి ఒడిగట్టి అడవుల పాలయ్యాడు.

-ప్రమద్వర


భారత కథలో ధర్మజుడితో అబద్ధం ఆడించాల్సిన పరిస్థితిలో అశ్వత్థామ పేరును ఉపయోగించుకోవడం వరకే మనకు తెలుసు. కానీ అతని జీవితం చాలా లోతైనది.
కురుపాండవులకూ, వారి కుటుంబాలకూ గురువైన ద్రోణాచార్యుని ఏకైక పుత్రుడే అశ్వత్థామ. ఇతను పుట్టగానే చాలా పెద్దగా అరిచినందువల్ల గుర్రంలా రావం ఆ అరుపు వల్ల ఈతనికి అశ్వత్థామ అని పేరుపెట్టారట. అశ్వత్థామ కూడా కురుపాండవులతో పాటే విద్యలు నేర్చుకుంటూ, వారి సహవాసంలోనే పెరిగాడు. ఆ ఇరుపక్షాలపట్లా అశ్వత్థామ సుముఖంగానే ఉండేవాడు. అందుకే అశ్వత్థామను అర్జునుడు తనను మించిన వాడవుతాడేమోననే ఆలోచన బాధిస్తూ ఉండేది. అది కేవలం స్వార్థంలానే ఉండేది కానీ అతనిలో ద్వేషాన్ని పెంచిపోషించలేదు. ద్రోణుడు తండ్రిగా అశ్వత్థామను చాలా గారాబంగా పెంచినప్పటికీ, ఒక గురువులా మాత్రం విద్యార్థిగానే తర్ఫీదునిచ్చేవాడు. ఆ విషయం అశ్వత్థామకు ద్రోణుడు బ్రహ్మశరోనామశాస్త్రం అనేదాన్ని ఉపదేశించాడు. అది అగస్త్యుడు ద్రోణునికిస్తే, ద్రోణుడు అర్జునునికీ, అశ్వత్థామకూ ఉపదేశించాడు. ఆ గర్వం మాత్రం అశ్వత్థామలో చాలా ఉండేది. పైగా అశ్వత్థామ చీకట్లో కూడా బాణం వేయగల సమర్థుడు.

అశ్వత్థామ ఒకసారి కృష్ణుని కలిసి తన దగ్గరున్న దివ్యాస్త్రం ఇస్తానూ, తనకు సుదర్శన చక్రం ఇవ్వమని అడుగుతాడు. కృష్ణుడందుకు అర్జునుడే నన్నింతవరకూ చక్రమివ్వమని అడుగలేదు. అయినా అడిగినవారికి ఇవ్వడమే నాకు తెలుసు, దానికి బదులుగా నేనేమీ కోరుకోననని చెప్పి తన దగ్గరున్న ఆయుధాలన్నీ అశ్వత్థామ ముందుంచి నీకు కావలసింది తీసుకోమంటాడు కృష్ణుడు. కానీ దానిని తన రెండు చేతులతోనూ ఎత్తలేక ఊరుకుండిపోతాడు. ఎవరితో యుద్ధం చేయడానికి దీనిని అడిగావని కృష్ణుడు అశ్వత్థామనడుగగా, నీతో పోరాడి నేను గెలువలేను, అందుకే దీనినడిగానంటాడు. కృష్ణుడు అశ్వత్థామకు భరోసానిస్తూ నేను నీతో తలపడనని చెబుతాడు. అయినా కూడా తనవద్ద ఉన్న అస్త్రం పట్ల గర్వం అణుగలేదు అశ్వత్థామలో.

కురుపాండవుల మధ్య పెరిగిన వైషమ్యాలతో అశ్వత్థామకు సంబంధం లేకపోయినప్పటికీ, దుర్యోధనుని ఇంట ఉప్పు తిన్న విశ్వాసానికి అతని పక్షంలోనే నిలిచాడు. భీష్ముడూ, తన తండ్రి, దుర్యోధనుడూ రణరంగంలో పాండవుల వల్లనే మరణించారనీ, వారిపై పగ తీర్చుకోవాలనీ సంకల్పించుకున్నాడు అశ్వత్థామ. పైగా చివరి శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనునితో కృష్ణుడు చూస్తుండగానే ఒక్కరు కూడా మిగులకుండా నాచే చంపబడతారని శపథం చేస్తాడు. శపథం చేసిన నాటి రాత్రి పగతో రగులుతూ, నిద్రపోలేక ఓ చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తుండగా, గుడ్లగూబ ఒకటి చెట్లు మీద ఉన్న చిన్నచిన్న పక్షులను పొడిచిపొడిచి తినసాగింది. ఇంతలో అశ్వత్థామకు ఆలోచన తట్టింది రాత్రివేళలో నిద్రిస్తున్న పక్షుల్ని గుడ్లగూబ పొడుచుకుతిన్నట్టుగానే, శిబిరాలలో నిద్రపోతున్న పాండవులను నిద్రలోనే చంపేయాలని నిర్ణయించుకుంటాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులకు తన ఆలోచన చెబితే అది క్షత్రియ ధర్మం కాదని వారిస్తారు. కానీ అశ్వత్థామ అబద్ధం చెప్పి నా తండ్రినీ, నీతి తప్పి నాకు అన్నం పెట్టిన నా చక్రవర్తి దుర్యోధనున్నీ చంపిన పాండవులను నిద్రలోనే చంపడం తగు నిర్ణయం. దాన్ని అమలుచేసి నా తండ్రి, నా చక్రవర్తి రుణాన్ని తీర్చుకుంటానని అంటాడు అశ్వత్థామ.

అశ్వత్థామ ఆక్రోశంతో వెళుతూ, తన దగ్గరున్న దివ్యాస్రాలతో పాటు, శివఖడ్గాన్నీ వరంగా పొందుతాడు. అంతే పాండవుల శిబిరాలపైచ విరుచుకుపడి ముందుగా నిద్రిస్తున్న దుష్టమ్యమున్నీ, శిఖండినీ నిర్దయగా నరికేస్తాడు. తర్వాత పాండవ శిబిరాలన్నింటికీ నిప్పుపెడతాడు. పాండవ సైన్యమంతా అగ్నికి ఆహుతవుతూ చెల్లాచెదురైంది. విషయం తెలుసుకొని కృష్ణునితో సహా అక్కడికి చేరుకున్న ద్రౌపదీ పాండవులకు ఉపపాండవులు చనిపోయారని తెలుస్తుంది. దానికి కారణమైన అశ్వత్థామను వెదుకుతూ బయలుదేనికవారికి గంగాతీరంలో వ్యాసుని ఆశ్రయంతో ప్రాణం దక్కించుకోవాలన్న అశ్వత్థామ కనిపిస్తాడు. అశ్వత్థామ తన దివ్యాస్ర్తాన్ని ప్రయోగిస్తే, కృష్ణుని మాటపై అర్జునుడూ అదే అస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. చేసేది లేక ఒక దర్భను తీసి తన తపః శక్తితో పాండవవంశం నాశనం కావాలని శపిస్తూ ఉత్తర గర్భంలోని అభిమన్యునిపైకి ప్రయోగిస్తాడు. కృష్ణుడు దాని ప్రయోగాన్ని అడ్డుకొని అభిమన్యుడు రాజ్యం ఏలుతాడనీ, నీవే దుర్భరమైన జీవితం గడుపుతావనీ శపిస్తాడు. అశ్వత్థామను చంపకుండా అతని శిరోమణిని తీసుకొని అతని గర్వం అణిగితే అతనూ చచ్చినట్లేనని భావిస్తారు పాండవులు. చివరికి విరాగియై అడవుల పాలవుతాడు అశ్వత్థామ. ఉన్నత కుటుంబంలో పుట్టుక, మంచి విద్యాబుద్ధులూ, తన శక్తిని ఆసరాగా చేసుకొని సాధించిన దివ్యాస్ర్తాలూ, తనదైన అసలు వ్యక్తిత్వం దుర్యోధనుని మీద స్వామిభక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేసాయేగానీ ధర్మాధర్మాల విచక్షణకు నోచుకోలేదు అశ్వత్థామ. అశ్వత్థామ హతః అన్నమాట అబద్ధమే అయినా వ్యక్తిత్వ నిరూపణలో నిజమే అయింది.

శంతనుడు

శంతనుడు


Sun,April 8, 2018 04:21 AM
మనిషి జీవితాన్ని శాసించేవి కాలంతో పాటు వచ్చే పరిస్థితులో, కర్మఫలాలో, ఆలోచనా సరళో కాదు. మనిషి వ్యక్తిత్వానికి ఆలంబనగా నిలిచే స్వాధీనత పరాధీనత, స్వాతంత్య్రం, పరతంత్య్రం. కొన్నికొన్ని సార్లు మనకు తెలియకుండానే మన జీవితం పరాధీనతలోకి, పరతంత్య్రంలోకి నెట్టివేయబడుతుంది. అప్పుడు ఉన్నతమైన కుటుంబ నేపథ్యం, స్వీయ తెలివితేటలు జీవితాన్ని సామాన్యంగా చిత్రీకరిస్తాయి. ఉన్నతత్వం, సామాన్యత అనేవి రెండూ భిన్న పార్వ్యాలు. వాటిలో దేనిని సాధించుకోవాలో, దేన్నుంచి దేనికి వెళ్ళాలో నిర్ణయించుకునేది మనమే. మనలోని తత్వం అలంకరింపబడే అవకాశం ఉన్నతత్వానికిస్తామా? లేదా సామాన్యంగా గడుపుతామా?.. అనేది కేవలం మన నిర్ణయమే. అలాంటి జీవితాన్ని ఉదాహరణగా చూపించే శంతనుని గురించి భారతం చాటుతున్న కబుర్లు సామాన్యత వెనుకున్న గాంభీర్యాన్నీ, ఎటువంటి భేషజాలూ లేని పరతంత్య్రమునూ, పరాధీనతనూ ప్రదర్శిస్తున్నాయి. శంతననుని చరిత్ర కూడా అలా మొదలై ఇలా ముగిసిపోతుంది.
-ప్రమద్వర


ప్రతీపుడు శంతనుని తండ్రి. శంతనునికి దేవాపి అనే అన్న, బాహ్లకుడనే తమ్ముడు. ఇదే అతని కుటుంబం. తండ్రీ, అన్న రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోగా చాలా చిన్న వయసులోనే శంతనునిపై రాజ్యభారం పడింది.తనకన్నా పెద్దవాడైన దేవాపి అన్ని అర్హతలూ కలిగినవాడు ఉండగా శంతనుడు రాజుగా బాధ్యతలు చేపట్టడం వల్లే రాజ్యంలో పన్నెండు సంవత్సరాలు వర్షాలు లేక కరువు ఏర్పడిందనే నింద పడింది. దాంతో దేవాపిని వెతికి అతనికి రాజ్యభారం అప్పగించే క్రమంలో దేవాపి అప్పటికే సన్యాస ధర్మంలోకి వెళ్లిపోవడంతో శాస్ర్తోక్తంగా తనే పట్టాభిషిక్తుడయ్యాడు శంతనుడు. దాంతో వర్షం కుంభవృైష్టె కురిసింది. శంతనుడు బాధ్యతలకూ, ధర్మాలకూ, పరిస్థితులకూ ఆధీనుడే గానీ స్వచ్ఛమైన మనస్తత్వం కలవాడు. అతని స్వచ్ఛతకు నిరూపణ ఏంటంటే.. శంతనుడు తాకిన వెంటనే పండు ముసలి సైతం యవ్వనంతో వెలిగిపోతారట.

శంతనుడు తన స్వతంత్య్రాన్ని, స్వాధీనతనూ తన ఇద్దరు భార్యలకూ ఇచ్చేశాడు. ముందు గంగను వరించి ఆమె మాటకు ఎదురు మాట్లాడక తమకు పుట్టిన ఏడుగురు సంతానాన్నీ గంగపాలు చేస్తుంటే చూసి ఊరకుండిపోయాడు. ఎనిమిదవ వాడైన తన పుత్రున్ని గంగలో కలిపేస్తుంటే వారించాడు శంతనుడు. తనకు అడ్డు చెప్పినందుకు గంగపుత్రునితో సహా వెళ్లిపోయింది. పదమూడవ యేట ఆ పిల్లాన్ని అప్పగిస్తానని వెళ్తూ వెళ్తూ చెప్పింది. అతనే భీష్ముడు. శంతనుడు భీష్ముడు తనను చేరగానే అతనికి రాజ్యభారం అప్పగించాడు. తర్వాత సత్యవతిని వరించి పెళ్లి చేసుకుందామంటే, ఆమె వల్ల భీష్మునికి గాక, శంతన సత్యవతుల సంతానానికి పట్టం కట్టేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. భీష్ముడూ తండ్రికోసం, శంతనుని స్వచ్ఛమైన వ్యక్తిత్వం కోసం రాజ్యాన్ని, వివాహాన్ని త్యాగం చేశాడు. మనం ఎవరికోసమైనా త్యాగం చేస్తున్నామంటే వారిలోని ఉదాత్తత ఎంతటిదో చెప్పక్కర్లేదు.

శంతనుడు చాలా విశాల హృదయం గల మనిషి. అందరినీ ఆదరించాలనే ఆత్రుత ఆయనలో గుణరత్నమై ఒప్పారింది. ఒకనాడు వేటకై వెళ్లిన శంతనుడు అక్కడ ఆదరణ లేక పెరుగుతున్న కృపినీ, కృపాచార్యులను ఇంటికి తెచ్చుకొని పెంచి పెద్దచేశాడు. కృపతో వారిని గ్రహించాడు కనుక వారికి ఆ పేర్లు వచ్చాయి.అత్యంత శక్తి బలసంపన్నుడు, భీష్ముడంతడి వాడికి తండ్రి. తన మరో ఇద్దరు పుత్రులైన విచిత్రవీర్యుని, చిత్రాంగదుని సంస్కారంతో పెంచి, వారికి రాజ్యాన్ని అప్పగించి తనువు చాలించిన మహోన్నత వ్యక్తి శంతనుడు. ఇతని గొప్పతనం భీష్మునిలో ద్విగుణీకృతమైంది.

తనదైన జీవితం తనది కాకుండానే బతికి, తన వారి కోసం సర్వం త్యాగం చేసి, ఎటువంటి కోరికలకూ, అహంకారాలకూ లోనవ్వకుండా బతికినవాడు శంతనుడు. తాను తలుచుకుంటే ఒక గొప్ప చక్రవర్తిలా అలుపెరుగని యోధునిలా, సకల విద్యాపారంగతునిగానో చరిత్రలో స్థానం సంపాదించుకునేవాడు. కానీ అతి సామాన్యంగా, తనలోని ఉన్నతత్తాన్ని ఉదారత ఛాయలో నిండు జీవితాన్ని అనుభవించిన శంతనునిది నిక్కచ్చిగా చెప్పాలంటే పరాధీన, పారతంత్య్ర జీవితం కాదేమో! విలువైన, సత్యభూషితమైన, స్వాభావికతకు ఆస్కారమిచ్చే చరితయేమోనని అర్థమైపోతుంది.

Saturday, 14 April 2018

శంతనుడు

శంతనుడు


ప్రతీపుడు శంతనుని తండ్రి. శంతనునికి దేవాపి అనే అన్న, బాహ్లకుడనే తమ్ముడు. ఇదే అతని కుటుంబం. తండ్రీ, అన్న రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోగా చాలా చిన్న వయసులోనే శంతనునిపై రాజ్యభారం పడింది. తనకన్నా పెద్దవాడైన దేవాపి అన్ని అర్హతలూ కలిగినవాడు ఉండగా శంతనుడు రాజుగా బాధ్యతలు చేపట్టడం వల్లే రాజ్యంలో పన్నెండు సంవత్సరాలు వర్షాలు లేక కరువు ఏర్పడిందనే నింద పడింది. దాంతో దేవాపిని వెతికి అతనికి రాజ్యభారం అప్పగించే క్రమంలో దేవాపి అప్పటికే సన్యాస ధర్మంలోకి వెళ్లిపోవడంతో శాస్త్రోక్తంగా తనే పట్టాభిషిక్తుడయ్యాడు శంతనుడు. దాంతో వర్షం కుంభవృైష్టె కురిసింది. శంతనుడు బాధ్యతలకూ, ధర్మాలకూ, పరిస్థితులకూ ఆధీనుడే గానీ స్వచ్ఛమైన మనస్తత్వం కలవాడు. అతని స్వచ్ఛతకు నిరూపణ ఏంటంటే.. శంతనుడు తాకిన వెంటనే పండు ముసలి సైతం యవ్వనంతో వెలిగిపోతారట.

శంతనుడు తన స్వతంత్య్రాన్ని, స్వాధీనతనూ తన ఇద్దరు భార్యలకూ ఇచ్చేశాడు. ముందు గంగను వరించి ఆమె మాటకు ఎదురు మాట్లాడక తమకు పుట్టిన ఏడుగురు సంతానాన్నీ గంగపాలు చేస్తుంటే చూసి ఊరకుండిపోయాడు. ఎనిమిదవ వాడైన తన పుత్రున్ని గంగలో కలిపేస్తుంటే వారించాడు శంతనుడు. తనకు అడ్డు చెప్పినందుకు గంగపుత్రునితో సహా వెళ్లిపోయింది. పదమూడవ యేట ఆ పిల్లాన్ని అప్పగిస్తానని వెళ్తూ వెళ్తూ చెప్పింది. అతనే భీష్ముడు. శంతనుడు భీష్ముడు తనను చేరగానే అతనికి రాజ్యభారం అప్పగించాడు.

తర్వాత సత్యవతిని వరించి పెళ్లి చేసుకుందామంటే, ఆమె వల్ల భీష్మునికి గాక, శంతన సత్యవతుల సంతానానికి పట్టం కట్టేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. భీష్ముడూ తండ్రి కోసం, శంతనుని స్వచ్ఛమైన వ్యక్తిత్వం కోసం రాజ్యాన్ని, వివాహాన్ని త్యాగం చేశాడు. 

ఒకనాడు వేటకై వెళ్లిన శంతనుడు అక్కడ ఆదరణ లేక పెరుగుతున్న కృపినీ, కృపాచార్యులను ఇంటికి తెచ్చుకొని పెంచి పెద్దచేశాడు. కృపతో వారిని గ్రహించాడు కనుక వారికి ఆ పేర్లు వచ్చాయి. అత్యంత శక్తి బలసంపన్నుడు, భీష్ముడంతడి వాడికి తండ్రి. తన మరో ఇద్దరు పుత్రులైన విచిత్రవీర్యుని, చిత్రాంగదుని సంస్కారంతో పెంచి, వారికి రాజ్యాన్ని అప్పగించి తనువు చాలించిన మహోన్నత వ్యక్తి శంతనుడు. ఇతని గొప్పతనం భీష్మునిలో ద్విగుణీకృతమైంది.

తనదైన జీవితం తనది కాకుండానే బతికి, తన వారి కోసం సర్వం త్యాగం చేసి, ఎటువంటి కోరికలకూ, అహంకారాలకూ లోనవ్వకుండా బతికినవాడు శంతనుడు. తాను తలుచుకుంటే ఒక గొప్ప చక్రవర్తిలా అలుపెరుగని యోధునిలా, సకల విద్యాపారంగతునిగానో చరిత్రలో స్థానం సంపాదించుకునేవాడు. కానీ అతి సామాన్యంగా, తనలోని ఉన్నతత్తాన్ని ఉదారత ఛాయలో నిండు జీవితాన్ని అనుభవించిన శంతనునిది నిక్కచ్చిగా చెప్పాలంటే పరాధీన, పారతంత్య్ర జీవితం కాదేమో! విలువైన, సత్యభూషితమైన, స్వాభావికతకు ఆస్కారమిచ్చే చరితయేమోనని అర్థమైపోతుంది.

చాదస్తం వదిలించుకోవాలి!






చాదస్తం వదిలించుకోవాలి!

తొమ్మిదీ వాకిళ్ల దొడ్డి లోపలను ఆరుగురు శత్రులు మిత్రులైదుగురు అంతటా ముగ్గురు మూర్ఖులున్నారు తెలివి తెలిపేవాడు దేవుడున్నాడు జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా!

అంతటా ముగ్గురు మూర్ఖులున్నారు. అందులో ఒక మూర్ఖుడైన తమోగుణంలో ఉండే నిద్ర, ఆలస్యం, బద్ధకం వీటి నుంచి బయటపడగలిగితే హింసాత్మకమైన ఆలోచనలు ఉండవు. తమోగుణాన్ని వదిలేసినట్టే లెక్క! ఆ గుణాన్ని జయించినట్టే లెక్క! మిగతా ఇద్దరు మూర్ఖులు రజోగుణం, సత్వగుణం. దానిపైది, అంతేస్థాయిలో ఉండేది రజోగుణం. రజోగుణం అంటే చురుకుదనం. తమోగుణం ఉన్నవాడు బద్ధకస్తుడు అయి ఉంటాడు. వానికన్నా రజోగుణం ఉన్నవాడు చాలా నయం. చురుకుదనమన్నా ఉంటుంది. ఒక రోజు కాకపోయినా ఒక రోజన్నా బాగుపడతాడు. ‘ఇలా కాదు అలా చేస్తే బాగుపడతావు’ అని చెప్పొచ్చు. అందుకే తమోగుణం కంటే రజోగుణం గొప్పది. కానీ దాని ప్రమాదాలు దానికున్నాయి. చురుకుదనం చురుక్కుమని అటూ అంటుంది.. ఇటూ అంటుంది. పోటీలు పడటం, రాజకీయాలు, వ్యాపారాల్లోనూ.. అన్నింటా చురుగ్గా ఉంటారు.

ఈ గుణం కంటే మంచిది సత్వగుణం. అంటే శాంతం! మంచిగా ఉంటారు. పుస్తకాలు చదువుతారు. అవసరం లేని దాంట్లో వేలు పెట్టరు. గుళ్లు, గోపురాలు దర్శిస్తారు. ఈ సత్వగుణంతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే ‘నేను మంచి వాణ్ణి, నేను ధర్మాత్ముణ్ణి’ అనే అహంకారం వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. గుళ్లు, గోపురాలు నిర్మించడం, చెరువులు తవ్వించడం, రోడ్లు వేయించడం.. ఇలాంటి పనులు సాత్విక అహంకారంగా మారకుండా చూసుకోవాలి. మరోటి ఏమిటంటే అహంకారంగా మారకపోయినా చాదస్తంగా మారుతుంది.

పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు మంచివే. కానీ అవి చేయకపోయినా నష్టం ఏమీలేదు. వాటివల్ల జ్ఞానాన్ని గ్రహించాలి గానీ, ‘ఇవ్వాళ ఈ నైవేద్యం పెట్టలేకపోయాను’ అని..., ‘ఈ రోజు మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లాల్సి ఉండేది... కానీ వెళ్లలేకపోయాం మనసంతా అదోలా ఉంది’ అని అన్నారంటే సత్వగుణం ఛాదస్తంగా మారింది అని అర్థం. దాన్ని వెంటనే వదిలించుకోవాలి.

తమోగుణంతో ఎలా వ్యవహరించాలి? రజోగుణంతో ఎలా వ్యవహరించాలి? సత్వగుణంతో ఎలా వ్యవహరించాలి? అప్పుడు మనిషి త్రిగుణాతీతుడుగా ఎలా ఎదుగుతాడో తెలుస్తుంది. ఆంజనేయస్వామి అలా ఎదిగాడు.

ఆయన సముద్రం దాటుతున్నప్పుడు మూడు ఆటంకాలు వచ్చాయి. ఒకటి మైనాకుడు, రెండు సురస. మూడు సింహిక. మైనాకుడు మర్యాద కోసం ఆగమన్నాడు. సత్వగుణం కలవాడు కాబట్టి అతనితో సాత్వికంగా వ్యవహరించాడు. మైనాకుడు ఆగమని కోరితే ‘నేను ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. ఎక్కువ సమయం ఆగలేను. నేను నిన్ను ముట్టుకుంటే ఆగినట్టుగానే భావించు. నువ్విచ్చిన పండ్లు తీసుకున్నట్టుగానే భావించు’ అని సాత్వికంగా జవాబిచ్చాడు ఆంజనేయుడు. అందుచేత సత్వగుణాన్ని సత్వగుణంతోనే పోగొట్టుకోవాలి.

తరువాత రాజసమైన ఆటంకం వచ్చింది. సురస రెండు అడుగులు నోరు తెరిస్తే, ఆంజనేయుడు నాలుగు అడుగులు దేహం పెంచాడు. సురస పది అడుగులు నోరు తెరిస్తే, ఇరవై అడుగులు దేహం పెంచాడు. చివరకు ‘నీతో నాకు పోటీ ఎందుకు? నువ్వు దాక్షాయనీ దేవివి. అమ్మ వారి స్వరూపం. నువ్వు రాక్షసివి కావు’ అని పది అడుగులు తెరిచి ఉన్న నోట్లోకి సూక్ష్మరూపంలోకి మారి దూరిపోయి, చెవి రంధ్రంలో నుంచి బయటకు వచ్చి నమస్కరించాడు ఆంజనేయుడు. ‘నువ్వు పెట్టిన షరతు ప్రకారం నాలో ప్రవేశించకుండా ఎవ్వరూ వెళ్లలేరు అన్నావు. నీ మాట నేను నిలబెట్టాను. నిన్ను అవమానించడం నా పని కాదు, నేను పని మీద వెళుతున్నాను. అనవసరంగా గొడవవద్దు’ అన్నాడు. రజోగుణంలో ఇది చాలా ముఖ్యం.

మూడోది సింహిక. ఆంజనేయుడు ఎగరకుండా కిందకు పట్టి లాగేస్తోంది. నేరుగా యుద్ధానికే దిగింది. దాంతో పిడికిలితో ఒక్క గుద్దు గుద్ది ప్రాణాలు తీశాడు. తమోగుణాన్ని అలానే ఛేదించాలి.

ఆంజనేయుడు సత్వగుణాన్ని సాత్వికంగా ఎదిరించాడు. రాజస ఆటంకాన్ని రజోగుణంతో ఎదుర్కొన్నాడు. తమోగుణాన్ని ఒక గుద్దు గుద్ది పారేశాడు.



-డా. గరికపాటి నరసింహారావు





శ్రీరామనవమి






ఈ మూడు కలిస్తేనే శ్రీరామనవమి..!

భారత ఇతిహాస చరిత్రలో శ్రీరామచంద్రుడిది ప్రత్యేక స్థానం. రామ అంటే రమణీయం. ఆయన నామస్మరణలోనే మనకు ఆనందం లభిస్తుంది. ఒక పరిపూర్ణ మానవుడిగా ఎలా ఉండాలో ఆచరణలో చూపించాడు ఆ శ్రీరాముడు. ఆయన బాటలో నడిస్తే అంతా అలౌకిక ఆనందమే. పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, సకల గుణాభిరాముడిగా, కరుణాపయోనిధిగా, అగ్రజుడిగా, తండ్రిగా, ప్రజాపాలకుడిగా... ఇలా ఏ రూపంలో చూసినా సకల గుణాలు శ్రీరామునిలో కనిపిస్తాయి. మరి ఆ సకల గుణాభి రాముడి జన్మదినాన్ని శ్రీరామనవమి పర్వదినంగా జరుపుకుంటారు.

చైత్రమాసంలో నవమినాడు శ్రీరామనవమి పర్వదినం వస్తుంది. మామిడిచెట్టు గుబుర్లలో కూర్చుని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కళకళలాడిపోతుంటుంది. ముందుగా చైత్రంలో వసంతరుతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంతరుతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ‘పుష్పమాసే హితరావహ సంఘర్షదివ పుష్పితా’ అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తాయట. ఉగాది పండగ రోజు చేదు, తీపి పచ్చడి తినడంతో పాటు శ్రీరామనవమి వేడుకలు కూడా మొదలవుతాయి.

తొమ్మిది రోజుల పండగ ఇది
రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని ‘దేవ రహస్యం’ అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా- జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు- దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.

రావణుడి మీద సాధించిన విజయం, సీతతో అతని వివాహం, పట్టాభిషేకం, ఈ మూడూ కలిపి వేడుకగా నిర్వహించే పండగే ఇది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పండగగా జరుపుకుంటారు. గ్రామాలలో హరికథలు చెప్తారు. ప్రతి వీధిలో నవమి పందిళ్లు వెలుస్తాయి. సీతారామ కల్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్లు నెలవవుతాయి. హరికథా కాలక్షేపం ముఖ్య కార్యక్రమం. సంగీత కార్యక్రమాలు, నంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి.

ఆ పర్వదినాన...
శ్రీరామనవమి రోజున స్నానాదికాలు ముగించి, కొత్త బట్టలు ధరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు.వాకిట్లో రంగవల్లులు దిద్ది, గుమ్మానికి తోరణాలు కట్టి, గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతారు. లక్ష్మణ, భరత, శతృఘ్నులు, హనుమంతుడితో కూడిన సీతారాముల చిత్ర పటమును అలంకరించి, శ్రీరామచంద్రుడి అష్టోత్తరం చదవడం గానీ, రామాయణంలోని పట్టాభిషేక అధ్యాయాన్ని పారాయణ గానీ చేస్తారు. నైవేద్యంగా వడపప్పు, -పానకాన్ని సమర్పిస్తారు.

ఇక దేవాలయ మంటపంలో ఉత్సవమూర్తులకు జరిగే కల్యాణం కనుల పండువగా ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ జరిగే భజనలు, కోలాటాలు భక్తిని ఉత్సాహపు మార్గంలో ఉరకలు వేయిస్తాయి. కల్యాణం పూర్తి అయిన తరువాత స్వామివారి తరఫున గాని, అమ్మవారి తరఫున గాని కట్న కానుకలు చదివించుకుని, అక్షింతలను తలపై వేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు.

వడపప్పు, పానకం
రామనవమికి చేసే ప్రసాదాలు కూడా వైద్యపరంగా శరీరానికి మేలు చేస్తాయి. పానకం తయారు చేయడానికి వాడే పదార్థాల వలన కలిగే ఉపయోగాల గురించి ఆయుర్వేదం చెప్తుంది. తలనొప్పి, కడుపునొప్పి, గొంతునొప్పికి మంచి ఔషధం మిరియాలు. జలుబు, దగ్గుకి పానకం మందులాగా పనిచేస్తుంది. బెల్లంలో ఐరన్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. పానకం ఎండాకాలంలో వాత, కఫ, పిత్త దోషాలు మూడింటిని నియంత్రిస్తుంది. ఎండ తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. సత్వర శక్తిని అందించే గుణం పానకానికి ఉంటుంది. పానకంలో శొంఠిపొడి కూడా వేస్తారు. దాని వలన ఉదర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

వడపప్పు కోసం నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి తురుము, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, మామిడి కాయ ముక్కలు వేస్తారు. పెసరపప్పులో పీచు, ప్రొటీన్లు ఉంటాయి. పొటాషియం, కాల్షియం, బి కాంప్లెక్స్ ఉంటుంది. శరీరాన్ని చల్లబరిచే గుణం పెసరపప్పుకూ ఉంటుంది. పానకం, వడపప్పును కలిపి తీసుకోవడం వలన అరుగుదల వ్యవస్థ మెరుగు పడుతుంది.

తెలుగువారి పెళ్ళిపత్రికల్లో...
శ్రీరాముడికి వివాహం తరువాతనే పట్టాభిషేకం జరిగింది. భద్రాచలంలో రామదాసు గారు ప్రతి సంవత్సరం ఆచరిస్తూ వచ్చిన శ్రీ సీతారామ కల్యాణాన్ని ఈ నాటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో మనమంతా తిలకించి తరిస్తూ ఉంటాం. అక్కడ వాడిన తలంబ్రాలు సంపాదించి ఇంట్లో పెట్టుకుని వివాహం సమయంలో వధూవరులను ఆశీర్వదించేందుకు ఎందరో ఉపయోగిస్తూ ఉంటారు. 


తెలుగు వారు శుభలేఖలో ,
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
వ్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికకలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః
అని రాసుకుని, శ్రీ సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని స్మరిస్తూ, ఆశీర్వాదం పొంది ఆ తరువాతే మిగతా వివరాలు రాసుకుంటారు.

సకల గుణాభిరాముడు ఆ శ్రీరాముడు
గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం... ఇలా అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు. ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతం సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు.


ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదుకోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా- సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.

రామకథాగానం
‘రామకథా సుధా రసపానము రాజ్యము సేయనై’ అన్నాడు త్యాగయ్య. శ్రీరామనవమికి ఊరూరా అందమైన పందిళ్ళల్లో రామకథా గానం ఒక రమణీయమైన ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ.

కరుణాపయోనిధి భద్రగిరి రామయ్య
పవిత్ర గోదావరి నదీతీరంలోని భద్రాద్రిలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయం దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. వనవాసకాలంలో స్వామివారు సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడే నివాసమున్న పవిత్రనేల ఇది. పర్ణశాల నుంచే అమ్మవారిని రావణాసురుడు అపహరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

భద్రగిరి
మేరు, మేనకల పుత్రుడైన భద్రుడు మునిపుంగవుడు. స్వామివారు పర్ణశాలలో నివాసమున్న విషయం తెలుసుకొని దర్శించుకుంటారు. అనంతరం రాముల వారు సీతాన్వేషణకు బయలుదేరుతారు. రావణవధ అనంతరం అక్కడకు విచ్చేస్తానని భద్రునికి వరమిస్తాడు. కొంత కాలానికి రావణ వధ జరగడం, శ్రీరామ పట్టాభిషేకం వెంట వెంటనే జరిగిపోతాయి. భద్ర మహర్షి శ్రీరామ దర్శనం కోసం తపస్సు చేస్తాడు. భక్తుని తపస్సును గమనించిన వైకంఠరాముడు యావత్‌ వైకుంఠమే కదిలివచ్చిన రీతిలో భద్రుడికి ప్రత్యక్షయ్యాడు. తాను కొండగా ఉంటానని తనపై స్వామివారు అధిష్ఠించాలని భద్రుడు కోరుకుంటాడు. భక్తుని కోరిక ప్రకారమే భద్రగిరిపై సీతాసమేతంగా స్వామి వెలిశారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీరామ కల్యాణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు భద్రాద్రికి చేరుకుంటారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను రాములవారికి సమర్పిస్తారు. అంగరంగవైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు రెండు కన్నులు చాలవంటే అతిశయోక్తికాదు.

తారక మంత్రం
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనో పాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ‘‘ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!’’ అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే

ఈ శ్లోకం మూడుమార్లు స్మరిస్తే చాలు ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈ తారకమంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.





శ్రీ సీతారామ కల్యాణం.. జగదానంద కారకం


శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

అంటూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి శ్రీరామనామ మహాత్మ్యం గురించి చెప్పాడు. అంతటి మహాపురుషుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మీస్వరూపిణియైున సీతాదేవిని వివాహమాడిన సుందరఘట్టాన్ని వాల్మీకి మహర్షి తన కావ్యంలో పరమ రమణీయంగా వర్ణించడమే కాక భారతీయ సంస్కృతిలోని షోడశ సంస్కారాల్లో ప్రధానమైన వైవాహిక సంస్కారాన్ని దాని పవిత్రతను సందర్భానుసారంగా విపులంగా చెప్పాడు. అంతటితో తనివితీరక మరో సందర్భంలో.. అనసూయాదేవికి సీతమ్మవారు చెప్పే నెపంతో రెండోసారి కూడా చెప్పాడు. యుగాలు మారినా తరాలు మారినా ఇవాళ్టికీ వాడవాడలా ప్రజలు సీతారామకల్యాణాలు జరుపుకొంటూ తమ భక్తినేగాక, ఆ దంపతులపై అనురాగాన్ని ప్రదర్శించుకుంటూనే ఉన్నారు. వైదిక వివాహ జీవితం భారతీయ ధార్మిక జీవితానికి పునాది. దాంపత్య జీవితాన్ని గడపబోయే దంపతుల్లో ప్రేమ ముఖ్యం. ఆ ప్రేమ జనించే విధంలోనే శ్రీరాముని ప్రేమాధిక్యాన్ని చెబుతూ ‘దారా పితృకృతాః’ అనడంలో.. పెద్దలు మన శ్రేయస్సు కోరి నిర్ణయించిన వివాహం ద్వారా మన జీవితంలోకి వచ్చిన భార్య యెడల భర్త అమిత ప్రేమ కలిగి ఉండాలని సూచించాడు మహర్షి. దివ్యమైన దాంపత్యానికి ప్రతీకలుగా నిలిచిన సీతారాముల కల్యాణ వర్ణన లోకానికి ఆహ్లాదాన్ని లిగించే ఘట్టం. మానవ సంబంధాలకు ప్రేమ, వివాహం, ప్రధాన భూమికలై నిలవాలన్న వాల్మీకి మహర్షి అంతరంగం ఆవిష్కరింపబడిన శ్రీ సీతారామ కల్యాణ ఘట్టం జగదానంద కారకం అనడంలో ఏ సందేహం లేదు.
గన్నమరాజు గిరిజామనోహరబాబు





రామ, సుగ్రీవుల మైత్రీ






రామ, సుగ్రీవుల మైత్రీబంధమే..

మిత్రుడు అంటే సూర్యభగవానుడు. సర్వజగత్తుకూ వెలుగులు పంచేవాడు, చైతన్యప్రదాత. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడవలె అనుసరించివచ్చేవాడే నిజమైన మిత్రుడు. మనిషి సౌశీల్యం అతడు పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఆభిజాత్యాన్నిగానీ ఐశ్వర్యాన్నిగానీ విద్యనుగానీ పదవినిగానీ దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు. ఆ దృష్టి లేనివాడే సౌశీల్యమూర్తి. అలాంటి సౌశీల్యరూపుడు శ్రీరామచంద్రుడు. రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి చాటాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా దర్శనమిస్తారు. రాముడు చక్రవర్తి అయినా.. గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. కష్టాల్లో సహకారం అందించేవాడు నిజమైన మిత్రుడని రామసుగ్రీవులు చాటారు. వారిద్దరూ భార్యావియోగాన్ని అనుభవించినవారే. సుగ్రీవుని భార్య రుమను వాలి తన అధీనంలోకి తీసుకుంటే.. సీతాదేవిని రావణుడు అపహరించాడు. రామ, సుగ్రీవుల మైత్రీబంధమే.. రుమ, సీతల విముక్తికి కారణమైంది. శత్రువు సోదరుడైనా సరే.. అధర్మాన్ని ఎదిరించి వచ్చినందుకు విభీషణుడితో రాముడు స్నేహం చేశాడు. 


మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన’.. 
మిత్రభావంతో వచ్చినవానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నాడు.

ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పి వా పునః
వయస్యార్థే ప్రవర్తన్తే స్నేహం దృష్ట్వా తథావిధమ్‌
..అన్నారు వాల్మీకి మహర్షి.


నిజమైన స్నేహానికి ధనాన్నైనా, శరీర సుఖాన్నైనా, చివరకు దేహాన్నైనా త్యాగం చేయాల్సిందే తప్ప స్నేహాన్ని వదలరాదని దీని భావం.
-గన్నమరాజు గిరిజామనోహర బాబు



Sunday, 8 April 2018

రావణుడు - మారీచుడు




రావణుడు - మారీచుడు
అదిగదిగో బంగరు లేడి

తన ఆశ్రమంలో ధ్యానంలో లీనమై ఉన్న మారీచుడి ముందు వచ్చి నిలిచాడు రావణుడు. తమ రాజుని చూసిన మారీచుడు అతిథి సత్కారాలు చేశాడు. కుశలప్రశ్నలు వేశాడు. అంతటి మహా బలశాలి, పరాక్రమవంతుడు అయిన రావణుడు తన వద్దకు ఎందుకు వచ్చాడో తెలియలేదు. అదే విషయం వినయంగా అడిగాడు.

సమాధానంగా రావణుడు ‘‘నాయనా! నేనిప్పుడు మహా కోపంతో ఉన్నాను. వాడెవడో రాముడట. దశరథ మహారాజు కొడుకట. తండ్రి అడవులకు వెళ్లమని ఆజ్ఞాపిస్తే, ఇక్కడకు వచ్చాడు. అతనొక్కడే నా బలగంలోని పద్నాలుగువేల మంది రాక్షసుల్ని, మా సైన్యాధ్యక్షుడైన త్రిశిరుణ్ణి, నా తమ్ముళ్లు ఖరదూషణాదుల్నీ చంపేసి, నన్ను దెబ్బతీశాడు. అతని అందచందాలకు ముగ్ధురాలై, చెంత చేరబోయిన నా చెల్లెలు శూర్పణఖ ముక్కూచెవులూ కోసి, కురూపిని చేసి, తీవ్రంగా పరాభవించాడు. నా చెల్లెలు దీనంగా నా వద్దకొచ్చి నిలుచుంటే, నా గుండె ద్రవించిపోయింది. ఆ రాముడి భార్య సీత మహా సౌందర్యవతి అట. ఆమె అంటే రాముడికి వల్లమాలిన ప్రేమట. ఆ సీతను అపహరించుకునిపోయి, రాముణ్ణి మానసికంగా దెబ్బతీయాలి. అప్పుడు కానీ, నా గుండె మంట చల్లారదు. నువ్వు నాకు మిత్రుడివి, మాయలు తెలిసిన వాడివి కాబట్టి సీతాపహరణకు నాకు సాయం చేయాలి’’ అన్నాడు.

మారీచుడు రావణుడితో ‘‘మహారాజా! నీకు రాముడి సంగతి తెలియదు. అతడు మహా బలపరాక్రమ వంతుడు. ధర్మస్వరూపుడు. సీత ఆయన ప్రాణసఖి. ఆమెను ఆయన నుంచి వేరు చేసిన వారెవరయినా సరే, బతికి బట్టకట్టడం అసాధ్యం. ఇప్పటివరకు ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నావు. కోరికోరి వైరం పెట్టుకుని, ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు?’’ అని హితవు చెప్పబోయాడు.

ఆ మాటలను రావణుడు ఏమాత్రం చెవిన వేసుకోకపోగా, ‘‘నీవన్నీ సోమరిపోతు మాటలు. పనికిమాలిన ప్రబోధాలు. రాజు వచ్చి అడిగితే బంటు కాదని అనడం ఎక్కడైనా ఉందా? దిక్పాలకులే నా మాట మీరరే, నీవెంత? నీ సాయమడిగానని మిడిసిపడుతున్నావా? మర్యాదగా నీకు చెప్పిన పని చేయి. లేదంటే నిన్ను ఇక్కడికిక్కడే హతమారుస్తాను’’అని బెదిరించాడు.

దుష్టుడైన రావణుడి చేతిలో చచ్చేకంటే, పురుషోత్తముడైన రాముడి చేతిలో మరణించడం మేలనుకున్నాడు మారీచుడు. వెంటనే వెండిచుక్కలున్న బంగారులేడిలా మారిపోయి, పంచవటి వైపు పయనించాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, శత్రువైనా సరే, అతడిలోని మంచిగుణాలను మెచ్చుకోవలసిందే! అదేవిధంగా, పోగాలం దాపురించిన వాడికి ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా, తలకెక్కవు అని.


డి.వి.ఆర్‌. భాస్కర్‌





అతిరాత్రం యాగం





మహోత్కృష్ట యాగం... అతిరాత్రం

Information about Yagam and types of Yagam.

ప్రకృతిపై వికృతి ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటుంది (ఉదా – సార్స్, స్వైన్‌ ఫ్లూ, బర్డ్‌ ఫ్లూ, ఎబోలా, మ్యాడ్‌ కౌ వంటివి.) మానవశరీరంపై ప్రతి నిమిషం దాదాపు 50,000 సూక్ష్మక్రిములు (బాక్టీరియా) దాడిచేస్తూనే ఉంటాయి. మన రోగనిరోధక శక్తి వాటిని నిరోధిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకు తగ్గినపుడు రోగగ్రస్థులమవుతాం. దేహం – దేశం రెండూ ఒక్కటే.

భూమిపై ఏ జీవీ ప్రయత్నించని విధంగా మానవుడు వివిధ ఆయుధాలతో, అణుశక్తి విస్ఫోటనశక్తితో ప్రపంచంలో జీవకణశక్తిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటువంటి వినాశకారక ఆలోచనలు మార్చేందుకు చంద్ర సంబంధమైన సోమలతతో అత్యంత కఠోర నియమావళితో చేసే మా–నవ ప్రయత్నమే సోమయాగం. ఏ యజ్ఞమైనా ప్రకృతిని కాపాడడానికే.

కలియుగంలో చేయదగిన సప్త సోమయాగాలలో అప్తోర్యామం ఏడవది. అగ్నిహోత్రంతో సశాస్త్రీయ సనాతన భారతీయ వేద విజ్ఞాన విధానం ద్వారా ప్రకృతిలో జీవశక్తిని పెంచడానికి సోమలతనుండి తీసే సోమరసాన్ని ప్రకృతికి (దేవతలకు) సమర్పించటమే సోమయాగం. చంద్రుడు మనఃకారకుడు. చంద్రకాంతి ప్రకృతిని, జీవుల మనస్సును ప్రభావితం చేస్తుంది. చంద్రకళలతో సమానంగా పెరుగుతూ, సమానంగా తరిగే ఏకైక ఓషధీ రాజం సోమలత. అమితంగా చంద్రశక్తిని గ్రహించే ఏకైక లత సోమలత. సోమయజ్ఞాలలో సోమవల్లీరసం ప్రధానం.

ప్రకృతిలో జీవశక్తిని పెంచడానికి సోమలతనుండి తీసే సోమరసాన్ని అగ్ని ద్వారా దేవతలకు సమర్పించు మంత్రవిభాగాలు ప్రధానంగా 33 స్తుతి – శస్త్రాలు. స్తుతి సామవేద మంత్రాలు, శస్త్రాలు ఋగ్వేద మంత్రాలు. సప్త సోమయాగాల పేర్లు ఈస్తుతి – శస్త్రాల సంఖ్యను అనుసరించి నిర్ణయించబడుతుంది. వేదానాం సామవేదోస్మి అని జగద్గురువులైన శ్రీ కృష్ణులు చెప్పారు. సామం లేకపోతే యాగం లేదు. సోమయాగంలో సామవేదమే ప్రధానం. ఈ విషయం అర్థం కావాలంటే యాగం చూడడం, అది ఏమిటి అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

సోమయాగాలు ఏడు – 1) అగ్నిష్టోమం 2) అత్యగ్నిష్టోమం 3) ఉక్థ్యం 4) షోడశీ 5) వాజపేయం – 6) అతిరాత్రం 7) అప్తోర్యామం.

ఫలం ఏమిటి?
సోమ యాగం వల్ల ప్రకృతికి ఏది అవసరమో అవి తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. ఆవునేతితో హోమంచేస్తే ప్రాణ వాయువు (ఆక్సిజన్‌) పెరుగుతుంది. సోమరసంతో హోమం చేస్తే ప్రకృతిలోని సమస్త మూలకణములు శుద్ధి అయి, జీవశక్తి పెరుగుతుంది. సోమయాగం జరిగినచోటే గాక హోమధూమం వెళ్ళినచోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భజలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి.

జీవజాతులలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హానికర సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఉండవు. ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయి. పాలలో పోషకవిలువలు పెరుగుతాయి. సస్యవృద్ధి (పంటలు) కలుగుతుంది. ఆ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సిజేరియన్‌ ఆపరేషన్లు తగ్గి సహజమైన కాన్పులు కలుగుతాయి. మాతా శిశు మరణాలు, ప్రమాదాలు తగ్గుతాయి. మానవుడికి చెడు ఆలోచనలు రావు.

అప్తోర్యామం సోమయాగం వల్ల మానవుల కనీస అవసరాలు తీరుతాయని శ్రుతి (వేదం) చెప్తున్నది. ఇది శాస్త్రీయ పరిశోధనద్వారా నిరూపితమైంది.యాగం అనంతరం పిల్లలు లేని దంపతుల కోసం పుత్రకామేష్టి, జీవితంలోని అన్ని విపత్తులూ తొలగిపోయి, సకల శుభాలూ జరగడం కోసం చేసుకునే శ్రీ ప్రత్యంగిరా హోమం జరుగుతాయని, ఆసక్తి గల వారు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చునని యాగ పరిరక్షకులు కేసాప్రగడ ఫణి రాజశేఖర శర్మ తెలియజేస్తున్నారు.

నిర్వహణ ఎవరు?

జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ తీర్ధమహాస్వామి, వెదురుపాక గాడ్, శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివార్ల దివ్య ఆశీస్సులతో త్రిలింగ తెలుగు ప్రాంతాలైన భద్రాచలంలో 2012లో అతిరాత్రం, 2013లో మురమళ్లలో అతిరుద్రం, 2015లో గార్గేయపురం (కర్నూలు)లో అప్తోర్యామం, 2017లో యాదగిరిగుట్టలో అయుత శ్రీమహావిష్ణు మహాయాగాలు‘ ఇత్యాది ఏకవింశతి (21) మహాయాగకర్తలు బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ – రాధాకృష్ణకుమారి దంపతుల కర్తృత్వాన, హైదరాబాద్‌ కె.హెచ్‌.ఎస్‌. సేవా ట్రస్ట్, ఇతర అనుబంధ సంస్థల నిర్వహణలో అశేష భక్త జనావళి పాల్గొననున్నారు.

ఎప్పుడు? ఎక్కడ?
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పంచారామాలలో ఒకటైన కుమారారామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో గల పాండవుల గుట్టలో ఈ ఏప్రిల్‌ 14 నుంచి 25వ తేదీ వరకు మహాగ్నిచయన పూర్వక మహోత్కృష్ట సోమయాగం అతిరాత్రం జరగనుంది. బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహర నాథ శర్మ నేతృత్వ పర్యవేక్షణలో త్రేతాగ్ని హోత్రి బ్రహ్మశ్రీ కిరణ్‌ అవధాని దంపతులు యజమానులు కాగా, భార్గవ రామ అవధాని బ్రహ్మగానూ, సాకేత రామ అవధాని హోతగానూ, శ్రీధర శర్మ ఉద్గాతగానూ ఈ యాగం అత్యంత శాస్త్రోక్తంగా, మహా వైభవంగా జరగనుంది.






తెలుగు నేలపై అతిరాత్రం!

లోక శ్రేయస్సునూ, వైయక్తికమైన ఫలాలనూ ఆశించి యాగాలు నిర్వహించే సంప్రదాయం మన దేశంలో వేల సంవత్సరాల నుంచీ ఉంది. వీటిలో కలియుగంలో చేయదగినవిగా ఏడు సోమ యాగాలను వేదపండితులు పేర్కొంటారు. అవి: అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉక్థ్యం, షోడశీ, వాజపేయం, అతిరాత్రం, అప్తోర్యామం. వీటిలో అతిరాత్రం అనేక విశిష్టతల సమాహారం. సోమలత ప్రస్తావన వేదాల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. శుక్ల పక్షంలో చంద్రుడితో పాటు ఎదుగుతూ, కృష్ణ పక్షంలో చంద్ర కళలతోపాటు తరుగుతూ ఉండే సోమలత చంద్రుడి శక్తిని అపారంగా గ్రహిస్తుందని పెద్దలు చెబుతారు.

దీనిలో ఔషధీ గుణాలు అపారమనీ, జీవశక్తిని ఇది పెంచుతుందనీ పేర్కొంటారు. ఆ సోమలతల నుంచి తీసే రసం సోమ యజ్ఞంలో ప్రధాన ద్రవ్యం. యాగ గుండంలో సోమరసాన్ని అగ్నికి అర్పించి, దేవతలను అర్చిస్తారు. ఈ అరుదైన యాగ సంప్రదాయాలను కేరళలోని పండితులు సంరక్షించి, యాగాలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలుగు ప్రాంతాల్లో- 2012లో భద్రాచలంలో అతిరాత్ర మహాయాగం, 2015లో అప్తోర్యామ మహాయాగం జరిగాయి. మరోసారి అతిరాత్రానికి తెలుగునేల సిద్ధమవుతోంది.

ఎప్పుడు?: తాజాగా ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకూ - 14 రోజులపాటు

ఎక్కడ?: తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం-సామర్లకోట టి.జంక్షన్‌ వద్ద, పాండవులమెట్ట దిగువన.

ఎలా వెళ్ళాలి?:
సామర్ల కోట రైల్వే స్టేషన్‌ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో యాగ స్థలం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సామర్లకోటకు నేరుగా రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. సమీప విమానాశ్రయం రాజమండ్రిలో (37 కిలోమీటర్లు) ఉంది.

ప్రధాన కార్యక్రమాలు:
అతిరాత్రం - మహాగ్నిచయన పూర్వక శ్రౌత సోమయాగం, పుత్రకామేష్టి (26వ తేదీన) , శ్రీప్రత్యంగిరా విశ్వశాంతి మహాయాగాలు, పూర్ణాహుతి (27వ తేదీన)

ప్రధానంగా ఆశించే ఫలితాలేమిటి?:
ప్రకృతిలో జీవ శక్తి పెంపొందించడం, దేశానికి ఎదురయ్యే అరిష్టాలను నివారించడం, సకాలంలో వర్షాలు పడేలా ప్రకృతిని అనుకూలపరచడం, జీవజాతుల్లో వ్యాధి నిరోధకతను పెంపొందించడం.

ఈ యాగాన్ని కర్నాటక రాష్ట్రం మత్తూరు అగ్రహారానికి చెందిన కిరణ అవధాని సోమయాజి దంపతుల యాజమాన్యంలో కె.హెచ్‌.ఎస్‌. సేవా ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 70 మంది చతుర్వేద శ్రౌత పండితులు పాలుపంచుకుంటారు. యాగ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే వివరాల కోసం కె.హెచ్‌.ఎస్‌. సేవా ట్రస్ట్‌ను ఫోన్‌ నెంబర్‌ 9642072905లో సంప్రదించవచ్చు.





Thursday, 5 April 2018

ద్రౌపది - నిప్పుల్లో దొర్లిన ఒక స్త్రీ





ద్రౌపది
నిప్పుల్లో దొర్లిన ఒక స్త్రీ

పాండవుల మూర్తిమత్వంలో సందిగ్ధతలు, ద్వైధీభావాలు కనపడతాయి కాని ద్రౌపదిలో కానరావు. కఠిన పురుష ప్రపంచంలో ఒక ధిక్కారస్వరం ఆమె. స్వతంత్ర భావప్రకటనలో సీత మొదలు ఏ పౌరాణిక స్త్రీనీ ఆమెతో పోల్చలేం.

ఆమె కృష్ణ, పాంచాలి, యాజ్ఞసేని, ద్రౌపది. భారతీయ సాహిత్యంలో నాకిష్టమైన విశిష్టమైన స్త్రీ. సీత, సావిత్రి వంటి సాధ్వీ మణుల జాబితాలో ఆమెకు చోటు లేకపోవచ్చు. (మూడున్నర దశాబ్దాల ఈ రచయిత అధ్యాపక వృత్తిలో ఒకే ఒక్క విద్యార్థిని మాత్రమే ‘ద్రౌపది’ పేరుతో చేరింది.) కాని ఆ అందరికన్న ఆమె జీవితం చాలా కష్టమైనది, క్లిష్టమైనది. భర్తలు మొదలు సమాజం దాక అందరివల్ల ఆమెకు అన్యాయమే జరిగింది. ద్రౌపది పాత్ర భారతంతో ముగిసిపోయిందనుకోను. ఇప్పటికీ ఆమె ఆధునిక స్త్రీ గాయాల తో తన గాయాలను పోల్చి చూసుకుంటూనే ఉంది.

ఆమె పుట్టుకే ఒక మర్మం. ద్రోణుడిని వధించగల కొడుకు కావాలని గంగాతీరాన ఉన్న యాజోపయాజులచేత పుత్ర కామేష్టి జరిపించాడు ద్రుపదుడు. అగ్నిప్రసాదంతో యజ్ఞ కుండం నుంచి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది కూడా జన్మించారు. కనుక ద్రౌపది అయోనిజ. అగ్నిస్వభావం ఆమెలో అంతర్గర్భితమై ఉంది.

ఆనాటి రాజకుమార్తెలకు కాబోయే వరుడిని ఎన్నుకోవటంలో స్వయంవరం ఒక అవకాశం. అయితే ద్రౌపది విషయంలో అది జీవితకాలపు శాపమే అయ్యింది. ఆ సందర్భంలో కర్ణుడు మత్స్యయంత్రాన్ని భేదించే ప్రయత్నం చేశాడని, కాని ద్రౌపది ‘నేను సూతుడిని వరించను’ (‘నాహం వరయామి సూతమ్‌’) అన్నదని, దానితో కర్ణుడు విల్లు వదిలాడని ఒక కథ. అది సంశోధిత ప్రతుల్లో లేదు. ఆ అసంబద్ధ కథనాన్ని నన్నయ కూడా త్రోసిపుచ్చాడు. ఇలా ఆమె చుట్టూ ఎన్నో అబద్ధాలు అల్లుకొన్నాయి.

మత్స్యయంత్రాన్ని ఐదు బాణాలతో కొట్టిన అర్జునుడితో పాటు పాండవులు తల్లి వద్దకువచ్చి, ‘మేమొక్క భిక్ష తెచ్చితిమి’ అని చెప్పారు. ‘మీరేవురు నుపయోగింపుడు’ అన్నది కుంతి. పొరపాటు తెలుసుకొని, ‘నా మాట పూర్వం ఎప్పుడూ అనృతం కాలేదు, ఇదేమో లోకంలో లేని ఆచారం. ఇప్పుడేం చెయ్యాలి?’ అని మథనపడింది. పెద్దవాడుండగా చిన్నవాడు పెళ్లాడటం ధర్మవిరుద్ధం కాబట్టి ఆమెను ‘అగ్రమహిషి’గా స్వీకరించమని అర్జునుడు అన్నను కోరాడు. అలా అయితే ఆమె మన ఐదుగురికీ భార్య అవుతుందన్నాడు ధర్మరాజు. విషయం తెలిసి ద్రుపదుడు బాధపడుతుంటే వ్యాసుడు వచ్చి ద్రౌపది పూర్వజన్మ (ఇంద్రసేన) వృత్తాంతం వివరించాడు. పూర్వ జన్మలో ఆమె కామస్వభావంతో శివుడిని ‘పతిం దేహి’ అని ఐదుమార్లు కోరిందని, అందువల్ల మరుజన్మలో ఐదుగురు భర్తలు కలుగుతున్నారని, అందులో తప్పు లేదని వ్యాసుడి మాట. "ఎన్నిమార్లు కోరినా వరమిచ్చిన సర్వజ్ఞుడికి ఆ మాత్రం తెలియదా?" అనే ప్రశ్నని పక్కన బెట్టినా ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం కేవలం కల్పితమని తెలుస్తుంది. తెలుగు భారతంలో ఆ కథ లేదు. మూలంలోను సంశోధిత ప్రచురణలో లేదు. పాండవులందరికీ ద్రౌపది మీద కోరిక ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. కాని భారతంలో ఎక్కడా ద్రౌపది ప్రేమికురాలుగా తప్ప కాముకురాలుగా కనపడదు.

వివాహవృత్తాంతం అంతటిలో ద్రౌపది ప్రమేయం ఏమాత్రం లేదు. ఆమె ఇష్టానిష్టాలతో రవ్వంత నిమిత్తం లేకుండా ఆస్తిని పంచుకున్నట్టు ఆమెనీ పంచుకున్నారు. తండ్రి మొదలు తాళి కట్టే భర్త దాక ఎవ్వరూ ఆమె అభిప్రాయాన్ని అడగకపోవటం విచిత్రం. అదే సమయాన ద్రౌపది తన అభిప్రాయం తెలపటానికి కనీసం ప్రయత్నించలేదు. బహుశః అప్పటికి అది సమాజం స్థిరీకరించిన పురుషాధిపత్య విధానం అయ్యుండాలి. కనుకనే కాలక్రమంలో ఎన్నో విషయాల్లో ఆమోదిత విలువలకు భిన్నంగా స్వతంత్రాభిప్రాయాలు ప్రకటించిన ద్రౌపది అతి ముఖ్యమైన జీవితసందర్భంలో మౌనంగా ఉండిపోయింది.

జూదసభ ద్రౌపదిని జీవితాంతం వెన్నాడిన పీడ. అందులో ఒకానొక ప్రశ్న కూడా.
బ్రతుకంతా ఆమెకి సమాధానం దొరకలేదు. ఏకవస్త్రగా ఉన్న తనను నిండుసభలోకి ఈడ్చినప్పుడు, ‘నేను ధర్మవిజితనా? అధర్మ విజితనా? దాసినా? అదాసినా?’ అని ఆమె అడిగింది. ఏ యుగంలోనైనా ఎటువంటి తప్పుడు జూదగాడైనా ఆలిని పందెంగా పెట్టిన వాడున్నాడా అని ఆశ్చర్యపడింది. ‘తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా?’ - ఇదీ ఆమె ధర్మసూక్ష్మత. పురుష సమాజానికి వేసిన ఆ ప్రశ్నలో తెలివి, తెగువ - రెండూ ఉన్నాయి. భీష్ముడితో సహా ఎవ్వరూ నోరెత్తని సందర్భంలో ‘నేనిందు ధర్మనిర్ణయంబు సేసెద’నని ముందుకు వచ్చిన ధైర్యశాలి వికర్ణుడు. పాండవులందరికీ సాధారణ ధనమైన పాంచాలిని ధర్మరాజు ఒక్కడే పణంగా పెట్టాడు కనుక ‘ద్రౌపది అధర్మ విజిత, అక్కోమలి నేకవస్త్రనిట దోడ్కొని తెచ్చుట యన్యాయంబు’ అని ప్రకటించిన ధీశాలి అతను. భార్యకు దైవవిహితుడైన భర్త ఒక్కడే, ఇది అనేక భర్తృక కాబట్టి ‘బంధకి’ అనబడుతుంది, అటువంటి దానిని వివస్త్రగా చేసి తెచ్చినా తప్పులేదన్నాడు కర్ణుడు. ఇది ఆమెకు మరో తీవ్ర గాయం. అనేకభర్తృక కావటంలో ఆమె నిస్సహాయురాలని, అందువల్ల ఆమె చేసిన శీలాతిక్రమణం ఏమీ లేదని ఎవ్వరూ అనలేకపోయారు. ఆ సమయాన ‘భ్రాతృ పుత్త్ర బంధుజనం బులు నాకుం గలిగియు లేనివారయిరి’ అని అరణ్యవాసంలో కృష్ణుడి వద్ద వాపోయింది ఆమె. అన్ని అవమానాలు ముగిసి నాక మానసికంగానూ గుడ్డివాడైన ధృతరాష్ర్టుడు రెండు వరాలు కోరుకొమ్మన్నప్పుడు ఆమె తొలి భర్తకి, ఆ తర్వాత తక్కిన నలుగురికీ విమోచనం కోరుకొంది. మూడో వరం కోరుకొమ్మన్నప్పుడు తనకై ఏమీ యాచించకుండా క్షత్రియస్త్రీ రెండు వరాలే ధర్మ పద్ధతి అని ఎంతో ఉన్నతంగా ఆలోచించి, వద్దన్నది. ఈ వస్త్రాపహరణ సన్నివేశంలో మొత్తం కౌరవసభ నైతికంగా మరణించింది.

పనిపాటలెట్లా చెయ్యాలో మెట్టినింట్లో అడుగు పెట్టిననాటి నుంచే కోడలికి నేర్పిన కుంతి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు తన బిడ్డల్ని ఆమెకి అప్పగించింది. సహదేవుడిని ‘కడు పసిబిడ్డ’గా అప్పజెప్పింది. పాండవులకు విడివిడిగా దేవిక మొదలు పదిమంది భార్యలున్నా ఎవ్వరూ అడవికి పోలేదు. ద్రౌపది ఆ పన్నెండేళ్లూ వాళ్లకి ఇల్లాలుగా సేవలు చేసింది, తల్లిగా కూరిమి చూపింది. స్త్రీ తమ భర్తలకి భార్యలే కాదు, తల్లులు కూడా అని నిరూపించింది. అంతకు మించి ‘కరణేషు మంత్రి’గా క్షత్రియులకు క్షమతో పాటు తేజస్సు కూడా అవసర మని అరణ్యవాసంలో ధర్మరాజుతో వాదించింది. ధర్మపన్నాలు వల్లిస్తున్న భర్తతో ‘ఎఱుగని దాన గాను ధర్మతత్త్వయుక్తి’ అని విశదం చేసిన శాస్త్రజ్ఞానం ఆమెది. భర్తలకన్న మిన్నగా ఆనాటి క్షత్రియధర్మం పాటించింది ద్రౌపది.

అజ్ఞాతవాసం ఎట్లాచెయ్యాలో ద్రౌపదికి చెపుతూ ధర్మరాజు, తులువల తలపులు తెలిసి ప్రవర్తించాలి అన్నప్పుడు ఆమె ‘అనాదర మందస్మితం’ చేసింది. ఆ మాత్రం తెలియని దానినా అని ఆ నవ్వుకర్థం. స్వతంత్రమైన ఆలోచనతో ‘మాలిని’ పేరుతో తనంత తనే సైరంధ్రి వృత్తి నిర్ణయించుకొంది. ఆ వృత్తిలోనే ఆమె మనసు మీద మరో కత్తిగాటు పడింది. కీచకుడు బలాత్కారం చెయ్యటమేకాక, తప్పించుకు పరుగెత్తిన ఆమెను నిండుసభలో జుట్టుముడిపట్టి లాగి, కాలితో తన్నాడు. పడి లేచిన ద్రౌపది ఏ స్పందన లేని ఆ సభాంగణంలో ‘ఎవ్వరి యాండ్రురింక పరిభవంబున బొందక బ్రతుకువారు?’ అని విరటుడిని ప్రశ్నించింది. ఆలి అవమానానికి గాక అజ్ఞాతవాస భంగానికి వెరచిన ధర్మరాజు ‘పలుపోకల బోవుచు విచ్చలవిడి నాట్యంబు సలుపు చాడ్పున... కులసతుల గరువచందము తొలగగ’ ఇట్లా ప్రవర్తించటం తగునా... అని మందలించాడు. పుండుమీద కారం అది. ఆమె చేసింది నాట్యమేనా? కులసతుల గౌరవం, అవమానించిన కీచకుడి వల్ల తొలగిందా, ద్రౌపది వల్ల తొలగిందా అనేది ‘అంతర్మద దుష్టుడు’ అయిన ధర్మరాజు గుర్తించలేదు. దానికి వచ్చిన సమాధానం అతని జీవితంలో మర్చిపో లేనిది.
‘నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు

పెద్దవారి యట్ల పిన్నవారు
కాన పతుల విధమ కాక యే శైలూషి కాదనంగ రాదు కంకభట్ట!’

‘మత్పతి శైలూషుండ కాడు, కితవుండునుం గాన జూదరి యాలికి గరువచందంబెక్కడిది?’ అన్నది ద్రౌపది. శైలూషుడు (నర్తకుడు) అనే మాట బృహన్నలకు తగిలితే కితవుడు (జూదగాడు) అనే మాట ధర్మరాజుకు తగిలింది. దెబ్బతిన్న ఆత్మాభిమా నానికి రోషం తోడైతే వెలువడ్డ ఎత్తిపొడుపు మాటలవి.
ఆ రాత్రి వంటశాలలో నిద్రిస్తున్న భీముడిని లేపింది ద్రౌపది. ‘ఉత్తిష్తోత్తిష్ట భీమసేన! కిం శేషే యథా మృతః?’ అని మూలం. ఆలి తలవంపు పట్టకుండా చచ్చినవాడిలా అంత గాఢనిద్రా? అని ఆమె కినుక. ఎన్నో చోట్ల మూలానికి మెరుగులు దిద్దిన తిక్కన అంత పెద్ద తిట్టు ఆమె నోటివెంట పలికించలేక మెల్లని మాటలతో మెత్తని కరస్పర్శతో మేల్కొలిపినట్టు చెప్పాడు. ఆమె స్వభావానికి మూలమే తగుననిపిస్తుంది. తన బాధ, కష్టం భీముడికి చెప్పుకొని, కాయలు గాసిన చేతులు చూపించి, అతని రొమ్ముపై తల పెట్టి ఏడ్చింది ద్రౌపది. కీచకుడిని చంపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఒత్తిడి చేసింది. అది ఆమె ప్రతీకారవాంఛ. భీముడు చెప్పిన ఉపాయం చొప్పున కీచకుడిని ఆకర్షించటానికి ఎన్నడూలేని వగలమారి తనం చూపించింది. కీచకుడిని నర్తనశాలలో ‘వికృతపు చావు’ చంపిన భీముడు ‘శాంతింబొందెనె రోషపావకుడు? దుశ్చారిత్రునిం జూచితే?
సంతోషించితె?’ అని అడిగాడు. సంతోషించింది ద్రౌపది. పరాభవించబడిన ప్రతిసారి ఆమె తలెత్తి నిలబడింది. ప్రతి అవమానాన్ని ధిక్కరించింది. ఆమెకి తోడునీడై జరిగిన ప్రతి అవమానానికి బదులు తీర్చినవాడు, అందరి కన్న ఆమెను గాఢంగా ప్రేమించిన వాడు భీముడే.

కృష్ణుడు రాయబారానికి బయలుదేరేటప్పుడు ఆమె నిప్పులు కురిసింది. పాండవులు అన్నదమ్ములు ఐదుగరూ ‘హీనగతి’తో ఐనా సంధికే ఇష్టపడ్డారు. అది అసమర్థత అని లోకులంటారన్నది ద్రౌపది. ఆ సందర్భంలో తన ఆభిజాత్యాన్ని తొలిసారి ప్రకటించింది:
‘వరమునఁ బుట్టితిన్‌, భరతవంశముఁ జొచ్చితి, నందు పాండుభూ
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁ బొందితి, నీతివిక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్‌, సహజన్ముల ప్రాపు గాంచితిన్‌
సరసిజనాభ! యిన్నిటఁ బ్రశస్తికి నెక్కిన దాననెంతయున్‌’


ఒక ఉత్తమ ఇల్లాలి గౌరవప్రమాణాలు ఏవని ఆమె భావించిందో- వర ప్రాభవం, వంశ ప్రతిష్ఠ, ఉత్తమ భర్తృత్వం, వీరమాతృత్వం, సోదరప్రేమ- అవన్నీ తనకున్నాయి. అదీ ఆమె ప్రశస్తి, ఆత్మగౌరవం. అటువంటి తనను కౌరవులు అవమానించారు. కోడలిని దాసిని చేశారు. ఇప్పుడు భర్తలు ఆ ‘మహాపురుషుడి’ (ధృతరాష్ర్టుడి)వద్దకు అభిమానం చంపుకొని పోగా, నేను కూడా వెళ్లి కోడరికం చెయ్యాలా? దాస్యం చెయ్యాలా? అని ఆమె అడిగిన ప్రశ్నలో చాలా తర్కం ఉంది. ఈ క్రమంలో తన రోషం ఆపుకోలేక కురులు విప్పి, కృష్ణుడి ముందు పెట్టి, ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన ఆ చేయి మొదలు తనువంతా ముక్కలు ముక్కలు కావాలని, రాజరాజు పీనుగు కళ్లారా చూడాలని తన ప్రతీకారేచ్ఛ వెల్లడించింది. పాండవుల మూర్తిమత్వంలో సందిగ్ధతలు, సడలుతనాలు, ద్వైధీభావాలు కనపడతాయి కాని ద్రౌపదిలో మచ్చుకు కూడా కానరావు. కఠిన పురుష ప్రపంచంలో ఒక ధిక్కారస్వరం ఆమె. స్వతంత్ర భావప్రకటనలో సీత మొదలు ఏ పౌరాణిక స్త్రీనీ ఆమెతో పోల్చలేం.

భారతంలో చివరిసారిగా ఆమె కనపడేది పాండవుల మహాప్రస్థానంలో. హిమాలయాలు దాటి మేరుపర్వత పథంలో ఉండగా ముందుగా ద్రౌపది కుప్పగూలిపోయింది. ఆమెని అమితంగా ప్రేమించిన భీముడు అడిగాడు అన్నని, ‘ఈమె ఎన్నడూ ధర్మహాని చెయ్యలేదు, ఇట్లా కూలిపోవటానికి కారణమేమిటి’ అని. ‘ఈమెకు అర్జునుడి పట్ల పక్షపాతం. అందువల్ల తన పుణ్యాలు ఫలించక ఇటువంటి దురవస్థ పాటిల్లింది’ అన్నాడు ధర్మరాజు. ‘ధర్మార్థ కుశలా చైవ ద్రౌపదీ ధర్మచారిణీ’ (వ్యాసుడు), ‘అయోనిజా లోకకాంతా పుణ్యగంధా’ (ఇంద్రుడు) అనే విధంగా ఎందరి మెప్పునో పొందిన ఆమె, జీవితాంతం అసలు భర్త కాని ఏ వ్యక్తిని నెత్తిని పెట్టుకొందో అతని మెప్పు మాత్రం పొందలేక పోయింది. తన జీవితంలో అన్ని అవమానాల కన్న దారుణమైన అవమానం అదే. ‘నాథవతీ అనాథవత్‌’ (భర్తలుండీ లేనిది)అని భారతమంతటా వచ్చే ప్రస్తావన ఒక రకంగా ఆమె బండలైన బ్రతుకుకు వ్యాఖ్యానమే.

పౌరాణిక సాహిత్యం చెయ్యలేని కావ్యన్యాయం జానపద సాహిత్యం చేసింది. జూదసభలోకి తనే స్వయంగా వచ్చి, శకునిని సవాలు చేసి, ఎడమకాలితో పాచికలాడి, పాండవుల్ని తిరిగి గెలిపించి, దుర్యోధనుడి ముఖంపై ఉమ్మేసిన ‘పాంచాలమ్మ పాట’ ఆ పాత్రలోని పౌరుషాన్ని ఆవిష్కరి స్తుంది. (సూళ్లూరు పేట, పొన్నేరు ప్రాంతాల్లో పాడుకొనే ఈ పాట గురించి మిత్రులు స.వెం. రమేశ్‌ చెప్పారు. ఆమె పూర్వజన్మ గురించీ ఒక జంగం పాట ఉన్నట్టు తెలుస్తుంది.) ప్రాచీనపాత్రల్ని ఆధునిక రచనలు పునర్వ్యాఖ్య చేేసటప్పుడు జాగ్రత్త అవసరం. ఆ వ్యాఖ్యలు లేదా కల్పనలు వాస్తవ భూమిక మీద ఆయా పాత్రల అవ్యక్త అంతరంగాన్ని ఆవిష్కరించేలాగా, సానుకూలంగా ఉండాలి. మూలచ్ఛేదం చెయ్యగూడదు.

చెయ్యని నేరం తలకెత్తిన సీత, ద్రౌపది వంటి స్త్రీలే యుద్ధాలకి మూలకారణం అనటం పురుష దుర్మార్గాలను కప్పిపుచ్చటమే. నిజానికి అనాదిగా ఈ కర్మభూమిలో తమ జీవితంలో స్త్రీలచేత ఎప్పుడూ అవమానించబడని పురుషులుం టారు. కాని పురుషుల చేత ఎన్నడూ అవమానించబడని స్త్రీలు ఉండరు గాక ఉండరు. బ్రతుకంతా నిప్పుల్లో పొర్లాడింది ఆ అభాగిని. సత్త్వ రజోగుణాల కలయిక ఆమె. అవమానిత భారతీయ మహిళా సమాజానికి ప్రాచీన ప్రతీక ద్రౌపది. అదే సమయాన తన జీవితంపై తన అధికారం కోసం పోరాడు తున్న ఆధునిక మహిళకి మహా స్ఫూర్తి ద్రౌపది.

‘అహల్యా ద్రౌపదీ కుంతీ, తారా మండోదరీ తథా
పంచకన్యా స్మరేన్నిత్యం, మహాపాతక నాశనమ్‌’
వీళ్లంతా తమ తమ బ్రతుకుల్లో అత్యాచారానికి గురి అయినవాళ్లు. అందరిలో మహా దయనీయ, మహా ధైర్యశాలి ద్రౌపది. ఎన్నో పేర్లున్నా ఆమెకి పెట్టదగిన పాతకాలపు పేరు ‘పుణ్యగంధ’. ఈ కాలపు అచ్చమైన పేరు ‘ధీర వనిత’.
పాపినేని శివశంకర్‌