పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయతలపెట్టాడు. యాగానికి ముందు సోదరులను, కౌరవులను, కృష్ణభగవానుణ్ణి, ఇతర సామంతులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు.
యాగానికి అందరూ సహకరించాల్సిందిగా కోరారు ధర్మరాజు.
సభకు హాజరైనవారంతా.. ‘దానిదేం భాగ్యం ధర్మరాజా! మీరు ఏం చెబితే అది చేస్తామ’ని ప్రకటించారు.
భీముడికి భోజనాల విభాగం చూసుకోమని చెప్పాడు.
కర్ణుడికి దానధర్మాలు చూసుకోవాల్సిందిగా కోరాడు.
ఆదాయ, వ్యయాల విషయాలన్నీ దుర్యోధనుడికి అప్పగించాడు.
ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు ధర్మరాజు.
ఇంతలో శ్రీకృష్ణుడు లేచి.. ‘ధర్మరాజా! అందరికీ అన్ని పనులు చెప్పేస్తున్నావు. మరి నామాటేమిటి?’ అన్నాడు.
అప్పుడు ధర్మరాజు.. ‘పరమాత్మా! నీవు యాగంలో ఉంటే చాలు మాకు కొండంత అండ. మీ సాన్నిథ్య బలంతో యాగం నిర్విఘ్నంగా సాగిపోతుంది’ అని బదులిచ్చాడు.
అయినా కృష్ణుడు ఒప్పుకోలేదు. తనకేదైనా పని అప్పగించాల్సిందేనని పట్టుబడ్డాడు.
దైవంగా కొలిచే కృష్ణ పరమాత్మకు ఏ పని అప్పగించాలో తెలియక ధర్మరాజు తికమకపడ్డాడు.
ధర్మజుడి ఇబ్బంది గ్రహించిన కృష్ణుడు ‘ధర్మరాజా! యాగానికి వచ్చే మునులు, రుషుల పాదాలు కడిగే బాధ్యత నాద’ని చెప్పాడు.
ధర్మరాజు విస్తుపోయాడు.
అన్నట్టుగానే యాగంలో తపస్సంపన్నుల పాద సేవ చేశాడు కృష్ణుడు.
రాజసూయ యాగం పూర్తయిన తర్వాత అగ్రపూజ అందుకున్నాడు. ఎంత వాడైనా ఒదిగి ఉండాలనే సత్యాన్ని ఈ దృష్టాంతం ద్వారా లోకానికి చాటిచెప్పాడు శ్రీకృష్ణుడు.
No comments:
Post a Comment