అన్యాయాన్ని చూసి సహించలేని వీరత్వం వెనుక ధర్మం రక్షించబడాలనే తపన, అంతా మంచే జరగాలన్న సున్నితత్వం, ఆవేశం అనర్థాలను మాత్రమే నివారించాలి గాని, నిశ్చలమైన జీవితాన్ని కాదనే ఉన్నత వ్యక్తిత్వం, అమోఘమైన తెలివితేటలు, భుజబలం, బుద్ధిబలం కలగలిసిన మూర్తిమత్వం మహానుభావుల రూపంలో చరిత్ర ఒడిలో ఒదిగిపోయినట్టే కనిపిస్తుంది గానీ, ఆ రూపం ఇచ్చే స్ఫూర్తి కొండలనైనా పిండి చేయగల సమర్థతకు ఊపిరి పోస్తుంది. న్యాయం, ధర్మం రక్షించబడాలంటే కొన్నికొన్ని సార్లు శాంతి ప్రబోధాలను పక్కనబెట్టి పోరాటాలూ, యుద్ధాలూ, ఉద్యమాలూ చేయక తప్పదనీ అవి మాత్రమే చెడును కూకటివేళ్ళతో సహా పెకిలించి వేయగలవనీ నిరూపితమైన సందర్భాలు కోకొల్లలు. చెడును ప్రక్షాళన చేసే క్రమంలో దయాదాక్షిణ్యాలు చూపించరాదనీ, జీవన యుద్ధం మంచిని బతికించేదే కావాలనీ తెలియ జెప్పిన భీముడు ఆవేశానికి చిరునామాగా కనిపించే కరుణాంత రంగుడు. ఆలోచనతో గెలిచే శక్తియుక్తులూ వృకోదరుడై ఆరితేరిన వంటనేర్పు, కడుపునిండా తిని కంటనిండా నిద్రించే అమాయకత్వం, అన్యాయం అన్నది వినిపించినా చాలు ఆవేశంతో రగిలిపోయే యోధుడిలా భీముడు చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.
పాండవులలో మధ్యముడు, కుంతీదేవికి వాయుదేవుని వరప్రసాదంగా పుట్టినవాడు, అత్యంత బలవంతుడు, అంతే మంచి మనసున్న వాడూ భీమసేనుడు. ఆవేశంతో తన వ్యక్తిత్వానికి ముడిపెట్టినా ఎవరినీ ద్వేషించని మనసు భీమునిది. కానీ అన్యాయాన్ని సహించలేని తత్వం భీముని జీవితంగా మారిందంటే ఆశ్చర్యం లేదు.
భీముడు పుట్టిన పదో రోజే కుంతీపాండురాజులు ఆ బాలుణ్ని తీసుకొని వనదేవత ఆశీర్వాదానికై వెళుతుంటే ఒక పులి వారిపై దూకపోయింది. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో బాల భీముడు కుంతి చేతుల నుండి జారిపోయి రాయిమీద పడిపోతాడు. కుంతీ పాండు రాజులు భీమునికేమయిందోనని చూడగా, ఆ రాయి తునాతునకలైంది. నవ్వుతూ కనిపించాడు భీముడు. అంతటి బలం భీమునిది. అదే కౌరవులకు ఇబ్బందిగా తోచింది. చిన్నతనంలో భీమునికి విషం పెట్టి, బంధించి నదిలో పడేస్తారు కౌరవులు. అవి భీమున్ని ఏ మాత్రం బాధించలేకపోయింది. భీముని హృదయం చాలా సరళమైంది. ఎత్తులు, యుక్తులు అతనికి చేతకావు. మంచికి సహకరించడం, చెడును నిర్మూలించడం మాత్రమే భీమునికి తెలుసు. అందుకే కౌరవులు ఎన్ని పన్నాగాలు పన్నినా వారిపై ఏ మాత్రం ద్వేషం కలగలేదు. కానీ వారిలోని చెడును తట్టుకోలేకపోయేవాడు భీముడు. వారి పక్షాన మాట్లాడే పెద్దలపట్ల కూడా ద్వేషం కాక కోపం ప్రదర్శించే వాడు భీముడు.తల్లిని అమితంగా ప్రేమిస్తూ, అన్న మాటకు కట్టుబడి, సోదరులను ఆదరిస్తూ బతికిన భీముడు ప్రతీ అనుకూల, ప్రతికూల సమయాలలో వారందరికీ అండగా నిలబడ్డాడు. లక్క ఇంటిలో తమ చావును నిర్ధారించిన కౌరవుల పన్నాగాన్ని పసిగట్టినవాడై గట్టి కాపాలా ఇచ్చాడు భీముడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని అడవిమార్గంలో వెళుతున్న వారందరూ అలసిపోతే భీముడు కుంతిని భుజంపై ఎక్కించుకొని నకుల సహదేవులను చంకనెత్తుకొని అర్జున ధర్మరాజులకు చెరో చేయినీ సాయమందించి ముందుకు నడిపిస్తాడు. ఆదమరచి అలసి సొలసి వారంతా నిద్రిస్తే కంటికి రెప్పలా కాపుకాసాడు భీముడు.
భీముని భుజపరాక్రమం వల్లనే కుంతీ పాండవుల జీవితం అడుగడుగునా రక్షించబడుతూ వచ్చింది. ధర్మరాజు రాజసూయయాగం చేస్తే లెక్కలేనన్ని ధనరాసులను తెచ్చిచ్చాడు భీముడు. యాగంలో శిశుపాలుడు కృష్ణుణ్ని అవమానిస్తే వాడిని చంపడానికి చూసాడు. బకాసురుణ్ని చంపి చక్రపురమనే ఊరును కాపాడాడు. జరాసంధుడనే మహాయోధుడినీ దుష్టుడైనందున సంహరించాడు భీముడు. ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత, ఆమెను చాలా జాగ్రత్తగా కాపాడిన వాడూ. ఆమె భావాలకు విలువనిచ్చేవాడూ భీముడే కావడం అతని మెత్తని మనసుకు నిదర్శనం.ధర్మరాజు జూదంలో తమనూ, రాజ్యాన్నీ ఓడినా మారుమాట్లాడని భీముడు, ద్రౌపదిని పణంగా పెట్టడం సహించలేకపోయాడు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయడం భీమునికి బొత్తిగా ఇష్టం లేదు. ఎందుకంటే, క్షత్రియధర్మం అన్యాయాన్ని ఎదిరించి పోరాడి గెలవమనే చెబుతుందనేది భీముని నమ్మకం. అరణ్యవాసంలో పాండవులకు ఎదురైన అనేక సమస్యలకు భీముడే పరిష్కారం చూపించాడు.అజ్ఞాతవాసంలో ద్రౌపదిని హింసించిన కీచకుణ్ని అత్యంత భయంకరంగా చంపిన భీముడు పరాయి స్త్రీలను వంచిస్తే ఇదే గతని చరిత్ర సాక్షిగా నిరూపించాడు. ఆనాడు సభలో ద్రౌపదిని పరాభవించిన దుశ్శాసన, దుర్యోధనులను చంపి వారి రక్తంతో ద్రౌపది కురులను ముడిచి, వారి పాపానికి తగిన శిక్ష వేసాడు. మహాబలవంతులైన దుష్టులందరూ భీముని చేతిలోనే చనిపోయారంటే భీమసేనుని ఆవేశం అన్యాయాన్ని బలి కోరుతుందని చెప్పకనే చెప్పింది.స్త్రీని గౌరవించడం, ఆమెను అడుగడుగునా కాపాడుకోవడం విద్యుక్తధర్మంగా, తన కుటుంబం, వారిని ఆదరించడం తన నైజంగా ధర్మ పక్షంలో ఉండేవారిని రక్షిస్తూ అధర్మ పక్షంలోని వారందరినీ సమూలంగా నాశనం చేయడమే ధ్యేయంగా తన బలం, తన ఓరిమి, తన వ్యక్తిత్వం సడలని ధృడ నిశ్చయాలుగా మలుచుకున్న భీముని తత్వం అత్యున్నతం. ఈతని పాకశాస్త్ర నైపుణ్యం అమోఘం. ఆతని ఆవేశం వెనకాల ఉన్న సున్నితత్వం అత్యంత రమణీయం.
ప్రమద్వర
No comments:
Post a Comment