Friday, 29 September 2017

దేవీనవరాత్రులు అలంకార విశేషాలు



Title
matter



దేవీనవరాత్రులు
భక్తితో దణ్ణం పెట్టుకుంటే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, పూజించడం వల్ల కలిగే ఫలితాలను సాక్షి ఫ్యామిలీ పాఠకులకోసం రోజూ ప్రత్యేకంగా అందిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం.



మొదటిరోజు: స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి)గా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు.



నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి. ఈరోజు పఠించవలసిన 
శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే! యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్‌

భావం : ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు!

ఫలమ్‌ : ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి.



రెండోరోజు అలంకారం బాలాత్రిపురసుందరి
నిర్మలమైన మనస్సుకూ, నిత్యసంతోషానికీ చిహ్నాలు చిన్నారులు. నవరాత్రి వేడుకలో ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. బాల్యం దైవత్వంతో సమానమని ప్రతీకాత్మకంగా నిరూపించడమే ఈ అలంకరణ ఆంతర్యం. బాలారూపంలో అమ్మను దర్శించే భక్తులకు ఎటువంటి మనోవికారాలకు లోనుకాని ప్రశాంత చిత్తం కలుగుతుందని విశ్వాసం.

దిక్కులన్నిటినీ కాంతిపుంజాలతో నింపుతూ జ్ఞానాన్ని ప్రదానం చేసే అభయ హస్తంతో, వరదానం చేస్తూ స్ఫటికమాల, విద్యాప్రదాయినిగా, పుస్తకాన్ని, ఎర్రకలువను చేత ధరించి చతుర్భుజాలతో మోమున చిరు మందహాసంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది.

శ్లోకం : దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ! దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యమత్తమా!

భావం :  వరదాభయ హస్తాలతో జ్ఞానం అనే అక్షరమాలను  స్ఫటికమాలను ధరించి  జ్ఞానప్రదానం చేయుము జగద్ధాత్రీ!

అర్చన, సందర్శన ఫలమ్‌ : ఉన్నతవిద్య, విశేషజ్ఞాన  సంపదలు చేకూరతాయి.

నివేదన  : కట్టెపొంగలి, దధ్యోదనం



శ్రీ గాయత్రీ అలంకారం దేవీనవరాత్రులు
సర్వతత్వ మయీం వందే గాయత్రీం వేదమాతరం అంటే సకల మంత్రాలకూ, అనుష్ఠానాలకూ, ఉపనిషత్తులకూ మూలం గాయత్రీదేవే.  శ్రీ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. పంచభూతాలకూ ప్రతీకగా పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తుంది.

న గాయత్య్రాః పరో మంత్రం
న మాతుః పరదైవతం
అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన గొప్ప మంత్రం లేదు. అమ్మను మించిన దైవం లేదు అని అర్థం. కనుక గాయత్రీ రూపంలో అమ్మవారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను సందర్శించినట్లే.

ఫలమ్‌ : మంత్రసిద్ధి,
వృత్తి : ఉద్యోగాలలో ఉన్నత స్థానం.
నివేదన : గుడాన్నం (బెల్లం  పరమాన్నం)

శ్లోకం: యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమో నమః

భావం: ఓ జగజ్జననీ! సకల చరాచర జగత్తుయందు మాతృ
మూర్తిగా నిలిచి ఉన్న నీకు శతదా సహస్రకోటి నమస్సులు. 



నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
ఈరోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడయిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస పుణ్యం లభిస్తుందని ఆర్యోక్తి.

ఫలమ్‌: పాడిపంటలు, ధనధాన్యాభివృద్ధి, నూతన గృహ యోగం కలుగుతాయి. ఉపాసకులకు జ్ఞానం, వైరాగ్యం ప్రాప్తిస్తాయి.

నివేదన : అప్పాలు,  షడ్రసోపేత  మహానైవేద్యం (ఓపిక లేనివారు  స్నానం చేసి శుచిగా వండిన అన్నం, పప్పు, కూరలను కూడా  నివేదించవచ్చు)

శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహిచ పార్వతి

భావం: ఓ అన్నపూర్ణాదేవీ, సాక్షాత్తూ శంకరుని ప్రాణేశ్వరివైన నీవు మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్నీ భిక్షగా ప్రసాదించు తల్లీ!



ఐదో రోజు లలితాత్రిపురసుందరీదేవి అలంకారం
శరన్నవరాత్రి ఉత్సవాల ఐదోరోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈమెకే లలితాత్రిపురసుందరి  అని నామాంతరం ఉంది. శ్రీవిద్యోపాసనకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో శ్రీచక్ర అధిష్టానశక్తిగా ఉంటుంది. పంచదశాక్షరి మంత్రానికి కూడా ఈమే అధిష్టానదేవత. సకల లోకాలకు అతీతమైన కుసుమకోమల రూపంలో చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతులు వీస్తుండగా భక్తులకు ప్రసన్నురాలై వరాలను అనుగ్రహిస్తుంది. సృష్టి, స్థితి, లయ కార్యాలకు ఈమె అనుగ్రహం తప్పనిసరి.

నిత్యం ఈమెను పూజించిన ముత్తయిదువులు అఖండ మాంగల్య సౌభాగ్యం పొందుతారు. సకల సంపదలు ఈ తల్లి అనుగ్రహం ద్వారా సంప్రాప్తమవుతాయి. శ్రీచక్రాన్ని అర్చించి, కుంకుమ పూజ చేయడం ద్వారా ఈ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఇంద్రకీలాద్రిపై ఆదిశంకరులు శ్రీచక్రాన్ని స్వయంగా ప్రతిష్టించి, ఇక్కడ నిత్యం కుంకుమపూజ జరిగేలా ఆదేశించారు. అంతకుపూర్వం ఉగ్రస్వరూపిణిగా ఉన్న కనకదుర్గాదేవి నాటినుంచి శాంతరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తోంది. లలితాదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజున లలితా సహస్రనామ పారాయణ వీలైనన్ని సార్లు చేయాలి. అలాగే లలితా అష్టోత్తరం, స్తోత్రాలు, పంచరత్నాలు పఠించాలి.

మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి.
నివేదన: అమ్మకు గారెలు నివేదన చేయాలి. సువాసినులకు పూజచేసి,  మంగళద్రవ్యాలు అందించాలి.
ఫలం: దారిద్య్ర దుఃఖం తొలగి, సకల శుభాలు, ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి.



ఆరో రోజు మహాలక్ష్మీదేవి అలంకారం
రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ వరద ముద్రలు ప్రదర్శిస్తూ  పులా గజరాజు సేవిస్తున్న తేజోమూర్తిగా శరన్నవరాత్రుల్లో ఆరోరోజున కనకదుర్గాదేవి భక్తులను మహాలక్ష్మీ అవతారంలో అనుగ్రహిస్తుంది. ఈ తల్లి సర్వమంగళకారిణి, సకల సౌభాగ్యప్రదాయిని, ఆనంద సంధాయిని. నిత్యం ప్రసన్నవదనంతో ఉంటుంది. అష్టలక్ష్ముల సమష్టిరూపంగా, సకల జీవకోటిలో, ప్రకృతిలో నిండి ఉన్న సకల లక్ష్మీస్వరూపంగా ఈమెను శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ‘యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ అని చండీసప్తశతి చెబుతోంది.

డోలాసురుడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం ఈ దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్యలో ఉంటుంది.  ఎరుపురంగు పూలతో అర్చించి, లక్ష్మీస్తోత్రం పారాయణ చేస్తే శీఘ్రఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మీ ప్రీతిగా పూర్ణాలు నివేదన చేయాలి. సువాసినులకు షోడశోపచారాలతో అర్చించి, శక్తికొద్దీ మంగళద్రవ్యాలు అందించాలి.
మంత్రం: ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్షై్మ్య నమోనమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి
నైవేద్యం: పూర్ణాలు   
ఫలితం: సకలైశ్వర్య సిద్ధి.



ఏడవ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి
ఈరోజు దుర్గమ్మ ధవళవస్త్రధారిణిౖయె సంగీత రస స్వరూపమైన మరాళ వాహనంపై తారాహారాలు కంఠాభరణాలుగా ధరించి జ్ఞానాధిష్ఠాన దేవత, వాగ్దేవిౖయెన శ్రీ మహాసరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన దుర్గాదేవిని చదువులతల్లి అయిన సరస్వతీదేవి రూపంలో అలంకరించటం విశేషం. శ్రీ సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకుంటే విశేష జ్ఞాన సంపద కలుగుతుందని ప్రతీతి.

శ్లోకం : యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్మై నమస్తస్మై నమస్త్మై నమో నమః

భావం : సృష్టిలోని సమస్త జీవులయందు బుద్ధి రూపంలో ప్రకాశిస్తున్న ఓ జగన్మాతా నీకు మొక్కెదన్‌.
నివేదన : జీడిపప్పు, కొబ్బరి పులిహోర
ఫలమ్‌: బుద్ధి కుశలత, జ్ఞానసంపద, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు.



ఎనిమిదవ రోజు మహిషాసురమర్దిని
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున దుర్గాదేవి శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఇది ఆఖరి రోజు. దీనికే దుర్గాష్టమి అనే పేరు వాడుకలో ఉంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం కోసం సకల దేవీ, దేవతల శక్తి స్వరూపంగా ఈ తల్లి ఆవిర్భవించింది. ఇది అత్యుగ్రరూపం. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ఈ అవతారంలో అమ్మ సింహవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషుడిని సంహరిస్తున్న రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. ఈ మూర్తిని ఉపాసించడం ద్వారా సకల భయాలు, శత్రుపీడ, రోగాలు దూరమవుతాయి.

విశ్వశాంతి కలుగుతుంది. శత్రువిజయాన్ని కాంక్షించేవారు ఈ తల్లిని ఉపాసించాలి. ఈ తల్లిని పూజించడం వల్ల సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది. ఈరోజున చండీ సప్తశతీ పారాయణ, హోమం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
మంత్రం: ‘ఓం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా’ అనే మంత్రాన్ని జపించడం మంచిది.
నైవేద్యం: గారెలు, పులిహోర, పొంగలి



కనకదుర్గాదేవి
లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం.

శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ
సర్వశక్తి సమన్వితే!
భయేభ్యః ప్రాహివో దేవి
దుర్గేదేవి నమోస్తుతే!!

భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు.
ఫలమ్‌: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు.
నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం

మహిషాసురమర్దిని
బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి.

శ్లోకం
దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
భావం: అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతిని, భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను.
నివేదన: నువ్వులు, బెల్లమన్నం
ఫలమ్‌: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి.



దానవత్వంపై దైవత్వం విజయం
పండగ
దుష్ట రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి.ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చని చెప్పే పండుగ ఇది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి, ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే.
ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం
దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అదీ వీలుకాని వారు మూడు రోజులు, అదీ కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి ఆశీస్సులందుకోవాలి.
చెడుపై మంచి సాధించిన విజయం
దానవత్వంపై దైవత్వం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలోనే ఉన్నారు. మనలోని దుర్గుణాతో పోరాడి విజయం సాధిద్దాం.
జమ్మిని ఎందుకు పూజిస్తారు?
శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు విజయ సోపానాలని నమ్మకం. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. అందుకే
శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మిని బంగారం అంటారు. జమ్మి బంగారాన్ని అందరికీ పంచి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే... అమ్మవారి విజయవార్తను దేవతలు కొందరు పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చి చాటిచెప్పారట. అందుకే ఆ రోజు పాలపిట్ట దర్శనం శుభప్రదం.  
రావణ దహనం ఎందుకు చేస్తారు?
మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలి, విజయం సాధించిన దినం విజయ దశమే. రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను టపాసులతో పేల్చేడం లేదా దహనం చేయడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు.



Title
matter



Title
matter



Title
matter



Title
matter

No comments:

Post a Comment