Wednesday, 8 November 2017

కాశీ క్షేత్ర పాలకుడు - కాలభైరవుడు

కాశీ క్షేత్ర పాలకుడు - కాలభైరవుడు




కాశీలోని కాలభైరవ దేవాలయం

సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం ఆగమ శాస్త్రానుసారంగా మహనీయులచే స్థాపించబడిన ప్రతి దేవాలయానికీ ఒక క్షేత్రపాలకుడిని కూడా గుర్తించి ఆలయం నిర్మించటం. పేరులో ఉన్నట్లు క్షేత్రపాలకుడు ఆ క్షేత్రానికి కాపలాదారు. అంటే ఆ దేవతా స్వరూపానికి నమ్మిన బంటు లేదా ఆ దేవతామూర్తి యొక్క మరొక రూపమే. తన శక్తిని క్షేత్రపాలకునికి ఆ దేవతామూర్తి నిరంతరం అందజేస్తూ ఉంటుంది. మీరు నిశితంగా పరిశీలించండి - కొన్ని వైష్ణవాలయాలలో హనుమంతుడు, శివ, శక్తి సంబంధితమైన ఆలయాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులుగా ఉంటారు. కాలభైరవుని వృత్తాంతము శివపురాణంలో చెప్పబడింది. ఈ సారి కాశీ వెళితే తప్పకుండా కాలభైరవుని దర్శించుకోండి. అలాగే, నేపాల్ వెళ్లినప్పుడు కాఠ్మండు లోని దర్బారు స్క్వేరులో గల కాలభైరవుని దర్శించుకోగలరు.


కాఠ్మండులోని కాలభైరవ విగ్రహం

వారణాసి (కాశీ) పుణ్య క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుని ఉగ్రాంశగా భావించబడే రూపం కాలభైరవుడు. దీనికి ఒక చిన్న గాథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ శివుని అవమానించి, తన ముఖముతో శివుని చూసి పక పక నవ్వాడు. అప్పుడు శివుని నుండి కాల భైరవుడు జన్మించి ఆ శిరస్సును నరికేస్తాడు. విష్ణువు విన్నపముతో శివుడు బ్రహ్మను మన్నించి శాంతిస్తాడు. కాని శిరస్సు ఖండించిన ఆ పాపము కాలభైరవుడిని వెంటాడింది. ఆ శిరస్సు కూడా కాలభైరవుని వీడక ఉంది. ఈ పాతకము, దాని శిక్షను దూరం చేసుకోటానికి కాలభైరవుడు కాశీ క్షేత్ర ప్రవేశము చేయాలని సంకల్పిస్తాడు. ఆయన ప్రవేశించ గలుగుతాడు, ఆ పాపము ఊరి బయటనే ఉండిపోతుంది. అప్పటినుంచి ఆ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి కోత్వాల్ (క్షేత్ర పాలకుడు) గా వ్యవహరించబడ్డాడు. ఈ కాల భైరవునకు వాహనము శునకము. ఈ స్వామి దర్శనము చేయనిదే కాశీ యాత్ర పూర్తి కానట్లే అని ప్రతీతి.

1 comment: