Sunday, 12 July 2015

సత్యభామ







సత్యభామ

శక్తి నాట్యమే ఈ ప్రపంచం. శక్తి లేకపోతే లోకంలో అణువంతైనా కదలదూ, మెదలదు. అంతటా అన్నింటా ఉండే శక్తి పరిపూర్ణతను సంతరించుకుంటూ, నిండుదనంతో అలరారుతూ, సృష్టికే మూలాధారమవుతూ, సకల కళలకూ ఆలవాలమవుతూ, బాధ్యతకు ప్రతిరూపమవుతూ, నింగికెగిసే ఉత్సాహంతో స్త్రీలా భువిని తరింపజేస్తుంది. అమ్మదనంలోని లాలిత్యమే కాదు. స్త్రీలోని ఓర్పునే కాదు, ప్రళయరూపం దాల్చిన పౌరుషాన్ని సైతం చూపించి అధర్మనాశనం చేయడానికి సన్నద్ధమవుతుంది. ఆలోచనల్లోని భావ కౌశలం స్త్రీలోనే ఎక్కువగా ఉంటుందనడానికీ, క్షమించే, పాలించే గుణాలతో పాటు శాసించే స్థాయికి ఏనాడో చేరుకున్న స్త్రీశక్తి ప్రతిరూపానికి సాక్ష్యమవుతుంది సత్యభామ. అందం, స్వాభిమానం, అపారమైన శక్తి, సాహసం, నిఖార్సైన ముక్కుసూటితనం సరిగ్గా రూపుదాల్చిన సత్యభామ మహిళా లోకానికే కాదు, మహిళలే ఆధారంగా బతుకుతున్న సమాజానికీ ఆదర్శం.

సత్రాజిత్తు కూతురు సత్యభామ. శమంతకమణి కారణంగా శ్రీకృష్ణుని పరిణయమాడినా కృష్ణుని జీవితంలో ప్రత్యేక స్థానాన్ని హక్కుగా సాధించింది సత్యభామ. శమంతకమణికీ, సత్యభామకూ ఉన్న సంబంధం కారణంగానే కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకున్నాడు. శమంతకమణి కారణంగానే, సత్యభామను తనకిచ్చి వివాహం చేయలేదనో శతధ్వనుడు తన తండ్రి సత్రాజిత్తును చంపినందుకు వానికి తగిన బుద్ధి చెప్పమని కృష్ణుని పంపించింది సత్యభామ. అన్యాయాన్ని సహించలేని అగ్నిశిఖలా ఉండేది సత్యభామ. రుక్మిణీ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే ఏడుగురు సవతులతోనూ సఖ్యంగా ఉండే సత్యభామ కృష్ణుని విషయంలో మాత్రం తనదే పైచేయన్నట్టుగా వ్యవహరించేది. పైగా స్త్రీ కేవలం గృహసంబంధ విషయాలనే కాదు, రాచకార్యాలనూ నిర్వహించగలదన్నట్టూ ముఖ్యమైన అన్ని సమావేశాల్లోనూ సత్యభామ పాల్గొనడమే కాక తగిన సలహాలనూ ఇచ్చేది. ధర్మరక్షణ జరుగాలనే కృష్ణుని సంకల్పానికి సదా వెన్నుదన్నుగా ఉండేది సత్యభామ.అందమైన ద్వారకలో అలకాగృహానికి వన్నె తెచ్చిన ఏకైక మహిళ సత్యభామ. తన స్వాభిమానం ఎవరినీ అవమానపరిచే రీతిలో గాక తన అస్తిత్వానికీ, ఉనికికీ ప్రతిబింబంలా మలుచుకుంది సత్యభామ. ప్రేమనూ, బాధ్యతనూ గాంభీర్య ప్రవర్తనలో ప్రకటిస్తూనే సత్యభామ స్వచ్ఛమైన తన అమాయకత్వాన్ని మంచి మనసుతో ప్రదర్శించేది. సత్యభామ అనగానే కృష్ణుని తన పాదంతో తన్నిన రూపమో, శమంతకమణి ప్రస్తావనా రూపంలోనో ఊహించుకోవడం పరిపాటి. కానీ సత్యభామ అంటేనే గుర్తొచ్చేది చెడుకు అంతం. మంచికి శ్రీకారం అయిన నరకాసుర వధ, పారిజాతాపహరణం. అధర్మ కారకుడూ, సకల లోకాలకూ భారమైన వాడూ అయిన నరకాసురుని శ్రీకృష్ణుడు వధించడానికి బయలుదేరాడు. అంతలో చిరునవ్వుతో ఎదురొచ్చిన సత్యభామ ఆనంద విహారానికి మాత్రమే మీతో వచ్చిన నేను ఈసారి కదనరంగానికి వచ్చి మీరు అవలీలగా శత్రుసంహారం చేస్తుంటే చూడాలని ఉంది అంటుంది. దానికి నవ్వు ఆపుకోలేక శ్రీకృష్ణుడు అక్కడ మంచి వాసనల పూదోటలు, చల్లని పిల్లగాలులూ ఉండవు... గుర్రాల పరుగులతో చెలరేగే దుమ్ము, బాణాల వర్షం, సైనికుల వీరగర్జనలు తప్ప అంటాడు.

సత్యభామ ఎంతకూ వినక కృష్ణునితో సహా గరుడవాహనంపై నరకుని నగరానికి వెళ్లింది. శంఖం పూరించి యుద్ధం ప్రకటించిన కృష్ణుడు నరకుని నగరాన్ని ధ్వంసం చేస్తూనే అడ్డుగా వచ్చిన వారందరినీ మట్టు పెట్టాడు. విషయం తెలుసుకొని నరకుడే యుద్ధానికి ఎదురొస్తాడు. ఎందుకో నరకుడిని చూడగానే తానే యుద్ధం చేయాలనుకుంటుంది సత్యభామ. అంతే.. జుట్టు ముడేసి, కొంగు నడుముకు చుట్టి లేచి నిలబడింది. సత్యభామ ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ కృష్ణుడు వింటిని, బాణాలనూ ఆమె చేతికందిస్తాడు. సత్యభామ బాణం సంధిస్తే నిప్పులు కురిసే కనులతో శత్రుసేనను చూస్తూ ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. రౌద్రమూర్తిలా బాణాల పరంపరను అవిశ్రాంతంగా కురిపించింది సత్యభామ. ఆమె ధాటికి దానవ సేనలు నరకుని వెనక్కి వెళ్లి దాక్కున్నాయి. అంతలో కృష్ణుడు అంతటి సేననూ తుదముట్టించి, నరకుని సంహారం చేశాడు. ఈ ధర్మకార్యంలో పాలు పంచుకున్నందుకు సత్యభామను గొప్పగా కీర్తించాడు. నరకుని బందీలుగా ఉన్న పదహారు వేలమంది గోపికలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నది సత్యభామ వల్లనే. ఆమె సాహసానికి బహుమానంగా దేవతలనే వారించి స్వర్గంలోని పారిజాతాన్ని ఇచ్చాడు కృష్ణుడు. ఆయన జీవితంలో విశిష్ఠమైన స్థానాన్ని సంపాదించుకున్న సత్యభామ స్వీయ వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో మలుచుకుంది. వీరనారిగా, రాచరికం ఎరిగిన స్త్రీగా, ధర్మ పరిరక్షణలో భాగంగా, సౌమ్యానికి చిహ్నమవుతూనే గాంభీర్యాన్ని ప్రదర్శించే శక్తిగా సత్యభామ వ్యక్తీకృతమైంది. కాఠిన్యంగా వినిపించే ఆమె స్వరంలో గర్వం తొణికిసలాడినా, ఆ స్వరంలోంచి వచ్చే మాట వెనుక భావసౌహార్ధ్రం చాలా స్వచ్ఛమైంది. అవసరానికి అనుగుణంగా, సామాజిక పరిస్థితులకు దీటుగా స్త్రీ తనను తాను పదును పెట్టుకోవాలని తెలియజెప్పిన నాటి సత్యభామ నేటి ఆధునిక మహిళకు ఒక పౌరాణిక ప్రతీక.

ప్రమద్వర

No comments:

Post a Comment