Wednesday, 11 January 2017

నచికేతుడు - యముడు





నచికేతుడు - యముడు

వేదాంతాలుగా పేరొందిన ఉపనిషత్తుల్లో అక్కడక్కడా కొన్ని కథలు కనిపిస్తుంటాయి. వాటిలో సత్యకామజాబాలి, నచికేతుని కథలకు చాలా ప్రాధాన్యం ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని జాబాలి చెబితే, అన్నమాటకు కట్టుబడాలని నచికేతుని కథ తెలియజేస్తుంది.

నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. నచికేతుని తండ్రి పేరు వాజశ్రవుడు. అతడు గౌతముని వంశానికి చెందిన బ్రాహ్మణుడు. వాజశ్రవుడు ఒకసారి విశ్వజిత అనే యాగాన్ని సంకల్పించాడు. యాగం పూర్తయిన తర్వాత దానాలు చేయడం మొదలు పెట్టాడు. చిన్నపిల్లవాడైన నచికేతుడు తండ్రి దగ్గరకు వెళ్లి, ‘నాన్నా.. మరి నన్నెవరికి దానం చేస్తావు..?’ అని పదే పదే అడగసాగాడు. విసిగెత్తిన వాజశ్రవుడు పొరపాటున ‘నిన్ను యముడికి దానం చేశాను పో..’ అంటాడు.

తండ్రి మాట ప్రకారం తనకు తాను యమునికి అర్పించుకునేందుకు బయల్దేరాడు. తండ్రి ఎంత వారించినా వినకుండా యమలోకానికి వెళతాడు. కానీ, అక్కడ నచికేతుడికి యముని దర్శనం కలగదు. మనుషుల పాపపుణ్యాలు లెక్కకడుతూ, ఆయుష్షు తీరిన వారి ప్రాణాలను హరిస్తూ యముడు క్షణం తీరిక లేకుండా ఉంటాడు. మూడు రోజుల తర్వాత యమలోకం ద్వారం దగ్గర ఉన్న నచికేతుడిని గమనిస్తాడు యముడు.


బాలుడ్ని చూసి ‘ఇక్కడ నీకేం పని’ అని అడుగుతాడు యముడు. తండ్రి మాటను నిలబెట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు నచికేతుడు. ‘నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం కుదరదంటాడు యముడు. నచికేతుడి సత్యనిష్ఠకు ముచ్చటపడిన యముడు ఏదైనా కోరుకోమని అంటాడు.

అప్పుడు నచికేతుడు ‘మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు..?’ అని అడుగుతాడు. ఓ బాలకుడు మరణ రహస్యం తెలపాల్సిందిగా అడగడంతో యముడికి ఆశ్చర్యం కలుగుతుంది. ‘నువ్వు చిన్నపిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. జనన మరణాల చట్రం అనేది జ్ఞానులకే అంతుచిక్కని రహస్యం’ అని అంటూ.. మరేదైనా కోరుకోమని అడుగుతాడు. కానీ, నచికేతుడు పట్టిన పట్టు విడువడు. తనకు ఆత్మ తత్వాన్ని తెలపాల్సిందిగా కోరుతాడు.

ఆ బాలుడి పట్టుదలను మెచ్చిన యముడు.. ‘మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా.. అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలు చంపుకోలేక, పునరావృతమవుతున్న ఆ కోరికలను తీర్చుకోలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఆత్మ ఒక్కటే! దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు..?’ అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత నచికేతుడు యముడి ఆజ్ఞ మేరకు తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికీ, నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం వహిస్తుంది.





No comments:

Post a Comment