కార్తిక సమో మాసో న కృతేన సమం యుగంవేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే కార్తిక మాసంతో సమానమైన మాసం, కృతయుగంతో సమమైన యుగం, వేదానికి సరితూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని అర్థం.
శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది.
ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరు పొందిన కార్తిక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి. ఈ నెలలో ఆచరించదగిన అనేక పూజలనూ, వ్రతాలనూ పూర్వులు నిర్దేశించారు. వీటితోపాటు ఆహార నియమాలనూ, పాటించాల్సిన విధులనూ కూడా బోధించారు. వాటి గురించి...
ఈ నెలలో పర్వదినాలు
శాక సప్తమి, గోపాష్టమి, అక్షయ నవమి, సార్వభౌమ వ్రతం, ఉత్థాన ఏకాదశి, ప్రబోధనైకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి) , వైకుంఠ చతుర్దశి, కార్తిక పూర్ణిమ, త్రిపురోత్సవం, మన్వాది, కర్కాష్టమి, యమదీప దానం (కార్తిక బహుళ చతుర్దశి), కరక చతుర్థి, గోక్రీడనం
పఠించదగిన స్తోత్రాలు
వామన స్తోత్రం, మార్కండేయకృత శివస్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం, శ్రీ కృష్ణాష్టకం, సూర్య స్తుతి, గణేశ స్తుతి, దశావతార స్తుతి, దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం, లింగాష్టకం, బిల్వాష్టకం, శివషడక్షరీ స్తోత్రం, శ్రీ శివ స్తోత్రం, శివాష్టకం, మృత్యుంజయ మహామంత్ర జపం, శ్రీ విష్ణు స్తోత్రం, శివ పంచాక్షరీ స్తోత్రం, తులసీ కవచం, తులసీ షోడశ నామావళి
చేయదగిన వ్రతాలు
శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం, ఉమా సహిత శంకర వ్రతం, శ్రీ శివ సోమవార వ్రతం, క్షీరాబ్ధి ద్వాదశీ వ్రతం, కేదారేశ్వర వ్రతం, శ్రీ రాధా దామోదర వ్రతం, వృషోత్సర్జనం, జ్వాలా తోరణం, అర్ధనారీశ్వర వ్రతం, కార్తికేయ వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం, చాతుర్మాస్య దీక్షా విరమణ, బలిపూజ
చేయాల్సిన పూజలు
శివారాధనం, కేశవారాధనం, శక్త్యుపాసనం, గణేశార్చనం, సూర్చార్చనం, సవత్స గోపూజనం, వృషభ పూజ, అశ్వత్థ చూజ, వట పూజ, తులసి పూజ, ధాత్రీ పూజనం, గంగాది నదీపూజనం, జలస్థాన పూజనం
ఈ నెలలో చేయదగిన పనులు
కార్తిక ప్రాతఃస్నానం, ఆకాశ దీపం, వివిధ దానాలు, సాలగ్రామ దానం, కన్యా దానం, కార్తిక పురాణ పఠనం, శ్రవణం, ఉపవాసం, భూశయనం, బ్రహ్మచర్యం, శ్రీహరి కమలార్చనం, సహవ్రతులతో కలిసి వన భోజనం, తీర్థ యాత్రలు, కార్తిక నిత్య దీపారాధనం, సవత్స గోదానం, సువర్ణ తులసీ వృక్ష దానం, ఉపవాసం, నక్తం (పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యడం), ఏక భుక్తం, అయాచితం, విప్ర పూజన
చేయకూడని పనులు
పర నింద, గురు నింద, పర ద్రోహం, మాదకద్రవ్య సేవనం, తైలాభ్యంగనం, వ్రతభ్రష్టులతో సంభాషణం, బహిష్ఠులతో సంభాషణం, తల్ప శయనం, పరాన్న భోజనం, ఇతరుల ఎంగిలి పదార్థాల్ని తినడం, గణ భోజనం, గణికా భోజనం, పాచిపోయిన ఆహారం తినడం
తినదగినవి
ధాన్యం, యవలు (బార్లీ), జొన్నలు, గోధుమలు, కంద, సముద్రపు ఉప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పనస, మామిడి, కొబ్బరి, కరక్కాయ, పిప్పళ్ళు, జీలకర్ర, శొంఠి, ఒక విధమైన ఉసిరిక, నూనెతో చెయ్యని వంటకాలు, బెల్లం తప్ప చెరకు నుంచి వచ్చే మిగిలిన పదార్థాలు.
విడిచి పెట్టాల్సినవి
ప్రాణుల శరీర భస్మం, చర్మంతో చేసిన పాత్రల్లో నీరు, నిమ్మపండు, దానిమ్మపండు, యజ్ఞ ప్రసాదం కానిది, విష్ణువుకు నైవేద్యం కాని ఆహారం, మాడిన అన్నం, మసూరములు, మాంసం- వీటికి ‘ఆమిషములు’ అని పేరు. వాటిని విడిచిపెట్టాలి. వీటితోపాటు ద్విదళ ధాన్యాలు, అవిసె, గుగ్గిళ్ళు, లవణం, ఆనపకాయ, కళింగ ఫలం, బహు బీజ ఫలాలు, నిర్బీజములైన ముల్లంగి, ఎర్ర ముల్లంగి , గుమ్మడి కాయ, చెరుకుగడ, కొత్త రేగు, ఉసిరిక, చింతకాయ, తేనె, పొట్లకాయ, వంగ, ఉల్లి, వెల్లుల్లి, తెల్ల ఆవాలు.
- డాక్టర్ రాణి సదాశివమూర్తి
ఎక్కడైనా సరే నడక అనేది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ల మీద నడవాలి. రెండు కాళ్ల మీద నడిచినట్లే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయనం, దక్షిణాయనం అనబడే పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. చాలా మంది తెలియక.. దక్షిణాయనంలో చనిపోతే ఏదో ఉపద్రవం వచ్చేసిందనుకుంటారు. శంకరాచార్యుల వారి బ్రహ్మసూత్రాల భాష్యం ప్రకారం- జీవుడు కొన్ని కొన్ని లోకముల మీదుగా ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమందు ఈశ్వరునియందు ఐక్యమైపోయే స్థితి దక్షిణాయనం. వాస్తవానికి ఉత్తరాయనం కన్నా దక్షిణాయనం గొప్పది. ఎందుకంటే దక్షిణాయనం అంతా ఉపాసన సంబంధమైనది. దీనిలో కార్తీకమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం కాబట్టి దానికి కార్తీకమాసమని పేరు. సాధారణంగా కొన్ని కొన్ని తిథులు విష్ణ్వాలయంలో ఉన్నవి శివాలయంలో ఉండవు. శివాలయంలో ఉన్నవి విష్ణ్వాలయంలో ఉండాలని లేదు. కానీ కార్తీకమాసంలో మాత్రం అన్ని దేవాలయాలలోను దీపాలను వెలిగిస్తారు. మనకు పన్నెండు నెలలు ఉన్నా.. ఒక్క కార్తీకమాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీకదీపమని పేరు. అంతే కాకుండా కార్తీక మాసంలో పెట్టే కార్తీక దీపం.. ఆకాశ దీపం.. ఇలా ఒక్కో దీపానికి ఒక్కో మహత్యం ఉంది. కార్తీక దీపాన్ని వెలిగించినప్పుడు- దామోదరమావాహయామి అనాలి. లేదా త్య్రయంబకమావాహయామి అనాలి. దామోదరుడు విష్ణు సంబంధం. త్య్రయంబకం శివ సంబంధం. త్రయంబకుడు అంటే మూడు కన్నులున్నవాడు అని మాత్రమే కాదు. మూడు లోకములకు తల్లి, తండ్రి కూడా. అటువంటి త్య్రయంబక స్వరూపమైన పరమ శివుణ్ణి ఆవాహన చేయాలి. దీపం మీద అక్షితలు, పువ్వో, పసుపో, కుంకుమో వేయాలి. అప్పుడు ఆ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. ఆకాశం వైపు చూసి
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాఃజలేస్థలే.. ఫలే ఏ నివసంతిజీవా దృష్ట్యాప్రదీపం నచ జన్మ భాగినఃభవన్తి త్వ శ్వపచాహి విప్రాఃఅని చెప్పి నమస్కారం చేయాలి. ఈశ్వరా.. ఈ దీపం ద్వారా నిన్ను ఆవాహన చేసి.. ఈ విశ్వంలోని ప్రాణులన్నింటికీ ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్లు చేస్తున్నానని ఈ శ్లోకార్థం. ఇక కార్తీక మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఈశ్వరుడు వెలిగించిన ఆకాశ దీపాలు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడుకట్టి ఒక చిన్నపాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి, భగవంతుడి నామాలు చెబుతూ పైకెత్తేది ఆకాశదీపం. ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. అజ్ఞానాన్ని తొలగిస్తుంది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
No comments:
Post a Comment