అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించగలడే గానీ, వెలుపలికి వచ్చే మార్గం మాత్రం అతనికి తెలియదు. అయితే, భీమ, దృష్టద్యుమ్నాది అనేక మంది మహాయోధులు తన వెనకే ఉంటారు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ యువయోధునికి అందరూ చెప్పారు. ఎంతో సందేహంతోనే యుధిష్టిరుడు అభిమన్యున్ని చక్రవ్యూహాన్ని చేధించడానికి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాడు. అభిమన్యుడు తన వింటికి నారి సంధించి మీటాడు. ఆ వింటి ధ్వని గాండీవ ధ్వనిలా రణరంగమంతటా ప్రతిధ్వనించింది. అభిమన్యుడు బాహ్యవలయమైన పద్మవ్యూహాన్ని సమీపించాడు. మరుక్షణంలో అభిమన్యుని రథం పద్మవ్యూహాన్ని చీల్చుకుని ముందుకు సాగింది. అభిమన్యుడి బాణాలకు వందలాది శత్రుసైనికులు ప్రాణాలు కోల్పోయారు. కౌరవ సైన్యం భయభీతమయ్యింది. అభిమన్యునితో దుర్యోధనుడు పోటీ పడలేడని తెలిసిన ద్రోణుడు అతని రక్షణకు వచ్చాడు. అప్పుడే రంగ ప్రవేశం చేసిన దుశ్శాసనుడు అభిమన్యుని దాటికి తట్టుకోలేక పారిపోయాడు. తన సైనికులు భయకంపితులై పారిపోవడం చూసి దుర్యోధనడు దిగ్భాంతికి గురయ్యాడు. అభిమన్యుడి ధనుస్సు వజ్రాయుధంలా అసంఖ్యాకమైన కౌరవ సైనికుల్ని ఊచకోత కోస్తూనే ఉంది. పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా, అభిమన్యుడు మాత్రం హోరాహోరీగా పోరాడుతూనే ఉన్నాడు.
నిస్పృహతో ద్రోణున్ని సమీపించిన శకుని ‘‘మనందరం కలిసి ఒక్క ఉదుటున దాడిచేస్తే తప్ప అభిమన్యున్ని చంపలేం.’’ అన్నాడు.
అది విన్న ద్రోణుడు ‘‘అజేయమైన ధనువు అభిమన్యుని చేతిలో ఉన్నంత సేపు ఎవరూ అతన్ని చంపలేరు. అందువల్ల ఎవరో ఒకరు అతని వింటి అల్లెత్రాటిని తెంచాలి. రథాన్ని ధ్వంసం చేయాలి. లేకపోతే అతన్నెవరూ ఓడించలేరు.’’ అన్నాడు.
ఆ మాట విన్న రాధేయుడు జయధ్రధునితో పోరాడుతున్న అభిమన్యుని వెనుకగా వెళ్లి వింటి అల్లెత్రాటిని కోసివేశాడు. అదే సమయంలో ద్రోణుడు అభిమన్యుని రథపు అశ్వాలను వధించాడు. కృపుడు సారథిని హతమార్చాడు. అభిమన్యుడు నిస్సహాయుడుగా నిలుచుండిపోయాడు. అయినా రథచక్రంతోనూ, గదతోనూ కొంత పోరాడాడు అయితే చివరికి అభిమన్యుడు అలిసిపోయాడు. శరీరమంతా గాయాల మయమై రక్తం చిమ్ముతోంది. సొమ్మసిల్లి నేలకూలిపోయాడు అతని కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. కౌరవులు విజయోత్సాహంతో కేకలు వేశారు. కానీ, ద్రోణుని వెన్నులో ఒక మహా నేరం చేసిన భావన పాకిపోయింది. వింటి అల్లెత్రాటిని కోసిన ఈ నీచకృత్యంలో నేను భాగస్వామినయ్యాను కదా అన్న వ్యధ అతన్ని దహించివేయసాగింది. అభిమన్యున్ని హతమార్చగలిగామన్న సంతోషం ఏ మూలన పడిపోయిందోకానీ, అతన్ని చంపడానికి తాను అనుసరించిన అధర్మ మార్గం తీవ్రమైన హృదయ క్షోభకు గురిచేసింది. అధర్మ మార్గంలో సాధించిన విజయం వేయి అపజయాలకు సమానమని, ధర్మ మార్గంలో ఓడినా అది వేయి విజయాలకు సమానమని అతనికి బోధపడసాగింది.
No comments:
Post a Comment