Thursday, 5 October 2017

జయశుభకారిణి విజయరూపిణి



జయశుభకారిణి విజయరూపిణి
అనంత వైభవానికి ప్రతీకలు


నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే


దేవీనవరాత్రులు శరదృతువులో వస్తాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులు అంటారు. ఈ శరన్నవరాత్రులు ఆశ్వయుజమాసంలో వచ్చే మొదటి రోజున అంటే ప్రతిపద (పాడ్యమి) నుంచి దశమి వరకు ఆచరించాలని ధర్మప్రవృత్తి, మత్స్యపురాణం, దేవీపురాణం, స్కందపురాణం మొదలైన గ్రంధాలెన్నో వివరించాయి. దాన్ని ఆధారంగా చేసుకుని మనదేశం నలుమూలలా ఈ నవరాత్రులు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మ వారి పూజ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజులూ తొమ్మిదిరూపాలలో అమ్మవారిని కొలుస్తాం. మొదటిరోజు బాలాతిపురసుందరిగా, రెండోరోజు గాయత్రిగా, మూడోరోజు అన్నపూర్ణగా, నాలుగవ రోజు మహాలక్మిగా, ఐదవరోజు లలితాదేవిగా, ఆరో రోజు సరస్వతిగా, ఏడవరోజు మహా దుర్గగా, ఎనిమిదవరోజు మహిషాసుర మర్దినిగా, తొమ్మిదవరోజు రాజరాజేశ్వరిగా పూజిస్తాం. చివరిరోజైన విజయదశమినాడు సమస్త శుభాలనూ చేకూర్చే అపరాజితగా పూజిస్తాం. మహిషాసుర సంహారంతో అమ్మవారు జగత్తుకు విజయం చేకూర్చిన రోజే విజయదశమి.

నవరూపాల్లో ఒక్కోరూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వయసుతో నిమిత్తం లేకుండా బాల్యంలోనే శక్తీతత్వం ఉంటుందని బాలాత్రిపురసుందరి తెలియ చేస్తుంది. పరమార్దాన్ని బ్రహ్మజ్ఞానమనే పేరుతో సూచించే రూపం గాయత్రి, సకల జీవరాశులకూ ప్రాణాధారమైన అన్నాన్ని ప్రేమతో పెట్టే తల్లి అన్నపూర్ణ, సర్వసంపదలూ ప్రసాదించే వరదాయిని మహాలక్ష్మీ, ఆత్మసౌందర్యాన్ని ప్రసాదించే లలితా త్రిపుర సుందరి, సమస్త విద్యలనూ అనుగ్రహించే సరస్వతి, సాటిలేని శక్తికి సంకేతం కాళి, జీవులలో దుందుడుకు స్వభావాన్ని అణచివేసే మహిషాసుర మర్దిని, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి రాజరాజేశ్వరి. ఇక ఇవేకాక శైలపుత్రీ, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండి, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్దిధాత్రిరూపాలలో కూడా అమ్మవారిని కొలుస్తాం. ఈ రూపాలన్నీ అమ్మ అనంతవైభవానికి ప్రతీకలు. భక్తులు తమ భక్తి, విశ్వాసాలను బట్టీ వివిధ రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. కోరికలు తీర్చమని వేడుకుంటారు

కుమారి ఆరాధన
ఆశ్వయుజ పాడ్యమి మొదలుకుని తొమ్మిది రోజులపాటు విశేషపూజలు చేసి చివరగా కుమారీ పూజ చేయాలని శ్రీ విద్యార్జవ గ్రంథంలో చెప్ప బడింది. నవరాత్రి పూజా విధానాలలో కుమారీపూజ విశేషమైనది. రోజుకొక్కరు చొప్పున తొమ్మిది రోజులు తొమ్మిది మంది బాలికలను పూజించాలి. వీరంతా రెండు సంవత్పరాల నుంచి పదిసంవత్పరాల లోపు కలవారై ఉరిడాలనేది శాస్త్రం.

సమస్త సుఖాలు కలిగించేది
ఒకనాడు దేవతలు, రాక్షసులతో యుద్దం చేస్తూ శ్రవణనక్షత్రం నాడు అభిజిత్ లగ్నసమయంలో విజయం సాధించారు. ఆనాడు ఆశ్వయుజదశమి. దేవతలు విజయం సాధించిన దశమి కనుకనే విజయ దశమి అయింది. దీనినే కొందరు దసరా అంటారు. సకల సద్గునాలతో కూడిన సమున్నత వ్యక్తీత్వవికాసానికి సంకేతమే విజయదశమి. అందుకే ఆ రోజు అన్ని అంశలకూ మూలమైన రాజరాజేశ్వరిదేవిని అర్చించే సంప్రదాయం ఏర్పడింది. చండ ముండ మహిషాది దుష్ట రాక్షసులను సంహరించి జగన్మాత సకల లోకాలకు ఆనందం ప్రసాదించిన పండగే విజయదశమి. రాముడు రావణసంహారం చేసింది కూడా ఈరోజే. గదాధర పద్దతి అనే గ్రందంలో ఇదే అపరా జిత దశమిగా చెప్పబడింది. విజయానికి అధిదేవత అపరాజితా దేవి. దుర్గాదేవికి మరోపేరు అపరాజిత. మహారాజుల ఆరాధ్య దైవంగా చెప్పబడింది. విజయదశమిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ ఉత్సవాలు నిర్వహించడంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య భేదం ఉన్నా అంతర్గతంగా మూలసూత్రం మాత్రం ఒక్కటే. అదే దుష్ఠత్వంపై దైవత్వ విజయం. ఈ సత్యం కళ్ళకు కట్టినట్టుగా మనకు కనపడుతుంది. అహంకారం, అజ్ఞానం కేవలంవ్యక్తినే కాదు, సమాజాన్ని తద్వారా జాతినే నిర్వీర్యం చేయగల శక్తీ కలిగినవి. అలాంటి దుర్గుణాలను సమీపానికి రానీయకుండా ఎప్పటికప్పుడు మనలోని చెడు ఆలోచనలు తొలగించుకుంటూ సత్వగుణాన్ని అలవరుచుకునే అవకాశం కలుగజేసేదే విజయదశమి. అపజయం ఎరుగని విజయదశమి రోజు అపరాజితాదేవిని పూజించి ఏ పని ప్రారంబించినా అఖండ విజయం సొంతమవుతుందని భక్తుల విశ్వాసం. దేవీభాగవతం మొదలైన దేవీపూరాణాల్లో ని కథలూ ఆ విషయాన్నే చెబుతాయి. సాధన ద్వారా అన్నింటినీ సాధించి విజయం పొందవచ్చనేదే విజయదశమి ముఖ్యభావన.

శమీపూజ
శమీశమీయతే పాపం శమీశతృవినాశనం
అర్జునస్య ధనుర్దారి రామస్య ప్రియవాదినీ

దసరా పండుగరోజు సాయంత్రం శమీవృక్షం అంటే జమ్మిచెట్టుకు పూజలు చేయాలి. అది మన సంప్రదాయం. శమీ ఆంటే దోషాల్ని తొలగిరిచేది అని అర్ధం. జమ్మిచెట్టుకు ఒక ప్రత్యేకత ఉరిది. అగ్నిని తనలో ఇముడ్చుకున్న పవిత్రవృక్షం జమ్మి. అందుకే దీనిని అగ్నిగర్భ అని పిలుస్తాం. వైదిక సంప్రదాయంలో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినప్పుడు అందుకు కావాల్సిన అగ్నిని రావి, జమ్మి రెండురకాల కర్రలతో చేసిన ఒక పరికరం ద్వారా సృష్టిస్తారు. ఇలా పుట్టిన అగ్ని అతి పవిత్ర మైనది. అంతటి అగ్నిని శమీవృక్షం తన గర్భంలో దాచుకుంది. అందుకే వేదం కూడా ‘శమీగర్భా దగ్నిం మంథతి’ అని అగ్నికి జమ్మిచెట్టు నిలయం అని చెబుతోంది. పాండవులు అజ్ఞాతవాస ప్రారంభంలో తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు. తర్వాత జరిగిన యుద్ధంలో విజయం సాధించారు. దానికి సూచికగా ఆనాటి నుంచి సకల కార్య విజయాన్ని కోరుకునేవారు విజయ దశమినాడు ఆయుధపూజ నిర్వహించడం, జమ్మి చెట్టును పూజించి ఆ వృక్షం ఆకులు శిరస్సుపై వేసుకోవడం మన సంప్రదాయం. నవగ్రహాలలో ప్రధానమైన శనిదేవునికి జమ్మివృక్షం ప్రీతికరమైనది. జమ్మి వృక్షాన్ని పూజించడం ద్వారా శనిదోషాలు తొలగించుకోవచ్చు. ఇంకా ఈరోజు సీమోల్లంఘనం చేస్తారు. అంటే ఊరు పొలిమేరలు దాటి వెవక్కిరావడమన్న మాట. దీని అంతరార్థం ఊళ్ళోని ఎవరి మధ్యనైనా శత్రుత్వం ఉంటే దాన్ని ఊరిచివరనే విడిచిపెట్టి మళ్లీ స్నేహితుల్లా కలిసిపోవడానికి సూచనగా ఈ పద్ధతి పాటిస్తారు.


శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి రూపాలు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి రూపాలు

1వ రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి
2వ రోజూ బాలాత్రీపుర సుందరి దేవీ
3వ రోజు గాయత్రీ దేవి
4వ రోజు అన్నపూర్ణ దేవి
5వ రోజు లలితా త్రీపుర సుందరి దేవి
6వ రోజు మహాలక్ష్మీ దేవి
7వ రోజు మహా సరస్వతి దేవి
8వ రోజు దుర్గాదేవి
9వ రోజు మహిషాసురమర్దిని దేవి
విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి




జగన్మాత వైభవం

“అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌! ”

మాతృదేవోభవ అని చెబుతురిటారు పెద్దలు. మన భారతీయ సంస్కృతిలో తల్లికి ఉత్కృష్ఠమైన స్ధానం ఉంది. అమ్మలకే అమ్మ ఆమె. ఇలలో తల్లిగా అవతరించిన సాక్షాత్తూ ఆ శక్తిస్వరూపిణి సమగ్ర స్వరూపమే లలిత త్రిపురసుందరి. లలితా సహస్రనామస్తోత్రంలో మాతృమూర్తి గొప్పతనాన్ని తెలిపే నామాలనేకం.

పారాయణంతో విశేష ఫలం
దేవీనవరాత్రులలో లలితాసహస్రనామ పారాయణం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. లలితాపరమేశ్వరి గురించి బ్రహ్మాండం పురాణం వివరించింది. అగస్త్యమహాముని కోరిక మేరకు జగన్మాత గొప్పదనాన్ని వివరించిన హయగ్రీవుడే లలితా నామాలను కూడా చెప్పాడు. అదే లలితా సహస్రనామం. వాటిని రహస్య సహస్రనామం అన్నాడు. ఇందులో ప్రతి ఒక్క నామాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే అమ్మవారి తత్వం మనకు బోధపడుతుంది. అదే మాతృతత్వం.

లలితా సహస్రనామాలలో జననీ, మాతా, అంబా వంటి నామాలన్నీ మాతృప్రేమను వ్యక్తం చేసేవే . శ్రీమహారాజ్ఞి, శ్రీపీఠా, రాజపీఠ లాంటి నామాలలో ఆమె పరిపాలనాదక్షత, రక్షణ, పోషణ ప్రసాదించే గుణం వెల్లడవుతాయి. మైత్రాదివాసనాలభ్యా వంటి నామాలను పరిశీలిస్తే మైత్రి, కరుణ వంటి సద్గుణాలు ప్రస్పుటమవుతాయి. సరస్వతీ శాస్త్ర మయీ వంటి నామాలు ఆమె పాండిత్యాన్ని వెల్లడిస్తాయి. మహాలావణ్య సేవధి, దయామయీ, కరుణారససాగరా వంటి నామాలు ఆమె దయాళుత్వం, గుణరూపం, అంతః, బాహ్య సౌందర్యాలను వివరిస్తాయి. జీవితంలో సాధించాల్సివ సమస్త ప్రయోజనాలు, సకల సద్గుణాలు కలిసి లలితాదేవి రూపంలో కనిపించడమే ఆ స్తోత్రవిశేషం. సంకేతరూపంలో చెప్పే ఆ స్తోత్రనామాలోని అర్ధాలు, సంపూర్ణ వ్వక్తీత్వ వికాసాన్ని, ఉదాత్త మానవత్వాన్నీ రూపుగడతాయి. అలాంటి దివ్య స్తోత్రాన్ని పదే పదే పఠిస్తూ అరాధించడం ఆ మహనీయ గుణాలను అలవరుచుకోవడమే. అర్చనలోని ప్రధాన లక్యమూ అదే.

నవరూపాలు
దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో నవ వర్ణాంబరాలతో అమ్మవారిని అలంకరిస్తారు. అదే విధంగా అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు నైవేద్యం చేస్తారు.


ప్రథమం శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థకీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనీతి చ|
సప్తమా కాలరాత్రే చ| అష్టమాచాతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్‌| నవదుర్గా ప్రకీర్తితా:||

మొదటిరోజు:
ఆశ్వయుజ శుద్ధపాడ్యమితో మొదలయ్యే దేవీనవరాత్రుల్లో మొదటిరోజు శైలపుత్రి అవతారం. నందివాహనంపై కుడి, ఎడమల త్రిశూల, పద్మధారిణియై దర్శవమిస్తుంది దేవి.
నైవేద్యం: చలిమిడి, వడపప్పు, పాయసం, కట్జెపొంగలి
రెండవరోజు:
రెండవరోజు బ్రహ్మచారిణియై కుడి, ఎడమల రుద్రాక్షమాల, కమండలధారిణియై బ్రహ్మచారిణీ మాతనిష్ఠలో భక్తులను కరుణిస్తుంది. నైవేద్యం: శనగలు, తీపీబూరిది, పులిహోర
మూడవరోజు:
మూడోరోజు పదిచేతులలో పది ఆయుధాలు ధరించి సింహవాహినియై చంద్రఘంటారూపంలో కనిపిస్తుంది.
నైవేద్యం: కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసం.
నాలుగవరోజు:
నాలుగవరోజు అమ్మవారు కూష్మాండియై ధనుర్భాణం, పద్మం, పుష్పం, అమృతభాండం, చక్రం, గద, రుద్రాక్షమాలలు ధరించి భక్తులకు ఎనిమిదిచేతులతో అభయమిస్తుంది అమ్మ.
నైవేద్యం: మినపగారెలు లేదా మొక్కజొన్న గారెలు లేదా పెసరగారెలు
ఐదవరోజూ: 

ఐదోరోజు కూష్మాండ బలిదానంతో  దేవి సంతృప్తి చెందుతుందని శాస్త్రం. ఒకచేత స్కందబాలుడు, మరోచేత పద్మం, ఆశీర్వాదముద్రలతో పద్మ పీఠధారిణియై నాలుగుచేతులతో స్కందమాతగా దర్శనమిస్తుంది అమ్మ.
నైవేద్యం: పెరుగన్నం.
ఆరవరోజు:
ఆరవనాడు కాత్యాయనిదేవిగా సింహవాహనంపై బంగరు ఛాయతో వన్నెలీనుతుంది. కుడిచేత అభయవరద ముద్ర, ఎడమచేత పద్మ ఖడ్గములతో దర్శనమిస్తుంది దేవి.
నైవేద్యం: కేసరి
ఏడవరోజు: 

ఇక ఏడవరూపంగా, విరబూసిన కాటుకకురులతో నిప్పులుకక్కే త్రినేత్రిగా, నాలుగుచేతులతో గాడిదపై భయంకర రూపంలో గోచరిస్తుంది ఈ కాళరాత్రిదేవి. చెడును శిక్షించే విలయకారిణీరూపమిది.
నైవేద్యం: శాకాన్నం లేదా కలగూరపులుసు
ఎనిమిదవరోజు:
ఎనిమిదవనాడు శ్వేతవర్ణ మహాగౌరిగా నందివాహనంపై ప్రశాంతతకు, పరిశుద్ధతకు ప్రతీకగా విరాజిల్లుతుంది.
నైవేద్యం: చక్రపొంగలి
తొమ్మిదవరోజు: 

ఎడమచేత పద్మం, శంఖం, కుడిచేత ముద్గలం, చక్రం ధరించి సిద్దిధాత్రిదేవిగా చివరిరోజైన తొమ్మిదవనాడు పూజలందుకుంటుంది.
నైవేద్యం: పాయసం లేదా పరమాన్నం
విజయదశమి: 

విజయదశమిరోజు పరాజయమెరుగని తల్లిగా అపరాజితా దేవిగా కొలువుదీరుతుంది పరమేశ్వరి.
నైవేద్యం: గారెలు, పులిహోర, పాయసం, అన్నిరకాల నైవేద్యాలు 


No comments:

Post a Comment