మావిచిగురు తిని జీరగొంతుతో తన జోడీని పిలవడం తప్ప కోయిల చేసేదేమీ లేదు. ఆమని కూడా అంతే. ప్రకృతి ఆదేశాల ప్రకారం ఒళ్లంతా పచ్చగా సింగారించుకోవడం తప్ప ఆ ఋతువుకి ఏ పాపమూ తెలియదు. కానీ ఈ రెంటిచుట్టూ మన సినీ కవులెన్ని కల్పనలు చేశారో. ఎన్నెన్ని కవితలల్లారో! వసంతం, కోయిలలపై వారి ఊహా విహారాలు కొన్ని చూద్దామా..
ఉగాది వసంతానికి నాంది. ఈ వేళ చెట్లు కొత్తచిగుళ్లను తొడుగుతాయి.. తొలిసంజె కిరణాలు మొదలు పున్నమి వెలుగుల వరకూ పరిసరాలు అద్భుతమనిపిస్తాయి. ప్రకృతిని చూడటం, స్పృశించడం, శ్వాసించడం, కోయిల గొంతుకని వినడం, పచ్చి పళ్ల రుచులు చూడటం.. ఇలా మనలోని పంచేంద్రియాలూ కొత్త తీయదనాన్ని చవిచూస్తాయి. మత్తుతో సోలిపోతాయి. అందుకే దీన్ని మధుమాసం అంటారు. ఆమని చేసే ఈ వేడుకనంతా ఓ పెళ్లిలా భావించాడు సినీ కవి వేటూరి. ‘కోకిలమ్మపెళ్లికి కోనంతా పందిరి.. చిగురాకుల తోరణాలు.. చిరుగాలి సన్నాయి..’ అన్నాడు. ‘మరి వరుడెవరూ..!’ అనే సందేహం వస్తుంది కదా! అందుకే ‘వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి.. పూలన్నీ తలంబ్రాలు.. పున్నమీ తొలిరేయి!’ అని చెప్పుకొచ్చాడు. చిలకలూ, గోరింకలూ వాటి కిలకిలారావాలు ఎన్నున్నా కోకిలే వసంతానికి ప్రతినిధి. మిసమిసలాడే లేతమామిడి చిగుళ్లు తిని తీయగా గొంతెత్తే ఈ కలకంఠి ప్రస్తావన లేని తెలుగు పాట చాలా అరుదు! ‘నాకుగాదులు లేవు.. ఉషస్సులు లేవు!’ అంటూ వైరాగ్యం ప్రకటించిన భావకవి కృష్ణశాస్త్రి కోకిల దగ్గరకొచ్చేటప్పటికి పరవశంతో ఎన్నో ప్రశ్నలు సంధించాడు. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా.. కోయిలగొంతు వినగానే మావి చిగురు తొడిగేనా!’ అంటూ ఎంతో మీమాంసకి గురయ్యాడు. ‘జానకిరాముడు’ చిత్రంలో నాయకుడైతే ‘చిలకపచ్చ తోటలో చిలిపి కోయిలా.. తెలుగుపాట పాడవే తీయగా..హాయిగా!’ అంటూ కోయిల పంచమస్వరంలో తేట తెలుగు పదాలే వినాలనుకున్నాడు. పోతే పోనీ అనుకుందేమో కోయిలమ్మని కాస్త పక్కనపెట్టి వసంతాన వచ్చే ఓ చిలుకని చేరదీసింది ‘నిన్నే ప్రేమిస్తా..’ నాయిక. దాన్ని ‘కోయిలపాట బాగుందా కొమ్మల సడి బాగుందా...’ అని అడిగి ఆమని అందాలు ఎలా ఉన్నాయో ఆరాతీస్తుంది!
వారి మధ్య కోకిలమ్మ..
ఇక కోకిలమ్మని అడ్డుపెట్టుకుని మన నాయకానాయికలు చెప్పుకున్న ప్రేమ ఊసులకైతే లెక్కేలేదు. ‘కోకిల... కొక్కోక్కోకిల... కూతలా రసగీతలా... గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిల... నీపాటతో మరు పూదోటలో మదివేసింది మారాకిలా!’ అంటాడు ఓ నాయకుడు. ‘మావిచిగురు తిని... నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిల’ అని తన ప్రియునికి కోకిల చేతే శుభాకాంక్షలు చెప్పిస్తుంది ఓ నాయిక గడుసుగా. ‘కుహూ కుహూ తప్ప కోకిలమ్మకేం తెలుసు.. ఒహోం.. ఒహోం తప్ప కొండగాలికేం తెలుసు!’ అంటూ తాను ఆరాధించే అమ్మాయికే అన్నీ వచ్చంటాడు ‘ఆపద్బాంధవుడు’!
వసంతం...
వసంతం ఉండేది కొద్దికాలమే అయినా ఉన్నన్నాళ్లూ రంగులమయమే. ఏడాదిలో తర్వాత్తర్వాత ఎండలతో మాడ్చేసే గ్రీష్మాన్నీ, వరదలతో మంచెత్తే వర్షరుతువునీ, చలితో వణికించే శీతలాన్ని.. వీటన్నింటినీ తట్టుకునే ఆనంద పారవశ్యాన్ని ముందుగానే ఇస్తుంది. అందుకేనేమో ఓ ప్రియురాలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా..’. అంటుంది తన మనసుకి నచ్చినవాణ్ని. ప్రకృతి అందాలని తెలపడానికి మాత్రమే కాదు, స్ఫూర్తి పాఠం చెప్పేందుకూ వసంతాన్ని గుర్తుచేశారు మన కవులు.
‘తరలిరాదా తనే వసంతం... తన దరికిరాని వనాల కోసం’ అంటాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘రుద్రవీణ’లో. ‘గీతాంజలి’ కథానాయకుడి విషాదమేంటో అందరికీ తెలుసు. అందుకే ‘ఆమనీ పాడవే హాయిగా..’ అని ప్రాధేయపడతాడు. అతనెంత దీనావస్థలో ఉన్నా.. కారుచీకట్లో సన్నటి వెలుగులా నమ్మకమొకటి ఎక్కడో మిణుకుమిణుకుమంటూ ఉంటుంది కదా! ఆ నమ్మకాన్ని అతను ఉగాదిగానే చూశాడు. వసంతం తనకు మరో ప్రపంచాన్నే ఇస్తుందన్నాడు. ‘శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం, దివీ భువీ కలానిజం స్పృశించిన మహోదయం, మరో ప్రపంచమే మరింత చేరువై, నివాళి కోరిన ఉగాది వేళలో, గతించిపోని గాథ నేననీ..!’ అనంటాడు ఎంతో నమ్మకంగా! అతనికే కాదు మనందరికీ ఉగాది తన అందచందాలతో అందించే సందేశం ఆ చిన్నపాటి నమ్మకమే!
ఓ పక్క పగలంతా చురుక్కుమనే సూరీడూ... మరో పక్క రాత్రి అయ్యేసరికి వీచే చల్లని గాలులూ... వెరసి వసంతరాత్రుల వైనమే వేరు. శిశిరంలో ఆకులు రాల్చి చిగురించిన చెట్లన్నీ ఆ గాలికి తలలూపుతూ ప్రతి గాలీ పైర గాలేననిపిస్తుంటే కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగిడిన జంటల పరిస్థితిని వర్ణించడానికి మాటలేముంటాయ్!
ప్రకృతితో మమేకమై జీవించే మనిషికి రుతువులే పండగలు. ఏ రుతువు విశేషాలు ఆ రుతువుకే ఉన్నా ఆరు రుతువుల్లోనూ వసంతానిది కొంచెం ఎక్కువ ప్రత్యేకత. ప్రకృతి కేలండరుకి తోడు మనిషి రూపొందించుకున్న కేలండరూ జత కలిసి వసంతాన్ని మధుర జ్ఞాపకాల మాలగా మారుస్తాయి. వసంతం... సంతోషానికి మరోపేరు. కొత్త సంవత్సరానికే కాదు, మరెన్నో విషయాల్లో కొత్తదనానికి శ్రీకారం చుట్టే సమయం.కోయిలమ్మల పాట కచేరీలూ లేలేత మామిడాకుల తోరణాలూ స్వాగత గీతికలు పాడుతుండగా చీకటి తెర తీసుకుని వచ్చే సూరీడు నెమ్మదిగా తన ప్రభావం చూపడం మొదలెడతాడు. సాయంత్రమయ్యేసరికి పెళ్లిళ్ల సందడీ, తెల్లవారుజామునే గృహప్రవేశాల హడావుడీ... వసంతం వచ్చిందంటే నిత్యం పేరంటమే. వీటన్నిటి మధ్యా విజయమే లక్ష్యంగా పిల్లల పరీక్షల సందడి. ప్రతి పరీక్షా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేదే కదా!
వసంత నవరాత్రులు
వసంత నవరాత్రుల వేడుకలు ఎల్లెడలా భక్తి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో శరన్నవరాత్రుల్లాగే చైత్రంలోనూ దుర్గా నవరాత్రులు జరిపి అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. వసంత రుతువులో దేవీ నవరాత్రుల ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఉత్తరాదిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోసలని పాలించే వీరసేనుడనే రాజు యుద్ధంలో ఓడిపోవడంతో ఆయన వారసుడైన సుదర్శనుడు తల్లితో కలిసి భరద్వాజ ముని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతాడు. అక్కడ బీజాక్షరం ఉచ్చరించడం ద్వారా దేవి అనుగ్రహాన్నీ తద్వారా ఆయుధ శక్తినీ సమకూర్చుకుంటాడు. అతడి గురించి విన్న వారణాసి రాజు తన కుమార్తె శశికళను ఇచ్చి వివాహం చేస్తాడు. కోసల రాజ్యాన్ని తిరిగి వశపరుచుకోవడానికి సహాయపడతాడు. ఆయుధ శక్తినిచ్చి తోడ్పడిన దేవికి ఘనంగా పూజలు చేసి కృతజ్ఞతలు తెలుపుతాడు సుదర్శనుడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై ఏటా వసంత నవరాత్రులు నిర్వహించాలని ఆదేశించి అదృశ్యమవుతుంది. అప్పటినుంచి వసంతరుతువు రాగానే దేవీ నవరాత్రులను వేడుకగా జరపడం ఆచారంగా మారింది. సుదర్శనుడి వారసులే రామలక్ష్మణులు. రామ జన్మదిన, కల్యాణ వేడుకలు కూడా ఈ వసంత నవరాత్రుల్లో భాగమే. వసంత రుతువు రెండు నెలలూ ఎన్నో వేడుకలకు నెలవు! వాటికి తోడు పరవశింపజేసే వసంత యామినీ వెండి మబ్బుల అజ లేని వినీలాకాశమూ చల్లని వెన్నెల వెలుగులూ మత్తెక్కించే మల్లెపూల పరిమళాలూ... వసంతరాత్రుల సోయగాలకు ప్రణయావేశంతో పరవశించనివారుంటారా? అందుకే ఈ వసంత రుతువులో ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి జీవితం ఓ అందమైన పాటలాగా సాగిపోవాలని కోరుకుందాం!
No comments:
Post a Comment