జీవితం మనిషికి అన్నివిధాలా సహకరించాలనీ, అన్నింటినీ జమకూర్చాలనీ తహతహలాడుతుంది. ఎందుకంటే మనిషికి అన్నీ అందినప్పుడే జీవితం పరిపూర్ణత సంతరించుకుంటుందనే చిన్న స్వార్థం. అస్థిత్వాన్నిచ్చి, అవసరాలు తీర్చి అన్నీ సమకూర్చినప్పుడు జీవితం మనిషి నుంచి కూడా కొంత కోరుకోవడంలో తప్పు లేదు! జీవితం అందించే ప్రతి దాన్నీ ఆహ్వానించాలనీ, మలుపులూ, గెలుపులూ మనిషిని మార్చేయకూడదనీ, సానుకూల దృక్పథంతో ముందుకుసాగాలని, జీవితం ఇచ్చిన బలాన్ని, సంతోషాన్ని, శక్తిని వ్యర్థం చేయకూడదని, ప్రతి క్షణం ఆస్వాదించాలని, మంచిగానే ఆలోచించాలని, మానవత్వంతో ఎదగాలని.. జీవితం కోరుకుంటుంది. మనకోసం ఇన్ని చేసిన జీవితం కోసం మనమేం చేయగలం. జీవితాన్ని జీవితంలా జీవించి సంతృప్తి పరచడం తప్ప. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటేనే బాగుంటుంది. ప్రయోగాలు చేయాలని చూస్తే దుష్ఫలితం పొందక తప్పదు. అదిచ్చే చేదును అనుభవించాకా తప్పదు. పైగా జీవితంతో ప్రయోగాలు చేస్తే అది మనతో ఆడుకుంటుంది. రామాయణంలోని కబంధుని గాథే అందుకు ఉదాహరణ.
దనువనే పేరుగల గంధర్వుడు కబంధునిగా మారిన వైనం ముమ్మాటికీ తన తప్పిదంగానే భావించి విధికి తలొంచి తన గాథను చెప్పుకుంటాడు రామునితో కబంధుడు. దనువు చాలా అందమైన రూపం గల గంధర్వుడు. కానీ వికృత రూపం వేసుకొని సామాన్యులనూ, ఋషులనూ హింసించే విలాసానికి అలవాటుపడ్డాడు దనువు. ఒకరోజు అలాగే వికృతరూపం ధరించి స్థూల శిరస్కుడనే ఋషిని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఆయన కోపగించుకొని ఏ రూపంతో వెకిలిచేష్టలు చేశావో, ఈ రూపమే నీకు శాశ్వతమవుతుందని శపించాడు. వేడుకున్నాడు దనువు. కనిపించిన ఋషి తరుణోపాయం చెప్పాడు. అక్కడితో ఆగితే కథ వేరేలా ఉండేది. దనువు దనువులాగే చరిత్రలో ఉండిపోయేవాడు. కబంధునిలా మారేవాడు కాదు.
మంచి వైభవం, అందమైన రూపంగల దనువు ముల్లోకాలలో ప్రసిద్ధుడు. కాని బుద్ధిమాంద్యం అతని జీవితాన్నే మార్చేసింది. అష్టభోగాలూ, ఐశ్వర్యాలూ ఉన్నాయి. కానీ ఘోరరూపం ఋషి ద్వారా పొంది, కబంధు రూపం దేవేంద్రుని వల్ల పొందాడు దనువు. అందమైన రూపానికి చిరునామా అయిన కబంధుడు ఘోరరూపం పొందడంతో చింతించి తనకు దీర్ఘాయువునివ్వమని బ్రహ్మను గురించి తపస్సు చేసి వరం పొందాడు. ఆ వరంతో ఇకనైనా పద్ధతిగా బతకాలని నిశ్చయించుకోకపోగా వర గర్వంతో కన్నూమిన్నూ కానరాక మిడిసిపడి దేవేంద్రునితో యుద్ధానికి తలపడుతాడు.
దీర్ఘాయువు ఉందనే గర్వం, రూపం పోయినా బలం ఉందనే అత్యుత్సాహం, దేనికీ కొదువలేదనే పొగరు కలగలిసిన కబంధునిలో ఆలోచనకీ, వివేచనకీ తావు లేకుండా పోయింది. అంతే దేవేంద్రునితో కయ్యానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఊరుకుంటాడా. వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం తలనూ, కాళ్ళనూ నరికేసింది. తలా, మొలా లేని జీవితం నాకెందుకు, నన్ను పూర్తిగా చంపేయమని ఇంద్రున్ని కోరతాడు కబంధుడు.
దీర్ఘాయువు వరం ఉందనే నిన్ను చంపకుండా వదిలేశానని అంటాడు ఇంద్రుడు. ఈ రూపంతో నేనెలా బతకాలని వేడుకుంటాడు. చాలా దూరం వరకూ సాగే చేతులనూ, కడుపులో నోరునూ, గుండెలమీద కన్నునూ కల్పించి దనువుని కబంధునిలా మార్చాడు ఇంద్రుడు. అప్పటి నుంచి చేతులు చాచి అందినవి అంటూ బతుకు సాగిస్తున్నాడు కబంధుడు. జీవితం ఎన్ని కఠిన పరీక్షలు పెట్టినా, వాటి నుంచి బయటపడేందుకు నిరీక్షించినా చివరి అంకం ఉండనే ఉంటుందనేది జీవిత సత్యం. ఋషి చెప్పిన తరుణోపాయం కోసం కాలం వెల్లదీస్తూ గడుపుతుండగా తన చేతులకు చిక్కుతారు రామలక్ష్మణులు. వారే తన జీవితాన్ని మలుపు తిప్పుతారనే సంకేతం తన మనసు ఒకవైపు చెబుతుండగా, ఇక్షాకువంశీయుల ద్వారానే శాపవిమోచనమని ఋషి చెప్పగా ఆ సమయం రానే వచ్చింది. కబంధుడు రాముని గురించిన పూర్తి సమాచారం తెలుసుకొని, రామా! నన్ను దహనం చేసి నాకు శాపం నుంచి విముక్తి కలిగించు నా నిజరూపం నాకు రప్చించు.
నీకు తప్పక ఉపకారవిషయం చెబుతానని ప్రాధేయపడుతాడు. కబంధునిది మహాకాయం. దాన్ని దహించాలంటే మామూలు విషయం కాదు. అందుకనే ఒక కొండ పక్కన పర్వతం లాంటి కబంధుని శరీరాన్ని ఉంచి ఆ కొండనే చితిలా మార్చి అగ్నినిస్తారు రామ లక్ష్మణులు. ఆ భారీ కాయం దహనం కావడానికి చాలా సేపే పడుతుంది. పూర్తిగా దహనమవ్వగానే అందులోంచి అద్భుతమైన వెలుగు కబంధుని నుంచి మరలా దనువులా మారినదై ఆవిష్కరించబడింది. అందమైన స్ఫురద్రూపం అబ్బురపరిచింది. దనువైన కబంధుడు కృతజ్ఞతగా రామునికి సీతదొరికే ఉపాయం చెబుతూ చాలా తెలివిగా వివరిస్తాడు. ఈ లోకంలో మనిషి సాధనకు ఉపయోగపడే ఆరు ఉపాయాలున్నాయనీ, వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే అన్నికార్యాలూ సిద్ధిస్తాయనీ చెబుతాడు కబంధుడు. సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైదీభావ, సమాశ్రమాలు ఆరు ఉపాయాలు. కనుక నీ మార్గం ఒక రూపందాల్చాలంటే ముందుగా రామా! సుగ్రీవునితో స్నేహం చేయి.. అంటూ సుగ్రీవుడంటే ప్రాంతం, దానిని చేరుకునే దారుల వివరాలూ సవివరంగా చెబుతాడు కబంధుడు.
ఇట్టేడు అర్కనందనా దేవి
No comments:
Post a Comment