‘వృష’ అంటే ఉత్కృష్టమైన, ‘భ’ అంటే ప్రకాశించునది. వృషభం అనే నామం నందికి సార్థకమైనది. నందీశ్వరుడిని నైతిక నియమాల పరిరక్షకుడిగా, శంకరుని నమ్మినబంటుగా చెప్పవచ్చు. శైవులు శివుని పరమాత్మగా, నందిని జీవాత్మగా విశ్వసిస్తారు. ఎవరైనా శివ భక్తులు మరణిస్తే, ఆ వ్యక్తిలోని జీవాత్మ పరమాత్మలో కలసిపోయిందని నమ్ముతారు. దానికి సూచనగా ఒక ఎద్దును కన్నెతాడు వదిలి స్వేచ్ఛగా తిరగనిస్తారు. అదొక ఆచారం. నంది శివగణాలకు సారథ్యం వహిస్తుంది. శివుని ద్వారపాలకుడు నంది. అందుకే ప్రతి శివాలయంలోనూ శివునికి ఎదురుగా నందిని ప్రతిష్ఠిస్తారు. జీవాత్మ, పరమాత్మపైనే దృష్టి నిలపాలని చెప్పడం దీనికి అర్థం. నంది చెవిలో ఏదైనా చెప్తే అది శివునికి చేరుతుందని భక్తుల విశ్వాసం.
దీని వెనుక ఒక గాథ ఉంది. ఒకసారి జలంధరుడనే రాక్షసుడు పార్వతీదేవిని అపహరించాలని ప్రయత్నించి, సాహసించలేకపోతాడు. ధ్యానంలో ఉన్న తండ్రికి ఈ విషయం చెప్పేందుకు వినాయకుడు ప్రయత్నించినప్పటికీ.. శివాగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోనని భయపడి ఆగిపోతాడు. అప్పుడు దేవతలు.. నంది చెవిలో ఈ విషయం చెబితే, ఎలాగైనా స్వామికి తెలుపుతాడని వినాయకుడికి సూచించారు. వెంటనే వినాయకుడు నంది చెవిలో రాక్షసుడి పన్నాగం గురించి చెప్పాడు. నంది ద్వారా విషయం తెలుసుకున్న శివుడు జలంధరుని సంహరిస్తాడు. అప్పటి నుండి శివాలయంలో నంది చెవిలో కోరికలు చెప్పే ఆనవాయితీ మొదలైంది.
అలాగే.. రావణ రాజ్యానికి ఒక వానరం వల్ల ముప్పు కలుగుతుందని శపించినవాడు కూడా నందీశ్వరుడే. ఆ కథేంటంటే.. శివుని దర్శించుకోవడానికి ఒకసారి రావణాసురుడు కైలాసానికి వెళ్లినప్పుడు నంది అనుమతించడు. కోపగించిన రావణుడు.. ‘ఎద్దువి నన్ను అడ్డగిస్తావా?’ అని దుర్భాషలాడుతాడు. ‘కోతిలా ఉన్నావంటూ నందీశ్వరుని తిడతాడు. దీనికి నంది ఆగ్రహించి ‘కోతిలా ఉన్నానంటూ నన్ను అసహ్యించకున్నావు కాబట్టి ఆ కోతి చేతిలోనే నీ సామ్రాజ్యం దహనమవుతుంద’ని శపించాడు. లంకా దహనానికి ఆ శాపమే కారణం.
నిట్టల గోపాలకృష్ణ
No comments:
Post a Comment