Sunday, 18 October 2015

నారీ విశ్వరూపం..నవరాత్రి వైభవం!





నారీ విశ్వరూపం.. నవరాత్రి వైభవం!


సర్వమంగళమాంగల్యే.. శివే సర్వార్థ సాధికే.. శరణ్యే త్రయంబకే దేవీ.. నారాయణీ నమోస్తుతే!!.. అంటూ పలు అలంకారాల్లో ఆ జగన్మాతను పూజించే పండగ దసరా. ఇది కేవలం ఓ పదకొండు రోజుల వేడుక మాత్రమే కాదు, మహిళా సాధికారతకూ, చైతన్యానికీ ప్రతీక. ఆ రూపాల నుంచీ ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవత’ అన్నది ఆర్యోక్తి. స్త్రీలను గౌరవించడం వల్ల దేవతలు నివసిస్తారనేది దానర్థం. అసలు స్త్రీలని ఎందుకు గౌరవించాలి? గౌరవించదగిన స్థితిలో స్త్రీలు ఎలా ఉండాలి? అనేది ఈ శరన్నవరాత్రులు చెబుతాయి. మరి ఆ జగన్మాత రూపాల నుంచి మనమేం నేర్చుకోవచ్చో చూద్దామా.

కనకదుర్గ:మొదటి రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా దర్శనమిస్తుంది. రాక్షసులతో యుద్ధం చేసేందుకు స్వర్ణ కవచం ధరిస్తుంది. ఆ స్వర్ణ కవచం సంపదకూ, వైభవానికి గుర్తు. నేటి మహిళలు అలాంటి కవచాన్ని ధరించాల్సిన అవసరంలేదు కానీ.. సమస్యలు ఎదురైనప్పుడు యుక్తీ, ఓర్పూ, నేర్పులను కవచంగా ధరించాలి.

బాలా త్రిపుర సుందరి:తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన రూపానికి బాల అని పేరు. ఈ బాలాత్రిపుర సుందరిని పూజించడమంటే.. మహిళల్ని చిన్నతనం నుంచే పవిత్ర భావం, గౌరవంతో ఆదరించాలని అర్థం. తొమ్మిదేళ్ల బాలిక అయ్యుండి ముప్పై మంది రాక్షసులను సంహరించిందని బ్రహ్మాండ పురాణ గాథ చెబుతోంది. ఆడపిల్ల బాల్యం నుంచి.. యౌవనంలోకి అడుగు పెట్టకముందే సమాజంలోని చీకటి కోణాన్ని గుర్తించి, జాగ్రత్త పడాలని, వెర్రి చేష్టలు చేసేవారిని ఓ కంట కనిపెట్టాలని, తగిన తీరులో సమాధానం చెప్పాలని బాలాదేవి ఆరాధన చెబుతుంది.

లలితా త్రిపుర సుందరి:‘ఓం శ్రీమాత్రే నమః’ అంటూ లలితాదేవిని పూజిస్తాం. వాస్తవానికి ఈ రూపం నుంచే మనం ఆరాధిస్తున్న దేవతా రూపాలు దిగివచ్చాయని వ్యాస మహర్షి పురాణాల్లో తెలిపాడు. శరీరం, మనసు, బుద్ధి అనేవి త్రిపురాలు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులు కలిగినది లలితాదేవి అంటారు. నేటి మహిళలు పరిజ్ఞానంలో పురుషుల కంటే ముందు అడుగులో ఉన్నారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు అనే పేరుతో సంసిద్ధత, అవగాహన, నిర్వహణ దక్షత అనే మూడు లక్షణాలను సొంతం చేసుకుని పురోగమించే నేటి మహిళలకి లలితాత్రిపురసుందరి మార్గదర్శి.

కాత్యాయని:కతుడు అనే మహర్షి కడుపున పుట్టిన అమ్మే కాత్యాయని అనీ, ఆమె పరమేశ్వరుడి అర్థాంగిగా ప్రత్యేకత అందుకుందని పురాణాలు చెబుతున్నాయి. భాగవతంలో గోపికలు నిర్మలమైన ప్రేమతో శ్రీకృష్ణుడే భర్తగా కావాలని కాత్యాయనీ వ్రతం చేశారు. అంటే గృహస్థ జీవితంలో మహిళకి ఉన్న ప్రాధాన్యాన్ని కాత్యాయిని తెలియజేస్తుంది. బాధ్యత, ప్రవర్తన, ఓర్పు, నేర్పుల ఆధారంగా వైవాహిక జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఓర్పు నేర్పులన్నీ కాత్యాయనీ స్వరూపాలే.

గాయత్రీదేవి:‘సర్వ చైతన్య రూపాం! పాం ఆధ్యాం! విద్యాం చ ధీమహీ! బుద్ధిం య నహః ప్రచోదయ’ అని గాయత్రి దేవీని ఆరాధిస్తాం. ఈ దేవతకు ముఖాలు ఐదు అయినా హృదయం ఒకటే. గాయత్రీ దేవత విద్యాధిదేవత అనీ, బుద్ధి, శక్తిని ప్రచోదనం చేస్తుందని మహర్షులు సెలవిచ్చారు. నేటి మహిళలు గృహిణిగా, ఉద్యోగినిగా సామాజిక కార్యకర్తలు, కళాకారిణిగా, వీరసైనికురాలిగా ఎన్నో రూపాలూ, మరెన్నో పాత్రల్నీ పోషిస్తున్నారు. ఏ స్త్రీ మూర్తి బుద్ధి చురుగ్గా ఉండి.. స్తబ్ధత లేకుండా చైతన్యంతో అడుగులు వేస్తుందో అలాంటి మహిళ వల్ల కుటుంబం పచ్చగా ఉంటుంది. సమాజం బాగుంటుంది. అలాంటి వారంతా గాయత్రీ దేవతలే. ‘కరణేశు మంత్రి’ అని గృహిణిని పేర్కొంటారు. తగిన సమయానికి సలహాలూ, సూచనలు అందించగల సమర్థురాలు గృహిణి అని అర్థం. ఈ లక్షణం కూడా గాయత్రీ తత్వమే.

అన్నపూర్ణ:అన్నం పెట్టడం, అతిథ్యం ఇవ్వడం, కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి కావల్సిన అంశం. ఉద్యోగం చేస్తున్నా మహిళలు ఈ విషయంలో బాధ్యతగా ఉంటారు. అందుకు కావల్సిన అన్ని ఆలోచనలూ సమగ్రంగా చేస్తుంది స్త్రీ. అభాగ్యులను ఆదరించడంలోనూ ఆమె చూపే ఓర్పు నేర్పులే ఆ ఇంటి గౌరవాన్ని పెంపొదిస్తాయి. బాధ్యతగా ఉండే గృహిణులంతా అన్నపూర్ణలే. అమ్మవారూ మహిళలకు ఆ తత్వమే బోధిస్తుంది!

మహాలక్ష్మి:సంపదలను అనుగ్రహించే మహాలక్ష్మినే ధనలక్ష్మీ అంటారు. ఆధునిక అవసరాలకు తగినట్టుగా అటు తండ్రికో, భర్తకో ఆర్థిక సహకారాన్ని అందించగలిగిన ప్రతి మహిళా మహాలక్ష్మి స్వరూపమే. సంపాదించకపోయినా పొదుపుగా ఇల్లు దిద్దుకోవడంలో మహిళకు మహిళే సాటి. అలాంటి ఇల్లే లక్ష్మీ కళతో శోభిల్లుతుంది. ఈ స్వభావం కూడా మహాలక్ష్మి గుణమే.

మహా సరస్వతి:ఈమెని విద్యాలక్ష్మి అంటారు. అందరికీ చక్కని వాక్కు కావాలి, సాంకేతిక శాస్త్ర రంగాల్లో నైపుణ్యం తెలిసి ఉండాలి. కళల్లో ప్రావీణ్యం కావాలి. అలాగే చక్కని వాక్కు ఉండాలి. సాంకేతిక శాస్త్ర రంగాల్లో పైపుణ్యం కావాలి. ఇవన్నీ విద్యలో అంతర్భాగాలే. ఈ అవగాహన కలిగిన స్త్రీ మూర్తులందరూ సరస్వతీ రూపాలే. వాక్కును పరిమితంగా, సూటిగా, స్పష్టంగా ప్రయోజనకరంగా, ప్రభావవంతంగా ప్రయోగించగలిగిన నేర్పు ప్రతి మహిళకీ అవసరమే.

దుర్గ:దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడానికే అమ్మవారు దుర్గగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గముడు అంటే ఎటూ వెళ్లనీయని వాడు. కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవితాల్లో నేడు ఎటూ తేలని, పరిష్కారం దొరకని సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఎదురైనప్పుడు ఆందోళన పడకుండా ఆలోచిస్తే ఆ దుర్గమం అనే రాక్షసత్వాన్ని సంహరించడం సులువే అవుతుంది.

మహిషాసుర మర్దిని:మహిషుడు అనే రాక్షసుడి సంహారానికే అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతోంది. మహిషుడు అంటే దున్నపోతు రూపంలో ఉన్నవాడు. ఏమీ ఆలోచించకపోవడం, దుడుకుతనం, సోమరితనం, దుర్మార్గం మహిషుడి లక్షణాలు. నేటి మహిళల చుట్టూ ఎందరో మహిషాసురులు కనిపిస్తున్నారు. ఆనాడు మహిషుడు అమ్మవారి పట్ల కాముక ప్రవృత్తిని ప్రకటించాడు. నేడు నర రూపరాక్షసులుగా మానవ మహిషాసురుల్లా కనపడుతున్నవారెందరో. అలాంటి వారికి బెంబేలు పడకుండా మహిష రూపాన్ని మర్దించగల రూపం తనలో దాగి ఉందని ప్రతి మహిళా గుర్తించాలి.

రాజరాజేశ్వరి:దసరా రోజుల్లో ఇదే చివరి అలంకారం. రాజులంటే పాలకులు. రాజరాజులంటే వారి అధికారులు. రాజరాజేశ్వరి అంటే ఉన్నతోన్నత అధికార పీఠాన్ని ఆదర్శ ప్రాయంగా, అభ్యుదయకరంగా నిర్వహించగల సామర్థ్యానికి ప్రతీక. వివిధ జీవన దశల్లో బాల, తరుణి, వృద్ధ రూపాల్లో ఉన్న లలితాత్రిపురసుందరి రాజరాజేశ్వరిగా పరిపాలన రంగంలో అఖండ విజయాలను సాధించగలుగుతోంది. అలా విజయం సాధించిన తోటి మహిళల్ని ప్రతి ఆడపిల్లా ఆదర్శంగా తీసుకోవాలి. ఆ జాగన్మాతను మనసారా పూజిస్తూ.. దేవీరూపాల్లోని అంతరార్థాలను తెలుసుకోవాలి.

మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


No comments:

Post a Comment