‘మాసానాం మార్గశీర్షోహమ్’ (మాసాలలో మార్గశీర్షాన్ని నేనే) అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అలాంటి విశిష్టమైన మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ‘స్కంద షష్ఠి’ అని కూడా అంటారు. ఆది దంపతులుగా పూజలందుకొనే శివపార్వతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి పుట్టిన రోజుగా మార్గశిర శుద్ధ షష్ఠిని దేశవ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో భక్తులు జరుపుకొంటారు. దీన్ని ఎంతో పవిత్రమైన దినంగా ఆచరిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాలు కూడా నిర్వహిస్తారు. బ్రహ్మచారులను భోజన, వస్త్రాలతో సత్కరించడం, ఉపవాసం ఆచరించడం లాంటి నియమాలను భక్తులు ఈ రోజున పాటిస్తారు. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో కావడి మొక్కులు, నోటిలోంచీ శూలాలను గుచ్చుకొనే మొక్కులూ భక్తులు తీర్చుకుంటూ ఉంటారు.
యోగశాస్త్రం ఏం చెబుతోంది?:
ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాకుండా యోగ శాస్త్రంలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరు ముఖాలతో పుట్టిన స్కందుడిని, అంటే షణ్ముఖుడిని మానవ దేహంలోని షట్చక్రాలకు ప్రతీకగా యోగసాధకులు భావిస్తారు. రెల్లు పొదలో పుట్టిన కారణంగా శరవణభవుడనీ, కృత్తికల చేతుల్లో పెరిగాడు కాబట్టి కార్తికేయుడనీ సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తారు. దేవ సైన్యాధ్యక్షుడై తారకాసురుణ్ణి సంహరించిన తరువాత మహా విష్ణువు ఆదేశం మేరకు వల్లీ, దేవసేనలను కార్తికేయుడు పరిణయమాడినట్టు పురాణ గాథలు చెబుతాయి. వల్లి కుండలినీ శక్తికి ప్రతీక అంటారు. కాబట్టి కుండలినీ శక్తికి అధిపతిగా కూడా ఆయనను సాధకులు ఆరాధిస్తారు.
సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మజ్ఞానానికి ప్రతీక అంటారు. ఆయన సర్పాకారంలో ఉంటాడనే విశ్వాసం ఉంది. కాబట్టి భక్తులు పుట్టల దగ్గర పూజలు చేసి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పుట్టల్లో పాలు పోస్తారు. సంతాన ప్రాప్తికీ, ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తికీ, ముఖ్యంగా కుజదోష నివారణకూ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనను మించినది లేదని ఒక విశ్వాసం.. ఐహికమైనవాటిని అలా ఉంచితే, కార్తికేయుడి కరుణాత్మకమైన అమృత దృష్టి ఎవరిమీద ప్రసరిస్తే వారిలో కామాది అరిషడ్వర్గాలూ, మనో కాలుష్యాలూ నశిస్తాయనీ, దుష్టమైన ఆలోచనలు రూపుమాసిపోతాయనీ కూడా
నమ్మిక ఉంది.
No comments:
Post a Comment