Wednesday, 8 February 2017

హిడింబి







హిడింబి

సృష్టి మనుగడ మనిషితోనే సాధ్యపడుతుంది. మరి మనిషి మనుగడ ఇచ్చిపుచ్చుకోవడంతో తృప్తిపడుతుంది. ఇది విశ్వజనీన సత్యం. కానీ తీసుకోవడంలో చూపించే ఆసక్తి, శ్రద్ధ ఇవ్వడంలో వెనక్కి తగ్గుతాయి. వాటి స్థానంలో గర్వం, హేళన, స్వార్థం పేరును అడ్డుపెట్టుకొని ఇవ్వడంలోని ఆంతర్యాన్నే మార్చేస్తున్నాయి. ఒక చేత్తో ఇచ్చిన విషయం మరో చేయికి కూడా తెలియకూడదని చెప్పారు మన పెద్దలు. అంటే ఇవ్వడం అనేది ఒక నిగూఢమైన హుందాతనం. దాన్నే చులకన చేస్తే మనం ఇచ్చినా లాభమేమీ ఉండదు. ప్రపంచం, ప్రకృతి, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మనిషి విలువనూ, మనసు స్వచ్ఛతనూ ఎరిగిన గొప్పవాళ్లు, స్నేహం - ప్రేమ-సహృదయత గలిగిన మహనీయులు... వీరికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. ఎంతసేపూ ఇవ్వాలనే తాపత్రయం తప్ప, బదులు తీసుకోవాలనే తలంపేరాని తత్వం లోకంలో విశాల దక్పథమై నిన్న, నేడు, రేపు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం అనుభవైకవేద్యమేగానీ అనిర్వచనీయం. కానీ హిడింబి పాత్ర ఇవ్వడంలోని మాధ్యుర్యాన్నీ, ఔదార్యాన్నీ, గొప్పతనాన్నీ పరిచయం చేసింది.

భారతంలో ఘటోత్కచుని వంటి మహావీరుని తల్లిగా, భీముని ఒకానొక భార్యగా, రాక్షసజాతికి చెందిన స్త్రీగా చరిత్రకు పరిచయమైన హిడింబి వ్యక్తిగత విశేషాలు తనకంటూ ప్రత్యేకంగా కేటాయించుకోనే లేదు. పాండవుల శ్రేయస్సు కోసం తన జీవితాన్నే అంకితం చేసింది.లక్క ఇంటి నుంచి ప్రాణాలు దక్కించుకొని అడవుల్లో నడుస్తూ, నడుస్తూ అలసి సొలసి ఒక మర్రిచెట్టు నీడలో సేదతీరుతారు కుంతీ పాండవులు. తల్లీ, సోదరులూ నిద్రపోతుంటే రెప్పవాల్చకుండా కాపాలా కాస్తుంటాడు. మనుషుల వాసనతో వారెక్కడున్నారో తెలుసుకోగల శక్తిమంతుడు హిడింబాసురుడు. అతని చెల్లెలే హిడింబి. కుంతీ పాండవుల వాసనతో హిడింబాసురుని ఆకలి మరింత పెరిగింది. వారి జాడ చెప్పి, వారిని చంపి తెచ్చి తనకు వండిపెట్టుమని హిడింబిని పురమాయిస్తాడు హిండిబాసురుడు. నరమాంస భక్షణ ఇన్నాళ్ళకు కడుపారా దొరికిందనీ వారిని చంపి తెమ్మని మరీమరీ హిడింబితో చెబుతాడు హిడింబాసురుడు.హిడింబి అన్న ఆజ్ఞానుసారం మర్రిచెట్టు నీడన ఉన్న కుంతీపాండువులను ఓ చెట్టు చాటు నుంచి చూసింది. కుంతీదేవి, తన నలుగురు సోదరులూ నిద్రలో ఉంటే కాపాలాకాస్తున్న భీముని చూసింది హిడింబి. భీమునిలోని ధైర్యం, పరాక్రమం, రౌద్రం భుజబలం ప్రపంచమంతా గుర్తించింది. వేనోళ్ళ కీర్తిస్తుంది. కానీ ఆ మహాకాయంలోను ఒక మనసుంటుందనీ, తన వారిపైన తాను చూపించే ప్రేమ నిబద్ధతనూ, సహృదయతనూ అర్థం చేసుకున్న ఏకైక స్త్రీ హిడింబి. భీమున్ని చూసి మనసులోనే వరించి, ఒక అందమైన స్త్రీగా మారి భీముని ముందుకు వెళుతుంది. నా అన్న మిమ్ములను చంపి తీసుకురమ్మన్నాడనీ, ఆలస్యం అయితే తనే వచ్చి మిమ్మల్నందరినీ నిమిషాల్లో నమిలి మింగేస్తాడనీ, నేను నిన్ను వరించాను కనుక నీ చావునూ, నీతో పాటు నీ వారి బలినీ చూడలేననీ, అనుమతిస్తే మిమ్ములందరినీ అమాంతం ఎత్తుకెళ్లి సురక్షిత ప్రాంతంలో దిగబెడుతాననీ అంటుంది హిడింబి. భీముడు అందుకు ఒప్పుకోకపోవడం, హిడింబాసురునితో యుద్ధం, ఆ రాక్షసున్ని మట్టుపెట్టడం, హిడింబినీ చంపే ప్రయత్నం చేస్తుండగా ధర్మరాజు స్త్రీని చంపడం భావ్యం కాదని వారించడం జరిగాయి. కుంతీదేవితోనూ, ధర్మరాజుతోనూ నేను భీమసేనున్ని ఇష్టపడుతున్నాను. అన్నింటినీ వదిలి తన కోసం వచ్చేశాను. పైగా మీ మంచి కోరి నాకళ్ళముందే నా అన్ననూ పోగొట్టుకున్నాను. నేను రాక్షసజాతికి చెందిన దాన్ని అనుకోకండి. నేను హక్కును కాదు. కేవలం భీముని ప్రేమను మాత్రమే కోరుకుంటున్నానని నిర్భయంగా చెబుతుంది హిడింబి.

హిడింబి మాటల్లోని నిజాయితీని గమనించిన కుంతీ, ధర్మరాజు భీమునితో హిడింబిని భార్యగా అంగీకరించమని చెబుతారు. కుంతీ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళేవరకూ వారితోనే ఉండి, తర్వాత అక్కడి నుంచి వారి జీవితాల్లోంచి దూరంగా వెళుతుంది. పైగా వారితో కలిసి ఉన్నప్పుడే ఇక్కడి నుంచి కాస్త దూరంగా వెళితే సరోవరం ఒకటి ఉంటుందనీ దాంట్లోని నీరు తాగితే అరణ్యవాస కాలంలో శీతోష్ణవర్షాది బాధలుండవు. పైగా వ్యాసుడే మిమ్మల్ని కలిసి దారి చూపుతాడనీ వారికి ధైర్యం చెబుతుంది. హిడింబికి భూతవర్తమాన భవిష్యత్ కాలాలను గురించి తెలుసుకోగల శక్తి ఉంది.హిడింబి పాండవులతో ఉన్నన్నాళ్లూ వారికీ, కుంతీదేవికీ సేవచేసింది. భీముని ముక్కోపాన్ని సంభాళించింది. అతన్ని ప్రేమగా చూసుకుంది. అపరిమిత బలపరాక్రమాలు గల కుమారుడు ఘటోత్కచుని భీమపుత్రునిగా అందించింది. ఘటోత్కచునికి పాండవులంటే మహాగౌరవం. వారు తలుచుకున్నప్పుడల్లా వారి ముందు ప్రత్యక్షమవుతానని మాటిస్తాడు. హిడింబి తనలోని తనను భీమునికి ఇచ్చేసింది. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు.

లోకంలోని అన్యాయాన్నీ, కుట్రలనూ చూసి తట్టుకోలేని అసహనమే భీముని ఆక్రోషం తప్ప, నిజంగా భీమునిలోని సున్నితత్వం, ధర్మ చింతనను సరిగ్గా అర్థం చేసుకున్న స్త్రీ హిడింబి. తనకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. ఇవ్వడంలోని ఆనందానికి తననే నిర్వచనంగా మలుచుకున్న రాక్షసజాతి ఆణిముత్యం హిడింబి.

ప్రమద్వర




No comments:

Post a Comment