Wednesday, 14 February 2018

శివరాత్రి











మాంపాహి మహేశ్వరా..!

‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టద’ని విశ్వసించి ఎనలేని నిశ్చింతను పొందినా... ‘శివరాత్రితో చలి శివ శివా అంటూ పోతుంద’ని ప్రకృతి మార్పును నానుడిగా ఏటా మురిపెంగా గుర్తుచేసుకున్నా... ఆఖరికి అశుభవాక్కులు వినపడినప్పుడు ‘శివశివా’ అని చెవులు మూసుకునే సున్నితత్వాన్ని ప్రదర్శించినా... తరతరాల తెలుగువారి సాంస్కృతిక జీవితంలో బోళాశంకరుడిది ప్రత్యేక స్థానం. జానపద కళల్లో, బైరాగి తత్వాల్లో, పాటల్లో, ఆటల్లో ఆ నటరాజ ముద్ర ప్రస్ఫుటం. అందుకే ఆ ఆదిదేవుడి తత్వం నేటికీ ఒక జీవన మార్గం.

హాలాహలాన్ని కంఠంలో, అగ్నిని ఫాలనేత్రంలో దాచుకుని కూడా చల్లని వెన్నెల్లాంటి వరాలు కురిపించే విలక్షణ దైవం హరుడు. భేషజాలకూ వైభవాలకూ దూరంగా నిరాడంబర జీవిత ప్రాముఖ్యం తెలిపి, లౌకిక జీవితంలోని మనందరికీ దారి చూపే తత్వం శివతత్వం. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, సమస్త జీవరాశి పట్లా దయతో మెలగడం, ప్రేమను నలుగురితో పంచుకోగలగడం... ఇవన్నీ ఆ తత్వంలో అంతర్లీనంగా కనిపించే అంశాలే. ఉన్నతికి దోహదపడే సోపానాలే.

పాలసముద్రము సిల్కెయాళ
నిను పాగల్‌గానిగ జేస్తిరయ్య!
అమృత మిడిసిపెట్టి ఇషమా..?
శబ్బాష్‌రా... శంకరా!!
అంటూ... తనికెళ్ల భరణి ‘ఆటగదరా శివా’లో ఆ దేవదేవుడి గురించి ఎంత చక్కగా చమత్కరించారు.
అమృతాన్ని సేవించేటప్పుడూ, అంతా కలిసి విందులూ, వినోదాలూ చేసుకునేటప్పుడూ అక్కడ శివుడి ఊసే ఉండదు. కానీ లోకాన్ని గడగడలాడించిన గరళాన్ని తాగాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరికీ శంకరుడే కావాలి. అయినా సరే విషాన్ని తాగేందుకు ఒక్క క్షణం ఆలోచించడు ఆ దేవదేవుడు. పట్టుబట్టలు కట్టే దేవుళ్లలో త్రిశూలధారి పేరే ఉండదు. కానీ మందమైన కరి చర్మం కట్టాలంటే అతడే దిక్కు. గంగస్నానాల పుణ్యం అందరికీ కావాలి కానీ ప్రళయ రూపంలో వచ్చే గంగమ్మను అడ్డుకోవాలంటే శివయ్యే రావాలి. భక్తుల వేషంలో వచ్చి కోర్కెలు కోరిన రాక్షసులకైనా వరాలిచ్చే శంకరుడి లాంటి బోళాదేవుడు, దీనబాంధవా నీవే దిక్కని వేడినంతనే కరిగిపోయే అల్పసంతోషీ ఇంకెక్కడా కనిపించడు. అలాంటి నవనీత హృదయుడిని శరణు శరణని మోకరిల్లితే చాలు వశుడైపోతాడు, పరమసంతోషంతో నెత్తినపెట్టేసుకుంటాడు.

నిరాడంబరం...
దేవదేవుడూ, పశుపతీ అయిన ఆ పరమేశ్వరుడు ఆడంబరాలకు దూరంగా ఉంటాడు. భిక్షాటనే జీవనాధారం. రుద్రభూమే శాశ్వత స్థానం. ఎప్పుడూ పులితోలు కప్పుకుని తిరుగుతుంటాడు. ఆభరణాల ఊసేలేదు సరికదా విషపునాగులను మాలలుగా ధరించి మురిసిపోతుంటాడు. రుద్రాక్షల్ని దండలుగా గుచ్చుకుని హారాలంటాడు. పోనీ, సిగలోని చంద్రుడినైనా చూసి ముచ్చటపడదామంటే అదీ కుదరదు. ఆ జడలను పట్టుకు వేలాడేవాడు వెన్నెల సోనలు వెదజల్లే నిండు చంద్రుడేం కాదు కళాకాంతీలేని సన్నని చంద్రవంక. రంకెలేయలేని ముసలి ఎద్దే వాహనంగా ఊరేగుతాడు. ఇక శివుడి చుట్టూ ఉండే పరివారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకటో రకం ప్రమథ గణం. నందికి నందే సాటి, భృంగికి భృంగే పోటీ. వీరినే మగపెళ్లివారిగా తీసుకుని పర్వత రాజు ఇంటికి ధూంధాంగా బయలుదేరాడట పశుపతి. వియ్యాలవారు ఈ దండు మొత్తాన్నీ చూసి ముక్కునవేలేసుకున్నారట. పర్వతరాజు వీరిని ఎలా సంబాళించుకురాగలడోననీ, పార్వతి సంసారం ఎలా సాగుతుందోననీ భయపడ్డారట. ఇంత సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నవాడు జగతికి ఏ రీతిన సందేశమివ్వగలడని సంశయించవచ్చు. అక్కడే ఉంది చిదంబర రహస్యం. కలియుగంలోని మనుషుల తీరు చంద్రశేఖరుడికి తెలిసినట్టుగా మరొకరికి తెలీదు. వెయ్యి చెబితే పదో పరకో అవగాహన చేసుకునే మనస్తత్వం మనది. కాబట్టే తనను తాను తక్కువగా చేసుకున్నట్లు కనిపిస్తూ నేలమీద నడవడమంటే ఇదేనంటూ మనిషి జీవితం ఇలానే ఉండాలంటూ సందేశాన్ని అందిస్తున్నాడు. ‘మామూలు మనుషులుగా ప్రేమ స్వరూపులుగా మెలగండి, ఆడంబరాలను నెత్తికెక్కించుకోకుండా మానవత్వంతో జీవించండి’ అనే హితోక్తులను తన ప్రవర్తన ద్వారా అందరికీ చెబుతున్నాడన్నమాట.

అర్ధనారీశ్వరం...
జగతికి తల్లీతండ్రీ అయిన శివపార్వతులు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేరు. విచిత్రమేంటంటే ఆదిదంపతులైన వీరివి భిన్న నేపథ్యాలు. పార్వతీ దేవి హిమవంతుని కుమార్తె. సిరిగలవారింట పుట్టిన పిల్ల. యువరాణి. బాల్యం నుంచీ భోగభాగ్యాలు అనుభవించింది. కానీ, జంగమయ్యను చేరాక అదంతా మటుమాయమైపోయింది. వల్లకాడులో సంసారం నడపమంటాడు. భవతీ భిక్షాందేహీ అంటూ కపాలం పట్టుకుని ఊరంతా తిరుగుతుంటాడు. రూపమయినా చక్కనిదా అంటే అదీకాదు. ఎగుడు దిగుడు కన్నులతో ఉంటుంది. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు, తక్కువచేసి మాట్లాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకల మీదికి తెచ్చుకుంటాడు శివుడు. కానీ ఆయన్ని పల్లెత్తుమాటయినా అనని మహా ఇల్లాలు పార్వతి. కఠోర తపస్సుచేసి మరీ శివుడిని తనవాడిగా చేసుకున్న ఆ తల్లికి ఆయన గురించి తెలియనిది అంటూ ఏదీ ఉండదు కదా! గంగమ్మను తెచ్చి సిగలో ఉంచుకున్నా లోకం కోసమే శివయ్య ఆ పని చేశాడని అర్థం చేసుకోగలిగింది. తనకంటే ప్రమథగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ మరోలా ఆలోచించలేదు. తనను నమ్మినవారిని నట్టేట ముంచని భర్త ప్రవర్తనను గర్వంగా చెప్పుకుంది. క్షీరసాగరాన్ని మధించే వేళ అమృతం పుడితే ఎవరో తాగుతారట. కామధేనువూ, కల్పతరువూ వేరెవరో తీసుకుంటారట. కానీ, కాలకూటం వెలువడినప్పుడు మాత్రం తన భర్తదగ్గరకే పరుగులు తీస్తారట. అయినాసరే కట్టుకున్నవాడు చేస్తున్న పని లోకరక్షణ కోసమే అయినప్పుడు తన పసుపుకుంకాలకు ఢోకా ఉండదన్న ధైర్యం ఆమెది. లయకారకుడయిన పతిని ఏ విషమయినా ఏం చేయగలుగుతుందని తనను తానే సమాధాన పరుచుకుంది. సర్వమంగళ అయిన తనకు చింత ఎందుకని సర్ది చెప్పుకుంది.

శంకరుడు నిశ్చలంగా విషాన్ని సేవిస్తుంటే ఆయన పక్కన అంతకంటే నిశ్చింతగా నిలవగలిగింది. రాయిలాంటి భర్తను రాగమయుడిగా, అనురాగమయుడిగా, ప్రేమస్వరూపుడిగా చేయగలిగింది. సదాశివుడూ అంతే, ఏ సందర్భంలోనూ సతికి అడ్డుచెప్పింది లేదు. ఆమె నిర్ణయాలను కోరికలను ప్రశ్నించిందీ లేదు. ఆమె స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఆమెవే అనుకునేవాడు. ఈశ్వరుడు జటాధారిగా, తోలుదుస్తులతో నడయాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో సర్వాలంకారశోభితయై అలరారుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆది దంపతులుగా వీరు జగత్ప్రసిద్ధమైంది ఇందుకే.

భక్తికి వశం...
శివుడిని శరణు కోరిన మార్కండేయుడు యమపాశం నుంచి బయటపడి చిరంజీవి అయ్యాడు. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన అనంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగర తీరంలో సైకత లింగాన్ని ప్రతిష్ఠించి, అర్చించి పాపవిముక్తుడయ్యాడు. శివుడికి తన కన్నులనే అర్పించిన తిన్నడు భక్తకన్నప్పగా ప్రసిద్ధి చెందాడు... ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో మహాభక్తుల చరితలు మనకు దృష్టాంతాలుగా కన్పిస్తాయి. అలాంటి నిగర్వి, నిరాకార, నిర్గుణ, నిరాడంబరుడైన నిలాక్షుడి ప్రేమానురాగాలు తెలిపే గాథలు అనంతం. ఎల్లలు లేనిది ఆయన మమకారం. ‘శివా’ అని ఆర్తిగా పిలిస్తే, మరుక్షణం చెంతనిలిచే ఆశ్రిత వత్సలుడాయన. అంతేనా, ఆ భక్తవశంకరుడి వాత్సల్యానికి సురాసుర భేదం లేదు. అందుకే కదా, భస్మాసురుడు ఆ నీలకంఠుడి నుంచి అవలీలగా వరాన్ని పొందగలిగాడు. ఎవరి తలమీద చెయ్యి పెడితే వాడే బుగ్గయి పోతాడన్న భరోసా దక్కించుకున్నాడు. శివుడి మీదనే ఆ వరబలాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అప్పుడిక ఆ రాక్షసుడి బారినపడకుండా తప్పించుకునేందుకు ఆ కైలాసనాథుడు నానాయాతనా పడాల్సివచ్చింది. రావణాసురుడూ అలాగే కదా ఆ పరమపావనుడిని ప్రసన్నం చేసుకున్నది. ఇక్కడే అంతర్లీనమైన ఒక ధర్మసూక్ష్మం ఉంది. దుష్టుల పట్ల జాగరూకతతో మెలగడం మనిషిలక్షణం. దుర్మార్గుడిని సైతం ప్రేమించగలగడం దైవత్వం. పశుపతి అసలైన దైవం కాబట్టే రాక్షసుల విషయంలోనూ దయనూ ప్రేమనూ ప్రకటించగలిగాడు. ఆ దిశగా యోచన చేసి తీరాలంటూ మానవాళికి హితవు చెప్పాడు.

మనలోని దైవం...
శివుడిని ప్రథమ దేవుడూ దేవాది దేవుడూ మహాదేవుడూ అంటూ ధ్యానించినా దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో అని కీర్తించినా ఆయనలోనూ మనిషికి మల్లేనే కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. కామం, క్రోధం, వాత్సల్యం, హాస్యచతురత, అనంతమైన ప్రేమ, అంతులేని అనుగ్రహం ఆయనలోనూ అగుపిస్తాయి. తనను ఒకింటివాడిగా చేద్దామని ప్రయత్నించిన మన్మథుడిని దహించివేస్తాడు శంకరుడు.  రతీదేవి బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్న తర్వాత కానీ మదనుడికి మరో జన్మ దక్కలేదు. ఈశ్వరుడు కోపంతో చేసినా, ప్రేమతో చేసినా ఆయన చేసిన ప్రతీ పనీ జగత్కల్యాణ కారకమవుతుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలా మనిషే శివుడూ దేవుడే మానవుడూ అని చాటిచెప్పడం వెనక కారణం లేకపోలేదు. ఎవరైనా ఎవరితోనయినా సరిపోల్చుకోవాలంటే పోలికలుంటేనే సులభవుతుంది. మనలాంటి వాడే శివుడూ అనుకుంటేనే అతగాడిని పలకరిస్తాం, నమస్కరిస్తాం. ఆయన దారిలో వెళ్లడం మొదలెడతాం. ఆయన తత్వాన్ని మనతత్వంగా మలచుకుంటాం. మహనీయులుగా రూపాంతరం చెందుతాం. ఇంతటి మార్మిక తార్కిక సిద్ధాంతం పార్వతీపతిలో లీనమై ఉంది. కాబట్టే, శంకర భగవత్పాదులు ‘శివ’ అనే రెండక్షరాలు పలికితే పాపాలన్నీ పటాపంచలయి పోతాయని చెప్పారు.

స్త్రీవాదం...
కైలాసనాథుడిని మించిన స్త్రీవాది, మహిళాపక్షపాతి మరొకరు ఉండరని చెప్పడానికి ఉదాహరణలు అనేకం. ఆడవారు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మనం ఇప్పుడు ప్రసంగాలిస్తున్నాం. కానీ, యుగాలనాడే ఈ వాదన వినిపించడమే కాదు, ఆచరణకు దిగిన ఆదిదేవుడు ఆయనే. తనలో అర్ధభాగాన్ని ఇచ్చానని ఈశ్వరుడెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సహజంగా, స్వతంత్రంగా ఆయన దేహంలో ఆమె కలిసిపోయింది. అలా ఆమె కలవడానికి అనువుగా మనసా వాచా కర్మణా తనను తాను మార్చుకోగలిగాడు. అంతెందుకు... ప్రదోషవేళలో తానొక్కడే ఆడిపాడి ఆనందించడు. నటరాజుగా నృత్యకేళీ విలాసాల్లో తేలుతున్నప్పుడూ శంకరుడు ఒంటరి కాదు. ఆదిశక్తితో కలిసి నర్తిస్తూ మహదానంద భరితుడవుతాడు. ఆ ఆటను చిత్కళగా భావించి గౌరవిస్తాడు. అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఈ ముక్కంటికి మించిన స్త్రీవాది ఎవరుంటారు? ఇంకా చెప్పాలంటే పార్వతమ్మ ముచ్చటపడి తయారుచేసి, ప్రాణం పోసి మరీ ఇంటి ద్వారపాలకుడిగా నియమించుకున్న బాలుడిని రెండు ముక్కలుగా చేసేస్తాడు ముక్కోపి. విషయం తెలిసి ఆమె ఘొల్లుమంటుంది. ఆమెను శాంతింపజేయడానికి ఏనుగు తలను తెచ్చి మరీ పిల్లాడికి అతికిస్తాడు. వినాయకుడిగా అక్కున చేర్చుకుంటాడు. గణాధిపతిగా అధికారాన్ని కట్టబెడతాడు. భార్యకు అంతగా విలువనిచ్చే పతి మహేశ్వరుడు.

ప్రకృతే రూపం...
సదా ధ్యానముద్రుడై కనిపించే ఆ పరమ శివుడి రూపం, ఆభరణాలూ, ఆయుధాలూ... ప్రతీదీ ఓ ప్రతీకే. త్రిశూలం సత్వ రజః తమో గుణాలకు ప్రతీక. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్థ చింతనకు మరోరూపం. ఏనుగంటే నిలువెత్తు గర్వం. వాటన్నింటినీ జయించినవాడు శివుడు. మనమూ వీటిని విడనాడాలి అని తెలిపేదే శివతత్వం. నంది ధర్మానికీ, సర్పాలు నిర్భయత్వానికీ నిదర్శనం.

ఆద్యంతరహితుడూ పంచభూతాత్మక స్వరూపుడూ అయిన మహా శివుడిని ‘నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంతో ధ్యానిస్తాం. ఈ మంత్రంలోని అయిదు బీజాక్షరాలూ విశ్వంలోని పంచభూతాలకూ ప్రతీకలు. ఇందులో న - భూమి, మః - జలం, శి - వాయువు, వా - అగ్ని, య - ఆకాశతత్వాలకు సూచికలుగా నిలుస్తున్నాయి. ఈ పంచభూతాల రూపాల్లో వెలసిన పంచభూత లింగాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నాయి. కంచిలో ఆ ముక్కంటి పృథ్వీలింగ రూపంలో ఆవిర్భవించాడు. తిరువణ్ణామలైలో తేజోరూపంలో ఉన్న అరుణాచలేశ్వరుడు అగ్నికి గుర్తు. జంబుకేశ్వరంలో జలలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో వాయులింగంగా... ఆ పరమశివుడు పూజలందుకుంటున్నాడు. ప్రకృతే శివుడూ శివమే ప్రకృతి అన్న సత్యాన్ని మానవాళికి చాటి చెప్పడమే ఇందులోని ఆంతర్యం, అంతరార్థం కూడా.

స్వార్థ చింతన, అసత్య భాషణం, కష్టాలకు కుంగిపోవడం, ప్రాణకోటిపట్ల దయలేకుండా ఉండటం... ఇలాంటి అవలక్షణాలే మన బాధలకూ కష్టాలకూ హేతువులు. వీటిని ఎలా దూరం చేసుకోవాలో, మనిషి మనిషిగా ఎలా బతకాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మనల్ని మనం ఎలా ఆవిష్కరించుకోవాలో తెలిపేదే శివతత్వం. ఒక్కమాటలో చెప్పాలంటే శివతత్వాన్ని అర్థం చేసుకోవడమంటే శివుడిలా మెలగడమే.

అంతా భ్రమని తెలుసు, బతుకంటే బొమ్మలాటనీ తెలుసు, కథని తెలుసు, కథలన్నీ కంచికే చేరుతాయనీ తెలుసు. అయినా జరిగేదీ జరుగుతోందీ నిత్యమనీ శాశ్వతమనీ భావించే అజ్ఞానపు మిడిసిపాటు మనిషిది. అనుకున్నది జరగకపోయినా, అనుకోని కష్టమొచ్చినా భరించలేని మనస్తత్వం... ఇలా చెప్పుకొంటూ పోతే మానవుల్లో తర్కించాల్సినవీ సరిచేసుకోవాల్సినవీ ఎన్నో. వీటన్నింటికీ శివ తత్వాన్ని అనుసరించడమే మనిషికి మార్గం. శివయ్యలా ప్రేమిస్తే, అలానే ఆదరిస్తే, అదేవిధంగా ఆలోచిస్తే... సమస్త విశ్వంలోనూ శివతత్వమే వెల్లివిరుస్తుంది. ప్రతి మనిషిలోనూ శివుడే కనిపిస్తాడు.

తెలుగు నేలపై...
పంచారామాలకు నెలవై, అష్టాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగమైన తెలుగు నేల నలుచెరగులా పరచుకున్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఎన్నో... మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని తెలిపే కథలూ, గాథలూ చిరస్మరణీయం. మూర్తి రూపంలోనూ, లింగాకారంగానూ పూజలందుకునే దైవం శివుడు. కానీ, లింగ రూపమే అందులో ప్రధానమైంది. ప్రతి లింగంలో శివుడి జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని విశ్వసిస్తారు నాయనార్లు. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలను అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొంటారు. అందులో కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున లింగం ఒకటి. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆది శంకరాచార్యులు శివానందలహరిని ఇక్కడే రాశారని ప్రతీతి.

* పురాణాల ప్రకారం తారకాసురుడు నేలకూలడంతో అతనిలోని ఆత్మలింగం అయిదు ముక్కలైంది. దేవతలు ఆ అయిదింటినీ అయిదు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఆ ప్రసిద్ధ క్షేత్రాలే పంచారామాలుగా ఆ దేవదేవుని ఆవాసాలుగా వెలుగొందుతున్నాయి. అవే ఆంధ్రప్రదేశ్‌లోని... దక్షారామం (ద్రాక్షారామం, తూ.గో. జిల్లా), కుమారారామం (సామర్లకోట, తూ.గో. జిల్లా), క్షీరారామం (పాలకొల్లు, ప.గో. జిల్లా), సోమారామం (భీమవరం, ప.గో. జిల్లా), అమరారామం (అమరావతి, గుంటూరు జిల్లా). ఇవికాక శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగేశ్వరం, చిత్తూరులోని కపిలతీర్థం, పశ్చిమ గోదావరిలోని ముక్తేశ్వరం, గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ, కర్నూలులో మహానంది, అదే జిల్లాలోని యాగంటి ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి.

* తెలంగాణలో సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రామప్పదేవాలయం, వరంగల్‌లోని ఐనవోలులో కాకతీయులు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం, కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి దేవాలయం, వేములవాడలో చాళుక్య రాజులు నిర్మించిన కోడెమొక్కులరాజరాజేశ్వరస్వామి దేవాలయం... నేడు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్రలో’ నల్గొండ జిల్లా పానగల్లు ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీనమైన పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం ఇక్కడివే.
లింగోద్భవ కాలమే...
మన ముఖ్యమైన పండగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుతాం.ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా పూజలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైంది. దీన్ని అత్యంత విశిష్టమైందిగా భావిస్తారు. సృష్టి స్థితికారకులైన బ్రహ్మదేవుడికీ శ్రీమహావిష్ణువుకూ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంమీద వాగ్వాదం మొదలైంది. ఒక్కోజామూ గడిచేకొద్దీ వాదాల వేడి పెరుగుతోంది. వారిని శాంతింప చేయమంటూ దేవతలంతా ముక్కంటికి మొరపెట్టుకున్నారు. లయకారుడైన ఆ కైలాసనాథుడు తేజోలింగరూపాన వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సందేహాలు తీర్చాడు. అపోహలు పారదోలాడు. ఆ రోజు... బహుళ చతుర్దశి. భక్తకోటికి పరమ పవిత్రమైన శివరాత్రి.దిగంబరుడు లింగరూపంలో అవతరించిన కాలమే లింగోద్భవ పుణ్యకాలం. భక్తకోటికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి.ఉపవాసం శారీరక శుద్ధికీ, జాగారం చేస్తూ ధ్యానం చేయడం మనోశుద్ధికీ ఉపకరిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
దంతుర్తి లక్ష్మీప్రసన్న








శివోద్భవ రాత్రి

శివుడు లింగాకృతిలో స్వర్గ మర్త్య పాతాళాల్లో ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. ఇది ప్రతి ఏడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశినాడు అర్ధరాత్రివేళ సంభవిస్తుంది. ఈ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట. అంతులేని సిరుల మూట. ఉపాసనలకు నెలవు. పూజలకు కొలువు. శివుడు లింగాకృతిలో ఆవిర్భవించడానికి ఒక నేపథ్యం ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువులు ఆధిపత్యాల గురించి వాదించుకున్నారట. ఇంతలో వారి ఎదుట ఒక శివలింగం ఉద్భవిస్తుంది. వారు ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది పెరగడం ప్రారంభిస్తుంది. క్రమంగా భూమిని చీల్చుకొని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ వూర్ధ్వలోకాలకు విస్తరిస్తుంది. అప్పుడు బ్రహ్మవిష్ణువులిద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు.

బ్రహ్మదేవుడు హంసలా మారిపోయి, ఆకాశంలోకి ఎగిరి వెళతాడు. విష్ణువు వరాహంగా మారి, నేలను చీల్చుకుంటూ పాతాళానికి చేరతాడు. వారిద్దరూ అలుపూ సొలుపూ లేకుండా ఎంత దూరం వెళ్లినా, శివలింగం అంతాన్ని చూడలేకపోతారు. తిరిగి యథాపూర్వ స్థానానికే చేరుకుంటారు.అప్పుడు వారి ఎదుట పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. తాను శివలింగం అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు అసత్యం పలికాడట. విష్ణువు సత్యం పలుకుతాడు. అసత్యం మాట్లాడిన బ్రహ్మకు లోకంలో పూజార్హత ఉండదని శివుడు శపిస్తాడు. బ్రహ్మదేవుడు నిరసించడంతో, ఆ శివ దూషణను కాలభైరవుడు సహించలేకపోతాడు. శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి, బ్రహ్మ అయిదో తలను ఖండిస్తాడట. ఆనాటి నుంచి ఆయన నాలుగు తలలవాడయ్యాడని, అనంతరం బ్రహ్మవిష్ణువులిద్దరూ శివమహిమను అంగీకరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.

శివపూజారంభంలో భక్తుడు తనలో శివుణ్ని భావించుకుంటాడు. తనతో పాటు ఈ సమస్త ప్రపంచం శివమయం అని విశ్వసించి పూజించే పద్ధతినే ‘ఆత్మపూజ’ అంటారు. శంకర భగవత్పాదులు ‘శివానంద లహరి’లో ఈ పూజా విధానాన్ని వర్ణించారు. ‘ఓ పరమేశ్వరా! నా ఆత్మ నీవు. నా బుద్ధి పార్వతీదేవి. నా ప్రాణాలే మిత్రులు. నా శరీరమే ఇల్లు. నేను అనుభవిస్తున్న సౌఖ్యాలే నీ పూజలు. నా నిద్రే తపస్సు. నా సంచారమే నీకు ప్రదక్షిణం. నేను పలికే మాటలే నీ స్తోత్రాలు. నేను చేస్తున్న పనులన్నీ నీ ఆరాధనలే!’- ఈ మాటల్లో ఎంతో పరమార్థం ఉంది.

మనిషి శివుణ్ని నిష్కల్మషంగా పూజించాలనుకుంటే, తన ఆత్మ అంతా శివుడే నిండి ఉన్నట్లు భావించాలి. మనిషి శివారాధనలో చతుర్విధ ముక్తులూ పొందుతాడని శంకర భగవత్పాదుల ఉపదేశం. భక్తుడు తానే శివుడై చేసే పూజలో శివుడి ‘సారూప్యం’ (సమాన రూపం) ఉంటుంది. అందుకే ఇది సారూప్య ముక్తి. శివభక్తులతో సాహచర్యం చేస్తూ శివాలయాల్ని సందర్శించడం వల్ల ఆయన సమీపానికి చేరుకున్నట్లు అవుతుంది కనుక ఇది సామీప్య ముక్తి. ఈ ప్రపంచం అంతా శివమయమే కాబట్టి, ఈ లోకంలో తానూ ఉన్నందుకు మనిషికి ‘సాలోక్య ముక్తి’ లభిస్తుంది. శివుడితో మానసికమైన అనుసంధానం ఉంటుంది. ఆ కారణంగా ‘సాయుజ్య ముక్తి’ లభించినట్లే. ఇలా శివుడి పూజ వల్ల చతుర్విధ ముక్తులనూ ఇహలోకంలోనే పొందుతున్న మనిషి ధన్యుడు.

శివుడి అర్చనలోని వస్తువులన్నీ ఆయన ప్రసాదించినవే. శివ జటాజూటంలోని గంగానది నీళ్లను అనుగ్రహిస్తుంది. శివుడి నేత్రమైన సూర్య కిరణాల వల్ల పూలు లభిస్తున్నాయి. శివుడి తలపైన గల చంద్రుడి దయతో పండ్లు లభిస్తున్నాయి. బిల్వదళాలు చేతికి అందుతున్నాయి. అవన్నీ శివ ప్రసాదాలే!

ఇలా శివుడు ఇచ్చిన సంపదలన్నింటినీ ఆయనకే అర్పించడం శివార్చన. దాని పరమార్థం- ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదని, అవి సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవని గ్రహించడం. మానవ జీవనం భోగమయం కారాదని, త్యాగమయం కావాలని తెలియజేసేదే మహాశివరాత్రి!

అనునిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంలా రూపొందించాలి. తనలో అందరిని, అందరిలో తనను చూసుకొని ఈ ప్రపంచాన్ని శివుడిగా భావించడమే అతడి కర్తవ్యం. మహాశివరాత్రి పర్వదినం అందజేసే సందేశం ఇదే! ఈ శివభావనతో పరమశివుణ్ని ఆరాధిస్తేనే, లోకమంతా శివ(మంగళ)మయం అవుతుంది!





మహాశివరాత్రి

మన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఇది మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి మరీ ప్రీతికరమైంది. ఆ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణచతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు. శివరాత్రులు అయిదు రకాలు. అవి.. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. నిత్యశివరాత్రి అంటే ప్రతిరోజూ రాత్రిపూటచేసే శివారాధన. పక్ష శివరాత్రి అంటే ప్రతి పదిహేను రోజులకొకసారి శివార్చన కోసం నిర్దేశించిన రాత్రి. మాసశివరాత్రి అంటే ప్రతి మాసంలోనూ శివపూజకు ఉద్దేశించిన రాత్రి. మిగతా శివరాత్రులు ఏవి కుదిరినా కుదరకపోయినా ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రినాడు శివపూజ చేయడం పుణ్యప్రదం. యోగి అయినవాడు తన యోగబలం చేత యోగనిద్రలోకి వెళ్లే రాత్రిని యోగశివరాత్రి అని అంటారు. సాధారణంగా రాత్రిపూట దేవీపూజను, పగటిపూట దేవపూజను చేయడం ఒక ఆచారంగా ఉంటుంది. కానీ శివరాత్రి విషయంలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున రాత్రిపూటే శివపూజ జరుగుతుంది. త్రిమూర్తులలో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఇలా శివ ఆరాధన రాత్రిపూట జరగడానికి ఓ కారణం కూడా ఉంది. పూర్వం ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది. ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. శివరాత్రినాడు శివుడిని రాత్రిపూట మాత్రమే పూజించడం, మిగిలిన పండుగలలా పంచభక్ష్య పరమాన్నాలతో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఓ విశేషం. మహాశివరాత్రి వ్రతాచరణను గురించి లింగపురాణం పేర్కొంటోంది. వ్రత ఉద్యాపన గురించి స్కందపురాణంలో వివరంగా ఉంది. శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం, రాత్రిపూట లింగార్చన, జాగరణం చేస్తారు. లింగార్చన తరువాత పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేయడం కూడా ఓ అలవాటుగా వస్తోంది. శివరాత్రినాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాలలో కూడా కొన్ని పద్ధతులున్నాయి. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాములలోనూ నాలుగు సార్లు నాలుగు రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు. మొదటి జాములో పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెడతారు. రుగ్వేద మంత్ర పఠనం జరుపుతారు. రెండో జాములో పెరుగుతో అభిషేకం, తులసీ దళార్చనచేసి, పాయసం నైవేద్యంపెట్టి యజుర్వేద మంత్రాలను చదువుతారు. మూడోజాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, నువ్వుల పొడి కలిపిన తిను బండారాలను నివేదిస్తారు. సామవేద మంత్రపఠన చేస్తారు. నాలుగో జాములో తేనెతో అభిషేకంచేసి నల్ల కలువలతో పూజించి అన్నం నివేదిస్తారు. అధర్వణ వేద మంత్రాలను చదువుతారు. ఇలా అభిషేకాలు చేసే శక్తిలేనివారు అభిషేకం చేసేటప్పుడు శివదర్శనం చేసుకున్నా పుణ్యమేనంటారు. నాలుగో జాము ముగిశాక ఉదయంపూట శివుడిని ఊరేగిస్తారు. ఇలా ఊరేగించడం వెనుక ఓ సామాజిక అంతరార్థం ఉంది. ఎవరైనా ఏ కారణం చేతనైనా ఆలయాలకు వెళ్ళి శివదర్శనం చేసుకోలేకపోతే వారికి ఆ ఊరేగింపును చూసి పుణ్యం పొందే భాగ్యం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రినాడు విధిగా చేస్తుంటారు. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్ళు శివలింగం మీద పోసి మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగంమీద పెడితే బోళాశంకరుడు పరవశించి అలా చేసినవారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో కనిపిస్తున్నాయి.




అరుణాచలం.. శివమయాచలం!

స్మరించినంత మాత్రాన ముక్తినిచ్చే క్షేత్రం అరుణాచలం. స్వయంభువుగా కొలువైన అక్కడి శివుడు అరుణాచలేశ్వరుడు. ఈ క్షేత్ర మహిమ పురాణ ప్రసిద్ధం. శివ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణాల్లోనే కాకుండా ఋగ్వేద, అధర్వణ వేద మంత్రాల్లో కూడా అరుణాచల ప్రసక్తి ఉంది. కొన్ని ఉపనిషత్తులు, సంహితలు అరుణాచల మాహాత్మ్యాన్ని ప్రశంసించాయి.

శివరాత్రితో ముడిపడిన క్షేత్ర పురాణం!
అరుణాచలానికి ఎన్నో పేర్లున్నాయి. ప్రధానంగా శోణాద్రి (ఎర్రని కొండ)గా ప్రాశస్త్యం పొందింది. ఈ పేరు రావడానికీ, అరుణాచలానికీ- శివరాత్రికీ ఎంతో సంబంధం ఉంది.
దీనికి సంబంధించిన కథ ఇది.

బ్రహ్మ విష్ణువుల మధ్య ‘ఎవరు గొప్ప?’ అనే వాదం తలెత్తింది. అది వివాదంగా మారింది. యుద్ధానికి దారితీసింది. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్రాల ప్రయోగానికి వారు సిద్ధమవుతున్న సమయంలో- బ్రహ్మ విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభంగా పరమ శివుడు ఆవిర్భవించాడు. ఇదీ క్లుప్తంగా కథ.

అలా ఆవిర్భవించింది శివుడని తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు ప్రార్థించడంతో శివుడు సాక్షాత్కరించాడు. ‘‘త్రిమూర్తులలో ఎక్కువ, తక్కువలకు తావు లేదు. సృష్టి-స్థితి-లయాలకు ప్రతీకలుగా ముగ్గురినీ పరాశక్తి సృష్టించింది. ఆమె సంకల్పాలను నిర్వర్తించడమే మన కర్తవ్యం’’ అని హితబోధ చేశాడు.

శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘ కృష్ణ చతుర్దశి- అర్ధరాత్రి. ఆ రోజును మహా శివరాత్రి పర్వదినంగా యావద్భారతదేశం పాటిస్తోంది. మహాదేవుడికి తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, నిర్వహిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, శివనామాన్ని జపిస్తారు. శివాలయాలకు వెళ్తారు. రాత్రి జాగరణం చేసి, లింగోద్భవ సమయంలో (అర్ధరాత్రి) శివుడిని దర్శించి, అనుగ్రహ పాత్రులవుతారు.

ఆధ్యాత్మిక రమణాచలం!
మహాశివరాత్రి అనగానే తమిళనాడులోని అరుణాచలం గుర్తుకొస్తుంది. అరుణాచలం అనగానే భగవాన్‌ శ్రీ రమణ మహర్షి స్మరణకు వస్తారు. పధ్నాలుగేళ్ళ వయసులో అరుణాచలం వచ్చిన వెంకటరామన్‌ (రమణ మహర్షి) జీవితాంతం అరుణగిరి సానువులలోనే గడిపారు. అరుణాచలానికీ, రమణ మహర్షికీ మధ్య అంత విడదీయరాని బంధం ఉంది. ‘‘అరుణాచలాన్ని పాషాణాలు, ముళ్ళ పొదలతో కూడిన మామూలు పర్వతంగా భావించవద్దు. ఇది పరమేశ్వరుని ప్రతిరూపం. అరుణం అంటే శక్తి- పార్వతి, ప్రకృతి, అచలం అంటే నిశ్చలాత్మ, శివుడు, పురుషుడు. ప్రకృతీ పురుషుల సమ్మేళనం... సగుణ నిర్గుణా ఏకత్వ రూపం ఇది!’’ అని ఆయన అనేవారు.

హిమాలయాల కన్నా పురాతనం!
పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా అరుణగిరి గొప్పతనాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. సృష్టికి పూర్వమే అరుణగిరి ఉందనీ, సూర్యుడి నుంచి విడివడిన భూమి అగ్నిమయంగా ఉన్న దశ నుంచి ప్రకృతిలో సహజ సిద్ధమైన మార్పులు పొందుతూ చల్లబడి ఏర్పడిన తొలి పాషాణమయ స్థానం అనీ, ఇది ఆసియా ఖండంలో భాగం కాదనీ, అప్పటి మహా సముద్రంలో మునిగిన లెమోరియా ఖండంలో భాగమనీ, హిమాలయాల కన్నా పురాతనమైన పర్వతమనీ ధ్రువపరిచారు.
దీనికి సంబంధించి-

గంగాచ మూలభాగస్థాయమునా గగనస్థితా!సోమోద్భవ శిరోభాగేసేవంతే శోణ పర్వతః!!అని స్కాంద పురాణం స్పష్టంగా చెబుతోంది.
సాధారణంగా పర్వతాలు చెట్లూ, పుట్టలతో పచ్చగా ఉంటాయి. కాని అరుణగిరి ఆ పేరులోనే ఉన్న వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ‘‘అరుణగిరి అగ్నితత్త్వానికి సంకేతం. ఇది ధరిత్రికి హృదయం వంటిది. సత్య స్వరూపం. జ్ఞాన తేజస్సు. శ్రేష్టతమం’’ అని ఋగ్వేదం కీర్తించింది.

ముక్తిదాయకం గిరిప్రదక్షిణం
అరుణాచలేశ్వరుని దేవేరి అపీత కుచాంబ. నలుదిశలా ఎత్తైన ప్రాకారాలతో, అరుణగిరి సానువులో నెలకొన్న అతి విశాలమైన అరుణాచలాలయంలో శివ కుటుంబంలోని గణపతి, కుమారస్వామి ఆలయాలున్నాయి. ఈ గిరి చుట్టూ ముక్కోటి దేవతలు శివలింగాలను ప్రతిష్ఠించారు. అరుణగిరిపై దక్షిణామూర్తి కొలువు తీరాడు. బ్రహ్మాది దేవతలందరూ అరుణగిరి ప్రదక్షిణం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరమణ మహర్షి కూడా అరుణగిరి ప్రదక్షిణం చేయాల్సిందిగా భక్తులకు చెప్పడమే కాదు- ఆయన కూడా భక్తులతో కలిసి ప్రదక్షిణం చేసేవారు.

వైభవంగా శివరాత్రి
అరుణాచలంలో సంవత్సరంలో ఎన్నో పండుగలు, పర్వాలు జరుగుతాయి. అన్నిటిలో ప్రధానమైనది శివరాత్రి. ఆ రోజున దివారాత్రాలు అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఒక్కసారిగా గుడిలోని గంటలన్నీ మ్రోగుతాయి. శంఖనాదాలు మిన్నుముడతాయి. కర్పూర హారతి ప్రకాశిస్తూ ఆకాశంలో పున్నమి చంద్రుడి వెన్నెలను భాసింపజేస్తుంది. ‘‘అరుణాచల శివా! అరుణాచల శివా!’’ అనే శరణు ఘోష దశదిశశలా ప్రతిధ్వనిస్తుంది. అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనూ దర్శించి భక్తులు తన్మయులవుతారు.

అత్యద్భుతమైన ఈ ప్రాచీన ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు మంటపాలను, గోపురాలను నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ‘అరుణగిరి వాసం, ఇక్కడ మరణం ముక్తిదాయకం. ఇది గొప్ప తీర్థక్షేత్రం. స్మరించిన మాత్రాన ముక్తి కలుగుతుంది’ అని శివపురాణం ఉల్లేఖించింది. శివభక్తికి ప్రధాన క్షేత్రమైన అరుణాచలంలో ఈశ్వరుని, అపీత కుచాంబను, అరుణగిరిని దర్శించినవారికి ఆ ఆది దంపతుల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఏ.సీతారామారావు








No comments:

Post a Comment