దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఇవన్నీ హిందూమతంలోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
- అద్వైతం లేదా స్మార్తం
- విశిష్టాద్వైతం లేదా వైష్ణవం
- ద్వైతం లేదా మధ్వం
హిందూమతాన్ని ఉద్ధరించిన ఆచార్యులలో ముఖ్యులు త్రిమతాచార్యులు.
త్రిమతాచార్యులు:
- ఆది శంకరాచార్యులు
- రామానుజాచార్యులు
- మధ్వాచార్యులు
ఆది శంకరాచార్యులు:
సమకాలీన హిందూమతం పై అత్యంత ప్రభావం చూపిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. భజ గోవిందం, కనకథారా స్తోత్రం, శివానందలహరి (శ్రీశైలంలో రచించారు), సౌందర్యలహరి, గణేశ పంచరత్న స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఆది శంకరులు 108 గ్రంథాలు రచించారు. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు. తరువాత ఆది శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు.
ఆది శంకరాచార్యులు దేశం నలుమూలలా నాలుగు మఠాలను స్థాపించారు. వీటినే చతుర్ధామాలు, చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి నుంచి నేటి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏ ప్రాతిపదిక పై ఎంత పటిష్ఠంగా నిర్మించారో తెలుస్తుంది. ఆది శంకరులు స్థాపించిన ఆ నాలుగు మఠాలు ద్వారకా మఠము, గోవర్ధన మఠము, శృంగేరి మఠము, జ్యోతిర్మఠం మఠము.
ద్వారకా మఠము(గుజరాత్)
ఈ మఠము శంకరులచే దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. ఇది కీటవాళ సాంప్రదాయ మఠము. భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయమంటారు. ఈ మఠ సన్యాసులకు చివర 'తీర్ధ' అనిగాని 'ఆశ్రమ' అని గాని ఉంటుంది. ఈమఠానికి క్షేత్రం ద్వారక (గుజరాత్‌లో ఉంది); పీఠ దేవత సిద్ధేశ్వరుడు; పీఠ శక్తి భద్రకాళి; మఠము యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యులలో ఒకడైన పద్మపాదాచార్యుడు; గోమతీ నది ఈపీఠ తీర్థము.ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు.సన్యాసం తీసుకోబోయే ముందు బ్రహ్మచారిగా చేరి శిక్షణ పొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది. తత్త్వమసి అనేది ఈమఠం యొక్క మహావాక్యం. ఈ వాక్యం జీవ, బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది. బ్రహ్మచారులు అవిగత గోత్రానికి చెందినవారుగా పరిగణింపబడతారు. సింధు, సౌరాష్ట్ర, మహారాష్ట్రములు వాటి మధ్యనున్న పశ్చిమ భారత ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో హిందూమత ధర్మాన్ని సుస్థిరం చేయవలసిన బాధ్యత ఈ ద్వారకా మఠానిది.
గోవర్ధన మఠము
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు.ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో ఉంది.ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన','అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ);పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు; పీఠశక్తి వృషలాదేవి (సుభద్ర);మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు; మహోదధి ఈ మఠ తీర్థము.ఈమఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు.భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం.ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది.'ప్రజ్ఞానం బ్రహ్మ' అనేది ఈ మఠం యొక్క మహావాక్యము.ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ,వంగ,కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు.ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.
శృంగేరీ మఠము
ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమనీ పిలువబడుతుంది.కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది.ఈ పీఠ దేవత వరాహుడు; పీఠ శక్తి శ్రీ శారదాదేవి; పీఠ క్షేత్రం రామేశ్వరం; పీఠ తీర్థం తుంగ నది.ఇక్కడి బ్రహ్మచారులను చైతన్యులని పిలుస్తారు. ఈ మఠము యొక్క మొదటి అధిపతి సురేశ్వరాచార్యుడు.ఈ మఠ సన్యాసులు పదియోగపట్టములలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరు భూరివాళ సంప్రదాయానికి చెందిన వారు.భూరి అంటే బంగారము అని అర్థము.ఏ సాంప్రదాయం మానవులను కాంచనశక్తి (ధన వ్యామోహం,ధర్మబద్ధమైన ధనాపేక్షకాక) నుండి వారిస్తుందో అది భూరివాళ సాంప్రదాయం.ఇక్కడ యజుర్వేదం ప్రత్యేకంగా పఠించబడుతుంది.అహం బ్రహ్మాస్మి అనేది ఈ మఠము అనుసరించే మహావాక్యం. వీరిది భూర్భువ గోత్రం. ఆంధ్ర, కర్ణాట, ద్రవిడ, కేరళ ప్రాంతములు ఈ మఠ పరిధిలోకి వస్తాయి.
జ్యోతిర్మఠము
దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం; పీఠ దేవత నారాయణుడు; పీఠ శక్తి పూర్ణగిరి; పీఠ తీర్థం అలకనంద (గంగానది). వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.
శంకర మఠము(కంచికామకోటి పీఠము)
ఈ మఠము శంకర మఠముగా కన్నా కంచి మఠముగానే ప్రసిద్ధము. దీనిని సర్వజ్ఞ పీఠము అని కూడా అంటారు. ఇది దక్షిణ దేశములోని కాంచీపురములో ఉన్నది. ఇక్కడి ఆచార్యుల యోగ పట్టనామము 'ఇంద్రసరస్వతి'. ఈ నామము శ్రీ చంద్ర శేఖర ఇంద్ర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీవిజయేంద్ర సరస్వతి ఈ విధముగా వాడబడుతున్నది. కంచి పీఠములో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠప్రథమ ఆచార్యుడు సాక్షాత్తు ఆది శంకరుడే అంటారు. తన తర్వాత పీఠాధిపతిగా సర్వజ్ఞాత్ముడనే బాల సన్యాసిని ఏర్పరచి, శృంగేరీ పీఠాధిపతి అయిన సురేశ్వరాచార్యుడి సంరక్షణలో ఉంచాడని కంచి పీఠం చరిత్ర చెబుతోంది. ఐదవ శతాబ్దము నుండి కంచి పీఠము విజయ పథములో నడుపబడుతున్నది.
చతుర్మఠాలంటే ఏమిటి? కంచిమఠానికి ఎందుకంత ప్రాధాన్యత?
ఆధ్యాత్మిక జీవనం గడిపేందుకు సన్యాసులు, బ్రహ్మచారులు ఉండేదానిని మఠం అంటారు. దేవతను ప్రతిష్ఠించిన అనంతరం అది పీఠంగా ప్రభవిస్తుంది. శంకరాచార్యుడు దేశం నలుమూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడు. వీటినే చతుర్మఠాలని పిలుస్తారు. వీటిలో మొదటిది ద్వారకా మఠం. ఈ మఠానికి తొలి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యుడైన పద్మపాదాచార్యుడు. రెండవది గోవర్ధన మఠం. ఇది ఒడిశాలోని పూరీ పట్టణంలో ఉంది. ఈ మఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు. మూడవది శృంగేరీ మఠం. ఇది కర్ణాటకలోని శృంగేరిలో ఉంది. ఈ మఠం తొలి అధిపతి సురేశ్వరాచార్యుడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనేది ఈ మఠం అనుసరించే మహావాక్యం. నాలుగవది జ్యోతిర్మఠం. దీనిని బదరికాశ్రమము కూడా అంటారు. ఇక్కడ అథర్వణ వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలివి. వీటితోపాటు శంకరుడు ముక్తి పొందిన కంచి మఠం అయిదవది. దీనిని సర్వజ్ఞ పీఠం అని కూడా అంటారు. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కంచిపీఠంలో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠం ప్రథమ ఆచార్యుడు ఆది శంకరుడే అని చెబుతారు.
| మొదటి ఆచార్యుడు | మఠం | పీఠ దేవత | పీఠ శక్తి | పీఠ తీర్థం | మహావాక్యం | వేదం | సంప్రదాయం |
|---|---|---|---|---|---|---|---|
| హస్తామలకాచార్యుడు | గోవర్ధన పీఠం పూరి | పురుషోత్తముడు (జగన్నాథుడు) | వృషలాదేవి (సుభద్ర) | మహోదధి | ప్రజ్ఞానం బ్రహ్మా | ఋగ్వేదం | భోగవార |
| సురేశ్వరాచార్యుడు | శృంగేరి శారదాపీఠం శృంగేరి | వరాహుడు | శ్రీ శారదాదేవి | తుంగ నది | అహం బ్రహ్మాస్మి | యజుర్వేదం | భూరివార |
| పద్మపాదాచార్యుడు | ద్వారకా పీఠం ద్వారక | సిద్ధేశ్వరుడు | పీఠ శక్తి భద్రకాళి | గోమతీ నది | తత్వమసి | సామవేదం | కీటవార |
| తోటకాచాఱ్యుడు | జ్యోతిర్మఠం బదరీనాధ్ | నారాయణుడు | పూర్ణగిరి | అలకనంద (గంగానది) | అయమాత్మా బ్రహ్మా | అథర్వవేదం | ఆనందవార |
| ఆది శంకరుడు సర్వజ్ఞాత్ముడు | చంద్రమౌళీశ్వరస్వామి | కామాక్షీదేవి. |
శంకరాచార్యులు బోధించిన, ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఆది శంకరుల "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -
బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః
బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, బ్రహ్మమునకు భేదం లేదు.
రామానుజాచార్యులు
రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యులు త్రిమతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆది శంకరాచార్యులు వారి అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు రామానుజాచార్యులు వారు. విశిష్టాద్వైతం వైదిక మతంలోని త్రివిధ విశ్వాసాలలో ఒకటి. మిగిలినవి అద్వైతం, ద్వైతం. విశిష్టాద్వైతం రామానుజుడికి పూర్వం నుంచి ఉంది. ఐతే, దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.
తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు
తిరుమలలోని మూలవిరాట్టు (ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపి ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు. అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.
మధ్వాచార్యులు
త్రిమతాచార్యులలో మధ్వాచార్యులు మూడవవాడు. మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరియు భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు. యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు. దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
ద్వైత వాదం
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
పాంచరాత్రము
పాంచరాత్రమనగా శ్రీవైష్ణవులు పరమపవిత్రంగా భావించే ఆగమ శాస్త్రం. చారిత్రక ఆధారాల ప్రకారం రామానుజుల వారి కాలంలో ఈ ఆగమ శాస్త్రం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ఇది నేడు ప్రామాణికం. పదకొండవ శతాబ్దిలో రామానుజులు ఆది శంకరుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరచారు. రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆగమం ముఖ్య పాత్రను వహిస్తుంది.
శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.
ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.
ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే. తమని శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారు.
హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.
శైవులు - పరమ శివుని ఆరాధించే వారు
శాక్తేయులు - పరాశక్తిని ఆరాధించేవారు.
వైష్ణవులు - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
గాణాపత్యులు - గణపతి ఆరాధకులు.
కౌమారులు - కుమారస్వామి ని ఆరాధించేవారు.
సౌరులు - సూర్యుణ్ణి ఆరాధించేవారు.
శివ లింగము హిందూ మతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది.
సాధారణంగా లింగము శక్తికి, స్త్రీ సృజనాత్మక శక్తికి సూచిక అయిన యోనిలో ప్రతిష్టింపబడి ఉంటుంది. లింగ-యోనుల సంగమం నిష్క్రియాత్మక విశ్వం మరియు క్రియాత్మక కాలం యొక్క కలయికని, ద్వైతంలోని అనంత ఐక్యతని, జీవోద్భావనని సూచిస్తుంది.
పూర్వం శివుడ్ని విగ్రహ రూపంలోనే పూజించే వారు (హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు). వరాహపురాణంలోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది." అని శపిస్తాడు. అంటే అంతకు ముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం.
శివలింగము(మానుష లింగము)లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.
స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.
మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).
హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.
శైవులు - పరమ శివుని ఆరాధించే వారు
శాక్తేయులు - పరాశక్తిని ఆరాధించేవారు.
వైష్ణవులు - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
గాణాపత్యులు - గణపతి ఆరాధకులు.
కౌమారులు - కుమారస్వామి ని ఆరాధించేవారు.
సౌరులు - సూర్యుణ్ణి ఆరాధించేవారు.
పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - అన్నామలై
2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం:
4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు - కంచి:
5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి:
1. అమారారామము: అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
2. ద్రాక్షారామము: ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
3. కుమారారామము: సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
4 భీమారామము: భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
5. క్షీరారామము: పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, ఉమ
శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.
శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.
పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం - శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురంలేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగం బ్రహ్మ స్థానంలో ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూ మూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణద్వార ముఖంగా ఉంటుంది.
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం(శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.
చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.
అన్ని శివాలయాలలో బ్రహ్మ ముహూర్తంలో రుద్రాభిషేకం మరియు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలోఉన్నది. ప్రతి శివాలయంలో ఈ శివరాత్రి అతి ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రతి ధర్మానికి కొన్ని ఆగమాలు ఉంటాయి.
వైష్ణవ దేవాలయాలలో చేసే అర్చనలకు మూలాధారమైనవి పాంచరాత్రాగమాలు. ఇవి 108పైనే ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 20 మాత్రమే అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో తెలుగులో లభించేవి 10 మాత్రమే. వీటిని తెలుసుకోవటం వల్ల వివిధ పుణ్యక్షేత్రాలలోని అర్చనాదులలోని అంతరార్థం తెలుస్తుంది.
భద్రాచలం సహా అనేక వైష్ణవ క్షేత్రాలలో ఆగమ ప్రమాణంగా భావించే శ్రీ కపింజల సంహిత.
శ్రీమన్నారాయణుని దేవాలయ నిర్మాణ పద్ధతి, ప్రతిష్ట, ఆరాధన మొదలైన వాటిని తేల్పే వైష్ణవాగమాలల్లో పాంచరాత్రాగమం, వైఖానసాగమం అని రెండు భేదాలున్నాయి. వాటిలో పాంచరాత్రాగమాన్ని నాథమునులు, యామున మునీంద్రులు, భగవద్రామానుజులు మొదలైనవారు విశేష శ్రమలకోర్చి ప్రచారం చేసినారు. శ్రీరంగాదిక్షేత్రాల్లో భగవదారాధన ఈ పద్ధతిననుసరించియే సాగుతూన్నది. ఈ విష్ణుసంహిత పాంచరాత్రాగమానికి చెందిన శాస్త్రం. దీనికి కొన్నిచోట్ల విష్ణుతంత్రమనే పేరు కూడా కన్పిస్తున్నది. అస్తు.
అదేం దురదృష్టమో కాని తెలుగువారు ఎక్కువగా అనుసరిస్తున్న పాంచరాత్రాగమ గ్రంథాలు 108 పైగా ఉంటే పట్టుమని పదిగ్రంథాలు కూడా తెలుగులిపిలో దొరకడం లేదు. అవీ చాలా పాతవి. ఎక్కడ దొరుకుతాయో తెలియని స్థితి. భద్రాచలదేవస్థానం వారు పాద్మం, పరమపురుషసంహితలు వేసినారు. అవీ ప్రస్తుతం అలభ్యం. శ్రీమాన్ రేజేటి వేంకట వేణుగోపాలాచార్యులువారు రాజమండ్రి వంటి మహానుభావులు అధిక శ్రమకోర్చి పాంచరాత్రాగమ గ్రంథాలను ముద్రిస్తూ సేవచేస్తున్నారు.
ఈ స్థితిలో అపర రామానుజులుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు ఈ కార్యక్రమానికి పూనుకొని క్రమక్రమంగా వీటిని తెలుగులిపిలో ముద్రిస్తున్నారు. తెలుగువారు భాగ్యవంతులౌతున్నారు. ఉడతాభక్తి సంప్రదాయ సేవగా ఈ గ్రంథాలను తెలుగులిపిలో ప్రచురించి భాగవతోత్తముల సేవచేయాలని దాసుని సంకల్పం. దానిలో భాగంగా తొలుత ప్రచురిస్తున్నదీ విష్ణుసంహిత.
దీన్ని ఔపమన్యువనే మహర్షికి తిరుమలలో తపస్సు చేసికొంటున్న సిద్ధుడు ఉపదేశించినట్లు కన్పిస్తుంది.
దీనిలో విష్ణువైభవం, క్షేత్రక్షేత్రజ్ఞనిర్ణయం, మంత్రోద్ధారవిధి, ఆరాధనా విధానం, ముద్రలు, అగ్నిసంస్కారం, మండలరచనావిధి, దీక్షా స్వీకార విధి, యాగభూమిలక్షణం, ప్రాసాదవిధి, ప్రతిమాలక్షణం మొదలైనవి అనేకం చెప్పబడ్డాయి.
సంక్షిప్తంగానైనా తెలుగు వివరణతో అందించడం ఈ గ్రంథంలోని ప్రత్యేకత.
ఆగమము అనగా వచ్చినది అని అర్దము. వైష్ణవ ఆగమము లలో రెండు రకములు ఉన్నాయి. అందులో ఒకటి వైఖానశ మునికి విష్ణువు నుండి వచ్చినది 'వైఖానశ ఆగమము', రెండవది గరుత్మంతునికి అయిదు రాత్రులు విష్ణువు వుపదేశించినదే 'పాంచరాత్ర ఆగమము'. నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజలు నిర్వహించబడుతున్నాయి. కానీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాత్రం వైఖానశ ఆగమానుసారం పూజలు నిర్వహించబడుతున్నాయి. మిగతా వైఖానశ ఆగమాలను అనుసరించే దేవాలయాలను పాంచరాత్ర ఆగమ విధానం లోనికి మార్చిన రామానుజాచార్యులవారు తిరుమలలో మాత్రం ఆసాహసం చేయలేక వైఖానశ ఆగమం లోనే పూజలు చేయాలని కట్టడి చేసారు.
No comments:
Post a Comment