మహాభారతానికి వస్తే, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహాల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది. కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.
ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’నని బంధువుల మధ్య ప్రకటించేశాడు. గాంధారి ఆ మాట వింది. తండ్రి అలా మాట ఇచ్చిన క్షణం నుంచే ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేశాడు. గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.
నిజానికి అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్క గాంధారిని మాత్రమే పెళ్లిచేసుకోలేదు. ఆమెతోపాటు ఆమె చెల్లెళ్ళు పదిమందిని పెళ్లాడాడు. మహాభారతం వాళ్ళ పేర్లను కూడా ఇచ్చింది. అంతేకాదు, కులం, రూపం, శీలం కలిగిన మరో వందమందిని తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. ఆ లెక్కన ధృతరాష్ట్రుని భార్యలు నూటపదకొండుగురు అవుతారు. అప్పుడు అతనికి వందమంది కొడుకులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారందరినీ గాంధారి సంతానంగానే చెబుతారు. గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, మహాభారతంలో కొన్ని వివరాలు ప్రచారంలో లేవు. అలాగే, అనేక సందేహాలకు అందులో తగిన సమాధానం ఉండదు. నూటొక్క మందిని గాంధారి సంతానంగా చెప్పడం అలాంటిదే. గాంధారి చెల్లెళ్ళకు, ఇతర భార్యలకు కలిగిన సంతానాన్ని కూడా పట్టమహిషి అయిన గాంధారికే ఆపాదించి ఉండచ్చు. నూటొక్కరు (కూతురు దుశ్శలతో కలిపి) కౌరవులలో పదిహేడుమందే గాంధారికి పుట్టినవారని ఎస్.ఎల్. భైరప్ప తన ‘పర్వ’ నవలలో అంటారు. అయితే, చిక్కుముడులుగా కనిపించే ఈ సంతానం లెక్క లన్నింటికీ శాస్త్రపరమైన ఇతర వివరణలు లేకపోలేదు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.
సుబలుడు ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననడం, కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావం’డనడంలా ధ్వనిస్తుంది. మహాభారత కాలం నుంచీ నేటి వరకూ అప్రతిహతంగా సాగుతున్న పితృస్వామ్యం పదునును ఈ రెండు వాక్యాలూ పట్టి చూపుతాయి. ముక్కుపచ్చలారని తన కూతురును ముసలివాడికిచ్చి పెళ్లి చేసే అఘాయిత్యాన్ని సహించలేక అగ్నిహోత్రావధాన్లు భార్య ప్రతిఘటించడం భోజనాల దగ్గర పెద్ద సీను సృష్టిస్తుంది. మరి సుబలుని నిర్ణయాన్ని అతని భార్యా, పిల్లలు వాస్తవంగా ఎలా తీసుకున్నారో తెలియదు. విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఉదాహరణగా ఈ ఘట్టాన్ని పితృస్వామ్య కోణం నుంచి వ్యాఖ్యానించారు. ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననగానే బంధువులు మారు మాట్లాడక పోగా, కళ్ళు లేకపోతేనేం గుణవంతుడు కాడా ఏమిటని సరిపెట్టుకోవడం; తండ్రి ఆ మాట అన్న క్షణం నుంచీ గాంధారి ధృతరాష్ట్రునే తన భర్తగా భావించి నేత్రపట్టం కట్టుకోవడం -బంధువర్గంలోనూ కుటుంబసభ్యుల్లోనూ సుబలుని మాటకు గల తిరుగులేని లక్షణాన్ని, గాంధారి పాతివ్రత్యాన్ని సూచిస్తాయని విశ్వనాథవారు అంటారు. ఇరావతీ కార్వే తన ‘యుగాంత’లో స్త్రీ కోణం నుంచి ఈ ఘట్టాన్ని చూస్తూ గాంధారి నేత్రపట్టం కట్టుకోవడం తండ్రి నిర్ణయంపట్ల నిరసన సూచకంగా అనుమానిస్తారు. కాలంతోపాటు కలిగే దృష్టిభేదం ప్రతి కాలంలోనూ పురాగాథల్ని సరికొత్తగా వ్యాఖ్యానించుకునే అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా ఆ కథలు నిత్యనవీనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటాయి.
అంధత్వాన్నే కాదు, ఏ వైకల్యాన్ని అయినా వేలెత్తి చూపించడం ఇప్పుడు కుసంస్కారం అవుతుందని మనకు తెలుసు. అదలా ఉంచి, ధృతరాష్ట్రునిపై సానుభూతినుంచి కలిగిన ప్రేమతోనే గాంధారి అతనిని భర్తగా అంగీకరించీ ఉండచ్చు. నిజంగా ఆమె ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు. తెలిసే అవకాశం లేదు.
చెప్పుకుంటూ వెడితే ఈ ఘట్టంలోని విశేషాలకు అంతే ఉండదు. ధృతరాష్ట్రునికి వధువుకోసం గాంధారం దాకా వెళ్ళారంటే, సమీపంలో సుక్షత్రియకన్య దొరకలేదనుకోవాలి. గాంధారి రూపలావణ్య శీలాల గురించి భీష్ముడు బ్రాహ్మణుల ద్వారా వినడం ఇంకో విశేషం. బ్రాహ్మణుల ద్వారానే ఎందుకంటే, వాళ్లే ఆనాడు క్షత్రియ కుటుంబాలకు, బయటి ప్రపంచానికి మధ్య వారధులుగానూ, వార్తాహరులుగానూ ఉన్నారు. అంటే, నాలుగు గోడల మధ్య ఆభిజాత్యాన్ని కాపాడుకునే క్షత్రియులకు బహిరంగ అభివ్యక్తి లేదా బయటి ప్రపంచాన్ని చూపించే కిటికీ బ్రాహ్మణులే. అది మళ్ళీ బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత గురించిన చర్చలోకి తీసుకువెడుతుంది. దానినలా ఉంచితే, ఎక్కడికైనా యధేచ్చగా వెళ్లగలిగే అవకాశమూ, బహుశా అధికారమూ ఆనాడు బ్రాహ్మణులకే ఉండి ఉండాలి. అది మళ్ళీ నాటి సామాజికమైన అమరికవైపూ, గణసమాజపు తీరు తెన్నులవైపు మనల్ని మళ్లిస్తుంది. అలాగే, ధృతరాష్ట్రుడే గాంధారదేశం వచ్చి గాంధారిని పెళ్లాడకుండా, గాంధారే అతని దగ్గరకు తరలి వెళ్లడమూ విశేషమే.
అంతకు మించి గమనించవలసిన విశేషం ఇంకొకటి ఉంది. అది కుంతి- పాండురాజుల వివాహం. ధృతరాష్ట్రునికి వధువు కోసం గాంధారదేశం దాకా వెళ్లవలసివచ్చింది కానీ, పాండురాజుకు వధువు దగ్గరలోనే, యాదవుల ఇంట దొరికింది. ఆ వధువు కూడా అప్పటికే కొడుకును కన్నది. అన్నదమ్ములే అయినా రాజ్యాధికారం ఉన్న వ్యక్తికీ, లేని వ్యక్తికీ వధువును ఎంపిక చేయడంలో ఉండే తరతమ భేదాలకు ఇది సూచన కావచ్చు. అయితే, ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రదేశపు రాచకన్య మాద్రిని కూడా పెళ్లిచేసుకున్నాడు. మొదటి పెళ్లికీ, ఈ పెళ్లికీ మధ్య ఏం జరిగిందో తెలియదు. కుంతికి సంతానం కలగకపోవడం ఒక కారణంగా కనిపిస్తుంది. లోపం పాండురాజులోనే ఉన్నా దానిని కప్పి పుచ్చడానికి మాద్రిని ఇచ్చి చేశారని ఎస్.ఎల్. భైరప్ప ఊహిస్తారు. కుంతి చరిత్ర యాదవ-క్షత్రియుల మధ్య నున్న సామాజిక అంతరాన్ని సూచిస్తోందనుకుంటే, అదే కురు-పాండవ శత్రుత్వానికీ అంతిమంగా యుద్ధానికీ దారితీయించిందా అన్నది అన్నింటికంటే ఆసక్తికరమైన ప్రశ్న.
కిందటి వ్యాసం ఆగిపోయిన చోటికి మళ్ళీ వెడదాం. మధ్య ఆసియాలో ఉన్న నేటి అప్ఘానిస్తానే నాటి గాంధారదేశం. అంటే ధృతరాష్ట్రునికి వధువును మధ్య ఆసియా నుంచి తెచ్చుకున్నారన్నమాట. అంతేకాదు, మాద్రి కూడా అక్కడిదే. మద్రదేశం గాంధారదేశాన్ని ఆనుకునే ఉంటుంది. అది మళ్ళీ ఉత్తర మద్ర, తూర్పు మద్ర అనే రెండు జనపదాలుగా ఉండేది. ఉత్తరమద్రను ఉత్తర కురుభూములని, బాహ్లిక దేశమని కూడా అనేవారు. గ్రీకులు దానినే బాక్ట్రియా అన్నారు. పురాణ, ఇతిహాస కాలం నాటి భౌగోళిక రేఖా పటాన్ని గీస్తే అది అప్ఘానిస్తాన్ నుంచి ఉత్తరభారతం వరకూ ఒకే నడవగా ఉన్నట్టు చూపిస్తుందని చెప్పుకున్నాం. అంటే, మధ్య ఆసియా, భారత ఉపఖండ జనపదాల మధ్య బాంధవ్యాలు, ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు, యుద్ధాలలో పరస్పర సహకారం ఉండేవన్నమాట.
క్షత్రియ వధువుల కోసం గాంధార, మద్రదేశాలవరకూ వెడితే వెళ్లచ్చు కానీ, నిజానికి మద్ర (లేదా బాహ్లిక) జనాలకు మంచి పేరు లేదు. ఆ విషయం కూడా మహాభారతమే చెబుతోంది.
కర్ణుడు అంగరాజు. అంగరాజ్యం నేటి బీహార్ తూర్పున కొంతభాగం. చంపానగరం దాని రాజధాని. నేటి భాగల్పూర్ ను అంగరాజ్యంలోదిగా గుర్తించారు. ఇక శల్యుడు మద్రదేశీయుడు, క్షత్రియుడు, పాండురాజు రెండో భార్య మాద్రికి సోదరుడు. గమనించే ఉంటారు, పైన ఉటంకించిన సంభాషణలోని కులనింద, ప్రాంత నిందల ఘాటు నసాళానికి అంటేలా ఉంది. అందులోనూ కర్ణుని మాటలు మరింత పరుషంగా ఉన్నాయి. అయితే, వాస్తవంగా నింద ప్రారంభించింది శల్యుడు. అతని మాటలు ఇంకా పరుషంగా ఉంటాయి. అంటే, కర్ణుని నింద ప్రతినింద మాత్రమే.
కర్ణుడు యుద్ధానికి బయలుదేరగానే శల్యుడు నిందకు తెరదీశాడు. కర్ణుని కులాన్ని ఎత్తి చూపి మాటి మాటికీ ‘సూతపుత్రుడి’గా అతనిని సంబోధిస్తూ తూలనాడాడు. అర్జునుడి పరాక్రమాన్ని అదేపనిగా ఆకాశానికి ఎత్తి ఈసడింపు మాటలతో కర్ణుని కుళ్లబొడిచాడు. ఎంగిళ్లు తిని కొవ్వెక్కిన కాకితో అతనిని పోల్చుతూ కాకి-హంస కథ చెప్పాడు. ఉబికి వచ్చే కోపాన్ని కర్ణుడు మొదట్లో బలవంతాన అణచుకున్నాడు కానీ, శల్యుడు ఎంతకీ తగ్గకపోవడంతో తనూ నోరు చేసుకున్నాడు. శల్యుడు కులం రీత్యా ఉన్నతస్థానంలో ఉండగా, కర్ణుడు ప్రాంతం రీత్యా ఉన్నతస్థానంలో ఉన్నాడు. శల్యుడు కర్ణుడి కులాన్ని ఎత్తి కించపరిస్తే; శల్యుని క్షత్రియాధమునిగా కర్ణుడు సంబోధిస్తూ అతని ప్రాంతాన్ని ఎత్తి కించపరిచాడు.
కులదర్పం ఇంతగా కరడుగట్టిన శల్యుడు కర్ణునికి రథసారథి కావడానికి అసలెందుకు ఒప్పుకున్నాడు? అదెలా జరిగిందంటే, శల్యుని తనకు సారథిని చేయమని కర్ణుడే దుర్యోధనుని అడిగాడు. అది కూడా శల్యుని పట్ల ప్రశంసా భావనతోనే. కృష్ణుని సారథ్యంలో అర్జునుడు మరింత అజేయుడవుతున్నాడు కనుక, అశ్వజ్ఞానంలో కృష్ణునికి సాటి వచ్చే శల్యుని నాకు సారథిని చేస్తే అర్జునుని అవలీలగా గెలుస్తానన్నాడు. దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని శల్యుని దగ్గరకు వెళ్లాడు. అతన్ని అనేకవిధాలుగా ఉబ్బేసి కర్ణునికి రథసారథ్యం చేయమని కోరాడు.
ఆ కోరిక శల్యునిపై ఎంత పిడుగుపాటు అయిందో తిక్కన అద్భుతంగా చిత్రిస్తాడు. అప్పుడు శల్యుని కళ్ళు కోపంతో జేవురించాయి. నుదుట చెమటలు పట్టేశాయి. ఇంత నీచమైన పనికి నన్నెలా నియోగిస్తావు, నీకు వర్ణధర్మాలు తెలియవా, మూర్ధాభిషిక్తులైన రాజులు ఎన్నడైనా శూద్రులకు పరిచర్యలు చేశారా అని దుర్యోధనుని నిలదీశాడు. సూతపుత్రుడైన కర్ణుని దొరగా చేసుకుని నన్ను సారథ్యం ఎలా జరపమంటావు, అదీగాక కర్ణుడు నాకన్నా బలవంతుడా అని ప్రశ్నించాడు. తెలియక నువ్విలా కోరి ఉంటావు, ఒకవేళ తెలిసీ కర్ణుని మీద పక్షపాతంతో నన్నిలా అవమానించదలచుకుంటే ఇప్పుడే మా దేశానికి వెళ్లిపోతానంటూ రాజుల మధ్యలోంచి చివాలున లేచి బయటకు నడిచాడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని ఆపి బుజ్జగించాడు. ఒక్క కర్ణుడే దేనికి, నిన్ను మించిన వీరులు ఎక్కడా లేరు; అశ్వహృదయం తెలియడంలో కృష్ణుని కన్నా కూడా నువ్వు ఎక్కువ కనుకే ఈ కోరిక కోరానన్నాడు. ఆ మాటతో శల్యుడు చల్లబడ్డాడు. ఇంతమంది రాజుల మధ్య నన్ను కృష్ణుడికంటే ఎక్కువన్నావు కనుక ఒప్పుకుంటున్నాను; అయితే ఒక షరతు, నేను కర్ణునితో విచ్చలవిడిగా, తోచినట్లు మాట్లాడతాను, నన్ను తప్పుపట్టకూడదు అన్నాడు.
శల్యుడు చెప్పిన కాకి-హంస కథ వేరే కారణంతో అపురూపంగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తుంది. ఆ కథ ఇదీ:
సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ధర్మవర్తి అనే రాజు పురంలో ఒక సంపన్న వైశ్యుడు ఉండేవాడు. అతనింట్లోకి ఓ రోజు ఓ కాకి ప్రవేశించింది. ఆ వైశ్యుని కొడుకులు ఎంగిళ్ళు తినిపించి దానిని పోషిస్తూ వచ్చారు. దాంతో దానికి కొవ్వెక్కింది. ఎలాంటి పక్షి అయినా తనకు సాటి రాదన్న అహంకారం పెరిగిపోయింది. అంతలో ఒకనాడు కొన్ని హంసలు ఆ సమీపంలో కనిపించాయి. ‘తారతమ్యం తెలియని’ ఆ వైశ్యపుత్రులు వాటిని కాకికి చూపించి, పక్షులలో నీ అంతవారు లేరు కనుక ఆ హంసలతో పోటీ పడి ఎగిరి వాటిని ఓడించు అన్నారు. అప్పుడు కాకి వాటి దగ్గరకు వెళ్ళి, ఓ హంసను గుర్తించి, తనతో సమానంగా ఎగరమని సవాలు చేసింది. అప్పుడా హంసలన్నీ నవ్వుతూ, మేము మానససరోవరం దగ్గర ఉండేవాళ్లం, మా బలాన్ని వేగాన్ని అన్ని పక్షులూ పొగడుతాయి. మేము ఎక్కడికైనా, ఎంతదూరమైనా వెళ్లగలం, మాకు ఎలాంటి అలసటా రాదు, హంసలను పోటీకి రమ్మని కవ్వించిన కాకిని మేమింతవరకూ చూడలేదు, పైగా మా అందరిలోనూ బలశాలినే ఎంచుకున్నావు, అన్నాయి.
అప్పుడా హంసతో కాకి, నూటొక్క గతుల్లో నేను ఎగరగలను, ఒక్కొక్క గతిలో వందయోజనాలు వెళ్లగలనంటూ తను చేయగల విన్యాసాలను వర్ణించింది. దానికా హంస, నాకా మార్గాలన్నీ తెలియవు, పక్షులన్నీ ఎగిరే ఒక్క మార్గమే తెలుసు, ఎగురుదాం పద, అంది. రెండూ సముద్రం మీద ఎగరడం ప్రారంభించాయి. చూస్తుండగానే కాకి హంసను దాటిపోయింది. ఇక హంస పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసి గాలిలో తన విన్యాసాలను మొదలుపెట్టింది. మధ్య మధ్య మళ్ళీ వెనక్కి వచ్చి హంసను వెక్కిరించింది. హంస మాత్రం నిబ్బరంగా సమగతిలో సాగిపోయింది.
కొంతసేపటికి కాకి అలసిపోయింది. వేగం తగ్గిపోయింది. మనసులో అలజడి మొదలైంది. కాలు మోపడానికి ఎక్కడా ఓ చెట్టూ, పుట్టా లేవే అనుకుని కలవరపడింది. దైన్యం ఆవహించింది. ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకుంది. క్రమంగా కిందికి దిగిపోవడం ప్రారంభించింది. అది గమనించిన హంస, ఎన్నో గతులు తెలుసన్నావుగా, ఇది ఏ గతి అని పరిహాసమాడింది. చివరికి ఎగిరే ఓపిక పూర్తిగా నశించి సముద్రంలో మునిగిపోయే దశలో, ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి నీతో పోటీపడ్డాను, బుద్ధొచ్చింది, నన్ను కాపాడి కాకుల్లో కలుపు అని కాకి ఆ హంసను ప్రార్థించింది. అప్పుడు హంస తన కాళ్లమధ్య కాకిని ఇరికించుకుని పైకిలాగి తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఒడ్డున పడేసింది.
సరే, శల్యుడు ఈ కథ చెప్పడంలో ఉద్దేశం కర్ణుని ఎంగిలి కూడు తినే కాకి తోనూ, అర్జునుని హంసతోనూ పోల్చడమని తెలిసిపోతూనే ఉంది.
స్థూలంగా చెప్పుకుంటే; మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ. ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. ‘నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను’ అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.
వ్యాస, భీష్మ, ద్రోణులలో కులధర్మం గురించిన పట్టింపు ఎక్కువగా కనిపిస్తుంది. తరాల మధ్య అంతరం కూడా అందుకు కారణం కావచ్చు. నువ్విక వానప్రస్థానికి వెడితే మంచిదని ధృతరాష్ట్రునికి వ్యాసుడు సలహా ఇస్తూ, ‘రాజులు యుద్ధంలోనైనా చావాలి, దృఢ సమాధితోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతే తప్ప, వృద్ధులై రోగంతో మంచం పట్టి చావడం మేలా, ఓ భరతముఖ్యా?’ అంటాడు. ‘భరతముఖ్యా’ అనడంలో ఉద్దేశం, భరతులు ఆయుధోపజీవులు సుమా అని గుర్తుచేయడమే. భీష్ముడు కూడా అర్జునుడిలానే ఒక దశలో హింస-అహింసల మధ్య సందిగ్ధతను ఎదుర్కొన్నట్టు కనిపిస్తాడు. అయితే, ఇద్దరి సందిగ్ధతా ఒకలాంటివి కావు. భీష్ముడు హింసపట్ల విసుగు ప్రకటిస్తూనే, రాజుల హింసను కులధర్మంగా నొక్కి చెబుతాడు. ‘పది రోజుల్లో ఉత్తమ క్షత్రియుల నెందరినో వాడి బాణాలతో చంపేశాను. విసుగుపుట్టింది. ఇక ఈ శరీరం విడిచి పెట్టడం మంచి’దని అనుకుంటాడు. ‘పుట్టినప్పటి నుంచీ క్రౌర్యంతో రాజులను చంపడంలోనే నా కాలం గడచిపోయింది, విసుగుపుట్టింది, ఇక నేనీ రాక్షస కృత్యం చేయలే’నని ధర్మరాజుతో అంటాడు. అర్జునుడిలో హింసా వైముఖ్యం వ్యవస్థాగతమైనదైతే, భీష్ముడి వైముఖ్యం వ్యక్తిగతం. భీష్ముని మాటల్లో హింస పట్ల విచారాన్ని మించి, ఉత్తమ క్షత్రియులు అంతరించిపోతున్నారే నన్న ఆవేదన కనిపిస్తుంది. ఇదే భీష్ముడు అంపశయ్య మీద అంతిమక్షణాలకు ఎదురుచూస్తున్న సమయంలో కూడా ; ‘విప్రులకు అధ్యయనం ఎలాగో, రాజులకు యుద్ధం అలాగ. పాపపరులైనప్పుడు తల్లిదండ్రులను, పుత్రపౌత్రులను, గురువులనైనా సరే; యుద్ధంలో చంపడం ధర్మమే. రాజులకు యుద్ధాన్ని మించిన ఉత్తమధర్మం లే’దని ధర్మరాజుతో అంటాడు. అంతేకాదు, యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ, ‘ఏ యజ్ఞమూ సంగ్రామయజ్ఞానికి సాటిరావు’ అంటాడు.
ఇక ద్రోణుడి విషయానికి వస్తే, అభిమన్యుని వధలో ముఖ్యపాత్ర పోషించిన సైంధవుడు; అర్జునుడు తనను చంపుతానని చేసిన ప్రతిజ్ఞకు భయపడి ద్రోణాచార్యుని కలసుకున్నప్పుడు, ‘కులధర్మం శిథిలం కాకుండా వెళ్ళి యుద్ధం చేయి’ అని ద్రోణుడు అతనితో అంటాడు. మరి విప్రుడైన ద్రోణుడు కులధర్మం తప్పలేదా అన్న ప్రశ్న రావచ్చు కానీ దానిని వ్యక్తిగత దోషంగానే చూడాలి. తను చేసిన తప్పు పట్ల స్పృహతోనే అతను సైంధవుడికి ఆ సలహా ఇచ్చి ఉండచ్చు.
ఇంతకీ చరిత్రకందని ఆ కాలంలోనే హింస-అహింసల మధ్య ఇంత అంతర్మథనం, ఇంత చర్చ ఎందుకు సంభవించాయన్నది మరో కీలకమైన ప్రశ్న. దానికి సంక్షిప్తంగా చెప్పుకోదగిన సమాధానం ఏమిటంటే, హింస సామాజిక పురోగమనానికి తీవ్ర ఆటంకంగా మారే పరిస్థితులు ఆనాటికే తోసుకువస్తున్నాయి. రాజకీయార్థిక రూపంలో మౌలికమైన మార్పు వస్తోంది. అన్న పుష్కలత్వాన్ని సాధిస్తూ పెరుగుతున్న జనాభాను ఆదుకుంటున్న అభివృద్ధికర సాధనంగా వ్యవసాయం నానాటికీ బలం పుంజుకుంటోంది. దానికితోడు ఇనుము లభ్యత అటు వ్యవసాయానికి సాయపడుతూనే, విచిత్రంగా ఇటు హింసా విజృంభణకూ దారితీయిస్తోంది. వ్యవసాయవిస్తరణకు గణసమాజమూ, ఆయుధోపజీవనమూ అడ్డంకిగా పరిణమించడమే అందుకు కారణం. చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ వ్యవసాయ శక్తులకూ, యథాతథవాదులకూ మధ్య సంఘర్షణ మరింత తీవ్ర రూపం ధరించబోతోంది.
ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ’ నవల గుర్తుకొస్తోంది. ఆ నవల ప్రారంభమే ఋతుకాల భయాలతో జరుగుతుంది. మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ, స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.
books
భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది.
ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో కథకుడైన వైశంపాయనుడు వ్యాసుని పుట్టుక గురించి జనమేజయునికి చెప్పి, ఆ వెంటనే, దేవదానవుల అంశతో భీష్మాది వీరులు పుట్టి భారతయుద్ధం చేశారని అంటాడు. అలా పుట్టిన రాజులందరూ భారతయుద్ధంలో నశించడానికి కారణమేమిటని జనమేజయుడు అడుగుతాడు. వైశంపాయనుడు సమాధానం చెబుతూ, పరశురాముడు ఇరవయ్యొక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ సంహరించాడనీ, అప్పుడు ఆ రాజుల భార్యలు సంతానం కోరి ఋతుకాలంలో ధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారనీ, దాంతో రాజవంశాలు వర్ధిల్లాయనీ అంటాడు.మృతులైన రాజుల భార్యలు ఋతుకాలంలో ధర్మం తప్పకుండా, అంటే ఋతుకాలధర్మం తప్పకుండా మహావిప్రుల దయతో సంతానం పొందారని పై సమాచారం వెల్లడిస్తోంది. ఇక్కడ ఋతుకాల ప్రస్తావన చేయకుండా, విప్రుల ఆశీస్సులతో సంతానం పొందారని చెప్పి ఉంటే, దానికి ఏదో మహిమను ఆపాదించి సమర్థించుకోవచ్చు. కానీ ఋతుకాలాన్ని ప్రస్తావించి మరీ కథకుడు ఈ సంగతి చెప్పాడుకనుక దీనిని వాస్తవికార్థంలోనే తీసుకోవలసి ఉంటుంది.
ఉదంకుడు పైలుడనే ముని శిష్యుడు. ఫైలు డొకసారి దేశాంతరం వెడుతూ ఇంటి బాధ్యతలు ఉదంకునికి అప్పజెబుతాడు. అంతలో ఫైలుని భార్యకు ఋతుకాలం సంభవిస్తుంది. ఇతర స్త్రీలు ఉదంకునితో ఈ విషయం చెప్పి, గురువు దగ్గరలో లేరు కనుక ఆయన స్థానంలో నువ్వు ఆమెకు ఋతుకాలోచితాన్ని నిర్వర్తించాలని చెబుతారు. ఉదంకుడు అందుకు తిరస్కరిస్తాడు. గురువు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం ఆయనకు చెబుతాడు. అప్పుడు గురువు ఉదంకుని మెచ్చుకుంటాడు. ఉదంకునికి స్త్రీలు ఆ సూచన చేశారంటే, అప్పటికి అలాంటి ఆనవాయితీ ఉందనుకోవాలి. ఉదంకుడు తిరస్కరించాడంటే, ఆ ఆనవాయితీకి కాలం చెల్లుతూ ఉండాలి. ఈ సందర్భాన్ని కథకుడు ప్రధానంగా మరొకందుకు వాడుకున్నాడు. అది, ఉదంకుని గురుభక్తిని చెప్పడం. యజమాని దేశాంతరం వెళ్ళడం, ఒక కట్టుగా ఉన్న స్త్రీలు మాతృస్వామ్యం తాలూకు ఒక ఆనవాయితీని అమలుచేయడానికి ప్రయత్నించడం, యజమాని ప్రతినిధి అయిన ఉదంకుడు అందుకు నిరాకరించడం -ఋతుకాలోచితం విషయంలో స్త్రీ-పురుషుల మధ్య అప్పటికింకా కొనసాగుతున్న ఘర్షణను సూచిస్తూ ఉండచ్చు.
No comments:
Post a Comment