విశ్వ వినాయకమ్
స్వర్గలోకం సకల భోగాలకు నిలయం. భూలోకంలో జీవితాంతం అలాంటి భోగాలను అనుభవించడం అసాధ్యం. జరామరణాలతో కూడిన మర్త్య జీవితం కంటే, స్వర్గాన్ని చేరి అమర సౌఖ్యాలను అనుభవిస్తేనే కదా సార్థకత అనుకున్న మానవులు ఘోర తపస్సులు ఆచరిస్తూ, తపః ఫలితంగా ఒక్కొక్కరే స్వర్గానికి వెళ్లసాగారు. స్వర్గంలో దేవతల కంటే మనుషులే ఎక్కువయ్యారు. స్వర్గంలో తమ ఆధిక్యత పెరగడంతో మానవులు ఏకంగా దేవతల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్వైరవిహారం చేయడం ప్రారంభించారు. మానవులంటేనే దేవతలు భయపడే పరిస్థితి దాపురించింది. మానవులకు భయపడుతూ బతకడం దుస్సహంగా ఉందని, వాళ్లను ఎలాగైనా నియంత్రించాలని స్వర్గంలోని దేవతలందరూ దేవేంద్రుడితో మొరపెట్టుకున్నారు. తపస్సులు సాగించి స్వర్గానికి వచ్చిన వాళ్లను ఎలా నియంత్రించాలో దిక్కుతోచని దేవేంద్రుడు నేరుగా కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి, వారిని పరిపరి విధాల స్తుతించాడు. ‘దేవేంద్రా! నీ రాకకు కారణమేమిటి?’ అని పరమేశ్వరుడు ప్రశ్నించగా, తన మొర వినిపించాడు.
వినాయకుడికి గల గజముఖానికి మొదట్లో రెండు దంతాలూ ఉండేవట. పరశురాముడి గొడ్డలి దెబ్బ వల్ల ఒక దంతాన్ని పోగొట్టుకుని ఏకదంతుడయ్యాడట. అదెలాగంటే... కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరుశురాముడు పరమశివుడి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని అడ్డగించి, ‘ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడద’న్నాడు. ‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవ్వడివి‘ అంటూ పరుశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాటా మాటా పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్లు బైర్లుకమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడి పైకి విసిరాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీపరమేశ్వరులు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురోడుతున్న బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముడిని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటి ఆ కథ ముగిసినా, వినాయకుడు ఏకదంతుడిగా పేరుపొందాడు.
వినాయకుడు ప్రణవరూపుడు. ప్రణవనాదమైన ఓంకారం ఆకారంలోనే వినాయకుడు కనిపిస్తాడు. దేవనాగరి లిపిలోని ఓంకారం ఆకారంలోనే చాలా వరకు పురాతన వినాయక విగ్రహాలు కనిపిస్తాయి. అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఉపపురాణాలలో వినాయకుని ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుని గురించిన విపులమైన కథనాలు గణేశ పురాణంలోను, ముద్గల పురాణంలోను కనిపిస్తాయి. ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి ఎనిమిది అవతారాలు ఉన్నాయి. అవి: వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు. ఈ ఎనిమిదింటిలోనూ ఐదు అవతారాలకు వినాయకుని వాహనం ఎలుక. వక్రతుండ అవతారానికి సింహం, వికటావతారానికి నెమలి, విఘ్నరాజ అవతారానికి శేషువు వాహనాలు. గణేశ పురాణం ప్రకారం వినాయకునికి నాలుగు అవతారాలు ఉన్నాయి. అవి: మహోటక అవతారం, మయూరేశ్వర అవతారం, ధూమ్రకేతు అవతారం, గజానన అవతారం. మహోటక అవతారానికి సింహం, మయూరేశ్వర అవతారానికి నెమలి, ధూమ్రకేతు అవతారానికి గుర్రం, గజానన అవతారానికి ఎలుక వాహనాలుగా ఉన్నట్లు గణేశ పురాణ కథనం. చారిత్రకంగా చూసుకుంటే తొలినాటి వినాయక శిల్పాలలో ఎక్కడా ఎలుక వాహనం కనిపించదు. ఏడో శతాబ్ది తర్వాతి నాటి శిల్పాలలో మాత్రమే వినాయకునితో పాటు ఎలుక వాహనం కనిపిస్తుంది. పురాణాల్లో చూసుకుంటే మత్స్య పురాణంలో వినాయకుని మూషిక వాహన ప్రస్తావన తొలిసారిగా కనిపిస్తుంది. ఎలుకను తామస ప్రవృత్తికి చిహ్నంగా భావిస్తారు. ఎలుకపై స్వారీ చేయడం ద్వారా వినాయకుడు మానవులలోని కామ క్రోధ లోభ మోహాది తామస ప్రవృత్తిని నియంత్రిస్తాడని ప్రతీతి.
వినాయక వ్రతం ఆచరించిన వారు పూజ ముగించిన తర్వాత వినాయకుడి ముందు గుంజీలు తీయడం ఆచారంగా వస్తోంది. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు. బావగారైన శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు. సుదర్శనం, గద తదితర ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి, శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శనచక్రాన్ని తీసుకుని, అమాంతం అప్పడంలా నోట్లో వేసుకుని మింగేశాడు. శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో మరచానేమోనని సుదర్శనం కోసం వెదకడం ప్రారంభిస్తాడు. విష్ణువు వెదుకులాడుతుండటం చూసిన వినాయకుడు ‘మామా! దేనికోసం వెదుకుతున్నావు?’ అని అడిగాడు. ‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరచాను. దాని కోసమే వెదుకుతున్నాను’ అని చెప్పాడు విష్ణువు. ‘ఓహో! సుదర్శనమా! దానిని నేను మింగేశాగా!’ అని నవ్వుతూ అన్నాడు వినాయకుడు. బాలుడైన వినాయకుడిని ఏమీ చేయలేక తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని నానా రకాలుగా బతిమాలుకుంటాడు. గణపతి విష్ణువు బతిమాలుతున్న కొద్దీ నవ్వుతూ అతడిని ఆటపట్టిస్తాడు. అప్పుడు అంతటి మహావిష్ణువు తన కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు. విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో అతడి కడుపున ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువంతటి వాడు వినాయకుడి ముందు గుంజీలు తీయడంతో వినాయక వ్రత పూజ తర్వాత గుంజీలు తీయడం ఆచారంగా మారింది.
వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడని సాధారణంగా తెలిసిన విషయం. అయితే, వినాయకుని జననానికి సంబంధించి పురాణాలలో రకరకాల గాథలు ఉన్నాయి. పార్వతి నలుగు పెట్టుకునేటప్పుడు నలుగుపిండితో వినాయకుడిని రూపొందించినట్లుగా చెబుతున్న గాథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, శివుడే ఇతడిని సృష్టించాడని, పుణ్యక వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి వినాయకుడిని కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుడిని సృష్టించారని, స్వయంభువుగా వెలసిన వినాయకుడిని పార్వతీ పరమేశ్వరులు కనుగొన్నారని... ఇలా రకరకాల గాథలు ఉన్నాయి. వినాయకుడి తమ్ముడు కుమారస్వామి. ఇతడికే కార్తికేయుడని, స్కందుడని కూడా అంటారు. వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని గాథలలోను, అతడికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని మరికొన్ని గాథలలోను ఉంది. శివపురాణం ప్రకారం వినాయకుడికి క్షేమం, లాభం అనే ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారని ప్రతీతి. సనాతన సంప్రదాయంలో ఆరు మతాలు ఉన్నాయి. వీటినే షణ్మతాలు అంటారు. అవి: శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణపత్య స్కంద మతాలు. వీటిలో శైవ వైష్ణవ మతాలు మాత్రమే ఇప్పటికీ ప్రధానంగా ఉనికిలో ఉన్నాయి. శాక్తేయం కొంతవరకు ఉనికిలోల ఉన్నా, ఆరాధన పద్ధతులు చాలావరకు మారాయి. చరిత్రను తరచి చూస్తే క్రీస్తుశకం ఆరో శతాబ్ది వరకు స్కంద ఆరాధన ఎక్కువగా ఉండేది. స్కందుని పూజను వీర పూజ అనేవారు. ఆరో శతాబ్ది తర్వాతి నుంచి వినాయకుని ఆరాధన క్రమంగా పెరిగింది. వినాయకుని ఆరాధనకు ప్రాచుర్యం పెరిగిన తొలినాళ్లలో గాణపత్య మతం ప్రత్యేక మతంగా ఉనికిలో ఉండేది. గాణపత్యాన్ని అవలంబించే వారిలో కొందరు గణపతిని తాంత్రిక పద్ధతుల్లో పూజించేవారు కూడా. ఉచ్చిష్ట గణపతి సాధన వంటి తాంత్రిక ఆరాధనలు అప్పట్లో మొదలై ఉంటాయని చరిత్రకారుల అంచనా. వినాయకుని తొలినాటి శిల్పాలు అఫ్ఘానిస్థాన్‌లో దొరికాయి. ఇవి క్రీస్తుశకం నాలుగో శతాబ్దం నాటివని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉదయగిరి గుహలు, రామగఢ్ కొండ, భుమరా ఆలయంలో కూడా వినాయకుని అతి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇవన్నీ గుప్తుల కాలం నాటివని, అంటే సుమారు క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటివని చెబుతున్నారు. గణపతిని ప్రధాన దైవంగా ఆరాధించే గాణపత్య మతం క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికి బాగా ప్రాచుర్యంలో ఉండేదని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.
భారత ఉపఖండం నుంచి వినాయకుడు అనతి కాలంలోనే సముద్రాలకు ఆవల ఉన్న పలు ఇతర దేశాలకూ విస్తరించాడు. నౌకా వాణిజ్య సంబంధాల కారణంగా వినాయకుని ఆరాధన విదేశాలకూ పాకింది. చైనాలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే వినాయకుని ఆరాధన ఉండేదనేందుకు అక్కడ దొరికిన గణపతి శిల్పాలే నిదర్శనం. గణపతి ఆరాధన క్రీస్తుశకం ఐదు–ఆరు శతాబ్దాల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినా, దీనికి మూలాలు సింధులోయ నాగరికత కాలంలోనే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇరాన్‌లోని లోరెస్తాన్ ప్రావిన్స్‌లో జరిపిన తవ్వకాల్లో దొరికిన లోహఫలకంపై గణపతిని పోలిన ఆకారం ఉండటంతో గజాననుడి ఆరాధనకు మూలాలు క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల కిందటే ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వైదిక సాహిత్యాన్ని తీసుకుంటే రుగ్వేదంలో వినాయకుని ప్రస్తావన ‘బ్రాహ్మణస్పతి’ అనే పేరిట కనిపిస్తుంది. కృష్ణ యజుర్వేదంలోను, తైత్తరీయ అరణ్యకంలోను కూడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వమే ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు కూడా గణపతి ఆరాధనను స్వీకరించాయి. ఈ మతాలు వ్యాపించిన దేశాల్లో కూడా గణపతి ఆరాధన విభిన్నమైన విలక్షణమైన పద్ధతుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. హేరంబ రూపంలోని వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. హేరంబుని వాహనం సింహం. నేపాల్, టిబెట్‌లలో నృత్యముద్రలో ఉన్న గణపతిని కూడా ఆరాధించేవారు. శ్రీలంక, బర్మా, చైనా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా దేశాల్లో కూడా వినాయకుడు విలక్షణ రూపాల్లో కనిపిస్తాడు. జైన గ్రంథాలలో వినాయకుని ప్రస్తావన లేకున్నా, జైనులు మాత్రం వినాయకుడిని ఆరాధిస్తారు. జైనులు తమ సంప్రదాయంలో గణేశునికి కొన్ని కుబేరుని లక్షణాలను ఆపాదించినట్లు కనిపిస్తుంది. బౌద్ధ గ్రంథాలలో అక్కడక్కడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది.
– పన్యాల జగన్నాథదాసు
శ్వేతార్క గణపతి
అపురూపమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్కమూలం చాలా విశిష్టమైనది. శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. దీనిని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. అరుదుగా ఒక్కొక్కసారి శ్వేతార్కమూలం గణపతి ఆకారంలో లభిస్తూ ఉంటుంది. అది మరింత విశిష్టమైనది. శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కేతు గ్రహ దోషాలు, వాటి వల్ల కలిగే అనవసర భయాలు తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, శత్రుబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. ఇంట్లోని దుష్టశక్తులు నశిస్తాయి.
శ్వేతార్క మూలాన్ని ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలసి వచ్చేటప్పుడు సేకరించడం అత్యంత శ్రేష్టం. ఇవన్నీ ఒకేసారి కుదరడం చాలా దుర్లభం. అందువల్ల ఈ మూడింటిలో ఏ రెండు కలసి వచ్చిన రోజునైనా ఉదయం వేళలో శ్వేతార్కమూలాన్ని సేకరించడం మంచిది. శుచిగా స్నానం చేసిన తర్వాత మట్టి నుంచి తవ్వి సేకరించిన శ్వేతార్క మూలాన్ని మంచినీటితో శుభ్రం చేయాలి. తర్వాత దానిని ఇంట్లోని పూజమందిరంలో ఎర్రని వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. శ్వేతార్క గణపతిని పూజించడానికి ఎర్రని పూలు, ఎర్రని అక్షతలు, రక్తచందనం ఉపయోగించాలి.
– పన్యాల జగన్నాథ దాసు
హరిద్ర గణపతి
శ్వేతార్కమూల గణపతి మాదిరిగానే హరిద్ర గణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు. పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అంటారు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. ఏదైనా గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు.
జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షలలో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది. వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్రగణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచినట్లయితే, ఆటంకాలు తొలగి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హరిద్ర గణపతికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి మూల మంత్రాన్ని, గణేశ గాయత్రీ మంతాన్ని పదకొండు సార్లు చొప్పున పఠించాలి. పురోహితులకు శనగలు, పసుపు రంగు వస్త్రాలను ఇతోధిక దక్షిణతో కలిపి దానం చేయాలి. గురువులను తగిన కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి.
– పన్యాల జగన్నాథ దాసు
పారద గణపతి
పాదరసంతో తయారుచేసిన గణపతినే ‘పారద గణపతి’ అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు చేసిన గణపతిని అర్చించడం కూడా గొప్ప ఫలితాలనిస్తుంది. జ్ఞానవృద్ధి, మనోస్థైర్యాల కోసం పారద గణపతి ఆరాధన చక్కని సులభమార్గం. వినాయక చవితిరోజున పూజమందిరంలో చేతి బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మంచిది.
వినాయక చవితినాడు వీలు కాకుంటే ఏదైనా నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున పారద గణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించుకోవడం మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలసి ఉన్న గణపతి రూపాన్ని ఒకేమూర్తిగా తయారు చేయించిన పారద లక్ష్మీగణపతిని పూజించినట్లయితే ఆర్థిక ఇక్కట్లు, ఆటంకాలు తొలగిపోతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో పారద లక్ష్మీగణపతిని పూజించడం వల్ల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారద గణపతిని లేదా పారద లక్ష్మీగణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి.
– పన్యాల జగన్నాథ దాసు
గణపతి సాక్షిగా...
ఆ గణపతి శివభక్తుల అఖండ భక్తికి, శ్రీశైలయాత్రకు తొలిసాక్షి. ఇల కైలాసపు విశేషాలకు ముఖ్య సాక్షి. క్షేత్రానికి వచ్చే జన నానుడిలో శ్రీశైలయాత్ర చేసేవారు ముందుగా సాక్షిగణపతిని దర్శించి క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, ఆయన ఈ యాత్రను నమోదుచేసి తన తండ్రి మల్లికార్జునస్వామివారికి, తల్లి భ్రమరాంబాదేవికి తెలియజేస్తాడని కథనం. అపు‘రూపం’ గణపతి రూపాలలోనే అత్యంత విశిష్టమైన రూపం ఇదని క్షేత్ర మాహాత్మ్యం చెబుతోంది. ఈ రూపం మరే ఇతర గాణాపత్య సాహిత్యంలోను మనకు దొరకదు. ఈ మూర్తి ఆసీన రూపంలో కొలువై వుంటాడు. ప్రసన్న వదనంతో, వక్రతుండంతో, ఎడమచేత పుస్తకాన్ని, కుడిచేత లేఖిని (కలం)ని, మిగిలిన రెండు చేతులతో పాశం, అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. ఓంకార గణపతి ఓనమాలు దిద్దుతూ పుస్తకంపై ఆయన లిఖిస్తున్న ఓనమాలు శివపంచాక్షరీ (ఓం నమశ్శివాయ) మంత్రమే. అక్షరాలను లిఖిస్తూ కనిపిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అధర్వణ వేదం తెలిపింది. ముద్గల పురాణం చెప్పిన 32 గణపతి రూపాలో ద్విజగణపతి రూపానికి, ఈ సాక్షిగణపతి రూపానికి చాలా దగ్గర పోలిక వుంది. అక్కడ కూడా స్వామి పుస్తకం, లేఖిని మొదగు ఆయుధాలతో దర్శనమిస్తాడు. పుస్తకం, లేఖిని అజ్ఞానాన్ని, అవిద్యను నాశనం చేసే ఆయుధాలే. కనుక ఈ గణపతిని పూజిస్తే విద్య లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
మహాభారతం నాటి రూపం
ఐదవ వేదంగా ప్రసిద్ధి పొందిన మహాభారతం రచించింది వేదవ్యాసుడైనా , కొన్ని లక్షల శ్లోకాలను నిరాటంకంగా గణపతి లిఖించాడు. ప్రస్తుతం శ్రీశైలంలోని సాక్షిగణపతి రూపం ఆ లేఖక గణపతిని గుర్తుకు తెస్తుంది. అయితే ఇక్కడ వ్యాసుడు మాత్రం మనకు కనపడడు. శ్రీశైలం యుగయుగాల నాటిదని క్షేత్రపురాణం చెబుతోంది. ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి క్షేత్రానికి వచ్చినట్లు క్షేత్ర మాహాత్మ్యం తెలుపుతోంది.
– డా. ఛాయా కామాక్షీదేవి
No comments:
Post a Comment