Wednesday, 19 September 2018

యయాతి-దేవయాని-శర్మిష్టల కథ

యయాతి-దేవయాని-శర్మిష్టల కథ



యయాతి-దేవయాని-శర్మిష్టల కథలో దేవయాని చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, సాధికారంగా కూడా మాట్లాడుతుంది. శర్మిష్ట చాలా తక్కువగా మాట్లాడుతుంది. వారిరువురి సామాజిక నేపథ్యాలలోనూ, సామాజిక దశలలోనూ ఉన్న తేడాయే అందుకు కారణం. బ్రాహ్మణులు అప్పటికి గణనిర్బంధాలనుంచి బయటపడ్డారు. తమ గణం వెలుపల ఎవరికైనా వారు పురోహితులు కావడం, ఎవరినుంచైనా దక్షిణలు తీసుకోవడం ఇందుకు సూచన అని కోశాంబీ అంటాడు. అలాగే, వృత్తి జీవనులుగా బ్రాహ్మణులకు సంచారజీవనమూ ఎక్కువ. ఆవిధంగా వారు నాలుగు ప్రదేశాలు చూస్తారు, ఎక్కువ లోకజ్ఞానాన్ని పొందుతారు. దేవయాని బ్రాహ్మణకన్య కనుక శర్మిష్టతో పోల్చితే ఆమెకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, తెలివి ఎక్కువ. అవి కలిగించే ఆత్మవిశ్వాసం, అహంకారాల పాలు కూడా ఎక్కువే. శర్మిష్ట అలా కాదు, ఆమె రాచకన్య, తండ్రి చాటు బిడ్డ, గణం కట్టుబాట్లకు బందీ, అవసరమైతే తండ్రి రాజకీయ ప్రయోజనాలకు పావుగా మారక తప్పదు. నగరంలో పుట్టి పెరిగి, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయికీ, పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయికీ ఉన్న తేడా లాంటిదే దేవయానికీ, శర్మిష్టకీ ఉన్న తేడా.

కథలోకి వెడుతున్న కొద్దీ ఈ వ్యత్యాసాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

శుక్రుడు దైత్యదానవ గణాలకు ఆచార్యుడిగా ఉన్నాడు. అతని దగ్గర మృతసంజీవిని అనే విద్య ఉంది. దేవతలతో జరిగే యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను ఆ విద్యతో అతను బతికిస్తున్నాడు. దాంతో దేవతల పక్షంలో చావులూ, ఓటమీ సంభవిస్తున్నాయి. దేవతలు బృహస్పతి కొడుకైన కచుని దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎలాగైనా శుక్రుని  మెప్పించి మృతసంజీవినీ విద్యను సాధించాలని కోరారు. శుక్రునికి, కూతురైన దేవయానిపై మమకారం ఎక్కువ, నువ్వు ఆమె మనసు గెలుచుకుంటే నీ పని తేలికవుతుందని కూడా చెప్పారు. కచుడు అంగీకరించి శుక్రుని దగ్గరకు వెళ్ళాడు. శుక్రుడు అతనిని శిష్యునిగా స్వీకరించడమేకాక, అతనికి ఆతిథ్యం ఇవ్వడం స్వయంగా బృహస్పతికి ఆతిథ్యం ఇవ్వడమే ననుకుని సంతోషించాడు. శత్రువైనాసరే, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనాటి మర్యాద.

శిష్యులు గురువుగారి గోవులను కాచడంతో సహా ఇంటిపనులు చక్కబెట్టడం ఆనాటి గురు-శిష్య సంబంధంలో భాగం. కచుడు ఇంటి పనులు చేస్తూ అటు శుక్రునీ; పువ్వులూ, ఫలాలూ తెస్తూ ఇటు దేవయానినీ మెప్పిస్తూ వచ్చాడు.  కచుడు తమ విరోధులైన దేవతల గురువు బృహస్పతికి కొడుకు కనుక, అతడు ఇలా శుక్రుని ఇంట్లో పాగా వేయడంలో  రాజకీయమైన కుట్రను రాక్షసులు పసిగట్టడం సహజమే. ఓ రోజు కచుడు గోవులను తోలుకుని అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు అతన్ని చంపేసి, మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. కచుడు వెంట లేకుండా గోవులు ఒంటిగా ఇంటికి చేరుకోవడం చూసి, దేవయాని కీడు శంకించింది. అప్పుడు తండ్రితో అన్న మాటలే పై పద్యం.

శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని మృతసంజీవినీ విద్యను కచుని వద్దకు పంపించి అతన్ని బతికించాడు. కచుడు ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. మరోసారి రాక్షసులు అడవిలో కచుణ్ణి పట్టుకుని చంపేసారు. ఈసారి అతన్ని బతికించే అవకాశం ఇవ్వకూడదనుకుని మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, దానిని సురలో కలిపి శుక్రునికి ఇచ్చారు. శుక్రుడు ఆ సురను తాగేశాడు.

కచుడు ఇంటికి రాకపోయేసరికి రాక్షసులే అతన్ని చంపేసి ఉంటారని దేవయాని ఊహించింది. శోకించడం ప్రారంభించింది. అప్పుడు శుక్రుడు, ‘రాక్షసులు అతని మీద పగబట్టారు. ఎలాగైనా అతన్ని చంపేస్తారు. అతనికి ఉత్తమలోకాలు కలుగుతాయి. ఎందుకు దుఃఖించడం?’ అన్నాడు. 

ఆ మాటకు దేవయాని తండ్రిపై తాచులా లేచింది.

‘మహానుభావా, నువ్వూ ధర్మం తెలిసినవాడివే కదా; ఎంతో బుద్ధిశాలి అయిన అంగిరసుని మనవడు, నీకు ఆశ్రితుడు, నీ శిష్యుడు, బృహస్పతికి కొడుకు, అందగాడు, బ్రహ్మచారి అయిన కచుణ్ణి రాక్షసులు అన్యాయంగా చంపేస్తే, నేను దుఃఖించకుండా ఎలా ఉంటాను? అతను నా కంట పడితే తప్ప నేను అన్నం తిన’ నని, ఎత్తిపొడుపూ, ఏడుపూ, మొండితనమూ దట్టిస్తూ తండ్రిపై మాటల మేకులు చెక్కింది.

ఇక్కడ తండ్రీ, కూతుళ్ల మధ్య అనుభవంలోనూ, పరిణతిలోనూ ఉన్న వ్యత్యాసాన్ని పౌరాణికుడు అద్భుతంగా సూచిస్తాడు. కచుని మరణానికి దేవయాని భావోద్వేగంతో స్పందిస్తే; శుక్రుడు రాజకీయ వివేకంతో స్పందిస్తాడు. కచుణ్ణి రాక్షసులు బతకనివ్వరని అతను అప్పటికే గ్రహించాడు. అది రాజకీయంలో భాగం. దాని వెనుక రాక్షసరాజు వృషపర్వుని ఆదేశం తప్పనిసరిగా ఉంటుంది. ఒక హద్దును మించి తను అందులో జోక్యం చేసుకోలేడు. చేసుకోకూడదు కూడా. చేసుకుంటే తన స్థానం ప్రమాదంలో పడడం అలా ఉంచి, నీతి కూడా కాదు. రాక్షసుల గురువుగా వారి రాజకీయ వ్యూహాలకు, ప్రయోజనాలకు తను కలసి రావలసిందే. మరి కచుని శిష్యునిగా ఎలా స్వీకరించాడన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ముందే చెప్పుకున్నాం. శత్రువైనా సరే, దేనినైనా కోరి, అతిథిగా వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదరించడం వ్యక్తిగత స్థాయిలో అనుసరించవలసిన ధర్మమూ, మర్యాదా. అతిథి మర్యాద గురించి ఆ కాలంలో ఉన్న పట్టింపును సూచించే కథలు చాలా ఉన్నాయి. అలాగే, కచునిపై తన కూతురు మనసు పడుతోందనీ శుక్రునికి తెలుసు. అయితే, అది ధర్మబద్ధం కాదనో, లేక పొసగదనో భావన అతనికి ఉన్నట్టు కథాగమనం సూచిస్తుంది.

అయితే, శుక్రునిలో కూతురిపై  ఉన్న మమకారం వీటన్నిటినీ మించినది. అది అతనిలోని రాజకీయ వివేకంతో పోటీపడుతోంది. ఎట్టకేలకు మెత్తబడ్డాడు…

కచుని చూసి కానీ అన్నం ముట్టనని మంకుపట్టు పట్టి అదేపనిగా ఏడుస్తున్న కూతురిని చూసి శుక్రుడు కరిగిపోయాడు. యోగదృష్టితో చూసేసరికి భూమి మీద ఎక్కడా కచుడు కనిపించలేదు. చివరికి తను సేవించిన సురలో బూడిద రూపంలో కచుడు ఉన్నట్టు కనుగొన్నాడు. సురాపానం ఎంత చేటు తెచ్చిందనుకున్నాడు. ఇక నుంచి మద్యపానం ఎవరు చేసినా పాపపు పనుల మీద ఆసక్తితో పతితులైపోతారని శపించాడు. ఆ తర్వాత తన కడుపులో ఉన్న కచుని సంజీవినీ విద్యతో బతికించాడు. అప్పుడు కచుడు, ‘మీ అనుగ్రహం వల్ల దేహాన్నీ, ప్రాణాన్నీ, బలాన్నీ పొందాను. మీ కడుపులోంచి బయటపడే మార్గాన్ని కూడా ఉపదేశించం’ డని శుక్రుని కోరాడు.

శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. నా కడుపును భేదించుకుని కానీ ఇతడు బయటకు రాలేడు, అప్పుడు నా ప్రాణాలు పోతాయి, నేను తిరిగి జీవించాలంటే ఇతనికి సంజీవినిని ఉపదేశించడమే మార్గమనుకున్నాడు. సంజీవినిని ఉపదేశించాడు. తూర్పుకొండ గుహా ముఖం నుంచి ఉదయించిన పూర్ణచంద్రుడిలా కచుడు శుక్రుని కడుపులోంచి బయటకువచ్చాడు. శుక్రుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు కచుడు అతనికి సంజీవినితో ప్రాణం పోశాడు.

కచుని పాత్రను రాజకీయకోణం నుంచి అన్వయించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అతడు రెండు ఉద్దేశాలతో శుక్రుని ఆశ్రయించి ఉండచ్చు. మొదటిది, శత్రురహస్యాలను సంగ్రహించడం. రెండోది, శుక్రుని నుంచి కొన్ని విద్యలు నేర్చుకోవడం. శుక్రునికి రాజనీతి కోవిదుడన్న పేరుంది. శుక్రనీతి ప్రసిద్ధం. అయితే, శుక్రుడు శత్రువుల గురువు. కనుక కచునికి అతని ఆశ్రయం లభించడం అంత సులభం కాదు. ఎంతో యుక్తిని కనబరఛాలి. శత్రువర్గానికి చెందిన కచుని  శిష్యునిగా స్వీకరించడం కూడా శుక్రునికి అలాంటిదే. ఆవిధంగా, కచుని యుక్తికీ; శుక్రుని  జాగ్రత్తకూ ఇక్కడ పోటీ. ఆ పోటీలో  కచుడు నెగ్గాడు. శుక్రుని కడుపులో ఉండి మృతసంజీవినిని ఉపదేశం పొందడం, ఆ తర్వాత శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రావడం, శుక్రుని నుంచి తను నేర్చుకున్న విద్యతోనే తిరిగి అతనికి ప్రాణదానం చేయడం కచుని పైచేయిని చాటతాయి.

దీనినే గురు-శిష్య సంప్రదాయం నుంచి చెప్పుకుంటే, కచుడు గురువును మించిన, లేదా గురువుతో సమానుడైన శిష్యు డయ్యాడు. గురువు మృతుడైనా అతని విద్య శిష్య, ప్రశిష్యుల ద్వారా సంజీవినిగా మారి అతని కీర్తి కాయాన్ని బతికిస్తూనే ఉంటుందన్న ధ్వని కూడా ఇందులో ఉండచ్చు. కచుడు వామనుడి పాత్రను గుర్తుకు తెస్తాడు. వామనుడు కూడా ఇలాగే యుక్తిపరుడు. బలి చక్రవర్తిని మూడడుగుల నేల మాత్రం అడిగి చివరికి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. గణనిర్బంధాలనుంచి బయటపడి నూతన సామాజిక వ్యవస్థకు వేగుచుక్కగా మారిన బ్రాహ్మణులు, ఇతర సామాజికవర్గాలతో పోల్చితే బుద్ధి కుశలతను పెంచుకుంటున్న సంగతిని ఈ రెండు పాత్రలూ ప్రకటిస్తూ ఉండచ్చు.

అదలా ఉంచితే, మృతసంజీవిని పేరిట చనిపోయినవారిని బతికించే విద్య ఏదో  ఉండేదని భావించనవసరం లేదు. అది, కచునిలోని యుక్తిపరుని పైకెత్తడానికి ఉద్దేశించిన ఒక చక్కని పౌరాణిక కల్పన కావచ్చు.

కచుడు శుక్రుని ఇంట అడుగు పెట్టే ముందే వ్యూహరచన జరిగినట్టు పౌరాణికుడు చెప్పనే చెప్పాడు. తను శుక్రుని ఒక్కడినే మెప్పిస్తే చాలదని కచునికి తెలుసు. శుక్రుని అతి పెద్ద బలహీనత అయిన అతని కూతురు దేవయాని మనసునూ గెలుచుకుని, ఆమెను తండ్రిపై ఒడుపుగా ప్రయోగించాలి. అలా రెండు వైపులనుంచీ కచుడు నరుక్కు వచ్చాడు. అతడు కరడుగట్టిన ప్రయోజనవాదిగానూ, శత్రుస్థావరంలోకి అవలీలగా అడుగుపెట్టి, రహస్యాలను కొల్లగొట్టి అజేయంగా తిరిగి రాగలిగిన సుశిక్షితుడైన గూఢచారిలానూ కనిపిస్తాడు. ఏ బలహీనతలకూ లొంగని లక్ష్యశుద్ధి అతనిది. దేవయాని తనపట్ల మనసు పడేలా అద్భుతంగా నటించాడు. తండ్రిని ప్రభావితం చేసి, రాక్షసుల బారినుంచి తనను కాపాడే కవచంలా ఆమెను ఉపయోగించుకున్నాడు. అదే సమయంలో ఆమె ఆకర్షణ వలయంలో తను  చిక్కుకోకుండానూ జాగ్రత్త పడ్డాడు. దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి లేనే లేదు.

ఇందుకు భిన్నంగా దేవయాని కచుని మాయలో పడిపోయింది. శుక్రుడు కూతురి మీద మమకారానికి తలవంచాడు. కచుడు వచ్చిన పని చక్కబెట్టుకుని విజయగర్వంతో స్వస్థలానికి తిరుగు ప్రయణమయ్యాడు. అప్పుడు దేవయాని అతనితో అన్న మాటలే, పై పద్యం.

కచునిలా దేవయాని కూడా తెలివైనదే, గడుసుదే; అయితే ఆ తెలివి అతితెలివి అంచులు తాకుతూ ఉంటుంది. ఆ పైన ఆ తెలివిని కచునిపై మోహం మబ్బులా కమ్మేసింది. ఎక్కడ కాదంటాడో నన్న శంకతో, సంజీవినితోపాటు నన్ను కూడా స్వీకరించు అంటూ, సంజీవినిని కట్నంగా ఎర వేసింది. అది కూడా,  ‘శుక్రుని దయతో’ అనడంలో, తను తండ్రి చాటు బిడ్డననీ, అయితే తండ్రి ఈ పెళ్ళికి కాదనడనీ, ఆయనను ఒప్పించే బాధ్యత తనదనే ధ్వని ఉంది. అంత తెలివిగా మాట్లాడే దేవయాని ఎక్కడ తప్పటడుగు వేసిందంటే, ఒక కచ్చితమైన రాజకీయలక్ష్యంతో వచ్చిన కచుని ఇంగితాన్ని అర్థంచేసుకోలేకపోవడంలో! వ్యక్తిగత ప్రేమకూ, కనికరానికీ తావులేని అతని విశాల రాజకీయ వ్యూహంతో, ఆమె వ్యక్తిగత ఆకాంక్ష పోటీ పడి, ఓడిపోయింది. దేవయాని నిలువునా మోసపోయింది.

ఆమె మాటలు కచునికి ఎంతో విషాదాన్నీ, నొప్పినీ కలిగించాయట. లోకమంతా తప్పు పట్టే మాటలు మాట్లాడడం నీకు తగునా అన్నాడు. నా మనసులో నీకున్నది సోదరి స్థానమే ననేశాడు. ఆ తర్వాత, అంతకంటే ముఖ్యమైన ఒక సత్యాన్ని ప్రస్తావించాడు. గురువులకు శిష్యులు పుత్రులే, ఇదే లోకధర్మం, గురుపుత్రి వైన నువ్వు దీనిని గమనించకుండా మాట్లాడా వన్నాడు. దాంతో హతాశురాలై ఆగ్రహించిన దేవయాని నా కోరికను నువ్వు కాదన్నావు కనుక నీకు సంజీవిని పనిచేయకుండు గాక అని శాపమిచ్చింది. అప్పుడు కచుడు, సంజీవిని నాకు పని చేయకపోయినా నా నుంచి ఉపదేశం పొందిన వారికి పని చేస్తుంది; నువ్వు ధర్మవిరుద్ధమైన ప్రతిపాదన చేశావు కనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్లిచేసుకోడని ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు.

నువ్వు నాకు సోదరివని కచుడు ఇప్పుడు దేవయానితో అన్నా, అంతకాలమూ  ఆమెతో సోదరభావనతో  మెలగలేదని స్పష్టమే. అంటే, తన లక్ష్యానికి ఆమెను పరికరంగా వాడుకుంటూ ఆమెలో లేనిపోని ఆశలు కలిగించాడు. కనుక, గురువులకు శిష్యులు పుత్రులన్న ధర్మం పట్ల అతనికి ఎంత నిబద్ధత ఉందో మనకు తెలియదు. ఏమైనా, తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే తప్ప దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి ఎలాగూ లేదు కనుక అతన్ని పక్కన పెడితే; ఆ పెళ్లి విషయంలో, కథ చెబుతున్న పౌరాణికునికీ, బహుశా శుక్రుడికీ కూడా నిజంగానే అభ్యంతరాలున్నాయి. ఎందుకంటే, తప్పించుకునే ఉద్దేశంతోనే చెప్పినా, కచుడు నిజం చెప్పాడు.

తనను పెళ్లాడమని యయాతిని కోరబోతున్న దేవయాని, అందమైన తన దాసీలను కూడా అతనికి ఎర వేయబోతోంది. అంతేకాదు, తనకు సంతానం ప్రసాదించమని యయాతిని అడగబోతున్న శర్మిష్ట; ‘భార్య, దాసి, కొడుకు అనేవి వారించలేని ధర్మాలు సుమా’ అని అతనికి గుర్తుచేయబోతోంది.


కచుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట అనేకమంది కన్యలను వెంటబెట్టుకుని దేవయానితో కలసి వనవిహారానికి వెళ్లింది. అంతా తమ చీరలు గట్టున పెట్టి ఓ సరస్సులో జలక్రీడలాడారు. అంతలో పెద్ద సుడిగాలి వీచింది. చీరలన్నీ కలసిపోయాయి, గట్టు మీదికి వచ్చి చీర కట్టుకునే తొందరలో శర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది. దాంతో దేవయాని మండిపడింది. ‘లోకోత్తర చరిత్ర కలిగిన శుక్రుని కూతురిని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన బ్రాహ్మణకులంలో పుట్టినదానిని, ఇప్పుడు నువ్వు కట్టి విడిచిన మైల చీర నేను కట్టుకోవాలా?’ అంది.

ఆ మాటకు శర్మిష్ట అహం దెబ్బతింది. ‘నీ తండ్రి మా అయ్య దగ్గర పని చేస్తూ, దీవిస్తూ, ప్రియమైన మాటలు చెబుతూ ఉంటాడు. నీ గొప్పలు నా దగ్గరా, సిగ్గులేకపోతే సరి, నేను కట్టిన చీర నువ్వెందుకు కట్ట కూడదట?!’ అని నిందించి, అంతటితో కోపం తీరక దేవయానిని ఒక నూతిలోకి తోసేసి, కన్యలతో కలసి ఇంటికి వెళ్లిపోయింది.

yayati1

ఆ సమయంలో వేటకు వచ్చిన రాజు యయాతి, ఆ అడవంతా తిరిగి అలసిపోయాడు.  మంచినీళ్లు తాగుదామని దేవయాని పడున్న నూతి దగ్గరకు వచ్చాడు.  లోపలికి తొంగి చూశాడు. కన్నీరు నింపుకుంటూ, ఒక పెద్ద తీగను పట్టుకుని ఉన్న దేవయాని కనిపించింది. ‘నువ్వు ఎవరిదానివి? ఈ నట్టడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?’ అని అడిగాడు. తాము ఎప్పుడూ విహారానికి వచ్చే ఆ అడవికి యయాతి వేటకు రావడం ఇంతకుముందు చూసింది కనుక దేవయాని అతన్ని గుర్తుపట్టింది.  ‘దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను తన సంజీవినీవిద్యతో బతికించే అమితశక్తిమంతుడైన శుక్రుని కూతుర్ని నేను. నా పేరు దేవయాని. పొరపాటున ఈ నూతిలో పడి బయటికి రాలేకపోతున్నాను. నన్ను పైకి లాగి రక్షించు’ అంది. అప్పుడు యయాతి తన కుడి చేతిని ఆమెకు అందించి పైకి తీశాడు. ఆ తర్వాత తన దారిన తను వెళ్లిపోయాడు.

అంతలో ఒక పరిచారిక దేవయానిని వెతుక్కుంటూ వచ్చింది.  దేవయాని ఆమెతో, ‘నేను వృషపర్వుని పురంలోకి  అడుగుపెట్టను. శర్మిష్ట నాకు చేసిన అవమానం గురించి వెళ్ళి నా తండ్రికి చెప్పు’ అని చెప్పి పంపేసింది. సంగతి తెలిసి శుక్రుడు పరుగుపరుగున వచ్చాడు. కోపంతో సుడులు తిరుగుతున్న కళ్ళలో నీరు కుక్కుకుంటున్న కూతుర్ని చూసి అన్నాడు.  ‘వేయి యజ్ఞాలు చేసినవాడి కన్నా కోపం లేనివాడే గొప్పవాడు. ఇతరులు కోపించినా కోపించకుండా, నిందించినా మారు మాట్లాడకుండా, అవమానించినా మన్సులో తలవకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు. బుద్ధిమంతులు కోపాన్ని గొప్ప చేయరు. శర్మిష్ట రాచకూతురు, చిన్నది, దానితో నీకేమిటి, ఇంటికిరా’ అన్నాడు.

‘ఎలాంటివారినీ లక్ష్యపెట్టకుండా హద్దు మీరి నిందించే బుద్ధిలేని వాళ్ళ దగ్గర ఉండడం కన్నా నీచమేముంటుంది, నేనా వృషపర్వుని పురంలోకి రాను, ఇంకెక్కడికైనా పోతాను’ అని దేవయాని భీష్మించింది. ‘సరే, నీ కంటే నాకింకెవరున్నారు, నేనూ నీతోనే వస్తాను, పద’ అని శుక్రుడు అన్నాడు. చారులద్వారా వృషపర్వునికి విషయం తెలిసింది. హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. ‘మీ విద్యాబలంతోనే రాక్షసులు దేవతలను జయించి స్థిరమైన సంపదనూ, ఉద్ధతినీ పొందగలుగుతున్నారు. లేకపోతే, దేవసేనాపతుల దెబ్బకు సముద్రం పాలయ్యేవారే. ఈ సంపదంతా మీది, ఈ రాక్షసులంతా మీ వాళ్ళు’ అని శుక్రునితో అని, దేవయానితో, ‘తల్లీ నీ కేది ఇష్టమో చెప్పు, అది ఇస్తాను’ అన్నాడు. దేవయాని సంతోషించి, ‘అయితే, శర్మిష్టను, ఆమె వెంట ఉండే కన్యలతో సహా నాకు దాసిని చెయ్యి’ అంది. వృషపర్వుడు అంగీకరించి అప్పటికప్పుడు కూతుర్ని అక్కడికి రప్పించి దేవయానికి దాసిగా ఇచ్చేశాడు. శర్మిష్ట మారు మాట్లాడకుండా తండ్రి ఆదేశాన్ని శిరసావహించి, తనతో ఉన్న కన్యలతోపాటు తను కూడా దేవయానికి దాసిగా సేవలు చేయడం ప్రారంభించింది.

శుక్రుడి స్వభావం గురించి కొంత ఇంతకుముందే చెప్పుకున్నాం. అతనికి దేవయాని ప్రవర్తన నచ్చడం లేదు. అయినా ఆమెపై మమకారం అతనిలోని వివేకం పీక నొక్కేస్తోంది. ఇంటికి రానని కూతురు కబురు చేసేసరికి కలవరపడుతూ పరుగు పరుగున ఆమె ఉన్న చోటికి వెళ్ళాడు. ‘కోపం పనికి రాదు, శర్మిష్ట రాచకూతురు, చిన్నపిల్ల, ఆమెతో నీకేమి’ టని చెప్పిచూశాడు. దేవయాని వినలేదు. ‘అయితే, సరే నీతోనే నేనూ’ అన్నాడు. శర్మిష్ట తన కూతురిని అవమానిస్తుందా అనుకుని కూతురిలా అతను  ఆవేశపడలేదు. ఆమె రాచకూతురు అనడంలో అతనిలో తారతమ్యాల స్పృహ ఉంది, చిన్నపిల్ల అనడంలో  పెద్దరికంతోపాటు, ఆమె కూడా తన కూతురిలాంటిదే నన్న వాత్సల్యభావన ఉంది. శర్మిష్టపై శుక్రునికి ఉన్న ఒక ప్రత్యేక ఆదరభావం ముందు ముందు కూడా వ్యక్తం కాబోతోంది.

ఇక్కడ శుక్రుడు-దేవయాని; వృషపర్వుడు-శర్మిష్ట అనే రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య ఉన్న తేడాను గమనించండి. దేవయానిది తండ్రిని శాసించే స్వభావం. శర్మిష్టది తండ్రి శాసనాన్ని మౌనంగా తలదాల్చే స్వభావం. దేవయానికి తండ్రి రాజకీయ అవసరాలమీదా, ఇబ్బందుల మీదా ఖాతరు లేదు. శర్మిష్టకు ఉంది. దేవయానిని నిందించి నూతిలో తోసే సమయంలో ఆ ఖాతరు లేకపోయినా,  ఆ తర్వాత తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో  ఆమెకు అర్థమయ్యుంటుంది.  వృషపర్వుని రాజకీయ అస్తిత్వంలో శుక్రుడు ఒక ముఖ్యమైన భాగం. వృషపర్వుని అస్తిత్వం, మొత్తం రాక్షసుల అస్తిత్వం. తను దూరం ఆలోచించకుండా క్షణికోద్రేకంతో తప్పు చేసింది. ఆ తప్పుకు తండ్రి విధించే శిక్షను కిమ్మనకుండా అనుభవించవలసిందే!

శుక్రుడికి దేవయానిపై ఉన్నంత మమకారమే వృషపర్వునికి శర్మిష్టపై ఉంటుంది. అయినా సరే, రాక్షసుల విశాల అస్తిత్వం కోసం కూతురి సుఖాన్ని బలిచేయడానికి అతను మనసు రాయి చేసుకోక తప్పదు. కూతురి విషయంలో శుక్రుడు ఎక్కడైతే ఓడిపోయాడో  వృషపర్వుడు అక్కడే గెలిచాడు. ఈ  రెండు జతల తండ్రీ-కూతుళ్ల మధ్య తేడా ఇంకా ఎలాంటిదంటే; గణం నిర్బంధాలు, అవసరాలు ఏమీ లేని వైయక్తిక స్వతంత్ర వ్యవహారశైలి శుక్ర-దేవయానులది. గణ నిర్బంధాలు, ప్రయోజనాల పంజరంలో అస్వతంత్రను పాటించక తప్పని స్థితి వృషపర్వ-శర్మిష్టలది. ఒక్క మాటలో చెప్పాలంటే, గణం వెలుపల కూడా జీవించగలిగిన వెసులుబాటు శుక్ర-దేవయానులకు ఉంది. గణం వెలుపల వృషపర్వ-శర్మిష్టలకు జీవితం లేదు.

కథనంలో కవి ఇంకా ఎన్ని మెళకువలు చూపాడో చూడండి…దేవయాని-శర్మిష్టల వైరానికి తక్షణ కారణం, శర్మిష్ట కట్టి విడిచిన చీర దేవయాని కట్టుకోవలసి రావడం. నువ్వు కట్టిన మైల చీర నేను కట్టుకోవాలా అని శర్మిష్టను నిలదీసింది. ఆ సమయంలో కులాహంకారం ఆమెలో ఎంతగా పడగవిప్పి బుసకొట్టిందంటే, భవిష్యత్తులో దానికి ఆమె ప్రతిఫలం చెల్లించుకోవలసి వచ్చింది. నీ మైల చీర నేను కట్టుకోవాలా అని ప్రశ్నించిన దేవయానే ముందు ముందు తను కట్టుకున్న పురుషుని శర్మిష్టతో కలసి పంచుకోబోతోంది. అంటే, శర్మిష్ట ఎంగిలి చేసినదాన్నే తనూ అనుభవించబోతోందన్నమాట.

ప్రకృతి సమవర్తి. అతి ఎక్కడున్నా సహించదు. ఎక్కడో ఒకచోట సమతూకాన్ని స్థాపించి తీరుతుంది.

‘నువ్వెవరివి, ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నా’వని యయాతి అడిగిన సందర్భంలో, పొరపాటున తను నూతిలో పడ్డానని దేవయాని అబద్ధమాడిన సంగతి గమనించండి. దేవయాని గడుసుదనానికి అదొక నిదర్శనం. శర్మిష్ట అనే రాచకూతురు తనను నూతిలోకి తోసిందని చెబితే, యయాతి ఆలోచన ఆమె వైపుకి మళ్లిపోతుంది. బహుశా తనకంటే శర్మిష్ట అందగత్తె, పైగా రాచబిడ్డ.  ఆ సమయంలో ఆమె పేరు తను ఎత్తడమంటే, ఆమెను తనే తీసుకెళ్లి రాజు చేతుల్లో పెట్టడమే. శర్మిష్ట తనను నూతిలోకి తోసేసి వెళ్ళిన తర్వాత, అంతటి అవమానంలోనూ, దుఃఖంలోనూ కూడా దేవయాని బుద్ధి చురుగ్గా పనిచేస్తోందన్న మాట. శర్మిష్ట రాచవైభవాన్నే కాదు; అది తెచ్చిపెట్టే అతిశయాన్నీ, అహంకారాన్ని కూడా దేవయాని ఇప్పుడు దగ్గరగా చూసింది. శర్మిష్టపై ఆమెకు ఆక్షణంలో ఆగ్రహమే కాదు, అసూయ కూడా ఉంది. దానికి తోడు కచుడు తనను నిరాకరించి వెళ్ళిన నేపథ్యం ఉంది. నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడడన్న కచుని శాపం కూడా ఆమె ఆలోచనల్ని వెంటాడుతూ ఉండచ్చు. నూతిలో పడున్న ఆ క్షణాలలోనే శర్మిష్ట చేసిన అవమానమూ, కచుని శాపమూ కలసి రాజును పెళ్లాడాలన్న సంకల్పాన్ని ఆమె బుద్ధిలో బలంగా నాటి ఉండచ్చు. సరిగ్గా ఆ సమయంలోనే  యయాతి రంగప్రవేశం…

కథనంలో ఇలా నన్నయ చూపించిన మెళకువలను చర్చించడం ఈ మొత్తం కథను ఏకరవు పెట్టడానికి మొదటి కారణమైతే, ఇక రెండో కారణానికి వస్తాను. ఈ కారణం మొదటిదానికంటే కీలకమే కాక, అత్యంత ఆసక్తికరం కూడా. పైన వివరించుకున్న కథలోనే కథకుడు పాత్రల స్వభావాలను, కథ తిరగబోయే మలపులను నేరుగా చెప్పకుండా అక్కడక్కడ ధ్వనింపజేశాడనుకున్నాం. విచిత్రమేమిటంటే, ఇంకో కోణం నుంచి చూసినప్పుడు, ఈ మొత్తం కథానిర్మాణమే ఇంకో కథను ధ్వనింపజేస్తోంది! ఆ కథలో నాయిక దేవయాని కాదు, శర్మిష్ట! పై కథను ఓసారి గమనించండి…అది దేవయాని పరంగా చెబుతున్నట్టు మనకు అనిపిస్తుంది. దేవయానే కథానాయికగానూ అనిపిస్తుంది. కానీ కథలో అంతర్లీనంగా ధ్వనించే అసలు కథ వైపు చెవి యొగ్గి జాగ్రత్తగా వినండి. అది శర్మిష్ట పరంగా చెబుతున్న కథ అని మీకు అర్థమవుతుంది.

అవును, నిజం. అతిగా మాట్లాడే దేవయాని ఈ కథలో నాయిక కాదు…మితంగా మాట్లాడే శర్మిష్టే నాయిక!

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న ’అతిశయ రూప లావణ్య సుందరి’ అయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ‘ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు’ అంది.

ఆ వెంటనే, ‘నన్ను నూతిలోంచి  పైకి తీసినప్పుడే ఆ సూర్యుని సాక్షిగా నీ కుడి చేతితో నా చేయిపట్టుకున్నావు. అది నన్ను పెళ్లాడడమే. ఆ సంగతి విస్మరించడం నీకు న్యాయం కాదు’ అని హెచ్చరించింది. ఆపైన, ‘నహుషుని కొడుకువైన  యయాతీ, నన్ను పెళ్లి చేసుకుని ఈ సుందరాంగితోపాటు, దేవకన్యలకు సాటి వచ్చే ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా దేవేంద్రుడిలా ఈ నరలోకంలో అన్ని భోగాలూ అనుభవించు’ అంది. దేవేంద్ర భోగాలు అనుభవించమనడంలో తెలివిగా ‘ఓ నహుషనందనా’ అని సంబోధించింది. నహుషుడు కొంతకాలం ఇంద్రపదవిలో ఉన్నాడు.

01Kach

దేవయాని ప్రతిపాదనకు యయాతి అభ్యంతరం చెప్పాడు. క్షత్రియకన్యలను బ్రాహ్మణులు వివాహం చేసుకోవచ్చు కానీ, బ్రాహ్మణకన్యలను క్షత్రియులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఉందా, వర్ణాశ్రమధర్మాలను కాపాడవలసిన రాజునైన నేనే ధర్మం తప్పితే ప్రపంచం నడక అస్తవ్యస్తమైపోదా అన్నాడు. అప్పుడు దేవయాని, ‘గొప్ప బాహుబలం కలవాడా’ అని అతన్ని సంబోధించి, ‘ధర్మాధర్మాలు నిర్ణయించే లోకపూజ్యుడైన శుక్రుడు ఆదేశిస్తే నన్ను పెళ్లిచేసుకుంటావా?’ అని అడిగింది. ‘బాహుబలం కలవాడా’ అనడంలో, రాజ్యపాలనే నీ బాధ్యత తప్ప ధర్మాధర్మనిర్ణయం కాదు, అది శుక్రుడు చేయవలసిన పని అనే మెత్తని చురక ఉంది. అంతేకాదు, తండ్రిని తను ఒప్పించగలనన్న ధీమా కూడా ఆ మాటల్లో ఉంది.

ఆ మహాముని ధర్మవిరుద్ధం కాదంటే నిన్ను వివాహమాడతానంటూ యయాతి ఆ సంభాషణకు అంతటితో తెర దించాడు. దానిని పొడిగించడం వల్ల అతనికి నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే, అప్పటికే అతను శర్మిష్టవైపు ఆకర్షితుడయ్యాడు. దేవయాని ఆమెను తన దాసిగా పరిచయం చేసింది కనుక, ఆమెను నేరుగా తను పొందగల అవకాశం లేదు. దేవయానిని తను పెళ్లిచేసుకుంటేనే శర్మిష్ట తన దవుతుంది. బహుశా నేరుగా ఆమెను తను స్వీకరించడానికి సామాజిక స్థాయికీ, హోదాకూ చెందిన అభ్యంతరాలు కూడా ఉండి ఉండచ్చు. దేవయాని మాట నేర్పు, స్వభావం అప్పటికే అతనికి అర్థమయ్యాయి. ఆమె తనతో పెళ్ళికి తండ్రిని ఒప్పించగలదన్న నమ్మకమూ అతనికి కలిగి ఉంటుంది. దేవయానితో పెళ్ళికి అంగీకరిస్తేనే శర్మిష్ట  తనకు దక్కుతుంది కనుక దేవయానితో తన పెళ్లి ధర్మమా, కాదా అన్న చర్చ తనకు అనవసరం. అది తేల్చే బాధ్యత దేవయాని తీసుకుంది.

జాగ్రత్తగా గమనించండి…యయాతి దేవయాని పట్ల ఆకర్షితుడు కాలేదు. ఇంతకుముందు ఆమెను నూతి లోంచి పైకి తీసిన తర్వాత అతను తన దారిన తను వెళ్లిపోయాడని చెప్పడం ద్వారా కథకుడు ఆ సూచన చేయనే చేశాడు. ప్రస్తుత సందర్భంలో, ‘అతిశయ రూపలావణ్యసుందరి’ అయిన శర్మిష్ట గురించి తెలుసుకో గోరాడని అనడం ద్వారా ఆమె వైపు అతను ఆకర్షితుడయ్యాడన్న సూచన అంతకంటే స్పష్టంగా ఇచ్చాడు.

దేవయాని, యయాతి ల మధ్య నడిచినది ఒకవిధమైన మైండ్ గేమ్. ఇద్దరిలోనూ లౌక్యమూ, గడుసుదనమూ ఉన్నాయి. ఇద్దరికీ తమవైన వ్యూహాలు ఉన్నాయి. దేవయానికి రాజును పెళ్లాడడం ముఖ్యం. తద్వారా లభించే రాచవైభవం ఆమెకు కావాలి. యయాతికి రూపలావణ్య సుందరి అయిన శర్మిష్ట కావాలి. శర్మిష్ట మనసులో ఆ క్షణంలో ఎటువంటి ఆలోచనలు చెలరేగాయో మనకు తెలియదు. అప్పటికామె ఎటు వంచితే అటు వంగవలసిన మైనపు బొమ్మ!

దేవయాని అప్పటికప్పుడు తండ్రిని రప్పించింది. ‘ఈ రాజు ఇప్పటికే నా పాణిగ్రహణం చేశాడు కనుక వివాహ సంబంధంగా ఇంకొకరు నా చేయి పట్టుకోవడం ఎలా ధర్మమవుతుంది? కనుక ఈ జన్మలో ఇతడే నా భర్త. నువ్వు ఒప్పుకుంటే నన్ను పెళ్లాడతానని ఇతడు కూడా మాట ఇచ్చాడు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడు’ అని తండ్రితో అంది. గమనించండి…దేవయాని ఈ పెళ్లి ధర్మబద్ధమో, కాదో చెప్పమని అడగలేదు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడమని మాత్రమే అడిగింది. అంటే తన terms and conditions ను స్పష్టంగా నిర్దేశించిందన్నమాట. శుక్రుడు వాటిని దాటి మాట్లాడే ప్రశ్నే లేదు. ఈ వివాహంలో ఎలాంటి ధర్మోల్లంఘనా లేదన్న ఒకే ఒక వాక్యంతో ఆమోదం తెలిపేశాడు. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.

ఆ తర్వాత శుక్రుడు శర్మిష్టను యయాతికి చూపించి, ’ఈమె వృషపర్వుని కూతురు. ప్రేమతో ఈమెకు అన్నపానాలు, వస్త్రాభరణాలు, సుగంధలేపనాలు వగైరాలు సమకూర్చి సంతోషపెట్టు. అయితే ఈమెతో నువ్వు పడక సుఖానికి మాత్రం దూరంగా ఉండాలి’ అన్నాడు. యయాతి శుక్రుని వద్ద సెలవు తీసుకుని దేవయానినీ, శర్మిష్టతో సహా దాసీకన్యలనూ  వెంటబెట్టుకుని రాజధానికి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఒక చక్కని మేడలో దేవయానిని ఉంచి; ఆమె అనుమతితో శర్మిష్టనూ మిగిలిన కన్యలనూ అశోకవనం సమీపంలోని ఒక గృహం లో ఉంచాడు.

యయాతితో శుక్రుడు అన్న పై మాటలు అతని స్వభావాన్నీ, దేవయాని స్వభావాన్నీ కూడా మరోసారి వెల్లడిస్తున్నాయి. దేవయానిలో అహమూ, అసూయే కాక; అవకాశవాదమూ, స్వార్థమూ కూడా హెచ్చుపాళ్లలోనే ఉన్నాయి. యయాతిని తనతో పెళ్ళికి ఒప్పించే ముందు; శర్మిష్టనూ, మిగిలిన దాసీ కన్యలనూ చూపించి దేవతాస్త్రీలకు సాటివచ్చే ఈ సుందరాంగులందరూ నిన్ను సుఖపెడతారని ఆశపెట్టింది. తీరా యయాతి పెళ్ళికి ఒప్పుకున్నాక మాట మార్చింది. యయాతిని శర్మిష్టతో కలసి పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆ మాట యయాతితో తను నేరుగా చెప్పకుండా తండ్రితో చెప్పించింది. తండ్రి ఆదేశాన్ని ఉల్లంఘించే సాహసం యయాతి చేయడని ఆమె ధీమా.

శుక్రుడు కూతురి అభిమతాన్ని కాదనే ప్రసక్తే లేదు కనుక, శర్మిష్టను పడక సుఖానికి  మాత్రం దూరంగా ఉంచమని యయాతికి ప్రత్యేకించి చెప్పాడు. అయితే, వృషపర్వుని కూతురైన ఈమెకు అన్నీ సమకూర్చి సంతోషపెట్టు అని కూడా అంతే ప్రత్యేకంగా చెప్పాడు. అలా చెప్పడంలో శర్మిష్టపై అతనికున్న పుత్రికావాత్సల్యమూ, సుకుమారంగా సుఖాల మధ్య పెరిగిన ఆమెను కష్టపెట్టవద్దని చెప్పే ఔదార్యమూ, ధార్మికతా వ్యక్తమవుతూ ఉండచ్చు.

ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, శర్మిష్టకు అన్ని వసతులూ కల్పించి పడక సుఖానికి మాత్రం దూరంగా ఉంచమని శుక్రుడు చెప్పడంలో, ఆమెనుంచి పడక సుఖం కూడా పొందమన్న ధ్వని ఉండడానికీ అవకాశముంది. దాని గురించి వివరించుకోవడం ప్రారంభిస్తే, ఆ వివరణ ఇంతకుముందు చెప్పినట్టు, దేవయాని పరంగా చెప్పిన కథను శర్మిష్ట పరంగా మార్చివేస్తుంది. శర్మిష్టనే కథానాయికగా మనముందుకు తీసుకొస్తుంది.

ఎలాగంటే, యయాతికి శర్మిష్టను చేపట్టడమే ప్రధాన లక్ష్యం. అందులో వ్యక్తిగత ఆకాంక్షే కాక, రాజకీయ అవసరం కూడా ఉండచ్చు. తను రాజు కనుక రాచకన్యద్వారానే వారసుని కనవలసి ఉంటుంది.  అప్పుడే దానికి సమాజం నుంచి హర్షామోదాలు లభిస్తాయి. దేవయానికి కలిగే సంతానానికి సమాజం ఆ ప్రతిపత్తి ఇవ్వదు. వారసుని ఎంపికలో ఆనాటి రాజుకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదు. అది సమాజమూ, రాజూ కలసి తీసుకోవలసిన సమష్టి నిర్ణయం. యయాతికీ, శుక్రుడికీ కూడా ఆ అవగాహన ఉంది. అయితే, ఇక్కడ మధ్యలో దేవయాని ఉంది. ఇంతవరకు శుక్రుడికి నెత్తి మీద దేవతగా ఉన్న దేవయాని ఇకముందు యయాతికి చిక్కుముడిగా మారబోతోంది. బహుశా యయాతి-శర్మిష్టల మధ్య కలగబోయే సంబంధం శుక్రుని ఊహలో ముందే ఉండి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే, అందుకు సంబంధించిన రాజకీయ ప్రణాళికలో శుక్రుడు కూడా భాగస్వామి అయుండచ్చు.

కూతురిపై అపరిమిత మమకారం ఉన్న శుక్రుడు ఆమె కాపురంలో చిచ్చు పెట్టే పాత్ర నిర్వహించాడంటే వినడానికి విడ్డూరంగానూ, విపరీతంగానూ ఉండే మాట నిజమే. అయితే, కాసేపు దేవయాని పరంగా చెప్పిన కథ అన్న సంగతి మరచిపోయి శర్మిష్ట పరంగా చెప్పిన కథగా ఊహించుకోండి. యయాతి అసలు శర్మిష్టనే చేపట్టాలనుకున్నాడు. అయితే, ఆమె దేవయానికి అప్పటికే దాసిగా మారిపోయింది కనుక యజమానురాలిని పెళ్లాడితేనే శర్మిష్ట తనకు దక్కుతుంది. యయాతి వైపునుంచి ఈ మొత్తం వ్యూహానికి సంబంధించిన అవగాహన లోకజ్ఞుడైన శుక్రుడికి పూర్తిగా ఉంది. దేవయానికి లేదు. ఎందుకంటే, ఆమెది పూర్తిగా వైయక్తికమైన అజెండా. అందులో ఇతరేతర అంశాలకు చోటులేదు.

  అసలు శర్మిష్ట కథను దేవయాని వైపునుంచి కథకుడు ఎందుకు చెప్పినట్టు? రెండు కారణాలను ఊహించవచ్చు. మొదటిది, దాసిగా ఉన్న శర్మిష్టను రాజమార్గంలో చేపట్టడానికి యయాతికి అవకాశంలేదు. అందుకు సామాజిక నిర్బంధాలు అడ్డువస్తాయి. రెండవది, కథకుడికి దేవయానిని ప్రధానం చేసి కథ చెప్పడమే ఇష్టం. ఎందుకంటే, ఆమె భృగువంశీకురాలు. కోశాంబీ ప్రకారం మహాభారత పరిష్కరణలో భృగులు ప్రధాన భూమిక పోషించారు. భృగులను విశిష్టులుగా చిత్రించే ఘట్టాలు మహాభారతంలో చాలా ఉన్నాయి. పరశురాముడు ఇంకో ఉదాహరణ. 
కథలోకి వస్తే, ‘దేవయాని అనుమతి’తో శర్మిష్టను ఇతర దాసీ కన్యలతోపాటు యయాతి అశోకవన సమీపంలో ఒక గృహంలో ఉంచాడని కథకుడు చెబుతున్నాడు. ఆ సమాచారంతో యయాతి-శర్మిష్టల మధ్య జరగబోయే సమాగమాన్ని  సూచిస్తున్నాడు. అంటే, ఎంత దేవయాని వైపునుంచి కథ చెప్పినా కథకుడు శర్మిష్ట ప్రాధాన్యాన్ని కప్పిపుచ్చలేకపోతున్నాడన్నమాట!  అదలా ఉంచితే, ‘దేవయాని అనుమతితో’ శర్మిష్టను (తను తరచు విహరించే) అశోకవన సమీపంలో ఉంచాడని చెప్పడం  ద్వారా, అనేకమందితో రహస్య ప్రణయాలు సాగిస్తూ, భార్యపట్ల అతి విధేయతను ప్రదర్శించే దక్షిణనాయకుడిగా యయాతిని కథకుడు మన ముందుకు తెస్తున్నాడు.

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది. ఏ ఆడదైనా కోరుకునేది భర్తనూ, కొడుకులనూ పొందాలనే, ఆ రెండూ దక్కిన దేవయాని అదృష్టమే అదృష్ట మనుకుంటోంది.

యయాతి తొలిసారి తనను చూసినప్పుడే ఆ చూపుల్లో తన మీద ఉట్టిపడుతున్న ఇష్టాన్ని శర్మిష్ట పోల్చుకుని ఉంటుంది. అప్పుడే నిశ్శబ్దంగా తన హృదయంలో అతనిని నిలుపుకుని ఉంటుంది.  అతనిమీదే నా హృదయం ఎప్పుడూ లగ్నమై ఉంటుందని ఇప్పుడు కూడా అనుకుంటున్న శర్మిష్ట, ‘నన్నీతడు గరము  కారుణ్యమున  బ్రీతి గలయట్ల జూచు…’ ననుకుంది.

సామాజిక స్థాయీ భేదాలు మానవసంబంధాలలోనే కాక; వాటి వ్యక్తీకరణకు ఉపయోగించే మాటల్లో కూడా తేడా ఎలా తీసుకొస్తాయో పౌరాణికుడు ఇక్కడ అలవోకగా సూచిస్తున్నాడు. యజమాని ఒక దాసిపై  చూపించే అనురక్తిని ప్రేమ అనో, అనురాగమనో అనకూడదు; కారుణ్యం అనాలి. దాసి కూడా యజమాని నుంచి కారుణ్యాన్ని మాత్రమే ఆశిస్తుంది. పై వాక్యం శర్మిష్ట దాసిత్వాన్నే కాక ప్రస్తుత సందర్భంలో ఆమె దయనీయతను కూడా వెల్లడిస్తోంది.

దేవయానిలానే నేను కూడా ఇతనినే భర్తను చేసుకుంటానని శర్మిష్ట అనుకుంది. సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’ అంది.

‘పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు.

‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.

 శర్మిష్టకు శరీరంతో మాట్లాడే భాషే కాదు, దానికి కావలసినవి సాధించుకునే తర్కమూ తెలుసు. అందుకు అవసరమైన పాండిత్యమూ ఆమెకు ఉంది. మగవాడి బలహీనతపై ఒడుపుగా గురిచూసి కొట్టి లొంగదీసుకునే నేర్పూ ఉంది. ప్రకృతి ప్రతి ప్రాణికీ ఆయాచితంగా ప్రసాదించిన నేర్పు అది. ప్రకృతి సిద్ధమైన ఆమె బలవత్తర వాంఛ ఆ క్షణంలో దేవయానిపట్ల భీతిని కూడా జయించింది.

శర్మిష్టకు కొడుకు పుట్టాడు. పేరు, దృహ్యువు. దేవయాని ఆశ్చర్యపోయింది.  ‘చిన్నదానివైనా మంచి వినయశీలాలతోనూ, గౌరవంగానూ, మనోవికారాలకు దూరంగానూ ఉంటున్న ఈ పరిస్థితిలో నీకు కొడుకు ఎలా పుట్టాడు? చాలా ఆశ్చర్యంగా ఉందే!’ అంది.

శర్మిష్ట సిగ్గుపడుతూ తలవంచుకుని, ‘ఎక్కడినుంచో ఒక మహాముని, వేదవేదాంగపారగుడు వచ్చి ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకును ప్రసాదించాడు’ అంది.

దేవయాని (ఏమీ మాట్లాడకుండా) తన నివాసానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత శర్మిష్టకు వరసగా అనువు, పూరువు అనే మరో ఇద్దరు కొడుకులు కలిగారు.

దేవయానికి శర్మిష్టలో హఠాత్తుగా వినయశీలాలు, గౌరవనీయత కనిపించడం విశేషం. దానినలా ఉంచితే, శర్మిష్ట సమాధానం గమనించండి…ఎవరో మహాముని వచ్చి, ఋతుమతి నై ఉన్న నన్ను చూసి కొడుకునిచ్చా’ డని చెబుతోంది. పైన రాజుల భార్యల విషయంలో చెప్పుకున్నదే ఇక్కడా వర్తిస్తుంది.  శర్మిష్ట ఋతుకాలం లో ఉన్నప్పుడే ఆ ‘మహాముని’ ఆమెకు కొడుకునిచ్చి వెళ్ళాడు. అది అబద్ధమైనా, అది వెల్లడిస్తున్న ఆనవాయితీ అబద్ధం కాదు. ఆ ఆనవాయితీ దేవయానికి కూడా తెలుసు. అందుకే శర్మిష్ట అలా చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్లిపోయింది. నిజానికి ‘నీకు కొడుకు ఎలా పుట్టా’ డన్నదే దేవయాని ప్రశ్న అయుంటుంది. యయాతి వల్ల కలిగాడా అన్నది తేల్చుకోవడమే ఆమెకు కావాలి.  యయాతి వల్ల కాకుండా, ఇంకెవరి వల్ల శర్మిష్టకు కొడుకు పుట్టినా దేవయానికి అభ్యంతరం లేదు, అందులో ఆశ్చర్యమూ లేదు.

ఇక, ఆమె ప్రశ్నలోని మిగతా భాగమంతా కథకుని కల్పన. ఎందుకంటే, ఋతుకాల ప్రాధాన్యాన్ని వెల్లడించే ఆ ఆనవాయితీ చర్చలోకి రాకూడదు. అందుకే, దేవయాని నోట తన మాటలు పలికిస్తూ ఆ ఆనవాయితీపై  కథకుడు ముసుగు కప్పుతున్నాడు. కారణం ఇంతకుముందు చెప్పుకున్నదే:  ఆ ఆనవాయితీ గురించి తెలియని వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు అతడు కథ చెబుతున్నాడు. లేదా, తనే ఆ ఆనవాయితీని సరిగా పోల్చుకోలేకపోయీ ఉండచ్చు.

శర్మిష్ట కొడుకులు ముగ్గురూ, ఒంటి మీద ఆభరణాలు లేకపోయినా సహజకాంతితో మూడు అగ్నుల్లా ప్రకాశిస్తూ తన ముందు ఆడుకుంటుండగా వినోదిస్తున్న యయాతి దగ్గరికి; శర్మిష్టనూ, ఇతర దాసీ కన్యలనూ వెంటబెట్టుకుని వైభవం చాటుకుంటూ శచీదేవిలా దేవయాని వచ్చింది. తేజస్సు ఉట్టిపడుతుండగా, యయాతి ప్రతిబింబాల్లా ఉన్న ఆ ముగ్గురినీ చూసి ‘ఈ పిల్ల లెవ’ రని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పలేదు. ‘మీ తల్లిదండ్రు లెవ’ రని ఆ పిల్లలనే అడిగింది. వారు లేత చూపుడు వేళ్ళతో యయాతినీ, శర్మిష్టనూ చూపించారు.

తనకు తెలియకుండా యయాతి శర్మిష్టవల్ల సంతానం పొందాడని దేవయానికి తెలిసిపోయింది. కోపమూ, దుఃఖమూ ఆమెను ముంచెత్తాయి. ఈ ‘దానవి’తో సంబంధం పెట్టుకుని యయాతి తనను నిలువునా వంచించాడనుకుంది. తక్షణమే పుట్టింటికి వెళ్ళి, తండ్రి పాదాలమీద పడి దీర్ఘనేత్రాలనుంచి ఉబికివచ్చే జలధారలతో వాటిని కడిగింది.

యయాతి కూడా బతిమాలుతూ దేవయాని వెంటే వెళ్ళి శుక్రుని దర్శించి నమస్కరించాడు.  ‘ధర్మం తప్పి ఈ రాజు రాక్షస పద్ధతిలో ఆ రాక్షసిమీద అనురక్తుడై ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. నన్ను అవమానించాడు’ అని దేవయాని గద్గదస్వరంతో అంది. శుక్రునికి కోపం వచ్చింది. ‘యవ్వన గర్వంతో కళ్ళు మూసుకుపోయి నా కూతురికి అప్రియం చేశావు కనుక నువ్వు వృద్ధాప్యభారంతో కుంగిపోతావు’ అని యయాతికి శాపమిచ్చాడు.

అప్పుడు, ‘ఋతుమతియైన భార్య కొడుకునిమ్మని భర్తను కోరినప్పుడు అతడు నిరాకరించి ఋతువిఫలత్వం చేస్తే భ్రూణహత్యా పాపం సంభవిస్తుందని పెద్దలు చెప్పలేదా, దానికి భయపడే ఆ మానవతి కోరిక తీర్చాను, ఇందుకు ఆగ్రహించడం న్యాయమా’ అని యయాతి ప్రశ్నించాడు. ఆ వెంటనే గడుసుగా, కూతురిపై శుక్రునికి ఉన్న మమకారానికి గురి పెడుతూ, ‘ఈ దేవయానిపై నాకింకా కోరిక తీరలేదు. ఇప్పుడే వృద్ధాప్యాన్ని ఎలా భరించను?’ అన్నాడు. ఆ మాటకు శుక్రుడు మెత్తబడ్డాడు. ‘అలా అయితే నీ వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఒకరికిచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో. విషయసుఖాలతో తృప్తి చెందిన తర్వాత తిరిగి వాడి యవ్వనాన్ని వాడికి ఇచ్చేసి, నీ వృద్ధాప్యాన్ని తిరిగి పుచ్చుకో. ఇంకో విషయం, నీ వృద్ధాప్యాన్ని తీసుకున్నవాడే నీ రాజ్యానికి అర్హుడు, వంశకర్త అవుతాడు’ అన్నాడు.








No comments:

Post a Comment