తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం. శంఖనిధి, పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమ వైపున అంటే దక్షిన దిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి, ఇలాగే కుడి ప్రక్కన అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత పేరు పద్మనిధి. శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించి ఉంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.
ఇంతకూ వీరు ఎక్కడ ఉన్నారంటారా! తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలే సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించే ముందు మనం మన కాళ్ళను ప్రక్షాళన చేసుకునే దగ్గర శ్రీవారి ఆలయం గడపకు ఇరు ప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.
ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధి దేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు.
ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది.
ఇంతకు ముందు వీరిని మీరు గమనించి వుండకపోతే ఈసారి శ్రీవారి దర్శనంకు వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.
No comments:
Post a Comment