Wednesday, 18 November 2015

మన్వంతరము





మన్వంతరము

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.


మన్వంతరాల పేర్లు

  1. స్వాయంభువ మన్వంతరము
  2. స్వారోచిష మన్వంతరము
  3. ఉత్తమ మన్వంతరము
  4. తామస మన్వంతరము
  5. రైవత మన్వంతరము
  6. చాక్షుష మన్వంతరము
  7. వైవస్వత మన్వంతరము
  8. సూర్యసావర్ణి మన్వంతరము
  9. దక్షసావర్ణి మన్వంతరము
  10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
  11. ధర్మసావర్ణి మన్వంతరము
  12. భద్రసావర్ణి మన్వంతరము
  13. దేవసావర్ణి మన్వంతరము
  14. ఇంద్రసావర్ణి మన్వంతరము

ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక రాత్రి 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక దివారాత్రము (ఒక రోజు) 864,00,00,000 2,40,00,000
బ్రహ్మకు ఒక సంవత్సరము 311040,00,00,000 864,00,00,000

ముఖ్య సంఘటనలు

స్వాయంభువ మన్వంతరము
మనువు – స్వాయంభువు.
భగవంతుని అవతారాలు – కపిలుడు, యజ్ఞుడు – దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది వడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.
మనుపుత్రులు – ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు
సప్తర్షులు – మరీచి ప్రముఖులు
ఇంద్రుడు – యజ్ఞుడు
సురలు – యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము

స్వారోచిష మన్వంతరము
మనువు – అగ్ని కొడుకు స్వారోచిషుడు.
మనువు పుత్రులు – ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు
భగవంతుని అవతారాలు – విభువు – వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు – ఊర్జస్తంభాదులు
ఇంద్రుడు – రోచనుడు
సురలు – తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము

ఉత్తమ మన్వంతరము
మనువు – ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
మనువు పుత్రులు – భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు – సత్య సేనుడు – ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు – ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
ఇంద్రుడు – సత్యజితుడు
సురలు – సత్యదేవ శృతభద్రులు

తామస మన్వంతరము
మనువు – ఉత్తముని సోదరుడు తామసుడు.
మనువు పుత్రులు – వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు – హరి – హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు – జ్యోతిర్వ్యోమాదులు
ఇంద్రుడు – త్రిశిఖుడు
సురలు – విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు

రైవత మన్వంతరము
మనువు – తామసుని సోదరుడు రైవతుడు
మనువు పుత్రులు – అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు – వైకుంఠుడు – శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు – హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
ఇంద్రుడు – విభుడు
సురలు – భూత దయాదులు

చాక్షుష మన్వంతరము
మనువు – చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
మనువు పుత్రులు – పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు – అజితుడు, కూర్మావతారం – వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
సప్తర్షులు – హవిష్మ దీరకాదులు
ఇంద్రుడు – మంత్రద్యుమ్నుడు
సురలు – ఆప్యాదులు

వైవస్వత మన్వంతరము
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
మనువు – వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు – ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
భగవంతుని అవతారాలు – కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు – కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు – పురందరుడు
సురలు – వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు

(సూర్య) సావర్ణి మన్వంతరము
రాబోయే మన్వంతరము
మనువు – సావర్ణి – విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
మనువు పుత్రులు – నిర్మోహ విరజస్కాదులు
భగవంతుని అవతారాలు – సార్వభౌముడు – వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
సప్తర్షులు – గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, ఋష్యశృంగుడు, బాదరాయణుడు (వీరందరూ ఇప్పుడు ఆత్మయోగనిష్ఠులై తమతమ ఆశ్రమాలలో ఉన్నారు)
ఇంద్రుడు – విరోచన సుతుడైన బలి
సురలు – సుతపసులు, విజులు, అమృత ప్రభులు

దక్షసావర్ణి మన్వంతరము
మనువు – వరుణుని పుత్రుడు దక్ష సావర్ణి
మనువు పుత్రులు – ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
భగవంతుని అవతారాలు – (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
సప్తర్షులు – ద్యుతిమంతాదులు
ఇంద్రుడు – అద్భుతుడు
సురలు – పరమరీచి గర్గాదులు

బ్రహ్మసావర్ణి మన్వంతరము
మనువు – ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు – భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
సప్తర్షులు – హవిష్మంతుడు మున్నగువారు
ఇంద్రుడు – శంభుడు
సురలు – విభుదాదులు

ధర్మసావర్ణి మన్వంతరము
మనువు – ధర్మసావర్ణి
మనువు పుత్రులు – సత్య ధర్మాదులు పదిమంది.
భగవంతుని అవతారాలు – సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
సప్తర్షులు – అరుణాదులు
ఇంద్రుడు – వైధృతుడు
సురలు – విహంగమాదులు

భద్రసావర్ణి మన్వంతరము
మనువు – భద్ర సావర్ణి
మనువు పుత్రులు – దేవసుతాదులు
భగవంతుని అవతారాలు – సత్య తాపసుడు – సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
సప్తర్షులు – తపోమూర్త్యాదులు
ఇంద్రుడు – ఋతధాముడు
సురలు – పరితారులు

దేవసావర్ణి మన్వంతరము
మనువు – దేవసావర్ణి
మనువు పుత్రులు – విచిత్ర సేనాదులు
భగవంతుని అవతారాలు – దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
సప్తర్షులు – నిర్మోహ తత్వదర్శనాదులు
ఇంద్రుడు – దివస్పతి
సురలు – సుకర్మాదులు

ఇంద్రసావర్ణి మన్వంతరము
మనువు – ఇంద్ర సావర్ణి
మనువు పుత్రులు – గంభీరాదులు
భగవంతుని అవతారాలు – సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
సప్తర్షులు – అగ్నిబాహ్యాదులు
ఇంద్రుడు – శుచి
సురలు – పవిత్రాదులు

చతుర్యుగాలు

హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగముగా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.
యుగాలు, మహా యుగము
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.

యుగాదులు
కృత యుగాది – కార్తీక శుద్ధ నవమి
త్రేతా యుగాది – వైశాఖ శుద్ధ తదియ
ద్వాపర యుగాది – మాఘ బహుళ అమావాస్య
కలి యుగాది – భాద్రపద బహుళ త్రయోదశి

యుగాల మధ్య జరిగిన ఒక కథ
భాగవతం ఏకాదశ స్కందము నుండి: ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో – సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, “నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణ వాఙ్మయం ఆవిర్భావం
“పురాణ” శబ్దానికి “పూర్వ కాల కథా విశేషం” అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరాళ వేళలలో ఇష్ట కధా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కధలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కధాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది

వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. “అ” నుండి “హ” వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ ‘అ’కార, ‘ఉ’కార ‘మ’కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి
పురాణం లక్షణాలు
ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం
సర్గశ్చప్రతిసర్గశ్చ వంశః మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం
సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.
సర్గము – సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
ప్రతి సర్గము – సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
వంశము – పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
మన్వంతరము – ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
వంశాలచరిత్ర
భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:
అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కధనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.

పురాణాల విభజన
పురాణాల పేర్లు చెప్పే శ్లోకం
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్కా — స్కాంద పురాణం

అష్టాదశ పురాణములలో శ్లోకాలు
బ్రహ్మ పురాణం – బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
పద్మ పురాణం – బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం – పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం – వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణం – నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
గరుడ పురాణం – విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
నారద పురాణం – నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం – భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
స్కంద పురాణం – కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం – శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం – వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం – పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
వామన పురాణం – బ్రహ్మదేవుని రచన – 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం – శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం – శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం – శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం – బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.


దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.
వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే


ఇలాంటిదే మరొక శ్లోకం
బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

వైష్ణవ పురాణాలు – సాత్విక గుణాన్ని
బ్రహ్మ పురాణాలు – రాజస గుణాన్ని
శైవ పురాణాలు – తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం


ఉపపురాణాలు
ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా ఉన్నాయి.అష్టాదశ పురాణాలు కాకుండా ఉన్న ఉపపురాణాలు
సనత్కుమారీయము
నారసింహము
స్కాందము (కుమారస్వామి చే చెప్పబడినది)
శివ ధర్మము (నందికేశ్వరుడి చేత చెప్పబడినది)
నారదీయము(దూర్వాసునిచే చెప్పబడినది)
కాపిలము
వామనము
బ్రహ్మాండ పురాణము (శుక్రచార్యులచే చెప్పబడినది)
వారుణము
కాలకము
మహేశ్వరము
సాంబము
సౌరము
మారీచము
భార్గవపురాణము (పరాశరునిచేత చెప్పబడినది)
కార్తీకపురాణం (స్కందపురాణంలో అంతర్భాగంగా చెప్పబడింది)





No comments:

Post a Comment