Sunday, 13 March 2016

విద్వేషాల మూలాలు వెతకాలి





విద్వేషాల మూలాలు వెతకాలి

పంచ పాండవులకూ, దుర్యోధనుడికీ మధ్య శాంతి, సౌహార్దాలన్నవి ఎప్పుడూ లేవు. బాల్యం నుంచీ ప్రత్యర్థులుగానే పెరిగారు. దుర్యోధనుడు తనను తాను యువరాజుగా భావించుకుంటే, యుధిష్ఠరుడు కూడా పాండురాజు జ్యేష్ఠ పుత్రుడిగా హస్తినాపురంపై తన అధికారాన్ని ఎప్పుడూ కాదనుకోలేదు. నిజానికి కురువంశంలోని ఈ రెండు వర్గాల మధ్య శత్రుత్వానికి ప్రధాన కారణం భీముడు. అతని బాహుబలం దుర్యోధనుడికీ, అతని సోదరులకూ అసూయా కారణమయ్యింది. పైగా ద్రోణుని ఆచార్యత్వంలో ధనుర్విద్య నేర్చుకున్న కౌరవులు, తమ కౌశలానికి ప్రశంసలెన్నడూ పొందలేదు.

ఆచార్యుడెప్పుడూ భీముణ్ణో, అర్జునుణ్ణో పొగిడే వాడు. ఏదో విధంగా భీముడి అడ్డు తొలగించుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని దుర్యోధనుడు భావించేవాడు. అందువల్ల భీముణ్ణి గంగలో తోసి చంపివేద్దామని అతడు పథకం వేశాడు. ఒకరోజు నదిలో తమతో ఈత కొట్టడానికి భీముణ్ణి ఆహ్వానించాడు. భీముడిది విపరీతంగా తినే నైజం. కాబట్టి భీముడి చేత కడుపు పగిలేలా విషం కలిపిన ఆహారం తినిపించాలనీ, ఆ తర్వాత భయంకర విష సర్పాలున్న నదిలో పారవేయాలనీ దుర్యోధనుడు పథకం వేశాడు. వారు అనుకున్నట్లే భీముడు కడుపు నిండా విషాహారం తిని మూర్ఛపోయాడు. కౌరవులు అతన్ని మోసుకువెళ్లి నదిలో పడవేశారు. అయితే అదృష్ఠవశాత్తూ భీముడు తిన్న విషాహారం, అతన్ని కాటేసిన పాముల విషానికి విరుగుడుగా పనిచేసింది. కాసేపు స్పృహ లేకుండా నదిలో కొట్టుకుపోయిన తర్వాత స్పృహ వచ్చిన భీముడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. క్షేమంగా ఇంటికి బయలు దేరాడు.

ఈతకు వెళ్లిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో యుధిష్ఠరుడు ఆందోళన చెందాడు. భీముడి గురించి దుర్యోధనుణ్ణి అడిగాడు. దుర్యోధనుడు తనకేమీ తెలియదన్నాడు. యుధిష్ఠరుడికి ఎక్కడో ఏదో జరిగి ఉంటుందన్న అనుమానం కలిగింది. అందుకే భీముణ్ణి వెదకడానికి అనుచరులను పంపాడు. కానీ, వారెవరికీ భీముడు కనిపించలేదు. అయితే, ఆ తర్వాత అకస్మాత్తుగా భీముడు రాజభవనంలోకి నడిచి వస్తుండడం చూసి యుధిష్ఠరుడు హర్షాతిరేకానికి లోనయ్యాడు. ఈత పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్లావని యుధిష్ఠరుడు అడిగాడు. దుర్యోధనుడు తనకు విషం పెట్టి చంపడానికి పన్నిన పన్నాగం గురించి భీముడు చెప్పేసరికి యుధిష్ఠరుడు అవాక్కయ్యాడు. ఈ విషయం కుంతి విన్నది. హస్తినాపుర సింహాసనం కోసం తనకు ఎటువంటి అడ్డు లేకుండా చేసుకోవడానికి దుర్యోధనుడు పాండవులందరినీ చంపడానికి పూనుకున్నాడని ఆమెకు బోధపడింది. తీవ్రంగా కలత చెందిన కుంతి సలహా కోసం విదురుని పిలిచింది. అయితే ‘‘నీ అనుమానాల్ని గుండెలోనే దాచుకొండి. దుర్యోధనకి ఈ విషయాలు తెలిస్తే నీ కుమారుల్ని చంపడానికి మరో పథకం వేస్తాడు’’ అంటూ హెచ్చరించాడు. విదురుడు చెప్పినట్లే, జరిగిన సంగతి విషయంలో మౌనం వహించమని కుంతి యుధిష్ఠరుడుని హెచ్చరించింది.

భీముడు క్షేమంగా తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న దుర్యోధనుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అసహనంతో రగిలిపోయాడు. మరణించిన వ్యక్తి సమాధిలోంచి లేచి వచ్చిన భావన కలిగింది. అయితే, తనను కానీ, తన తమ్ముల్ని కానీ ఎవరూ అనుమానించనందుకు అతనికి సంతోషం కూడా కలిగింది. అయితే తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి అతడు యుధిష్ఠరుని వద్దకు వెళ్లి భీముడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దుర్యోధనుని దురాగతం గురించి ముందే తెలిసిన యుధిష్ఠరుడు అభివ్యక్తికీ, అంతరంగానికీ మధ్యనుండే వేయి పొరల్ని గమనించకపోతే ఎంత ప్రమాదమో కదా అనుకున్నాడు.



No comments:

Post a Comment