ఒకరోజు నందనందనుడు గోపాలురతో కలిసి ఆడుచుండెను. కొందఱు గోవులుగా మరికొందఱు మేకలుగా కొందఱు చోరులుగా మరియు కొందఱు పసులకాపరులుగా విడివడి ఆడుచుండిరి. కంసప్రేరితుడైన వ్యోమాసురుడు చోరుల గుంపులో చేరి గోవులుగా మేకలుగా గోపాలురుగా నటిస్తున్న బాలులను ఎత్తుకొని పోయి ఒక బిలమున దాచి బిలద్వారము మూసివేసెను. పరమాత్మ అది గ్రహించి రక్కసుని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై విసిరిగొట్టెను. మృతుండైన వ్యోమాసురుని లోని తేజస్సు పరమాత్మలో లీనమయ్యెను.
వ్యోమాసురుని చరిత్ర
పూర్వం మహాపుణ్యక్షేత్రమగు భవ్య కాశీనగరమును భీమరథుడు అను రాజేంద్రుడు పరిపాలించెడివాడు. అతడు మేధావి దానశీలి ధర్మజ్ఞుడు పైగా శ్రీహరి భక్తుడు. రాజ్యభారమును యోగ్యుడైన కుమారునికి అప్పగించి రమేశుని పై అనురక్తుడై తపముకై మలయపర్వతమునకు ఏగెను. అక్కడ ఆశ్రమములో నివసించి తపమును సాగించుచుండెను.
ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడు పరమపూజ్యుడు అయిన పులస్త్య మహర్షి శిష్యవర్గముతో భీమరథుని ఆశ్రమమునకు వచ్చెను. త్రిలోకపూజ్యుడైన పులస్త్యునకు రాజు నమస్కరించెనే కానీ యథావిధి అతిథి సత్కారము చేయలేదు. ధర్మము తప్పినందుకు మహర్షి “రాజా! ఇంటికి వచ్చిన వానిని సత్కరింపకుండుట అసురలక్షణము. కావున నీవు రాక్షసుడివి కమ్ము.”! అని శపించెను. పశ్చాత్తాపముతో శరణువేడిన రాజును కరుణించి పులస్త్యుడు “నీ దుష్కర్మకు ఫలితమనుభవించక తప్పదు. కానీ నీవు అఖండ విష్ణుభక్తుడవగుటచే నీకు ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహము కలుగును. భగవంతుడు భక్తుల కెన్నడు అపజయము కలిగించడు కదా!” అని ఆశీర్వదించెను. ఆ భీమరథుడే వ్యోమాసురుడు.
యమునాతీరములో ఉన్న పొగడ చెట్టు మీదకూర్చుని మధుర వేణుగానముతో శ్రీకృష్ణపరమాత్మ సామవేదసారాన్ని బోధించెడివాడు. ఎంతో ప్రియముగా లేలేత పసిరికను మేస్తున్న గోమాతలు ఆ మధుర వేణురవం వినగానే పసిరికను వదిలి నిశ్చేష్టులై బొమ్మలవలె నందబాలునివైపు చూస్తూ వేణుగానమును ఆస్వాదించెడివి. హంసలు బెగ్గురుపక్షులు సమాధినిష్ఠులవలె వేణుగానమును గ్రోలుచుండెడివి.
పరమాత్మ గోపబాలులతో ఆడుచు పాడుచు నృత్యములు చేసెడివాడు. వారు గంతులువేస్తూ పరుగులెడుతూ పందెములు వైచుచూ కలహములాడుచూ క్రీడించుచుండెడివారు.
ఒకసారి వారు రెండు పక్షములుగా బారులుదీరి ఒకపక్షమునకు బలరాముని రెండవ దానికి శ్రీకృష్ణుని నాయకులుగా ఎంచుకొని ఆడుచుండిరి.
గెలిచిన పక్షమువారిని ఓడినవారు భాండీరకమను వటవృక్షము కడకు మోయవలెనని పందెము. ఆటలో శ్రీకృష్ణుని పక్షము ఓడిపోయెను. భక్తుల వద్ద ఓడిపోవుట భగవంతునికి పరిపాటి కదా! పరమాత్మ ప్రియసఖుడైన శ్రీధాముని మోసెను. మారువేషములో వచ్చి శ్రీకృష్ణుని పక్షాన ఉన్నట్టు నటించి కంస ప్రేరితుడైన ప్రలంబాసురుడు అవతల పక్షములో ఉన్న బలరామదేవుని మోసెను.
ప్రలంబుని కపటము గ్రహించి బలరామస్వామి తన బరువు పెంచుకొనెను. మోయలేక దానవుడు నిజరూపము దాల్చెను. ప్రలంబుని బ్రహ్మరంధ్రము చిట్లునట్టు ఒక్క ముష్టిఘాతమిచ్చెను బలరాముడు. తల రెండు వ్రక్కలయి ప్రలంబాసురుడు ప్రాణములను విడచెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.
ప్రలంబాసురుని వృత్తాంతము
పరమశివుని ప్రియసఖుడు దిక్పాలకుడు యక్షేశ్వరుడు త్రిలోకపూజ్యుడు అయిన కుబేరుకి చైత్రరథము అను ఉద్యానవనము కలదు. పరమ శివభక్తుడైన కుబేరుడు చైత్రరథములోని పుష్పములన్నిటిని మహాదేవుని పూజకోసమే వినియోగించెడివాడు. కానీ కావలివాళ్ళు ఎంత అప్రమత్తులై ఉన్నా ఎవడో ఆ ఉద్యానవనములోని పుష్పములను అపహరించుచుండెడివాడు. అది తెలిసి కుబేరుడు పుష్పచౌర్యము చేసినవాడు రాక్షసుడై జన్మిస్తాడని శపించెను.
ఒకసారి హూహూ అను గంధర్వుని కుమారుడైన విజయుడు ఎన్నో తీర్థయాత్రలు చేసి కుబేరుని ఉద్యానవనము వద్దకు వచ్చెను. కుబేరుని అనుమతి గ్రహింపకనే ఉద్యానవనములోకి వెళ్ళి కొన్ని పువ్వులను గైకొనెను. యజమాని అనుమతి లేకనే పుష్పములు స్వీకరించిన కారణముగా విజయునికి పుష్పచౌర్య దోషము వచ్చెను. కుబేరుని శాపప్రభావముచే ప్రలంబాసురునిగా మారెను. పశ్చాత్తాపముతో కుబేరుని శరణువేడగా అభయమిచ్చి కుబేరుడు “నాయనా! తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నిహోత్రము వలన చేయి కాలక మానదు కదా! అట్లే పాపము కూడా. కానీ పరమ భక్తుడవైన నీకు కడకు మేలు జరుగును. పాపఫలితమును అనుభవించిన తరువాత బలరామస్వామిచే సంహరించబడి ముక్తుడవు అవుతావు” అని ఆశీర్వదించెను. (హాహా హూహూ అను గంధర్వులు శాపగ్రస్తులై గజేంద్ర మకరములుగా జన్మలెత్తి శ్రీహరికృపచే కైవల్యమును పొందినవారు.)
బలరామకృష్ణులు వివిధ వర్ణముల గోవులను చక్కగా అలంకరించి చూచువారి కన్నులపండగుగా ఆలమందలను తోలుకొని పోయేవారు. పవిత్రమైన గోధూళి తనపై పడాలని నందకిశోరుడు ఆలమందల వెనుక నడచుచుండెడివాడు. కానీ భక్తి అనే అమృతమును హృదయముల నిండా నింపుకొన్న గోమాతలకు పచ్చికబయళ్ళకన్నా పరమాత్మ సందర్శనమే మిక్కిలిప్రీతిని కల్గించుచుండెడిది. కావున గోమాతలు పరమాత్ముడైన యశోదాతనయుని చూడకపోతే అడుగులు ముందుకు వేసేవి కావు. అందుకని ఆ లీలామానుషవేషధారి తానే ఆలమందల ముందు నడుమ వెనుక ఉండి అందరికి ఆనందమును అందించెడివాడు. భక్తునికి భగవంతునికి గల సంబంధము అవ్యక్తమధురము కదా!

ధేనుకాసురుని వృత్తాంతము:
పరమ విష్ణుభక్తుడైన బలిచక్రవర్తి యొక్క కుమారుడు సాహసికుడు. అహంకారి అయిన సాహసికుడు ఒకనాడు పవిత్రమైన గంధమాదన పర్వతములపై పదివేలమంది వనితలతో విహారములు చేసినాడు. ఆ పవిత్ర ప్రదేశములో ఘోరతపస్సు చేసుకొంటున్న దుర్వాసమహర్షికి సాహసికుని వలన తపోభంగమైనది. మహర్షి “ఓరీ! ఏమాత్రమూ వినయవిధేయతలు లేకుండా గార్దభమువలె ప్రవర్తించినావు. పవిత్రమైన ఈ పర్వతముపై విలాసవిహారములు చేసి నా తపస్సును భంగపఱచినావు. గార్దభమువై జన్మించు” అని సాహసికుని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మహర్షిని శరణువేడినాడు సాహసికుడు. కరుణించి మహర్షి “నాయనా! అహంకారముతో మనసుకు నచ్చినట్లు చేయుట వివేకవంతుల లక్షణముకాదు. ఉత్తముడైన వాడు ధర్మబద్ధమైన కార్యములనే చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ వినయమును కలిగి ధర్మమార్గముననే నడువవలెను. నీవు చేసిన తప్పుకు ఫలితమును అనుభవించిన తరువాత ద్వాపరయుగములో బలరాముని చేతిలో మరణించి ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించెను. ఆ సాహసికుడే ధేనుకుడు. పూర్వం ప్రహ్లాదుని కాచినపుడు స్వామి ప్రహ్లాదుని వంశమువారిని సంహరించనని వరమిచ్చెను. అందుకనే బలరామునికి ధేనుకాసురిని సంహరించమని సైగచేసెను.
ఏ పరమపూరుషుని బ్రహ్మణ్యులు పరబ్రహ్మ అని, వైష్ణవులు విష్ణువని, శైవులు మరియు ఇతర భక్తులు శివుడని, కాపాలికులు కాలభైరవుడని, శాక్తేయులు శక్తి అని కొలిచెదరో అట్టి వేదవేద్యుడైన స్వామి గోపబాలురకు సఖునిగా స్నేహితునిగా మెలిగి వారితో కలిసి తని ఆడి పాడి వరిని తరింపచేసినాడు. ఆహా! గోపబాలుల అదృష్టమే అదృష్టము. (అదృష్టమంటే కనబడనిది – అంటే మన జన్మజన్మాంతరాల కర్మఫలము)
ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుచుండగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు ఒక పెద్ద కొండచిలువ రూపమున వచ్చి నోటిని తెరిచి శ్రీకృష్ణునికై ఎదురుచూసెను. దాని పైపెదవి మేఘమండలమును క్రింది పెదవి భూమిని తాకుచుండెను! శ్రీకృష్ణలీలలను ప్రత్యక్షముగా చాలాసార్లు చూసిన గోపబాలురు అతడే రక్షిస్తాడనే నమ్మకముతో గోవులతో సహా పెద్దకొండబిలము వలెనున్న అఘాసురుని నోటిలోకి వెళ్ళిపోయినారు.
నందకిశోరుడు కూడా లోనికి ప్రవేశించెను. పరమాత్మ ప్రవేశించగానే అఘాసురుడు నోరుమూసివేసెను. విషవాయువుల ప్రభావముచే గోవులు గోపబాలురు ప్రాణములు విడిచిరి. అప్పుడు పరమాత్మ అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరము ఉబ్బునట్టు చేసెను. అఘాసురుని పొట్టపగిలి నందనందనుడు బయటికి వచ్చెను. సంకల్పమాత్రముచే శ్రీకృష్ణుడు గోవులను గోపబాలురను బ్రతికించెను. అఘాసురుడు ముక్తినొందెను.
అఘాసురుని వృత్తాంతము:
శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు యౌవనుడు బలిష్ఠదేహుడు. కాని పరులను నిందించు స్వభావము కలవాడు. వాడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూచి “ఇన్ని వంకరలేమి” అని హేళన చేసెను. మహర్షి అనుగ్రహము చూపుటకు “ఓరీ! వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువు” అని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది రక్షించమని ప్రార్థించిన అఘాసురునితో అష్టావక్ర మహర్షి “నాయనా! పరనింద మృత్యువువంటిది. మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే నిందింపబడిన వాడి పాపములో సగం మనకివస్తుంది. అంతేకాక మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యసర్వస్వములో సగం అతనికి వెళిపోతుంది. కావున అనవసరముగా పరనిందచేయరాదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది పాపఫలము అనుభవించిన తరువాత ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించినాడు.
యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు బాలునివలె గోపాలురతో యమునాతీరమున తిరుగుతూ ఆడుచూ ఉండెను. అప్పుడు కైలాస పర్వతమంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద కొంగ అక్కడికి వచ్చెను. మేఘగర్జన వలెనున్న దాని అరుపు విని గోపబాలురు భయభ్రాంతులైరి. ఆ మహాబకము తన ముక్కుతో పరమాత్మను నోటిలోకి వేసుకొని మ్రింగెను.
లోకరక్షకుని రక్షించుటకై దేవేంద్రుడు వజ్రప్రయోగము చేసెను. విధాత దండమును విసరెను. ఆ బకాసురునికి ఏ హానీ జరగలేదు! పరమేశ్వరుడు త్రిశూలముచే దాని రెక్క విఱుగగొట్టెను. వాయదేవుని వాయవ్యాస్త్రము యముని దండము సూర్యుని వేయిబాణములు చంద్రుని నీహారాస్త్రము ఆ బకాసురునిపై పనిచేయలేదు!
ఆగ్నేయాస్త్రముతో అగ్నిదేవుడు ఆ బకుని రొమ్ములను కాల్చెను. వరుణదేవుడు పాశముతో భద్రకాళి గదతో కొట్టగా ఆ బకాసురుడు మూర్ఛనొందెను. కొంతసేపటికి తేరుకున్న బకుని కాలు విఱుగగొట్టెను తన శక్త్యాస్త్రముతో కుమారస్వామి. ఒంటికాలితోనే మింటికెగసి ఆ బకాసురుడు దేవతలను తరిమికొట్టెను!
మహర్షులు వేదవేద్యుడైన శ్రీకృష్ణస్వామిని ధ్యానించగా బకాసురుని ఉదరములోనున్న స్వామి వాడి పొట్ట ఉబ్బునట్లు చేసెను. ఊపిరాడక బకుడు పరమాత్మను బయటకు ఉమ్మివేసెను. తరువాత బకుడు ముక్కుతో పొడవగా నందకిశోరుడు బకుని ముక్కుపుటములను చీల్చెను. మరణించిన బకాసురుని చూచి దేవతలు పరమాత్మపై పుష్పవృష్టి కురిపించిరి. బకునిలోని తేజస్సు కృష్ణపరమాత్మలో కలసెను.
బకాసురుని వృత్తాంతము:
హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడు ఉత్కలుడు. వాడు తన బలపరాక్రమాలతో దేవేంద్రుని జయించి స్వర్గాధిపతి అయ్యెను. ఇట్లు నూరేండ్లు త్రిలోకాధిపతియై శోభిల్లెను.
అన్ని ఏండ్లు దేవేంద్రపదవిని పొందియూ బుద్ధిమాంద్యముచే ఆతడు మహాతెజస్వి అయిన జాజిలి మహర్షి ఆశ్రమము వద్దనున్న సింధూ మహాసాగరమునకు పోయి అక్కడ చేపలను పట్టుచుండెను. అప్పుడు జాజిలి మహర్షి ఉత్కలుని చూచి “ఓయి! నీకిట్టి జీవహింస చేయ తగునా? వంశానుక్రమమున నీకు లభించిన సంస్కారమేమి? నీవు చేయుచున్న పని ఏమి? జీవ హింస మహాపాపమని ఎఱుగవా”? అని మందలించెను. మూర్ఖుడైన ఉత్కలుడు మహర్షి మాటలను విశ్వసించక జీవహింస కొనసాగించుచుండెను. అంతట జాజిలి మహర్షి “కొంగవలె చేపలు పట్టుచుంటివి కావున బకుడవు కమ్ము” అని శపించెను. పశ్చాత్తాపముతో మహర్షిని శరణువేడినాడు ఉత్కలుడు. అప్పుడు మహర్షి “వత్సా! కర్మ ఫలితమును అనుభవింపక తప్పు కదా! పశ్చాత్తాముతో పునీతుడవైన నీకు శ్రీకృష్ణ సందర్శనము కలుగును. ముక్తిని పొందెదవు” అని అనుగ్రహించినాడు.
ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
అహింసా పరమో ధర్మః |
ధర్మహింసా తథైవచ ||
ఈ సూక్తికి అద్దంపట్టే కథ బకాసుర వధ. ఇంద్రపదవిని చేపట్టి తన సంస్కారానికి విరుద్ధముగా చేపలను పట్టుకుని ఉత్కలుడు జీవహింస చేసినాడు. అందులకు జాజిలి మహర్షి అతనిని శపించినాడు. కావున మనము జీవ హింస ఎన్నడూ చేయరాదు.
దుష్టుడు లోకహింసా పరాయణుడు అయిన ఉత్కలుని సంహరించి లోకాలకురాజైన శ్రీకృష్ణపరమాత్మ ధర్మసంస్థాపన చేసినాడు. శ్రీకృష్ణుడు చేసినది ధర్మహింస అయినది. పైన చెప్పిన సూక్తి ప్రకారము అహింస పరమ ధర్మము. అహింస అంతే గొప్పది ధర్మహింస.
(దండనీతిని పాటించి దుష్టులను శిక్షించి రాజు ధర్మహింసయే చేస్తాడు.)
బలరామకృష్ణులకు గోవులనుగాచే వయస్సు వచ్చినది. నీలాంబరధారి అయిన బలరాముడు పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు గోవులను చక్కగా అలంకరించి గోపాలురతో కలిసి పచ్చిక బయళ్ళలో విహరించుచుండేవారు. కాళిందీనదీ తీరము వారికి ప్రియమైన విహారస్థలమయ్యెను. తన మధుర వేణుగానముతో పరమాత్మ జీవులకు సామవేద సారాన్ని బోధించేవాడు. బ్రహ్మానందముతో గోవులు గోపబాలురు పశుపక్షాదులు ఆ వేదవేద్యుని వేణుగానం వినుచుండెడివి. శ్రీకృష్ణుడు గోపాలురు ఎన్నో ఆటాలాడేవారు. వారు పక్షులనీడలలో పఱుగులెట్టేవారు. నెమళ్ళ లేళ్ళ గుంపుల వెంటబడేవారు. కోతికొమ్మంచులు బిళ్ళంగోళ్ళు ఆడేవారు. యమునా నదిలో జలకాలాడేవారు.
ఒకసారి వారు వివిధ జంతువులను అనుకరిస్తూ ఆడుచుండగా కంసప్రేరితుడైన వత్సాసురుడు వచ్చి శ్రీకృష్ణుని ఆలమందలో కలిసి పోయాడు.
సర్వజ్ఞుడైన స్వామి అదిగమనించాడు. మెల్లమెల్లగా వచ్చి ఆ వత్సాసురుడు పరమాత్మను తన్నాడు. నందకిశోరుడు వాడి కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగచెట్టుకేసి కొట్టాటు. మృతినొందిన ఆ వత్సాసురుడి నుంచి తేజము బయటికి వచ్చి పరమాత్మలో కలిసిపోయింది.
వత్సాసురుని వృత్తాంతము:
మురాసురుడనే రాక్షసుని కుమారుడు ప్రమీలుడు. వాడు దురాశకులోనై కపటవిప్రవేషం ధరించి సర్వాభీష్టఫలదాయిని అయిన నందినీధేనువును తనకు దానమిమ్మని వసిష్ఠుని కోరినాడు. నందినీధేనువు వాడి కుటిలత్వం గ్రహించి అసురస్వభావము గల లేగదూడవు కమ్మని శపించింది. పశ్చాత్తాపముతో శరణువేడిన ప్రమీలుని కరుణించి ఆ నందిని “చేసిన పాపమునకు ఫలమనుభవించక తప్పదు. పాపము తీరిన తరువాత నా అనుగ్రహము వలన నీవు పరమాత్మ చేతిలో మరణిస్తావు. అలా ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించింది.
ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
కుటిలత్వము ఉండరాదని మనకీ కథ ద్వారా తెలిసినది. కపటవేషము వేసి మోసగించబోయిన ప్రమీలుని శపించినది నందినీధేనువు. కావున ఇతరుల నెన్నడూ మోసం చేయరాదు.
అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురూ బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనేతెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.
శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీదనుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది.
తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు! పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో ఱోకటికి (ఉలూఖలమునకు) కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది. మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకుగానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!

యమళార్జునుల వృత్తాంతము:
నలకూబరమణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు. వారు చాలా ధనగర్వముతో ఉండేవారు. రుద్రానుచరులై కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాసపర్వతములోని ఒక సుందర ఉద్యానవనములో స్త్రీలతో కూడి వహారము చెసినారు. మదోమత్తులై వారుణి అను మదిరను పానముచేసినారు. వారు పద్మవనములో ఉన్న గంగలో జలక్రీడలాడ సాగినారు. అప్పుడు పరమపూజ్యుడైన నారదమహర్షి వారి పురాకృత సుకృతమువలన అక్కడికి వచ్చాడు. నారదుని చూసి ఆ దేవతాస్త్రీలు లజ్జితులై వెంటనే వస్త్రములు ధరించారు. కానీ మదిర ప్రభావములో ఒళ్ళు మరచిపోయిన ఆ కుబేరపుత్రులు వస్త్రములను ధరించలేదు.
ఆ దేవకుమారుల అజ్ఞానమును చూచి నారదుడు ఇలా అన్నాడు “ధనగర్వము ఎంతటి గొప్పవారినైనా నాశనము చేస్తుంది. ధనగర్వితులైన వారు మద్యపానము జూదము స్త్రీసంభోగము వంటి దుర్వ్యసనములకు లోబడి అనేక పాపకార్యాలు చేయుదురు. నిర్దయులై మనోవినోదముకై పశువులను వధించెదరు. నశ్వరమైన దేహనుము శాశ్వతమైనదని నమ్మి దేహసౌఖ్యమే పరమానందము అనుకొనెదరు.
మద్యపానమత్తులై నగ్నముగా ఉండి ఘోరాపరాధము చేసిన వీరు స్థావరత్వమును పొందుటకు తగియున్నారు. మరల వీరెన్నడూ ఇట్టి అకార్యములు చేయకుండుటకై నా అనుగ్రహమువలన వీరికి పూర్వజన్మ స్మృతి ఉండును. నూరుదివ్యవర్షములు చేసిన తప్పుకు పశ్చాత్తాపము నొంది పునీతులై నా అనుగ్రహముచే కృష్ణభక్తులై దైవత్వమును పొందగలరు”. ఆ కుబేర పుత్రులే యమళార్జునులు.
ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
- వస్త్రధారణము యొక్క ప్రాముఖ్యత మనకు ఈ కథ ద్వారా తెలిసినది. ఎప్పూడూ సరిగా వస్త్రములేకుండా ఉండరాదని నారదమహర్షి మనకు చెప్పాడు.
- వారుణి అనే మదిర ప్రభావములో ఉండి తప్పని తెలిసి కూడా నలకూబరమణిగ్రీవులు వస్త్రధారణము చేయలేదు. మదిరాపానం వలన మానవుడు తెలియకనే అనేక పాపాలు చేస్తాడు. పంచమహాపాతకాలలో మొదటిది ఈ మదిరాపానమే. అందుకని మనమిట్టి దుర్వ్యసనములకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.
- ధనగర్వము ఉండరాదని నారదమహర్షి మనకు ఉపదేసించాడు. శివానుచరులై ఉండికూడా కేవలము ధనగర్వము వలన కుబేరపుత్రులు వారి దైవత్వాన్ని కోల్పోయారు.
- తీర్థాలు పుణ్యక్షేత్రాలు సిద్ధప్రదేశాలు ఎప్పుడు విహార దృష్టితో వెళ్ళరాదని మనకు ఈ కథ ద్వారా తెలిసినది.
ముద్దుకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆడించుచున్నది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రక్కసుడు పెద్ద సుడిగాలి రూపములో అక్కడికి వచ్చెను. కొండంత బరువెక్కిన తయుని భారము భరించలేక యశోద శ్రీకృష్ణుని నేలపైకి దించెను. జంతువులు ప్రజలు ఇంటిపైకప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగురదొడగెను. ధూళి రేగగా శ్రీకృష్ణుడు యశోదకు గోపికలకు కనబడలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని వెదుకసాగిరి.
చిన్నికృష్ణుడు తృణావర్తుని వెంట మింటికెగసి ఆతని వీపుపైకి ఎక్కెను. అండపిండవేదోండ సహతులను గుప్తగతి బొజ్జలో ఉంచుకొన్న స్వామి భారము మోయలేక ఆతని క్రిందికి వసరికొట్టబోయెను తృణావర్తుడు. పాపం పండిన దానవుని గొంతునులిమి శ్రీకాంతుడు భూభారము దించెను.
నేలగూలి ప్రాణములువిడిచిన అసురుని శరీరముపై ఏమీ ఎఱగనట్టు ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి బాలకుడు క్షేమముగా ఉన్నాడని సంతోషించి యశోద శ్రీకృష్ణుని ముద్దాడి దిష్టి తీసి వేదాశీర్వచనము చేయించెను. ఎన్నో గో భూ దానములు పండితమండలికి ఇప్పించెను.
తృణావర్తుని వృత్తాంతము
పూర్వం పాండుదేశమును సహస్రాక్షుడను మహారాజు పరిపాలించుచుండెడివాడు. ఆతుడు మిక్కిలి భగవద్భక్తుడే కాని స్త్రీలోలుడు. సీతమ్మ చెప్పినట్టు (సత్యసంధః కథ చూడండి) ఎవడైతే వ్యసనాలకు దూరముగా ఉంటాడో వాడే ధర్మమార్గాన నడువగలడు. కామాంధుడైన ఆ సహస్రాక్షుడు దూర్వాసమహర్షి వచ్చాడని ఎఱిగియూ ఆతనికి నమస్కరించలేదు. వ్యసనపరుడై పూజ్యపూజావ్యతిక్రమ దోషము చేసిన సహస్రాక్షుని రాక్షసుడివి కమ్మని ఆ మహర్షి శపించెను. తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తముతో శరణువేడిన ఆ సహస్రాక్షుని మహర్షి మన్నించి “రాజా! ఈ దుష్కార్యమునకు ఫలితమనుభవింపక తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థము కదా! కానీ భక్తుడవైన నీకు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పాదస్పర్శచే కైవల్యము ప్రాప్తించును” అని ఆశీర్వదించెను. ఆ సహస్రాక్షుడే తృణావర్తుడు.
మనమీ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:
మానవుడు అన్ని వ్యసనములనుండి ఎల్లవేళలా దూరముగా ఉండవలెను. పరమ భక్తుడైనా ఒక్క స్త్రీలోలత్వం అనే వ్యసనము వలన దుష్కర్మ చేసి శాపగ్రస్తుడైనాడు సహస్రాక్షుడు.
ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలారా వీనులలర
మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా
అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ వ్రజభామలందఱూ చిన్ని కృష్ణుని చూడ వచ్చారు. బాలకృష్ణుని కురులు ముడిచి పరిమళ పుష్పములతో అలంకరించారు. ఆ చిన్ని శిశువు నుదుట కస్తూరి దిద్ది కాటుక పెట్టారు. చెవి పోగులు పులిగోరు చంద్రహారము బాలునికి ధరింపచేశారు. బోసి నవ్వులొకిస్తున్న జగన్నాథుని బుగ్గన గడ్డముపై చుక్కలు పెట్టారు. చేతులకు కడియాలు ముంజేతులకు మురుగులు మొలకు బంగారుత్రాడు కట్టారు. బాలుని రూపములో ఉన్న శేషశాయికి నీరాజనాలిచ్చి “ఉయ్యాలా బాలునూచెదరు” అంటూ బాలుని బండీ క్రిందనున్న పసిడి తొట్టిలో పడుకోబెట్టి లాలి పాటలు పాడారు. వ్రజభామలు ఎన్నో కానుకలు పిండివంటలు మొదలగునవి ఇచ్చారు.
ఈ కోలాహలంలో కంసప్రేరితుడైన శకటాసురుడు వాయు రూపములో వచ్చి పరమాత్మపై బండిని పడద్రోశాడు. ముద్దులొలికిస్తూ చిన్నికృష్ణుడు ఆ శకటమును (బండిని) తన్నాడు. రివ్వున బండీ ఎగిరి శకటునిపై పడి ఆతని తల వ్రక్కలయ్యెను. బండిపైనున్న క్షీర దధి భాండములు క్రింద పడి పగిలెను.
అలికిడి వినిన వ్రజభామలు కలవరుముతో చూడగా బాలకృష్ణుడు కేరింతలుకొట్టుచూ ఆడుకుంటున్నాడు. ఈ లీలను చూచిన గోపబాలురు జరిగిన సంగతి వ్రజభామలకు చెప్పిరి. ఆశ్చర్యపడి నందనందునకు ఎఱ్ఱని నీటితో దిష్టితీసి భూసురులచేత వేదాశీర్వచనములు చేయించి లోకరక్షకునకు రక్షకట్టిరి.
శకటాసురుని వృత్తాంతము:
హిరణ్యలోచనుని పుత్రుడైన ఉత్కచుడు చాలా క్రూరుడు. ఒకసారి అతడు తన స్వాభావికమైన క్రూరత్వముచే లోమశ మహర్షి ఆశ్రములోనున్న వృక్షలతాదులను పెఱికివేశాడు! ఆతని క్రూరబుద్ధిని చూసి ఆ మహర్షి “ఓరీ! పాము కుసుసము విడిచినట్టు నీవు ఈ దేహము విడువుము” అని శపించినాడు. పశ్చాత్తాపముతో మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఉత్కచుడు. “పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. అయిననూ నీవు చేసిన కర్మకు శిక్ష తప్పదు. ద్వాపరమున శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను విధించును. ఆ పురుషోత్తముని పాద స్పర్శతో నీకు శాపవిముక్తి కలుగుతుంది” అని శాపావశానం చెప్పాడు లోమశ మహర్షి. ఆ ఉత్కచుడే శకటాసురుడు.
ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:
క్రూరత్వం కడు దుష్టస్వభావము అసురలక్షనము. తోటి మానవులు జంతువులతోనే కాక వృక్షములతో కూడా మైత్రీభావముతో ఉండవలెనని మనకు ఈ కథ ద్వారా తెలిసినది. మన శాస్త్రాల ప్రకారం ఒక చెట్టును ఊరికే నఱకడం మహాపాపమ్. అవసరార్థం ఒక వృక్షమును నఱికితే దానికి బదులు నాలుగు వృక్షములు నాటమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉత్కచుడు ఊరికే ఎన్నో వృక్షములను పెఱికివేసి ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు.














No comments:
Post a Comment