Tuesday, 6 September 2016

పంచాయతనం





పంచాయతనం

పంచాయతనం అంటే ఐదుగురు దేవతా మూర్తులున్న పీఠం. ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, పరమేశ్వరుడు. మూర్తులంటే విగ్రహాలు కావు. ఆయా దేవతలకు ప్రతిరూపాలుగా భావించే శిలలు.

ఆదిత్యుడికి ప్రతి రూపం స్ఫటికం. గోళీకాయంత ప్రమాణంలో ఉండే స్ఫటికం సూర్యునిగా పూజలందుకుంటుంది.

అంబికకు ప్రతిరూపం నాపరాయి వలే ఉంటుంది. ఇందులో సువర్ణం ఉంటుందంటారు. కొన్ని నాపరాళ్లలో బంగరు రంగు గీతలుంటాయన్నది విదితమే కదా! దీనిని చంద్రశిల అంటారు.

విష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడని అందరికే తెలిసిన విషయమే. ఇందులో జీవశక్తి ఉంటుంది. ఈ సాలగ్రామాలు ఉత్తరాన, హిమాలయాల్లో ప్రవహించే గండకీ నదిలో లభ్యమౌతాయి.

గణపతి జేగురు రంగులో ఉండే శిలలో ఉంటాడు. ఇవి శోణా నదిలో ఉంటాయి. శోణం అంటే ఎరుపు, లేదా అగ్ని వర్ణం. శోణానది మైనాక పర్వతంలో పుట్టి గంగలో కలుస్తుంది. ఈ నదిలో లభించే శిలలను శోణభద్ర వినాయక మూర్తులని అంటారు.

మహేశ్వరుడు బాణలింగ రూపంలో పూజలందుకుంటాడు. ఇది కూడా చిహ్న రూపమే. బాణలింగాలు నర్మదా నదిలో లభిస్తాయి. ఇవి శివలింగాకృతిలో ఉంటాయి.

పంచాయతనం పూజా గృహాల్లోనూ, దేవతార్చనా మందిరాల్లోనూ ఉంటుంది. కొన్ని గర్భ గుడుల్లో కూడా ఉంటాయి. కానీ గుళ్ళల్లో ఉన్న పంచాయతనంలో విగ్రహాలుంటాయి. తిరుమలలో, శ్రీశైలంలో, కాళహస్తిలో పంచాయతనాలు లేవు.. మూల విరాట్ఠులు మాత్రమే ఉంటారు. గృహస్థులు ఎచటికేగినా పంచాయతనాన్ని తమ వెంట తీసుకుని వెళ్లి పూజలు చెయ్యాలి. మధ్యలో ఉన్న శిలను బట్టి పంచాయతనానికి పేరు ఉంటుంది.

ఉదాహరణ:
విష్ణుపంచాయతనం అంటే సాలగ్రామం మధ్యలో ఉంటుంది.


పంచాయతనం అంటే ఏమిటి?
‘ఆయతన’మంటే ఆకారం. 
‘పంచాయతన’మనగా అయిదు ఆకారాలు గల పరమాత్మ. 
పేరు పంచాతనుడు. 
ఆయన పూజ పంచాయతన పూజ. 
ఈ పూజలో శివ, విష్ణు, దేవి, గణపతి, సూర్య ఆకారాలలో పరమాత్మను ఒకేసారి అర్చన చేస్తారు. 
ఈ ఐదు ఆకారాలు పరమాత్మ ఆకారాలే అనే జ్ఞానంతో చేసే అర్చన పంచాయతన అర్చన. 
ఈ ఐదు ఆకారాలే ఎందుకు తీసుకోవాలంటే లోకంలో ఈ ఐదురకాల ఆకారాల మీదనే ప్రధానంగా ప్రతి విశేషము వుంటోంది. దేవతల పేర్లు చాలా వున్నా, ఈ దేవతలకే ప్రధాన దేవతలన్న ప్రశస్తి ఉపనిషత్తులలోను, పురాణాలలోను ఏర్పడివుంది. మంత్ర శాస్త్రంలోని మంత్రాలన్నీ కూడా, ఈ ఐదు దేవతల ఆధారంగానే విభజన చేయబడి వున్నాయి. 

ఈ కారణాలవల్ల ఈ ఐదు దేవతలనే స్వీకరించి పంచాయతన పూజా విధానాన్ని రచించటం జరిగింది. 

పంచాయతనం అంటే ఏమిటి? శంకరులు ఎందుకని పంచాయతనానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు? 
తేజస్సు పృధ్వి జలము కలిసి మహాగణపతి అనుకున్నాం. దివ్యులు అంటే దేవతలు లేదా దేవుళ్ళు వీరందరూ పేర్లు వేరైనా బ్రహ్మతత్త్వమూ, పరబ్రహ్మతత్త్వమూ తెలుసుకుంటే ఉన్నది ఒక్కటేనని తెలుస్తుంది. అలా తెలుసుకోగలగాంలటే పూర్వజన్మ సుకృతమూ అనేక జన్మల సాధనా, జ్ఞానమూ, దైవకృప కావాలి ! ఇవి అందరికీ ఉండవు గనుక అందరికీ పనికి వచ్చేలా మన మూర్తి లేదా విగ్ర్రహ పూజను పెద్దలు మనకు అందించారు. శివుడు గొప్పా?, విష్ణువు గొప్పా? లేదా అమ్మవారిని పూజించాలా? అన్న సమస్యలు అందరికీ కలుగుతూ వుంటాయిఠ. ఇలాటి సమస్యకు పరిష్కారంగా శివుడు, విష్ణువు, సూర్యుడు. గణపతి, అమ్మవారు ఈ అయిదు స్వరూపాలను ఒక్కచోట పెట్టి ఒక్కలాగ ఆరాధించే పద్ధతిని ఆదిశంకరులు మనకు అనుగ్రహించారు.

No comments:

Post a Comment