యథా రాజా తథా ప్రజా అన్న నానుడిని నిజం చేసి చూపించడమే కాదు, తాను తలచిందే రాజ్యమంతా ఏకీభవించేలా పాలించిన ఘనుడై చరిత్రలో నిలిచిపోయాడు. మనిషంటే, ధర్మమంటే, రాజ్యమంటే ప్రజల మనోభావాలంటే ఆచారాలంటే సంప్రదాయాలంటే, విలువలంటే, భూలోక స్వర్గమంటే ఏమిటో చరిత్రకు పరిచయం చేసిన దశరథుడు నిజమైన మహారాజు, మనసున్న చక్రవర్తి.
ఇక్షాకువంశం మహామహులను ప్రపంచానికి ఇచ్చింది. అజుని కొడుకే దశరథుడు. వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే కాదు. మంచితనానికి పరాకాష్టగా బతికాడు. పరాక్రమమంటే ఇతనిదే. దశరథుని పరిపాలనలో ప్రజలకు బాధలంటే ఏంటో తెలియదు. ఈ మహారాజు చతురంగ సేనకు పెట్టింది పేరు. శత్రువులకు దశరథుడంటే మృత్యువే. అదే శరణని ఆశ్రయం పొందిన వారికి సమస్తం సమకూర్చే ఆపన్నహస్తం. దశరథుని స్నేహాన్ని కోరిన వారెందరో దశరథుని తమ కుటుంబంలో ఒకరిగా భావించి ఆదరాభిమానాలనూ, విశిష్టమైన గౌరవాన్నీ చూపిస్తూ విలువైన కానుకలను సమర్పించుకునేవారట పొరుగు రాజులూ, చక్రవర్తులు.దశరథునికి కౌసల్యా, సుమిత్ర, కైకేయిలనే ముగ్గురు భార్యలు. అశ్వమేథయాగం చేసి అయోధ్యా నగరానికీ, రాజ్యానికీ శోభ తీసుకొచ్చిన వాడై పుత్రకామేష్టితో రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే పుత్రులూ పొంది పరిపూర్ణ కుటుంబానికి రూపమిచ్చాడు దశరథుడు. ఈతనికి శాంత అనే పుత్రిక కూడా ఉంది. తన పుత్రుడైన రోమపాదునికి దత్తతగా తన కూతురును ధారపోశాడు. శాంతను ఋష్య శృంగునికిచ్చి పెళ్ళి చేశాడు రోమపాదుడు. వారిద్దరే పుత్రకామేష్టి యాగం చేయించి దశరథునికి సంతానం కలిగేలా చేశారు. వారి పట్ల సదా కృతజ్ఞుడై మెదిలాడు దశరథుడు.దశరథ మహారాజుకు తన ప్రధాన పురోహితులైన వశిష్ట, వామదేవులంటే అమితమైన గౌరవం. ఎనిమిది మంది ముఖ్య మంత్రుల్లో సుమంత్రుడంటే ప్రత్యేకమైన అభిమానం, చొరవ. ఏ సమయంలోనైనా అంతఃపురంలోకి, తన జీవితంలోకి వచ్చేంత అధికారమిచ్చాడు సుమంత్రునికి. కోసల రాజ్యానికి ఎనిమిది దిక్కులై నిత్యపర్యవేక్షణ చేసి ఎనిమిది మంది మంత్రులూ యంత్రాంగంలో ఆరితేరిన దిట్టలు. దశరథుని మాటంటే వీరికి వేదవాక్కు. అపారమైన ధర్మనీతిని తన రాజ్యంలో స్థాపించాలన్న దశరథుని సంకల్పానికి ఊతమందించిన తన మంత్రివర్గం అంటే తనకి వల్లమాలిన నమ్మకం.దశరథుని జీవితం, సమయం పాలనకే అంకితం చేశాడు. ప్రజలపై పన్నుభారం వేయలేదు. తన రాజ్యాంలోని వారికి భయమనేదే లేదు. ఆకలి బాధలు లేవు.
ప్రతీ ఇల్లూ సర్వసమృద్ధిగా కళకళలాడుతూ ఉండేది అయోధ్యలో. అక్కడ పెట్టేవారే తప్ప అడిగేవారే ఉండేవారు కాదు. ఆతిథ్యమంటే అయోధ్యలోనిదే అనేంత గొప్పగా ఉండేది. ప్రజలంతా దశరథుని కనుసన్నలలో తృప్తిగా బతికేవారు. ఆయన ఆలోచనను అర్థం చేసుకొని మెలిగేవారు. సత్యం, ధర్మం, న్యాయం ప్రజల నైజంగా మారాయి. వారి ఇళ్ళలో, జీవితాల్లో లేదు అన్న మాటే లేదు. అందరూ ధనవంతులే గుణంలోనూ, ధనంలోనూ.. మహిళలు గౌరవం పొందాలనేది దశరథుని ధర్మం. అదే రాజ్యధర్మం. ధర్మం కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా వదిలేసేంత మహాత్ములు అయోధ్యా పురవాసులు. నాస్తికత్వం అన్నమాటే లేదు. అసలు అయోధ్యంటే అపరవైకుంఠం. కుబేరునికే అరువిచ్చేంత ధనసంపదకు నెలవు అయోధ్య. ప్రపంచంలోని వైభవమంతా అయోధ్యలోనే ఉందంటే అతిశయోక్తి లేదు. అంతటి అయోధ్యకు రూపమిచ్చిన మహారాజు దశరథుడు.అయోధ్య ప్రజలకీ దశరథుని ఆజ్ఞంటే సదా సంసిద్ధులమేనన్న భావస్వామ్యం ఏర్పరచుకున్న గొప్పతనం చూసి మైమరిచిపోయి హరి రాముడై జన్మించాడేమో. ఎంతటి వైభవమో అంతటి వినయం దశరథునిది. సున్నితమైన మనసు, అపారమైన మేథస్సు, ఆరితేరిన పరాక్రమం, ప్రపంచంతో ఏర్పరచుకున్న భావసారూప్యత దశరథుని జీవితంలోని ఒక కోణం మాత్రమే. మరో కోణంలో అనుకోకుండా జరిగిపోయిన తప్పు, ఇచ్చిన మాట వికటించిన వైనం దశరథుని జీవితాన్నే అనూహ్యంగా మలుపుతిప్పాయి. అన్నింటినీ అందరికీ సమకూర్చినవాడైనా తనపట్ల తాను అన్యాయం చేసుకున్నాడు. కష్టాన్ని తట్టుకొని నిలబడేంత గుండెధైర్యం లేక కుప్పకూలిపోయిన సున్నితుడు దశరథుడు.దశరథుడు ఒకనాడు వేటకు వెళ్ళి దూరం నుంచి సరిగా కనిపించక వేటనుకొని ఒక పిల్లవాణ్ని బాణంతో కొట్టగా అతను గట్టిగా అరుస్తాడు. దగ్గరికెళ్ళి చూస్తే తన తల్లిదండ్రులకు దాహం తీర్చడానికని నీటి కోసం వచ్చిన పిల్లవాడు చేసేదేమి లేక వారికి నీరిచ్చి విషయం చెబుతాడు. కానీ వారు బాధలో దశరథుని పుత్రశోకంతో మరణిస్తానని శపిస్తారు. అదే జరిగింది. ఇక శంబరాసురునితో యుద్ధం చేసేప్పుడు సాయపడిన కైకేయికి ఇచ్చిన రెండు వరాలూ తనకత్యంత ఇష్టమైన రాముని విషయంలో శాపంగా మారడం తనకు శాపమని భావించి మరణించిన దశరథుని గాథ హృదయ విదాకరం.
-ప్రమద్వర
No comments:
Post a Comment