Tuesday, 18 April 2017

కౌరవుల పక్షాన గల యోధులు

దుర్యోధనుడు సర్వ సైన్యాధిపతి పితామహుడు అయిన భీష్మునికి అంజలి ఘటించి, తమ పక్షాన గల యోధుల స్థాయిలను ఎలా నిర్ణయించారో తెల్పమని అర్థించాడు.

భీష్ముడు ఆ ప్రశ్నకు అత్యంత వాత్సల్యంతో, " సుయోధనా వాస్తవ స్థితి గతులు నీకు వివరించడం నా బాధ్యత. నువ్వు అనాయాసంగా ప్రత్యర్థిని ఎదుర్కొని నిర్జింగల సమర్థుడవు. అస్త్ర శస్త్ర కోవిదుడవు. గదా యుద్ధ వీరుడవు. నువ్వు అతిరథుడవు. నీ సహోదరులు శూర శ్రేష్టులు. ఇక నా(భీష్ముడు) సంగతి నేను చెప్పుకోవడం భావ్యం కాదు. కృతవర్మ అసామాన్యుడు. అందుకే అతడు అతిరథుల కోవకు చెందుతాడు. వాసుదేవునిపై విద్వేషంతో నీ పక్షాన చేరిన భూరిశ్రవుడు, శల్యుడు అతిరథులగా పేర్కొనడానికి అర్హులు. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రు కూటమికి వెన్నీయని సైంధవుడు మహారథుడు. నీకు జ్ఞాపకం ఉందా, పాంచాలీ దేవిని అపహరించినప్పుడు పాండవులు అతనిని పట్టి పరాభవించారు. ఆ కక్షతో సైంధవుడు ఘోర తపస్సు చేసి, కొన్ని మహా శక్తులు ఆర్జించాడు ఆ సింధు దేశాధిపతి మనకు రణరంగంలో గట్టి చేయూతనివ్వగలడు. ఇక భోజదేశాధీశుడు సుదక్షిణుడు సమరథుడు. ఇతని బలగంలో ప్రశస్థమైన రథాలు చాలా వున్నాయి. మాహిష్మతీ నగరాధిపతి నీలుడు అర్థరథుడు. సహదేవునిపై ఈతనికి ఎడతెగని పగ. అందుకని ప్రాణాలకు తెగించి పోరాడగలడు. అవంతీ దేశాధీశ్వరులు విందాను విందులు అర్థరథులలో చేరతారు. వారికి ఒకరి పై ఒకరికి వాత్సల్యం. కనుక వారు తోడు నీడలై విజృంభిస్తారు. త్రిగ‌ర్తాధీశులు, ఆ సహోదరులైదుగురు మహారథులు, గోగ్రహణ వేళ వీరు పాండవుల చేత భంగపాటు పడ్డారు. ఆ ఘోరావమానం వారిని దహిస్తోంది. ఆ అగ్ని మనకుపకరించగలదు. లక్ష్మణ కుమారుడు సమరదుడే కాని మీ వంటి వారిని సైతం నిలువరించగల సమర్థుడు. బృహద్బలుడు కోసల సైన్యాలతో కార్చిచ్చువలె పగవారిపై ఉరకగలడు. దండదారుడు సమరథుడు, కాల యమునిలా భాసించగలడు. మన వారిలో మహా శస్త్రాత్తవేత్త కృపాచార్యుడు అతిరథులలో అతిరథుడు. ఈ యోధాగ్రణికి సరితూగువారు లేరు. ఇక పాండవేయులకు గర్భ శత్రువుగా పేరొందిన నీ ఆప్తుడు శకుని కేవలం సమరథుడు. బలవంతులైన అనుచరులే అతనికి సిరి. దివ్యాస్త్రవేత్త, గురుపుత్రుడు అశ్వత్థామ అతిరథుడు. సంగ్రామంలో సాక్షాత్తు అతను కాలాంతకుడే. ద్రోణాచార్యుని గురించి ప్రత్యేకించి పేర్కొనవలసింది లేదు. అతిరథులలో ఎన్నతగిన ధీరమూర్తి. యుద్ధరంగ మార్తాండుడు. నీ పట్ల ద్రోణునికి మక్కువ ఎక్కువ. అర్జునుని పట్ల కూడా వాత్సల్యం వుంది. ఇందుకు గత సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు. అందుకే పార్థుని సంహరించడానికి ద్రోణుడు సంకోచించవచ్చు కాని మిగిలిన వారి విషయంలో ఆయన చేతికి అడ్డుండదు. ఇక బాహ్లికుడు అతిరథుడు. అతని కొడుకు సోమదత్తుడు తండ్రికి సరిపోలే మహావీరుడు. ఈ తండ్రీతనయులకు సమరమంటే పెళ్లి వేడుకే.’’ ఇలా వారి వారి స్తోమతులను చెబుతుంటే దుర్యోధనుడు చెవులొగ్గి ఆసక్తిగావింటున్నాడు.

No comments:

Post a Comment