Sunday, 14 January 2018

ధనుర్మాసం - ముక్కోటి





ముక్కోటి దేవతల పర్వం

సౌరమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’గా పరిగణిస్తారు. ఈ రోజు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువు సర్వాలంకార భూషితుడై, తన దేవేరులతో కలసి దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ అపురూప దర్శనం కోసం దేవతలు ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠంలోకి ప్రవేశించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకం. అలాగే ఈ రోజున శ్రీమహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భువికి దిగి వస్తాడని ప్రతీతి. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైష్ణవ సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

శైవులకూ... శాక్తేయులకూ పవిత్రమే!క్షీర సాగర మధన సమయంలో అమృతం, హాలాహలం ఇదే రోజున ఉద్భవించాయన్నది పురాణ కథనం. హాలాహలాన్ని పరమ శివుడు తన కంఠంలో ధరించి లోకాలను కాపాడగా, శ్రీమహావిష్ణువు అమృతాన్ని దేవతలకు అందించి అమరులుగా మారుస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశిని శైవులు, వైష్ణవులు సమాన భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు.
పద్మ పురాణం ప్రకారం- ‘ముర’ అనే రాక్షసి లోకాలను పీడిస్తుంటే, దేవతలు పరమశివుని సలహా ప్రకారం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. శ్రీమహావిష్ణువు, హైమవతి అనే స్త్రీ శక్తి ద్వారా ఆ రాక్షసిని సంహరించాడు ఎవరైతే ఈ రోజు తనను అర్చిస్తారో వారికి అంత్యకాలంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడు. అందువల్ల కూడా ఈ రోజును వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ కారణంగా శాక్తేయులకు కూడా ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు.

ఉపవాస ఫలంమహాభారత కాలంలో శ్రీకృష్ణార్జుల మధ్య గీతా సంవాదం జరిగినది కూడా ఈ రోజే అంటారు. ఇలా అనేక ప్రాధాన్యాలూ, విశేషాలూ ఉన్నందువల్ల ఈ రోజును ఆస్తికులు అత్యంత పుణ్యప్రదమైనది, పరమ పవిత్రమైనది, శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ దినం ఏకాదశీ వ్రతం చేసి, శివ కేశవులను పూజించి, ఉపవాస- జాగరణలు పాటిస్తే పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయని విశ్వాసం. విష్ణుపురాణాన్ని అనుసరించి ఈ రోజు ఉపవాసం చేస్తే మూడుకోట్ల ఏకాదశుల ఉపవాస పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెపుతారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేశ, విదేశాలలోని అన్ని వైష్ణవ దేవాలయాలలో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. తిరుపతిలో వైకుంఠ ద్వారం తెరచి, దాని గుండా భక్తులను అనుమతిస్తారు. ఈ ద్వారాన్ని మరునాడు- ద్వాదశి రోజున కూడా తెరచి ఉంచుతారు. సంవత్సరంలో ఈ రెండు రోజులు మాత్రమే తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనం లభిస్తుంది. అలాగే తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయంలోనూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారాలు తెరచి భ క్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజులలో ఈ ద్వారం మూసి ఉంటుంది. పురాణాల ప్రకారం రంగనాథస్వామి దక్షిణ ముఖంగా నిలిచి ఉత్తర ముఖంగా ఉన్న విభీషణుడికి దర్శనమిచ్చాడని చెబుతారు. అక్కడ 20 రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

పూజా విధి!ముక్కోటి ఏకాదశి రోజున ఆచరించాల్సిన పూజా విధిని పెద్దలు సూచించారు. దాని ప్రకారం, సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు ఆచరించాలి. శుచిగా పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ పరమశివుని బిల్వదళాలు, శంఖం, పూలు, తులసి దళాలతో అర్చించాలి. ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్యం వైపు చూసే విధంగా దీపాలు వెలిగించాలి. ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తిచేసి, ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఈ రోజు లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించాలి. పూజానంతరం నేతిలో పెసరపప్పు, బియ్యం వేయించి ఉడికించిన పొంగలి నివేదన చేయాలి. ఏకాదశి వ్రత ప్రభావం వలన జన్మజన్మాంతరాల నుంచి పీడిస్తున్న బాధలు తొలగిపోయి, ఐశ్వర్యం, సుఖ జీవన ప్రాప్తి కలుగుతాయన్నది పురాణ ప్రవచనం.

 డాక్టర్‌ దేవులపల్లి పద్మజ



No comments:

Post a Comment